తెలంగాణ తరహాలో ఏపీలోనూ 51 కోట్ల ఈఎస్ఐ స్కామ్.. అచ్చెన్నాయుడు పాత్ర!!

ఏపీలోనూ తెలంగాణ తరహాలో భారీగా ఈఎస్ఐ స్కామ్ జరిగింది. తాజాగా విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు జరిపిన దర్యాప్తులో మందుల కొనుగోళ్లలో భారీగా అక్రమాలు చోటుచేసుకున్నట్లు నిర్ధారణ అయింది. ఆరేళ్లుగా కోట్లాది రూపాయల ప్రభుత్వ నిధులను అక్రమార్కులు స్వాహా చేసినట్లు అధికారులు గుర్తించారు. నకిలీ కొటేషన్లతో రేట్ కాంట్రాక్టులో లేని సంస్ధలకు సైతం ఆర్డర్లు ఇచ్చినట్టు విజిలెన్స్ గుర్తించింది. ప్రభుత్వం మందుల కొనుగోళ్ల కోసం మొత్తం 89 కోట్లు చెల్లించగా.. అందులో 38 కోట్లు నిబంధనల ప్రకారం చెల్లించినట్లు, మరో 51 కోట్లు మాత్రం అక్రమార్కులు మింగేశారు. అప్పటి కార్మిక మంత్రి అచ్చెన్నాయుడికీ ఇందులో పాత్ర ఉన్నట్లు తేలింది. తెలంగాణలో కొన్నినెలల క్రితం చోటుచేసుకున్న ఈఎస్ఐ మందుల కొనుగోళ్ల స్కామ్ మరకవకముందే ఏపీలోనూ అదే తరహా అవినీతి చోటుచేసుకున్నట్లు తాజాగా విజిలెన్స్ అధికారులు గుర్తించారు. ఈఎస్ఐలో కీలకంగా ఉన్న పలువురు అధికారులు కుమ్మక్కై దాదాపు 51 కోట్ల మేర అక్రమ కొనుగోళ్లు జరిపినట్లు విజిలెన్స్ విచారణలో తేలింది. నిబంధనల ప్రకారం రేట్ కాంట్రాక్టులో ఉన్న సంస్ధల నుంచి మాత్రమే మందులు కొనుగోలు చేయాల్సి ఉండగా.. అందులో లేని సంస్ధల నుంచి కూడా 51 కోట్ల రూపాయల మేర చెల్లింపులు చేసి మందులు తీసుకున్నట్లు నిర్ధారణ అయింది. అదీ వాస్తవ ధర132 శాతం అధికంగా చెల్లింపులు జరిపినట్లు విజిలెన్స్ విచారణ నివేదికలో తెలిపింది. ఈ మొత్తం స్కామ్ లో కీలక పాత్ర పోషించిన సరఫరాదారులు తెలంగాణ ఈఎస్ఐ స్కామ్ లో నిందితులుగా ఉన్నవారే కావడం ఇక్కడ మరో విశేషం. ఏపీలో చోటు చేసుకున్న ఈఎస్ఐ స్కామ్ లో అప్పట్లో డైరెక్టర్లుగా వ్యవహరించిన రవికుమార్, విజయ్ కుమార్ తో పాటు ఆరుగురు జాయింట్ డైరెక్టర్లు, ఫార్మసిస్టులు, సీనియర్ అసిస్టెంట్ ను అధికారులు బాధ్యులుగా తేల్చారు. వీరిపై తదుపరి చర్యల కోసం ప్రభుత్వానికి సిఫార్సు చేశారు. ఈ ముగ్గురు డైరెక్టర్లు గా వ్యవహరించిన సమయంలో 975 కోట్ల రూపాయల మందుల కొనుగోలు చేస్తే, అందులో 100 కోట్లకు పైగా నకిలీ బిల్లులకు చెల్లించినట్లు ఆరోపణలు వచ్చాయి. మందుల కొనుగోలుకు ప్రభుత్వం 293 కోట్ల బడ్జెట్ కేటాయిస్తే, ఈ ముగ్గురు డైరెక్టర్లు 698 కోట్ల రూపాయలకు మందులను కొనుగోలు చేశారు. అంటే ప్రభుత్వానికి 404 కోట్ల రూపాయలు నష్టం కలిగేలా వ్యవహరించారు. లెజెండ్ ఎంటర్ ప్రైజెస్, ఓమ్ని మెడీ, ఎన్వెంటర్ పర్ఫామెన్స్ సంస్థలే రెండు రాష్ట్రాల్లో భారీగా ఈఎస్ఐ స్కామ్ కు పాల్పడ్డాయి. ఈ మూడు సంస్థలకు లాబ్ కిట్ల కొనుగోలు పేరుతో 85 కోట్ల రూపాయలను అక్రమంగా చెల్లించినట్లు తేలింది. లెజెండ్ ఎంటర్ప్రైజెస్ ద్వారా ల్యాబ్ పరికరాల కోసం ఎలాంటి టెండర్లు లేకుండానే 2 కోట్లకు కొనుగోలు చేసినట్టు ఇడెంట్లు సృష్టించారని విజిలెన్స్ నివేదిక వెల్లడించింది. 2018 19 సంవత్సరానికి 18 కోట్ల విలువైన మందులు కొనుగోలు చేసినట్లు రికార్డుల్లో ఉం టే , అందులో కేవలం 8 కోట్లు మాత్రమే వాస్తవ ధర అయితే 10 కోట్లు అదనంగా నిధులు స్వాహా చేసినట్టు అధికారులు గుర్తించారు. మందుల కొనుగోలు, ల్యాబ్ కిట్లు, ఫర్నిచర్, ఈసీజీ సర్వీసులు బయోమెట్రిక్ యంత్రాలను కొనుగోలు లో భారీగా అక్రమాలు జరిగినట్టు కూడా విజిలెన్స్ నివేదికలో తేలింది. ఒక్కో బయోమెట్రిక్ మిషన్ వాస్తవ ధర 16,000 అయితే ఏకంగా 70 వేల చొప్పున ఇండెంట్లు సృష్టించినట్లు విజిలెన్స్ నిర్ధారించింది. జర్సన్ ఎంటర్ప్రైజెస్ అనే నకిలీ సంస్థను సృష్టించి కందుల కొనుగోలు పేరుతో నిధులు మళ్లించినట్లు తేలింది. అయితే ఈ మొత్తం వ్యవహారంలో అప్పట్లో కార్మికశాఖ మంత్రిగా ఉన్న అచ్చెన్నాయుడు పాత్ర కూడా ఉందదని విజిలెన్స్ నివేదికలో తేల్చారు. టెలీ హెల్త్ సర్వీసుల పేరుతో ఆర్డర్స్ ఇవ్వడంలో అచ్చెన్నాయుడు ఒత్తిడి తెచ్చారని, నామినేషన్ పద్ధతిలో ఆర్డర్లు కేటాయించాలని అచ్చెన్నాయుడు ఆదేశించిట్లు నివేదిక తెలిపింది.

హైదరాబాద్ బస్టాప్ ల్లో ఆర్టీసీ గైడ్స్... అడిగిమరీ బస్సెక్కిస్తారు... 

50రోజుల ఆర్టీసీ సమ్మెతో యాజమాన్యం భారీ గుణపాఠాన్నే నేర్చుకున్నట్టు కనిపిస్తోంది. ముఖ్యంగా నష్టాల నుంచి గట్టెక్కించేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. తెలంగాణ ఆర్టీసీని లాభాల బాట పట్టించేందుకు అనేక చర్యలు చేపడుతున్నారు. ఆర్టీసీ సమ్మె తర్వాత సమూల ప్రక్షాళన చేపట్టిన యాజమాన్యం... సంస్థను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు, అలాగే ప్రయాణికులకు దగ్గరయ్యేందుకు సరికొత్త విధానాలను అవలంభిస్తోంది. ముఖ్యంగా హైదరాబాద్‌లో ప్రయాణికుల సౌకర్యార్ధం ట్రాఫిక్ జనరేటింగ్ పాయింట్ల దగ్గర మార్పులకు శ్రీకారం చేపట్టారు. బస్సుల రాకపోకలపై ప్రయాణికులకు సమాచారం అందించేందుకు మెగాఫోన్ వ్యవస్థను మొదలుపెట్టారు. ముఖ్యంగా హైదరాబాద్‌లో ఆర్టీసీని బలోపేతం చేయడం కోసం అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. బస్సుల షెడ్యూల్‌ను మార్చడమే కాకుండా, ఏ బస్సు ఎక్కడ ఆగుతుంది... ఏ సమయంలో వస్తుంది... ఏ నెంబర్ బస్సు ఎక్కడి వెళ్తుంది... ఇలా, ప్రయాణికులకు సమాచారం అందించడానికి, ప్రతి బస్టాండ్‌లో గైడ్స్‌‌ను ఏర్పాట్లు చేస్తున్నారు. వీళ్లంతా మెగా ఫోన్ల ద్వారా... ఆయా బస్సుల వివరాలు అందిస్తూ ప్రయాణికులకు సహాయపడేలా చర్యలు చేపట్టారు.  ఒకవేళ బస్సుల్లో తగినంతమంది ప్రయాణికులు లేకపోతే ప్రీక్వెన్నీ నియంత్రిస్తూ ఓఆర్ పెంచేందుకు రెండుమూడు నిమిషాలు నిలిపి పంపేలా చర్యలు తీసుకుంటున్నారు. ఆర్టీసీ సమ్మె తర్వాత చేపట్టిన చర్యలతో సంస్థ మెల్లమెల్లగా గాడిలో పడుతోందని అంటున్నారు. సర్వీసుల క్రమబద్ధీకరణతో నష్టాలు గణనీయంగా తగ్గుతున్నాయని చెబుతున్నారు. మొత్తానికి, ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పినట్లుగా ఆర్టీసీ కార్మికులు బోనస్ తీసుకునేలా సకల చర్యలు చేపడుతున్నారు. మరి, తెలంగాణ ఆర్టీసీ ప్రయత్నాలు ఫలిస్తాయో లేదో మున్ముందు తెలుస్తుంది.

ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ తన గొయ్యి తానే తవ్వుకుంటోందా?

ఆంధ్రప్రదేశ్ లో సొంతంగానే బలపడతాం అని ప్రతి రోజూ ప్రకటనలు గుప్పిస్తున్న భారతీయ జనతా పార్టీ అందుకు ఎలాంటి వ్యూహాలు రచిస్తోంది అంటే? భలే ప్రశ్న అడిగారండి, ఆ విషయం ఆ పార్టీ నాయకులకే తెలియడం లేదు మనకేం తెలుస్తుంది? అంటున్నారు జనాలు. ఆంధ్రప్రదేశ్ లో బిజెపి రెండు పడవలపై కాళ్లు పెట్టి అటూ ఇటు కాకుండా పోతోంది. అధికార వైసిసి పట్ల ఏం వైఖరి అవలంబించాలనే విషయంలో పార్టీ ఒక నిర్ణయానికి రాలేకపోతున్నట్టు స్పష్టంగా కనిపిస్తుంది. వైసిపి లోక్ సభ సభ్యులతో బిజెపికి పని లేకపోయినా రాజ్యసభ సభ్యులతో మాత్రం ఆ పార్టీకి ఇంకా పని ఉంది. పైగా వచ్చే రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికలతో తెలుగుదేశం పార్టీకి ఉన్న సీట్లు బాగా తగ్గి అన్ని సీట్లూ వైసీపీకి రాబోతున్నాయి. అందువల్ల వైసిపి రాజ్యసభ సభ్యులతో బిజెపికి పని ఉంది. ఈ కారణంతో ఆంధ్రప్రదేశ్ లో బిజెపి ఒక అడుగు ముందుకు రెండు అడుగులు వెనక్కి వేస్తోంది. ఈ బలహీనతతో బాటు వైసిపిని పూర్తిగా కట్టడి చేస్తే మళ్లీ తెలుగుదేశం పార్టీ పుంజుకుంటుందేమోననే అనుమానం, బెంగ  బిజెపిని పట్టి పీడిస్తున్నాయి.  అందుకోసం కూడా బిజెపి అనుకున్న విధంగా వైసీపీని కట్టడి చేయలేకపోతున్నట్టు కనపడుతుంది. వైసిపికి వ్యతిరేకంగా పూర్తి స్థాయి ఉద్యమం నడుపుతున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు విపరీతమైన స్పందన వస్తోంది. జనసేన పార్టీ నిర్మాణం పూర్తిగా లేకపోయినా ఆయన చేపడుతున్న కార్యక్రమాలతో ప్రజల్లో తిరుగుబాటు మనస్తత్వం కనపడుతోంది.. పవన్ కల్యాణ్ వెనుక ఉండేది అందరూ యూత్ కాబట్టి ఆయన మాటలపై వారికి  విశ్వాసం ఉంది కాబట్టి ప్రభుత్వ వ్యతిరేకత ఎంతో వేగంగా విస్తరిస్తోంది. అయితే పవన్ కళ్యాణ్ కు పార్టీ నిర్మాణం చేయడం, అందుకు ఆర్ధిక వనరులు లేకపోవడం లాంటి బలహీనతలు ఉన్నాయి. ఈ బలహీనతలను ఆసరాగా చేసుకుని జనసేన తమ ఆధీనంలోకి వచ్చే విధంగా బిజెపి చేసుకుంది. ఈ ఎత్తుగడతో వైసిపికి వ్యతిరేకంగా ఉద్యమం చేసే పవన్ కల్యాణ్ ను కూడా కట్టడి చేసి వైసిపిని బిజెపి అన్ని రకాలుగా రక్షిస్తున్నట్టు సామాన్యులు సైతం అనుకుంటున్నారు. అమరావతి నుంచి రాజధానిని ఎత్తేయడం పై ఒక దశలో పెద్ద ఎత్తున వచ్చిన ఉద్యమంలో ఉత్సాహంగా పాల్గొనేందుకు బిజెపి ముందుకు వచ్చింది. అయితే కేంద్రం నుంచి వచ్చిన ఆదేశాలతోనే బిజెపి రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు ఆ ఉద్యమాన్ని పూర్తిగా నీరుగార్చే విధంగా మాట్లాడారని ప్రజలు అనుకుంటున్నారు. జీవీఎల్ చేస్తున్న వ్యాఖ్యలకు అనుగుణంగానే కేంద్రం నుంచి సంకేతాలు వస్తుండటంలో రాష్ట్ర బిజెపి పూర్తిగా నీరుగారి పోయింది. ఉద్యమం చేస్తున్న పవన్ కల్యాణ్ ను కూడా చల్లార్చేసింది. రాష్ట్ర విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి అధికారం లోకి వచ్చిన తర్వాత మాట మార్చిన బిజెపి తొలి ఐదేళ్లలో ఏపిలో బిజెపి పెరిగే అవకాశాన్ని చేజేతులా కొల్పోవడమే కాక  ఏపి ప్రజలకు విరోధిగా మారింది. తెలుగుదేశం ఘోరంగా ఓడిపోయిన తర్వాత  బీజేపీకి ఏపిలో మళ్లీ పెరిగే అవకాశం వచ్చింది. అయితే అమరావతి తరలింపు తదితర అంశాలకు పరోక్షంగా మద్దతు ఇస్తూ బిజెపి తన పెరుగుదలకు తానే పాతర వేసుకుంటోంది.  ఆంధ్రా రాజకీయాల్లో కమలం పార్టీ కన్స్యూజన్ లో ఉందని, తాజా పరిణామాలతో నేతలు అయోమయంలో వున్నారన్న విషయం ప్రస్ఫుటంగా తెలుస్తోంది. ఆంధ్ర నాయకులు ఒకలా.. ఢిల్లీ నాయకులు మరోలా మాట్లాడుతూ నానా  గందరగోళాన్ని సృష్టిస్తున్నారు.  మూడు రాజధానుల నుంచి మండలి రద్దు అంశం వరకూ  బీజేపీ నేతల వైఖరి భిన్నమైన దారుల్లో వెళ్లడంతో రాష్ట్ర పార్టీ వ్యూహానికి కేంద్ర ప్రభుత్వ వ్యూహానికి తేడా స్పష్టంగా కనిపిస్తోంది. దీంతో కమలం పార్టీలో అసలేం జరుగుతోందో అర్థంకాక నేతలతో పాటు జనాలు కూడా జుట్టు పీక్కుంటున్నారు. ఈ పరిణామాలతో ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం, వైసీపీలను వ్యతిరేకించినా ప్రత్యామ్నాయంగా బీజేపీని ఎంచుకునే పరిస్థితులు లేకుండా పోతున్నాయని ప్రజలు అనుకుంటున్నారు.

సొంత జిల్లాలో ధర్మానకు తీరని అవమానం..!

ధర్మాన ప్రసాదరావు. ఏ పార్టీలో ఉన్నా శ్రీకాకుళం జిల్లా రాజకీయాల్లో ఆయననే పెద్దదిక్కుగా చెప్పుకుంటారు. అలాంటి ధర్మాన ప్రసాదరావు, వైసీపీ అధికారంలోకి వచ్చాక, మంత్రి పదవి ఆశించి భంగపడ్డాక, ఎమ్మెల్యేగానే మిలిగిపోయారు. అయితే ఎమ్మెల్యే స్థాయిలో ఉన్న ధర్మాన... తన స్థాయిని మరిచి వ్యవహరిస్తున్నారనే వార్తలు, ఇప్పుడు సిక్కోలు రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి. శ్రీకాకుళం మార్కెట్ వర్తక సంఘంలో నాలుగు వర్గాలున్నాయి. అందులో మూడు వర్గాలు అధికార వైసీపీకి మద్దతు తెలుపుతుండగా, మిగిలిన ఆ ఒక్క వర్గం మాత్రం టీడీపీకి మద్దతు తెలుపుతోంది. అయితే, ఆ ఒక్క వర్గాన్నీ తమవైపు తిప్పికోవాలని అధికార పార్టీ నాయకులు ప్రయత్నాలు చేశాయి. అయితే, వర్తక సంఘంలో తమ ఆధిపత్యం నడవాలంటే అన్ని వర్గాలు తమవే అయ్యుండాలని చోటా నాయకులు ధర్మానకు నూరిపోశారు. దాంతో ధర్మాన సైతం తన సహజశైలికి భిన్నంగా వ్యవహరించారట. అయితే, ఇది, అధికార పార్టీకి మద్దతుగా ఉన్న వర్తకుల్లో మాత్రం తీవ్ర అసంతృప్తిని రాజేసింది. ఇటీవల శ్రీకాకుళం మార్కెట్ వర్తక సంఘంలో ధర్మాన వర్గం, ఆయన వ్యతిరేక వర్గం పోటాపోటీగా నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఇది బహిర్గతమైంది. ధర్మాన అనుకూల వర్గం నిర్వహించిన రక్తదాన శిబిరంలో కేవలం 20మంది మాత్రమే పాల్గొనగా, ఆయన వ్యతిరేక వ్యాపార వర్తక సంఘం నిర్వహించిన కార్యక్రమంలో మాత్రం, 200మందికి పైగా పాల్గొన్నారు. దాంతో, ధర్మాన ప్రసాదరావుకు ఇది తీవ్ర అవమానమన్న చర్చ శ్రీకాకుళంలో జరుగుతోంది. శత్రువుల్లో కూడా సానుభూతిపరులను దగ్గర చేసుకునే ధర్మాన, ఈసారి మాత్రం ఆ లాజిక్ మిస్సయ్యారని అంటున్నారు. సొంత పార్టీలో ఉన్నవారినే కాదు, వైరి పక్షాల్లో ఉన్న సానుభూతిపరులను కూడా దగ్గర చేర్చుకోవడమే ధర్మాన గెలుపు మంత్రమని చెప్పుకుంటారు. ప్రధానంగా 2004, 2009, 2019 ఎన్నికల్లో ఇటువంటి అంశాలే ధర్మాన విజయానికి సూత్రమని చెప్పుకుంటారు. అలాంటి ధర్మాన... మార్కెట్ వర్తక సంఘం వ్యవహారంలో ఆ లాజిక్ ఎలా మిస్ అయ్యారని చర్చించుకుంటున్నారు. అయితే, అనవసరమైన విషయంలో జోక్యం చేసుకుని, ధర్మాన పలుచన అవుతున్నారని వైసీపీ నేతలు మాట్లాడుకుంటున్నారు. ఎంత బలవంతుడైనా, అనువుగాని చోట అధికులమనరాదన్న మాటను, ధర్మాన మరచిపోయారని పార్టీ నేతలు అంటున్నారట. ఓవరాల్ గా వర్తక సంఘంలో అనుకున్నది ఒక్కటైతే, జరిగింది మరొకటని అంటున్నారు. మరి, ఈ మార్కెట్ అవమానం నుంచి ధర్మాన ఎలా బయటపడతారో చూడాలంటున్నారు.

బీజేపీతో పెరుగుతున్న జగన్ మైత్రి- పవన్ ఒంటరవుతున్నారా?

కేంద్ర, రాష్ట్రాల్లో అధికార పార్టీలుగా ఉన్న బీజేపీ- వైసీపీ చెలిమి అనివార్యమవుతున్న తరుణంలో కాషాయ పార్టీకి మిత్రపక్షంగా ఉన్న జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఒంటరవుతున్నట్లే కనిపిస్తోంది. బీజేపీతో పొత్తు ప్రకటన తర్వాత ఇరు పార్టీల మధ్య సమన్వయ కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించినా అది ఇప్పటివరకూ సాధ్యం కాలేదు. ఈ కమిటీలో ఎవరుండాలనే దానిపై ఏకాభిప్రాయ కుదరకపోవడమే దీనికి కారణంగా తెలుస్తోంది. ఆలోపే ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షాతో జగన్ భేటీ జరగడం, మండలి రద్దు సహా పలు కీలక అంశాలపై హామీ లభించడం చకచకా జరిగిపోయాయి. దీంతో త్వరలో కేంద్ర కేబినెట్ లో వైసీపీ చేరికపై ఊహాగానాలు కూడా మొదలయ్యాయి. అప్పటి నుంచి జనసేన పరిస్ధితి ఇబ్బందికరంగా తయారైంది. 2014 ఎన్నికలకు ముందు టీడీపీతో కలిసి బీజేపీతో పొత్తు పెట్టుకున్న జనసేన పార్టీ సార్వత్రిక పోరులో మాత్రం ప్రత్యక్షంగా బరిలోకి దిగలేకపోయింది. సంస్ధాగతంగా బలంగా లేకపోవడం, పార్టీ కమిటీల ఏర్పాటు కూడా జరగకపోవడం, అభ్యర్దుల ఎంపికకు తగినంత సమయం లేకపోవడం వంటి కారణాలతో 2014 ఎన్నికల్లో జనసేన కేవలం టీడీపీ, బీజేపీలకు మద్దతివ్వడంతోనే సరిపెట్టింది. ఆ తర్వాత మారిన పరిస్దితుల్లో 2018లో ఎన్డీయే నుంచి టీడీపీ బయటికి వచ్చాక అదే బాటలో బీజేపీపై యుద్ధం ప్రకటించిన పవన్... రాష్ట్రానికి పాచిపోయిన లడ్డూలు ఇచ్చారంటూ బీజేపీని దు‌మ్మెత్తి పోశారు. టీడీపీ బాటలోనే ఎన్డీయేకు గుడ్ బై చెప్పినా 2019 సార్వత్రిక ఎన్నికల్లో నేరుగా పోరాడే పరిస్దితి జనసేనకు లేకపోయింది. దీనికి తోడు జనసేన కూడా టీడీపీకి పరోక్షంగా సహకరిస్తుందనే భావన ఓటర్లలో రావడంతో ఇరు పార్టీలు ఘోరంగా దెబ్బతిన్నాయి. ఆ ఎన్నికలు ముగిశాయో లేదో టీడీపీ కంటే ముందే వైసీపీపై పోరుకు సిద్ధమైపోయిన జనసేనాని పవన్ అతి కొత్తి సమయంలోనే మళ్లీ బీజేపీ గడపతొక్కారు. ఢిల్లీలో బీజేపీ పెద్దలను కలిశాక విజయవాడలో ఇరుపార్టీల పొత్తును ప్రకటించారు. పొత్తు ప్రకటన అయితే వచ్చింది కానీ ఇరు పార్టీలు కలిసి క్షేత్రస్ధాయిలో ఉమ్మడిగా పోరాటాలు చేసింది లేదు. అమరావతి సహా కీలక అంశాలపై ఇరు పార్టీలదీ ఇప్పటికీ ఒంటరి పోరాటమే. తాజాగా సీఎం జగన్ ఢిల్లీ పర్యటనలో ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షాను కలిశాక ఎన్డీయేలో వైసీపీ చేరిక ఊహాగానాలు మొదలయ్యాయి. అయితే వీటిపై పూర్తిగా క్లారిటీ లేకపోయినా త్వరలో జరిగే కేబినెట్ విస్తరణలో వైసీపీ కేంద్రంలో చేరే అవకాశాలు ఉన్నాయనే ప్రచారం మాత్రం సాగుతోంది. దీనికి బీజేపీ వైపు నుంచి ఫుల్ స్టాప్ పడకపోవడంతో ఆ పార్టీకి మిత్రపక్షంగా ఉన్న పవన్ పరిస్ధితి నానాటికీ ఇబ్బందికరంగా మారుతోంది. దీంతో పరిస్ధితిని గమనించిన పవన్ తానే చొరవ తీసుకుని బీజేపీ వైసీపీతో పొత్తు పెట్టుకుంటే తాను కాషాయ పార్టీతో పొత్తుకు గుడ్ బై చెబుతానని ప్రకటించారు. ఆ తర్వాత కూడా కర్నూలులో సుగాలి ప్రీతి కేసుపై సీబీఐ విచారణ కోరుతూ ధర్నా కూడా చేశారు. ఇందులో బీజేపీ నేతలెవరూ పాల్గొనలేదు. ఓవైపు వైసీపీతో చెలిమిపై బీజేపీ పెద్దల నుంచి ఎలాంటి ప్రకటన రాకపోవడం, క్షేత్రస్ధాయిలో బీజేపీ నేతలు తన కార్యక్రమాలకు మద్దతు ఇవ్వకపోవడం చూస్తే జనసేనాని ఒంటరవుతున్నారా అన్న అనుమానాలు మొదలయ్యాయి. అందుకే భవిష్యత్ పరిణామాలను ఊహించే పవన్ రాష్ట్రంలో తాను చేపట్టే కార్యక్రమాలకు బీజేపీని ఆహ్వానించడం లేదని అర్దమవుతోంది. ఇదే పరిస్ధితి కొనసాగితే వైసీపీ కేంద్ర కేబినెట్ లో చేరకముందే బీజేపీతో పవన్ చెలిమి మూన్నాళ్ల ముచ్చట అవుతుందా అన్న వాదన వినిపిస్తోంది.

కావలి టీడీపీకి కోలుకోలేని దెబ్బ... బీద రవిచంద్రపై నేతల గుర్రు...!

నెల్లూరు జిల్లా కావలిలో అధికార వైసీపీ బలం పెరుగుతూ, ప్రతిపక్ష తెలుగుదేశం బలహీన పడుతోందన్న మాట వినిపిస్తోంది. ఇప్పటివరకు ఒకే పార్టీలో ఉన్న అన్నదమ్ములు బీదా మస్తాన్​రావు, బీదా రవిచంద్రలు, ఇప్పుడు రాజకీయ శత్రువులుగా మారడంతో కావలి రాజకీయాలు రసవత్తరంగా మారాయంటున్నారు. ఎన్నడూ లేనివిధంగా, టీడీపీ అంపశయ్య ఎక్కే పరిస్థితి ఏర్పడిందన్న మాటలు వినిపిస్తున్నాయి. సార్వత్రిక ఎన్నికల అనంతరం కావలి నియోజవకర్గంలో తెలుగుదేశానికి అన్నీతానై ఉన్న బీదా మస్తాన్​రావు, టీడీపీని వీడి వైఎస్సార్​కాంగ్రెస్‌లో చేరడంతో పార్టీ పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. బీదా మస్తాన్​రావు వెళ్లిపోవడంతో కావలి నియోజకవర్గంలో టీడీపీకి ఎన్నడూలేని విధంగా కోలుకోలేని దెబ్బ తగిలింది. అసలు, కావలి టీడీపీని ముందుండి నడిపించే నాయకుడు కరువయ్యాడని అంటున్నారు. బీదా మస్తాన్​రావు వైసీపీలో చేరా, టీడీపీలో కిందిస్థాయి నాయకులు చెట్టుకొకరు పుట్టకొకరుగా ఉండిపోయారని, అదే వైసీపీకి కలిసొస్తుందని చెబుతున్నారు. ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్​కుమార్​రెడ్డితో సఖ్యతగా ఉంటూనే, బీదా మస్తాన్​రావు తనదైన రాజకీయాలు చేస్తూ, పార్టీలో చక్రం తిప్పుతుండటంతో ఎంతోమంది తెలుగుదేశం అభిమానులు వైసీపీలోకి వెళ్లిపోతున్నారని అంటున్నారు.  ఒకవైపు బీద మస్తాన్ రావు పార్టీని వీడటంతో కావలి టీడీపీకి తీరని నష్టం జరిగితే... మరోవైపు, నెల్లూరు జిల్లా టీడీపీ అధ్యక్షుడు బీదా రవిచంద్ర అనుచిత నిర్ణయాలు పార్టీని దెబ్బతీస్తున్నాయని అంటున్నారు. పార్టీ మారతారన్న సమాచారమున్నా, వాళ్లను బుజ్జగించి టీడీపీలోనే కొనసాగేలా బీదా రవిచంద్ర ప్రయత్నించడం లేదని అంటున్నారు. పైగా, పార్టీ మారతారన్న సమాచారం రాగానే సస్పెండ్ చేసిపారేస్తున్నారని, దాంతో పార్టీకి నష్టం జరుగుతోందని చెబుతున్నారు. కావలి టీడీపీ అధ్యక్షుడు సుబ్బారాయుడుతోపాటు మరో నలుగురు ముఖ్య నేతలు ....ఎమ్మెల్యే రామిరెడ్డి, బీదా మస్తాన్​రావు సమక్షంలో వైసీపీ కండువా కప్పుకున్నారు. అయితే, వీళ్లు పార్టీ మారతారని ముందే తెలుసుకున్న బీదా రవిచంద్ర... బుజ్జగించాల్సిపోయి, వాళ్ల పదవులను రద్దు చేశారని, ఆ నిర్ణయంతోనే వాళ్లంతా వైసీపీలో చేరారని అంటున్నారు. అలాగే, ఎమ్మెల్యే ఇంట్లోని విందుకు హాజరైన 11మంది టీడీపీ నేతలను సస్పెండ్ చేయడం కూడా పార్టీకి చేటు చేసిందంటున్నారు. ఇలా, అందర్నీ సస్పెండ్ చేసుకుంటూ పోతే, కావలిలో నేతల్లేని పార్టీగా మిగిలిపోయే పరిస్థితి వస్తుందంటున్నారు.  కావలిలో టీడీపీకి ఇలాంటి పరిస్థితులు దాపురించడానికి కారణం, బీదా రవిచంద్ర తీరేనని, కొందరు బాహాటంగానే విమర్శలు కురిపిస్తున్నారు. కార్యకర్తలు, నేతలకు అందుబాటులో లేకపోవడం, అమరావతిలో ఎక్కువ సమయం గడుపుతుండటంతో, కావలిలో తెలుగుదేశం పార్టీకి గడ్డుకాలం ఏర్పడిందంటున్నారు. ఇప్పటికైనా టీడీపీ అధినాయకత్వం మేల్కొనకపోతే, కావలిలో తెలుగుదేశం అడ్రస్​గల్లంతయ్యే పరిస్థితి వస్తుందంటున్నారు కార్యకర్తలు.

వివాదాల్లో బీజేపీ లక్ష్మణ్... ఎందుకొచ్చిన తిప్పలంటూ సెటైర్లు...

తెలంగాణ బీజేపీ నేతలు ఒకరి తర్వాత మరొకరు వివాదాల్లో చిక్కుకుంటున్నారు. ఎర్రబస్సు మాత్రమే ఎక్కిన తెలంగాణ ప్రజలకు, మోడీ ప్రభుత్వం వచ్చాకే రైలంటే ఏంటో తెలిసిందంటూ కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి చేసిన కామెంట్స్ పై విపరీతమైన ట్రోలింగ్స్ జరుగుతుంటే... పిలవని పేరంటానికి వెళ్లి అవమానం పాలవుతున్నారంటూ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ పై సెటైర్లు పేలుతున్నాయి. ప్రత్యర్ధి పార్టీల నేతలే కాదు... సొంత పార్టీ లీడర్లు కూడా లక్ష్మణ్ తీరుపై నవ్వుకుంటున్నారు. పిలవని పేరంటానికి వెళ్తూ అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటూ లక్ష్మణ్ నిబంధనలను అతిక్రమిస్తున్నారని అంటున్నారు. కేంద్రమంత్రి హోదాలో తెలంగాణ అధికారులతో కిషన్ రెడ్డి నిర్వహిస్తున్న ప్రతి సమీక్షలోనూ లక్ష్మణ్ పాల్గొనడం వివాదాస్పదమవుతోంది. బైంసా అల్లర్లపైనా... ఆ తర్వాత మెట్రోరైల్ పైనా... ఇప్పుడు చర్లపల్లి శాటిలైట్ రైల్వే స్టేషన్ శంకుస్థాపన కార్యక్రమంలోనూ లక్ష్మణ్ పాల్గొనడంపై విమర్శలు రేగుతున్నాయి. అవన్నీ అధికారిక కార్యక్రమాలైతే... లక్ష్మణ్ ఎలా హాజరవుతారని... కిషన్ రెడ్డితో కలిసి సమీక్షల్లో పాల్గొంటారని ప్రశ్నిస్తున్నారు. కేంద్రమంత్రి పీయూష్‌ గోయల్, మరో కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డితో పాటు పలువురు స్థానిక ప్రజానిధులు, రైల్వే ఆఫీసర్లు, ఇటీవల హైదరాబాద్‌లో, రైల్వేకు సంబంధించి పలు అభివృద్ది కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ  కార్యక్రమంలో ప్రోటోకాల్‌ ఉంటుంది. అది అందరూ విధిగా ఫాలో అవ్వాల్సిందే. అయితే, అన్నీ తెలిసిన లక్ష్మణ్‌ మాత్రం, కేంద్ర మంత్రులు వస్తున్నారని, రెక్కలు కట్టుకుని, ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రోగ్రామ్‌లో పాల్గొనడంలో తప్పేమీలేదు కానీ, స్టేజి మీద కూర్చున్నారు. మంత్రులు, అధికారులతో కలిసి ఆసీనులయ్యారు. ఇది ప్రోటోకాల్‌కు విరుద్దం. కేవలం ప్రజాప్రతినిధులు, అధికారులు మాత్రమే, వేదిక మీదుండాలన్నది రూల్. రాజకీయాలకు ఏమాత్రం సంబంధంలేని కార్యక్రమం అది. కానీ రాజకీయ పార్టీకి అధ్యక్షుడైన లక్ష్మణ్‌, ప్రోటోకాల్‌ను పట్టించుకోకుండా, స్టేజ్ మీద కూర్చోవడం విమర్శలకు దారి తీసింది. ప్రోటోకాల్‌ పాటించాల్సిన ప్రోగ్రామ్‌లో పాల్గొనడమే కాకుండా, ఇనాగిరేషన్‌లో సైతం చేయి కలపడం, ఆయన స్థాయిని తగ్గించేలా చేసిందంటున్నారు. లక్ష్మణ్‌ ఇంకా తాను ముషీరాబాద్ ఎమ్మెల్యేగా ఉన్నానని భావించినట్లు ఉన్నారన్న సెటైర్లు పేలుతున్నాయి. అయితే, రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా తనకు ఆహ్వానం ఉందని చెప్పుకునే ప్రయత్నం చేశారన్న చర్చ జరుగుతోంది. మరి, కార్యక్రమంలో బీజేపీ మాత్రమే ఎందుకుంటుంది...మిగతా పార్టీల నేతలెందుకు లేరన్న ప్రశ్నకు సమాధానం మాత్రం చెప్పడం లేదట లక్ష్మణ్. అయితే, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌, వివాదాలకు చాలా దూరంగా వుంటారన్న పేరుంది. తనకుమాలిన విషయాలను అస్సలు పట్టించుకోరని సన్నిహితులంటారు. అలాంటిది, ఇలాంటి లేనిపోని వివాదాలను ఎందుకు కొనితెచ్చుకుంటున్నారన్న చర్చ జరుగుతోంది.

పశువులకూ ఆధార్ కార్డులు... దేశవ్యాప్తంగా అమలు...

వందల కోట్ల జనాభా ఉండే భారతదేశంలో ప్రతి ఒక్కరి వివరాలు తెలుసుకోవాలంటే ఒకప్పుడు అత్యంత కష్టసాధ్యమైన పని. అతను చెప్పేది నిజమో కాదో నిర్ధారించుకోవాలన్నా... రోజులూ నెలలూ పట్టేది. కానీ, ఆధార్ వ్యవస్థ వచ్చాక... యూనిక్ ఐడీ నెంబరు కొడితే చాలు అతని పేరు, వయసు, తండ్రి పేరు, గ్రామం, మండలం, జిల్లా, రాష్ట్రం... ఇలా అన్నీ వివరాలూ క్షణాల్లో తెలుసుకోగలుతున్నాం... ఇక, అతని ఫోన్ నెంబరు ఆధారంగా ఎక్కడున్నాడో... ఎటువైపు వెళ్తున్నాడో తెలుసుకునే స్థాయికి సాంకేతికత అభివృద్ధి చెందింది. అయితే, మనుషులకే కాదు... పశువులకూ ఐడెంటిఫికేషన్ నెంబరు వచ్చేసింది. భారతీయులందరికీ ఆధార్ నెంబరు ఉన్నట్లే... పశువులకూ యూనిక్ ఐడీ కేటాయిస్తున్నారు.  దేశవ్యాప్తంగా పశువులకు యూనీ ట్యాగింగ్ ప్రారంభమైంది. ఆవులు, గేదెలు, దున్నలు, ఎద్దులు... ఇలా ప్రతి పశువుకూ ఒక యూనిక్ ఐడీ నెంబరును కేటాయించి జియో ట్యాగింగ్ చేస్తున్నారు. ఈ యూనీ ట్యాగింగ్‌తో పశుగణనతోపాటు దాని యజమాని, గ్రామం... ఇలా ప్రతీది ఆన్‌లైన్‌లో నమోదు చేస్తున్నారు. మనుషుల్లో ఒక్కొక్కరి ఒక్కో నెంబరు ఉన్నట్లే... ప్రతి పశువుకూ డిఫరెంట్ యూనిక్ ఐడీ నెంబరు అలాట్ చేస్తూ.... ఆవులు, గేదెలు, దున్నలు, ఎద్దులకు ట్యాగింగ్ చేస్తున్నారు. అంటే, ఒక పశువుకు వేసే యూనిక్ ఐడీ నెంబరుతో దేశంలో మరొకటి ఎట్టిపరిస్థితుల్లోనూ ఉండదన్న మాట. పశు సంతతి, వాటికి సోకే వ్యాధులపై కచ్చితమైన సమాచారం కోసమే ఈ యూనీ ట్యాగ్ విధానం తీసుకొచ్చినట్లు అధికారులు చెబుతున్నారు.  ఈ యూనీ ట్యాగ్‌లో యూనిక్ ఐడీ నెంబరుతోపాటు పశువు యజమాని పేరు, అతని ఫొటో, ఆధార్ నెంబరు, గ్రామం... ఇతర వివరాలతో జియో ట్యాగింగ్ ద్వారా రికార్డు చేసి, పశువు ఫొటో తీస్తున్నారు. అనంతరం టీకా వేసి, ట్యాగ్ కుట్టి, మొత్తం వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేస్తున్నారు. ఈ యూనీ ట్యాగ్‌‌లో నమోదు చేస్తున్న వివరాలతో భవిష్యత్తులో పశుశులకు ఏమైనా వ్యాధులు సోకితే ఆన్‌లైన్‌లో నమోదుచేసిన వివరాల మేరకు వేగంగా వైద్యం అందించవచ్చని చెబుతున్నారు. అంతేకాదు, ఈ విధానంతో పశువుల అక్రమ రవాణాను కూడా అడ్డుకోవచ్చని రైతులు అంటున్నారు.

ఒకటి కవితకు... రెండోది పొంగులేటికి... గిది ఫైనల్ అంతే..!  

తెలంగాణలో ఖాళీ అవుతోన్న రెండు రాజ్యసభ సీట్లపై ఎప్పట్నుంచో రకరకాల ఊహాగానాలు వెలువడుతున్నాయి. టీఆర్ఎస్ ఖాతాలోకి వెళ్లే ఈ రెండు స్థానాలపై పలువురి పేర్లు ప్రచారంలో ఉన్నాయి. అయితే, మొదట్నుంచీ కవిత పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. లోక్ సభలో గట్టిగా తెలంగాణ వాణి వినిపించి పేరు తెచ్చుకున్న కవిత... అనూహ్యంగా నిజామాబాద్లో ఓటమిపాలు కావడంతో... రాజ్యసభకు పంపుతారనే ప్రచారం జరిగింది. అంతలోనే రాజ్యసభకు కాదు ఏకంగా రాష్ట్ర కేబినెట్లోకి తీసుకుంటారంటూ కథనాలు వచ్చాయి. అయితే, కవితను రాజ్యసభకు పంపడం ఖాయమైనట్లు తెలుస్తోంది.  టీఆర్ఎస్ కు దక్కనున్న రెండు రాజ్యసభ సీట్లలో ఒక స్థానానికి కవిత పేరు దాదాపు ఫైనల్ అంటున్నారు. ఢిల్లీ స్థాయిలో అన్ని రాజకీయ వర్గాలతో సత్సబంధాలు కలిగివుండటం... వాక్చాతుర్యం, హిందీ, ఇంగ్లీష్ మీద పట్టు ఉండటం.... తెలంగాణ సమస్యలు, అంశాల మీద సమగ్ర అవగాహన కలిగివున్న కవితను, రాజ్యసభకు పంపితే... హస్తినలో టీఆర్ఎస్ పాత్ర మరింత పెరుగుతుందని కేసీఆర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక, కేసీఆర్ కూతురుగా ఉండే ఇమేజ్ ఎలాగూ ఉండనుంది. ఇలా, అన్నీ కవితకు కలిసొస్తున్నందున రాజ్యసభకు వెళ్లడం ఖాయమంటున్నారు. ఇక, మిగిలిన మరో సీటుపైనే మాజీ మంత్రులు, మాజీ ఎంపీలు, సీనియర్లు గంపెడాశలు పెట్టుకున్నారు. అయితే, ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి ఇప్పటికే హమీ లభించినట్టు పార్టీలో చర్చ జరుగుతోంది. ఖమ్మం ఎంపీ టికెట్ నిరాకరించినా..పొంగులేటి పార్టీకి విధేయులుగానే ఉన్నారు. పార్టీ అప్పగించిన బాధ్యతలను నిర్వర్తిస్తూ.. పార్టీ అభ్యర్ధుల విజయం కోసం పనిచేశారు. దీంతో అన్నా నువ్వు రాజ్యసభకు వెళుతున్నావు..రెడీ అవ్వు అని కేటీఆర్..పొంగులేటికి హమీ ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో పెద్దల సభకు పొంగులేటి అని పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఏదైనా, చివరి నిమిషంలో మార్పులు చేస్తే తప్ప, కవిత అండ్ పొంగులేటి రాజ్యసభకు వెళ్లడం ఖాయమంటున్నారు.

విశాఖలో... రెండో వైపు చూస్తే కచ్చితంగా భయపడతారు..! 

ఆంధ్రప్రదేశ్‌లో నెంబర్‌వన్ మెట్రోపాలిటిన్ సిటీ విశాఖ... అంతేకాదు విశాఖ నగరానికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. ఒకటి కాదు... రెండు కాదు... వందలకొలది ప్రత్యేకతలు విశాఖ సొంతం.... ముఖ్యంగా విశాఖకు మెయిన్ అస్సెట్... సీ కోస్ట్.... సముద్ర తీరం వెంబడి ‎మహానగరంగా రూపాంతరం చెందిన వైజాగ్‌లో సహజసిద్ధ అందాలెన్నో కనిపిస్తాయి.... అంతేకాదు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో హైదరాబాద్ కంటే ముందుగా గ్రేటర్ సిటీ హోదా పొందిన తొలి నగరం విశాఖ.... అలాగే, దేశంలోనే అతిపెద్ద నాలుగో ఓడరేవు కలిగిన నగరం వైజాగ్‌.... భారత నౌకాదళ తూర్పు ప్రధాన స్థావరం కూడా విశాఖలోనే ఉంది.... ఇక, సుందరమైన సముద్ర తీరం... ఆహ్లాదకరమైన వాతావరణం... పచ్చని కొండలు... అద్భుతమైన కొండ లోయలు... మన్యం సౌందర్యం.... చూడచక్కని సముద్ర తీరం... కళ్లు చెదిరే ప్రకృతి అందాలు...  ఇలా చెప్పుకుంటూ పోతే.... ఇలా ఎన్నో ప్రత్యేకతలు వైజాగ్‌కి ఉన్నాయి.... అయితే, ఇవన్నీ ఒకవైపే... ఎందుకంటే, రెండో వైపు చూస్తే ఎవరైనాసరే వామ్మో అనకమానరు. ఇండియన్ స్మార్ట్ సిటీస్‌లో ఒకటైన విశాఖను నిత్యం వేలాది మంది పర్యాటకులు సందర్శిస్తూ ఉంటారు. ముఖ్యంగా విశాఖ బీచ్‌ల్లో ఎంజాయ్ చేయడానికి వస్తుంటారు. సముద్రపు ఒడ్డున అలలతో ఆటలాడుతూ అంతులేని ఆనందాన్ని పొందుతుంటారు. అయితే, విశాఖ నగరానికి మణిహారంగా నిలుస్తోన్న సాగర తీరం కాలుష్య కోరల్లో కూరుకుపోతోంది. లాసన్స్ బే కాలనీ నుంచి వస్తున్న మురుగునీరు జాలారిపేట తీరంలో కలుస్తుండటంతో సాగరం చెత్తాచెదారంతో నిండిపోతోంది. ఈ కాలుష్యం కారణంగా పర్యాటకులే కాదు, స్థానికంగా నివసించే మత్స్యకారులు కూడా రోగాల బారినపడుతున్నారు. విశాఖ బీచ్‌ల్లోకి పెద్దఎత్తున మురుగు నీరు, మానవ విసర్జితాలు, కాగితాలు, బట్టలు, సబ్బులు, డిటర్జెంట్లు, కెమికల్స్ మొదలైన వ్యర్ధాలతో నిండిపోతుండటంతో సాగర తీరం డంపింగ్ యార్డుగా మారిపోతోంది.ఇలా, ఎన్నో పర్యాటక, చారిత్రక అందాలకు నెలవైన విశాఖలో పర్యావరణ హననం ఆందోళన కలిగిస్తోంది. ‎స్వచ్ఛ సర్వేక్షణ్ పేరుతో వేలకోట్లు ఖర్చు చేస్తున్నా, కాలుష్యాన్ని మాత్రం నియంత్రించలేకపోతున్నారు. దాంతో, మురికివాడల్లోని ప్రజలు రోగాల బారిన పడుతున్నారు. మరి, ఆంధ్రప్రదేశ్‌ పరిపాలనా రాజధానిగా మారుతోన్న విశాఖ మహానగరాన్ని కాలుష్య కోరల్లో నుంచి జగన్ ప్రభుత్వం బయటపడేస్తుందో లేదో చూడాలి.

దిల్‌సుఖ్‌నగర్ మారణహోమానికి ఏడేళ్లు... హైదరాబాదీలను వెంటాడుతోన్న గాయం

సరిగ్గా ఏడేళ్ల క్రితం... ఇదే రోజు... బాంబు పేలుళ్లలో భాగ్యనగరం ఉలిక్కిపడింది. 2013... ఫిబ్రవరి 21... రాత్రి 7గంటలు... హైదరాబాద్‌లో అత్యంత రద్దీ ప్రాంతమైన దిల్‌‌సుఖ్‌నగర్‌ జనంతో కిటకిటలాడుతోంది... ప్రయాణికులు, విద్యార్ధులు, ఉద్యోగులు... ఇలా అన్ని వర్గాల ప్రజల రాకపోకలతో బస్టాండ్లు, షాపింగ్ మాల్స్‌, దుకాణాలు, రోడ్లూ... అన్నీ రద్దీగా ఉన్నాయి... ఎవరి పనుల్లో వాళ్లున్నారు... తమతమ గమ్యస్థానాలకు చేరుకోవడానికి బస్టాప్‌‌లో కొందరు వేచిచూస్తుంటే, మరికొందరు, వేడివేడి మిర్చి బజ్జీలు, ఛాయ్ తాగడానికి ఏ1 టిఫిన్ సెంటర్‌ దగ్గర గుమిగూడారు. ఇలా, ఎవరి పనుల్లో వాళ్లు బిజీగా ఉండగా, సరిగ్గా రాత్రి 7గంటల 2 నిమిషాలకు... భారీ శబ్ధంతో బస్టాప్‌‌లో బాంబు పేలుడు సంబవించింది. అంతలోనే ఏ1 టిఫిన్ సెంటర్‌ దగ్గర మరో బాంబు పేలుడు పేలింది. జనమంతా ఉరుకులు పరుగులు తీశారు. అసలేం జరిగిందో తెలుసుకునేలోపే అక్కడంతా భయానకంగా మారిపోయింది. ఎటుచూసినా రక్తపు ధారలే. మాంసపు ముద్దలే. దాంతో, దిల్‌సుఖ్‌నగర్ రోదనలతో మార్మోగింది. ఈ బాంబు పేలుళ్లలో 18మంది స్పాట్‌లోనే మరణించగా, 50మందికి పైగా తీవ్రంగా గాయపడి జీవశ్చవాలుగా బతుకుతున్నారు. దిల్‌సుఖ్‌నగర్ మారణహోమం జరిగి ఏడేళ్లు గడిచిపోతున్నా... ఇప్పటికీ మానని గాయంగా హైదరాబాదీలను వెంటాడుతోంది. బాంబు పేలుళ్లలో తమ ఆత్మీయులను గొట్టుకున్నవారంతా ఇప్పటికీ కోలుకోలేదు. తమవారిని తలుచుకుంటూ ప్రతిక్షణం కన్నీరుమున్నీరవుతున్నారు.

కిషన్ రెడ్డిపై సోషల్ మీడియాలో ట్రోలింగ్...

ఎర్రబస్సు మాత్రమే ఎక్కిన తెలంగాణ ప్రజలకు, మోడీ ప్రభుత్వం వచ్చాకే రైలంటే ఏంటో తెలిసిందంటూ కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి చేసిన కామెంట్స్ పై విపరీతమైన ట్రోలింగ్స్ జరుగుతున్నాయి. టీఆర్ఎస్‌ నేతలతోపాటు, తెలంగాణ ప్రజానీకం... కిషన్‌ రెడ్డిని ఓ ఆట ఆడుకుంటున్నారు. ఒక్కొక్కరూ ఒక్కోవిధంగా ఫైరవుతున్నారు. బాహుబలి శివలింగాన్ని మోసుకొచ్చినట్టు, రైల్వేను కిషన్‌ రెడ్డి తెలంగాణకు మోసుకొచ్చారని కొందరు కామెంట్ చేస్తే..... చూడండి, 1905లో మోడీ, కిషన్‌ రెడ్డిలు టికెట్ లేకుండా రైల్లో ప్రయాణించినందుకు, సికింద్రాబాద్ స్టేషన్‌లో టీసీ దించేశారని మరికొందరు ట్రోలింగ్ చేస్తున్నారు. అంతేకాదు, 1938లో నిజాం స్టేట్ రైల్వే, ముక్కోటి ఏకాదశి పర్వదినం సందర్భంగా టికెట్ రేట్లు తగ్గించడాన్ని ప్రచురించిన ఓ పత్రిక పేపర్‌ కటింగ్‌ను షేర్‌ చేస్తున్నారు. ఇంకా తెలంగాణకు రైలు కావాలని, నెహ్రూను కిషన్‌ రెడ్డి అడిగారంటూ, ఇద్దరి మార్ఫింగ్‌ ఫోటోను పోస్ట్‌ చేశారు. ఇలా కిషన్‌ రెడ్డిపై, సోషల్ మీడియాలో ట్రోలింగ్‌ మామూలుగా లేదు. మొత్తానికి, తెలంగాణలో కిషన్‌ రెడ్డి కామెంట్స్ పెద్ద దుమారాన్నే రేపుతున్నాయి.  అయితే, కిషన్‌ రెడ్డి ఏం మాట్లాడినా, చాలా ఆచితూచి మాట్లాడతారు. అసెంబ్లీలోనూ, బయటా స్పష్టంగా ప్రసంగాలు చేసి శభాష్‌ అనిపించుకున్నారు. కేంద్రమంత్రి అయ్యాక, ఆయన మరింత జాగ్రత్తగా మాట్లాడుతున్నారు. కానీ ఎందుకనో, ఏ మూడ్‌లో ఉన్నారో గానీ, పీయూష్‌ గోయల్‌తో కలిసి రైల్వే అభివృద్ది పనులను ప్రారంభించిన సమయంలో మాట తూలారు. దశాబ్దాల క్రితమే  తెలంగాణలో రైలు పరుగులు తీసిందన్న చరిత్ర తెలిసినా, మోడీ వచ్చాకే ఏదో తెలంగాణకు రైలు వచ్చిందన్నట్టుగా మాట్లాడి విమర్శకులకు అవకాశమిచ్చారు. అంతేకాదు, ఎర్రబస్సు మాత్రమే తెలిసిన తెలంగాణ ప్రజలంటూ, జనాగ్రహానికి గురయ్యారు. అయితే, ఎప్పుడూ పకడ్బందీగా, పక్కాగా, చక్కగా మాట్లాడే ఆ నాయకుడు, అనవసరంగా మాట తూలారన్న చర్చ జరుగుతోంది. ఏదో మాట్లాడబోయి మరేదో మాట్లాడి అనవసర వివాదంలో ఇరుక్కున్నారంటున్నారు. కిషన్‌ రెడ్డి కామెంట్లపై బీజేపీలోనూ హాట్‌హాట్‌గా చర్చ జరుగుతోంది. ఈ కామెంట్లు తెలంగాణలో బీజేపీకి ఇబ్బంది కలిగించేవేనని అంటున్నారు. రాష్ట్రంలో పార్టీ ఎదుగుతున్న సమయంలో, కిషన్‌ రెడ్డి కామెంట్లు చేటు చేసేలా ఉన్నాయని వ్యాఖ్యానిస్తున్నారు. దాంతో, కిషన్ రెడ్డి వ్యాఖ్యలను పార్టీ పెద్దల దృష్టికి తీసుకెళ్లేందుకు ప్రత్యర్ధి వర్గం ప్రయత్నిస్తోంది.

తెలుగు రాష్ట్రాల్లో మహాశివరాత్రి శోభ... శివనామ స్మరణతో మార్మోగుతున్న శైవ క్షేత్రాలు...

తెలుగు రాష్ట్రాల్లో మహా శివరాత్రి సందడి నెలకొంది. మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా ఏపీ, తెలంగాణలోని శివాలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోని శైవ క్షేత్రాలన్నీ శివనామ స్మరణతో మార్మోగిపోతున్నాయి. వేకువజాము నుంచే భక్తులు శివాలయాలకు పోటెత్తారు. పరమ శివుడిని దర్శనం చేసుకునేందుకు ఆలయాల ముందు పెద్దఎత్తున బారులు తీరారు. ప్రముఖ శైవ క్షేత్రమైన శ్రీశైలంలో శివరాత్రి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. మల్లికార్జునస్వామిని దర్శించుకునేందుకు భక్తులు శ్రీశైలానికి పోటెత్తుతున్నారు. అలాగే, శ్రీకాకుళం జిల్లా శ్రీముఖలింగలోని శ్రీముఖలింగేశ్వరస్వామి ఆలయానికి... పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలోని పంచారామక్షేత్రమైన సోమారామానికి భక్తులు పోటెత్తారు. అదేవిధంగా, పాలకొల్లు పంచారామక్షేత్రం క్షీరరామలింగేశ్వరస్వామి ఆలయానికి తెల్లవారుజాము నుంచే భక్తులు బారులు తీరారు. తెలంగాణలో అతిపెద్ద శైవక్షేత్రమైన వేములవాడ శ్రీరాజరాజేశ్వరి ఆలయంలో మహాశివరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. భక్తుల కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా ప్రఖ్యాతిగాంచిన వేములవాడ రాజన్నను దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. కోడె మొక్కులు తీర్చుకుంటూ ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఇక, ప్రధాన శైవ క్షేత్రాలైన ఉమామహేశ్వరం, జోగులాంబ బాలబ్రహ్మేశ్వరస్వామి ఆలయాలతోపాటు కీసర, ధర్మపురి శివాలయాలకు భక్తులు పోటెత్తారు. ఇక, మహా శివరాత్రి సందర్భంగా వేములవాడ రాజన్న టెంపుల్‌కు తెలంగాణ పర్యాటకశాఖ హెలికాప్టర్ సర్వీసును ప్రారంభించింది. బేగంపేట్‌ ఎయిర్‌పోర్ట్‌ నుంచి సేవలు అందుబాటులో ఉండనున్నాయి. భవిష్యత్తులో అన్ని ప్రధాన ఆలయాలకు హెలికాప్టర్ సర్వీసులు ప్రారంభిస్తామని మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు.

బీజేపీ ఎంపీ సుజనాకు మరోషాక్.. 400 కోట్ల ఆస్తుల వేలానికి బ్యాంకు ప్రకటన

అప్పుల ఎగవేత ఆరోపణలు ఎదుర్కొంటున్న బీజేపీ రాజ్యసభ ఎంపీ సుజనా చౌదరికి చెందిన సుజనా గ్రూప్ ఆస్తుల వేలానికి బ్యాంకుల నోటీసుల పర్వం కొనసాగుతోంది. సుజనా గ్రూపు సంస్ధ అయిన హైదరాబాద్ లోని సుజనా యూనివర్శల్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ సంస్ధ గతంలో తీసుకున్న 400 కోట్ల రూపాయల అప్పు తిరిగి చెల్లించకపోవడంతో ఇవాళ బ్యాంక్ ఆఫ్ ఇండియా వేలం ప్రకటన జారీ చేసింది. అప్పులను రాబట్టుకునేందుకు వచ్చే నెల 23న సంస్ధకు చెందిన పలు ఆస్తులను వేలం వేస్తున్నట్లు ఈ ప్రకటనలో తెలిపింది. టీడీపీని వీడి బీజేపీలో చేరినా రాజ్యసభ ఎంపీ సుజనా చౌదరికి సమస్యలు తప్పడం లేదు. సుజనా చౌదరికి చెందిన సుజనా గ్రూప్ సంస్ధలు వివిధ ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకుల నుంచి ఆస్తులు తనఖా పెట్టి తీసుకున్న రుణాలను తిరిగి చెల్లించకపోవడంతో ఆయా బ్యాంకులు వేలం ప్రకటనలు జారీ చేస్తున్నాయి. ఇప్పటికే సీబీఐ ద్వారా పలు బ్యాంకులు సుజనా గ్రూప్ సంస్ధలకు వేలం నోటీసులు పంపగా.. తాజాగా హైదరాబాద్ లోని సుజనా గ్రూప్ సంస్ధ మెసర్స్ సుజనా యూనివర్శల్ ఇండస్ట్రీస్ సంస్ధ గతంలో తీసుకున్న 400 కోట్ల అప్పుల రికవరీకి గానూ సంస్ధకు చెందిన ఆస్తులను వేలం వేసేందుకు వీలుగా బ్యాంక్ ఆఫ్ ఇండియా అధికారులు బహిరంగ ప్రకటన ఇచ్చారు. ఇందులో రుణం తీసుకున్నందుకు గ్యారంటెర్లుగా ఉన్న ఎంపీ సుజనా చౌదరితో పాటు వై. జితిన్ కుమార్, స్ప్లెండిడ్ మెటల్ ప్రొడక్స్ట్స్ లిమిటెడ్, సుజనా క్యాపిటల్, సుజనా పంప్స్ అండ్ మోటార్స్ తో పాటు మరికొందరి పేర్లను ఈ నోటీసుల్లో పేర్కొన్నారు.. ఇప్పటికే సీబీఐ నుంచి వివిధ బ్యాంకులకు చెందిన రుణాల ఎగవేత కేసుల్లో నోటీసులు అందుకున్న సుజనా గ్రూప్ సంస్ధలకు ఇది మరో ఎదురుదెబ్బగా మారింది. వాస్తవానికి మోడీ తొలిసారి ప్రధాని అయ్యాక టీడీపీ కోటాలో కేంద్రమంత్రిగా వ్యవవహరించిన సుజనా చౌదరి పదవిలో ఉండగానే ఆరోపణలు మొదలయ్యాయి. ఆ తర్వాత సీబీఐ కేసు కూడా నమోదు చేసింది. వివిధ బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాల ఎగవేతకు సంబంధించి ఆస్తుల వేలం నోటీసులు కూడా ఇచ్చింది. ఇందులో విదేశీ బ్యాంకుల రుణాలు కూడ ఉన్న నేపథ్యంలో ఈడీ కూడా కేసులు నమోదు చేసినట్లు తెలుస్తోంది. అయితే ఎన్డీయేలో టీడీపీ భాగస్వామిగా ఉన్నప్పుడు కేంద్రమంత్రి హోదాలో ఉన్న సుజనా చౌదరిపై చర్యలకు వెనుకాడిన సీబీఐ, ఇతర దర్యాప్తు సంస్దలు. 2018లో ఎన్డీయే నుంచి టీడీపీ బయటికి రావడంతో సుజనాపై కేసుల విషయంలో జోరు పెంచాయి. ఆ తర్వాత వరుసగా సుజనా గ్రూపు సంస్ధల్లో సోదాలు కూడా జరిగాయి. 2019 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ పరాజయం తర్వాత సుజనా మరో ముగ్గురు ఎంపీలు సీఎం రమేష్, టీజీ వెంకటేష్, గరికపాటి మోహనరావుతో కలిసి బీజేపీలో చేరిపోయారు. రుణాల ఎగవేత ఆరోపణల నేపథ్యంలో ఏ క్షణాన్నైనా సుజనాను అరెస్టు చేయవచ్చన్న ప్రచారం కూడా అప్పట్లో ఉండేది. వాటి నుంచి బయటపడేందుకే సుజనా బీజేపీని ఆశ్రయించారని అంతా భావించారు. కానీ తాజా వేలం ప్రకటనలను బట్టి చూస్తే ఆ పరిస్ధితి లేదని అర్ధమవుతోంది. సుజనా బీజేపీ ఎంపీ అయినప్పటికీ బ్యాంకులు మాత్రం ఆర్ధిక మంత్రిత్వశాఖ మార్గదర్శకాలు, ఒత్తిడి మేరకు కఠినంగా వ్యవహరిస్తున్నట్లు దీన్ని బట్టి తెలుస్తోంది.

అమరావతిలో హైటెన్షన్.. డ్రోన్ కెమెరాలతో నిఘా.. రైతుల ఆందోళన!!

రాజధానిని తరలించవద్దని డిమాండ్ చేస్తూ గత రెండు నెలలుగా అమరావతి రైతులు ఆందోళనలు చేస్తున్న సంగతి తెలిసిందే. తమ ప్రాణాలు పోయినా పర్లేదు కానీ, రాజధాని తరలింపుకు ఒప్పుకోబోమని.. రాజధాని ప్రాంతంలో రైతులు, మహిళలు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడుతున్నారు.  రోజురోజుకి ఆ ఆందోళనలు తీవ్రతరమవుతున్నాయి. ఇదిలా ఉంటే, ఈరోజు మందడం గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రైతులు ఆందోళన చేస్తున్న ప్రాంతాన్ని డ్రోన్ కెమెరాలతో పోలీసులు చిత్రీకరించారు. ఈ నేపథ్యంలో, పోలీసుల తీరుపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తామేమి ఆర్ధిక నేరగాళ్లం కాదని, అరాచకం సృష్టించే వాళ్ళం కాదని ఎందుకు డ్రోన్ లతో చిత్రీకరిస్తున్నారని మండిపడ్డారు. ఈ క్రమంలో రైతులకు, పోలీసులకు మధ్య తోపులాట చేసుకుంది. దీంతో మందడంలో పరిస్థితులు ఆందోళనకరంగా మారాయి.

9 నెలల్లో జగన్ సర్కార్ 3 పనులు కరెక్ట్ గా చేసింది: లోకేష్

ఏపీ సీఎం వైఎస్ జగన్ పైన, వైసీపీ పైన టీడీపీ నేత నారా లోకేష్ విమర్శలు గుప్పించారు. మేం ప్రజా చైతన్య యాత్ర చేస్తే వైసీపీకి భయమెందుకు? అని ప్రశ్నించారు. ప్రజా వేదిక కూల్చివేతతో జగన్ తుగ్లక్ పాలన ప్రారంభం అయ్యిందని విమర్శించారు. కేవలం తొమ్మిది నెలల్లోనే రాష్ట్రాన్ని సర్వ నాశనం చేసారని మండిపడ్డారు. అభివృద్ధి, సంక్షేమాన్ని గాలికొదిలేశారని అన్నారు. తొమ్మిది నెలల్లో ప్రజల్ని ముంచే కార్యక్రమాలు తప్ప జగన్ సర్కార్ చేసిన ఒక్క మంచి కార్యక్రమం లేదని విమర్శించారు.  జగన్‌ అధికారంలోకి వచ్చాక మూడే మూడు పనులు చేశారన్నారు. అవి ఏంటంటే.. రంగులు వేయడం, దాడులు చేయడం, హామీలపై వెనక్కి పోవడం.. అని ఎద్దేవా చేశారు. ఏపీలో ఈ మూడే జరుగుతున్నాయని విమర్శించారు. జగన్‌ వల్ల ఏపీ బ్రాండ్ వ్యాల్యూ పోయిందని ఆరోపించారు. 9 నెలల్లో రాష్ట్రం 20 ఏళ్లు వెనక్కి పోయిందని.. జనం గగ్గోలు పెడుతున్నారన్నారు. జగన్‌ ముఖ్యమంత్రై 9 నెలలైంది.. కానీ ఒక్క ప్రెస్‌కాన్ఫరెన్స్‌ పెట్టే ధైర్యం కూడా లేదని లోకేష్‌ విమర్శించారు. ‘‘నీ కేసులు సంగతేంటి?.. కేంద్రం నిధుల సంగతేంటి?.. హోదా ఏమైంది?.. రేషన్‌కార్డులు, పెన్షన్లు ఎందుకు పీకేస్తున్నారు?.. ఇలాంటి ప్రశ్నలు ఎదురవుతాయని జగన్‌ భయపడుతున్నారు అని లోకేష్ అన్నారు.

నారా వారి ఆస్తులు.. తాత కన్నా మనవడి ఆస్తులే ఎక్కువ!!

మంగళగిరి తెలుగుదేశం పార్టీ ఆఫీసులో కుటుంబ సభ్యలు ఆస్తుల వివరాలను నారా లోకేష్‌ ప్రకటించారు. గత తొమ్మిది సంవత్సరాల నుంచి తాము ఆస్తులను ప్రకటిస్తున్నామని అన్నారు. చంద్రబాబు ఆస్తులు గత ఏడాదితో పోలిస్తే రూ.85 లక్షలు పెరిగాయని తెలిపారు. చంద్రబాబు నికర ఆస్తి 3.87 కోట్లు, అప్పులు రూ.5.13 కోట్లు ఉన్నాయని తెలియజేసారు. ఇక తన తల్లి భువనేశ్వరి ఆస్తి రూ.53 కోట్ల నుంచి రూ.50 కోట్లకు తగ్గిందని చెప్పారు. తన (నారా లోకేష్) పేరు మీదున్న ఆస్తి 24 కోట్లు.. బ్రాహ్మణి ఆస్తి 15 కోట్ల 68 లక్షలు.. దేవాన్ష్‌ ఆస్తి 19 కోట్ల 42 లక్షలుగా ఉన్నాయని తెలిపారు. నారా లోకేష్ చెప్పిన దాని ప్రకారం.. చంద్రబాబు కుటుంబం మొత్తం ఆస్తులు రూ.119.42 కోట్లు. మొత్తం అప్పులు రూ.26.04 కోట్లు. మొత్తంగా చూస్తే ఆస్తుల్లో నుంచి అప్పులు మినహాయించగా, వారి నికర ఆస్తుల విలువ రూ.93.38 కోట్లు. దీనికి నిర్వాణ హోల్డింగ్స్ సంస్థ ఆస్తులు అదనం.  

ఆ లేఖ నన్ను కదిలించింది.. అందుకే రూ.కోటి ఇచ్చా: పవన్

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఢిల్లీలో పర్యటిస్తున్నారు. ఈరోజు ఉదయం ఢిల్లీ వెళ్లిన పవన్.. ఆర్కేపురంలోని కేంద్రీయ సైనిక్ బోర్డు కార్యాలయాన్ని సందర్శించి, అమర సైనిక కుటుంబాల సంక్షేమానికి రూ.కోటి విరాళాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆర్మ్డ్‌ ఫోర్స్‌ బ్యాడ్జీతో పవన్‌ను సైనిక అధికారులు గౌరవించారు.  అనంతరం పవన్ మీడియాతో మాట్లాడుతూ... సైనిక్ బోర్డుకు సహాయం అందించాలంటూ బ్రిగేడియర్‌ వీరేంద్ర కుమార్ రాసిన లేఖ తనను కదిలించిందని తెలిపారు. అందుకే తన వంతు సహాయంగా కోటి రూపాయలు అందించానని చెప్పారు. ఇటీవల కొన్నిసార్లు ఢిల్లీకి వచ్చినప్పుడు ఆ మొత్తాన్ని ఇద్దామనుకున్నాను. అయితే అప్పుడు కుదరలేదు అన్నారు. దేశాన్ని, సైనికులను ప్రేమించే ప్రతి ఒక్కరూ సైనిక్ బోర్డ్‌కి సహాయం చేయాలని పిలుపునిచ్చారు. మన సాయం సైనిక కుటుంబాలకు ఎంతో కొంత ఉపయోగపడుతుంది అని పవన్‌ తెలిపారు.

గుంటూరు వైసీపీలో భగ్గుమన్న విభేదాలు.. మరో ఎంపీ, ఎమ్మెల్యే మధ్య వర్గపోరు

గుంటూరు జిల్లా వైసీపీలో విభేదాలు మరోసారి రచ్చకెక్కాయి. జిల్లాల్లో ఇప్పటికే ఉప్పు నిప్పుగా ఉంటున్న నరసరావుపేట ఎంపీ లావు కృష్ణదేవరాయలు, చిలకలూరిపేట ఎమ్మెల్యే విడదల రజనీ అనుచరులు ఒక్కసారిగా బాహాబాహీకి దిగారు. దీంతో పోలీసులు వారికి సర్దిచెప్పి ఎంపీని అక్కడి నుంచి పంపించారు. మహాశివరాత్రి సందర్భంగా ఎంపీ కృష్ణదేవరాయలు చిలకలూరి పేటలోని పురుషోత్తపట్నంలో జరిగిన ఓ కార్యక్రమానికి ఎమ్మెల్యే రజనీకి సమాచారం ఇవ్వకుండా రావడమే దీనికి అసలు కారణం. గుంటూరు జిల్లాలో వైసీపీ తరఫున గెలిచిన నేతలంతా దాదాపు కొత్తవారే కావడంతో వారి మధ్య సఖ్యత కుదరడం లేదు. గతంలో ఇసుక అక్రమ తవ్వకాలు, తరలింపు నేపథ్యంలో బాపట్ల ఎంపీ నందిగం సురేష్ వైఖరిని నిరసిస్తూ తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి ఆందోళనకు దిగారు. ఈ వివాదం సీఎం జగన్ వద్దకు వెళ్లడం, ఇద్దరినీ పిలిపించి మాట్లాడటంతో పరిస్ధితి సద్దుమణిగింది. తాజాగా బుధవారం రాత్రి చిలకలూరిపేటలోని పురుషోత్తపట్నంలో మహాశివరాత్రి సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రభ వద్దకు నరసరావుపేట ఎంపీ లావు కృష్ణదేవరాయలు వచ్చారు. స్ధానిక నేతల ఆహ్వానం మేరకు అక్కడికి వచ్చిన ఎంపీ కృష్ణదేవరాయలను స్ధానిక ఎమ్మెల్యే విడదల రజనీ అనుచరులు అడ్డుకున్నారు. ఇద్దరూ అధికార పార్టీ నేతలు కావడం, గతంలోనూ వీరిద్దరి మధ్య ప్రోటోకాల్ విషయంలో పలు వివాదాలు తలెత్తడం జరిగింది. దీంతో ఒకరంటే మరొకరికి పడటం లేదు. స్ధానికంగా ఉన్న సంఘమిత్ర ఇంటికి వచ్చిన ఎంపీ కారును ఎమ్మెల్యే వర్గీయులు అడ్డగించారు. ఎంపీ అనుచరులు కూడా దీన్ని వ్యతిరేకిస్తూ వాగ్వాదానికి దిగారు. ఇది కాస్తా ఇరువర్గాల మధ్య ఘర్షణకు దారితీసింది. తోపులాటలో ఓ వ్యక్తి తలకు గాయాలు కూడా అయ్యాయి. పరిస్ధితి ముదరడంతో పోలీసులు జోక్యం చేసుకుని ఎంపీ కృష్ణదేవరాయలను అక్కడి నుంచి పంపించేశారు. దీంతో పరిస్ధితి సద్దుమణిగింది. స్ధానిక ఎమ్మెల్యేకు సమాచారం ఇవ్వకుండా నియోజకవర్గంలో ఎలా పర్యటిస్తారనేది ఎమ్మెల్యే రజనీ అనుచరుల వాదన కాగా... ఎంపీగా తమ నియోజకవర్గం పరిధిలో ఎక్కడైనా పర్యటించే హక్కు తనకుందనేది ఎంపీ కృష్ణదేవరాయలు వాదన. అయితే వీరిద్దరి మధ్య గతంలో ఉన్న ఆధిపత్య పోరు కారణంగానే తాజా వివాదం తలెత్తిందని జిల్లా వైసీపీ నేతలు చెబుతున్నారు. వాస్తవానికి విడదల రజనీకి వైసీపీ అధిష్టానం పెద్దల ఆశీస్సులున్నాయి. గతంలో వైసీపీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్న మర్రి రాజశేఖర్ ను కాదని గత ఎన్నికల్లో జగన్ రజనీకి టికెట్ కేటాయించారు. అప్పటికే నియోజకవర్గంలో తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటున్న ప్రత్తిపాటి పుల్లారావుపై ఆమె సునాయాసంగానే విజయం సాధించారు. ఆర్ధికంగా బలమైన నేత కావడంతో పాటు బీసీ సామాజికవర్గానికి చెందిన మహిళ కావడం ఆమెకు కలిసివచ్చాయి. అయితే తనకున్న అనుకూలతలను వాడుకుండూ ఎంపీ లావు కృష్ణదేవరాయలను తన నియోజకవర్గంలో అడుగుపెట్టనీయకుండా రజనీ కొంతకాలంగా అడ్డుకుంటున్నారు. ఈ వ్యవహారంపై ఆయన అధిష్టానం పెద్దలకు గతంలో ఫిర్యాదు కూడా చేసినట్లు తెలుస్తోంది. అయినా వారి నుంచి స్పందన రాకపోవడంతో తన పని తాను చేసుకుపోవాలని భావిస్తున్న ఎంపీ లావు యథావిథిగా నియోజకవర్గాల్లో పర్యటిస్తున్నారు. అదే కోవలో చిలకలూరిపేట రావడంతో వివాదం తలెత్తింది. తాజా వివాదంపై ఇరువర్గాలు వైసీపీ పెద్దలకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది.