ఆముదాలవలసలో తమ్మినేనికి అసమ్మతి పోటు!?
posted on Mar 21, 2024 @ 12:42PM
శ్రీకాకుళం జిల్లా కేంద్రానికి ఆనుకుని ఉన్న నియోజకవర్గం ఆమదాలవలస.. ఇక్కడ ఎమ్మెల్యే గా గెలిచిన వారు క్యాబినెట్ స్థాయి పదవిని అనుభవించడం గడచిన కొన్ని దశాబ్దాలుగా ఆనవాయితీగా వస్తోంది. తెలుగుదేశంలో కూన రవికుమార్, వైసీపీలో తమ్మినేని సీతారాం కూడా ఈ కోవకు చెందిన వారే. సిక్కోలు పాలిటిక్స్ లో సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ గా మారిన ఆమదాలవలసలో టికెట్ కోసం ఆశపడే వారి జాబితా ఎక్కువగానే ఉంటుంది. అయితే ఈ బహునాయకత్వ సమస్య టిడిపిలో లేకపోవడం ఆ పార్టీకి కలసి వస్తోంది. ఇదే తలనొప్పితో బాధపడుతున్న వైకాపా నేత, ప్రస్తుత ఆమదాలవలస ఎమ్మెల్యే, స్పీకర్ తమ్మినేని సీతారాం మాత్రం ఎమ్మెల్యే అభ్యర్ధిగా తన పేరును అధిష్టానం ప్రకటించిన తరువాత విపత్కర పరిస్థితులను ఎదుర్కొంటున్నారు.
ఔను బహునాయకత్వ సమస్యలు స్పీకర్ తమ్మినేని సీతారాం కు తల బొప్పి కట్టించాయి. మూడు పార్టీ ఆఫీసులు, ఆరుగురు ఆశావహులతో రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఒక్క స్పీకర్ నియోజకవర్గం ఆమదాలవలసలోనే తీవ్ర స్థాయిలో ఉన్న వర్గ పోరు, ఆముదాలవలస అసెంబ్లీ నియోజకవర్గ వైసీపీ అభ్యర్ధిగా స్పీకర్ తమ్మినేని పేరు ప్రకటన తరువాత ముదిరి పాకాన పడింది.
వైసీపీ సీనియర్ నేత, స్పీకర్ తమ్మినేని సీతారాం సొంత నియోజకవర్గం లోనే వర్గపోరు సభాపతికి తలనొప్పిగా మారింది. గడచిన నాలుగేళ్ళగా స్పీకర్ తో విభేదించిన స్థానిక నాయకులు మూడు పార్టీ ఆఫీసులు ప్రారంభించి క్యాడర్ తో మూడు ముక్కలాట ఆడుతూనే ఉన్నారు. స్పీకర్ తమ్మినేనితో విభేదిస్తూ.. మొన్నటి వరకూ ఈ ముగ్గురూ ఎవరికి వారుగా పార్టీ కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చేవారు. క్యాడర్ శ్రమను స్పీకర్ గుర్తించడం లేదని వేరు కుంపటి పెట్టిన వైకాపా నేతలు ఎవరికీ వారు ఈ ఎన్నికల్లో టికెట్ కోసం క్యాడర్ ను సైతం మూడు ముక్కలు చేసి తమ ప్రయత్నాలు ముమ్మరం చేశారు.
గడచిన సాధారణ ఎన్నికల్లో గెలిచి ఎమ్మెల్యే అయిన క్షణం నుంచీ పార్టీలో స్పీకర్ తమ్మినేని వర్గపోరు ఎదుర్కుంటూనే ఉన్నారు. గెలిపించిన నేతలకు విలువ ఇవ్వడం లేదని, పార్టీ కార్యక్రమాలలో గుర్తింపు ఇవ్వడం లేదని ఇద్దరు సీనియర్ వైసీపీ నేతలు స్పీకర్ కు వ్యతిరేకంగా నాలుగేళ్ల క్రితమే పార్టీలో సొంత కుంపట్లు ఏర్పాటు చేసుకున్నారు. మొత్తంగా మొన్నటి వరకూ మూడు పార్టీ ఆఫీసులు ఆమదాలవలస నియోజకవర్గంలో నడుస్తూ ఉండేవి..
నాలుగేళ్ళుగా తమ్మినేని తీరుని బహిరంగంగానే వ్యతరేకిస్తూ.. ఈ ఎన్నికల్లో టికెట్ ను ఆశిస్తూ స్థానిక నేతలు నేతలు సువ్వారి గాంధీ, చింతాడ రవికుమార్ లు పర్యటనలు చేస్తూ వచ్చారు... మండల స్థాయి నేతలను తమ గ్రూపులలో చేర్చుకుని ఎవరికీ వారు తమ క్యాడర్ ను బలపరుచుకుంటూ.. క్షేత్ర స్థాయి పర్యటనలు చేస్తూ అధిష్టానం ఆశీస్సులు పొందేందుకు ప్రయత్నాలు చేశారు.. అయితే చాలా నెలల హైడ్రామా తరువాత.. ఇటివల ప్రకటించిన వైకాపా అభ్యర్ధుల జాబితా లో తిరిగి తమ్మినేని పేరునే అముదాలవలస పార్టీ అభ్యర్థిగా అధిష్టానం ప్రకటించడంతో స్థానిక నేతల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. తాడోపేడో తేల్చుకోవడానికి సిద్ధమైన ఆమదాలవలస వైసిపి నేత సువ్వారి గాంధీ.. తన క్యాడర్ తో సహా పార్టీకి రాజీనామా చేసి.. వచ్చే ఎన్నికల్లో ఇండిపెండెంట్ గా బరిలో నిలుస్తానని స్పష్టం చేశారు.
ఆమదాలవలస లో స్పీకర్ తమ్మినేనితో విభేదించి నాలుగేళ్ల క్రితమే తన వర్గాన్ని తాను ఏర్పాటు చేసుకున్న వైసిపి నేత సువ్వారి గాంధీ.. పార్టీలో తనకంటూ బలమైన వర్గాన్ని ఏర్పాటు చేసుకున్నారు. చాలా చోట్ల స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల మద్దతును కూడగట్టుకున్నారు. తీరా ఇప్పుడు ఆమదాలవలస అభ్యర్ధిగా స్పీకర్ తమ్మినేనినే జగన్ ఖరారు చేయడంతో ఆమదాలవలస ఫ్యాన్ పార్టీ మూడు రెక్కల దిగువ ఉన్న క్యాడర్ లో తన అనుయాయులతో కలసి సువ్వారి గాంధీ రెబల్ గా అవతారం ఎత్తారు. ఇప్పటికే అభివృద్ధి లేదనే ఆరోపణలకు తోడు అనేక సమస్యలతో సతమతమవుతున్న స్పీకర్ తమ్మినేనికి సువ్వారి గాంధీ రూపంలో ఇప్పుడు మరో గట్టి జలక్ తగిలింది.