జి.20 దేశాల్లో భారత్ బెస్ట్! ఆర్బీఐ గవర్నర్
posted on Apr 17, 2020 @ 12:27PM
ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక సంక్షోభం నెలకొంది. అయినా భారత ఆర్థిక పరిస్థితి మిగతా దేశాల కంటే బాగుంది. ప్రపంచ వ్యాప్తంగా దేశాల వృద్ధి రేటు తిరోగమనంలో ఉంటే, G20 దేశాల్లో భారత్ ఎక్కువ వృద్ధి రేటు నమోదు చేస్తుందని IMF వెల్లడించినట్లు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ అన్నారు.
ఆర్‌బిఐ భారత ఆర్థిక వ్యవస్థపై కరోనా ప్రభావాన్ని ఎప్పటికి అప్పుడు సమీక్షిస్తోంది. క్వారంటైన్‌లో ఉండి సేవలు అందిస్తున్న ఉద్యోగులకు, కరోనా ఉద్యోగులకు సేవలు చేస్తున్న డాక్టర్లకు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ కృతజ్ఞతలుతెలిపారు.
1930 నాటి సంక్షోభాన్ని ఇప్పుడు కరోనా గుర్తు చేస్తోంది. ప్రపంచ మార్కెట్లు ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నాయి. స్థూల ఆర్థిక వ్యవస్థ క్షీణించిందని శక్తికాంత దాస్ చెప్పారు. లాక్ డౌన్ తర్వాత వ్యవస్థలోకి రూ.1.20 లక్షల కోట్లు విడుదల చేశారు. జీడీపీలో 3.2 శాతం ద్రవ్యాన్ని అందుబాటులోకి తెచ్చారు. బ్యాంకుల్లో సరిపడా ద్రవ్యం అందుబాటులో ఉంది.
2020 ఏడాదిలో భారత వృద్ధి రేటు 1.9 శాతం ఉంటుందని ఐఎంఎఫ్ అంచనా వేసిందని శక్తికాంత దాస్ చెప్పారు. 2021-22 ఆర్థిక సంవత్సరంలో మన వృద్ధి రేటు 7.4 శాతంగా ఉంటుందని అంచనా వేస్తున్నట్లు తెలిపారు.
కరోనా కారణంగా చిన్న, మధ్యతరహా పరిశ్రమలు భారీగా దెబ్బతిన్నాయని శక్తికాంత దాస్ చెప్పారు. ఎలాంటి పరిస్థితులను అయినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. ఖరీఫ్‌లో 36 శాతం ధాన్యం ఉత్పత్తి పెరిగింది. ఏప్రిల్‌లో ఆహార ఉత్పత్తుల ధరలు 2.3శాతం పెరిగాయి. ఆటోమొబైల్ పరిశ్రమలో ఉత్పత్తి, అమ్మకాలు తగ్గాయి. విద్యుత్ వినియోం బాగా తగ్గింది. బ్యాంకుల కార్యకలాపాలు సాఫీగాసాగుతున్నాయి. లాక్‌డౌన్ వల్ల ప్రపంచ జీడీపీకి 9 ట్రిలియన్ డాలర్ల నష్టం'' అని శక్తికాంత దాస్ వివరించారు.