మున్సిపోల్స్ కు కొత్త నోటిఫికేషన్ ! ఎస్ఈసీకి జనసేన వినతి
posted on Feb 15, 2021 @ 1:47PM
ఆంధ్రప్రదేశ్ లో పంచాయతీ ఎన్నికలు ముగిసిన వెంటనే మున్సిపల్ ఎన్నికలు జరగనున్నాయి. మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ ను ప్రకటించింది ఎన్నికల సంఘం. మార్చి 10న 75 పురపాలక సంఘాలు, 12 నగర పాలక సంస్థలకు పోలింగ్ జరుగునుంది. గత మార్చిలో మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ ప్రారంభమై... కరోనా కారణంగా నిలిచిపోయింది. గతంలో ఆగిపోయిన దగ్గర నుంచే మళ్లీ ఎన్నికల ప్రక్రియను కొనసాగుతుందని ఎస్ఈసీ ప్రకటించింది. ఇదే ఇప్పుడు వివాదంగా మారింది. ఎస్ఈసీ నిర్ణయంపై విపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
మున్సిపల్ నామినేషన్ ప్రక్రియ మొదటి నుంచి ప్రారంభిస్తే.. అందరికీ న్యాయం జరుగుతుందని జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు. గతంలో జరిగిన మున్సిపల్ నామినేషన్ ప్రక్రియ ప్రజాస్వామ్య బద్దంగా లేదన్నారు. నోటిఫికేషన్‌పై ఎస్‌ఈసీ మరోసారి ఆలోచించాలని నాదెండ్ల మనోహర్ డిమాండ్ చేశారు. ఆనాడు వైసీపీ నేతలు చాలా దౌర్జన్యాలకు పాల్పడ్డారని మనోహర్ తెలిపారు.ఇతర పార్టీల అభ్యర్థులను బెదిరించి వైసీపీ నేతలు నామినేషన్ వేశారని చెప్పారు. అవన్నీ వదిలేసి ఇప్పుడు మళ్లీ ఆగిన చోటినుంచి ఎన్నికలు నిర్వహించడం సరికాదన్నారు. ఇదే విధానం కొనసాగితే ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరుగుతాయని తాము ఆశించడం లేదన్నారు. రాజకీయ పార్టీల గుర్తుల ఆధారంగా జరుగుతున్న ఎన్నికలను అందరికీ ఆమోదయోగ్యంగా నిర్వహించాలని కోరారు.
సామాన్యులకు ధైర్యం నింపేలా, అభ్యర్థులకు అండగా ఉండేలా ఈ ఎన్నికలు ఉండాలన్నారు నాదేండ్ల మనోహర్. జనసేన అభ్యర్థులకు అండగా నిలుస్తామన్నారు. వైసీపీ నేతలు తమ స్వలాభం కోసం వాలంటీర్లను రాజకీయాలకు వినియోగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓటర్ స్లిప్పులపై పథకాల పేర్లు రాసి నిలిపివేస్తామని హెచ్చరిస్తున్నారని మండిపడ్డారు. ఏపీలో ప్రజాస్వామ్యం నిలబడాలంటే స్థానిక సంస్థల ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించాలన్నారు. ఎస్ఈసీ మరోసారి మున్సిపల్ నామినేషన్ ప్రక్రియపై పునరాలోచించాలని నాదెండ్ల మనోహర్ కోరారు.