ఇంతోటి దానికి అంతోటి రాగ మెందుకో..!
తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుట్ల చంద్రశేఖర రావు, చివరాఖరుకు, జాతీయ రాజకీయాల గురించి ఒక నిర్ణయానికి వచ్చారు. అనేక కోణాల్లో అలోచించి, ఇంచుమించుగా నాలుగు సంవత్సరాల ముందు మొదలైన ‘జాతీయ’ అలోచనకు చుక్క పెట్టారు. పాత పార్టీకి కొత్త లేబుల్ తగిలించే నామకరణ మహోత్సవానికి ముహూర్తం ఖరారు చేశారు. దసరా రోజున తెలంగాణకు పర్యాయ పదంగా నిలిచిన తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)కు వీడ్కోలు పలికేందుకు ముహూర్తం ఖరారు చేశారు.
తెలంగాణ ప్రజలు, చివరకు కేసీఆర్ మార్క్ రాజకీయాలతో విభేదించే వారు కూడా ఇంటి పార్టీగా అక్కున చేర్చుకుని, ఆదరించిన తెరాసను చెరిపేస్తున్నారు. పజల గుండెల్లోంచి తొలిగించేస్తున్నారు. తెరాస స్థానంలో కొత్త పేరు వచ్చి చేరుతుంది. తెరాస చరిత్ర పుటల్లో చేరిపోతుంది. ఇప్పుడు ఒక ప్రాతీయ పార్టీకి అధ్యక్షుడుగా ఉన్న కేసీఆర్ జాతీయ పార్టీ అధ్యక్షుడు అవుతారు. కొత్త పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడుగా కేటీఆర్, కొలువు తీరతారు. నిజానికి, కారణాలు ఏవైనా కేసీఆర్ చాలా కాలంగా జాతీయ రాజకీయాల వైపు చూస్తున్నారు. ఒక దశలో రాష్ట్ర రాజకీయాలు బోర్ కొడుతున్నాయని కుడా అన్నారు. అందుకే 2018 అసెంబ్లీ ఎన్నికలకు ముందే ముఖ్యమంత్రి జాతీయ రాజకేయాల ఆలోచన చేశారు. అయితే, ఎందుకనో ఏమో ప్రాంతీయ పార్టీల జాతీయ కూటమ,(థర్డ్ ఫ్రంట్)గా మొదలైన ఆ ఆలోచన కార్యరూపం దాల్చలేదు. అయితే, అలా థర్డ్ ఫ్రంట్ గా మొదలైన ఆలోచన జాతీయ పార్టీ ఏర్పాటు అంచుల దాకా వెళ్లి, యూటర్న్ తీసుకుంది. చివరకు, ప్రాంతీయ పార్టీ (తెరాస) పేరుమార్చి కొత్త పేరు (బీఆర్ఎస్. నవభారత్ పార్టీ) తో జాతీయ రాజకీయ ప్రస్థానానికి శ్రీకారం చుట్టాలనే గమ్యానికి చేరింది.
అయితే, ఇంతోటి దానికి అంతోటి రాగం ఎందుకని, రాజకీయ విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. నిజానికి,ప్రాంతీయ పార్టీలుగా పుట్టిన తృణమూల్, ఎన్సీపీ, ఆప్, లాంటి అనేక పార్టీలు జాతీయ హోదా పొందక ముందు నుంచి కూడా ఇతర రాష్ట్రాలలోనూ పోటీ చేస్తున్నాయి. సీట్లు గెలుచుకుంటున్నాయి. తెరాస పుట్టిన దశాబ్ద కాలానికి, అంటే 2011లో పుట్టిన ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)అయితే, పుట్టిన ఢిల్లీతో పాటుగా, పంజాబ్ లోనూ అధికారంలోకి వచ్చింది.
ఇప్పుడు గుజారత్ లో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు దీటుగా పోటీకి దిగుతోంది. కానీ, తెరాస మాత్రం ఇంతవరకు తెలంగాణ గడప దాటలేదు. ఇప్పుడే తొలి అడుగు వేస్తోంది. అయితే, నిజానికి ముఖ్యమంత్రి కేసేఆర్ మనసులో ఏమున్నా, పైకి చెపుతున్న మాటలను, ఇతర రాష్ట్రాల ప్రజలు, నాయకులు నమ్మడం లేదు. ఇతర రాష్ట్రాల నాయకులు , ప్రజలే కాదు, రాష్ట్ర ప్రజలు, చివరకు, సొంత పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా విశ్వసించడం లేదు. కేవలం, తెలంగాణలో వీస్తున్న ఎదురు గాలులను తట్టుకునేందుకే ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ ఎజెండాను భుజానికి ఎత్తుకున్నారన్నది స్పష్టమై పోయిందని అంటున్నారు. నిజానికి, కేసీఆర్ గతంలోనే రాష్ట్రంలో అధికారం నిలుపుకునేందుకు తమ వ్యూహం తమకు ఉందని అనేక సందర్భాలలో ప్రకటించారు. బహుసా అది ఇదే కావచ్చని అంటున్నారు.
అంతే కాకుండా, దేశమంతా తెలంగాణ మోడల్ కోరుకుంటోందని తెరాస నాయకులు ప్రచారం చేసుకోవడమే కానీ తెరాస ప్రభుత్వం వందల వేల కోట్ల రూపాయల ప్రజా ధనం ఖర్చు చేసి దేశ వ్యాప్తంగా ప్రచారం చేస్తుకున్నా ఊరు పేరున్న నాయకులు ఎవరూ కూడా, కేసీఆర్ కు జై కొట్టలేదు. కనీసం చేతులు కలపలేదు.
నిజానికి కేసీఆర్ కాలికి బలపం కట్టుకుని దేశం చుట్టి వచ్చారు. అరడజను మంది వరకు ముఖ్యమంత్రులను, ఇతర పార్టీల పెద్దలను కలిసి వచ్చారు. కానీ, అందులో ఏ ఒక్కరూ కూడా తెలంగాణ మోడల్ అద్భుతంగా ఉందని కితాబు ఇవ్వలేదు. అసలు ఒక సారి కలిసిన వారు ఎవరూ రెండవసారి అయనతో రాజకీయ సంబంధాలు కొనసాగించలేదు. ఒక విధంగా, జాతీయ రాజకేయాల్లో కేసీఆర్ ఒంటరి అయిపోయారనే అభిప్రాయం బలపడింది.
అందుకే, కేసీఆర్ థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచను అటకెక్కించారని, ఇతర రాజకీయ పండితులు విశ్లేషించారు. ఆ తర్వాతనే జాతీయ పార్టీ ఆలోచను తెర పైకి తెచ్చారు. అయితే అదీ వర్క్అవుట్ కాలేదు.అందుకే చివరకు ఏ దారి లేకనే తెరాస పేరును మార్చి పరవు నిలుపుకునే ప్రయత్నం చేస్తున్నారని అంటున్నారు. అయితే, ఇదైనా వర్కౌట్ అవుతుందా అంటే, అవకాశమే లేదని అంటున్నారు. అలాగే జాతీయ రాజకీయాలకు సంబంధించి ఇంతవరకు కేసీఆర్ చేసిన ఏ ప్రయత్నం ఫలించలేదు. ఇది కూడా అంతే అంటున్నారు రాజకీయ పండితులు.