విశాఖ ఘటనపై హైకోర్టు సీరియస్.. వాళ్లకో రూల్, వీళ్లకో రూలా?

టీడీపీ అధినేత చంద్రబాబు ఉత్తరాంధ్ర పర్యటన నేపథ్యంలో నిన్న విశాఖ ఎయిర్‌పోర్టులో ఉద్రిక్తత నెలకొన్న సంగతి తెలిసిందే. చంద్రబాబు కాన్వాయ్ ని వైసీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. ఆయన కాన్వాయ్ పైకి కోడిగుడ్లు, టొమాటోలు, చెప్పులు విసిరారు. పోలీసులు వారిని నిలువరించలేక చంద్రబాబుని అదుపులోకి తీసుకొని అక్కడి నుంచి వెనక్కి పంపించారు. అనుమతి ఇచ్చి ఇలా అడ్డుకోవడం ఏంటని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేసారు. మరోవైపు, ఎయిర్ పోర్ట్ వ్యవహారంపై హైకోర్టులో లంచ్‌మోషన్ పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్‌ను విచారించిన హైకోర్టు పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. అధికారపక్షానికి ఒక రూల్‌, ప్రతిపక్షానికి మరో రూల్‌ ఉంటుందా?.. చట్టం ముందు అందరూ సమానమే కదా? అని ప్రశ్నించింది. అనుమతి ఇచ్చిన తర్వాత 151 కింద నోటీసులు ఎందుకు ఇచ్చారని క్వశ్చన్ చేసింది. ముందస్తు అరెస్ట్‌ చేయాల్సింది దాడి చేయడానికి వచ్చిన వాళ్లని కదా?.. మరి, ఆందోళనకారులపై ఎందుకు చర్యలు తీసుకోలేదు?.. ఎయిర్‌పోర్టుకు రాకుండా వాళ్లని ఎందుకు నిలువరించలేకపోయారు? అని హైకోర్టు నిలదీసింది. దీనిపై వచ్చే నెల 2న కౌంటర్‌ దాఖలు చేయాలని డీజీపీ, విశాఖ సీపీని ఆదేశించింది. అదే రోజే విచారణ చేస్తామని హైకోర్టు తెలిపింది.

సీఎం జగన్ ఫ్రెండ్ ని బలి తీసుకున్న అభిమానం!!

ఏపీ సీఎం వైఎస్ జగన్ పై తమకున్న అభిమానాన్ని చాటుకోవాలన్న తాపత్రయంతో ఇద్దరు ప్రాణాలు పోగొట్టుకున్న ఘటన విశాఖ జిల్లాలోని అనకాపల్లిలో జరిగింది. పట్టణ పరిధిలో నివాసం ఉంటున్న ఏడిద జగదీష్ (39), ముప్పిడి శ్రీను (42) వైసీపీ అభిమానులు. జగదీష్, తన చిన్న వయసులో హైదరాబాద్ లోని పబ్లిక్ స్కూల్ లో వైఎస్ జగన్ తో కలిసి చదువుకున్నాడు. ఆ స్నేహమే పెద్దయ్యాక జగన్ మీద అభిమానంగా మారింది. అయితే ఆ అభిమానమే ఇప్పుడు ఆయనను బలి తీసుకుంది. జగన్ తో తీయించుకున్న ఫోటోలు, జగన్ పాదయాత్రలో పాల్గొన్న ఫొటోలతో కలిపి ఓ భారీ ఫ్లెక్సీని తయారు చేయించాడు. దానిని తన ఇంటి ముందు కట్టేందుకు శ్రీనుతో కలిసి జగదీష్ డాబా పైకి ఎక్కాడు. అయితే, ఆ సమయంలో గాలి అధికంగా వీచడంతో, ఫ్లెక్సీ ఒక్కసారిగా ఇంటి ముందు ఉన్న విద్యుత్ తీగలపై పడింది. దీంతో ఫ్లెక్సీని పట్టుకుని ఉన్న ఇద్దరూ షాక్ కు గురై మరణించారు.

మోడీ, బాబు వంటి వీఐపీల సెక్యూరిటీ చేతిలో బ్రీఫ్ కేస్.. దానిలో ఏముందో తెలిస్తే షాక్!

జెడ్ లేదా జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఉండే ప్రముఖులను ఎప్పుడైనా గమనించారా?. ప్రధానిని మొదలుకొని ప్రత్యేక రక్షణ అవసరమైన పలువురు ప్రముఖులకు ఈ సెక్యూరిటీ ఉంటుంది. ఈ ప్రముఖుల చుట్టూ సెక్యూరిటీ వారిని సరిగ్గా గమనిస్తే.. ఒకరిద్దరి చేతుల్లో బ్రీఫ్ కేస్ లు కనిపిస్తాయి. ఆ బ్రీఫ్ కేస్ లో ఏముంటదని ఎప్పుడైనా ఆలోచించారా?.. అబ్బే ఏముంది ఆ ప్రముఖులకు సంబంధించిన ముఖ్యమైన ఫైల్స్ కానీ, విలువైన వస్తువులు కానీ ఉండి ఉంటాయి అంటారా?.. అలా అనుకుంటే మీరు పప్పు, సాంబార్, రసం ఇలా అన్నింట్లో కాలేసినట్టే. అది బ్రీఫ్ కేస్ లా కనిపిస్తుంది.. కానీ బ్రీఫ్ కేస్ కాదు. బ్రీఫ్ కేస్ లా కనిపించే బుల్లెట్ ప్రూఫ్ జాకెట్. బ్రీఫ్ కేస్ ఏంటి? బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ ఏంటి? అని షాక్ అవుతున్నారా.. నిజం.. ఆ బ్రీఫ్ కేస్ ఓ పోర్టబుల్ బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ లాంటిది. అది ఆ బ్రీఫ్ కేస్ ఓపెన్ చేస్తే తెలుస్తుంది. ఇది జెడ్ లేదా జెడ్ ప్లస్ రక్షణ కల్పించే అందరికీ ఉంటుంది. ఒక వేళ సదరు వీఐపీ మీద దాడి జరిగితే బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ లా పనిచేస్తుంది. దాడి జరిగినప్పుడే కాదు, సదరు సెక్యూరిటీ అధికారికి దాడి జరగవచ్చేమో అనే అనుమానం వచ్చినా ఆ బ్రీఫ్ కేస్ ఓపెన్ చేయవచ్చు. ఇది ప్రముఖులకు తక్షణ మరియు తాత్కాలిక రక్షణ కల్పించే కవచంగా పనిచేస్తుంది. ప్రధాని మోడీ పక్కన ఉండే సెక్యూరిటీ చేతిలో బ్రీఫ్ కేస్ ఉంటుంది. అది పోర్టబుల్ బుల్లెట్ ప్రూఫ్ జాకెట్టే. అంతెందుకు టీడీపీ అధినేత చంద్రబాబు  శుక్రవారం విశాఖ పర్యటనకు వెళ్లగా అక్కడ ఉద్రిక్తత నెలకొంది కదా. విశాఖ విమానాశ్రయంలో వైసీపీ కార్యకర్తలు.. చంద్రబాబు కాన్వాయ్ ని అడ్డుకున్నారు. కోడిగుడ్లు, చెప్పులు విసురుతూ కాన్వాయ్ మీదకు దూసుకొచ్చే ప్రయత్నం చేసారు. ఆ సమయంలో సెక్యూరిటీ సిబ్బంది.. వారి చేతిలో ఉన్న బ్రీఫ్ కేస్ ని ఓపెన్ చేసి రక్షణ కవచంగా ఉపయోగించారు. అలా ఆ  బ్రీఫ్ కేస్ ప్రముఖులకు తక్షణ మరియు తాత్కాలిక రక్షణ కల్పించే కవచంగా ఉపయోగపడుతుంది.

సీఎం పోలవరం పర్యటనలో రచ్చ.. పోలీసులు వర్సెస్ వైసీపీ నేతలు!!

ఏపీ సీఎం వైఎస్ జగన్ పోలవరం ప్రాజెక్టు పర్యటనలో భాగంగా.. ప్రాజెక్ట్ ప్రాంతంలో ఏరియల్‌ సర్వే నిర్వహించారు. సీఎం హోదాలో జగన్ పోలవరానికి వెళ్లడం ఇది రెండోసారి. పోలవరం ప్రాజెక్టు స్పిల్ వే వద్ద ఫోటో ఎగ్జిబిషన్‌ను తిలకించిన జగన్.. పోలవరం పురోగతి పనులను పరిశీలించి అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు.  ఇదిలా ఉంటే.. పోలవరం ప్రాజెక్టు హెలిపాడ్ వద్ద పోలీసులకు- వైసీపీ నేతలకు మధ్య వాగ్వాదం జరిగింది. సీఎం జగన్ దగ్గరకు వెళ్ళనివ్వకుండా పోలీసులు అడ్డుకోవడంతో కొందరు వైసీపీ నేతలు తీవ్ర ఆగ్రహానికి లోనయ్యారట. నువ్వెంత అంటే నువ్వెంత అంటూ వాగ్వాదానికి దిగినట్టు తెలుస్తోంది. అయితే అక్కడే ఉన్న మరికొందరు నేతలు రంగంలోకి దిగి సర్ది చెప్పడంతో వివాదం సద్దుమణిగిందని సమాచారం. కాగా.. ఇటీవలే జగన్ కర్నూలు జిల్లా పర్యటనలో భాగంగా యువనేత బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి- సీఎం సిబ్బంది మధ్య జరిగిన వాగ్వాదం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఆ వివాదం మరువక ముందే తాజాగా మరోసారి ఇలాంటి ఘటన జరగడం చర్చనీయాంశమైంది.

విప్లవాత్మక చట్టం దిశగా కేసీఆర్ అడుగులు... మొత్తం వ్యవస్థ సమూల ప్రక్షాళనే లక్ష్యం

ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా పాలనా సంస్కరణలు చేపడుతోన్న ముఖ్యమంత్రి కేసీఆర్‌, రెవెన్యూ వ్యవస్థ సమూల ప్రక్షాళనకు కసరత్తు చేస్తున్నారు. రెవెన్యూ వ్యవస్థ ప్రక్షాళన, కొత్త రెవెన్యూ చట్టం రూపకల్పనపై గట్టి పట్టుదలతో ఉన్న కేసీఆర్, కొద్దిరోజులుగా ఉన్నతాధికారులతో చర్చిస్తున్నారు. ప్రజలకు, రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా, పూర్తి పారదర్శకంగా ఉండే నూతన రెవెన్యూ చట్టం రూపకల్పనపై తీవ్రంగా కసరత్తు చేస్తున్నారు. దాదాపు 85నుంచి 90శాతం భూములకు ఎలాంటి వివాదాల్లేవని భూరికార్డుల ప్రక్షాళనతో తేలినప్పటికినీ, రెవెన్యూ యంత్రాంగం రైతులను ఇబ్బందులకు గురిచేస్తోందన్న అభిప్రాయంతో సీఎం కేసీఆర్ ఉన్నారు. ఎలాంటి సమస్యల్లేని భూముల విషయంలోనూ ప్రజలకు నరకం చూపిస్తున్నారన్న ఆరోపణలతో, మొత్తం వ్యవస్థనే సమూలంగా మార్చేసేందుకు సిద్ధమవుతున్నారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి అధికారులకు విచక్షణాధికారం లేకుండా చేయడం లేదా నామమాత్రం చేస్తూ కొత్త చట్టం రూపొందించాలని భావిస్తున్నారు. బ్యాంకింగ్ లావాదేవీల కోసం ఉపయోగించే కోర్ బ్యాంకింగ్ విధానాన్నే భూముల లావాదేవీలకు కూడా అమలు చేయాలని భావిస్తున్నారు. రుణాల మంజూరు, మార్ట్ గేజ్ కోసం రైతుల పాస్‌‌బుక్స్‌ ఆధారంగా ఎలక్ట్రానిక్ భూరికార్డులను పరిగణలోకి తీసుకోవాలని గతంలోనే చట్ట సవరణ చేసినా, అది పూర్తిస్థాయిలో అమలుకాకపోవడంతో... కొత్త చట్టంలో సంబంధిత అంశాలను విధిగా పేర్కొనేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. బ్యాంకు లావాదేవీల తరహాలోనే భూలావాదేవీలు నిర్వహించేలా సాంకేతిక పరిజ్ఞానాన్ని తయారు చేయాలని నిర్ణయించారు. రెవెన్యూ యంత్రాంగానికి విచక్షణాధికారాలు ఉండటం వల్లే అవినీతికి ఆస్కారం ఏర్పడిందని భావిస్తోన్న కేసీఆర్... ఏమాత్రం అవినీతి అక్రమాలకు ఆస్కారం లేకుండా కొత్త చట్టాన్ని తేవాలనుకుంటున్నారు. కొత్త రెవెన్యూ చట్టంలో భూములు, ఆస్తులపై సర్వాధికారం యజమానులకు ఉంటుంది. వీటి రిజిస్ట్రేషన్లను స్వతంత్ర వ్యవస్థ దగ్గర చేసుకుంటే టైటిల్‌ డీడ్‌ జారీ చేస్తారు. దానికన్నా ముందే భూములు పొజీషన్‌లో ఉన్నాయా? లేవా? అన్నది పరిశీలిస్తారు. రిజిస్ట్రేషన్‌కు ముందే అభ్యంతరాలు స్వీకరిస్తారు. భూములు రిజిస్ట్రేషన్‌ అయినా తర్వాత అవి పరాధీనం అయినా, లేక ఆ భూములు తమవేనని ఎవరైనా అర్జీలు సమర్పించినా విచారణ జరుపుతారు. వారి వాదన నిజమేనని తేలితే వారికి నష్టపరిహారం చెల్లిస్తారు. కొత్త చట్టం ప్రకారం భూముల రిజిస్ట్రేషన్‌, మ్యుటేషన్‌పై సబ్‌ రిజిస్ట్రార్‌, తహశీల్దార్లకు అధికారం ఉండదు. ప్రభుత్వం ప్రతిపాదించే స్వతంత్ర వ్యవస్థ చూసుకుంటుంది. భూములు రిజిస్ట్రేషన్‌ చేస్తున్నప్పుడు ఆ భూమికి రక్షణ కల్పించడానికి వీలుగా ప్రత్యేక రుసుమును ప్రభుత్వం ప్రతిపాదించే అవకాశాలున్నాయి. ఆ భూమికి వసూలు చేసే నిధిని బీమా రూపంలో జమ చేస్తుంది. స్వతంత్ర వ్యవస్థ ఒక్కసారి రిజిస్ట్రేషన్‌ చేసి, రికార్డుల్లో మ్యుటేషన్‌ చేస్తే ఆ భూమికి కంక్లూజివ్‌ టైటిల్‌ దక్కుతుంది. ఇలా, అనేక మార్పులు చేర్పులతో, కొత్త రెవెన్యూ చట్టం రూపుదిద్దుకుంటున్నట్లు తెలుస్తోంది. కొత్త రెవెన్యూ చట్టానికి సంబంధించిన బిల్లును ఈ బడ్జెట్ సమావేశాల్లోనే ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతోన్న కేసీఆర్ ప్రభుత్వం.... విప్లవాత్మక నిర్ణయాలు తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది.

పోలవరం పరిశీలనకు జగన్... 2021 లక్ష్యంగా వర్క్ యాక్షన్...

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ఇవాళ పోలవరంలో పర్యటించనున్నారు. పోలవరంలో ఏరియల్ సర్వే నిర్వహించి, గంటన్నరపాటు ప్రాజెక్టును పరిశీలించనున్నారు. క్షేత్రస్థాయిలో పనులు జరుగుతున్న తీరును సీఎం జగన్‌ స్వయంగా తెలుసుకోనున్నారు. 2021 చివరి నాటికల్లా ప్రాజెక్టును పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకోవడంతో... పనుల వేగవంతానికి దిశానిర్దేశం చేయనున్నారు. స్పిల్‌వే 18వ గేటు దగ్గర ఏర్పాటు చేసిన పోలవరం పనుల ఫొటో ఎగ్జిబిషన్‌ను తిలకిస్తారు. అనంతరం, హిల్‌ వ్యూ-2పైకి వెళ్లి స్పిల్‌వే కాంక్రీట్ పనులను పరిశీలిస్తారు. అలాగే, గోదావరి నది ఒడ్డుకు వెళ్లి ఎగువ కాఫర్ డ్యామ్‌ను చూస్తారు. అక్కడ్నుంచి పోలవరం క్యాంపు కార్యాలయానికి చేరుకుంటారు. పోలవరం ప్రాజెక్టు పరిశీలన తర్వాత, ఉభయ గోదావరి జిల్లాల కలెక్టర్లు, ఇరిగేషన్ అధికారులతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సమావేశంకానున్నారు. పనులు జరుగుతున్న తీరు, నిర్వాసితుల పునరావాసంపై ఉన్నతస్థాయి సమీక్షిస్తారు. ముఖ్యంగా పరిహారం, పనుల వేగవంతంగా అధికారులకు సీఎం జగన్ దిశానిర్దేశం చేయనున్నారు. ఇక, ఈ సమావేశంలోనే నిర్వాసితులకు కల్పించే పునరావాసంపై అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు.

అధికారంలో ఉంటే ఒకలా... ప్రతిపక్షంలో ఉంటే మరోలా... వైజాగ్ ఎపిసోడ్ నీతి ఏంటి?

రాజకీయాల్లో ఓడలు బళ్లు అవుతాయి. బళ్లు ఓడలవుతాయి. ప్రజాస్వామ్యంలో ఇది సాధారణమే. ప్రస్తుతం దేశంలోనూ, అనేక రాష్ట్రాల్లోనూ ఇదే జరుగుతోంది. నిన్నమొన్నటివరకు దేశంలోనూ, ఆయా రాష్ట్రాల్లో చక్రం తిప్పినవారంతా, అనామకులుగా మారిపోయారు. దశాబ్దాల తరబడి రాజ్యాన్ని ఏలినవారు, ఇప్పుడు సైడైపోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. తెలుగు రాష్ట్రాల్లో పలువురు ఉద్దండుల పరిస్థితి ఇప్పుడలాగే కనిపిస్తోంది. ఎంతోమంది ముఖ్యనేతలు తీవ్ర గడ్డుపరిస్థితులను ఎదుర్కొంటున్నారు. మళ్లీ వాళ్లకు మంచి రోజులు వస్తాయని మాత్రం కచ్చితంగా చెప్పలేని పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండింటిలోనూ ఊహించని రాజకీయ మార్పులు జరగడంతో ఓడలు బళ్లు... బళ్లు ఓడలయ్యాయి.  అయితే, అధికారంలో ఉండగా ఒకలా, ప్రతిపక్షంలా ఉంటే మరోలా వ్యవహరించడం సర్వసాధారణంగా కనిపిస్తుంది. విపక్ష నేతగా ఉన్న సందర్భాల్లో నేతలు వ్యవహరించే తీరు ఒక్కోసారి సాధారణ ప్రజాస్వామిక సూత్రాలకు విరుద్ధంగా ఉంటుంది. నేటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మూడేళ్ళ క్రితం విపక్ష నేతగా ఉన్నారు. అప్పట్లో ఆయన ప్రత్యేక హోదా కోసం పట్టుదలతో ఉన్నారు. క్యాండిల్ ర్యాలీ నిర్వహించేందుకు వైజాగ్ పర్యటనకు వెళ్లారు. అప్పటికే అక్కడ సీఐఐ పార్ట్ నర్ షిప్ సమ్మిట్ జరుగుతోంది. ఆ నేపథ్యంలో క్యాండిల్ ర్యాలీకి అనుమతిని ప్రభుత్వం నిరాకరించింది. అయినా కూడా జగన్ వైజాగ్ చేరుకున్నారు. అక్కడి నుంచి నగరంలోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. అప్పట్లో పోలీసులు ఆయనను అడ్డుకున్నారు. తనను అడ్డుకోవడంపై అప్పట్లో విపక్ష నేతగా ఉన్న జగన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.  ఇక, ఇప్పడు ఏపీలో రాజధాని రగడ కొనసాగుతోంది. అందులో భాగంగా చంద్రబాబు చేపట్టిన వైజాగ్ యాత్రలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఇందులో పోలీసులను తప్పు పట్టాల్సింది ఏమీ లేదు. అయితే, ఇలాంటి సమయంలో విపక్ష నాయకులు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటారు. ఎలాగైనా పోలీసు వలయాన్ని ఛేదించుకోవాలని తాము అనుకున్నది చేయాలని చూస్తుంటారు. పొలిటికల్ మైలేజ్ పొందాలని ప్రయత్నిస్తుంటారు. చంద్రబాబు వైజాగ్ టూర్లోనూ అదే జరిగిందనే మాట వినిపిస్తోంది. నాయకులు విపక్షంలో ఉన్నప్పుడు పొలిటికల్ మైలేజ్ కోసం ప్రయత్నించడంలో తప్పు లేదు. కాకపోతే...ఆ ప్రయత్నాలు సమాజంలో ఉద్రిక్తతలు పెంచేవిగా మాత్రం ఉండకూడదంటున్నారు. అదే సమయంలో అధికారంలో ఉన్న నాయకులు ప్రజాస్వామ్యంలో విపక్షాలకు ఉండే ప్రాధాన్యాన్ని గుర్తించాలని సూచిస్తున్నారు. అధికారపక్షం, విపక్షం....రెండూ ప్రజాస్వామ్యానికి రెండు చక్రాల్లాంటివని, ఏ ఒక్కటి సరిగా లేకున్నా ప్రజాస్వామ్యం కుంటుపడుతుందని గుర్తుచేస్తున్నారు.

మనసున్న మారాజు కేసీఆర్.. సలీమ్ ని చూసి చలించిన సీఎం...

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మానవత్వం చాటుకున్నారు. మిట్ట మధ్యాహ్నం ఎర్రటి ఎండలో... చేతిలో దరఖాస్తు పట్టుకొని రోడ్డుపక్కన నిలబడిన వృద్ధుడిని చూసి... సీఎం కేసీఆర్‌ చలించిపోయారు. సెక్యూరిటీని సైతం పక్కనబెట్టి, తన కాన్వాయ్‌ను ఆపడమే కాకుండా, కారు దిగి, ఆ వృద్ధుడి దగ్గరకు వెళ్లారు. అతను చెప్పిన సమస్యలను ఓపికగా విని, అప్పటికప్పుడు పరిష్కారానికి అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి కేసీఆర్, హైదరాబాద్ టోలిచౌకిలో ఓ ప్రైవేట్ కార్యక్రమానికి హాజరై, తిరిగి వెళ్తుండగా, చేతిలో దరఖాస్తు పట్టుకుని నిల్చున్న వృద్ధుడ్ని చూసి తన కాన్వాయ్‌ను ఆపారు. కారు దిగిన కేసీఆర్‌, ఆ వృద్ధుడి దగ్గరకెళ్లి వివరాలు అడిగారు. తన పేరు సలీమ్ అంటూ పరిచయం చేసుకున్న వృద్ధుడు... గతంలో తాను డ్రైవర్‌గా పనిచేసేవాడినని, తొమ్మిదేళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్నానని, నాలుగేళ్ల క్రితం భవనం పైనుంచి పడటంతో కాలు విరిగిందని ముఖ్యమంత్రికి వివరించాడు. తన కొడుకు ఆరోగ్యం కూడా బాగా లేదని, ఉండటానికి ఇల్లు కూడా లేదంటూ తన గోడును కేసీఆర్‌కు చెప్పుకున్న సలీమ్‌.... తగిన సాయం చేయాలని విన్నవించుకున్నాడు. మహ్మద్ సలీమ్‌ బాధను అర్ధం చేసుకున్న సీఎం కేసీఆర్‌, సానుకూలంగా స్పందించారు. సలీమ్‌కు వికలాంగుల పెన్షన్‌తోపాటు డబుల్ బెడ్రూమ్ ఇల్లు మంజూరు చేయాలంటూ హైదరాబాద్‌ కలెక్టర్ శ్వేతామహంతిని ఆదేశించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో, టోలిచౌకిలో నివాసముంటున్న సలీమ్ ఇంటికెళ్లిన హైదరాబాద్‌ కలెక్టర్ శ్వేతామహంతి... కుటుంబ వివరాలు తెలుసుకున్నారు. సలీమ్‌ వికలాంగుడని ధృవీకరించే సర్టిఫికెట్ ఉండటంతో అప్పటికప్పుడు పెన్షన్ మంజూరు చేశారు. అలాగే, జియాగూడలో డబుల్ బెడ్రూమ్‌ ఇల్లు కేటాయించారు. అంతేకాదు, ప్రభుత్వ ఖర్చులతో సలీమ్‌కు చికిత్స చేయించడంతోపాటు అనారోగ్యంతో బాధపడుతోన్న అతని కుమారునికి సీఎంఆర్ఎఫ్ కింద ఆర్ధిక సాయం అందిస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు. అయితే, తమ సమస్యలపై సానుకూలంగా స్పందించి, పరిష్కరించిన ముఖ్యమంత్రి కేసీఆర్ కు సలీమ్ కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలియజేశారు.

విశాఖ ఎయిర్ పోర్టులో నాడు-నేడు.. తమిళనాడు తరహాలో ప్రతీకార రాజకీయం...

అప్పుడు జగన్‌... ఇప్పుడు చంద్రబాబు... ప్లేస్‌ ఒకటే... లీడర్స్ డిఫరెంట్.... అప్పుడూ ఇప్పుడూ, విశాఖ విమానాశ్రయమే యుద్ధక్షేత్రమైంది... నాడు స్పెషల్ స్టేటస్ డిమాండ్‌‌ చేయడానికి వెళ్లిన జగన్‌ను చంద్రబాబు దిగ్బంధనం చేస్తే, ఇప్పుడు అదే ప్లేస్ లో చంద్రబాబును జగన్ ఉక్కిరిబిక్కిరి చేశారు. మొత్తానికి, ఊహించినట్టుగానే టీడీపీ అధినేత, ప్రతిపక్ష లీడర్ చంద్రబాబు విశాఖ పర్యటన యుద్ధక్షేత్రాన్ని తలపించింది. ఎయిర్‌పోర్ట్‌‌ నుంచి బయటకు రాగానే, భారీ సంఖ్యలో చేరిన జనం చంద్రబాబును అడ్డుకోవడం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. 2017, జనవరి 26, ప్రత్యేక హోదా కోసం విశాఖలో నిరసన చేయడానికి నాటి ప్రతిపక్ష నేత జగన్‌, ఎయిర్‌పోర్ట్‌లో దిగగానే పోలీసులు అడ్డుకున్నారు. ఎలాంటి పర్మిషన్‌ లేదని, ముందుకు కదలనివ్వలేదు. దాంతో ఎయిర్‌పోర్టు రన్‌వే పరిసరాల్లోనే దీక్షకు కూర్చున్నారు జగన్. రాష్ట్రానికి హోదా కోసం పోరాడుతుంటే, చంద్రబాబు ప్రభుత్వమే స్వయంగా అడ్డుకుందన్న అంశాన్ని, ప్రజల్లోకి తీసుకెళ్లి, ఎంతోకొంత సానుభూతి పొందడంలో సఫలమయ్యామన్నది వైసీపీ భావన. ఇప్పుడు చంద్రబాబు పర్యటన కూడా, ఆనాటి జగన్‌ పర్యటనను తలపించింది. తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. అయితే, రెండు ఘటనల్లోనూ చాలా తేడా ఉందంటున్నారు. నాడు హోదా కోసం అరెస్టయి, జగన్‌ సింపతీ పొందారని, కానీ చంద్రబాబు విశాఖను రాజధానిగా వ్యతిరేకించి, అదే వైజాగ్ లో అడుగుపెట్టారని, దాంతో సహజంగానే విశాఖలో వ్యతిరేకత వచ్చిందంటున్నారు. టీడీపీ ఆరోపిస్తున్నట్టు చంద్రబాబును అడ్డుకున్నవారిలో వైసీపీ కార్యకర్తలుండొచ్చు, కానీ క్యాపిటల్‌గా సాగర నగరాన్ని వ్యతిరేకించి, అదే సిటీలో అడుగుపెట్టడం బాబుకు ఇబ్బంది అవుతుందని ముందు నుంచీ ఊహించిందే. విశాఖ టీడీపీ ఎమ్మెల్యేలే, విశాఖ రాజధానిగా వ్యతిరేకించలేక సతమతమయ్యారు. వైజాగ్ నార్త్ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు సైతం క్యాపిటల్‌ ప్రతిపాదనను సమర్థించారు. అలా సమర్థించలేకపోతే, స్థానిక టీడీపీ నేతల ఉనికే ప్రమాదంలో పడుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో వైజాగ్‌లో అడుగుపెట్టిన చంద్రబాబుకు సహజంగానే వ్యతిరేకత వ్యక్తమైంది. ఎందుకంటే, మూడు రాజధానుల ప్రతిపాదనలతో, మూడు ప్రాంతాలూ, మూడు రకాలుగా స్పందిస్తున్నాయి. గుంటూరు, కృష్ణాలో చంద్రబాబుకు సింపతీ రావొచ్చేమో కానీ, ఉత్తరాంధ‌్ర, రాయలసీమల్లో మాత్రం, బాబు ఆశించిన సానుభూతి మాత్రం లభించదంటున్నారు. సింపతీ విషయాలు పక్కనపెడితే, అధికార, విపక్షాలు మాత్రం రెండు అంశాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేందుకు, విశాఖలో చంద్రబాబు దిగ్భంధనాన్ని వాడుకోవాలని ప్రయత్నిస్తున్నాయని అర్థమవుతోంది. విశాఖను రాజధానిగా వ్యతిరేకించినందుకు, విశాఖ ప్రజలు చంద్రబాబును తిప్పి పంపారని, ప్రజాగ్రహంతో బాబు వెనుతిరగాల్సి వచ్చిందని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తోంది వైసీపీ. అటు టీడీపీ అధినేత చంద్రబాబు కూడా, తనను అడ్డుకోవడాన్ని ప్రజాస్వామ్యానికే మచ్చగా అభివర్ణిస్తున్నారు. ఒక ప్రతిపక్ష నాయకున్నే అడ్డుకుంటే, ఇక సామాన్యుల పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు. వైజాగ్‌లో తనను అడ్డుకోవడాన్ని జనంలోకి బలంగా తీసుకెళ్లాలనుకుంటున్న చంద్రబాబు, టీడీపీ శ్రేణుల్లో ఉత్సాహం నింపడానికి ఈ ఘటనను ప్రయోగించాలనుకుంటున్నారు. ఓటమితో తీవ్ర నిరాశలో వున్న తెలుగు తమ్ముళ్లలో హుషారు నింపాలనుకుంటున్నారు. ఇలా చంద్రబాబును ప్రజలను తిప్పికొట్టారని వైసీపీ విమర్శనాస్త్రాలు సంధిస్తుంటే, సానుభూతిగా మలచుకోవాలని చంద్రబాబు ఎత్తుగడ వేస్తున్నారు. మరి నాడు వైసీపీ సానుభూతి పొందితే, నేడు చంద్రబాబుకూ అదే సానుభూతి లభిస్తుందా? లేదా? అనేది స్థానిక ఎన్నికల్లో తేలుతుంది.

జగన్ కు కొత్త తలనొప్పులు.. ఇలాగైతే లోకల్ వార్ లో గెలుపు కష్టమే..!

ముఖ్యమంత్రి జగనేమో మేనిఫెస్టో, నవరత్నాలూ అంటూ ఒక్కోటి అమలు చేసుకుంటూ ముందుకు పోతున్నారు. మరోవైపు, స్థానిక ఎన్నికలకు సమాయత్తం కావాలని ప్రజాప్రతినిధులకు, ముఖ్యనేతలకు ఆదేశాలిస్తున్నారు. కానీ, జగన్ ఒకటి తలిస్తే, నియోజకవర్గాల్లో మరొకటి జరుగుతోందంటున్నారు. జగన్ పాలనలో బిజీగా ఉంటే, వైసీపీ నేతలు మాత్రం ఆధిపత్య పోరు కోల్డ్‌వార్ తో, జగన్‌కు కొత్త తలనొప్పులు తెచ్చిపెడుతున్నారు. ఒకట్రెండు జిల్లాలు, మొత్తం అన్ని జిల్లాల్లోనూ దాదాపు ఇదే పరిస్థితి కనిపిస్తోంది. గుంటూరు జిల్లాలో అనేక మంది ప్రజాప్రతినిధుల మధ్య నిప్పులేకుండానే తగలపడేంతగా విభేదాలు రాజుకున్నాయి. గతంలో తాడికొండ ఎమ్మెల్యే శ్రీదేవి, ఎంపీ నందిగం సురేష్‌ మధ్య విభేదాలు సీఎం వరకూ వెళ్లాయి. తాజాగా నరసరావుపేట ఎంపీ, ఆ పరిధిలోని మహిళ ఎమ్మెల్యే మధ్య విభేదాలు రచ్చరచ్చయ్యాయి. పార్టీ పెద్దలు నచ్చజెప్పడంతో అప్పటికప్పుడు సైలెంటయినా, లోలోపల వారిద్దరూ ఇంకా రగిలిపోతూనే వున్నారన్న చర్చ జరుగుతోంది. ఇక, తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం నియోజకవర్గంలో తోట త్రిమూర్తులు, ఎమ్మెల్యే చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. అలాగే, ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డికి, ఎమ్మెల్యేలకీ మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. ఇక, కర్నూలులోనైతే, కోల్డ్‌వార్‌ ఇంకో రేంజ్‌లో ఉంది. ఎమ్మెల్యే హఫీజ్‌ ఖాన్, మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌ రెడ్డి మధ్య నువ్వానేనా అన్నట్టుగా యుద్ధం సాగుతోంది. సెగ్మెంట్‌లో నువ్వన్నా ఉండాలి, నేనైనా ఉండాలన్న స్థాయిలో ఇరువురి మధ్య పోరు నడుస్తోంది. దాంతో వీరిద్దరి పంచాయతీ కూడా సీఎం జగన్‌ దగ్గరకు వెళ్లింది. ఇలా, ప్రతి జిల్లాలో, ప్రతి నియోజకవర్గంలో ముఖ్యనేతలు, ప్రజాప్రతినిధుల మధ్య విబేధాలు తారాస్థాయికి చేరుకుంటున్నాయి. నేతల విభేదాలతో కార్యకర్తలు సైతం వర్గాలుగా విడిపోతున్నారు.  ఒకవైపు ముఖ్యమంత్రి జగనేమో, స్థానిక ఎన్నికల కోసం నేతలందరూ కలిసికట్టుగా పనిచేయాలని ఆదేశాలిస్తున్నారు. కానీ నేతలేమో బాహాటంగానే తమ విభేదాలను ప్రదర్శిస్తున్నారు. అయితే, ఈ విభేదాలు మొత్తం పార్టీకే ఇబ్బందికరంగా మారుతున్నాయని, వచ్చే లోకల్‌ ఎలక్షన్స్‌లో ప్రభావితం చేస్తాయని కార్యకర్తలు, పార్టీ అగ్రనేతలు టెన్షన్‌ పడుతున్నారు.

విశాఖ ఎయిర్ పోర్టు నుంచి చంద్రబాబును వెనక్కి పంపిన పోలీసులు.. జగన్ ప్రతీకారం తీర్చుకున్నారా?

విశాఖపట్నం, విజయనగరం జిల్లాల్లో ప్రజా చైతన్య యాత్రతో పాటు ఇతర కార్యక్రమాల్లో పాల్గొనేందుకు విశాఖ వెళ్లిన ఏపీ ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబును పోలీసులు బలవంతంగా ఎయిర్ పోర్టు నుంచి వెనక్కి పంపారు. విజయవాడకు వెళ్లేందుకు విమానాలు అందుబాటులో లేకపోవడంతో హైదరాబాద్ వెళ్లే విమానంలో ఆయన్ను ఎక్కించి పంపారు. అంతకు ముందు ఉదయం విశాఖ ఎయిర్ పోర్టుకు చేరుకున్న చంద్రబాబును అధికార పార్టీ వైసీపీ కార్యకర్తలు అడుగడుగునా అడ్డుకున్నారు. విజయనగరం వెళ్లేందుకు పోలీసుల నుంచి మందస్తు అనుమతి ఉన్నా వైసీపీ కార్యకర్తల నిరసనలతో చంద్రబాబు కాన్వాయ్ ఎయిర్ పోర్టు దాటి వెళ్లలేకపోయింది. టీడీపీ కార్యకర్తలు కూడా ప్రతిదాడులకు దిగడంతో విశాఖ ఎయిర్ పోర్టులో ఉద్రిక్త పరిస్ధితులు తలెత్తాయి. పోలీసులు జోక్యం చేసుకుని ఇరువర్గాలను శాంతిపజేశారు. నాలుగు గంటల హైడ్రామా తర్వాత ఎయిర్ పోర్టు బయటికి వచ్చిన చంద్రబాబు టీడీపీ నేతలతో కలిసి రోడ్డుపైనే బైఠాయించారు. విజయనగరం వెళ్లేందుకు అనుమతి తీసుకున్నా తనను ఎందుకు అడ్డుకున్నారో పోలీసులు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. గంటసేపు నిరసన తర్వాత పోలీసులు సెక్షన్ 151 ప్రకారం చంద్రబాబుకు నోటీసులు జారీ చేశారు. శాంతి భద్రతల పరిరక్షణ పేరుతో చంద్రబాబు సహా మిగతా టీడీపీ నేతలను సైతం ముందస్తు అరెస్టు చేశారు. చంద్రబాబును విశాఖ ఎయిర్ పోర్టులోని వీఐపీ లాంజ్ లోకి తీసుకెళ్లిన పోలీసులు వెనక్కి వెళ్లిపోవాల్సిందిగా కోరారు. చంద్రబాబు ససేమిరా అనడంతో పోలీసులతో వాగ్వాదం చోటుచేసుకుంది. చివరికి పోలీసులు చంద్రబాబును నచ్చజెప్పి వెనక్కి పంపించేందుకు సిద్దమయ్యారు. కానీ విశాఖ నుంచి విజయవాడ విమానాశ్రయానికి నేరుగా వెళ్లే ఫ్లైట్లు లేకపోవడంతో హైదరాబాద్ విమానం ఎక్కించి పంపించేశారు. తాజా పరిణామాలతో 2017లో ప్రత్యేక హోదా ఉద్యమం కోసం విశాఖ ఎయిర్ పోర్టుకు వచ్చినప్పుడు అప్పటి టీడీపీ ప్రభుత్వం తనను వెనక్కి పంపిన నేపథ్యంలో సీఎం జగన్ అందుకు ప్రతీకారగా ఇప్పుడు చంద్రబాబును వెనక్కి పంపారనే విమర్శలు వినిపిస్తున్నాయి. అయితే ప్రభుత్వం మాత్రం శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందనే కారణంతోనే చంద్రబాబును వెనక్కి పంపినట్లు చెబుతోంది.  

హిందూపురం వైసీపీలో ముదిరిన పోరు.. పార్టీ నేత హనుమంత్ రెడ్డిపై ఎమ్మెల్సీ ఇక్బాల్ దాడి

అనంతపురం జిల్లా హిందూపురం అసెంబ్లీ సెగ్మెంట్ లో వైసీపీ నేతల విభేదాలు తారాస్దాయికి చేరుకున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీలో అనైక్యత కారణంగా ఓటమిపాలైన వైసీపీకి, ఎన్నికల తర్వాత కూడా ఇంటిపోరు తప్పడం లేదు. తాజాగా హిందూపురం నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు సంబంధించి ఏర్పడిన విభేదాలు వ్యక్తిగత దాడుల వరకూ వెళ్లాయి. అభివృద్ధి పనుల కేటాయింపుకు సంబంధించి తనను ప్రశ్నించేందుకు వచ్చిన వైసీపీ రాష్ట్ర కార్యదర్శి కొట్టి హనుమంతరెడ్డిపై ఎమ్మెల్సీ ఇక్బాల్ దాడి చేసినట్లు పోలీసులకు ఫిర్యాదు అందింది. కోటిపి గ్రామంలో తనకు కనీస సమాచారం లేకుండా ఎవరెవరో వచ్చి పనులు చేసుకుంటున్నారని తెలిసిన హనుమంతరెడ్డి .. నియోజకవర్గం ఇన్ ఛార్జి గా ఉన్న ఇక్బాల్ ను ప్రశ్నించేందుకు ప్రశాంతి నగర్ లోని వైసీపీ కార్యాలయానికి వెళ్లారు. అదే సమయంలో అక్కడే ఉన్న ఇక్బాల్ తనను చూసిన వెంటనే ఉన్నపళంగా కుర్చీలోంచి లేచి పార్టీకి నీలాంటి వాళ్ల అవసరం లేదంటూ ముఖంపై పిడిగుద్దులు కురిపించారని హనుమంతరెడ్డిని పోలీసులకు చేసిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ విషయాన్ని పార్టీ అధిష్టానం దృష్టికి కూడా తీసుకెళతానని హనుమంతరెడ్డి తెలిపారు. హిందూపురంలో టీడీపీ బలంగా ఉండటంతో పాటు వరుసగా అక్కడి నుంచి సినీ నటుడు బాలకృష్ణ గెలుస్తుడటంతో వైసీపీ ఇక్కడ బలహీనంగా కనిపిస్తోంది. అదే సమయంలో పార్టీలో అంతర్గత తగాదాలు వైసీపీ పరువు తీస్తున్నాయని నేతలు వాపోతున్నారు.  

ఎట్టకేలకు సీబీఐకి ప్రీతి సుగాలి అత్యాచారం, హత్య కేసు.. ఏపీ సర్కార్ ఆదేశాలు

2017లో కర్నూలులో సంచలనం రేపిన సుగాలి ప్రీతీ బాయి అత్యాచారం, హత్య కేసును సీబీఐకి అప్పగిస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గతంలో ఈ కేసును విచారించిన పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం, ఇప్పటికీ దోషులను పట్టుకోకపోవడం వంటి కారణాలతో ప్రీతి కుటుంబ సభ్యులు సీబీఐ దర్యాప్తు కోసం డిమాండ్ చేస్తున్నారు. తాజాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఇదే డిమాండ్ తో కర్నూలులో ర్యాలీ కూడా నిర్వహించారు. ఆ తర్వాత కర్నూలు పర్యటనలో ప్రీతి కుటుంబ సభ్యులను పిలిపించుకుని మాట్లాడిన సీఎం జగన్.. తాజాగా ఈ కేసును సీబీఐకి అప్పగిస్తూ ఆదేశాలు జారీ చేశారు. 2017లో కర్నూలులోని కట్టమంచి రామలింగారెడ్డి హైస్కూల్లో పదో తరగతి చదువుతున్న సుగాలి ప్రీతీ బాయి స్కూలు హాస్టల్లోనే ఉరేసుకుంది. అప్పట్లో దీన్ని ఆత్మహత్య కేసుగా తేల్చిన పోలీసులు కేసును మూసేశారు. కానీ పోస్టు మార్టమ్ నివేదికలో ఆమె జననాంగాల్లో వీర్య కణాలు ఉన్నట్లు నిర్ధారించింది. అదే సమయంలో ఉరేసుకున్న వ్యక్తి కాళ్లు నేలకు తాకుతూ ఎలా ఉంటాయన్న సందేహాలు కూడా వ్యక్తమయ్యాయి.  దీంతో అప్పటి అధికార టీడీపీ నేతల ఒత్తిడితోనే పోలీసులు కేసును తప్పుదోవ పట్టిస్తున్నారని తోసిపుచ్చిన ప్రీతి తల్లితండ్రులు ఆరోపించారు. స్ధానికుల నుంచి కూడా ఒత్తిడి పెరగడంతో జిల్లా కలెక్టర్ ముగ్గురు సభ్యులతో విచారణ కమిటీని ఏర్పాటు చేశారు. ఆర్డీవో, డీఈవో, సాంఘిక సంక్షేమశాఖ డిప్యూటీ డైరెక్టర్ తో కూడిన ఈ కమిటీ ఘటన జరిగిన పాఠశాలను సందర్శించి ఆధారాలు సేకరించింది. అయితే ఈ కమిటీ దర్యాప్తు కూడా నత్తనడకన సాగింది.   ఆ తర్వాత ఈ కేసులో సాక్ష్యాలను తారుమారు చేసేందుకు వైద్యారోగ్య శాఖ డిప్యూటీ కార్యదర్శి రాజు నిందితుల వద్ద 5 లక్షలు డిమాండ్ చేశారని మృతురాలి తల్లి ఆరోపించారు. మరోవైపు ప్రీతి మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించిన కర్నూలు మెడికల్ కాలేజీ బృందం దీన్ని అత్యాచారం, హత్యగా నిర్ధారించింది. అయితే ఇదే బృందంలో సభ్యుడిగా ఉన్న ప్రొఫెసర్ లక్ష్మీనారాయణ పోస్టుమార్టం నివేదికను తారుమారు చేశారని ప్రీతి తల్లి ఆరోపించారు. చివరికి 2017 ఆగస్టులో ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టంతో పాటు పోస్కో చట్టం కింద ప్రీతి హత్యకు గురైన కట్టమంచి రామలింగారెడ్డి స్కూలు ఛైర్మన్ జనార్ధన్ రెడ్డిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. అనంతరం ప్రీతి కేసుపై విచారణ జరిపిన ముగ్గురు సభ్యుల అధికారుల కమిటీ తన నివేదికను వైద్యారోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి పూనం మాలకొండయ్యకు సమర్పించారు. అయితే ఈ నివేదికలో ప్రీతిది ఆత్మహత్యేనని వారు తేల్చారు. ఆ తర్వాత ఈ కేసులో విచారణాధికారిగా ఉన్న డీసీపీ వినోద్ కుమార్... ఐపీసీ సెక్షన్లు 302, 201 తో పాటు పోస్కో చట్టం కింద కేసులు నమోదు చేయలేదని గుర్తించారు. పోస్టుమార్టం నివేదికను మార్చిన ప్రొఫెసర్ లక్ష్మీనారాయణతో డీసీపీ వినోద్ కుమ్మక్కాయని కూడా ప్రీతి తల్లి ఆరోపించారు.  ఆ తర్వాత మానవ హక్కుల కమిషన్ ఆదేశాలతో ప్రీతి హత్యాచార కేసుపై అప్పటి డీజీపీ ఆర్పీ ఠాకూర్ మరోసారి విచారణకు ఆదేశించారు. విచారణాధికారిగా వ్యవహరించిన ఐపీఎస్ అధికారి అమిత్ గార్గ్ .. పోస్టు మార్టం నివేదిక తారుమారైందని తేల్చారు. కానీ తాను నివేదికను తారుమారు చేయలేదని దాన్ని రూపొందించిన డాక్టర్ శంకర్ చెప్పుకొచ్చారు. అయితే ఆయన్ను ఈ ఘటనకు బాధ్యడిగా గుర్తిస్తూ వైద్యారోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి పూనం మాలకొండయ్య సస్పెన్షన్ ఆదేశాలు ఇచ్చారు. ఆ తర్వాత డాక్టర్ శంకర్.. తాను మూడు గంటల పాటు నిర్వహించిన పోస్టుమార్టంలో ప్రీతి అత్యాచారం, హత్యకు గురైందని మరో నివేదిక ఇచ్చారు.     ఈ నివేదిక వెలువడ్డాక ప్రీతి తల్లితండ్రులు ఈ కేసును సీబీఐకి అప్పగించి విచారణ జరిపిస్తే కానీ తమ కుమార్తెకు న్యాయం జరగదని స్పష్టం చేశారు. తాజాగా కర్నూలులో పర్యటించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా మృతురాలు ప్రీతికి న్యాయం జరగాలంటే ఈ కేసును సీబీఐకి అప్పగించాలని, ప్రీతికి న్యాయం చేయలేని వైసీపీ ప్రభుత్వం కర్నూల్లో హైకోర్టు పెట్టి ప్రజలకు ఏం న్యాయం చేస్తుందని కూడా ప్రశ్నించారు. ఎట్టకేలకు ప్రభుత్వం ఈ సంచలన కేసును సీబీఐకి అప్పగిస్తూ ఇవాళ ఉత్తర్వులు జారీ చేసింది. 

చంద్రబాబు అరెస్ట్.. నన్ను ఎన్ కౌంటర్ చేయండి అంటూ బాబు ఫైర్!!

విశాఖపట్నంలో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటిస్తోన్న నేపథ్యంలో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. వైసీపీ కార్యకర్తల అడ్డుకోవడంతో చంద్రబాబు కాన్వాయ్ ముందుకు కదిలే పరిస్థితి కనపడలేదు. దాదాపు రెండు గంటల పాటు బాబు కాన్వాయిలోనే ఉండిపోయారు. వేలాదిగా వైసీపీ, టీడీపీ కార్యకర్తలు విమానాశ్రయ ప్రాంతానికి రావడంతో.. ఇరు పార్టీల కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. వైసీపీ కార్యకర్తలు చంద్రబాబు వాహనంపై కోడిగుడ్లు, టమోటాలు, చెప్పులు విసిరారు. కొందరు చెప్పులు చూపెడుతూ 'గో బ్యాక్ బాబు' అంటూ నినాదాలు చేశారు. మరోవైపు టీడీపీ కార్యకర్తలు 'ఏ1- ఏ1' అంటూ నినాదాలు చేశారు. ఇలా ఇరు పార్టీల కార్యకర్తల నినాదాలు, తోపులాటలతో విశాఖ విమాశ్రయ ప్రాంతం ఉద్రిక్తంగా మారింది. తీవ్ర ఉద్రిక్తతల మధ్య చంద్రబాబును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 151 సెక్షన్ కింద చంద్రబాబును అదుపులోకి తీసుకుని విమానాశ్రయంలోని వీఐపీ లాంజ్‌లోకి తరలించారు. పరిస్థితులు అదుపులోకి వచ్చేంత వరకు ఆయన్ను నిర్బంధింలోనే ఉంచాలని పోలీసులు భావిస్తున్నారు. ఆయనతో పాటు ఉన్న టీడీపీ నేతలను కూడా అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల తీరుపై చంద్రబాబు ఫైర్ అయ్యారు. తనను ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. పర్మిషన్ ఉన్నా అడ్డుకుంటారా అంటూ ఫైర్ అయిన ఆయన.. నన్ను షూట్ చేయండి.. నన్ను ఎన్ కౌంటర్ చేయండి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

జగన్ చర్యలతో చంద్రబాబుకు లాభం...

గతంలో జగన్ ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ప్రత్యేక హోదాను కోరుతూ ఆర్కే బీచ్‌లో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించాలని తలపెట్టగా కార్యక్రమానికి ఎవరూ అనుమతులు తీసుకోలేదని, అదే సమయంలో గణతంత్ర దినోత్సవం, భాగస్వామ్య సదస్సు జరగనున్నది అని పోలీసులు ఆర్కే బీచ్ ను దిగ్భంధం చేశారు. ఎవరిని ఆర్కే బీచ్ దరిదాపులకి వెళ్లనివ్వకుండా అడ్డుకున్నారు.  వైజాగ్ విమానాశ్రయం చేరుకున్న జగన్ ను బయటికి రాకుండా పోలీసులు అడ్డుకున్నారు. శాంతి భద్రతల దృష్ట్యా బయటికి అనుమతించలేదు. దీంతో జగన్ పోలీసులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను వెనక్కి వెళ్లేది లేదని విమానాశ్రయంలోనే కూర్చుండి పోయిన విషయం తెలిసిందే. సరిగ్గా అదే సన్నివేశం నేడు పునరావృతం అయింది. కానీ అధికార పక్షం ఇక్కడే చిన్న లాజిక్ మిస్ అయిందని ప్రతిపక్ష నాయకులు, జరుగుతున్న పరిణామాలను నిశితంగా గమనిస్తున్న ప్రజలు అనుకుంటున్నారు. నాడు తెలుగుదేశం అధికారంలో ఉండగా జగన్ ఏడాది పాటు పాదయాత్ర చేశారని, ఏనాడూ ప్రభుత్వం అడ్డంకులు సృష్టించాలని చూడలేదని, ఇవాళ్టి పరిస్థితులు ఆనాడు కల్పిస్తే జగన్ పాదయాత్ర జరిగేదా? అని తెలుగుదేశం వారు అంటున్నారు. ఇదే సమయంలో  ఈ రోజు చంద్రబాబుని విశాఖపట్నంలో వైసీపీ అడ్డుకోవటం రాజకీయంగా వైసీపీ చేసిన తప్పటడుగుగానే కనిపిస్తోంది. గతంలో విశాఖలో జగన్ కు జరిగిన దానిని మనసులో పెట్టుకొని విశాఖపట్నం లో బాబును అడుగుపెట్ట నివ్వకూడదు అని తీసుకుని అమలు చేసిన నిర్ణయం ముమ్మాటికీ రాజకీయంగా బాబు కలిసి వచ్చేదే అంటున్నారు రాజకీయ పరిశీలకులు. వైసిపి నాయకులు, కార్యకర్తలు  ఎటువంటి మనస్తత్వం కలిగి ఉంటారు ఎంత విధ్వంసకారులో  ప్రజలకు చూపించడానికి బాబుకి ఇది కలిసివచ్చిన అవకాశమని విశ్లేషిస్తున్నారు. అందులోనూ ఎక్కువమందిని ఒక గంట అని చెప్పి 500 రూపాయలకు మాట్లాడుకుని తెచ్చుకున్నారు అనేది బయట పడటం, పెందుర్తి లోని వైసీపీ నాయకుడికి చెందిన ఓ కాలేజి నుంచి విద్యార్థులని తెచ్చి వారితో నినాదాలు ఇప్పించడం వంటివి కూడా ప్రజలకు తెలిసిందని ఈ పరిణామాలు వైసీపీకి మరింత నష్టం కలగజేస్తాయని అంటున్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో  ఏది జరిగినా చంద్రబాబుకే అనుకూలమవుతాయని తెలుగుదేశం వర్గాలు ఒకింత ఆనందం వ్యక్తం చేస్తున్నాయి.

వైజాగ్ లో హైడ్రామా.. ఒక్కొక్కరికి రూ. 500.. పసుపు చీరలు!!

విశాఖపట్నం ఎయిర్‌పోర్టులో టీడీపీ అధినేత చంద్రబాబు కాన్వాయ్‌ని వైసీపీ శ్రేణులు అడుగడుగునా అడ్డుకున్నారు. చంద్రబాబు వెహికిల్ ని కదలనివ్వకుండా గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. చంద్రబాబు కాన్వాయ్‌ను వైసీపీ కార్యకర్తలు అడ్డుకోవడంపై టీడీపీ అధికార ప్రతినిధి పంచుమర్తి అనురాధ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబును చూసి భయపడుతున్నారని.. మంత్రి బొత్సకు చెమటలు పడుతున్నాయని, అవంతికి కాళ్లు, చేతులు ఆడడంలేదని.. అందుకే చంద్రబాబు కాన్వాయ్‌ను అడ్డుకున్నారని మండిపడ్డారు. ఇలా ఎన్ని రోజులు ఆపుతారని అనురాధ ప్రశ్నించారు. అప్పుడు వైఎస్ జగన్ పాదయాత్రను అడ్డుకుని ఉంటే వైసీపీ వాళ్లంతా ఎక్కడుండేవాళ్లని నిలదీశారు. చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న వాళ్లంతా పెయిడ్ ఆర్టిస్టులని, ఒక్కొక్కరికి రూ. 500 ఇచ్చి వైసీపీ నేతలు తీసుకువచ్చారని ఆరోపించారు. వైసీపీవాళ్లకు దమ్ములేదని, మహిళలకు పసుపు రంగు చీరలు కట్టించి తీసుకువచ్చారని అనురాధ ఆరోపించారు.

విశాఖ ఎయిర్ పోర్టులో వైసీపీ, టీడీపీ పరస్పర దాడులు.. ఎట్టకేలకు విజయనగరం టూర్ కు చంద్రబాబు

విజయనగరం జిల్లా ప్రజాచైతన్య యాత్రకు వెళ్లేందుకు ఇవాళ ఉదయం విశాఖపట్నం ఎయిర్ పోర్టుకు చేరుకున్న సందర్భంగా తీవ్ర ఉద్రిక్త పరిస్దితులు తలెత్తాయి. మూడు రాజధానులను వ్యతిరేకిస్తున్న చంద్రబాబును అడ్డుకోవాలని నిన్న మంత్రి అవంతి శ్రీనివాస్ ఇచ్చిన పిలుపుతో వైసీపీ కార్యకర్తలు రెచ్చిపోయారు. విశాఖ ఎయిర్ పోర్టులోనే చంద్రబాబును అడ్డుకున్నారు. కోడిగుడ్లు, టమోటాలు, చెప్పులను చంద్రబాబు కాన్వాయ్ పైకి విసిరారు. చంద్రబాబును కాపాడే క్రమంలో టీడీపీ కార్యకర్తలు కూడా ఎదురుదాడులకు దిగడంతో పరిస్ధితి ఉద్రిక్తంగా మారిందీ. పోలీసులు రంగంలోకి దిగి ఆందోళనకారులను అడ్డుకునేందుకు ప్రయత్నించినా వారు శాంతించలేదు. వైసీపీ కార్యకర్తల దాడుల మధ్య దాదాపు మూడు గంటల పాటు చంద్రబాబు విశాఖ ఎయిర్ పోర్టులోనే చిక్కుకుపోయారు. చంద్రబాబు కాన్వాయ్ ముందుకు కదలకుండా వైసీపీ కార్యకర్తలు అడుగడుగునా అడ్డుతగిలారు. వీరితో టీడీపీ కార్యకర్తలు బాహాబాహీకి దిగడంతో పరిస్ధితి అంతకంతకూ ఉద్రిక్తంగా మారింది. పోలీసులు జోక్యం చేసుకున్నా ఫలితం లేకపోయింది. చంద్రబాబు గో బ్యాక్ నినాదాలతో వైసీపీ కార్యకర్తలు హంగామా చేశారు. ఓ దశలో పోలీసులు శాంతి భద్రతల పరిస్ధితిని కారణంగా చూపుతూ చంద్రబాబును వెనక్కి పంపించేందుకు సిద్దమయ్యారు. చివరికి అతి కష్టం మీద చంద్రబాబు బయటపడ్డారు. చివరికి మధ్యాహ్నం ఒంటిగంట తర్వాత విజయనగరం టూర్ కు వెళ్లేందుకు పోలీసులు చంద్రబాబును అనుమతించారు. మరోవైపు చంద్రబాబును విశాఖ ఎయిర్ పోర్టులో వైసీపీ కార్యకర్తలు అడ్డుకున్న ఘటనపై టీడీపీ, వైసీపీ నేతల మధ్య తీవ్ర మాటల యుద్దం సాగుతోంది. చంద్రబాబును అడ్డుకునేందుకు ఇవాళ గుడ్లు, టమోటాలు విసిరారని, రేపు బాంబులు, కత్తులు విసురుతారని వైసీపీ నేతలను ఉద్దేశించి టీడీపీ యువనేత లోకేష్ వ్యాఖ్యానించారు. జగన్ విశాఖలో అడుగుపెడితే ఏ రేంజ్ అరాచకం ఉంటుందో వైసీపీ ఇవాళ ట్రైలర్ చూపించిందని లోకేష్ మండిపడ్డారు. మూడు ముక్కలాట ఆడి సగం చచ్చారని, ప్రతిపక్ష నేతను విశాఖలో అడ్డుకునేందుకు గొయ్యి తవ్వి పూర్తిగా చచ్చారని లోకేష్ ట్వీట్ కూడా చేశారు. మరోవైపు తనను అడ్డుకున్న వైసీపీ కార్యకర్తలను ఉద్దేశించి అందరి భరతం పడతానని చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్జి స్పందించారు. “కొండపై నుంచి జారిపడుతూ మధ్యలో కొమ్మను పట్టుకుని వేలాడుతున్న పరిస్థితి చంద్రబాబుది. ఏ క్షణంలోనైనా కొమ్మ విరగొచ్చు లేదా పట్టుతప్పి తనే అగాథంలోకి పడిపోవచ్చు. అంత నిస్సహాయతలో కూడా ‘ఒక్కొక్కరి భరతం పడతా, ఎవర్నీ వదిలి పెట్టేది లేదు’ అని బెదిరిస్తున్నాడంటే మామూలు ‘గుండె’ కాదు” అని సాయిరెడ్డి ట్వీట్ చేశారు.

అల్లర్ల కేసు విచారిస్తున్న ఢిల్లీ హైకోర్టు జడ్జి బదిలీ.. సాధారణ ప్రక్రియలోభాగమేనన్న కేంద్రం

ఈశాన్య ఢిల్లీలో అల్లర్ల కేసును విచారిస్తున్న ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎస్. మురళీధర్ ను కేంద్రం రాత్రికి రాత్రే పంజాబ్-హరియాణా హైకోర్టుకు బదిలీ చేసింది. ఢిల్లీలో కేంద్ర మంత్రులు, బీజేపీ నేతలు చేసిన విద్వేష ప్రచారం వల్లే అల్లర్లు చోటుచేసుకున్నాయన్న విమర్శల నేపథ్యంలో ప్రసంగాల సందర్భంగా పక్కనే ఉన్న పోలీసు అధికారులు తమ బాధ్యత నిర్వర్తించలేదంటూ మురళీధర్ చేసిన వ్యాఖ్యలు కేంద్రానికి ఇబ్బందికరంగా మారాయి. దీంతో రాత్రికి రాత్రే ఆయన్న పంజాబ్-హరియాణా హైకోర్టుకు బదిలీ చేస్తూ న్యాయశాఖ ఉత్తర్వులు జారీచేసింది. జస్టిస్ మురళీధర్ బదిలీ ఉత్తర్వులపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. కీలక కేసు విచారణ జరుపుతున్న న్యాయమూర్తిని అర్ధరాత్రి బదిలీ చేయడం సరికాదని కేంద్రంపై విపక్షాలు విరుచుకుపడుతున్నాయి. దీంతో కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ విపక్షాల విమర్శలపై స్పందించారు. సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సుల మేరకు జస్టిస్ మురళీధర్ ను బదిలీ చేశామని తెలిపారు. ఇదంతా సాధారణ ప్రక్రియలో భాగమేనన్నారు. సాధారణంగా ఇలాంటి బదిలీలు చేసినప్పుడు కొత్త స్దానంలో బాధ్యతలు చేపట్టేందుకు రెండు వారాల సమయం కూడా ఉంటుందన్నారు. జడ్జి బదిలీ వ్యవహారాన్ని విపక్ష కాంగ్రెస్ పార్టీ రాజకీయం చేయడం సరికాదని రవిశంకర్ ప్రసాద్ ట్వీట్ చేశారు.