తాజ్ మహాల్ సందర్శనకు గ్రీన్ సిగ్నల్

దేశవ్యాప్తంగా తెరుచుకోనున్న అనేక సందర్శనీయ స్థలాలు ప్రపంచ వింతల్లో ఒకటైన అద్భుత కట్టడం తాజ్ మహల్ సందర్శనకు ఈనెల ఆరు నుంచి అనుమతించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు కేంద్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్ తన ట్విట్టర్లో పోస్ట్ చేశారు. దేశంలోని అన్ని సందర్శనీయ, స్మారక ప్రాంతాలను ఈనెల ఆరవ తేదీ నుంచి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా విస్తరించిన కరోనా కారణంగా దేశవిదేశాల్లోని దర్శనీయ స్థలాలకు, పర్యాటక ప్రాంతాలన్నింటినీ మూసివేశారు. మన దేశంలో దాదాపు మూడువేల ఐదువందలకు పైగా సందర్శనీయ స్థలాలను కేంద్ర పురావస్తు పరిశోధన సంస్థ(ఏఏస్ఐ) మూసివేసింది. మార్చి 17 నుంచి జూన్ 8 వరకు వివిధ మతాలకు చెందిన దేవాలయాలు, మసీదులు, చర్చిలు తదితర ప్రార్థనా స్థలాలు కూడా మూసివేశారు. అన్ లాక్ మొదటి దశలో ఆధ్యాత్మిక కేంద్రాలను తెరిచారు. కరోనా ప్రభావం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో మాత్రం లాక్ డౌన్ కొనసాగుతుంది. తాజాగా పర్యాటక, సందర్శనీయ, చారిత్రాత్మక ప్రాంతాల్లో పర్యాటనలకు అనుమతించాలని కేంద్రం నిర్ణయించింది. అయితే ఆయా రాష్ట్రాలు స్థానిక పరిస్థితులను సమీక్షించి నిర్ణయం తీసుకోవాలని సూచించింది.

తెలంగాణ పై కరోనా పంజా.. పాజిటివ్ కేసులలో కొత్త రికార్డ్

తెలంగాణలో కరోనా తన పంజా బాగానే విసురుతోంది. నిన్న ఒక్క రోజులోనే 1892 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. ఇందులో ఒక్క హైదరాబాద్ పరిధిలోనే 1685 కేసులు నమోదయ్యాయి. దీంతో తెలంగాణ లో మొత్తం కేసుల సంఖ్య 20,462 కు చేరుకున్నాయి. ఇందులో కరోనా తో పోరాడి 10,195 మంది కోలుకోగా 283 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం తెలంగాణలో 9,984 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. ఐతే నిన్న 1126 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 5,965 శాంపిల్స్‌ సేకటించి పరీక్షించారు. వీరిలో 4,073 మందికి నెగెటివ్ రాగా 1,892 మందికి పాజిటివ్ గా తేలింది. ఐతే ప్రైవేట్ ల్యాబ్స్‌లో కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువగా వస్తున్నాయని ప్రభుత్వం చెబుతోంది. మరి ముఖ్యంగా ఒక ల్యాబ్‌లో చేసిన టెస్ట్ లలో ఎక్కువ పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయని తెలిపింది. దీంతో శుక్రవారం జీహెచ్ఎంసీ పరిధిలో రికార్డ్ స్థాయిలో కరోనా కేసులు నమోదయ్యాయని వెల్లడించింది. ఇప్పటివరకు తెలంగాణలో 1,04,118 మందికి కరోనా పరీక్షలు చేసినట్లు వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది.

వివాదాస్పద ఏపీ ప్రాజెక్ట్.. పీకే సొంత టీమ్ గురువుకే పంగనామం పెట్టిందా..!

గత సంవత్సరం ఏపీలో జరిగిన ఎన్నికలలో వైసీపీ ఘన విజయం సాధించి అధికారం చేపట్టింది. ఐతే ఈ విజయం వెనుక ప్రశాంత్ కిషోర్ కు చెందిన ఐప్యాక్ సంస్థ విశేష కృషి ఉన్న విషయం తెలిసిందే. ఇదే విషయాన్నీ తాను గెలిచిన తర్వాత ఆ టీమ్ తో జరిగిన మీటింగ్ లో స్వయంగా జగన్ కూడా వ్యక్తం చేసిన సంగతి తెల్సిందే. ఐతే ఈ గెలుపు తర్వాత సీఎం జగన్ పీకే టీమ్ కు ప్రజల నుండి వచ్చే ఫీడ్ బ్యాక్, ప్రభుత్వ పథకాల ప్రచారం తో పాటు వివిధ కార్యక్రమాల పై వర్క్ చేయాలనీ కోరినట్లు తెలుస్తోంది. దీని పై స్టడీ చేసిన పీకే ఈ ప్రాజెక్ట్ కోసం కొంత భారీ మొత్తాన్ని కోట్ చేసినట్లు తెలుస్తోంది. ఐతే ఈ ప్రాజెక్ట్ ను సీఎం కొద్దీ రోజులు పక్కన పెట్టినట్లుగా తెలుస్తోంది. ఈ లోగా పీకే టీమ్ లోని కొంత మంది మెంబర్స్ వేరే ప్రాజెక్టుల కోసం ఇతర రాష్ట్రాలకు వెళ్లిపోగా కొంతమంది మాత్రం ఇదే ప్రాజెక్ట్ తమకు అప్పగిస్తే పీకే కోట్ చేసిన మొత్తం లో సగానికే చేస్తామని ప్రపోజ్ చేశారట. ఐతే ఈవిషయాన్ని సీఎం పీకే కు తెలియ చేయగా మొదట షాక్ తిన్నా తరువాత మీ ఇష్టం అని ఉరుకున్నారట. దీంతో ప్రభుత్వం వాలంటీర్లకు ట్రైనింగ్ ఇచ్చే ప్రోగ్రాం ను ఆ టీమ్ కు అప్పగించారట.  ఐతే కొద్దీ రోజుల నుండి వలంటీర్ల వ్యవస్థ తో పాటు గ్రామీణ రెవెన్యూ వ్యవస్థను పీకే టీమ్ చేతిలో పెడుతున్నట్టుగా వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ఐతే తాజాగా ఈ వార్తల పై స్పందించిన ప్రశాంత్ కిషోర్ తాము కానీ తమ టీమ్ కానీ ఏపీలో ఎటువంటి ప్రాజెక్ట్ లు చేయడం లేదని ట్వీట్ చేసారు ఇంతకూ సంగతేంటంటే పీకే కార్పొరేట్ సొల్యూషన్స్ పేరుతొ ఒకప్పటి పీకే టీమ్ సభ్యులే ఈ ప్రాజెక్ట్ ను టేక్ అప్ చేసారని తెలుస్తోంది. సో పీకే కార్పొరేట్ సొల్యూషన్స్ పేరుతొ వీళ్ళు తమ గురువు ఐన ప్రశాంత్ కిషోర్ కే పంగనామాలు పెట్టారన్నమాట.

వైసీపీ, బీజేపీ మధ్య బంధం ఇక బయటపడుతుందా...

గత ఎన్నికలలో వైసీపీ విజయానికి పరోక్షంగా బీజేపీ సహకరించిందని ప్రతిపక్షాలు ఆరోపించాయి. కొంత మంది రాష్ట్ర బీజేపీ నాయకులు ఎన్నికల తరువాత ఇన్ డైరెక్ట్ గా ఇదే అభిప్రాయం వ్యక్తం చేసారు. తరువాత బీజేపీ, వైసీపీ నేతల మధ్య అప్పుడప్పుడు మాటల యుద్ధాలు నడిచాయి.  ఐతే సీఎం జగన్ మాత్రం బీజేపీ కేంద్ర నాయకత్వాన్నీ ధిక్కరించే ధోరణి తో కాక వారికి అనుకూలంగానే వ్యవహరిస్తున్నారు. ఐతే వైసీపీలో నెలకొన్న తాజా పరిస్థితుల నేపథ్యంలో ఈ బంధం పై ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయం పడుతున్నారు. అసలు విషయం ఏంటంటే వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు పై అనర్హత వేటు వేయాలని వైసీపీ ఎంపీలు ఈ రోజు స్పీకర్ ను కలిసి విజ్ఞప్తి చేసారు. మరో పక్క రఘరామ రాజు బీజేపీ లో చేరుతారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో ఎలాగైనా అయన పై అనర్హత వేటు వేసి తమ పార్టీలో అసమ్మతి కి వాయిస్ లేకుండా చేయాలని వైసీపీ అధినాయకత్వం భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఇదే సమయం లో అటు రఘు రామ రాజు అసలు వైసీపీ పార్టీ వైఎస్ఆర్ పేరు ఎలా వాడుకుంటుంది అని ప్రశ్నిస్తూ ఎన్నికల సంఘాన్ని కూడా కలిశారు. ఈ పరిస్థితుల్లో కేంద్రం లోని అధినాయకత్వం ఎటు వైపు నిలబడుతుందో అని విశ్లేషకులు ఆసక్తిగా గమనిస్తున్నారు. ఇంతకూ కేంద్రం లోని పెద్దలు ఈ విషయంలో కలగచేసుకుంటారా లేక కర్ర విరగకుండా పాము చావకుండా అన్నట్లుగా వ్యవహరిస్తారో వేచి చూడాలి.

అచ్చెన్న బెయిల్‌ పిటిషన్‌ కొట్టివేత

టీడీపీ నేత, మాజీమంత్రి అచ్చెన్నాయుడు బెయిల్‌ పిటిషన్‌‌ను ఏసీబీ కోర్టు కొట్టివేసింది. ఇటీవల ఈఎస్‌ఐ స్కాం ఆరోపణలుతో ఆయనను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అరెస్ట్‌ కు ఒక్కరోజు ముందు ఆయనకు ఆపరేషన్ జరిగింది. ఈ నేపథ్యంలో బెయిల్ ఇవ్వాలని ఏసీబీ కోర్టును కోరారు. ఇరు వర్గాల వాదనలు విన్న కోర్టు.. అచ్చెన్నాయుడు బెయిల్ పిటిషన్‌ను కొట్టివేసింది.  మరోవైపు, అచ్చెన్నాయుడును ఆసుపత్రికి తరలించే అంశంపై హైకోర్టులో వాదనలు ముగిశాయి. అచ్చెన్నాయుడుకు రెండోసారి ఆపరేషన్ జరిగిందని, ఆపరేషన్ తర్వాత ఆయన పరిస్థితి ఇబ్బందిగా మారిందని లాయర్‌ కోర్టు దృష్టికి తెచ్చారు. మెరుగైన చికిత్స కోసం ఆసుపత్రికి తరలించాలని విజ్ఞప్తి చేశారు. అయితే, ప్రభుత్వ లాయర్‌.. అచ్చెన్నాయుడుకు పూర్తిస్థాయిలో చికిత్స అందించామని, ఆయనకు మెరుగైన వైద్యం అవసరం లేదని పేర్కొన్నారు. వాదనలు విన్న  హైకోర్టు.. ఈ అంశంపై శనివారం తీర్పు ఇస్తామని తెలిపింది. 

మీకు అలవాటైన హత్యారాజకీయాలను వారికి అంటగడతారా?

మచిలీపట్నంకు చెందిన వైసీపీ నేత, మంత్రి పేర్ని నాని అనుచరుడు మోకా భాస్కర రావు హత్య కేసులో టీడీపీ నేత, మాజీ మంత్రి కొల్లు రవీంద్రపై కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై టీడీపీ అధినేత చంద్రబాబు ట్విట్టర్ వేదికగా స్పందించారు.  "ఏసీబీ కేసులు, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు, నిర్భయ కేసులు అయిపోయాయి. ఇప్పుడిక తెలుగుదేశం నేతలపై హత్య కేసులు పెడుతున్నారు. పైగా బీసీ నేతలే లక్ష్యంగా అక్రమకేసులు పెట్టడం ఏంటి? బీసీ నాయకత్వంపై ఎందుకింత పగబట్టారు?" అని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. "అచ్చెన్నాయుడిపై తప్పుడు కేసు, యనమల రామకృష్ణుడుపై ఎస్సీ,ఎస్టీ అట్రాసిటి కేసు, అయ్యన్నపాత్రుడిపై నిర్భయ కేసులు పెట్టారు. బీద రవిచంద్ర యాదవ్ పై శాసనమండలిలోనే వైసీపీ మంత్రులు దాడి చేసారు. ఇప్పుడు మరో బీసీ నేత కొల్లు రవీంద్రపై  హత్యకేసు బనాయిస్తారా? ఏమిటీ ఉన్మాదం? మీ ప్రలోభాలకు లొంగకపొతే, మీ దుర్మార్గాలను ప్రశ్నిస్తే తెలుగుదేశం నేతలపై ఇంతకు తెగిస్తారా? మీకు అలవాటైన హత్యారాజకీయాలను వారికి అంటగడతారా?" అని మండిపడ్డారు. "తెలుగుదేశం పార్టీకి వెన్నెముక బీసిలే అన్న అక్కసుతో... బీసి నాయకత్వాన్నే అణిచేస్తారా..? దీనికి ఇంతకు ఇంత మూల్యం చెల్లించుకోక తప్పదు. ఈ దుశ్చర్యలను తెలుగుదేశం తీవ్రంగా ఖండిస్తోంది. తెలుగుదేశం బీసీ నేతలకు పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుంది. వారిపై పెడుతున్న అక్రమ కేసులకు వ్యతిరేకంగా ప్రభుత్వం పై అన్నివిధాలా పోరాడుతాం." అని చంద్రబాబు పేర్కొన్నారు.

ఆప్కాస్‌ ను ప్రారంభించిన సీఎం జగన్

తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఏపీ కార్పొరేషన్‌ ఫర్‌ ఔట్‌ సోర్స్‌డ్‌ సర్వీసెస్(ఆప్కాస్)‌ను సీఎం వైఎస్ జగన్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. పాదయాత్ర సమయంలో ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగుల కష్టాలు, సమస్యల గురించి తెలుసుకున్నానని అన్నారు. అందుకే వ్యవస్థలో మార్పు తీసుకువచ్చేందుకే ఔట్ సోర్సింగ్ కార్పొరేషన్ ఏర్పాటు చేశామని తెలిపారు. గతంలో కాంట్రాక్టర్లకు మేలు చేసేందుకే ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను తీసుకున్నారని, కానీ ఆ వ్యవస్థను మార్చి నియామకాల్లో పారదర్శకత తీసుకురావాలనే చర్యలు చేపట్టామని సీఎం తెలిపారు. ఎవరికీ లంచాలు ఇవ్వనవసరంలేదని, 50 శాతం ఉద్యోగాలు ఎస్సీ, ఎస్టీలు, బీసీ, మహిళలకే ఇస్తామని స్పష్టం చేశారు. జిల్లాల వారీగా కలెక్టర్లు చైర్మన్ లు గా ఉండి ఈ ఔట్ సోర్సింగ్ ఉద్యోగ నియామకాలను పర్యవేక్షిస్తారని అన్నారు. ఔట్ సోర్సింగ్ కార్పొరేషన్ ద్వారా ఉద్యోగులుగా నియమితులైన వారికి ప్రతి నెల 1వ తేదీన జీతాలు చెల్లించడం జరుగుతుందని తెలిపారు. ఈ విధానంలో లంచాలు, కమీషన్ కు తావులేనందున ఉద్యోగికి పూర్తి జీతం చేతికి అందుతుందని సీఎం జగన్ స్పష్టం చేశారు.

పంద్రా ఆగస్టు కు భారత్ లో కరోనా వ్యాక్సిన్.. ఐసీఎంఆర్ టార్గెట్

ప్రపంచ దేశాలన్నీ కరోనా వైరస్ కలకలం తో కకావికలమౌతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ప్రతి రోజు లక్షల మంది ఈ వైరస్ బారిన పడుతుండగా వేల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఇక భారత్ లో ఐతే గత 24 గంటల్లో 21 వేల పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ వైరస్ ను అరికట్టేందు కోసం వ్యాక్సిన్ తయారీలో 12 ప్రముఖ సంస్థలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. వీటిలో మన దేశానికి చెందిన భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ కూడా ఉంది. హైదరాబాద్ లోని జినోమ్ వ్యాలీలో ఉన్న ఈ సంస్థ ఇప్పటికే జంతువుల పై కరోనా వ్యాక్సిన్ ను పరీక్షించి ఇది సురక్షితమేననీ తేలడంతో పాటు సమర్థంగా పనిచేస్తున్నట్లు గా గుర్తించింది. భారత్ బయోటెక్ యొక్క కరోనా వ్యాక్సిన్ "కోవ్యాక్సిన్" మొదటి, రెండో దశ ట్రయిల్స్ లో భాగంగా మనుషుల పై క్లినికల్ ట్రయల్స్ జరిపేందుకు అనుమతి పొందింది. వ్యాక్సిన్ ఎంత ఎఫెక్టివ్ గా, ఎంత సురక్షితం గా పని చేస్తుందో అనే అంశాల పై ప్రధానంగా ఈ ప్రయోగాలు జరుగుతాయి. ఐతే కరోనా వ్యాక్సిన్ తయారీలో మంచి పురోగతి సాధిస్తున్న భారత్ బయోటెక్ వచ్చే ఆగస్టు 15 నాటికి వ్యాక్సిన్‌ను ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తోంది. ఐసీఎంఆర్ కూడా కరోనా వ్యాక్సిన్ తయారీకి సంబంధించిన ప్రక్రియను వేగవంతం చేయాలని భారత్ బయోటెక్ కు సూచించింది. ఈ వ్యాక్సిన్ తో మనుషుల పై జరిగే ట్రయల్స్ కనుక విజయవంతమైతే ఇదే తొలి వ్యాక్సిన్ గా నిలిచే అవకాశం ఉంది.

మీ పంచాయితీల కోసం ప్రజా ధనం వృధా చెయ్యడం ఏంటి జగన్ గారు?

నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు పై అనర్హత వేటు వేయాలని కోరుతూ లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాకి లేఖ ఇవ్వడానికి వైసీపీ ఎంపీలు ప్రత్యేక విమానంలో ఢిల్లీ వెళ్లిన సంగతి తెలిసిందే. ప్రజా సమస్యల కోసం ఏనాడూ ఢిల్లీ వెళ్ళని నేతలు.. ఇలా సొంత పనుల కోసం స్పెషల్ ఫ్లైట్లు వేసుకుని వెళ్లడం ఏంటంటూ టీడీపీ నేత నారా లోకేష్ విరుచుకుపడ్డారు. ఆ మధ్య సెర్బియా పోలీసులు నిమ్మగడ్డ ప్రసాద్ ని అదుపులోకి తీసుకున్న విషయాన్నీ ప్రస్తావించిన లోకేష్.. ఆ విషయమై అప్పుడు కేంద్రానికి లేఖ రాశారు. ఇప్పుడు సొంత పనికోసం ఏకంగా స్పెషల్ ఫ్లైట్ వేసుకొని వెళ్తున్నారు అంటూ ట్విట్టర్ వేదికగా లోకేష్ విమర్శలు గుప్పించారు. "కేంద్రానికి మొదటి లేఖగా, సెర్బియా పోలీసులు చేతిలో చిక్కుకున్న సహా నిందితుడిని విడిపించమని ఉత్తరం రాసారు. ఇప్పుడేమో, మీ పార్టీ సమస్య కోసం స్పెషల్ ఫ్లైట్లు వేసుకుని ఢిల్లీ వెళ్తున్నారు. ఏ రోజు అయినా, కేంద్రం నుంచి రాబట్టే నిధులు కోసం కానీ, ప్రత్యేక హోదా కోసం కానీ, పోలవరం కోసం కానీ ఇలా స్పెషల్ ఫ్లైట్లు వేసుకుని వెళ్ళారా ? మీ పంచాయితీల కోసం ప్రజా ధనం వృధా చెయ్యడం ఏంటి వైఎస్ జగన్ గారు?" అంటూ లోకేష్ ధ్వజమెత్తారు.

ఆ రోజే ఏపీలో కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ చేయడానికి రంగం సిద్ధమవుతోంది. రాజ్యసభకు ఎన్నికైన నేపథ్యంలో ఇద్దరు మంత్రులు మోపిదేవి వెంకటరమణారావు, పిల్లి సుభాష్‌చంద్రబోస్‌లు తమ పదవులకు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఖాళీ అయిన మంత్రి పదవులను భర్తీ చేయడానికి వీలుగా విస్తరణ చేపట్టనున్నట్లు తెలుస్తోంది. ఆషాఢమాసం ముగిసిన తర్వాత శ్రావణమాసం ప్రారంభంలో మంత్రివర్గ విస్తరణ చేపట్టే అవకాశముందని సమాచారం. కాగా, శ్రావణ మాసం 21వ తేదీ నుంచి ప్రారంభమవుతోంది. దీంతో 22వ తేదీన కొత్త మంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించే వీలున్నట్టు తెలుస్తోంది.  ప్రస్తుతం మంత్రి పదవులకు రాజీనామా చేసిన ఇద్దరు నేతలు బీసీ వర్గానికి చెందినవారు. కొత్త మంత్రులను కూడా బీసీ వర్గం నుంచే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఎంపిక చేస్తారని భావిస్తున్నారు. అంబటి రాంబాబు, విడదల రజిని వంటి వారు మంత్రి పదవులు ఆశిస్తున్న వారిలో ఉన్నారు.

సీఎం జగన్ కు కాపు ఉద్యమ నేత వార్నింగ్ తో కూడిన విన్నపం

కాపుల రిజ‌ర్వేష‌న్ల‌పై ప్ర‌ధాని మోడీతో వెంట‌నే మాట్లాడి రిజ‌ర్వేష‌న్లు క‌ల్పించాలంటూ కాపు ఉద్య‌మ నాయ‌కుడు ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం సీఎం జ‌గ‌న్ కు లేఖ రాశారు. కాపుల స‌మ‌స్య‌లు వెంట‌నే తీర్చాల‌ని తన లేఖ‌లో ఆయన డిమాండ్ చేశారు. అడిగిన వారికి, అడ‌గ‌ని వారికి అన్నీ ఇస్తూ ధాన‌క‌ర్ణుడులా పేరు తెచ్చుకుంటున్న మీరు, మా స‌మ‌స్య ను కూడా పరిష్కరించాలని అయన కోరారు. మీ పార్టీ విజ‌యంలో కాపు జాతి కూడా ఉంద‌ని అంటూ.. ప్రజల యొక్క స‌మ‌స్యలను తీర్చి న‌వీన్ ప‌ట్నాయ‌క్, జ్యోతిబ‌సు, వైఎస్ లాగా మీరు కూడా పేరు తెచ్చుకోవాల‌ని, అల్లా కాకపోతే అది ముణ్ణాళ్ల ముచ్చ‌టే అవుతుంద‌ని ముద్రగడ సున్నితంగా హెచ్చ‌రించారు. కాపులకు బీసీ రిజ‌ర్వేష‌న్లు అనేది త‌మ అంతిమ కోరిక అని, త‌మ‌ను బీసీలో క‌ల‌పాల‌న్న డిమాండ్ కు మీరు కూడా గ‌తంలో మ‌ద్ధ‌తిచ్చారంటూ ముద్ర‌గ‌డ సీఎం జ‌గ‌న్ కు గుర్తు చేశారు. ఐతే కాపు రిజర్వేషన్ల అంశంపై ముద్రగడ పద్మనాభం వైసీపీ ప్రభుత్వాన్నిమొదటి సారిగా కాస్త గట్టిగానే డిమాండ్ చేయడం ఎపి రాజకీయవర్గాల్లో ప్రాధాన్యత సంతరించుకుంది.

సడెన్ గా భారత్-చైనా సరిహద్దులో ప్రత్యక్షమైన ప్రధాని మోదీ

భారత్, చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తత కొనసాగుతుండగా.. లేహ్, లడఖ్‌లో ప్రధాని మోదీ ఆకస్మికంగా పర్యటిస్తున్నారు. ఆయన వెంట త్రివిధ దళాల అధిపతి జనరల్ బిపిన్ రావత్ ఉన్నారు. ప్రధాని షెడ్యూల్ లో లేని ఈ పర్యటనకు ముందుగానే రహస్యంగా ఏర్పాట్లు జరిగినట్లు తెలుస్తోంది. శుక్రవారం ఉదయం లడఖ్ కు ప్రధాని వచ్చారని అక్కడి మీడియా వెల్లడించేంత వరకూ విషయం బయటకు రాకపోవడం గమనార్హం. సరిహద్దుల్లో వీరోచితంగా పోరాడుతూ దేశాన్ని కాపాడుతున్న సైనికుల్లో మనోస్థైర్యాన్ని నింపేందుకు లడఖ్ లో పర్యటించాలని నిర్ణయించుకున్నారు. తొలుత ప్రత్యేక విమానంలో శుక్రవారం ఉదయం 10.00 గంటలకు లేహ్‌కు చేరుకున్న ప్రధాని.. సైనికులతో సమావేశమయ్యారు. ఆర్మీ, ఎయిర్‌ఫోర్స్, ఐటీబీపీ జవాన్లు ఇందులో పాల్గొన్నారు. సరిహద్దుల్లో చైనా దూకుడును దృష్టిలో ఉంచుకుని, పరిస్థితులను సమీక్షించేందుకు ప్రధాని ఆకస్మికంగా పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా గల్వాన్ లోయ ఘటన సహా సరిహద్దుల్లో పరిస్థితిని ప్రధాని సమీక్షించనున్నారు. గల్వాన్ లోయ ఘర్షణలో గాయపడిన జవాన్లును కూడా ప్రధాని పరామర్శించనున్నారు. భారత్, చైనా మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో.. అక్కడ పరిస్థితిని భారత్ ఎప్పటికప్పుడు నిశితంగా పరిశీలిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ హఠాత్తుగా పర్యటించడం ప్రాధాన్యత సంతరించుకుంది.

ఏక్ దో తీన్ డాన్స్ కంపోజర్ సరోజ్ ఖాన్ కన్నుమూత

బాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీలో ఎన్నోహిట్ సాంగ్స్ కు డాన్స్ కంపోజ్ చేసిన ప్రముఖ కొరియోగ్రాఫర్ సరోజ్‌ ఖాన్ ముంబైలోని ప్రముఖ హాస్పిటల్ లో ఈ తెల్లవారుజామున కార్డియాక్ అరెస్ట్ తో కన్నుమూశారు. ఆమె వయస్సు 71 సంవత్సరాలు. జూన్ నెల 20 న శ్వాసకోశ సమస్యతో ఆమె బాంద్రాలోని గురునానక్ ఆసుపత్రిలో చేరారు. ఐతే ఆమెకు డాక్టర్లు కరోనా పరీక్షలు చేయగా ఆమెకు నెగిటివ్ అని తేలింది. అదే హాస్పిటల్ లో చికిత్స పొందుతూ ఈ తెల్లవారు జామున మృతి చెందారు. సరోజ్ ఖాన్ దాదాపు రెండు దశాబ్దాలుగా 2 వేలకు పైగా సినిమాలకు ఆమె నృత్య దర్శకత్వం వహించారు. ‘తేజాబ్’ సినిమాలో మాధురి దీక్షిత్ చేసిన ‘ఏక్ దో తీన్’ పాట ఆమె కు సూపర్ హిట్ ను ఇచ్చింది. ముఖ్యంగా షారుఖ్ ఖాన్ హీరోగా సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో వచ్చిన ‘దేవదాస్’ సినిమాలో ‘డోలా రే డోలారే ’ పాట, తమిళ సినిమా శృంగారం చిత్రం లోని, "జబ్ వి మెట్" లోని ‘యే ఇష్క్ హై’ పాటలు ఆమెకు మంచి పేరు తీసుకు రావడమే కాక జాతీయ స్థాయి అవార్డులు అందుకున్నారు. సరోజ్ ఖాన్ చివరి సారిగా 2019లో కరణ్ జోహార్ నిర్మించిన "కళంక్" సినిమాలో మాధురీ దీక్షిత్ నటించిన "తబా హోగయీ" పాటకు కొరియోగ్రఫీ చేశారు. సరోజ్ ఖాన్ మృతి పట్ల బాలీవుడ్ చిత్ర పరిశ్రమ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ ఆమె కుటుంబ సభ్యులకు తమ సంతాపం తెలియచేస్తున్నారు.

హైకోర్ట్ లో పిటిషన్ వేసిన ఎంపీ రఘురామ కృష్ణంరాజు

నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు పై అనర్హత వేటు వేయడానికి వైసీపీ ప్రయత్నాలు మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రఘురామ కృష్ణంరాజు హైకోర్ట్ లో పిటిషన్ వేశారు. తనపై అనర్హత, సస్పెన్షన్ చర్యలు అడ్డుకోవాలని పిటిషన్ లో కోరారు. తను ఎటువంటి పార్టీ వ్యతిరేఖ చర్యలకు పాల్పడలేదని స్పష్టం చేసిన రఘురామ కృష్ణంరాజు.. తనకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లెటర్ హెడ్ పై షోకాజ్ నోటీసులు వచ్చాయని, తాను ఎన్నికైన యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ పేరు మీద షో కౌజు నోటీస్ ఇవ్వలేదని తెలిపారు. ప్రస్తుతం కరోనా దృష్ట్యా అత్యవసర కేసులు మాత్రమే హైకోర్టు విచారిస్తోంది. ఈ పిటిషన్ సోమవారం పరిశీలనకు వచ్చే అవకాశం ఉంది.

వైసీపీ నేత హత్య కేసులో కొల్లు రవీంద్రపై కేసు నమోదు 

కృష్ణా జిల్లా మచిలీపట్నంకు చెందిన వైసీపీ నేత, మంత్రి పేర్ని నాని అనుచరుడు మోకా భాస్కర రావు హత్య కేసులో మాజీ మంత్రి, టీడీపీ నేత కొల్లు రవీంద్రపై కేసు నమోదు చేశారు పోలీసులు. కుట్రదారుగా కొల్లు రవీంద్రపై 109 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. హత్య కేసులో ఇప్పటికే ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. మోకాను హత్య చేస్తే తర్వాత అంతా తాను చూసుకుంటా అని కొల్లు రవీంద్ర అభయం ఇచ్చినట్టు నిందితులు పోలీస్ విచారణ వాంగ్మూలంలో చెప్పినట్టు సమాచారం. ఈ క్రమంలో పోలీసులు కొల్లు రవీంద్రను అదుపులోకి తీసుకుని విచారించాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. హత్యలో కొల్లు రవీంద్ర ప్రమేయం ఉన్నట్టు తేలితే ఆయన్ని అరెస్ట్‌ చేసే అవకాశం ఉంది.  కాగా, 2013 లో మోకా భాస్కర రావు చేసిన హత్యలో తమ తండ్రిని కోల్పోవడంతో కక్ష పెంచుకున్న కొడుకులు ఇద్దరు మోకా భాస్కర రావును హత్య చేశారని తెలుస్తోంది. నిందితుల్లో ఒకరి వయసు 19 సంవత్సరాలు కాగా, మరకొరి వయసు 17 సంవత్సరాలు. మరోవైపు, హత్య కేసులో కావాలని మాజీ మంత్రి పేరు ఇరికంచారని టీడీపీ శ్రేణులు మండిపడుతున్నాయి. 

ప్రగతి భవన్ ను తాకిన కరోనా.. తెలంగాణాలో కరోనా విలయం 

తెలంగాణలో కరోనా తీవ్రత రోజు రోజుకు తీవ్రమవుతోంది. గురువారం కూడా భారీగా కొత్త పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో కొత్తగా 1,213 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. ఇందులో ఎక్కువ భాగం 998 కేసులు ఒక్క హైదరాబాద్ పరిధిలో నే నమోదయ్యాయి. ఇక మేడ్చల్‌లో 54, రంగారెడ్డిలో 48, ఖమ్మంలో 18, వరంగల్ రూరల్‌లో 10, వరంగల్ అర్బన్‌లో 9, నల్గొండలో 8, భద్రాద్రిలో 7, సిరిసిల్లలో 6, కరీంనగర్‌లో 5, నిజామాబాద్‌లో 5, ములుగు, నిర్మల్‌ ల లో 4 చొప్పున, నారాయణపేట, కామారెడ్డిలో 2 చొప్పున, గద్వాల్, సిద్దిపేట, మెదక్, యాదాద్రి, నాగర్‌కర్నూల్, వికారాబాద్ ల ‌లో ఒక్కో కేసు నమోదయ్యాయి. ఇది ఇలా ఉండగా నిన్న సీఎం కార్యకలాపాలు సాగించే సీఎం క్యాంప్ ఆఫీసు, ప్రగతి భవన్ లో 4 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో తెలంగాణలో మొత్తం కేసుల సంఖ్య 18,570కి చేరింది. వీరిలో కరోనా మహమ్మారితో పోరాడి గెలిచిన 9,069 మంది డిశ్చార్జి అయ్యారు. 275 మంది ఈ వైరస్ బారిన పడి మరణించారు. ప్రస్తుతం తెలంగాణలో 9,226 యాక్టివ్ కరోనా కేసులున్నాయి. ఇక టెస్టుల విషయానికి వస్తే గడిచిన 24 గంటల్లో 5,356 శాంపిల్స్‌ను పరీక్షించగా 4,143 మందికి నెగెటివ్ రాగా 1,213 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. తెలంగాణలో ఇప్పటి వరకు 98,153 మందికి కరోనా పరీక్షలు చేసినట్లు వైద్యఆరోగ్యశాఖ ప్రకటించింది.

అచ్చెన్నాయుడు వ్యవహారం పై హైకోర్టులో పిటిషన్

మాజీ మంత్రి టీడీపీ సీనియర్ నేత అచ్చెన్నాయుడు ను నిన్న హడావిడిగా గుంటూరు జీజీహెచ్ నుండి డిశ్చార్జ్ చేసి విజయవాడ సబ్ జైలుకు తరలించిన సంగతి తెలిసిందే. దీని పై ఒక పక్క రాజకీయంగా తీవ్ర దుమారం రేగుతోంది. ఐతే తాజాగా ఈ వ్యవహారం పై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. కేవలం రాజ‌కీయ కార‌ణాల‌తోనే అచ్చెన్నాయుడును హాడావిడిగా గుంటూరు జీజీహెచ్ నుండి డిశ్చార్జ్ చేసి త‌ర‌లించార‌ని పిటిష‌న‌ర్ పేర్కొన్నారు. ప్ర‌భుత్వ వైద్యుల‌పై ఒత్తిడి తెచ్చి ఆసుప‌త్రి నుండి డిశ్చార్జ్ చేశార‌ని, ఆయ‌న ఆరోగ్య ప‌రిస్థితుల దృష్ట్యా దీని పై వెంట‌నే చ‌ర్య‌లు తీసుకోవాల‌ని వెంక‌టేష్ అనే వ్య‌క్తి కోర్టును ఆశ్ర‌యించారు. ఈ కేసుపై విచార‌ణ శుక్ర‌వారం జ‌రిగే అవ‌కాశం ఉంది.

రూ.705 కోట్ల కుంభకోణం.. జీవీకే రెడ్డి, ఆయన కుమారుడిపై సీబీఐ ఎఫ్ఐఆర్

ముంబయి ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ డెవలప్‌మెంట్, మెయింటెనెన్స్ నిధులను దుర్వినియోగం చేశారంటూ జీవీకే గ్రూప్ కంపెనీల చైర్మన్ గునుపాటి వెంకట కృష్ణారెడ్డి, ఆయన కుమారుడు ముంబయి ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లిమిటెడ్ ఎండీ గునుపాటి వెంకట సంజయ్ రెడ్డి, కొన్ని ఇతర సంస్థలు, ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాకు చెందిన కొందరు అధికారులపైన సీబీఐ కేసు నమోదు చేసింది. ఈ మేరకు నమోదు చేసిన ఎఫ్ఐఆర్‌లో.. 2012-18 మధ్య రూ. 705 కోట్లను అక్రమంగా వాడుకున్నారంటూ సీబీఐ ఆరోపించింది. బోగస్ కంపెనీలకు కాంట్రాక్టులు ఇచ్చి నిధులను అక్రమంగా మళ్లించారన్నది సీబీఐ ప్రధాన ఆరోపణ. ఈ కేసులో జీవీకే రెడ్డి, సంజయ్ రెడ్డితో పాటు మరో 12 సంస్థలపైనా కేసు నమోదైంది. ఈ మేరకు జూన్ 27 రాత్రి ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ కేసులో సీబీఐ బుధవారం ముంబయి, హైదరాబాద్‌లలో జీవీకే రెడ్డి, ఆయన కుమారుడికి చెందిన కార్యాలయాలు.. ముంబయి ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులోని పలు కార్యాలయాలు సహా మొత్తం 6 ప్రదేశాలలో సోదాలు చేసింది.  ముంబయి ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లిమిటెడ్(ఎంఈఎఎల్) అనేది ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఏఏఐ), జీవీకే ఎయిర్‌పోర్ట్ హోల్డింగ్స్ లిమిటెడ్, మరికొన్ని విదేశీ సంస్థలతో కలిసి ఏర్పాటు చేసుకున్న జాయింట్ వెంచర్. ముంబయి విమానాశ్రయ అభివృద్ది, నిర్వహణ, నవీకరణ కోసం దీన్ని ఏర్పాటుచేశారు. ఇందులో జీవీకే ఎయిర్‌పోర్ట్స్ హోల్డింగ్స్ లిమిటెడ్ వాటా 50.5 శాతం కాగా ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా వాటా 26 శాతం. ఈ వెంచర్ సంస్థ‌పై వచ్చే ఆదాయంలో వార్షిక రుసుముగా 38.7 శాతం మొత్తాన్ని ఎంఏఈఎల్ ఏఏఐకి చెల్లించాల్సి ఉంటుంది. మిగతా మొత్తాన్ని విమానాశ్రయ నిర్వహణ, అభివృద్ధి, నవీకరణకు వినియోగించాల్సి ఉంటుంది. సీబీఐ ఆరోపణల ప్రకారం ప్రధానంగా అవినీతి ఇక్కడే జరిగింది. బోగస్ కంపెనీలకు కాంట్రాక్టులు ఇచ్చి నిధులను అక్రమంగా మళ్లించారన్నది సీబీఐ ప్రధాన ఆరోపణ. ఇందుకోసం 9 ప్రయివేటు సంస్థలను వాడుకుందని ఎఫ్ఐఆర్‌లో పేర్కొంది. ఇలా రూ. 310 కోట్ల నిధులను దారి మళ్లించి ముంబయి విమానాశ్రయ పరిసరాల్లో 200 ఎకరాలను రియల్ ఎస్టేట్ డెవలప్‌మెంట్‌కు జీవీకే వినియోగించుకుందని సీబీఐ ఆరోపించింది. జీవీకే గ్రూప్ కంపెనీ ప్రతినిధుల నేరపూరిత చర్యల వల్ల ఏఏఐ తీవ్రంగా నష్టపోయిందని, ఎంఐఏఎల్ వద్ద ఉన్న రూ. 395 మిగులు నిధులను జీవీకే అనుబంధ కంపెనీల్లోకి తరలించారని పేర్కొంది. జీవీకే కారణంగా రూ. 705 కోట్ల నష్టం వాటిల్లిందని సీబీఐ అధికార వర్గాలు వెల్లడించాయి.

అబ్బే ఆ ఎంపీల టూర్ తో ఒరిగేదేమి లేదు.. రఘురామ రాజు  

వైసిపి రెబల్ ఎంపీ రఘురామకృష్ణం రాజు పై అనర్హత వేటు వేయాలని కోరేందుకు కొంతమంది ఎంపీలు న్యాయ సలహాదారులతో సహా ప్రత్యేక విమానం లో ఢిల్లీకి వెళ్తున్నారు. వీరంతా రేపు లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాను కలిసి రఘు రామ రాజును అనర్హుడిగా ప్రకటించాలని కోరనున్నారని సమాచారం. ఈ నేపథ్యంలో వైసిపి ఎంపీల ఈ పర్యటన పై రఘురామరాజు స్పందించారు. ఆ ఎంపీల ఢిల్లీ పర్యటనతో ఎటువంటి ప్రయోజనం ఉండదని అయన తేల్చి చెప్పారు. ఇన్నాళ్లు తన పై జరుగుతున్న వ్యవహారమంతా జగన్ కు తెలియకుండా జరుగుతోందని భావించానని ఐతే ప్రత్యేక విమానం లో ఎంపీలను ఢిల్లీకి పంపిస్తున్నారంటే ఇదంతా జగన్ కనుసన్నలలోనే జరుగుతోందని స్పష్టమౌతోందని అయన అన్నారు. అయినా ప్రజా సమస్యలను ప్రస్తావించిన వారిని సస్పెండ్ చేస్తే ఇక పార్లమెంట్‌లో ఎవరు మిగులుతారన్నారు. అంతే కాకుండా తాను పార్టీకి వ్యతిరేకంగా ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని మరోసారి అయన స్పష్టం చేశారు. తిరుమల శ్రీవారి భూములు అమ్మొద్దని చెప్పానని, తర్వాత సీఎం జగన్ కూడా అదే నిర్ణయం తీసుకున్నారన్నారు. ఇసుక, పేదలందరికీ ఇల్లు పథకంలో ఉన్న తప్పులను మాత్రమే తాను ఎత్తి చూపానన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి నరసాపురం ఎంపీ ఒక లేఖ రాశారు. కేంద్ర ప్రభుత్వం గరీబ్ కళ్యాణ్ యోజన పథకాన్ని పొడిగిస్తూ తీసుకున్న నిర్ణయం పై ఆ లేఖలో కేంద్రానికి కృతజ్ఞతలు తెలిపారు. ఎంతో దూరదృష్టితో తీసుకున్న ఈ పరిపాలనా నిర్ణయంతో 80 కోట్ల మంది పేదలకు మేలు చేస్తుందని అలాగే ప్రధాని మోదీని దయగల మనిషిగా చరిత్ర గుర్తిస్తుందంటూ రఘురామ కృష్ణంరాజు తన లేఖలో ప్రశంసించారు.