సంచయిత మరో వివాదాస్పద నిర్ణయం.. మాన్సాస్ కార్యాలయం తరలింపు!

విజయనగరం మాన్సాస్ ట్రస్ట్ చైర్ పర్సన్ సంచయిత గజపతిరాజు నిర్ణయాలు రోజురోజుకి వివాదాస్పదమవుతున్నాయి. ఇప్పటికే అనేక వివాదాస్పద నిర్ణయాలు తీసుకున్న ఆమె.. తాజాగా మరో వివాదానికి తెరతీశారు. ఇప్పటివరకూ విజయనగరం మహారాజ కోటలో ఉన్న మాన్సాస్ రెవిన్యూ కార్యాలయాన్ని విశాఖ జిల్లా పద్మనాభంకి తరలించాలని ఆదేశాలు జారీ చేశారు. కార్యాలయం తరలింపు నిర్ణయం తక్షణమే అమలులోకి వచ్చేలా ఆదేశాలు ఇచ్చారు. ఛైర్ పర్సన్, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ల సంతకాలతో కార్యాలయం మార్పు నిర్ణయం మోమో విడుదలైంది. 1958 లో పివిజి రాజు స్థాపించిన మాన్సాస్ కార్యాలయం అప్పటి నుండి కోటలోనే కొనసాగుతూ వచ్చింది. ఇప్పుడు కార్యాలయాన్ని తరలించాలని మాన్సాస్ యాజమాన్యం తీసుకున్న నిర్ణయం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. సంచయిత నిర్ణయంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

వైఎస్సార్ పై వీహెచ్ సంచలనం!  పీజేఆర్ ను వదిలేయమని ఆఫర్  

కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ వి. హనుమంతరావు మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈసారి ఆయన దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ కు సంబంధించి ఆసక్తికర విషయాలు చెప్పారు. దివంగత మాజీ మంత్రి పీజేఆర్‌ గురించి ప్రస్తావన తెస్తూ వైఎస్‌పై వీహెచ్ ఈ వ్యాఖ్యలు చేశారు.  పీజేఆర్‌కు  తనకు మధ్య ఉన్న బంధాన్ని విడదీయాలని అప్పట్లో వైఎస్ ప్రయత్నాలు చేశారని చెప్పారు వీహెచ్. అంతేకాదు పీజేఆర్‌ను వదిలేస్తే ఏ సహాయమైనా చేస్తానని వైఎస్  తనకు ఆఫర్ చేశారని తెలిపారు. అయితే  వైఎస్సార్  ఆఫర్‌ను తాను తిరస్కరించానని..  ఒకవేళ అప్పట్లో వైఎస్‌ ఆఫర్‌ను అంగీకరించి ఉంటే  తాను ఎంతో సంపాందించేవాడినని చెప్పారు హనుమంతరావు.  కాంగ్రెస్ పార్టీ 136వ ఆవిర్భావ దినోత్సవ సందర్బంగా గాంధీ భవన్‌లో జరిగిన కార్యక్రమంలో వీహెచ్ పాల్గొన్నారు. ఇవాళే పీజేఆర్ వర్ధంతి కూడా కావడంతో .. ఆ సమావేశంలో ఆయన గురించి పలు వ్యాఖ్యలు చేశారు వీహెచ్.   కాంగ్రెస్ ఉన్నంత కాలం పీజేఆర్‌ను ప్రజలు మరువరని తెలిపారు. తాగునీటి కోసం పోరాటం చేశారని, ఎంతోమంది పేదలకు ఇళ్లు ఇప్పించారని చెప్పారు.  తెలంగాణ కోసం మొదట పోరాడిన వ్యక్తి పీజేఆర్ అని వీహెచ్ స్పష్టం చేశారు. వైఎస్సార్ గురించి వీహెచ్  చేసిన కామెంట్లు కాంగ్రెస్ పార్టీలో చర్చనీయాంశంగా మారాయి. తనకు వ్యతిరేకంగా ఉన్న నేతలను ఆఫర్ల ద్వారానే వైఎస్సార్ తన కంట్రోల్ లోకి తెచ్చుకున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.   

ఆగని రైతు ఉద్యమం... వందల సంఖ్యలో జియో సెల్ టవర్ల ధ్వంసం

కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా కొన్ని నెలలుగా ఆందోళన చేస్తున్న రైతులు తాజాగా ముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్‌ కంపెనీపై యుద్ధానికి దిగారు. రిలయన్స్‌ జియోకు చెందిన 1338 సిగ్నల్‌ టవర్ల సైట్లను ధ్వంసం చేశారు. గడచిన 24 గంటలలోనే 151 టవర్లను, అవి ఉన్న సైట్లను కొంత మంది ఆందోళనకారులు నాశనం చేసినట్లు పంజాబ్ ప్రభుత్వమే ప్రకటించింది. "ఢిల్లీ శివార్లలో, పంజాబ్‌లోని చాలా చోట్ల నిరసనల్లో రైతులు సంయమనం పాటిస్తున్నారు. చట్టాన్ని మీ చేతుల్లోకి తీసుకోవద్దు. మీ చర్యల వల్ల ఫోన్‌ కనెక్టివిటీ పోతోంది.. ఫలితంగా ప్రజల దైనందిన జీవితానికి ఆటంకం కలుగుతోంది. పిల్లల చదవుకు.. ఇంటి నుంచి పని చేసే టెకీలకు ఈ చర్యలతో నష్టం వాటిల్లుతుంది. అంతేకాక కొవిడ్‌ తీవ్రంగా ఉన్న సమయంలో ఇలాంటివి అవాంఛనీయం" అని సీఎం అమరిందర్ పదేపదే విజ్ఞప్తి చేసినా ఏమాత్రం ఫలితం కనిపించడం లేదు. ఎక్కడికక్కడ టెలికాం లైన్లను, ఇతర మౌలిక సదుపాయాలను ధ్వంసం చేస్తున్నారు. అయితే వీరంతా రైతులేనని చెప్పలేమని, వీరిలో కొందరు అరాచకవాదులు కూడా కలిసి ఈ అరాచకానికి పాల్పడుతున్నారని పోలీసులు అంటున్నారు. వీరు ముఖ్యంగా రాత్రివేళల్లో ఆప్టిక్‌ ఫైబర్‌ నెట్‌వర్క్‌ను కత్తిరించేస్తున్నట్లు అక్కడి పోలీసులు చెబుతున్నారు.   పంట ఉత్పత్తుల సేకరణ, పంపిణీ మొదలైన విషయాలతో దిగ్గజ వ్యాపారవేత్తలు ముఖేశ్‌ అంబానీ, గౌతమ్‌ అదానీ గ్రూపులకు ఎలాంటి సంబంధమూ లేకపోయినా.. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన కొత్త సాగుచట్టాల వల్ల ఆ ఇద్దరి కంపెనీలకూ భారీగా లబ్ధి చేకూరుతుందన్న అభిప్రాయాలతో కొందరు వ్యక్తులు ఈ విధ్వంసకాండకు దిగినట్లుగా తెలుస్తోంది. ఈ చట్టాల సహకారంతో కార్పొరేట్లు తమ భూములను లాగేసుకుంటాయని ఆందోళన చెందుతున్న రైతులు ఆ కార్పొరేట్లకు ప్రతినిధులుగా అంబానీ, అదానీలను భావిస్తున్నారు.   మరోపక్క ఒక్క రోజులో 200 కు పైగా ప్రదేశాలలో నెట్‌వర్క్‌ను ధ్వంసం చేయడం వల్ల కనెక్టివిటీ తెగిపోయిందని, ఈ సైట్లలో సుమారు రూ.40కోట్లకు పైగా నష్టం వాటిల్లిందని రిలయన్స్‌ జియో పేర్కొంది. పంజాబ్‌లోని వివిధ ప్రాంతాల్లో రైతుల పేరిట కొందరు వ్యక్తులు ఈ దుశ్చర్యలకు పాల్పడుతున్నారని, తగిన భద్రతనివ్వాలని రిలయన్స్ అధికారులు 23వ తేదీనే పంజాబ్‌ డీజీపీకి లేఖ రాయడంతో ఆయన పోలీస్‌ అధికారులను అప్రమత్తం చేశారు.   ఇది ఇలా ఉండగా రైతుల ముసుగులో కొంత మంది అరాచకవాదులు ఈ దురాగతాలు చేస్తున్నారని పంజాబ్‌లో అతి పెద్ద రైతు సంఘం భారతీయ కిసాన్‌ యూనియన్ ‌(ఉగ్రహాన్‌) పేర్కొంది. "జియోను బహిష్కరించాలని, ఆ సిమ్‌లు వాడవద్దని మాత్రమే పిలుపునిచ్చాం తప్ప నెట్‌వర్క్‌ను ధ్వంసం చేయమని కోరలేదని, రైతులు కూడా అలా చేయరని" పేర్కొంది.   మరోపక్క నిన్న ప్రధాని నరేంద్ర మోదీ మన్‌కీ బాత్‌ కార్యక్రమం ప్రసారమవుతున్నపుడు రైతులు తాము భోజనం చేసే పళ్లాలను మోగిస్తూ.. కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నినదించి తమ నిరసన వ్యక్తం చేశారు. ఈ సంవత్సరానికి చివరిసారిగా మోదీ తన మన్‌కీ బాత్‌ను వినిపించినా అందులో అయన రైతుల గురించిన ఎటువంటి ప్రస్తావన చేయలేదు. మరోపక్క రైతులు మాత్రం "మోదీ తన మనసులో మాటల్ని చెప్పడం కాదు... మా మనసుల్లో మాట వినాలి" అని రైతు నేతలు వ్యాఖ్యానించారు. "మోదీ మాటలు వినీ వినీ రైతులు విసిగెత్తి పోయారు. చెప్పిన మాటలే చెప్పడం, రైతులపై అభాండాలు వేయడం ఆయనకు పరిపాటయ్యింది. అందుకే ఈ నిరసన" అని స్వరాజ్‌ అభియాన్‌ నేత యోగేంద్ర యాదవ్‌ అన్నారు.

పట్టాలెక్కుతున్న బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్ ! భూసేకరణకు  మహా సర్కార్ లైన్ క్లియర్ 

ప్రధాని నరేంద్ర మోడీ డ్రీం ప్రాజెక్ట్  బుల్లెట్ ట్రైన్ నిర్మాణ పనులు త్వరలోనే ప్రారంభం కానున్నాయి. దేశంలో  మొదటగా  ముంబై-అహ్మదాబాద్‌ల మధ్య 508కిలోమీటర్ల పొడవునా బుల్లెట్ ప్రాజెక్టు కోసం రైల్వే లైన్ నిర్మించనున్నారు. ఈ ప్రాజెక్ట్ 2023నాటికల్లా పూర్తి చేయాల్సి ఉంది. అయితే మహారాష్ట్రలోని పల్ఘర్ వంటి కొన్ని ప్రాంతాలలో ప్రజలు మరియు రాజకీయ పార్టీల వ్యతిరేకత కారణంగా భూసేకరణ సమస్యగా మారింది. మహారాష్ట్రలోని మహా-వికాస్ అఘాడి కూటమి ఈ ప్రాజెక్ట్ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తోంది. దీంతో ప్రాజెక్టు పనులు ముందుకు సాగడం లేదు. గుజరాత్‌లో మాత్రం ప్రాజెక్టులు ఎలాంటి సమస్యలు తలెత్తలేదు. దీంతో  బుల్లెట్ ప్రాజెక్ట్‌ను తొలిఫేజ్ కింద అహ్మదాబాద్ నుంచి వాపి వరకు కారిడార్ నిర్మాణ పనులు చేపట్టేందుకు రైల్వే మంత్రిత్వ శాఖ కసరత్తు చేస్తోంది.  భూసేకరణ సమస్యతో  నిలిచిపోయిన ప్రాజెక్టు పనులను  దశల వారీగా ప్రారంభిస్తున్నట్లు రైల్వే బోర్డు చైర్మన్ వినోద్ కుమార్ యాదవ్ తెలిపారు.         భూసేకరణకు ఇంతకాలం సహకరించని మహారాష్ట్ర సర్కార్ కూడా క్రమంగా దిగొస్తున్నట్లు కనిపిస్తోంది.  రాబోయే నాలుగు నెలల్లోనే 80% భూసేకరణ పనులు పూర్తిచేసేలా మహారాష్ట్ర ప్రభుత్వం.., కేంద్రానికి హామీ ఇచ్చినట్లు వీకే యాదవ్ తెలిపారు. ఆ సమస్య తీరగానే మహారాష్ట్రలోనూ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు పనులు ప్రారంభిస్తామని ఆయన చెప్పారు. సుమారు లక్షా ఎనిమిదివేల కోట్ల రూపాయల బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టుకు జపాన్ ప్రభుత్వ సాంకేతిక, ఆర్థిక సాయాన్ని అందిస్తోంది. దేశంలోనే తొలి అత్యంత భారీ బుల్లెట్ రైలు మార్గం నిర్మాణం కోసం జాతీయ హై స్పీడ్ రైల్ కార్పొరేషన్ ఎల్ అండ్ టీ మధ్య కీలక ఒప్పందం కుదుర్చుకొని దేశంలోనే అతిపెద్ద సివిల్ కాంట్రాక్ట్‌‌గా ఇది రికార్డ్ సృష్టించింది. 

బీహార్ కు కొత్త ముఖ్యమంత్రి?  పదవిపై ఆసక్తి లేదంటున్న  నితీశ్‌ 

బీహార్ ముఖ్యమంత్రిగా ఇటీవలే మూడోసారి ప్రమాణ స్వీకారం చేశారు జేడీయూ అధినేత నితీష్ కుమార్. అయితే తాజాగా ఆయన చేసిన ప్రకటనతో ఆయన త్వరలోనే సీఎం సీటు నుంచి దిగిపోనున్నారా అన్న  చర్చ జరుగుతోంది. పార్టీ సమావేశంలో మాట్లాడిన నితీష్ కుమార్.. ముఖ్యమంత్రి పదవిపై కీలక వ్యాఖ్యలు చేశారు. తనకు ముఖ్యమంత్రి పదవి  అవసరం లేదని చెప్పారు. బీహార్‌లోని తమ మిత్రపక్షం బీజేపీ ముఖ్యమంత్రి పదవిని ఆశిస్తుందని ప్రజలు మాట్లాడుకుంటున్నారని జేడీయూ జాతీయ కార్యవర్గ సమావేశంలో నితీశ్ అన్నారు.  తాను ముఖ్యమంత్రి కుర్చీకి అంకితం కాలేదని ఆయన చెప్పారు. నిజానికి తాను అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత సీఎంగా బాధ్యతలు స్వీకరించలేనని ఎన్డీఏలోని పార్టీలకు తెలిపానని అన్నారు. అయితే, ఇందుకు వారు ఒప్పుకోలేదని ఆయన చెప్పారు. తనపై చాలా ఒత్తిడి తర్వాత తాను మరోసారి సీఎంగా బాధ్యతలు స్వీకరించాల్సి వచ్చిందని అన్నారు. ఈ పదవి పట్ల తనకు ఏ మాత్రం ఆసక్తి లేదని, సీఎం పదవి అవసరం లేదని చెప్పారు నితీష్ కుమార్.   ఆదివారమే జేడీయూ పార్టీ అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పుకున్నారు బీహార్ ముఖ్యమంత్రి  నితీశ్ కుమార్.  తన  స్థానంలో రాజ్యసభ సభ్యుడు రామచంద్ర ప్రసాద్ సింగ్ ను జేడీయూ కొత్త చీఫ్ గా నియమించారు. పార్టీ అధ్యక్షుడిగా  తప్పుకున్న కొన్ని  గంటల్లోనే ముఖ్యమంత్రి పదవి కూడా తనకు వద్దంటూ నితీష్ కుమార్ చేసిన ప్రకటన ఇప్పుడు బీహార్ లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. సీఎం పోస్టును బీజేపీకి ఇచ్చేందుకు నితీష్ సిద్ధమవుతున్నారనే ప్రచారం జరుగుతోంది. నవంబర్ లో జరిగిన అసెంబ్లీ  ఎన్నికల్లో బీజేపీ, జేడీయూ కూటమి  అధికారంలోకి వచ్చింది. అయితే బీజేపీ 72 సీట్లలో విజయం సాధించగా, జేడీయూ 49 నియోజకవర్గాల్లో మాత్రమే గెలిచింది. దీంతో బీజేపీ వ్యక్తే ముఖ్యమంత్రి అవుతారని అంతా భావించారు. కాని పొత్తు ధర్మాన్ని పాటిస్తూ.. ఎన్నికలకు ముందే ప్రకటించినట్లుగానే తక్కువ సీట్లు వచ్చినా.. నితీష్ కుమార్ నే మళ్లీ సీఎంగా నియమించారు. నితీష్ తాజా ప్రకటనతో ఆయన ముఖ్యమంత్రి పదవిపై అసంతృప్తిగా ఉన్నారని చెబుతున్నారు. ముఖ్యంగా బీజేపీ ఎమ్మెల్యేలు జేడీయూ కంటే చాలా ఎక్కువగా ఉండటంతో.. ఆయన ఫ్రీగా పని చేయలేకపోతున్నారని, అందుకే అలాంటి ప్రకటన చేశారనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. 

వెలగపూడి ఘర్షణలో మహిళ మృతి.. ఎంపీ నందిగం సురేష్ పై ఆరోపణలు

రాజధాని అమరావతి ప్రాంతంలోని వెలగపూడిలో గత రాత్రి రెండు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. రోడ్డుకు ఆర్చి నిర్మాణ విషయంలో రెండు వర్గాల మధ్య వివాదం చెలరేగింది. దీంతో రెండు వర్గాలు పరస్పరం రాళ్లు రువ్వుకున్నారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన మరియమ్మ అనే మహిళను ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. దీంతో రాజధాని ప్రాంతంలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.   ఈ ఘటన వివరాల్లోకి వెళితే.. వెలగపూడిలోని ఎస్సీ కాలనీలో ఆర్చి విషయంలో ఘర్షణ చోటు చేసుకుంది. ఈ వివాదం గత రెండు మూడు రోజులుగా కొనసాగుతోంది. ఎస్సీ కాలనీలో ఆర్చి నిర్మించి.. జగజ్జీవన్‌రామ్ కాలనీగా పేరు పెట్టాలని ఎంపీ నందిగం సురేష్ అనుచరులు ప్రయత్నిస్తున్నారు. అయితే ఆ నిర్ణయంపై మరొక వర్గం తీవ్ర అభ్యరంతరం వ్యక్తం చేసింది. దీంతో ఈ విషయంపై ఇరు వర్గాల మధ్య వివాదాలు చెలరేగుతున్నాయి. అయితే ఈ ఘర్షణలో ఎంపీ నందిగం సురేష్ హస్తం ఉన్నట్లుగా స్థానికులు ఆరోపిస్తున్నారు. అయన రెండు దళిత వర్గాల మధ్య ఘర్షణను ప్రొత్సహించారని వారు ఆరోపణలు చేస్తున్నారు. తాజా ఘర్షణ నేపథ్యంలో రంగంలోకి దిగిన పోలీసులు ఇరు వర్గాలను చెల్లాచెదురు చేశారు.

కేసుల భయమా.. కొడుకు కోసమా? కమలంతో కేసీఆర్ కథేంటో ?  

రాజకీయ వ్యూహాలు రచించడంలో దిట్టగా పేరున్న తెలంగాణ ముఖ్యమంత్రి , టీఆర్ఎస్ అధినేత కేసీఆర్.. మాట మార్చడంలోనూ అందరి కంటే టాప్ లోనే ఉంటారనే ఆరోపణలు ఉన్నాయి. కేసీఆర్ ఎప్పుడు ఏం మాట్లాడుతారో, ఏ స్టాండ్ తీసుకుంటారో ఎవరికి అర్ధం కాదు. రాజకీయ నిర్ణయాలే కాదు పాలనా పరమైన అంశాల్లోనూ ఆయన అంతే. ఉద్యమ సమయంలోనూ,  తెలంగాణ ముఖ్యమంత్రిగానూ కేసీఆర్  ఎన్నో  సార్లు యూటర్న్ తీసుకున్నారు. పొగిడిన వారినే పరుష పదజాలంతో  తిట్టడం... వ్యతిరేకించిన వారినే అందలం ఎక్కించడం ఆయనకు పరిపాటి. తాజాగా కేసీఆర్ మరోసారి బిగ్ టర్న్ తీసుకున్నారు. కేంద్రంతో యుద్దం చేస్తానన్న గులాబీ బాస్.. కొన్ని రోజుల్లోనే వారితో రాజీకి వచ్చినట్లు కనిపిస్తోంది. కేసీఆర్ తాజా నిర్ణయాల పై రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. కేంద్రం పెద్దలతో కేసీఆర్ సఖ్యత వెనక బలమైన కారణాలే ఉన్నాయంటున్నారు.   2014లో అధికారం చేపట్టినప్పటి నుంచి బీజేపీతో మంచిగానే ఉన్నారు కేసీఆర్. అయితే గత లోక్ సభ ఎన్నికల ముందు  విభేదించినట్లు మాట్లాడారు. ఫెడరల్ ఫ్రంట్ ప్రతిపాదన తెచ్చారు. లోక్ సభ ఎన్నికల ఫలితాల తర్వాత సైలెంట్ అయ్యారు. తెలంగాణలో జరిగిన మున్సిపల్ ఎన్నికల తర్వాత మరోసారి జాతీయ రాజకీయాలపై మాట్లాడారు. ఎందుకో మళ్లీ మౌనం దాల్చారు. గత పార్లమెంట్ సమావేశాల సందర్బంగా కేంద్రానికి వ్యతిరేకంగా వ్యవహరించారు. కేంద్రం తీసుకొచ్చిన మూడు కొత్త వ్యవసాయ బిల్లులను టీఆర్ఎస్ ఎంపీలు వ్యతిరేకించారు. కేంద్ర బిల్లులపై ఘాటైన విమర్శలు చేశారు కేసీఆర్. అనైతిక బిల్లులంటూ విరుచుకుపడ్డారు. రైతుల కోసమే అవరసమైతే కేంద్రంతో యుద్ధం చేస్తామని ప్రకటించారు. ఇటీవల గ్రేటర్ ఎన్నికలకు ముందు కూడా కేంద్రం తీరును ఎండగట్టారు గులాబీ బాస్. సడెన్ గా ఢిల్లీకి వెళ్లన కేసీఆర్ .. ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను కలిశారు. తర్వాత కేంద్రంపై తన స్టాండ్ మార్చుకున్నారు కేసీఆర్. కేంద్రం తీసుకొచ్చిన కొత్త చట్టాలకు మద్దతు పలికారు. ఇకపైన గ్రామాలలో కొనుగోలు కేంద్రాలు ఉండవని ప్రకటించారు.  తెలంగాణ రైతు తన పంటను తీసుకెళ్లి గుజరాత్ మార్కెట్ లో అమ్ముతాడా అంటూ కేంద్రాన్ని నిలదీసిన కేసీఆర్.. ఇప్పుడు పంటకు ఎక్కడ ఎక్కువ ధర వస్తే అక్కడే అమ్ముకోవచ్చని రైతులకు సూచించారు. వానాకాలం సీజన్‌లో అమలు చేసిన నియంత్రిత సాగు విధానానికి స్వస్తి చెప్పి.. యాసంగి నుంచి ఇష్టమైన పంట వేసుకోవచ్చన్నారు. కేసీఆర్ తాజా యూటర్న్ కు తన ఢిల్లీ పర్యటనే కారణమంటున్నారు. కేంద్రం బెదిరించడం వల్లే కేసీఆర్ రాజీ కొచ్చారని చెబుతున్నారు. గత ఆరేండ్లుగా తెలంగాణలో జరిగిన అవినీతి, కాళేశ్వరం ప్రాజెక్టు నిధుల్లో అక్రమాలపై కేంద్ర నిఘా సంస్థల దగ్గర పూర్తి వివరాలు ఉన్నాయని తెలుస్తోంది.  ఢిల్లీ పర్యటనలో ఆ జాబితాను కేంద్ర పెద్దలు కేసీఆర్ కు చూపించి ప్రశ్నించారని తెలుస్తోంది. సీబీఐ విచారణ జరిపితే తన అవినీతి బాగోతం బయటపడుతుందనే భయంతోనే కేసీఆర్ బీజేపీతో రాజీ పడ్డారని, అందుకే కేంద్ర చట్టాలకు మద్దతు తెలిపారనే చర్చ జరుగుతోంది. గతంలో కేసీఆర్ కేంద్ర కార్మికశాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఈఎస్ఐం స్కాం జరిగిందనే ఆరోపణలు ఎప్పటినుంచో ఉన్నాయి. ఈ కేసును కూడా బయటికి తీస్తామని కేంద్ర బెదిరించిందని, అందుకే కేసీఆర్ కిమ్మనకుండా వాళ్లు చెప్పినదానికే ఓకే చెప్పారనే ప్రచారం కూడా జరుగుతోంది.   కేంద్రంతో కేసీఆర్ రాజీకి మరో కారణం ఉందని కూడా బలంగా వినిపిస్తోంది. రెండు, మూడు నెలల్లో కేటీఆర్ ను తెలంగాణ ముఖ్యమంత్రిగా నియమించాలని కేసీఆర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపైనే కేంద్ర పెద్దలతో ఆయన మాట్లాడారని చెబుతున్నారు. తన కొడుకును సీఎంగా నియమిస్తున్నానని, అందుకు సహకరించాలని కేసీఆర్ కోరినట్లు తెలుస్తోంది. కేటీఆర్ కు సహకరిస్తే.. కేంద్రానికి తమ ఎంపీలు మద్దతుగా ఉంటారని ఆయన రాజీకి వచ్చారని అంటున్నారు. వచ్చే ఎన్నికల్లో కేంద్రంలో బీజేపీకి ఎంపీలు అవసరమైనా  తాము మద్దతు ఇస్తామని చెప్పినట్లు చెబుతున్నారు. అంతేకాదు వన్నేషన్ వన్ ఎలక్షన్ కు సపోర్ట్ చేస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారంటున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ను పూర్తిగా నిర్వీర్యం చేయడానికి ఇద్దరం కలిసి పనిచేయాలనే ఆలోచనకు రెండు పార్టీలు వచ్చాయని కూడా చర్చ జరుగుతోంది. అందుకే కేసీఆర్ ఢిల్లీ వెళ్లి వచ్చిన తర్వాత రెండు పార్టీల నేతల మధ్య గతంలోగా ఆరోపణలు చేసుకోవడం లేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.  మొత్తానికి కేసుల భయంతో పాటు కేటీఆర్ కోసం కేంద్రం పెద్దలతో తెలంగాణ ముఖ్యమంత్రి రాజీ పడ్డారన్నది మాత్రం తాజా నిర్ణయాలతో ఖాయమైందని రాజకీయ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.

బ్యాంకుల ముందు చెత్త పనిపై కేంద్రం సీరియస్.. కమిషనర్ సస్పెన్షన్ 

ఏపీలో సీఎం జగన్ కొత్తగా ప్రారంభించిన సంక్షేమ కార్యక్రమాల లబ్ది దారులకు బ్యాంకులు రుణాలు ఇవ్వడంలేదని సాక్షాత్తు అధికారులే కృష్ణా జిల్లాలోని పలు బ్యాంకుల ముందు చెత్త వేయించిన ఘటన తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ చెత్త పనులపై కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మల సీతారామన్ సీరియస్ గా స్పందించి రాష్ట్ర ఆర్ధిక మంత్రి బుగ్గనకు ఫోన్ చేసి మరీ క్లాస్ తీసుకోవడంతో అప్రమత్తమైన జగన్ సర్కార్ ఈ ఘటన పై విచారణ జరిపి ఉయ్యూరు నగర పంచాయతీ కమిషనర్ ప్రకాశ్‌రావు పై సప్సెన్షన్ వేటు వేసింది. ఐతే ఈ సస్పెన్షన్ కు ముందు అయన తన తప్పుకు క్షమాపణ చెప్పినప్పటికీ ప్రభుత్వం ఆయనను సస్పెండ్ చేస్తూ పురపాలకశాఖ కమిషనర్ విజయ్‌కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.   ఈ సందర్భంగా పురపాలకశాఖ కమిషనర్ విజయ్‌కుమార్ మాట్లాడుతూ.. పారిశుద్ధ్య సిబ్బంది, కొంత మంది లబ్ధిదారులు కలిసి బ్యాంకుల ఎదుట చెత్త వేయడం బాధకరమని అన్నారు. ఇటువంటి ఘటనలు మరోసారి జరగకుండా చూస్తామన్నారు. ఈ ఘటనతో బ్యాంకు అధికారులు, సిబ్బంది మనోభావాలు గాయపడి ఉంటే క్షమాపణలు కోరుతున్నట్టు విజయ్‌కుమార్ చెప్పారు. బ్యాంకుల ముందు చెత్త వేసిన ఘటనపై విచారణ చేపట్టి దీనికి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటామని కమిషనర్ హామీ ఇచ్చారు. ఇది ఇలా ఉండగా తమ పరిదిలోని బ్యాంకుల ముందు చెత్త వేసిన ఘటన పై మచిలీపట్నం కమిషనర్ శివరామకృష్ణ, విజయవాడ కమిషనర్ల ప్రసన్న వెంకటేష్ లను కూడా రాష్ట్ర ప్రభుత్వం వివరణ కోరింది. అయితే ఈ చెత్త పనికి ప్రధాన కారణం కొంత మంది ఉన్నతాధికారుల ఆదేశాలేనని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ సస్పెన్షన్ల పర్వం ఇక్కడితో ఆగుతుందా లేక దీనికి బాధ్యులైన మరి కొందరు అధికారులపై కూడా చర్యలు తీసుకుంటారా వేచి చూడాలి.

దత్తపుత్రికను పెళ్లికూతురిని చేసి ఆశీర్వదించిన సీఎం కేసీఆర్ సతీమణి 

సీఎం కేసిఆర్ దత్త పుత్రిక ప్రత్యూష వివాహం ఈరోజు చరణ్ రెడ్డితో జరగనున్న సంగతి తెల్సిందే. ఈ నేపథ్యంలో రాష్ట్ర మహిళాభివృద్ది, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఐఏఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్‌లో ప్రత్యూషను పెళ్లికూతురును చేసారు. ఈ కార్యక్రమానికి సీఎం కేసీఆర్ సతీమణి శ్రీమతి శోభ స్వయంగా హాజరై వధువుకు డైమండ్ నక్లెస్, పట్టుబట్టలు పెట్టి ఆశీర్వదించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రి సత్యవతి రాథోడ్, మహిళాభివృద్ధి శాఖ కమిషనర్, ప్రత్యేక కార్యదర్శి దివ్య తదితరులు హాజరయ్యారు. ఈ రోజు జరిగే ప్రత్యూష, చరణ్ రెడ్డి వివాహానికి సీఎం కేసీఆర్ హాజరవుతారని తెలుస్తోంది.

భారత సరిహద్దులలో తెలంగాణ జవాను మృతి.. మృతిపై స్పష్టత ఇవ్వని అధికారులు.. 

మనదేశ సరిహద్దులలోని లేహ్ లో విధులు నిర్వర్తిస్తున్న తెలంగాణ జవాను మృతి చెందాడు. అయితే ఆ జవాను మరణానికి గల కారణాలను అధికారులు వెల్లడించాల్సి ఉంది. మహబూబ్ నగర్ జిల్లా గువ్వనికుంట తండాకు చెందిన పరశురాం 2004లో ఆర్మీకి సెలక్ట్ అయ్యాడు. అనేక రాష్ట్రాల్లో బాధ్యతలు నిర్వహించిన 35 ఏళ్ల పరశురాం ప్రస్తుతం సరిహద్దులోని లేహ్ ప్రాంతంలో నాయక్ ర్యాంకులో విధులు నిర్వర్తిస్తున్నాడు. ఈ నేపథ్యంలో శుక్రవారం నాడు సైనికాధికారులు పరశురాం కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి, ఆయన మరణవార్త తెలియ చేసారు. అయితే, పరశురాం ఎలా చనిపోయాడన్న విషయం మాత్రం వారు చెప్పలేదు. అయితే జవాను పరశురామ్ మృతి చెందిన నేపథ్యంలో అతని కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. ఆయన మరణవార్త విన్న పలువురు రాజకీయ నాయకులు పరశురాం కుటుంబాన్ని కలిసి తమ ప్రగాఢ సంతాపం తెలియచేసారు. అధికారులు పరశురాం మృతదేహాన్ని గువ్వనికుంట తండా తీసుకువచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

పవన్ కళ్యాణ్ కు పీసీసీ చీఫ్‌ పదవి!!

మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టుగా.. అసలే తెలంగాణలో వరుస ఓటములతో సతమతమవుతున్న కాంగ్రెస్ కు టీపీసీసీ చీఫ్‌ ఎంపిక కొత్త తలనొప్పి తెచ్చిపెట్టింది. తెలంగాణ కాంగ్రెస్ పగ్గాలు చేపట్టడానికి పలువురు నేతలు పోటీపడుతున్నారు. ఈ రేసులో రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి, జగ్గారెడ్డి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. మరోవైపు, టీపీసీసీ చీఫ్‌ గా రేవంత్ పేరు ఖరారైనట్లు వార్తలొస్తున్నాయి. దీంతో ఆ పార్టీ సీనియర్లు తిరుగుబాటు స్వరం వినిపిస్తున్నారు. వి. హనుమంతరావు అయితే రేవంత్ కి పార్టీ పగ్గాలిస్తే తాను పార్టీని వీడతానని కూడా ప్రకటించారు. దీంతో తెలంగాణ కాంగ్రెస్ శ్రేణులు గ్రూపులుగా విడిపోయి ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. ఈ తరుణంలో వి. హనుమంతరావు తెలుగు రాజకీయాల్లో మరో కొత్త చర్చకు తెరదీశారు. జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ కాంగ్రెస్‌లోకి వస్తే పీసీసీ చీఫ్‌ పదవి ఇప్పిస్తానని సంచలన ప్రకటన చేశారు.   సూర్యాపేట జిల్లా దొండపాడులో వంగవీటి రంగా విగ్రహాన్ని వీహెచ్‌ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. వంగవీటి రంగా రానున్న రోజుల్లో సీఎం అవుతాడనే హత్య చేశారని అన్నారు. రాష్ట్రంలో 3 శాతం ఉన్న సామాజికవర్గం వారు కాంగ్రెస్ ‌ను నాశనం చేశారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బీసీలకు పీసీసీ చీఫ్‌ ఇవ్వాలన్నందుకు ఫోన్లు చేసి బెదిరిస్తున్నారని, బెదిరింపులకు భయపడనని, పార్టీ కోసం ప్రాణం పోయినా ఫరవాలేదన్నారు. పవన్ ‌కల్యాణ్‌ కాంగ్రెస్‌లోకి వస్తే పీసీసీ చీఫ్‌ పదవి ఇప్పిస్తానని ప్రకటించారు. ఏపీలో 27 శాతం ఉన్న కాపులు రాజ్యాధికారం సాధించాలని ఆకాంక్షించారు. వంగవీటి రంగా తర్వాత పవన్‌ కల్యాణ్‌కు మంచి వేవ్ ఉందని వీహెచ్‌ అన్నారు.

వైసీపీ నేతలు భూకబ్జాదారులు.. మంత్రులు పొద్దెరగని బిచ్చగాళ్లు! 

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు, జగన్ కేబినెట్ లోని మంత్రులపై సంచలన ఆరోపణలు చేశారు  సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ.  వైసీపీ నేతలు భూ కబ్జాదారులని చెప్పారు. వైసీపీ నేతల భూ ఆక్రమణలను ఆధారాలతో నిరూపిస్తానంటూ సీఎం జగన్ కు సవాల్ చేశారు నారాయణ. గుంటూరు, విశాఖలో భూ దోపిడీకి పాల్పడింది వైసీపీ నేతలేనని చెప్పారు. అవినీతిలో పుట్టి పెరిగిన వ్యక్తులు జగన్, విజయసాయిరెడ్డి అని వ్యాఖ్యానించారు నారాయణ. వైసీపీ మంత్రులు పొద్దెరగని బిచ్చగాళ్లని విమర్శించారు. తిరుమలలో ఇతర మతాల గురించి మాట్లాడడం ఏంటి? అవంతి, నారాయణస్వామి లాంటి మంత్రులు ఏపీకి అవసరమా? అని సీపీఐ నారాయణ ప్రశ్నించారు.

అధికారులు తాగి పడుకోవద్దు! మంత్రి ఎర్రబెల్లి వివాదాస్పద వ్యాఖ్యలు 

వరంగల్ జిల్లా ఐనవోలు మల్లన్న జాతర ఏర్పాట్లపై సమీక్ష జరిపిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అధికారులు తాగిపడుకోకుండా సీరియస్ గా పనిచేయాలని మంత్రి అన్నారు. మేడారం జాతరలో తాగిపడుకున్నట్టు ఇక్కడ పడుకుంటే కుదరదన్నారు. మేడారం జాతర సందర్భంగా పలువురు అధికారులతో మాట్లాడుతుంటే తాగిఊగుతున్నారని గుర్తుచేశారు. ఐనవోలు జాతరలో అలా చేయకుండా సీరియస్ గా పనిచేయాలని  వార్నింగ్ ఇచ్చారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు.  ఐన‌వోలు శ్రీ మ‌ల్లికార్జున స్వామి జాత‌ర  జ‌న‌వ‌రి 13,14,15 తేదీల్లో మూడు రోజుల‌పాటు జ‌రగనుంది. జాతర ఏర్పాట్లపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించిన మంత్రి ఎర్రబెల్లి.. భ‌క్తుల‌కు  అవ‌స‌ర‌మైన భ‌ద్ర‌త‌, లావెట్రీలు, చ‌లువ పందిళ్ళు, మంచినీటి వ‌స‌తి, స్నానాల గ‌దులు, బ‌ట్ట‌లు మార్చుకునే గ‌దులు ఏర్పాటు చేయాలని ఆదేశింతారు.  క్యూ లైన్లు, విద్యుత్, సిసి కెమెరాలు, భ‌క్తుల‌కు అన్న‌దానం వంటి అనేక వ‌స‌తుల క‌ల్ప‌న పై ఆయాశాఖ‌ల  అధికారుల‌కు త‌గు సూచ‌న‌లు, స‌ల‌హాలు చేశారు. కోటి రూపాయలతో ఐనవోలు లో శాశ్వత ప్రాతిపదికన బాత్ రూం ల నిర్మాణానికి ముందుకు వచ్చిన కుడా చైర్మన్ మర్రి యాదవ రెడ్డి ని మంత్రి అభినందించారు. జాతరలో సోడియం హైపోరైడ్ ద్రావణం పిచ్చికారీ, నిరంతర శానిటేషన్ కి అంగీకరించిన మేయర్ గుండా ప్రకాశ్ రావుని కూడా మంత్రి అభినందించారు. కోవిడ్ నేప‌థ్యంలో త‌ప్ప‌నిస‌రిగా క‌రోనా నిబంధ‌న‌లు పాటించాల‌ని, మాస్కలు ఉంటేనే దర్శనం కలిగించాలని చెప్పారు. ప్ర‌జాప్ర‌తినిధులు, అధికారులు, సిబ్బంది స‌మ‌న్వ‌యంతో ప‌ని చేయాల‌ని చెప్పారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు.  

నాకు ప్రజాస్వామ్య పాఠాలు చెప్పాలని చూస్తున్నారు! రాహుల్ కు ప్రధాని మోడీ చురకలు

కాంగ్రెస్ యువనేత రాహుల్ గాంధీకి చురకలు అంటించారు ప్రధాని నరేంద్ర మోడీ. ఢిల్లీ వేదికగా కొందరు ప్రతి రోజూ తనకు ‘ప్రజాస్వామ్య పాఠాలు’ చెప్పడానికి ప్రయత్నిస్తున్నారని కామెంట్ చేశారు.  ప్రతిరోజూ తనను విమర్శిస్తున్న వారంతా జమ్మూకశ్మీర్‌ను చూసి నేర్చుకోవాలని ప్రధాని హితవుపలికారు. జమ్మూ కశ్మీర్ లో ఆయుష్మాన్ భారత్ కార్యక్రమాన్ని ప్రారంభించిన మోడీ.. కాంగ్రెస్ సహా విపక్షాలపై విమర్శలు చేశారు. ప్రజాస్వామ్యం ఎంత బలమైనదో జమ్మూ కశ్మీర్‌లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలు చూపించాయన్నారు. ఢిల్లీ వేదికగా రోజూ నన్ను అవమానించాలని, నాకు ప్రజాస్వామ్య పాఠాలు చెప్పాలని చూస్తున్నారు.. వారి కపటత్వం, పవిత్రతను ఓ సారి చూడండి అని మోడీ వ్యాఖ్యానించారు. సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చినా...  కాంగ్రెస్ పార్టీ పాండిచ్చేరిలో స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించలేదని... కేంద్ర పాలిత ప్రాంతంగా జమ్మూ కశ్మీర్‌ను ప్రకటించగానే తాము స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించామని చెప్పారు.  దేశ అభివృద్ధితో భుజం భుజం కలుపుతూ ప్రస్తుతం జమ్మూ కశ్మీర్‌ కూడా అభివృద్ధి పథంలో పయనిస్తోందని ప్రధాని మోడీ హర్షం వ్యక్తం చేశారు. కరోనా సమయంలో కూడా జమ్మూ కశ్మీర్ ప్రాంతంలో అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయన్నారు. గాంధీ మహాత్ముడి విజన్ అయిన గ్రామ స్వరాజ్యాన్ని జమ్మూ కశ్మీర్ ప్రజలు సాధించారని ప్రశంసించారు. జమ్మూ కశ్మీర్‌లో ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడానికి ప్రజలు ఓట్లు వేశారని, అధిక సంఖ్యలో ఓటింగ్ కేంద్రాలకు తరలివచ్చి స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్‌లో పాల్గొన్నారని ప్రధాని కొనియాడారు. గతంలో తాము ఇక్కడి ప్రభుత్వంతో పొత్తు కుదుర్చుకున్నామని, ఆ తర్వాత పొత్తు విచ్ఛిన్నమైపోయిందని మోడీ పరోక్షంగా మెహబూబాతో కొనసాగిన పొత్తు గురించి వ్యాఖ్యానించారు. ప్రజలందరూ స్థానిక సంస్థల ఎన్నికల్లో పాల్గొని తమ ఓటు హక్కును వినియోగించుకొని, తమకు నచ్చిన వారిని ఎన్నుకోవాలన్నదే తమ తాపత్రయంగా ఉండేదని వివరణ ఇచ్చారు. ఆయుష్మాన్ భారత్ ద్వారా ప్రతి ఒక్కరూ లాభపడతారని చెప్పారు ప్రధాని మోడీ.

ఇంటి స్థలాల పేరిట వసూళ్లు.. వైసీపీ నేతపై కేసు నమోదు!

ఏపీలో ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమానికి సీఎం వైఎస్‌ జగన్‌ శుక్రవారం శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. అయితే, ఇళ్ల పట్టాల పంపిణీ పేరుతో వైసీపీ నేతలు అక్రమాలకు పాల్పడుతున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఆ ఆరోపణలకు తగ్గట్టే, ఇళ్ల స్థలాల పంపిణీకి సంబంధించి వసూళ్లకు పాల్పడిన ఓ వైసీపీ నేతపై పోలీసులు తాజాగా కేసు నమోదు చేశారు.    చిత్తూరు జిల్లాలోని బంగారుపాలెం మండలం తగ్గువారిపల్లెకు చెందిన వైసీపీ నేత సురేంద్ర.. పార్వతమ్మ అనే మహిళకు ఇంటి స్థలం ఇప్పిస్తానని చెప్పి రూ. 30వేలకు ఒప్పందం చేసుకున్నాడు. ఒప్పందంలో భాగంగా ముందుగా ఆమె నుంచి రూ. 5 వేలు తీసుకున్నాడు. అయితే, ఇటీవల ప్రకటించిన అర్హుల జాబితాలో పార్వతమ్మ పేరు లేకపోవడంతో.. ఆమె సురేంద్రను నిలదీసింది. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో అతనిపై పోలీసులు కేసు నమోదు చేశారు.    చిత్తూరు పార్లమెంట్ బీసీ సంక్షేమ సంఘం కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్న సురేంద్ర ఇంటి స్థలాల పేరిట ఇలా చాలామంది నుంచి డబ్బులు వసూలు చేసినట్టు ప్రచారం జరుగుతోంది. మరోవైపు, ఈ విషయం తెలసిన పార్టీ నాయకులు అతన్ని వైసీపీ నుంచి సస్పెండ్ చేసినట్లు తెలుస్తోంది. అలాగే, వాలంటీర్‌గా పనిచేస్తున్న అతని కుమారుడిని కూడా ఆ జాబ్‌ నుంచి తొలగించారని సమాచారం.

రేవంత్ టార్గెట్ గా సోనియాకు లేఖ!  వీహెచ్ బాటలోనే జగ్గారెడ్డి! 

తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటి అధ్యక్ష ఎన్నిక పీటముడి ఇప్పట్లో తెగేలా కనిపించడం లేదు.  పీసీసీ చీఫ్ ను హైకమాండ్ దాదాపుగా ఖరారు చేసిందని  ఓ వైపు  ప్రచారం జరుగుతుండానే.. మరోవైపు కొత్త ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. పీసీసీ చీఫ్ గా ఖాయమయ్యారనే ప్రచారం జరుగుతున్న మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్ రెడ్డి టార్గెట్ గా దూకుడు పెంచారు ఆయన ప్రత్యర్థులు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా, రాహుల్‌ గాంధీ, రాష్ట్ర ఇన్‌చార్జ్‌ ఠాగూర్‌కి ఎమ్మెల్యే జగ్గారెడ్డి లేఖ రాశారు. పీసీసీ ఎన్నికపై తొందరపాటు నిర్ణయం తీసుకోవద్దని లేఖలో ఆయన పేర్కొన్నారు. నాగార్జున సాగర్ ఉప ఎన్నిక వరకు ఉత్తమ్‌ కుమార్ రెడ్డినే కొనసాగించాలని  జగ్గారెడ్డి కోరారు. పీసీసీ ఎన్నికపై సీనియర్‌ కాంగ్రెస్‌ నేతల అభిప్రాయాలు తీసుకోవాలని సూచించారు. ఏకాభిప్రాయంతోనే పీసీసీ చీఫ్‌ ఎన్నిక జరగాలని ఎమ్మెల్యే జగ్గారెడ్డి...  సోనియారు రాసిన లేఖలో స్పష్టం చేశారు.          పీసీసీ విషయంలో మొదటి నుంచి రేవంత్ రెడ్డిని వ్యతిరేకిస్తున్నారు ఎమ్మెల్యే జగ్గారెడ్డి. పార్టీలోకి కొత్తగా వచ్చిన వారికి కీలక పోస్టులు ఇవ్వొద్దంటూ బహిరంగంగానే తన అభిప్రాయాన్ని చాలా సార్లు చెప్పారు. తాను కూడా పీసీసీ రేసులో ఉన్నానని ప్రకటించారు. ఇటీవల గాంధీభవన్ లో రేవంత్ రెడ్డి, జగ్గారెడ్డి సరదాగా మాట్లాడుకుంటున్న వీడియో బయటకి వచ్చింది. దీంతో ఇద్దరి మధ్య సఖ్యత కుదిరిందని అంతా భావించారు. కాని జగ్గారెడ్డి తాజా ప్రకటనతో రేవంత్ రెడ్డికి పీసీసీ పగ్గాలు రాకుండా ఆయన ఇంకా ప్రయత్నాలు చేస్తున్నారని తెలుస్తోంది. మరో సీనియర్ హనుమంతరావు కూడా రేవంత్ రెడ్డిని మొదటి నుంచి వ్యయతిరేకిస్తున్నారు.  శుక్రవారం మరో కీలక ప్రకటన చేశార. రేవంత్ కు టీపీసీసీ పగ్గాలు ఇస్తే తాను కాంగ్రెస్ పార్టీ నుంచి బయటికి వెళ్తానని ప్రకటించి సంచలనం రేపారు. వీహెచ్ వ్యాఖ్యలపై రేవంత్ రెడ్డి అభిమానులు తీవ్రంగా స్పందించడం... తనను ఫోన్ చేసి తిట్టారంటూ రేవంత్ రెడ్డి అనుచరుడిపై హనుమంతరావు కేసు పెట్టడం కూడా జరిగిపోయాయి.  వీహెచ్ కామెంట్లపై హైకమాండ్ ఆగ్రహంగా ఉందని తెలుస్తోంది. వీహెచ్ కు ఏఐసీసీ నుంచి షోకాజ్ నోటీసులు రావొచ్చని చెబుతున్నారు.

బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్‌కు వైసీపీ ఎమ్మెల్యే సవాల్

తెలంగాణకు చెందిన బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్‌ కు, ఏపీకి చెందిన శ్రీశైలం వైసీపీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. శ్రీశైలంలోని దుకాణ సముదాయాల్లో ముస్లింలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారంటూ రాజాసింగ్ ఆరోపించారు. తాత్కాలిక ప్రాతిపదికన ఇచ్చిన షాపులను తీసేయాలని కోర్టు ఆదేశించినా పట్టించుకోవడం లేదని అన్నారు. వైసీపీ ఎమ్మెల్యే చక్రపాణి ఓ టీమ్ తయారుచేసి, వైసీపీకి చెందిన రజాక్ అనే వ్యక్తికి బాధ్యతలు అప్పగించారని చెప్పారు. రజాక్ ను అడ్డుపెట్టుకొని ఎమ్మెల్యే చక్రపాణి అక్రమాలకు పాల్పడుతున్నారని, అడ్డగోలుగా కాంట్రాక్టులు పొందుతున్నారని విమర్శలు చేశారు. శ్రీశైలం దేవస్థానాన్ని కాపాడాలని, ఎమ్మెల్యే చక్రపాణిని కట్టడి చేయాలని ఏపీ సీఎం వైఎస్ జగన్‌ కు విజ్ఞప్తి చేశారు. పుణ్యక్షేత్రం పవిత్రతను కాపాడాలని, తాము ఇన్వాల్వ్ అయితే వేరేలా ఉంటుందని రాజాసింగ్ వార్నింగ్ కూడా ఇచ్చారు.   రాజా సింగ్‌ వ్యాఖ్యలపై చక్రపాణి రెడ్డి స్పందించారు. రాజాసింగ్ ఎప్పుడంటే అప్పుడు శ్రీశైలంలో పెద్దల సమక్షంలో చర్చకు సిద్ధమని అన్నారు. తనపై చేసిన ఆరోపణలు నిజమని నిరూపిస్తే రాజీనామాకు సిద్ధమని చెప్పిన ఆయన.. ఆరోపణలు నిరూపించకపోతే రాజీనామాకు సిద్ధమా? అని రాజా సింగ్‌ కు సవాల్ విసిరారు. శ్రీశైలంలో ముస్లింలను వెళ్లగొట్టడానికి తామెవరమని, అక్కడ వాళ్ళు 40 సంవత్సరాలుగా వ్యాపారాలు చేసుకుంటున్నారని చెప్పారు. రజాక్ అనే వ్యక్తి నలభై సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నారని, తొమ్మిది సంవత్సరాల నుంచి మాత్రమే రాజకీయాల్లో ఉన్న తనకు ఆయన బినామీ ఎలా అవుతాడని ప్రశ్నించారు. ఎన్నో దేవాలయాలకు తాను ఆర్థిక సహాయం చేశానని, అలాంటి తనను పట్టుకొని హిందూ ద్రోహిగా ముద్రవేయాలని చూస్తున్నారని చక్రపాణి రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.

తమిళనాట కొత్త పార్టీ లేనట్టేనా ? రజనీ అనారోగ్యంపై కొత్త చర్చ ? 

సూపర్ స్టార్  రజనీకాంత్ కు ఏమైంది?  ఆయన హై బీపీతోనే బాధపడుతున్నారా లేక ఇంకేమైనా తీవ్రమైన ఆరోగ్య సమస్యలు  ఉన్నాయా? డిసెంబర్ 31న రజనీ కొత్త పార్టీ ప్రకటన ఉంటుందా.. ఉండదా?.. ఇదే ఇప్పుడు రజనీకాంత్ అభిమానులకు నిద్ర లేకుండా చేస్తోంది. తమిళనాడు ప్రజల్లోనూ చర్చనీయాంశంగా మారింది. డిసెంబర్ 31న కొత్త రాజకీయ పార్టీపై ప్రకటన చేస్తానని చెప్పిన రజనీకాంత్.. అందుకు కసరత్తు కూడా చేసుకుంటున్నారు. పార్టీ ఏర్పాట్లు చూస్తూనే రామోజీ ఫిలిం సిటీలో జరుగుతున్న సినిమా షూటింగ్ లో పాల్గొంటున్న రజనీకాంత్.. ఒక్కసారిగా అనారోగ్యానికి హైదరాబాద్ అపోలో హాస్పిటల్ లో చేరారు. దీంతో భాషా హెల్త్ కండీషన్ పై  ఆయన అభిమానుల్లో ఆందోళన నెలకొంది. రజనీకాంత్ ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు చెబుతున్నా... అభిమానుల్లో మాత్రం ఆందోళన తగ్గడం లేదు.          రజనీ కాంత్  ఆరోగ్య పరిస్థితి  శుక్రవారం  కంటే మరింత మెరుగుపడిందన్న అపోలో డాక్టర్లు..  మరిన్ని వైద్య పరీక్షలు చేశామని తెలిపారు.  రజనీకాంత్ ను  పరామర్శించేందుకు ఎవ్వరూ రావద్దని మరోసారి విజ్ఞప్తి చేశారు. దీంతో రజనీ పరామర్శకు ఎవరూ రావొద్దని వైద్యులు చెప్పడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రాజకీయ  పార్టీ ప్రకటన వాయిదా వేయడానికే రజనీకాంత్ హాస్పిటల్ లో జాయిన్ అయ్యారనే వాదనలు కొందరి నుంచి వస్తున్నాయి. గతంలోనూ  కొందరు రాజకీయ నేతల కొత్త పార్టీ ఏర్పాటు, పార్టీ మార్పు సందర్భాల్లో ఇలాంటి ఘటనలే జరిగాయి.  ఏపీ కాంగ్రెస్ నేతగా ఉన్నప్పుడు  వైసీపీలో చేరడానికి రంగం సిద్దం చేసుకున్నారు కన్నా లక్ష్మినారాయణ . తెల్లారితే కన్నా జగన్ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకోవాల్సి  ఉండగా.. బీజేపీ పెద్దలు ఎంట్రీ అయ్యారు. కన్నాను తమ పార్టీలోకి ఆహ్వానించారు. ఇంతలోనే  వైసీపీలో చేరడానికి  అన్ని సిద్దం చేసుకున్న కన్నా లక్ష్మినారాయణ.. అర్ధరాత్రి పూట సడెన్ గా అనారోగ్యానికి గురై హాస్పిటల్ లో అడ్మిట్ అయ్యారు.  మరికొన్ని గంటల్లో వైసీపీలో చేరాల్సి ఉన్న  కన్నా.. అది తప్పించుకోవడానికే హాస్పిటల్ లో చేరారనే ప్రచారం జరిగింది. ఇప్పుడు రజనీకాంత్ విషయంలో అలానే జరుగుతుందనే చర్చ  కొందరి నుంచి వస్తోంది.  తమిళనాడులో రజనీకాంత్ రాజకీయ పార్టీపై మొదటి నుంచి గందరగోళమే కనిపించింది. 2017 డిసెంబర్‌ 31న రాజకీయ పార్టీపై ప్రకటన చేశారు రజనీకాంత్. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తామని కూడా ప్రకటించారు. అయితే పార్టీ పెడతానని ప్రకటించి మూడేళ్లు అయినా... పార్టీ ఏర్పాటుపై పురోగతి కన్పించలేదు.  రజనీ మక్కల్‌ మండ్రం ఏర్పాటు, కార్యవర్గం నియామకం, సభ్యత్వ నమోదుతో సరిపెట్టారు రజనీకాంత్.  మరో ఐదు నెలల్లోనే అసెంబ్లీ ఎన్నికలు ఉండటంతో రజనీకాంత్ పార్టీ ఉండకపోవచ్చని దాదాపుగా అందరూ నిర్ణయానికి వచ్చారు. ఇంతలో సడెన్ గా మేల్కొన్న రజనీకాంత్.. నవంబర్ 30న  రజనీ మక్కల్ మండ్రం సభ్యులతో  చర్చించి కొత్త పార్టీపై మరోసారి ప్రకటన చేశారు. డిసెంబర్ 31 పార్టీ పేరు ప్రకటిస్తానని చెప్పారు.  పార్టీ పేరు రిజిస్ట్రేషన్ ప్రక్రియను అయన అనుచరులు కేంద్ర ఎన్నికల సంఘం పూర్తి చేశారు. ఇంతలోనే రజనీకాంత్ ఆరోగ్యం క్షీణించి హాస్పిటల్ లో చేరడంతో పార్టీ ఏర్పాటుపై మళ్లీ అయోమయం నెలకొంది.   రాజకీయ పార్టీపై రజనీకాంత్  వెనక్కి తగ్గారని  గతంలోనూ సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. అనారోగ్య కారణాలతో రజనీకాంత్ రాజకీయ పార్టీ పెట్టడం లేదన్నది ఆ ప్రచార సారాంశం. వైద్యుల సలహా మేరకు రాజకీయాల నుంచి రజనీకాంత్ తప్పుకుంటున్నారని అందులో ఉంది.  సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై స్పందించిన రజనీకాంత్..  అది తన ప్రకటన కాదంటూనే అందులో పేర్కొన్న ఆరోగ్యపరమైన సమస్యలను  పరోక్షంగానే అంగీకరించారు. మండ్రం నిర్వాహకులతో చర్చించి నిర్ణయం తీసుకుంటానని ప్రకటించారు. గతంలో ప్రచారం జరిగినట్లే రజనీకాంత్ ఆరోగ్యం క్షీణించడంతో ఇప్పుడు కొత్త చర్చలు తెరపైకి వస్తున్నాయి. అరోగ్య కారణాల రీత్యా పార్టీ ఏర్పాటుకు రజనీకాంత్ కు మంచి కాదని వైద్యులు గతంలో సూచించారని, వాళ్లు చెప్పినట్లే జరుగుతున్నందున.. రాజకీయ పార్టీపై రజనీకాంత్ పునరాలోచన చేసే అవకాశం ఉందని చెబుతున్నారు. దీంతో రజనీకాంత్ రాజకీయ గమనం ఉంటుందా ఉండదా అన్న అనుమానాలే ఇప్పుడు తమిళనాడులో ఎక్కువగా జరుగుతున్నాయి.

చీరాలలో మంత్రి సాక్షిగా ఉప్పు నిప్పు కలిసాయి.. 

ఏపీ సీఎం జగన్ ను నిత్యం చికాకులతో సతాయించే నియోజకవర్గాలు రెండు. అందులో ఒకటి కృష్ణాజిల్లా గన్నవరం కాగా రెండోది ప్రకాశం జిల్లా చీరాల. ఈ రెండు చోట్ల టీడీపీ తరుఫున గెలిచిన ఎమ్మెల్యేలు సీఎం జగన్ కు జై కొట్టడంతో వైసీపీ పార్టీలో నిత్యం ఏదో ఒక రచ్చ జరుగుతూనే ఉంది. చీరాలలో ఎటువంటి కార్యక్రమం జరిగినా అటు కరణం బలరాం వర్గం, ఇటు ఆమంచి కృష్ణమోహన్ వర్గం కాలు దువ్వుతూనే ఉన్నాయి. అయితే తాజాగా నిన్న చీరాలలో పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీ కార్యక్రమంలో ఈ ఇద్దరు నాయకులు మంత్రితో ఒకే వేదిక ను పంచుకోవడం హాట్ టాపిక్ అయింది.   ఈ ప్రభుత్వ కార్యక్రమంలో మంత్రి బాలినేనికి ఓ వైపు కరణం బలరాం.. మరోవైపు ఆమంచి నిలబడి ఉండగా ఎలాంటి గొడవలు జరగకుండా ప్రోగ్రాం పూర్తి కావడం విశేషం. కొద్దిరోజుల క్రితం చీరాలలో మత్స్యకారుల మధ్య నెలకొన్న గొడవల్లో కరణం, ఆమంచి వర్గీయుల మధ్య పెద్ద ఎత్తున ఘర్షణలు చోటు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో.. ప్రభుత్వం చేపట్టిన ఇళ్ల స్థలాల పంపిణీ కార్యక్రమం ప్రతిష్టాత్మకం కావడంతో మంత్రి బాలినేని స్వయంగా రంగంలోకి దిగారు. దీంతో ఇద్దరు నేతల అనుచరులు వస్తే మళ్లీ ఘర్షణలు జరుగుతాయని భావించిన పోలీసులు ముందుజాగ్రత్త చర్యగా కేవలం ఆమంచి, కరణంలను మాత్రమే వేదికపైకి అనుమతించారు. అయితే ఒకరిపై మరొకరు లోపల రగిలిపోతున్నా.. ఆమంచి, కరణం మాత్రం పైకి నవ్వులు చిందిస్తూ ఫొటోలకు ఫోజులివ్వడం విశేషం. అయితే వేదికపై వారిద్దరూ పలకరించుకోకుండా ఎడముఖం పెడముఖంగానే ఉన్నారు. ఇద్దరునేతల అనుచరులను పోలీసులు అనుమతించకపోకడంతో.. ఎటువంటి ఘర్షణలు లేకుండా కార్యక్రమం ముగియడంతో ఇటు వైసీపీ కార్యకర్తలు, అటు అధికారులు కూడా ఉపిరి పీల్చుకున్నారు.