పుదుచ్చేరి ప్రభుత్వానికి గండం?
posted on Feb 16, 2021 @ 1:44PM
రాష్ట్రం ఏదైనా, అది కేంద్ర పాలిత ప్రాంతమే అయినా రాజకీయం మాత్రం ఒకటిగానే ఉంటుంది.ఫిరాయింపులు ఎక్కడైనా ఒక్కలానే జరుగ్తుఅయి. ఇందుకు తాజా ఉదాహరణ పుదుచ్చేరి. కొద్ది కాలం క్రితం మధ్య ప్రదేశ్’లో అంతకు ముందు మన పొరుగు రాష్ట్రం కర్ణాటకలో ఫిరాయింపుల ప్రభావంతో ప్రభుత్వాలు కూలిపోవడం చూశాం. ఇప్పుడు మరో మూడు నెలల్లో ఎన్నికలు జరగనున్న పుదుచ్చేరిలో అదే పరిస్థితి తలెత్తింది. బొటాబొటి మెజారిటీతో ఇంతకాలం ప్రభుత్వాన్ని నెట్టుకొచ్చిన ముఖ్యమంత్రి నారాయణ స్వామి ప్రభుత్వం ఇప్పుడు మైనారిటీలో పడింది.
పుదుచ్చేరి శాసన సభలో ముగ్గురు నామినేటెడ్ సభ్యులతో కలిపి మొత్తం సభ్యుల సంఖ్య 33. ఐదు సంవత్సరాల క్రితం 2016లో 30 స్థానాలకు ఎన్నికలు జరిగితే, కాంగ్రెస్ పార్టీ 15 స్థానాలు గెలుచుకుంది. మరో ఇద్దరు డీఎంకే సభ్యుల మద్దతుతో నారాయణ స్వామి ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది.అయితే ఎన్నికలు సమీపిస్తున్న ప్రస్తుత సమయంలో, కేవలం పది రోజుల వ్యవధిలో నలుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. దీంతో నారాయణ స్వామి ప్రభుత్వం మైనారిటీలో పడిపోయింది.
ఇదిలా ఉంటే కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ బుధవారం పుదుచ్చేరిలో పర్యటించనున్నారు. పార్టీని ఎన్నికలకు సిద్ధం చేసేందుకు ఉద్దేశించిన రాహుల్ గాంధీ పర్యటనకు ఒక రోజు ముందు ఈ పరిణామం చోటు చేసుకోవడం మరింత ప్రాధాన్యతను సంతరించుకుంది. గత నెల 25న నమశివాయం, తీప్పయింజన్ అనే ఇద్దరు అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. సోమవారం ఒకరు, మంగళవారం మరొకరు రాజీనామా చేశారు. దీంతో కాంగ్రెస్ బలం 15 నుంచి 11కు పడిపోయింది.
ఎమ్మెల్యేల ఫిరాయింపులతో అప్రమత్తమైన ముఖ్యమత్రి నారాయణ స్వామి.. హడావుడిగా మంత్రి వర్గ సమావేం ఏర్పాటు చేశారు. అసెంబ్లీని రద్దుచేసి ముదస్తు ఎన్నికలకు వెళ్ళే ఆలోచనలో నారాయణ స్వామిఉన్నట్లు తెలుస్తోంది. అయితే అందుకు లెఫ్ట్నెంట్ గవర్నర్ కిరణ్ బేడి సహకరిస్తారా లేక కేంద్ర పాలనకు సిఫార్సు చేస్తారా అనేది కీలకంగా మారనుంది.