రేవంత్ టార్గెట్ గా సోనియాకు లేఖ!  వీహెచ్ బాటలోనే జగ్గారెడ్డి! 

తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటి అధ్యక్ష ఎన్నిక పీటముడి ఇప్పట్లో తెగేలా కనిపించడం లేదు.  పీసీసీ చీఫ్ ను హైకమాండ్ దాదాపుగా ఖరారు చేసిందని  ఓ వైపు  ప్రచారం జరుగుతుండానే.. మరోవైపు కొత్త ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. పీసీసీ చీఫ్ గా ఖాయమయ్యారనే ప్రచారం జరుగుతున్న మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్ రెడ్డి టార్గెట్ గా దూకుడు పెంచారు ఆయన ప్రత్యర్థులు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా, రాహుల్‌ గాంధీ, రాష్ట్ర ఇన్‌చార్జ్‌ ఠాగూర్‌కి ఎమ్మెల్యే జగ్గారెడ్డి లేఖ రాశారు. పీసీసీ ఎన్నికపై తొందరపాటు నిర్ణయం తీసుకోవద్దని లేఖలో ఆయన పేర్కొన్నారు. నాగార్జున సాగర్ ఉప ఎన్నిక వరకు ఉత్తమ్‌ కుమార్ రెడ్డినే కొనసాగించాలని  జగ్గారెడ్డి కోరారు. పీసీసీ ఎన్నికపై సీనియర్‌ కాంగ్రెస్‌ నేతల అభిప్రాయాలు తీసుకోవాలని సూచించారు. ఏకాభిప్రాయంతోనే పీసీసీ చీఫ్‌ ఎన్నిక జరగాలని ఎమ్మెల్యే జగ్గారెడ్డి...  సోనియారు రాసిన లేఖలో స్పష్టం చేశారు.          పీసీసీ విషయంలో మొదటి నుంచి రేవంత్ రెడ్డిని వ్యతిరేకిస్తున్నారు ఎమ్మెల్యే జగ్గారెడ్డి. పార్టీలోకి కొత్తగా వచ్చిన వారికి కీలక పోస్టులు ఇవ్వొద్దంటూ బహిరంగంగానే తన అభిప్రాయాన్ని చాలా సార్లు చెప్పారు. తాను కూడా పీసీసీ రేసులో ఉన్నానని ప్రకటించారు. ఇటీవల గాంధీభవన్ లో రేవంత్ రెడ్డి, జగ్గారెడ్డి సరదాగా మాట్లాడుకుంటున్న వీడియో బయటకి వచ్చింది. దీంతో ఇద్దరి మధ్య సఖ్యత కుదిరిందని అంతా భావించారు. కాని జగ్గారెడ్డి తాజా ప్రకటనతో రేవంత్ రెడ్డికి పీసీసీ పగ్గాలు రాకుండా ఆయన ఇంకా ప్రయత్నాలు చేస్తున్నారని తెలుస్తోంది. మరో సీనియర్ హనుమంతరావు కూడా రేవంత్ రెడ్డిని మొదటి నుంచి వ్యయతిరేకిస్తున్నారు.  శుక్రవారం మరో కీలక ప్రకటన చేశార. రేవంత్ కు టీపీసీసీ పగ్గాలు ఇస్తే తాను కాంగ్రెస్ పార్టీ నుంచి బయటికి వెళ్తానని ప్రకటించి సంచలనం రేపారు. వీహెచ్ వ్యాఖ్యలపై రేవంత్ రెడ్డి అభిమానులు తీవ్రంగా స్పందించడం... తనను ఫోన్ చేసి తిట్టారంటూ రేవంత్ రెడ్డి అనుచరుడిపై హనుమంతరావు కేసు పెట్టడం కూడా జరిగిపోయాయి.  వీహెచ్ కామెంట్లపై హైకమాండ్ ఆగ్రహంగా ఉందని తెలుస్తోంది. వీహెచ్ కు ఏఐసీసీ నుంచి షోకాజ్ నోటీసులు రావొచ్చని చెబుతున్నారు.

బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్‌కు వైసీపీ ఎమ్మెల్యే సవాల్

తెలంగాణకు చెందిన బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్‌ కు, ఏపీకి చెందిన శ్రీశైలం వైసీపీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. శ్రీశైలంలోని దుకాణ సముదాయాల్లో ముస్లింలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారంటూ రాజాసింగ్ ఆరోపించారు. తాత్కాలిక ప్రాతిపదికన ఇచ్చిన షాపులను తీసేయాలని కోర్టు ఆదేశించినా పట్టించుకోవడం లేదని అన్నారు. వైసీపీ ఎమ్మెల్యే చక్రపాణి ఓ టీమ్ తయారుచేసి, వైసీపీకి చెందిన రజాక్ అనే వ్యక్తికి బాధ్యతలు అప్పగించారని చెప్పారు. రజాక్ ను అడ్డుపెట్టుకొని ఎమ్మెల్యే చక్రపాణి అక్రమాలకు పాల్పడుతున్నారని, అడ్డగోలుగా కాంట్రాక్టులు పొందుతున్నారని విమర్శలు చేశారు. శ్రీశైలం దేవస్థానాన్ని కాపాడాలని, ఎమ్మెల్యే చక్రపాణిని కట్టడి చేయాలని ఏపీ సీఎం వైఎస్ జగన్‌ కు విజ్ఞప్తి చేశారు. పుణ్యక్షేత్రం పవిత్రతను కాపాడాలని, తాము ఇన్వాల్వ్ అయితే వేరేలా ఉంటుందని రాజాసింగ్ వార్నింగ్ కూడా ఇచ్చారు.   రాజా సింగ్‌ వ్యాఖ్యలపై చక్రపాణి రెడ్డి స్పందించారు. రాజాసింగ్ ఎప్పుడంటే అప్పుడు శ్రీశైలంలో పెద్దల సమక్షంలో చర్చకు సిద్ధమని అన్నారు. తనపై చేసిన ఆరోపణలు నిజమని నిరూపిస్తే రాజీనామాకు సిద్ధమని చెప్పిన ఆయన.. ఆరోపణలు నిరూపించకపోతే రాజీనామాకు సిద్ధమా? అని రాజా సింగ్‌ కు సవాల్ విసిరారు. శ్రీశైలంలో ముస్లింలను వెళ్లగొట్టడానికి తామెవరమని, అక్కడ వాళ్ళు 40 సంవత్సరాలుగా వ్యాపారాలు చేసుకుంటున్నారని చెప్పారు. రజాక్ అనే వ్యక్తి నలభై సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నారని, తొమ్మిది సంవత్సరాల నుంచి మాత్రమే రాజకీయాల్లో ఉన్న తనకు ఆయన బినామీ ఎలా అవుతాడని ప్రశ్నించారు. ఎన్నో దేవాలయాలకు తాను ఆర్థిక సహాయం చేశానని, అలాంటి తనను పట్టుకొని హిందూ ద్రోహిగా ముద్రవేయాలని చూస్తున్నారని చక్రపాణి రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.

తమిళనాట కొత్త పార్టీ లేనట్టేనా ? రజనీ అనారోగ్యంపై కొత్త చర్చ ? 

సూపర్ స్టార్  రజనీకాంత్ కు ఏమైంది?  ఆయన హై బీపీతోనే బాధపడుతున్నారా లేక ఇంకేమైనా తీవ్రమైన ఆరోగ్య సమస్యలు  ఉన్నాయా? డిసెంబర్ 31న రజనీ కొత్త పార్టీ ప్రకటన ఉంటుందా.. ఉండదా?.. ఇదే ఇప్పుడు రజనీకాంత్ అభిమానులకు నిద్ర లేకుండా చేస్తోంది. తమిళనాడు ప్రజల్లోనూ చర్చనీయాంశంగా మారింది. డిసెంబర్ 31న కొత్త రాజకీయ పార్టీపై ప్రకటన చేస్తానని చెప్పిన రజనీకాంత్.. అందుకు కసరత్తు కూడా చేసుకుంటున్నారు. పార్టీ ఏర్పాట్లు చూస్తూనే రామోజీ ఫిలిం సిటీలో జరుగుతున్న సినిమా షూటింగ్ లో పాల్గొంటున్న రజనీకాంత్.. ఒక్కసారిగా అనారోగ్యానికి హైదరాబాద్ అపోలో హాస్పిటల్ లో చేరారు. దీంతో భాషా హెల్త్ కండీషన్ పై  ఆయన అభిమానుల్లో ఆందోళన నెలకొంది. రజనీకాంత్ ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు చెబుతున్నా... అభిమానుల్లో మాత్రం ఆందోళన తగ్గడం లేదు.          రజనీ కాంత్  ఆరోగ్య పరిస్థితి  శుక్రవారం  కంటే మరింత మెరుగుపడిందన్న అపోలో డాక్టర్లు..  మరిన్ని వైద్య పరీక్షలు చేశామని తెలిపారు.  రజనీకాంత్ ను  పరామర్శించేందుకు ఎవ్వరూ రావద్దని మరోసారి విజ్ఞప్తి చేశారు. దీంతో రజనీ పరామర్శకు ఎవరూ రావొద్దని వైద్యులు చెప్పడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రాజకీయ  పార్టీ ప్రకటన వాయిదా వేయడానికే రజనీకాంత్ హాస్పిటల్ లో జాయిన్ అయ్యారనే వాదనలు కొందరి నుంచి వస్తున్నాయి. గతంలోనూ  కొందరు రాజకీయ నేతల కొత్త పార్టీ ఏర్పాటు, పార్టీ మార్పు సందర్భాల్లో ఇలాంటి ఘటనలే జరిగాయి.  ఏపీ కాంగ్రెస్ నేతగా ఉన్నప్పుడు  వైసీపీలో చేరడానికి రంగం సిద్దం చేసుకున్నారు కన్నా లక్ష్మినారాయణ . తెల్లారితే కన్నా జగన్ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకోవాల్సి  ఉండగా.. బీజేపీ పెద్దలు ఎంట్రీ అయ్యారు. కన్నాను తమ పార్టీలోకి ఆహ్వానించారు. ఇంతలోనే  వైసీపీలో చేరడానికి  అన్ని సిద్దం చేసుకున్న కన్నా లక్ష్మినారాయణ.. అర్ధరాత్రి పూట సడెన్ గా అనారోగ్యానికి గురై హాస్పిటల్ లో అడ్మిట్ అయ్యారు.  మరికొన్ని గంటల్లో వైసీపీలో చేరాల్సి ఉన్న  కన్నా.. అది తప్పించుకోవడానికే హాస్పిటల్ లో చేరారనే ప్రచారం జరిగింది. ఇప్పుడు రజనీకాంత్ విషయంలో అలానే జరుగుతుందనే చర్చ  కొందరి నుంచి వస్తోంది.  తమిళనాడులో రజనీకాంత్ రాజకీయ పార్టీపై మొదటి నుంచి గందరగోళమే కనిపించింది. 2017 డిసెంబర్‌ 31న రాజకీయ పార్టీపై ప్రకటన చేశారు రజనీకాంత్. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తామని కూడా ప్రకటించారు. అయితే పార్టీ పెడతానని ప్రకటించి మూడేళ్లు అయినా... పార్టీ ఏర్పాటుపై పురోగతి కన్పించలేదు.  రజనీ మక్కల్‌ మండ్రం ఏర్పాటు, కార్యవర్గం నియామకం, సభ్యత్వ నమోదుతో సరిపెట్టారు రజనీకాంత్.  మరో ఐదు నెలల్లోనే అసెంబ్లీ ఎన్నికలు ఉండటంతో రజనీకాంత్ పార్టీ ఉండకపోవచ్చని దాదాపుగా అందరూ నిర్ణయానికి వచ్చారు. ఇంతలో సడెన్ గా మేల్కొన్న రజనీకాంత్.. నవంబర్ 30న  రజనీ మక్కల్ మండ్రం సభ్యులతో  చర్చించి కొత్త పార్టీపై మరోసారి ప్రకటన చేశారు. డిసెంబర్ 31 పార్టీ పేరు ప్రకటిస్తానని చెప్పారు.  పార్టీ పేరు రిజిస్ట్రేషన్ ప్రక్రియను అయన అనుచరులు కేంద్ర ఎన్నికల సంఘం పూర్తి చేశారు. ఇంతలోనే రజనీకాంత్ ఆరోగ్యం క్షీణించి హాస్పిటల్ లో చేరడంతో పార్టీ ఏర్పాటుపై మళ్లీ అయోమయం నెలకొంది.   రాజకీయ పార్టీపై రజనీకాంత్  వెనక్కి తగ్గారని  గతంలోనూ సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. అనారోగ్య కారణాలతో రజనీకాంత్ రాజకీయ పార్టీ పెట్టడం లేదన్నది ఆ ప్రచార సారాంశం. వైద్యుల సలహా మేరకు రాజకీయాల నుంచి రజనీకాంత్ తప్పుకుంటున్నారని అందులో ఉంది.  సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై స్పందించిన రజనీకాంత్..  అది తన ప్రకటన కాదంటూనే అందులో పేర్కొన్న ఆరోగ్యపరమైన సమస్యలను  పరోక్షంగానే అంగీకరించారు. మండ్రం నిర్వాహకులతో చర్చించి నిర్ణయం తీసుకుంటానని ప్రకటించారు. గతంలో ప్రచారం జరిగినట్లే రజనీకాంత్ ఆరోగ్యం క్షీణించడంతో ఇప్పుడు కొత్త చర్చలు తెరపైకి వస్తున్నాయి. అరోగ్య కారణాల రీత్యా పార్టీ ఏర్పాటుకు రజనీకాంత్ కు మంచి కాదని వైద్యులు గతంలో సూచించారని, వాళ్లు చెప్పినట్లే జరుగుతున్నందున.. రాజకీయ పార్టీపై రజనీకాంత్ పునరాలోచన చేసే అవకాశం ఉందని చెబుతున్నారు. దీంతో రజనీకాంత్ రాజకీయ గమనం ఉంటుందా ఉండదా అన్న అనుమానాలే ఇప్పుడు తమిళనాడులో ఎక్కువగా జరుగుతున్నాయి.

చీరాలలో మంత్రి సాక్షిగా ఉప్పు నిప్పు కలిసాయి.. 

ఏపీ సీఎం జగన్ ను నిత్యం చికాకులతో సతాయించే నియోజకవర్గాలు రెండు. అందులో ఒకటి కృష్ణాజిల్లా గన్నవరం కాగా రెండోది ప్రకాశం జిల్లా చీరాల. ఈ రెండు చోట్ల టీడీపీ తరుఫున గెలిచిన ఎమ్మెల్యేలు సీఎం జగన్ కు జై కొట్టడంతో వైసీపీ పార్టీలో నిత్యం ఏదో ఒక రచ్చ జరుగుతూనే ఉంది. చీరాలలో ఎటువంటి కార్యక్రమం జరిగినా అటు కరణం బలరాం వర్గం, ఇటు ఆమంచి కృష్ణమోహన్ వర్గం కాలు దువ్వుతూనే ఉన్నాయి. అయితే తాజాగా నిన్న చీరాలలో పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీ కార్యక్రమంలో ఈ ఇద్దరు నాయకులు మంత్రితో ఒకే వేదిక ను పంచుకోవడం హాట్ టాపిక్ అయింది.   ఈ ప్రభుత్వ కార్యక్రమంలో మంత్రి బాలినేనికి ఓ వైపు కరణం బలరాం.. మరోవైపు ఆమంచి నిలబడి ఉండగా ఎలాంటి గొడవలు జరగకుండా ప్రోగ్రాం పూర్తి కావడం విశేషం. కొద్దిరోజుల క్రితం చీరాలలో మత్స్యకారుల మధ్య నెలకొన్న గొడవల్లో కరణం, ఆమంచి వర్గీయుల మధ్య పెద్ద ఎత్తున ఘర్షణలు చోటు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో.. ప్రభుత్వం చేపట్టిన ఇళ్ల స్థలాల పంపిణీ కార్యక్రమం ప్రతిష్టాత్మకం కావడంతో మంత్రి బాలినేని స్వయంగా రంగంలోకి దిగారు. దీంతో ఇద్దరు నేతల అనుచరులు వస్తే మళ్లీ ఘర్షణలు జరుగుతాయని భావించిన పోలీసులు ముందుజాగ్రత్త చర్యగా కేవలం ఆమంచి, కరణంలను మాత్రమే వేదికపైకి అనుమతించారు. అయితే ఒకరిపై మరొకరు లోపల రగిలిపోతున్నా.. ఆమంచి, కరణం మాత్రం పైకి నవ్వులు చిందిస్తూ ఫొటోలకు ఫోజులివ్వడం విశేషం. అయితే వేదికపై వారిద్దరూ పలకరించుకోకుండా ఎడముఖం పెడముఖంగానే ఉన్నారు. ఇద్దరునేతల అనుచరులను పోలీసులు అనుమతించకపోకడంతో.. ఎటువంటి ఘర్షణలు లేకుండా కార్యక్రమం ముగియడంతో ఇటు వైసీపీ కార్యకర్తలు, అటు అధికారులు కూడా ఉపిరి పీల్చుకున్నారు.

విశాఖలో టీడీపీ, వైసీపీ నేతల ప్రమాణాల సవాళ్లు.. పరిస్థితి ఉద్రిక్తం 

ఏపీలో వైసీపీ, టీడీపీ నేతల మధ్య పరస్పర అవినీతి ఆరోపణలు.. ఆ తర్వాత ప్రముఖ ఆలయాలలో నేతల ప్రమాణాలతో రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. కొద్ది రోజుల క్రితం అనపర్తి వైసీపీ ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణరెడ్డి, మాజీ ఎమ్మెల్యే.. టీడీపీ నేత నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఒకరిపై ఒకరు అవినీతి ఆరోపణలు చేసుకుని తర్వాత బిక్కవోలు వినాయకుడి గుడిలో ప్రమాణాలు చేయాలంటూ సవాళ్లు, ప్రతి సవాళ్లు విసురుకున్నారు. అంతేకాకుండా ఏకంగా గుడిలో ప్రమాణం చేసే సమయంలో కూడా తీవ్ర ఉద్రిక్తత నెలకొన్న సంగతి తెల్సిందే.   తాజాగా ఏపీలో వైసీపీ, టీడీపీలు నేతల మధ్య మరోసారి ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. విశాఖపట్నం నగరంలో గత టీడీపీ ప్రభుత్వ హయాంలో భూ కబ్జాలు జరిగాయని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఆరోపించారు. దీంతో గత మూడు రోజులుగా టీడీపీ, వైసీపీ నేతల మధ్య ప్రమాణాల సవాళ్లు నడుస్తున్నాయి. భూ అక్రమాలకు పాల్పడ్డారని తనపై వైసీపీ నాయకులు చేస్తున్న ఆరోపణల పై విశాఖ తూర్పు టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు తీవ్రంగా స్పందిస్తూ.. దమ్ముంటే సాయిబాబా గుడిలో ప్రమాణం చేయాలని విజయసాయిరెడ్డికి సవాలు విసిరారు. అయితే విజయసాయి తరుఫున తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ విజయనిర్మల సిద్ధమయ్యారు.   రెండు పార్టీల నాయకుల తాజా ప్రమాణాల సవాళ్లతో విశాఖ పోలీసులు అప్రమత్తమయ్యారు. దీంతో ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు ఇంటి వద్ద పోలీసులు భారీగా మోహరించారు. మరోపక్క నాయకులు ప్రమాణాలు చేయడానికి సిద్దమైన ఈస్ట్ పాయింట్ కాలనీ లో ఉన్న సాయిబాబా గుడి వద్ద భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. కొద్ది రోజుల క్రితం ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు ఆఫీసు వద్ద వైసీపీ నేతలు చేసిన ధర్నాలో పోలీసులపై కూడా దాడి జరిగిన నేపథ్యంలో.. ఈ సవాళ్ల వ్యవహారంలో ఎప్పుడు ఏం జరుగుతుందో అని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

కొత్త కరోనా గురించి ఆందోళన అవసరం లేదు: ఎయిమ్స్ డైరెక్టర్

బ్రిటన్ లో రూపు మార్చుకున్న కొత్త కరోనా వైరస్ గురించి ప్రపంచ దేశాల్లో ఆందోళన వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే. కొత్త వైరస్ మరింత ప్రమాదకరమైందని, ప్రపంచమంతా మళ్ళీ లాక్ డౌన్ లోకి వెళ్ళే ప్రమాదముందని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో కొత్త కరోనా వైరస్ పై ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రణ్ దీప్ గులేరియా స్పందించారు. దాని గురించి అంత ఆందోళన అవసరం లేదని అన్నారు. భారత్ లో పది నెలల్లో కరోనా వైరస్ ఎన్నో రూపాలు మార్చుకుందని, అది సాధారణంగా జరిగేదేనని తెలిపారు. నెలకు సగటున వైరస్ లో రెండు ఉత్పరివర్తనాలు జరిగాయని, వైరస్ రూపు మార్చుకున్నా అది సోకినప్పుడు కలిగే లక్షణాల్లో మాత్రం ఎలాంటి మార్పులు లేవన్నారు. కరోనా చికిత్స కూడా మారలేదని, మార్చాల్సిన అవసరమూ లేదని తెలిపారు. ప్రస్తుతం వివిధ దశల ట్రయల్స్ లో ఉన్న టీకాలన్నీ కొత్త కరోనా వైరస్ పై సమర్థంగా పనిచేస్తాయని ధీమా వ్యక్తం చేశారు. చాలా వేగంగా వ్యాప్తి చెందడం వల్లే బ్రిటన్ వైరస్ పై ఎక్కువ భయాలు నెలకొన్నాయని చెప్పారు. ఈ రకం వైరస్ సోకినా ఎక్కువ రోజులు ఆసుపత్రిలో ఉండాల్సిన అవసరం లేదని గులేరియా వివరించారు.

అమరావతికి కులం లింకా? 'రెడ్డి' పాలన చేస్తూ నీతి వాక్యాలా?

నలుగురు నవ్వుపోదురు గాక నాకేటి సిగ్గు అన్నట్లుగా ఉంది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీరు. స్థలాల పంపిణి సభలో రాజధాని అమరావతికి కులం లింకుతో ఆయన చేసిన వ్యాఖ్యలపై అన్ని వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఏపీలో రెడ్డి పాలన చేస్తూ కులాల గురించి నీతి వాక్యాలు చెబుతున్న జగన్ ను చూసి  జనాలు నవ్వుకుంటున్నారు. అమరావతికి కులం కంపు కలుపుతూ జగన్మోహన్ రెడ్డి దిగజారుడు ప్రకటనలు చేస్తున్నారని మండిపడుతున్నారు. ముఖ్యమంత్రి హోదాలో ఉండి.. కులాల ప్రస్తావన తెస్తూ ఆ పదవికే జగన్ రెడ్డి కళంకం తెచ్చారని ఆరోపిస్తున్నారు. గత 18 నెలలుగా ఏపీలో సాగుతున్న పాలన, పదవుల పంపకం, నామినేటెడ్ పోస్టుల భర్తీ.. ఇలా అన్నింటా ఒకే వర్గానికి పెద్దపీట వేసిన ఘటనలను ప్రస్తావిస్తూ జగన్ రెడ్డికి ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు మేధావులు, విద్యావంతులు. జగన్ రెడ్డి తీరుపై విపక్షాలు, ప్రజా సంఘాలు  విరుచుకుపడుతున్నాయి.    కులం పట్టి పోస్టింగులు.. రెడ్డి అధికారులకు రెడ్ కార్పెట్.. ఇతర వర్గాల వారికి డిమోషన్.. కమ్మ కులం ఆఫీసరైతే వెయిటింగ్.. తన కులానికే నామినేటెడ్ పదవులు.. ఇదీ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో పాలనా పరిస్థితి. వైఎస్ జగన్ పాలనలో రెడ్డి సామజిక వర్గానికే పదవులన్నీ కట్టబెడుతున్నారని సర్కార్ లెక్కలు చూస్తేనే అర్దమై పోతోంది. జగన్ రెడ్డి పాలనలో ఏపీలో సామాజిక న్యాయం అడ్రసే లేకుండా పోయింది. ఇప్పటివరకు నియమించిన నామినేటెడ్ పదవుల్లో అంతటా రెడ్డి  వర్గ ఆధిపత్యమే. అధికారం, నిధులు ఉన్న పదవులన్ని వాళ్ల సొంతమే. ఏపీలో మొత్తం నామినేటెడ్‌ పదవులు 712 ఉండగా.. వీటిలో దాదాపు 90 శాతం రెడ్లకే దక్కాయి.  వీసీల్లో 83 శాతం, ప్రభుత్వ సలహదారుల్లో 71 శాతం పదవులు ఆ సామాజిక వర్గానికే  ఇచ్చారు. ఏపీలో అతి ముఖ్యమైన టీటీడీలో మొత్తం 36 మంది సభ్యులుంటే అందులో 11 మంది రెడ్లే,  12 మంది వైస్ ఛాన్స్ లర్లలో 10 రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారే. ప్రభుత్వ న్యాయవాదులు 30 మంది ఉంటే.. 16  మంది సీఎం రెడ్లే.  యూనివర్సిటీ సెర్చ్‌ కమిటీల్లో 12 మంది ఉంటే 9  మంది రెడ్లనే నియమించారు.    ఆంధ్రప్రదేశ్ లో  కిలకమైన టీటీడీ, తుడా, ఏపీఐఐసీ పదవులన్ని రెడ్లతోనే నింపేశారు.  టీటీడీ చైర్మెన్ గా వైవీ సుబ్బారెడ్డి, ఈవోగా జవహర్ రెడ్డి, ప్రత్యేక అధికారిగా ధర్మారెడ్డిని నియమించారు జగన్ రెడ్డి. తుడా చైర్మెన్ గా  చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఏపీఐఐసీ చైర్మెన్ రోజారెడ్డికి పగ్గాలు అప్పగించారు. జగన్ ప్రభుత్వ సలహాదారులుగా మొత్తం ఆయన రెడ్డి వర్గానికే చెందిన వారినే నియమించుకున్నారు. రాజధాని అమరావతిపై  వేసిన మంత్రివర్గ ఉపసంఘంలోనూ అంతా ఒక రెడ్డి నేతలే ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం కీలక శాఖలన్ని రెడ్డి అధికారులకే కట్టబెట్టారు. ఇతర వర్గాల అధికారులకు అనామక పోస్టింగులు ఇస్తున్నారు. బదిలీలు, ప్రమోషన్లలోనూ ఆ వర్గానికే అందలం. కమ్మ కులం అధికారులుంటే.. వారికే లూప్ లైన్ లో పోస్టింగ్.. లేదంటే సస్పెన్షన్ విధిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇంతలా ఏపీలో రెడ్డి పాలన చేస్తూ అమరావతి విషయంలో సీఎ జగన్ కుల ప్రస్తాలన తెవడంపై ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. ముఖ్యమంత్రి పదవిలో ఉన్న జగన్ దిగజారిపోయి మాట్లాడుతూ.. ఆ పదవికే మచ్చ తెచ్చారనే  ఆరోపణలు అన్ని వర్గాల నుంచి వస్తున్నాయి.    నిజానికి హైకోర్టులో అమరావతి రైతులు వేసిన పిటిషన్ లో ఎక్కడా కుల ప్రస్తావన లేదు. పేదలకు ఇళ్ల స్థలాలను కేటాయించడాన్ని అటు రైతులు గానీ, హైకోర్టు గానీ తప్పు పట్టలేదు. రాజధాని ప్రాంతంలో స్థానికులకు కాకుండా బయటి వారికి ఇవ్వడాన్ని తప్పు పడుతూ కోర్టును ఆశ్రయించారు అమరావతి రైతులు. అమరావతికి కులం కంపు కలుపుతూ జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై రాజధాని ప్రాంత రైతులు విస్మ యం వ్యక్తం చేస్తున్నారు. సీఎం స్థాయిలో ఆయన హైకోర్టు తీర్పును వక్రీకరించి, అవస్తవాలు చెప్పడం సరికాదంటున్నారు. రాజధాని కోసం రైతులను ఇచ్చిన భూములను ఇళ్ల స్థలాలకు ఇస్తామనడం, మాస్టర్‌ ప్లాన్‌లోని జోన్లను మార్చడంపైనే కోర్టును ఆశ్రయించినట్లు గుర్తు చేశారు. పిటిషన్లలో ఎక్కడా కుల ప్రస్తావన లేదని తెలిపారు.    రాజధానిలో పేదలు కూడా ఉండాలనే ఉద్దేశంతోనే 5వేల ఎకరాలు కేటాయించామన్నారు తాడికొండ మాజీ ఎమ్మెల్యే శ్రావణ్‌ కుమార్‌. టీడీపీ ప్రభుత్వం 8 వేల మందికి ఇళ్లు కేటాయించిందని, 5024 ఇళ్లు కట్టించి సిద్ధం చేసిందని తెలిపారు. పేదల కోసం రాజధాని ప్రాంతంలో తమ ప్రభుత్వం కట్టించిన ఈ ఇళ్లను జగన్‌ సర్కారు లబ్ధిదారులకు ఇవ్వకుండా పాడుబెట్టడంపై కూడా తాను  కోర్టును ఆశ్రయించాను చెప్పారు. అమరావతిలో అన్ని కులాలు, మతాలు, సంస్కృతుల ప్రజలు కలిసి జీవిస్తున్నా, కళ్లుండి సీఎం జగన్‌ చూడలేకపోతున్నారని రాజధాని పరిరక్ష ణ సమితి అధ్యక్షుడు కొలికపూడి శ్రీనివాసరావు విమర్శించారు.  స్థలాల పంపిణీ సభలో సీఎం జగన్‌ చేసిన ప్రకటనను ఆయన ఖండించారు. అమరావతిలో కేవలం ఒకే సామాజికవర్గం కనపడడం ఆయన సంకుచిత మనస్తత్వానికి నిదర్శనమని శ్రీనివాసరావు మండిపడ్డారు.

జనవరిలో తిరుపతి, నాగార్జున సాగర్  బైపోల్ షెడ్యూల్ ! 

తెలుగు రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న లోక్ సభ , అసెంబ్లీ స్థానాలకు ఫిబ్రవరి చివర లేదా మార్చి తొలి వారంలో  ఉప ఎన్నికలు జరిగే అవకాశం కనిపిస్తోంది. కరోనాకు చికిత్స తీసుకుంటూ చెన్నై హాస్పిటల్ లో తిరుపతి వైసీపీ ఎంపీ బల్లి దుర్గాప్రసాద్  సెప్టెంబర్ 16న చనిపోయారు. ఎన్నికల సంఘం రూల్స్ ప్రకారం.. ఎవరైన ప్రజా ప్రతినిధి చనిపోతే ఏర్పడే ఖాళీని ఆరు నెలల్లోపు భర్తీ చేయాలి. ఈ లెక్కన తిరుపతి లోక్ సభకు  మార్చి 16వ తేదీలోపు బైఎలక్షన్​ జరగాల్సి ఉంది. నాగార్జున సాగర్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే డిసెంబర్ 1న చనిపోయారు. సాగర్ ఉప ఎన్నికకు జూన్ వరకు గడువున్నా.. తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికతో పాటు నాగార్జున సాగర్ అసెంబ్లీ బై పోల్ ను నిర్వహించాలని ఎలక్షన్​ కమిషన్​ భావిస్తున్నట్టు తెలుస్తోంది.  తిరుపతి, నాగార్జున సాగర్ ఉప ఎన్నికల షెడ్యూల్ జనవరి చివర లేదా ఫిబ్రవరి తొలి వారంలో విడుదలయ్యే చాన్స్ ఉందని సమాచారం.  తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నిక కోసం  పార్టీలు ఇప్పటికే కసరత్తు మొదలు పెట్టాయి.  ప్రధాన ప్రతిపక్షం టీడీపీ అభ్యర్థిని కూడా ప్రకటించి ప్రచారం చేసేస్తోంది. 2019 ఎన్నికల్లో పోటీ చేసిన కేంద్ర మాజీ  మంత్రి పనబాక లక్ష్మినే మరోసారి బరిలోకి దింపుతోంది టీడీపీ. ఏపీలో ప్రస్తుతం జగన్ సర్కార్ పై ప్రజల్లో బాగా వ్యతిరేకత కనిపిస్తోంది. దాన్ని క్యాష్ చేసుకునేందుకు టీడీపీ ప్రయత్నాలు చేస్తోంది. తిరుపతిలో తమదే విజయమనే ధీమాలో ఉంది తెలుగు దేశం పార్టీ.  తిరుపతిలో బీజేపీ, జనసేన కలిసి పోటీ చేస్తాయని ప్రచారం జరుగుతున్నా.. ఆ రెండు పార్టీల మధ్య స్పష్టత రావడం లేదు. తామే పోటీ చేయబోతున్నామని జనసేన నేతలు ప్రకటిస్తుండగా.. తిరుపతిలో బీజేపీ అభ్యర్థే ఉంటారని సోము వీర్రాజు చెబుతున్నారు. తిరుపతిలో పోటీపై జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ కూడా  సీరియస్ గా ఉన్నట్లు చెబుతున్నారు. 2019 ఎన్నికల్లో బీజేపీ కంటే జనసేన మద్దతుతో పోటీ చేసిన బీఎస్పీ అభ్యర్థికే తిరుపతిలో ఎక్కువ ఓట్లు వచ్చాయి.  దీంతో బీజేపీ, జనసేనలో ఎవరూ తిరుపతి ఉప ఎన్నిక బరిలో  ఉంటారన్న దానిపై గందరగోళం నెలకొంది.  అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కూడా ఇంకా తిరుపతి అభ్యర్థిని ఖరారు చేయలేదు. మొదట దివంగత ఎంపీ బల్లి దుర్గా ప్రసాద రావు కుటుంబ సభ్యులకే టికెట్ ఇస్తారని ప్రచారం జరిగినా... తర్వాత తెరపైకి జగన్ వ్యక్తిగత ఫిజియో థెరపిస్ట్ డాక్టర్ గురుమూర్తి పేరు వచ్చింది. గురుమూర్తే వైసీపీ నుంచి పోటీ చేస్తారని తెలుస్తోంది. జగన్, షర్మిల పాదయాత్ర చేసినప్పుడు వాళ్ల వెంటే ఉన్నారు గురుమూర్తి. వాళ్లిద్దరకి సపర్యలు చేశారు. తమకు చేసిన సేవకు మెచ్చే గురుమూర్తిని జగన్ ఎంపీగా పోటీ చేయిస్తున్నారనే చర్చ వచ్చింది. అయితే గురుమూర్తి అభ్యర్థిత్వంపై విమర్శలు కూడా వస్తున్నాయి. తన కాళ్లకు కట్లు కట్టిన వ్యక్తికి జగన్ ఎంపీ టికెట్ ఇస్తున్నారని అంటూ..  తనకు సమయానికి ట్యాబ్లెట్లు ఇచ్చిన సంతోష్ కుమార్ ను కేసీఆర్ రాజ్యసభకు పంపడాన్ని ప్రస్తావిస్తూ నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. కేసీఆర్ బాటలోనే జగన్ నడుస్తున్నారని విమర్శలు చేస్తున్నారు. దీంతో గురుమూర్తినే వైసీపీ ఖరారు చేస్తుందా లేక మరొకరికి ఇస్తుందా  అన్నది సస్పెన్స్ గా మారింది.    తెలంగాణలోని నాగార్జున సాగర్ అసెంబ్లీ ఉప ఎన్నిక పార్టీలకు కీలకంగా మారింది. దుబ్బాక, గ్రేటర్ ఎన్నికల్లో ఓడిపోయిన అధికార టీఆర్ఎస్ పార్టీ.. సాగర్ లో గెలిచి మళ్లీ పట్టు సాధించాలని భావిస్తోంది. వరుస విజయాలతో దూకుడు మీదున్న బీజేపీ... అదే ట్రెండ్ కొనసాగిస్తూ రాష్ట్రంలో అధికారం దిశగా అడుగులు వేయాలని చూస్తోంది. ఘోర పరాజయాలతో ఢీలా పడిన కేడర్ లో ఉత్సాహం నింపి పార్టీని మళ్లీ బలోపేతం చేయాలంటే నాగార్జున సాగర్ లో గెలిచి తీరాలని కాంగ్రెస్ పట్టుదలగా ఉంది. దీంతో సాగర్ సమరం అన్ని పార్టీలకు సవాల్ గా మారింది.  నాగార్జున సాగర్  టికెట్  కోసం టీఆర్ఎస్ లో తీవ్రంగా పోటీ నెలకొంది. దివంగత ఎమ్మెల్యే  నోముల భార్య లక్ష్మిగాని,  కొడుకు భగత్ యాదవ్ గానీ పోటీకి రెడీగా ఉన్నట్టు  చెప్తున్నారు. మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి నాగార్జున సాగర్ నుంచి పోటీ చేసేందుకు రెడీగా ఉన్నారని తెలుస్తోంది.  ఎమ్మెల్సీ తేరా చిన్నపరెడ్డి, లోకల్ లీడర్ ఎంసీ కోటిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే రామ్మూర్తి యాదవ్ మనవడు మన్నెం రంజిత్ యాదవ్  కూడా టీఆర్ఎస్​ టికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. దుబ్బాకలో సానుభూతి కలిసి రాకపోవడంతో నాగార్జున సాగర్ టికెట్ ను నోముల కుటుంబానికి ఇవ్వాలా, వద్దా? అన్న దానిపై టీఆర్ఎస్  హైకమాండ్​ అలోచనలో పడిందని సమాచారం.  కాంగ్రెస్  నుంచి ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి జానారెడ్డి పోటీకి రెడీ అయినట్టు కాంగ్రెస్​ వర్గాలు చెప్తున్నాయి. ముందుగా తన కొడుకు రఘువీర్ రెడ్డిని బరిలోకి దింపాలని ఆయన భావించారు. దీనిపై జానారెడ్డి లోకల్ లీడర్లతో ప్రత్యేకంగా ఓ మీటింగ్​ నిర్వహించి, వారి అభిప్రాయాలను తీసుకున్నట్టు తెలిసింది. మెజార్టీ లీడర్లు జానారెడ్డినే పోటీ చేయాలని, ఒకవేళ రఘువీర్ పోటీ చేస్తే ప్రయోజనం ఉండదని డైరెక్ట్​గా చెప్పడంతో జానారెడ్డి బరిలోకి దిగేందుకు రెడీ అయినట్టు కాంగ్రెస్ లో చర్చ జరుగుతోంది. నాగార్జున సాగర్ లో బలమైన క్యాండిడేట్​ కోసం సెర్చ్​ చేస్తోంది బీజేపీ. టీఆర్ఎస్ బీసీలకు టికెటిస్తే బీజేపీ నుంచి ఓసీ క్యాండిడేట్​ని.. ఒకవేళ ఆ పార్టీ ఓసీ నేతను బరిలోకి దింపితే బీజేపీ నుంచి బీసీ క్యాండిడేట్​ను రంగంలోకి దింపాలని భావిస్తున్నట్టు తెలిసింది. 2014 అసెంబ్లీ ఎలక్షన్లలో టీడీపీ నుంచి పోటీచేసి దాదాపు 22 వేల ఓట్లు సాధించిన కడారి అంజయ్య యాదవ్ ప్రస్తుతం బీజేపీ నుంచి పోటీ కోసం ప్రయత్నిస్తున్నారు. టీఆర్ఎస్ నుంచి టికెట్ ఆశించి భంగపడ్డ స్ట్రాంగ్ లీడర్లను చేర్చుకుని వారిలో ఒకరికి టికెట్ ఇచ్చే వ్యూహంలో బీజేపీ ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది.

ఏపీ సర్కార్ చేసిన "చెత్తపని" పై కేంద్రం సీరియస్ 

ఏపీలోని జగన్ సర్కార్ రోజుకో కొత్త సంక్షేమ పథకాన్ని ప్రారంభిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ కార్యక్రమాలకు బ్యాంకులు నిధులు మంజూరు చేయడంలేదని పేర్కొంటూ.. బ్యాంకుల ముందు చెత్త పోయడాన్ని బ్యాంకర్లు సీరియస్ గా తీసుకుంటున్నారు. దీంతో వచ్చే సోమవారం నాడు ఏదో ఒక రూపంలో తమ తీవ్ర నిరసనను వ్యక్తం చేయాలని వారు భావిస్తున్నారు. ఇది ఇలా ఉండగా విజయవాడ, మచిలీపట్నం, ఉయ్యూరుల్లోని బ్యాంకుల గుమ్మం ముందు చెత్తను గుమ్మరించిన ఘటనపై కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ ఇప్పటికే తీవ్రంగా స్పందించారు. ఈ విషయమై ఆమె ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డితో మాట్లాడినట్లుగా ఆమె ట్విట్టర్ ద్వారా తెలిపారు. బ్యాంకు గుమ్మాల ముందు చెత్తపోసిన ఫొటోలను కూడా ఆమె తన పోస్ట్‌ కు జత చేశారు. దీంతో ఈ విషయం జాతీయ స్థాయిలో తీవ్ర చర్చకు దారి తీసింది. దీంతో "ఏపీలో ఇలా జరుగుతోందా" అంటూ బ్యాంకర్లు, ఆర్థిక నిపుణులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. జాతీయ స్థాయిలో ఏపీ పరువు పోతున్నా జగన్ సర్కారు మాత్రం దీనిని తేలిగ్గానే తీసుకుంటోంది. అంతేకాకుండా రుణాలు అందని పథకాల లబ్ధిదారులే ఇలా నిరసన వ్యక్తం చేశారని ఉన్నతాధికారులు వాదిస్తున్నారు. అయితే కృష్ణా జిల్లాలోని విజయవాడ, మచిలీపట్నం, ఉయ్యూరులలో ఒకేరోజు వివిధ బ్యాంకు శాఖల ముందు చెత్తపోయడం యాదృచ్ఛికంగా జరిగింది కాదని... "ఉన్నతస్థాయి" నుండి వచ్చిన ఆదేశాలను పాటించి మునిసిపాలిటీ పారిశుధ్య సిబ్బంది ఈ పని చేశారని బ్యాంకర్లు భావిస్తున్నారు.   అంతేకాకుండా ఉయ్యూరులో ఏకంగా "నగరపంచాయతీ కమిషనర్" పేరిట బ్యానర్లు ఉంచడమే దీనికి నిదర్శనమని బ్యాంకు సిబ్బంది చెబుతున్నారు. జగనన్న తోడు, వైఎస్సార్‌ చేయూత, సీఎం స్వానిధి తదితర పథకాల విధివిధానాల్లో స్పష్టత లేకపోవడంతోపాటు, సిబ్బంది కొరత కారణంగానే రుణాలివ్వడంలో జాప్యం జరుగుతోందే తప్ప ఇందులో ఉద్దేశపూర్వక అలసత్వం ఏమాత్రం లేదని వివిధ సమావేశాల్లో స్పష్టం చేస్తున్నప్పటికీ ఇలాంటి చెత్త చర్యలకు పాల్పడటాన్ని బ్యాంకర్లు ఖండిస్తున్నారు. తాజాగా జాతీయ స్థాయిలో చర్చనీయాంశమైన ఈ వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందోనన్న ఆసక్తి ప్రస్తుతం నెలకొంది. క్రిస్మస్‌ సెలవుల తర్వాత ఏదో ఒక రూపంలో తమ నిరసనను వ్యక్తం చేయాలని బ్యాంకుల ఉద్యోగులు, అధికారులు ఆలోచిస్తున్న నేపథ్యంలో.. ఈ ఘటనకు కారణమైన బాధ్యులపై ప్రభుత్వం తప్పనిసరిగా చర్యలు తీసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. 

హైదరాబాద్ కు మార్చిలోనే వచ్చేసిన కొత్త కరోనా స్ట్రెయిన్.. ఐజీఐబీ డైరెక్టర్ 

కరోనా మహమ్మారి నిరంతరం రూపాంతరం చెందుతూ ప్రపంచాన్ని ముప్పతిప్పలు పెడుతూనే ఉంది. కొద్ది రోజుల క్రితం ఇలా రూపాంతరం (మ్యుటేషన్‌) చెందిన వైరస్ ప్రపంచాన్ని బెంబేలెత్తించింది. తాజాగా ఈ వైరస్ మరింతగా రూపాంతరం చెంది సూపర్‌ స్ర్పెడర్ ‌(స్ర్టైయిన్‌‌) గా మారి బ్రిటన్‌ లో విలయం సృష్టిస్తోంది.   అయితే, ఈ సూపర్‌ స్ర్పెడర్ స్ర్టైయిన్‌ మన దేశంలోకి ఈ ఏడాది మార్చిలోనే ప్రవేశించినట్లు కౌన్సిల్‌ ఆఫ్‌ సైంటిఫిక్‌ అండ్‌ ఇండస్ట్రియల్‌ రీసెర్చ్‌ (సీఎస్ఐఆర్‌) అనుబంధ సంస్థ అయిన ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ జీనోమిక్స్‌ అండ్‌ ఇంటిగ్రేటివ్‌ బయాలజీ (ఐజీఐబీ) డైరెక్టర్‌ అనురాగ్‌ అగర్వాల్‌ తెలిపారు. ఈ సంస్థ ప్రస్తుతం బయటపడ్డ కొత్త రకం వైరస్ ప్రభావాన్ని గుర్తించడానికి జన్యు విశ్లేషణలో నిమగ్నమైంది. మొన్న మార్చికి ముందు ఉన్న వైరస్‌కు భిన్నమైన రకాలను మనదేశంలో గత మార్చిలోనే శాస్త్రవేత్తలు గుర్తించారు. వీటిలో ఒక రకాన్ని సూపర్ స్ప్రెడర్‌గా గుర్తించి దానికి "ఏ4" అని పేరు పెట్టారు. ఆగ్నేయ ఆసియాలో మొదలైన ఈ ఏ4 రకం సూపర్‌ స్ర్పెడర్‌ వైరస్ .... హైదరాబాద్‌, ఢిల్లీ, కోల్‌కతాల నుంచి సేకరించిన నమూనాల్లో తేలింది. అయితే, మన భారతీయుల్లోని వ్యాధి నిరోధక వ్యవస్థ దెబ్బకు అది జూన్‌ నాటికి దానికదే నాశనమై ఉండొచ్చని.. శాస్త్రవేత్తలు చెపుతున్నారు. ఈ రకం వైరస్ అలా అంతం కాకపోతే కేవలం మూడు నెలల్లో ఇండియాలో పరిస్థితి మరింత దారుణంగా ఉండేదని అనురాగ్‌ అభిప్రాయపడ్డారు. అందువల్ల ఈ సూపర్‌ స్ర్పెడర్ స్ర్టైయిన్ గురించి మనం పెద్దగా కంగారు పడాల్సిన అవసరం లేదని అయన అన్నారు. అయితే, ప్రస్తుతం వెలుగుచూసిన రకం వేగంగా విస్తరిస్తుండడంతో మనం మరింత అప్రమత్తతతో ఉండాలని అయన హెచ్చరించారు. అదేసమయంలో వైరస్ లోని మార్పులు బ్రిటన్‌ కంటే ఇక్కడే ఎక్కువని అయన చెప్పారు. రూపాంతరం చెందిన వైరస్ రకాలను కూడా త్వరలో రానున్న టీకాలు సమర్థవంతంగా నిరోధిస్తాయని ఆశిస్తున్నామని అనురాగ్‌ అగర్వాల్‌.

తెలంగాణలోకి కొత్త కరోనా వైరస్ ? టిమ్స్ లో స్పెషల్ ఐసోలేషన్ 

బ్రిటన్ ను వణికిస్తున్న కరోనా కొత్త రకం స్ట్రెయిన్ వైరస్  తెలంగాణలోకి ఎంటరైందని  వైద్య ఆరోగ్య శాఖ అనుమానిస్తోంది. అమెరికా నుంచి లండన్​ మీదుగా హైదరాబాద్​కు వచ్చిన ఓ మహిళకు ఆర్టీపీసీఆర్ టెస్టులో కరోనా నిర్దారణ అయింది. అయితే ఆ మహిళకు ఇండియాకు వచ్చే ముందే వైరస్​ లక్షణాలు ఉన్నాయని తెలియడంతో .. ఆమెకు కొత్త స్ట్రెయిన్​ సోకి ఉండొచ్చన్న సందేహాలు వస్తున్నాయి. ప్రస్తుతం  ఆమెను గచ్చిబౌలిలోని టిమ్స్‌‌‌‌ స్పెషల్ ఐసోలేషన్ లో ఉంచి చికిత్స అందిస్తున్నారు.  ఆ మహిళ  పాపను కూడా తల్లితోపాటు టిమ్స్‌‌‌‌లో ఉంచారు. ఆమె భర్తను హైదరాబాద్​లోని ఇంట్లో, నల్గొండలో ఉంటున్న ఆమె అత్త, మామలను అక్కడే క్వారంటైన్ చేశారు.  వాళ్లందరి శాంపిల్స్‌ను టెస్టుల కోసం పంపారు ఆరోగ్య  శాఖ అధికారులు.   హైదరాబాద్‌‌‌‌లోని బోడుప్పల్‌‌‌‌ కు చెందిన ఆ మహిళ.. ఈ నెల 19న అమెరికా నుంచి లండన్  మీదుగా హైదరాబాద్‌‌‌‌కు వచ్చారు. కొత్తపేటలోని ఓ ఫ్లాట్‌‌‌‌లో ఉంటున్న ఆమెను వైద్య శాఖ అధికారులు గుర్తించి గురువారం రాత్రి టెస్టులు చేయించారు. తనకు లండ్ నుంచి వస్తున్నప్పుడే  వైరస్ సింప్టమ్స్ కనిపించాయని.. అందుకే బోడుప్పల్‌‌‌‌లోని తమ ఇంటికి వెళ్లకుండా, కొత్తపేటలో తెలిసిన వాళ్ల అపార్ట్‌‌‌‌ మెంట్లో ఓ ఫ్లాట్ తీసుకుని ఐసోలేషన్‌‌‌‌ లో ఉంటున్నానని ఆమె అధికారులకు చెప్పినట్టు తెలిసింది. భర్త, రెండేండ్ల పాపతో కలిసి ఆమె అమెరికా నుంచి లండన్ మీదుగా వచ్చిందని.. ఫ్లైట్‌‌‌‌ మారేందుకు లండన్‌‌‌‌  ఎయిర్‌‌‌‌‌‌‌‌పోర్టులో రెండున్నర గంటల పాటు వెయిట్ చేసిందని అధికారులు గుర్తించారు.  దీంతో ఆమెకు కరోనా కొత్త స్ట్రెయిన్​ సోకి ఉంటుందని అనుమానిస్తున్నారు.  డిసెంబర్ నెలలో బ్రిటన్​ నుంచి తెలంగాణకు వచ్చిన మొత్తం 12 వందల మందిలో.. శుక్రవారం సాయంత్రం వరకు 926 మందిని అధికారులు ట్రేస్ చేయగలిగారు. వారి నుంచి శాంపిల్స్ సేకరించి టెస్టుల కోసం పంపారు. ఆరొందల మంది టెస్టు రిజల్ట్స్​ రాగా..  వారిలో  గురువారం 8 మందికి పాజిటివ్ రాగా.. శుక్రవారం మరో 8 మందికి పాజిటివ్ వచ్చింది. ఈ 16 మందిలో హైదరాబాద్‌‌‌‌ వాళ్లు నలుగురు, మేడ్చల్‌‌‌‌ జిల్లాకు చెందిన నలుగురు, జగిత్యాల జిల్లాకు చెందిన ఇద్దరు.. మంచిర్యాల, నల్గొండ, రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్దిపేట, వరంగల్ అర్బన్ జిల్లాలకు చెందిన ఒక్కొక్కరు ఉన్నారు. హైదరాబాద్, మేడ్చల్ వాళ్లను టిమ్స్‌‌‌‌లో, మిగతా వారిని జిల్లాల్లోని హాస్పిటల్స్‌‌‌‌లో ఐసోలేషన్‌‌‌‌ ఉంచి ట్రీట్‌‌‌‌మెంట్ అందిస్తున్నారు. కరోనా సోకిన ఈ 16 మందికి సన్నిహితంగా మెలిగిన 76 మందిని క్వారంటైన్‌‌‌‌లో పెట్టారు.    బ్రిటన్​ నుంచి వచ్చినవాళ్లకు సోకింది బ్రిటన్‌లో మ్యూటేటైన వైరసా, వేరే రకమా అన్నది శనివారం రాత్రికి తేలనుంది.   యూకే నుంచి వచ్చి కరోనా నిర్దారణ అయిన 16 మంది శాంపిళ్లను జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం సీసీఎంబీకి పంపించామని హెల్త్​ డిపార్ట్​మెంట్​ ప్రకటించింది. వరంగల్ అర్బన్, సిద్దిపేట జిల్లాకు చెందిన ఇద్దరి జీనోమ్ సీక్వెన్సింగ్ ప్రక్రియ గురువారం సాయంత్రం ప్రారంభమైంది. శనివారం రాత్రి లేదా ఆదివారం ఉదయానికల్లా శాంపిళ్ల రిజల్ట్​ వెల్లడించనున్నట్టు సీసీఎంబీ సైంటిస్టులు తెలిపారు.  

కరోనా ఎఫెక్ట్..  ఏకంగా దేశ ప్రధాని పై 900 కోట్లు కట్టాలని ఆ దేశ ప్రజల దావా..

కరోనాతో దాదాపుగా గత సంవత్సర కాలంగా ప్రపంచ దేశాలన్నీ అతలాకుతలం అవుతున్నాయి. ఈ మహమ్మారి కారణంగా కొన్ని లక్షల మంది మృత్యువాత పడ్డారు. ఇక తమ ఐనవాళ్ళ కడసారి చూపుకు కూడా నోచుకోని వారి బాధ ఐతే వర్ణనాతీతం. తాజాగా కరోనా కట్టడిలో ఇటలీ ప్రధాని, ఆరోగ్యశాఖ మంత్రి విఫలమయ్యారని.. వారికీ వ్యతిరేకంగా సుమారు 500 మంది ప్రజలు కోర్టును ఆశ్రయించారు. దేశ ప్రధాని కారణంగా తమకు తీరని నష్టం జరిగిందనీ.. అందువల్ల తమకు భారీ మొత్తంలో నష్టపరిహారం ఇప్పించాలని బాధితులు కోర్టును కోరారు. గత సంవత్సర కాలంగా కరోనా కాటు వల్ల సొంతవాళ్లను పోగొట్టుకున్న ప్రజలు.. సాక్షాత్తు ఇటలీ ప్రధాని గిసెప్పే కొంటేపై కోర్టులో దావా వేశారు. ఈ దావాలో ఆ దేశ ఆరోగ్యశాఖ మంత్రి రోబర్టో స్పెరాంజాతోపాటు, లాంబార్డీ ప్రాంత గవర్నర్ అట్టిలియో ఫొంటావా పేర్లను కూడా చేర్చారు. దావా వేసిన ప్రజల ముఖ్య ఆరోపణ ఏంటంటే.. కరోనా విజృంభిస్తున్న సమయంలో తగిన ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవడంలో ఈనేతలంతా విఫలమయ్యారని కోర్టులో వేసిన దావాలో ఆరోపించారు. ఈ ముగ్గురి నిర్లక్ష్యం కారణంగా తాము అయినవాళ్లను కోల్పోయామని వారు ఆవేదన వ్యక్తం చేశారు. తమకు జరిగిన అన్యాయానికి దేశ ప్రధాని, ఆరోగ్యశాఖ మంత్రితోపాటు గవర్నర్ కూడా పూర్తి బాధ్యత వహించి.. నష్టపరిహారంగా 100 మిలియన్ యూరోలు (సుమారు రూ. 900కోట్లు) చెల్లించాలని డిమాండ్ చేశారు. ఇదిలా ఉండగా. ఇటలీలో ఫిబ్రవరి 20న మొట్టమొదటి కరోనా కేసు బయటపడింది. ఇప్పటివరకు ఆ దేశంలో కరోనా కారణంగా 70వేల మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రపంచ వ్యాప్తంగా చూస్తే కరోనా మరణాలలో ఇటలీ ఐదో స్థానంలో ఉంది.

ఆరోజు ముద్దులు.. నేడు పిడిగుద్దులు!  జగన్ జీవితమే ఒక ఫేక్!  

అనంతపురం జిల్లాలో జరిగిన దళిత యువతి స్నేహలత హత్యపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. వైసీపీ ప్రభుత్వంపై ఆయన  తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. సభ్యసమాజం సిగ్గుతో తలదించుకోవాల్సిన ఘటన అన్న చంద్రబాబు..  గన్ వచ్చే లోపల జగన్ వస్తాడన్న మాటలు ఎక్కడా అని ప్రశ్నించారు.  ఆడపిల్లల పాలిట మేనమామగా ఉంటానన్న వ్యక్తి వారిపట్ల కంశుడిలా తయారయ్యారని బాబు మండిపడ్డారు. జగన్ జీవితమే ఒక ఫేక్.. చట్టమే రాని దిశ చట్టానికి పోలీసు స్టేషన్లు పెట్టి వాహనాలు పంపిణీ చేశారు.. అదే దిశ పోలీస్ స్టేషన్ కు స్నేహలత తల్లి ఫోన్ చేస్తే స్పందన లేదని ఆరోపించారు. 19నెలల్లో జరిగిన హత్యాచారాలు, ఆడిబిడ్డలపై వేధింపులు  గతంలో ఎప్పుడూ జరగలేదని చెప్పారు చంద్రబాబు. ‘తండ్రి చనిపోయాడని ఓదార్పు యాత్రలు చేసి సానుభూతి కోసం నానా గడ్డి తినీ ఇప్పుడు ఆడబిడ్డలపై కనికరం లేకుండా  వ్యవహరిస్తారా? రాష్ట్రంలో శాంతిభద్రతలు ఎక్కడున్నాయి. వైసీపీ అరాచకాలకు అడ్డు అదుపు లేదా? ఆడపిల్లల మానానికి శీలానికి రక్షణ కల్పించలేని చేతకాని దద్దమ్మ ప్రభుత్వం ఇది. ఇంత దారుణాలు జరిగితే పులివెందుల నుంచి అనంతపురం ముఖ్యమంత్రి వెళ్లలేరా? మానవత్వం లేకుండా ప్రవర్తిస్తూ మనుషుల్ని మనుషుల్లా చూడట్లేదు. కుక్కలకు బిస్కెట్లు వేసిన మాదిరి ప్రజల్ని చూస్తున్నారు. పోలీసు వ్యవస్థని నిర్వీర్యం చేసి రాజకీయ కక్షల కోసం పోలీసుల్ని వాడటం రాష్ట్రానికి చేటు. వివేకానందరెడ్డిని హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించినప్పుడే జగన్ ఫేక్ వ్యక్తని తేలిపోయింది. డబ్బుల వ్యామోహం, స్వప్రయోజనాల కోసం ముందుకు పోతున్నారు తప్ప రాష్ట్రాభివృద్ధిని గాలికొదిలేశారు’అని చంద్రబాబు ఘాటుగా ధ్వజమెత్తారు. ‘స్నేహలత హత్య ఘటనను మళ్లించేందుకే జేసీ కుటుంబంపై దాడి చేశారు. సమాజం కోసం పనిచేసిన నాయకుల విగ్రహాలు కూలగొట్టి రౌడీలు, నేరస్థుల విగ్రహాలు పెడతారా? శ్రీకాకుంళంలో గౌతు లచ్ఛన్న విగ్రహాన్ని కూలగొడతాననటం దుర్మార్గం. బీసీల ఓట్లు తీసుకుంటూ వారి పతనం కోరుతూ మనోభావాలను అన్ని విధాలా దెబ్బతీస్తున్నారు. కరుడగట్టిన నేరస్థులు కాబట్టి కిందవాళ్లని కూడా మీలాగా ఉగ్రవాదుల్లా తయారు చేస్తారా? ఒకసారి ముఖ్యమంత్రి అవకాశం అడిగితే నమ్మి పూనకం వచ్చినట్లు ఓట్లేశారు. ఆరోజు ముద్దులు పెట్టి నేడు పిడిగుద్దులు గుద్దుతున్నారు. స్నేహలత ఘటనతో పాటు ఇతర సంఘటనల్నింటిపైనా సీబీఐ విచారణ జరిపించాలి. బాధ్యులతో పాటు నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసులపై కఠని చర్యలు తీసుకోవాలి’ అని చంద్రబాబు డిమాండ్ చేశారు.  

నన్ను చంపుతారేమో.. అయినా భయపడేది లేదు! జేసీ ప్రభాకర్ రెడ్డి 

అనంతపురం జిల్లా తాడిపత్రి భగ్గుమంటోంది. టీడీపీ సీనియర్ నేత , మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటిపై వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి దాడి చేయడంతో తీవ్ర ఉద్రిక్తతలు ఏర్పడ్డాయి. జేసీ వద్ద పనిచేసే కిరణ్ అనే వ్యక్తి తనపై సోషల్ మీడియాలో అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తున్నాడని ఆరోపిస్తూ ఎమ్మెల్యే కేతిరెడ్డి... తన అనుచరులతో కలిసి జేసీ నివాసంపై దండెత్తారు. అక్కడే ఉన్న కిరణ్ అనే వ్యక్తిపై దాడికి పాల్పడ్డారు. దాంతో జేసీ అనుచరులు తిరగబడడంతో అక్కడ యుద్ధ వాతావరణం నెలకొంది. దాడిలో కిరణ్ కు గాయాలయ్యాయి.  జేసీ నివాసంలోకి ప్రవేశించిన ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఓ కుర్చీలో కూర్చోగా, అనంతరం ఆ కుర్చీని జేసీ వర్గీయులు తగులబెట్టారు. కాగా, తన ఇంటిపై దాడి జరిగిందని తెలుసుకున్న జేసీ ప్రభాకర్ రెడ్డి పట్టరాని ఆగ్రహావేశాలు ప్రదర్శించారు. తన ఇంటిపై రాళ్లదాడి పట్ల ఆయన పోలీసులతో వాగ్యుద్ధానికి దిగారు. ఎమ్మెల్యే, ఆయన అనుచరులు తన ఇంటిపై దాడి చేస్తుంటే మీరంతా ఏం చేస్తున్నారని నిలదీశారు. తాడిపత్రిలో తాను లేని సమయంలో తన ఇంటిపై స్థానిక వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తన అనుచరులతో దాడి చేశారని జేసీ ప్రభాకర్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసుల వైఖరి సరిగాలేదని, తన ఇంటిపై దాడిలో పోలీసుల పాత్ర కూడా ఉందని ఆరోపించారు. వాళ్లు, వాళ్లు ఏం మాట్లాడుకున్నారో తనకు తెలియదని చెప్పారు. పెళ్లిలో ఉండగా తనకు ఫోన్ వచ్చిందని జేసీ తెలిపారు.   "అన్నా పెద్దారెడ్డి వచ్చినాడన్నా... నన్ను కొట్టారు అంటూ ఆ కుర్రాడు ఫోన్ చేశాడు. ఎందుకు కొట్టారు అంటే... పెద్దారెడ్డి భార్య మీద ఏదో విషయం వైరల్ అయిందంట అందుకని కొట్టారన్నా అని చెప్పాడు. అసలు వ్యక్తులపై చర్యలు తీసుకోకుండా దాడులు చేయడమేంటి? ఇదంతా పోలీసుల వైఫల్యమే! ఎమ్మెల్యే మా ఇంటికి వస్తే ఎస్సై తలుపు తీయడం ఏంటి? హత్య వ్యవహారాల్లో ఉన్నవాళ్లకు గన్ మెన్లను ఇస్తున్నారు, కానీ మాకు భద్రత లేకుండా పోయింది. ఒకవేళ నన్ను చంపుతారేమో... అంతకుమించి ఇంకేం చేస్తారు? నా రాత ఎలా ఉంటుందో అలా జరుగుతుంది. దేనికీ భయపడేది లేదు. అప్పుడెలా ఉన్నానో ఇప్పుడూ అలాగే ఉన్నాను" అని జేసీ ప్రభాకర్ రెడ్డి చెప్పారు.   

బీజేపీ కార్పోరేటర్లకు రూ.5 కోట్లు ఆఫర్ ! 

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై సంచలన ఆరోపణలు చేశారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్. గ్రేటర్‌ హైదరాబాద్ ఎన్నికల్లో ఓడినా కేసీఆర్‌కు అహంకారం తగ్గలేదని వ్యాఖ్యానించారు. . గ్రేటర్‌ హైదరాబాద్ మేయర్ ఎన్నికను వెంటనే నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు. బీజేపీ కార్పోరేటర్లకు టీఆర్‌ఎస్‌  5 కోట్లు రూపాయలు  ఆఫర్ చేస్తోందని బండి సంజయ్ ఆరోపించారు. టీఆర్ఎస్ మా జోలికొస్తే వాళ్ల ఎమ్మెల్యేలను బీజేపీలో చేర్చుకుంటామని ఆయన హెచ్చరించారు.       తెలంగాణ పోలీసులు నిజంగా హీరోలేనని మరోసారి స్పష్టం చేశారు బండి సంజయ్. 15 నిమిషాలు ఓల్డ్ సిటీని అప్పగిస్తే జల్లెడ పడుతారని చెప్పారు. పాతబస్తీలో రోహింగ్యాలు, పాకిస్తాన్‌ వాళ్లను బయటకు తీస్తారని చెప్పుకొచ్చారు బండి సంజయ్.  ఖమ్మంకు చెందిన పలువురు టీఆర్ఎస్ నేతలు బండి సంజయ్ సమక్షంలో బీజేపీలో చేరారు. కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మాట్లాడిన బండి సంజయ్.. టీఆర్ఎస్ సర్కార్ పై , సీఎం కేసీఆర్ పై విరుచుకుపడ్డారు. కేసీఆర్ పతనం మొదలైందని, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి అధికారం ఖాయమని చెప్పారు. 

కష్టంగా మారిన యూకే ప్రయాణికుల ట్రేసింగ్ ! కొత్త కరోనాతో మళ్లీ టెన్షన్ 

ట్రేసింగ్.. టెస్టింగ్.. ట్రీట్ మెంట్.. ఐసోలేషన్..  ఈ పదాలు కరోనా దేశంలోకి ఎంటరైన కొత్తలో  విన్న పదాలు. మార్చి నెలలో అధికారులంతా వీటి చుట్టే తిరిగారు. విదేశాల నుంచి వచ్చే వారిని ట్రేస్ చేయడం.. వారిని టెస్టింగ్ చేయడం.. కరోనా సోకినట్లు నిర్దారణ అయితే ట్రీట్ మెంట్ చేయడం... పాజిటివ్ వ్యక్తి కుటుంబ సభ్యులను ఐసోలేషన్ చేయడమే ప్రధానంగా ఉండేది. పాజిటివ్ వచ్చిన వ్యక్తి ప్రైమరీ , సెకండరీ కాంటాక్ట్ ను ట్రేస్ చేసి .. వారికి టెస్టింగ్ చేయడానికి ఆరోగ్య శాఖ అధికారులు పరుగులు పెట్టేవారు. మార్చి, ఏప్రిల్, మే నెల వరకు ఎక్కడ చూసినా, విన్నా.. ఈ పదాలే వినిపించేవి. మళ్లీ ఇప్పుడు దేశ వ్యాప్తంగా అవే పరిస్థితులు నెల కొన్నాయి. ట్రేసింగ్.. టెస్టింగ్.. ట్రీట్ మెంట్.. ఐసోలేషన్.. ప్రైమరీ కాంటాక్ట్, సెకండరీ కాంటాక్ట్ అంటూ ప్రభుత్వ యంత్రాంగమంతా ఉరుగులు పరుగులు పెడుతోంది.     బ్రిటన్ లో విజృంభిస్తున్న కొత్తరకం కరోనా వైరస్‌ ఇప్పుడు దేశంలో కలకలం రేపుతోంది. తెలుగు రాష్ట్రాలను వణికిస్తోంది. గత కొన్ని రోజులుగా యూకే నుంచి వచ్చిన వారిని గుర్తించి కరోనా పరీక్షలు చేయిస్తున్నారు అధికారులు. బ్రిటన్ నుంచి ఏపీకి నేరుగా విమానాలు లేకపోయినా హైదరాబాద్ వచ్చి అక్కడి నుంచి ఏపీకి వెళతారు. అయితే డిసెంబర్ 9 నుంచి యూకే విమానాలు బంద్ అయ్యే వరకు దాదాపు 3 వేల మంది ప్రయాణికులు లండన్ నుంచి వచ్చారని తెలుస్తోంది. వీరిలో 18 వందల మంది ఏపీ , 12 వందల మంది తెలంగాణకు చెందిన వారు ఉన్నారని అధికారులు గుర్తించారు. వీళ్లను గుర్తించి కరోనా పరీక్షలు జరిపిస్తున్నారు. యూకే నుంచి వచ్చిన వారిని ఐసోలేషన్ లో ఉంచడంతో పాటు వారి కుటుంబ సభ్యులను కూడా ఐసోలేట్ చేస్తున్నారు అధికారులు. అయితే యూకే నుంచి వచ్చిన వారిలో కొందరి అడ్రస్ అధికారులు , పోలీసులకు దొరకడం లేదని తెలుస్తోంది. పాస్ పోర్టులో ఉన్న అడ్రస్ లో వారు ఉండటం లేదని చెబుతున్నారు. దీంతో అధికారులు ఆందోళన చెందుతున్నారు.  యూకే నుంచి  వచ్చిన ఓ మహిళకు పాజిటివ్‌గా తేలడంతో తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం వణికిపోతోంది. సంబంధిత మహిళ ఏపీ ఎక్స్‌ప్రెస్‌లో ఈ నెల 22న ఢిల్లీలో బయలుదేరి, బుధవారం రాత్రి రాజమహేంద్రవరం చేరారు. రాజమహేంద్రవరం చేరుకున్న మహిళను రెవెన్యూ, వైద్యఆరోగ్యశాఖ, పోలీసు అధికారులు 108 అంబులెన్స్‌లో రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మహిళతోపాటు ఆమె కుమారుడికి సైతం పీపీఈ కిట్లు వేసి ఆసుపత్రికి తీసుకొచ్చారు. వాళ్ల బ్లడ్ శాంపుల్స్ సేకరించి పరీక్షలకు పంపించారు. యూకే నుంచి వచ్చిన మహిళకు సోకింది కొత్త రకం కరోనానా లేక పాత కరోనానా అనే సంగతి ఇంకా నిర్ధారణ కాలేదు. లండన్‌ నుంచి సోమవారం రాత్రి ఢిల్లీకి వచ్చిన మహిళ క్వారంటైన్‌లో ఉండకుండానే ఇక్కడికి వచ్చారని ప్రచారం జరగడంతో జిల్లావాసులు భయపడిపోతున్నారు.కొత్త వైరస్‌ జాడను కాకినాడలోని వైరాలజీ ల్యాబ్‌లో నిర్ధారించే పరిస్థితి లేకపోవడంతో.. వాళ్ల నమూనాలను పుణెలోని నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీ ల్యాబ్‌కు పంపించారు.  తెలంగాణ అధికారులు కూడా బ్రిటన్ నుంచి వచ్చిన 12 వందల మందిని గుర్తించే పనిలో పడ్డారు. ఇప్పటికే కొందరిని ట్రేస్ చేసి కరోనా పరీక్షలు నిర్వహించారు.  బ్రిటన్ లో వెలుగు చూసిన ఈ స్ట్రెయిన్ వైరస్ పై కరీంనగర్ లో ఆందోళ‌న నెల‌కొంది. బ్రిట‌న్ నుంచి ఈ నెల 13 నుంచి 18 వరకు జిల్లాకు వచ్చిన 16 మందిని గుర్తించి వైర‌స్ ప‌రీక్ష‌లు నిర్వ‌హించారు. రిపోర్టులు రావాల్సి ఉంది. ఇంగ్లాండ్ నుంచి వచ్చిన వాళ్ళంతా ఎయిర్ పోర్టులో చేసిన ఆర్.టి.పి.సి.ఆర్ పరీక్షలో నెగిటివ్ అని తేలిన తర్వాతే ఇళ్లకు వచ్చారని.. అయినా ముందు జాగ్రత్తగా మరోసారి పరీక్షలు చేస్తున్నామ‌ని జిల్లా వైధ్యాధికారులు తెలిపారు. వీళ్లంతా ఎక్కడివారు అక్కడే ఉండాలని ఆదేశించినట్టు చెప్పారు.  బ్రిటన్ నుంచి నిర్మల్ జిల్లా కేంద్రానికి వచ్చిన ఇద్దరి సాంపుల్స్ సేకరించారు ఆరోగ్య సిబ్బంది. ఆదిలాబాద్ కు వచ్చిన యువకుడికి రిపోర్ట్ నెగిటివ్ రావడంతో అక్కడి అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. గత 20 రోజుల నుంచి యూకే నుంచి సంగారెడ్డి జిల్లాకు వచ్చిన  26 మందిని ట్రేస్ చేసి టెస్టింగ్ చేశారు. 

వైసీపీ ఎమ్మెల్యేలు వీధి రౌడీలకన్నా ఘోరం! 

అనంతపురం జిల్లా తాడిపత్రిలో  మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటిపై వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి దాడి చేయడంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తీవ్రంగా స్పందించారు.  వైసీపీ ఎమ్మెల్యేలు వీధి రౌడీలకంటే ఘోరంగా ప్రవర్తిస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.  జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంట్లో లేని సమయంలో ఆయన ఇంటిపైనా, కార్యకర్తలపైనా తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని ట్విట్టర్ ద్వారా చెప్పారు నారా  లోకేష్.  చట్టాన్ని ఉల్లంఘించి రెచ్చిపోయిన రౌడీ ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేదంటే, వైసీపీ రౌడీలకు కచ్చితంగా తామే బుద్ధి చెబుతామని స్పష్టం చేశారు. నాయకుల ఇళ్లపై దాడి చేసి, కార్యకర్తలను కొట్టి హీరోలమంటూ విర్రవీగుతున్నారని, వారి తల పొగరు అణచివేస్తామని లోకేశ్ ఘాటు హెచ్చరికలు చేశారు. టీడీపీ అధికారంలోకి రావడం, అన్నీ వడ్డీతో సహా తిరిగి చెల్లించడం ఖాయమని నారా లోకేశ్ స్పష్టం చేశారు.    మరోవైపు తాడిపత్రిలో హై టెన్షన్ కొనసాగుతోంది.  తన ఇంటిపై జరిగిన దాడిపై స్పందించారు జేసీ ప్రభాకర్ రెడ్డి. దాడులకు భయపడేది లేదని చెప్పారు. రండిరా చూసుకుందాం అంటూ ఆయన వైసీపీ నేతలకు సవాల్ విసిరారు. జేసీ ఇంటిపై స్వయంగా ఎమ్మెల్యేనే తన అనచురులతో వచ్చి దాడి చేయడం దుమారం రేపుతోంది. జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటిపై దాడి జరిగిందని తెలియడంతో టీడీపీ కార్యకర్తలు, ఆయన అనుచురులు అక్కడికి భారీగా  చేరుకుంటున్నారు. పోలీసులు కూడా అదనపు బలగాలను మోహరించారు. దీంతో ఇరు వర్గాల మధ్య ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న ఆందోళన తాడిపత్రిలో నెలకొంది.

జగన్ రెడ్డి పాలనలో ఆడబిడ్డలకు రక్షణ  ఉండదా! అనంతపురం ఘటనపై పవన్ ఫైర్ 

అనంతపురం జిల్లాలో  దళిత యువతిని ప్రేమపేరుతో వెంటాడి, వేధించి హత్య చేసిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. పోలీసుల నిర్లక్ష్యం వల్లే యువతి హత్య జరిగిందనే ఆరోపణలు వస్తున్నాయి. ఇద్దరు యువకులు వేధిస్తున్నారని చెప్పినా పోలీసులు పట్టించుకోలేదని, వారు ముందే స్పందించి ఉంటే ఆ ఘటన జరిగేది కాదని స్థానికులు చెబుతున్నారు. దళిత యువతి హత్యపై జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ ఘాటుగా స్పందించారు. దిశ చట్టం చేసి ఏంటి ప్రయోజనం ఏంటని ఆయన ప్రశ్నించారు. ప్రచారం కోసం చట్టాలు చేస్తే మహిళలకు రక్షణ దొరుకుతుందా? అని పవన్‌కల్యాణ్ జగన్ సర్కార్ ను నిలదీశారు.   ‘దిశ చట్టం వచ్చి ఏడాది అయింది. చట్టం చేయగానే పాలాభిషేకాలు చేయించుకొని... కేకులు కోయించుకున్నారు. చట్టాన్ని మాత్రం ఆచరణలోకి తీసుకురాలేదు. ఆడ బిడ్డలపై పెట్రోలు పోసి నిప్పు పెట్టడాలు... కత్తిపోట్లు మాత్రం ఆగలేదు. ప్రచారం కోసం చేసిన ఈ చట్టం ఆడబిడ్డలకు ఏ విధంగా రక్షణ ఇస్తుందో ముఖ్యమంత్రి జగన్ రెడ్డి గారు, హోంశాఖ మంత్రి  సుచరిత గారు ప్రజలకు సమాధానం చెప్పాలి’అని పవన్‌కల్యాణ్ డిమాండ్ చేశారు.  "స్నేహలత వేధింపుల కారణంగానే చదువు మధ్యలోనే ఆపేసి చిన్న ఉద్యోగంలో చేరిందని తెలిసింది. అయితే, తమ ఇంటి ముందుకొచ్చి మరీ వేధిస్తున్నారని పోలీసులకు ఆమె తల్లిదండ్రులు ఫిర్యాదు చేస్తే... అక్కడ్నించి ఇల్లు మారండి అని పోలీసులు చెప్పడం వారిని మరింత కుంగదీసింది. పోలీసు వ్యవస్థ ఎంత బాధ్యత లేకుండా వ్యవహరిస్తోందో దీన్ని బట్టే అర్థమవుతోంది. వ్యవస్థల వైఫల్యం వల్లే స్నేహలత ఇద్దరు దుర్మార్గుల చేతిలో ప్రాణాలు కోల్పోయింది. ప్రచారం కోసం చేసిన దిశ చట్టం ఏవిధంగా ఆడబిడ్డలకు రక్షణ ఇస్తుందో సీఎం జగన్, హోంమంత్రి సుచరిత ప్రజలకు జవాబు చెప్పాలి" అని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. ‘వ్యవస్థల వైఫల్యమే స్నేహలత ప్రాణాలు తీసింది. స్నేహలత కుటుంబానికి న్యాయం చేయాలి. మహిళల రక్షణ కోసం దిశ చట్టం చేశాం... నేరం చేసినవారికి 21 రోజుల్లో శిక్ష పడుతుంది అంటూ ప్రచారం చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఆచరణలో మాత్రం ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదు. సరి కదా మైనర్ బాలికలు, విద్యార్థినులు, యువతులు, మహిళలపై అఘాయిత్యాలు, దాడులు ఆగలేదు. ఉన్మాదుల చేతుల్లో ప్రాణాలు కోల్పోతున్నారు. అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వంలో చలనం ఉండటం లేదు. విజయవాడలో రెండు ఘటనలు, గాజువాకలో ఒక ఘటనలో యువతులు మృగాళ్ల చేతుల్లో హత్యకు గురయ్యారు. ఇప్పుడు అనంతపురం జిల్లా ధర్మవరంలో స్నేహలత అనే పేద దళిత యువతి హత్యకు గురవడం అత్యంత బాధాకరం’ అని పవన్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు.  

బంధువుల్లా వచ్చి పెళ్లి కుమార్తె నగలనే కొట్టేశారు!

బంధువుల్లా పెళ్లికొచ్చారు.. పెళ్లి మండపంలో నానా హడావుడి చేశారు. పెళ్లికి వచ్చిన వారితో కలిసి అంతా కలియ తిరిగారు. ముందు వరుసలోనే కూర్చుని వివాహ తంతును వీక్షించారు. పెళ్లి తంతు పూర్తైన తర్వాత జరిగే ఘట్టాల సందర్భంగా తాము వచ్చిన అసలు పని కానిచ్చేశారు. అందరిని నమ్మించి ఏకంగా పెళ్లి కూతురు నగలనే నొక్కేశారు. దాదాపు 20 లక్షల రూపాయల విలువైన బంగారు ఆభరణాలు తీసుకుని పెళ్లి మండపం నుంచి దర్జాగా ఊడాయించారు.  నిజామాబాద్ జిల్లా డిచ్ పల్లి మండలం బర్దీపూర్ లో  జరిగిన ఓ పెళ్లివేడుకలో ఈ ఘటన జరిగింది. సిద్ధిపేట జిల్లాకు చెందిన ఫణీంద్ర అనే యువకుడికి మహారాష్ట్ర వాసి కావ్యతో పెళ్లి కుదిరింది. బర్దీపూర్ శివారు ప్రాంతంలో ఉన్న ఓ మ్యారేజి హాలులో పెళ్లికి ఏర్పాట్లు జరిగాయి.  పెళ్లికి ఇద్దరు కొత్త వ్యక్తులు వచ్చారు. పెళ్లికి వచ్చిన బంధువులతో వారు ఇట్టే కలిసిపోయారు. అయితే పెళ్లి క్రతువు పూర్తయిన తర్వాత పెళ్లికుమార్తె నగలను తీసి ఓ బ్యాగులో ఉంచారు. ఇది గమనించిన ఆ ఇద్దరు వ్యక్తులు ఆ బ్యాగును పట్టుకుని ఉన్న మహిళ వద్దకు వెళ్లారు. ఆ ఇద్దరిలో ఒకరు ఆమె దృష్టి మరల్చగా, మరో వ్యక్తి ఇదే అదనుగా బ్యాగ్ ను మాయం చేశాడు. ఆమె ఏం జరిగిందో తెలుసుకునే లోపే ఆ ఇద్దరూ ఫంక్షన్ హాల్ నుంచి ఉడాయించారు.     పెళ్లికి వచ్చిన కొందరు వ్యక్తులు ఏకంగా పెళ్లికుమార్తె నగలనే ఎత్తుకెళ్లడం కలకలం రేపింది. చోరీ ఘటనతో పెళ్లివేడుక కాస్తా గందరగోళంగా మారింది. రూ.20 లక్షల విలువైన బంగారు నగలు దొంగలపాలు కావడంతో పెళ్లికుమార్తె బంధువులు లబోదిబోమన్నారు. ఈ ఘటనపై వరుడి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయగా, పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని అక్కడి సీసీ కెమెరా ఫుటేజి పరిశీలించారు. సీసీ కెమెరా పుటేజీ ఆధారంగా పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.