మహిళల టీ20 ప్రపంచకప్‌.. సెమీస్‌ చేరిన భారత్

మహిళల టీ20 వరల్డ్‌కప్‌లో టీమిండియా అదరగొట్టింది. హ్యాట్రిక్ విజయాలతో సెమీఫైనల్‌కి అర్హత సాధించింది. మెల్‌బోర్న్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన మూడో లీగ్ టీ20లో 4 పరుగుల తేడాతో టీమిండియా విజయం సాధించి సెమీస్‌కు చేరింది. మొదట బ్యాటింగ్‌ చేసిన టీమిండియా 134 పరుగుల లక్ష్యాన్ని న్యూజిలాండ్‌ ముందుంచింది. 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి న్యూజిలాండ్‌ 129 పరుగులు మాత్రమే సాధించింది. దీంతో 4 పరుగుల తేడాతో టీమిండియా విజయం సాధించింది. 46 పరుగులు చేసి టీమిండియా గెలుపులో కీలక పాత్ర పోషించిన షెఫాలీ వర్మకు ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ దక్కింది.

ఈఎస్ఐ స్కామ్ నేపథ్యంలో ఏసీబీ పంజా.. ఏపీ వ్యాప్తంగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో సోదాలు

ఏపీలో గత ప్రభుత్వ హయాంలో చోటు చేసుకున్న 151 కోట్ల ఈఎస్ఐ స్కామ్ నేపథ్యంలో ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఏసీబీ సోదాలు నిర్వహిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లా స్ధాయి, ఏరియా అస్పత్రుల్లో ఏసీబీ సోదాలు జరుగుతున్నాయి.. ఈఎస్ఐ స్కామ్ లో భారీగా మందులు, వైద్య పరికరాల కొనుగోళ్లలో అక్రమాలు జరిగినట్లు విజిలెన్స్ నిర్దారించిన నేపథ్యంలో అవి ఎక్కడెక్కడికి చేరాయన్న దానిపై ఏసీబీ దృష్టిపెట్టినట్లు తెలుస్తోంది. ఉదయం నుంచే పలు ఆస్పత్రులకు చేరుకున్న ఏసీబీ టీమ్ లు వివిధ విభాగాల్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు. తెలంగాణ తరహాలో ఏపీలోనూ ఈఎస్ఐ స్కామ్ చోటుచేసుకున్న నేపథ్యంలో దీనిపై మరింత లోతుగా విచారణ జరిపేందుకు ఏసీబీ రంగంలోకి దిగింది. విజిలెన్స్ విచారణలో బయటపడిన అక్రమాల నివేదిక ఆధారంగా రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉదయం నుంచి ఏసీబీ అధికారులు దాడులు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో ప్రధానంగా మందులతో పాటు వైద్య పరికరాల కొనుగోళ్లలో చేతివాటానికి సంబంధించిన వివరాలను ఏసీబీ రాబడుతున్నట్లు సమాచారం. విజిలెన్స్ నివేదికలో మాజీ మంత్రి అచ్చెన్నాయుడు పేరు కూడా ప్రస్తావనకు వచ్చిన నేపథ్యంలో ఆయన సిఫార్సుల ఆదారంగా ఏయే సంస్ధలు మందులను ప్రభుత్వానికి విక్రయించాయి, వాటిని ఎవరెవరికి పంపారు, వైద్య పరికరాలు ఏయే ఆస్పత్రులకు చేరాయన్న అంశాలను ఏసీబీ ఆరా తీసే అవకాశముంది.

విశాఖ ఎయిర్ పోర్టు వద్ద ఉద్రిక్తత.. చంద్రబాబు ర్యాలీకి అనుమతి నిరాకరణ

విశాఖ ఎయిర్ పోర్ట్ వద్ద ఉద్రిక్తకరమైన పరిస్థితులు నెలకొన్నాయి. ఈరోజు చంద్రబాబు నాయుడు విజయనగరంలో ప్రజాచైతన్య యాత్రలో పాల్గొనేందుకు అమరావతి నుంచి విశాఖకు విమానంలో వెళ్లారు.  విశాఖ ఎయిర్ పోర్ట్ లో దిగిన చంద్రబాబుకు ఘన స్వాగతం పలికేందుకు తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలు భారీగా తరలివెళ్లారు.  అయితే, భారీ ర్యాలీకి పోలీసులు అనుమతి ఇవ్వలేదు.  అయినా సరే తెలుగుదేశం పార్టీ నేతలు భారీ సంఖ్యలో బయలుదేరి వెళ్లడంతో విశాఖ ఎయిర్ పోర్ట్ సమీపంలో తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలను వైకాపా కార్యకర్తలు అడ్డుకున్నారు. చంద్రబాబు డౌన్ డౌన్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.  దీంతో అక్కడ ఉద్రిక్తకరమైన పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు ఇరు వర్గాల వ్యక్తులు నచ్చజెప్పిఅక్కడి నుంచి పంపించే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో ట్రాఫిక్‌కు అంతరాయమేర్పడింది.

రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ పై ఛీటింగ్ కేసు నమోదు!!

ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ పై ఛీటింగ్ కేసు నమోదైంది. బీహార్‌లో ‘బాత్‌ బీహార్‌ కీ’ పేరుతో ఓ కార్యక్రమాన్ని ప్రారంభించి యువతను కలుస్తానని ప్రశాంత్ కిషోర్ ఇటీవల ప్రకటన చేసిన విషయం తెలిసిందే. అయితే, ప్రశాంత్ కిషోర్ తన ఐడియాను కాపీ కొట్టి ఈ కార్యక్రమాన్ని రూపొందించారంటూ ఆయనపై ఓ యువకుడు చీటింగ్ కేసు పెట్టాడు.  ‘బాత్‌ బిహార్‌ కీ’ కార్యక్రమం తన ఆలోచన అని, ఈ ఐడియాను తన మాజీ సహోద్యోగి ఒసామా, ప్రశాంత్ కిషోర్ కు చెప్పాడని.. దీంతో ప్రశాంత్ కిషోర్ తన కంటెంట్‌ను దొంగిలించి వాడుకున్నారని.. శశ్వత్ గౌతమ్ అనే యువకుడు పట్నా నగరంలోని పాటలీపుత్ర పోలీసుస్టేషనులో ఫిర్యాదు చేసాడు. ఇప్పటికే తాను ‘బిహార్‌ కీ బాత్‌’ అనే కార్యక్రమాన్ని ప్రారంభించానని తెలిపాడు. ఇందుకు సంబంధించిన ఆధారాలను కూడా పోలీసులకు ఇచ్చాడు. గౌతమ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పాటలీపుత్ర పోలీసులు ప్రశాంత్ కిషోర్ తో పాటు ఒసామాపై ఐపీసీ సెక్షన్ 420, 406 ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

మంత్రి వర్సెస్ ఎమ్మెల్యే.... టీఆర్ఎస్ లో రచ్చకెక్కిన విభేదాలు...

ఉమ్మడి వరంగల్ జిల్లా టీఆర్ఎస్ లో విభేదాలు రచ్చకెక్కాయి. మహబూబాబాద్ కలెక్టరేట్లో ఎమ్మెల్యే శంకర్ నాయక్, గిరిజన శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ మధ్య మాటల యుద్ధం జరిగింది. తనకు తెలియకుండా రివ్యూ మీటింగ్ పెట్టడంపై శంకర్ నాయక్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. స్థానిక సమస్యలు మీకు తెలుసా, నాకు తెలుసా అంటూ మంత్రిపై శంకర్ నాయక్ మండిపడ్డారు. రివ్యూ మీటింగ్ అంటే నాలుగు మాటలు మాట్లాడి ఫోటోలు దిగి వెళ్లిపోవడం కాదంటూ నిప్పులు చెరిగారు. దాంతో, కంగుతిన్న మంత్రి సత్యవతి రాథోడ్... సమష్టిగా పని చేద్దాం, సమస్యలు చెప్పండి అంటూ కౌంటరిచ్చారు. మంత్రి మాటలపై శంకర్ నాయక్ ఆగ్రహం వ్యక్తం చేస్తుండగా మధ్యలో కలెక్టర్ గౌతమ్ జోక్యం చేసుకున్నారు. సమాచారమివ్వకుండా రివ్యూ మీటింగ్ నిర్వహించడంపై శంకర్ నాయక్ కు ... కలెక్టర్ క్షమాపణ చెప్పారు. దాంతో, కలెక్టర్ స్థాయి వ్యక్తి సారీ చెప్పడం సరికాదన్న శంకర్ నాయక్.. హడావిడిగా రివ్యూ మీటింగ్ ఎందుకు పెట్టారని ప్రశ్నించారు. అయితే, శంకర్ నాయక్ తీరుపై మంత్రి సత్యవతి రాథోడ్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. మొత్తానికి ఇరువురి వాగ్వాదంపై సమావేశం గందరగోళంగా మారింది. సమస్యలు మీరు చెప్పండి అంటే, మీరు చెప్పండి అంటూ ఎమ్మెల్యే, మంత్రి వాదులాడుకున్నారు. దాంతో కలెక్టర్... కలుగజేసుకుని ఎమ్మెల్యే, మంత్రిని శాంతింపజేశారు.

తెలంగాణలో మళ్లీ భయపెడుతున్న డేంజర్ వైరస్.. గాంధీలో మహిళ మృతి...

తెలంగాణలో మళ్లీ స్వైన్ ఫ్లూ కలకలం మొదలైంది. ఒకవైపు కరోనా టెన్షన్ పెడుతుంటే... మరోవైపు స్వైన్ ఫ్లూ భయపెడుతోంది. హైదరాబాద్లో స్వైన్ ఫ్లూ కేసులు నమోదవుతుండటంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. ఇప్పటికే స్వైన్ ఫ్లూ లక్షణాలతో ఒకరు మరణించడంతో... ప్రజలు అలెర్ట్ ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.  ఇంతకు ముందు స్వైన్ ఫ్లూ కేసులు చలికాలం ఎక్కువగా వ్యాపించేవి... కానీ, ఇప్పుడు ఎండలు మొదలైనా కూడా స్వైన్ ఫ్లూ భయం ప్రజలను వెంటాడుతోంది. ఎండకాలం వస్తున్నా స్వైన్ ఫ్లూ అనుమానంతో పలువురు ఆస్పత్రుల్లో చేరడం ఆందోళన కలిగిస్తోంది. మరోసారి స్వైన్ ఫ్లూ ఎటాక్ చేస్తుందేమోనని ప్రజలు టెన్షన్ పడుతున్నారు.  ఈ ఏడాదిలో ఇప్పటివరకు గాంధీ ఆస్పత్రిలో 18 స్వైన్ ఫ్లూ కేసులు నమోదు అయ్యాయి. రీసెంట్ గా గాంధీలో ఒక మహిళ స్వైన్ ఫ్లూ సోకి మరణించడంతో... అలెర్ట్ అయ్యామని వైద్య అధికారులు చెప్తున్నారు. వృద్ధులు, చిన్నపిల్లలకి ఈ వైరస్ సోకే అవకాశం ఎక్కువగా ఉందని.. వైరల్ ఫీవర్ వచ్చినవారు సైతం జాగ్రత్తగా ఉండాలని డాక్టర్లు సూచిస్తున్నారు.

ఏపీ సీఎం జగన్‌పై అసభ్యకర పోస్టు.. కడప జిల్లా వ్యక్తిపై కేసు

ఏపీలో రాజకీయ నేతలు, సెలబ్రిటీలను లక్ష్యంగా చేసుకుంటూ చెలరేగిపోతున్న సోషల్ మీడియా పోస్టులపై పోలీసులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా ఫలితం కనిపించడం లేదు. తాజాగా ఏపీ సీఎం వైఎస్ జగన్ సొంత జిల్లాలోనే ఆయనపై సోషల్ మీడియాలో అసభ్యకరంగా పోస్టు పెట్టిన వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు. వైసీపీ నేతలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కడప జిల్లా మైదుకూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు కడప జిల్లా మైదుకూరుకు చెందిన పుల్లయ్య అనే వ్యక్తి సీఎం జగన్ ను ఉద్దేశించి అసభ్యకరంగా రూపొందించిన ఓ టిక్ టాక్ వీడియాను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్టు చేశాడు. దువ్వూరు మండలం పెద్ద జొన్నవరానికి చెందిన పుల్లయ్య పెట్టిన పోస్టు వైరల్ అవుతుండటంతో స్ధానిక వైసీపీ నేత కానాల జయచంద్రారెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు సైబర్ క్రైమ్ అధికారుల సాయంతో ఈ టిక్ టాక్ వీడియో ఎప్పుడు పోస్టు చేశారు. పుల్లయ్య వెనుక ఎవరైనా ఉన్నారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

మొత్తానికి జగన్ ను కలిసిన టాలీవుడ్ నిర్మాతలు... ఎందుకంటే?

టాలీవుడ్ అగ్ర నిర్మాతలు... ఏపీ ముఖ్యమంత్రి జగన్ ను కలిశాను. గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీతోపాటు నిర్మాతలు దగ్గుబాటి సురేష్, శ్యాంప్రసాద్ రెడ్డి, నల్లమలుపు బుజ్జితో కూడిన బృందం... సీఎం క్యాంపు కార్యాలయంలో జగన్మోహన్ రెడ్డితో సమావేశమైంది. హుద్ హుద్ తుఫాను సమయంలో ఇళ్లు కోల్పోయిన బాధితుల కోసం సినీ పరిశ్రమ 320 ఇళ్లు నిర్మించిన విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లారు. ఈ ఇళ్లను ప్రారంభించాలని ముఖ్యమంత్రిని నిర్మాతల బృందం కోరగా, జగన్మోహన్ రెడ్డి సానుకూలంగా స్పందించారు. దాదాపు 15కోట్ల రూపాయలతో హుద్ హుద్ బాధితుల కోసం టాలీవుడ్ నిర్మించిన ఇళ్లను త్వరలోనే సీఎం జగన్ ప్రారంభించనున్నారు. అయితే, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక, టాలీవుడ్ అగ్ర నిర్మాతలు ఇదే మొదటిసారి కలవడం. పైగా, చిత్ర పరిశ్రమ పెద్దలు ఎన్నిసార్లు అపాయింట్ మెంట్ అడిగినా జగన్ ఇవ్వలేదనే మాట వినిపించింది. అయితే, ఇప్పుడు గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ద్వారా, జగన్మోహన్ రెడ్డిని కలిసినట్లు తెలుస్తోంది.

కియాపై మరో న్యూస్ నెట్ వర్క్ కథనం... ఖండించిన కోట్రా...

ఏపీ నుంచి కియా మోటర్స్ కార్ల పరిశ్రమ తరలిపోతుందన్న ప్రచారాన్ని దక్షిణ కొరియా ప్రభుత్వ అత్యున్నత వాణిజ్య విభాగం కొరియా ట్రేడ్ ఇన్వెస్ట్ మెంట్ ప్రమోషన్ ఏజెన్సీ ఖండించింది. కియా తరలిపోతుందన్న వార్తలు, ప్రచారాలు పూర్తిగా అవాస్తవమని తెలిపింది. కియా పరిశ్రమను తరలించాల్సిన అవసరం ఏమాత్రం లేదని కుండబద్దలు కొట్టింది. కియా మోటర్స్ ఎక్కడికి తరలించేది లేదని స్పష్టం చేసింది. రాయిటర్స్ కథనంతో కియా తరలింపుపై కలకలం రేగగా, తాజాగా... కియా తరలిపోతుందంటూ ఆసియా కమ్యూనిటీ న్యూస్ నెట్‌వర్క్‌ కథనం రాయడంతో... కోట్రా దానిని ఖండించింది. ఏపీ ప్రభుత్వం నుంచి సంపూర్ణ సహాకారం, మద్దతు ఉందని వెల్లడించింది. దీర్ఘకాలిక లక్ష్యంతో అనంతపురంలో 1.1 బిలియన్ డాలర్లతో కియా యూనిట్ ను ఏర్పాటు చేశామని...ఇక్కడి నుంచే ప్రపంచస్థాయి కార్లను తయారుచేసి వినియోగదారులకు అందిస్తామని కియా మోటర్స్  ఎండీ కుక్ యున్ షిమ్ తెలిపారు.

నివురుగప్పిన నిప్పులా ఢిల్లీ.. ఇప్పటివరకు 27మంది మృత్యువాత...

దేశ రాజధాని ఢిల్లీలో హైటెన్షన్  కొనసాగుతోంది. ఈశాన్య ఢిల్లీలో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితులు నెలకొన్నాయి. కర్ఫ్యూ, 144 సెక్షన్ అమల్లో ఉన్నా... అల్లరి మూకలు రెచ్చిపోతూనే ఉన్నాయి. పెద్దఎత్తున కేంద్ర బలగాలను రంగంలోకి దించినప్పటికీ, పరిస్థితులు పూర్తిస్థాయిలో అదుపులోకి రావడం లేదు. దాంతో, రంగంలోకి దిగిన జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ... ఈశాన్య ఢిల్లీలో తిరుగుతూ స్వయంగా పరిస్థితిని సమీక్షించారు. ఇక, ఢిల్లీ అల్లర్లలో ఇప్పటివరకు 27మంది మరణించగా, వందల సంఖ్యలో గాయపడ్డారు. అయితే, మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. దేశ రాజధానిలో జరుగుతున్న హింసాకాండపై ఢిల్లీ హైకోర్టు తీవ్రంగా స్పందించింది. 1984 ఘటనలను పునరావృతం కానివ్వరాదన్న న్యాయస్థానం... బాధితులకు సాయం అందించేందుకు హెల్ప్ లైన్లు ఏర్పాటు చేయాలని ఆదేశించింది. అలాగే, బాధితులను ఆస్పత్రులు, సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు చర్యలు చేపట్టాలని సూచించింది. కేంద్ర ప్రభుత్వంపై రజనీకాంత్  విమర్శలు గుప్పించారు. ఢిల్లీ అల్లర్లకు కేంద్ర హోంశాఖదే బాధ్యతన్నారు. సీఏఏ వ్యతిరేక ఆందోళనలు హింసాత్మకంగా మారుతుంటే నిఘా వర్గాలు ఏం చేస్తున్నాయని తలైవా ప్రశ్నించారు. హోంశాఖ, నిఘా వర్గాల వైఫల్యం వల్లే ఢిల్లీలో ఘర్షణలు జరిగాయని రజనీ ఆరోపించారు.  ఢిల్లీ అల్లర్లపై అధికార, ప్రతిపక్షాల మధ్యా మాటల యుద్ధం జరుగుతోంది. హస్తిన ఘర్షణలకు బాధ్యత వహిస్తూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాజీనామా చేయాలని సోనియాగాంధీ డిమాండ్ చేశారు. అయితే, రాజకీయ లబ్ధి కోసం కాంగ్రెస్ ప్రయత్నిస్తోందంటూ కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ కౌంటరిచ్చారు.  

ఏపీలో మొదలవుతున్న పరీక్షల సీజన్.. అధికారుల విస్తృత ఏర్పాట్లు

ఏపీలో పబ్లిక్ పరీక్షల సీజన్ మొదలు కాబోతోంది. వచ్చే నెల 4 నుంచి ఇంటర్, 23 నుంచి పదోతరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. దీంతో అధికారులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. పరీక్షల షెడ్యూల్, ఏర్పాట్ల వివరాలను విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ఇవాళ సచివాలయంలో వెల్లడించారు. వీటి ప్రకారం ఇంటర్ పరీక్షలు మార్చి 4 నుంచి 23 తేదీ వరకు 20 రోజుల పాటు జరగనున్నాయి. ఇందుకోసం 1411 పరీక్ష కేంద్రాను సిద్దం చేస్తున్నారు. ఈ ఏడాది 10 లక్షల మంది విద్యార్థులు ఇంటర్ మీడియట్ పరీక్షలు రాయనున్నారు. అలాగే పదో తరగతి పరీక్షలు మార్చి 23 నుంచి ఏప్రిల్ 8 తేదీ వరకు జరగనున్నాయి. రాష్ట్రంలో మొత్తం 6 లక్షల 30 వేల మంది పదో తరగతి విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. ఇందుకోసం అన్ని జిల్లాల్లో కలిపి మొత్తం 2,900 కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉండనుంది. పరీక్ష సమయంలో స్థానికంగా ఉండే జిరాక్స్ కేంద్రాలు కూడా మూసివేసేలా చర్యలు.తీసుకోనున్నారు.. ఇన్విజిలేటర్లను జంబ్లింగ్ విధానంలో కేటాయించనున్నారు. 1400 ఇంటర్ పరీక్ష, 2900 పదో తరగతి పరీక్ష కేంద్రాల్లో ఎక్కడా విద్యార్థులు కింద కూర్చుని పరీక్ష రాసే అవస్థలు లేకుండా చర్యలు చేపట్టాలని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చినట్లు విద్యాశాఖ మంత్రి సురేష్ తెలిపారు. పదో తరగతి పరీక్షల్లో స్వల్ప మార్పులు చేసినందున విద్యార్థులను సిద్ధం చేసేందుకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. టెన్త్ , ఇంటర్ పరీక్షల హాల్ టికెట్లను వెబ్ సైట్ ద్వారా డౌన్లోడ్ చేసుకునే అవకాశం కల్పించారు. ప్రతి హాల్ టికెట్ పైనా క్యూ ఆర్ కోడ్ ఉంటుంది. ప్రతి విద్యార్థి హాల్ టికెట్ ను తనిఖీ చేయనున్నారు. పరీక్ష కేంద్రాలు తెలుసుకునేందుకు ఓ యాప్ ను కూడా సిద్ధం చేస్తున్నారు. పరీక్షా కేంద్రాల్లో కాపీయింగ్ నిరోధానికి సీసీ కెమెరాలను అందుబాటులో ఉంచుతున్నారు. పరీక్ష పత్రాలు లీకేజీ లేకుండా ఉండేందుకు చీఫ్ సూపర్ వైజర్ మినహా ఎవరి వద్దా మొబైల్ ఫోన్లు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు విద్యామంత్రి తెలిపారు. గతంలోలా పొరుగు రాష్ట్రాల్లో మన విద్యార్ధులకు ఇబ్బందులు ఎదురుకాకుండా ఇంటర్ లో గ్రేడింగ్ తో పాటు మార్కులు కూడా ఇవ్వనున్నారు. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులను కూడా ఇన్విజిలేటర్లుగా వాడుకోనున్నారు. పరీక్షల నిర్వహణకు రాష్ట్ర స్థాయిలో కంట్రోల్ రూమ్ లను ఏర్పాటు చేస్తున్నారు. ఇంటర్ పరీక్షలకు మార్చి 3 తేది నుంచి, పదో తరగతి పరీక్షలకు 14 తేదీ నుంచి కంట్రోల్ రూమ్ పని చేస్తుంది. ఇన్విజిలేటర్లుగా గా అవకాశం ఉంటే గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులను కూడా వినియోగించుకుంటామని విద్యామంత్రి సురేష్ తెలిపారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు, గందరగోళం లేకుండా చూడాలన్నదే ప్రభుత్వ ప్రయత్నమని సురేష్ పేర్కొన్నారు. జవాబు పత్రం కేవలం 24 పేజీలతో ఉంటుందని, ఈసారి అడిషనల్ తీసుకునే అవకాశం లేదని ఆయన తెలిపారు. నూజివీడు ఐఐఐటీలో బాలికల హాస్టల్లో విద్యార్ధి చొరబడిన ఘటనపై విచారణ కమిటీ వేశామని .దీనిపై నివేదిక వచ్చాక చర్యలు చేపడతామని సురేష్ వెల్లడించారు.

అమరావతి పిటిషన్లపై ఏపీ హైకోర్టులో వాదనలు.. వచ్చేనెల 30కి విచారణ వాయిదా

ఏపీ ప్రభుత్వం తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన పలు పిటిషన్లపై ఏఫీ హైకోర్టులో ఇవాళ విచారణ జరిగింది. ఇందులో మూడు రాజధానులకు ఉద్ధేశించిన సీఆర్డీఏ చట్టం రద్దు బిల్లు, వికేంద్రీకరణ బిల్లుతో పాటు కర్నూలుకు విజిలెన్స్ కార్యాలయాల తరలింపు పిటిషన్లను హైకోర్టు ధర్మాసనం ఇవాళ విచారించింది. ఈ సందర్భంగా కర్నూలుకు హైకోర్టు తరలింపుపైనా ధర్మాసనం ముందు పిటిషనర్లు వాదనలు వినిపించారు. కర్నూలుకు హైకోర్టు తరలింపు ప్రక్రియ ఇంకా మొదలు కానందున అమరావతిలో హైకోర్టులో జరుగుతున్న పనులు కొనసాగించాలని ధర్మాసనం సూచించింది. మూడు రాజధానుల ఏర్పాటు సందర్బంగా దాఖలైన పిటిషన్లను వేర్వేరుగా విచారించాల్సిన అవసరం ఉందని హైకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది. అదే సమయంలో మూడు రాజధానుల ప్రక్రియకు ప్రాతిపదికగా ప్రభుత్వం చెబుతున్న జీఎన్‌ రావు, బోస్టన్‌ గ్రూపు నివేదికలను కోర్టుకు సమర్పించాలని న్యాయస్థానం ఆదేశించింది. వివిధ పిటిషన్లపై వాదనలు విన్న ధర్మాసనం వీటిపై తదుపరి వాదనలను వచ్చే నెల 30కి వాయిదా వేసింది.

పొరుగు రాష్ట్రాలకు విద్యుత్ అమ్మకాలకు ఏపీ సర్కారు గ్రీన్ సిగ్నల్

ఏపీలో విద్యుత్ రంగాన్ని నష్టాల నుంచి గట్టెక్కించేందుకు వైసీపీ సర్కారు ఇవాళ కొన్ని నిర్ణయాలు తీసుకుంది. విద్యుత్ రంగంపై జరిగిన సమీక్షలో సీఎం జగన్ ఎనర్జీ ఎక్స్‌పోర్ట్‌ పాలసీ తయారీకి ఆదేశాలు ఇచ్చారు. రాష్ట్రంలో విద్యుత్‌ ఉత్పత్తి, ఆ విద్యుత్‌ను బయట అమ్మకోవాలనుకునే కంపెనీలకు, సంస్థలకు అనుకూలంగా పాలసీ రూపకల్పన చేయాలని అధికారులకు సూచించారు. విద్యుత్‌ రంగంలో పెట్టుబడులు, మరిన్ని ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా కొత్త విధానం ఉండాలని జగన్ ఆదేశించారు. ఏపీలో కొత్తగా ప్లాంట్లు పెట్టాలనుకునేవారికి సానుకూల వాతావరణం కల్పించేలా విద్యుత్ ఎగుమతుల విధానం ఉండాలని సీఎం సూచించారు. ఏపీలో కొత్తగా విద్యుత్ ప్లాంట్ల నిర్మాణం కోసం లీజు ప్రాతిపదికన భూములు తీసుకునే ప్రతిపాదనపైనా జగన్ విద్యుత్ రంగ సమీక్షా సమావేశంలో చర్చించారు. దీనివల్ల భూములిచ్చేవారికి మేలు జరుగుతుందని సీఎం తెలిపారు. దీనివల్ల ప్రతిఏటా రైతులకు ఆదాయం వస్తుందని, భూమిపై హక్కులు ఎప్పటికీ వారికే ఉంటాయని పేర్కొన్నారు. రాష్ట్రంలో మరో వెయ్యి మెగావాట్ల విద్యుత్‌ ఉత్పాదనకు ఎన్టీపీసీ ముందుకు వస్తుందని అధికారులు సీఎం దృష్టికి తెచ్చారు. వీరికి అవసరమైన భూమిని ఇచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నాని వారు సీఎంకు తెలిపారు. రాష్ట్రంలో పది వేల మెగావాట్ల సౌరవిద్యుత్ ప్లాంట్ నిర్మాణంపైనా చర్చ జరిగింది. వీలైనంత త్వరగా ప్లాంట్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ అధికారులను కోరారు. సోలార్‌ ప్లాంట్‌ నిర్మాణం విధివిధానాలపైనా సమావేశంలో చర్చించారు. వ్యవసాయానికి 9 గంటలపాటు నిరంతర విద్యుత్‌కోసం ఫీడర్ల ఆటోమేషన్‌ ఏర్పాటు పూర్తిచేయాలని సీఎం ఆదేశించారు. వచ్చే రెండేళ్లలోగా ఆటోమేషన్‌ ప్రక్రియ పూర్తిచేయాలని జగన్ అధికారులను ఆదేశించారు.

డీజీపీ ఆఫీసులో సాక్షి మీడియా పర్యవేక్షణపై దేవినేని ఫైర్.. సీబీఐ విచారణకు డిమాండ్

ఏపీ ప్రభుత్వ తీరుపై టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు మండిపడ్డారు. ఇవాళ అమరావతిలో మీడియాతో మాట్లాడుతూ... డీజీపీ ఆఫీసులో సాక్షి మీడియా పర్యవేక్షణ చేయడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. ఈ వ్యవహారంపై సీబీఐ విచారణ చేయాలని, డీజీపీ ఆఫీసులో నిర్ణయాలను సీఎం జగన్ సన్నిహితులు తీసుకుంటున్నారని ఉమ ఆరోపించారు. రాష్ట్ర పోలీసు శాఖ హెడ్ క్వార్టర్స్ లో ఇలాంటి కార్యక్రమాలు జరగడం తీవ్ర ఆక్షేపణీయమన్నారు. పోలీసు శాఖలో తాజాగా చోటు చేసుకుంటున్న పరిణామాలు, పోలీసుల వ్యవహారశైలిపైనా ఉమ తీవ్ర ఆరోపణలు చేశారు. సీఎం జగన్ ప్రజా వ్యవహారాల సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి సూచనల మేరకే పోలీసు శాఖలో పోస్టింగ్‌లు ఇస్తున్నారని దేవినేని ఉమ ఆరోపించారు. పోలీసుల తీరును కోర్టులు తప్పుపడుతున్నా మార్పురావడంలేదని ఆయన మండిపడ్డారు. న్యాయవ్యవస్థను ప్రశ్నించే స్థాయికి పోలీసులు వెళ్లారని ఆయన విమర్శించారు. కృష్ణా నదికి వరదలు వచ్చినప్పటికీ నీళ్లు ఇవ్వలేని చేతకాని ప్రభుత్వం వైసీపీ సర్కారు అని అన్నారు.

ఇంత దీనపు పలుకులు ఏమిటి?.. చంద్రబాబుపై విజయసాయిరెడ్డి ట్వీట్

టీడీపీ ప్రజాచైతన్యయాత్రలో భాగంగా విపక్ష నేత చంద్రబాబు చేస్తున్న విమర్శలపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్‌లో స్పందించారు. కుప్పం వెళ్లి అన్న క్యాంటీన్లు రద్దు చేశారని వాపోయారని, పేద వాళ్లకు తిండి దొరకకుండా చేశామని చంద్రబాబు చెబుతున్నారని, 9 సార్లు ఆయన్ను గెలిపించిన కుప్పం ప్రజలు ఇంకా ఐదు రూపాయల భోజనం కోసం ఎదురుచూస్తుండటమేమిటని సాయిరెడ్డి ప్రశ్నించారు. ఇంత దీనపు పలుకులేమిటని ఆయన ట్వీట్ లో పేర్కొన్నారు. జగన్ నాలుగు నెలల్లోనే రివర్స్ టెండర్ విధానంలో రూ.2000 కోట్ల ప్రజా ధనాన్ని ఆదా చేశారని, మీరు అధికారంలో ఉంటే 15% అంచనాల పెంపు, నామినేషన్లతో పనులు కట్టబెట్టి రూ.15 వేల కోట్లు దోచుకునేవారని సాయిరెడ్డి తన ట్వీట్ లో విమర్శలు గుప్పించారు. పరిపాలన అంటే లూటీ చేయడమే అన్న ఫిలాసఫీ కదా మీది అంటూ చంద్రబాబునుద్దేశించి విజయసాయి వ్యాఖ్యానించారు..చివరిగా ఎవరేంటో ప్రజలకు తెలిసిపోయింది' అని విజయసాయిరెడ్డి ట్వీట్ లో పేర్కొన్నారు.

అమరావతిపై టీడీపీ కొత్త ప్లాన్.. రేపటి నుంచి మూడు రోజుల పాటు ప్రజాభిప్రాయసేకరణ

ఏపీ రాజధానిని అమరావతి నుంచి తరలించడాన్ని నిరసిస్తూ రైతులతో కలిసి ఇప్పటివరకూ ఆందోళనలు సాగిస్తున్న టీడీపీ తాజాగా దీన్ని మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా రేపటి నుంచి మూడు రోజుల పాటు ప్రజా చైతన్య యాత్రల్లోనే ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టాలని నిర్ణయించింది. పార్టీ అధినేత చంద్రబాబు పిలుపుమేరకు రాష్ట్రవ్యాప్తంగా ప్రజా చైతన్య యాత్ర చేపట్టిన టీడీపీ వైసీపీ ప్రభుత్వం తొమ్మిది నెలల్లో తీసుకున్న పలు ప్రజావ్యతిరేక నిర్ణయాలను ఎండగడుతోంది. ఎలాగో ప్రజల్లోకి వెళుతున్నారు కాబట్టి అందులో భాగంగానే మూడు రాజధానులపై ప్రజా బ్యాలెట్ నిర్వహించాలని భావిస్తోంది... మూడు రాజదానుల నిర్ణయంతో ప్రజలను సీఎం జగన్ అయోమయంలోకి నెట్టారని, తన స్వార్ధం కోసమే విశాఖను రాజధానిని ఎంచుకున్నారు తప్ప అక్కడ అభివృద్ధి చేసే ఉద్దేశం ఆయనకు లేదని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో విమర్శించారు. జగన్ తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయంపై ప్రజాభిప్రాయం కోరాలని నిర్ణయించామని, అందులో భాగంగానే రేపటి నుంచి జరగబోయే యాత్రలో ప్రజాభీష్టమేమిటో తెలుసుకుంటామని రవీంద్ర వివరించారు. రేపటి నుంచి మూడు రోజుల పాటు ప్రజా బ్యాలెట్ ద్వారా ప్రజాభిప్రాయం సేకరిస్తామని, జగన్ అమరావతి కేంద్రంగా చేస్తున్న అల్లరిని రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తామన్నారు. జగన్ తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయంపై కేంద్రం స్పష్టత ఇవ్వాలని తాడికొండ మాజీ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ డిమాండ్ చేశారు. అమరావతిపై జగన్ తన అక్కసును వెళ్లగక్కుతుంటే కేంద్రం స్పందించకపోవడం విచారకరమన్నారు. కేంద్రం ఇప్పటికైనా జగన్ నిర్ణయంపై తన అభిప్రాయమేంటో స్పష్టంగా చెప్పాలన్నారు. అమరావతిలోని 132 సంస్ధలను తరిమేస్తున్న జగన్ విశాఖను అభివృద్ధి చేస్తామంటే ఎవరూ నమ్మే స్ధితిలో లేరని శ్రావణ్ కుమార్ వ్యాఖ్యానించారు. రాజధానిలో ఉండే పేదల కోసం గత ప్రభుత్వం 5 వేల ఇళ్లను నిర్మించిందని, వాటిని గాలికొదిలేసి మళ్లీ పేదలకు రాజధానిలో భూములు కేటాయిస్తామనడం విడ్డూరమన్నారు.

పేదలకు వివాదాస్పద భూములిస్తారా ? జగన్ సర్కారుకు పవన్ ప్రశ్న...

ఏపీ ప్రభుత్వం పేదలకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేయనున్న నేపథ్యంలో, జనసేనాని పవన్ కల్యాణ్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. వివాదాలకు తావులేని భూములనే ఇళ్ల స్థలాలుగా ఇవ్వాలని సూచించారు. నిర్దిష్ట అవసరాల కోసం సమీకరించిన భూములను ఇతర అవసరాలకు కేటాయిస్తే వివాదాలు రేగే అవకాశముందని తెలిపారు. రాజధాని నిర్మాణం కోసం సమీకరించిన భూములను ఇళ్ల స్థలాల కోసం కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేయడాన్ని పవన్ తప్పుబట్టారు. ఇల్లు లేని పేదలకు ఇళ్ల స్థలం ఇస్తామంటే ఎవరూ అభ్యంతరం వ్యక్తం చేయరని, చిత్తశుద్ధి ఉంటే పేదలకు వివాద రహిత భూములనే పంపిణీ చేయాలని హితవు పలికారు. భూములు ఇచ్చిన రైతులు ఓవైపు ఉద్యమాలు చేస్తుంటే, మరోవైపు ప్రభుత్వం పేదలకు పట్టాలు ఇచ్చేందుకు ప్రయత్నాలు చేయడం ప్రజల మధ్య చిచ్చుపెట్టడమేనని ఆరోపించారు. రాజధాని భూములను లబ్దిదారులకు ఇచ్చి చేతులు దులుపుకోవాలని ప్రభుత్వం భావిస్తోందని, కానీ ఆ తర్వాత చట్టపరమైన చిక్కులు వస్తే బాధపడేది పేదవాళ్లేనని అభిప్రాయపడ్డారు.

హీరో మహేష్ బాబుకి జగనన్న విద్యా దీవెన!!

స్టార్ హీరోల సినిమాల రిలీజ్ సమయంలో.. ప్రభుత్వాలు స్పెషల్ షోలకు పర్మిషన్ ఇవ్వడం, పన్ను రాయితీలు ఇవ్వడం కామన్. అలా కాకుండా వెరైటీగా ఓ స్టార్ హీరోకి ప్రభుత్వ పథకం వర్తింప చేస్తే ఎలా ఉంటుంది?. ఏపీ అధికారుల నిర్లక్ష్యం పుణ్యమా అని హీరో మహేష్ బాబు ఫోటో ఓ ప్రభుత్వ పథక లబ్ధిదారుల్లో ప్రత్యక్షమైంది. ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా విద్యా దీవెన పథకాన్ని తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఇటీవల విజయనగరం జిల్లాలో సీఎం వైఎస్ జగన్ ఈ పథకాన్ని ప్రారంభించారు. అయితే ఈ పథకానికి సంబంధించి విద్యార్థులకు పంపిణీ చేసిన కార్డులు తప్పుల తడకగా ఉన్నాయి. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు సిద్దార్థ డిగ్రీ కళాశాలలో లక్ష్మీ అనే విద్యార్థిని ఫోటోకు బదులుగా సినీ హీరో మహేష్ బాబు ఫొటో వచ్చింది. మరోచోట కూడా లోకేష్ అనే విద్యార్థి ఫోటో స్థానంలో మహేష్‌బాబు ఫోటో ప్రత్యక్షమైంది. దీంతో షాకైన విద్యార్థులు.. అధికారులకు ఫిర్యాదు చేశారు. కార్డుల జారీలో లోపాలు బయటపడటంతో అధికారులు.. ఎక్కడ పొరపాటు జరిగిందో ఆరా తీస్తున్నారు.

ఢిల్లీ అల్లర్లు.. ఇంటెలిజెన్స్ బ్యూరో ఉద్యోగిని చంపి మురికి కాలువలో పడేసారు!

ఢిల్లీలో చెలరేగిన హింసాకాండలో షాకింగ్ ఘటన వెలుగుచూసింది. 26 ఏళ్ల ఇంటిజెన్స్ బ్యూరో ఉద్యోగి అంకిత్ శర్మను అల్లరి మూకలు హతమార్చాయి. ఢిల్లీలోని చాంద్‌బాగ్‌లో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది. రెండేళ్ల క్రితం ఇంటెలిజెన్స్ బ్యూరోలో చేరిన శర్మ.. కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్నారు. మంగళవారం సాయంత్రం నుంచి కనిపించకుండా పోయిన అంకిత్ శర్మ.. ఓ మురుగు కాలువలో విగతజీవిగా కనిపించాడు. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం... విధులు నిర్వహించుకుని ఇంటికి తిరిగి వస్తుండగా అల్లరిమూక ఆయనపై దాడి చేసి, హతమార్చి, పక్కనే ఉన్న మురికి కాల్వలో పడేసింది. ఆయన శరీరంపై బుల్లెట్ గాయాలు కూడా ఉన్నాయని తెలుస్తోంది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు, అంకిత్ శర్మ హత్య నేపథ్యంలో ఢిల్లీలో ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. కాగా ఈశాన్య ఢిల్లీలో చెలరేగిన అల్లర్ల కారణంగా ఇప్పటికే 20 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. మరో 200 మందికి పైగా గాయపడినట్టు సమాచారం.