కొందరి కోసం లక్షల మందిని దూరం చేసుకుంటున్న జగన్!!

  గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థను అక్టోబర్‌ 2వ తేదీ నుంచి ఏపీ ప్రభుత్వం ప్రారంభించబోతున్న విషయం తెలిసిందే. ఒకే నోటిఫికేషన్‌ ద్వారా లక్షకు పైగా శాశ్వత ఉద్యోగాలు కల్పించడం రికార్డు అని ఏపీ ప్రభుత్వం గర్వంగా చెప్పుకుంటోంది. సచివాలయాల వ్యవస్థతో తమ పార్టీకి ఇటు యువతలో, అటు గ్రామ ప్రజల్లో బోలెడంత మైలేజ్  వస్తుందని సీఎం వైఎస్ జగన్ భావిస్తున్నారు. అయితే గ్రౌండ్ లెవెల్ లో మాత్రం ప్రజల అభిప్రాయం పూర్తి భిన్నంగా ఉన్నట్లు తెలుస్తోంది. అందుకు.. సచివాలయ ప్రశ్నపత్రాల లీకేజీ, ఒకే సామజిక వర్గానికి పెద్ద పీట ఇలా పలు కారణాలు ఉన్నాయి అంటున్నారు. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాల కోసం యువత పెద్ద ఎత్తున పోటీ పడ్డారు. దాదాపు 20 లక్షల మంది యువత దరఖాస్తు చేసుకున్నారు. వారిలో లక్ష మందికి పైగా (1,26,738) ఎంపిక అయ్యారు. అయితే పరీక్ష నిర్వహణ లోపంతో ఎక్కువ మంది అర్హతలేని వారు ఉద్యోగానికి ఎంపిక అయినట్లు తెలుస్తోంది. ప్రశ్నాపత్రం లీక్ అయిందని, తన సానుభూతి పరులకు ముందే పేపర్ లీక్ చేసి పరీక్ష రాయించారని ప్రచారం జరిగింది. మొదటి 250 ర్యాంకుల్లో ఒకే సామజిక వర్గానికి చెందినవారు 190 కి పైగా ఉండటంతో లీకేజీ అనుమానాలు బలపడ్డాయి. దీంతో స్వల్ప తేడాతో ఉద్యోగం చేజారిన వారిలో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. అర్హులైన వారిని పక్కనపెట్టి.. తమ పార్టీ సానుభూతిపరులకు, తమ సామాజికవర్గానికి చెందిన వారికి అవకాశం ఇచ్చారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సీఎం జగన్ భావిస్తున్నట్లు సచివాలయాల వ్యవస్థ వల్ల అధికార పార్టీకి మైలేజీ వస్తుందన్న సంగతి పక్కన పెడితే.. బోలెడంత నెగటివ్ ఇమేజ్ వచ్చే అవకాశముందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. పరీక్ష నిర్వహణ లోపం, ఫలితాలపై కులముద్ర పడటంతో మిగతా కులాల వారిలో తీవ్ర వ్యతిరేకత వచ్చే అవకాశం ఉందంటున్నారు. అంతేకాదు దాదాపు 20 లక్షల మంది దరఖాస్తు చేసుకుంటే 18 లక్షల మందికి పైగా నిరాశ తప్పలేదు. ఎంపికైన లక్షమంది మరియు వారి కుటుంబాలు జగన్ సర్కార్ పట్ల ఎంత సానుకూలంగా ఉంటారో.. అంతకు పదింతలు ఎంపిక కాని లక్షల కుటుంబాల వారు జగన్ పట్ల తీవ్ర అసంతృప్తితో ఉండే అవకాశముంది. పరీక్ష నిర్వహణ లోపం వల్లే తమకు ఉద్యోగం దక్కలేదని మెజారిటీ అభ్యర్థులు అభిప్రాయపడుతున్నారు. అది జగన్ సర్కార్ పై తీవ్ర ప్రభావం చూపవచ్చు. ఇప్పటికే సోషల్ మీడియా వేదికగా ఎంపిక కాని అభ్యర్థులు జగన్ సర్కార్ మీద విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రస్తుతం సొసైటీ మీద సోషల్ మీడియా ప్రభావం బలంగా ఉంది. అంతెందుకు వైసీపీ అధికారంలోకి రావడంలో కూడా సోషల్ మీడియా ప్రముఖ పాత్ర పోషించింది. ఇప్పుడదే సోషల్ మీడియాలో యువత జగన్ సర్కార్ పై తిరగబడుతోంది. ఇది మరింత ఉధృతమైతే వైసీపీకి తీవ్ర నష్టమని చెప్పక తప్పదు. ఓ రకంగా సచివాలయ వ్యవస్థ కూడా ఇసుక మాదిరిగానే లక్షల కుటుంబాలపై ప్రభావం చూపి వైసీపీ ప్రభుత్వానికి ఇబ్బందిగా మారనుందని చెప్పాలి. జగన్ సీఎంగా బాధ్యతలు చేపట్టాక ఇసుక కొరతతో రాష్ట్ర వ్యాప్తంగా నిర్మాణాలు నిలిచిపోయాయి. లారీ డ్రైవర్లు, కూలీలు ఇలా లక్షల కుటుంబాలు పని దొరక్క రోడ్డున పడ్డాయి. వారంతా జగన్ పై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఇప్పుడు ఆ లిస్ట్ లో సచివాలయ ఉద్యోగాలు దక్కని అభ్యర్థుల కుటుంబాలు కూడా చేరితే.. జగన్ మరింత గడ్డు కాలమే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

సాక్షి ఉద్యోగుల పంట పండుతోంది... ఇక మిగిలింది కొమ్మినేని ఒక్కరే..!

ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావడంతో సాక్షి ఉద్యోగుల పంట పండుతోంది. ఒకరి తర్వాత మరొకరికి కేబినెట్ ర్యాంక్ పదవులు దక్కుతున్నాయి. సీనియర్ ఐఏఎస్ లను మించిన జీతాలు, సౌకర్యాలతో కీలక పదవులు కట్టబెడుతున్నారు జగన్మోహన్ రెడ్డి. ఇప్పటికే సాక్షి ఎడిటోరియల్ డైరెక్టర్ సజ్జల రామకృష్ణారెడ్డిని సలహాదారుగా నియమించుకుని కేబినెట్ ర్యాంకు కట్టబెట్టిన జగన్మోహన్ రెడ్డి... ఆ తర్వాత సాక్షి ఉద్యోగులు కృష్ణమోహన్, హరికృష్ణలను సీఎంవోలోకి తీసుకున్నారు. ఇక తెలంగాణ జర్నలిస్టు దేవుపల్లి అమర్ ను జాతీయ మీడియా - ఇంటర్ స్టేషన్ మీడియా సలహాదారుగా నియమించుకుని నెలకు దాదాపు 4లక్షల జీతం, ఇతర సౌకర్యాలు కల్పించారు. ఇక ఇఫ్పుడు సాక్షి ఎడిటోరియల్ డైరెక్టర్ కె.రామచంద్రమూర్తిని ప్రజాసంబంధాల సలహాదారుగా నియమించారు. అయితే, రామచంద్రమూర్తి కూడా తెలంగాణ జర్నలిస్టే. అయితే, వీళ్లందరికీ సాక్షిలో ఏ స్థాయిలో జీతాలు ఇచ్చారో తెలియదు కానీ, ప్రభుత్వం మాత్రం 4లక్షలపైనే వేతనమిస్తూ, అలవెన్సులు, సౌకర్యాలు అదనంగా కల్పిస్తోంది. ఇక వీళ్లే కాకుండా, పీఆర్వోలుగా, ఫొటో-వీడియోగ్రాఫర్లుగా, ఆఫీస్ బాయ్ లుగా దాదాపు 150మంది సాక్షి ఉద్యోగులను నియమించినట్లు తెలుస్తోంది. అలాగే, ప్రభుత్వ డిజిటల్ మీడియాలోకి మరో 150మంది సాక్షి ఉద్యోగులనే తీసుకోనున్నారనే ప్రచారం జరుగుతోంది. అయితే, సజ్జల, దేవులపల్లి అమర్, రామచంద్రమూర్తి, కృష్ణమోహన్, హరికృష్ణను వివిధ హోదాల్లో నియమించుకుని, పలువురికి కేబినెట్ ర్యాంక్ హోదా కట్టబెట్టిన జగన్మోహన్ రెడ్డి... వీరభక్తుడైన కొమ్మినేని శ్రీనివాసరావుకు మాత్రం అన్యాయం చేస్తున్నారనే మాట వినిస్తోంది. తెలంగాణ జర్నలిస్టులందరికీ పెద్దపీట వేసిన జగన్..... అసలుసిసలు ఆంధ్రా జర్నలిస్టుకు మాత్రం ఇంకా ఎందుకు పదవి ఇవ్వలేదని అంటున్నారు. సాక్షిలో పెద్ద తలకాయలందరికీ దాదాపు పదవులిచ్చేశారు... ఇక, కొమ్మినేనికి కూడా ఏదోఒక కీలక పదవి ఇచ్చేస్తే బ్యాలెన్స్ కంప్లీట్ అవుతుందని అంటున్నారు. మరి వీరభక్తుడికి జగన్ ఏ పదవి కట్టబెడతారో చూడాలి.

ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీలో కుల రాజకీయాలు... పేరు మార్చుతారన్న ప్రచారంపై కలకలం...

ఆంధ్రప్రదేశ్ లో ప్రధానంగా రెండు సామాజిక వర్గాల మధ్యే అధికార మార్పిడి జరుగుతోంది. దాంతో ఎవరు అధికారంలోకొస్తే, వాళ్లు తమ వర్గానికి పెద్దపీట వేసుకోవడం సర్వసాధారణంగా మారింది. ఇది ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నిజం. చంద్రబాబు హయాంలో తన సామాజిక వర్గానికే ప్రతిచోటా కీలక పదవులను కట్టబెట్టారని ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఇది కూడా టీడీపీ ఘోర పరాజయం పాలవడానికి కారణాల్లో ఒకటని అంటారు. ఇక, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావడంతో... రెడ్డి కమ్యూనిటీకి పెద్దపీట వేస్తున్నారనే మాట వినిపిస్తోంది. నామినేటెడ్ పదవుల్లో బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు 50శాతం కోటా అంటూ చట్టం తెచ్చినప్పటికీ, కీలక పదవుల్లో మాత్రం జగన్మోహన్ రెడ్డి కమ్యూనిటీకే పెద్దపీట దక్కుతుందనేది ఆరోపణ. అయితే, ఈ కుల రాజకీయాలు... విశ్వవిద్యాలయాల్లో కూడా అలజడి సృష్టిస్తున్నాయట. తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఏకైక వైద్య విశ్వవిద్యాలయంలో ఇఫ్పుడు క్యాస్ట్ పాలిటిక్స్ భగ్గుమంటున్నాయి. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావడంతో, ఆ సామాజికవర్గ ప్రముఖులు.... ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీలో పాగా వేయడానికి సిద్ధమయ్యారట. అందులో భాగంగా ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ వైస్ ఛాన్సలర్ సీవీరావును తప్పించాలని సీఎం జగన్మోహన్ రెడ్డిపై ఒత్తిడి తెస్తున్నారట. దాంతో ఎందుకొచ్చిన తలపోటని సీవీరావు రాజీనామాకు సిద్ధపడినట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ ఇష్యూ... సీఎం జగన్మోహన్ రెడ్డి దృష్టికి వెళ్లడంతో అతిత్వరలోనే, వీసీ సీవీరావును తప్పిస్తారనే ప్రచారం జరుగుతోంది. అంతేకాదు స్వయంప్రతిపత్తి కలిగిన వైద్య విశ్వవిద్యాలయంపై వైద్యారోగ్యశాఖ ముఖ్య అధికారి అప్పుడే తనదైన శైలిలో పెత్తనం మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. అయితే, ముందు పెద్ద తలకాయలను తప్పిస్తేనే, ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీలో తాము అనుకున్నది చేయగలుతామని నిర్ణయానికి వచ్చిన జగన్ సామాజికవర్గ నేతలు, అధికారులు.... ముందుగా వీసీని వెంటనే తప్పించాలని జగన్ పై ఒత్తిడి పెంచారట. అంతేకాదు, అసలు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ పేరు మార్చాలని సీఎం దగ్గర ప్రతిపాదన పెట్టినట్లు వదంతులు వినిపిస్తున్నాయి. ఎన్టీఆర్ తొలగించాలని జగన్ సామాజికవర్గం డిమాండ్ చేస్తోందట. అయితే, ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీలో కుల రాజకీయాలపై అక్కడి అధికారులు, ఉద్యోగులు మండిపడుతున్నారు. మూడేళ్ల పదవీ కాలానికి ఎన్నికైన సీవీరావును వీసీగా తప్పిస్తే ఊరుకునేది లేదని హెచ్చరిస్తున్నారు. ఇక, యూనివర్శిటీ పేరు మార్చుతారన్న ప్రచారంపైనా ఉద్యోగులు ఫైరవుతున్నారు. ఎన్టీఆర్ పేరును తొలగిస్తే చూస్తూ ఊరుకోమని వార్నింగ్ ఇస్తున్నారు.

చంద్రబాబు బాటలో జగన్... వన్‌మ్యాన్‌ ఆర్మీలా పరిపాలన..!

చంద్రబాబు తరహాలోనే జగన్మోహన్ రెడ్డి కూడా అప్పుడే మంత్రులు, ఎమ్మెల్యేల పనితీరుకు మార్కులు వేయడం మొదలుపెట్టారట. ఎప్పటికప్పుడు మంత్రులు, ఎమ్మెల్యేల పనితీరును సమీక్షిస్తోన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి... తీవ్ర అసంతృప్తిగా ఉన్నారనే మాట వినిపిస్తోంది. విప్లవాత్మక నిర్ణయాలతో తాను దూసుకుపోతుంటే, మంత్రులు, ఎమ్మెల్యేలు... తన స్పీడ్ ను అందుకోలేకపోతున్నారని అసహనం వ్యక్తంచేస్తున్నారట. అంతేకాదు తన అంచనాలు ఒకలా ఉంటే... మంత్రులు, ఎమ్మెల్యేల పనితీరు మాత్రం మరోలా ఉందని జగన్ మండిపడుతున్నట్లు తెలుస్తోంది. క్లిష్ట సమయాల్లో కీలక పరిస్థితుల్లో మంత్రులు చాకచక్యంగా వ్యవహరించలేకపోతున్నారని జగన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారట. ముఖ్యంగా విపక్షాల విమర్శలకు దీటుగా కౌంటర్ ఇవ్వలేకపోతున్నారంటూ మంత్రులకు జగన్ క్లాస్ పీకినట్లు తెలుస్తోంది. అంతేకాదు, ప్రభుత్వం అమలు చేస్తోన్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో మంత్రులు, ఎమ్మెల్యేలు ఘోరంగా విఫలమవుతున్నారని జగన్ ఫైరయ్యారట. ముఖ్యంగా గత ప్రభుత్వం కంటే గొప్పగా మనమేం చేస్తున్నామో చెప్పుకోవడంలో ఇటు మంత్రులు... అటు ఎమ్మెల్యేలు వెనుకబడుతున్నారని జగన్ క్లాస్ పీకారట. అయితే, జగన్ స్పీడ్‌ను తట్టుకోలేక మంత్రులు ఇబ్బంది పడుతున్నట్లు టాక్ వినిపిస్తోంది. ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి వేగంగా నిర్ణయాలు తీసుకుంటున్నా, అంతే వేగంగా రిసీవ్ చేసుకోలేకపోతున్నామని అంటున్నారు. అదేవిధంగా ఎమ్మెల్యేల పరిస్థితి కూడా ఉంటోందని చెబుతున్నారు. దాంతో ఒక్క సీఎం తప్పా...మిగతా వాళ్లెవరూ పనిచేయడం లేదనే సంకేతాలు ప్రజల్లోకి వెళ్లిందని, అదే సమయంలో పరిపాలన మొత్తం జగన్ వన్‌మ్యాన్‌ ఆర్మీలా కనిపిస్తోందని అంటున్నారు. అయితే, ఇదే పరిస్థితి కొనసాగితే, ఇటు ప్రభుత్వానికి, అటు పార్టీకి తీవ్ర నష్టం తప్పదని హెచ్చరిస్తున్నారు.

సాక్ష్యాలతో దొరికిన ఆమంచి.. సొంత పార్టీ వ్యక్తి పైనే దాడి!!

  చీరాలలో జర్నలిస్ట్ నాగార్జున రెడ్డిపై దాడి వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. ఇటీవల నాగార్జున రెడ్డిపై దాడి జరిగిన సంగతి తెలిసిందే. ఆ దాడి చేసిన వ్యక్తులు వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ అనుచరులని వార్తలొచ్చాయి. అంతేకాదు అసలు జర్నలిస్ట్ నాగార్జున రెడ్డి.. ఆమంచి మరియు అతని అనుచరుల అక్రమాలపై పోలీసులకు ఫిర్యాదు చేసి వస్తున్న సమయంలోనే ఈ దాడి జరిగిందని ప్రచారం జరిగింది. మరోవైపు నాగార్జున రెడ్డి కూడా తనపై.. ఆమంచి బంధువులు, అనుచరులు దాడి చేశారని పోలీసులకు స్టేట్ మెంట్ ఇచ్చారు. అయితే ఆమంచి మాత్రం ఇదంతా పచ్చి అబద్దం, ఇది టీడీపీ ఆడిస్తున్న నాటకం అని కొట్టి పారేసారు. అంతేకాదు.. 'నాగార్జున రెడ్డి జర్నలిస్ట్‌ కాదు. ఇటీవల ఎన్నికలలో టీడీపీ ఏజంట్‌ గా పనిచేసాడు. టీడీపీ లో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నాడు.' అని ఆమంచి చెప్పుకొచ్చారు.   అయితే ఆమంచి చేసిన వ్యాఖ్యల్లో ఏమాత్రం నిజం లేదని తెలుస్తోంది. ఆయన చేసిన వ్యాఖ్యలు అబద్దమని రుజువు చేస్తూ సోషల్ మీడియాలో ఆధారాలు దర్శనమిస్తున్నాయి. నాగార్జున రెడ్డి జర్నలిస్ట్‌ కాదని ఆమంచి అన్నారు. కానీ ఆమంచి ప్రస్తుతం ఏ పార్టీలో ఉన్నారో, అదే పార్టీ అధినేతకు చెందిన మీడియా సంస్థలో నాగార్జున రెడ్డి జర్నలిస్ట్ గా పనిచేసారు.     అదేవిధంగా నాగార్జున రెడ్డి.. ఎన్నికలలో ఏజంట్‌ గా పనిచేసిన మాట వాస్తవమే కానీ.. ఆయన పనిచేసింది టీడీపీ కోసం కాదు ఇండిపెండెంట్ అభ్యర్థి కోసం. ఇక్కడ ఇంకో ట్విస్ట్ కూడా ఉంది. నాగార్జున రెడ్డి టీడీపీ లో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారని ఆమంచి చెప్పుకొచ్చారు. కానీ నిజానికి నాగార్జున రెడ్డి వైసీపీలో క్రియాశీలకంగా వ్యవహరించారని తెలుస్తోంది. అంతెందుకు వైఎస్ జగన్ తో కలిసి పాదయాత్రలో కూడా పాల్గొన్నారు.     మరి ఇవన్నీ తెలియకుండానే 'నాగార్జున రెడ్డి జర్నలిస్ట్ కాదు, టీడీపీకి చెందిన వ్యక్తి' అని ఆమంచి వ్యాఖ్యలు చేసారా?. ఏది ఏమైనా ఆధారాలతో నెటిజన్లు సోషల్ మీడియాలో ఆమంచిని ఏకేస్తున్నారు. అంతేకాదు ఆమంచి కుటుంబం మీద ఉన్న కేసుల లిస్ట్ ని కూడా ప్రస్తావిస్తూ నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. ఆమంచి తండ్రి మీద.. హత్య, దొంగసారా మరియు హత్యాయత్నం కింద పలు కేసులు నమోదయ్యాయి. ఆమంచి సోదరుడిపై కూడా పలు కేసులు నమోదయ్యాయి. ఆమంచి వర్గీయలు చీరాలలో పలువురిపై దాడి చేసిన ఆరోపణలు ఉన్నాయి. జర్నలిస్ట్ నాగార్జున రెడ్డిపై గతంలో కూడా ఆమంచి సోదరుడు, అనుచరులు దాడి చేసాడని ఆరోపణలు వచ్చాయి. ఇప్పుడు కూడా ఆమంచి వర్గీయులే తన మీద దాడి చేసారని నాగార్జున చెప్తున్నాడు. కానీ ఆమంచి మాత్రం సింపుల్ గా.. అతను జర్నలిస్ట్ కాదు, టీడీపీ వ్యక్తి అంటూ చెప్పుకొచ్చారు. టీడీపీ వ్యక్తి అయితే జగన్ తో పాదయాత్రలో ఎందుకు పాల్గొన్నాడు అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. సొంత పార్టీకి చెందిన వ్యక్తే ఆమంచి మరియు అతని వర్గీయులపై ఫిర్యాదు చేస్తున్నారు అంటే.. చీరాలలో వారి ఆగడాలు ఏ స్థాయిలో ఉన్నాయో ఊహించుకోవచ్చు అంటున్నారు. ఆమంచి మరియు అతని వర్గీయులు చీరాలలో ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నారంటూ నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

రైతు భరోసా సగానికి సగం కోత... అన్నదాతలకు జగన్ సర్కారు షాక్..

ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాటలను చూస్తుంటే... కోటలు దాటుతున్నాయ్. కానీ అమలు దగ్గరికి వచ్చేసరికి మాత్రం అసలు రూపం బయటపెడుతున్నారు. అమ్మఒడి పథకం నుంచి రైతుభరోసా పథకం వరకు అన్నింటా ఇదే జరుగుతోంది. వైసీపీ నవరత్నాల్లో భాగంగా ప్రతి రైతుకూ పెట్టుబడి సాయం ఇస్తామని హామీ ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి... లబ్దిదారులను సగానికి సగం తగ్గించేందుకు వడపోత ప్రారంభించారు. అక్టోబర్ నుంచే వైఎస్సార్ రైతు భరోసాను అమలు చేస్తామని గొప్పగా ప్రకటించిన జగన్... మార్గదర్శకాల పేరుతో అన్నదాతలకు ఊహించని షాకిచ్చారు. తాజా మార్గదర్శకాల ప్రకారం గతంలో సర్కారు ప్రకటించిన లబ్దిదారుల సంఖ్య... సగానికి సగం తగ్గిపోయింది. కౌలు రైతులతో కలుపుకొని 64లక్షల పైగా(రైతులు 48.7లక్షలు, కౌలు రైతులు 15.37లక్షలు) సాగుదారులు ఉన్నారని, వారందరికీ పెట్టుబడి సాయం అందిస్తామంటూ వ్యవసాయ బడ్జెట్ లో స్పష్టంగా పేర్కొన్న జగన్ సర్కారు... గైడ్ లైన్స్ అండ్ వడపోత తర్వాత ఆ సంఖ్యను దాదాపు 36లక్షలకు కుదించేసింది. ఎన్నికల టైమ్ లో ప్రతి రైతుకూ 12వేల 500 రూపాయల పెట్టుబడి సాయం అందిస్తామన్న జగన్మోహన్ రెడ్డి.... ఇఫ్పుడు కేంద్రం ఇస్తోన్న 6వేలు పోను... మిగతా 6500లను మాత్రమే రైతుల ఖాతాల్లో జమ చేసేందుకు సిద్ధమవుతోంది. అయితే, కేంద్రం అమలు చేస్తోన్న గైడ్ లైన్స్ నే జగన్ సర్కారు కూడా ఫాలో కావాలని నిర్ణయించింది. కేంద్రం గైడ్ లైన్స్ ప్రకారం లబ్దిదారుల సంఖ్య  29.45లక్షలకు పడిపోయింది. ఎన్నికలవేళ కేంద్రం మొదటగా ఏపీలో దాదాపు 43లక్షల మంది రైతులకు పీఎం-కిసాన్ మనీ జమచేయగా, రెండో విడతకు వచ్చేసరికి పలురకాల కండీషన్స్ తో లబ్దిదారుల సంఖ్యను 33లక్షలకు తగ్గించేసింది. ఇక మూడో విడత వచ్చేసరికి ఆ సంఖ్య 29.45లక్షలకు పడిపోయింది. కేవలం మూడే మూడు నెలల్లో గైడ్ లైన్స్ పేరుతో ఏకంగా పదమూడున్నర లక్షల మంది రైతులను అర్హుల జాబితాలో నుంచి తొలగించేసింది. అయితే, కేంద్రం ఇస్తోన్న సొమ్ముతో కలిపే 12వేల 500 ఇస్తామంటూ మెలిక పెట్టిన జగన్ సర్కారు... అదే గైడ్ లైన్స్ ఫాలో అవుతూ, లబ్దిదారుల సంఖ్యను సగానికి సగం కోత పెట్టింది. కేంద్రం ఎవరి ఖాతాల్లో అయితే, మూడు విడతల్లో 6వేల రూపాయలు జమ చేసిందో... వాళ్లకే మిగతా ఆరున్నర వేలు వేయనున్నట్లు తెలుస్తోంది. సొంత భూమి కలిగిన రైతుల విషయంలో గైడ్ లైన్స్ ఇలాగుంటే, ఇక కౌలు రైతుల దగ్గరకు వచ్చేసరికి పరిస్థితి మరీ దారుణంగా ఉంది. కౌలు రైతులకు కేంద్రం నయా పైసా ఇవ్వకపోవడంతో, మొత్తం 12వేల 500 తామే ఇస్తామంటోంది జగన్ సర్కారు. అయితే, గైడ్ లైన్స్ అండ్ కండీషన్స్ పేరుతో కౌలు రైతుల సంఖ్యను కూడా 16లక్షల నుంచి ఐదారు లక్షలకు తగ్గించి, పెట్టుబడి సాయం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి కేంద్రం గైడ్ లైన్స్ అండ్ కండీషన్స్ పేరుతో వైఎస్సార్ రైతు భరోసా లబ్దిదారుల సంఖ్యను సగానికి సగం కోత పెట్టిన జగన్ సర్కారు... కేవలం 30లక్షల్లోపు రైతులకే సాయం అందించినున్నట్లు తెలుస్తోంది.

లింగమనేని వర్సెస్ జగన్ సర్కార్... ఏపీలో కరకట్ట రాజకీయం...

టీడీపీ అధినేత చంద్రబాబు నివాసముంటోన్న లింగమనేని రమేష్‌ ఇల్లు కూల్చివేత నోటీసులపై వైసీపీ-టీడీపీ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. తన ఇంటిని పక్కా నిబంధనలను పాటించే నిర్మించానని లింగమనేని చెబుతుంటే... రమేష్‌ చెబుతున్నవన్నీ పచ్చి అబద్దాలంటూ వైసీపీ ఎదురుదాడికి దిగింది. అంతేకాదు తన ఇంటిని కూల్చివేయవద్దంటూ సీఎం జగన్‌కు లింగమనేని లేఖ రాయడంపై మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే మండిపడ్డారు. కృష్ణా కరకట్టపై గెస్ట్‌ హౌస్ కూల్చివేతకు నోటీసులు ఇవ్వడంపై సీఎం జగన్మోహన్ రెడ్డికి లేఖ రాసిన లింగమనేని రమేష్‌.... అన్ని రకాల అనుమతులు తీసుకున్నాకే, నిర్మాణం చేపట్టినట్లు తెలిపారు. కూల్చివేతల వల్ల తన ఒక్క కుటుంబమే ప్రభావితం కాదని, రాష్ట్ర ప్రజలందరూ అవుతారన్నారు. నిర్మాణాల కూల్చివేత... రాజధాని ప్రాంతంలో లక్షలాది మందిని నిరాశా నిస్పృహల్లోకి నెట్టేసిందన్నారు. ఉండవల్లి అతిథిగృహానికి 2012లోనే చట్టపరంగా అన్ని అనుమతులతో పాటు ఇరిగేషన్‌ శాఖలోని కృష్ణా సెంట్రల్‌ డివిజన్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌ నుంచి ఎన్‌వోసీ కూడా తీసుకున్నామని, 2014లో ఇక్కడి నుంచి పరిపాలన సాగించే ముఖ్యమంత్రికి అవసరమైన నివాసం లేకపోవడంతో కరకట్ట మీదున్న తన గెస్ట్‌ హౌస్‌ను అధికార నివాసానికి ఇచ్చానన్నారు. ఇందులో ఎలాంటి రాజకీయ, ఆర్థిక సంబంధిత ఆలోచనలు ఇందుల్లేవన్నారు. లింగమనేని లేఖపై మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే ఘాటుగా రియాక్టయ్యారు. లేఖలో పేర్కొన్న విషయాలన్నీ అవాస్తవాలని కొట్టిపారేశారు. చంద్రబాబు వల్ల లబ్ది పొందకుంటే... తన ఇంటిని ఎందుకిచ్చారో చెప్పాలన్నారు. అక్రమంగా భవనాలు కట్టారు కాబట్టే... ప్రభుత్వం చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటుందన్నారు. అక్రమ లేఔట్లతో ప్రభుత్వ భూములను లింగమనేని ఎలా కొల్లగొట్టారో ఆధారాలతో సహా బయటపెడతానన్నారు. మొత్తానికి కరకట్టపై కూల్చివేతల రాజకీయం రోజురోజుకీ హీటెక్కుతోంది. మరోవైపు లింగమనేని హైకోర్టును ఆశ్రయించడంతో ఈ వ్యవహారం ఏ మలుపు తిరుగుతుందో చూడాలి.

రేవంత్ రెడ్డికి సోనియా గాంధీ షాక్...

తెలంగాణ లోని సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజక వర్గ కాంగ్రెస్ అభ్యర్థిగా పీసీసీ అధ్యక్షుడు నల్లగొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి సతీమణి పద్మావతి రెడ్డిని నిర్ణయిస్తూ ఎఐసిసి అధినేత్రి సోనియా గాంధీ నిర్ణయం తీసుకున్నారు. అయితే ఉత్తమ కుమార్ రెడ్డి తన సతీమణి కి కాంగ్రెస్ టికెట్ కేటాయించి, పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ మల్కాజ్ గిరి ఎంపి రేవంత్ రెడ్డి కి సోనియా గాంధీ షాకిచ్చారు. రేవంత్ రెడ్డి తన అనుచరుడు అయిన శ్యామల్ కిరణ్ రెడ్డి కి టిక్కెట్ ఇవ్వాలని ఏఐసీసీ కి నివేదించుకున్నా సోనియగాంది కనికరం చూపలేదు. దీంతో పిసిసి లో ఉత్తమ్ మాటకు తిరుగులేదని తేలిపోయింది. హుజూర్ నగర్ నియోజక వర్గ కాంగ్రెస్ అభ్యర్థిగా పద్మావతి రెడ్డి పేరు కాంగ్రెస్ అధిష్టానం ఖరారు చేసింది. గత రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో కోదాడ నియోజక వర్గం నుంచి ఆమె పోటీ చేసి శాసన సభకు ఎన్నికయ్యారు. రెండు వేల పధ్ధెనిమిది ఎన్నికల్లో ఆమె పోటీ చేసినప్పటికీ గెలుపొందలేదు. కోదాడ నుంచి టీ.ఆర్.ఎస్ అభ్యర్థి బొల్లం మల్లయ్య యాదవ్ గెలుపొందారు. రెండు వేల పధ్ధెనిమిది ఎన్నికల్లో హుజూర్ నగర్ నుంచి గెలు పొందిన ఉత్తమ్ కుమార్ రెడ్డి రెండు వేల పంతొమ్మిది లోకసభ ఎన్నికల్లో నల్గొండ నియోజకవర్గానికి పోటీ చేసి విజయం సాధించారు. దీంతో ఆ స్థానం ఖాళీ కావడంతో అక్టోబర్ ఇరవై ఒకటిన ఉప ఎన్నిక నిర్వహించనున్నారు. ఈ ఉప ఎన్నిక కౌంటింగ్ అక్టోబర్ ఇరవై నాలుగున జరగనుంది. ఇక టీ.ఆర్.ఎస్ అభ్యర్థిగా శానంపూడి సైది రెడ్డిని సీ.ఎం కేసీఆర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. సైదురెడ్డికి సీఎం కేసీఆర్ బీఫారం కూడా అందజేశారు. ఆయన గత ఎన్నికలకు ముందు ఎన్నారై గా ఉంటూ ఉత్తమ్ కుమార్ రెడ్డిపై టీఆర్ ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి చివరి వరకూ గట్టి పోటీ ఇచ్చి ఏడు వేల ఓట్లతో ఓడిపోయారు. ఇప్పుడు కాంగ్రెస్ అభ్యర్థి ఖరారు కావడంతో పోరు రసవత్తరంగా మారనుంది. ఇప్పటికే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇలాఖగా ఉన్న హుజూర్ నగర్ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి అధికార పార్టీకి గట్టి పోటీ తప్పదన్న చర్చలు నడుస్తున్నాయి. ఉత్తమ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థికి ముప్పై వేల మెజారిటీ ఖాయమని ప్రకటించాడు. దీంతో టీ.ఆర్.ఎస్ ఈ ఎన్నికను ఎలాగైనా గెలిచి సత్తా చాటాలని ప్రయత్నిస్తుంది. ఉత్తమ్ సొంత కోటాలో గులాబీ జెండా ఎగరవేసేందుకే టీ.ఆర్.ఎస్ ఇప్పటి నుంచే ప్రయత్నాలు ముమ్మరం చేసింది. మధ్యలో బిజెపి సైతం గణనీయంగా ఓట్లు సాధించేందుకు రెడీ అవుతోంది. హుజూర్ నగర్ ఉప ఎన్నిక అటు ఉత్తమ్ కుమార్ రెడ్డి కి కేసీఆర్ కు సవాల్ గా మారింది.

దుమారం రేపుతున్న అమరావతి హై కోర్టు వివాదం...

  ఏపీలో హై కోర్టు వివాదం తీవ్రరూపం దాల్చుతోంది, హైకోర్టు కావాలంటూ సీమలో ఆందోళన ఊపందుకుంది. హై కోర్టుని అమరావతి నుంచి తరలించడానికి వీల్లేదని ఆంధ్రాలో లాయర్ లు ఉద్యమ బాట పట్టారు. దీంతో ఏపీలో హై కోర్టు వివాదం తీవ్రస్థాయికి చేరుతోంది. శ్రీబాగ్ ఒప్పందం గుర్తు చేస్తూ సీమలోని న్యాయవాదులు కదం తొక్కుతున్నారు. రాజధాని విషయంలోనే సీమకు అన్యాయం జరిగిందంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటు గుంటూరులో ఐదు జిల్లాల న్యాయవాదులు ఆందోళన బాట పట్టారు అయితే, రాయలసీమకు హై కోర్టు కావాల్సిందేనని కర్నూలులో లాయర్లు రిలే, నిరాహార దీక్షలు చేస్తున్నారు. రాజధానిని అమరావతి నుంచి తరలిస్తున్నారనే ప్రచారం మొదలైన క్షణం నుంచి రాయలసీమలో ఉద్యమాలు మొదలయ్యాయి. శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం కర్నూలులో రాజధానిని ఏర్పాటు చేయాలంటూ ఆందోళనలు ఊపందుకున్నాయి. కర్నూలు, కడప జిల్లా న్యాయవాదులు గత వారం రోజులుగా ఆందోళన చేస్తున్నారు. విద్యార్థి సంఘాల నేతలు, సామాజికవేత్తలతో కలిసి పోరు బాట పట్టారు. సీమకు మొదట్నుంచీ అన్యాయం జరిగిందని హై కోర్టు విషయంలో వెనక్కి తగ్గేది లేదు అని న్యాయవాదులు అంటున్నారు. హైకోర్టు సీమకు ఇవ్వాలంటూ కడప, కర్నూలు జిల్లాలో ఇప్పటికే రిలే, నిరాహార దీక్షలు నడుస్తుంటే తాజాగా అనంతపురంలో కూడా సీమకు హైకోర్టు నినాదంతో ఆందోళనలు మొదలయ్యాయి. అనంతపురం కోర్టు నుంచి తెలుగు తల్లి విగ్రహం వరకు న్యాయవాదులంతా విధుల బహిష్కరించి భారీ ర్యాలీ నిర్వహించారు. శ్రీబాగ్ ఒప్పందాన్ని ఉల్లంఘించరాదని దాన్ని అనుసరించి సీమకు న్యాయం చేయాలని అక్కడి న్యాయవాదులు డిమాండ్ చేస్తున్నారు. హై కోర్టు కోసం ఆంధ్రా లోనూ అలజడి మొదలైంది, అమరావతి నుంచి హైకోర్టును తరలిస్తే ఊరుకునేది లేదంటూ ఆంధ్రాలోని ఆరు జిల్లాల న్యాయవాదులు ఉద్యమ బాట పట్టారు. హై కోర్టు రాజధానిలోనే ఉండాలని అమరావతి నుంచి మరో ప్రాంతానికి ఎలా తరలిస్తారని ప్రశ్నిస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడే గుంటూరులో హై కోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలని ఉద్యమించామని, ఇప్పుడు వచ్చిన హైకోర్టును ఎలా వదులుకుంటామని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో గుంటూరు, కృష్ణా, నెల్లూరుతో పాటు ఉభయ గోదావరి జిల్లాల న్యాయవాదులు గుంటూరులో భారీ నిరసన ప్రదర్శన చేపట్టారు.

హుజూర్ ఉప ఎన్నికల్లో టిడిపి పరిస్థితేంటి..?

టిడిపి హుజూర్ పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయలేదు, అది చాలా తప్పుడు సంకేతం వెళ్లింది, కార్యకర్తలందరూ కూడా చాలా నిరుత్సాహపడిపోయారు కానీ, ఇప్పుడు మరోసారి తెలంగాణలో టీడీపీని బలోపేతం చేసే ప్రయత్నం చేస్తామని చంద్రబాబు చెబుతున్నారు. వారానికి రెండు రోజులు హైదరాబాద్ లో ఉంటూనే పార్లమెంట్ నియోజక వర్గాల వారీగా కూడా సమీక్షలు చేస్తూ కొంత యువ నాయకులను ప్రోత్సహించే ప్రయత్నం చేస్తున్నారు. ఎన్నిక వచ్చిన సందర్భంలో టిడిపి నాయకులు ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించిన మిగిలిన టిడిపి నాయకులు కూడా నర్సిరెడ్డి లాంటి నాయకులకి టికెట్ ఇస్తే కొంత టిడిపికి ఉత్సాహం వచ్చే అవకాశం ఉంది. అయితే, నర్సిరెడ్డి ఇప్పటికే అన్ని కార్యక్రమాల్లో స్టేజ్ పై మాట్లాడుతూ కొంత యాక్టివ్ గా ఉన్నారు. ఇలాంటి నాయకులని ప్రోత్సహిస్తే మరోసారి టిడిపికి కొంత ఊపు వచ్చే అవకాశముంటుంది. కాబట్టి ఈ ఎన్నికను ఉపయోగించుకోవాలని టిడిపి సీనియర్ నాయకులు చెప్తున్నారు. కానీ ఇది అంత సులభంగా జరిగే పని కాదు, ఖర్చు ఒక ఎత్తయితే ఇప్పుడు పోటీ చేస్తే, పోటీలో వచ్చే పరిణామాలు ఏ విధంగా ఉంటాయి, పోటీ కారణంగా లాభనష్టాలు ఏ విధంగా ఉంటాయి ఇవన్నీ పరిగణనలోకి తీసుకున్న తర్వాతే పోటీకి నిలబడాలి. కాని, నాయకుల చెబుతున్నట్టుగా పోటీ చేసినంత మాత్రాన పార్టీ బలోపేతం అయ్యే పరిస్థితి అయితే కనిపించట్లేదనే చెప్పాలి.కానీ, చంద్రబాబు వ్యూహం ఏ విధంగా ఉంటుందనేది చూడాలి. ఇప్పుడు పోటీ చేస్తే లాభం కన్నా నష్టమే ఎక్కువ జరుగుతుంది అని చంద్రబాబు ఆలోచించే అవకాశాలున్నాయి. దీంతో నర్సిరెడ్డి లాంటి నాయకులు నిరుత్సాహపడే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇప్పటికే అసెంబ్లీ నియోజక వర్గాల వారీగా నాయకులను గుర్తించి , వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి ప్రోత్సహించే ప్రయత్నాలైతే టిడిపి నాయకులు చేస్తున్నారు. ఉప ఎన్నికల్లో పార్టిసిపేట్ చేయడం సరైన నిర్ణయం కాదని టిడిపి సీనియర్ నాయకులు అనుకుంటున్నారు. కాకపోతే భవిష్యత్తులో మాత్రం పట్టు వదలకుండా నియోజకవర్గాల వారీగా నాయకులని ప్రోత్సహించే ప్రయత్నం మాత్రం ఎప్పుడూ జరుగుతూనే ఉంటుందని, తెలంగాణ లో మరొక్కసారి మంచి రోజులొస్తాయనే ఆలోచనలో తెలంగాణ టిడిపి ఉన్నట్టుగా తెలుస్తోంది.

జగన్‌ను ఇరికించిన కేసీఆర్..! అయినా నిప్పు లేకుండా పొగ రాదు కదా.!

కేంద్రంపైనా, బీజేపీపైనా ఉమ్మడి పోరు చేయాలని కేసీఆర్-జగన్ ఏకాభిప్రాయానికి వచ్చారంటూ వచ్చిన కథనాలతో జగన్ ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రుల సమావేశంపై ప్రముఖ పత్రికలు ప్రచురించిన కథనాలు జగన్ సర్కారులో గుబులు రేపుతున్నాయి.ప్రభుత్వం భయపడుతోంది. మోడీ గవర్నమెంట్ తోనూ, బీజేపీతోనూ సఖ్యతగా ఉంటూ వస్తోన్న ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి... పేపర్లలో వచ్చిన కథనాలు చూసి కంగుతిన్నట్లు తెలుస్తోంది. దాంతో, కేంద్రం, బీజేపీ తీరుపై కేసీఆర్-జగన్ తీవ్ర అసంతృప్తిగా ఉన్నారంటూ వచ్చిన కథనాలపై ఏపీ ప్రభుత్వం వివరణ ఇచ్చింది. సమావేశంలో అసలు, కేంద్రం గురించి గానీ, అలాగే బీజేపీపైనా కానీ అస్సలు చర్చే జరగలేదని, ఇది దురుద్దేశపూరిత కథనం అంటూ ఏపీ సీఎంవో ప్రకటన ఇచ్చింది. అయితే, కేంద్రం తీరుపైనా, బీజేపీ విధానాలపైనా ముఖ్యమంత్రుల మీటింగ్ లో తీవ్ర చర్చ జరిగినట్లు ప్రముఖ ప్రతికలు కథనాలు ఇచ్చాయి. అత్యధిక సర్క్యులేషన్ ఉన్న ప్రముఖ పత్రిక... కేంద్రం చిన్నచూపు-తెలుగు రాష్ట్రాల అసంతృప్తి అంటూ మెయిన్ హెడ్డింగ్ తో ఫ్రంట్ పేజీ వార్త ప్రచురించింది. అలాగే, ఏపీ, తెలంగాణలో బీజేపీ అనుసరిస్తోన్న విధానాలు సరిగా లేవు... తెలుగు రాష్ట్రాల ప్రయోజనాలను ఎన్డీఏ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు... ఏపీ, తెలంగాణ ప్రభుత్వ నిర్ణయాలను కేంద్రం వ్యతిరేకిస్తోంది... కేంద్రానికి వ్యతిరేకంగా ఉమ్మడి పోరు చేద్దామంటూ... ఇద్దరు ముఖ్యమంత్రులు ఏకాభిప్రాయానికి వచ్చారంటూ కథనం ఇచ్చింది. ఇక మరో పత్రిక... బీజేపీని ఉమ్మడిగా ఎదుర్కొందాం... కనీసం గవర్నర్ల నియామకంపైనా రాష్ట్రాలను సంప్రదించలేదంటూ... కేసీఆర్-జగన్ మీటింగ్ పై కథనం ప్రచురించింది. దాంతో అప్రమత్తమైన జగన్ ప్రభుత్వం వెంటనే వివరణ ఇచ్చింది. కేంద్రం, బీజేపీ గురించి అస్సలు చర్చ జరగలేదని ప్రకటన చేసింది. అయితే, నిజంగానే కేంద్రం, బీజేపీ గురించి చర్చించకపోతే, తెలంగాణ సీఎంవో కూడా స్పందించాల్సి ఉంటుంది. లేకపోతే కథనాలు నిజమేనని భావించాల్సి ఉంటుందని విశ్లేషకులు అంటున్నారు. నిప్పు లేకుండా పొగ రాదనే ఎంత సత్యమో... కేంద్రం తీరుపైనా, బీజేపీ విధానాలపైనా కేసీఆర్-జగన్ చర్చించకుండా కథనాలు రావనేది అంతే నిజం. అయితే, కేంద్రంతోనూ, మోడీ-అమిత్ షాతో సఖ్యతనే కోరుకుంటున్న జగన్ కు ఈ కథనాలు ఇబ్బంది కలిగించాయి. దాంతో వెంటనే సీఎంవోతో వివరణ ఇప్పించారు. అయితే, తెలంగాణ ప్రభుత్వం వైపు నుంచి మాత్రం ఎలాంటి వివరణ రాలేదు. దాంతో కేంద్రంపైనా, బీజేపీపైనా గుర్రుగా ఉన్నది కేసీఆర్ అయితే, అందులోకి జగన్ కి కూడా తెలివిగా లాగారనేది రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. తెలంగాణలో టీఆర్ఎస్ కు బీజేపీ సవాలు విసురుతోంది... అలాగే 2023లో ఎలాగైనా అధికారంలోకి రావాలని వ్యూహరచన చేస్తోంది. దాంతో బీజేపీతో, మోడీతో కేసీఆర్ తీవ్రంగా విభేదిస్తున్నారు. పైగా మోడీ రెండోసారి ప్రధాని పగ్గాలు చేపట్టాక, కేంద్రంలో కేసీఆర్ అస్సలు సత్సంబంధాలు కొనసాగించడం లేదని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే కేంద్రం అండ్ కాషాయ పార్టీతో కేసీఆర్ సై అంటే సై అంటున్నారని, కానీ మోడీ-అమిత్ షాతో తగువు పెట్టుకోవడానికి ఏమాత్రం సిద్ధంగా లేని జగన్ ను ఇందులోకి లాగడంతోనే ఏపీ సీఎంవో వివరణ ఇచ్చినట్లు అర్ధమవుతోంది. ప్రముఖ పత్రికల్లో వచ్చిన కథనాలతో కేసీఆర్ కు ఎలాంటి నష్టం లేకపోయినా, జగన్ కు మాత్రం ఇది కచ్చితంగా ఇబ్బందికర పరిణామమే అంటున్నారు విశ్లేషకులు.

తెలుగుదేశం కంచుకోటలకు బీటలు... అప్రమత్తం కాకపోతే కనుమరుగే..!

తెలుగుదేశం ఆవిర్భావం తర్వాత విశాఖ రాజకీయ ముఖచిత్రాన్ని పరిశీలిస్తే పసుపు జెండాదే హవా కనిపిస్తుంది. వైజాగ్ రాజకీయాల్లో టీడీపీ ఛరిష్మా చారిత్రాత్మకం. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. క్రమంగా వైసీపీ బలపడుతూ వచ్చింది. 2014లో పెద్దగా ప్రభావం చూపించలేకపోయిన జగన్ పార్టీ... 2019కి వచ్చేసరికి అనూహ్యంగా పుంజుకుని ఒక్క విశాఖ అర్బన్ మినహా జిల్లా మొత్తం క్లీన్ స్వీప్ చేసింది. అయితే, జగన్ సునామీలో కూడా విశాఖ అర్బన్‌లో నాలుగు స్థానాలను కైవసం చేసుకుని తెలుగుదేశం సత్తా చాటింది. అంతేకాదు ఓడిపోయిన నియోజకవర్గాల్లోనూ గట్టిపోటీనిచ్చి స్వల్ప తేడాలతోనే సీట్లను కోల్పోయింది. సీట్లు రాకపోయినా, ఓటు బ్యాంకు మాత్రం చెక్కు చెదరలేదని, విశాఖ జిల్లాలో తెలుగుదేశం పునాదులు స్ట్రాంగ్ గా ఉన్నాయని రుజువు చేసింది. కానీ ఎన్నికల తర్వాత తెలుగుదేశం గోడలకు బీటలు వారుతున్నాయి. ముఖ్యనేతల మధ్య విభేదాలు, వివాదాలతో ఒక్కో నియోజకవర్గంలో పట్టు కోల్పోతోంది. గంటాతో విభేదాలతో, ఎన్నికలకు ముందే అవంతి శ్రీనివాస్ వైసీపీ గూటికి చేరడంతో భీమిలిలో పట్టుకోల్పోయింది టీడీపీ. ఇక అవంతి బాటలోనే అయ్యన్నపాత్రుడు సొంత తమ్ముడు, తెలుగుదేశాన్ని వీడి... జగన్ గూటికి చేరనుండటంతో నర్సీపట్నం టీడీపీలో చీలికలు మొదలై పార్టీ బలహీనపడిందనే మాట వినిపిస్తోంది. అలాగే, విశాఖ డెయిరీ ఆడారి కుటుంబం వైసీపీలో చేరడంతో దాదాపు గ్రామీణ ప్రాంతంలో తెలుగుదేశం పట్టుకోల్పోందని అంటున్నారు. ఇక, ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌, వైజాగ్ అర్బన్ అధ్యక్షుడు రెహ్మన్ మధ్య విభేదాలు తీవ్రస్థాయికి చేరి, పార్టీ అధిష్టానం వరకు వెళ్లాయి. ఇలా, ప్రతి నియోజకవర్గంలో, ముఖ్యనేతల మధ్య విభేదాలు బయటపడుతుండటంతో, పార్టీ బలహీనపడుతుందనే మాట వినిపిస్తోంది. అయితే, త్వరలోనే జీవీఎంసీ ఎన్నికలు ఉన్నందున, అధిష్టానం అప్రమత్తమై... లీడర్లను సెట్ రైట్ చేయాలని, లేదంటే పార్టీకి నష్టం తప్పదని తెలుగు తమ్ముళ్లు అంటున్నారు.   మొత్తానికి ఒకపక్క విభేదాలు-వివాదాలు... మరోపక్క వలసలతో విశాఖ టీడీపీ కష్టాల్లో పడింది. అయితే, తెలుగుదేశం ఆవిర్భావం నుంచి వైజాగ్ లో టీడీపీకి మంచి పట్టుండటం, సాగరతీర రాజకీయాలను పసుపు జెండా శాసించిన రికార్డు ఉండటంతో, మళ్లీ ఆ కీర్తికిరీటాన్ని నిలబెట్టుకునేందుకు టీడీపీ అధిష్టానం వేగంగా పావులు కదుపుతోంది.

పోలవరం ప్రాజెక్టు రీడిజైనింగ్? కేసీఆర్-జగన్ భేటీ వెనుక సీక్రెట్ ఇదేనా?

  పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గించేందుకు ప్రయత్నం జరుగుతుందనే మాట వినిపిస్తోంది. పోలవరం ప్రాజెక్టుపై ఇటీవల అసెంబ్లీలో కీలక ప్రకటన చేసిన సీఎం కేసీఆర్.... కేవలం ఎత్తు వల్లే తెలంగాణ, ఒడిషాకు అభ్యంతరాలు ఉన్నాయన్నారు. ఒకవేళ ఏపీ ప్రభుత్వం... పోలవరం ఎత్తు తగ్గించేందుకు అంగీకరిస్తే, సమస్యలన్నీ సమసిపోతాయని చెప్పుకొచ్చారు. అయితే, పోలవరం ఎత్తు తగ్గించాలని తాను ఆంధ్రా సీఎం జగన్మోహన్ రెడ్డితో మాట్లాడానని, అందుకు జగన్ అంగీకరించారంటూ స్వయంగా అసెంబ్లీలోనే ప్రకటించి కేసీఆర్ కలకలం రేపారు. ఆ ప్రకటనకు కొనసాగింపుగానే, ముఖ్యమంత్రుల సమావేశం జరిగిందనే టాక్ వినిపిస్తోంది. అయితే, కేసీఆర్ ప్రకటనపై అటు చంద్రబాబు... ఇటు ప్రజాసంఘాల నేతలు ఆనాడు మండిపడ్డారు. కేసీఆర్, జగన్ ఎవరైనాసరే పోలవరం ప్రాజెక్టు జోలికొస్తే ఊరుకునేది లేదని బాబు హెచ్చరించారు. 71శాతం పూర్తయిన ప్రాజెక్టుపై కుట్రలు చేస్తే ఊరుకునేది లేదంటూ మండిపడ్డారు. పోలవరం ఎత్తు తగ్గించేందుకు ఏపీ సీఎం ఒప్పుకున్నారంటోన్న కేసీఆర్ కి ఆంధ్రా పరిస్థితులు ఏం తెలుసని ప్రశ్నించారు. అసలు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడానికి కేసీఆర్ ఎవరని చంద్రబాబు నిప్పులు చెరిగారు. 55లక్షల క్యూసెక్యుల నీటిని దృష్టిలో పెట్టుకుని పోలవరం ప్రాజెక్టును డిజైన్ చేశారని, అందువల్ల ప్రాజెక్టు భద్రతతో రాజకీయ ఆటలాడొద్దని సీఎం జగన్మోహన్ రెడ్డికి సూచించారు. ఏదైనా జరగరానిది జరిగితే గోదావరి జిల్లాల్లో ఒక్క గ్రామం కూడా మిగలదని హెచ్చరించారు. అయితే, ఎంతమంది వ్యతిరేకిస్తున్నా, తాను అనుకున్నదే చేసుకుంటూ పోతున్న జగన్మోహన్ రెడ్డి... పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గింపుపై ఓకే చెప్పారనే మాట వినిపిస్తోంది. కారణాలు ఏమైనా, కేసీఆర్ మాటకు జగన్ అధిక విలువ ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఒకవిధంగా జగన్ కు కేసీఆరే ముఖ్యసలహాదారుగా మారారనే గుసగుసలూ వినిపిస్తున్నాయి. కేసీఆర్ ఏం చెబితే దానికి జగన్ ఎస్ అంటున్నారని చెప్పుకుంటున్నారు. అందుకే పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గింపునకు కూడా జగన్ సానుకూలంగా ఉన్నారనే మాట వినిపిస్తోంది. ముఖ్యమంత్రుల మీటింగ్ లో పోలవరం ఎత్తు తగ్గింపు అంశంపైనా చర్చించినట్లు తెలుస్తోంది. రహస్య అజెండాగా పోలవరం ఎత్తు తగ్గింపుపై ఇద్దరి మధ్య చర్చలు సాగాయని అంటున్నారు. ఒకవేళ కేసీఆర్ ప్రకటించినట్లుగా, పోలవరం ఎత్తు తగ్గింపునకు జగన్ ఒప్పుకుంటే, అది ఏపీలో కలకలం రేపే అవకాశం ఉంది. అలాగే ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడం ఖాయం. అంతేకాదు కేసీఆర్ చెప్పినట్లుగా పోలవరం ఎత్తు తగ్గిస్తే... 196 టీఎంసీల నీటి నిల్వ సామర్ధ్యమున్న ప్రాజెక్టులో 60 టీఎంసీలు తగ్గిపోయి... 130 టీఎంసీలకు పడిపోతుందని, అదే జరిగితే ఆంధ్రప్రదేశ్ కు తీవ్ర నష్టం తప్పదని, ముఖ్యంగా కోస్తాంధ్ర, రాయలసీమకు అన్యాయం జరుగుతుందని నిపుణులు అంటున్నారు. అయితే, కేసీఆర్ మాటలకు తలొగ్గి ఆంధ్రప్రదేశ్ కు అన్యాయం చేయాలని చూసినా, ప్రజల మనోభావాలతో ఆడుకున్నా, జగన్ చరిత్రహీనుడుగా మిగిలిపోవడం ఖాయమని టీడీపీ నేతలు హెచ్చరిస్తున్నారు. ఒకవేళ జగన్ ప్రభుత్వం.... రాష్ట్ర ప్రయోజనాలకు తెలంగాణకు తాకట్టు పెడితే, పెద్దఎత్తున ప్రజాఉద్యమాలు చేపడతామని తెలుగుదేశం లీడర్లు అంటున్నారు.

కీలక నిర్ణయాలు తీసుకున్న టిటిడి బోర్డ్...

తిరుమలలో టిటిడి బోర్డ్ కీలక నిర్ణయాలు తీసుకుంది, తాగునీటి కొరత నివారణకు శ్రీకారం చుట్టింది. బాలాజీ రిజర్వాయర్ నిర్మాణం చేపట్టేందుకు బోర్డు నిర్ణయం తీసుకుంది. టీటీడీ ఛైర్మన్ వైవి సుబ్బారెడ్డి అధ్యక్షతన పాలక మండలి తొలి సమావేశం జరిగింది. పెండింగ్ లో ఉన్న పలు అంశాల పై సమావేశంలో చర్చించారు. బాలాజీ రిజర్వాయర్ నిర్మాణంతో తిరుమల కొండపై తాగు నీటి సమస్య శాశ్వతంగా పరిష్కారమవుతుందని బోర్డు సభ్యులు అభిప్రాయపడ్డారు. అమరావతిలో శ్రీ వారి ఆలయ నిర్మాణ పరిధిని తగ్గిస్తూ బోర్డు నిర్ణయం తీసుకుంది. ముప్పై ఆరు కోట్లతో నిర్మాణాన్ని జరపాలని తీర్మానించింది. తిరుమలలో కాలుష్యం పెరిగి పోతుండడంతో దానిని తగ్గించేందుకు ఎలక్ట్రిక్ బస్సులు, కార్లను ప్రవేశ పెట్టాలని నిర్ణయం తీసుకుంది. తిరుపతిలో అవిలాల చెరువు అభివృద్ధికి కేటాయించిన నిధులను బాలాజీ రిజర్వాయర్ నిర్మాణానికి మళ్లించేందుకు సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. తిరుపతిలో గరుడ వారది నిర్మాణానికి నిధుల కేటాయింపుపై ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదు. టీటీడీలో పని చేస్తున్న కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడానికి సబ్ కమిటీని ఏర్పాటు చేయనుంది. భక్తుల సౌకర్యానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించామన్నారు టిటిడి ఛైర్మన్ వైవి సుబ్బారెడ్డి. పెండింగ్ లో ఉన్న అన్ని సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామన్నారు.  టీటీడీ బోర్డు సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం ముగిసింది. బోర్డు సభ్యుడిగా మైహోమ్ గ్రూప్స్ అధినేత జూపల్లి రామేశ్వర్ రావు ప్రమాణ స్వీకారం చేశారు. టీటీడీ బోర్డులో తనకు స్థానం కల్పించినందుకు జూపల్లి రామేశ్వరరావు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. చినజీయర్ అనుగ్రహంతోనే తను టీటీడీ సభ్యుడను అయ్యారని చెప్పారు. సామాన్య భక్తులకు సేవ చేసేందుకు కావలసిన శక్తిని ప్రసాదించాలని ఆయన శ్రీవారిని వేడుకున్నారు.

పోలవరం ప్రాజెక్టుపై పెట్టిన రివర్స్ టెండరింగ్ రివర్స్ అవనుందా..?

పోలవరం ప్రాజెక్టుపై జగన్ ప్రభుత్వం తల పెట్టిన టెండర్లు రివర్స్ కొట్టే అవకాశముందని జల వనరుల నిపుణులు అంటున్నారు. పోలవరం సాగునీటి ప్రాజెక్టు హెడ్ వర్క్స్ లోని మిగిలిన కాంక్రీటు పనులు, జలవిద్యుత్ కేంద్రం నిర్మాణానికి ఒక ప్యాకేజి కింద 4987.55 కోట్లతో పిలిచిన రివర్స్ టెండర్లకు ఒకటే టెండరు రావడం దీనికి తార్కాణం అని చెబుతున్నారు. సాగునీటి ప్రాజెక్టు లోని అరవై ఐదు ప్యాకేజీ పనులకు పిలిచిన రివర్స్ టెండర్లను ఆరు సంస్థలు పాల్గొని బిడ్ లు దాఖలు చేయటం, 15.6 శాతం తక్కువకు టెండర్ వేయటంతో రివర్స్ టెండరింగ్ విజయవంతమైందని మంత్రులు, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు ప్రకటనలు గుప్పించారు. దేశంలోనే తొలి సారిగా ఈ విధానానికి వెళ్లే యాభై ఎనిమిది కోట్లు ఆదా చేస్తామన్నారు. కానీ ఆ సంతోషం ఇరవై నాలుగు గంటలు గడవక ముందే ఆవిరైంది. పోలవరంలో రెండు పనులకు కలిపి పిలిచిన రివర్స్ టెండర్లలో ఒకే ఒక్క బిడ్ దాఖలైంది. మెఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ ఫ్రా లిమిటెడ్ ఒకటే బిడ్ వేసింది. జలవనరుల శాఖ ఇచ్చిన జీవో 67 ప్రకారం రివర్స్ టెండరింగ్ లో కనీసం రెండు సంస్థలైనా పాల్గొనాలి, కాని ఒక్క సంస్థే టెండర్ వేయడంతో ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాక ఆ శాఖ మల్లగుల్లాలు పడుతోంది. పోలవరం కాంక్రీట్, జల విద్యుత్ కేంద్రం పటంలో ఒకే ప్యాకేజీగా గత నెల పదిహేడవ తేదిన రివర్స్ టెండర్ విధానంలో జల వనరుల శాఖ టెండర్లను ఆహ్వానించింది. దానికి ముందు రోజే రివర్స్ టెండరింగ్ లో అనుసరించాల్సిన మార్గ దర్శకాలను వివరిస్తూ ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాధ్ దాస్ జీవో 67 జారీ చేశారు, ఇప్పుడు ఆ మార్గదర్శకాలే ప్రతిబంధకంగా మారాయి. ఈ ఉత్తర్వును గత ప్రభుత్వం విడుదల చేసుంటే అందులోని లోపాలు సరిచేసేందుకే రివర్స్ బిడ్డింగ్ లో ముందుకు వెళుతున్నామని జగన్ సర్కార్ చెప్పేది. కానీ, గత నెల పదహారున తానిచ్చిన ఉత్తర్వు తాజాగా ప్రధాన సమస్యగా మారింది. అందులో పేర్కొన్న ప్రకారం రివర్స్ టెండర్ కు వెళ్లాలంటే ఖచ్చితంగా రెండు సంస్థలైనా బిడ్ లు దాఖలు చేయాలి అలాగైతేనే ఒక సంస్థ ఎల్ వన్ గా నిలిస్తే మరో సంస్థతో సంప్రదింపులకు వీలుంటుందని ఉత్తర్వు స్పష్టం చేస్తోంది. పోనీ దీన్ని రివర్స్ టెండర్ అని కాకుండా రీటెండర్ గా భావిద్దాం అన్న నిబంధనలు అంగీకరించవని నిపుణులు కూడా చెబుతున్నారు. జల విద్యుత్ కేంద్ర పనుల నుంచి తమను తప్పించడాన్ని వ్యతిరేకిస్తూ నవయుగ సంస్థ హైకోర్టులో గతంలోనే వ్యాజ్యం వేసింది. ఏపీజెన్కో తీసుకున్న ప్రీ క్లోజరు నిర్ణయంపై కోర్టు స్టే విధించింది. స్టేను ఎత్తి వేయాలని జెన్ కో వేసిన పిటిషన్ పై సోమవారం న్యాయస్థానంలో విచారణ జరగనుంది. మరోవైపు సోమవారం ఉదయం పదకొండు గంటలకు రివర్స్ టెండర్ లో ఫైనాన్షియల్ బిడ్ ను జల వనరుల శాఖ తెరవనుంది.

ఉత్తమ్ కంచుకోటలో ఈసారి గులాబీ జెండా ఎగురుతుందా? కేసీఆర్ వ్యూహం అదేనా?

  పీసీసీ చీఫ్, నల్గొండ ఎంపీ ఉత్తమ్ కంచుకోట హుజుర్ నగర్ ఉపఎన్నిక టీఆర్ఎస్ కు అగ్నిపరీక్షగా మారింది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లోనే ఎలాగైనా ఉత్తమ్ కు చెక్ పెట్టాలని గులాబీ బాస్ తీవ్రంగా ప్రయత్నించినా, టీఆర్ఎస్ వ్యూహం బెడిసికొట్టింది. 2009నుంచి హూజుర్ నగర్ నుంచి చేజిక్కించుకోవాలని గులాబీ పార్టీ ప్రయత్నిస్తోంది. 2009లో ప్రస్తుత మంత్రి జగదీశ్ రెడ్డి... టీఆర్ఎస్ నుంచి పోటీకి దిగి ఓటమిపాలయ్యారు. ఇక 2014లో అమరవీరుడు శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మకు టికెట్ ఇచ్చినా, ఆమె కూడా ఉత్తమ్ పై గెలవలేకపోయింది. దాంతో 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జగదీశ్ రెడ్డి వర్గీయుడు సైదిరెడ్డిని బరిలోకి దింపారు. అయితే, సైదిరెడ్డి గట్టిపోటీ ఇచ్చినప్పటికీ, చివరికి ఉత్తమ్ చేతిలో పరాజయం పాలవ్వక తప్పలేదు. వరుసగా మూడోసారి టీఆర్ఎస్ కు భంగపాటు కలిగినా, సైదిరెడ్డి... గట్టిపోటీనివ్వడంతో... మళ్లీ అతనికే టికెట్ ఇచ్చి, బరిలోకి దింపింది గులాబీ పార్టీ. అయితే, మొన్నటి ఎన్నికల్లో ఆలస్యంగా అభ్యర్ధిని ప్రకటించడంతోనే నష్టం జరిగిందని గుర్తించిన టీఆర్ఎస్ అధిష్టానం.... ఈసారి ముందుజాగ్రత్తపడింది. నోటిఫికేషన్ రాకముందే అభ్యర్ధిని ప్రకటించి కదనరంగంలోకి దింపింది. అయితే, అసెంబ్లీ ఎన్నికల్లో నల్గొండ మొత్తం దాదాపు క్లీన్ స్వీప్ చేసిన గులాబీ పార్టీ.... రెండు నెలలకే జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం నల్గొండ ఎంపీ స్థానాన్ని కోల్పోయింది. హుజూర్ నగర్ ఎమ్మెల్యేగా ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి... నల్గొండ బరిలో నిలిచి సూపర్ విక్టరీ కొట్టారు. అయితే, నల్గొండ ఎంపీ సీటును కోల్పోయి పరాభవంలో ఉన్న టీఆర్ఎస్.... ఎలాగైనాసరే హుజుర్ నగర్ ఉపఎన్నికలో గెలిచి తీరాలని కంకణం కట్టుకుంది. అందుకోసం గట్టి ప్రయత్నాలే చేస్తోంది. మంత్రులు, ఎమ్మెల్యేలను... గ్రామ-మండల ఇన్ ఛార్జులుగా నియమించి విజయానికి వ్యూహం పన్నింది. అయితే, ఈసారి హుజూర్ నగర్ నుంచి ఉత్తమ్ భార్య పద్మావతి బరిలో దిగుతుండగా, బీజేపీ నుంచి అమరవీరుడు శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ రంగంలోకి దింపనున్నట్లు తెలుస్తోంది. ఇక, టీడీపీ కూడా తన అభ్యర్ధిని పోటీకి దింపే అవకాశం కనిపిస్తోంది. అయితే, ఎంతమంది పోటీలో ఉన్నా, ఈసారి మాత్రం హుజూర్ నగర్ లో ఎగిరేది గులాబీ జెండానే అంటున్నారు టీఆర్ఎస్ నేతలు. దాంతో, హుజూర్ నగర్ ఉపఎన్నిక రసవత్తరంగా మారింది.

కాంగ్రెస్ తో కష్టం.. బీజేపీలోకి రేవంత్ రెడ్డి!!

  పరిస్థితిని బట్టి పద్దతి మార్చుకోవాలని మన పెద్దలు చెప్తుంటారు. కానీ తెలంగాణ కాంగ్రెస్ నేతలు మాత్రం.. అబ్బే పరిస్థితి ఎంత దారుణంగా ఉన్నా మా తీరు మార్చుకునేది లేదని అంటున్నారు. ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ పరిస్థితి అంత గొప్పగా ఏం లేదు. తెలంగాణ ఇచ్చిన పార్టీగా 2014 ఎన్నికల్లో దూసుకెళ్తుంది అనుకుంటే టీఆర్ఎస్ దూకుడు ముందు కాంగ్రెస్ నిలబడలేకపోయింది. పోనీ 2018 ఎన్నికల్లో అయినా మిగతా పార్టీల మద్దతుతో సత్తా చాటుతుంది అనుకుంటే.. మహాకూటమి రూపంలో మునిగిపోయింది. దానికి తోడు గెలిచిన ఎమ్మెల్యేలు కూడా దాదాపు పార్టీని వీడారు. మొత్తానికి కాంగ్రెస్ పరిస్థితి దారుణంగా ఉంది. మరి ఇలాంటి సమయంలో నేతలంతా కలిసి పార్టీని పుంజుకునేలా చేయాలి. కానీ తెలంగాణ కాంగ్రెస్ నేతలు మాత్రం బహిరంగంగా విమర్శలు చేసుకుంటూ.. పార్టీ పరిస్థితిని మరింత దిగజారుస్తున్నారు. ముఖ్యంగా రేవంత్ రెడ్డి వర్సెస్ సీనియర్ నేతల పోరు తెలంగాణ కాంగ్రెస్ కు పెద్ద తలనొప్పిలా మారింది. కాంగ్రెస్ లో గ్రూప్ రాజకీయాలు కొత్తేమి కాదు. దశాబ్దాలుగా ఆ ఆనవాయితీ కొనసాగుతూనే ఉంది. తెలంగాణ కాంగ్రెస్ లో పీసీసీ కుర్చీ కోసం వర్గ పోరు ఎప్పటి నుంచో కొనసాగుతూనే ఉంది. ఉత్తమ్ ని పీసీసీ చీఫ్ గా తప్పించి.. తమకి అవకాశం ఇవ్వాలని పలువురు సీనియర్లు డిమాండ్ చేసారు. ముఖ్యంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి లాంటి వారు ఉత్తమ్ ని వ్యతిరేకిస్తూ బహిరంగంగానే విమర్శలు చేసారు. కోమటిరెడ్డి మాత్రమే కాదు.. పలువురు సీనియర్లు పీసీసీ చీఫ్ గా ఉత్తమ్ ని వ్యతిరేకించారు. పీసీసీ కుర్చీపై కన్నేశారు. కానీ ఇప్పుడు ఉన్నట్టుండి ఆ సీనియర్ నేతలంతా కలిసిపోయారు. వారి కలయికకు కారణం రేవంత్ రెడ్డి అనే చెప్పాలి. రేవంత్ కి టీడీపీలో ఉన్న సమయంలోనే మాస్ లీడర్ గా మంచి గుర్తింపు ఉంది. కాంగ్రెస్ లో చేరాక కూడా ఆ క్రేజ్ అలాగే కొనసాగింది. అయితే రేవంత్ తో ఇన్నాళ్లు సీనియర్లకు అంతగా ప్రాబ్లమ్ రాలేదు. కానీ ఇటీవల రేవంత్.. కుటుంబ సమేతంగా వెళ్లి కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీని కలిశారు. దీంతో పీసీసీ చీఫ్ గా త్వరలోనే రేవంత్ బాధ్యతలు చేపట్టనున్నారు అంటూ ప్రచారం మొదలైంది. దాంతోపాటే సీనియర్ నేతల్లో గుబులు మొదలైంది. ఇన్నాళ్లు మనలో మనం పోటీ పడ్డాం, ఇప్పుడు కొత్తగా వచ్చిన రేవంత్ కి ఇస్తానంటే ఎలా ఊరుకుంటాం అనుకున్నారేమో.. అందరూ ఏకమయ్యారు. రేవంత్ ని టార్గెట్ చేస్తున్నారు. దానికి తగ్గట్టే రేవంత్ తన వ్యాఖ్యలతో సీనియర్లకు అవకాశం ఇస్తున్నారు. హుజుర్ నగర్ ఉప ఎన్నిక అభ్యర్థి, యురేనియం అంశాలలో.. రేవంత్ చేసిన వ్యాఖ్యలతో సీనియర్లంతా ఏకమై రేవంత్ ని కార్నర్ చేస్తున్నారు. మరోవైపు కోమటిరెడ్డి, విహెచ్, సంపత్ వంటి వారు పీసీసీ చీఫ్ గా తామే కరెక్ట్ అని చెప్పుకుంటున్నారు. ఓ రకంగా రేవంత్ పేరుకి కాంగ్రెస్ లో ఉన్నా ఒంటరిగానే ఉన్నారని చెప్పాలి. ఇలాంటి పరిస్థితుల్లో అసలు ఆయన కాంగ్రెస్ లో కొనసాగుతారా అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. సీనియర్లంతా ఏకమవ్వడం, రేవంత్ ఒంటరవ్వడంతో అధిష్టానం కూడా ఏం చేయలేని పరిస్థితి. ఒక్కడి కోసం అందర్నీ వదులుకోలేదు, అలా అని రేవంత్ ని కూడా వదులుకోవడానికి ఇష్టపడకపోవొచ్చు. మరి అధిష్టానం అందరికి సర్ది చెప్పి గొడవ సద్దు మణిగేలా చేస్తుందో లేక ఇలాగే మౌనంగా ఉండి పార్టీకి నష్టం చేసుకుంటుందో చూడాలి. ఏది ఏమైనా పరిస్థితి ఇలాగే కొనసాగితే రేవంత్ బీజేపీ వైపు చూసే అవకాశముందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కొంతకాలంగా బీజేపీ తెలంగాణలో బలపడే దిశగా అడుగులు వేస్తోంది. టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం తామే అన్నట్టుగా దూసుకెళ్తోంది. ఇలాంటి సమయంలో రేవంత్ లాంటి నేతను కళ్ళకద్దుకొని తీసుకునే అవకాశం ఉంది. మరి రేవంత్ కాంగ్రెస్ లో వర్గ పోరు పడలేక బీజేపీలోకి చేరి తన సత్తా చూపుతారేమో చూడాలి.

కోడెలను కాపాడుకోలేకపోయిన టీడీపీ.. నెక్స్ట్ స్టెప్ ఏంటి?

  భవనం నిర్మించాలంటే నెలల సమయం పడుతుంది. కానీ కూల్చివేయాలంటే నిమిషాలు చాలు. అలాగే మనిషి మంచి పేరు సంపాదించాలంటే ఎన్నో ఏళ్లు పడుతుంది. కానీ ఆ పేరు పోవాలంటే కొన్ని క్షణాలు చాలు. తెలిసో తెలియకో కోడెల శివ ప్రసాద్ విషయంలో కూడా అలాగే జరిగింది. వైద్యుడిగా, రాజకీయ నాయకుడిగా ఎన్నో ఏళ్లు సేవ చేసి ప్రజల్లో మంచి పేరు తెచ్చుకున్న ఆయన.. కొంతకాలంగా ఆరోపణలు, అవమానాలు చుట్టుముట్టడంతో.. తీవ్ర మనస్తాపానికి గురై.. ఆత్మహత్య చేసుకొని మరణించారు. 2019 ఎన్నికల్లో ఆయన ఓడిపోవడం, టీడీపీ ప్రతిపక్షానికి పరిమితం కావడంతో.. కోడెలకు కష్టాలు మొదలయ్యాయి. అధికార పార్టీ వైసీపీ కోడెలను బాగా టార్గెట్ చేసింది. ముఖ్యంగా అసెంబ్లీ ఫర్నీచర్ అంశాన్ని బాగా హైలైట్ చేసి కోడెల ప్రతిష్టను మసకబారేలా చేసింది. నిజంగా తప్పు చేసుంటే ఎంతవారినైనా శిక్షించాల్సిందే. కానీ కోడెల చేయని తప్పుకి ఎక్కువ అవమానాలు ఎదుర్కొన్నారని చెప్పక తప్పదు. ప్రభుత్వం ఇచ్చిన క్వార్టర్స్ లో ఉండి, పదవీకాలం ముగిసి ఖాళీ చేసేటప్పుడు.. ఫర్నీచర్ అప్పజెప్పడం, పాడైన వాటికి ఖరీదు చెల్లించడం ఆనాయితీ. అసలు సరిగా అప్పజెప్పకపోవడం కూడా ఆనాయితీనే. అంతెందుకు కొత్త మంత్రులు, గవర్నర్లు, కొత్త సీఎంలు వచ్జ్చినప్పుడు కొత్త ఫర్నీచర్, ఇతర సామాగ్రి కొనడం.. పాతవి పక్కనెయ్యడం లేదా సిబ్బంది ఇళ్ళకు తరలిపోవడం కూడా ఆనవాయితీనే. కానీ కోడెల విషయంలో ఈ ఆనవాయితేనే అవినీతి అన్నారు. అసెంబ్లీ, స్పీకర్ కార్యాలయం హైద్రాబాద్ నుండి అమరావతికి వచ్చినప్పుడు.. కొత్త భవనాలు ఫర్నీచర్ తో సహా అమర్చి ఇవ్వడంతో.. పాత ఫర్నీచర్ ను ఆయన తన క్యాంప్ ఆఫీసుల్లో అధికారులకు చెప్పి ఏర్పాటు చేసుకున్నారు. నిజానికి అదేం కోట్ల విలువైన సొత్తు కాదు. రెండు మూడు లక్షల విలువైన పాత ఫర్నీచర్ మాత్రమే. అది కూడా కోడెల అప్పనంగా కొట్టేయాలి అనుకోలేదు. ఎందరో నాయకులు కోట్లు దోచుకున్నారు. కానీ కోడెల మాత్రం.. కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక ఆ ఫర్నీచర్ తీసుకెళ్లండని బాధ్యతగా లేఖ రాసారు. కొత్త స్పీకర్ జూన్ 12 లేదా 13 న ఛార్జ్ తీసుకొని ఉండొచ్చు. కానీ జూన్ 7 నే కోడెల పాత సామాగ్రి అప్పగిస్తాను లేదా వెల కట్టండి డబ్బులు చెల్లిస్తాను అని లేఖ రాసారు. కానీ అధికారుల నుంచి సమాధానం లేదు. దీంతో కోడెల మళ్ళీ ఆగస్ట్ 20 న మొదటి లేఖను ప్రస్తావిస్తూ మరో లేఖ రాసారు. అయినా సమాధానం లేదు. నిజానికి ఆ లేఖలకు స్పందించి ఫర్నీచర్ ని పట్టుకొని పోవచ్చు. కానీ ఉద్దేశ్య పూర్వకంగా రాద్దాంతం చేసి, కక్ష సాధింపు తరహాలో ఆగష్టు 24న కేసులు పెట్టి ఆయన్ని అవమానించారు. మరోవైపు అధికార పార్టీ నేతలు ఆయన మీద తీవ్ర విమర్శలు గుప్పించారు. ముఖ్యంగా అంబటి రాంబాబు, విజయసాయి రెడ్డి వంటి వారు కోడెలపై దొంగ అనే ముద్ర వేశారు. విజయ సాయి రెడ్డి అయితే కోడెల దూడలు అంటూ వెటకారాలు చేస్తూ ట్విట్టర్ వేదికగా పదేపదే విమర్శలు గుప్పించారు. ఇలాంటి విమర్శలు కోడెలను బాగా కృంగదీశాయి. అసలు నా తప్పులేదు, నేను ముందే లేఖలు రాసాను.. కక్ష సాధింపుతో నా మీద నిందలు వేస్తున్నారని.. కోడెల పదేపదే ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన అవివివేకం కానీ.. ఈ సోషల్ మీడియాలో యుగంలో ఆయన ఆవేదన ఎవరికి పడుతుంది?. 'ఫర్నీచర్ కోసం కోడెల కక్కుర్తి' అంటూ అటు మీడియా, సోషల్ మీడియాలో పదేపదే వార్తలు రావడంతో.. దానిలోని నిజానిజాలు తెలుసుకోకుండా అందరూ ఆయన మీద విమర్శలు గుప్పించారు. వీటిని కోడెల డిఫెండ్ చేసుకోలేకపోయారు. మరోవైపు పార్టీ నుండి కూడా ఆయనకు మద్దతు కరువైంది. ఆయనకు మద్దతిస్తే ఎక్కడ తమ మీద విమర్శలు వస్తాయనుకున్నారో ఏమో.. టీడీపీ నేతలు ఎవరూ మీడియా ముందుకొచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా, కోడెలకు మద్దతుగా మాట్లాడలేదు. ఒకవైపు అధికార పార్టీ నేతల విమర్శలు, వేధింపులు ఎక్కువవ్వడం.. మరోవైపు సొంత పార్టీ నేతల నుంచి మద్దతు కరువవ్వడంతో కోడెల మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నారు. తరువాత టీడీపీ నేతలకు వైసీపీ ప్రభుత్వం మీద ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ప్రభుత్వ వేధింపుల వల్లే ఆయన మరణించారని టీడీపీ నేతలు జగన్ సర్కార్ మీద మండిపడ్డారు. టీడీపీ అధినేత చంద్రబాబు కూడా జగన్ సర్కార్ పై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. చిన్న చిన్న కేసులు అడ్డుపెట్టుకొని కోడెలను తీవ్రంగా వేధించారని మండిపడ్డారు. ఇలాంటి మద్దతే కోడెల కోరుకున్నారు. కానీ పాపం ఆయన మరణించాక లభించింది. ఏమీలేని అంశంలో ఆయనను అంతలా ఇబ్బంది పెడుతుంటే.. ఒక్కడే ఎలా ఎదుర్కోవాలో తెలియక కోడెల మరణానికి తలవంచారు. కోడెల విషయంలో టీడీపీ నేతలు చేసిన తప్పు.. మిగతా నేతల విషయంలో చేయవద్దని కార్యకర్తలు కోరుకుంటున్నారు. మిగతా నాయకులు కూడా ఇలా వేధింపులకు గురైతే.. ముందే వారికి అండగా నిలబడి, వారికి రక్షించుకోవాలని సూచిస్తున్నారు. మరి టీడీపీ నాయకులు, అధినాయకత్వం.. కోడెలలాంటి పరిస్థితి ఎవరికైనా ఎదురైతే వారికి అండగా ఉండి వారిని కాపాడుకునే ప్రయత్నం చేస్తారేమో చూడాలి. అంతేకాదు.. కోడెల మరణంతో టీడీపీకి ఆగ్రహం కట్టలు తెంచుకుంది. వైసీపీ మీద విరుచుకుపడింది. కేంద్రానికి, గవర్నర్ కి ఫిర్యాదు చేసింది. సీబీఐ ఎంక్వయిరీ కోరుతోంది. మరి ఈ పోరాటం టీడీపీ ఇలానే కొనసాగిస్తుందా?. అసలు కోడెల విషయంలో నెక్స్ట్ ఎలాంటి స్టెప్ తీసుకోబోతుందో చూడాలి. మొత్తానికి ఎలాంటి స్టెప్ తీసుకున్నా.. కార్యకర్తలు మాత్రం వేధింపులకు గురవుతున్న నాయకులను కాపాడుకోవాల్సిన బాధ్యత అధిష్టానం మీదే ఉందని అంటున్నారు.

టీటీడీ బోర్డులో ఎస్సీ ఎస్టీల కోటా ఎక్కడ? జగన్ వి ఉత్తి మాటలేనా?

  తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలిపై వివాదం రాజుకుంటోంది. సుమారు వందేళ్ల టీటీడీ చరిత్రలో ఎన్నడూలేనివిధంగా 29మందితో జంబో బోర్డును నియమించిన జగన్ ప్రభుత్వం... ఇప్పుడు మరో వివాదాస్పద నిర్ణయం తీసుకుంది. ఇప్పుడున్న 29మందికి అదనంగా మరో ఏడుగురికి టీటీడీ బోర్డులో చోటు కల్పిస్తూ జీవో జారీ చేసింది. ఇప్పటికే టీటీడీ బోర్డులో సభ్యులు ఎక్కువయ్యారని, తిరుమల తిరుపతి దేవస్థానాన్ని రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చేశారంటూ విమర్శలు చెలరేగుతుండగా, ఇఫ్పుడు అదనంగా మరో ఏడుగురికి చోటు కల్పించడంపై ఆధ్యాత్మికవేత్తలు, భక్తులు మండిపడుతున్నారు. 29మందితో జంబో బోర్డు ఏర్పాటుచేసిన జగన్ ప్రభుత్వం.... తాజాగా భూమన కరుణాకర్ రెడ్డి, రాకేష్‌సింహా, శేఖర్‌, కుపేందర్‌రెడ్డి, గోవింద హరి, దుష్మంత్ కుమార్‌, అమోల్ కాలేను ప్రత్యేక ఆహ్వానితులుగా ప్రకటిస్తూ జీవో ఇచ్చింది. మిగతా సభ్యుల్లాగే వీళ్లకూ టీటీడీ ప్రోటోకాల్ వర్తిస్తుందని ప్రకటించింది. అయితే, టీటీడీ బోర్డు మాజీ సభ్యుడు శేఖర్ రెడ్డికి చోటు కల్పించడంపై విమర్శలు చెలరేగుతున్నాయి. నోట్ల రద్దు సమయంలో శేఖర్ రెడ్డి నివాసం నుంచి వందల కోట్ల రూపాయల నోట్ల కట్టలను స్వాధీనం చేసుకోవడం అప్పట్లో పెనుసంచలనమైంది. అప్పుడు శేఖర్ రెడ్డి టీటీడీ పాలక మండలి సభ్యుడిగా ఉండటంతో అప్పటి ప్రభుత్వం అతడిని బోర్డు నుంచి తొలగించింది. అంతేకాదు శేఖర్ రెడ్డిని తొలగించాలంటూ అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ కూడా డిమాండ్ చేసింది. అయితే, అదే శేఖర్ రెడ్డికి ఇఫ్పుడు టీటీడీ బోర్డులో వైసీపీ సర్కార్ చోటు కల్పించడం ఆశ్చర్యంగా మారింది. ఇక, టీటీడీలో మితిమీరిన రాజకీయ జోక్యం పెరుగుతోందన్న విమర్శలు రేగుతున్నాయి. అసలే 29మందితో జంబో టీమ్ ప్రకటించిన జగన్ ప్రభుత్వం.... అది చాలదన్నట్లు ప్రత్యేక ఆహ్వానితుల పేరుతో బోర్డులో మరికొందరికి చోటు కల్పించడంపై భక్తుల్లో ఆగ్రహం పెరుగుతోంది. ఈసారి ప్రకటించిన పాలక మండలిలో రాష్ట్రేతరులకే పెద్ద పీట వేశారు. అలాగే అన్ని దేవాలయాల్లో ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లు అమలు చేస్తామన్న జగన్.... తిరుమల తిరుపతి దేవస్థానంలో మాత్రం ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నిస్తున్నారు.