సెంట్రల్ విస్టా ప్రాజెక్టుకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్

కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించ తలపెట్టిన సెంట్రల్ విస్టా ప్రాజెక్టుకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జస్టిస్ ఏఎం ఖన్విల్కర్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ అంశంపై మంగళవారం తీర్పు వెల్లడించింది. పర్యావరణ అనుమతులు, ప్రాజెక్టు డిజైన్‌పై కేంద్రం వాదనలతో ధర్మాసనం ఏకీభవించింది. అయితే, నిర్మాణం మొదలుపెట్టే ముందు హెరిటేజ్ కన్జర్వేషన్ కమిటీ అనుమతి తీసుకోవాలని ఆదేశించింది. ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతాల్లో కాలుష్యాన్ని తగ్గించే స్మాగ్‌ టవర్లు ఏర్పాటు చేయాలని సూచించింది   కాగా, దేశ రాజధాని ఢిల్లీలో ఇండియా గేట్ నుంచి రాష్ట్రపతి భవనం వరకు ఉన్న ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు కేంద్ర ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకున్న విష‌యం తెలిసిందే. ఇందులో భాగంగా రూ.20,000 కోట్లతో 'సెంట్ర‌ల్ విస్టా' ప్రాజెక్టును తలపెట్టింది. ఈ ప్రాజెక్ట్ లో భాగంగా ఒక కొత్త త్రిభుజాకారపు పార్లమెంట్ భవనంతో పాటు ఒక కామన్ సెంట్రల్ సెక్రటేరియట్, రాష్ట్రపతి భవనం నుంచి ఇండియా గేట్ వరకు మూడు కిలోమీటర్ల రాజ్‌పథ్‌ను పునరుద్ధరిస్తారు. పార్లమెంట్ భవనంలో ఒక పెద్ద‌ హాల్, ఎంపీల కోసం ఒక లాంజ్, లైబ్రరీ, కమిటీ గదులు, డైనింగ్ హాళ్లు, పార్కింగ్ ప్లేసులు, అన్ని సౌక‌ర్యాలు ఉంటాయి. సెంట్రల్ విస్టా ప్రాజెక్టులో భాగంగా ప్రధానమంత్రి నివాసం సౌత బ్లాక్‌కు, ఉపరాష్ట్రపతి కొత్త నివాసాన్ని నార్త్ బ్లాక్ సమీపంలోకి త‌ర‌లిస్తారు.   ఈ ప్రాజెక్టులో భాగంగా కొత్త పార్లమెంటు భవన నిర్మాణానికి గత  డిసెంబర్ 10న ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు. అయితే, ఈ సెంట్రల్ విస్టా ప్రాజెక్ట్ నిర్మాణాన్ని సవాలు చేస్తూ అనేక పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ ప్రాజెక్టు పలు నిబంధనలను ఉల్లంఘిస్తోందని పిటిషనర్లు ఆరోపించారు. దీనిపై విచారణ జరిపిన సుప్రీం ధర్మాసనం పర్యావరణ అనుమతులు, ప్రాజెక్టు డిజైన్‌పై కేంద్రం వాదనలతో ఏకీభవించింది. సెంట్రల్ విస్టా ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

ఐదు రోజులైనా సీఎం ఏం గడ్డి పీకారు! 

ఆలయాలపై దాడులు , పోలీసుల తీరు, సర్కార్ నిర్లక్ష్యంపై మరోసారి  నిప్పులు చెరిగారు టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. మతమార్పిడులు చేయించే అధికారం సీఎంకు ఎవరిచ్చారని నిలదీశారు. హిందూ-ముస్లిం మనోభావాలు దెబ్బతీస్తున్నారని ఆయన తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. రామతీర్థం పర్యటన చేపట్టడంతో ప్రభుత్వం భయపడి మాపై నిందలు వేస్తోందని, ఘటన జరిగి 5 రోజులైనా పట్టించుకోకుండా ఏం గడ్డి పీకారని చంద్రబాబు ప్రశ్నించారు. రామతీర్థం ఘటన అమానుషమన్న చంద్రబాబు..  మన దేవాలయాలను మనమే కాపాడుకుందామని ఏపీ ప్రజలకు  పిలుపు ఇచ్చారు. హిందూ దేవాలయాలపై జరుగుతున్న దాడులను ఇక ఉపేక్షించేది లేదని చెప్పారు. సీఎం, హోంమంత్రి, డీజీపీ క్రిస్టియన్లు అయినంత మాత్రాన..దేవాలయాలపై జరుగుతున్న దాడులను ఆపరా? అని టీడీపీ అధినేత ప్రశ్నించారు.  తాను సీఎంగా ఉన్నప్పుడు ఏ మసీదు, చర్చిపై దాడి జరగలేదన్నారు చంద్రబాబు.  రామతీర్థం పర్యటనకు అనుమతి ఇచ్చినట్టే ఇచ్చి పోలీసులు అడుగడుగునా అడ్డుతగిలారని మండిపడ్డారు. గ్రామాల్లో పెరుగుతున్న చర్చిలపై హిందువులు ఆలోచన చేయాలని సూచించారు. రాష్ట్రంలో మతమార్పిడులు చేయించడానికి వీళ్లేదన్నారు. కులమతాలకు అతీతంగా ఉంటానని చేసిన ప్రమాణాన్ని సీఎం జగన్ గుర్తించాలన్నారు చంద్రబాబు. పాస్టర్లకు రూ.5 వేలు ఇవ్వడం చట్ట విరుద్ధమన్నారు. రాష్ట్రంలో హిందువులతో పాటు ముస్లింలపైనా దాడులు జరుగుతున్నాయన్నారు. తప్పుడు కేసులు పెట్టే ఏ పోలీస్ అధికారిని వదిలిపెట్టమని చంద్రబాబు మరోసారి హెచ్చరించారు 

టీఆర్ఎస్ కు వరంగల్, ఖమ్మం టెన్షన్ ! ఎన్నికల వాయిదాకు ప్లాన్ ?  

దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నిక, గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్ ఫలితాలతో షాకైన అధికార టీఆర్ఎస్ పార్టీ  ఎన్నికలంటేనే భయపడుతున్నట్లు కనిపిస్తోంది. ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత బాగా ఉండటంతో ఇప్పట్లో ఎన్నికల జోలికి వెళ్లకపోవడమే బెటరని భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే గడువుకన్నా రెండు నెలల ముందే జీహెచ్ఎంసీ ఎన్నికలకు వెళ్లిన టీఆర్ఎస్ సర్కార్... వరంగల్,  ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికలకు మాత్రం ప్లాన్ మార్చినట్లు చెబుతున్నారు. గడువు ముగిసిన తర్వాత కొంతకాలం ప్రత్యేకాధికారుల పాలనలో పెట్టి పరిస్థితులు అనుకూలంగా వచ్చిన తర్వాత ఎన్నికల నిర్వహణపై నిర్ణయం తీసుకోవాలన్న ఆలోచనతో ఉన్నట్లు తెలిసింది.  సోమవారం జరగాల్సిన మంత్రి కేటీఆర్ వరంగల్ పర్యటన వాయిదా పడటంతో కార్పొరేషన్ ఎన్నిక వాయిదా పడటం ఖాయమనే ప్రచారం జోరుగా జరుగుతోంది.  వరంగల్, ఖమ్మం కార్పొరేషన్ల పదవీకాలం మార్చి 14వ తేదీ వరకు ఉంది. పార్టీ అంతర్గతంగా చేయించుకున్న సర్వేలో  ప్రతికూల పరిస్థితి ఉన్నట్లు తేలిందట. గతేడాది వచ్చిన వరదల సమయంలో ప్రభుత్వం బాధితులను పట్టించుకోకపోవడం, జీహెచ్ఎంసీ తరహాలో వారికి ఎలాంటి నష్టపరిహారం చెల్లించకపోవడం లాంటి అంశాలు వరంగల్ లో అధికార పార్టీకి ఇబ్బందిగా మారినట్లు చెబుతున్నారు.  దీంతో తొందరపడి ఎన్నికలకు వెళ్లడం కంటే. ఎన్నికల వాయిదా పద్ధతే ఉత్తమమన్న అభిప్రాయానికి టీఆర్ఎస్ నేతలు వచ్చినట్లు తెలుస్తోంది.  సిద్దిపేట, అచ్చంపేట, కొత్తూరు, జడ్చర్ల, నకిరేకల్ మున్సిపాల్టీల పాలకమండళ్ల గడువు ఐదారు నెలల్లో ముగియనుంది. దీంతో  వాటితో పాటే వరంగల్, ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికలు నిర్వహించాలనే ఆలోచనలో ఉందని చెబుతున్నారు. నాగార్జునసాగర్ అసెంబ్లీ ఉప ఎన్నిక, రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు పూర్తయిన తర్వాత.. ఆ  రెండు ఎన్నికల్లో పార్టీ పరిస్థితిని కాస్త మెరుగుపర్చుకుని ఇప్పటివరకు జరిగిన డ్యామేజీని కాస్త చక్కిదిద్దుకోవచ్చన్నది గులాబీ పార్టీ ఆలోచనగా ఉందంటున్నారు.    గడువు ప్రకారమే ఎన్నికలు వస్తాయన్న ఉద్దేశంతో బీజేపీ ఇప్పటికే క్షేత్రస్థాయిలో ప్రచారం మొదలుపెట్టింది.  ప్రభుత్వ వైఫల్యాలతో పాటు వరదసాయం, ఎల్ఆర్ఎస్ లాంటి అంశాలను ప్రచారం చేస్తోంది. రెండు నెలల ముందస్తు ఎన్నికలకు పోయి జీహెచ్ఎంసీలో చేదు అనుభవాలను చవిచూసినందువల్ల వరంగల్, ఖమ్మం ఎన్నికల్లోనూ అదే తరహా ఫలితాలు వస్తే రాష్ట్రవ్యాప్తంగా గడ్డు పరిస్థితి తలెత్తే ప్రమాదం ఉంటుందన్న అభిప్రాయం ఆ పార్టీ నేతల్లో వ్యక్తమవుతోందట.  వరంగల్, ఖమ్మం ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఇప్పటికే మంత్రి కేటీఆర్ రెండు చోట్ల టెక్స్‌టైల్ పార్కు, ఐటీ పార్కు లాంటి పలు ప్రకటనలు చేశారు. స్వయంగా ఈ రెండు జిల్లాల్లో పర్యటించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా  పాలనను గాడిలో పెట్టడానికి దూకుడు నిర్ణయాలు తీసుకుంటున్నారు. వరంగల్, ఖమ్మం ఎన్నికల్లో సైతం లబ్ధి పొందడానికి కొన్ని హామీలు ఇచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు.   టీఆర్ఎస్ సర్కార్ తీరుతో వరంగల్, ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ల ఎన్నికలు  ఆలస్యమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. గడువు ముగియడానికి మూడు నెలల ముందునుంచే ఎన్నికల సంఘం కసరత్తు మొదలుపెట్టాల్సి ఉంటుంది. కాని  ఇప్పటికింకా అలాంటి ప్రయత్నాలే ప్రారంభం కాలేదు. ఈలోగా కేంద్ర ఎన్నికల సంఘం తుది ఓటర్ల జాబితాను విడుదల చేయడం, దానికి అనుగుణంగా వార్డుల పునర్ వ్యవస్థీకరణ, రిజర్వేషన్ల ఖరారు, పార్టీలతో రాష్ట్ర ఎన్నికల సంఘం సమావేశాలు నిర్వహించడం లాంటివన్నీ జరగాల్సి ఉంది. ఇవేని జరగకపోవడంతో గడువు లోగా  వరంగల్, ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికలు జరగడం కష్టమేననే అభిప్రాయమే అధికార వర్గాల నుంచి వస్తోంది.

నీ పాలనతో రాజారెడ్డి మనవడినని ప్రూవ్ చేసుకుంటున్నావా.. జగన్ పై మండిపడ్డ యువతి 

ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి పరిపాలన తీరుపై ఓ యువతి తీవ్రస్థాయిలో మండిపడింది. "అబ్బబ్బబ్బబ్బా.. ఏం పరిపాలన జగన్మోహన్ రెడ్డి.. నీ పరిపాలనలో పేకాట ఆడినా తప్పులేదు.. ఆడపిల్లలను మానభంగాలు చేసినా, చంపేసినా తప్పులేదు.. నడిరోడ్డుపై పట్టపగలు ఓ మనిషిని నిర్ధాక్షిణ్యంగా చంపేసినా దిక్కూ మొక్కూ ఉండదు.. దేవుడి విగ్రహాలు ధ్వంసం చేసినా తప్పులేదు.. కానీ ప్రభుత్వం చేసిన తప్పులను ఎవరైనా ప్రశ్నించినా.. చిన్న పోస్టు పెట్టినా.. వాళ్లపై కేసులు పెట్టడం, చంపేయడం చేస్తున్నారు. ఏం రాజ్యమిది.. నువ్వు రాజారెడ్డి మనవడినని ఫ్రూవ్ చేస్తున్నావా? పులివెందుల పంచాయితీలు, రాజకీయాలను రాష్ట్రమంతటా పాకించాలని అనుకుంటున్నావా..?. రాజన్న రాజ్యం తీసుకువస్తానన్నావ్. కానీ నీ రాజ్యంలో సాక్షాత్తు రాముడికి కూడా సేఫ్టీ లేదు. ఇక ప్రజలు ఎలా బ్రతకాలి? రాష్ట్రాన్ని, ప్రజలను ఏం చేద్దామని అనుకుంటున్నావ్.. నీవు ఎలా ఉన్నావో.. నీ మంత్రులు కూడా అలాగే ఉన్నారు. నీవు రాజ్యాంగాన్ని గౌరవించి.. పాలించాలి, రాజ్యాంగమంటే నీవు రచించుకున్న రాజారెడ్డి రాజ్యాంగం కాదు జగన్మోహన్ రెడ్డీ.. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం.. అది నువ్వు ఖచ్చితంగా పాటించి తీరాలి. దీనికి ఎవరూ అతీతులు కాదు.. అందులో నీవు మొదటివాడివి.. ఇదొక పరిపాలన అనుకుంటున్నావా? ఎన్ని రోజులు ప్రజలను భయభ్రాంతులకు గురిచేసి, చంపించి, కేసులు పెట్టించి పాలించాలనుకుంటున్నావ్.. దీనిపై తిరుగుబాటు తప్పదు.. ఒక్కసారి తిరుగుబాటు మొదలైతే నీ పతనం మొదలౌతుంది. జాగ్రత్త జగన్మోహన్ రెడ్డీ’’ అంటూ ఆ యువతి మాట్లాడిన వీడియోను పోస్టు చేసింది. తాజాగా ఈ వీడియో విపరీతంగా వైరల్ అవుతోంది.

పేకాట డెన్ తో ఆ మంత్రికి ఊస్టింగేనా ? జగన్ సర్కార్ కు ఆయన గండమేనా?  

గడ్డం గ్యాంగ్ తో గండం వచ్చిందా? కృష్ణా జిల్లా రాజకీయాల్లో మార్పులు జరగబోతున్నాయా? తాడేపల్లికి ఆయన పరుగులెందుకు? ఇదే ఇప్పుడు అమరావతితో పాటు ఆంధ్రప్రదేశ్ లో చర్చగా మారింది. గుడివాడలో  పేకాట డెన్ బయటపడటం తీవ్ర కలకలం రేపింది.  తమ్మిరిస పేకాట శిబిరంపై ఎస్ఈబీ దాడులు చేసి.. 30 మంది పేకాట రాయుళ్లను పట్టుకుంది. 28 కార్లు, భారీగా నగదు సీజ్ చేసింది.  అధికార పార్టీ నేతల కనుసన్నల్లోనే  పేకాట క్లబ్‌ నడుపుతున్నారని.. సాక్షాత్తూ మంత్రి అండ కూడా ఉందనే ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో వైసీపీ సర్కార్ ఇబ్బందుల్లో పడింది. దాడులతో  మంత్రి కొడాలి నాని ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారని తెలుస్తోంది. అయన తన కార్యక్రమాలన్నీ రద్దు చేసుకుని ఉన్నపళంగా వెళ్లి సీఎం జగన్ ను కలిశారు. సీఎం ఆఫీసు నుండి వచ్చిన పిలుపువల్లే మంత్రి హడావుడిగా తాడేపల్లికి పరుగులు పెట్టారంటున్నారు.   కొద్ది రోజుల క్రితం గుడివాడలో జరిగిన బహిరంగ సభలో పేకాట క్లబ్‌లపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీవ్ర విమర్శలు చేశారు."మీరు పేకాట క్లబ్‌లు, సిమెంట్ కంపెనీలు, మీడియా సంస్థలను నడపగా లేనిది.. నేను సినిమాల్లో నటిస్తే తప్పేంటి?" అని మంత్రిని ప్రశ్నించారు. పవన్ ఆ మాటలు అన్న కొన్ని రోజులకే ఇలా పేకాట క్లబ్ పై దాడులు జరగడంతో ఏపీ రాజకీయాల్లో ఈ వ్యవహారం పెను సంచలనంగా మారింది. గుడివాడ పేకాట డెన్ కొడాలి నానీకి పెద్ద తలనొప్పిగా మారిందనే ప్రచారం జరుగుతోంది. పేకాట డెన్  వ్యవహారంపై సీఎం జగన్  సీరియస్ గా ఉన్నారని,  మంత్రి కొడాలిని  క్యాంప్ కార్యాలయానికి పిలిపించి చివాట్లు పెట్టినట్లు చెబుతున్నారు. అంతే కాదు కొడాలి మంత్రి పదవికి ఎసరు వచ్చిందనే చర్చ జరుగుతోంది. పేకాట డెన్ తో ప్రభుత్వం అభాసుపాలైందని భావిస్తున్న జగన్.. కొడాలిని మంత్రి వర్గం నుంచి తొలగించి.. ఆ డ్యామేజీని కంట్రోల్ చేసుకోవాలనే ఆలోచనలో ఉన్నట్లు వైసీపీ వర్గాల సమాచారం.   జగన్ కేబినెట్ లో ఉన్న కొడాలి నాని వ్యవహారం మొదటి నుంచి వైసీపీకి ఇబ్బందిగానే మారిందనే చర్చ ఆ పార్టీలోనే జరుగుతోంది. మంత్రిగా ఉంటూ కూడా వివాదాస్పద వ్యాఖ్యలే చేస్తున్నారు కొడాలి. ముఖ్యంగా టీడీపీ అధినేత చంద్రబాబు, లోకేష్ లపై బూతులు మాట్లాడుతున్నారు. అమ్మ మొగుడు వంటి అన్ పార్లమెంటరీ పదాలు కొడాలి నానికి ఊతపదాలుగా మారిపోయాయి. తన మంత్రి పదవిని కాపాడుకునేందుకే కొడాలి అలా మాట్లాడుతున్నారనే విమర్శలు ఉన్నాయి. కేబినెట్‌లోని 90 శాతం మంత్రుల పదవి కాలం రెండున్నర సంవత్సరాలేనని సర్కార్ ఏర్పాటు చేసిన కొన్ని రోజులపై  జగన్ స్పష్టం చేశారు. దీంతో అయిదు సంవత్సరాలు ఉండే 10శాతం జాబితాలో చోటు కోసం మంత్రులలో పోటీ నెలకొంది. ఇందు కోసం అందరికి భిన్నంగా పనితీరు కంటే.. బూతు సాహిత్యాన్నే కొడాలి అస్త్రంగా ఎంచుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి.    గతంలో నరేంద్ర మోడీ, బీజేపీ నేతలను ఉద్దేశించి మంత్రి నాని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తిరుమలకు సీఎం జగన్ సతీసమేతంగా రావాలని బీజేపీ నేతలు చేసిన వ్యాఖ్యలపై మంత్రి నాని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ముందు ప్రధాని నరేంద్ర మోడీని సతీసమేతంగా రామాలయానికి వెళ్లి భూమి పూజ చేసిన తర్వాత బీజేపీ ఆ మాటలు ఇతరులకు చెబితే బాగుంటుందని చెప్పారు. మోడీని ఉద్దేశించి నాని చేసిన వ్యాఖ్యలను బీజేపీ సీరియస్ గా తీసుకుంది. వైసీపీలోనూ కొంత ఆందోళన కలిగించింది. అందుకే చంద్రబాబుతో పాటు టీడీపీ నేతలను తిట్టినప్పుడు శభాష్ అన్నవాళ్ళు, ప్రధాని మోడీని, ఇతర బీజేపీ నేతలను విమర్శించినప్పుడు మాత్రం కంగారు పడ్డారు.  దీంతో ఆ సమయంలోనే కొడాలిని జగన్ తన కేబినెట్ నుంచి తప్పిస్తారనే ప్రచారం జరిగింది. మంత్రి పదవి ప్రతిష్టని దిగజార్చే విధంగా ఆయన చేస్తున్న వ్యాఖ్యలు విపక్షాలతోపాటు సామాన్య ప్రజలలోనూ తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. కొడాలి బూతులు మాట్లాడుతున్నా సీఎం జగన్ తో పాటు వైసీపీ నేతలెవరు అతన్ని వారించలేదని చెబుతున్నారు. అందుకే అతను మరింతగా రెచ్చిపోయి మాట్లాడుతున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. చివరకి అవే ఆ మంత్రితో పాటు జగన్ సర్కార్ కు గండంగా మారాయంటున్నారు. కొడాలి నానికి సంబంధించి  మరో ప్రచారం కూడా జరుగుతోంది. గుడివాడ నుంచి ఎన్నికైనవారికి మంత్రి పదవి ఇస్తే .. ఆ ప్రభుత్వం పూర్తి కాలం పనిచేయదు అనే సెంటిమెంట్ ఎప్పటినుంచో ఉంది. 1955లో గుడివాడ నుంచి ఎంపికైన వేముల కూర్మయ్యకు ప్రకాశం పంతులు తన కేబినెట్ లో స్ధానం కల్పించారు. కాని ప్రకాశం పంతులు ప్రభుత్వం పూర్తి కాలం పనిచేయలేదు. తరువాత 1983లో గుడివాడ నుంచి గెలిచిన టీడీపీ వ్యవస్ధాపకులు NTR ముఖ్యమంత్రి పదవి చేపట్టారు. అయితే 1984లో నాదేండ్ల భాస్కరరావు కారణంగా ఎన్.టి.ఆర్ కు పదవి గండం ఎదురైంది. అందుకే 1985లో ఎన్.టి.ఆర్. గుడివాడ నుంచి శాసనసభ్యుడుగా గెలిచినా ..సెంటిమెంట్‌ భయంతోనే గుడివాడకు రాజీనామా చేశారని చెబుతారు. 1989లో గుడివాడ నుంచి ఎంపికయిన కఠారి ఈశ్వర్ కుమార్‌కు.. చెన్నారెడ్డి తన కేబినట్‌లో చోటు కల్పించారు. అయితే చెన్నారెడ్డి ప్రభుత్వం కూడా పూర్తికాలం కొనసాగలేదు. వీటన్నిటిని పట్టించుకోకుండా జగన్ గుడివాడ నుంచి ఎంపికయిన కొడాలి నానికి తన కేబినెట్‌లో చోటు కల్పించారు. దీనితో ఇప్పుడు కొడాలి నాని కారణంగా జగన్ సర్కార్‌కు కాలగండం ఏర్పడనుందా అనే చర్చ కూడా ఏపీలో జోరుగా సాగుతుంది.

చలో రామతీర్థం యాత్ర రగడ.. బీజేపీ చీఫ్ సోము వీర్రాజు అరెస్ట్ 

విజయనగరం జిల్లా రామ‌తీర్థంలో కోదండరాముడి విగ్రహం ధ్వంసం నేపథ్యంలో ఇంకా ఉద్రిక్త‌త కొన‌సాగుతోంది. ఈ ఘటనను నిరసిస్తూ బీజేపీ, జనసేన పిలుపునిచ్చిన‌ ధర్మయాత్రను పోలీసులు ఎక్క‌డిక‌క్క‌డ‌ అడ్డుకున్నారు. ఇప్పటికే రెండు పార్టీలకు చెందిన ప‌లువురు నేత‌ల‌ను హౌస్ అరెస్ట్ చేయ‌గా.. రామతీర్థం జంక్ష‌న్‌లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు వాహ‌నాన్ని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు, బీజేపీ కార్యకర్తలకు మధ్య తోపులాట జరగడంతో ఉద్రిక్తత నెలకొంది. చంద్రబాబు, విజయసాయిరెడ్డిని రామతీర్థం గుట్టపైకి అనుమతించిన పోలీసులు తమను ఎందుకు అనుమతించడం లేదని వీర్రాజు ప్రశ్నించారు. ప్రస్తుతం అక్కడ సెక్షన్‌ 30 అమల్లో ఉంద‌ని.. ఎలాంటి ర్యాలీలకు అనుమ‌తి లేద‌ని పోలీసులు ఆయ‌న‌కు చెప్పారు. మరోపక్క ప‌రిస్థితి మ‌రింత ఉద్రిక్తంగా మారే అవ‌కాశం ఉండ‌టంతో.. వీర్రాజు‌తో సహా పలువురు బీజేపీ నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. అనంత‌రం ఆయనను నెల్లిమర్ల పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు.

ప్రచార కమిటి చైర్మెన్ గా పాదయాత్ర! రాహుల్ , రేవంత్ ప్లాన్ ఇదేనా ?

తెలంగాణ కాంగ్రెస్ కమిటి కూర్పు ఎట్టకేలకు కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. నెలరోజుల మంత్రాంగం తర్వాత టీపీసీసీ పగ్గాలపై కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయం తీసుకుంది. అయితే కొన్ని రోజులుగా జరుగుతున్న ప్రచారానికి భిన్నంగా ఎవరూ ఊహించని ట్విస్ట్ టీపీసీసీ ఎంపికలో కనిపిస్తోంది. ఎంపీలు రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిలలో ఎవరో ఒకరికి పీసీసీ పగ్గాలు ఇస్తారని భావించినా.. హైకమాండ్ మాత్రం ఎమ్మెల్సీ, మాజీ మంత్రి టీ జీవన్ రెడ్డిని పీసీసీ చీఫ్ గా ఖరారు చేశారని తెలుస్తోంది.  పీసీసీ చీఫ్ ఖాయమనుకున్న రేవంత్ రెడ్డిని ప్రచార కమిటీ చైర్మన్‌గా , రేసులో నిలిచిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని వర్కింగ్ ప్రెసిడెంట్‌గా,  సీఎల్పీ నేతగా దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, సమన్వయ కమిటీ చైర్మన్‌గా మల్లు భట్టి విక్రమార్కను నియమించారని సమాచారం. పీసీసీ పగ్గాల కోసం తీవ్ర పోటీ ఉండటం, నేతల మధ్య ఏకాభిప్రాయం రాకపోవడంతో మధ్యే మార్గంగా అందరికీ ఆమోదయోగ్యంగా ఉండేలా జీవన్ రెడ్డి ఎంపిక చేశారని భావిస్తున్నారు.    టీపీసీసీ కూర్పు వెనక హైకమాండ్ భారీ వ్యూహమే ఉన్నట్లు తెలుస్తోంది. రేవంత్ రెడ్డి డైరెక్షన్ లోనే ఇదంతా జరిగిందనే చర్చ జరుగుతోంది. పీసీసీ చీఫ్ పదవి కోసం రేవంత్ రెడ్డి ప్రయత్నించినా..  సొంత పార్టీ నేతలే తనను వ్యతిరేకించడంతో  ఒక దశలో ఆయన అసంతృప్తి లోనయ్యారని చెబుతున్నారు. అయితే రేవంత్ రెడ్డిని తమ తురుపు ముక్కగా భావిస్తున్న మరో ఐడియా వేసిందని చెబుతున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉన్నందున... కొన్ని రోజుల వరకు జీవన్ రెడ్డిని పీసీసీగా కొనసాగించి.. అసెంబ్లీ ఎన్నికలకు ముందు రేవంత్ రెడ్డికి అ బాధ్యత అప్పగించాలని నిర్ణయించిందని తెలుస్తోంది. పీసీసీ పదవి వస్తే తెలంగాణ వ్యాప్తంగా పాదయాత్ర చేస్తానని గతంలో రేవంత్ ప్రకటించారు. ఇప్పుడు ప్రచార కమిటి చైర్మెన్ గా రేవంత్ రెడ్డితో పాదయాత్ర చేయించే యోచనలో హైకమాండ్ ఉందట. వయసు రిత్యా ఎలాగూ జీవన్ రెడ్డి పాదయాత్ర చేయలేరు కాబట్టి.. రేవంత్ కు ఇక్కడ వచ్చిన ఇబ్బందేమి ఉండదు.    తెలంగాణ మొత్తం రేవంత్ రెడ్డి పాదయాత్ర ముగిసే సరికి .. అసెంబ్లీ ఎన్నికల సమయం దగ్గర పడుతుంది. ఆ సమయంలో రేవంత్ రెడ్డికి పీసీసీ పగ్గాలు ఇచ్చి... ఆయనే ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎన్నికలు ఎదుర్కొవాలనే ఆలోచనతోనే హైకమాండ్ తాజా పీసీసీ కూర్పు చేసిందనే చర్చ గాంధీభవన్ లోనే జరుగుతోంది. అందుకే రేవంత్ రెడ్డి తనంతట తానుగా జీవన్‌రెడ్డి పేరును పరిగణనలోకి తీసుకోవాలని అధిష్ఠానానికి ప్రతిపాదించారని సమాచారం.  పీసీసీ రేసులో నిలిచిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి వర్కింగ్ ప్రెసిడెంట్ , శ్రీధర్ బాబుకు సీఎల్పీ, మల్లు భట్టి విక్రమార్కకు సమన్వయ కమిటి చైర్మెన్ పదవులు ఇచ్చినందున ఎవరిలోనూ నిరాశ ఉండదని కాంగ్రెస్ హైకమాండ్ భావిస్తుందట.   రేవంత్ రెడ్డికి ప్రచార కమిటి చైర్మెన్ పదవి ఇవ్వడానికి మరో లాజిక్ కూడా కనిపిస్తోంది. నరేంద్ర మోడీ ప్రధాని కాక ముందు.. అంటే 2014 పార్లమెంట్ ఎన్నికలకు ముందు బీజేపీ ప్రచార కమిటి చైర్మెన్ గా పని చేశారు. ఆ పదవితోనే ఆయన దేశ మంతా తిరిగి ఎన్నికల ప్రచారం చేశారు. 2014 ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించడంతో.. ప్రచార కమిటి చైర్మెన్ గా పార్టీ బలోపేతానికి పాటుపడిన నరేంద్ర మోడీకే ప్రధానమంత్రి పదవి వరించింది. రేవంత్ కూడా అదే రూట్ ఎంచుకున్నట్లు కనిపిస్తోంది. పార్టీ ప్రచార కమిటీ చైర్మెన్ గా రాష్ట్ర మంతా పాదయాత్ర చేసి.. ప్రస్తుతం నిరాశలో ఉన్న కాంగ్రెస్ కేడర్ లో జోష్ తేవాలని రేవంత్ ఆలోచన. రేవంత్ ఈ ఆలోచనకు హైకమాండ్ కూడా గ్రీన్ సిగ్నల్  ఇచ్చిందని తెలుస్తోంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిస్తే.. పాదయాత్రతో పార్టీకి పూర్వ వైభవం తెచ్చిన రేవంత్ రెడ్డికే ముఖ్యమంత్రి పదవి ఖాయమని అతని అనుచరులు కూడా  చెబుతున్నారు.      అందుకే ప్రచారకమిటీ చైర్మన్ అంటేనే  తనకు చాలా ఇష్టమని చెప్పారు రేవంత్ రెడ్డి.  ఆ పదవి ఇస్తే రాష్ట్రం మొత్తం  పాదయాత్ర చేస్తూ ప్రచారం  చేస్తానంటున్నారు. రాష్ట్రానికి , దేశానికి ప్రచార కమిటీ చైర్మన్ చాలా కీలకమైన పదవులన్న రేవంత్ రెడ్డి.. పీసీసీ పదవి కార్యక్రమాల రూపకల్పన,సమన్వయ చేసేందుకు మాత్రమే పని కొస్తుందన్నారు. రాష్ట్ర మొత్తం తిరగాలంటే ప్రచారకమిటీ చైర్మన్ పదవే కీలకమన్నారు. పీసీసీ పదవి ఎవరికి వచ్చిన సంతోశషంగా అందరితో కలిసి పనిచేస్తానని రేవంత్ క్లారిటీ ఇచ్చారు. టీఆర్ఎస్, బీజేపీ ఉమ్మడి శత్రువు కాంగ్రెస్ అన్నారు. కేసీఆర్ తను తీసుకున్న గోతిలో ఆయనే పడి కొట్టుకుంటున్నారని చెప్పారు. కాంగ్రెస్ ను నాశనం చేద్దామని గోయి తవితే ఆ గోయిలోనే కేసీఆర్ పడిపోయాడరన్నారు రేవంత్ రెడ్డి. బీజేపీ, టీఆర్ఎస్ బొమ్మ బోరుసులాంటివని.. ఆ రెండు పార్టీలను ఓడించడమే తమ లక్ష్యమంటున్నారు రేవంత్ రెడ్డి.

రిపీటైన శుభలగ్నం సీన్.. భర్తను 15 కోట్లకు అమ్మిన భార్య

దాదాపు 25 ఏళ్ల క్రితం ఎస్వీ కృష్ణారెడ్డి డైరెక్షన్ లో జగపతిబాబు, ఆమని, రోజా జంటగా నటించిన సూపర్ హిట్ మూవీ "శుభలగ్నం" మీకు గుర్తుండే ఉంటుంది. ఆ మూవీలో హీరోయిన్ ఆమని డబ్బు ఆశతో తన భర్తను కోటి రూపాయలకు మరో యువతికి అమ్మేస్తుంది. అప్పట్లో ఈ సినిమాపై మహిళలలో విపరీతమైన చర్చ జరిగింది. తాజాగా ఇలాంటి ఘటనే ఒకటి చోటు చేసుకుంది. మధ్యప్రదేశ్ లోని భోపాల్ లో జరిగిన ఈ ఘటనలో ఒక మహిళ తన భర్తను రూ.15 కోట్లకు ఆయనను ప్రేమించిన ప్రియురాలికి అమ్మేసింది. ఈ రియల్ లైఫ్ శుభలగ్నం స్టోరీ, తాజాగా మధ్యప్రదేశ్ లో వైరల్ అయింది.   ఈ ఘటన పూర్తి వివరాల్లోకి వెళితే.. భోపాల్ ఫ్యామిలీ కోర్టుకు ఈమధ్య ఒక కేసు వచ్చింది. ఒక బాలిక తన తండ్రి అతని ఆఫీసులో పనిచేసే ఒక మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకుని, తన అమ్మతో తరచూ గొడవ పడుతున్నాడని ఫిర్యాదు చేసింది. దీంతో ఇంట్లో ప్రశాంతత కరువైందని.. ఈ కారణంగా తాను, తన చెల్లెలు చదువు మీద ధ్యాస పెట్టలేకపోతున్నామని ఆ ఫిర్యాదులో తెలిపింది. దీంతో ఆ బాలిక తల్లిదండ్రులను ఫ్యామిలీ కౌన్సెలింగ్ సెంటర్‌కు పిలిపించగా.. ఆ బాలిక ఫిర్యాదు నిజమేనని వెల్లడైంది. అంతేకాకుండా అతను ఆ ప్రియురాలితోనే ఉండాలనుకుంటున్నట్లుగా స్పష్టం చేశాడు. అయితే దీనికి అతని భార్య ఒప్పుకోలేదు.   అయితే ఈ సమస్య పరిష్కారం కోసం అధికారులు ఆ దంపతులకు పలు మార్లు కౌన్సెలింగ్ నిర్వహించారు. దీంతో చివరకు ఈ సమస్యకు పరిష్కారం దొరికింది. అతని భార్య ఒక షరతుపై తన భర్తకు విడాకులు ఇచ్చేందుకు ఒప్పుకుంది. తాను భర్తను ఆమెకు అప్పగించాలంటే తనకు ఒక ఖరీదైన ఫ్లాట్‌తో పాటు పెద్ద మొత్తంలో నగదు ఇవ్వాలని డిమాండ్ చేసింది. అప్పుడే తన భర్తను ఆమెకు అప్పగిస్తారని స్పష్టం చేసింది. ఈ షరతుకు భర్త ప్రియురాలు ఒప్పుకోవడంతో ఈ సమస్యకు పరిష్కారం దొరికింది. ఈ సందర్భంగా అతని భార్య మాట్లాడుతూ పెళ్లయి ఇన్నేళ్లు గడచిన తరువాత తన భర్త ఇలా ప్రవర్తించడం తనకు ఏమాత్రం నచ్చలేదని.. అయితే తన పిల్లల భవిష్యత్ దృష్ట్యా డబ్బులు తీసుకోవాల్సి వచ్చిందని ఆమె తెలిపారు.

టీపీసీసీ చీఫ్ గా చివరి నిమిషంలో జీవన్ రెడ్డి..?

టీపీసీసీకి కొత్త అధ్యక్షుడు ఎవరన్న విషయంపై ఇంకా ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. కాబోయే పీసీసీ చీఫ్‌ ఎంపీ రేవంత్‌రెడ్డి అంటూ కొంతకాలంగా వార్తలు వచ్చినప్పటికీ.. అనూహ్యంగా సీనియర్‌ నేత, ఎమ్మెల్సీ టి.జీవన్‌రెడ్డి పేరు ప్రచారంలోకి వచ్చింది. అయితే ఈ విషయంలో తనకు ఎటువంటి సమాచారం లేదని జీవన్‌రెడ్డి చెపుతున్నారు. అయితే రేవంత్‌రెడ్డిని పీసీసీ చీఫ్‌గా పార్టీలోని మెజారిటీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మరీ ముఖ్యంగా కొందరు సీనియర్లు అంగీకరించడం లేదని తెలుస్తోంది.   మరోపక్క ప్రజాకర్షణ, కార్యకర్తల మద్దతు మాత్రం రేవంత్‌రెడ్డికే ఎక్కువగా ఉంది. ఈ నేపథ్యంలో మధ్యేమార్గంగా జీవన్‌రెడ్డిని పీసీసీ చీఫ్‌గా, రేవంత్‌ను ప్రచార కమిటీ చైర్మన్‌గా నియమించే ఆలోచనలో పార్టీ అధిష్ఠానం ఉందన్న ప్రచారం జరుగుతోంది. అయితే దీనిని ముఖ్యనేతలెవరూ ధ్రువీకరించడంలేదు. అలా అని ఖండించడమూ లేదు. దీంతో జీవన్‌రెడ్డి అధ్యక్షుడయ్యేందుకు 50-50 అవకాశాలున్నాయని పార్టీ వర్గాలు చెబుతున్నారు. ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఈరోజు ఉదయం 11 గంటలకు ఈ అంశాన్ని పరిశీలించనున్నట్లుగా తెలుస్తోంది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, జీవన్‌రెడ్డి, డి.శ్రీధర్‌బాబు, దామోదర రాజనర్సింహ, మధుయాష్కి గౌడ్‌ తదితర నేతల పేర్లను ఆమె పరిశీలించి.. ఎవరెవరికి ఏ బాధ్యతలు అప్పగించాలో నిర్ణయించనున్నట్లు సమాచారం.    

వారంతా క్రైస్తవులే... అందుకే హిందూ దేవాలయాలపై దాడులు: కాల్వ ఫైర్ 

ఏపీలో హిందూ ఆలయాలపై వరుసగా జరుగుతున్న దాడులపై టీడీపీ నేత కాల్వ శ్రీనివాసులు నిప్పులు చెరిగారు. ఏపీ సీఎం వైఎస్ జగన్, హోంమంత్రి మేకతోటి సుచరిత, డీజీపీ గౌతమ్ సవాంగ్ ముగ్గురూ క్రైస్తవులేనని.. మరి అటువంటి పరిస్థితుల్లో హిందూ మతం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం మరింత జాగ్రత్తగా వ్యవహరించాలని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు కాల్వ శ్రీనివాస్ పేర్కొన్నారు. అయితే జగన్ ప్రభుత్వం ఈ తరహాలో వ్యవహరించడం లేదని విమర్శించారు.   "మంత్రి కొడాలి నాని దేవాలయాలపై జరుగుతున్న దాడులపై చేస్తున్న వ్యాఖ్యలను సీఎం జగన్ ఎందుకు ఖండించ లేదు. రాష్ట్ర ప్రభుత్వం యొక్క విశృంఖలత్వం తాజాగా రాముని శిరచ్ఛేధనం వరకు తెచ్చింది. దీంతో ఏపీలో ఆందోళనకరమైన వాతావరణం నెలకొంది. జగన్ తన నిర్వాకంతో మెజార్టీ ప్రజల మనోభావాలను దారుణంగా దెబ్బ తీస్తున్నారు." అంటూ కాల్వ తీవ్ర విమర్శలు చేసారు.   "ప్రస్తుతం ఏపీలో దేవుడికే రక్షణ లేని అనాగరిక సమాజాన్ని స్థాపించేందుకే సీఎం జగన్ ప్రయత్నం చేస్తున్నారు. రాముడు తల తీసేయడం ఒక అనాగరికమైన, ఆటవిక చర్య. వరుసగా జరుగుతున్న ఈ దుర్ఘటనల వెనుక ఎవరున్నారో తేలాలి. బ్రిటీష్ జమానాలో కూడా హిందూ దేవాలయాలపై ఈ స్థాయిలో దాడులు జరగలేదు. ఏ వర్గం మనోభావాలైనా దెబ్బతింటే.. ఆ వర్గం పక్షాన టీడీపీ నిలబడి పోరాడుతుంది. అయినా చంద్రబాబు రామతీర్ధం వెళ్లే దాకా ప్రభుత్వం ఏం గాడిదలు కాస్తోంది.. ఎక్కడ గడ్డి పీకుతోంది. చంద్రబాబు పర్మిషన్ తీసుకుని వెళ్లినరోజే.. విజయసాయి ఎందుకెళ్లారు..." అని జగన్ ప్రభుత్వంపై కాల్వ మండి పడ్డారు.   చంద్రబాబును రామతీర్ధం వెళ్లకుండా ప్రభుత్వం అడుగడుగునా అడ్డుకోవడంతో.. ఆయనను ప్రజలే వెంట బెట్టుకు తీసుకెళ్లారు. మరోపక్క రామతీర్ధం నుంచి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని విజయసాయి రెడ్డి విశాఖ వెళ్లారు. అయినా విజయసాయిపై దాడితో టీడీపీకి, చంద్రబాబుకేం సంబంధం. హిందూ ఆలయాల రక్షణలో ప్రభుత్వం ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా ఉంది..? అసలు హిందూ ధర్మంపై దాడి చేసే అధికారం సీఎం జగన్ కు ఎవరిచ్చారు..?" అని కాల్వ శ్రీనివాసులు నిలదీశారు.   అసలు "సీఎం, హోంమంత్రి, డీజీపీల పర్యవేక్షణలోనే దేవాలయాలపై దాడులు జరుగుతున్నాయని రాష్ట్రంలో ప్రచారం ఉంది. హిందూ ధర్మంపై ప్రభుత్వమే దాడులు జరుపుతోంటే ఇక ఎవరికి చెప్పాలి..? ఒకపక్క ఉత్తరాదిలోని అయోధ్యలో రాముని గుడి నిర్మిస్తోంటే.. ఇక్కడ ఏపీలో రాముని తల తీసేశారు. ఏపీలోని దేవాలయాలపై జరుగుతున్న వరుస దాడుల విషయంలో సీబీఐ తో విచారణ జరిపించాలి. ఈ మొత్తం వ్యవహారంపై కేంద్రం తక్షణం సీబీఐ విచారణకు ఆదేశించాలి" అని అయన డిమాండ్ చేశారు.

సోము భజన.. సంజయ్ గర్జన! ఏపీ బీజేపీ పరువు గోవిందా! 

ఆంధ్రప్రదేశ్ బీజేపీ నేతల పరువు తీస్తూ నాయకుడంటే ఎలా ఉండాలో చూపించారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్. అధికార పార్టీకి తొత్తులుగా కాదు.. సర్కార్ వైఫల్యాలు, అరాచకాలపై ఉద్యమించాలనే సంకేతమిచ్చారు. ఏపీలో హిందూ దేవాలయాలపై వరుసగా దాడులు జరుగుతున్నా.. పోరాటం చేయలేని ఏపీ బీజేపీ నేతల దుస్థితిని పరోక్షంగా ఎండగడుతూ.. ఎలా ముందుకు వెళ్లాలో చూపించారు బండి సంజయ్. జగన్  ప్రభుత్వంపై ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఏపీలో ఒక మతం రాజ్యమేలుతోందని మండిపడ్డారు.  దేవాలయాలపై వరుసగా జరుగుతున్న దాడులకు ముఖ్యమంత్రి జగన్ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఇంత జరుగుతున్నా జగన్ స్పందించకపోవడం ఆయన దిగజారుడు తనానికి నిదర్శనమన్నారు సంజయ్. ఏపీలో వైసీపీ ప్రభుత్వం మూటాముల్లె సర్దుకునేలా తరిమికొడతామని హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడినైన తాను... ఏపీలో జరుగుతున్న దారుణాలపై బాధతోనే మాట్లాడుతున్నానంటూ.. ఏపీ బీజేపీ నేతల చేతగాని తనాన్ని చెప్పకనే చెప్పారు బండి సంజయ్.   హిందూ ధర్మాన్ని నాశనం చేసే విధంగా ఏపీ ప్రభుత్వం చేస్తున్న పనులకు వ్యతిరేకంగా ఉద్యమిస్తామని చెప్పారు సంజయ్. రెండు కొండలవాడా గోవిందా గోవిందా అనే వైసీపీకి ఓటు వేస్తారా? లేక ఏడు కొండలవాడా గోవిందా గోవిందా అనే బీజేపీకి ఓటువేస్తారా? అనే విషయాన్ని ఏపీలోని హిందువులందరూ ఆలోచించాలని అన్నారు. బైబిల్ పార్టీ కావాలో, భగవద్గీత పార్టీ కావాలో ఏపీ ప్రజలు తేల్చుకోవాలని చెప్పారు. ఏడు కొండలను రెండు కొండలు చేయాలనుకున్న పార్టీ ఇప్పుడు ఏపీలో రాజ్యాధికారాన్ని చెలాయిస్తోందని మండిపడ్డారు. ఏపీ ప్రజలు చాలా తెలివైనవారని... అధికార పార్టీకి బుద్ధి చెపుతారని అన్నారు. ఏపీ బీజేపీ నేతలు, కార్యకర్తల సహనాన్ని చేతకానితనంగా భావించవద్దన్నారు బండి సంజయ్.  తెలంగాణ బీజేపీ కార్యకర్తల కంటే ఏపీ బీజేపీ కార్యకర్తలు బలవంతులని, దమ్మున్నవారని చెబుతూ.. జగన్ సర్కార్ ఉద్యమించడానికి ఓ రకంగా వారికి ధైర్యం కల్పించే ప్రయత్నం చేశారు  బండి సంజయ్.  ఆంధ్రప్రదేశ్ లో  జగన్ రెడ్డి పాలన వచ్చాకా  హిందూ ఆలయాలపై వరుసగా దాడులు జరుగుతున్నాయి. ఇప్పటికే 150కి పైగా దేవాలయాలపై దాడులు జరిగాయి. పలు ఆలయాల్లో దేవుళ్ల విగ్రహాలను దుండగులు ధ్వంసం చేశారు. అంతర్వేది రథం దగ్ధం, కనకదుర్గ అమ్మవారి వెండి రథం సింహాలు మాయమయ్యాయి. విజయనగరం జిల్లాలోని ప్రసిద్ధ ఆలయం రామతీర్థం  కోదండరామాలయంలోని రాముడి విగ్రహాన్ని రెండు ముక్కలు చేశారు దుండగులు.  ఆలయాలపై దాడులు జరుగుతున్నా హిందుత్వ పార్టీగా చెప్పుకునే బీజేపీ నేతలు సీరియస్ గా స్పందించ లేదు. ఎక్కడో పాకిస్థాన్ లోని హిందూ దేవాలయంపై దాడి జరిగితే ఆవేశంగా స్పందించే ఏపీ బీజేపీ నేతలు.. సొంత రాష్ట్రంలో దారుణ ఘటనలు జరుగుతున్నా తమ జగన్ భక్తినే చాటుకున్నారు. ఎవరికి అనుమానం రాకుండే ఉండేందుకన్నట్లు.. ఆలయాలపై దాడులను ఖండిస్తున్నట్లు పేపర్ స్టేట్ మెంట్లు ఇచ్చి చేతులు దులుపుకున్నారు.      రామతీర్థంలో రాములోరి తల నరికినా.. నిత్యం  జై శ్రీరామ్ నినాదాలు చేసే ఏపీ కమలనాధులు ఏపీ సర్కార్ ను గట్టిగా నిలదీయలేదు. టీడీపీ చంద్రబాబు నాయుడు రామతీర్థం పర్యటనతో మేల్కొని కొంత హడావుడి చేశారు. అక్కడ కూడా తమ రాజకీయ కుట్రను బయటపెట్టుకున్నారు ఏపీ బీజేపీ నేతలు. రాముడి విగ్రహం ధ్వంసం ఘటనకు సంబంధించి జగన్ సర్కార్ పై ఆరోపణలు చేయకుండా  అధికార ప్రతినిధి విష్ణువర్ధన్ రెడ్డి ఎప్పటిలానే చంద్రబాబుపై పడ్డారు. రామతీర్థం ఘటనపై మాట్లాడకుండా.. టీడీపీలో హయాంలో కూల్చేసిన గుడుల గురించి ప్రస్తావించి తన జగన్ భక్తి చాటుకున్నారు. కేంద్రం నిర్మించిన కనకదుర్గ ఫ్లై ఓవర్ నిర్మాణం కోసం అడ్డుగా ఉన్న గుడులను తొలగించారని తెలిసినా.. అవే పసలేని ఆరోపణలు చేశారు విష్ణువర్దన్ రెడ్డి. జగన్ సర్కార్ కు ఇబ్బంది కాకుండా, చంద్రబాబును టార్గెట్ చేస్తూ ఇష్యూ డైవర్ట్ చేయడానికి విష్ణువర్ధన్ రెడ్డి ప్రయత్నిస్తున్నారనే ఆరోపణలు సొంత పార్టీ కేడర్ నుంచే వస్తున్నాయంటే ఏపీ బీజేపీ నేతల తీరు ఎలా ఉందో ఊహించవచ్చు.  ఏపీలో ఆలయాలపై జరుగుతున్న దాడులపై సంజయ్ చేసిన వ్యాఖ్యలపై ఏపీ బీజేపీలో ఆసక్తికర చర్చ జరుగుతోంది. మన నేతలు చేయలేని పనిని తెలంగాణ అధ్యక్షుడు చేశారని కమలం కార్యకర్తలు చెప్పుకుంటున్నారు. పార్టీ బలోపేతం కావాలంటే సంజయ్ లాగా దూకుడుగా ఉండాలి .. కాని అధికార పార్టీ తొత్తుగా వ్యవహరిస్తే సాధ్యం కాదని చెబుతున్నారు. సోము వీర్రాజు, విష్ణువర్ధన్ రెడ్డి లాంటి నేతల వల్లే ఏపీలో బీజేపీ నాశనం అవుతుందని కార్యకర్తలు ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికైనా జగన్ రెడ్డి భజన వీడి వైసీపీ కోసం కాకుండా పార్టీ కోసం బండి సంజయ్ లాగా పని చేస్తేనే ఏపీలో బీజేపీ బలోపేతం అవుతుందని చెబుతున్నారు. మొత్తానికి జగన్ రెడ్డి సర్కార్ పై బండి సంజయ్ చేసిన కామెంట్లు ఇప్పుడు ఏపీలో హాట్ హాట్ గా మారాయి. ఏపీ బీజేపీ కార్యకర్తలంతా బండికి ఫిదా అయిపోయారని తెలుస్తోంది. అదే సమయంలో సంజయ్ వ్యాఖ్యలతో తమ చేతకానితనం బయటపడిందని సోము వీర్రాజు టీమ్ వర్రీ అవుతోందని తెలుస్తోంది. 

'జాక్ మా' కనబడుటలేదు.. ఏమైపోయాడు?

చైనా కుబేరుడు, అలీ బాబా సంస్థ సహ వ్యవస్థాపకుడు జాక్ మా గత రెండు నెలలుగా కనిపించడంలేదు. ఆయన ఆస్తుల విలువ కూడా పడిపోయింది. కొన్ని నెలల కిందట 61 బిలియన్ డాలర్లుగా ఉన్న ఆయన సంపద ఇప్పుడు 50 బిలియన్ డాలర్లకు పడిపోయింది. దీనంతటికీ ఆయన మాట్లాడిన ఒక్క మాటే కారణం. ఆ ఒక్క మాట ఆయన జీవితాన్నే మార్చేసింది.    గత అక్టోబరులో చైనా ప్రభుత్వ ఆర్థిక విధానాలు, బ్యాంక్ రెగ్యులేటరీలపై జాక్ మా చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి. చైనా బ్యాంకులు తాకట్టు దుకాణాల తరహాలో వ్యవహరిస్తున్నాయని, విస్తృత స్థాయిలో ఆలోచించడం అలవర్చుకోవాలని వ్యాఖ్యానించారు. దీంతో జాక్‌ మాపై ఆగ్రహించిన చైనా ప్రభుత్వం ఆయనను టార్గెట్ చేసింది. ఆయన సంస్థలు, ఆర్థిక కార్యకలాపాలపై నిఘా వేసింది. వ్యాపారాలపై విచారణకు ఆదేశించింది. జాక్ మా ఎదిగేందుకు ఉపకరించే చర్యలను అడ్డుకుంది.    చైనా ప్రభుత్వం కన్నెర్ర చేయడంతో జాక్ మాకు గడ్డుకాలం మొదలైంది. ఆయన ఆస్తులు హరించుకుపోతున్నాయి. రెండు నెలల్లోనే 11 బిలియన్ డాలర్లు నష్టపోయారు. అంతేకాదు, రెండు నెలలుగా ఆసలు ఆయన ఎక్కడున్నారో కూడా తెలియడంలేదు. నిజానికి జాక్ మా స్వయంగా నిర్వహించే 'ఆఫ్రికాస్ బిజినెస్ హీరోస్' అనే టాలెంట్ షోలో ఆయన పాల్గొనాల్సి ఉంది. కానీ ఆయన ఆ షోకు కూడా రాలేదు. ఆయన తరపున ఆలీబాబా ఎగ్జిక్యూటివ్ ఒకరు పాల్గొన్నారు. జాక్ మా షెడ్యూల్ బిజీగా ఉన్నందునే రాలేకపోయారంటూ ఆ ఎగ్జిక్యూటివ్ చెప్పారు. కానీ దీనిపై అనేక అనుమానాలు రేగుతున్నాయి. జాక్ మా అదృశ్యం ఇప్పుడు ప్రపంచ దేశాల్లో హాట్ టాపిక్ గా మారింది.

నా అనుచరులు పేకాటలో ఉంటే ఏంటీ? గడ్డం గ్యాంగ్ పై కొడాలి రియాక్షన్ 

మంత్రి కొడాలి నాని సొంత నియోజకవర్గం గుడివాడలో పేకాట రాయుళ్ల అరెస్ట్ ఏపీలో ప్రకంపనలు రేపుతోంది. మంత్రి అండదండలతోనే గుడివాడలో పేకాట క్లబ్లులు నడుస్తున్నాయనే ఆరోపణలు వస్తున్నాయి. అయితే గుడివాడ గడ్డం గ్యాంగ్ అరెస్ట్ పై స్పందించిన మంత్రి కొడాలి నాని..  అదో చిన్న విషయంగా  చిత్రీకరించే ప్రయత్నం చేయడం మరింత వివాదమవుతోంది. గుడివాడ ఘటనపై మాట్లాడిన కొడాలి నాని.. పేకాట ఆడిన వారిలో తన  అనుచరులు  ఉంటే ఏమవుతుందని ఎదురు ప్రశ్నించారు. పేకాట ఆడుతూ దొరికిపోయిన వాళ్లలో తన అనుచరులు ఉన్నా, తన తమ్ముడే ఉన్నా ఇబ్బందేమీలేదని, వాళ్లకేమైనా ఉరిశిక్ష వేస్తారా? అంటూ లైట్ తీసుకున్నారు. పట్టుకుంటే జరిమానా కట్టించుకుని వదిలేస్తుంటారు కాబట్టే హద్దు అదుపు లేకుండా పేకాట ఆడుకుంటుంటారని మంత్రి కొడాలి  వివరించారు. తన ఇలాకాలో పేకాట క్లబ్బులు నడుస్తున్నాయని, తానే వాటి వెనకుండి నడిపిస్తున్నానని ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకవేళ తానే పేకాట క్లబ్బులు నడిపిస్తున్నట్టయితే పోలీసులు దాడులు చేయగలరా? అని కొడాలి నాని ప్రశ్నించారు. టీడీపీ నేతలు ఆరోపిస్తున్నట్టుగా పేకాట ఆడేవాళ్లకు పార్టీలు ఉంటాయా ? అని అన్నారు.  గుడివాడలో పేకాట క్లబ్బులపై మీడియాలో వచ్చిన కథనాలతో మంత్రి కొడాలి నాని ఉలిక్కిపడ్డారని తెలుస్తోంది. దీంతో అయన తన కార్యక్రమాలన్నీ రద్దు చేసుకుని ఉన్నపళంగా తాడేపల్లికి వచ్చి సీఎం జగన్ ను కలిశారు.  సీఎం ఆఫీసు నుండి వచ్చిన పిలుపో.. లేక ఈ మొత్తం ఘటన పై వివరణ ఇచ్చుకునేందుకు ఆయనే వెళ్లారో తెలియలేదు కానీ  హఠాత్తుగా మంత్రి నాని సీఎం ఇంటికి వెళ్ళడం మాత్రం  పెద్ద చర్చకు దారి తీసింది. అయితే పేకాట రాయుళ్ల కోసం తాను సీఎం జగన్ వద్దకు పరిగెత్తుకు రావాల్సిన అవసరంలేదని చెప్పారు కొడాలి నాని.  తాను సీఎం వద్దకు వచ్చానంటే అది పాలనకు సంబంధించిన విషయాల కోసమేనని తెలిపారు. గుడివాడ నుంచి కంకిపాడు వెళ్లే రోడ్డు, వయా మానికొండ మీదుగా వెళ్లే రోడ్డుకు సంబంధించిన పనులను ఎన్డీబీ రెండో ఫేజ్ లో చేర్చాల్సిందిగా విజ్ఞప్తి చేయడానికి సీఎంను కలిశానని వివరణ ఇచ్చారు. తనకు ఓట్లు వేసి గెలిపించిన గుడివాడ ప్రజల కోసం తాను సీఎ జగన్ ను కలిశానే తప్ప పేకాటరాయుళ్ల కోసం రావాల్సిన అగత్యం తనకు పట్టలేదని అన్నారు. అలాంటి చిల్లర పనులు చేసేది చంద్రబాబు, దేవినేని ఉమ అని విమర్శించారు.   మంత్రి కొడాలి నాని వ్యాఖ్యలపై విపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. పేకాట ఆడుతూ తన అనుచరులు అడ్డంగా దొరికినా మంత్రి ఇంకా బుకాయిస్తున్నారని మండిపడుతున్నాయి. పేకాట ఆడితే తప్పేంటని మాట్లాడుతున్న కొడాలి.. గడ్డం గ్యాంగ్ కు సపోర్ట్ చేస్తున్నారా అని ప్రజా సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. పేకాడుతూ దొరికిన నిందితులను కఠినంగా శిక్షించాలని కోరడం పోయి..  దొరికితే  ఏమవుతుంది.. వాళ్లకేమైనా ఉరి శిక్ష వేస్తారా అంటూ మంత్రి మాట్లాడటం దారుణమంటున్నారు జనాలు. అక్రమంగా పేకాట క్లబ్బులు నిర్వహిస్తున్న కొడాలి నానిని కేబినెట్ నుంచి వెంటనే బర్తరఫ్ చేయాలని టీడీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఇంతకాలం లేనిది గుడివాడ నియోజకవర్గ సమస్యలు ముఖ్యమంత్రికి చెప్పడానికి మంత్రి గారికి ఇప్పుడే కనిపించినట్లున్నాయని తమ్ముళ్లు సెటైర్లు వేస్తున్నారు. 

మూషికం మనసు గెలిచిన విజయవాడ పోలీసులు!!

కరోనా మహమ్మారి మూలంగా గత కొద్దినెలలుగా ప్రజలు పండుగలు సరిగా జరుపుకోలేకపోయారు. వాటిలో వినాయక చవితి కూడా ఒకటి. ప్రతి ఏడాది ఘనంగా వినాయకుడిని పూజించి నిమజ్జనం చేసే భక్తులు ఈసారి మాత్రం మొక్కుబడిగా పూజలు చేశారు. నైవేద్యంగా పెట్టే ఉండ్రాళ్ళు కూడా బాగా తగ్గించారు. దీంతో బొజ్జ గణపయ్యకు కోపమొచ్చింది. వెంటనే తన వాహనమైన మూషికాన్ని పిలిచి.. "మూషికా.. నరులు ఈ ఏడాది నాకు ఉండ్రాళ్ళు తక్కువ చేసి.. నా కడుపులో నిన్ను పరుగెత్తేలా చేశారు. వెంటనే నువ్వు భూలోకానికి వెళ్లి నేను అలిగానని వాళ్ళకి అర్థమయ్యేలా అలజడి సృష్టించు" అని గణపయ్య ఆజ్ఞాపించారు.    గణపయ్య ఆజ్ఞతో భూలోకానికి వచ్చిన మూషికం తిరిగి తిరిగి అలసిపోయి ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడకు చేరుకుంది. అలజడి సృష్టించడానికి ఇదే సరైన ప్రదేశమని నిర్ణయించుకుంది. నగరంలోని పండిట్ నెహ్రు బస్ స్టేషన్‌ ఆవరణలో ఉన్న రామ మందిరంలో మూషికం స్థావరం ఏర్పరుచుకుంది. అక్కడ సీతారాముల మట్టి విగ్రహాలుంటే వాటి నీడలో ఉంటూ తాను వచ్చిన పనిని మర్చిపోయి పూజారులు, భక్తులు పెట్టిన నైవేద్యం తింటూ బాహుబలిలా బలంగా తయారైంది. అలా కొద్దిరోజులు గడిచాక గణపతి ఆజ్ఞ గుర్తుకొచ్చి, తాను భూలోకానికి వచ్చిన పనిని మరిచానని గ్రహించి.. వెంటనే అక్కడి నుండి బయటకు రాబోతుండగా.. బాహుబలిలా బలంగా తయారైన మూషికం తాకిడికి సీతమ్మ విగ్రహం కిందపడిపోయింది. 'అయ్యయ్యో ఎంత అపచారం జరిగింది.. నన్ను క్షమించు అమ్మ' అంటూ మూషికం సీతమ్మకి క్షమాపణ చెప్పి పరుగుపరుగునా వినాయకుడి వద్దకు చేరుకుంది.   భూలోకంలో తాను చేసిన పని వినాయకుడికి తెలిసి ఉంటుందని, తనని మందలిస్తాడని మూషికం అనుకుంది. కానీ తాను చేసిన పని వినాయకుడు కనిపెట్టలేకపోవడంతో హమ్మయ్య అని ఊపిరి పీల్చుకుంది. కానీ, వినాయకుడు కనిపెట్టలేకపోతేనేం.. విజయవాడ పోలీసులు కనిపెట్టేశారు. ఎలుక తోసేయడం వల్ల సీతమ్మ విగ్రహం కింద పడిపోయి ఉంటుందని కృష్ణలంక సీఐ సత్యానందం, ఏసీపీ వెంకటేశ్వర్లు ప్రాధమిక అంచనాకు వచ్చేశారు. ఇది మట్టితో తయారుచేసిన విగ్రహమని, ఎలుకల వల్ల కిందపడి ధ్వంసమై ఉంటుందని సీఐ వ్యాఖ్యానించారు. నిందితులను పట్టుకోలేక, ఇలాంటి కాకమ్మ కబుర్లు చెబుతున్నారని సీఐపై భక్తులు, ప్రతిపక్ష నాయకులు విమర్శలు చేస్తున్నారు. అయితే వినాయకుని వాహనం మూషికం మాత్రం సీఐని ప్రశంసిస్తోంది. నేను చేసిన పనిని స్వామి గణపయ్యే కనిపెట్టలేకపోయారు.. కానీ సీఐ భలేగా కనిపెట్టారంటూ ఆయనపై మనసులోనే ప్రశంసల వర్షం కురిపిస్తోంది.

కేసీఆర్ కోసమా.. ఆయనతో విభేదాలా? బీజేపీలోకి రామేశ్వరరావు ఖాయమేనా?

తెలంగాణ రాజకీయాల్లో  అనూహ్యా పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. త్వరలో  ఊహించని ట్విస్టులు ఉంటాయనే చర్చ జరుగుతోంది. అందులో ప్రధానంగా వినిపిస్తోంది ప్రముఖ పారిశ్రామికవేత్త, ముఖ్యమంత్రి కేసీఆర్‌కు అత్యంత సన్నిహితుడైన మై హోమ్ రామేశ్వరరావు బీజేపీ తీర్థం పుచ్చుకోబోతున్నారన్నది. రామేశ్వరరావును బీజేపీ రాజ్యసభకు పంపించబోతుందని కూడా చెబుతున్నారు. రామేశ్వరరావు బీజేపీలోకి వెళుతున్నారన్న  ప్రచారం ఇప్పుడు తెలంగాణ రాజకీయాలను షేక్ చేస్తోంది. కేసీఆర్ టార్గెట్ గానే బీజేపీ జూపల్లిని లాగుతుందని కొందరు చెబుతుండగా.. కేసీఆర్ కోసమే రామేశ్వరరావు కమలం గూటికి చేరే ప్రయత్నాలు చేస్తున్నారన్న చర్చ జరుగుతోంది. కేసీఆర్ తో కొంత కాలంగా జూపల్లికి విభేదాలు వచ్చాయని , అందుకే ఆయన మరో పార్టీ వైపు చూస్తున్నారన్న వాదన కూడా రాజకీయ వర్గాల నుంచి వినిపిస్తోంది.    తెలంగాణలో ఇటీవల జరుగుతున్న పరిణామాలు కూడా కేసీఆర్, జూపల్లికి మధ్య గ్యాప్ వచ్చిందనే సంకేతమిస్తున్నాయి. ముఖ్యంగా జూపల్లికి చెందిన మీడియాలో కాంగ్రెస్ పైర్ బ్రాండ్ లీడర్, మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్ రెడ్డి లైవ్ షో జరగడం ఈ అనుమానాలకు బలాన్నిస్తోంది. మీడియాలోకి జూపల్లి ఎంటరయ్యాకా... ఆయనకు సంబంధించిన ఛానెళ్లలో రేవంత్ రెడ్డి వార్తలే రావడం లేదు. సీఎం కేసీఆర్, జూపల్లి రామేశ్వరరావును రేవంత్ రెడ్డి మొదటి నుంచి తీవ్ర స్థాయిలో టార్గెట్ చేస్తున్నారు. అందుకే అతని వార్తలను జూపల్లి మీడియాలో బ్యాన్ చేశారని భావించారు.  కాని సడెన్ గా సీన్ మారిపోయింది. జూపల్లికి సంబంధించిన  మీడియాలో రేవంత్ రెడ్డి గంటన్నర పాటు కనిపించడంతో చూసినవారంతా .. ఇది నిజమా  కలా  అంటూ విస్తుపోయారు. అది కూడా జూపల్లికి కేసీఆర్ తో ఆయనకు విభేదాలు వచ్చాయని ప్రచారం జరుగుతున్న సమయంలోనే జరగడం మరిన్ని అనుమానాలకు తావిచ్చింది.  జూపల్లి మీడియాలో కేసీఆర్ రాజకీయ ప్రత్యర్థి రేవంత్ రెడ్డి లైవ్ షో జరగడంతో .. కేసీఆర్, జూపల్లి మధ్య ఏదో జరుగుతుందన్న ప్రచారం మరింత ఊపందుకుంది.              తెలంగాణపై బీజేపీ హైకమాండ్ స్పెషల్ ఫోకస్ చేసింది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా పావులు కదుపుతోంది.  దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నికలో సంచలన విజయం సాధించడంతో పాటు గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలోనూ కారుకు షాకిచ్చింది కమలం పార్టీ. ఇక అధికారం చేజిక్కుంచుకోవడమే లక్ష్యంగా కొత్త ఎత్తులు వేస్తుందని, అందులో భాగంగానే కేసీఆర్ ఆర్థిక మూలాలపై బీజేపీ దెబ్బ కొడుతుందనే ప్రచారం జరుగుతోంది. అందుకే కేసీఆర్‌కు అత్యంత సన్నిహితుడు,టీఆర్ఎస్‌కు ఆర్థిక అండ దండలు అందిస్తున్న మై హోమ్ రామేశ్వరరావును బీజేపీలోకి లాగుతున్నారన్న చర్చ జరుగుతోంది. గతంలో ఆయన సంస్థలపై ఈడీ దాడులు జరగడం కూడా బీజేపీలో వ్యూహంలో భాగమేనంటున్నారు.  కేంద్రంలోని బీజేపీ నేతల నుంచి ఒత్తిడి పెరగడం, ఈడీ దాడులతో రామేశ్వరరావు కూడా బీజేపీలో చేరేందుకు సిద్దమవుతున్నట్లు కొందరు అభిప్రాయపడుతున్నారు.  జూపల్లికి సంబంధించి మరో ప్రచారం కూడా జరుగుతోంది. కేసీఆర్ అవినీతికి సంబంధించిన చిట్టా మొత్తం కేంద్రంలో చేతుల్లో ఉందని, కేసీఆర్ జైలుకు వెళ్లడం ఖాయమని కొన్ని రోజులుగా తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ సహా పలువురు నేతలు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో  కేంద్ర దర్యాప్తు సంస్థల నుంచి తప్పించుకునేందుకు  కేసీఆరే .. తన సన్నిహితుడు జూపల్లి రామేశ్వరరావును బీజేపీలోకి పంపిస్తున్నారా అన్న అనుమానాలు కూడా కొన్ని వర్గాల నుంచి వ్యక్తమవుతున్నాయి. జూపల్లికి బీజేపీ పెద్దలతో మంచి సంబంధాలు ఉండటంతో కేసీఆర్ అటు వైపు నుంచి నరుక్కొస్తున్నారని చెబుతున్నారు. కేంద్రంపై యుద్దమే అంటూ ఒంటి కాలిపై లేచిన కేసీఆర్.. ఇటీవల ఢిల్లీకి వెళ్లి వచ్చిన తర్వాత సైలెంట్ అయ్యారు. గతంలో వ్యతిరేకించిన కేంద్ర పథకాలకు జై కొట్టారు. దీంతో  బీజేపీ పెద్దలను గులాబీ బాస్ శరణు వేడుకున్నారన్న ప్రచారం జరుగుతోంది. కేంద్ర దర్యాప్తు సంస్థలకు భయపడి బీజేపీకి ఆయన సరెండర్ అయ్యారని రాజకీయ ప్రత్యర్థులు విమర్శిస్తున్నారు. బీజేపీతో సయోధ్య చేసుకోవాలని కేసీఆర్‌కు సలహా ఇచ్చింది కూడా మై హోమ్ రామేశ్వరరావే అన్న వాదన కూడా వుంది. అందుకే కేసీఆర్ ను కాపాడేందుకు తనవంతు ప్రయత్నాలు చేస్తున్న రామేశ్వరరావు.. కేసీఆర్ కోసమే బీజేపీలోకి వెళ్లేందుకు సిద్దమవుతున్నారని కొందరు చెబుతున్నారు,        టీఆర్ఎస్-బీజేపీ రెండూ ఒకటేనని చాలాకాలంగా కాంగ్రెస్ పార్టీ విమర్శలు చేస్తోంది. ఢిల్లీలో దోస్తీ గల్లీలో కుస్తీ అన్నట్లుగా బీజేపీతో కేసీఆర్ వ్యవహరిస్తున్నారని ఆ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. తాజా పరిణామాలతో ఆ విషయం బహిర్గతమవుతుందని చెబుతున్నారు. అంతేకాదు కేసుల బూచి చూపిస్తూ ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీతో పాటు టీడీపీని బీజేపీ తన గుప్పిట్లో పెట్టుకుందని, తెలంగాణలోనూ అదే చేయబోతుందని కాంగ్రెస్ నేతలు స్పష్టం చేస్తున్నారు.  ఏపీకి చెందిన టీడీపీ రాజ్యసభ సభ్యులు బీజేపీలోకి వెళ్లినప్పుడు... చంద్రబాబే బీజేపీకి మళ్లీ దగ్గరయ్యేందుకు వాళ్లను పంపించారనే ప్రచారం జరిగింది. ఇప్పుడు తెలంగాణలో కూడా తనపై కేంద్ర దర్యాప్తు సంస్థల విచారణ జరగకుండా ఉండేందుకే..  తన సన్నిహితుడిని కేసీఆరే బీజేపీలోకి పంపిస్తున్నారని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు.  మొత్తానికి కారణం ఏదైనా.. మైహోం రామేశ్వరరావు బీజేపీకి వెళితే మాత్రం అది తెలంగాణలో పెద్ద రాజకీయ సంచలనమే. 

సీఎం దగ్గరకు హడావిడిగా పరుగులు పెట్టిన మంత్రి కొడాలి నాని.. కారణం అదేనా..!

ఏపీ పౌర సరఫరాల మంత్రి కొడాలి నాని తన అనుచరులతో కలిసి నిర్వహిస్తున్నట్లుగా చెపుతున్న పేకాట క్లబ్బులపై పోలీసులు దాడులు చేసిన సంగతి తెల్సిందే. తాజాగా ఈ దాడుల నేపథ్యంలో మంత్రి కొడాలి నాని ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారని తెలుస్తోంది. దీంతో అయన తన కార్యక్రమాలన్నీ రద్దు చేసుకుని ఉన్నపళంగా సీఎం జగన్ ను కలిసేందుకు అయన నివాసానికి హడావిడిగా చేరుకున్నట్లుగా తెలుస్తోంది. అయితే దీనికి కారణం సీఎం ఆఫీసు నుండి వచ్చిన పిలుపో.. లేక ఈ మొత్తం ఘటన పై వివరణ ఇచ్చుకునేందుకు ఆయనే వెళ్లారో తెలియలేదు కానీ ఇంత హఠాత్తుగా మంత్రి నాని సీఎం ఇంటికి వెళ్ళడం మాత్రం ప్రస్తుతం పెద్ద చర్చకు దారి తీసింది.   ఇదిలా ఉండగా.. గత రాత్రి మంత్రి కొడాలి నాని కి చెందిన గుడివాడ నియోజకవర్గంలోని తమ్మిరిస గ్రామంలోని పేకాట శిబిరంపై ఎస్ఈబీ దాడులు చేసి.. 30 మంది పేకాట రాయుళ్లను పట్టుకుంది. 28 కార్లు, కోట్ల కొద్దీ నగదు సీజ్ చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఇక్కడి అధికార పార్టీ నేతలే పేకాట క్లబ్‌ను నడుపుతున్నారని ఆరోపణలు వెల్లువెత్తాయి. సాక్షాత్తూ ఒక కీలక మంత్రి కనుసన్నల్లో.. కృష్ణా జిల్లాలో నడుపుతున్న ఈ పేకాట డెన్‌ గుట్టు రట్టయింది. ఈ పేకాట డెన్ లోకి ఎంట్రీ ఫీజ్ 10 వేలు అని విశ్వసనీయ వర్గాల సమాచారం.   అంతేకాకుండా కొద్దిరోజుల క్రితం గుడివాడలో జరిగిన బహిరంగ సభలో పేకాట క్లబ్‌లపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీవ్ర విమర్శలు చేసిన సంగతి తెల్సిందే. "మీరు పేకాట క్లబ్‌లు, సిమెంట్ కంపెనీలు, మీడియా సంస్థలను నడపగా లేనిది.. నేను సినిమాల్లో నటిస్తే తప్పేంటి?" అని మంత్రిని ప్రశ్నిస్తూ.. పవన్ ధ్వజమెత్తిన సంగతి తెల్సిందే. దీంతో ఏపీ వ్యాప్తంగా పవన్ ఆరోపణలు తీవ్ర సంచలనం రేకెత్తించాయి. అయితే పవన్ ఆ మాటలు అన్న కొన్ని రోజులకే ఇలా పేకాట క్లబ్ పై దాడులు జరగడంతో ఏపీ రాజకీయాల్లో ఈ వ్యవహారం పెను సంచలనంగా మారింది.

తమ్ముడిని సీఎం పదవిలోకి రానివ్వను! 

రాజకీయాల్లో బంధాలు, బంధుత్వాలు పని చేయవంటారు. అధికారం కోసం కొంత మంది లీడర్లు ఎంతకైనా తెగిస్తుంటారు. సొంత మనుషులను కూడా కాదనుకుంటారు. దేశంలో చాలా రాష్ట్రాల్లో ఇలాంటి ఘటనలు జరిగాయి. కొందరు ముఖ్య నేతలు కూడా తమ కుటుంబ సభ్యుల నుంచే తీవ్ర పోటీ ఎదుర్కొన్నారు. కుటుంబ గొడవలతో తీవ్ర ఇబ్బందులు  పడ్డారు. కుటుంబ కలహాలతో మరి కొందరు నేతలు పదవులు కూడా పోగొట్టుకున్నారు. తమిళనాడులో ప్రస్తుతం ఇదే జరుగుతోంది. అధికారం కోసం పావులు కదుపుతున్న డీఎంకే చీఫ్ స్టాలిన్ కు కుటుంబం నుంచే తీవ్ర ఇబ్బందులు వస్తున్నాయి.      నాలుగైదు నెలల్లోనే తమిళనాడు అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. దీంతో అక్కడ రాజకీయ వాతావ‌ర‌ణం వేడెక్కుతోంది. పొలిటికల్ ఈక్వేషన్స్ కూడా  వేగంగా మారిపోతున్నాయి. ఈ ఎన్నికల్లో డీఎంకేకే విజయావకాశాలు ఎక్కువని సర్వే సంస్థలు చెబుతున్నాయి.  అయితే ఆ పార్టీకి ఇప్పుడు  మాజీ ముఖ్యమంత్రి దివంగ‌త‌ క‌రుణానిధి కుమారుడు అళ‌గిరి పెద్ద అడ్డంకిగా మారుతున్నారనే చర్చ జరుగుతోంది. కలైంజర్‌ డీఎంకే పేరిట పార్టీ పెట్టేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు అళగరి. మదురైలో తన మద్దతుదారులతో  సమావేశం కూడా నిర్వహించారు. అంతేకాదు కొత్త పార్టీ ఏర్పాటు చేయబోతున్న అళగరి.. తన తమ్ముడు స్టాలిన్ నే ఎక్కువగా  టార్గెట్ చేస్తున్నారు.  తన త‌మ్ముడు స్టాలిన్ పై విమ‌ర్శ‌లు గుప్పించారు అళగిరి. గ‌తంలో డీఎంకే ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొందని, అలాగే త‌న‌ను రాజకీయంగా అణ‌చివేయ‌డానికి ప్ర‌య‌త్నాలు జ‌రిగినా తాను పెద్దగా పట్టించుకోలేదని చెప్పుకొచ్చారు. త‌న‌కు గ‌తంలో దక్షిణ తమిళనాడు పార్టీ నిర్వాహక కార్యదర్శి పదవిని అప్పగిస్తే పార్టీకి విజ‌యాలు అందించాన‌ని చెప్పారు. కరుణానిధితో మాట్లాడి స్టాలిన్‌కు కోశాధికారి పదవి ఇప్పించాన‌ని తెలిపారు. తాను పదవుల కోసం ఎన్నడూ ఆశ‌ప‌డ‌లేద‌ని చెప్పారు అళగిరి. స్టాలిన్‌కు గ‌తంలో డిప్యూటీ సీఎం పదవి రావడంలో త‌న పాత్ర ఉంద‌న్నారు.  పార్టీ కోసం ఓ కార్యకర్తగా ఇంత‌గా శ్రమించిన తనను  ఏదో తప్పు చేసినట్టుగా చూశార‌ని చెప్పారు. స్టాలినే  త‌న‌ను డీఎంకే నుంచి బయటకు పంపించారని ఆరోపించారు అళగిరి.  త‌మిళ‌నాడుకు ముఖ్య‌మంత్రి కావాలన్న ఆశతో స్టాలిన్‌ ఉన్నాడన్నారు అళగిరి.  అయితే  ఆ పదవిలోకి ఆయన వచ్చే ప్రసక్తే లేదని జోస్యం చెప్పారు. తాను ఏడేళ్లులుగా  మౌనంగా ఉన్నానని, ఇప్పుడు తాను ఏ నిర్ణయం తీసుకున్నా త‌న‌ మద్దతుదారులు త‌న వెంటే ఉంటార‌ని చెప్పారు.  అళగిరి పార్టీతో డీఎంకేకు నష్టం జరుగుతుందనే చర్చ జరుగుతోంది. దక్షిణ తమిళనాడులో అళగిరికి మంచి పట్టు ఉందని, అక్కడ డీఎంకేకు భారీగా గండి పడవచ్చని అంచనా వేస్తున్నారు. అళగిరి పార్టీ ఏర్పాటు వెనక బీజేపీ ఉందనే ప్రచారం కూడా జరుగుతోంది. యూపీఏ కూటమిలో ప్రధాన పార్టీగా ఉన్న డీఎంతే ఎట్టి పరిస్థిత్తుల్లోనూ అధికారంలోకి రాకుండా చూసేందుకు బీజేపీ పెద్దలు అళగిరితో పార్టీ పెట్టిస్తున్నారని చెబుతున్నారు. దీంతో తమిళనాడు ముఖ్యమంత్రి కావాలన్న స్టాలిన్ ఆశలకు.. ఆయన అన్న అళగిరే అడ్డంకిగా మారారనే చర్చ తమిళనాడులో జరుగుతోంది. 

గృహ నిర్బంధంలో జేసీ బ్రదర్స్... తాడిపత్రిలో హైటెన్షన్  

అనంత‌పురం జిల్లా తాడిప‌త్రిలో జేసీ బ్ర‌ద‌ర్స్ నిర‌హార దీక్ష చేసేందుకు సిద్ధం కావడంతో హై టెన్ష‌న్ వాతావ‌ర‌ణం నెల‌కొంది. త‌మ‌పై పోలీసులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్ట‌డాన్ని నిర‌సిస్తూ.. దీనికి వ్య‌తిరేకంగా త‌హ‌సిల్దార్ కార్యాల‌యం ఎదుట ఆమ‌ర‌ణ నిర‌హార దీక్ష చేసేందుకు జేసీ సోదరులు సిద్ధ‌మయ్యారు. దీంతో ముందస్తు చ‌ర్య‌ల్లో భాగంగా జేసీ ప్ర‌భాక‌ర్ రెడ్డి, జేసీ దివాక‌ర్ రెడ్డిని పోలీసులు గృహ నిర్బంధం చేశారు. నిరాహార దీక్ష చేయడానికి బయల్దేరిన జేసీ దివాక‌ర్ రెడ్డిని పోలీసులు ఫామ్ హౌజ్ వ‌ద్ద‌నే హౌస్ అరెస్ట్ చేయ‌గా.. ప్ర‌భాక‌ర్ రెడ్డిని ఇంటి వ‌ద్దే అడ్డుకున్నారు. దీంతో అయన ఇంటి వద్దే ఆమరణ దీక్షకు కూర్చున్నారు. దీంతో అక్క‌డ తీవ్ర ఉద్రిక్త ప‌రిస్థితులు నెల‌కొన్నాయి. మరోపక్క జేసీ బ్ర‌ద‌ర్స్ అనుచ‌రులు, టీడీపీ కార్య‌క‌ర్తలు వారి ఇళ్ల వ‌ద్ద‌కు భారీ సంఖ్య‌లో త‌ర‌లివ‌స్తున్నారు.   ఇదిఇలా ఉండగా ఇప్ప‌టికే పోలీసులు తాడిప‌త్రిలో 30 యాక్టు,144 సెక్షన్ విధించారు. ప్రస్తుతం ప‌ట్ట‌ణంలో ఎలాంటి స‌భ‌లు, స‌మావేశాలు, ధ‌ర్నా కార్య‌క్ర‌మాల‌కు అనుమ‌తి లేద‌ని పోలీసులు స్ప‌ష్టం చేశారు. జేసీ సోదరులతో పాటు ఎమ్మెల్యే పెద్దారెడ్డి నివాసాల వ‌ద్ద పోలీసులు భారీగా బందోబ‌స్తు ఏర్పాటు చేశారు. మరోపక్క పోలీసులు తమను అరెస్ట్‌ చేసినా.. దీక్ష చేసి తీరతామని జేసీ బ్రదర్స్ స్పష్టం చేస్తున్నారు. తాడిపత్రిలో పోలీసులు కవాతు చేసినా తాము భయపడేది లేదంటున్నారు. తాము శాంతియుతంగానే ఆమ‌ర‌ణ‌ నిరాహార దీక్ష చేస్తామ‌ని.. దీనిని పోలీసులు అడ్డుకోవ‌డం స‌రికాదంటూ జేసీ బ్రదర్స్ మండిప‌డుతున్నారు. 

త్వరలో టీఆర్ఎస్ లోకి వీహెచ్! కేసీఆర్ ను పొగడటంతో లైన్ క్లియరా? 

తెలంగాణ రాజకీయాల్లో కొన్ని రోజులుగా అనూహ్యా మార్పులు జరుగుతున్నాయి. నాయకుల వలసలతో ఎవరూ ఎప్పుడు ఏ పార్టీలో ఉంటారో తెలియని పరిస్థితి నెలకొంది. కాంగ్రెస్ పార్టీ నుంచి ఈ తరహా వలసలు ఎక్కువగా జరుగుతున్నాయి.  దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నిక విజయం, గ్రేటర్ ఎన్నికల్లో సత్తా చాటడంతో తెలంగాణలో  బీజేపీ దూకుడు పెరిగింది. ఆ పార్టీలోకి రోజూ చేరికలు కొనసాగుతున్నాయి. ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ లో మాత్రం పీసీసీ చీఫ్ పీటముడి వీడటం లేదు. ఇదిగో అదిగో ప్రకటన అంటూనే నెల రోజులు కాలాయపన చేసింది కాంగ్రెస్ హైకమాండ్. దీంతో హస్తం నేతలు ఎవరి దారి వారు చూసుకుంటున్నారు. అయితే కాంగ్రెస్ కు మొదటి నుంచి వీర విధేయుడిగా ఉన్న సీనియర్ నేత, మాజీ ఎంపీ వి హనుమంతరావు పార్టీ మారతారనే ప్రచారం కొన్ని రోజులుగా జరుగుతుంది. కేసీఆర్ ను తీవ్ర స్థాయిలో టార్గెట్ చేసే వీహెచ్.. పార్టీ మారాల్సి వస్తే   బీజేపీలోకి వెళ్లవచ్చని భావించారు.   అందరి అంచనాలు తలకిందులు చేస్తూ ఆయన గులాబీ గూటికి చేరే ప్రయత్నాలు చేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. ఎప్పుడు కేసీఆర్ పై తీవ్రంగా విరుచుకుపడే వీహెచ్.. తాజాగా ఆయనను ప్రశంసిస్తూ  వ్యాఖ్యలు చేయడంతో హనుమంతరావు కారు పార్టీలో చేరడం ఖాయమని భావిస్తున్నారు. మున్నూరు కాపు మహాసభలో మాట్లాడిన వీహెచ్..  కేసీఆర్‌పై గతంలో ఎప్పుడు లేనంతగా ప్రశంసలు కురిపించారు.  సీఎం కేసీఆర్‌ అన్ని కులసంఘాల భవనాలకు స్థలం, నిధులు ఇస్తున్నారని చెప్పారు. గతంలో ఏ ముఖ్యమంత్రి కుల సంఘాలకు ఇంతగా ప్రాధాన్యత ఇవ్వలేదన్నారు హనుమంతరావు.  వీహెచ్ చేసిన ఈ వ్యాఖ్యలపై ఇప్పుడు తెలంగాణలో చర్చనీయాంశంగా మారాయి. ఆయన పార్టీ మారాలని నిర్ణయించుకున్నందు వల్లే కేసీఆర్ ను పొగుడుతున్నారనే ప్రచారం రాజకీయ వర్గాల్లో జరుగుతోంది.   తెలంగాణ పీసీసీ అధ్యక్ష ఎన్నిక  కాంగ్రెస్  పార్టీలో  వివాదం రేపుతోంది. ముఖ్యంగా రేవంత్ రెడ్డికి పీసీసీ పగ్గాలు ఇవ్వొద్దని కొందరు నేతలు బహిరంగంగానే చెబుతున్నారు. అందులో వీహెచ్ ప్రధానంగా ఉన్నారు. పార్టీలోకి కొత్తగా వచ్చిన రేవంత్ రెడ్డికి పార్టీ బాధ్యతలు అప్పగించవద్దని ఆయన చాలా సార్లు చెప్పారు. హైకమాండ్ కు వివరించారు. ఎక్కడ మాట్లాడినా పీసీసీ విషయంలో రేవంత్ ను వ్యతిరేకిస్తున్నారు వీహెచ్. దీంతో రేవంత్ రెడ్డి అనుచరులు వీహెచ్ ను టార్గెట్ చేశారు. రేవంత్ అభిమానితో  వీహెచ్ కు ఫోన్ లో జరిగిన గొడవకు సంబంధించిన ఆడియో కాల్ లీకై తీవ్ర కలకలం రేపింది. రేవంత్ రెడ్డి అనుచరుడిపై పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు వీహెచ్. తర్వాత కూడా రేవంత్ ను ఆయన వదలడం లేదు.  రేవంత్ రెడ్డికి పీసీసీ పగ్గాలు ఇస్తే తాను కాంగ్రెస్ నుంచి బయటికి వస్తానని కూడా చెప్పారు వీహెచ్.  రేవంత్ రెడ్డికే పీసీసీ చీఫ్ పోస్టు దాదాపుగా ఖాయమని ఢిల్లీ వర్గాల నుంచి సమాచారం రావడంతో .. తాను చెప్పినట్లే  కాంగ్రెస్ పార్టీని  వీడేందుకు హనుమంతరావు సిద్ధమవుతున్నారని చెబుతున్నారు. బీజేపీలోకి వెళితే పదవులు వచ్చే అవకాశం లేదని, కేసీఆర్ అయితే ఏదో ఒక పోస్టు కట్టబెడుతారని వీహెచ్ భావిస్తున్నారట. అందుకే టీఆర్ఎస్ లో చేరాలని దాదాపుగా నిర్ణయించుకున్న వీహెచ్..  సీఎం కేసీఆర్ ను ప్రశంసిస్తూ కామెంట్లు చేశారంటున్నారు. రేవంత్ రెడ్డికే పీసీసీ చీఫ్ అన్న ప్రకటన వచ్చిన వెంటనే వీహెచ్ కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పేస్తారని ఆయన అనచురులు కూడా చెబుతున్నారు. మొత్తానికి వీహెచ్ టీఆర్ఎస్ లో చేరితే మాత్రం అది సంచలనమే. విశ్లేషకులు మాత్రం రాజకీయాల్లో శాశ్వాత మిత్రులు, శత్రువులు ఉండరని.. ఏదైనా జరగవచ్చని చెబుతున్నారు. వీహెచ్ టీఆర్ఎస్ లో చేరినా పెద్దగా అశ్చర్యపడాల్సింది ఏమీ లేదంటున్నారు.