నిమ్మగడ్డ కేసులో మరోసారి జగన్ సర్కార్‌కు చుక్కెదురు

నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహారంలో జగన్ సర్కార్ పంతం నెగ్గేలా కనిపించడంలేదు. నిమ్మగడ్డ కేసులో మరోసారి జగన్ సర్కార్‌కు చుక్కెదురైంది. హైకోర్టు తీర్పుపై స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది.  రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పదవి ఖాళీగా ఉండకూడదని, కాబట్టి హైకోర్టు తీర్పుపై స్టే ఇవ్వాలని కోరుతూ ఏపీ ప్రభుత్వం తరఫు న్యాయవాది సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై స్పందించిన సుప్రీంకోర్టు.. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ను పునర్నియమించాలంటూ హైకోర్టు తీర్పు చెప్పినందున ఆ పదవి ఖాళీగా ఉన్నట్టు ఎలా అవుతుందని ప్రశ్నించింది. అంటే, పరోక్షంగా ఆ పదవిలో నిమ్మగడ్డ ఉన్నారు కదా అనే అభిప్రాయాన్ని సుప్రీంకోర్టు వ్యక్తం చేసింది. ఏపీ ప్రభుత్వం స్టే ఇవ్వాలని కోరగా, దాన్ని తిరస్కరించిన సుప్రీంకోర్టు.. తదుపరి విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది.

తెలంగాణ హైకోర్టులో కరోనా కలకలం.. రేపటి నుంచి పూర్తిగా మూసివేత

తెలంగాణలో కరోనా విజృంభిస్తోంది. తాజాగా తెలంగాణ హైకోర్టు సిబ్బందికి, సెక్యూరిటీ బలగాలకు కరోనా పరీక్షలు నిర్వహించగా 10 మందికి పాజిటివ్ అని తేలింది. ఇప్పటివరకు హైకోర్టులో మొత్తం 25 మంది ఉద్యోగులకు కరోనా సంక్రమించింది. దీంతో రేపటి నుంచి హైకోర్టు మూసివేయాలని నిర్ణయం తీసుకున్నారు.  హైకోర్టును పూర్తిగా శానిటైజ్ చేయాలని న్యాయమూర్తులు ఆదేశించారు. కరోనాను దృష్టిలో ఉంచుకుని హైకోర్టులోని ఫైళ్లు మొత్తం జ్యుడిషియల్ అకాడమీకి తరలించారు. ముఖ్యమైన కేసులు ఏవైనా ఉంటే వీడియో కాన్ఫరెన్స్ ద్వారానే విచారించాలని నిర్ణయించారు.

రైతన్నకు ఒరిగింది ఏంటి? యుశ్రారైకాపా రంగుల లోకం తప్ప

వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతిని జగన్ సర్కార్ 'రైతు దినోత్సవం'గా ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే, దీనిపై టీడీపీ నేత నారా లోకేష్ ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పించారు. "ఈ రోజు వైఎస్ జగన్ 'రైతు దగా దినోత్సవం'. విత్తనాలు ఇవ్వలేని కొడుకు, 14 వేల మంది రైతుల్ని బలిగొని వ్యవసాయ రంగాన్ని చిన్నాభిన్నం చేసిన తండ్రి జన్మదినాన్ని రైతు దినోత్సవం అంటూ ప్రకటనలు ఇచ్చి ప్రజాధనం వృధా చెయ్యడం దారుణం." అని లోకేష్ వ్యాఖ్యానించారు. "వ్యవసాయ రంగానికి బడ్జెట్ లో కోత, భరోసా లో కోత, గిట్టుబాటు ధర అడ్రెస్స్ లేదు, ఏడాదికి లచ్చ రూపాయిల లబ్ది రత్నం గల్లంతు, గత ప్రభుత్వ హయాంలో ఉన్న సున్నా వడ్డీకి పేరు మార్పు, ఉచిత విద్యుత్ పథకానికి పేరు మార్పు. రైతన్నకు ఒరిగింది ఏంటి? యుశ్రారైకాపా రంగుల లోకం తప్ప." అని విమర్శించారు లోకేష్. అన్నట్టు లోకేష్ వాడిన 'యుశ్రారైకాపా' పదం అర్థమైందో లేదో. 'యుశ్రారైకాపా' అంటే 'యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ'కి షార్ట్ ఫామ్ అన్నమాట.

కేసీఆర్ ఎక్కడుంటే మీకెందుకు?.. సెక్షన్-8 అంటే నాలుక తెగ్గోస్తారు

తెలంగాణ సర్కార్ పై విపక్షాలు విరుచుకుపడుతున్నాయి. కరోనా విలయతాండవం, పాత సచివాలయం కూల్చివేత వంటి అంశాలపై విమర్శలు గుప్పిస్తున్నాయి. రాష్ట్రంలో కరోనా విలయతాండవం చేస్తుంటే సీఎం కేసీఆర్ ఎక్కడున్నారు? అంటూ ప్రశ్నిస్తున్నాయి. కరోనా కాలంలో ఉద్యోగులకు పూర్తీ జీతాలు ఇవ్వలేని ప్రభుత్వం.. ఇంత కంగారుగా పాత సచివాలయం కూల్చివేసి రూ.500 కోట్లతో కొత్త సచివాలయం నిర్మించడం అవసరమా అని ప్రశ్నిస్తున్నాయి. ఇక టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అయితే, 2012-13లో పూర్తయిన భవనాలను ఇప్పుడు కూల్చివేయడం దారుణమని, విభజన చట్టం ప్రకారం గవర్నర్ సెక్షన్-8 అమలు చేయాలని డిమాండ్ చేశారు. విపక్షాల వ్యాఖ్యలపై మంత్రి శ్రీనివాస్ గౌడ్ స్పందించారు. కేసీఆర్ ఎక్కడుంటే మీకెందుకు? ఏ ఒక్క ప్రభుత్వ పథకమైనా ఆగిందా? అంటూ ప్రశ్నించారు. సచివాలయంపై కాంగ్రెస్, బీజేపీ నేతలు విషాన్ని కక్కుతున్నారని మండిపడ్డారు. తెలంగాణ వెనుకబాటుతనానికి ఆంధ్రా నాయకులే కారణమని ఇన్నాళ్లూ భావించామని, కానీ ఇక్కడి నాయకులే కారణమని ఇప్పుడర్థమవుతోందని మంత్రి శ్రీనివాస్ అన్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డీ.. ముందు నీ కుర్చీ కాపాడుకో, తెలంగాణ ఉద్యమంలో నువ్వెకడున్నావ్ అంటూ ప్రశ్నించారు.  బిల్డింగ్‌లు అప్పగించి ఏపీ ప్రభుత్వం ఇక్కడి నుంచి వెళ్లిపోయిందని గుర్తుచేసారు. ఆంధ్రా వాళ్లు మాట్లాడినట్టు మీరు కూడా సెక్షన్-8 అంటున్నారు. మరోసారి సెక్షన్-8 అంటే నాలుక తెగ్గోస్తారు. హైదరాబాద్ నగరం తెలంగాణ సొత్తు. ఇక్కడ ఇతరుల పెత్తనాన్ని సహించం అంటూ వ్యాఖ్యానించారు. పాత సచివాలయంలోకి కనీసం ఫైర్ ఇంజిన్ వెళ్లలేని పరిస్థితి ఉంది. సచివాలయం రాష్ట్రానికి ఒక ఐకాన్‌గా ఉండాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నారని మంత్రి శ్రీనివాస్ పేర్కొన్నారు.

సీఎం కేసీఆర్ ఆరోగ్యం పై హైకోర్టులో పిటిషన్

తెలంగాణ సీఎం కేసీఆర్ రాష్ట్రంలో కరోనా కేసులు మొదలైనప్పటినుండి వైరస్ కట్టడికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, ప్రజలు తీసుకోవలసిన జాగ్రత్తల పై తరచుగా మీడియా సమావేశాలు నిర్వహించి ప్రజలను అప్రమత్తం చేసిన సంగతి తెలిసిందే. ఐతే కొద్ది రోజుల క్రితం అయన కార్యాలయం ఐన ప్రగతి భవన్ లో 30 కరోనా పాజిటివ్ కేసులు తేలాయి. ఇందులో కేసీఆర్ సెక్యూరిటీ సిబ్బందికి కూడా కరోనా సోకినట్లు వార్తలు వచ్చాయి. ఆ తరువాత అయన అటు మీడియా సమావేశాల్లో కానీ లేదా అధికారుల తో సమీక్షలు కానీ నిర్వహించినట్లుగా పెద్దగా సమాచారం లేదు. దీనికి తోడు ముఖ్యమంత్రి ఫామ్‌హౌస్‌కి షిఫ్ట్ అయినట్లుగా వార్తలు వచ్చాయి. దీంతో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలను ఫామ్‌హౌస్‌కి రావద్దన్నారని ప్రచారం జరుగుతోంది. అంతే కాకుండా అక్కడి నుంచే అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాలన సాగించేందుకు కావలసిన ఏర్పాట్లు కూడా జరిగినట్లుగా వార్తలు వచ్చాయి. ఐతే ఇపుడు కేసీఆర్ ఆరోగ్యం పై స్పష్టత కోరుతూ హైకోర్టు లో ఒక పిటిషన్ దాఖలైంది. నవీన్ అలియాస్ తీన్ మార్ మల్లన్న ఈ పిటిషన్ దాఖలు చేసారు. ఆ పిటిషన్ లో ముఖ్యమంత్రి ఫామ్‌హౌస్‌కి వెళ్లినట్లుగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోందని.. సీఎం కేసీఆర్ ఆరోగ్యంపై రాష్ట్ర ప్రజలకు వివరాలు తెలియాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ ప్రగతి భవన్‌లో లేదా అందుబాటులో లేరన్న సాకు తో వివిధ శాఖలకు సంబంధించిన అధికారులు సక్రమంగా పనిచేయట్లేదని ఆ పిటిషన్ లో పేర్కొన్నారు. ముఖ్యమంత్రి ఆరోగ్యం ఎలా ఉందో అని రాష్ట్ర ప్రజలు ఆందోళన చెందుతున్నారని పిటిషనర్ తెలిపారు. గత నెల 28న మాజీ ప్రధాని పీవీ నరసింహారావు శత జయంతి రోజు కేసీఆర్ చివరిసారిగా మీడియా ముందుకు వచ్చారని ఆ పిటిషన్‌లో తెలిపారు. ఐతే ఈ పిటిషన్ పై హైకోర్టు ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.

హైకోర్టులో ఏసీబీకి ఎదురు దెబ్బ.. హాస్పిటల్ కు షిఫ్ట్ చేయమని ఆదేశాలు

అచ్చెన్నాయుడు కేసులో ఏసీబీకి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. తనకు ప్రయివేట్ హాస్పిటల్ లో చికిత్స తీసుకునేందుకు అనుమతి ఇవ్వాలని అచ్చెన్న దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు వెంటనే ఆయనను ప్రయివేట్ హాస్పిటల్ లో చేర్చి చికిత్స అందించాలని ఆదేశించింది. అయితే కోర్టు ఆదేశాలపై ఏసీబీ తరపు లాయర్ అభ్యంతరం వ్యక్తం చేస్తూ వాదించారు. అచ్చెన్నాయుడును ఏ ఆస్పత్రికి తరలించాలన్నది గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్‌ నిర్ణయించాలని లాయర్ వాదించారు. అయితే ప్రభుత్వం తరుఫు న్యాయవాది వాదనను హైకోర్టు తోసిపుచ్చింది. హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో అచ్చెన్నాయుడును గుంటూరు లోని రమేష్‌ ఆస్పత్రికి తరలించనున్నట్లుగా తెలుస్తోంది. ఏసీబీ అరెస్ట్ కు ఒక రోజు ముందు అచ్చెన్నాయుడు కు పైల్స్ ఆపరేషన్ జరగడంతో జడ్జ్ ముందు హాజరు పరిచి ఆయనను గుంటూరు జీజీహెచ్ లో చేర్చి చికిత్స అందించారు. అయితే జూలై 1న గుంటూరు ప్రభుత్వాస్పత్రి నుంచి పూర్తిగా కోలుకోకుండానే డిశ్చార్జి చేసారు. దీంతో ఆయనను ఏసీబీ అధికారులు నేరుగా విజయవాడ సబ్‌జైలుకు తరలించారు. అయితే ప్రభుత్వం ఒత్తిడి మేరకే ఆయన్ను బలవంతంగా డిశ్చార్జి చేశారని అపుడే టీడీపీ నేతలు విమర్శలు గుప్పించారు. ఈ క్రమంలోనే అచ్చెన్నాయుడు హైకోర్టును ఆశ్రయించారు.

ఈ నెలాఖరులోగా కొత్త సచివాలయం పనులు ప్రారంభం

27 ఎకరాల్లో 20శాతం స్థలంలోనే కొత్త సచివాలయం.. ఆరు అంతస్తుత్లో దీర్ఘ చతురస్రారాకంలో నిర్మాణం.. రెండు హెలిప్యాడ్స్, విశాలమైన పార్కింగ్ సదుపాయాలు.. రాష్ట్ర అధికార పుష్పం తంగేడు ఆకారంలో ఫౌంటెన్లు.. ఫ్రాన్స్ లోని  ప్యాలెస్ ఆఫ్ వర్సైల్స్ నమూనాలో.. డిజైన్ చేసిన ప్రముఖ ఆర్కిటెక్ట్ హఫీజ్‌.. ఈ నెలాఖరులోగా పనులు ప్రారంభం.. తెలంగాణ కొత్త సచివాలయం అత్యాధునిక హంగులతో నిర్మించడానికి ప్రభుత్వం సిద్దమైంది.  పాత సచివాలయం ఉన్న 27ఎకరాల స్థలంలో కేవలం 20శాతం మాత్రమే భవననిర్మాణానికి వినియోగించనుంది. మిగతా స్థలంలో రెండు హెలిప్యాడ్స్, విశాలమైన పార్కింగ్ సదుపాయలు, పార్క్ లు, ఫౌంటెన్లు ఏర్పాటు చేసేలా డిజైన్ చేశారు.  ఏడు లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో దీర్ఘ చతురస్రాకారంలో ఆరు అంతస్తులతో కొత్త భవనాన్ని 500 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో నిర్మించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. వాస్తు దోషం లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ల్యాండ్ స్కేప్‌లు, రాష్ట్ర అధికార పుష్పమైన తంగేడు పువ్వు ఆకారంలో ఫౌంటెన్లు, ఒకేసారి 800 కార్లు పార్కు చేసేలా విశాలమైన పార్కింగ్ సదుపాయాలు కల్పిస్తారు. ఒకేసారి రెండు హెలికాప్టర్లు ల్యాండ్ అయ్యేలా ఏర్పాట్లు చేయనున్నారు. ఫ్రాన్స్‌లోని ప్రపంచ ప్రసిద్ధి చెందిన ప్యాలెస్ ఆఫ్ వర్సైల్స్ భవనం స్ఫూర్తితో డిజైన్ నమూనాను ముంబైకి చెందిన ప్రముఖ ఆర్కిటెక్ట్ హఫీజ్‌ రూపొందించారు. కొత్త భవనం నమూనాను ఖరారు చేశారు. అయితే దక్కన్ వాస్తురీతుల సమ్మిళితం ఈ భవనం డిజైన్ లో అగుపిస్తుంది. ప్రధానంగా భవనస్థంభాలు కాకతీయ వాస్తురీతులకు దగ్గరగా ఉండటంతో పాటు గవాక్షాల్లో దక్కన్ రీతులు గోచరిస్తున్నాయి. ఈ నెలాఖరులో పనులు ప్రారంభించి వీలైనంత త్వరగా పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.

గ్యాంగ్ స్టర్ వికాస్ దూబే ముఖ్య అనుచరుడి ఎన్ కౌంటర్

ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్ లో ఎనిమిది మంది పోలీసులను కిరాతకంగా హత్య చేసిన గ్యాంగ్ స్టర్ వికాస్ దూబే ప్రధాన అనుచరుడు అమర దూబే ను ఈరోజు తెల్లవారుజామున ఉత్తరప్రదేశ్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు ఎన్ కౌంటర్ చేసారు. ఈ నెల 3న వికాస్ దూబే ను అరెస్ట్ చేయడానికి వెళ్లిన డిఎస్పీ తో సహా ఎనిమిది మంది పోలీసులను కాల్చి చంపి తరువాత వారి శరీరాలను ముక్కలుగా చేసిన వారిలో ఈ అమర్ దూబే ముఖ్యుడిగా పోలీసులు గుర్తించారు. ఇది ఇలా ఉండగా ప్రధాన నిందితుడు వికాస్ దూబే హర్యానా లోని ఫరీదాబాద్ లో ఒక హోటల్ లో తలదాచుకుంటున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. దీంతో యూపీ పోలీసులు ఫరీదాబాద్ చేరుకొని ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. అయితే వికాస్ దూబే కు  దారుణమైన నేర చరిత్ర తో పాటు రాజకీయంగా పెద్ద తలకాయల తో లింకులు కూడా ఉండడంతో ఈ కేసు విషయంలో ఏం జరుగుతుందో అని ప్రజలు కూడా ఆసక్తిగా గమనిస్తున్నారు.

భారీ భద్రత మధ్య భారీ యంత్రాలతో కూల్చివేత పనులు

25ఎకరాల స్థలం సిద్దం చేయడానికి రెండు వారాల సమయం.. సచివాలయానికి వెళ్లే అన్నిదారులు బంద్.. విపక్షాలు ఆందోళనలు చేయకుండా కట్టడి.. తెలంగాణ సచివాలయ భవనం కూల్చివేత పనులు చాలా వేగంగా సాగుతున్నాయి. విపక్షాలు, ప్రజాసంఘాలు ఆందోళనకు దిగక ముందే పూర్తిగా నేలమట్టం చేయాలన్న ఆలోచనలో ప్రభుత్వ యంత్రాంగం ఆగమేఘాల మీద పనులు చేస్తోంది. సచివాలయం చుట్టూ ఉన్న రోడ్డులన్నీ బంద్ చేశారు. ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తూ ఆందోళనలకు తావు లేకుండా భారీ యంత్రాలతో కూల్చివేత పనులు త్వరత్వరగా చేస్తున్నారు. భారీ బందోబస్తు మధ్య 25.5 ఎకరాల సచివాలయం ప్రాంగణాన్ని భారీ కొత్త భవన నిర్మాణం కోసం సిద్దం చేస్తున్నారు.

మాస్క్ అవసరం లేదంటూ కరోనా కు వెల్కమ్ చెప్పిన బ్రెజిల్ అధ్యక్షుడు

ప్రపంచం మొత్తం కరోనా తో వణుకుతుంటే దానికి ఏమాత్రం భయపడాల్సిన పని లేదు.. కనీసం మాస్క్ కూడా పెట్టుకోము అన్న దేశాధ్యక్షులు ఇద్దరే ఇద్దరు. ఒకరు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కాగా మరొకరు బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బోల్సోనారో. ఇదిగో ఇంకేముంది వ్యాక్సిన్ కొద్దీ రోజుల్లోనే వచ్చేస్తుంది ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం లేదు అన్న మహానునుభావులు వీళ్ళు. కనీసం దేశం లోని ప్రజలకు ముందుండి నడపవలసిన వాళ్ళే ఇలా ఉంటె ఇక అక్కడ పరిస్థితులు ఎలా ఉంటాయో మనం ఊహించుకోవచ్చు. ప్రస్తుతం కరోనా తో విలవిలలాడుతున్న దేశాల టాప్ లిస్ట్ లో 30,97,084 కేసులతో అమెరికా, తరువాత 16,74,655 కేసులతో బ్రెజిల్ మొదటి రెండో ప్లేసు ల లో ఉన్నాయి. . తాజాగా బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బోల్సోనారో కరోనా బారిన పడ్డారు. లేటెస్ట్ గా చేయించుకున్న పరీక్షల్లో ఆయనకు కరోనా వైరస్ సోకినట్లు నిర్ధారణ ఐంది. అంతకు ముందు ఆయన రెండుసార్లు కరోనా పరీక్షలు చేయించుకున్నా నెగటివ్ అని తేలింది. ఐతే మూడవసారి మాత్రం పాజిటివ్ అని తేలింది. ఇక కరోనా టెస్టుల గురించి, మాస్కు ధరించడం గురించి ఈయన చుట్టూ పెద్ద కాంట్రవర్సీనే నడుస్తోంది. ఎంత దేశాధినేతైనా సరే మాస్క్ ధరించాల్సిందేనన్న బ్రెజిల్ కోర్టు వ్యాఖ్యలను ఆయన కొట్టి పారేశారు. అంతే కాకుండా కరోనా టెస్టు లు తరుచూ చేయించుకోవడం వల్ల తన ఊపిరితిత్తులు శుభ్రపడుతున్నాయని గొప్ప కామెంట్ ఒకటి చేశారు. ఒక పక్క కరోనా బ్రెజిల్ లో తీవ్రంగా స్ప్రెడ్ అవుతుంటే ర్యాలీలు నిర్వహించిన మహానుభావుడు ఈ బోల్సోనారో. అయితే బోల్సోనారో తీరుపై ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. ఇదే విషయమై బ్రెజిల్‌లోని సావోపాలో గవర్నర్ జాయ్ డోరియా మాట్లాడుతూ బ్రెజిల్‌లో కరోనా తీవ్ర స్థాయిలో విజృంభిస్తున్నా అధ్యక్షుడికి ఏమాత్రం పట్టడం లేదని, దేశంలో ఇపుడు కరోనా కంటే బోల్సనారో వైరస్ అత్యంత ప్రమాదకరం అంటూ తీవ్ర విమర్శలు చేశారు.

సచివాలయం కూల్చివేతపై విరుచుకుపడిన విపక్షాలు

చరిత్రలో చీకటి రోజు - ఉత్తమ్ సచివాలయం కూల్చివేతపై హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు లో విచారణకు తీసుకునే లోపే కూల్చివేయడం అన్యాయమని రాష్ట్ర పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. 132ఏండ్ల చరిత్ర ఉన్న సచివాలయాన్ని కూల్చివేసిన ఈ రోజు చరిత్రలో చీకటిరోజు అన్నారు. కేసీఆర్ మూఢ నమ్మకానికి కోట్లాది రూపాయల ప్రజాధనం వృద్ధా అవుతుందని ఆయన విమర్శించారు. ఉద్యోగులకు జీతాలు ఇవ్వడానికి ఖజానా ఖాళీగా ఉందని చెప్పే సిఎం 500 కోట్లను ఎక్కడి నుంచి తీసుకువస్తారని, ప్రస్తుత తరుణంలో కొత్త సచివాలయం అవసరమా? అని ప్ర‌శ్నించారు. ఒక్క కుటుంబ అవసరాల కోసం తెలంగాణ ప్రజలందరినీ ఇబ్బంది పెడుతున్నారని ఆయన విమర్శించారు. సచివాలయానికే రాని సిఎంకు కొత్త సచివాలయం ఎందుకు?.. ప్రజలు ప్రాణాలు గాలికి వదిలేసి కోట్లాది రూపాయల ప్రజాధనం వృద్ధా చేస్తున్నారు.. రాష్ట్రంలో నిజాం నాటి నిరంకుశ పాలన.. - బిజెపి ఎంపి బండి సంజయ్ సచివాలయం 132ఏండ్ల చరిత్ర గల సచివాలయాన్ని రాత్రికి రాత్రి కూలగొట్టడం దుర్మార్గమైన చర్య అన్నారు బిజేపీ ఎంపి బండి సంజయ్. రాష్ట్రంలో నిజాం పాలన నాటి నిరంకుశ ,నియంతృత్వ పాలన కొనసాగుతోందని విమర్శించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పరిపాలనకు, సరిపోయే విధంగా కట్టిన ఈ బిల్డింగ్ ను చాదస్తంతో ప్రవర్తిస్తూ…రాత్రికి రాత్రే కూలగొట్టడం మతిలేని చర్య అన్నారు. 132 ఏండ్ల చరిత్రగల భవనాలను నేలమట్టం చేయడం, కోట్లాది రూపాయల ప్రజా ధనం వృధా చేయడం నిరంకుశ చర్య అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి విలయ తాండవం చేస్తుంది.  కరోనా బారినపడిన ప్రజలు ఆసుపత్రులు లేక , సరైన వైద్య సదుపాయం లేవు.  ప్రైవేటు కార్పోరేట్ ఆస్పత్రుల దోపిడీతో అల్లాడుతున్నారు. ఇలాంటి సమయంలో వైద్య పరీక్షలు నిర్వహించి ప్రజల ప్రాణాలు కాపాడాల్సిన ప్రభుత్వం సచివాలయం కూల్చివేతపై ఆగమేఘాలమీద నిర్ణయాలు తీసుకోవడం విడ్డూరమ‌న్నారు. తిరుగుబాటు ఎదుర్కొనే రోజు వస్తుంది - విజయశాంతి సీఎం కేసీఆర్ తప్పులు పెరిగిపోతున్నాయి. ప్రజలను పట్టించుకోకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని సినీ నటి విజయశాంతి విమర్శించారు. ప్రజల తిరుగుబాటు ఎదుర్కొనే రోజులు త్వరలోనే ఉన్నాయన్నారు. ప్రజలు కరోనాతో అల్లాడుతుంటే కూల్చివేతలు అవసరమా - డికె అరుణ రాష్ట్రంలో ప్రజలు అల్లాడుతుంటే సచివాలయం కూల్చివేత అవసరమా అంటూ బిజెపి జాతీయ ప్రతినిధి, మాజీ మంత్రి డికె అరుణ ప్రశ్నించారు. ఒక రోజు కూడా సచివాలయానికి వెళ్ళని కేసీఆర్ కు సచివాలయం ఎందుకని ఆమె ఎద్దేవా చేశారు. 

సీఎం గారి ఆఫీస్ కు బంగారం స్మగ్లింగ్ మరక..!

కరోనా ను హ్యాండిల్ చేయడంలో మంచి పేరు తెచ్చుకుంది కేరళలోని వామపక్ష పినరై విజయన్ ప్రభుత్వం. దేశంలోనే మొట్టమొదటి కరోనా కేసు నమోదైంది కేరళలోనే.. అయినా కూడా ఇప్పటి వరకు అక్కడ మొత్తం కరోనా కేసుల సంఖ్య 5700 దాటలేదు. ఇంత గొప్ప ఘనత సాధించిన పినరై విజయన్ ప్రభుత్వానికి తాజాగా బంగారం స్మగ్లింగ్ మరక అంటింది. ఈ స్మగ్లింగ్ తో ఆ ప్రభుత్వానికి డైరెక్ట్ గా సంబంధం లేకపోయినా ఒక అధికారి వల్ల ఈ చెడ్డపేరు వచ్చిందని తెలుస్తోంది. వివరాలలోకీ వెళితే కేరళ కేపిటల్ తిరువనంతపురం లోని ఎయిర్ పోర్ట్ కస్టమ్స్ అధికారులు మొన్న ఆదివారం జరిపిన తనిఖీలలో ఏకంగా 15 కోట్ల విలువైన 30 కిలోల బంగారం పట్టుబడింది. ఈ బంగారం నగరం లోని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఎంబసీ పేరుతొ ఆహార పదార్ధాల పార్సెల్ గా బుక్ అయినట్లు గుర్తించారు అధికారులు. దీని పై అధికారులు దర్యాప్తు చేపట్టగా సూత్రధారి స్వప్న సురేష్ అనే మహిళ అని తేలింది. దీంతో రాష్ట్రం లోని ప్రతిపక్షాలు విజయన్ సర్కార్ పై విరుచుకు పడుతూన్నాయి. కారణం ఏంటంటే బంగారం స్మగ్లింగ్ సూత్రధారి స్వప్న రాష్ట్ర ఐటి శాఖ ఉద్యోగి కావడం పైగా ఆ శాఖను సాక్షాత్తు సీఎం చూస్తూ ఉండడమే. అంతే కాకుండా ఆమె అంతకుముందు యుఎఇ ఎంబసి లో కూడా పని చేసింది. దానిని అడ్డుపెట్టుకుని ఎంబసీ పేరుతొ కొన్ని డాక్యుమెంట్లను ఫోర్జరీ చేసి ఆ రాయబార కార్యాలయం ముసుగులో ఆమె స్మగ్లింగ్ కు పాల్పడినట్లుగా తెలుస్తోంది. దీనికి ఎంబసీలోని మరో ఉద్యోగి కూడా సహకరించినట్లుగా అధికారులు గుర్తించారు.  ఐతే ఈ వ్యవహారం లో నిందితురాలు స్వప్నను కాపాడటానికి సీఎంవో లోని ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి కూడా ప్రయత్నించారని బయటకు వచ్చింది. దీంతో అప్రమత్తమైన విజయన్ ప్రభుత్వం ముందుగా ఆమెను ఆ పోస్ట్ నుండి డిస్మిస్ చేసింది. ఆ తరువాత సిఎంఓ లోని సీనియర్ అధికారిని కూడా బదిలీ చేసి అతని స్థానం లో మరో అధికారిని నియమించినట్లు సమాచారం.

దొరగారు అప్పుడు అవహేళన చేశారు.. ఇప్పుడు అజ్ఞాతంలోకి వెళ్లారు

కరోనా కట్టడిలో తెలంగాణ ప్రభుత్వం విఫలమైంది అంటూ కాంగ్రెస్ నాయకురాలు విజయశాంతి ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పించారు. "శిశుపాలుడి తప్పుల్లా తెలంగాణ సీఎం కేసీఆర్ గారి తప్పులు నానాటికీ పెరిగిపోతున్నాయి. ప్రజాతీర్పు తనకే అనుకూలమని విర్రవీగుతున్న దొరగారికి... ప్రజల తిరస్కారం, తిరుగుబాటును ఎదుర్కొనే రోజులు దగ్గర్ల పడ్డాయని తాజా పరిణామాలతో అర్థమవుతోంది." అని విజయశాంతి అన్నారు. "ప్రతి విషయంలోనూ ఉచిత సలహాలిస్తూ, మాయమాటలు చెప్పి, తనను మేధావిగా ప్రదర్శించుకునే ప్రయత్నం చేసే కేసీఆర్ గారు... కరోనా మహమ్మారిని కట్టడి చేయడంలో చేతులెత్తేసి, అజ్ఞాతంలోకి వెళ్లిపోవడం ఇప్పుడు తెలంగాణాలో హాట్ టాపిక్‌గా మారింది." అని ఎద్దేవా చేశారు. "కరోనా విషయంలో నిర్లక్ష్యం తగదని  ప్రతిపక్షాలు హెచ్చరిస్తే సీఎం దొరగారు దాన్ని అవహేళన చేశారు. కరోనా కట్టడికి తగిన వైద్య వసతులు లేవని పత్రికల్లో వార్తలు వస్తే.. వాటి యాజమాన్యంపై కేసీఆర్ గారు శాపనార్థాలు పెట్టారు." అని మండిపడ్డారు.  "కరోనా పరీక్షల్లో రాష్ట్ర ప్రభుత్వ అలసత్వాన్ని హైకోర్టు తప్పుపట్టినా... సీఎం దొరగారు దాన్ని ఏమాత్రం పట్టించుకోలేదు. పరిస్థితి చేయి దాటి పోతుందని గ్రహించి, తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళ్ ఇసై గారు స్వయంగా జోక్యం చేసుకుని, సంక్షోభ నివారణకు చొరవ తీసుకున్నారు. గవర్నర్ చొరవను కూడా సీఎం దొరగారు అడ్డుకోవడం నిరంకుశత్వానికి పరాకాష్ట అన్న విమర్శలు వినిపిస్తున్నాయి. సీఎంగా కేసీఆర్ గారు తన బాధ్యతల నిర్వహణలో విఫలమైనందు వల్ల గవర్నర్ జోక్యం చేసుకోవడాన్ని రాష్ట్ర ప్రజలు సైతం స్వాగతిస్తున్నారు." అని వ్యాఖ్యానించారు. "గవర్నర్ చొరవను సీఎం కేసీఆర్ గారు అనవసర రాద్ధాంతం చేయడం కంటే, ప్రజలకు భరోసా ఇచ్చేలా చర్యలు తీసుకోవడం మేలు. లేనిపక్షంలో తెలంగాణ సమాజ ఆగ్రహ జ్వాలలు తారాస్థాయికి చేరుతాయనడంలో సందేహం లేదు." అని విజయశాంతి పేర్కొన్నారు.

అధిక చార్జీలు వసూలు చేయవద్దు

నాణ్యమైన చికిత్సతో రోగులకు భరోసా కల్పించాలి.. బాధ్యతతో టెస్టులు చేయాలి.. అధిక చార్జీలు వసూలు చేయవద్దు.. ప్రైవేటు, కార్పోరేటు హాస్పిటల్స్ యాజమాన్యంతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన గవర్నర్ తమిళ సై.. వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న 11 హాస్పిటల్స్.. కరోనా నియంత్రణ, చికిత్స పై ప్రభుత్వం పూర్తిగా చేతులెత్తేసింది అంటూ ప్రజలు నేరుగా రాష్ట్ర గవర్నర్ కు ఫిర్యాదు చేశారు. ట్విట్టర్లో అనేకమంది గవర్నర్ తమిళసై సౌందర రాజన్ దృష్టికి ప్రభుత్వ తీరు, ప్రైవేటు హాస్పిటల్స్  అధిక ఫీజులు వసూలు చేస్తున్న విషయాలను తీసుకువెళ్లారు. దాంతో ఆమె నగరంలోని ప్రైవేట్ హాస్పిటల్స్ యాజమాన్యాల తో రాజ్ భవన్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కరోనా పాజిటివ్ రోగులను చేర్చుకోవడం లేదన్న విషయం పై ఆమె వివరణ కోరారు. అధిక ఫీజులు వసూలు చేయడం సరికాదని, కరోనా విజృంబిస్తున్న తరుణంలో మానవత్వంతో వ్యవహరించాలని, రోగులకు మెరుగైన చికిత్స అందించాల్సిన బాధ్యతను గుర్తించాలన్నారు. బెడ్స్ కు కొరత ఉంటే హాస్పిటల్స్ కు అనుబంధంగా ఉన్న వైద్య కళాశాలలను వినియోగించుకోవాలని గవర్నర్ సూచించారు. కరోనా పాజిటివ్ రోగులొస్తే కచ్చితంగా చేర్చుకుని మెరుగైన చికిత్స అందించాలని హాస్పిటల్స్ యాజమాన్యాలకు తేల్చి చెప్పారు. నాణ్యమైన చికిత్సతో రోగులకు భరోసా కల్పించాలన్నారు. కరోనా కల్లోలంతో ప్రజల్లో భయాందోళనలు పెరిగిపోతున్న కారణంగా ప్రైవేట్ హాస్పిటల్స్ కు వచ్చే రోగుల పట్ల మానవత్వంతో చికిత్స అందించేలా చర్యలు తీసుకోవాలని యాజమాన్యాలకు సూచించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ పేషేంట్స్ నుండి అధిక చార్జీలు వసూలు చేయకూడదని గవర్నర్ తమిళ సై స్పష్టం చేశారు.

మోడీ పాట పాడిన మరో వైసిపి నేత.. అసలేం జరుగుతోంది

వైసిపిలో ఇప్పటికే రఘురామ కృష్ణం రాజు రాజేసిన కుంపటి ఇంకా చల్లారలేదు. అయన స్వపక్షంలో విపక్షం లాగా తయారయ్యారని ఆ పార్టీ నేతలు ఒక పక్క మండి పడుతున్నారు. ఇపుడు దీనికి మరో వైసిపి నేత జత అయ్యారు. తాజాగా సినీ నిర్మాత, విజయవాడ వైసిపి ఎంపీ అభ్యర్థి పీవీపీ మోడీని ప్రశంసలతో ముంచెత్తారు. చైనా పై బలంగా డిజిటల్ స్ట్రైక్ చేసి, దౌత్యం ద్వారా సరిహద్దు నుంచి వెనక్కినెట్టారని ట్విటర్‌లో మెచ్చుకున్నారు. హైదరాబాద్ లోని బంజారాహిల్స్‌ పోలీస్ స్టేషన్‌లో పీవీపీపై ఇప్పటికే పలు కేసులు నమోదయ్యాయి. పీవీపీ తన ఇంటిపై దాడి చేసి, దౌర్జన్యానికి పాల్పడ్డారంటూ కైలాష్ విక్రమ్ అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు. ఈ కేసులో ఆయనకు అరెస్టు వారెంట్ కూడా జారీ అయింది. అదే సమయంలో తన ఇంటికి వచ్చిన బంజారాహిల్స్ పోలీసులపై పెంపుడు కుక్కులను వదిలారని మరోసారి ఆయనపై ఆరోపణలు వచ్చాయి. దీంతో అప్పటి నుండి అయన అజ్ఞాతంలోకి వెళ్లి.. మళ్ళీ ఈ రోజు ప్రధాని మోదీని ప్రశంసిస్తూ ట్వీట్ పెట్టారు. "శాంతి సందేశం పంపిస్తున్న చైనా..! హిందీ, చీని భాయి భాయి అని నెహ్రు గారిలా మోసపోకుండా, డిజిటల్ స్ట్రైక్ మరియు దౌత్యం ద్వారా వెనక్కి నెట్టిన నరేంద్ర మోదీ గారికి దేశమంతా జేజేలు." పీవీపీ ట్వీట్ చేశారు. పెండింగ్ కేసుల విషయంలో పీవీపీని అరెస్ట్ చేసేందుకు హైదరాబాద్ పోలీసులు రంగంలోకి దిగిన పరిస్థితుల్లో ఆయన ప్రధాని మోదీని కీర్తిస్తూ ట్వీట్ చేయడం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. ఇంతకూ కేసుల నుండి బయట పడేందుకు పీవీపీ మోడీని కీర్తిస్తున్నారా లేక ఈయన కూడా రఘురామ కృష్ణంరాజు తరహాలోనే బీజేపీకి చేరువవుతున్నారా అని ఏపీ రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది.

విదేశీ విద్యార్థుల‌కు ట్రంప్ సర్కార్ భారీ షాక్‌

అమెరికాలో చదువుకుంటున్న విదేశీ విద్యార్థులకు ట్రంప్ ప్రభుత్వం షాక్ ఇచ్చింది. కరోనా దెబ్బకు ప్రపంచ వ్యాప్తంగా పలు విద్యా సంస్థలు ఆన్ లైన్ క్లాసులు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. అమెరికాలోనూ కొన్ని విద్యా సంస్థలు ఆన్ లైన్ క్లాసులు నిర్వహిస్తున్నాయి. అయితే, ఆన్ లైన్ క్లాసుల్లో పాల్గొంటున్న విదేశీ విద్యార్థులు తమ దేశంలో ఉండాల్సిన పనిలేదని అమెరికా ప్రకటించింది.  నాన్‌ ఇమ్మిగ్రెంట్‌ వీసా(ఎఫ్‌-1 ,ఎం-1 తాత్కాలిక ప్రాతిపదికన జారీ చేసేవి) మీద ప్రస్తుతం అమెరికాలో ఉండి ఆన్‌లైన్‌ క్లాసులు వింటున్న వాళ్లు దేశం విడిచి వెళ్లాలని ప్రకటించింది. ఆన్ లైన్ క్లాసుల కోసం రిజిస్ట్రేషన్ చేసుకున్నవారు దేశం విడిచి వెళ్లాలని, ఒక వేళ అలాంటి విద్యార్థులు దేశంలోనే ఉంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసి ఉంటుందని అమెరికా ఇమ్మిగ్రేషన్‌ అండ్‌ కస్టమ్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌(ఐసీఈ) హెచ్చరించింది. అదే విధంగా కొత్తగా విద్యార్థి వీసాలు జారీ చేయబోమని పేర్కొంది. ఆన్‌లైన్ చ‌దువుల కోసం రిజిస్టర్ చేసుకున్న విద్యార్థుల‌కు వీసాలు ఇవ్వ‌మ‌ని, అలాంటి విద్యార్థుల‌ను యూఎస్ క‌స్ట‌మ్స్ అండ్ బోర్డ‌ర్ ప్రొటెక్ష‌న్ ప‌ర్మిట్ దేశంలోకి రానివ్వ‌ద‌ని ఐసీఈ స్ప‌ష్టం చేసింది.

విజయసాయి ట్వీట్ కు సైకో ప్రిజనరి అంటూ అయ్యన్న స్ట్రాంగ్ కౌంటర్

టీడీపీ అధినేత చంద్రబాబు, అయన కుమారుడు లోకేష్ పై తీవ్ర విమర్శలతో కూడిన ట్వీట్లతో చెలరేగిపోతున్న ఎంపీ విజయ సాయి రెడ్డికి తాజాగా మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. చంద్రబాబు దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారన్న విజయసాయి తాజా వ్యాఖ్యలపై స్పందిస్తూ అసలు దిగజారుడు ఇదే అంటూ స్ట్రాంగ్ కౌంటరిచ్చారు. ముందుగా ఎంపీ విజయసాయి రెడ్డి తన ట్వీట్ లో ''జగన్ గారి ప్రభుత్వం పేదలకు 30 లక్షల ఇళ్ల పట్టాలిస్తుంటే నిరసనలకు పిలుపునిచ్చాడు ఒక గుడ్డి విజనరీ. హైదరాబాద్లో ఉంటూ జూమ్ యాప్ ద్వారా కుట్రలు. ఉద్యోగులకు జీతాలు ఇవ్వకుండా బిల్లు అడ్డుకోవడం. ఇళ్ళ పట్టాలు ఇవ్వకుండా కోర్టుకు వెళ్లడం. ఇంకెంత దిగజారతావు బాబూ? దీంతో 2024లో నీ అడ్రస్ గల్లంతే'' అంటూ చంద్రబాబు పై విరుచుకు పడుతూ ట్వీట్ చేశారు. ఐతే దీనికి అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చారు టీడీపీ నేత అయ్యన్న పాత్రుడు. "వైఎస్ఆర్ ఇళ్ల పట్టాల అమ్మకం కార్యక్రమాన్ని మూడోసారి వాయిదా వేసాడు సైకో ప్రిజనరీ అని అంటూ స్ట్రాంగ్ కామెంట్స్ చేసారు. దీంతో పాటు.. సహజీవనం అన్న మేధావి ఇప్పుడు కరోనా కారణంగా ఇళ్ల పట్టాలు అమ్మకం వాయిదా పడింది అనడం అందరికి విడ్డూరంగా ఉంది. ఇళ్ల పట్టాలు అమ్మకం, డబుల్ రేటుకి స్థలాలు కొనడం. అధికార పార్టీ వాళ్లే తమది చెత్త పాలన అంటూ వేరే కుంపటి పెడుతున్నా ప్రిజనరీ దిగజారుతూనే ఉన్నాడు'' అంటూ ఎంపీ విజయసాయికి ట్విట్టర్ ద్వారా అయ్యన్నపాత్రుడు ఘాటుగా రిప్లై ఇచ్చారు.

అందులోనూ కక్కుర్తి.. ఇళ్లను కరోనా కేంద్రాలుగా మార్చేశారు

పేదల ఇళ్ల స్థలాల పేరుతో వైసీపీ నేతలు భారీ దోపిడీకి శ్రీకారం చుట్టారని టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోపించారు. టీడీపీ నేతలతో చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎక్కడికక్కడ కుంభకోణాలు చేస్తూ, వైసీపీ నేతలు తమ పొట్టలు పెంచుకుంటున్నారని విమర్శించారు. పేదలకు హౌసింగ్‌ అంటూనే వారి ఇళ్లు కూలుస్తున్నారని ధ్వజమెత్తారు. ఎవరన్నా ప్రశ్నిస్తే వారిపై దాడులు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.  టీడీపీ హయాంలో కట్టించిన ఇళ్లను లబ్ధిదారులకు ఎందుకివ్వలేదు? అని ప్రశ్నించారు. టీడీపీ హయాంలో కట్టిన ఇళ్లు శిథిలావస్థకు చేరుస్తున్నారని మండిపడ్డారు. టీడీపీ హయాంలో 10 లక్షల ఇళ్లు పూర్తి చేశాం. లబ్ధిదారులకు ఇవ్వాల్సిన ఇళ్లను కరోనా కేంద్రాలుగా మార్చేశారని ఆరోపించారు. గ్రామాల్లో మేం రెండున్నర సెంట్ల స్థలం ఇస్తే, వైసీపీ ప్రభుత్వం దాన్ని ఒకటిన్నర సెంటుకు తగ్గించిందని విమర్శించారు. పట్టణ ప్రాంతాల్లో మేం రెండు సెంట్ల స్థలం ఇస్తే వీళ్లు ఒక సెంటే ఇస్తామనే పరిస్థితి వచ్చింది అన్నారు.  కుప్పంలో ఏం పాపం చేశారని ఆ పేదవాళ్ల ఇళ్లు కూలగొడుతున్నారు? అని ప్రశ్నించారు. పేదల ఇళ్ల పేరుతో ఈ నాయకులు దోచుకుంటున్నారని ఆరోపించారు. లాగేసుకున్న భూముల ధరలు రెండున్నర రెట్లు పెంచేసి వీళ్లు దోచుకుంటున్నారు. చివరికి పేదవాళ్లకు ఇళ్లు కట్టించడంలోనూ కక్కుర్తి పడుతున్నారంటూ విరుచుకుపడ్డారు. కరోనాను అదుపు చేయడం మానేసి రాజకీయ కక్షలకు వైసీపీ ప్రాధాన్యం ఇస్తోందని విమర్శించారు. తప్పుడు కేసులు పెట్టి టీడీపీ నేతలను వేధిస్తున్నారు అని చంద్రబాబు మండిపడ్డారు.

క్లినికల్‌ ట్రయల్స్‌ వాయిదా

హైదరాబాద్‌ నిమ్స్ లో ఈ రోజు నుంచి జరగాల్సిన క్లినికల్‌ ట్రయల్స్‌ వాయిదా పడ్డాయి. క్లినికల్ ట్రయల్స్ నిర్వహించేందుకు భారత వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్‌) అనుమతి కోసం నిమ్స్ వేచి చూస్తోంది. రెండు మూడు రోజుల్లో ఐసీఎంఆర్ నుంచి అనుమతి వచ్చే అవకాశం ఉంది. అనుమతి రాగానే ఫేస్ 1, ఫేస్ 2 కింద ఈ క్లినికల్‌ ట్రయల్స్‌ జరుగుతాయి.  హైదరాబాద్‌కు చెందిన భారత్ బయోటెక్ సంస్థ కరోనాను అరికట్టేందుకు కొవాక్సిన్ పేరిట వ్యాక్సిన్ ని రూపొందించిన సంగతి తెలిసిందే. ఈ వ్యాక్సిన్‌‌ను ఆగస్టు 15వ తేదీ నాటికి అందుబాటులోకి తీసుకురావాలని ఐసీఎంఆర్‌ భావిస్తోంది. ఈ వ్యాక్సిన్‌ క్లినికల్ ట్రయల్స్‌ కోసం ఐసీఎంఆర్ ఇప్పటికే దేశంలోని 12 ఆస్పత్రులను ఎంపిక చేసింది. అందులో హైదరాబాద్‌లోని నిమ్స్‌, విశాఖలోని కేజీహెచ్ కూడా ఉన్నాయి.