సచివాలయం కూల్చివేత పై హైకోర్టు స్టే పొడిగింపు

ఈ నెల 15 వరకు కూల్చివేతలు ఆపాలి తెలంగాణ రాష్ట్ర సచివాలయం కూల్చివేత పై శుక్రవారం విధించిన స్టేను హైకోర్టు ఈ నెల 15 వరకు పొడిగించింది. సచివాలయం కూల్చివేయాలని క్యాబినెట్ ఎప్పుడు నిర్ణయం తీసుకుంది? కూల్చివేతకు సంబంధించి ఇతర శాఖల నుంచి అనుమతులు తీసుకున్నారా? ఈ వివరాలన్నీ కూడా సీల్డ్ కవర్ లో కోర్టు కు తెలియజేయాలన్నారు. సచివాలయం కూల్చివేత కారణంగా కాలుష్యం పెరుగుతుంది అంటూ ప్రొఫెసర్ పి ఎల్ విశ్వేశ్వరరావు దాఖలు చేసిన పిటిషన్ శుక్రవారం విచారణకు తీసుకున్న న్యాయస్థానం సోమవారం వరకు కూల్చివేతలు ఆపాలంటూ స్టే విధించింది. సోమవారం ఉదయం విచారణ కొనసాగిస్తూ  సచివాలయ భవనం కూల్చివేత పనులపై ప్రభుత్వం వివరాలు ఇవ్వాలని కోరింది.

అనంత పద్మనాభ స్వామి ఆలయ నిర్వహణ బాధ్యత ట్రావెన్ కోర్ వంశస్తులదే

తుది తీర్పు వెలువరించిన సుప్రీంకోర్టు కేరళలోని అనంత పద్మనాభ స్వామి ఆలయ నిర్వహణ బాధ్యతలు ట్రావెన్కోర్ రాజ వంశస్థులవే అంటూ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. జస్టిస్ లలిత్ జస్టిస్ మల్హోత్ర  ధర్మాసనం తుది తీర్పును ఈరోజు వెలువరించింది.  అనంత పద్మనాభ స్వామి ఆలయ పాలన బాధ్యత పైన 2011 జనవరి 31న కేరళ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ ట్రావెన్కోర్ వంశస్థులు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. తొమ్మిది సంవత్సరాల పాటు వాదోపవాదాలు విన్న తర్వాత ఈరోజు సుప్రీం కోర్టు తుది తీర్పు ఇచ్చింది. అయితే గత ఏడాది ఏప్రిల్లోనే  విచారణ పూర్తి అయినప్పటికీ తీర్పును మాత్రం రిజర్వ్ చేశారు. సోమవారం తుది తీర్పు తరువాత ఈ ఆలయానికి సంబంధించిన సంపద నిర్వహణ బాధ్యత ట్రావెన్కోర్ వంశస్థుల కే దక్కుతుంది.  2011 లో జరిగిన తవ్వకాలలో అనంత పద్మనాభ స్వామి ఆలయంలో దాదాపు 10 లక్షల కోట్ల విలువైన సంపద బయటపడటం తో ఈ ఆలయం ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. తరతరాలుగా ఆలయ బాధ్యతలు నిర్వహిస్తున్న ట్రావెన్కోర్ రాజవంశానికి ఆలయ నిర్వహణ బాధ్యతలు దక్కాయి.

వైఎస్సార్సీపీకి ఢిల్లీ హైకోర్టు నోటీసులు

ఏపీ అధికార పార్టీ వైఎస్సార్సీపీకి ఢిల్లీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. వైఎస్సార్ కాంగ్రెస్ పేరుతో ప్రచారం చేసుకుంటూ తమ పార్టీ పేరును దెబ్బతీస్తున్నారని అన్న వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు మహబూబ్ బాషా ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. దీనిపై విచారణకు స్వీకరించిన ఢిల్లీ హైకోర్టు.. కౌంటర్ దాఖలు చేయాలంటూ వైఎస్సార్సీపీకి, కేంద్ర ఎన్నికల సంఘానికి నోటీసులు పంపింది. ఏపీలో అధికార పార్టీ 'యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ' పేరుతో ఎన్నికల సంఘం వద్ద రిజిస్టర్ అయిందని, వైఎస్సార్ పేరును అక్రమంగా ఉపయోగిస్తోందని మహబూబ్ బాషా అన్నారు. వైఎస్సార్ పేరుతో కేంద్ర ఎన్నికల సంఘం వద్ద రిజిస్టరైన పార్టీ 'అన్న వైఎస్సార్ కాంగ్రెస్' ఒక్కటేనని స్పష్టం చేశారు. తమదే నిజమైన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అని ఆయన  కోర్టుకు తెలిపారు. జగన్ పార్టీ పేరును రద్దు చేసేలా కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలంటూ మహబూబ్ బాషా కోర్టుకు విజ్ఞప్తి చేశారు. దీనిపై స్పందించిన ఢిల్లీ హైకోర్టు.. సెప్టెంబరు 3 లోగా కౌంటర్ అఫిడవిట్లు దాఖలు చేయాలని వైఎస్సార్సీపీతో పాటు ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. 

మరిన్ని కరోనా కష్టాలు తప్పవు.. మీకు అండగానే ఉంటా: రంగంలో అమ్మవారు

భారత్ మొత్తం కరోనా తో గజగజలాడుతోంది. ఇక తెలంగాణాలో ఐతే హైదరాబాద్ లో కరోనా ఉధృతంగానే ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల ఉత్సవంలో భాగంగా అమ్మవారి రంగంలో జోగిని స్వర్ణలత భవిష్యవాణిని వినిపించారు. వర్షాలు ఎలా కురుస్తాయి? పంటలు ఎలా పండుతాయి? ప్రజల బాగోగుల గురించి ప్రతి సంవత్సరం పూజారులు అడిగేవారు. ఐతే ఈసారి మాత్రం కరోనా వైరస్ గురించి అమ్మవారిని అడిగారు. ఈ వైరస్ ఎన్నాళ్లు ఉంటుంది? ఎప్పుడు పోతుంది? దానికి ప్రజలు ఏం చెయ్యాలి? అని అడగగా ఆమె తన భవిష్యవాణిలో ప్రజలకు కొన్ని హెచ్చరికలు చేశారు. రానున్న కాలంలో ప్రజలు మరింత జాగ్రత్తగా ఉండాలని, అంతే కాకుండా "ఎవరు చేసుకున్న కర్మ వాళ్లు అనుభవించక తప్పదని" అమ్మవారు హెచ్చరించారు. ఓ అమ్మగా తాను కాపాడేందుకు ప్రయత్నిస్తున్నానని, ఐతే అంతకు మించి కొంత మంది ప్రజలు ఇలా చేస్తున్నారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేసారు. కరోనాను అదుపు చేయడానికి తాను సిద్ధమేనని, అయితే తనను ఐదు వారాలు కొలవాలని, అలాగే యజ్ఞ యాగాదులు చేయాలనీ చెప్పారు. ప్లేగువ్యాధి అంతరించిన తర్వాత 19వ శతాబ్దం మొదట్లో సికింద్రాబాద్‌ ఉజ్జయినీ మహంకాళి అమ్మవారి బోనాల ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ప్రతి ఏడాది బోనాలకు లక్షల్లో జనం హాజరయ్యేవారు. ఐతే ఈ సంవత్సరం కరోనా వల్ల కొద్దిమంది మాత్రమే తగిన జాగ్రత్తలు తీసుకుంటూ బోనాల ఉత్సవాలలో పాల్గొన్నారు.

కాపు ఉద్యమ నేత ముద్రగడ సంచలన నిర్ణయం

కాపులను బీసీలలో చేర్చాలని తీవ్రంగా ఉద్యమం చేసిన నాయకుడు ముద్రగడ పద్మనాభం ఉద్యమం నుండి తప్పుకుంటున్నట్లు సంచలన నిర్ణయం ప్రకటించారు. ఇటీవల కొందరు సోషల్ మీడియాలో తనపై తీవ్ర విమర్శలు చేస్తున్నారని ఆయన అన్నారు. అంతే కాకుండా తనను కుల ద్రోహి, గజదొంగ వంటి దారుణమైన వ్యాఖ్యలతో విమర్శిస్తున్నారని ఆయన తెలిపారు. గతంలో మేధావులతో కలిసి తాను ఉద్యమం నడిపానని ఆయన చెప్పారు. కాపు ఉద్యమం ద్వారా నిజానికి తాను ఆర్థికంగా, రాజకీయంగా, ఆరోగ్య పరంగా చాలా నష్టపోయానని అయన తెలిపారు. కొంత మంది తనను రోజుకో మాట మాట్లాడుతున్నారంటూ విమర్శిస్తున్నారని అయన తెలిపారు . ఇప్పుడు కాపు రిజర్వేషన్ బంతిని కేంద్రం కోర్టులో వేశాననడం తనను తీవ్రంగా బాధిస్తోందని అయన వాపోయారు. ఐతే ఉద్యమ సందర్భానుసారంగా రూపురేఖలు మార్చుకుంటోందని, దీనితో తన జాతికి ఏదో ఒక విధంగా మేలు జరగాలని తాను ఎన్నో ప్రయత్నాలు చేశానని అయన ఈ సందర్భంగా తెలిపారు.

ఏపీలో కరోనా ఉగ్రరూపం.. ఒకే రోజు రికార్డ్ సంఖ్యలో కేసులు

ఏపీలో కరోనా తీవ్ర రూపం దాలుస్తోంది. నిన్న ఒక్క రోజే 1933 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. నిన్న మొత్తం 17,624 శాంపిల్స్ పరీక్షించగా రికార్డ్ స్థాయిలో 1933 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. అంతే కాకుండా నిన్న 19 మంది మృత్యువాత పడ్డారు. దీనితో మృతుల సంఖ్య 328 కి చేరుకుంది. నిన్న నమోదైన కేసులతో కలిపి రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 29,168 కి చేరింది. ఐతే వీరిలో 15,412 మంది కోలుకోగా ప్రస్తుతం 13,428 యాక్టివ్ కేసులు ఉన్నాయి. వీరిలో కొంత మంది ఇంటి వద్దే చికిత్స తీసుకుంటూ ఉండగా ఎక్కువ మంది వివిధ హాస్పిటల్స్ లో చికిత్స తీసుకుంటున్నట్లు సమాచారం.

ఏపీ డిప్యూటీ సీఎంకు కరోనా పాజిటివ్ 

ఏపీలో కరోనా వైరస్ వ్యాప్తి తీవ్రంగా ఉంది. దీంతో పాటు ఇప్పటికే ఏపీలోని అనేకమంది ప్రజాప్రతినిధులు కరోనా బారిన పడ్డారు. కొద్ది రోజుల క్రితం సీఎం జగన్ కడప పర్యటనలో డిప్యూటీ సీఎం అంజాద్ భాషా ఎక్కడా కనిపించకపోవడం తో ఆయనకు కరోనా సోకిందని వార్తలు వచ్చాయి. ఐతే ఆయన గన్మెన్ కు కరోనా సోకిందని అందుకే అయన సీఎం పర్యటనకు దూరంగా ఉన్నారని తెలుస్తోంది. ఐతే తాజాగా డిప్యూటీ సీఎం కుటుంబానికి కరోనా టెస్ట్ లు చేయగా అంజాద్ బాషా తో పాటు అయన భార్య, కుమార్తెకు కూడా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో వారిని తిరుపతిలోని స్విమ్స్ కోవిడ్ ఆస్పత్రిలోని ప్రత్యేక గదిలో ఉంచి చికిత్స అందించారు. ఆ తరువాత చికిత్స కోసం హైదరాబాద్‌కు తరలించారు. తాజాగా అంజాద్ బాషా కు కరోనా నిర్ధారణ కావడంతో కొద్ది రోజులుగా ఆయనతో సన్నిహితంగా మెలిగిన నేతలు కూడా కరోనా పరీక్షలు చేయించుకుంటున్నారు.

చడీ చప్పుడు లేకుండా కరోనా కు వ్యాక్సిన్ సిద్ధం చేసిన రష్యా

ప్రపంచం మొత్తం కరోనా మహమ్మారితో తల్లడిల్లిపోతోంది. ఈ వైరస్ ఎదుర్కునే సమర్ధవంతమైన వ్యాక్సిన్ ఎపుడు వస్తుందా అని మానవాళి ఎదురుచూస్తోంది. ఇప్పటివరకు ఇండియా లో భారత్ బయోటెక్ డెవలప్ చేసిన కోవాక్సిన్, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ డెవలప్ చేసిన వ్యాక్సిన్ ఇప్పటికే జంతువుల పై ప్రయోగాలు ముగించుకుని క్లినికల్ ట్రయల్స్ లో ఉన్నాయి. ఐతే తాజాగా రష్యా శాస్త్రవేత్తలు మాత్రం గుట్టు చప్పుడు కాకుండా ప్రయోగాలు చేపట్టి ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురిచేశారు. రష్యా రాజధాని మాస్కోలోని సెచెనోవ్ మెడికల్ యూనివర్సిటీలో జంతువుల పై ప్రయోగాలతో పాటు క్లినికల్ ట్రయల్స్ కూడా విజయవంతంగా పూర్తి చేసుకుంది. ఇప్పటికే వలంటీర్లకు ఇచ్చిన వ్యాక్సిన్ సత్ఫలితాలు ఇచ్చినట్టు ఆ యూనివర్సిటీ వర్గాలు తెలిపాయి. ఈ వ్యాక్సిన్ ను గమాలెయ్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఎపిడెమాలజీ అండ్ మైక్రోబయాలజీ రూపొందించింది. ఏ వ్యాక్సిన్ తో తొలి దశ క్లినికల్ ట్రయల్స్ జూన్ 18 నుండి స్టార్ట్ చేయగా, వ్యాక్సిన్ వేయించుకున్న వలంటీర్లు మొదటి బ్యాచ్ ఈ బుధవారం డిశ్చార్జి అవుతారని తెలుస్తోంది. మరికొందరు వలంటీర్లు ఈ నెల 20న డిశ్చార్జి అవుతారు. ఈ వ్యాక్సిన్ సురక్షితమైనదా కాదా అనే విషయాన్ని ఈ క్లినికల్ ట్రయల్స్ లో పరీక్షించామని సెచెనోవ్ యూనివర్సిటీలోని ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ పారాసైటాలజీ, ట్రాపికల్ అండ్ వెక్టర్ బోర్న్ డిసీజెస్ డైరెక్టర్ అలెగ్జాండర్ లుకాషెవ్ తెలియచేసారు. ఈ ట్రయల్స్ లో తాము విజయవంతం అయ్యామని అయన అన్నారు. దీని తరువాతి దశలో ఎలాంటి పరీక్షలు చేపట్టాలన్నది వ్యాక్సిన్ రూపకర్తలు ఇప్పటికే డిసైడ్ అయ్యారని. అలాగే ఈ వ్యాక్సిన్ ప్రొడక్షన్ పై అతి త్వరలో ఒక నిర్ణయం తీసుకుంటారని లుకాషెవ్ తెలిపారు.

ఈనెల 21 నుంచి అమర్ నాథ్ దర్శనం 

రోజుకు ఐదువందల మందికే అవకాశం.. గత ఏడాది దర్శించుకున్న భక్తుల సంఖ్య 3,42,883.. అమరనాథ్ యాత్ర పై దాఖలైన పిటిషన్.. నేడు సుప్రీంకోర్టులో విచారణకు వచ్చే అవకాశం.. సరిహద్దుల్లో యుద్ధం వాతావరణం.... మరోవైపు విజృంభిస్తున్న కరోనా. ఈ విపత్కర పరిస్థితుల్లోనూ ప్రకృతి సిద్ధంగా వెలిసే అమరనాథ్ శివలింగం దర్శనం కోసం యాత్రికులు పెద్దసంఖ్యలోనే తమ పేర్లు నమోదు చేసుకున్నారు. కరోనా కారణంగా వైష్టోదేవి, చార్ దామ్ యాత్రలను ఇప్పటికే రద్దు చేశారు. అయితే ఏడాదిలో 15రోజులు మాత్రమే ఉండే అమరనాథుని దివ్య, అద్భుత, మహిమాన్విత రూపాన్ని చూడడానికి అనుమతి ఇవ్వాలన్న భక్తుల కోరిక మేరకు ఈనెల 21 నుంచి ఆగస్టు 3 వరకు భక్తులను అనుమతిస్తారు. అయితే పరిమిత సంఖ్యలో మాత్రమే భక్తులను అనుమతించాలని కోరుతూ సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్ నేడు విచారణ రానుంది.  గత ఏడాది 3,42,883 మంది భక్తులు  గత ఏడాది జమ్ము సరిహద్దుల్లో నెలకొన్న భద్రతా సమస్యలు,  ఉగ్రవాద ముప్పు ఉన్నప్పటికీ భక్తుల సంఖ్య మాత్రం తగ్గలేదు. 3,42,883మంది భక్తులు కట్టుదిట్టమైన భద్రతావలయంలో అమరనాథుడిని దర్శించుకున్నారు.  ఈ ఏడాది లక్షకు పైగానే.. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా అమర్‌నాథ్‌ యాత్రకు వెళ్లే భక్తుల సంఖ్య మాత్రం తగ్గడం లేదు. ఈ ఏడాది 1.5లక్షల మంది భక్తులు అమర్ నాథ్ యాత్రకు పేర్లు నమోదు చేసుకున్నారు. ఇక, నిఘా వర్గాల హెచ్చరికలతో అప్రమత్తమైన ప్రభుత్వం.. ఈ సారి 30 వేల మంది పోలీసులతో ప్రత్యేక భద్రత ఏర్పాట్లు చేశారు. అమర్ నాథ్ యాత్ర పై  తీసుకోవల్సిన జాగ్రత్తలపై కేంద్ర మంత్రులు జితేంద్ర సింగ్, జి కిషన్ రెడ్డి జమ్మూ కాశ్మీర్ పరిపాలనాధికారులు, హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికారులు, స్థానిక సైనికాధికారులతో సమావేశం నిర్వహించారు. పరిమిత సంఖ్యలో మాత్రమే ప్రస్తుత పరిస్థితిలో రైలు లేకపోవడంతో యాత్ర కోసం నమోదు చేసుకున్న రిజర్వేషన్లు చేసుకున్న చాలామంది తమ యాత్రను రద్దు చేసుకున్నారు. నేడు సుప్రీంకోర్టులో విచారణ ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల కారణంగా పరిమితమైన సంఖ్యలో మాత్రమే భక్తులను అనుమతించాలని  కోరుతూ సుప్రీంకోర్టులో దాఖలైన పిటీషన్ ఈ రోజు విచారణకు రానుంది. శ్రీ అమర్‌నాథ్ బర్ఫానీ లంగర్ ఆర్గనైజేషన్ దాఖలు చేసిన పిటిషన్ లో అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఇంటర్నెట్ ద్వారా ప్రత్యేక దర్శనాన్ని ప్రసారం చేయాలని కోరారు.

కాంగ్రెస్ ప్రభుత్వం కూల్చడానికి 2000 కోట్లతో ప్లాన్.. ఎఫ్ఐఆర్ నమోదు

రాజస్థాన్ లోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలదోసేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందంటూ ఆ రాష్ట్ర సీఎం అశోక్ గెహ్లాట్ ఆరోపించారు. దీని కోసం ఆ పార్టీ సిగ్గు కూడా వదిలేసి ప్రయత్నాలు చేస్తోందని అయన బీజేపీ మీద మండి పడ్డారు. ఈరోజు మీడియాతో మాట్లాడిన అయన "నేను ప్రస్తుతం దేశంలో జరుగుతున్న పరిస్థితుల మీద చర్చించేందుకు ఈ రోజు మీ ముందుకు వచ్చా. కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు నేను అందరినీ కలుపుకొని ముందుకు వెళ్తున్నా. కానీ, బీజేపీ మాత్రం మానవత్వం మరిచిపోయి. కరోనా విజృంభిస్తున్న సమయంలో ప్రజలు ఎన్నుకొన్న రాష్ట్ర ప్రభుత్వాన్ని కూల్చడానికి కుట్ర పన్నుతోంది." అని ఆరోపించారు. అంతే కాకుండా "కొంతమంది సిగ్గులేని నాయకులూ కూడా ఉంటారు. అటువంటి వారే గుజరాత్‌లో ఏడుగురు ఎమ్మెల్యేలను ఎత్తుకెళ్లి రెండు సీట్లు సాధించారు. రాజస్థాన్ లో కూడా అలాగే చేయడానికి వారు ప్రయత్నించారు. ఇక్కడ మాత్రం కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఇతర ఎమ్మెల్యేలు సహకారంతో మేం రెండు సీట్లు సాధించాం. ఐతే ఆ సిగ్గులేని నాయకులూ మాత్రం ఇంకా పాత టెక్నిక్‌లు వాడుతూనే ఉన్నారు." అని గెహ్లాట్ బీజేపీ నేతలను విమర్శించారు. రాజస్థాన్ లో ఒక ఆయుధ స్మగ్లింగ్ ముఠాకు సంబంధించి కొంత మంది ఫోన్ల పై నిఘా పెట్టగా వారి సంభాషణలలో గెహ్లాట్ ప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్నం జరుగుతున్నటుగా ఎస్ ఓ జి పోలీసులు గుర్తించి ఇద్దరిని అరెస్ట్ చేసారు. అంతే కాకుండా ప్రభుత్వాన్ని కూల్చడానికి రూ.1000 కోట్ల నుంచి రూ.2000 కోట్లు ఖర్చు చేయనున్నట్టు వారి సంభాషణల్లో వెల్లడైనట్లు సమాచారం. మొన్న జరిగిన రాజ్యసభ ఎన్నికల కు ముందే ప్రస్తుత ప్రభుత్వాన్ని కూలదోయడానికి కుట్ర చేశారంటూ పోలీసులు తాజాగా ఎఫ్ఐఆర్‌లో పేర్కొన్నారు. ఐతే రాష్ట్ర బీజేపీ నేతలు మాత్రం ఇవి నిరాధారమైన ఆరోపణలుగా కొట్టి పారేశారు.

ఊచలు లెక్కపెడతావ్ ఉమా.. కాదు నువ్వే బెయిల్ మీదున్నావు సాయి రెడ్డి

నిత్యం చంద్రబాబు, లోకేష్ ల పై స్ట్రాంగ్ కామెంట్లతో విరుచుకుపడే వైసిపి ఎంపీ విజయ్ సాయి రెడ్డి తాజాగా మాజీ మంత్రి దేవినేని ఉమా పై రెచ్చిపోయారు. తాజాగా టీడీపీ నేతల వరుస అరెస్టుల నేపథ్యంలో టీడీపీ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలపై విజయ్ సాయిరెడ్డి ట్విట్టర్ ద్వారా తీవ్రంగా స్పందించారు. "వాస్తవాలు చెబుతుంటే ప్రభుత్వం కక్షపూరితంగా అరెస్టులు చేస్తోందంటున్నారు. దీంతో ఉమకి ఫ్రస్ట్రేషన్ లో ఏం మాట్లాడేది తెలియడంలేదు. నీటిపారుదల ప్రాజెక్టుల కుంభకోణాలు బయటికి వస్తే నువ్వు కూడా ఊచలు లెక్కపెట్టాల్సిందే ఉమా.. మాజీ సీఎం అయినా, మాజీ మంత్రులైనా ఎవరూ తప్పించుకోలేరు. దోచుకోవడాలు, పంచుకోవడాలు అన్నీ మీతోనే పోయాయి" అంటూ వ్యాఖ్యానించారు. దీని పై మాజీ మంత్రి దేవినేని ఉమా కూడా అంతే ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. "తమ ప్రభుత్వ హయాంలో ఏపీ నీటిపారుదల రంగాన్ని దేశంలోనే 2వ స్థానంలో నిలిపామని ఆయన స్పష్టం చేసారు. అంతే కాకుండా "కారు దింపిన తర్వాత ఫ్రస్ట్రేషన్ లో పడినట్టున్నావు. 108 అంబులెన్సుల్లో రూ.307 కోట్లు కొట్టేశావు. 12 సీబీఐ, ఈడీ కేసుల్లో 16 నెలల ఊచలు లెక్కపెట్టావు. మీ తప్పుడు కేసులకు భయపడం. జైలు నుంచి బెయిల్ పై వచ్చావ్.. ఒళ్ళు సోయిలో పెట్టుకో, బెదిరింపులు ఆపు జరబద్రం" అంటూ ఎంపీ విజయ్ సాయి రెడ్డిని ఉమ హెచ్చరించారు.

బాధితుల ఇంటికి ఉచితంగా కరోనా కిట్

ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. కరోనా లక్షణాలతో హోం క్వారంటైన్ లో ఉన్నవారు బయటకు రాకుండా.. వారికి కావాల్సినవాటిని ఇంటికే పంపించే కార్యక్రమాన్ని చేపట్టాయి.  కరోనా తీవ్రత తక్కువగా ఉన్న రోగులను హోమ్ క్వారంటైన్ లో ఉండేలా చర్యలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. అయితే, హోం క్వారంటైన్ లో ఉన్నవారు మెడిసిన్స్, ఇతర సామగ్రి కోసం బయటకు వస్తే.. వైరస్ ఇతరులకు సోకే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో, వారికి అవసరమైన వాటిని కిట్ ద్వారా అందించే ఏర్పాట్లను రాష్ట్ర ప్రభుత్వాలు చేశాయి. హోం క్వారంటైన్ లో ఉన్న వారికి 'కోవిడ్ హోమ్ క్వారంటైన్ కిట్' ను ఏపీ ప్రభుత్వం పంపించనుంది. ఈ కిట్ లో కరోనా మందులు, శానిటైజర్, మాస్క్ లు, గ్లౌజ్ లు, ఆక్సీమీటర్ ఉంటాయి. హోం క్వారంటైన్ లో ఉన్న వారికి 'హోమ్ ఐసోలేషన్ కిట్' ను తెలంగాణ ప్రభుత్వం పంపించనుంది. ఈ కిట్ లో 17 రోజులకు సరిపడే మెడిసిన్ ఉంటుంది.  అలాగే, మాస్కులు, శానిటైజర్లతో పాటుగా కరోనా పాజిటివ్ వచ్చిన సమయంలో ఏం చేయాలి, ఏం చేయకూడదు అనే విషయాలను గురించి వివరించే ఓ చిన్న బుక్ కూడా అందులో ఉంటుందట.

కరోనాను అదుపు చేయడంలో శక్తి, యుక్తిని ప్రదర్శించిన మహిళా నేతలు

విఫలమైన అగ్రదేశాల అధినేతలు ప్రపంచవ్యాప్తంగా అన్నీ దేశాలను అతలాకుతలం చేసింది కోవిద్ 19 వైరస్. కంటికి కనిపించని ఈ సూక్ష్మజీవి అత్యంత ఆధునిక దేశాలుగా ప్రపంచపటంలో గుర్తింపు పొందిన దేశాలు ప్రాణభయంతో పరుగులు పెట్టేలా చేస్తోంది. అగ్రదేశాల్లో మరణమృదంగం మోగిస్తోంది. అత్యంత ఎక్కువగా ప్రభావితమైన దేశాలను, అతి తక్కువ సమయంలో కోవిద్ 19ను అదుపు చేసిన దేశాలను పరిశీలిస్తే ఒక వాస్తవం స్పష్టమవుతోంది. కోవిద్ 19 బారిన పడుతున్న వారిలో మగవారి సంఖ్యనే ఎక్కువగా ఉన్నది ఒక సర్వే . అంతేకాదు పురుషాహంకార అధిపత్యధోరణి కనబరిచే వారి ఎలుబడిలో ఉన్న దేశాల్లో ఉగ్రరూపం దాల్చింది.  కోవిద్ 19ను అరికట్టడంలో విఫలమైన ఏడు దేశాలు.. ఆ దేశాల అధ్యక్ష, ప్రధానులు గమనిస్తే ఈ విషయం మరింత స్పష్టం అవుతుంది. కరోనా విజృంభణలో అమెరికాదే ప్రథమ స్థానం. ఆ దేశంలో కోవిద్ 19 కేసుల సంఖ్య మూడున్నర లక్షలకు చేరువలో ఉంది. మరణాల సంఖ్య1,36,671. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అధిపత్యభావజాలం ప్రపంచ ప్రజలకు సుపరిచితమే. రెండో స్థానంలో ఉన్న బ్రెజిల్ లో ఈ వైరస్ వ్యాప్తి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దేశ ప్రధాని జైర్ బోల్సోనారో కోవిడ్ బారిన పడ్డారంటే అక్కడ నియంత్రణ చర్యలు ఏ మేరకు ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు.  బ్రెజిల్లో కరోనా కోరల్లో చిక్కిన వారి సంఖ్య  1,804,338 అయితే మరణించిన వారి సంఖ్య 70,524. మాస్క్ కూడా ధరించను అంటూ నిర్లక్ష్యపూరితంగా వ్యవహరించిన బోల్పోనారో అందుకు ప్రతిఫలంగా కోవిడ్ బారిన పడి క్వారంటైన్ లో ఉన్నారు. రాకెట్ వేగంతో మూడోస్థానంలోకి వచ్చిన మనదేశంలోనూ నిరంకుశ ధోరణిలో వ్యవహరించే దేశప్రధాని కనిపిస్తారు. ప్రజా సంక్షేమం కంటే కార్పోరేట్ సంస్థల ఖజానా నిండటమే ముఖ్యమన్న ధోరణితో వ్యవహరిస్తూ దేశంలో కరోనా కేసులు ఎనిమిది లక్షల 22వేలు దాటేలా చేశారు. మరణాలు 22వేలు దాటాయి. ప్రతిరోజూ వేలసంఖ్యలో కేసులు నమోదు అవుతున్నా సరైన వైద్యసదుపాయాలు అందించడంలో విఫలం అయ్యారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కూడా నియంత్రణ చర్యలు తీసుకోవడంలో విఫలమయ్యారు. ఆ దేశంలో కోవిద్ 19బారిన పడిన వారి సంఖ్య 713,936 ఉండగా పదివేలకు పైగా మరణాలు సంభవించాయి. పెరూ, చిలీ, స్పెయిన్, ఇటలీ దేశాల్లోనూ ఇదే పరిస్థితి. ముంచుకొస్తున్న ముప్పును ఆయా దేశాల అధినేతలు సరైన అంచనా వేయలేకపోయారు. లక్షలాది మంది కరోనా బారిన పడేందుకు, వేలాది మంది ఈ వైరస్ కారణంగా మృత్యవాత పడేందుకు కారణమయ్యారు. విజృంభిస్తున్న కోవిడ్ 19ను సమర్థవంతగా ఎదుర్కొన్న దేశాలు మహిళాధినేతల పరిపాలనలో ఉండటం గమనించదగిన విషయం. విపత్కర పరిస్థితులను సరిగ్గా అంచన వేయగలగడం, ప్రజల ప్రాణాలుకు ముప్పు రాకుండా తగిన చర్యలు తీసుకోవడం ఇందుకు కారణం అని చెప్పవచ్చు. డెన్మార్క్ లోనూ కరోనా వ్యాప్తి చెందినప్పటికీ చాలా తక్కువ సమయంలో నియంత్రించారు. ఆ దేశ ప్రధాని మెట్టే ఫ్రెడెరిక్సెన్ ప్రజలందరికీ కోవిద్ వైరస్ పరీక్షల నిర్వహించేలా జాగ్రత్తలు తీసుకున్నారు. చాలా చోట్ల కోవిద్ 19 నెగిటివ్ రిపోర్ట్స్ చూయించిన వారికే అనుమతించారు. దాంతో కరోనాను కట్టడి చేయగలిగారు. ఆ దేశంలో 13,117 మంది ఈ వైరస్ బారిన పడగా 609 మంది మరణించారు. వైరస్ తమ దేశంలోకి రాకముందే వస్తే ఎలా ఎదుర్కోవాలో అన్న అంశంపై పటిష్టమైన విధానాన్ని రూపొందించారు ఐస్లాండ్ ప్రధాని కాట్రిన్ జాకోబ్స్డోట్టిర్. ఆమె తీసుకున్న ముందస్తు చర్యలతో ఆ దేశంలో ఒక కేసు కూడా నమోదు కాలేదు. దశలవారీగా లాక్ డౌన్ ఎత్తేయడంతో పాటు వైద్యపరీక్షలను పెంచుతూ కరోనా వ్యాప్తిని అరికట్టారు ఫిన్లాండ్ ప్రధాని సన్నా మారిన్. ఇప్పటికీ ఆ దేశంలో లాక్ డౌన్ నిబంధనలు అమలులో ఉన్నాయి. ఇప్పటి వరకు 7,279మంది కరోనా బారిన పడితే వారిలో 6,800మంది కోలుకున్నారు.  329మంది మరణించారు.   యూరప్ మొత్తంలో అత్యధిక పరీక్షలు నిర్వహించిన దేశం జర్మనీ. ఆ దేశ ప్రధాని ఏంజెలా మెర్కెల్ కోవిద్ వ్యాప్తి నియంత్రణకు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. ఈ దేశంలో అధికంగా ఉన్న వృద్ధులకు వైరస్ సోకకుండా తగిన జాగ్రత్తలు తీసుకున్నారు. ఏప్రిల్ నుంచే దశలవారిగా లాక్ డౌన్ ఎత్తేశారు. దేశ జిడిపిలో 11శాతం ప్రజల ఆరోగ్యం కోసమే వినియోగిస్తారు. కరోనా బారిన పడిన వారి సంఖ్య లక్షల్లో ఉన్నా మరణాల రేటు ఎక్కువగా లేకుండా చర్యలు తీసుకున్నారు. న్యూజిలాండ్కు మొదటిసారి ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన జాకిందా ఆర్డెర్స్ పరిపాలనా దక్షతను ప్రపంచదేశాలు కీర్తిస్తున్నాయి. 2017లో న్యూజిలాండ్ 40వ ప్రధానిగా పదవి చేప్పటిన ఆమె ఉగ్రదాడులను, ప్రకృతివైపరీత్యాలను సమర్ధవంతంగా ఎదుర్కొన్నారు. కరోనా వ్యాప్తిని ముందుగా గుర్తించారు. ఫిబ్రవరి 2న చైనా బయటి దేశంలో మొదటి కరోనా మరణం సంభవించిన అంశాన్ని గుర్తించి చైనా నుంచి వచ్చేవారిని అడ్డుకున్నారు. తమ దేశస్తులు వచ్చినా వారిని కచ్ఛితంగా క్వారంటైన్ లో ఉంచారు. జనాభా 80శాతం మంది ప్రభుత్వం నిబంధనలు వందశాతం పాటించేలా ప్రజలకు పరిస్థితులను వివరించారు. ఇప్పటివరకు 1,543 మంది కరోనా బారిన పడగా 1497మంది కోలుకున్నారు. 22మంది మరణించారు. కచ్ఛితమైన నిబంధనలతో నార్వేలో మార్చి 12 నుంచి పూర్తిగా లాక్ డౌన్ పాటించారు. నార్వేప్రధాని ఎర్నా సోల్బెర్గ్ తీసుకున్న కఠినమైన చర్యలే  ఆ దేశంలో కోవిద్ ను అరికట్టింది. ఫిబ్రవరి 27 తర్వాత  తమ దేశానికి వచ్చిన ప్రతి ఒక్కరినీ లక్షణాలతో సంబంధం లేకుండా క్వారంటైన్ లో ఉంచారు. 8974 మంది కరోనా బారిన పడగా 252 మరణించారు. తాయ్ ఇవాన్-వెన్, తైవాన్ అధక్షురాలు తాయ్ ఇవాన్ వెన్ తీసుకున్న పటిష్టమైన నిర్ణయాలతో ఆ దేశంలో కరోనా వ్యాప్తిని నియంత్రించారు. 17ఏండ్ల కిందట సార్స్ ప్రబలినప్పుడు ఎదురైన తీవ్రమైన పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని కఠినమైన చర్యలు తీసుకున్నారు. జనవరి నుంచే చైనా నుంచి వచ్చేవారందరినీ క్యారంటైన్ చేశారు.  విపత్కర పరిస్థితులను ఎదుర్కోవడంలో మహిళలు తమ శక్తినే కాదు యుక్తి  ని ప్రదర్శిస్తారు అన్నది మరోసారి స్పష్టమైంది. ఆడవారికి అధికారం ఇవ్వడం అనవసరం అనుకునేవారు ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనాను అదుపుచేసిన  ఈ మహిళానేతల గురించి తెలుసుకుని వారి అభిప్రాయాలు మార్చుకోవాలి.

భారత్ లో కరోనాకు మరో కొత్త మందును ఓకే చేసిన డిసిజిఐ

భారత్ లో కరోనా వ్యాప్తి తీవ్రమవుతున్న నేపథ్యంలో వ్యాక్సిన్ రావడానికి చాలా సమయం పడుతుందని వార్తలు వస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో డ్రగ్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా కరోనా రోగులకు ఎమర్జెన్సీ సమయంలో వాడేందుకు ఇటోలిజుమాబ్ అనే ఇంజెక్షన్ కు అనుమతులు మంజూరు చేసింది. సొరియాసిస్ (psoriasis) అనే చర్మ వ్యాధిని తగ్గించేందుకు దీనిని ఇప్పటికే వాడుతున్నారు. ఐతే తాజాగా కరోనా పేషెంట్లపై ఈ మందును ప్రయోగించగా మంచి ఫలితాలు వచ్చాయని తెలుస్తోంది. బెంగళూరులోని బయోకాన్ ఇండియా లిమిటెడ్ ఈ మందును సొరియాసిస్ ట్రీట్ మెంట్ కోసం వాడేందుకు చాలా ఏళ్ల కిందట అనుమతి పొందింది. ఈ ఇటోలిజుమాబ్ అనే మందు చాలా పవర్‌ఫుల్. దీంతో కరోనా చాలా తీవ్రంగా ఉండి, ప్రాణాపాయ స్థితిలో ఉన్న పేషంట్లకు మాత్రమే దీన్ని ఇస్తారు. కరోనా వైరస్ అంతు చూసే యాంటీబాడీల ఉత్పత్తికి ఉపయోగపడే సైటోకిన్ల ను ఉత్పత్తి చేయడంలో ఇది బాగా పనిచేస్తోంది. ఎయిమ్స్‌కు చెందిన కొందరు నిపుణులు ఈ మందుతో చేసిన ప్రయోగాలు సత్ఫలితాలు ఇచ్చాయి. ఐతే ఇది చాలా పవర్‌ఫుల్ కాబట్టి ఈ మందును తీసుకోవాలనుకునేవారు ముందుగా తమ అంగీకారం తెలుపుతూ పేపర్‌పై సంతకం పెట్టాల్సి ఉంటుంది. ఈ ఇటోలిజుమాబ్‌ని మే నెలలో కరోనా ఉధృతంగా ఉన్న ముంబైలోని నాయిర్‌ హాస్పిటల్ వాడి చూసింది. వెంటిలేటర్‌తో ఉన్న ఇద్దరు రోగులకు ఇవ్వగా వాళ్లు కోలుకొన్నారు. ఈ మందు ఒక డోస్ ఇవ్వగానే రోగులు కోలుకుంటున్నారని ఐతే కొంత మందికి మాత్రం 3 డోసుల దాకా ఇవ్వాల్సి వస్తోందని సమాచారం.

ఏపీ సీఎం జగన్ పై కోట శ్రీనివాసరావు సెన్సేషనల్ కామెంట్స్ 

టాలీవుడ్ సీనియర్ నటుడు కోట శ్రీనివాస రావు తన పుట్టిన రోజు సందర్బంగా కొన్ని మీడియా ఛానళ్లకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్బంగా తాను గతంలో బిజెపి తరుఫున విజయవాడ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి పనిచేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. తాను మాజీ ప్రధాని వాజ్ పేయికి అభిమానిని అని, అందుకే తనను బిజెపిలోకి తీసుకున్నారని అన్నారు. ఇదే సమయంలో అనేక విషయాల పై మాట్లాడిన కోటా రాజకీయాల పై మీడియా వారు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పారు. ఈ సందర్భం లో ఆయన ఏపీ సీఎం జగన్ పై కొన్ని సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. తాను పాత సామెతలను నమ్ముతానని, అందులో ఒక సామెత ప్రకారం ఇప్పుడు ఆంధ్రలో పరిస్థితి ఎలా ఉందంటే "నిద్రపోయేవాడిని లేపవచ్చు గానీ నిద్ర నటించేవాడిని లేపలేమని కోట శ్రీనివాస రావు అన్నారు. ప్రస్తుతం జరుగుతున్న వ్యవహారాలన్నీ సీఎం జగన్ కు తెలియకుండానే జరగుతున్నాయా అని ఆయన ప్రశ్నించారు. ఐతే అలా ఎందుకు జరుగుతుందో మాత్రం తెలియడం లేదని ఆయన అన్నారు. ఐతే అంతకు మించి మాట్లాడడానికి మాత్రం కోట ఇష్ట పడలేదు. అదే సమయంలో తాను తెలంగాణ గురించి మాట్లాడబోనని, ఐతే ఆంధ్రప్రదేశ్ గురించి మాత్రం మాట్లాడుతానని ఎందుకంటే తనకు ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడే అర్హత ఉందని, అక్కడ తాను గతంలో బీజేపీ ఎమ్మెల్యేగా పనిచేశానని ఆయన అన్నారు. తన స్వగ్రామం కంకిపాడు విజయవాడ పక్కనే ఉందని అక్కడ తనకు ఇప్పటికి ఆస్తులు ఉన్నాయని, అందుకే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి మాట్లాడుతానని ఆయన అన్నారు. అది కూడా ఒకే ఒక మాటలో ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు సంభవిస్తున్న పరిస్థితిపై మాట్లాడుతానని అంటూ ఆయన స్పష్టం చేశారు.

సుప్రీంకు చేరిన తెలంగాణ సచివాలయం వ్యవహారం

తెలంగాణ నూతన సచివాలయం నిర్మాణ అంశం సుప్రీంకోర్టుకు చేరింది. సచివాలయం నిర్మాణంపై తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సుప్రీంకోర్టులో పిటిషన్ ధాఖలు చేశారు. ప్రభుత్వానికి అనుకూలంగా హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే ఇవ్వాలని జీవన్‌ రెడ్డి పిటిషన్ లో కోరారు. ఈ పిటిషన్ ను సుప్రీంకోర్టు సోమవారం విచారించనుంది.  మరోవైపు, సచివాలయ భవనాల కూల్చివేత పనులను తాత్కాలిక బ్రేక్ పడిన సంగతి తెలిసిందే. నూతన సచివాలయ నిర్మాణానికి హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందో లేదో.. ప్రభుత్వం చకచక ప్రస్తుత సచివాలయ భవనాల కూల్చివేత మొదలుపెట్టింది. దీనిపై విపక్షాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఈ కరోనా కష్టకాలంలో పాత భవనాల్ని కూల్చి రూ.500 కోట్లతో కొత్త భవనాలు కట్టడం అవసరమా అని ప్రశ్నించాయి. ఈ కూల్చివేతలకు వ్యతిరేకంగా హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. దీంతో, సోమవారం వరకు కూల్చివేత చేపట్టొద్దని హైకోర్టు అదేశాలు జారీ చేసింది. అయితే ఇప్పటికే సచివాలయ భవనాల కూల్చివేత పనులు 50 శాతం పూర్తి అయ్యాయి. ఈ నేపథ్యంలో కూల్చివేత ఆపాలని హైకోర్టు, సుప్రీంకోర్టులలో పిటిషన్లు ధాఖలు కావడం ఆసక్తికరంగా మారింది. మరి ఈ అంశంపై కోర్టులు ఎలా స్పందిస్తాయో చూడాలి.

800కోట్లకు చేరువలో ప్రపంచ జనాభా.. లాక్ డౌన్ కారణంగా ఏడు లక్షల అవాంఛిత గర్భాలు

800కోట్లకు చేరువలో ప్రపంచ జనాభా.. 33ఏండ్లలో మూడు వందల కోట్లు జనాభా పెరిగింది.. మానవవనరులు, ప్రకృతి వనరుల మధ్య సమతుల్యత చర్చించేందుకు వీలుగా ప్రపంచ జనాభా దినోత్సవం.. కరోనా కారణంగా 47లక్షల మంది మహిళలకు గర్భనిరోధక మాత్రలు అందుబాటులోలేవు - యుఎన్ఎఫ్ పిఎ పరిశోధన.. లాక్ డౌన్ కారణంగా ఏడు లక్షల అవాంఛిత గర్భాలు.. మహిళలకు కరువైన వైద్యసేవలు.. లైంగిక హింస, బాల్యవివాహాలు తగ్గించే లక్ష్యంగా 2020 థీమ్.. ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతున్న జనాభా, అందుబాటులో ఉన్న ప్రకృతి వనరులు, అభివృద్ధి అంశాలను చర్చించేందుకు ప్రతిఏటా జూలై 11న ప్రపంచ జనాభా దినోత్సవం నిర్వహించాలని ఐక్యరాజ్యసమితి  నిర్ణయించింది. 11జూలై, 1987 నాటికి ప్రపంచ జనాభా ఐదువందల కోట్లకు చేరింది. పెరుగుతున్న జనాభాను నియంత్రించే అంశాలపై చర్చించేందుకు ప్రతి ఏటా 11 జూలై ను ప్రపంచ జనాభా దినోత్సవంగా నిర్వహించాలన్న ప్రతిపాదన 1989లో వచ్చింది. అన్ని దేశాల ప్రతినిధులతో చర్చించిన తర్వాత ప్రతి ఏటా ఒక అంశంతో జనాభా దినోత్సవాన్ని నిర్వహించాలని ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశం నిర్ణయించింది. ఈ ఏడాది లైంగిక హింస అరికట్టడం, మహిళల సంతానోత్పత్తి సమస్యలను నివారించడం, బాల్యవివాహాలు అడ్డుకోవడం అంశాలను ప్రధానంగా తీసుకున్నారు. 2020ని మహిళలు, బాలికల ఆరోగ్యం, వారి హక్కుల రక్షణ సంవత్సరంగా ప్రకటించారు. లాక్ డౌన్ కొత్త సమస్యలను.. ప్రపంచాన్ని కుదిపేస్తున్న కరోనా మహమ్మారి కారణంగా విధించిన లాక్ డౌన్ సరికొత్త సమస్యలను తెచ్చిపెడుతుంది.  కొన్ని దేశాల్లో లక్షలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు. మరి కొన్ని దేశాల్లో సరైన వైద్యసదుపాయాలు, మందులు అందుబాటులో అనారోగ్య సమస్యలు తీవ్రరూపం దాల్చుతున్నాయి.  ముఖ్యంగా మహిళల ఆరోగ్యంపై, అవాంఛిత గర్భధారణపై లాక్ డౌన్ ప్రభావం చాలా ఉందని,  47లక్షల మంది మహిళలకు  గర్భనిరోధక మాత్రలు అందుబాటులో లేకపోవడంతో అవాంఛిత గర్భం దాల్చుతున్నారని యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ ఫండ్ (యుఎన్ఎఫ్ పిఎ) పరిశోధనల్లో స్పష్టమైంది.  ఆరునెలల పాటు దశవారీగా లాక్ డౌన్ విధించిన కొన్ని దేశాల్లో వైద్యసేవలకు తీవ్ర అంతరాయం కలిగింది. మరికొన్ని దేశాల్లో మహిళలు పిల్లలు కనడాన్ని వాయిదా వేసుకుంటున్నారు. ఈ విపత్కర పరిస్థితి కారణంగా విభిన్న ప్రాంతాల్లో భిన్నమైన హెచ్చుతగ్గులు ఉంటాయని యుఎన్ఎఫ్ పిఎ పేర్కొంది.  ప్రపంచ జనాభాలో 36శాతం రెండు దేశాల్లోనే.. ఐక్యరాజ్యసమితి నివేదికల ప్రకారం ప్రపంచ జనాభా  ఎనిమిది వందల కోట్లకు చేరువలో ఉంది. 2023 నాటికి 800కోట్లు దాటవచ్చని అంచనా.  అత్యధిక జనాభా కలిగిన ఆసియా ఖండంలోని రెండు దేశాలు చైనా, భారత్ లోనే ప్రపంచ జనాభాలో 36శాతం జనాభా ఉంది. అయితే కోవిడ్ 19 వైరస్ విసిరిన పంజాలో ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య ఎక్కువగానే ఉన్నప్పటికీ  ప్రణాళిక లేని గర్భాల కారణంగా జననాల రేటు పెరిగే ప్రమాదం ఉందని అంచనా. కొన్ని దేశాల్లో లక్షల్లో మరణాలు సంభవించడంతో హెచ్చుతగ్గులు ఎక్కువగా ఉంటాయి. 2050 నుంచీ ... ప్రపంచ జనాభా 2050 తర్వాత  తగ్గుతుందనే అంచనాలున్నాయి. అత్యధిక జనాభా ఉన్న చైనా, భారత్ లో జననాల రేటు తగ్గుతుందని అంచనా. గతంతో పోలిస్తే ఈ తేడా స్పష్టమవుతుంది.

ఒకే ముహూర్తానికి ప్రియురాలిని, పెద్దలు కుదిర్చిన అమ్మాయిని పెళ్లాడిన యువకుడు

ఒక పక్క కరోనా కలకలం. మరో పక్క లాక్ డౌన్ కష్టాలు. ఈ పరిస్థితుల్లో కూడా ఆ ఊళ్ళో మాత్రం పెళ్లి చాలా హ్యాపీగా సాఫీగా సాగిపోయింది. ఐతే ఇక్కడ సాఫీగా అని ఎందుకంటున్నాం అంటే పెళ్లి పీటల మీద పెళ్లి కొడుకు తో పాటు ఇద్దరు పెళ్లి కుమార్తెలు కూడా ఉన్నారు. అవును మీరు చదువుతున్నది నిజంగా నిజమే. అది కూడా అటు పెళ్లి కొడుకు ఇటు పెళ్లి కుమార్తెలు అందరు కూడా హ్యాపీగా ఉండడం ఇక్కడ విశేషం.  ఐతే ఈ పెళ్లి కథా కమామిషు ఏంటంటే మధ్యప్రదేశ్ లోని బేతుల్ జిల్లాకు చెందిన కేరియా గ్రామంలో సందీప్ అనే గిరిజన యువకుడు ఒకే మండపం లో అదే పెళ్లి పీటల పై ఒకే సారి ఇద్దరు అమ్మాయిల తో కలిసి ఏడడుగులు నడిచాడు. దీనికి కారణం సందీప్ భోపాల్ లో చదువుకునే సమయంలో హోషంగాబాద్ కు చెందిన యువతి తో లవ్ లో పడ్డాడు. ఆ యువతి కూడా అతడి ప్రేమకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఇద్దరు పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యారు. ఐతే ఈ ప్రేమ దోమ నచ్చని పెద్దలు మరో అమ్మాయితో సందీప్ పెళ్లి డిసైడ్ చేసారు. పెద్దలు కుదిర్చిన పెళ్లి ముహూర్తం టైం కు నా ప్రియుడు తొనే జీవితం అంటూ ప్రియురాలు ఫ్యామిలీ తో సహా ఎంట్రీ ఇచ్చింది. ఒక పక్క పెద్దలు కుదిర్చిన అమ్మాయి.. మరో పక్క ప్రేమించిన ప్రియురాలు. దీంతో మూడు కుటుంబాలు ఊరి పెద్దల వద్దకు పంచాయతీ తీర్చమని వెళ్లాయి. అక్కడ పంచాయతీ పెద్దలు ఇద్దరు అమ్మాయిలకు నచ్చ చెప్పే ప్రయత్నం చేసారు. ఏదేమైనా సరే అతడినే పెళ్లి చేసుకుంటామని ఇద్దరు పట్టు పట్టారు. అంతే కాకుండా ఇద్దరు కలిసి అతనితో కాపురం చేస్తామని చెప్పడంతో అటు కుటుంబ పెద్దలు ఇటు పంచాయతీలోని పెద్దలు కూడా దీని వల్ల ముందు ముందు ఇబ్బందులు ఎదురవుతాయని నచ్చ చెప్పే ప్రయత్నం చేసినా వారిద్దరూ ససేమిరా అన్నారు. దీంతో ఇక చేసేది ఏమిలేక పెద్దలందరూ రాజీ పడడంతో అదే మండపంలో ముందుగా నిర్ణయించిన ముహుర్తానికే ఇద్దరు యువతులతో సందీప్ కు పెళ్లి చేశారు.

ఈఎస్‌ఐ స్కామ్ లో మరో ట్విస్ట్.. యాంటిసిపేటరీ బెయిల్ కోరిన పితాని కుమారుడు

ఏపీలో ఈఎస్‌ఐ స్కామ్ లో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. ఇప్పటికే ఈ కేసులో మాజీ మ్నాత్రి అచ్చెన్నాయుడు తో సహా తొమ్మిది మందిని ఎసిబి అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అదే సమయంలో ఈ స్కామ్ లో మాజీ మంత్రి పితాని పేరు కూడా వినిపించింది. ఐతే తాజాగా పితాని సత్యనారాయణ కుమారుడు పితాని సురేష్ యాంటిసిపేటరీ బెయిల్ కోసం ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. దీని పై విచారణ సందర్భంగా అయన తరుఫు లాయర్ ఏపీ ప్రభుత్వం రాజకీయంగా కక్ష సాధింపు ధోరణితో వ్యవహరిస్తోందని వాదించారు. ఇది ఇలా ఉండగా మాజీ మంత్రి పితాని వద్ద అప్పట్లో పీఎస్ గా ఉన్న మురళి మోహన్ ను ఈ రోజు ఉదయం సెక్రటేరియట్ వద్ద ఎసిబి అరెస్ట్ చేసినట్లుగా వార్తలు వచ్చాయి. దీంతో పితాని కుమారుడు ముందస్తు బెయిల్ పిటిషన్ ఏపీ పాలిటిక్స్ లో హాట్ టాపిక్ గా మారింది.