జర భద్రం.. తెలంగాణాలో బయటపడ్డ రెండు కొత్త స్ట్రెయిన్ కరోనా కేసులు
బ్రిటన్ లో కొత్తగా వెలుగు చూసిన రూపాంతరం చెందిన కరోనా వైరస్ కేసులు తాజాగా భారత్ లోనూ నమోదవుతున్నాయి. బ్రిటన్ లో కొత్త స్ట్రెయిన్ మొదలైందని ప్రకటించగానే ఆ దేశం నుండి వచ్చే విమానాలపై భారత్ నిషేధం విధించినప్పటికీ… కేంద్రం రియాక్ట్ అయ్యే లోపే వైరస్ భారత్ లో ఎంటర్ అయిపోయింది. తాజాగా ఇదే విషయాన్ని కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది.
దేశవ్యాప్తంగా ఈ కొత్త స్ట్రెయిన్ వైరస్ కేసులు 6 నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ఈరోజు వెల్లడించింది. ఇందులో బెంగళూరులో 3, హైదరాబాద్ లో 2, పుణేలో ఒకరికి కొత్త స్ట్రెయిన్ వైరస్ సోకినట్లు బులిటెన్ వెల్లడించింది. బ్రిటన్ నుండి వచ్చిన మొత్తం 33వేల మందిని పరీక్షించగా 114మందికి వైరస్ ఉన్నట్ల నిర్ధారణ అయ్యిందని, అందులో 6గురికి ఈ కొత్త స్ట్రెయిన్ ఉన్నట్లు నిర్ధారణ అయ్యిందని తెలిపింది.
ప్రస్తుతం కొత్త స్ట్రెయిన్ ఉన్న వారి కాంటాక్ట్ ట్రేసింగ్ జరుగుతోందని, వైరస్ ఉన్న వారిని ప్రత్యేక గదిలో ఉంచి చికిత్స అందిస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. బ్రిటన్ లో గుర్తించిన ఈ కొత్త స్ట్రెయిన్ వల్ల వైరస్ వ్యాప్తి వేగంగా ఉంటుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించిన సంగతి తెల్సిందే. ఈ కరోనా స్ట్రెయిన్ తో యువత, పిల్లల్లోనూ కేసులు ఎక్కువగా నమోదవుతాయని హెచ్చరించింది.
ఇది ఇలా ఉండగా ఇటీవల యూకే నుంచి తిరిగొచ్చిన వరంగల్ అర్బన్ జిల్లాకు చెందిన వ్యక్తి (49)లో దీనిని గుర్తించారు. ఆ వ్యక్తితో ప్రాథమికంగా కాంటాక్టు అయినవారిలో తల్లి, భార్య, డ్రైవర్ ఉన్నారు. వీరికి కూడా పరీక్షలు నిర్వహించగా తల్లికి పాజిటివ్ అని తేలింది. అయితే ఆమెకు సోకింది కొత్త కరోనానా? కాదా? అని తేల్చేందుకు నమూనాలను సీసీఎంబీకి పంపారు. అయితే యూకే నుంచి వచ్చి పాజిటివ్‌గా తేలినవారి నమూనాల జన్యు విశ్లేషణ అనంతరం ఫలితాల నివేదికను ఆదివారమే సీసీఎంబీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు పంపింది. అందులోనే వరంగల్ వ్యక్తిలో కొత్త స్ట్రెయిన్‌ను నిర్ధారించినట్లు సమాచారం. ఇతడి ఆరోగ్యం నిలకడగా ఉందని, కొద్ది రోజుల్లోనే డిశ్చార్జి అవుతారని వైద్య ఆరోగ్య శాఖ వర్గాలు చెబుతున్నాయి.
మరోపక్క రాష్ట్రంలో బ్రిటన్ నుండి వచ్చి ట్రేస్ అయినవారిలో 996 మందికి పరీక్షలు నిర్వహించగా, 966 మందికి నెగెటివ్ వచ్చింది. 9 మంది ఫలితాలు రావాల్సి ఉంది. కరోనా పాజిటివ్ వచ్చిన 21 మందిలో హైదరాబాద్ వారు నలుగురు, మేడ్చల్‌వారు 9 మంది, జగిత్యాల జిల్లావాసులు ఇద్దరు, మంచిర్యాల, నల్లగొండ, రంగారెడ్డి జిల్లా, సంగారెడ్డి, సిద్దిపేట, వరంగల్ అర్బన్ జిల్లాలవారు ఒక్కొక్కరు ఉన్నారు. వీరంతా వివిధ ఆస్పత్రుల్లో ప్రత్యేక వార్డుల్లో చికిత్స పొందుతున్నారు.