జగన్, భారతి క్షమాపణలకు షర్మిల డిమాండ్
posted on Jun 10, 2025 @ 9:53AM
అమరావతిపై చర్చ పెట్టి.. అక్కడి మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేయడంపై ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మండిపడ్డారు. ఈ విషయంలో వైసీపీ అధినేత, తన సోదరుడు జగన్, ఆయన సతీమణి భారతి ఇద్దరూ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. అసలు రాజధానిపై మాట్లాడే అర్హత జగన్ కు కానీ, భారతికి కానీ, వారి సొంత మీడియాకు కానీ లేదని షర్మిల అన్నారు.
గతంలో అనేక సార్లు అమరావతిపైనా, అక్కడి ప్రజలపైనా, రాజధాని అమరావతికి భూములిచ్చిన రైతులపైనా అనుచిత వ్యాఖ్యలు చేయడమే కాకుండా, వారిని అవమానించేలా మాట్లాడారన్న షర్మిల.. మూడు రాజధానులకు వ్యతిరేకంగా ప్రజలు తీర్పు ఇచ్చిన తరువాత కూడా జగన్ లో మార్పురాలేదని దుయ్యబట్టారు. అ తాజాగా జగన్ మీడియాలో చేపట్టిన చర్చలో మహిళలను తీసుకురావడం ఏంటని ఆమె ప్రశ్నించారు. చిత్తూరు జిల్లా పర్యటనలో ఉన్న షర్మిల సోమవారం (జూన్ 9) మీడియాతో మాట్లాడారు. మహిళలను అవమానించే సంస్కృతి వైసీపీతోనే ప్రారంభమైందని విమర్శించారు ఈ విషయంలో జగన్ క్షమాపణలు చెప్పడంతోపాటు భారతితోనూ చెప్పించి ఉంటే బాగుండేదని వ్యాఖ్యానించారు.
జగన్ హయాంలో రాష్ట్రానికి కేరాఫ్ లేని పరిస్థితి ఉండేదని, ఇప్పుడు రాష్ట్రానికి రాజధాని నిర్మించుకుంటున్నామనీ పేర్కొన్నన షర్మిల.. ఇలాంటి సమయంలో రాజధాని అమరావతికి, అక్కడి మహిళలకు వ్యతిరేకంగా దారుణమైన వ్యాఖ్యలు చేయడం క్షమించరాని విషయమన్నారు.