సీనియర్ల సహాయ నిరాకరణ.. చిక్కుల్లో రేవంత్ ?
posted on Oct 3, 2022 @ 5:49PM
తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని సమస్యలు చుట్టుముడుతున్నాయా?, ఇటు మునుగోడు ఉప ఎన్నిక ప్రచార బాధ్యతలు, అటు రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర సన్నాహాల మధ్య ఆయన నలిగి పోతున్నారా? ఇదే అదనుగా సీనియర్లు తమ వంతు సమస్యలు సృష్టిస్తున్నారా? అంటే, గాంధీ భవన్ వర్గాలు అవునననే అంటున్నాయి.
నిజానికి, రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ గా బాధ్యతలు చేపట్టి నప్పటి నుంచి పార్టీ సీనియర్లు ఆయన పట్ల కొంత గుర్రుగానే ఉన్నారు. అదేమీ, రహస్యం కాదు. అయినా, ముందు కొంత కాలం, రేవంత్ రెడ్డి, సర్దుకు పోయే ధోరణి అవలంబించారు. అందరినీ కలుపుకు పోయే ప్రయత్నం చేశారు. పార్టీ సీనియర్లలోనూ ఒకరిద్దరు మినహా మిగిలి నేతలందరూ రేవంత్ రెడ్డికి పార్టీ అధిష్టానం అండదండలు పుష్కలంగా ఉండడం వల్లనో ఏమో కానీ అలివి కాని చోట అధికుల మనరాదు అన్నట్లు మౌనంగా ఉండిపోయారు.
కానీ, ఎప్పుడైతే రేవంత్ రెడ్డి సేనియర్లను హోం గార్డ్స్ తో పోలుస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేశారో, ఇక అక్కడి నుంచి, సీన్ మారిపోయింది. నిజానికి,అప్పటికే రెంత్ రెడ్డి ఒకటికి రెండు సార్లు గీత దాటి, సీనియర్ నాయకులను హర్ట్ చేసే వ్యాఖ్యలు చేశారు. అలాగే, రేవంత్ రెడ్డి వర్గానికి చెందిన టీపీసీసీ అధికార ప్రతినిధి, అద్దంకి దయాకర్ మునుగోడు సభలో పార్టీ సీనియర్ నాయకుడు, ఎంపీ కోమటి రెడ్డి వెంకట రెడ్డిని ఉద్దేశించి పార్టీలో ఉంటే ఉండు, పొతే ..’ అంటూ చేసిన వ్యాఖ్యలు రేవంత్ రెడ్డి, సేనియర్ల మధ్య దూరాన్ని మరింత పెంచింది. దయాకర్ తో పాటుగా, రేవంత్ రెడ్డి కూడా కోమటి రెడ్డికి క్షమాపణలు చెప్పినా, అటు రేవంత్, ఇటు దయాకర్ చేసిన వ్యాఖ్యలు సీనియర్లను వెంటాడుతూనే ఉన్నాయి. పైకి అంతా సర్డుకున్నట్లు కనిపించినా లోలోపల అగ్గి రగులుతూనే వుందని తాజా పరిణామాలు సూచిస్తున్నాయని న్నాయని పరిశీలకులు అంటున్నారు.
ఇంతకాలం ఒక విధంగా సరైన సమయం కోసం ఎదురు చూస్తున్న సీనియర్ నాయకులు, ఇటు నుంచి మునుగోడు అటు నుంచి రాహుల్ భారత్ జోడో యాత్ర రేవంత్ రెడ్డిని ఉక్కిరి బిక్కిరి చేస్తున్న సమయంలో బాధ్యత మొత్తాన్ని, రేవంత్ రెడ్డిపై వదిలేసి, తమాషా చూస్తున్నారని, అందుకే రేవంత్ రెడ్డి తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారని అంటున్నారు.
ఓ వంక మునుగోడు ఉప ఎన్నిక షెడ్యూలు వచ్చేసింది. ఈ రోజుకు ఖచ్చితంగా నెల రోజుల తర్వాత, నవంబర్ 3 న పోలింగ్ జరుగుతుంది. మరో వంక కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు సాగిస్తున్న భారత్ జోడో పాదయాత్ర ఈ నెల ( అక్టోబర్) 24 న రాష్ట్రంలో ప్రవేశిస్తోంది. ఇదే అదనుగా సీనియర్ నాయకులు రేవంత్ రెడ్డిని ఉక్కిరి బిక్కిరి చేసే వ్యూహాలతో పావులు కదుపుతున్నారు. ముఖ్యంగా, మునుగోడు ఉపఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్ధి స్రవంతి నెగ్గితే రేవంత్ రెడ్డి మరింతగా రెచ్చి పోతారని, దానికి తోదు రాహుల్ యాత్ర రాష్ట్రంలో సక్సెస్ అయితే ఇక తమకు కాంగ్రెస్ పార్టీలో నూకలు చెల్లినట్లే భావిస్తున్న సీనియర్లు ముందు జాగ్రత్తగా ఒక విధంగా సహాయ నిరాకరణ సూత్రాన్ని పాటిస్తున్నారని అంటున్నారు.
రేవంత్ రెడ్డి, కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీలతోనే కాకుండా, ఇటు సొంత పార్టీలోని అంతర్గత శత్రువులతోనూ ఏకకాలంలలో పోరాడా వలసి వస్తోందని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోందంటే పరిస్థితి ఏమిటో అర్థం చేసుకోవచ్చని అంటున్నారు. అదలా ఉంటే, మూలిగే నక్కపై తాటిపండు పడినట్లు, రేవంత్ రెడ్డితో కొంత సఖ్యతగా ఉంటున్న మాజీ మంత్రులు, సీనియర్ నాయకులు గీతా రెడ్డి, షబ్బీర్ ఆలీ సహా మరి కొందరికి నేషనల్ హెరాల్డ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సమన్లు జారీ చేసింది. విచారణకు ఢిల్లీ పిలిపించింది.
దీంతో రేవంత్ రెడ్డి, కేంద్ర ప్రభుత్వంపై తీవ్రంగా విరుచుకు పడుతున్నారు. ఈడీ నోటీసుల పేరుతో కాంగ్రెస్ నేతలను ఢిల్లీకి పిలిపించడం.. వారిని భయభ్రాంతులకు గురిచేసి బీజేపీలో చేర్చుకునేందుకు కుట్ర జరుగుతోందని ఆరోపించారు. బీజేపీ ఈడీని ఎలక్షన్ డిపార్ట్‌మెంట్‌గా మార్చిందని పేర్కొన్నారు. అయితే, రేవంత్ రెడ్డి ఫ్రస్ట్రేషన్ కు అసలు కారణం సీనియర్లు సహకరించక పోవడమే అంటున్నాయి పార్టీ వర్గాలు.కారాణాలు ఏవైనా రేవంత్ రెడ్డి బయటి నుంచే కాకుండా లోపలి నుంచి కూడా సమస్యలు ఎదుర్కుంటున్నది మాత్రం నిజమని పరిశీలకులు అంటున్నారు.