ఆకాశాన్ని అంటుతున్న కూరగాయల ధరలు :- వెల్లుల్లి కిలో రూ.250 , ఉల్లి కిలో రూ.80

  కూరగాయల ధరలు మండిపోతున్నాయి. ఉల్లి, వెల్లుల్లి రేట్లు భారీగా పెరుగుతున్నాయి. కిలో వెల్లుల్లి రూ.250 రుపాయలు, ఉల్లి రూ.70 రూపాయలు పలుకుతుంది. భారీ వర్షాల కారణంగా పొరుగు రాష్ట్రాల నుంచి దిగుమతులు పడిపోవడంతో ధరలు చుక్కలనంటుతున్నాయి. ధరలకు రెక్కలొచ్చి.. ఏకంగా రెండొందల దాటి మూడొందలకు పరుగెడుతున్నాయని చెప్పుకోవాలి. దీని కారణంగా సామాన్య మధ్య తరగతి ప్రజలు అసలు కొనలేని పరిస్థితుల్లో ఉల్లి వెల్లుల్లి ధరలు చేరుకున్నాయి. పూర్తిస్థాయిలో చిత్తూరు జిల్లా వ్యాప్తంగా కూడా ఇటు ఉల్లిపాయతో పాటకు పాటు వెల్లుల్లి ధరలు కూడా అమాంతంగా పెరిగిపోయాయి. కేజీ ఉల్లిపాయల ధరలు రూ.70 నుంచి 80 రూపాయలు పలుకుతుండగా ఏకంగా వెల్లుల్లి ధరలైతే రెండొందల రూపాయలు దాటి మూడొందల రూపాయల కూడా చేరుకునే పరిస్థితి ఏర్పడింది.చిత్తూరు జిల్లా వ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి నెలకొంది. అయితే ఇదే పరిస్థితి మొత్తం అన్ని జిల్లాల్లోనూ ఉంటుందని వ్యాపార వర్గాలు చెప్తున్నాయి. మహారాష్ట్రతో పాటు ఉత్తర ప్రదేశ్, గుజరాత్ వంటి ప్రాంతాల నుంచి కూడా ఎక్కువగా వెల్లుల్లి రావాల్సి ఉంది. అక్కడ పంట చేతికి రాకపోవడం.. వరుసగా వర్షాల కారణంగా కూడా పంట దిగుబడి అనేది తగ్గింది. దాని కారణంగా ఏపీకి ఎగుమతి తగ్గిపోవటంతో ఒక్కసారిగా వీటి ధరలు పెరిగాయని చిన్న వ్యాపారస్తులు చెబుతున్నారు. సామాన్యులకు మాత్రం చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడ్డాయని చెప్పుకోవాలి.. ఎందుకంటే ఉల్లి వెల్లుల్లి లేని పంటలు ఎక్కడా ఉండవని చెప్పవచ్చు. అదే ఆకుకూరల ధరలు కూడా తీవ్రంగా పెరిగిపోయి సామాన్యుడు కూరగాయల ధరలు కొనలేని పరిస్థితి ఏర్పడింది. మధ్య తరగతి వారు కూడా కూరగాయల కొనాలంటే భయపడుతున్న పరిస్థితి వచ్చింది.ఆకుకూరలతో పాటు కొత్తిమీర,కరివేపాకు రేట్లు కూడా విపరీతంగా పెరిగిపోయాయి అనే చెప్పాలి.ధరలపై సామాన్యు లు మధ్య తరగతి వారు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్న పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా వంకాయల ధరలు తీవ్రంగా పెరిగిపోయాయి.. ఇందుకు కారణం పంట పూర్తి స్థాయిలో అందుబాటులో రాకపోవడమేనని వ్యాపారుల చెబుతున్నారు. రెండు నెలల క్రితం వేసిన పంట భారీ వర్షాల వల్ల పూర్తిగా చెడిపోవడంతో దిగుబడి రావడం లేదంటున్నారు. మరో మూడు నెలల పాటు ఈ పంట వచ్చే పరిస్థితి లేని కారణంగా మూడు నెలల పాటు వంకాయల ధర రూ.50 నుంచి 70 రూపాయలు పలికే అవకాశం ఉందని తెలుస్తుంది. సాధారణ ప్రజలు ఇష్టంగా ఏదైనా కొనాలన్నా ..తినాలన్నా.. కష్టాంగా ఉందని వినియోగదారులు బాధ పడుతున్నారు.

తలనొప్పిగా మారిన వైసీపీ ఎమ్మెల్యేల తీరు.. అనంతలో నీటి గొడవలు!!

  అనంతపురం జిల్లాలో ఎమ్మెల్యేలని అధిగమించాలన్నా.. అక్కడి సమస్యల్ని పరిష్కరించాలన్నా అదంత సులభం కాదని అందరికి తెలిసిన విషయమే. ఈ సంగతి వైసిపి అధిష్టానానికి చాలా కొద్దిరోజులోనే అర్థమైంది. వైసిపి అధికారంలోకి వచ్చిన తరువాత జిల్లా అభివృద్ధి మీద మూడు రివ్యూ లు జరిగాయి. అందులో ఒకటి జిల్లా మంత్రి శంకర నారాయణ ఆధ్వర్యంలో, మరొకటి పాత ఇంచార్జి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి ఆధ్వర్యం లో, మూడవది ప్రస్తుత ఇన్ చార్జి బొత్స సత్యనారాయణ ఆధ్వర్యంలో జరిగాయి.ఇలా ముచ్చటగా మూడు మీటింగ్ లు జరిగితే మూడు మీటింగ్లలోనూ సేమ్ సీన్. ఎమ్మెల్యేలంతా ఎవరికి వారే యమునా తీరే అనే విధంగా వ్యవహరించారు. అంతకుముందు జరిగిన సాగు నీటి సలహా మండలి సమావేశంలో కూడా అంతే జరిగింది. నీటి విషయంలో ఏ ఎమ్మెల్యే కూడా తగ్గడం లేదు.  అనంతపురం జిల్లాకు ఉన్న నీటి వనరుల్లో ప్రధానమైనవి రెండు. ఒకటి తుంగభద్ర ఎగువ కాలువ అయిన హెచ్చెల్సీ, రెండోది శ్రీశైలం బ్యాక్ వాటర్ మీదుగా ఏర్పడిన హంద్రి నీవా ప్రాజెక్టు. ఈ రెండే జిల్లాకు ప్రధానమైన ఆధారం. ఇప్పుడు అన్ని నియోజకవర్గాలకు నీరు కావాలని డిమాండ్ పెట్టడంతో మంత్రులు తలలు పట్టుకుంటున్నారు. ఇటీవలే కొత్త ఇన్ చార్జి మంత్రి బొత్స సత్యనారాయణ అనంతపురం వచ్చి ఎమ్మెల్యేలతో మీటింగ్ పెట్టారు. తమ నియోజకవర్గానికి నీళ్లు కావాలంటే తమ నియోజకవర్గానికి కావాలంటూ మైకందుకుని అందరూ ఉపన్యాసాల మీద ఉపన్యాసాలిచ్చారు. మెజార్టీ ఎమ్మెల్యేలు వైసిపి నేతలే ఉండటంతో నేతల మధ్య పరస్పర సమన్వయం లేదని సమాచారం.దీంతో ఇన్ చార్జి మంత్రికి ఏం చేయాలో తెలియక తికమక పడుతున్నారు.ఎమ్మెల్యేల మధ్య సమన్వయం లేకపోడంతో మంత్రి కొంత అసహనానికి గురయ్యారు. మొత్తం మీద అనంతపురం ఎమ్మెల్యేల తీరు పై వైసీపీలో చర్చనీయాంశంగా మారింది.  

జనవరిలో జరగనున్న స్థానిక ఎన్నికలు... క్యాబినెట్ సమావేశంలో జగన్ ప్రకటన!!

  సీఎం జగన్ స్థానిక ఎన్నికలకు సమర భేరిని మోగించారు. బుధవారం జరిగిన మంత్రి వర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు సీఎం జగన్. విపక్షాలు ఎంత విమర్శించినా ఆంగ్ల మాధ్యమంపై అడుగు వెనక్కి వేసే ప్రసక్తే లేదన్నారు. అక్రమ లేఅవుట్ లను క్రమబద్ధీకరించాలని నిర్ణయించారు. స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్దాం సిద్ధంగా ఉండండి అంటూ మంత్రులను ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి అప్రమత్తం చేశారు. క్యాబినెట్ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికలపై ఆయన స్పష్టత ఇచ్చారు.  విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు ఈ సమావేశంలో అధికారిక అజెండా అంశాలు ముగిశాక రాజకీయ అంశాల పై చర్చ జరిగింది. ఈ సందర్భంగా మంత్రులతో పలు అంశాలను ప్రస్తావించారు జగన్. అమ్మవడి కార్యక్రమాన్ని వాస్తవానికి జనవరి 26వ తేదీన నిర్వహిద్దామని అనుకున్నాం కానీ అదే నెల జనవరి 9వ తేదీన చేపడతామని అనుకోలేదన్నారు. తమ పిల్లలను బడికి పంపే ప్రతి తల్లికీ రూ.15 వేల నగదును అందింస్తామని ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమాన్ని చేపట్టిన వెంటనే రాజకీయ వ్యవహారాలపై దృష్టి సారించి పాలనపై ప్రజాభిప్రాయం కోరనున్నట్లు తెలిపారు. జనవరిలోనే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్తాం అని వెల్లడించారు.మంత్రులు.. ఎమ్మెల్యేలు.. స్థానిక సమరానికి సిద్ధంగా ఉండాలని నిర్దేశించారు. ఈ నెలాఖరులోగా ఆలయ కమిటీ లు మార్కెట్ కమిటీలు వేయాలని మంత్రులను మరోసారి సీఎం ఆదేశించారు.గత కేబినెట్ భేటీలో ఇదే విషయాన్ని చెప్పిన సీఎం జగన్ బుధవారం నాటి మంత్రి వర్గ సమావేశంలోనూ దీని పై కర్తవ్య బోధ చేశారు. జిల్లా సమీక్షా సమావేశాలను త్వరగా పూర్తి చేయాలని ఇన్ చార్జి మంత్రులను ఆదేశించారు. ఆలయ కమిటీ లు మార్కెట్ కమిటీలను వేయాలని చెప్పారు. ఇందులో యాభై శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకు కేటాయించాలని ఈ మొత్తం లోనూ యాభై శాతం మహిళలు ఉండేలా చూడాలని మంత్రులకు ముఖ్యమంత్రి ఆదేశించారు.ఇన్ చార్జ్ మంత్రులు వారికి కేటాయించిన జిల్లాలో నాలుగు రోజులు ఉంటారో, అయిదురోజులూ ఉంటారో తనకు తెలియదని ఈ నెలాఖరులోగా జిల్లాలోని ఆలయ కమిటీ లను, మార్కెట్ కమిటీల భర్తీ చేయాల్సిందేనని స్పష్టం చేశారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలో ఒకటి నుంచి ఆరో తరగతి వరకు ఆంగ్ల మాధ్యమం ప్రవేశ పెట్టాలని మంత్రి వర్గం నిర్ణయించింది. రాష్ట్రంలో ఇప్పటికే 34 శాతం ప్రభుత్వ పాఠశాలలో ఆంగ్ల మాధ్యమం అమలులో ఉందని.. మిగిలిన 66 శాతం పాఠశాలల్లోనూ అమలు చెయ్యాలని తీర్మానించింది. ఈ వివరాలను మంత్రి పేర్ని నాని మీడియాకు తెలిపారు. పోటీ ప్రపంచంలో ఏదో ఒక స్థాయిలో ఆంగ్ల భాషను అందరూ నేర్చుకుంటున్నారని కొందరు ఎనిమిదవ తరగతి, కొందరు ఇంటర్, డిగ్రీ, మరికొందరు పీజీ ఇలా ఏదో ఒక స్థాయిలో ఆంగ్ల మాధ్యమంలోకి వెళుతున్నారన్నారు. అయితే సంగ్రహణ సామర్థ్యం బాల్యం నుంచే ఎక్కువగా ఉంటుంది గనుక ఒకటో తరగతి నుంచి పెడితే పేదపిల్లలు కూడా అభివృద్ధి చెందేందుకు ఆస్కారం ఏర్పడుతుంది అని మంత్రి వివరించారు.వచ్చే విద్యా సంవత్సరం నుంచే ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని తెలిపారు. పిల్లలు ఒకటో తరగతి నుంచి ఆరో తరగతి వరకు మాతృభాష తెలుగు లేక ఉర్దూ ఖచ్చితంగా చదవాల్సి ఉంటుందని మిగతా సబ్జెక్టుల మాత్రం ఆంగ్ల భాషలో బోధిస్తారని తెలిపారు.

ఏపీ ప్రభుత్వ పాఠశాలలకు మహర్దశ.. జగన్ మార్క్ పాలన

  ఏపీలో సర్కారు బడులకు మహర్దశ వచ్చింది, మరో బృహత్తర కార్యక్రమానికి సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శ్రీకారం చుట్టారు. విద్యా రంగంలో మార్పులు తీసుకొచ్చేందుకు నాడు నేడు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఒంగోలు పీవీఆర్ గ్రౌండ్ నందు ఈ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు. నాడు నేడుతో విద్యారంగంలో సమూల మార్పులు, తొమ్మిది రకాల కనీస వసతులతో సర్కారు బడులకు మహర్దశ, తొలి దశలో 15715 పాఠశాలల్లో అమలు, సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న ఏపీలోని సర్కారు బడుల రూపురేఖలు మారిపోనున్నాయి. నాణ్యమైన విద్యతో పాటు మెరుగైన మౌలిక సదుపాయాలను ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు చేరువ చేసేందుకు జగన్ సర్కార్ మూడు విడతల్లో మనబడి నాడు నేడు కార్యక్రమాన్ని అమలు చేసేందుకు నడుం బిగించింది. ప్రస్తుత ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి మార్పు తరవాత అదే పాఠశాలల పరిస్థితిని కళ్లకు కట్టేలా ఫొటోలు తీసి మరీ ప్రజల ముందు ప్రదర్శిస్తామంటూ ముఖ్యమంత్రి జగన్ ప్రకటించడం ద్వారా ఈ కార్యక్రమంపై తమ చిత్తశుద్ధిని చాటుకున్నారు. మూడు సంవత్సరాల్లో రాష్ట్రం లోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో సదుపాయాల లేమి అనే మాట వినిపించకూడదనే లక్ష్యంతో ప్రభుత్వం ప్రణాళికను సిద్ధం చేసింది. పంచాయతీ రాజ్, మునిసిపల్, పాఠశాల విద్య, గిరిజన సంక్షేమం, బీసీ సంక్షేమం, సాంఘిక సంక్షేమం, జువైనల్ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మొత్తం 44512 పాఠశాలలు ఉన్నాయి. వీటిలో 33797 ప్రాథమిక, 4215 ప్రాథమికోన్నత, 6510 ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. తొలి దశలో రాష్ట్రంలోని 17715 పాఠశాలలను ఎంపిక చేసింది ప్రభుత్వం. ఇందులో 9795 ప్రాథమిక, 3110 ప్రాథమికోన్నత పాఠశాలలు, 2810 ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. ఆయా పంచాయతీల పరిధిలో అధికంగా విద్యార్థులున్న పాఠశాలలను నాడు నేడు కార్యక్రమంలోని మొదటి దశలో ఎంపిక చేశారు. వీటితో పాటు శిథిలావస్థలో ఉన్న పాఠశాలలు, నూతనంగా నిర్మించాల్సిన పాఠశాలలు అసంపూర్తిగా ఉన్న పాఠశాలలకు కూడా ప్రాధాన్యత ఇచ్చారు. అదే విధంగా ఉన్నత పాఠశాలల్లో 250 మంది కన్నా ఎక్కువ మంది విద్యార్థులున్న పాఠశాలలకు కూడా మొదటి దశలో అవకాశం కల్పించారు. ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమాన్ని తీసుకు రావడం ద్వారా పేద, మధ్య తరగతి విద్యార్థులు కార్పొరేట్ విద్యా సంస్థలతో పోటీ పడేలా తీర్చి దిద్దాలనే లక్ష్యాన్ని ప్రభుత్వం ప్రకటించింది. విద్యతో పాటు ప్రైవేటు స్కూళ్లకు ఏమాత్రం తీసిపోని విధంగా కార్పొరేట్ స్కూళ్ళను తలదన్నే రీతిలో ప్రభుత్వ పాఠశాలలను మెరుగుపర్చాలనే సంకల్పంతో ఈ కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న ఈ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ లు ప్రాధాన్యతగా తీసుకోవాలని, అలాగే జిల్లాలోని మంత్రులు ఎమ్మెల్యేలను కూడా భాగస్వామ్యం చేయాలని ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు.

జగన్ సర్కార్ పై కార్మికుల ఆగ్రహం

  చంద్రబాబునాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నపుడు ఇలాంటి భవన నిర్మాణ కార్మికుల కోసం ఒక ఫండ్ ను ఏర్పాటు చేసి ఆ ఫండ్ ద్వారా ఏ కుటుంబానికైనా ఆపద వస్తే ఆదుకోవటం ఏ రంగానికైనా ఇబ్బంది వస్తే ఆ రంగాన్ని ఆదుకోవటం, అలాగే తెల్లరేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కళ్ళు దురదష్టవశాత్తు ఆ కుటుంబంలో ఎవరైనా చనిపోతే.. అనారోగ్యంతో చనిపోతే రెండు లక్షలు, ప్రమాదవశాత్తూ చనిపోతే అయిదు లక్షల రూపాయలు అందించటం వల్ల పేద వర్గాలన్నీ కూడా సుఖ సంతోషాలతో ఏ ఇబ్బందులూ లేకుండా ఉన్నాయి.ఇంట్లో తల్లి లాంటి ప్రభుత్వాన్ని వదులుకొని ఏదో కొత్త పెళ్లి కూతురు కోసం కొత్త పెళ్ళాం కోసం మోజు పడినట్టుగా ఒక్క ఛాన్స్ ఇచ్చాం. ఇవాళ అదే భస్మాసురహస్తంలాగా మానెత్తి మీద చేయిపెట్టాడు అని ఒక కార్మికుడు కడుపు మంటతో మాట్లాడుతున్నట్లు తెలియజేశారు. రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ పెయింటింగ్ వర్కర్స్ అసోసియేషన్ అధ్యక్షులు కె రాజుగారు ఒక్క భవన నిర్మాణ రంగం అంటే ఒక తాపీ మేస్త్రి, ప్లంబరో, ఒక కార్పెంటరో ఒకటైల్స్ వేసేవాళ్లో ఒక  ఎలక్ట్రిషన్ ఏ కాదు,దాదాపు అనేక వంద సంస్థలపై నా ఈ రంగం మీద ఆధారపడి వుంటాయని దాంట్లో ఒకటి పెయింటర్స్ రంగం ఇలా ఎన్నో సోషల్ యూనియన్లు  కూడా వచ్చి వాళ్ళ సమస్యలు కష్టాల కూడ చెప్పుంటారు. వీళ్లందరూ ఈ సమస్యలు సుడిగుండంలో పడటానికి కారణం ఒకే ఒక్క వ్యక్తి  మరియు ఒకే ఒక్క ప్రభుత్వ వైసీపీ ప్రభుత్వం జగన్మోహనరెడ్డి ప్రభుత్వం అని ఆరోపించారు.తాన తప్పు వల్ల ఇవ్వాల అందరూ ఒక పెయింట్ షాప్ అంటే కేవలం ఆయన ఒక్కడే కాదు బతికేది ఆయన దగ్గర ముఠావాళ్ళు కూడా బతుకుతారు, గుమస్తాలు,మేస్త్రీలు బతుకుతారు. ఎన్నో రంగాల్లో ఎంతమంది వ్యక్తులు ఆ పెయింట్ షాప్ మీద ఆధారపడి బతికే పరిస్థితులో దాదాపు ఏడు నెలల నుంచి ఇవాళ వాళ్ళు ఏ వ్యాపారం లేకుండా పోయిందంటే కనీసం భవిష్యత్తులో అయిన బావుండదంటే అది కూడా లేకుండా ఇష్టారీతిన పరిపాలన కొనసాగుతోందని పెయింటింగ్ వర్కర్స్ అసోసియేషన్ అధ్యక్షులు రాజుగారు తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు.

ఏపీ ఇసుక వెబ్ సైట్ హ్యాక్ .. ఇసుక కొరత బ్లూఫ్రాగ్ సంస్థ వల్లనేనా?

  డంపింగ్ యార్డుల్లో ఇసుక ఉంది. కానీ ప్రభుత్వ వెబ్ సైట్ లో మాత్రం ఇసుక లేదు. కృత్రిమ ఇసుక కొరతకు బ్లూఫ్రాగ్ సంస్థ కారణమా ? బ్లూఫ్రాగ్ సంస్థ వెనుక ఎవరైనా ఉన్నారా? వీటిని వెలికి తీసే పనిలో ఉంది సిఐడి. ఇసుక సరఫరా పారదర్శకంగా జరగాలని ఏపీ సర్కారు ప్రయత్నిస్తుంది. అక్రమ మార్గాలు అనుసరిస్తే జైలుకు పంపుతామని హెచ్చరికలు కూడా జారీ చేసింది. ఇసుక కొరత వల్ల లక్షల మంది ఎదుర్కుంటున్న ఇబ్బందుల పై గురి పెట్టి ప్రభుత్వాన్ని ఇరుకున పెడుతున్నారు. ఈ సమయంలో వెబ్ సైట్ హ్యాకింగ్ ద్వారా కృత్రిమ కొరతను సృష్టిస్తున్నారన్న వ్యవహారం వాతావరణాన్ని మరింత వేడెక్కించింది.  వరదల ప్రభావంతో డిమాండ్ కు సరిపడా ఇసుక సరఫరా జరగటం లేదని ప్రభుత్వం అంగీకరిస్తోంది. అదే సమయంలో యార్డుల్లో ఇసుక నిల్వలు ఉన్నప్పటికీ ఆన్ లైన్ పోర్టల్ లోకి ఎందుకు లభ్యం కావడం లేదని డౌట్ ఆధారంగా సీఐడీ దర్యాప్తు మొదలెట్టింది. బ్లూఫ్రాగ్ పై వరుస ఫిర్యాదులు అందుకున్న సీఐడీ ఏక కాలంలో సంస్థలపై దాడులు జరిపింది. డేటా స్టోర్ చేసే విభాగాలనూ తెరిచి కీలకమైన సమాచారం సేకరించారు. అదే విధంగా బ్లూఫ్రాగ్ సంస్థ ఐదారేళ్లుగా ఎటువంటి కార్యకలాపాలు నిర్వహిస్తుందన్న సమాచారాన్ని సీఐడీ రాబట్టింది. ఇసుక కృత్రిమ కొరత వెనుకున్న మాయాజాలం బయటపెట్టేందుకు బ్లూఫ్రాగ్ సంస్థల్లో సేకరించిన డేటాను ఐటీ సైబర్ క్రైం విభాగాలతో విశ్లేషించనున్నాయి. సంస్థ నుంచి సేకరించిన సమాచారాన్ని విశ్లేషించిన తర్వాతే వాస్తవాలు తెలుస్తాయంటున్నారు సీఐడీ అధికారులు. ప్రస్తుతం గ్రామీణాభివృద్ధి.. వ్యవసాయ రంగాలకు సంబంధించిన డేటా సేకరణ క్రోడీకరణ బ్లూఫ్రాగ్ సంస్థల్లో జరుగుతోంది. కంపెనీ సర్వర్ లలో డేటాను తనిఖీ చేసి పలు ఆధారాలను సీఐడీ అధికారులు సేకరించారు. ఐపీ అడ్రస్ ల ఆధారంగా మరింత లోతుగా విచారణ చేపట్టనుంది సీఐడీ. కృత్రిమ ఇసుక కొరత వెనుక బ్లూఫ్రాగ్ హస్తం ఉందనే అనుమానాలు ఉన్నప్పటికీ విచారణ తర్వాతే వాస్తవాలు వెలుగు చూసే అవకాశముంది.

పవన్ ని అన్న మాటలు మిమ్మల్ని అంటే తట్టుకోగలరా?: బాబు

  ఇసుక అంశంపై టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు విజయవాడ దగ్గర ధర్నా చౌక్ లో దీక్షకు దిగారు. ఈ దీక్ష పన్నెండు గంటల పాటు సాగనుంది. చంద్రబాబు ఆందోళనకు మద్దతు తెలియజేసిన జనసేన తమ పార్టీ తరపున ఇద్దరు ప్రతి నిధులను పంపింది. దాంట్లో జనసేన ఎమ్మెల్యే రాపాక వర ప్రసాద్, పార్టీ ప్రధాన కార్య దర్శి శివ శంకర్ ఉన్నారు .ఇసుక కొరత వల్ల ప్రాణాలు కోల్పోయిన భవన నిర్మాణ కార్మికుల చిత్రపటాల దగ్గర నివాళులర్పించారు చంద్రబాబు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం మీద సీఎం జగన్ పై తీవ్ర విమర్శలు చేశారు టిడిపి అధినేత. ఇసుక అంశంపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంటే అధికార పార్టీ నాయకులు అదే పనిగా దూషిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు చంద్రబాబు. తాము మీకంటే ఎక్కువ తిట్టగలమని అన్నారు ఆయన.  లాంగ్ మార్చ్ నిర్వహించిన పవన్ పై వ్యక్తిగత విమర్శలు చేశారని అలాంటి విమర్శలు మీపైనా, మీ కుటుంబంపైన చేస్తే తట్టుకోగలరా అని ప్రశ్నించారు చంద్రబాబు. అధికార నేతలకే కాదు తమకు కూడా ధైర్యం ఉందని,తిట్టడం చేతకాక కాదు తిట్టాలనుకుంటే  వాళ్ళ కంటే ఎక్కువగా తిట్టగలుగుతాము, కాని సభ్యత అడ్డం వస్తుందని గుర్తుపెట్టుకోమని తాను దుర్మార్గులని హెచ్చరిస్తున్నట్లు తెలియజేశారు. ఒక జనసేన నాయకుడు ఇసుక లాంగ్ మ్యాచ్ చేస్తుంటే ఆయనపైన వ్యక్తిగత విమర్శలు చేయడం ఎంతవరకు సబబు అని అలాంటి వ్యక్తిగత విమర్శలు చేస్తే  మీరు తట్టుకోగల్గుతారా మీ కుటుంబం గురించి చెప్పలేమా అని బాబు  తన ఆవేదనను వ్యక్తం చేశారు.మా నాయకులని తిట్టే పరిస్తితికి వచ్చారని.. అయినా పర్వాలేదు కానీ మమ్మల్ని తిటే సమయం మీరు ఉపయోగించుకోని ఈ పేద వాళ్లకు ఉచిత ఇసుక ఇవ్వండి, ఇసుక సరఫరా చేయండి చాతనైతే, చాతకాకపోతే మేము దద్దమ్మలమని ఒప్పుకోని రాష్ట్రానికి క్షమాపణలు చెప్పాల్సన అవసరం ఉందని బాబు ఘాటైన విమర్శలు చేశారు.దీని పై జగన్ ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.  

భర్తతో కలిసి కన్న కొడుకుని కిరాతకంగా చంపిన కన్న తల్లి 

  వరంగల్ జిల్లాలో ఓ వ్యక్తి సజీవ దహనం కేసు ఊహించని మలుపులు తిరుగుతుంది. తొలుత కొడుకు వేధింపులు భరించలేక తల్లిదండ్రులు ఈ దారుణానికి పాల్పడ్డారని అందరూ భావించారు. అయితే పోలీసుల రాకతో అసలు నిజాలు బయటికొస్తున్నాయి. ఆస్తి తగాదాల్లో కన్న కొడుకును తల్లిదండ్రులు అతి కిరాతకం గా చంపారని తేలింది. వరంగల్ రూరల్ జిల్లా దామర మండలం ముస్తాల పల్లిలో జరిగిందీ ఘటన.  కొడాలి ప్రభాకర్ వేములమ్మ దంపతుల కుమారుడు మహేష్ చంద్ర. ఇతనికి రజితతో పెళ్లయింది, కొడుకు కూతురు ఉన్నారు. మహేష్ చంద్ర వరంగల్ వ్యవసాయ మార్కెట్ లో గుమస్తాగా పని చేస్తున్నాడు. అయితే మంగళవారం రాత్రి కుటుంబ కలహాలతో మహేష్ చంద్ర కళ్లల్లో కారం కొట్టిన తల్లిదండ్రులు కర్రతో అతడి పై దాడి చేశారు. మహేష్ తప్పించుకోవడానికి వీలులేకుండా రెండు చేతులు కట్టివేసి కిరోసిన్ పోసి తగులబెట్టారు. మహేష్ పై దాడి జరుగుతున్న క్రమంలో స్థానికులు అడ్డుకునేందుకు ప్రయత్నించగా వారి పై కూడా ప్రభాకర్ , వేములమ్మ దాడికి దిగారు. వేములమ్మ , ప్రభాకర్ పై ముస్తా పల్లి వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆస్తి కోసం కొడుకును అత్యంత కిరాతకంగా హత్య చేసిన తల్లిదండ్రులను గ్రామం నుంచి బహిష్కరించాలని నిర్ణయించారు. వరంగల్ రూరల్ జిల్లా ముస్తాల్యపల్లి లో మహేశ్ చంద్ర సజీవ దహనం ఘటన పై అతని భార్యాపిల్లలు కన్నీరుమున్నీరవుతున్నారు. తన అత్తమామలే మహేష్ చంద్రను సజీవ దహనం చేశారని అతని భార్య రజిత ఆరోపించారు. కుటుంబ ఆస్తి వివాదంలో పెద్దల పంచాయతీలో ఇచ్చిన తీర్పు తన అత్తకు నచ్చలేదని రజిత చెప్పారు.  

మరో ఆర్టీసీ కండక్టర్ మృతి... మనస్తాపానికి గురై మతి చెలించి చివరకు ప్రాణాలు వీడారు

  ఆర్టిసి సమ్మె ఎంతకీ కొలిక్కి రాకపోవడంతో మరో కార్మికుడు తీవ్ర మనస్థాపంతో మృతి చెందాడు. ధర్నాలు, దీక్షలతో ఏమీ ఒరగదని... ప్రభుత్వం దిగి రావాలంటే తెలంగాణ ఉద్యమంలో జరిగినట్లుగా బలిదానం చేసుకోవాల్సిందేనని నమ్మిన కొందరు ప్రాణాలు కోల్పోతుంటే మరికొందరు మతిస్థిమితం కోల్పోయి చివరకు చనిపోతున్నారు. ఆర్టీసీ కుటుంబాలకు న్యాయం జరగాలన్నదే తన లక్ష్యమని ఆర్టిసిలో చివరి బలిదానం తనదే కావాలని పేర్కొంటూ బలవంతంగా తనువు చాలిస్తున్నారు. తాజాగా సంగారెడ్డి జిల్లా జోగిపేటకు చెందిన నాగేశ్వర్ మానసిక ఆందోళనతో మృతి చెందాడు. తనను మళ్లీ కొలువులోకి తీసుకుంటారో లేదోనని ఆందోళన చెందాడు.. ముందే సీఎం కేసీఆర్ పుట్టిన డెడ్ లైన్ కూడా ముగిసింది. కొలువులోకి తీసుకోకుంటే ఇల్లు గడిచేదెలా.. ఆర్టీసీ కండక్టర్ అస్తమానం ఇవే ఆలోచన్లతో నలిగిపోయాడు. తిండి,నిద్ర కూడా మరచిపోయి ఇదే చింతలో ఉన్న ఆయన ఈ నెల 6న  మతిస్థిమితం కోల్పోయాడు. ఆఖరికి ఇప్పుడు ప్రాణాలే కోల్పోయాడు. ఆర్టిసి సమ్మెలో భాగంగా ప్రతి రోజూ సంగారెడ్డి డిపో వద్ద జరిగే ఆందోళన కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. ఇటీవల ప్రభుత్వం కార్మికులు విధుల్లో చేరాలని నిర్ణయించిన డెడ్ లైన్ ను టీవీలో చూసినప్పట్నుంచి నగేష్ ప్రవర్తనలో మార్పు వచ్చింది. దీంతో అతని భార్య సుజాత తన తల్లి నివాసముండే జోగిపేటకు భర్తతో కలిసి వచ్చింది. మూడు నాలుగు రోజుల నుంచి నగేష్  టికెట్ టికెట్, బస్ ఆగింది దిగండి, రైట్ రైట్ అంటూ అరవడం ఆ సందర్భం గానే నవ్వుతూ ఉండటం.. ఫోన్ రాకున్నా హలో హలో అనడం.. ఎవరు చేశారని అడిగితే అశ్వద్ధామ అని సమాధానమిస్తూ ఉండేవాడు. ఒక్కోసారి ఉండండి డిపోలో కలెక్షన్ కట్టి వస్తానంటూ అరవటం ఇక ఇదే ధ్యాసలో ఉన్న నగేష్ చివరికి చనిపోయాడు. తన పిల్లల్ని కూడా గుర్తు పట్టలేని స్థితిలో ఆయన మృతి చెందాడు. ఇలాగే నగేష్ రాత్రంతా నిద్రపోకుండా ఏదోకటి మాట్లాడుతూ ఉండడంతో భర్త ప్రవర్తన చూసి సుజాత కంటి నిండా నీరుతో జాగారం చేస్తూ ఉండేది. చేతిలో డబ్బులు లేవని తన భర్తకు చికిత్స అందించేందుకు దాతలు ముందుకు రావాలని సుజాత వేడుకునేది. ఆర్టీసీ ఆసుపత్రికి వెళ్తే సమ్మెలో ఉన్న వారికి చికిత్స చేయమంటూ వెళ్లగొట్టారని బాధపడింది. ఇన్ని కష్టాల నడుమ ఏదోలా ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నా చివరకు నగేష్ చనిపోవడం పై తన ఆవేదనను సుజాతా వ్యక్తం చేసింది.

టీడీపీని స్వీప్ చెయ్యడమే లక్ష్యంగా పావులు కదుపుతున్న బీజేపీ

  ఏపీలో టీడీపీని ఖాళీ చేయాలని కమలనాథులు కంకణం కట్టుకున్నారా? పరిస్థితులు చూస్తుంటే అలాగే కనిపిస్తుంది. ఇప్పటికే టీడీపీ రాజ్యసభ సభ్యులను బిజెపిలో విలీనం చేసుకుంది. ఇక రాష్ట్రంలో ఎమ్మెల్యేలను చేర్చుకునేందుకు వేగంగా ఆపరేషన్ ఆకర్ష్ అమలు చేస్తుంది బీజేపీ. ఆంధ్రప్రదేశ్ లో 2024లో ఏర్పడేది బిజెపి ప్రభుత్వమేనని జోస్యం చెబుతున్నారు కమలనాథులు. ప్రతిపక్షం అని చెప్పుకుంటున్న పార్టీకి ఆ పరిస్థితి ఉండదంటూ టిడిపి పై సెటైర్లు వేస్తున్నారు. బిజెపి నేతల మాటలు చూస్తుంటే రానున్న రోజుల్లో టిడిపిని ఖాళీ చేయడం ఖాయంగా కనిపిస్తుంది. ఇప్పటికే టిడిపి రాజ్యసభ ఎంపీలు సుజనా, సీఎం రమేష్, టిజి వెంకటేష్, బిజెపిలో చేరారు. తాజాగా ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు కూడా బిజెపి ప్రధాన కార్యదర్శి రాంమాధవ్, ప్రధాని మోదీని కలిశారు.దీంతో గంటా కాషాయం తీర్థం పుచ్చుకోవటం ఖాయంగా తెలుస్తుంది. టిడిపికి ఇటీవల రాజీనామా చేసిన అధికార ప్రతినిధి యామినీ సాదినేని త్వరలో బీజేపీలో చేరుతారని ప్రచారం జరుగుతుంది. రాయలసీమలో ఇప్పటికే కొంత మంది మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు కాషాయి జెండా కప్పుకున్నారు. గంటాతో పాటు ఉత్తరాంధ్ర ప్రకాశం జిల్లాల నుంచి ఎమ్మెల్యేలు బీజేపీ నేతలతో టచ్ లో ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది.త్వరలోనే అసెంబ్లీలో బీజేపీ కి గౌరవప్రదమైన సంఖ్య వస్తుందని కమలనాథులు చేస్తున్న కామెంట్లు చూస్తే ఆపరేషన్ ఆకర్ష్ జోరుగా జరుగనున్నట్లు కనిపిస్తుంది. ఏపీతో పాటు తెలంగాణలోనూ బీజేపీని బలోపేతం చేసేందుకు ఇతర పార్టీల నుంచి భారీగా నేతలని బీజేపీలో చేర్చుకుంటున్నారు. రెండు రోజులకోసారి తెలుగు రాష్ట్రాల నుంచి టిడిపి నేతలు వెళ్లి ఢిల్లీలో బీజేపీ కండువా కప్పుకుని వస్తున్నారు. తెలంగాణలో టిడిపి ఇప్పటికే అస్థిత్వం కోల్పోయిన పరిస్థితి. ఏపీలోనూ గంటాతో మొదలయ్యే వలసల పర్వం ఎంత దూరం వెళుతుందో అర్థం కాని పరిస్థితి.రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో కాంగ్రెస్ దారుణంగా ఓడిపోయింది. కాంగ్రెస్ ఓటు బ్యాంకు అంతా వైసిపి వైపు మళ్లింది. ఏపీలో పుంజుకునేందుకు బీజేపీ ప్రయత్నిస్తున్నా ఆశించిన స్థాయిలో రాణించలేకపోతుంది. సార్వత్రిక ఎన్నికల్లో ఆ పార్టీకి నోటా కంటే తక్కువ ఓట్లు వచ్చాయి. ఏపీలో టిడిపిని దెబ్బ తీస్తే తమ ఓటు బ్యాంకు పెరుగుతుందని కమలనాథులు అంచనా వేస్తూ దీనికి అనుగుణంగా పావులు కదుపుతున్నారు.

నాడు ఇసుక దోపిడీ... నేడు దీక్షలు

  టిడిపి హయాంలో ఐదేళ్ళపాటు ఏపీలో ఇసుక దందా నడిచింది. డ్వాక్రా సంఘాల ముసుగులో పచ్చ పార్టీ నేతలే అడ్డగోలుగా ఇసుక తవ్వి వేల కోట్లు దోచుకున్నారు. చంద్రబాబు నివాసం పక్కనే జరిగిన అడ్డగోలు తవ్వకాలపై ఎన్జీటీ వంద కోట్ల జరిమానా వేసిన పరిస్థితి, అలాంటి చంద్రబాబు ఇప్పుడు ఇసుక కొరత తీరుతున్న సమయంలో దీక్షల పేరుతో డ్రామాలు చేయటంపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు మండిపడుతున్నారు. ఐదేళ్ళు ఇసుక మాఫియాను ప్రోత్సహించిన చంద్రబాబు ఇప్పుడు దొంగ దీక్షలు చేస్తున్నారని పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విమర్శించారు. బాబు కొంగజపాలు అందరికీ తెలుసన్నారు, ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి చేస్తున్న ప్రజారంజక పాలన చూసి ఓర్వలేకే చంద్రబాబు, లోకేష్ లు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.  చంద్రబాబు తనపై చేసిన ఆరోపణలకు ఆధారాలు చూపించాలని లేకుంటే చంద్రబాబు దీక్ష పక్కనే తాను కూడా దీక్షకు దిగుతానని వైఎస్సార్ సిపి ఎమ్మెల్యే పార్థసారథి హెచ్చరించారు. టిడిపి విడుదల చేసిన చార్జిషీట్ అబద్దాల పుట్ట అని ఆరోపించారు. బీసీ నేతలను టార్గెట్ చేస్తూ చంద్రబాబు తప్పుడు ప్రచారం చేస్తున్నారని పార్థసారథి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.  ఇసుకను చంద్రబాబు రాజకీయం చేస్తున్నారని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మండిపడ్డారు. రాష్ట్రంలో ఇసుక కొరత సమస్య తీరిందన్న ఆయన.. చంద్రబాబు ఎందుకోసం దీక్ష చేస్తున్నారని ప్రశ్నించారు. చంద్రబాబు చేసేవి దొంగ దీక్షలు కొంగ జపాలనీ మల్లాది విష్ణు ఆరోపించారు. తనపై చంద్రబాబు చేసిన ఆరోపణలు నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానన్నారు రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్. చంద్రబాబును ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. ఇసుక సరఫరా ప్రారంభమయ్యే సమయానికి దీక్షలంటూ డ్రామాలు చేస్తూ క్రెడిట్ సంపాదించాలని చూస్తున్నారని ఎద్దేవా చేశారు. ఐదేళ్ల పాటు తాను వెనకుండి టిడిపి నేతలతో ఇసుక మాఫియాను నడిపించిన చంద్రబాబు ఇప్పుడు అదే ఇసుకపై దీక్షకు దిగారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు.

వారోత్సవాలు అయ్యే వరకు ఎంత ఇసుక కావాలంటే అంత ఇవ్వండి: సీఎం జగన్

  వరదలు తగ్గుముఖం పట్టడంతో ఇక ఇసుకను జనానికి అందుబాటులో ఉంచుదామని ఏపీ అధికారులకు, ప్రజా ప్రతినిధులకు ఆదేశించారు సీఎం జగన్. ఇందు కోసం ప్రత్యేక ప్రణాళికతో ముందుకు వెళుతుంది సర్కార్. నేటి నుంచి ఈ నెల 21వ తేదీ వరకు ఇసుక వారోత్సవాలు నిర్వమించాలని సీఎం జగన్ ఆదేశించారు. వరద తగ్గడంతో సరఫరా పెంచి వారం రోజుల పాటు ఈ అంశంపైనే పూర్తిగా దృష్టి సారించి అడిగిన వారికి అడిగినంత ఇసుక సరఫరా చేయాలని సూచించారు. ఏపీలో ప్రస్తుతం రోజుకు లక్షా ఇరవై వేల టన్నుల ఇసుక సరఫరా చేస్తున్నారు. వారం రోజుల్లో దీనిని రెండు లక్షల టన్నులకు పెంచేందుకు ఇసుక వారోత్సవాల్లో ప్రభుత్వం చర్యలు చేపట్టబోతుంది.  280 రీచ్ లలో ప్రస్తుతం 99 ఆపరేషన్ లో ఉండగా 21వ తేదీనాటి వరకు 140కి పెంచేలా జాయింట్ కలెక్టర్ లకు బాధ్యతలు అప్పగించారు. నియోజకవర్గాల వారీగా ఇసుక ధరలను ఖరారు చేసి రెడ్ కార్డ్ లను ప్రదర్శించబోతున్నారు. ప్రజల అవసరాలకు సరిపడా ఇసుకను స్టాక్ యార్డుల్లో సిద్ధంగా ఉంచబోతున్నారు. నిర్ణయించిన ధర కంటే అధిక ధరలకు ఎవరు విక్రయించినా ఇసుకను సీజ్ చేయాలని సీఎం ఆదేశించారు. దీనికి తోడు అపరాధ రుసుముతో పాటు రెండేళ్ల వరకు జైలు శిక్ష కూడా విధిస్తామన్నారు.  ప్రస్తుతం రాష్ట్రంలో ఇసుకని నిల్వ చేసే అధికారంగాని, అమ్మే అధికారంగాని మైనింగ్ డిపార్ట్ మెంట్ కు మాత్రమే ఉంది తప్పితే ఎటువంటి వ్యక్తులకు గాని, సంస్థలకు గాని లేదు. కనుక ఇసుక నిల్వ చేసి అక్రమంగా రవాణా చేసినా.. అక్రమంగా నిల్వ చేసినా.. బ్లాక్ మార్కెటింగ్ చేసిన పునర్విక్రయం చేసినా కూడా ఉక్కుపాదం మోపాలని నిర్ణయించారు. ఇసుక వారోత్సవాలను ప్రభుత్వం ప్రతిష్టాత్మంగా తీసుకుంది. ఇసుక కొరత తీరే వరకు సంబంధిత విభాగాల్లో ఉద్యోగులెవ్వరూ సెలవులు తీసుకోరాదని సీఎం సూచించారు. సరిహద్దుల్లో ప్రతి చోట చెక్ పోస్టుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేపట్టారు అధికారులు. ఎవరైనా ఇసుక అక్రమ రవాణా చేసినా నిర్ణయించిన దానికంటే అధిక ధరలకు విక్రయించినా కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు.

పిల్లల భవిష్యత్తు ప్రశ్నార్ధకం... స్కూళ్లను కూడా వదలని వైసీపీ రాజకీయం!!

  స్కూళ్లు..పిల్లలు అంటే ఎవరైనా.. ఎక్కడైనా.. రాజకీయం చెయ్యడానికి అంతగా ఇష్టపడరు. కానీ ప్రకాశం జిల్లా నేతలు మాత్రం ససేమిరా అంటున్నారు. చిన్నారుల జీవితాలు ఏమైపోతే మాకేంటి.. మా పంతాలే మాకు ముఖ్యమని భీష్మించుకుని కూర్చున్నారు. వెరసి స్కూల్లో ఏకంగా ఓ పథకమే ఆగిపోయిన కూడా చీమకుట్టినట్లు కూడా బాధపడటం లేదు. కొండపి అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రానికి కొంత దూరంలో ఉన్న అనకర్లపూడి గ్రామంలో ఈ పాఠశాల ఉంది. గత 13 సంవత్సరాలుగా అక్కడి దళిత కాలనీ లోని పాఠశాలలో తుమ్మ లక్ష్మి అనే మహిళ మధ్యాహ్న భోజనం సమకూరుస్తుంది. వైసిపి సర్కారు రావడంతో ఆమెకు కష్టాలు మొదలయ్యాయి. అధికారంలోకి రాగానే లక్ష్మిని తొలగించాలని అధికారులకు హుకుం జారీ చేశారు వైసిపి నేతలు. నేతలు చెబితే తప్పుతుందా అని ఉన్నతాధికారులకు కొండపి ఎంఈవో ఓ లేఖ రాశారు. లక్ష్మి సరిగా పనిచేయటం లేదంటూ ఆ లేఖలో పేర్కొన్నారు. విద్యార్థుల శ్రేయస్సు దృష్ట్యా లక్ష్మిని తొలగిస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేశారు.అధికార పార్టీ నేతలు సూచించిన అదే గ్రామంలోని వేరొక మహిళకు ఆ బాధ్యతలు అప్పగించేశారు. ఈ మార్పును పాఠశాల విద్యార్థులు ఒప్పుకోలేదు. తమకు వండి పెట్టే ఆయా లక్ష్మీ ని తీసేశారని తల్లిదండ్రులకు చెప్పారు. వేరే ఎవరినో పెట్టారని.. భోజనం సరిగ్గా లేదంటూ ఫిర్యాదు చేశారు. దీంతో వివాదం రాజుకుంది. లక్ష్మిని తొలగించడం పై తల్లిదండ్రులు అభ్యంతరం వ్యక్తం చేశారు. పేరెంట్స్ కమిటీకి తెలియకుండా ఎలా నిర్ణయం తీసుకుంటారని ప్రశ్నించారు. వైసిపి నేతలు చెప్పిన వ్యక్తినే అధికారులు కొనసాగించటంతో తల్లిదండ్రులు ఆగ్రహించారు. పిల్లల్ని స్కూలుకు పంపకుండా ఆపేశారు. దీంతో ఇది జిల్లా స్థాయిలో అధికారులకు తెలిసిపోయింది. టీచర్లు ఫుల్.. స్టూడెంట్స్ నిల్.. అన్నట్లుగా మారింది పరిస్థితి.స్కూల్ విషయం లో రాజకీయం చివరికి పాఠశాల మూసేసే వరకు దారి తీసింది. అటు వైసీపీ నేతలు ఇటు తల్లిదండ్రులు ససేమిరా అనడంతో విద్యార్ధుల భవిష్యత్ ప్రశ్నార్ధకంగా మారింది. ఈ విషయం లో కొండపి ఎమ్మెల్యే జోక్యం చేసుకుంటారా..లేక జిల్లాకి చెందిన విద్యామంత్రి ఆదిమూలపు సురేష్ స్పందిస్తారా.. అనే విషయం వేచి చూడాలి.

బాలల దినోత్సవం నాడు విషాద వార్త... ఐదేళ్ల బాలుడు మృతి

  కర్నూలు జిల్లా పాణ్యంలో విషాదం చోటుచేసుకుంది. విజయానికేతన్ స్కూల్ యాజమాన్యం నిర్లక్ష్యం వల్ల చిన్నారి ప్రాణాలు కోల్పోయాడు. ఓర్వకల్లు మండలం తిప్పాయి పాలానికి చెందిన శ్యామ్ సుందర్ రెడ్డి కుమారుడు పురుషోత్తం రెడ్డి పాణ్యం విజయనికేతన్ లో యూకేజీ చదువుతున్నాడు.చిన్నారి ప్రమాదవశాత్తు వేడి వేడి సాంబారు గిన్నెలో పడి తీవ్రంగా గాయాల పాలయ్యాడు. హుటాహుటిన అతన్ని కర్నూలు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ చనిపోయాడు. బాలుడి మృతదేహాన్ని అక్కడే వదిలేసి స్కూల్ యాజమాన్యం పరారైంది. స్కూల్ యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే తన బిడ్డ చనిపోయాడని ఆరోపించాడు తండ్రి. హాస్టల్లో చేర్పించే సమయంలో  రూ.50 వేలు చెల్లించామన్నారు తండ్రి శ్యామ్. ఆ సమయంలో నలుగురు చిన్నారులకు ఒక కేర్ టేకర్ ఉంటారని చెప్పిన స్కూల్ యాజమాన్యం పై క్రిమినల్ కేసు పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు శ్యామ్ సుందర్ రెడ్డి. కర్నూల్ జిల్లాలో జరిగిన తీవ్ర విషాదాం విద్యార్థి తండ్రికి గుండె కోతను మిగిల్చింది.  వడ్డిస్తున్నప్పుడు కిందపడిపోయినట్లు యాజమాన్యం వాళ్ళు తనకు ఫోన్ చేసారని.. అప్పుడు తాను వేరే ఊరిలో ఉన్నానని.. వార్త విన్న వెంటనే స్కూల్ కి వచ్చానని.. అప్పటికే తన బిడ్డ ఉలుకూ పలుకూ లేకుండా పడి ఉన్నట్లు బాధను వ్యక్తం చేశాడు. స్కూలు యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే తన ఐదేళ్ళ బిడ్డను తను కోల్పోయానని వాపోయారు. యాజమాన్యం పై కఠిన చర్యలు తీసుకోవాలని బాలుడి తండ్రి వెల్లడించారు.స్కూళ్లో సరిగ్గా పిల్లల్ని కేర్ తీసుకోవడం లేదని.. సరైన జాగ్రత్తలు తీసుకోవడం లేదని.. ఈ విషయంపై చాలా సార్లు ఫిర్యాదు చేసినప్పటికీ స్కూల్ యాజమాన్యం సరిగ్గా స్పందించలేదన్నారు. మేము ఫిర్యాదు చేసినప్పుడే స్కూల్ యాజమాన్యం స్పందించి సరైన చర్యలు తీసుకొని ఉంటే ఈ రోజు తన కొడుకు బతికుండేవాడని కన్నీటి పర్వంతం అయ్యారు. రాబోయే రోజుల్లో ఏ ఒక్క తల్లిదండ్రులకు తన కష్టం రాకూడదని..ఎలాంటి నష్టం జరగకూడదని విద్యార్థి తండ్రి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

భవన నిర్మాణ కార్మికుల కోసం బాబు దీక్ష.. ఇసుక కొరతపై పోరాటం 

  గత కొద్దిరోజులుగా ఆంధ్రా రాజకీయాలు ఇసుక చుట్టూ తిరువుతున్నాయి.. చెప్పాలంటే ఇసుక రాజకీయంగా మారింది అని కూడా అనుకోవచ్చు. ఇసుక కొరతను పరిష్కరించడమే కాకుండా చనిపోయిన కార్మికుల కుటుంబాలని ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ విజయవాడ అలంకార్ సెంటర్ ధర్నా చౌక్‌ వద్ద నేడు చంద్రబాబు దీక్ష చేస్తున్నారు. ధర్నాచౌక్‌లో చంద్రబాబు దీక్ష కోసం భారీగా ఏర్పాట్లు చేశారు టీడీపీ నేతలు. చంద్రబాబు స్వయంగా దీక్ష ఏర్పాట్లను ఎప్పటికప్పుడు టెలికాన్ఫరెన్స్ ద్వారా   పర్యవేక్షించారు. గత ప్రభుత్వాలు చేసిన తీరుగా ఉచిత ఇసుక విధానాన్ని పునరుద్ధరించాలని కోరారు. ఈ నేపధ్యంలో పనులు లేక చనిపోయిన భవన నిర్మాణ కుటుంబాలకు 25 లక్షల రూపాయల పరిహారాన్ని ప్రభుత్వం అందించాలని చంద్రబాబు డిమాండ్‌ చేస్తున్నారు. ఈ కొరత వల్ల ఉపాధి కోల్పోయిన కార్మికులకు నెలకు 10వేల చొప్పున భృతి అందించాలని కూడా బాబు డిమాండ్లల్లో పేర్కొన్నారు. విశాఖలో జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ చేపట్టిన లాంగ్‌మార్చ్‌కు టీడీపీ మద్దతు ఇచ్చిన తెలిసిందే.. అలా చూస్తే ఇసుక సమస్యపై టీడీపీ రెండోసారి ఆందోళన చేస్తుందనే అనుకోవాలి. ప్రత్యేకంగా బాబు గారు ఎందులో పాల్గొనకపోయినా పార్టీ నేతలను పంపారు. ఇలా దశలవారీగా పోరాటాన్ని ఉధృతం చేస్తూ వచ్చారు చంద్రబాబు. ఇక ఇదంతా జరిగేపని కాదు అని నేడు తానే స్వయంగా దీక్షకు దిగారు. చంద్రబాబు చేస్తున్న దీక్షకు మద్దతు తెలపమంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌ను కోరారు టీడీపీ నేతలు. ముందులానే దీక్షకు బీజేపీ సంఘీభావం తెలపింది.. ఇక ప్రత్యక్షంగా పవన్ హాజరు కాకపోయినా తన ప్రతినిధుల బృందాన్ని పంపించాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.

ఏపీ చీఫ్ సెక్రటరీగా నీలం సహానీ... తొలి మహిళా సీఎస్ గా రికార్డు...

  నవ్యాంధ్రప్రదేశ్ తొలి మహిళా చీఫ్ సెక్రటరీగా నీలం సహానీ రికార్డు సృష్టించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శిగా నీలం సహానీని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 1984 బ్యాచ్ ఐఏఎస్‌ అధికారిణి అయిన నీలం సహానీ... ఇటీవలే కేంద్ర సర్వీసుల నుంచి రిలీవ్ అయ్యారు. కేంద్ర సాంఘిక సంక్షేమం, సాధికారత మంత్రిత్వశాఖ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించిన నీలం సహానీని... ఏపీ కేడర్‌కు రిలీవ్ చేసింది. ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వ సామాజిక న్యాయం, ఎంపర్ మెంట్ కార్యదర్శిగా పనిచేసిన నీలం సహానీ.... ఇప్పుడు ఏపీ సీఎస్‌గా బాధ్యతలు చేపట్టి ....నవ్యాంధ్రప్రదేశ్ తొలి మహిళా చీఫ్ సెక్రటరీగా రికార్డు సృష్టించారు. 1984వ ఐఏఎస్ బ్యాచ్ కి చెందిన నీలం సహానీ... మచిలీపట్నంలో అసిస్టెంట్ కలెక్టర్ గా పనిచేశారు. అలాగే, టెక్కలి సబ్ కలెక్టర్ గాను, నల్గొండ జిల్లా సంయుక్త కలెక్టర్ గాను పనిచేశారు. అదేవిధంగా మున్సిపల్ శాఖ డిప్యూటీ సెక్రటరీగా, హైదరాబాద్ లో స్ట్రీ శిశు సంక్షేమశాఖ పీడీగా, అలాగే నిజామాబాద్ జిల్లా పీడీడీ ఆర్డీఏగా, ఖమ్మం జిల్లాలో కాడా అడ్మినిస్ట్రేటర్ గాను పనిచేశారు. అనంతరం ఇంధనశాఖలో సంయుక్త కార్యదర్శిగా, నల్గొండ జిల్లా కలక్టర్ గా, కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్ గా, ఆర్ అండ్ బి కార్యదర్శిగా పనిచేశారు. అదేవిధంగా క్రీడలశాఖ కమిషనర్ మరియు శాప్ వీసీ అండ్ ఎండీగా పనిచేశారు. అనంతరం కేంద్ర గ్రామీణాభివృద్ధిశాఖ సంయుక్త కార్యదర్శిగా కేంద్రంలో పనిచేసిన అనంతరం ఏపీఐడీసీ కార్పొరేషన్ వీసీ అండ్ ఎండీగా ఉమ్మడి రాష్ట్రంలో పనిచేశారు. ఆ తర్వాత స్త్రీ-శిశు సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శిగా పనిచేశారు. 2018 నుంచి కేంద్ర సామాజిక న్యాయం మరియు ఎంపర్ మెంట్ కార్యదర్శిగా పనిచేస్తూ నవ్యాంధ్రప్రదేశ్ కి తొలి మహిళా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టారు. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో సతీనాయర్, మిన్నీ మాధ్యూలు మహిళా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులుగా పనిచేయగా... నవ్యాంధ్రప్రదేశ్ కు తొలి మహిళా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నీలం సహానీ బాధ్యతలు చేపట్టారు.  

భవిష్యత్తులో ఆర్టీసీ ఉంటుందా?.. హైకోర్టులో వాదనలు వింటే అలానే అనిపిస్తుంది

  ఆర్టీసీ సమ్మెపై హై కోర్టులో విచారణ జరిగింది. హైకోర్టు ప్రతిపాదించిన మాజీ న్యాయమూర్తుల కమిటీకీ ప్రభుత్వం అభ్యంతరం చెప్పింది. సమస్య లేబర్ కోర్టుకు వదిలేయాలని కోరింది. టీఎస్ఆర్టీసీ ఏర్పాటుకు కేంద్రం అనుమతి లేదని హైకోర్ట్ తెలిపింది. ఆ తర్వాత విచారణను నవంబర్ 18 కి వాయిదా వేసింది. ఆర్టీసీ సమ్మెపై హై కోర్టులో ఏ విషయం కొలిక్కి రవటంలేదు. సమ్మె రూట్ల ప్రైవేటీకరణపై విచారణ జరిగింది. ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసింది. కోర్టు సూచించిన హై పవర్ కమిటీకి అంగీకరించలేదు. అంతేకాకుండా సమ్మె వ్యవహారాన్ని లేబర్ కోర్టుకు అప్పగించాలని కోరింది. హైకోర్టులో విచారణ పెండింగ్ లో ఉన్నందున లేబర్ కోర్టుకు వెళ్లలేదని నివేదించింది.  ఎస్మా ప్రకారం సమ్మె చట్ట విరుద్ధమని ప్రభుత్వం తరుపున వాదించారు ఏజీ. పునర్విభజన చట్టం ప్రకారం టీఎస్ ఆర్టీసీని ఏర్పాటు చేశామన్నారు. అయితే కేంద్రం అనుమతి లేదు కదా అని హై కోర్టు ప్రశ్నించగా టీఎస్ఆర్టీసీ ఏర్పాటుకు అనుమతి తప్పని సరికాదన్నారు ఏజీ. ఆర్టీసీ పై ప్రభుత్వానికి సర్వాధికారాలుంటాయి అని తెలిపారు. అధికారాలు ఉన్నప్పటికీ కేంద్రం అనుమతి అవసరమని తెల్పింది ధర్మాసనం. తదుపరి విచారణ ఈ నెల 18కి వాయిదా వేసింది.  హైపవర్ కమిటీని ఆర్టీసీ జేఏసీ స్వాగతించినా సర్కార్ అభ్యంతరం చెప్పడంతో హై కోర్టు ఏం నిర్ణయం తీసుకుంటుంది అనేది ఆసక్తికరంగా మారింది.టీఎస్ ఆర్టీసీ ఏర్పాటుకు కేంద్రం అనుమతి విషయంలో కూడా కోర్టు క్లారిటీ ఇచ్చింది. మరి దీనికి ప్రభుత్వం ఎలాంటి కౌంటర్ ఇవ్వనుంది అనేది వేచి చూడాలి. ఆర్టీసీ సమ్మెపై హై కోర్టులో విచారణ జరుగుతున్న తీరు చూస్తుంటే అసలు భవిష్యత్తులో ఆర్టీసీ ఉంటుందా లేదా అనే అనుమానాలు కలుగుతున్నాయి. సమ్మెను త్వరగా పరిష్కరించాలనే ఉద్దేశం ప్రభుత్వానికి ఉన్నట్టు కనిపించటం లేదు. కార్మికులు కూడా మెట్టు దిగడానికి సిద్ధంగా లేకపోవటంతో తెలంగాణ ప్రజలకు రవాణా కష్టాలు తప్పేలా లేవు.

ప్రాధాన్యత ఇవ్వని పార్టీలో నేను ఉండను :- దేవినేని అవినాష్

తెలుగుయువత అధ్యక్షుడు దేవినేని అవినాష్ తెలుగు దేశం పార్టీని వీడుతున్నారు. అభిమానులు.. అనుచరులతో.. జరిగిన సమావేశంలోఇవాళ సాయంత్రం ( నవంబర్ 14న ) ఆయన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లుగా తన   నిర్ణయాన్ని ప్రకటించారు. చంద్రబాబుకు విధేయుడు గా ఉన్నప్పటికీ పార్టీలో ప్రాధాన్యత ఇవ్వటం లేదని అవినాష్ అసంతృప్తి వ్యక్తం చేశారు. 2019 ఎన్నికల్లో టిడిపి తరుపున గుడివాడ నుంచి పోటీ చేసి ఓటమి చెంది తర్వాత రాష్ట్ర తెలుగు యువత అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు దేవినేని అవినాష్. ఇటీవల కాలంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరమంటూ ఆయనకు ఆహ్వానం అందింది. గత ఎన్నికల్లో విజయవాడ ఎంపీ స్థానాన్ని వైసిపి కోల్పోవటంతో పాటు విజయవాడ తూర్పు నియోజకవర్గంలో కూడా ఓడిపోయింది. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో కూడా అతి తక్కువ మెజారిటీతో గెలు పొందడంతో పార్టీకి విజయవాడలోని ప్రధాన సామాజికవర్గ అండదండలు లేవని నిర్ణయానికి వచ్చారు సీఎం జగన్. దేవినేని కుటుంబం నుంచి దేవినేని అవినాష్ ను తమ వైపుకు రావలసిందిగా కీలక వ్యక్తుల ద్వారా సమాచారం పంపారు. ఇదే సమయంలో తెలుగు దేశం పార్టీ కూడా అవినాష్ ను తన పదవిలో కొనసాగించమనే కోరింది. అయితే తనకు నియోజక వర్గ బాధ్యతలు అప్పగించకుండా ఎన్నికల సమయంలో తమను ట్రబుల్ షూటర్ గా ఉపయోగించుకోవటం పట్ల అవినాష్ చంద్రబాబు వద్ద ఆవేదన వ్యక్తం చేశారు.తమ కుటుంబానికి అనుచరులు.. అభిమానులు.. ఉన్న విజయవాడ తూర్పు లేదా పెనమలూరు నియోజకవర్గాల్లో ఏదో ఒకటి తనకు కేటాయించాలని కోరారు. అదే విధంగా తూర్పు నియోజకవర్గంలో నగరంలో తమ అనుచరులకు కార్పొరేషన్ ఎన్నికల్లో టికెట్లు కేటాయించి అంశంపై కూడా పార్టీ నుంచి తగిన హామీ లభించలేదని అవినాష్ అనుచరులు చెబుతున్నారు. పార్టీలో చంద్రబాబు చెప్పిన మాట వింటూ ఉన్నప్పటికీ తమకు ఎటువంటి ప్రాధాన్యత గుర్తింపు ఇవ్వడం లేదని  నిన్న ( నవంబర్ 13న )  జరిగిన పార్టీ సమావేశంలో ఆందోళన వ్యక్తం చేశారు అవినాష్ అనుచరులు.

చంద్రబాబు దీక్ష రోజే ఇసుక వారోత్సవాలు మొదలు.. మొండిగా వ్యవహరిస్తున్న జగన్

  ఇసుక కొరత సమస్య ను పట్టించుకోనట్లుగా వ్యవహరిస్తున్న ముఖ్యమంత్రి కాస్తా విపక్షాల ఆందోళన కారణంగా 2 వారాల నుంచి వరుసగా సమీక్షలు చేస్తున్నారు. 2 వారాల కిందట తొలిసారి సమీక్ష చేసి వారోత్సవాలు నిర్వహించి సమస్య లేకుండా చేస్తామన్నారు. అది కూడా చంద్రబాబు ఇసుక కొరతపై దీక్ష చేయనున్న రోజు నుంచే వారోత్సవాలు నిర్వహించాలని ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి నిర్ణయించారు. గత సమీక్షలో కేవలం ఇసుక సమస్యల పై స్పందన కార్యక్రమం నిర్వహించి ఆ తర్వాత నెలాఖరులోగా వారోత్సవాలు నిర్వహిద్దామని అధికారులకు సూచించారు. కానీ ఇప్పుడు మనసు మార్చుకుని ఈ నెల 14 వ తేదీ నుంచి 21 వ తేదీ వరకు ప్రభుత్వ యంత్రాంగమంతా ఇసుక మీదనే పని చేయాలని ఆదేశించారు. నవంబర్ 3వ తేదీన లాంగ్ మార్చ్ నిర్వహించిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రభుత్వానికి రెండు వారాల గడువు ఇచ్చారు. తాజాగా గవర్నర్ ను కలిసి ఫిర్యాదు చేశారు. కూలీలు ఆత్మహత్యలు చేసుకుంటున్నా ప్రభుత్వం స్పందించకపోవడం పై మండిపడ్డారు.విపక్షాల ఇసుక పోరాటాలతో ప్రభుత్వానికి సెగ తగులుతోంది. కూలీలు ప్రతి రోజూ ఎక్కడో చోట ఉపాధి లేకపోవటం వల్ల ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. దీంతో సహజంగానే ప్రజల్లో అసహనం కనిపిస్తుంది. వరదల పేరుతో ప్రభుత్వం అబద్ధాలు చెబుతోందని ఇసుక బ్లాక్ మార్కెట్ లో ఎలా దొరుకుతోందన్న భావన ప్రజల్లోకి వచ్చింది. పైగా ఇప్పుడు వరదలు తగ్గిపోయాయి. అయినప్పటికీ ఇసుక పూర్తిస్థాయిలో అందుబాటులోకి రాలేదు. అందుబాటులోకి వచ్చే ఇసుక రేటు బ్లాక్ మార్కెట్ రేంజ్ లో ఉంది. ప్రభుత్వం ఇసుక వారోత్సవాలతో సమస్యను పరిష్కరిస్తుందా.? కూలీలందరికీ ఉపాధి దొరికేలా చేయగలుగుతుందా.? ఇంతకాలం వారికి జరిగిన నష్టాన్ని ఎలా భర్తీ చేస్తారు. రాష్ట్రంలో ఇసుక రాజకీయాన్ని ఏ మలుపు తిప్పబోతుంది అనేది వేచి చూడాలి.