నవంబర్ 3న మునుగోడు ఉప ఎన్నిక.. షెడ్యూల్ విడుదల
posted on Oct 3, 2022 @ 1:26PM
తెలంగాణే కాక మొత్తం దేశం అత్యంత ఆసక్తిగా ఎదురు చూస్తున్న మునుగోడు ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదలైంది. నవంబర్ 3న మునుగోడు ఉప ఎన్నిక జరగ నుంచి. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. దేశ వ్యాప్తంగా ఏడు అసెంబ్లీ స్ధానాలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. మహారాష్ట్ర, ఉత్తర ప్రదేశ్, బీహార్, హర్యానా, ఒడిశా, తెలంగాణ రాష్ట్రాలలో మొత్తం ఏడు అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరగనున్నాయి. కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసిన షెడ్యూల్ మేరకు ఈ నెల 7న నోటిఫికేషన్ వెలువడ నుంది. ఈ నెల 14 వరకూ నామినేషన్ల స్వీకరణ ఉంటుంది. 15న నామినేషన్ల పరిశీలన, నామినేషన్ల ఉప సంహరణకు తుది గడువు ఈ నెల 17.
ఇక పోలింగ్ వచ్చే నెల అంటే నవంబర్ 3న జరుగుతుంది. అదే నెల 6వ తేదీన ఓట్ల లెక్కింపు ఉంటుంది. కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి శాసనసభ్యత్వానికి, కాంగ్రెస్ పార్టీకీ రాజీనామా చేసి కమలం గూటికి చేరడంతో అక్కడ ఉప ఎన్నిక అనివార్యమైన సంగతి తెలిసింది. తెలంగాణ అసెంబ్లీకి వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో మునుగోడు ఉప ఎన్నికను రాష్ట్రంలోని మూడు ప్రధాన పార్టీలూ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి.
వచ్చే ఎన్నికలకు మునుగోడు ఉప ఎన్నికలో విజయం ఒక రాజమార్గంగా ప్రధాన పార్టీలైన టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ లు భావిస్తున్నాయి. ఎలాగైనా సిట్టింగ్ స్టానాన్ని నిలబెట్టుకోవాలని కాంగ్రెస్ పట్టుదలతో ఉంటే.. మునుగోడులో విజయం ద్వారా రాష్ట్రంలో టీఆర్ఎస్ పట్టు సడలలేదని నిరూపించుకోవాలని టీఆర్ఎస్ భావిస్తోంది. ఇక బీజేపీ అయితే.. వచ్చే ఎన్నికలలో విజయం ఖాయం అన్న భావనను ప్రజలలో వ్యాప్తి చేయడానికి మునుగోడులో విజయం కోసం సర్వ శక్తులూ ఒడ్డుతోంది.
పైగా రాజగోపాలరెడ్డి చేత రాజీనామా చేయించి మరీ ఉప ఎన్నికకు కారణమైన బీజేపీ ఆ స్థానంలో అభ్యర్థిగా రాజగోపాలరెడ్డినే నిలబెట్టి విజయం సాధించాలని భావిస్తోంది. ఇప్పటికే మునుగోడులో కాంగ్రెస్ తన అభ్యర్థిని ప్రకటించింది. ఇక బీజేపీ ఎలాగూ రాజగోపాలరెడ్డినే అభ్యర్థిగా రంగంలోకి దింపుతుంది.
అయితే టీఆర్ఎస్ మాత్రం మునుగోడు అభ్యర్థి ఎవరన్నది నిర్ణయించలేదు. మునుగోడులో పోటీకి టీఆర్ఎస్ నుంచి పలువురు ఆశావహులు ఉండటంతో అభ్యర్థి ఎంపిక విషయంలో మల్లగుల్లాలు పడుతోంది. ఈ నేపథ్యంలో మునుగోడు ఉప ఎన్నిక షెడ్యూల్ వెలువడటం.. నామినేషన్ల స్వీకరణకు ముందే తెరాస అధినేత కేసీఆర్ జాతీయ పార్టీ ప్రకటన చేసే అవకాశాలు ఉండటంతో రాష్ట్రంలో రాజకీయాలు ఒక్క సారిగా వేడెక్కాయి.