ప్రాధాన్యత ఇవ్వని పార్టీలో నేను ఉండను :- దేవినేని అవినాష్

తెలుగుయువత అధ్యక్షుడు దేవినేని అవినాష్ తెలుగు దేశం పార్టీని వీడుతున్నారు. అభిమానులు.. అనుచరులతో.. జరిగిన సమావేశంలోఇవాళ సాయంత్రం ( నవంబర్ 14న ) ఆయన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లుగా తన   నిర్ణయాన్ని ప్రకటించారు. చంద్రబాబుకు విధేయుడు గా ఉన్నప్పటికీ పార్టీలో ప్రాధాన్యత ఇవ్వటం లేదని అవినాష్ అసంతృప్తి వ్యక్తం చేశారు. 2019 ఎన్నికల్లో టిడిపి తరుపున గుడివాడ నుంచి పోటీ చేసి ఓటమి చెంది తర్వాత రాష్ట్ర తెలుగు యువత అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు దేవినేని అవినాష్. ఇటీవల కాలంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరమంటూ ఆయనకు ఆహ్వానం అందింది. గత ఎన్నికల్లో విజయవాడ ఎంపీ స్థానాన్ని వైసిపి కోల్పోవటంతో పాటు విజయవాడ తూర్పు నియోజకవర్గంలో కూడా ఓడిపోయింది. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో కూడా అతి తక్కువ మెజారిటీతో గెలు పొందడంతో పార్టీకి విజయవాడలోని ప్రధాన సామాజికవర్గ అండదండలు లేవని నిర్ణయానికి వచ్చారు సీఎం జగన్. దేవినేని కుటుంబం నుంచి దేవినేని అవినాష్ ను తమ వైపుకు రావలసిందిగా కీలక వ్యక్తుల ద్వారా సమాచారం పంపారు. ఇదే సమయంలో తెలుగు దేశం పార్టీ కూడా అవినాష్ ను తన పదవిలో కొనసాగించమనే కోరింది. అయితే తనకు నియోజక వర్గ బాధ్యతలు అప్పగించకుండా ఎన్నికల సమయంలో తమను ట్రబుల్ షూటర్ గా ఉపయోగించుకోవటం పట్ల అవినాష్ చంద్రబాబు వద్ద ఆవేదన వ్యక్తం చేశారు.తమ కుటుంబానికి అనుచరులు.. అభిమానులు.. ఉన్న విజయవాడ తూర్పు లేదా పెనమలూరు నియోజకవర్గాల్లో ఏదో ఒకటి తనకు కేటాయించాలని కోరారు. అదే విధంగా తూర్పు నియోజకవర్గంలో నగరంలో తమ అనుచరులకు కార్పొరేషన్ ఎన్నికల్లో టికెట్లు కేటాయించి అంశంపై కూడా పార్టీ నుంచి తగిన హామీ లభించలేదని అవినాష్ అనుచరులు చెబుతున్నారు. పార్టీలో చంద్రబాబు చెప్పిన మాట వింటూ ఉన్నప్పటికీ తమకు ఎటువంటి ప్రాధాన్యత గుర్తింపు ఇవ్వడం లేదని  నిన్న ( నవంబర్ 13న )  జరిగిన పార్టీ సమావేశంలో ఆందోళన వ్యక్తం చేశారు అవినాష్ అనుచరులు.

చంద్రబాబు దీక్ష రోజే ఇసుక వారోత్సవాలు మొదలు.. మొండిగా వ్యవహరిస్తున్న జగన్

  ఇసుక కొరత సమస్య ను పట్టించుకోనట్లుగా వ్యవహరిస్తున్న ముఖ్యమంత్రి కాస్తా విపక్షాల ఆందోళన కారణంగా 2 వారాల నుంచి వరుసగా సమీక్షలు చేస్తున్నారు. 2 వారాల కిందట తొలిసారి సమీక్ష చేసి వారోత్సవాలు నిర్వహించి సమస్య లేకుండా చేస్తామన్నారు. అది కూడా చంద్రబాబు ఇసుక కొరతపై దీక్ష చేయనున్న రోజు నుంచే వారోత్సవాలు నిర్వహించాలని ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి నిర్ణయించారు. గత సమీక్షలో కేవలం ఇసుక సమస్యల పై స్పందన కార్యక్రమం నిర్వహించి ఆ తర్వాత నెలాఖరులోగా వారోత్సవాలు నిర్వహిద్దామని అధికారులకు సూచించారు. కానీ ఇప్పుడు మనసు మార్చుకుని ఈ నెల 14 వ తేదీ నుంచి 21 వ తేదీ వరకు ప్రభుత్వ యంత్రాంగమంతా ఇసుక మీదనే పని చేయాలని ఆదేశించారు. నవంబర్ 3వ తేదీన లాంగ్ మార్చ్ నిర్వహించిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రభుత్వానికి రెండు వారాల గడువు ఇచ్చారు. తాజాగా గవర్నర్ ను కలిసి ఫిర్యాదు చేశారు. కూలీలు ఆత్మహత్యలు చేసుకుంటున్నా ప్రభుత్వం స్పందించకపోవడం పై మండిపడ్డారు.విపక్షాల ఇసుక పోరాటాలతో ప్రభుత్వానికి సెగ తగులుతోంది. కూలీలు ప్రతి రోజూ ఎక్కడో చోట ఉపాధి లేకపోవటం వల్ల ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. దీంతో సహజంగానే ప్రజల్లో అసహనం కనిపిస్తుంది. వరదల పేరుతో ప్రభుత్వం అబద్ధాలు చెబుతోందని ఇసుక బ్లాక్ మార్కెట్ లో ఎలా దొరుకుతోందన్న భావన ప్రజల్లోకి వచ్చింది. పైగా ఇప్పుడు వరదలు తగ్గిపోయాయి. అయినప్పటికీ ఇసుక పూర్తిస్థాయిలో అందుబాటులోకి రాలేదు. అందుబాటులోకి వచ్చే ఇసుక రేటు బ్లాక్ మార్కెట్ రేంజ్ లో ఉంది. ప్రభుత్వం ఇసుక వారోత్సవాలతో సమస్యను పరిష్కరిస్తుందా.? కూలీలందరికీ ఉపాధి దొరికేలా చేయగలుగుతుందా.? ఇంతకాలం వారికి జరిగిన నష్టాన్ని ఎలా భర్తీ చేస్తారు. రాష్ట్రంలో ఇసుక రాజకీయాన్ని ఏ మలుపు తిప్పబోతుంది అనేది వేచి చూడాలి.

కొత్త పథకం.. కొత్త కార్డు.. ఏపీలో జగన్ కొత్త తరహా పాలన

  ఆంధ్రప్రదేశ్ లో ప్రతి పథకానికి కొత్త కార్డులు రాబోతున్నాయి. లబ్ధిదారుల ఎంపికకు రాష్ట్రవ్యాప్త సర్వే నిర్వహించాలని సీఎం జగన్ మోహన్ రెడ్డి ఆదేశించారు. ఆ బాధ్యతలను వలంటీర్లు సచివాలయాలకు అప్పగించనున్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధిదారులందరికీ కొత్త కార్డులు మంజూరు చేయనున్నట్లు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రకటించారు. ఈ నవంబర్ 20 నుంచి డిసెంబర్ 20 వరకు నెల రోజుల పాటు సంక్షేమ పథకాల లబ్ధిదారుల ఎంపిక జరుగుతుందని తెలిపారు.  స్పందన కార్యక్రమంపై మంగళవారం సచివాలయం నుంచి కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రేషన్,పెన్షన్, ఆరోగ్య శ్రీ ఫీజు రీయంబర్స్మెంట్ తదితర సంక్షేమ పథకాల లబ్ధిదారుల ఎంపికకు రాష్ట్ర వ్యాప్తంగా సర్వే చేపట్టబోతున్నట్లు సీఎం ఈ సందర్భంగా తెలిపారు.ఈ కార్యక్రమంతో గ్రామ సచివాలయాలు వాలంటీర్లకు పూర్తి స్థాయిలో పని అప్పగించినట్లు అవుతుందన్నారు. ప్రభుత్వ పథకాలన్నింటికి కొత్త కార్డుల జారీ చేయటం వల్ల ఏ పథకానికి ఏ కార్డు ఉపయోగపడుతుందో లబ్దిదారులకు తెలుస్తుందని.. అధికారులకు కూడా ఒక స్పష్టత ఉంటుందని అభిప్రాయపడ్డారు. ఇదే సమయంలో వైయస్సార్ సున్నా వడ్డీ, నేతన్న నేస్తం, అమ్మ బడి, నాయి బ్రాహ్మణులకు నగదు, వైయస్సార్ కాపు నేస్తం తదితర పథకాల కు లబ్ధిదారుల ఎంపికపై మార్గదర్శకాలు కూడా విడుదల చేస్తామన్నారు. గ్రామ సచివాలయాలలో శాశ్వతంగా లబ్ధిదారుల పేర్లు వెల్లడించే బోర్డులు ఉండాలని సూచించారు. అధికారం కోసం కాకుండా ప్రజలకు సేవ చేయటానికే ఉన్నామన్నది కలెక్టర్ లు, ఎస్పీలు గుర్తుపెట్టుకోవాలి అని సీఎం అన్నారు. ప్రజా వినతుల పరిష్కారానికి చొరవ చూపాలని సూచించారు. వినతుల పరిష్కారంలో నాణ్యత చాలా ముఖ్యమైందని..అందుకోసమే ప్రయత్నించాలని స్పష్టం చేశారు. స్పందనల్లో వచ్చే ఫిర్యాదుల పరిష్కారంలో నాణ్యత కోసం స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్ పై ఆరు జిల్లాల లో శిక్షణ అవగాహన కార్యక్రమాలు పూర్తయ్యాయని సీఎం చెప్పారు.ఉగాది నాటికి ఇళ్ల స్థలాలు ఇచ్చే కార్యక్రమాన్ని ప్రభుత్వం మానస పుత్రిక గా జగన్ అభివర్ణించారు. కలెక్టర్లు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయటానికి కృషి చేయాలని పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వటం పైనే రాత్రి పగలు ఆలోచించాలని స్పష్టం చేశారు. అందుబాటులో ఉన్న ప్రభుత్వ భూములను గుర్తించాలని జిల్లా కలెక్టర్లకు.. రెవెన్యూ అధికారులకు.. ఆదేశించారు.  

రెండోసారి మోదీ సర్కార్ లో ఆర్ధిక పరిస్థితులు.. మొదటిసారి కంటే 87 శాతం తక్కువ

  మోదీ సర్కార్ రెండో సారి అధికారానికి వచ్చిన తరువాత దేశ ఆర్థిక పరిస్థితి అంత ఆశాజనకంగా లేదనే చెబుతున్నారు నిపుణులు. ప్రభుత్వం ఎంతో ఉత్సాహంగా ప్రవేశ పెట్టిన వస్తు సేవల పన్ను.. జీఎస్టీ వసూళ్లు.. అంతంత మాత్రంగానే ఉన్నాయి. ప్రతి నెలా జీఎస్టీ లక్ష్యాన్ని చేరుకోలేకపోతున్నారు. ఈ ఏడాది అక్టోబర్ లో కూడా జీఎస్టీ వసూళ్లు 5.29 శాతం తగ్గాయి. గత ఏడాది అక్టోబర్ లో లక్ష కోట్ల రూపాయలు జీఎస్టీ వసూలైతే ఈ ఏడాది 95,000 కోట్లకు పరిమితమైంది. పండుగ సీజన్ లో ఆన్ లైన్ సేల్స్ పెరగడంతో పన్ను వసూళ్లు తగ్గాయని పన్నుని 25 శాతం నుంచి 15 శాతానికి తగ్గించారు. దీనివల్ల దీపావళి పండుగ నాటికి ధరలు బాగా తగ్గి అటు పట్టణ ప్రాంతాల్లోనూ ఇటు గ్రామీణ ప్రాంతాల్లోనూ వినియోగ వస్తువుల విక్రయం పెరిగింది. కంపెనీల లాభాల్లో కూడా పెరుగుదల కనిపించింది. లాభాలు వచ్చిన రంగాల్లో ఉత్పత్తులు పెంచేందుకు.. కొత్తగా పెట్టుబడులు పెట్టేందుకు.. అవకాశం వచ్చింది. వాణిజ్యంలో ప్రభుత్వ మితిమీరిన జోక్యం కూడా శాపంగా పరిణమించింది. బ్యాంక్లు, ఎయిర్ లైన్స్, మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు నిత్యం ప్రభుత్వ సాయం పైనే ఆధారపడుతున్నాయి.చాలా వరకు నగదు ఈ 3 రంగాలకే పరిమితం అవుతుంది. పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా ప్రభుత్వం చాలా వరకు భారాన్ని తగ్గించుకోవచ్చు. ముఖ్యంగా మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు ఎక్కడ నుంచి లక్షల కోట్లు సేకరించాలనే అంశంలో ప్రభుత్వానికి స్పష్టత అవసరం. వచ్చే 5 ఏళ్ల కాలంలో మౌలిక రంగంపై 100 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టాలని ప్రభుత్వం భావిస్తుంది. అంటే ఏటా 20 లక్షల కోట్లు వ్యయం చేయాలి. అంటే ప్రస్తుతం చేస్తున్న వ్యయం కంటే చాలా ఎక్కువ పెట్టాలి. దేశీయంగా డిమాండ్ తగ్గుతుందన్నది ఇప్పుడు అందరినీ వేధిస్తున్న ప్రశ్న. పండుగల సీజన్ లో వినియోగ వస్తువుల కొనుగోలు కాస్త పెరిగినా సగటున తగ్గిందనేది అందరికీ తెలిసిన విషయమే. వచ్చే బడ్జెట్ లో ప్రభుత్వం మరిన్ని ప్రోత్సాహకాలు ఇవ్వాల్సి ఉంటుంది. తయారీరంగంలో పన్ను రాయితీలను పెంచక తప్పని పరిస్థితి ఏర్పడకపోవచ్చు. ఇందులో భాగంగా ప్రైవేటు పెట్టుబడులను పెంచే చర్యలు చేపట్టాలి. దేశంలో ప్రభుత్వ రంగ పెట్టుబడులు పెరగడం మినహా ప్రైవేటు పెట్టుబడులు పెరగడం లేదు. పైగా జూన్ తో ముగిసిన త్రైమాసికంలో 43,000 ల కోట్ల కొత్త ప్రాజెక్టులను మాత్రమే ప్రకటించారు. గతేడాదితో పోల్చితే ఇది 87 శాతం తక్కువ. రైల్వేలు, రోడ్లు, విద్యుత్ రంగంలో 11 లక్షల కోట్ల రూపాయల ప్రాజెక్టులు ఆగిపోయాయి. అందుకే ప్రైవేటు పెట్టుబడులు వస్తేనే ఆర్థిక వ్యవస్థ గాడిలో పడుతుందని గుర్తించాలి. ప్రైవేటు పెట్టుబడులు వస్తేనే జనం చేతిలో డబ్బులు ఉంటాయి. లాభాలు వస్తాయన్న నమ్మకం ఉంటేనే ప్రైవేటు కార్పొరేట్ సంస్థలు పెట్టుబడులు పెడతాయి.వారికి కూడా తక్కువ వడ్డీకి రుణాలు అవసరం. మోదీ సర్కారు అధికారానికి వచ్చిన తరువాత ఫిబ్రవరి 1న బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు. ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ఏర్పాట్లను అక్టోబరు రెండో వారంలోనే చేపట్టారని చెప్పొచ్చు. తయారీ రంగానికి రియల్ ఎస్టేట్ కు ఉద్దీపనల ద్వారా ఆమె రాబోయే బడ్జెట్ ఎలా ఉంటుందో కొంతవరకు చెప్పేశారు. భూసేకరణ, భూసంస్కరణలపై కూడా ప్రభుత్వం దృష్టి పెట్టాలి. దేశంలో పరిశ్రమలు పెట్టాలనుకునే వారికి భూ సేకరణలో ఎలాంటి అవరోధాలు ఎదురుకాకుండా చూడాలి. కార్మిక చట్టాల్లో పరిశ్రమల ఏర్పాటుకు అనుకూలంగా మార్చాలి. భూసేకరణ, కార్మిక చట్టాల విషయంలో సింగూరు లాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలి. దీర్ఘ కాలిక ప్రాజెక్టులపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టాలి. దీర్ఘ కాలిక ప్రాజెక్టులకు రుణాలు అందించే విధంగా బ్యాంకుల వద్ద తగినన్ని నిధులు ఉండాలి. అప్పుడే ఆర్థిక వృద్ధి రేటు గాడిలో పడే వీలుంది.  

తొందరేంలేదు.. మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుకు 6 నెలల సమయం ఉందంటున్న పార్టీలు

  మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన విధించారు. 6 నెలల పాటు రాష్ట్రపతి పాలన అమలయ్యే అవకాశం ఉన్నప్పటికీ త్వరలోనే ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ అంటున్నాయి. చర్చల ప్రక్రియను వేగవంతం చేశాయి. మరో పక్క ప్రభుత్వం ఏర్పాటు తమతోనే సాధ్యమని బీజేపీ ధీమా వ్యక్తం చేస్తుంది. గవర్నర్ కోషియారి సిఫారసుతో కేంద్ర క్యాబినెట్ ఆమోదం మేరకు రాష్ట్రపతి పాలన విధించారు. ఎన్నికల ఫలితాలు వచ్చి 19 రోజులైనా ప్రభుత్వ ఏర్పాటుపై స్పష్టత రాకపోవటంతో గవర్నర్ ఈ నిర్ణయం తీసుకున్నారు.  228 స్థానాలున్న మహారాష్ట్రలో శివసేన కలిసి రాకపోవటంతో 106 స్థానాలు వచ్చిన బీజేపీ వెనక్కి తగ్గింది. విముఖత వ్యక్తం చేస్తూ గవర్నర్ కు సమాచారమిచ్చింది. శివసేనకు గవర్నర్ 24 గంటలు గడువు ఇవ్వగా ఆ పార్టీ తన మద్దతుదారుల జాబితాను అందించేందుకు మరో 24 గంటల సమయం కోరింది. అయితే అందుకు నిరాకరించిన గవర్నర్ ఇక మూడో అధిక సంఖ్యాక పార్టీగా ఎన్సీపీని ఆహ్వానించారు. ఎన్సీపీకి మంగళవారం రాత్రి ఎనిమిదిన్నర వరకూ గడువు ఇవ్వగా, ఆ పార్టీ నేత శరద్ పవార్ కాంగ్రెస్, శివసేనతో చర్చలు జరిపారు. ఒక పక్క విపక్షాలతో చర్చలు జరుగుతుండగానే మరో పక్క గవర్నర్ కోషియారి రాష్ట్రపతి పాలనకు సిఫారసు పంపటం ఆ వెంటనే అమలు చేయడం అన్ని జరిగి పోయాయి. రాష్ట్రపతి పాలన 6 నెలల వరకు అమలులో ఉంటుంది. రాష్ట్రపతి పాలన పై ప్రకటన వచ్చిన కొద్ది గంటల్లోనే సోనియా ప్రతినిథులుగా కాంగ్రెస్ నేతలు అహ్మద్ పటేల్, మల్లికార్జున ఖర్గే, కేసీ వేణు గోపాల్ ముంబయి ఎన్సీపీ బృందంతో సమావేశమయ్యారు. ప్రభుత్వం ఏర్పాటుకు తొందరేమీ లేదని విధివిధానాలపై శివసేనతో చర్చించి స్పష్టత వచ్చిన తరువాతే ముందుకు సాగుతామని ఇరు పార్టీల నేతలు ప్రకటించారు. శివసేనకు మద్దతు ఇవ్వాలని కూడా ఇంకా నిర్ణయించుకోలేదన్నారు.  తమ పార్టీ ఎమ్మెల్యేలతో భేటీ అయిన శివసేన నేత ఉద్ధవ్ థాక్రే రాష్ట్రపతి పాలన ఎక్కువ రోజులు ఉండదు అని ధైర్యం చెప్పారు. బీజేపీ వెళ్లి కశ్మీర్ లో పీడీపీతో కలిసినప్పుడు తాము కాంగ్రెస్ తో చేతులు కలిపితే తప్పేంటని ప్రశ్నించారు. హిందుత్వం అంటే రామాలయం నిర్మించటం ఒక్కటే కాదని ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడం కూడా హిందుత్వమే అవుతుందనే థాక్రే కుండ బద్ధలు కొట్టారు. బీజేపీకి 3 రోజుల గడువు ఇచ్చిన గవర్నర్ తమకు మాత్రం 48 గంటలు కూడా ఇవ్వలేదని ఆయన అన్నారు. రాష్ట్రపతి పాలన ద్వారా తమకు 6 నెలల గడువు ఇచ్చారన్నారు. త్వరలో మిత్రపక్షాలతో కలిసి కనీస ఉమ్మడి కార్యక్రమాన్ని రూపొందిస్తామన్నారు.  గవర్నర్ వైఖరికి నిరసనగా శివసేన సుప్రీం కోర్టులో కేసు వేసింది. పిటిషన్ బుధవారం విచారణకు వస్తుంది. మరో పక్క శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశమే లేదని బీజేపీ అంటుంది. త్వరలో తమ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు అవుతుందని చెప్పుకుంటోంది. ఇదిలా ఉండగా గవర్నర్ కోషియారి తీరు ఎస్ఆర్ బొమ్మై కేసులో సుప్రీం కోర్టు తీర్పును అపహాస్యం చేసినట్లుగా ఉందని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.  

సమ్మె ఎఫెక్ట్.. తెలంగాణ ఆర్టీసీకి భారీ నష్టం!!

  ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె సంస్థ చరిత్రలోనే సుదీర్ఘమైనదిగా నిలిచిపోనుంది. నేటితో సమ్మె 40 వ రోజుకు చేరుకుంది. ఈ సమ్మె కాలంలో సంస్థ దాదాపు రూ.400 కోట్ల రూపాయల రాబడిని కోల్పోయింది. సమ్మె మొదలై మంగళవారం నాటికి 39 రోజులు అవుతున్నా అటు ప్రభుత్వం కానీ ఇటు కార్మికులు కానీ పట్టువీడడం లేదు. రవాణా సదుపాయాల విషయంలో ప్రజలు ఇబ్బంది పడుతూనే ఉన్నారు. 26 డిమాండ్ల సాధన కోసం కార్మికులు సమ్మె చేస్తున్నారు. సమస్యను పరిష్కరించుకోవాలని హైకోర్టు సూచించినా ప్రభుత్వం నుంచి స్పందన లేదు. దీంతో కార్మికులు సమ్మెను కొనసాగిస్తూనే ఉన్నారు. 1958 జనవరి 11 న ఏపీఎస్ఆర్టీసీ ఏర్పాటైంది. రాష్ట్ర విభజన అనంతరం 2015 జూన్ 3 న టీఎస్ఆర్టీసీ ఏర్పాటైంది. 2001 లో కార్మికులు 24 రోజులు సమ్మె చేశారు. ఆర్టీసీ చరిత్రలో అదే సుదీర్ఘ సమ్మె. 2005 లోనూ వేతనాల పెంపు కోసం జూలైలో 3 రోజులు, అక్టోబర్ లో 2 రోజులు కార్మికులు సమ్మె చేశారు. 2011 లో తెలంగాణ ఉద్యమం తీవ్రంగా కొనసాగుతున్న దశలో సకల జనుల సమ్మె చేపట్టారు. అందులో ఆర్టీసీ కార్మికులు 27 రోజుల పాటు పాల్గొన్నారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2015 లో కార్మికులు వేతనాల పెంపు కోసం 8 రోజులు సమ్మె చేశారు. ప్రస్తుత సుదీర్ఘ సమ్మెతో ఆర్టీసీ మరిన్ని నష్టాలను మూటగట్టుకుంటోంది. ఇప్పటికే 400 ల కోట్లకు పైగా ఆదాయాన్ని కోల్పోయినట్టు అధికార వర్గాలు తెలిపాయి.  సాధారణంగా ఆర్టీసీకి రోజుకు 11 కోట్ల మేరా టిక్కెట్ల ఆదాయం ఉంటుంది. కానీ తాత్కాలిక డ్రైవర్ లు కండక్టర్ లతో నడుస్తున్న బస్సులో రాబడి పెద్దగా ఉండటం లేదని అధికారులు అంటున్నారు. ఇకనైనా ముఖ్యమంత్రి తమ సంస్థను వెంటనే ప్రభుత్వంలో విలీనం చేయాలని కోరుతూ ఆర్టీసీ కార్మికులు కార్తీక పౌర్ణమి వేళ దేవుడికి పూజలు చేశారు. హైదరాబాద్ జీడిమెట్లకు చెందిన మహిళా కార్మికులు స్థానిక శివాలయం అమ్మవారి ఆలయానికి వెళ్లి దీపాలు వెలిగించి మొక్కుకున్నారు. వెంటనే తమ న్యాయపరమైన డిమాండ్లు ప్రభుత్వం తీర్చే విధంగా చూడాలని భగవంతుడిని కోరారు.  

రెవెన్యూ అధికారులకు భారీ భద్రత... భరోసా నిలుపుకున్న కేటీఆర్

  తెలంగాణలో నేటి నుంచి రెవెన్యూ ఉద్యోగులు తిరిగి విధుల్లోకి చేరనున్నారు. తహసీల్దార్ విజయారెడ్డి ఘటన తరువాత ప్రభుత్వం భద్రత కల్పిస్తామని చెప్పినా వారిలో భయం మాత్రం పోవడం లేదు. వారిలో భరోసా నింపేందుకు ప్రభుత్వం రెవెన్యూ కార్యాలయాలకు పోలీసు భద్రత ఏర్పాటు చేసింది. నిత్యం ప్రజల మధ్య ఉంటూ వారితో మమేకమై పని చేసే రెవిన్యూ ఉద్యోగులకు గుండె దడ పట్టుకొంది. ఈ నెల 4న పట్టపగలు తహసీల్దార్ విజయా రెడ్డిని ఓ రైతు సజీవ దహనం చేసిన ఘటన రెవిన్యూ ఉద్యోగుల్లో భయాన్ని పెంచింది. దీనికి తోడు విజయా రెడ్డికి పట్టిన గతే నీకూ పడుతుంది అంటూ ఇప్పటికే పలుచోట్ల రెవిన్యూ అధికారులను బెదిరిస్తున్నారు ప్రజలు. దాంతో మళ్లీ విధులకు వెళ్లాలంటేనే వారు జంకుతున్నారు. కుటుంబాలకు దూరంగా ఉంటూ ఉదయం నుంచి రాత్రి దాకా పని చేసినా ప్రజల్లో ఏమాత్రం సానుభూతి రాకపోగ రోజురోజుకు వ్యతిరేకత పెరిగిపోతూ ఉండటంతో ఏం చేయాలో పాలుపోని పరిస్థితి నెలకొంది. తాజా ఘటన రెవిన్యూ కుటుంబాల్లో కూడా అభద్రతా భావాన్ని పెంచింది. ఎందుకండీ ఈ ఉద్యోగం మానెయ్యండి.. ఏదో పని చేసుకొని బతుకుదాం అంటూ తన భార్య ఫోన్ చేసిందని ఓ అధికారి వాపోయారు.  విజయారెడ్డి హత్యతో ఈ నెల 4 నుంచి విధులకు దూరంగా ఉన్న వారంతా లాంఛనంగా మళ్లీ విధుల్లో చేరనున్నారు. హైదరాబాద్ మినహా 32 జిల్లాలలో భూ వివాదాలూ అధికం. పట్టణ స్వభావం ఉన్న ప్రాంతాలలో భూ వివాదాలూ మరీ అధికం. ఒక్కో భూమికి నలుగురైదుగురు యజమానులు ఉండటం.. వారంతా నా భూమంటే నా భూమి అంటూ క్లైమ్ చేయటం ఫైనల్ గా యంత్రాంగంపై ఒత్తిడి చేస్తూ ఉండటం జరుగుతుంది. తాజాగా భౌతిక దాడులకు పూనుకోవడమే యంత్రాంగంలో భయం పెంచింది. రక్షణ కల్పిస్తామని మంత్రి కేటీఆర్, రెవిన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చెప్పటం కొంత ఊరటనిస్తున్నా రోజువారీ విధులు స్వేచ్ఛాయుత వాతావరణంలో చేపట్టటాలంటే కోలుకోవడానికి కొంత సమయం పట్టే అవకాశాలు ఉన్నాయని పలువురు రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. రెవిన్యూ రక్షణకు డీజీపీ మార్గదర్శకాలు జారీ చేశారు. ప్రతి సోమవారం ఉదయం నుంచి సాయంత్రం దాకా తహసీల్దార్ కార్యాలయంలో ఇద్దరు కానిస్టేబుళ్లను రక్షణగా పెట్టాలి. మండే స్వభావం ఉన్న ఏ వస్తువు కార్యాలయంలోకి తీసుకెళ్లకుండా చూడాలి. ఇందుకు వీఆర్వో సాయం తీసుకోవాలి. రోజుకు రెండు సార్లు బ్లూకోల్స్, పెట్రోలింగ్ కార్లు తహసీల్దార్ కార్యాలయాల వద్దకు వెళ్లి తనిఖీలు చేయాలి. రెవిన్యూ ఉద్యోగులు ఫిర్యాదు చేయగానే చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. రెవెన్యూ ఉద్యోగులపై దాడికి ప్రయత్నించిన వారిని వదిలేయకుండా వెంటనే కేసులు పెట్టాలి. రెవిన్యూ ఉద్యోగులకు సంబంధించి ఏ ఫిర్యాదు వచ్చినా ప్రాథమిక విచారణ జరిపి ఉన్నతాధికారులకు నివేదన పంపి.. చర్యలు తీసుకోవాలి. రెవిన్యూ కార్యాలయాల రక్షణ, బాధ్యత సీఐలు, డీఎస్పీలదే. రెవెన్యూ ఉద్యోగులంతా రోజువారి విధులకు హాజరు కావాలని.. ప్రజల సమస్యలు ఏమున్నా పరిష్కరించాలని..డిప్యూటీ కలెక్టర్ల సంఘం, తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయిస్ సర్వీసెస్ అసోసియేషన్ కోరింది. రెవిన్యూ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ముందుకు వచ్చి అందుకు 15 రోజుల గడువు కోరిన నేపథ్యంలో ఉద్యోగులెవరూ విధులకు దూరంగా ఉండరాదని విజ్ఞప్తి చేశారు. నిర్భయంగా డ్యూటీలు చెయ్యాలని స్వేచ్ఛాయుత విధి నిర్వహణకు ప్రజల సహకారం తీసుకోవాలని కోరారు.  

కేరళలో హై అలర్ట్.. శబరిమలలో మహిళల ప్రవేశంపై సుప్రీం తుది తీర్పు!!

  చారిత్రాత్మక కేసుగా పరిగణించే రామజన్మభూమి-బాబ్రీ మసీదు భూవివాద విషయంలో ఇటీవల సుప్రీం కోర్టు తీర్పు వెలువరించింది. ఇక దేశంమంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న శబరిమల తీర్పు వెలువడే రోజు రానే వస్తోంది. కేరళలోని దట్టమైన అడవుల్లో కొలువున్న అయ్యప్ప స్వామి సన్నిధికి మహిళల ప్రవేశంపై దాఖలైన రివ్యూ పిటీషన్లపై ఇప్పటికే విచారణను ముగించారు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగొయ్. ఈ నెల 17వ తేదీ నుంచి మండల మకరవిళక్కు ఉత్సవాలు ప్రారంభం కానున్నట్లు ట్రావెన్ కోర్ బోర్డు ప్రకటించింది. అప్పటినుండి అయ్యప్పస్వామి మాలను ధరించిన భక్తులు అయ్యప్ప దర్శనానికై శబరిమలకు వెళ్లడం ప్రారంభం కానుంది. అదే సమయంలో సుప్రీం తుది తీర్పును వెల్లడించనుండటంతో కేరళ ప్రభుత్వం అప్రమత్తమైంది. తీర్పును పున:సమీక్షించాలని కోరుతూ సుప్రీం కోర్టులో 65 రివ్యూ పిటీషన్లు దాఖలయ్యాయి. అన్నింటిని ఒకే కేసుగా పరిగణించి సుప్రీంకోర్టు విచారణ పూర్తి చేసింది. తుది తీర్పును నవంబర్ 15న  వెలువరించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. అయోధ్య భూవివాద విషయంలో జస్టిస్ గొగోయ్ హిందువులకు అనుకూలంగా తీర్పును ఇచ్చినందున.. శబరిమల విషయంలో కూడా తమకు సానుకూల తీర్పు ఉంటుందని అయ్యప్ప భక్తులు నమ్మకంతో ఉన్నారు. కేరళ దేవస్వొమ్ మంత్రి కడకంపల్లి సురేంద్రన్ కూడా ఇదే విషయాన్ని వెల్లడించారు. సుప్రీంకోర్టు తీర్పును వెలువరించనందున శబరిమల అయ్యప్ప ఆలయానికి కట్టుదిట్టమైన భద్రతను కల్పించినట్లు కేరళ పోలీస్ డైరెక్టర్ జనరల్ లోక్ నాథ్ బెహరా తెలిపారు. భద్రత కోసం 5 దశల్లో 10,017 మంది పోలీసులను మోహరింపజేస్తున్నట్లు తెలిపారు. గత ఏడాది అయ్యప్ప స్వామి సన్నిధానంలోకి మహిళలకు ప్రవేశం కల్పిస్తూ సుప్రీం ఇచ్చిన తీర్పును నిరసిస్తూ వేలాదిమంది మహిళలు రోడ్డెక్కిన విషయం తెలిసిందే. అయ్యప్ప స్వామి ఆలయానికి తామే భద్రతను కల్పిస్తామంటూ.. నీలక్కల్ నుంచి పంబ వరకు రోడ్డుకు ఇరువైపులా నిల్చొని నిరసిస్తూ మహిళలను సన్నిధానంలోకి వెళ్లకుండా అడ్డుకున్నారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేయాల్సిన బాధ్యతతో పోలీసులు సైతం నిరసనలను ప్రతిఘటించారు.  

విద్యార్థినులతో అసభ్య ప్రవర్తన... వైస్ ప్రిన్సిపాల్ అరెస్ట్

  గురువంటే దైవంతో సమానంగా చూడటం మన సంప్రదాయం. పాఠాలు నేర్పే గురువు అంటే ఎంతో గౌరవం ఇస్తారు. చదువు చెప్పే టీచర్ల కంటే.. పిల్లలకు మంచి చెప్పి మంచి మార్గంలో వెళ్లేలా చూడాల్సిన బాధ్యత ప్రధానోపాధ్యాయులకు మరింత ఎక్కువ ఉంటుంది.  అలాంటి వృత్తికే అవమానంగా నిలిచాడు  ఒక వైస్ ప్రిన్సిపాల్. విద్యార్థినులతో తప్పుగా ప్రవర్తించి  జైలు పాలయ్యాడు. హైదరాబాద్‌లోని మదీనాగూడలో ఈ ఘటన జరిగింది.  భువనగిరికి చెందిన ముఖేష్ మదీనాగూడ నారాయణ ఐఐటీ క్యాంపస్‌లో వైస్ ప్రిన్సిపాల్‌గా పని చేస్తున్నాడు. స్టడీ అవర్ సమయంలో చదువుకుంటున్న ఒకొక్క అమ్మాయిని పిలిచి అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని.. రోజురోజుకి అతని వేధింపులు ఎక్కువ కావడంతో విసుగు చెందిన బాలికలు ధర్నాకు దిగారు.  విద్యార్థినులను  వేధించేవాడని వాపోయారు. ఇది తెలుసుకున్న విద్యార్థినుల తల్లిదండ్రులు అతనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.  ఈ నెల 8న అతడిపై కేసు నమోదైంది.అప్పటి నుండే ముఖేష్ పరారీలో ఉన్నాడు. అతడిపై  పోక్సో, నిర్భయ చట్టాల కింద కేసు నమోదు చేశారు పోలీసులు. తీవ్రంగా గాలింపులు చేపట్టారు. చివరకు మంగళవారం(నవంబర్ 12) ముకేష్ ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. మదీనాగూడలోని నారాయణ కాలేజీ బ్రాంచ్‌లో అతను రెండేళ్లుగా వైస్‌ ప్రిన్సిపల్‌గా పనిచేస్తున్నాడని పోలీసులు తెలిపారు.

విజయవాడ ద్వారక మర్డర్ కేసులో మలుపు... వివాహేతర సంబంధమే కారణమని అనుమానాలు

  మానవ సంబంధాలు నానాటికీ దిగజారిపోతున్నాయి. తుచ్ఛమైన కోరికలను తీర్చుకోవడం కోసం మానవత్వాన్నే మరిచిపోతున్నారు. రక్త సంబంధాన్ని... పేగు బంధాన్ని సైతం మరిచిపోయి అకృత్యాలకు పాల్పడుతున్నారు. కొందరు కన్న బిడ్డలనే కడతేర్చుతుంటే... మరికొందరు కన్నవాళ్లనే కాటికి పంపుతున్నారు. హైదరాబాద్ హయత్ నగర్ లో తన బాయ్ ఫ్రెండ్స్ తో జల్సాల కోసం కన్నతల్లినే కీర్తిరెడ్డి చంపేయగా, ఏపీ రాజధానిలో దాదాపు అలాంటి ఘటనే జరిగింది. విజయవాడలో జరిగిన చిన్నారి ద్వారక మర్డర్ వెనుక వివాహేతర సంబంధమే కారణమన్న అనుమానాలు బలపడుతున్నాయి. హత్యకు గురైన ద్వారక తల్లికి... నిందితుడు ప్రకాష్ మధ్య వివాహేతర సంబంధముందని పోలీసులు అనుమానిస్తున్నారు. చిన్నారి ద్వారక హత్య జరిగిన రోజు... వీళ్లిద్దరూ పలుమార్లు ఫోన్లో మాట్లాడుకున్నట్లు పోలీసులు గుర్తించారు. దాంతో, నిందితుడు ప్రకాష్ తోపాటు ద్వారక తల్లిని కూడా పోలీసులు విచారిస్తున్నారు. అయితే, తన బిడ్డను చంపుకునేంత కసాయిదాన్ని కాదని ద్వారక తల్లి చెబుతోంది. మొత్తానికి విజయవాడ చిన్నారి ద్వారక మర్డర్ కొత్త మలుపు తిరిగింది. ద్వారక తల్లి, నిందితుడు ప్రకాశ్ మధ్య పలుమార్లు ఫోన్ సంభాషణ జరగడంతో... చిన్నారి హత్యకు వివాహేతర సంబంధమే కారణమన్న కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే, ద్వారక హత్యలో కన్నతల్లి పాత్ర కూడా ఉందన్న అనుమానాలు రావడంతో స్థానికులు విస్తుపోతున్నారు.  

హేమామలిని బుగ్గల్లాంటి రోడ్లు వేపించాను.. కాంగ్రెస్ నేత వింత పోలిక

  చత్తీస్‌గఢ్‌కు చెందిన ఎక్సైజ్ మంత్రి కవాసీ లఖ్మా స్థానికంగా జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ కార్యక్రమంలో మాట్లాడుతూ.. సీనియర్ నటి, బీజేపీ ఎంపీ హేమమాలినిపై కాంగ్రెస్ నేత వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆయన తన నియోజకవర్గ స్థాయిలో వేయించిన రోడ్లను హేమమాలిని బుగ్గలతో పోలుస్తూ చేసిన కామెంట్స్ వివాదాస్పదంగా మారాయి. తాను నక్సల్ ప్రభావిత ప్రాంతం నుండి ఎన్నికైన ఎమ్మెల్యేనని తెలిపారు. అలాంటి ప్రాంతంలో కూడా రోడ్లను ఎంతో చక్కగా.. స్మూత్ గా.. వేయించానని చెప్పాలనుకున్నారు. ఆయన చేసిన పని హర్షణీయమైనా.. పోల్చిన పోలిక విమర్శలకు దారి తీసింది. తన ప్రాంతంలోని రోడ్లన్నీ హేమమాలిని చెంపల మాదిరిగా నిర్మించానంటూ వ్యాఖ్యానించారు. ఆయన చేసిన కామెంట్స్ పై స్పందించిన బీజేపీ నేతలు మండిపడుతున్నారు. లఖ్మా వెంటనే సదరు మహిళా నేత హేమామాలినికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.కవాసీ లఖ్మాకు వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం మొదటిసారి కాదు. గతంలో కూడా ఆయన ఒక పాఠశాలలోని కార్యక్రమంలో పాల్గొన్నారు. అక్కడి విద్యార్థులు అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ.. తనలా రాజకీయ నాయకుడు అవ్వాలనుకుంటే కలెక్టర్, ఎస్పీల కాలర్‌లు పట్టుకోవాలని చెప్పి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఏదేమైనా రోడ్లను బుగ్గలతో పోల్చాడంటే ఆయన హేమామలినికి ఎంత పెద్ద అభిమాని అయ్యుంటాడు అని నెటిజన్లు జోకులు వేస్తున్నారు.

టీడీపీలో కొనసాగుతున్న వలసలు... బై బై బాబు అంటున్న దేవినేని!!

  కృష్ణా జిల్లాలో తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడికి మరో షాక్ తగలనుంది. ఇప్పటికే వలసలతో సతమతమవుతున్న టీడీపీ పార్టీకి మరొక వలస ఎదురుకానుంది. విజయవాడకు చెందిన దేవినేని అవినాష్ టీడీపీ పార్టీకి రాజీనామా చేసేందుకు  సంసిద్ధమైనట్లు తెలుస్తుంది. గత కొద్ది రోజులుగా పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నాడు దేవినేని అవినాష్. తన అనుచరులతో జరిగిన సమావేశంలో టీడీపీకి రాజీనామా చేసి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరే ఆలోచనలో ఉన్నట్లు అవినాష్ అన్నారని అనుచరులు చెబుతున్నారు. 2019 సాధారణ ఎన్నికల్లో కొడాలి నానిపై పోటీ చేసి ఓటమి పాలయ్యాడు అవినాష్. తాజాగా వల్లభనేని వంశీ టీడీపీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే.  ఇక దేవినేని అవినాష్ కూడా పార్టీ నుంచి తప్పుకుంటే  కృష్ణా జిల్లాలో టీడీపీ మరింత బలహీనపడుతుందని కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొంత కాలంగా పార్టీ వ్యవహార శైలిపై అవినాష్ తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తుంది. ఎన్నికల తరువాత పార్టీ నేతలు తనను పట్టించుకోవడం లేదని ఆయన మనస్తాపానికి గురవుతున్నట్లుగా సమాచారం.  తనకు.. తన కుటుంబానికి పట్టు ఉన్న విజయవాడ తూర్పు, పెనమలూరు నియోజకవర్గాల్లో కాకుండా గుడివాడ నుంచి తనను బలవంతంగా పోటీ చేయించారని ఆయన అన్నట్లుగా తెలుస్తుంది. గతంలో కూడా అవినాష్ టీడీపీకి బై బై చెబుతున్నట్లు..వైసీపీలో చేరబోతున్నట్లు.. ప్రచారం జోరుగా సాగింది. అవినాష్ తో పాటు ప్రధాన అనుచరుడిగా ఉన్న కడియాల బుచ్చిబాబు కూడా పార్టీని వీడుతున్నట్లుగా అప్పట్లో భావించారు. అయితే.. ఆ వార్తలను దేవినేని అవినాష్ ఖండించారు. మరిప్పుడు ఏమంటారో ఆయనే చెప్పాలి.  

అర్వింద్ - యెండల మధ్య కోల్డ్ వార్... ఇందూరు దళపతి ఎంపికపై తలో మాట...

  నిజామాబాద్ బీజేపీలో ఎంపీ ధర్మపురి అర్వింద్... మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణ మధ్య ఆధిపత్య పోరు జరుగుతోంది. నిజామాబాద్ జిల్లా బీజేపీ పగ్గాలు తమ అనుచరులకే దక్కాలని ఇరువురూ ప్రయత్నాలు చేస్తున్నారు. బస్వా లక్ష్మీనర్సయ్యకు జిల్లా పార్టీ పగ్గాలు ఇవ్వాలంటూ ఎంపీ అర్వింద్ లాబీయింగ్ చేస్తుంటే.... యెండల లక్ష్మినారాయణ మాత్రం దళితుడైన ప్రకాష్ కి అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో బాన్సువాడ నుంచి పోటీచేసి ఓడిపోయిన ప్రకాష్ కు జిల్లా బీజేపీ పగ్గాలు అప్పగిస్తే పార్టీ బలపడుతుందని యెండల అంటున్నారు. అయితే, అర్వింద్, యెండల ప్రతిపాదిస్తున్న వాళ్లను పక్కనబెడితే, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బస్వ లక్ష్మీనర్సయ్య... నిజామాబాద్ బీజేపీ అధ్యక్ష రేసులో ముందున్నారు. అలాగే, అర్బన్ బీజేపీ ఇన్ ఛార్జ్ ధన్ పాల్ సూర్యనారాయణ సైతం పోటీపడుతున్నారు. అయితే, గతంలో టికెట్ దక్కకపోవడంతో పార్టీ కార్యాలయంపై దాడి చేయడం ధన్ పాల్ కు మైనస్ గా మారింది. అలాగే, మహిళా నేత గీతారెడ్డి... అదేవిధంగా బాల్కొండ ఇన్ ఛార్జ్ రుయ్యాడి రాజేశ్వర్ సైతం జిల్లా పార్టీ పగ్గాలు చేపట్టేందుకు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు.  అయితే, తన మనిషికే జిల్లా పార్టీ పగ్గాలు ఇవ్వాలని ఎంపీ ధర్మపురి అర్వింద్ పట్టుబడుతుంటే... కాదుకాదు ఎస్సీకి ఈసారి అవకాశమిద్దామని యెండల అంటున్నారు. మరోవైపు, ఒక్కసారైనా మహిళకు ఛాన్సివ్వాలని మరో వర్గం స్వరం పెంచుతోంది. దాంతో, ఇందూరు కమల దళపతి ఎవరు అవుతారన్నది ఉత్కంఠగా మారింది. నేతల పట్టింపులతో జిల్లా పార్టీ పగ్గాలు ఎవరికి అప్పగించాలన్న దానిపై అధిష్టానం కూడా మల్లగుల్లాలు పడుతోంది. అయితే, ఏకాభిప్రాయంతో ఎంపిక చేయాల్సిన పదవిపై ఇలా గ్రూపు రాజకీయాలు చేయడం పార్టీకి మంచిది కాదని కార్యకర్తలు అంటున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో అనూహ్య విజయాలు సాధించిన బీజేపీ, పార్టీని మరింత బలోపేతం చేసేందుకు ఆచితూచి అడుగులేస్తోంది. అందులో భాగంగా పార్టీ సంస్థాగత నిర్మాణంపై దృష్టిపెట్టింది. అందుకే, పార్టీ సిద్ధాంతాలపై అవగాహన, క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతంచేసే నేత కోసం అధిష్టానం అన్వేషిస్తోంది. మరి, ఇందూరు కమల దళపతి ఎంపికలో ఎవరి మాట నెగ్గుతుందో... ఎవరు పైచేయి సాధిస్తారో చూడాలి.

నా పెళ్లిళ్ల వల్లే జగన్ జైలుకెళ్లారా? చిల్లరగా మాట్లాడొద్దని పవన్ ఫైర్

  సీఎం జగన్మోహన్ రెడ్డికి జనసేనాని పవన్ కల్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. వైసీపీ నేతల మాటల్ని భరించడానికి తాము టీడీపీ కాదని... జనసేన అని గుర్తుంచుకోవాలని హెచ్చరించారు. తన గురించి మాట్లాడితే మూడు పెళ్లిళ్లు అంటున్నారని... కావాలంటే మీరు కూడా చేసుకోండి... ఎవరు వద్దన్నారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయినా, తాను మూడు పెళ్లిళ్లు చేసుకోవడం వల్లే జగన్మోహన్ రెడ్డి రెండేళ్లు జైల్లో ఉన్నారా? అంటూ ప్రశ్నించారు. తాము ప్రజాసమస్యలను ప్రస్తావిస్తుంటే... సీఎం జగన్ మాత్రం వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారని ఘాటుగా రియాక్టయ్యారు. అయితే, తాను టీడీపీ నేతల్లా చూస్తూ ఊరుకోనని హెచ్చరించారు. తాము విధానాలపైనే మాట్లాడుతాం కానీ... వ్యక్తిగతంగా కాదన్నారు. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుపై జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను పవన్ తప్పుబట్టారు. వెంకయ్య గురించి అలా మాట్లాడేందుకు సిగ్గు ఉండాలన్నారు. వెంకయ్యనాయుడు హోదాను కూడా గుర్తించకుండా ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేస్తారా మండిపడ్డారు. ఇంగ్లీష్‌ మీడియం మీద అంత ప్రేమ ఉంటే... తిరుమలలో సుప్రభాతాన్ని కూడా ఇంగ్లీష్‌లో చదివించాలన్నారు. జగన్... ఫ్యాక్షనిస్టు ధోరణితో మాట్లాడుతున్నారని, జగన్ బెదిరింపులకు తాను భయపడనని అన్నారు. ఆంధ్రప్రదేశ్... భాషాప్రయుక్త రాష్ట్రంగా ఏర్పడిందన్న విషయం అసలు జగన్ కు తెలుసా అంటూ ప్రశ్నించారు. తమిళనాడులో ఇంకా తెలుగు మీడియం ఉందనే సంగతి జగన్మోహన్ రెడ్డి తెలుసుకోవాలన్నారు. గత ప్రభుత్వ తప్పిదాలనే... వైసీపీ సర్కారు కూడా చేస్తోందని ఆరోపించారు. ప్రభుత్వ నిర్ణయాలనే తాము ప్రశ్నిస్తున్నామని, తప్పులు ఉంటే సరిచేసుకోవాలన్నారు. హిందీని జాతీయ భాషగా చేస్తామన్న ప్రకటనపై పలు రాష్ట్రాలు తీవ్రంగా స్పందించడంతో కేంద్రం వెనక్కి తగ్గి దిద్దుబాటు చర్యలు తీసుకుందన్న జనసేనాని... తాము ప్రశ్నిస్తే అందులో తప్పేముందన్నారు. ఇంగ్లీష్ గ్లోబల్ లాంగ్వేజ్... దీనిపై ఎవరికీ సందేహం లేదు... కానీ తొందరపాటు నిర్ణయాల వల్ల ఇబ్బంది పడకూడదనే తాము స్పందించామని అన్నారు. అయినా, టీచర్లకు ఆంగ్లంతో ప్రావీణ్యం కల్పించకుండా ఒకేసారి మారిస్తే ఎలా అన్నారు. టీచర్లు ఎప్పుడు ఇంగ్లీష్ లో శిక్షణ పొందుతారు... పిల్లలకు ఎప్పుడు చెబుతారని ప్రశ్నించారు. అయినా, ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి చిల్లరగా మాట్లాడటం సరికాదన్నారు. జగన్మోహన్ రెడ్డి ఇప్పటికీ వైసీపీ అధినేతగా మాట్లాడుతున్నారని, ఇప్పుడు ఏపీ ముఖ్యమంత్రి అన్న సంగతి మర్చిపోవద్దని, ఒక సీఎంలా మాట్లాడాలని సూచించారు.

లోకో పైలట్ కావాలనే సిగ్నల్ జంప్ చేశాడా? కాచిగూడ ట్రైన్ యాక్సిడెంట్ లో అసలేం జరిగిందంటే..!

కాచిగూడ ట్రైన్ యాక్సిడెంట్‌పై విచారణ మొదలైంది. ఒకే ట్రాక్‌పైకి కర్నూలు ఎక్స్‌ప్రెస్‌... ఎంఎంటీఎస్ ట్రైన్ ఎలా వచ్చాయనే దానిపై దర్యాప్తు ప్రారంభించింది. కాచిగూడ ట్రైన్ యాక్సిడెంట్‌ను సీరియస్‌గా తీసుకున్న సౌత్ సెంట్రల్ రైల్వే.... అసలేం జరిగిందో తేల్చాలంటూ ముగ్గురు సభ్యులతో హైలెవల్‌ కమిటీ ఏర్పాటు చేసింది. దాంతో, యాక్సిడెంట్‌ స్పాట్‌ని పరిశీలించనున్న కమిటీ... ప్రమాదానికి గల కారణాలను విశ్లేషించనుంది. అయితే, ఎంఎంటీఎస్ ట్రైన్ లోకో పైలట్‌ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని రైల్వే పోలీసులు అంచనా వేస్తున్నారు. సిగ్నల్ క్లియరెన్స్ లేకుండానే... ఎంఎంటీఎస్‌ రైలును లోకో పైలట్ మూవ్ చేశాడని ప్రాథమిక దర్యాప్తులో తేల్చారు. అయితే, సిగ్నల్‌ను కావాలనే అతిక్రమించాడా? లేక మరేదైనా కారణం ఉందా? అనే దానిపై రైల్వే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే కాచిగూడ స్టేషన్ మాస్టర్‌తోపాటు మరో ఆరుగురి స్టేట్‌మెంట్స్ రికార్డు చేశారు. ఇదిలాఉంటే, కాచిగూడ స్టేషన్ మేనేజర్ ఫిర్యాదు మేరకు ఎంఎంటీఎస్ లోకో పైలట్‌ చంద్రశేఖర్‌‌పై కేసు నమోదు చేశారు. రైలును నిర్లక్ష్యంగా నడిపినందుకు ఐపీసీ 337, ర్యాష్ డ్రైవింగ్‌తో ప్రయాణికులకు హాని చేసినందుకు సెక్షన్ 338 కింద ఎఫ్‌‌ఐఆర్ ఫైల్ చేశారు. అయితే, లోకో పైలట్ ఆరోగ్యం మెరుగైన తర్వాత అతని వాంగ్మూలం తీసుకుంటామని పోలీసులు చెబుతున్నారు. ఇక, కాచిగూడ రైలు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఎంఎంటీఎస్‌ లోకో పైలట్ చంద్రశేఖర్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు ప్రకటించారు. క్రష్ ఇంజూరీస్‌తో కాళ్లకు రక్త ప్రసరణ నిలిచిపోయిందని, అలాగే... యూరిన్ అవుట్ పుట్ తగ్గిందని, కిడ్నీకి కూడా గాయాలు అయ్యాయని తెలిపారు. అయితే, చంద్రశేఖర్ ప్రస్తుతం షాక్‌లో ఉన్నారని, 24గంటల తర్వాతే ఏదైనా చెప్పగలమని వైద్యులు ప్రకటించారు.

రాష్ట్రపతి పాలన వెనుక బీజేపీ వ్యూహం... గవర్నర్ తో టీ20 మ్యాచ్ ఆడించిన కేంద్రం..! 

అనేక మలుపులు తిరిగిన మహారాష్ట్ర రాజకీయం చివరికి రాష్ట్రపతి పాలన విధించడంతో ఎండ్ కార్డ్ పడింది. డెడ్‌లైన్‌లోపు ప్రభుత్వ ఏర్పాటుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో ...రాష్ట్రపతి పాలనకు గవర్నర్ సిఫార్సు చేశారు. గవర్నర్ అలా సిఫార్సు చేశారో లేదో ...కేంద్ర మంత్రిమండలి, ఆ తర్వాత రాష్ట్రపతి ఆమోదముద్ర వేశారు. అలా, రెండు వారాలకు పైగా సాగిన మహా డ్రామాకు తెరపడింది. అయితే, ఇంత వేగంగా గవర్నర్ నిర్ణయాలు తీసుకోవడం వెనుక బీజేపీ వ్యూహం ఉందనే మాటలు వినిపిస్తున్నాయి. అసలు ఎన్సీపీకి ఇచ్చిన గడువు ముగియకుండానే గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీ కేంద్రానికి నివేదిక ఇచ్చారు. స్థిరమైన ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశాల్లేవని, అందువల్ల రాష్ట్రపతి పాలన విధించాలని సిఫార్సు చేశారు. గవర్నర్ నివేదిక మేరకు కేంద్ర కేబినెట్... అనంతరం రాష్ట్రపతి ఆమోదముద్ర వేయడం చకచకా జరిగిపోయాయి. అయితే, బీజేపీకి రోజుల తరబడి సమయమిచ్చిన గవర్నర్.... తాము 48గంటల గడువు కోరినా ఇవ్వలేదంటూ శివసేన సుప్రీంను ఆశ్రయించింది. ప్రభుత్వ ఏర్పాటుకు తాము ప్రయత్నిస్తుండగానే రాష్ట్రపతి పాలన విధించారంటూ మండిపడింది. అయితే, మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన విధించడం వెనుక బీజేపీ తెలివిగా పావులు కదిపింది. శివసేనకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వడానికి మొదట్నుంచీ విముఖత చూపుతున్న బీజేపీ... ఎన్సీపీ, కాంగ్రెస్ తో కలిసి శివసేన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయకుండా... టీ20 మ్యాచ్ తరహాలో యమ స్పీడ్ గా గవర్నర్ తో గేమ్ ఆడించింది. తమకు దక్కని అధికారం ఎవరికీ దక్కకూడదన్న ఆలోచనతోనే బీజేపీ అలా చేసిందనే మాటలు వినిపిస్తున్నాయి. ప్రస్తుత పరిణామాలతో శివసేన ఇరకాటంలో పడిందని అంటున్నారు. శివసేనకు మద్దతిచ్చేందుకు కాంగ్రెస్ సిద్ధమైనా... ఎన్సీపీ 50-50 ఫార్ములాను తెరపైకి తేవడంతోనే... చర్చలు ముందుకి కదల్లేదనే మాట వినిపిస్తోంది. ఇక, ఆగమేఘాల మీద రాష్ట్రపతి పాలన విధించడంపై శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీ మండిపడ్డాయి. ప్రభుత్వ ఏర్పాటుకు 48గంటల గడువు కోరినా ఇవ్వకుండా రాష్ట్రపతి పాలన విధించారని శివసేన ఫైరవుతోంది. రాష్ట్రపతి పాలనపై బీజేపీ భిన్నంగా స్పందించింది. ప్రజలు స్పష్టమైన తీర్పు ఇచ్చినా ప్రభుత్వం ఏర్పాటు కాకపోవడం దురదృష్టకరమన్న ఫడ్నవిస్.... త్వరలో సుస్థిర సర్కారు ఏర్పడుతుందని వ్యాఖ్యానించారు. అయితే, రాష్ట్రపతి పాలన విధించినప్పటికీ... ప్రభుత్వం ఏర్పాటయ్యే పరిస్థితులు అనుకూలంగా ఉంటే... మళ్లీ అవకాశం ఇవ్వొచ్చని న్యాయ నిపుణులు అంటున్నారు.    

మా భూములు ఎక్కడ సారు?... ప్రభుత్వం ఇచ్చిన భూమిని కాజేసిన సిద్దిపేట నేత

  నిరుపేద దళిత మహిళలు వ్యవసాయం చేసుకుని ఆర్థికంగా ఎదగడానికి అప్పటి ప్రభుత్వం వారికి భూమిని పంపిణీ చేసింది. అప్పటి ప్రభుత్వం అంటే దాదాపు 20 ఏళ్ల క్రిందటి ప్రభుత్వం. అందరికి ఎలాగో నడిచింది కానీ అందులో నలుగురు మాత్రం శాపానికి గురైయ్యారు. కష్టం చేసుకుని ఎదగడం దేవుడెరుగు 20 ఏళ్ళ నుంచి వారికిచ్చిన భూమి ఎక్కడుందో వెతకడానికి వారి కళ్లు కాయలు కాస్తున్నాయి. తమ భూమిని తమకు ఇప్పించాలని నాటి నుంచి నేటి వరకు అధికారులు, నాయకుల చుట్టూ ప్రదక్షిణ చేసినప్పటికి కనీసం ఒక గజం భూమి కూడా చూపించలేదు. ఇప్పటికీ వారి భూములు ఎక్కడ ఉన్నాయో తెలియక సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని కల్లెపల్లి గ్రామానికి చెందిన దళిత మహిళలు ఇబ్బందులు పడుతూనే ఉన్నారు.  సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం కల్లెపల్లి గ్రామానికి చెందిన 15 మంది దళిత నిరుపేద మహిళలకు 2000 సంవత్సరంలో ఎస్సీ కార్పొరేషన్ ద్వారా బెజ్జంకి మండల శివారులో 29.22 ఎకరాల భూమిని ప్రభుత్వం కేటాయించింది. ఇచ్చిన భూమికి ప్రభుత్వం హద్దుల చూపించింది. అప్పుడు ఇందులో 4 బాధితులు రేఖం సుగుణ, కర్రోళ్ల స్వరూప, దాసరి లక్ష్మీ, బిగుళ్ల ఎల్లవ్వ ప్రభుత్వం ఇచ్చిన భూముల్లో వ్యవసాయం చేసినట్లు తెలిపారు. ఆ ప్రాంతంలో ఓ వ్యక్తి తన పలుకుబడితో సదరు భూమిని కబ్జా చేసి తమకు అక్కడ భూమి లేదని చెప్పినట్లు బాధితులు పేర్కొన్నారు. ఇందులో 2018 లో రేకం సుగుణ అనే బాధితురాలు, కుటుంబ సభ్యులు వారికి కేటాయించిన ప్రభుత్వ భూమి దగ్గరికి వెళ్లగా అప్పటికే సదరు భూమిని కబ్జా చేశాడు ఓ పార్టీ నేత. ఆయన కుటుంబ సభ్యులను అప్పటి తహసీల్దార్ సహాయంతో వేధింపులకు గురిచేసినట్లు బాధితురాలు సుగుణ పేర్కొన్నారు.  తమ భూమి తమకు ఇప్పించాలని సుగుణతో పాటు మిగతా ముగ్గురు బాధితులు అధికారుల చుట్టూ.. కార్యాలయాల చుట్టూ.. ప్రదక్షిణలు చేసినా సెంటు భూమిని కూడా అధికారులు చూపించలేదు. ఇదిలా ఉంటే ఇందులో కొందరికి తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత జారీ చేసిన కొత్త పాస్ బుక్ లు కూడా వచ్చాయి. తమ భూమిని చూపించాలనీ 4 బాధితులు వేడుకుంటున్నారు. తమ భూమిని ప్రస్తుత అధికార పార్టీ నేత పలుకుబడితో ఆ భూమిని తన కుటుంబ సభ్యుల పేరున మార్చుకున్నారని ఆరోపిస్తున్నారు. అధికారులు.. నాయకులు దృష్టి సారించి భూమిపై సర్వే చేయించి తమ భూమిని తమకు ఇప్పించాలని వేడుకుంటున్నారు భాదితులు.

ఆర్టీసీ సమ్మెపై హైకోర్టు కీలక నిర్ణయం.. ప్రభుత్వానికి డెడ్ లైన్!!

  ఆర్టీసీ సమ్మెకు అప్పుడే శుభం కార్డు పడేలా లేదు. ఇటు ప్రభుత్వం, అటు కార్మికులు మెట్టు దిగట్లేదు. దానికితోడు హైకోర్టు విచారణ రోజురోజుకి వాయిదా పడుతూ వస్తుంది. ఆర్టీసీ సమ్మె పిటిషన్ పై హైకోర్టులో ఈరోజు కూడా వాడీవేడీగా వాదనలు జరిగాయి. ఆర్టీసీ సమ్మె చట్ట విరుద్ధమని ప్రభుత్వం తరఫున సీనియర్ కౌన్సిల్ విద్యాసాగర్‌ వాదనలు విన్పించారు. సమ్మె ఎస్మా పరిధిలోకి వస్తుందని చెప్పిన ఆయన.. ఆర్టీసీని 1998, 2015లో ఎస్మా పరిధిలోకి తీసుకొస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయాన్ని గుర్తు చేశారు. దీనిపై స్పందించిన హైకోర్టు.. గతంలో ఇచ్చిన జీవోలు ఇప్పుడెలా వర్తిసాయని ప్రశ్నించింది.  1998లో ఇచ్చిన ఉత్తర్వులు ఏపీఎస్‌ఆర్టీసీకే వర్తిస్తాయని.. 2015లో ఇచ్చిన ఉత్తర్వులు ఆరునెలల వరకే అమల్లో ఉంటాయని పేర్కొంది. తాము కూడా చట్టానికి లోబడే పనిచేస్తామని హైకోర్టు చెప్పింది. చట్టానికి అతీతంగా తాము ఆదేశాలు ఇవ్వలేమని హైకోర్టు తేల్చి చెప్పింది. ‘కొంత మంది సమ్మె చట్ట విరుద్ధమని ఆదేశాలు ఇవ్వాలని కోరుతున్నారు. కొంత మంది ఎస్మా ప్రయోగించేలా ఆదేశాలు ఇవ్వాలని  కోరుతున్నారు. మరికొంత మంది చర్చలకు పిలిచేలా ఆదేశాలు ఇవ్వమంటున్నారు. అసలు ఈ అంశం కోర్టు పరిధిలో ఉందో లేదో చెప్పట్లేదు. కోర్టు పరిధి దాటి మేము ఆదేశాలు ఇవ్వలేము’ అని హైకోర్ట్ స్పష్టం చేసింది. సమ్మెలో ఉన్న కార్మికులతో చర్చలు జరపాలని  ఏ ప్రాతిపదికన ఆదేశాలు ఇవ్వాలని హైకోర్టు ప్రశ్నించింది. విచారణను రేపటికి వాయిదా వేస్తున్నట్లు తెలిపింది. అదేవిధంగా ఆర్టీసీ సమ్మె సమస్య పరిష్కారానికి ముగ్గురు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తులతో కమిటీ వేస్తామని హైకోర్టు పేర్కొంది. ఈ విషయమై ప్రభుత్వం అభిప్రాయం బుధవారంలోగా చెప్పాలని ఆదేశించింది.

మహా ట్విస్ట్... రాష్ట్రపతి పాలన కోరుతూ కేంద్రానికి గవర్నర్ లేఖ

మహారాష్ట్ర రాజకీయాలు మరో మలుపు తిరిగాయి. రాష్ట్రపతి పాలనకు గవర్నర్ భగతసింగ్ కోషియారి కేంద్రానికి సిఫార్సు లేఖ రాశారు. ట్విస్ట్ లు అనూహ్య మలుపుల మధ్య మహారాష్ట్ర పాలిటిక్స్ అంచనాలకు అందడం లేదు. ఉదయం నుండి చోటు చేసుకుంటున్న కీలక పరిణామాలతో క్షణక్షణం ఉత్కంఠత తలపించింది. ప్రభుత్వం అసలు ఏర్పాటవుతుందా..! లేదా రాష్ట్రపతి పాలనే శరణ్యమవుతుందా..! అన్న ప్రశ్నలు ఉత్పన్నమయ్యాయి. శివసేన చీఫ్ ఉద్దవ్ థాక్రే ఎన్సీపీకి మద్దతిచ్చే విషయం పై కాసేపట్లో క్లారిటీ ఇవ్వబోతున్నారు. అయితే ఎన్సీపీ నేతలు కూడా సీఎం పదవిని చెరో రెండున్నరేళ్లు పంచుకోవాలని డిమాండ్ చేసినట్లు తెలుస్తుంది. సర్కార్ ఏర్పాటు ఆలస్యం అవ్వడానికి తాము ఏమాత్రం కారణం కాదని కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు.  మహారాష్ట్ర పగ్గాలు అసలు పవార్ చేతికందేనా సీఎం కుర్చి ఎవరిని వరిస్తుంది..గవర్నర్ పిలిచినట్టుగా ఎన్సీపీ సర్కారు కొలువు తీరుతుందా.. సేన సహకారం ఎన్సీపీకి ఎంత వరకు లభించనుంది. ఈ ప్రశ్నలన్నీ రాజకీయ వర్గాల్లో ఉత్కంఠను రేపాయి. అయితే మహారాష్ట్రలో నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్న నేపథ్యంలో గడువులోపు శివసేన బలాన్ని నిరూపించుకోలేకపోవడంతో ఎన్సీపీకి ఆహ్వానం పంపారు గవర్నర్. మూడో అతిపెద్ద పార్టీగా అవతరించిన ఎన్సీపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందా అన్న అంశం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. గవర్నర్ ఎన్సీపీకి ఈ రోజు రాత్రి ఎనిమిదిన్నర వరకు గడువిచ్చారు. ప్రభుత్వ ఏర్పాటుపై ఎన్సీపీ ఏ నిర్ణయం తీసుకుంటుందన్నది ఇప్పుడు సర్వత్రా నెలకొన్న ఉత్కంఠత. సీఎం పీఠమే తమ టార్గెట్ గా ముందుకెళుతున్న శివసేన ప్రస్తుతం ఎన్సీపీకి మద్దతు ఇస్తుందా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. తమకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వలేదనే కారణంతో బీజేపీతో తెగదెంపులు చేసుకున్న శివసేన మరి ఎన్సీపీతో ఎలా చేతులు కలుపుతుందన్న సందిగ్ధం కొనసాగుతోంది. ఎన్సీపీకి మద్దతుపై శివసేన నుంచి ఇప్పటి వరకు క్లారిటీ రాలేదు.  మరోవైపు ఎన్సీపీ, కాంగ్రెస్, శివసేనలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం సైతం లేకపోలేదు అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అధికారాన్ని ఎన్సీపీ, శివసేన చెరో సగం పంచుకున్న ఆశ్చర్యపడాల్సిన పని లేదని విశ్లేషకులు భావిస్తున్నారు. 50-50 ఫార్ములాకు నో చెప్పడంతో దశాబ్దాలుగా బీజేపీతో కొనసాగుతున్న స్నేహాన్ని సైతం వదులుకుంది శివసేన. శివసేన అభ్యర్థి సీఎం కావడమే లక్ష్యంగా ఆ పార్టీ అడుగులు వేస్తుంది. ఈ క్రమంలోనే బీజేపీకి దూరమైన శివసేన కాంగ్రెస్, ఎన్సీపీలకు దగ్గరైంది. గవర్నర్ పిలుపు నేపథ్యంలో ఆ పార్టీలు విస్తృత స్థాయిలో మంతనాలు జరిగాయి. గడువు పెంపు కోసం శివసేన చేసిన విజ్ఞప్తిని గవర్నర్ తోసిపుచ్చడంతో అనూహ్యంగా ఎన్సీపీ తెరపైకొచ్చింది. మొత్తానికి సాయంత్రం ఎనిమిదిన్నర వరకు ఏం జరగబోతోంది మహారాష్ట్ర ఎన్నికల్లో తీవ్ర ఉత్కంఠను రేపుతున్నాయి.