రేవంత్ రెడ్డికి పదవి కోసం కేసీఆర్ మొక్కులు!
తెలంగాణ ఫైర్ బ్రాండ్ లీడర్ , మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్ రెడ్డికి కీలక పదవి రావాలని ముఖ్యమంత్రి కేసీఆర్ కోరుకుంటున్నారట.. ఏంటీ తప్పుగా రాశారని అనుకుంటున్నారా... ఆరున్నర ఏండ్లుగా పాలనలో తనకు పక్కెలో బల్లంలా మారిన రేవంత్ రెడ్డికి ఉన్నత పదవి రావాలని గులాబీ బాస్ కేసీఆర్ భావించడమేంటని ఆశ్చర్యపోతున్నారా.. కాని ఇది అక్షరాల నిజం. తెలంగాణలో ప్రస్తుతం రాజకీయంగా తనకు ప్రధాన ప్రత్యర్థిగా ఉన్న ఎంపీ రేవంత్ రెడ్డికి పొలిటికల్ ప్రమోషన్ రావాలని సీఎం కేసీఆర్ బలంగా కోరుకుంటున్నారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అందుకు బలమైన కారణాలు కూడా కనిపిస్తున్నాయి.
తెలంగాణలో ప్రస్తుతం బీజేపీ దూకుడుగా ఉంది. దుబ్బాక అసెంబ్లీ ఉపఎన్నికలో సంచలన విజయం సాధించడంతో పాటు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఊహించని ఫలితాలు సాధించి అధికార టీఆర్ఎస్ పార్టీకి సవాల్ విసురుతోంది. వరుస విజయాలతో కమలం గూటికి చేరడానికి నేతలు క్యూ కడుతున్నారు. రోజురోజుకు పెరుగుతున్న గ్రాఫ్ తో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తమదే అధికారమంటున్నారు తెలంగాణ బీజేపీ నేతలు. బీజేపీ దూకుడుతో కలవరపడుతున్న కారు పార్టీ అధినేత.. ఆ పార్టీ స్పీడ్ కు బ్రేక్ వేయడం ఒక్క రేవంత్ రెడ్డికే సాధ్యమనే ఆలోచనకు వచ్చారట. తెలంగాణలో తమ పార్టీకి ఢోకా లేకుండా ఉండాలంటే రేవంత్ రెడ్డికి కీలక పదవి రావాలని ఆయన బలంగా కోరుకుంటున్నారని తెలుస్తోంది.
దుబ్బాక అసెంబ్లీ, గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ఫలితాలపై పోస్ట్ మార్టమ్ నిర్వహించిన కేసీఆర్.. బీజేపీకి మంచి ఫలితాలు రావడానికి కాంగ్రెస్ బలహీనంగా ఉండటమే కారణమనే అంచనాకు వచ్చారని చెబుతున్నారు. ఇటీవల కేసీఆర్ సర్కార్ పై ప్రజా వ్యతిరేకత భారీగా పెరిగింది. అయితే కాంగ్రెస్ బలహీనంగా ఉండటంతో అది బీజేపీకి ఫ్లస్ అవుతోంది. కేసీఆర్ ను ఓడించాలనే కసిగా ఉన్న ఓటర్లంతా అయిష్టంగానైనా బీజేపీ వైపు మళ్లుతున్నారని టీఆర్ఎస్ సమీక్షలో తేలిందట. కాంగ్రెస్ ఎలాగూ గెలిచే పరిస్థితిలో లేదు కాబట్టి.. ఆ పార్టీకి ఓటేయడం కంటే బీజేపీకి వేస్తే టీఆర్ఎస్ ను ఓడించవచ్చని ప్రభుత్వంపై వ్యతిరేకంగా ఉన్నవారు భావించారని, అలానే ఓటింగులో పాల్గొన్నారని కేసీఆర్ అంచనా వేశారని తెలుస్తోంది.
తెలంగాణలోని ప్రతి నియోజకవర్గంలోనూ కాంగ్రెస్ కు 30 శాతానికి పైగానే సాంప్రదాయ ఓటు బ్యాంక్ ఉంటుంది. గ్రేటర్ హైదరాబాద్ లో ఇది 20 శాతానికి పైగానే ఉంటుంది. అయితే దుబ్బాకలో పీసీసీ నేతలంతా గతంలో ఎప్పుడూ లేనంతగా శ్రమించినా కాంగ్రెస్ కు 20 శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి. కాంగ్రెస్ ఎలాగూ గెలవలేదనే భావనతో హస్తం సానుభూతి పరులు, కేసీఆర్ పని తీరుపై కసిగా ఉన్న జనాలంతా కమలానికి జై కొట్టారని తేలింది. దుబ్బాకలో ఇలా దాదాపు 10 శాతం కాంగ్రెస్ ఓట్లు బీజేపీకి మళ్లాయంటున్నారు. అక్కడ బీజేపీ గెలిచింది కేవలం వెయ్యి ఓట్లతోనే. కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంటే.. ఆ పార్టీ ఓట్లు వారి అభ్యర్థికే పడితే.. దుబ్బాకలో టీఆర్ఎస్ దాదాపు 10 శాతం ఓట్లతో గెలిచేదని గులాబీ నేతల భావన. కాంగ్రెస్ ఓటు బ్యాంక్ ను తమవైపు తిప్పుకునేందుకు బీజేపీ కూడా దుబ్బాకలో ఇదే ప్రచారం చేసింది. కాంగ్రెస్ గెలవదు కాబట్టి.. ఆ పార్టీకి ఓటు వేస్తే టీఆర్ఎస్ కు వేసినట్టేనని జనాల్లోకి తీసుకెళ్లింది. ఇది కూడా బీజేపీకి వర్కవుట్ అయిందని ఫలితాల తర్వాత తేలింది.
గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ ఓటు బ్యాంక్ బీజేపీ వైపు వెళ్లిందని స్పష్టమైంది. జీహెచ్ఎంసీలో కాంగ్రెస్ కు కేవలం 6 శాతం ఓట్లు వచ్చాయి. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో గ్రేటర్ పరిధిలో రెండు సీట్లు గెలిచిన కాంగ్రెస్ దాదాపు 26 శాతం ఓట్లు సాధించింది. ఒక్క సీటు మాత్రమే గెలిచిన బీజేపీ కేవలం 12 శాతం ఓట్లు సాధించింది. కాని ఈసారి జరిగిన గ్రేటర్ ఎన్నికల్లో మాత్రం ఏకంగా 35 శాతానికి పైగా ఓట్లు సాధించిన బీజేపీ.. 48 డివిజన్లు గెలుచుకుంది. బీజేపీకి అదనంగా వచ్చిన ఓట్లన్ని కాంగ్రెస్ తో పాటు టీడీపీవేనని రాజకీయ విశ్లేషకుల అంచనా. ప్రభుత్వంపై వ్యతిరేకత ఉన్నా, బీజేపీ హిందుత్వ నినాదం వినిపించినా గత ఎన్నికల కంటే గ్రేటర్లో కేవలం మూడు శాతం ఓట్లు మాత్రమే టీఆర్ఎస్ కు తగ్గాయి. కాంగ్రెస్ అభ్యర్థులు బలంగా ఉన్న చోట బీజేపీకి తక్కువ ఓట్లు పడ్డాయి. కాంగ్రెస్ గెలిచిన ఉప్పల్, ఏఎస్ రావు నగర్ తో పాటు గట్టి పోటీ ఇచ్చిన గాజుల రామారంలో బీజేపీ అభ్యర్థులు బాగా వెనకబడ్డారు. ఈ లెక్కన కాంగ్రెస్ కొంత బలంగా ఉంటే గ్రేటర్ లో బీజేపీ సింగిల్ డిజిట్ దాటకపోయేదని టీఆర్ఎస్ నేతలతో పాటు కేసీఆర్ అంచనాకు వచ్చారట.
తెలంగాణలో ప్రస్తుతం రాజకీయ పరిస్థితులు, దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలను సమగ్రంగా విశ్లేషించిన కేసీఆర్.. రాష్ట్రంలో కాంగ్రెస్ బలంగా ఉంటనే బీజేపీ దూకుడుకు బ్రేకులు వేయగలమనే భావిస్తున్నారని తెలుస్తోంది. ప్రభుత్వ వ్యతిరేకత ఓటు చీలకుండా ఒకే పార్టీకి వెళుతుండటంతో అధికార పార్టీకి వ్యతిరేక ఫలితాలు వస్తున్నాయి. అదే ప్రజా వ్యతిరేక ఓటు చీలితే తమకు ఇబ్బంది ఉండదని గులాబీ బాస్ భావిస్తున్నారట. కాంగ్రెస్ బలంగా ఉంటనే టీఆర్ఎస్ పార్టీ రాజకీయ భవిష్యత్ బాగుంటుందనే భావనలో ఉన్నారట. అందుకే రాష్ట్రంలో రోజురోజుకు బలహీన పడుతున్న కాంగ్రెస్ బలోపేతం కావాలంటే టీపీసీసీ పగ్గాలు రేవంత్ రెడ్డికి రావాలని ఆయన బలంగా కోరుకుంటున్నారట. ఈ విషయాన్ని టీఆర్ఎస్ నేతలు కూడా అంగీకరిస్తున్నారు.
మరోవైపు తెలంగాణలో కేసీఆర్ ను ఢీ కొట్టాలంటే, తమకు ఎదురు లేకుండా ఉండాలంటే కాంగ్రెస్ కనుమరుగు కావాలని కోరుకుంటున్న కమలం నేతలు.. రేవంత్ రెడ్డికి పీసీసీ చీఫ్ పదవి రావొద్దని బలంగా కోరుకుంటున్నారట. మొత్తంగా ఫైర్ బ్రాండ్ లీడర్ , మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్ రెడ్డిపైనే టీఆర్ఎస్, బీజేపీ రాజకీయ భవిష్యత్ ఆధారపడి ఉండటం ఆసక్తిగా మారింది. తెలంగాణ రాజకీయాలన్ని ఆయన చుట్టే తిరుగుతున్నాయనడానికి టీఆర్ఎస్, బీజేపీ ఆలోచనలే నిదర్శమనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది.