ఫసల్ బీమా.. రైతులకు శఠగోపం.. బీమా కంపెనీలకు పైసలు
posted on Sep 6, 2022 @ 11:05AM
కేంద్ర ప్రభుత్వం ఘనంగా ప్రచారం చేసుకుని అమలు చేసిన ఫసల్ బీమా పథకం దారి తప్పిందని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమార్ స్వయంగా అంగీకరించారు. పేదలను కొట్టి పెద్దలకు పంచిన చందంగా రైతుల కోసం కేంద్రం తీసుకువచ్చిన ఈ పథకం అంతిమంగా బీమా కంపెనీలకే ప్రయోజనకరంగా మారింది.
ఈ విషయాన్ని స్వయంగా తోమార్ అంగీకరించారు. ఈ పథకం కింద గత ఐదేళ్లలో రైతులు, ప్రభుత్వాలు ప్రీమియం రూపంలో కోటీ 26లక్షల 521 కోట్ల రూపాయలు బీమా కంపెనీలకు చెల్లించాయి. అయితే ఈ పథకం కింద బీమా కంపెనీల నుంచి రైతులకు అందిన పరిహారం మాత్రం 87 వేల 320 కోట్ల రూపాయలు మాత్రమేననీ, ఈ పథకం ద్వారా బీమా కంపెనీలు 39, 201 కోట్ల రూపాయలు లబ్ధి చేకూరింది. అంటే రైతులకు కేవలం 69శాతం పరిహారంగా చెల్లించిన బీమా కంపెనీలు 31 శాతం నిధులు మిగుల్చుకున్నాయి. ఫసల్ బీమా పథకం రైతులకు ప్రయోజనం చేకూర్చేదిగా లేదనీ, బీమా కంపెనీలను పెంచి పోషించడానికే ఈ పథకాన్ని అమలు చేస్తున్నారా అంటూ విపక్షాలు మొదటి నుంచీ ప్రభుత్వాన్ని నిలదీస్తూనే ఉన్నయి.
అయితే ప్రభుత్వం మాత్రం రైతులకు ప్రయోజనం చేకూరడం విపక్షాలకు ఇష్టం లేదంటూ ఎదురు దాడి చేస్తూ వచ్చింది. ఇప్పుడు స్వయంగా కేంద్ర వ్యవసాయ మంత్రి తోమరే ఫసల్ బీమా పథకం దారి తప్పిందని అంగీకరించడంతో ప్రభుత్వం డిఫెన్స్ లో పడింది.
ఇప్పటికైనా ఫసల్ బీమా యోజన పథకాన్ని బీమా కంపెనీలకు ప్రయోజనకరంగా కాకుండా రైతులకు ఉపయోగపడేలా మార్చాలని రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ పథకంలో ప్రీమియం కట్టేది రాష్ట్రప్రభుత్వాలు, రైతులు దీంతో కేంద్రం తనకు ఏ మాత్రం భారం కాకుండా ఈ పథకాన్ని రూపొందించి చేతులు దులిపేసుకుందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.