ఫైబర్ నెట్ కు తప్పని జరిమానా...
posted on Oct 23, 2019 @ 2:33PM
ఆంధ్రజ్యోతి ప్రసారాల పునరుద్ధరణ విషయంలో తన ఆదేశాల అమలుకు సంబంధించి ఆలస్యం చేసినందుకు ఫైబర్ నెట్ జరిమానా చెల్లించాల్సిందేనని టీడీ శాట్ స్పష్టం చేసింది. ఈ పరిస్థితి మరొకసారి పునరావృతం కావొద్దని సూటిగా చెప్పేసింది. ఛానల్ ప్రసారాల నిలిపివేతపై ఏబీఎన్, టీవీ ఫైవ్ వేర్వేరుగా దాఖలు చేసిన పిటిషన్ ల పై ట్రైబ్యునల్ చైర్మన్ జస్టిస్ శివకీర్తి సింగ్ విచారణ జరిపారు. సాంకేతిక సమస్య పేరిట తప్పించుకునే ప్రయత్నాలు ఫలించకపోవడంతో రెండు రోజుల క్రితమే ఫైబర్ నెట్ లో ఏబీఎన్ ప్రసారాలను పునరుద్ధరించక తప్పలేదు. ప్రసారాలు పునరుద్ధరించామని జరిమానా విధించవద్దని రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాది జిఎన్ రెడ్డి టిడి శాట్ ను అభ్యర్థించారు. టీవీ ఫైవ్ కేసులో ఇప్పటికే విధించిన జరిమానాను మాఫీ చేయాలని వేడుకున్నారు. ఫైబర్ నెట్ చాలా ఆర్థిక ఇబ్బందుల్లో ఉందని తెలిపారు.
నిజంగా ఆ ఛానళ్ల ప్రసారాలను పునరుద్దరించారా చాలా సంతోషంగా ఉంది. ఎంతో ఉపశమనం కలిగిందని జస్టిస్ శివకీర్తి సింగ్ వ్యాఖ్యానించారు. అయితే ప్రసారాలను పునరుద్దరించాలని గత నెల ఇరవై నాలుగున తాము ఉత్తర్వులు జారీ చేశామని గుర్తు చేశారు. ఈ ఆదేశాల అమలులో ఆలస్యం చేసినందున జరిమానా చెల్లించి తీరాల్సిందేనని దీని నుంచి తప్పించుకోలేరని స్పష్టం చేశారు. ప్రసారాల పునరుద్దరణలో ఆలస్యానికి సంతృప్తికరమైన సమాధానం ఇవ్వడం లేదని ఆగ్రహించారు. ఛానల్ పునరుద్ధరణ అంశంపై విచారణను ముగిస్తున్నామని జరిమానా విధింపు పై విచారణ కొనసాగిస్తామని పేర్కొన్నారు. తదుపరి విచారణను నవంబర్ పద్నాలుగు వ తేదీకి వాయిదా వేసింది. జరిమానా ఎందుకు విధించకూడదో వివరిస్తూ రెండు రోజల్లో అఫిడవిట్ దాఖలు చేయాలని చట్ట పరంగా నడుచుకోవాలంటూ ఫైబర్ నెట్ ను జస్టిస్ శివకీర్తి సింగ్ ఆదేశించారు.
ఏబిఎన్ తరపు న్యాయవాది రాజశ్రీ వాదనలు వినిపించారు. భవిష్యత్ లో ఛానల్ నిలిపివేత వంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకోవాలని ఆ మేరకు ఉత్తర్వుల్లో తెలపాలని కోరారు. ఛానల్ స్క్రీన్ నాణ్యతగా ప్రసారం చేసేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. సెప్టెంబర్ పధ్ధెనిమిదిన అదే నెల ఇరవై నాలుగు న టీవీ5 ఛానల్ ను పునరుద్ధరించాలని ఆదేశించినా చాలా ఆలస్యంగా ఆ పని చేసినందుకు మూడు ప్రైవేటు ఎంఎస్వో సంస్థలకు ట్రైబ్యునల్ జరిమానా విధించింది. మాస్టర్ ఛానల్ కమ్యునిటీ నెట్ వర్క్ ప్రైవేట్ లిమిటెడ్ సిటీ సిరి డిజిటల్ నెట్ వర్క్ ప్రైవేట్ లిమిటెడ్ యాక్ట్ డిజిటల్ ఎంటర్ టైన్ మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలకు అయిదు వేల రూపాయల చొప్పున జరిమానా విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మొత్తాన్ని టీవీ 5 కు చెల్లించాలని ఆదేశించింది.