మినహాయింపు కోసమే జగన్ ఢిల్లీ వెళ్లారా? నవంబర్ 1న తీర్పు అనుకూలంగా రానుందా?
posted on Oct 23, 2019 @ 11:52AM
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటనపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కేంద్ర మంత్రులకు ముందస్తు సమాచారమిచ్చి ఢిల్లీ వెళ్లిన జగన్ కు ఊహించనివిధంగా చుక్కెదురైనట్లు కథనాలు వస్తున్నాయి. ముఖ్యంగా దాదాపు 24గంటల సుదీర్ఘ ఎదురుచూపులు తర్వాత అమిత్‌షా అపాయింట్ మెంట్ ఇవ్వడం... అదే సమయంలో మరో ఇద్దరు కేంద్ర మంత్రులను కలవకుండానే... ఢిల్లీ నుంచి వెనుదిరగడంపై రాజకీయ విమర్శలు చెలరేగుతున్నాయి. పైగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాట్లాడటానికి సమయం ఇవ్వకుండా కేవలం వినతిపత్రం మాత్రమే తీసుకుని జగన్ ను పంపేశారని తెలుస్తోంది. అంతేకాదు జగన్ ముందుగా అపాయింట్ మెంట్లు ఇచ్చిన కేంద్ర మంత్రులు రవిశంకర్ ప్రసాద్, ప్రహ్లాద్ జోషిలు ఆ తర్వాత రద్దు చేసుకున్నారని ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయి.
అయితే, జగన్ ఢిల్లీ పర్యటనపై టీడీపీ తీవ్ర విమర్శలు చేసింది. రాష్ట్ర సమస్యల కోసం జగన్ ఢిల్లీ వెళ్లలేదని, తన కేసులను మాఫీ చేసుకోవడానికే వెళ్లారని ఆరోపించింది. ముఖ్యంగా సీబీఐ కోర్టులో వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు కోసమే కేంద్ర హోంమంత్రిని కలిశారని వ్యంగ్యాస్త్రాలు సంధించింది. అయితే, తెలుగుదేశం ఆరోపణలకు కౌంటరిచ్చిన వైసీపీ..... అమిత్‌షాతో 45 నిమిషాలతోపాటు సమావేశమైన జగన్మోహన్ రెడ్డి... రాజకీయాలకు అతీతంగా ఏపీ సమస్యలపై చర్చించారని తెలిపింది. ఒకవైపు బర్త్ డే... మరోవైపు బిజీ షెడ్యూల్‌తో తీరిక లేకపోయినా అమిత్‌షా అపాయింట్‌మెంట్ ఇచ్చారని వైసీపీ చెప్పుకొచ్చింది. ఇక, ఏపీ సమస్యలపై ఇతర మంత్రులతో తాను మాట్లాడతానని అమిత్‌షా మాటివ్వడంతోనే... రవిశంకర్ ప్రసాద్, ప్రహ్లాద్ జోషిలను కలవకుండానే జగన్మోహన్ రెడ్డి.... ఢిల్లీ నుంచి వెనుదిరిగారని వైసీపీ కేంద్ర కార్యాలయం వివరణ ఇచ్చింది.
ఆరోపణలు, విమర్శలు, ఊహాగానాలు ఎలాగున్నా.... ఢిల్లీ పర్యటనపై జగన్మోహన్ రెడ్డి అసంతృప్తికి లోనైనట్లు వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. 24గంటలు వెయిట్ చేసినా అమిత్ షాతో పూర్తిస్థాయి మీటింగ్ జరగలేదని జగన్ అసహనానికి గురయ్యారని అంటున్నారు. అయితే, నవంబర్ 1న సీబీఐ కోర్టు తీర్పు నేపథ్యంలోనే జగన్ ఢిల్లీ వెళ్లారనే మాట వినిపిస్తోంది. ప్రతి శుక్రవారం వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలంటూ జగన్మోహన్ రెడ్డి దాఖలు చేసుకున్న పిటిషన్ పై సీబీఐ స్ట్రాంగ్ కౌంటర్ దాఖలు చేయడం, కోర్టులో వాడివేడి వాదనలు జరిగిన నేపథ్యంలో... ముందస్తు జాగ్రత్తతోనే... జగన్ ఢిల్లీ వెళ్లి అమిత్ షాను కలిశారని అంటున్నారు. ఇందులో నిజముందో లేదో తెలియదు గానీ, నవంబర్ 1న మాత్రం జగన్ కు అనుకూలంగా తీర్పు ఆశ్చర్యపోనవసరం లేదంటున్నారు.