అక్షరాలు చ‌క్క‌గా రాయ‌డం.. పెద్ద‌య్యాక క‌ష్టం!

అక్ష‌రాలు గుండ్రంగా రాయ‌డం అంద‌రికీ అంత సుల‌భంగా వ‌చ్చే క‌ళ కాదు. చిన్న‌పుడు స్కూల్లో కాపీ రైటింగ్ పేర టీచ‌ర్లు పిల్ల‌ల‌కు పెద్ద శిక్షే వేసేవారు. ఎవ‌రు గుండ్రంగా రాస్తే వారికి క్లాసులో గౌర‌వం, లీడ‌ర్ అయ్యే అవ‌కాశాలుండేవి. అదో పెద్ద హోదా. తెలుగు టీచ‌ర్ల‌కు అక్ష‌రాలు గుండ్రంగా రాసే వారంటే మ‌హాయిష్టం. బాల్యంలో ఇంత ప్రాధాన్య‌తిచ్చిన హ్యాండ్ రైటింగ్‌కి క్ర‌మేపీ పెద్ద చ‌దువుల్లోకి వెళ్ల‌గానే అంత ప్రాధాన్య‌త క‌న‌ప‌డ‌దు. ఫ‌లితంగా చేతికి వ‌చ్చిన విధంగా వేగంగా రాసే య‌డం అల‌వ‌డి అదే ప‌ద్ధ‌తి వృత్తి, ఉద్యోగాల్లోనూ కొన‌సాగిస్తూంటాము. ఇది త‌ప్పు కాదు. కానీ ఆ అల‌వాటు డాక్ట‌ర్ వృత్తి లో ఉన్న‌వారికే మ‌రీ ఇబ్బంది.  ఏదో చిన్న‌జ్వ‌రంతోనో, పెద్ద ఆరోగ్య స‌మ‌స్య‌తోనో వీధి చివ‌ర్నున్న డాక్ట‌ర్ ద‌గ్గ‌రికో, ఆస్ప‌త్రికో వెళ‌తాం. మ‌న స‌మ‌స్య వివ‌రిస్తాం. డాక్ట‌ర్ వీల‌యినంతగా ప‌రీక్ష చేసి పెన్ను ప‌ట్టి కాయితం మీద వీల‌యినంత వేగంగానో, వీల‌యినంత నెమ్మ‌దిగానో మందులు రాసిస్తారు. అది చూస్తే చైనా, జ‌పాన్ భాష‌ల్లో ఏదో రాశా డ‌నే ఫీలింగ్ వ‌చ్చి పేషెంట్లు విసుక్కోవ‌చ్చు. ఎందుకంటే ఆ మందుల పేర్లు ఆయ‌న రాసిన విధానంలో బొత్తిగా అర్ధంగావు గ‌నుక‌. దాన్ని చ‌దివే బ్ర‌హ్మ ఒక్క‌డే.. అత‌గాడే మందుల దుకాణంవాడు. అత‌నికి డాక్ట‌ర్‌కి వున్న అక్ష‌రాల‌ను అర్ధంచేసుకునే లింకు మ‌న‌బోటివారికి ఎవ్వ‌రికీ అర్ధం కాదు. కానీ అత‌గాడు టెన్త్ చ‌ది వినా, ఎంబీబీఎస్ రాసిన కాయితాన్ని అమాంతం చేతిలోంచి లాక్కుని అదే వేగంగా వాటిపేర్లు చ‌దువుతూ అసిస్టెంట్ చేత తీయించి బిల్లు ఇంత‌యింద‌ని అంటాడు.  అప్ప‌టిదాకా ఏదో మంత్రాలు విన్న‌ట్టే ఉం టుంది. అంత చ‌దువుకున్న‌వాడు ఛండాలంగా రాసింది అంత‌గా చ‌దువుకోని వాడు ఎలా అర్ధంచేసుకు న్నాడు? అనే సందేహంతోనే ఊగిస‌లాడుతూ ఇల్లు చేర తాం. అదే చిత్రం. మందుల పేర్లు దుకాణం వాడి కి కంఠ‌తా ఉంటాయా? ఫ‌లానా డాక్ట‌ర్ ఫ‌లానా ఆరోగ్య స‌మస్య‌కి ఫ‌లానా మందులే రాస్తాడ‌న్న అపూర్వజ్ఞానం క‌లిగి ఉండ‌డ‌మేనా? బ‌హుశా అదే అయి ఉంటుంది.  ఏమ‌యిన‌ప్ప‌టికీ, చిన్న‌ప్ప‌టి టీచ‌ర్ల బెత్తం దెబ్బ‌లు ఇపుడు త‌డుముకోవాల్సి వ‌స్తుంది. ఎందుకంటే అప్పుడు అన్ని తిట్లు, దెబ్బ‌లు తిని నేర్చుకున్న బ‌హుచ‌క్క‌ని రాత క్ర‌మేపీ త‌గ‌ల‌డిందేమిటా అని! గుండ్రంగా చూడ‌ముచ్చ‌ట‌గా రాయ‌డం జీవితాంతం ఆ నేర్పు క‌లిగి ఉండేవారు త‌క్కువ‌మందే ఉంటారు. ప్రొఫెష‌న్‌ని అనుస‌రించి రాయ‌డంలో వేగం పుంజుకుని అక్ష‌రాలు అవ‌త‌లివారికీ అర్ధం కావాల‌న్న ధ్యాసపోతోంది. టెన్త్ప‌రీక్ష‌ల్లో గుండ్రంగానే రాయాలి, మందులు రాసే డాక్ట‌ర్ గుండ్రం గానే రాయాలి. కానీ ఈ రెండు ఎన్న‌డూ ఒకే పంథాలో జ‌ర‌గ‌వు. దీన్ని గురించే ప్ర‌ముఖ పారిశ్రామిక‌వేత్త, మ‌హీంద్రా గ్రూప్ చైర్మ‌న్ ఆనంద్ మ‌హీంద్ర ఒక ట్వీట్ కూడా చేశారు. 

పైస‌ల్లేవు, అభివృద్ధీ లేదు.. స‌ర్పంచ్‌ల‌కు న‌ర‌కం

అభివృద్ధి చెందాలి అంటూ భారీ నినాదాలు చేస్తూనే పంచాయితీల‌కు ఇవ్వాల్సిన నిధుల‌ను తొక్కి పెడితే అభివృద్ధి ఎలా సాధ్య‌మ‌వుతుంది? ఏపీలో పంచాయితీల‌లో విన‌ప‌డుతున్న ప్ర‌ధాన ప్ర‌శ్న ఇదే. పంచాయితీ అధికారుల‌కు చేతిలో చిల్లి గ‌వ్వ‌లేకుండా ముంద‌డుగు వేయ‌మంటే ఎలా వెళ్ల‌గ‌ల‌రో సీఎం చెప్పాల‌ని అంటున్నారు. గ్రామాల్లో క‌నీసం రోడ్డు బాగుచేసుకోవ‌డానికి కూడా నిధులు లేక‌పోవ‌డం మ‌రీ విడ్డూరంగా మారింది. కేవ‌లం ప్ర‌చారాల‌కు ప్రాధాన్య‌త‌నిస్తూనే సీఎం, ఎమ్మెల్యేలు కాలం గ‌డిపేస్తు న్నారేగాని పంచాయితీలకు నిధులను అంద‌జేయ‌డం విష‌యంలో మాత్రం మౌనం వ‌హించ‌డం గ‌మ‌నా ర్హం. గ్రామాల అభివృద్ధికి స‌ర్పంచ్‌ల ఖాతాల్లో డ‌బ్బులు వేస్తున్నామంటూన్నారు గాని ఖాతాల‌న్నీ ఖాళీ యే అని స‌ర్పంచ్‌లు అంటున్నారు.  చివరికి డబ్బులు లేక.... పనులు చేయలేక... ప్రజల్లోకి వెళ్లలేని పరి స్థితుల్లో సర్పంచ్‌లు ఉన్నారు. ప్రభుత్వం నుంచి పంచాయతీలకు వివిధపద్దుల కింద రావాల్సిన నిధులు ఈ ఏడాదిలో ఇంకా విడు దల కాలేదు. రూ.4 చొప్పున ఇవ్వాల్సిన తలసరి గ్రాంటు, భూములు, ఆస్తుల రిజిస్ట్రేషన్లపై స్టాంపు డ్యూటీ వాటా తదితర పన్నులు పంచాయతీలకు ఈ ఆర్థిక సంవత్సరంలో జమ కాలేదు. 3, 4 రాష్ట్ర ఆర్థిక సంఘా లు సిఫారసు చేసిన నిధులనూ రాష్ట్ర ప్రభుత్వం కేటాయించలేదు. కర్నూలు జిల్లాలోని 484 గ్రామ పంచాయతీల్లో 15.11 లక్షల జనాభా ఉంది. గత ఏడాది చివర్లో  మొత్తం పంచాయతీ ఖాతాల్లోని నిధులను రాష్ట్ర ప్రభుత్వం ఖాళీ చేసింది. దీంతోపాటు మార్చి 31న పంచాయతీ ఖాతాల్లోని జనరల్‌ ఫండ్‌ను కూడా రాష్ట్ర ప్రభుత్వం మాయం చేసింది. ఇలా ఉమ్మడి  జిల్లాలోని పంచా యతీల నుంచి రూ.కోట్లు ఖాళీ చేసేసింది. మార్చి 31న ఖాతాల్లో ఉన్న నిధులు ఏప్రిల్‌ ఒకటో తేదీకి కని పించకుండా పోయేసరికి సర్పంచులు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేశారు. దీంతో ప్రభుత్వం తీసుకు న్న జనరల్‌ ఫండ్‌ను పది రోజుల్లో వెనక్కి ఇచ్చేసింది.  పంచాయతీ ఖాతాల్లోని సొమ్ములను రాష్ట్ర ప్రభు త్వం వెనక్కి లాగేస్తుండడంతో అడ్డుకట్ట వేసేందుకు కేంద్ర ప్రభుత్వం నేరుగా పంచాయతీలకు నిధులు అందించేలా చర్యలు తీసుకుంది. ఉమ్మడి జిల్లాలోని 973 పంచాయతీలూ కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఈ-గ్రామస్వరాజ్‌ పోర్టల్‌లో వివరాలు నమోదు చేసుకుని, ప్రత్యేక బ్యాంకు ఖాతాలు తెరిచాయి. ఇక నుంచి ఆ ఖాతాలకే కేంద్రం ఆర్థిక సంఘం నిధులు నేరుగా జమ కానున్నాయి. ఏపీలో అనేక గ్రామ‌పంచాయితీల స‌ర్పంచ్‌లు గ్రామాల్లో ప‌నులు చేయ‌డానికి నిధుల కొర‌త‌తో ప‌నులు ఆగిపోయాయి. దీంతో ప్ర‌జ‌ల్లోకి వెళ్ల‌లేని ప‌రిస్థితి ఏర్ప‌డిందని వారే వాపోతున్నారు. సీఎం, ఎమ్మెల్యేల‌కు ఈ సంగతి తెలిసినా బొత్తిగా నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రించ‌డం ప‌ట్ల స‌ర్పంచ్‌లు త‌మ ఇబ్బందులు చెప్పుకోలే ని స్థితిలో ఉండిపోయారు. త‌మ పాచంయతీ ఖాతాలోని  ఆర్ధిక‌సంఘం నిధుల‌ను ప్ర‌భుత్వం వెన‌క్కి తీసు కుంది. పంచాయితీలో అభివృద్ధి ప‌నులు నిలిచిపోయి ప్ర‌జ‌ల ముందుకు వెళ్ల‌లేక‌పోతున్నామ‌ని స‌ర్పంచ్లు వాపోతున్నారు. చాలా పంచాయితీల్లో చేసిన‌ప‌నుల‌కు బిల్లులు రాక స‌ర్పంచ్‌లు ఇబ్బంది ప‌డుతు న్నారు.  ఏపీలో దాదాపు అన్ని గ్రామ‌పంచాయితీల్లోనూ ప‌రిస్థితులు ఇలానే ఉన్నాయ‌నే అభిప్రాయాలే వ్య‌క్త‌మ‌వు తున్నాయి. ఈ కార‌ణంగా ప్ర‌జ‌లు ప్ర‌భుత్వం తీరును ఎండ‌గ‌డుతున్నారు. ఈ భ‌యంతోనే ఎమ్మెల్యేలు, స‌ర్పంచ్‌లు సైతం గ్రామాల్లో తిర‌గ‌డానికి వెళ్లి అవ‌మానాల‌పాల‌వుతున్నారు. ఇటీవ‌లి గ‌డ‌ప‌గ‌డ‌ప‌కు కార్య‌క్ర‌మంలో  జ‌రిగిన సంఘ‌ట‌న‌లే  అందుకు సాక్ష్యంగా నిలుస్తున్నాయి. 

దొంగతనం చేద్దామని వచ్చి తప్పతాగి దొరికిపోయారు!

అదృష్ట వంతుడికి యాక్సిడెంట్ అయితే అంబులెన్స్ కింద పడ్డాడంటారు. అదే దురదృష్ట వంతుడికి యాక్సిడెంట్ అంటే అతడు వెళుతున్న అంబులెన్సుకే యాక్సిడెంట్ అవ్వడం అన్న మాట. ఓ ఇద్దరు దొంగల పరిస్థితిఅలాగే తయారైంది. వాళ్లు చోరీ చేద్దామనుకున్నది డబ్బునో, నగలనో కాదు. మద్యాన్ని. పూటుగా తాగి బ్రహ్మాండంగా ఎంజాయ్ చేద్దామనుకున్న ఓ ఇద్దరు దొంగలు అనుకున్నట్లుగానే ఓ మద్యం షాపును ఎంచుకున్నారు. అర్ధరాత్రి దాటాకా ఆ షాపు గోడకు కన్నం పెట్టి లోపలికి దూరారు. అంత వరకూ బానే ఉంది కానీ ఆ  తరువాతే వచ్చింది అసలు సమస్య. ఖాళీగా ఉన్న దుకాణం. నిండా మద్యం సీసాలు. దీంతో  ఆ చోరులలోని తాగుబోతు ఒక్క సారిగా ఒళ్లు విరుచుకుని నిద్ర లేచాడు. తాగినంత తాగి ఆ తరువాత మిగిలిన మద్యం సీసాలను తీసుకువెళదామనుకున్నారు. అంతే అక్కడే కూర్చుని తాగేశారు. ఈ సంఘటన తమిళనాడులోని తిరువల్లూర్ జిల్లాలో జరిగింది. పూటుగా తాగిన తరువాత ఎవరైనా ఏం చేస్తారు. గొడవ పడతారు. లేదా పాటలు పాడతారు. వీళ్లూ అదే చేశారు. ఇంకే ముంది పెట్రోలింగ్ పోలీసులు ఏంటా గలాటా అని వచ్చారు. గోడకి కన్నమేమిటా అని చూస్తే లోపల దొంగల బాగోతం కనిపించింది. కడుపుబ్బా నవ్వుకుని ఆ తరువాత ఆ దొంగల్ని గోడకు వారు చేసిన కన్నంలోనుంచే బయటకు లాగి అరదండాలు తగిలించి జైలుకు తీసుకెళ్లారు.  పాపం ఇప్పుడు ఆ దొంగలు కొంచం సేపు ఓపిక పట్టి వీలైనంత మద్యాన్ని తీసుకుపోయి ఇంటి దగ్గర తాగి ఉంటే బాగుండేది కదా అని వగస్తున్నారు.  

బ్రిట‌న్ ప్ర‌ధానిగా ట్ర‌స్‌.. రిషికి చేజారిన అవ‌కాశం

బ్రిట‌న్ ప్ర‌ధాని పోటీలో హోరాహోరీ పోరాడిన భార‌త్ సంత‌తికి చెందిన రిషి సునాక్ ను వెన‌క్కి నెట్టి లిజ్ ట్ర‌స్ గెలిచింది. తొలుత కన్జర్వేటివ్‌ పార్టీ టోరీ ఎంపీల మద్దతు సునాక్‌కే ఉన్నా.. క్రమంగా ట్రస్‌ పైచేయి సాధించారు. 1.72 లక్షల మంది టోరీ సభ్యులు ఆన్‌లైన్‌, పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా కన్జర్వేటివ్‌ నేత ఎన్నికలో ఓట్లు వేయగా.. వాటిల్లో 654 చెల్లుబాటు కాలేదు. మిగతా వాటిల్లో ట్రస్‌కు 81,136.. సునాక్‌కు 60,399 ఓట్లు వచ్చాయి. భారత కాలమానం ప్రకారం సోమ వారం(ఆగ‌ష్టు 5)సాయంత్రం 5 గంటలకు టోరీ 1922 కమిటీ చైర్మన్‌ సర్‌ గ్రాహం బ్రాడీ ఎన్నికల ఫలి తాలను విడుదల చేస్తూ..లిజ్‌ ట్రస్‌ను విజేతగా ప్రకటించారు. కన్జర్వేటివ్‌ పార్టీ నేత ప్రధానిగా బాధ్యత లు చేపట్టడం ఆనవాయితీ. మార్గరేట్‌ థాచర్‌, థెరిసా మే తర్వాత.. బ్రిటన్‌ ప్రధాని పదవిని చేజిక్కిం చుకున్న మూడో మహిళగా ట్రస్‌ రికార్డు సృష్టించనున్నారు. సోమవారం సాయంత్రమే ఆమె కేబినెట్‌ కూర్పుపై కసరత్తు ప్రారంభించారు. అయితే.. ట్రస్‌ మంత్రివర్గంలో రుషి సునాక్‌కు చోటు అనుమాన మేనని తెలుస్తోంది.  మంగళవారం బోరిస్‌ జాన్సన్‌కు వీడ్కోలు సమావేశం జరగనుంది. ఆ వెంటనే ట్రస్‌ స్కాట్లాండ్‌లోని బల్మోరల్‌ క్యాజిల్‌లో బ్రిటన్‌ రాణి ఎలిజబెత్‌-2ను కలుస్తారు. అక్కడే బ్రిటన్‌ రాణి ఆమెను ప్రధానిగా నియమిస్తూ ఉత్తర్వులిస్తారు. నిజానికి బ్రిటన్‌ వెలుపల ప్రధాని నియామకం జరగడం ఇదే మొదటిసారి. బ్రిటన్‌ రాణి ఆరోగ్య పరిస్థితుల రీత్యా ఈ కార్యక్రమాన్ని స్కాట్లాండ్‌లో ఏర్పాటు చేశారు. బుధవారం ఆమె కేబినెట్‌ను ప్రకటించవ‌చ్చు. ఆ తర్వాత బ్రిటన్‌ దిగువసభ-- హౌస్‌ ఆఫ్‌ కామన్స్‌లో ప్రధాని హోదాలో తొలి ప్రసంగం చేయనున్నారు. రిషి సునాక్‌ ముందు నుంచి ప్రధాని రేసులో ముందంజలో ఉన్నారు. ఆయ‌న గెల‌వ‌డానికి ఆస్కారం ఉంద‌ని ప్ర‌చార‌మూ జ‌రిగింది. ఇటు భార‌తీయులు ఎంతో సంతోషించారు. కానీ ఊహించ‌నివిధంగా బోరిస్‌ జాన్సన్‌ ఆయనకు వ్యతిరేకంగా ప్రకటనలు చేయడం, ట్రస్‌కు మద్దతివ్వడం ప్రతికూలంగా మారాయి. ట్రస్  కూడా తన ప్రచారంలో రిషి తీసుకువచ్చిన పన్నులనే టార్గెట్‌గా చేసుకున్నారు. ఆర్థిక మాంద్యం దిశలో బ్రిటన్‌ అడుగులు వేస్తున్న తరుణంలో రిషి సునాక్‌ ఆదాయ, ఇతర పన్నులను పెంచారు. రిషి పెంచిన పన్నులను తగ్గించడమే నా ప్రధాన లక్ష్యమంటూ ట్రస్‌ చేసిన ప్రచారం టోరీ సభ్యులను ఆకట్టు కుంది. అంతే కాదు ట్ర‌స్  ప్రచారాన్ని ప్రారంభించినప్పటి నుంచి మార్గరేట్‌ థాచర్‌ మాదిరిగా ఆహార్యం, నడవడికను మార్చుకుని అంద‌ర్నీ ఆక‌ట్టుకున్నారు.  బ్రిటన్‌ ప్రధానిగా పగ్గాలు చేపట్టనున్న లిజ్‌ ట్రస్‌ను భారత ప్రధాని మోదీ అభినందించారు. ఇరు దేశాల మధ్య ‘సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం’ మరింత బలపడేలా ఆమె కృషిచేస్తారని ఆకాంక్షిం చారు. ట్రస్‌లిజ్‌.. అభినందనలు. భారత్‌-బ్రిటన్‌ బంధాన్ని మీరు మరింత బలోపేతం చేయాలని కోరుకుంటు న్నామ‌ని ట్వీట్‌ చేశారు. 

ఫసల్ బీమా.. రైతులకు శఠగోపం.. బీమా కంపెనీలకు పైసలు

కేంద్ర ప్రభుత్వం ఘనంగా ప్రచారం చేసుకుని అమలు చేసిన ఫసల్ బీమా పథకం దారి తప్పిందని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమార్ స్వయంగా అంగీకరించారు. పేదలను కొట్టి పెద్దలకు పంచిన చందంగా రైతుల కోసం కేంద్రం తీసుకువచ్చిన ఈ పథకం అంతిమంగా  బీమా కంపెనీలకే ప్రయోజనకరంగా మారింది. ఈ విషయాన్ని స్వయంగా తోమార్ అంగీకరించారు. ఈ పథకం కింద గత ఐదేళ్లలో రైతులు, ప్రభుత్వాలు ప్రీమియం రూపంలో కోటీ 26లక్షల 521 కోట్ల రూపాయలు బీమా కంపెనీలకు చెల్లించాయి. అయితే ఈ పథకం కింద బీమా కంపెనీల నుంచి రైతులకు అందిన పరిహారం మాత్రం 87 వేల 320 కోట్ల రూపాయలు మాత్రమేననీ, ఈ పథకం ద్వారా బీమా కంపెనీలు  39, 201 కోట్ల రూపాయ‌లు లబ్ధి చేకూరింది.  అంటే రైతులకు కేవలం 69శాతం పరిహారంగా చెల్లించిన బీమా కంపెనీలు 31 శాతం నిధులు మిగుల్చుకున్నాయి. ఫసల్ బీమా పథకం రైతులకు ప్రయోజనం చేకూర్చేదిగా లేదనీ, బీమా కంపెనీలను పెంచి పోషించడానికే ఈ పథకాన్ని అమలు చేస్తున్నారా అంటూ విపక్షాలు మొదటి నుంచీ ప్రభుత్వాన్ని నిలదీస్తూనే ఉన్నయి. అయితే ప్రభుత్వం మాత్రం రైతులకు ప్రయోజనం చేకూరడం విపక్షాలకు ఇష్టం లేదంటూ ఎదురు దాడి చేస్తూ వచ్చింది. ఇప్పుడు స్వయంగా కేంద్ర వ్యవసాయ మంత్రి తోమరే ఫసల్ బీమా పథకం దారి తప్పిందని అంగీకరించడంతో ప్రభుత్వం డిఫెన్స్ లో పడింది.   ఇప్పటికైనా ఫసల్ బీమా యోజన పథకాన్ని బీమా కంపెనీలకు ప్రయోజనకరంగా కాకుండా రైతులకు ఉపయోగపడేలా మార్చాలని రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ పథకంలో ప్రీమియం కట్టేది రాష్ట్రప్రభుత్వాలు, రైతులు దీంతో కేంద్రం తనకు ఏ మాత్రం భారం కాకుండా ఈ పథకాన్ని రూపొందించి చేతులు దులిపేసుకుందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

వైసీపీ బంప‌ర్ ఆఫ‌ర్‌!

ఆషాఢం సీజ‌న్‌, పెళ్లిళ్ల సీజ‌న్‌ల‌కీ బట్ట‌ల దుకాణాలు ఆఫ‌ర్లు ఇస్తుంటాయి. ఒక చీర కొంటే ఒక‌టి ఫ్రీ, ఒక వ‌స్తువు కొంటే రెండు వ‌స్తువులు ఫ్రీ అంటూ. జ‌నం విర‌గ‌బ‌డ‌తార‌ని  ఆక‌ట్టుకునేందుకు వారి అస్త్రంగా అలాంటి ప్ర‌క‌ట‌న‌లు చేస్తూంటారు. అది వ్యాపారం పెంచుకోవ‌డానికి, క‌ష్ట‌మ‌ర్ల‌ను పెద్ద సంఖ్య‌లో రాబ‌ట్టు కోవ‌డానికి. అందులో అర్ధం ఉంది. కానీ విచిత్రంగా ఏపీలో ఏకంగా  ప్ర‌భుత్వ‌మే కొత్త‌ర‌కం బంప‌ర్ ఆఫ‌ర్ ఇచ్చింది. వింటే షాక్ అవుతారు.  వినాయక నిమజ్జనం సందర్భంగా వైసీపీ నేతలు  బంపర్ ఆఫర్  ప్రకటించారు. నిమజ్జనం అంటే ఏవో రక రకాల ప్రసాదాలు పెడతారు లేదంటే అన్నదానాలు చేస్తారు. కానీ  వైసీపీ నేతల రూటే సెపరేట్. విచ్చల విడిగా మద్యం పంపిణీ చేశారు. అది కూడా ట్రాక్టర్లలో తీసుకొచ్చి మరీ. ఇది ఎక్కడో కాదు ఏకంగా  ఏపీ సీఎం జగన్మోహన్‌రెడ్డి  నివాసానికి కేవలం కూత వేటు దూరంలోనే జరిగింది. తాడేపల్లి గేటు సెంటర్ దగ్గర విచ్చలవిడిగా మద్యం పంపిణీ జరిగింది. ట్రాక్టర్‌పై డ్రమ్ము పెట్టి మరీ వైసీపీ నేతలు మద్యం పంపిణీ  చేయడం గమనార్హం. పోలీసుల సమక్షంలోనే వైసీపీ నేతలు మద్యం పంపిణీ చేశారు. సీఎం జగన్‌రెడ్డి  నివాసానికి కూతవేటు దూరంలోనే పంపిణీ జరిగింది. వైసీపీ నేత వేణుగోపాలరెడ్డి తీరుపై మహిళలు మండిపడుతున్నారు.

భూతల నరకం బెంగళూరు.. నీటిలోనే జనజీవనం

దేశంలోనే అత్యంత ప్రశాంత నగరంగా, ఐటీ రాజధానిగా పేరొందిన బెంగళూరు ఇప్పుడు భూతల నరకంగా మారిపోయింది. రహదారులు చెరువులయ్యాయి. భారీ వర్షాలకు నగరం చిగురుటాకులా వణికింది. దారీ తెన్నూ కానరాక జనం నానా అవస్థలూ పడుతున్నారు. నగరంలో ఏ దారి చూసినా గోదారే అన్నట్లుగా తయారైంది. భారీ వర్షాలకు ర‌హ‌దారులు, హైవేలు మునిగాయి. కాల‌నీల్లోకి నీళ్లు వ‌చ్చి చేరి ప్ర‌జ‌లు నరకయాతన అనుభవిస్తున్నారు. ఇక్కడ ఉద్యోగులు బస్సుల్లో కార్యాలయాలకు వెళ్లే పరిస్థితి మారి.. వారే బస్సును కార్యాలయానికి తోసుకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. గత నాలుగు రోజులుగా బెంగళూరు నగరం జల దిగ్బంధంలో చిక్కుకుంది. ఉద్యోగులు బస్సుల్లోనూ, కార్లలోనూ కాకుండా కార్యాలయాలకు వెళ్లడానికి ట్రాక్టర్లను ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడింది. బీజేపీ అధికారంలో ఉన్నకర్నాటకలో అడ్మినిస్ట్రేషన్ ఎంత అధ్వానంగా ఉందో చెప్పడానికి గత మూడు రోజులుగా బెంగళూరు వాసులు అనుభవిస్తున్న కష్టాలే నిదర్శనమని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇండియన్‌ సిలికాన్‌ వ్యాలీ కడలిలా మారిపోయింది. భారీ వర్షాలకు బెంగళూరు నగరం   నీటమునిగింది. అత్యంత కీలకమైన ఐటీ కారిడార్‌ లో ఎటు చూసినా నీరే కనిపిస్తోంది. ఆదివారం సుమారు 20.44 సెంటీమీటర్ల వర్షం పడటంతో నగరంలో చిగురుటాకులా అల్లల్లాడింది. నివాసాలు, ఐటీ కార్యాలయాల్లోకి మోకాల్లోతు నీరు చేరింది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. బెంగళూరు ఔటర్ వద్ద భారీగా ప్రవహిాస్తున్న నీటిలోనే అత్యంత ప్రమాదకర పరిస్థితుల్లో అంబులెన్స్ వెళ్లాల్సి రావడం నగరంలో భయానక పరిస్థితికి అద్దం పడుతోంది. ఒక్క వానకే బెంగళూరు మునిగిపోవడంపై నగరవాసులు అధికార బీజేపీ ప్రభుత్వంపై దుమ్మెత్తిపోస్తున్నారు. తమను ఆదుకోమంటూ ప్రభుత్వాన్ని సోషల్ మీడియా వేదికగా కోరుతున్నారు.   పూర్తిగా నీట మునిగిన ప్రాంతాల ప్రజలను   సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అధికారులు బోట్లు ఏర్పాటు చేశారు.  వార్తర్ రోడ్డుతోపాటు బెల్లాందుర్, సార్జాపుర రోడ్డు, వైట్ ఫీల్డ్, ఔటర్ రింగ్ రోడ్డు, బీఈఎమ్ఎల్ లేఔట్ వంటి ఏరియాలు పూర్తిగా నీట మునిగాయి. ఈ ప్రాంతాల్లో  వర్షపు నీరు వరద ప్రవాహాన్ని తలపిస్తోంది.   ఈ నెల 9 వరకు కర్ణాటకలోని అనేక జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది.  

ఏపీలో వైసీపీకి శృంగభంగం.. శ్రీఆత్మసాక్షి తాజా సర్వే

ఇప్పటి కిప్పుడు ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు జరిగితే ఏమవుతుంది?  అధికార వైసీపీ సీట్ల సంఖ్య గణనీయంగా తగ్గుతుంది. విపక్ష తెలుగుదేశం పార్టీకి సీట్ల సంఖ్య బాగా పెరుగుతుంది. గత అసెంబ్లీ ఎన్నికలలో కేవలం ఒకే ఒక్క స్థానానికి పరిమితమైన జనసేనకు ఈ సారి నాలుగు నుంచి ఐదు స్థానాలు రావచ్చు. కొన్నిస్థానాలలో తెలుగుదేశం, వైసీపీల మధ్య పోరు నువ్వా నేనా అన్నట్లు ఉంటుంది. పొత్తులు లేకుండా ఏ పార్టీకి ఆ పార్టీ వేరు వేరుగా పోటీ చేస్తే పరిస్థితి ఇది. అలా కాకుండా పొత్తులు పొడిచి పోటీలోకి దిగినా పై ఫలితాలలో పెద్దగా మార్పు ఉండే అవకాశం లేదు. శ్రీ ఆత్మ సాక్షి గ్రూప్ తాజాగా శాస్త్రీయంగా నిర్వహించిన సర్వేలో తేలిన ఫలితమిది..   శ్రీ ఆత్మ సాక్షి గ్రూప్, 02.06.2022 -03.09.22 మధ్య నిర్వహించిన,  ‘మూడ్ ఆఫ్ ది ఏపీ’  సర్వే ప్రకారం  ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే.. తెలుగుదేశం పార్టీ 95 స్థానాలలో విజయం సాధించే అవకాశం ఉంది, అలాగే వైసీపీ 75 స్థానాలలో గెలుపొందుతుంది. ఇక జనసేప పార్టీకి 5 స్థానాలలో విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి. శ్రీ ఆత్మ సాక్షి ( ఎస్ఎఎస్)  గ్రూప్ ఏదో సర్వే చేశాం అంటే చేశాం అన్నట్లు కాకుండా, ఇంచు మించుగా నెలరోజుల వ్యవధిలో మూడు దఫాలుగా, అన్ని వర్గాల ప్రజలను, ప్రభుత్వ పథకాల లబ్దిదారులను వ్యక్తిగతంగా కలిసి, 43 అంశాలకు సంబంధిచి  సేకరించిన ప్రజాభిప్రాయం అధాంగా శాస్త్రీయంగా నిర్వహించింది. ఓటర్లను విభిన్న ప్రాతిపదికల ఆధారంగా  20 వర్గాలుగా విభజించి ప్రతి నియోజక వర్గంలో అన్ని వర్గాల ప్రజల అభిప్రాయాలను ప్రాధాన్యతా క్రమంలో సేకరించి  మరీ నిర్వహించిన సర్వే. నెల రోజుల వ్యవధిలో మూడు దశలుగా నిర్వహించిన ఈ సర్వే ఫలితం వాస్తవ పరిస్థితులకు దగ్గరగా ఉందని ఆత్మసాక్షి సర్వే ఒక ప్రకటనలో తెలిపింది. అయితే సర్వేలో అత్యధికులు బీజేపీ, తెలుగుదేశం పొత్తు పట్ల అయిష్టత వ్యక్తం చేశారని పేర్కొంది. అదే సమయంలో తెలుగుదేశం, జనసేన పొత్తు పట్ల సుముఖత వ్యక్తం చేశారని సర్వేలో తేలిందని పేర్కొంది. తెలుగుదేశం, జనసేన 2024 ఎన్నికలలో పొత్తు పెట్టుకుంటే తాము మద్దతు పలుకుతామని 55శాతం మంది, మద్దతు ఇవ్వబోమని 35శాతం మంది చెప్పగా, సుముఖత, వ్యతిరేకత వ్యక్తం చేయని వారి శాతం 5గా ఉంది. ఇక బీజేపీ, జనసేనలతో తెలుగుదేశం పొత్తు పట్ల వ్యతిరేకత వ్యక్తం చేసిన వారు 56శాతం మంది కాగా, మద్దతు పలుకుతామని చెప్పిన వారి శాతం 30గా ఉంది. మరో 14శాతం మంది మాత్రం ఏమో తెలియదు అని చెప్పారని శ్రీఆత్మసాక్షి సర్వే పేర్కొంది. ఇక జనసేన, బీజేపీ పొత్తు విషయంలో ఏకంగా 62శాతం మంది వ్యతిరేకత వ్యక్తం చేశారు. కేవలం 31 శాతం మంది మాత్రమే మద్దతు పలికారు. అదే పొత్తులు లేకుండా ఏ పార్టీకి ఆ పార్టీ వేరువేరుగా పోటీ చేస్తే వైసీపీకి 43శాతం, తెలుగుదేశంకు 44.5శాతం ఓట్లు పోలయ్యే అవకాశం ఉందనీ ఇక జనసేనకు అయితే 9శాతం, ఇతరులకు 2 శాతం ఓట్లు పోలయ్యే అవకాశం ఉందని సర్వే తేల్చింది. ఇక సైలెంట్ ఓట్ ఫ్యాక్టర్ నిశబ్ద ఓటు (ఎస్వీఎఫ్) 1.5శాతంగా ఉందని పేర్కొంది.    ఒక గత ఎన్నికలలో పోలిస్తే, వైసీపీ దాదాపు ఏడు శాతం   (6.95 శాతం) ఓట్లను కోల్పోతోంది. 2019 ఎన్నికలలో ఇంచుమించుగా 50 ( 49.95) శాతం ఓట్లు పొందిన వైసీపీ ఓటు షేర్ ఇప్పటి కిప్పుడు ఎన్నికలు జరిగితే, 43 శాతానికి పడిపోతుంది. టీడీపీ ఓటు  షేర్, గత ఎన్నికలలో పోలిస్తే 5 శాతానికి పైగా(5.25 శాతం) పుంజుకుని, 39.26 శాతం నుంచి 44.5 శాతానికి చేరుతుందని సర్వే సూచిస్తోంది. అదే విధంగా, జనసేన ఓటు షేర్ కూడా ఇంచుమించుగా రెండు శాతానికి పైగా (2.03 శాతం) వరకు పెరుగుతుందని శ్రీ ఆత్మసాక్షి సర్వే పేర్కొంది. గత ఎన్నికలో 6.7 శాతం ఓట్లు మాత్రమే పోలైన జనసేనకు, ఈసారి 9 శాతం ఓట్లు పోలవుతాయని సర్వే తేల్చింది. అంటే,సర్వే లెక్కల ప్రకారం చూస్తే, వైసీపే కోల్పోయే ప్రతి ఓటు, నేరుగా టీడీపీ లేదా జనసేన ఖాతాలో చేరుతోంది. అంటే ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఓటర్ల పై బీజేపీ, కాంగ్రెస్, వామపక్ష పార్టీల ప్రభావం దాదాపు శూన్యమని సర్వే చెబుతోంది. మరో వంక 1.5 శాతంగా ఉన్నఎటు పోతుందో తెలియని నిశ్శబ్ద ఓటు ( సైలెంట్ ఓటు ఫ్యాక్టర్, ఎస్ వీఎఫ్) కీలకంగా మారనుందని సర్వే పేర్కొంది. మొత్తంగా రాష్ట్రంలో ఇప్పటి కిప్పుడు ఎన్నికలు జరిగితే వైసీపీకి శృంగభంగం తప్పదని శ్రీ ఆత్మసాక్షి సర్వే తేల్చింది. అదే సమయంలో తెలుగుదేశం పార్టీకి విజయం నల్లేరుమీద బండి నడక కాదనీ తేల్చింది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ వ్యతిరేక పవనాలు బలంగా వీస్తున్నప్పటికీ కనీసంలో కనీసం 38 స్థానాలలో అధికార, విపక్షాల మధ్యా పోటీ హోరాహోరీగా ఉంటుందని పేర్కొంది.  తెలుగుదేశం 77 స్థానాలలో, వైసీసీ 56 స్థానాలలో విజయం సాధించే అవకాశం ఉందనీ, జనసేన నాలుగు స్థానాలలో విజయం సాధించవచ్చనీ సర్వే పేర్కొంది.ఇక ఉమ్మడి జిల్లాల వారీగా చూస్తే శ్రీకాకుళం  తెలుగుదేశం 6, వైసీపీ 2, విజయనగరం తెలుగుదేశం 4, వైసీపీ 3, విశాఖపట్నం తెలుగుదేశం 6, వైసీపీ 5, తూర్పు గోదావరి తెలుగుదేశం 8, వైసీపీ 4, జనసేన 2, పశ్చిమ గోదావరి తెలుగుదేశం 8, వైసీపీ 3, జనసేన 2 స్థానాలలో విజయం సధించే అవకాశం ఉందని సర్వే పేర్కొంది. ఇక కృష్ణా జిల్లా విషయానికి వస్తే ఇక్కడ తెలుగుదేశం 7 స్థానాలలోనూ, వైసీపీ నాలుగు స్థానాలలోనూ విజయం సాధించే అవకాశం ఉంది. గుంటూరు జిల్లాలో అయితే తెలుగుదేశంకు పది స్థానాలలో విజయావకాశాలు మెండుగా ఉంటే, వైసీపీకి నాలుగు స్థానాలలో విజయావకాశాలు ఉన్నాయి. మిగిలిన చోట్ల పోటీ హోరాహోరీగా ఉంటుందని సర్వే పేర్కొంది. అలాగే ప్రకాశం జిల్లాలోనూ అత్యధిక స్థానాలలో తెలుగుదేశం పార్టీకే విజయావకాశాలు ఉన్నాయి. ఈ జిల్లాలో 7 స్థనాలలో తెలుగుదేశం, నాలుగు స్థానాలలో వైసీపీ గెలుపొందే చాన్స్ ఉందని శ్రీ ఆత్మసాక్షి సర్వే పేర్కొంది. నెల్లూరు జిల్లా విషయానికి వస్తే ఇక్కడ వైసీపీకి ఒకింత మొగ్గు కనిపిస్తోంది. ఈ జిల్లాలో వైసీపీకి ఐదు చోట్ల విజయం సాధించే అవకాశాలు ఉంటే తెలుగుదేశం పార్టీ మూడు స్థానాలలో విజయం సాధిస్తుంది. కడపలో తెలుగుదేశం పార్టీ ఒక స్థానంలో విజయం సాధించే అవకాశాలు ఉన్నాయనీ, వైసీపీ ఐదు స్థానాలలో విజయం సాధిస్తుందనీ పేర్కొన్న సర్వే మిగిలిన నాలుగు స్థానాలలోనూ ఇరు పార్టీల మధ్యా నువ్వా నేనా అన్న స్థాయిలో పోటీ ఉంటుందని పేర్కొంది. కర్నూలులో వైసీపీ, టీడీపీలకు చెరో ఐదు స్థానాలలోనూ విజయావకాశాలు ఉంటే నాలుగు స్థానాలలో పోటీ నువ్వా నేనా అన్నట్లుగా ఉంటుందని సర్వే పేర్కొంది. అలాగే చిత్తూరులో తెలుగుదేశం పార్టీకి 5, వైసీపీకి 6 స్థానాలలో విజయావకాశాలు ఉండగా, మూడు స్థానాలలో పోరు హోరాహోరీగా ఉంటుందని శ్రీ ఆత్మసాక్షి సర్వే వెల్లడించింది. అనంతపురం జిల్లాలో తెలుగుదేశం పార్టీకి 7 స్థానాలలోనూ వైసీపీకి 6 స్థానాలలోనూ విజయావకాశాలు ఉండగా, ఒక చోట పోటీ నువ్వా నేనా అన్నట్లుగా ఉంది. మొత్తానికి ఆత్మసాక్షి సర్వే ప్రకారం రాష్ట్రంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వైసీపీ, తెలుగుదేశం పార్టీల మధ్య హోరాహోరీ పోరు తప్పదని సర్వే తేల్చింది. అదే సమయంలో గత ఎన్నికలతో పోలిస్తే వైసీపీకి ఓటు షేర్ గణనీయంగా తగ్గిపోతుందనీ, అదే సమయంలో తెలుగుదేశం బలంగా పుంజుకుంటుందనీ తేల్చింది. ఇక బీజేపీ, తెలుగుదేశం పొత్తు విషయంలో ప్రజలలో అంత సానుకూలత లేదనీ సర్వే వెల్లడించింది. మొత్తం మీద ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే తెలుగుదేశం పార్టీ విజయానికి అవకాశాలు మెండుగా ఉన్నాయని సర్వే పేర్కొంది.    

ఏమిటీ మౌనం..కేసీఆర్ కు జాతీయ రాజకీయాలు తప్ప మహిళల మరణాలు పట్టవా?

ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా నలుగురు మహిళలు ప్రాణాలు కోల్పోయారు. మరో 30 మంది మహిళలు మృత్యువు అంచుల దాకా వెళ్లి ప్రాణాలతో తిరిగొచ్చారు. ఇది ఎక్కడో, కాదు, తెలంగాణ రాష్ట్రంలో,ఇబ్రహీంపట్నంలో జరిగింది. నిజమే, సామూహిక కుటుంబనియంత్రణ శస్త్ర చికిత్సలు,కంటి ఆపరేషన్ శిబిరాలు ఇతరత్రా వైద్య శిబిరాలు నిర్వహించిన సమయంలో అపశృతులు చోటు చేసుకోవడం, అమాయకుల ప్రాణాలు కోల్పోవడం, అప్పుడప్పుడు, అక్కడక్కడా జరుగుతూనే ఉన్నాయి. అయితే మరీ ఇంత ఘోరంగా, 34 మందికి కుటుంబనియంత్రణ శస్త్ర చికిత్సలు చేస్తే, అందులో నలుగురు ప్రాణాలు కోల్పోవడం మిగిలిన ౩౦ మంది ఆసుపత్రిపాలు కావడం, విషాదంలో కెల్లా విషాదం.  అదలా ఉంటే, రాష్ట్రంలో ఇంతటి విషాదం జరిగినా  ఇంతవరకు రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఒక కన్నీటి చుక్క రాల్చలేదు సరికదా, కనీస ధర్మగా, ‘అయ్యో’ అని కూడా అనలేదు. అసలు స్పందించనే లేదు.  అలాంటి సంఘటన ఒకటి రాష్ట్రంలో జరిగిందనే సమాచారం అయినా ఆయనకు వుందో లేదో కూడా తెలియని విధంగా ముఖ్యమంత్రి మౌనం ఉందని, బాధిత కుటుంబాలే కాదు,సామాన్య ప్రజలు అవేదన వ్యక్త పరుస్తున్నాయి.  నిజమే, అధికారులు చేయవలసింది ఏదో చేశారు. చనిపోయినవారు చనిపోయినా, ప్రాణాలతో మిగిలిన వారిని అయినా బతికించారు. చనిపోయిన తల్లుల పిల్లలకు సర్కార్ సహాయం అందించే ప్రయత్నాలు ఏవో జరుగుతున్నాయి. అలాగే, జాతీయ మహిళా కమిషన్ కార్యదర్శి ఆధ్వర్యంలో అధికారుల బృందం ఆపరేషనలు జరిగిన ఇబ్రహీంపట్నం ఆస్పత్రిని సందర్శించారు. ఆపరేషన్లు చేసిన థియేటర్లను పరిశీలించి డాక్టర్లు, సిబ్బందిని విచారించారు. మృతుల కుటుంబసభ్యులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. పూర్తిస్థాయి నివేదిక వచ్చాక.. సంబంధిత డాక్టర్లపై చర్యలు తీసుకుంటామని జాతీయ మహిళ కమిషన్ కార్యదర్శి మీటా రాజీవ్ లోచన్ తెలిపారు.అలాగే రాష్ట్ర గవర్నర్’ తమిళి సై సౌందరరాజన్’ నిమ్స్’లో చికిత్స పొందుతున్న బాధిత మహిళలను పరామర్శించారు.  అయితే, ఇప్పడు అందరినీ వేధిస్తున్న ప్రశ్న.. ముఖ్యమంత్రి మౌనం.అవును. రాష్ట్రంలో అది కూడా ప్రగతి భవన్’ కొద్ది మైళ్ళ దూరంలో ఇంతటి విషాద సంఘటన జరిగినా, ముఖ్యమంత్రి కనీసం స్పందించ లేదు. ఇదొక్కటే కాదు, గతంలోనూ ఇంటర్ బోర్డు నిర్వాకం కారణంగా ఇంటర్ విద్యార్ధులు పదుల సంఖ్యలో ఆత్మహత్య చేసుకున్న సందర్భంలో అయితే నేమీ, బాసర త్రిబుల్ ఐటీ విద్యార్థులు ఆందోళన సందర్భంలో అయితే నేమీ, ముఖ్యమంత్రి స్పందించలేదు. సాక్షాత్తు గవర్నర్ తమిళసై సౌందర రాజన్ బాసర విద్యార్థులను పరామర్శించారు. కానీ, ముఖ్యమంత్రి మాత్రం స్పందించలేదు. కొండగట్టు బస్సు ప్రమాదం జరిగినప్పుడు 60 మంది ప్రాణాలు కోల్పోయారు. అప్పుడు అంతే, ముఖ్యమంత్రి అటు వైపు కన్నెత్తి చూడలేదు. అలాగే, ప్రపంచ సమస్యలు అన్నింటినీ గంటల తరబడి ఏకరవు పెట్టే ముఖ్యమంత్రి రైతులు, నిరుద్యోగుల ఆత్మహత్యల విషయంలోనూ ప్రభుత్వ వైఫల్యం కారణం ఇతరత్రా దుర్ఘటనలు చోటు చేసుకున్న సందర్భంలోనూ ముఖ్యమంత్రి స్పందించవలసిన రీతిలో స్పదించ లేదని సామాన్య ప్రజలు గుర్తు చేస్తున్నారు. ఎక్కడో ఏదో జరిగితే చలించి పోయే ముఖ్యమంత్రి, రాష్ట్రంలో జరుగుతున్న దుర్ఘటనల విషయంలో ఎందుకు స్పందించరని, సామాన్యులు ప్రశ్నిస్తున్నారు. అలాగే, తెలంగాణ ప్రజలకు ఏ కష్టం వచ్చినా కంటికి రెప్పలా కాపాడే బాధ్యత తనదని మాటిచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్, ప్రభుత్వ నిర్వాకం వలన ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలను ఎందుకు పరామర్శించ లేదని, ఆ అభాగ్యులు ముఖ్యమంత్రి పలకరింపుకు అయినా నోచుకోలేదా? అని అడుగుతున్నారు.  ముఖ్యమత్రి దృష్టి మొత్తంగా జాతీయ రాజకీయాల వెంట పరుగులు తీస్తోంది. అందుకే, రాష్ట్ర ప్రజలను పట్టించుకోకుండా, దేశంలో గుణాత్మక మార్పు కోసం అంటూ తెలంగాణ ప్రజల సొమ్మును ఎవరెవరికో ఇచ్చుకుంటూ పోతున్నారు. కష్టాల్లో ఉన్న ఇతర రాష్ట్రాల ప్రజలను ఆదుకోవడాన్ని ఎవరు తప్పు పట్టరు.. పట్టకూడదు. కానీ, ఎంతో విశ్వాసంతో రెండుసార్లు అధికారం ఇచ్చిన ప్రజల కష్టాలను ముఖ్యమంత్రి పట్టించుకోక పోవడం ఏమిటని మాత్రమే ప్రజలు అడుగుతున్నారు.  అందుకే కావచ్చును, ముఖ్యమంత్రి ప్రవర్తిస్తున్న తీరు రోమ్ నగరం తగలబడుతుంటే ఫిడేల్ వాయించిన నీరో చక్రవర్తి చక్రవర్తిని గుర్తుకు తెస్తోందని అంటున్నారు. ప్రజల కష్టాలు, కన్నీళ్ళు  ఎందుకు ముఖ్యమంత్రి కంటికి కనిపించడం లేదని..అడుగుతున్నారు. ఇలా ఒకటని కాదు .. ముఖ్యమంత్రి ముందు ఎన్నో ప్రశ్నలు నిలుస్తున్నాయి.

ప్రధాని రేసులో మరో కృష్ణుడు

గుర్తుండే ఉంటుంది.రాష్ట్రపతి ఎన్నికల్లో ఉమ్మడి అభ్యర్ధిని నిలిపేందుకు, కాంగ్రెస్, ఎన్సీపీ, టీఎంసీ, వామ పక్షాలు సహా  సుమారు ఓ 20 వరకు పార్టీలు సమాలోచనలు జరిపాయి. అదికూడా  ఒకసారి కాదు. దఫ దఫాలుగా మూడు నాలుగుసార్లు సమావేశమయ్యారు. చర్చలు జరిపారు. సంప్రదింపులు సాగించారు. ఎన్సీపీ అధినేత శరద్ పవార్,  బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ,  కాంగ్రెస్ సీనియర్  నాయకుడు మల్లిఖార్జున ఖర్గే, లెఫ్ట్ నేతలు సీతారాం ఏచూరి,  డి.రాజ... ఇలా ఒకరని కాదు,  విపక్ష్లాల ముఖ్య నేతలంతా రాష్ట్రపతి ఉమ్మడి అభ్యర్ధి కోసం సుదీర్ఘంగా చర్చలు, సంప్రదింపులు జరిపారు. అలా సమావేశమైన ప్రతిసారి ఒక పేరు పైకి రావడం, వారు‘సారీ’ చెప్పి తప్పించుకోవడం ఒక ప్రహాసనంగా సాగింది. ముందు మమతా బెనర్జీ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్ పేరును ప్రతిపాదించారు, ఆయన నో..అన్నారు.ఆ తర్వాత ఫరూక్ అబ్దుల్లా, గోపాలకృష్ణ గాంధీ పేర్లు ప్రస్తావన కొచ్చాయి.. ఆ ఇద్దరు కూడా .. సారీ ..చెప్పి తప్పుకున్నారు. చివరాఖరుకు, కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ మాజీ నేత యశ్వంత్ సిన్హా నాలుగో  కృష్ణుడిగా తెరపై కొచ్చారు. ఓటమి ఖాయమని తెలిసినా, పోటీచేశారు. ఓడిపోయారు.  అయితే, ఇప్పడు ఇదంతా ఎందుకు చెపుతున్నట్లని, మీరు అడిగితే అడగవచ్చును. నిజమే, 2024 లోక్ సభ ఎన్నికల్లో ప్రధాని అభ్యర్ధిగా, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కర్చీఫ్ వేయడానికి, ఆనాటి రాష్ట్రపతి ఎన్నికలలో పోటీచేసే అభ్యర్ధులుగా తెరపై కొచ్చి వెళ్ళిన వరస కృష్ణుల కథకు డైరెక్ట్ గా ఏ సంబంధమ లేక పోవచ్చును కానీ, కొంచెం లోతుగా చూస్తే బీరకాయ పీచు సంబంధం ఏదో ఉన్నట్లే ఉందని పిస్తోంది..  నిజానికి, 2024 లోక్ సభ ఎన్నికల్లో బీజేపీని ఓడించి ప్రధాని మోడీని గద్దెడించాలనే బలమైన ఆకాంక్ష గాంధీల నుంచి కల్వకుంట్ల  ఫ్యామిలీ వరకు విపక్ష నేతలు అందరిలో వుంది. అదే సమయంలో అందరికీ, అది ఏ ఒక్కరి వల్లో, ఎ ఒక్క కూటమి వల్లనే అయ్యే పని కాదని కూడా తెలుసు. అందుకే, 2024 నాటికి అందరూ కలిసి ఏకమై మోడీ ఓడించే ‘పవిత్ర’ యజ్ఞానికి అంకురార్పణగానే, రాష్ట్రపతి ఎన్నికల్లో ఉమ్మడి అభ్యర్ధి ఆలోచన పురుడు పోసుకుంది.  అయితే,  ఆ ప్రహసనం, ఆ తర్వాత అదే పంధాలో సాగిన ఉప రాష్టపతి ఎన్నిక ప్రహసనం ఎలా ముగిసిందో అందరికీ తెలిసిన విషయమే.  రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల సందర్భంగా ప్రతిపక్షాల మధ్య ఐక్యత కోసం సాగిన విఫల యత్నంగా మిగిలి  పోయినా, అది అయ్యే పని కాదని ‘క్లియర్ కట్’ గా అందరికీ తెలిసి పోయినా, ప్రతిపక్ష పార్టీలు, పట్టు వదలని విక్రమార్కునిలా, భేతాళుడి శవాన్ని,  కథలను మోస్తూనే ఉన్నారు. 2024లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో నరేంద్రమోడీ ప్రభుత్వాన్ని గద్దె దింపేందుకు, బీజేపీ యేతర ప్రభుత్వాన్ని గద్దె పై కూర్చో పెట్టేదుకు, ఎవరి ప్రయాణాల్లో వారున్నారు. అదేమీ తప్పుకాదు కానీ, 2024 ఎన్నికల ముఖ్యచిత్రంపై ప్రధాని రేసులో నిలుస్తున్న, కృష్ణుల సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతోంది. పార్టీ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించేందుకు ససేమిరా అంటున్న రాహుల్ గాంధీ మొదలు, పట్టుమని పది మంది ఎంపీలు లేని, తెలంగాణ ముఖ్యమంత్రి, తెరాస అధినేత కేసీఆర్ వరకు బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ అధినేత్రి మమత బెనర్జీ , ఆప్ అధ్యక్షుడు, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ ఇలా ఇప్పటికే ఓ అరడజను మంది వరకు ప్రధాని రేసులో ఉన్నారు. ఇప్పడు,అ జాబితాలో, బీహార్ ముఖ్యమంత్రి, జేడీ(యు) అధినేత నితీష్ కుమార్ పేరు కూడా చేరింది.   నిన్న మొన్నటి వరకు బీజేపీ సారథ్యంలోని ఎన్డీఎ కూటమిలో ఉన్న నితీష్ కుమార్ ఈ మధ్యనే కమలానికి కటీఫ్ చెప్పి, ఆర్జేడీ, కాంగ్రెస్ కుతమితో జట్టు కట్టారు. ఇపుడు ఆయన కూడా, ‘పీఎం రేస్ 2024’లో కర్చీఫ్ వేశారు. అందుకే మళ్ళీ ఇప్పడు పౌరాణిక నాటకాల్లో, ఒకే పాత్రను నలుగురైదుగురు వేసినప్పుడు, ఒకటో కృష్ణుడు, రెండవ కృష్ణుడు వచ్చి పోయినట్లుగా, ఇప్పడు ప్రధాని రేసులో మరో కృష్ణుడిగా నితీశ్ రంగ ప్రవేశం చేశారు. అయితే చివరాఖరకు ఉట్టి కొట్టే కృష్ణుడు ఎవరో .. ? ఇదీ అసలు సిసలు భేతాళ ప్రశ్న.

కేజ్రీ బాట‌లో  సోరేన్‌..  బ‌ల‌ప‌రీక్ష‌లో విజ‌యం

బీజేపీ కుట్రలను ఛేదిస్తూ ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ప‌ద్ధ‌తిలోనే జార్ఖండ్ సీఎం హేమంత్ సోరేన్ అడుగు ముందుకు వేసారు.  అసెంబ్లీలో హేమంత్ సోరెన్ సర్కార్ బల నిరూపణలో విజయవంత మయింది. 81 మంది సభ్యులున్న అసెంబ్లీలో అధికార కూటమికి 49 ఓట్లు వచ్చాయి. కేంద్ర ఎన్నికల సంఘం సిఫార్సు మేరకు సోరెన్ శాసన సభ్యత్వం రద్దు చేసే అవకాశం ఉందని వార్తలు వచ్చాయి. సోరెన్ శాసనసభ్యత్వం పై గ‌వ‌ర్న‌ర్ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అయితే ఈ లోపు తన ప్రభుత్వాన్ని కూలగొట్టే ప్రయ త్నాలు జరుగు తున్నాయని హేమంత్ సోరెన్ బలపరీక్షకు దిగారు. తాను బలపరీక్షలో నెగ్గడంతో  ఇక మరో  ఆరు నెలల వరకూ ప్రభుత్వానికి ఇబ్బంది ఉండ‌దు. కాగా, శాస‌న‌స‌భ స‌భ్య‌త్వాన్ని ర‌ద్దు చేయాల‌ని గ‌వ‌ర్న‌ర్‌కి సిఫార‌సు చేసిన క్ష‌ణం నుంచీ తన ప్రభు త్వాన్ని కాపాడుకునేందుకు ఆధికార కూటమి  ప్రయత్నాలు  ముమ్మరం చేసింది. అందులో భాగంగా ఛత్తీస్​గఢ్​​ వెళ్లిన 30 మంది ఎమ్మెల్యేలు తిరిగి రాంచీకి చేరుకున్నారు. రాయ్‌పుర్‌ నుం చి ఛార్టెడ్‌ విమా నంలో 30మంది ఎమ్మెల్యేలు, ఇతర నేతలు రాంచీకి చేరుకున్నారు. సోమవారం జరిగిన అసెంబ్లీ ప్రత్యేక సమావేశంలో ముఖ్యమంత్రి హేమంత్‌ సోరెన్‌ తన బలాన్ని నిరూపించుకునేందుకు సిద్ధ మయ్యా రు. గవర్నర్ నిర్ణయం ప్రకటించకపోవటం,  బీజేపీ తీరు పైన జార్ఖండ్ అధికార పార్టీ అనుమా నాలు వ్యక్తం చేసింది. ఈ నేపథ్యం లో రాష్ట్ర రాజకీయాల్లో నెలకొన్న ప్రతిష్టంభనపై స్పష్టత ఇవ్వాలని కోరుతూ గవర్నర్ కు యూపీఏ ఎమ్మె ల్యేలు విజ్ఞప్తి చేశారు. కాగా సోమ‌వారం (సెప్టెంబ‌ర్ 5) సోరేన్ ప్ర‌భుత్వం విశ్వాస ప‌రీక్ష లో విజ‌యం సాధించింది. సోరేన్ ప్ర‌భు త్వానికి మ‌ద్ద‌తుగా 48 మంది ఎమ్మెల్యేలు ఓటు వేశారు. కేవ‌లం  ఈ  ప‌రీక్ష‌ను ఎదుర్కొనేందుకే ముఖ్య మంత్రి సోరేన్ సోమ‌వారంనాడు ప్ర‌త్యేకంగా అసెంబ్లీ స‌మావేశాన్ని ఏర్పాటు చేశారు. త‌న ప్ర‌భుత్వం స‌భా విశ్వా సాన్ని కోరుతూ ఆయ‌న తీర్మానం ప్ర‌వేశ పెట్టారు. దీనిపై జ‌రిగిన చ‌ర్చ‌లో ఆయ‌న మాట్లాడుతూ బిజెపి పై విరుచుకు ప‌డ్డారు. ఆ పార్టీ వ‌ల్లే ఈ ప‌రిస్థితి ఏర్ప‌డింద‌ని విమ‌ర్శించారు. ఎన్నికల్లో గెలవడానికి అల్లర్లకు ఆజ్యంపోసి దేశంలో  అంతర్యుద్ధం లాంటి పరిస్థితిని క‌ల్పించేందుకు బిజెపి ప్రయత్నిస్తోందని హేమంత్ ఆరోపించారు. తన ప్రభుత్వాన్ని పడగొట్టడానికి అస్సాం సీఎం హిమంత బిస్వా శర్మ  జార్ఖండ్ ఎమ్మెల్యే లను కొనుగోలు చేయడంలో  పాలుపంచుకున్నారని ఆయన ఆరోపించారు.

రామ‌న్ మెగ‌సెసె అవార్డు స్వీక‌రించ‌ను..కేర‌ళ మాజీమంత్రి శైల‌జ‌ 

భార‌త‌దేశంలో కోవిడ్ విజృంభించిన స‌మ‌యంలో వైద్య‌రంగం అందించిన సేవ‌లు అన‌న్య‌ సామాన్య‌ మ‌ని అంద‌రూ అంగీక‌రిస్తారు. అన్నిప్రాంతాల్లోనూ డాక్ట‌ర్లు, న‌ర్సులు ప్ర‌భుత్వ ఆస్ప‌త్రులు, ప్రైవేటు ఆస్పత్రులు ఎంతో అద్బుతంగా ప‌నిచేసి ప్ర‌జ‌ల‌ను కాపాడ‌డంలో ఎన్నో త్యాగాలు చేసి ప్ర‌జ‌ల మ‌న్ననలు అందుకున్నారు. నిఫా వైరస్‌, కొవిడ్‌తో కేరళ ప్రభుత్వం చేసిన యుద్ధంలో మంత్రిగా శైలజ అద్భుతంగా పని చేశారు. ఆమె సేవలను  రామ‌న్ మెగ‌సెసె అవార్డు కమిటీ గుర్తించింది. కానీ కేరళ ఆరోగ్య‌శాఖ మాజీ మంత్రి శైల‌జ ఆ అవార్డును స్వీక‌రించకూడ‌ద‌ని నిర్ణ‌యిం చారు. ప్రజాసేవకు తన జీవితాన్ని అంకితంచేసిన మహోన్నత వ్యిక్తి రామన్‌ మెగసెసె సేవకు గుర్తింపుగా ఆయన పేరుతో ఒక అవార్డును ప్రవేశపెట్టారు. 1957 ఏప్రిల్‌ మాసంలో న్యూయార్క్‌లోని  రాక్‌వెల్‌ బ్రదర్స్ ఫౌండేషన్‌ వారు ఈ అవార్డును నెలకొల్పారు. ప్రతి సంవత్సరం, వివిధ రంగాల్లో కృషి చేసిన ఆసియాకు చెందిన ప్రముఖులకు ఈ అవార్డును బహుకరిస్తారు. ఆసియా నోబెల్‌గా పేరొందిన ఈ అవా ర్డును ప్రభుత్వ సర్వీసులు, కమ్యూనిటీ లీడర్‌షిప్‌, జర్నలిజం, లిటరేచర్‌, శాంతి తదితర రంగా లలో సేవచేసినవారికి ఇస్తారు. తన జీవితకాలం మొత్తం శాంతికోసం పోరాటం చేసిన రామన్‌ మెగసెసె యువ రాజకీయ నాయ కులకు ఆదర్శవాదిగా పేరు గాంచాడు   రామన్‌ మెగసెసె అవార్డును స్వీకరించకూడదని కేరళ ఆరోగ్య శాఖ మాజీ మంత్రి కేకే శైలజ నిర్ణయించు కు న్నారు. దీనిపై శైలజ మాట్లాడుతూ, రామన్‌ మెగసెసె 64వ అవార్డును త‌న‌కు ఇవ్వాలని నిర్ణయించి నట్లు కమిటీ తెలిపింది. తాను  రాజకీయ నాయకురాలిన‌ని, ఈ అవార్డును రాజకీయ నేతలకు ఎన్నడూ ఇవ్వలేదనీ అన్నారు.  సీపీఎం కేంద్ర కమిటీ సభ్యురాలిగా ఉన్న తాను ఈ  అవార్డు స్వీకరణ అంశాన్ని పార్టీ నేతలతో చర్చించామ‌న్నారు.  దానిని తీసుకోకూడదని సమిష్ఠిగా నిర్ణయం తీసుకున్నామ‌ని శైల‌జ తెలిపారు. రామన్‌ మెగసెసె అవార్డును ఎన్‌జీవో అందిస్తోంది. ఆ సంస్థ కమ్యునిస్టు పార్టీ సిద్ధాంతాలను బలపరచద‌ని కేర‌ళ మాజీ మంత్రి శైల‌జ‌ పేర్కొన్నారు.

ఇది క‌దా స్వామి భ‌క్తి అంటే..!

జై జై గ‌ణేషా..అంటూ గ‌ణేష మండ‌పాలు  మార్మోగుతున్నాయి. గ‌ణేష నిమజ్జ‌న‌ చాలా ప్రాంతాల్లో ఆరంభ‌ మయింది. గ్రామాల్లో, ప‌ట్ట‌ణాల్లో చాలా ప్రాంతాల్లో ఇప్ప‌టికే చాలా గ‌ణేష విగ్ర‌హాలు నిమ‌జ్జ‌న మ‌య్యాయి. గ‌ణేషుని ఊరేగిస్తూ భక్తి పార‌వ‌శ్యంతో పాటు స‌ర‌దా కూడా జోడించి భ‌క్తిపాట‌లతో పిల్ల‌లు, పెద్ద‌వాళ్లు బ‌ళ్ల‌మీద ఊరేగిస్తూ తీసికెళ్ల‌డం మామూలు. ఇది అన్ని ప్రాంతాల్లో జ‌రిగేదే. చాలామటుకు నిజంగా సంగీత‌ప‌ర  సాంప్రదాయ రీతి  పాట‌లు, లేక‌పోతే సినిమా భ‌క్తిపాట‌ల‌తో ఊరేగిస్తూంటారు. మ‌ధ్య‌లో జై బోలో గ‌ణేష్ మ‌హారాజ్‌కీ జై అంటూ అరుస్తూ నానా సంద‌డిగా వాహ‌నాలు క‌దిలిపోతూంటాయి.  సంప్ర‌దాయ‌ప‌ద్ధ‌తికి కాస్తంత రాజ‌కీయ‌రంగూ జోడిస్తున్నారు ఇటీవ‌ల‌. అన్ని ప్రాంతాల్లోని రాజ‌కీయ నాయ కులు కూడా గ‌ణేషుని ఊరేగింపులో పాల్గొని త‌మ ప్రాంతీయుల‌ను ఆక‌ట్టుకోవ‌డానికి, పార్టీ ప‌రంగా వారిని ద‌గ్గ‌ర చేసుకోను వీల‌యినంతగా శ్ర‌మిస్తున్నారు. గ‌ణేష మండ‌పాల ఏర్పాటు, పూజ‌లు, ఇపుడు ఊరేగింపు అన్నింటా ఆయాప్రాంత రాజ‌కీయ‌నాయ‌కులు వారి వారి పార్టీల‌ను బాగానే  ప్ర‌చారం చేసు కుంటున్నారు. అందులో భాగంగానే శ్రీ‌కాకుళం జిల్లా ప‌లాస‌లో జ‌రిగిన ఒక గ‌ణేష ఊరేగింపులో భ‌క్తి  పాట మార్చేసి మ‌రీ రాజ‌కీయ రంగు పులిమి ఆనందించారు.  గ‌ణేషుని ఊరేగింపులో భాగంగా ప‌లాస భ‌క్త‌గ‌ణంతో పాటు చిందులు వేశారు మంత్రి అప్ప‌ల‌రాజు. అంతే కాదు ఆ ఉత్స‌వంలో జ‌గ‌న‌న్నా.. జ‌గ‌న‌న్నా.. జ‌న‌మంతా నీ వెంటే! అంటూ పాట వినిపించ‌గానే రెండు స్టెప్పులు కూడా వేశారు. గ‌ణేష ఉత్సావాల్లో జ‌గ‌న‌న్నా.. అంటూ పాట ఏమిటో అటుగా పోతున్న‌వారికి అర్ధం కాలేదు. కాదేదీ క‌విత‌కు అన‌ర్హం అన్నారు పెద్ద‌లు.  జ‌గ‌న‌న్న‌ను కీర్తించ‌డానికి, స్వామిభ‌క్తి ప్ర‌ద‌ర్శించడానికి వైసీపీ వారికి స‌మ‌యం, సంద‌ర్భంతో సం బంధం లేదు. గ‌ణేషునికంటే జ‌గ‌న‌న్నే ఈ లోకాన్ని కాపాడ‌తా డ‌న్న వీరాభిమానాన్ని ప్ర‌ద‌ర్శించారు. ఇది క‌దా స్వామి భ‌క్తంటే!

త‌ల్లి ప్రేమ ముందు పాము  ఓ లెక్కా?!

పిల్ల‌ల‌కి అన్నీ త‌ల్లే. ఆనందంలో, బాధ‌లోనూ. మంచిమార్కులు వ‌స్తే రిపోర్టుతో త‌ల్లిద‌గ్గ‌రకే ముందు ప‌రుగు. ఆ త‌ర్వాత‌నే సంత‌కం కోసం తండ్రి ద‌గ్గ‌రికి. రాయి ర‌ప్పా త‌గిలితే అమ్మా అంటూనే క‌ట్టు క‌ట్టిం చుకోను త‌ల్లి ద‌గ్గ‌రికే ప‌రుగు. త‌ర్వాతే నాన్న‌వెళ్లి మందులు తెస్తాడు. త‌ల్లి అంటే గొప్ప ఆనందం, త‌ల్లి అంటే గొప్ప ర‌క్ష‌.  ఎంత దూరంలో ఉన్నా ఈ పిచ్చి వెధ‌వ స‌రిగా ఉన్నాడో లేదో, తిన్నాడో లేదో, చ‌దువుతున్నాడో లేదో అనే అనుకుంటుంది త‌ల్లి. మ‌రీ ఐదారు త‌ర‌గ‌తిలో ఉన్న‌వాడ‌యితే , వాడికి దాదాపు ద‌రిదాపుల్లోనే తిరుగుతూంటుంది త‌ల్లి. అలాంటి ఓ త‌ల్లి త‌న పిల్ల‌డిని అమాంతం పెద్ద త్రాచు నుంచి కాపాడుకుంది.  క‌ర్ణాట‌కా  మాండ్యా లో  ఓ త‌ల్లి కొడుకు అప్పుడే ఇంట్లోంచి బ‌య‌టికి వ‌చ్చారు. మెట్లు దిగే స‌మ‌యంలో హ‌ఠాత్తుగా పిల్ల‌డి కాలుకి పెద్ద త్రాచుపాము త‌గిలింది. వాడు కెవ్వున అరిచేస‌రికి త‌ల్లికి గుండాగినంత ప‌నయింది. తీరా చూస్తే త్రాచుపాము పిల్ల‌డిని కాటు వేయ‌డానికి త‌ల ఎత్తింది. రెప్ప‌పాటులో ఆ త‌ల్లి పిల్ల‌డి చేయి ప‌ట్టి ఇవ‌త‌ల‌కి లాగి ప‌డేసింది. ఇదంతా సిసిటీవీలో రికార్డ‌యింది.  త‌ర్వాత చాలాస‌మ‌యానికి  అంతా తేరుకున్న త‌ర్వాత ఆ పాము ఎటు వెళ్లిందీ ఎవ‌రూ గ‌మ‌నించ‌లేదు. కానీ ఎటో వెళిపోయింది. ఆమె భ‌యం భ‌యంగా పిల్ల‌డిని హ‌త్తుకునే ఉండిపోయింది.  త‌ర్వాత ఎప్పుడో తేరుకుని సీసీటీవీ ఫుటేజ్ని జ‌నంతోపాటు చూసింది. పెద్దత్రాచు త‌ల పైకెత్తి కాటువేయ‌డానికి ముందు కు వ‌చ్చిన‌పుడు ఏదో శ‌క్తి ఆవ‌హించినట్ట‌యి పిల్ల‌డిని చేయిప‌ట్టి లాగేయ‌గ‌లిగాన‌ని అన్న‌ది ఆ త‌ల్లి.

మునుగోడుకు ‘ముందస్తు’మందు ?

తెలంగాణ ముఖ్యమంత్రి  కల్వకుంట్ల చంద్రశేఖర రావు మరోసారి ముందస్తు ఎన్నికలకు వెళ్ళే ఆలోచనలో ఉన్నారనే వార్తలు రాజకీయ, మీడియా వర్గాల్లో చాలా కాలంగా వినిపిస్తున్నాయి. అయితే, ముఖ్యమంత్రి ఒకటికి రెండు సార్లు అలాంటి ఆలోచన ఏదీ లేదని స్పష్టం చేశారు. చివరకు గత మార్చిలో జరిగన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలలోనూ అదే విషయం స్పష్టం చేశారు. కానీ . ఒకటి రెండు నెలల తర్వత మళ్ళీ  ఆయనే, విలేకరుల సమావేశంలో  కేంద్ర ప్రభుత్వం  వెంటనే ఎన్నికలు నిర్వహించేలా ఉంటే, ఇప్పటికిప్పుడు అసెంబ్లీ రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు వెళ్లేందుకు సిద్దంగా ఉన్నానని ప్రకటించారు. ఒక రకంగా ఆయన కేంద్ర ప్రభుత్వానికి, బీజేపీకి సవాలు విసిరారు. (అదే సందర్భంలో అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడు వచ్చినా తెరాస 100 కి పైగా స్థానాలతో విజయం సాధిస్తుందనే ధీమా కుడా వ్యక్త పరిచారు. సరే అది వేరే విషయం ) ఏది ఏమైనా ఇంచుమించుగా ఏడెనిమిది నెలలకు పైగానే, ముందస్తు ఎన్నికల ముచ్చట రాజకీయ, మీడియా వర్గాల్లో తరచూ వినిపిస్తూనే వుంది అధికార తెరాస సహా ఆన్ని రాజకీయ పార్టీలులలోనూ ముదస్తు వస్తే.. అనే కోణంలోనూ ఎన్నికల సన్నాహాలు సాగుతున్నాయి.  ఇక ప్రస్తుతంలోకి వస్తే, మంగళవాకం (సెప్టెంబర్ 6) నుంచి రాష్ట్ర శాసన సభ వర్షాకాల సమావేశాలు ప్రారంభమవుతున్న నేపధ్యంలో, ఇప్పుడు ముందస్తు ముచ్చట మళ్ళీ మరోమారు తెర మీదకు  వచ్చింది. అయితే, రెండు రోజుల క్రితం (శనివారం) జరిగిన తెరాస సభాపక్ష సమావేశంలో ముందస్తు ఎన్నికలకు వెళ్ళే ఆలోచనే లేదని ముఖ్యమంత్రి మరోమారు స్పష్టం చేశారని అంటున్నారు.  సో .. ముందస్తు ఎన్నికల ముచ్చటను ముఖ్యమంత్రి పూర్తిగా పక్కన పెట్టేసినట్లేనా? అంటే, అవుననే వారే కాదు, కాదనే వారు కూడా ఉన్నారు. తెరాస నాయకులలో కూడా కొందరు, మంగళవారం (సెప్టెంబర్ 6) నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాలే ప్రస్తుత అసెంబ్లీ ఆఖరి సమావేశాలు కావచ్చనే అనుమానాలు వ్యక్త పరుస్తున్నారు.  మరో వంక రాజకీయ, మీడియా వర్గాల్లోనూ అటూ ఇటుగా అదే  చర్చ జరుగుతోంది, నిజానికి, ఒకే రోజు (సెప్టెంబర్3) మంత్రివర్గ సమావేశం, తెరాస శాసనసభా పక్ష సమావేశం నిర్వహించడం, అది కూడా శాసనసభ సమావేశాలకు రెండే రెండు రోజుల ముందు కావడంతో, ముఖ్యమంత్రి కీలక నిర్ణయం ఏదో తీసుకుంటారని, అందరూ అనుకున్నారు, అయితే, మంత్రివర్గ సమావేశంలో అలాగే, శాసనసభ పక్ష సమావేశంలో ముఖ్యమంత్రి ప్రత్యక్షంగా ఆ ప్రస్తావన చేయలేదు. కానీ, పరోక్షంగా మాత్రం ముందస్తుకు సంబంధించి స్పష్టమైన సంకేతాలే ఇచ్చారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. నిజానికి గత కొంత కాలంగా జరుగుతున్న పరిణామాలను గమనిస్తే, ముఖ్యమంత్రి ముందస్తు ఆలోచనను పూర్తిగా పక్కన పెట్టలేదనే విషయం అర్థమవుతుందని అంటున్నారు.  నిజానికి మంత్రివర్గ సమావేశం, ఆ వెంటనే శాసన సభా పక్ష సమావేశం నిర్వహించడంలోనే అనుమానాలు మొదలయ్యాయి. అలాగే, శాసన సభా పక్ష సమావేశంలో ముఖ్యమంత్రి మర్మగర్భంగా చేసిన కీలక వ్యాఖ్యలు అనుమానాలను మరింతగా బలపరిచేలా ఉన్నాయని  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ముఖ్యమంత్రి ఎప్పటిలానే సర్వే ప్రస్తావన తెచ్చారు, ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే, 72 నుంచి 80 స్థానల్లో తెరాస గెలుస్తుందని, కొద్దిగా కష్టపడితే 90 దాకా వెళ్ళే అవకాశం  ఉందని తాజా సర్వే చెప్పినట్లు చెప్పారు. ఒకటి రెండు నెలల క్రితం మొత్తం 119 నియోజక వర్గాలకు గానూ 105 నియోజక వర్గాల్లో గులాబీ జెండా ఎగురుతుందని ఘంటాపథంగా  చెప్పిన ముఖ్యమంత్రి, ఒక్కసారిగా 72 నుంచి 80 స్థానాలకు, 25 స్థానాలు దిగివచ్చారు. అంటే తెరాస గ్రాఫ్ పడిపోతున్న విషయాన్ని ముఖ్యమంత్రి గ్రహించినట్లు గుర్తించవలసి ఉంటుదని అంటున్నారు. నిజానికి గతంలోనే, ఎన్నికల వ్యూహ కర్త ప్రశాంత్ కిశోర్, ఉభయ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఆలస్యం అమృతం విషం అని హెచ్చరించినట్లు వార్తలొచ్చాయి.ఎన్నికలు ఆలస్యం అయిన కొద్దీ అధికార పార్టీ గ్రాఫ్ పడిపోతుందని, సో ముందస్తుకు వెళ్ళడమే ఉత్తమమని పీకే సూచించినట్లు వార్తలొచ్చాయి. సో ముఖ్యమంత్రి, సర్వే ప్రస్థావన తీసుకురావడం ముందస్తు ఎన్నికలకు ఒక సంకేతంగా పరిశీలకులు భావిస్తున్నారు. అలాగే, సిట్టింగ్ ఏమ్మేల్యీలు అందరికీ మళ్ళీ టికెట్లు ఇస్తామని చేసిన ప్రకటన కూడా ముందస్తుకు ‘ముందస్తు’ సంకేతం సంకేతం అంటున్నారు. ఈ నేపధ్యంలోనే ముఖ్యమంత్రి,  మంగళ వారం నుంచి మొదలయ్యే శాసనసభ సంవేసాలు ముగిసిన వెంటనే, మంచి ముహూర్తం చూసుకుని అసెంబ్లీని రద్దు చేసే అవకాశం  ఉందని అంటున్నారు. అదే జరిగితే, నవంబర్, డిసెంబర్ నెలలలో గుజరాత్, హిమాచల్ అసెంబ్లీ ఎన్నికలతో పాటు, లేదంటే వచ్చే సంవత్సరం జనవరి, ఫిబ్రవరి నెలలో జరిగే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలతో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయని, అన్నిటినీ మించి, అసెంబ్లీ రద్దుతో మునుగోడు ఉప ఎన్నిక గండం దాటేయ వచ్చని ముఖ్యమంత్రి అలోచిస్తునట్లుగా తెలుస్తోంది.  నిజానికి, మునుగోడులో ఇప్పటికీ తెరాసకే ఎడ్జ్ ఉందని అనుకుంటున్నప్పటికీ, కీడెంచి  మేలేంచడం మంచిదనే ముందు చూపుతోనే ముఖ్యమంత్రి ముందస్తు ఆలోచనను ముందుకు తీసుకు పోతున్నారని అంటున్నారు. అలాగే ఎక్కువ సమయం ఇస్తే, బీజేపీ, కాంగ్రెస్ బలబలాల్లో వచ్చే హెచ్చు తగ్గుల ప్రభావం అంత బలంగా ఉండక పోవచ్చని ముఖ్యమంత్రి లెక్కలు వేస్తున్నట్లు తెలుస్తోంది.  అయితే, చివరకు ఏ నిర్ణయం అయినా ముఖ్యమంత్రి తీసుకోవలసి ఉంటుంది.సో. ముఖ్యమంత్రి కేసీఆర్ ఈరోజు ఏమి ఆలోచిస్తున్నారో, రేపేమి చేస్తారో  ముందు ముందు  చూడవలసిందే .. అంటున్నారు.

గాలిలో దీపంలా వీఆర్ఏల జీవితాలు.. ప్రాణాలు పోతున్నా పట్టించుకోని కేసీఆర్ సర్కార్

డిమాండ్ల పరిష్కారం కోసం గత నెల రోజులకు పైగా సమ్మెలో ఉన్న వీఆర్ ఏను ప్రభుత్వం అసలు పట్టించుకోవడం లేదు. గత 42 రోజులుగా సమ్మెలో ఉన్న వీఆర్ ఏప్రాణాలు పిట్టల్లా రాలిపోతున్నా తెలంగాణ సర్కార్ కు చీమ కుట్టడం లేదు. సమ్మెలో ఉన్న వీఆఆర్ ఏలలో  ఇప్పటి వరకూ ఇరవై మంది మరణించారు. వారి మరణాలకు వేర్వేరు కారణాలు ఉన్నప్పటికీ.. సమ్మె కాలంలో ఇలా వరుసగా వీఆర్ఏలు మరణించడం పట్ల మాత్రం సర్వత్రా ఆందోళన వ్యక్తమౌతున్నది. మరణించిన వీఆర్ఏలలో అత్యధికులు ఉద్యోగ భద్రతపై ఆందోళనతో మనస్తాపానికి గురై గుండె పోటుతో మరణించారని అంటున్నారు. మిగిలిన వారు అనారోగ్యం, ప్రమాదాలు వంటి కారణాలతో అసువులు బాసారని చెబుతున్నారు. అయితే సమ్మెలో ఉన్న వీఆర్ఏలలో మాత్రం తమ సహచరుల వరుస మరణాలు ఆందోళన నింపుతున్నాయి. అయినా తాము తగ్గేదేలే అంటున్నది వీఆర్ఏ రాష్ట్ర సంఘం చెబుతోంది. డిమాండ్లు నెరవేరేదాకా సమ్మె విరమించబోమని వీఆర్‌ఏల రాష్ట్ర సంఘం స్పష్టం చేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం 22,245 మంది వీఆర్‌ఏలు పనిచేస్తున్నారు. వీరిలో 19,345 మంది నిజాం కాలంలో పనిచేసినవారినుంచి వారసత్వంగా వచ్చిన ఉద్యోగాలు నిర్వహిస్తుండగా.. మిగిలిన 2,900 మంది ఉమ్మడి రా ష్ట్రంలో అప్పటి ఏపీపీఎస్సీ ద్వారా డైరెక్ట్‌గా నియుక్తులయ్యా రు. వీరంతా తమ ఉద్యోగాలు క్రమబద్ధీకరించి, పేస్కేలు, ఆరోగ్య బీమా, పింఛన్, పదోన్నతులు.. తదితర డిమాండ్లు నెరవేర్చాలని కోరుతున్నారు. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న తమ డిమాండ్లు నెరవేర్చాలని కోరుతూ ఈ ఏడాది జూలై 25 నుంచి రాష్ట్రవ్యాప్తంగా వీఆర్‌ఏలు సమ్మె చేస్తున్నారు. గతంలో సీఎం కేసీఆర్‌ అసెంబ్లీలో ప్రకటించిన విధంగా తమకు పేస్కేలు అమలు చేయాలని కోరుతున్నారు. అలాగే తమలో పీహెచ్‌డీలు, పీజీలు, ఎంటెక్, బీటెక్‌ వంటి ఉన్నత చదువులు ఉన్న వారికి పదోన్నతులు కల్పించాలని డిమాండ్‌ చేస్తున్నారు. 2016లో వీరికి పదోన్నతి కల్పించాల్సి ఉన్నా.. కొత్త జిల్లాల ఏర్పాటు కారణంగా అది వాయిదాపడింది. అనంతరం 10 జిల్లాలు 33 అయ్యాయి. 42 రెవెన్యూ డివిజన్ల సంఖ్య 73కు చేరింది. మండలాలు 466 నుంచి 594 అయ్యాయి. ఈ పెంపునకు సరిపడా కొత్తగా వీఆర్‌ఏలను రిక్రూట్‌ చేయలేదు. పైగా ఇటీవల ధరణిని ప్రవేశపెట్టే సమయంలో దాదాపు 5,500 మంది వీఆర్వోలను తొలగించారు. దాంతో వారి పని కూడా వీరే చేయాల్సి వస్తోంది. దీంతో తమకు కనీస హక్కులు అమలు కావడం లేదన్న ఆందోళనలో ఉన్న వారంతా సమ్మెకు దిగారు.   

రాముల‌మ్మా...క్రికెట్ కీ కాషాయం పులమడమా?

ఆట ఆటే, గెలిచినా, ఓడినా క్రీడాభిమానుల స‌ర‌దాలు, వేడుక‌లు మామూలే.  ఆసియాక‌ప్‌లో భాగంగా ఆదివారంనాటి భార‌త్ పాకిస్తాన్ మ్యాచ్‌  రాజ‌కీయ‌రంగు పులుముకుంది. వారం రోజుల క్రితం పాకిస్తాన్ పై భార‌త్ గెలిచిన‌పుడు వినిపించ‌ని వ్యాఖ్యానాలు ఆగ‌ష్టు 4న జరిగిన మ్యాచ్‌లో భార‌త్ ఓడిపోగానే రాజ‌కీయ రంగులో విన‌ప‌డుతున్నాయి. గెలిచినందుకు పాక్ సంబంరాలు చేసుకోవ‌డం అర్ధ‌ర‌హిత‌మ‌ని  బీజేపీ నాయకురాలు విజ‌య‌శాంతి వ్యాఖ్యానించారు. సోషల్ మీడియా వేదికగా రాములమ్మ భారత్-పాక్ మ్యాచ్ పై  స్పందించారు.   క్రికెట్ మ్యాచ్ అయినా స‌రే భార‌త్ కు పాకిస్తాన్ స‌మ ఉజ్జీగా కాద‌న్న అభిప్రాయాన్నే ఆమె వ్య‌క్తం చేశారు. ఓట‌మిని మ‌నం అంగీక‌రిస్తే పాక్‌ను మ‌నతో స‌మానంగా చూసిన‌ట్టేన‌ని ఆమె ఆగ్ర‌హించారు. ఆసియా కప్ లో పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండి యా ఓడిందని మనోళ్లు నిరాశ పడటం గెలిచినందుకు పాక్ సంబరాలు చేసుకోవడం పూర్తిగా అర్థ రహితమ‌న్నారు.  భారత్‌తో ఎక్కువగా ఓడిపోతూ వస్తున్న పాక్‌లో వారి విజయాన్ని సంబరం చేసుకోవడం వాళ్ళకి బాగుంటుంది కానీ, మనం బాధపడటంలో  ఏ మాత్రం అర్థం లేదన్నారు. ఎన్నో దేశాలపైన పదే పదే విజయాలు సాధించిన  టీమిండియాకి ఈ ఓటమి ఒక లెక్క కానే కాదని,  అప్పు డప్పుడూ ఎదురయ్యే ఓటముల్లో ఇదీ ఒకటిగా తీసుకోవాల‌న్నారు.  అయితే మన దేశంలో ఉగ్రవాదానికి ఊతమిస్తూ, మనని నిరంతర శత్రువుగా చూస్తూ, తన ఆర్థిక వ్యవ స్థని నాశనం చేసుకుని, దారుణంగా అప్పులపాలై  చివరికి జూలోని  జంతువుల్ని కూడా అమ్ము కుంటూ, ఏ విషయంలోనూ మనకి సరితూగని పాకిస్తాన్ ఏదో ఒక మ్యాచ్‌లో టీమిండియాపై గెలిచినంత మాత్రాన అదే దో పెద్ద విషయం అన్నట్టు చూడటం మన స్థాయికి తగద‌ని బీజేపీ నేత విజ‌య‌శాంతి అన్నారు. 

చూడ‌త‌ర‌మా.. ఏపీ స‌ర్కార్‌ యాప్‌ మ‌హిమ‌!

కాలం మారుతోన్న‌కొద్దీ సాంకేతికత  ఇబ్బందిక‌రంగా మారుతోంది. మొబైల్‌, యాప్‌ల రాజ్యం ఇది. ప్ర‌తీదీ యాప్‌ల‌కు అనుసంధానం చేయ‌డం మీద దృష్టిసారిస్తున్నారంతా. బ‌డికి ఉపాధ్యాయుల రాక‌పోక‌ల గురించి తెలుసుకోవ‌డానికి  ఫేస్ రిక‌గ్నిష‌న్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాల‌ని ఏపీ ప్ర‌భుత్వం పెట్టిన నిబంధ‌న ఉపాధ్యాయుల్లో ఆగ్ర‌హం రెండింత‌లు చేసింది. అస‌లే జీతబ‌త్యాలు, ట్రాన్స్‌ఫ‌ర్లు విష‌యాల్లో ప్ర‌భుత్వ నియ‌మ నిబంధ‌న‌ల‌తో స‌త‌మ‌త‌మ‌వుతున్న ఉపాధ్యాయుల‌కు ఇపుడు ఈ యాప్ మ‌రింత త‌లభారంగా మారింది. ఉపాధ్యాయుల మీద బైండోవర్‌, అక్రమకేసులు, నోటీసులనిస్తూ అప్రజా స్వామి కంగా ప్రభుత్వం వ్యవహ రిస్తున్న తీరుపై ఉపాధ్యాయులు భయభ్రాంతులకు గురవుతున్నారని ఉపా ధ్యాయ సంఘాల నేత‌లు అన్నారు. ప్రభుత్వం సొంత ఫోన్లలో ఫేస్‌ రికగ్నిషన్‌ యాప్‌ ద్వారా హాజరు వేసేలా ఒత్తి డి చేస్తున్నారని ఉపాధ్యాయులు ఆరోపిస్తున్నారు.  యాప్‌ గురించి ప్ర‌భుత్వంతో యుద్ధానికి త‌ల‌ప‌డ్డారు. ప‌రిస్థితులు గ్ర‌హించిన జ‌గ‌న్ స‌ర్కార్ యాప్ నిబం ధ‌న అంశాన్ని మ‌రోసారి ప‌రిశీలిస్తామ‌ని, లోపాలు స‌వ‌రించి నిర్ణ‌యం తెలియ‌జేస్తామ‌ని విద్యాశాఖ మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ చెప్పారు. దీంతో ఉపాధ్యాయులు కాస్తంత మెత‌క‌బ‌డ్డారు. కానీ ప్ర‌భుత్వం చెప్పినట్టుగా ఇచ్చిన హామీని విస్మ‌రించింది. దాన్ని గురించి అంత‌గా ప‌ట్టించుకోవ‌డం లేదు. దీంతో ఉపాధ్యా యులు తాడోపేడో తేల్చుకోవాల‌న్న నిర్ణ‌యానికి వ‌చ్చేశారు.  ప్రభుత్వం ఉపాధ్యాయుల పట్ల అవలంబి స్తున్న వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఉపాధ్యాయ దినోత్సవం రోజున ప్రభుత్వ సత్కా రాలు, సన్మానాలు తిర‌స్క‌రించారు.  ప్ర‌భుత్వ యాప్ విద్యార్ధుల‌కు అస్త్రంగా మారితేనే మ‌రీ త‌ల‌నొప్పి. ఒక‌వేళ యాప్‌లో గ‌డ్డం ఉన్న‌పుడు చూసిన ఉపాధ్యాయుడికి గ‌డ్డం లేకుండా క‌న‌ప‌డితే అటెండెన్స్ స‌మ‌యంలో ఫేస్ గుర్తుప‌ట్ట లేద‌ని తిర స్క‌రిస్తే వ‌చ్చే ఇబ్బంది అంతా యింతా కాద‌ని విద్యార్ధులు స‌ర‌దాగా యాప్‌ల మీద నెట్‌లో జోక్స్ పంచు కుంటున్నారు. యాప్ అనేది నిరంత‌రం బ్ర‌హ్మాండంగా ప‌నిచేస్తుంద‌న్న‌న‌మ్మ‌కం ఎవ‌రు ఇస్తారు. నిరం త‌రం లోపాలు ఉండ‌వ‌న్న గ్యారంటీ లేదు. ఇలాంటి అర్ధర‌హిత విధానాల‌ను అమ‌లుచేసి జ‌గ‌న్ స‌ర్కార్ త‌న  తెలివిని స్వ‌యంగా బ‌య‌ట‌పెట్టుకుంది. 

రఘురామ కృష్ణం రాజుకు ప్రాణహాని.. ప్రధానికి ఎంపీల లేఖ!

వైసీపీ రెబల్ ఎంపీకి ప్రాణహాని ఉందంటూ దాదాపు 70 మంది ఎంపీలు ప్రధాని నరేంద్రమోడీకి లేఖ రాశారు. సొంత పార్టీ నుంచే ఆయన ప్రాణానికి ముప్పు ఉందన్న ఆందోళనను వారా లేఖలో వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని స్వయంగా ఎంపీ రఘురామకృష్ణం రాజు వెల్లడించారు. ఆయనకు తన సొంత నియోజకవర్గంలో పర్యటించే పరిస్థితి లేదని వారా లేఖలో పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ భీమవరంలో అల్లూర విగ్రహావిష్కరణకు హాజరైన సంగతి తెలసిందే. ఈ సందర్బంగా ఆ కార్యక్రమానికి హాజరయ్యేందుకు బయలు దేరిన రఘురామకృష్ణం రాజులను ఆయన ప్రయాణిస్తున్న రైలు బోగీని దగ్ధం చేసైనా హతమార్చాలని చూశారని ఆ ఎంపీలు ప్రధానికి రాసిన లేఖలో పేర్కొన్నారు. తనను హత్య చేయడానికి ప్రయత్నించారని, అంతకు ముందు సీఐడీ కస్టడీలో చిత్ర హింసలకు గురి చేశారనీ పేర్కొంటూ రఘురామరాజు గతంలో ఎంపీలకు లేఖలు రాసిన సంగతి విదితమే. ఆ లేఖలకు స్పందించిన  వివిధ పార్టీలకు చెందిన దాదాపు 70 మంది ఎంపీలు ప్రధానికి లేఖ రాశారు. అలాగే కనీసం ఏడుగురు కేంద్ర మంత్రులు కూడా ఇదే విషయాన్ని లేఖ ద్వారా కేంద్ర హోంమంత్రి అమిత్ షా దృష్టికి తీసుకు వచ్చారు. ఈ విషయాన్ని మీడియాకు వెల్లడించిన ఆయన తమ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి జగన్ తీరు హింసే నా ఆయుధం, హింసే నామార్గం అన్నట్లుగా ఉందని అన్నారు. అన్న క్యాంటిన్ల ధ్వసం ఘటనలను చూస్తుంటే ఈ ప్రభుత్వానికేమైంది అనిపించక మానదన్నారు. అన్నం పెట్టే అన్న క్యాంటీన్లను ధ్వంసం చేయడం అడ్డుకున్న వారిపై అక్రమ కేసులు బనాయించడం దారుణమన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా అదుపుతప్పాయని విమర్శించారు. పరిస్థితులు ఇలాగే ఉంటే రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలన్న డిమాండ్ ముందుకు వచ్చే పరిస్థితి అనివార్యమౌతుందన్నారు. ఏపీ ప్రభుత్వానికి కోర్టుల మీద కానీ, కోర్టు తీర్పుల మీద కానీ గౌరవం ఉన్నట్లు కనబడటం లేదన్నారు. ఇక రిషి కొండ తవ్వకం విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న తీరు మరీ దారుణంగా ఉందన్నారు. రిషికొండపై ప్రకృతి విధ్వంసానికి సంబంధించి తాను సుప్రీం కోర్టును ఆశ్రయించగా, హైకోర్టులో ఉన్న కేసులో ఇంప్లీడ్ కావాలని సూచించిందని పేర్కొన్నారు. అయితే తన న్యాయవాది ఉమేష్ చంద్రకు రుషికొండ ప్రాంతాన్ని సందర్శించేందుకు అనుమతి లేదంటూ నిరాకరించారని రఘురామ  రాజు అన్నారు.