ఆత్మహత్యకు ఒక్కరోజు ముందు చంద్రబాబు ప్రెస్ మీట్ పెట్టుంటే కోడెల బతికేవారా? 

  కోడెల గురించి తెలిసినవాళ్లు... ఆయనది చాలా సున్నిత మనస్తత్వం అంటారు. రూపాయి డాక్టర్ గా పేదల ప్రజలకు సేవలందించిన కోడెల ...రాజకీయాల్లోకి వచ్చాకే రాటుదేలారని చెబుతారు. స్వయంగా ఎన్టీఆర్ కోరడంతో చిన్న వయసులోనే రాజకీయాల్లో వచ్చిన కోడెల... అప్పటికే పల్నాడులో తిరుగులేని ఆధిపత్యం చెలాయిస్తోన్న కాసు కుటుంబానికి ఎదురెళ్లి నర్సరావుపేట నుంచి ఎమ్మెల్యేగా ఘనవిజయం సాధించారు. అయితే, 1983లో కోడెల ఎమ్మెల్యేగా గెలిచాక, కాసు కుటుంబం దాడికి ప్రయత్నించింది. దాంతో కోడెలకు ప్రజలే అండగా నిలబడ్డారు. కోడెలను వాటర్ ట్యాంక్ లో పెట్టి, ఆయనకు రక్షణగా నిలిచారు. ఆ సంఘటనే కోడెలలో పట్టుదల రగిల్చింది. దాంతో ప్రజల అండదండలతో పల్నాడులో పట్టుసాధించిన కోడెల... తర్వాతి కాలంలో రాజకీయంగా రాటుదేలారు. కాసు కుటుంబం అరాచకాలకు ఎదురెళ్లి ప్రజలకు రక్షణగా నిలబడ్డారు. ఆ తెగువే కోడెలను అతికొద్దికాలంలోనే ప్రజానాయకుడిగా చేసింది. దాంతో ఒక్క పల్నాడులోనే కాదు... మొత్తం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనే కోడెల పేరు మోరుమోగిపోయింది. తన వ్యక్తిత్వంతో తలదించని నేతగా ఎదిగారు. పల్నాడు పులిగా పేరు తెచ్చుకున్నారు. తెలుగుదేశంలో ఫైర్‌బ్రాండ్‌గా మారారు. అలాంటి వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నారంటే ఇప్పటికీ నమ్మలేకపోతున్నారు ఆయన గురించి తెలిసినవాళ్లు.  ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో హోంమంత్రిగా పనిచేసిన కోడెలకు రాజకీయ వేధింపులు, కక్ష సాధింపు చర్యలు, కేసుల గురించి తెలియకుండా ఉండదు. రాజకీయాల్లో ఇది సహజమే అయినా, జగన్ ప్రభుత్వం మాత్రం... ఎన్నో అడుగులు ముందుకేసి కోడెలకు ఊపిరిసలపనీయకుండా చేసింది. కేసు మీద కేసు పెడుతూ, 3నెలల కాలంలోనే కుటుంబం మొత్తంపై దాదాపు 30 కేసులను పెట్టించి వేధించింది. దాంతో కోడెల కుమిలిపోయారు. మానసికంగా కుంగిపోయారు. 70ఏళ్ల పైబడిన వయసులో ధైర్యం సడలింది. మానసిక-ఆత్మస్థైర్యం దెబ్బతింది. ఆ సమయంలో పార్టీ అండ కోసం కోడెల ఎదురుచూశారు. కానీ అసెంబ్లీ ఫర్నిచర్ దొంగతనం అభియోగాల నేపథ్యంలో... కోడెలకు అండగా నిలిచేందుకు చంద్రబాబు వెనుకంజ వేశారు. కోడెలపై ఎంతో అభిమానమున్నా, అత్యంత సన్నిహితుడైనా, వెనకేసుకొస్తే ఎక్కడ పార్టీకి చెడ్డపేరు వస్తుందోనని బాబు భయపడ్డారు. కోడెలపై, కోడెల కుటుంబంపై జగన్ సర్కార్ ... వరుస కేసులు పెడుతుంటే చంద్రబాబు ఒక్క మాట కూడా మాట్లాడలేదు... పార్టీ తరపున అండగా ఉంటామని భరోసా ఇవ్వలేదు... కనీసం కోడెలను పరామర్శంచలేదు... ఇదే కోడెలను మరింత కుంగదీసింది. ఒకవైపు జగన్ ప్రభుత్వ వేధింపులు.... మరోవైపు బాబు నుంచి అండ లేకపోవడంతో మానసికంగా కుంగిపోయిన కోడెల... ఎటూపాలుపోక విధిలేని పరిస్థితుల్లోనే ఆత్మహత్యకు ఒడిగట్టారని అంటున్నారు. కోడెల ఆత్మహత్య తర్వాత చంద్రబాబు .... జగన్ ప్రభుత్వంపై ఒక్కసారిగా విరుచుకుపడ్డారు. కోడెల మరణాన్ని తలచుకుకుని కన్నీళ్లు పెట్టుకున్నారు. హైదరాబాద్ నుంచి గుంటూరు వరకు కోడెల భౌతికకాయం వెంటే చంద్రబాబు కూడా వచ్చారు. అయితే, ఇదంతా కోడెల బతికుండగా, ఆయనకు అండగా నిలిచి ఉంటే కోడెల బతికుండేవారని అనుకుంటున్నారు. కనీసం కోడెలను జగన్ ప్రభుత్వం వేధిస్తోందంటూ నిన్న పెట్టినట్లు ...కనీసం మూడ్రోజులు ముందు చంద్రబాబు ప్రెస్ మీట్ పెట్టుంటే ఆయన బతికేవారని, ఆత్మహత్య నిర్ణయం తీసుకుని ఉండేవారు కాదని అంటున్నారు.

తెలంగాణ కాంగ్రెస్ లో పవన్ చిచ్చు.. రేవంత్ ని టార్గెట్ చేశారు!!

  జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో చిచ్చు పెట్టినట్లు తెలుస్తోంది. యూరేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా ఆయన ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశానికి కాంగ్రెస్ ముఖ్యనేతలు వెళ్లడం.. కొంత మంది కాంగ్రెస్ నేతలకు నచ్చలేదు. ఈ విషయాన్ని హైలెట్ చేస్తూ.. పవన్ సమావేశానికి వెళ్లిన రేవంత్ రెడ్డి సహా పార్టీ నేతల్ని టార్గెట్ చేస్తూ.. హైకమాండ్ కు ఫిర్యాదుల పరంపర ప్రారంభమైంది. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జ్ కుంతియా సమక్షంలో.. దీనిపై పెద్ద రచ్చే జరిగింది. ముఖ్యంగా మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్.. రేవంత్ రెడ్డిపై విమర్శలకు..ఈ అఖిలపక్ష సమావేశాన్ని ఉపయోగించుకున్నట్లుగా తెలుస్తోంది. యురేనియం అంశాన్ని తెర మీదకు తెచ్చింది కాంగ్రెస్ అని, పవన్ కు సంబంధం ఏంటని సంపత్ ప్రశ్నించారు. కాంగ్రెస్ లాంటి జాతీయ పార్టీ వెళ్లి జనసేన ఫ్లాగ్ కింద కూర్చోవడం ద్వారా.. ఎలాంటి సంకేతాలు పంపించాలని అనుకుంటున్నారంటూ నేతలను నిలదీశారు. మన పార్టీ పిలిచినప్పుడు పవన్ రాలేదని గుర్తు చేశారు. సీనియర్ నేతలంతా వెళ్లి పవన్ దగ్గర కూర్చోవడం ఏంటని సంపత్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. సంపత్ అభిప్రాయంతో కుంతియా కూడా ఏకీభవించడంతో.. జనసేన అఖిలపక్ష సమావేశానికి వెళ్లడం తప్పేనని సీనియర్ నేతలు అంగీకరించినట్టు తెలుస్తోంది. మళ్లీ పునరావృతం కాకుండా చూస్తామని పీసీసీ చీఫ్ ఉత్తమ్ హామీ ఇచ్చేశారు. కొన్ని అంశాలలో విపక్షాలు కలిసి పోరాడటం సహజం. ముఖ్యంగా ప్రస్తుత పరిస్థితుల్లో అందర్నీ కలుపుకొని పోవడం కాంగ్రెస్ కి అవసరం. కానీ కొందరు నేతలు మాత్రం పవన్ సమావేశానికి వెళ్లిన నేతలను తప్పుపడుతున్నారు. అయితే దీని వెనుక మరో కారణం ఉందని తెలుస్తోంది. టీపీసీసీ చీఫ్ రేసులో రేవంత్ రెడ్డి ముందున్నారని ప్రచారం జరుగుతోంది. హైకమాండ్ కూడా రేవంత్ కి తెలంగాణలో పార్టీ పగ్గాలు ఇవ్వాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో రేవంత్ రెడ్డిని కట్టడి చేసేందుకు కొందరు కాంగ్రెస్ సీనియర్ నేతలు.. ఆయన పార్టీని చిన్న బుచ్చుతున్నారన్న ప్రచారం నిర్వహించి.. అఖిలపక్ష సమావేశానికి వెళ్లడం తప్పన్నట్లుగా మాట్లాడారని తెలుస్తోంది.

జాతీయ పార్టీగా టీఆర్ఎస్.! ఏపీ, మహారాష్ట్ర, కర్నాటకలో పోటీకి సన్నాహాలు.!

  నేషనల్ ఫ్రంట్ తో కేంద్రంలోనూ చక్రం తిప్పుతామంటూ సార్వత్రిక ఎన్నికలకు ముందు హడావిడి చేసిన గులాబీ బాస్ కేసీఆర్.... టీఆర్ఎస్ కు జాతీయ పార్టీ గుర్తింపు తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. అనేక సంక్షేమ, అభివృద్ధి పథకాలతో దేశానికే ఆదర్శంగా నిలుస్తూ, పలు రాష్ట్రాల ప్రజల సైతం ఆకట్టుకున్న కేసీఆర్... తన పథకాలకు లభిస్తోన్న ఆదరణ, గుర్తింపుతో, రెండు మూడు రాష్ట్రాలకు పార్టీని విస్తరించాలని వ్యూహరచన చేస్తున్నారట. ముఖ్యంగా తనకు ఎక్కువగా గుర్తింపు ఉన్న... ఆంధ్రప్రదేశ్, అలాగే కర్నాటక, మహారాష్ట్రల్లో పోటీకి కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని అంటున్నారు. ఆంధ్రప్రదేశ్ లో ఎలాగూ కేసీఆర్ ఎవరో తెలుసు... టీఆర్ఎస్ గురించి... కేసీఆర్ పరిపాలన గురించి తెలుసు. అయితే, కర్నాటక, మహారాష్ట్ర వాసులకు ఎలా తెలుస్తుందనుకుంటున్నారా? ఇక్కడే కేసీఆర్ తెలివిగా, పావులు కదుపుతున్నారు. కర్నాటక, మహారాష్ట్రల్లో తెలుగువాళ్లు ఉండే ప్రాంతాల్లో పోటీకి ప్లాన్ చేస్తున్నారు. ముఖ్యంగా కర్నాటకలోని బళ్లారి, మహారాష్ట్రలోని నాందేడ్ లో పోటీకి సిద్ధమవుతున్నారు. ఎందుకంటే, నిజాం హయాంలో ఈ రెండు ప్రాంతాలూ తెలంగాణలోనే ఉండటమే కాకుండా, ఇఫ్పటికీ అక్కడ అధిక సంఖ్యలో తెలుగు ప్రజలు ఉండటంతో, వాటిని ఎంచుకున్నట్లు తెలుస్తోంది. ఇటీవల కేసీఆర్ ను కలిసిన పలువురు మహారాష్ట్ర నేతలు... తెలంగాణలో అమలవుతోన్న పథకాలు అద్భుతంగా ఉన్నాయని, మహారాష్ట్ర ప్రజలను కూడా ఆకట్టుకుంటున్నాయని చెప్పుకొచ్చారు. అంతేకాదు మహారాష్ట్రలోనూ టీఆర్ఎస్ పోటీచేస్తే మంచి ఆదరణ లభిస్తుందని వివరించారు. దాంతో మహారాష్ట్ర స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీచేయడానికి కేసీఆర్ సూత్రప్రాయంగా అంగీకరించారని చెబుతున్నారు. ముఖ్యంగా నాందేడ్ జిల్లాలోని దెగ్లూర్, నాయిగాం, భోకర్, హిమాయత్ నగర్, కిన్ వట్ నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ పోటీకి దిగనున్నట్లు తెలుస్తోంది. అలాగే, కర్నాటక బళ్లారిలోనూ పోటీ చేయాలని నిర్ణయానికి వచ్చారట. ఇకపోతే మరో తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ లోనూ బరిలోకి దిగాలని డిసైడ్ చేశారట. త్వరలో జరగనున్న ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి దిగాలని ఆలోచిస్తున్నారట. మొత్తానికి జాతీయ హోదాపై కన్నేసిన టీఆర్ఎస్.... ఏపీ, మహారాష్ట్ర, కర్నాటకలో పోటీకి దిగబోతోంది. మరి, తెలంగాణలో తిరుగులేని పట్టుసాధించిన గులాబీ పార్టీ, పక్క రాష్ట్రాల్లో పాగా వేయాలన్న వ్యూహం ఏ మేరకు ఫలిస్తుందో... జాతీయ పార్టీగా అవతరించాలన్న కల నెరవేరుతుందో లేదో చూడాలి.

బోటు ప్రమాదంపై మోడీ ఒకలా... ఏపీ, తెలంగాణ బీజేపీ అధ్యక్షులు మరోలా..!

  తూర్పుగోదావరి బోటు ప్రమాదంపై ప్రధాని మోడీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఇది చాలా బాధాకరమైన దుర్ఘటన అంటూ ట్వీట్ చేశారు. అయితే, బోటు ప్రమాదంపై ఏపీ అండ్ తెలంగాణ బీజేపీ అధ్యక్షులు లక్ష్మణ్‌, కన్నా ఘాటుగా స్పందించారు. బోటు ప్రమాదంపై పూర్తిస్థాయి విచారణ జరిపించాలని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ డిమాండ్ చేశారు. అనుమతి లేకుండా బోట్లు నడుపుతున్నా, ప్రభుత్వం ప్రేక్షక పాత్ర వహించడం దురదృష్ణకరమన్నారు. ఇక ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా కూడా తీవ్రంగా స్పందించారు.  గోదావరిలో తరచూ ప్రమాదాలు జరుగుతున్నా, అధికారులు చర్యలు తీసుకోవడం లేదని, ఎవరో ఒకరి స్వలాభానికి ప్రజల ప్రాణాలు పోతూనే ఉన్నాయని మండిపడ్డారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం శాశ్వత ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మరోవైపు, బోటు ప్రమాదంపై అటు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి... ఇటు తెలంగాణ సీఎం కేసీఆర్... తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. మృతుల కుటుంబాలకు ఏపీ ప్రభుత్వం 10లక్షల చొప్పున ఎక్స్‌ గ్రేషియా ప్రకటించగా, అలాగే తెలంగాణ బాధిత కుటుంబాలకు... కేసీఆర్‌ ప్రభుత్వం అదనంగా మరో 5లక్షలు పరిహారంగా అందజేయనుంది. తూర్పుగోదావరి బోటు ప్రమాదంలో ఎక్కువమంది తెలంగాణవాసులు ఉండటంతో సహాయక చర్యలపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరా తీశారు. మరోవైపు సీఎం కేసీఆర్ ఆదేశాలతో ఏపీ చేరుకున్న తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్‌... బాధితులను పరామర్శించడంతోపాటు రెస్క్యూ ఆపరేషన్స్ ‌ను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు.

అధికారుల అలసత్వమా? బోటు సిబ్బంది నిర్లక్ష్యమా? బోటు ప్రమాదానికి కారణమెవరు?

  బోటు ప్రమాదానికి అనేక కారణాలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా గోదావరిలో అధిక నీటి ప్రవాహమే బోటు బోల్తాకి ప్రధాన కారణమని అంటున్నా, అధికారుల అలసత్వం, బోటు సిబ్బంది నిర్లక్ష్యమే కొంపముంచినట్లు తెలుస్తోంది. గోదావరిలో ప్రవాహం అధికంగా ఉన్న సమయంలో పాపికొండలకు బయల్దేరడం అదిపెద్ద తప్పు అయితే, ప్రయాణికులు అందరికీ లైఫ్ జాకెట్లు ఇవ్వకపోవడంతో మరో ఘోర తప్పిదంగా కనిపిస్తోంది. అలాగే అనుభవం లేని డ్రైవర్లు, బోటు సిబ్బంది కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ప్రవాహ ఉధృతిని అంచనా వేయలేకపోవడం... మలుపు దగ్గర చాకచక్యంగా వ్యవహరించలేకపోవడంతో... సుడిగుండాలకు బోటు బోల్తా కొట్టిందని ప్రమాదం నుంచి బయటపడిన ప్రయాణికులు అంటున్నారు. అయితే, బోటు మొదటి అంతస్తులో ఉన్నవాళ్లు... రెండో అంతస్తులోకి వెళ్లడంతోనే ఈ ప్రమాదం జరిగిందనే మాట కూడా వినిపిస్తోంది. ప్రయాణికులు ఒక్కసారిగా కింది అంతస్తు నుంచి పై అంతస్తుకు వెళ్లడంతో బోటు బ్యాలెన్స్ తప్పి, బోల్తాపడిందని అంటున్నారు. ఇదిలాఉంటే, ప్రమాదానికి గురైన బోటుకు ఎలాంటి అనుమతులు లేవని అధికారుల పరిశీలనలో తేలింది. పర్యాటకశాఖ నుంచి అనుమతులు తీసుకోకుండానే, రాయల్ వశిష్ట ప్రైవేట్ బోటును నడుపుతున్నట్లు గుర్తించారు. పైగా ఐదు లక్షలు పైగా ఇన్‌ ఫ్లో ఉండగా, పాపికొండలకు బోటు బయల్దేరడం అతిపెద్ద తప్పిదంగా అధికారులు తేల్చారు.

డెత్ జర్నీలుగా మారుతోన్న జల జర్నీలు... గోదావరిలోనే ఎందుకిలా?

నీటిపై ప్రయాణమంటే చిన్న పిల్లవాడి మొదలు వృద్ధుల వరకు అందరిలోనూ ఉత్సాహం ఉరకలేస్తోంది. ఆ ఆనంద క్షణాలను మనసులో మధురమైన గుర్తులుగా మార్చుకుందామని పర్యాటకులు ఆశిస్తారు. కానీ, అలలపై ఆహ్లాదంగా సాగిపోవాల్సిన బోటు ప్రయాణాలు విషాదాంతమవుతున్నాయి. యాత్రికుల రక్షణ గాల్లో దీపంలా మారుతున్నాయి. ముఖ్యంగా పాపికొండల్లో జల విహారం ప్రాణ సంకటంగా మారుతోంది. ప్రకృతి అందాలను తనివితీర తిలకిస్తూ ఉరకలెత్తే ఉత్సాహంతో గోదావరి అలల సయ్యాటతో మునిగి తేలాలన్న సరదాల మాటున విషాదం పొంచి ఉందనే భయంకర నిజాన్ని పర్యాటకులు ఊహించలేకపోతున్నారు. దాంతో జల అందాలను ఆస్వాదిస్తూ చేసిన ప్రయాణం క్షణాల్లోనే ఆవిరైపోతున్నాయి. తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం దగ్గర జరిగిన బోటు ప్రమాదంలోనూ ఇదే జరిగింది. అప్పటివరకు గోదావరి అందాలను చూసి పర్యాటకులు పరవశించిపోయారు. పాపికొండలను చూస్తున్నామన్న ఆనందంలో కేరింతలు కొట్టారు. గోదావరి చుట్టూ అల్లుకున్న ప్రకృతి అందాలకు ఫిదా అయిపోయారు. లోకాన్ని మరిచి...పరిసరాలను మైమరిచి నదీ సోయగాలను చూస్తూ ఉత్సాహంగా ముందుకుసాగారు. సహచర టూరిస్టులు, బంధువులు, కుటుంబ సభ్యులతో జాలీగా  గడుపుతూ ఫొటోలకు పోజులిచ్చారు. మరోవైపు బోటులో సాంస్కృతిక కార్యక్రమాలను ఆస్వాదించారు. అయితే, ఆ అందమైన ప్రకృతే వికృతంగా మారుతుందని ఊహించలేకపోయారు. గోదారమ్మ అమాంతం తమను మింగేస్తుందని అనుకోలేదు. అలాంటి పరిస్థితి వస్తుందని అస్సలు ఊహించలేదు. దాంతో ఒక్కసారిగా పడవ పక్కకు ఒరిగి గోదావరిలో మునిగిపోతుంటే... పర్యాటకులు చేసిన హాహాకారాలు, ఆర్తనాదాలు... ఆ గోదారమ్మ వినిపించుకోలేదు. కుటుంబ సభ్యుల కళ్లెదుటే ఆత్మీయులు జలసమాధి అయిపోయారు. దాంతో విహరయాత్ర కాస్త విషాదయాత్రగా మారిపోయింది. అయితే, బోటు పైఅంతస్తులో ఉన్నవారు మాత్రమే, ఈ ప్రమాదం నుంచి బయటపడినట్లు తెలుస్తోంది. కింది అంతస్తులో అద్దాల మధ్య ఉన్నవారతా జలసమాధి అయ్యారని భావిస్తున్నారు. బోటు దాదాపు 300 అడుగుల లోతులోకి దిగిపోవడంతో... వాళ్లంతా బోటులోనే చిక్కుకుని మరణించారని అంచనా వేస్తున్నారు. బోటును బయటికి తీస్తేనే, మృతుల సంఖ్యపై క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది.

తెలుగు రాష్ట్రాలపై సోనియా ఫోకస్... పీసీసీ చీఫ్ ల ఎంపికపై కసరత్తు

  దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పునురుజ్జీవం కోసం ప్రయత్నిస్తోన్న ఏఐసీసీ తాత్కాలిక ప్రెసిడెంట్ సోనియాగాంధీ.... తెలుగు రాష్ట్రాలపైనా ఫోకస్ పెట్టారు. రాష్ట్ర విభజనతో రెండు చోట్లా దెబ్బతిన్న కాంగ్రెస్ పార్టీని ఏదోవిధంగా బతికించుకోవాలని వ్యూహరచన చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో పార్టీ ఇప్పట్లో పుంజుకునే అవకాశం లేనప్పటికీ, గట్టి ప్రయత్నాలైతే చేయాలని సోనియా నిర్ణయించారు. అందుకే కొత్త పీసీసీ చీఫ్ ఎంపిక కోసం కసరత్తు మొదలుపెట్టారు. అయితే ఏపీసీసీ రేసులో పలువురు పేర్లు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా శైలజానాథ్, పల్లంరాజు, జేడీశీలం, చింతా మోహన్, గిడుగు రుద్రరాజు పేర్లను సోనియా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.  ఇక, తెలంగాణ విషయంలో పీసీసీ చీఫ్ ఎంపిక ఇప్పట్లో లేనట్లు తెలుస్తోంది. తెలంగాణ పీసీసీ కోసం పోటీ ఎక్కువగా ఉండటం, మరోవైపు ఒకరిపై మరొకరు ఫిర్యాదులు చేసుకోవడం, అలాగే అధిష్టానం పరిశీలనలో ఉన్న వ్యక్తులపై సీనియర్లు గుర్రుగా ఉండటంతో, పీసీసీ నియామకాన్ని తాత్కాలికంగా వాయిదా వేసినట్లు ఏఐసీసీ వర్గాలు చెబుతున్నాయి. రేవంత్ రెడ్డికి తెలంగాణ పీసీసీ పగ్గాలు అప్పగించనున్నారనే ప్రచారంతో ఒక్కసారిగా కలకలం రేగడం, ఢిల్లీకి ఫిర్యాదులు వెల్లువెత్తడంతో, హైకమాండ్ ఆచితూచి వ్యవహరిస్తున్నట్లు చెబుతున్నారు. అయితే, మున్సిపల్ ఎన్నికలు, అలాగే హుజూర్ నగర్ అసెంబ్లీ స్థానానికి ఉపఎన్నిక, అదేవిధంగా సభ్యత్వ నమోదు కార్యక్రమాలు ముగిసిన తర్వాత... తెలంగాణ పీసీసీ మార్పుపై అధిష్టానం నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. అయితే, ఏఐసీసీ తాత్కాలిక అధ్యక్ష బాధ్యతలు తీసుకున్నాక తొలిసారి వార్ రూమ్ చర్చలు జరుపుతోన్న సోనియా... తెలుగు రాష్ట్రాలపై సీరియస్ గా ఫోకస్ పెట్టినట్లు చెబుతున్నారు. ముఖ్యంగా తెలంగాణలో ఇప్పట్నుంచే పార్టీని బలోపేతంచేసి, 2024లో అధికారం కైవసం చేసుకునేలా రోడ్ మ్యాప్ రెడీ చేస్తున్నారట. అందుకే తెలంగాణలో ప్రజాసమస్యలపై నివేదిక ఇవ్వాలని సోనియా ఆదేశించారు.

బీజేపీలోకి జార్ఖండ్ డైనమైట్..! ధోనీ రిటైర్మెంట్ పై ఊహాగానాలు

  టీమిండియా క్రికెటర్‌, మాజీ కెప్టెన్‌ మహేంద్రసింగ్‌ ధోనీ... క్రికెట్‌కు గుడ్‌బై చెప్పనున్నారనే ఊహాగానాలు హల్ చల్ చేస్తున్నాయి. సౌతాఫ్రికా టూర్‌కి ధోనీని ఎంపిక చేయకపోవడంతో... ఇక ఇంటర్నేషనల్ క్రికెట్ గుడ్‌బై చెప్పాలని ధోనీ డిసైడయ్యాడని, త్వరలో ప్రకటిస్తాడంటూ ప్రచారం జరుగుతోంది. అంతేకాదు రిటైర్మెంట్ తర్వాత మహేంద్రసింగ్‌ ధోనీ... పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్నారనే వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా ధోనీ ...బీజేపీలో చేరబోతున్నారని అంటున్నారు. సొంత రాష్ట్రం జార్ఖండ్‌కు‌ అతిత్వరలో ఎన్నికలు జరగనుండటంతో... అసెంబ్లీ బరిలో ధోనీ దిగుతారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అందుకే ఈమధ్య ఎక్కువగా జాతీయవాదం వినిపించడంతోపాటు ఇటీవల 2నెలలపాటు ఆర్మీలో పనిచేశారని అంటున్నారు. ఇక, టీమిండియా క్రికెటర్ గా, కెప్టెన్‌గా మహేంద్రసింగ్‌ ధోనీ... పలు రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. మూడు ఫార్మాట్లలోనూ భారత్‌ను నెంబర్‌వన్‌గా నిలిపాడు. అంతేకాదు భారత్ కు వన్డే, టీ20 వరల్డ్, ఆసియా కప్ లను అందించి సంచలనం సృష్టంచాడు. కెప్టెన్ గా ఎన్నో సంచలన విజయాలను సాధించడమే కాకుండా, గ్రేట్ మ్యాచ్ ఫినిషర్ గా పేరు తెచ్చుకున్నాడు. 90కి పైగా టెస్టు మ్యాచులాడి సుమారు 5వేల పరుగులు చేసిన ధోనీ... 340కి పైగా వన్డేల్లో 10వేల 500 రన్స్ చేశాడు. వన్డేల్లో 10వేల పరుగులు చేసిన అతికొద్దిమంది క్రికెటర్లలో ధోనీ ఒకడు. ఇలా ఎన్నో రికార్డులు ధోనీ ఖాతాలో ఉన్నాయి. అయితే, తన రిటైర్మెంట్ పై జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నా, ధోనీ స్పందించకపోవడంతో నిజమేనని అంతా భావించారు. అయితే, ధోనీ అర్ధాంగి సాక్షి ఆ సందిగ్దతకు సింగిల్ లైన్ తో తెరిదించింది. డైరెక్టుగా ఖండించకపోయినా, మరి వీటినే వదంతులు అంటారు అంటూ ట్వీట్ చేసి, రిటైర్మెంట్ వార్తలకు తెరదించారు. సాక్షి చేసిన ఆ ట్వీట్ కు క్షణాల్లోనే వేలకొలది లైకులు, రీట్వీట్లు  వచ్చాయి. మరోవైపు బీసీసీఐ కూడా ధోనీ రిటైర్మెంట్ వార్తలపై డిఫరెంట్ గా స్పందించింది. తమకు సమాచారం లేదంటూ తెలివిగా రియాక్టయ్యింది. మరి ధోనీ నిజంగానే క్రికెట్ కు గుడ్ బై చెప్పి పొలికల్ ఎంట్రీ ఇస్తారో లేదో..!

కాంగ్రెస్ ను బతికించుకునేదెలా? RSS తరహా ప్లాన్ కు సోనియా చర్చలు

  వరుసగా రెండు ఎన్నికల్లో ఘోరంగా దెబ్బతిని డీలాపడిన కాంగ్రెస్ కు పునరుజ్జీవం తెచ్చేందుకు సోనియాగాంధీ ప్రయత్నిస్తున్నారు. జవజీవాలు కోల్పోయిన కాంగ్రెస్ పార్టీలో కొత్త జవసత్వాలు నింపేందుకు ఆపరేషన్ మొదలుపెట్టారు. ముఖ్యంగా మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత రాహుల్ గాంధీ అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పుకోవడంతో దెబ్బతిన్న కాంగ్రెస్ పరపతిని పెంచేందుకు సోనియా తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులను సమాయత్తం చేసేందుకు పూనుకున్న సోనియా... ఏఐసీసీ జనరల్ సెక్రటరీలు, సీఎల్పీ లీడర్లు, పీసీసీ చీఫ్ లతో వార్ రూమ్ చర్చలు జరుపుతున్నారు. పార్టీ బలోపేతం కోసం ఏం చేస్తే బాగుంటుందంటూ అభిప్రాయాలు సేకరిస్తున్నారు.  అయితే, కాంగ్రెస్ పార్టీకి పునర్ వైభవం తీసుకొచ్చేందుకు సోనియా సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆర్ఎస్ఎస్ తరహా మోడల్ అనుసరించాలని భావిస్తున్నారట. బీజేపీ, ఆర్ఎస్ఎస్ మాదిరిగా ప్రేరక్ లను నియమించాలని సోనియా థింక్ చేస్తున్నారని అంటున్నారు. ప్రజలకు చేరువయ్యేందుకు సోషల్ మీడియా ఒక్కటే సరిపోదని... ప్రజాసమస్యలపై స్పందిస్తూ నేరుగా ప్రజలతో అనుసంధానం కావాలని, అప్పుడే పార్టీ మళ్లీ పుంజుకుంటుందనే అంచనాకొచ్చిన సోనియా.... ఆర్ఎస్ఎస్ మాదిరిగా ప్రేరక్ లను నియమించాలని డిసైడయ్యారట.  అతిత్వరలోనే మూడు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరగనుండటంతో, ప్రస్తుత పరిస్థితులు కాంగ్రెస్ కు పెనుసవాలుగా మారాయి. అయితే, వాటన్నింటినీ అధిగమించి, కాంగ్రెస్ ను మళ్లీ రేసులో నిలిపేందుకు సోనియా సవాలుగా తీసుకున్నారట. మరి సోనియా ప్రయత్నాలు ఎంతమేర ఫలిస్తాయో.... కాంగ్రెస్ కు మళ్లీ పూర్వ వైభవం వస్తుందో రాదో... మూడు రాష్ట్రాల ఎన్నికల తర్వాత తేలిపోనుంది.

సబ్ జైలుకు చింతమనేని... పెండింగ్ లో మరో 60 కేసులు

టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌కు ఏలూరు కోర్టు... 14రోజుల రిమాండ్‌ విధించింది. దళిత యువకులపై దాడి, కులం పేరుతో దూషించిన ఘటనలో అట్రాసిటీ సెక్షన్‌తోపాటు 143, 341, 324, 323, 506, 148 రెడ్ విత్ 149 ఐపీసీ కింద కేసు నమోదు చేసిన పెదవేగి పోలీసులు.... చింతమనేనిని అరెస్ట్ చేసి ఏలూరు కోర్టులో హాజరుపర్చారు. న్యాయస్థానం సెప్టెంబర్ 25వరకు రిమాండ్ విధించడంతో ఏలూరు సబ్ జైలుకు తరలించారు. 2017లో దళిత యువకులపై దాడి, కులం పేరుతో దూషించిన కేసులో 12రోజులక్రితం చింతమనేనిని అతని ఇంటి దగ్గర అరెస్ట్ చేసేందుకు ప్రయత్నించారు. అయితే, పోలీసుల కళ్లుగప్పి తప్పించుకున్న చింతమనేని... అప్పట్నుంచి అజ్ఞాతంలోకి వెళ్లిపోవడంతో.... 14 పోలీస్ బృందాలు పశ్చిమగోదావరి జిల్లాను జల్లెడపట్టడమే కాకుండా, తెలుగు రాష్ట్రాల్లో విస్తృతంగా గాలించారు. అయితే సడన్‌గా తన స్వగ్రామం దుగ్గిరాలలో ప్రత్యక్షంకావడంతో, అప్పటికే ఇంటి దగ్గర మోహరించిన పోలీసులు.... చింతమనేనిని అరెస్ట్ చేసేందుకు ప్రయత్నించారు. అయితే, పోలీసులకు చింతమనేని చుక్కలు చూపించారు. కారు దిగనంటూ హైడ్రామా సృష్టించారు. అదే సమయంలో చింతమనేని అనుచరులు, టీడీపీ కార్యకర్తలు పెద్దఎత్తున అక్కడికి చేరుకోవడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. చింతమనేనిని చేతులపై ఎత్తుకున్న అనుచరులు కొద్దిసేపు అలజడి సృష్టించారు. పోలీసులను అడ్డుకుని వాగ్వాదానికి దిగారు. దాంతో అనుచరులు, కార్యకర్తలను చెదరగొట్టిన పోలీసులు, చింతమనేనిని బలవంతంగా జీపులో ఎక్కించి ఏలూరు తరలించారు. ఆ తర్వాత కోర్టులో హాజరుపర్చి జైలుకు తరలించారు. అయితే, తనపై అక్రమ కేసులు పెట్టారని, జగన్ ప్రభుత్వం... తనపై కక్షగట్టిందని,  తనను అంతమొందించేందుకు కుట్ర చేసిందని చింతమనేని ఆరోపించారు. ఇదిలాఉంటే, చింతమనేని బాధితులు... పోలీసుల ముందు క్యూకడుతున్నారు. తమకు న్యాయం చేయాలంటూ ఎస్పీకి పెద్దఎత్తున ఫిర్యాదులు ఇస్తున్నారు. అట్రాసిటీ, భూకబ్జా, బెదిరింపులు ఇలా... చింతమనేనిపై 60కి పైగా కేసులు ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు. మరోవైపు, చింతమనేని అరెస్ట్‌‌తో... ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా, దుగ్గిరాలలో పోలీసులు పెద్దఎత్తున బలగాలను మోహరించారు.

జగన్ చెబితే మమ్మల్ని చంపేస్తారా? చంద్రబాబు స్ట్రాంగ్ వార్నింగ్

జగన్మోహన్‌రెడ్డి పాలనపై టీడీపీ అధినేత చంద్రబాబు నిప్పులు చెరిగారు. తన 41ఏళ్ల రాజకీయ జీవితంలో ఇంత అరాచక, అనాగరిక పాలనను ఎప్పుడూ చూడలేదన్నారు. వైఎస్ హయాంలోనూ ఇంతటి దౌర్జన్యం జరగలేదన్నారు. రాజశేఖర్ రెడ్డి టైమ్ లో కేవలం ఒకే ఒక్క జిల్లాకు హింస పరిమితమైతే, ఇప్పుడు రాష్ట్రమంతటా రాక్షస పాలన సాగుతోందని విమర్శించారు. దాడులు, కేసులు, బెదిరింపులు, ఆస్తుల ధ్వంసం... ఇలా వంద రోజుల్లోనే వందలకొద్దీ దౌర్జన్యాలు చేశారని చంద్రబాబు ఆరోపించారు. ఒక్క అమరావతిలోనే టీడీపీ నేతలపై 38 అట్రాసిటీ కేసులు పెట్టారన్న చంద్రబాబు... ఈ వంద రోజుల్లోనే తెలుగుదేశం శ్రేణులపై 565 కేసులు, 201 దాడులు, 136 వేధింపులు, 52 అక్రమ కేసులు, 21మంది ఉద్యోగుల తొలగింపు, 15 భూకబ్జాలు, 65 ఆస్తుల ధ్వంసం, 10 హత్యలు, 28 చొప్పున 28 పర్సనల్ అండ్ సోషల్ మీడియా కేసులు పెట్టగా, వైసీపీ వేధింపులు భరించలేక 8మంది ఆత్మహత్య చేసుకున్నారని, అలాగే గుంటూరు జిల్లాలో 500మందిని గ్రామాల నుంచి తరిమికొట్టారని లెక్కలతో సహా బాబు బయటపెట్టారు. ఇక పోలీసులు సైతం టీడీపీ శ్రేణులను బెదిరిస్తున్నారని, తెలుగుదేశం వాళ్ల ఫిర్యాదులను తీసుకోవడం లేదని ఆరోపించారు. సీఎం జగన్ చెబితే మమ్మల్ని చంపేస్తారా అంటూ పోలీసులపై మండిపడ్డారు. ప్రజలు తమ సొంత ఇళ్లల్లో ఉండటానికి పోరాటం చేయాల్సిన దుస్థితి వచ్చిందని బాబు ఆవేదన వ్యక్తంచేశారు. దాడులు, అక్రమ కేసులే కాకుండా తోటలు, ఆస్తులు కూడా ధ్వంసం చేస్తున్నారని, ఇంతటి రాక్షస పాలనను తానెప్పుడూ చూడలేదని అన్నారు. రాక్షసుల గురించి వినడమే గానీ, ఇప్పుడు ప్రత్యక్షంగా చూస్తున్నామని, వైసీపీ నేతలు... రాక్షసులను మరిపిస్తున్నారని చంద్రబాబు నిప్పులు చెరిగారు. వైసీపీ నేతలు పిల్లల్ని కూడా వదిలిపెట్టడం లేదని చంద్రబాబు ఫైరయ్యారు. అమ్మాయిని వివస్త్రను చేసి కారం చల్లుతారా? 545మందిని గ్రామాల నుంచి వెలేస్తే చిన్న సమస్యా? బాధితులను పెయిడ్ ఆర్టిస్టులంటారా? అందర్నీ చంపి రాష్ట్రాన్ని వల్లకాడు చేస్తారా? అంటూ బాబు ప్రశ్నల వర్షం కురిపించారు. అయితే, తమకు అడ్డే లేదు... ఏమైనా చేస్తామని వైసీపీ నేతలు అనుకుంటున్నారని, కానీ వైసీపీ దౌర్జన్యాలు ఇక సాగనివ్వబోమంటూ చంద్రబాబు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఏదిఏమైనా ఛలో ఆత్మకూరు ఆగదని, ఆత్మరక్షణ కోసం ఎంతవరకైనా పోరాడతామని బాబు తేల్చిచెప్పారు.

తమిళిసై నియామకం కేసీఆర్‌కు ఇష్టం లేదా? మరి ఆ ఆర్టికల్ రాయించిందెవరు?

తెలంగాణ కొత్త గవర్నర్ తమిళిసైపై అప్పుడే రాజకీయ దుమారం మొదలైపోయింది. తమిళిసై ప్రమాణస్వీకారం చేసిన రోజే టీఆర్ఎస్ ప్రభుత్వం ఇన్ డైరెక్ట్ గా తన అసంతృప్తిని వెళ్లగక్కింది. గవర్నర్ వ్యవస్థపై సీఎం కేసీఆర్ సీపీఆర్వో రాసిన వ్యాసం దీనికి కేంద్రమైంది. సర్కారియా కమిషన్ సిపార్సులను ఊటంకిస్తూ రాసిన వ్యాసంలో... తమిళిసై నియామకంపై పరోక్షంగా టీఆర్ఎస్ సర్కారు అయిష్టతను బయటపెట్టిందనే మాట వినిపిస్తోంది. ఎక్కడా తమిళిసై పేరు ఎత్తకుండా రాసిన ఈ వ్యాసంలో... రాజకీయంగా చురుగ్గా ఉన్న నేతలను గవర్నర్లగా నియమించకూడదనే సర్కారియా కమిషన్ సిఫార్సులను ప్రస్తావించారు. గవర్నర్ వ్యవస్థపై కేంద్రం పెత్తనం చెలాయిస్తోందంటూ సీఎం కేసీఆర్ సీపీఆర్వో విశ్లేషణ సాగింది. అయితే సీఎం సీపీఆర్వో ఆర్టికల్ పై బీజేపీ మండిపడుతోంది. అసలు సర్కారియా కమిషన్ సిఫార్సులు ఎక్కడ అతిక్రమించామో చెప్పాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఒకవైపు గవర్నర్ ను గౌరవిస్తామని చెబుతూనే, మరోవైపు గవర్నర్ వ్యవస్థను అవమానించేలా వ్యాసాలు రాయించడమేంటని కాషాయ నేతలు ప్రశ్నిస్తున్నారు. అయినా ప్రభుత్వ పదవిలో ఉన్న వ్యక్తి, పైగా సీఎం సీపీఆర్వో... రాజ్యాంగ పదవిలో ఉన్న గవర్నర్ పై అనుమానాలు, అపోహలు ఉన్నాయంటూ, ఆర్టికల్ రాసే స్వేచ్ఛ ఎలా వచ్చిందని ప్రశ్నిస్తున్నారు. అసలు ఆర్టికల్ రాసిన వ్యక్తికి సర్కారియా కమిషన్ సిఫార్సులు గురించి కనీస అవగాహన లేదని మండిపడ్డారు. ఇదంతా సీఎం కేసీఆర్ కనుసన్నల్లోనే జరిగిందని ఆరోపిస్తోన్న బీజేపీ... సీపీఆర్వోను వెంటనే తొలగించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తోంది. గవర్నర్ పై అనుచిత ఆర్టికల్ రాసిన సీఎం సీపీఆర్వోపై చర్యలు తీసుకోకపోతే, క్రిమినల్ కేసు పెడతామని బీజేపీ నేతలు హెచ్చరించారు. అయినా, గవర్నర్‌గా బాధ్యతలు తీసుకుని 24గంటలు కూడా గడవకముందే ఇలా విషం కక్కడమేంటని ప్రశ్నిస్తున్నారు. అయితే, గవర్నర్ల నియామకం రాష్ట్రపతి చేతుల్లో ఉంటుందని, దాన్ని రాజకీయాల్లోకి లాగడం సరికాదని మంత్రి కేటీఆర్ అన్నారు. గవర్నర్ గా తమిళిసైకి ఇవ్వాల్సిన గౌరవం ఇస్తామన్న కేటీఆర్... ఆమె మంచి వ్యక్తి అంటూ కొనియాడారు. మరోవైపు మిగతా గవర్నర్లకు భిన్నంగా బాధ్యతలు స్వీకరించినరోజే తెలంగాణ ప్రజలనుద్దేశించి ప్రసంగించిన తమిళిసై... కేసీఆర్ పరిపాలనను, అమలు చేస్తోన్న అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రశంసించారు. బంగారు తెలంగాణ సాధనలో తాను కూడా భాగస్వామ్యమైనందుకు సంతోషంతో ఉందంటూ వ్యాఖ్యానించారు. మొత్తానికి, తెలంగాణకు కొత్త గవర్నర్ రాక సందర్భంగా, సీఎం కేసీఆర్ సీపీఆర్వో రాసిన వ్యాసం రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. అయితే, రాజకీయ కోణంలోనే తమిళిసైని తెలంగాణకు గవర్నర్ గా పంపారనే ప్రచారం విస్తృతంగా సాగుతుండటంతో, ఆమె నియామకం.... సీఎం కేసీఆర్ కు కూడా ఇష్టం లేదనే చర్చ నడుస్తోంది. మరి ముందుముందు ఈ వివాదం ఎటువైపు దారితీస్తుందో చూడాలి.

పల్నాటి యుద్ధం... వడ్డీతో సహా చెల్లిస్తామంటూ బాబు వార్నింగ్

  పల్నాడు పేరు చెబితేనే పగలు ప్రతీకారాలు గుర్తుకొస్తాయి. దాడులు ప్రతిదాడులు కామన్ గా కనిపిస్తాయి. ఇక అధికారం మారినప్పుడల్లా పరిస్థితులూ మారిపోతాయి. అందుకే, ఇప్పుడు పల్నాడులో కొత్త యుద్ధం నడుస్తోంది. ఆనాటి పల్నాటి యుద్ధాన్ని తలపించేలా అధికార వైసీపీ... ప్రతిపక్ష టీడీపీ... కత్తులు దూసుకుంటున్నాయి. రాజకీయ దాడులపై ఆరోపణలు, ప్రత్యారోపణలతో నిప్పులు కక్కుతున్నారు. జగన్మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక... గూండాయిజం పెరిగిపోయిందని టీడీపీ నేతలు ఆరోపిస్తుంటే...  టీడీపీ వాళ్లే దాడులు చేస్తూ... తిరిగి వైసీపీపై విమర్శలు చేస్తున్నారంటూ అధికార పార్టీ కౌంటర్ ఇస్తోంది. పల్నాడులో రాజకీయ దాడుల బాధితుల కోసం పునరావాస శిబిరం ఏర్పాటు చేసిన టీడీపీ అధినేత చంద్రబాబు... వైసీపీ వంద రోజుల పాలనలో ఐదు వందలకు పైగా దాడులు జరిగాయని, పది మందిని చంపేశారని ఆరోపించారు. ఇదే తరహాలో దాడులు కొనసాగిస్తే, భవిష్యత్తులో అంతకంతకు వడ్డీతో సహా చెల్లిస్తామంటూ చంద్రబాబు హెచ్చరించారు. ఇక నారా లోకేష్ కూడా రాజకీయ దాడులపై నిప్పులు చెరిగారు. రాజన్న రాజ్యం తీసుకొస్తానని రాక్షస పాలన తెచ్చారంటూ మండిపడ్డారు. అయితే, ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీసులే, తప్పుడు కేసులు పెడుతూ తమ కార్యకర్తలను ఊరు వదిలిపెళ్లిపోమని బెదిరిస్తున్నారని ఆరోపించారు. అయితే, తెలుగుదేశం ఆరోపణలపై హోంమంత్రి సుచరిత ఘాటుగా స్పందించారు. టీడీపీ తప్పుడు ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. పల్నాడు ప్రశాంతంగా ఉందని, ఆ ప్రశాంతతకు ఎవరూ భంగం కలిగించొద్దని సూచించారు. పెయిడ్‌ ఆర్టిస్టులతో టీడీపీ పునరావాస కేంద్రాలు నిర్వహిస్తోందన్న సుచరిత... అసలక్కడ నిజంగా బాధితులు ఉన్నారో లేదో తెలుసుకునేందుకు నిజనిర్ధారణతోపాటు సమగ్ర విచారణ చేపడతామని ప్రకటించారు.  ఒకవేళ పునరావాస కేంద్రాల్లో నిజంగానే బాధితులు ఉంటే, పోలీసులే వారిని స్వయంగా గ్రామాలకు తీసుకెళ్లి...రక్షణ కల్పిస్తారని హోంమంత్రి హామీ ఇచ్చారు. అలాగే, టీడీపీ ఛలో ఆత్మకూరుకు అనుమతి లేదని, ఎవరైనా శాంతిభద్రతలకు భంగం కలిగిస్తే ఉపేక్షించేది లేదని వార్నింగ్ ఇచ్చారు.

హరీష్ రావుకి చెక్ పెట్టిన కేసీఆర్.. ఆర్ధిక శాఖ ఇవ్వడం వెనుక మాస్టర్ ప్లాన్!!

  తెలంగాణలో ఆదివారం నాడు మంత్రివర్గ విస్తరణ జరిగిన సంగతి తెలిసిందే. హరీష్ రావు, కేటీఆర్ సహా ఆరుగురు నూతన మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. సీఎం కేసీఆర్.. హరీష్ రావుకి కీలకమైన ఆర్ధిక శాఖను అప్పగించారు. దీంతో హరీష్ అభిమానుల్లో సంతోషం నెలకొంది. అయితే ఒక్కరోజులో సీను పూర్తిగా రివర్స్ అయింది. హరీష్ కు ఆర్ధిక శాఖను అప్పగించడం వెనుక కేసీఆర్ మాస్టర్ ప్లాన్ ఉందా అని కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. 2019-20 ఏడాదికి కేసీఆర్ బడ్జెట్ ప్రవేశ పెట్టారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణపై ఆర్థిక మాంద్యం ప్రభావం తీవ్రంగా ఉందని అన్నారు. ఇప్పటికే అమలు చేస్తున్న సంక్షేమ పథకాల్ని కొనసాగిస్తామని చెప్పటంతో పాటు.. ఇక నుంచి ఎలాంటి కొత్త అభివృద్ధి పనులు ఉండబోవని.. బకాయిలు చెల్లించాకే కొత్త పనులు చేపట్టాలని విధాన నిర్ణయం తీసుకున్నట్లుగా కేసీఆర్ ప్రకటించారు. ఓ రకంగా ఖాళీ గల్లా పెట్టెను హరీష్ చేతికి ఇచ్చిన కేసీఆర్.. అందులోకి వచ్చే ఆదాయం ఏమైనా సరే.. తాను చెప్పిన రీతిలో బకాయిల చెల్లింపులకు తొలి ప్రాధాన్యం ఇవ్వాలని చెప్పేశారు. ఏ శాఖకు ఎంత కేటాయింపు, దేనికి ప్రాధాన్యత ఇవ్వాలన్నది ఆర్థిక మంత్రి హోదాలో హరీష్ కు అధికారం ఉండాలి. కానీ, ఆర్థిక శాఖ ఏం చేయాలన్న విషయాన్ని కేసీఆర్ తన స్పీచ్ లో చెప్పేయటంతో.. పరిమితుల మధ్య హరీష్ పని చేయటానికి మించి చేసేదేమీ లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అంటే.. ఆర్థికమంత్రిగా హరీష్.. సింపుల్ గా ఆఫీసుకు రావటం, వెళ్ళటం తప్పించి పెద్దగా చేసేందుకు పనేమీ ఉండదని అంటున్నారు. దానికి తోడు దేశ వ్యాప్తంగా ఉన్న ఆర్థిక మాంద్యం వలన తెలంగాణలో కూడా ఆదాయం గణనీయంగా తగ్గిపోయింది. ఏ పనులకైన నిధులు కొరత ఏర్పడితే ఆర్థిక మంత్రి హోదాలో హరీష్ రావు సమాధానం చెప్పాలి. దీన్నిబట్టి చూస్తుంటే.. ఆర్థిక మాంద్యం సమయంలో హరీష్ రావుకి ఆర్ధిక శాఖను అప్పగించి, ఖాళీ గల్లా పెట్టెను చేతికిచ్చి ఇరుకున పెట్టారా అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

కారే కాదు... సైకిల్ కూడా ఉంది... యాదాద్రి వివాదంలో లాజిక్ మిస్సయిన అధికారులు

  పవిత్రమైన పుణ్యక్షేత్రంలో వివాదం రాజుకుంది. అత్యంత ప్రతిష్టాత్మకంగా పునర్ నిర్మిస్తోన్న యాదాద్రి ఆలయంలో రాజకీయ నాయకుల చిత్రపటాలు కలకలం రేపాయి. దేవతా విగ్రహాలు, సంస్కృతి సంప్రదాయాలు, చరిత్ర ఉండాల్సిన చోట... పొలిటికల్ లీడర్స్, పార్టీల గుర్తులు, మేనిఫెస్టోలను పెట్టారు. ముఖ్యంగా టీఆర్‌ఎస్ పార్టీ గుర్తు కారు, అలాగే కేసీఆర్ చిత్రపటాలను ఆలయ ప్రాకారాల్లో చిత్రీకరించడంపై పెద్దఎత్తున విమర్శలు చెలరేగాయి. అయితే, యాదాద్రి రాతి స్తంభాలపై కేసీఆర్, కారు చిత్రాలను చెక్కడంపై పెద్దఎత్తున విమర్శలు రావడంతో ఆలయ అధికారులు వివరణ ఇచ్చారు. ఏ ఆలయంలోనైనా అప్పటి పరిస్థితుల్ని ప్రతిబింబించేలా శిల్పాలు చెక్కడం సర్వసాధారణమని యాదాద్రి ప్రత్యేకాధికారి కిషన్ రావు తెలిపారు. ఇవి ఏ వ్యక్తి కోసమో చెక్కినవి కావని, ఫలానా బొమ్మలు చెక్కమని శిల్పులకు ఎవరూ చెప్పలేదని, సమకాలీన పరిస్థితులకు అనుగుణంగా, వాళ్లే స్ఫూర్తిపొంది చిత్రాలను చెక్కారని అన్నారు. అలాగే కేసీఆర్‌పై అభిమానంతోనే ఆయన చిత్రపటాన్ని శిల్పులు చెక్కారని వైటీడీఏ అధికారి కిషన్‌రావు చెప్పుకొచ్చారు. అంతేగాని సీఎం కేసీఆర్ మెప్పు కోసమే చెక్కించామని చెప్పడం సరికాదన్నారు. ఇక కారును ఒక పార్టీ గుర్తు మాత్రమే చూడటం దుర్మార్గమన్న కిషన్ రావు.... రాతి స్తంభాలపై ఒక్క కారు మాత్రమే లేదని, ఎడ్లబండి, సైకిల్, రిక్షా... ఇలా అనేక బొమ్మలు ఉన్నాయన్నారు. అయితే,  కేసీఆర్ చిత్రపటం చెక్కడాన్ని సమర్ధించుకునే ప్రయత్నంచేశారు. అహోబిలం శిలలపై గాంధీ, నెహ్రూ బొమ్మలున్నాయని, ఒకవేళ అభ్యంతరాలుంటే కేసీఆర్ బొమ్మను తీసేస్తామంటూ చెప్పుకొచచారు కిషన్ రావు. మొత్తానికి యాదాద్రి వివాదాన్ని తెలివిగా శిల్పులపైకి నెట్టే ప్రయత్నం జరిగింది. అయితే, ఇక్కడ అధికారుల తెలివి తక్కువతనం క్లియర్ గా బయటపడింది. ఎందుకంటే, రెండువేల కోట్ల రూపాయల భారీ వ్యయంతో ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోన్న ఆలయంలో శిల్పులే తమంతట తాముగా శిల్పాలు చెక్కడం సాధ్యమేనా? పైగా ప్రభుత్వ ఆధ్వర్యంలో, అధికారుల నిరంతర పర్యవేక్షణలో యాదాద్రి ఆలయ పునర్ నిర్మాణం జరుగుతుంటే, ఎలాంటి దిశానిర్దేశం లేకుండానే శిల్పులు... వాళ్లకు నచ్చిన చిత్రాలను వాళ్లు చెక్కేస్తారా? అసలు జరిగే పనేనా? కాదని, సామాన్యుడిని అడిగినా చెబుతారు. మరి అధికారులు ఈ చిన్న లాజిక్ ఎందుకు మర్చిపోయారో..! ఏదేమైనా యాదాద్రి శ్రీలక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో రాజకీయ నేతల చిత్రాలను చెక్కడంపై పెద్దఎత్తున విమర్శలు చెలరేగుతున్నాయి. బీజేపీ, హిందూసంస్థలు ఉద్యమానికి సిద్ధమవుతున్నాయి.

ఒకే ఒక్క అడుగు దూరంలో లక్ష్యం... ఇస్రోకి ఇదే అసలుసిసలు సవాలు...

  వెయ్యి కోట్ల రూపాయలతో ప్రయోగించిన చంద్రయాన్-2 చివరి దశకు చేరుకుంది. చందమామను అందుకోవడానికి ఒకే ఒక్క అడుగు దూరంలో నిలిచింది ఇస్రో. చందమామ చివరి కక్ష్యలో పరిభ్రమిస్తోన్న ల్యాండర్ విక్రమ్, రోవర్ ప్రజ్ఞాన్... మరికొన్ని గంటల్లో జాబిల్లిపై అడుగు పెట్టబోతున్నాయి. అయితే, ఇప్పటివరకు సాగిన చంద్రయాన్-2 ప్రయాణం ఒక ఎత్తయితే... చివరిగా జరగాల్సిన సాఫ్ట్ ల్యాండింగే అతిపెద్ద సవాలుగా మారింది... చంద్రుడి దక్షిణధృవం వైపు దూసుకెళ్తోన్న ల్యాండర్ విక్రమ్‌ను సజావుగా దిగేలా చేయడమే ఇప్పుడు ఇస్రో ముందున్న లక్ష్యం. సెకనుకు కొన్ని వందల కిలోమీటర్ల వేగంతో తిరుగుతున్న ల్యాండర్ విక్రమ్‌ను చందమామ దక్షిణ ధృవంలో సురక్షితంగా దిగేలా చేయడం అత్యంత సంక్లిష్ట పని. చంద్రుడి ఉపరితలంపై ఎగుడు దిగుడు లేని ప్రదేశాన్ని ఎంచుకుని... విక్రమ్‌ను ల్యాండ్ చేయాల్సి ఉంటుంది‌. అయితే, వందల కిలోమీటర్ల వేగంతో పరిభ్రమిస్తోన్న ఈ ల్యాండర్ వేగాన్ని సకాలంలో నియంత్రిస్తూ ఉండాలి. అందులో, ఒక్క సెకను తేడా వచ్చినా సాఫ్ట్ ల్యాండింగ్ కుదరకపోవచ్చు. దాని వల్ల ఇబ్బందులు తప్పకపోవచ్చు. ఇస్రో తన లక్ష్యాన్నీ చేరుకోలేకపోవచ్చు. అయితే, విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్‌కు అమర్చిన కెమెరాల ద్వారా ఎప్పటికప్పుడు అందే ఫొటోలను బేరీజు వేసుకుంటున్న ఇస్రో.... సాఫ్ట్ ల్యాండింగ్ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ముఖ్యంగా కొండ ప్రాంతాలు, అగాథాల్లేని ప్రాంతం కోసం వెదుకుతోంది. చదునుగా ఉంటే, ఉపరితలాన్ని ఎంచుకుని, సాఫ్ట్ ల్యాండింగ్ ప్రయత్నిస్తోంది. అయితే, ఇది క్షణాల్లో జరిగిపోయే ప్రక్రియ. ఏమాత్రం ఏమరుపాటుగా ఉన్నా... మొత్తం కష్టం అంతా బూడిదలో పోసిన పన్నీరవుతుంది. 7న అర్ధరాత్రి ఒకటిన్నర నుంచి రెండున్నర మధ్య విక్రమ్ ల్యాండర్ చంద్రుడిపై కాలు మోపే అవకాశాలున్నాయి. అయితే, ఇప్పటివరకు సాగిన ప్రయాణంలో ఎలాంటి సాంకేతిక సమస్యలు తలెత్తకపోవడంతో ల్యాండింగ్ కూడా విజయవంతమవుతుందనే ధీమాతో ఉంది ఇస్రో. అత్యంత క్లిష్టమైన దశగా భావిస్తున్న సాఫ్ట్ ల్యాండింగ్‌ను  అధిగమిస్తే... అంతరిక్ష పరిశోధనల్లో అంతర్జాతీయంగా భారత్ పేరు మారుమోగడం ఖాయం.

తూర్పుగోదావరి టీడీపీలో ముసలం... చంద్రబాబుకి షాకిచ్చిన సీనియర్లు...

టీడీపీ అధినేత చంద్రబాబుకు తూర్పుగోదావరి టూర్ లో ఊహించని షాక్ తగిలింది. ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత తెలుగుదేశం కేడర్ లో ధైర్యం నింపేందుకు వచ్చిన చంద్రబాబుకు సీనియర్లు షాకిచ్చారు. సాక్షాత్తూ పార్టీ అధినేత హాజరైన సమీక్షా సమావేశానికే కీలక నేతలు డుమ్మాకొట్టారు. కాకినాడలో చంద్రబాబు నిర్వహించిన విస్తృతస్థాయి సమావేశానికి తోట త్రిమూర్తులు, మాగంటి రూప, చలమలశెట్టి సునీల్, బొడ్డు భాస్కర రామారావు, దొరబాబు తదితర ముఖ్యనేతలు గైర్హాజరయ్యారు. దాంతో తూర్పుగోదావరి జిల్లా టీడీపీలో ముసలం మొదలైందనే చర్చ ఊపందుకుంది. పార్టీ అధినేత సమావేశానికే డుమ్మాకొట్టడం టీడీపీలో కలకలం రేపుతోంది. ఓటమి భారంతో తీవ్ర నైరాశ్యంలోకి వెళ్లిపోయిన నేతలు, కార్యకర్తల్లో ధైర్యం, జోష్ నింపేందుకు ప్రయత్నిస్తోన్న చంద్రబాబు.... జిల్లాల్లో పర్యటిస్తూ సమీక్షలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా, తూర్పుగోదావరిలో పర్యటిస్తూ కాకినాడలో విస్తృతస్థాయి సమావేశం ఏర్పాటుచేశారు. మొదటిరోజు రంపచోడవరం, అనపర్తి, రాజానగరం, రాజమండ్రి సిటీ అండ్ రూరల్‌, రాజోలు, గన్నవరం, అమలాపురం, కొత్తపేట నియోజకవర్గాల సమీక్ష చేపట్టాయి. అయితే, ఈ సమావేశానికి తోట త్రిమూర్తులు, మాగంటి రూప, చలమలశెట్టి సునీల్, బొడ్డు భాస్కర రామారావు, దొరబాబు డుమ్మా కొట్టడం తీవ్ర సంచలనమైంది. అయితే, చంద్రబాబు విదేశీ పర్యటనలో ఉండగా, తోట త్రిమూర్తులు... కాపు నేతలతో సమావేశం నిర్వహించి కలకలం రేపారు. అంతేకాదు తోట త్రిమూర్తులు నేతృత్వంలో టీడీపీ కాపు నేతలంతా.... బీజేపీలో చేరబోతున్నారంటూ లీకులు వదిలారు. ఆ తర్వాత విజయవాడ బోండా ఉమా నివాసంలో మరోసారి కాపు లీడర్లంతా సమావేశమై కలకలం రేపారు. అప్పుడు కూడా, పలువురు నేతలు పార్టీ మారతారనే చర్చ జరిగింది. అయితే ఇప్పుడు, సాక్షాత్తూ టీడీపీ అధినేత చంద్రబాబు హాజరైన సమావేశానికే ముఖ్యనేతలు డుమ్మా కొట్టడం తెలుగుదేశం అధిష్టానాన్ని కలవరపాటుకు గురిచేస్తోంది.

దగ్గుబాటిపై నిఘా నిజమేనా? పర్చూరులో అసలేం జరుగుతోంది?

  దగ్గుబాటి వెంకటేశ్వరావు... దగ్గుబాటి పురంధేశ్వరి... పరిచయం అక్కర్లేని పేర్లు... ఎన్టీఆర్ అల్లుడిగా, ఎన్టీఆర్ కూతురిగానే కాకుండా తెలుగు రాజకీయాల్లో తమకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న పొలిటికల్ జంట... అయితే ఒకరు వైసీపీలో ఉంటే... మరొకరు బీజేపీలో ఉండటం... సమస్యగా మారుతోంది. ఒకే ఇంట్లో రెండు జెండాలు ఉండటం... వాళ్లిద్దరి వరకు సమస్య లేకపోయినా, ఆ రెండు పార్టీల అధినాయకుల్లో మాత్రం అనుమానాలు పెంచుతుందనే మాట వినిపిస్తోంది. ముఖ్యంగా ఇటీవల పురంధేశ్వరి.... వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేయడంతో... దగ్గుబాటి వెంకటేశ్వరావుపై జగన్మోహన్ రెడ్డి నిఘా పెట్టారనే వార్త వైసీపీలో సంచలనంగా మారింది. భార్య ఒక పార్టీలో... భర్త మరో పార్టీలో... అంటూ విమర్శలు చెలరేగినా, దగ్గుబాటి దంపతులు మాత్రం తమతమ పార్టీల్లో ఎవరి పని వాళ్లు చేసుకుపోతున్నారు. ఇద్దరూ కూడా ఎవరి రాజకీయంలో వారు బిజీగా ఉన్నారు. అయితే, గత ఎన్నికల్లో అనూహ్యంగా పర్చూరు వైసీపీ టికెట్ దక్కించుకున్న దగ్గుబాటి వెంకటేశ్వరావు... టీడీపీ అభ్యర్ధి ఏలూరి సాంబశివరావు చేతిలో స్వల్ప తేడాతో ఓడిపోయారు. దగ్గుబాటి ఓడిపోయినప్పటికీ, పర్చూరు నియోజకవర్గంలో మాత్రం దగ్గుబాటి మాటే చెల్లుబాటు అవుతుందని అంటున్నారు. అధికార యంత్రాంగంలోనూ, బదిలీల్లోనూ ఇలా ప్రతీ విషయంలోనూ దగ్గుబాటి వెంకటేశ్వరావు చక్రం తిప్పుతున్నారనే వైసీపీ నేతలే చెప్పుకుంటున్నారు. అలాగే, కుమారుడితో కలిసి అటు అధికారులు, ఇటు పార్టీ లీడర్లతో సమీక్షా సమావేశాలు నిర్వహిస్తోన్న దగ్గుబాటి... నియోజకవర్గంలో ప్రతీదీ తన కనుసన్నల్లోనే జరగాలని చెబుతున్నారట. అయితే దగ్గుబాటి పోకడపై సొంత పార్టీలోనే మరో వర్గం జగన్ కు ఫిర్యాదు చేసిందట. దాంతో దగ్గుబాటి వ్యవహారశైలిపై జగన్ నిఘా పెట్టారనే చర్చ సాగుతోంది. అయితే, దగ్గుబాటిపై జగన్ నిఘా పెట్టారనే ప్రచారం పార్టీలో తీవ్ర చర్చనీయాంశమైంది. అయితే, సొంత పార్టీ నాయకుడిపై ప్రభుత్వం నిఘా ఎందుకు పెట్టిందని మాట్లాడుకుంటున్నారు. దీనికి, జగన్ ప్రభుత్వంపై ఇటీవల పురంధేశ్వరి చేసిన వ్యాఖ్యలే కారణమన్న మాటలు వినిపిస్తున్నాయి. ఏపీలో బలపడాలనుకుంటోన్న బీజేపీ... ఎన్నికల తర్వాత విమర్శల దాడిని పెంచింది. అందులో భాగంగానే పురంధేశ్వరి కూడా జగన్ నిర్ణయాలను తప్పుబడుతూ తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలోనే దగ్గుబాటిపై వైసీపీ అధిష్టానం నిఘా పెట్టిందనే మాట వినిపిస్తోంది. పురంధేశ్వరి విమర్శల నేపథ్యంలోనే... పర్చూరులో పరిస్థితేంటి? ఆమె భర్త దగ్గుబాటి వైఖరి ఎలా ఉంది అంటూ సీఎం జగన్ ఆరా తీశారని చెప్పుకుంటున్నారు. అందుకే, నిఘా అధికారులు పర్చూరు నియోజకవర్గానికి వెళ్లి, పరిణామాలను నిశితంగా పరిశీలిస్తూ, నివేదికలు ఇస్తున్నారని తెలుస్తోంది. అయితే, దగ్గుబాటిపై జగన్ నిఘా పెట్టారన్న ప్రచారంలో నిజం లేదని ఆయన అనుచరులు చెబుతున్నారు. అధికార పార్టీగా నియోజకవర్గంలో ప్రభుత్వ పథకాలు, ప్రాధమ్యాలను జనానికి వివరించడానికి, పార్టీ పట్టు పెంచుకోవడానికే దగ్గుబాటి తన కుమారుడితో కలిసి, పర్యటిస్తున్నారని అంటున్నారు. ఇదంతా ప్రత్యర్ధుల కుట్ర అంటూ కొట్టిపారేస్తున్నారు.

అప్పుడు ఎన్టీఆర్... ఇప్పుడు కేసీఆర్... తమిళిసై రాకతో 1985 సీన్ రిపీట్ కానుందా?

2023లో అధికారమే లక్ష్యంగా తెలంగాణలో పావులు కదుపుతోన్న బీజేపీ... అన్నివైపుల నుంచి అస్త్రాలను ప్రయోగిస్తోంది. రాజకీయంగా బలపడటమే కాకుండా... వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా ఘనవిజయం సాధించి... తెలంగాణలో కాషాయ జెండా ఎగురవేయాలన్న లక్ష్యంతో అడుగులు వేస్తోంది. అందుకు అస్త్రంగానే తమిళిసైని ప్రయోగించారనే ప్రచారం జరుగుతోంది. ఎన్ని ట్యాగులు తగిలించుకున్నా, బీజేపీకి హిందుత్వవాదమే బలం. అందుకే కరుడుగట్టిన హిందుత్వవాదిగా పేరున్న తమిళిసైని వ్యూహాత్మకంగా రంగంలోకి దింపారనే మాట వినిపిస్తోంది. హిందుత్వ కార్యకలాపాల్లో చురుగ్గా పనిచేసిన తమిళిసైది దూకుడుగా వ్యవహరించే నైజం. తమిళనాట అసలు బీజేపీ ఉనికే లేనప్పుడు తమిళిసై అత్యంత సమర్ధవంతంగా పనిచేశారని అంటారు. అందుకే, తమిళిసైకి తమిళనాడు పార్టీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించారని, ఇప్పుడు తెలంగాణ గవర్నర్‌గా నియమించడం వెనుకా పక్కా వ్యూహం ఉందంటున్నారు. హిందుత్వవాదులను ప్రోత్సహించి బలపడాలన్నదే బీజేపీ గేమ్ ప్లాన్ కావడంతో... తమిళిసై రాకతో తెలంగాణలో హిందుత్వవాదులకు ఊహించనిస్థాయిలో అండ లభించబోతుందనే మాట వినిపిస్తోంది. కరుడుగట్టిన హిందుత్వవాదిగా పేరున్న తమిళిసై రాకతో కేసీఆర్‌కు చిక్కులు తప్పవనే మాట వినిపిస్తోంది. అసలు కేసీఆర్‌ అండ్ టీఆర్‌ఎస్‌ టార్గెట్‌గానే తమిళిసైని గవర్నర్‌గా నియమించారనే ప్రచారం జరుగుతుండటంతో... 1985 నాటి పరిస్థితులు పునరావృతం కానున్నాయనే ప్రచారం జరుగుతోంది. ఆనాడు ఎన్టీఆర్‌‌కి ఎదురైన పరిస్థితులే... ఇప్పుడు కేసీఆర్‌కి రిపీట్ కాబోతున్నాయేమోనని అంటున్నారు. 1985 నుంచి 1990 వరకు ఏపీ గవర్నర్‌గా పనిచేసిన కుముద్ బెన్ జోషి... ఆనాటి సీఎం ఎన్టీఆర్‌కి చుక్కలు చూపించారు. అప్పటి కాంగ్రెస్ ప్రధాని రాజీవ్ ఆశీస్సులతో రంగంలోకి దిగిన కుముద్ బెన్ జోషి... రాష్ట్రమంతా పర్యటించి లోపాయికారీగా కాంగ్రెస్‌ బలోపేతానికి ప్రయత్నించారనే ఆరోపణలు ఉన్నాయి. ఆ నేపథ్యంలోనే గవర్నర్ కుముద్ బెన్ జోషి చర్యలను ఎన్టీఆర్‌ తీవ్రంగా వ్యతిరేకించారు. అంతేకాదు కుముద్ బెన్ జోషికి సహకరించొద్దంటూ అధికార యంత్రాంగానికి ఎన్టీఆర్ ఆదేశాలు సైతం ఇచ్చారు. అయితే, కేంద్రం అండతో రాజ్ భవన్‌ నుంచి కుముద్ బెన్ జోషి... ప్రత్యామ్నాయ ప్రభుత్వాన్ని నడిపారని అంటారు. వైస్ ఛాన్సలర్లతో చర్చలు జరపడం... నిత్యం కాంగ్రెస్ లీడర్లతో సమావేశమవడం కావడంతో... రాజ్‌భవన్‌ కాంగ్రెస్ కార్యాలయంగా మారిందనే విమర్శలు వచ్చాయి. అయితే, ఇప్పుడు తమిళిసై కూడా అదే తరహాలో వ్యవహరించబోతున్నారనే ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా బీజేపీ నేతలకు అందుబాటులో ఉంటూ, హిందుత్వవాదులను, ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాలను ప్రోత్సహించే అవకాశముందంటున్నారు. మొత్తానికి తెలంగాణపై పకడ్బందీ ప్లాన్‌తోనే బీజేపీ నాయకత్వం తమిళిసైని తెరపైకి తెచ్చిందనే ప్రచారం జరుగుతోంది. 2023లో టీఆర్‌ఎస్‌ను ఓడించడం, అలాగే గద్దెనెక్కడమే లక్ష్యంగా గవర్నర్‌ నియామకం జరిగిందంటున్నారు. దాంతో కొత్త గవర్నర్ తమిళిసైతో కేసీఆర్‌కు తిప్పలు తప్పవనే మాటలు వినిపిస్తున్నాయి. మరి ప్రచారం జరుగుతున్నట్లుగా, కేసీఆర్ ప్రభుత్వానికి తమిళిసై కొరకరాని కొయ్యగా మారుతారో లేక నర్సింహన్ తరహాలోనే సహకరిస్తారో చూడాలి.