బంతిపూలవనంగా మారిన కడప
posted on May 26, 2025 @ 11:27AM
తెలుగుదేశం మహానాడుకు కడప నగరం ముస్తాబైంది. మంగళవారం (మే 27) నుంచి మూడు రోజుల పాటు కడప వేదికగా జరగనున్న మహానాడు కోసం ఏర్పాట్లూ శర వేగంతో జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే వైస్ జగన్ కు కంచుకోటలాంటి కడప నగరం తెలుగుదేశం జెండాలు, ఫ్లెక్సీలతో పసుపుపచ్చ శోభ కనిపిస్తోంది. ఎటు చూసినా పసుపుపచ్చదనం వెల్లివిరిస్తోంది. పార్టీ అధినేత చంద్రబాబు, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్.. ఇతర నేతలూ కడపకు తరలిరానున్నాయి.
ఇప్పటికే మహానాడు నిర్వహణ కోసం ఏర్పాటైన కమిటీలు నిర్విరామంగా తమతమ పనులు చేస్తున్నాయని తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిథి, స్వచ్ఛాంద్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభి మీడియాకు తెలిపారు. మహానాడుకు 50 వేల మందికి పైగా ప్రతినిథులు హాజరు కానున్నట్లు తెలపారు. ఈసారి మహానాడును స్వచ్ఛ మహానాడుగా, జీరో వేస్ట్ ఈవెంట్ గా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పర్యావరణానికి హాని కలిగించని వస్తువులనే వినియోగిస్తామన్నారు.
మహానాడులో చర్చించి ఆమోదించే తీర్మానాలపై ఇప్పటికే చంద్రబాబు నాయుడు సీనియర్ నేతలతో సుదీర్ఘంగా చర్చించారనీ, గత ప్రభుత్వ పాలనలో రాష్ట్రానికి జరిగిన నష్టం, ప్రస్తుత ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, సంస్థాగతంగా పార్టీ మరింత బలోపేతం చేయడం వంటి అంశాలపై తీర్మానాలు ఉండే అవకాశం ఉందంటున్నారు. అదే విధంగా యువత, మహిళలకు ప్రాధా న్యం, రాయలసీమ అభివృద్ధి, కడప ఉక్కు పరిశ్రమ వంటి అంశాలపై కూడా మహానాడు వేదికగా కీలక ప్రకటనలు ఉండే అవకాశం ఉందని అంటున్నారు.