టీడీపీ డైరెక్షన్లో కేఏ పాల్.. వైసీపీకి బిగ్ లాస్!!

  సీరియల్ మధ్యలో యాడ్ లాగా, సినిమా మధ్యలో కామెడీ ట్రాక్ లాగా.. అప్పుడప్పుడు రాజకీయ తెర మీద కనిపించే  ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ .. ఏపీలో ఎన్నికల సమయం దగ్గరపడుతున్న వేళ మళ్ళీ తెర మీదకు వచ్చారు. తనని చూసి మిగతా నాయకులు భయపడుతున్నారని, తానే ఏపీకి కాబోయే సీఎం నని మీడియా ముందు తెగ హడావుడి చేస్తున్నారు. ఆయన చెప్పే మాటలకు ఓట్లు వస్తాయో రావో తెలీదు కానీ.. ఆయన మాటల వీడియోలు మాత్రం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అయితే ఆయన మాటలు విని కొందరు నవ్వుకుంటున్నారు కానీ రాజకీయ విశ్లేషకులు మాత్రం వేరేలా ఆలోచిస్తున్నారు. కేఏ పాల్ వల్ల వచ్చే ఎన్నికల్లో వైసీపీకి ఎంతోకొంత నష్టం జరగవచ్చని అంచనా వేస్తున్నారు. కేఏ పాల్ చెప్పినట్లు వచ్చే ఎన్నికల్లో ఆయన సీఎం అవడం కష్టం కానీ.. పోటీ చేస్తే ఆయన పార్టీకి ఎంతో కొంతైనా క్రిస్టియన్ ఓట్లు పడే అవకాశముంది. అసలే వచ్చే ఎన్నికల్లో ప్రధాన పార్టీల మధ్య పోటీ నువ్వా నేనా అన్నట్టుగా  ఉండనుంది. మరి అలాంటప్పుడు కేఏ పాల్ వంటి వారు చీల్చే కొద్ది ఓట్లు కూడా ఫలితాల మీద ప్రభావం చూపుతాయి. అదే ఇప్పుడు ఏపీ రాజకీయ వర్గాల్లో చర్చకు దారి తీస్తోంది. టీడీపీకి మొదటినుంచి క్రిస్టియన్ ఓటు బ్యాంకు అంతగా లేదనే చెప్పాలి. గత ఎన్నికల్లో కూడా క్రిస్టియన్ ఓట్లలో మెజారిటీ  ఓట్లు వైసీపీకి పడ్డాయనే అభిప్రాయముంది. దీనిబట్టి చూస్తుంటే కేఏ పాల్ ఓట్లు చీల్చడం వల్ల టీడీపీకి కొత్తగా వచ్చే నష్టమేమి లేదు. నష్టమేదైనా ఉంటే వైసీపీకనే చెప్పాలి. కేఏ పాల్ ఎన్నికల బరిలోకి దిగితే కొద్దో గొప్పో క్రిస్టియన్ ఓట్లు పడతాయి తప్ప ఆయనకీ ఒరిగేదేమి లేదు. ఈ విషయం కేఏ పాల్ కి కూడా తెల్సే ఉంటుంది. అయినా కూడా అయన నేనే సీఎం అంటూ అంతలా ఎందుకు హడావుడి చేస్తున్నారు? ఆయన వెనుక ఎవరైనా ఉండి ఇదంతా నడిపిస్తున్నారా? అని సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కొందరైతే వైసీపీ ఓట్లు చీల్చేందుకే టీడీపీ కేఏ పాల్ ని తెరమీదకు తెచ్చిందని ఆరోపిస్తున్నారు. రాష్ట్ర రాజకీయాల్లో నాలుగున్నరేళ్ళుగా కనబడని కేఏ పాల్ ఇప్పుడు ఎందుకు హడావుడి చేసున్నారు ? వైసీపీకి పడే పది ఓట్లలో కనీసం కేఏ పాల్ ఒకటి, రెండు ఓట్లు ఆపినా ఆమేరకు లాభపడేది టీడీపీ నే. కాబట్టి టీడీపీనే కేఏ పాల్ ను తెరపైకి తెచ్చి ఉంటుందని కొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ ఆరోపణల్లో నిజమెంతో కేఏ పాల్ కే తెలియాలి.

షర్మిలకు షాకిచ్చిన జగన్.. కడప ఎంపీగా వైఎస్ భారతి!!

  ఏపీలో ఎన్నికల సమయం దగ్గర పడుతుండడంతో ప్రధాన పార్టీలన్నీ ఎన్నికల హడావుడిలో పడిపోయాయి. అభ్యర్థుల ఎంపిక, వ్యూహాల రచనతో పార్టీలు బిజీ బిజీగా ఉన్నాయి. అయితే ఇంకా పార్టీలు అధికారికంగా అభ్యర్థులను ప్రకటించకుండానే.. 'అక్కడి నుంచి వీళ్ళు పోటీ చేస్తున్నారు, ఇక్కడి నుంచి వాళ్ళు పోటీ చేసున్నారు' అంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇప్పటికే గుడివాడలో కొడాలి నానికి పోటీగా టీడీపీ తరుపున దేవినేని అవినాష్ బరిలోకి దిగుతాడని వార్తలొచ్చాయి. అదే విధంగా వైసీపీ అధినేత వైఎస్ జగన్ సోదరి షర్మిల కడప నుంచి ఎంపీగా పోటీ చేస్తారంటూ వార్తలొచ్చాయి. అయితే ఇప్పుడు మరో ఆసక్తికరమైన వార్త చక్కర్లు కొడుతోంది. కడప ఎంపీగా వైఎస్ జగన్ సతీమణి వైఎస్ భారతి బరిలోకి దిగబోతున్నారట. 2014 ఎన్నికల్లో కడప ఎంపీగా అవినాష్ రెడ్డి వైసీపీ నుంచి విజయం సాధించారు. అయితే ఏపీకి ప్రత్యేక హోదా డిమాండ్ తో వైసీపీ ఎంపీలు రాజీనామా చేసారు. వారిలో అవినాష్ రెడ్డి కూడా ఉన్నారు. మరో రెండు నెలల్లో ఏపీలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఈసారి కూడా కడప ఎంపీగా వైసీపీ తరుపున అవినాష్ రెడ్డి బరిలోకి దిగుతారని భావించారంతా. కానీ జగన్ మాత్రం మరోలా ఆలోచిస్తున్నారట. దానికి కారణం మంత్రి ఆదినారాయణ రెడ్డి. 2014 ఎన్నికల్లో ఆదినారాయణ రెడ్డి జమ్మలమడుగు నియోజకవర్గం నుంచి వైసీపీ తరుపున ఎమ్మెల్యేగా గెలుపొందారు. అనంతరం టీడీపీలో చేరి మంత్రి అయ్యారు. అయితే ప్రస్తుతం కడప టీడీపీలో చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో.. టీడీపీ తరుపున కడప ఎంపీగా ఆదినారాయణ రెడ్డిని బరిలోకి దించాలన్న ఆలోచనలో చంద్రబాబు ఉన్నట్లు తెలుస్తోంది. అదే జరిగితే ఆదినారాయణ రెడ్డి నుంచి అవినాష్ రెడ్డికి గట్టి పోటీ తప్పదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. వైసీపీకి కడప కంచుకోటలా చెప్పుకుంటారు. అలాంటి చోట టీడీపీ ఎంపీ గెలిస్తే ఇంకేమన్నా ఉందా? వైసీపీకి తీవ్ర నష్టం జరగుతుంది. అందుకే జగన్.. అవినాష్ రెడ్డి కంటే తన కుటుంబం నుంచే ఎవరినైనా బరిలోకి దించడం బెటర్ అనుకుంటున్నారట. దానివల్ల ఆదినారాయణ రెడ్డికి షాక్ ఇచ్చినట్లు ఉంటుంది. అదేవిధంగా కడపలో వైసీపీ బలం అలాగే ఉందని రుజువు చేసినట్టు ఉంటుందని జగన్ భావిస్తున్నారట. అయితే జగన్ కుటుంబం నుంచి ఇప్పటికే రాజకీయ అనుభవం ఉన్న ఆయన తల్లి విజయమ్మ, సోదరి షర్మిల ఉన్నారు. కానీ జగన్ మాత్రం సతీమణి భారతి వైపే మొగ్గుచూపుతున్నారట. గత ఎన్నికల్లో విజయమ్మ విశాఖ ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. దీంతో వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడానికి ఆమె అంతగా ఆసక్తి కనబరచట్లేదట. అయితే షర్మిల మాత్రం వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా పోటీ చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా కడప ఎంపీగా పోటీ చేయడానికి ఆమె ఆసక్తి కనబరుస్తున్నారట. అయితే జగన్ మాత్రం భారతిని కడప ఎంపీ బరిలో దింపి.. షర్మిలను విశాఖ లేదా అనంతపురం ఎంపీగా పోటీ చేయించాలి అనుకుంటున్నారట. మరి ఈ వార్తల్లో నిజమెంతో తెలీదు కానీ.. ఇదే జరిగితే కడప ఎంపీగా పోటీ చేయాలని భావిస్తున్న షర్మిలకు జగన్ షాక్ ఇచ్చినట్లే అవుతుంది.

ఖమ్మం ఎంపీగా కేసీఆరా? రాహుల్ గాంధీనా?

  తెలంగాణ రాజకీయాల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాకు ప్రత్యేక స్థానముంది. ఇక్కడ ఎన్నికల ఫలితాలు పూర్తి భిన్నంగా ఉంటాయి. అయితే ఇప్పుడు ఖమ్మం గురించి ఓ ఆసక్తికరమైన చర్చ జరుగుతుంది. త్వరలో లోక్ సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రధాన పార్టీల దృష్టి ఖమ్మం ఎంపీ స్థానం మీద పడింది. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఖమ్మం ఎంపీగా పోటీ చేయాలని టీఆర్ఎస్ శ్రేణులు భావిస్తుంటే.. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఖమ్మం ఎంపీ బరిలోకి దిగాలని కాంగ్రెస్ శ్రేణులు భావిస్తున్నాయి. మరి వీరిద్దరిలో ఏ ఒక్కరు ఖమ్మం నుంచి పోటీ చేసినా సంచలనం అవ్వడం ఖాయం. ఈమధ్య జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ 88 స్థానాలు గెలుచుకొని సత్తా చాటింది. అయితే ఖమ్మంలో మాత్రం టీఆర్ఎస్ కు చేదు ఫలితాలు వచ్చాయనే చెప్పాలి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మొత్తం 10 అసెంబ్లీ సీట్లు ఉంటే.. టీఆర్ఎస్ కేవలం ఒక్క సీటుతో సరిపెట్టుకుంది. తెలంగాణలో దాదాపు అన్ని జిల్లాల్లో బలంగా ఉన్న టీఆర్ఎస్.. ఖమ్మంలో మాత్రం ఆశించిన స్థాయిలో బలపడలేదు. అందుకే టీఆర్ఎస్ ఖమ్మం మీద ప్రత్యేక దృష్టి పెట్టింది. ఖమ్మంలో గులాబీ జెండా ఎగిరేలా చేయాలి అనుకుంటుంది. దానికి త్వరలో జరగబోయే లోక్ సభ ఎన్నికలే కరెక్ట్ టైం అని భావిస్తోంది. ఇప్పటికే కేసీఆర్, కేటీఆర్ ఖమ్మం ఎంపీ సీటు గెలుపు కోసం కసరత్తులు మొదలుపెట్టారు. అయితే కొందరు టీఆర్ఎస్ నేతలు అధిష్టానం దృష్టికి ఒక ఆసక్తికరమైన అంశం తీసుకెళ్లారట. అదేంటంటే కేసీఆర్ ఖమ్మం ఎంపీగా పోటీ చేయాలి. కేసీఆర్ పోటీ చేయడం వల్ల ఎంపీ సీటు ఈజీగా గెలవడంతో పాటు.. జిల్లాలో పార్టీ బలపడుతుందని సూచించారట. దీంతో కేసీఆర్ ఆలోచనలో పడ్డారట. ప్రస్తుతం ఎంపీగా ఉన్న పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని ఎమ్మెల్సీ చేసి, మంత్రి పదవి ఇచ్చి..  తాను ఎంపీగా పోటీ చేస్తే ఎలా ఉంటుందని ఆలోచిస్తున్నారట. మరి ప్రస్తుతం జాతీయ రాజకీయాల మీద దృష్టి పెడుతున్న కేసీఆర్.. ఖమ్మం నుంచి వేరొకరితో పోటీ చేయించి రిస్క్ చేసే కంటే.. తానే పోటీ చేస్తే ఖచ్చితంగా ఖమ్మం సీటు తమ ఖాతాలో పడుతుందని భావించి బరిలోకి దిగుతారేమో చూడాలి. టీఆర్ఎస్ నేతలు కేసీఆర్ కు చెప్పినట్లుగానే.. కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీకి ఖమ్మం ఎంపీగా పోటీ చేస్తే బావుంటుందని సలహా ఇచ్చారట. రాహుల్ గాంధీతో తెలంగాణ కాంగ్రెస్ నేతలు మంగళవారం భేటీ అయ్యారు. ఈ భేటీలో అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి, లోక్ సభ ఎన్నికల కసరత్తు గురించి చర్చించారు. ఈ సందర్భంగా.. ఖమ్మం ఎంపీగా పోటీ చేయాలని పొంగులేటి సుధాకర్ రెడ్డి.. రాహుల్ ని కోరారు. గతంలో ఇందిరా గాంధీ తెలంగాణ నుంచి పోటీ చేసిన విషయాన్ని గుర్తుచేశారు. దీనికి రాహుల్ నవ్వుతూ.. చూద్దాం లే అని సమాధానం చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, టీడీపీల కూటమి ఖమ్మంలో సత్తా చాటింది. లోక్ సభ ఎన్నికల్లో కూడా కలిసి పోటీ చేస్తే ఎంపీ సీటు గెలిచే అవకాశముంది. అయితే అభ్యర్థి ఎవరనేది అసలు సమస్య. గతంలో టీడీపీ తరపున ఎంపీగా పనిచేసిన నామా నాగేశ్వరరావు.. మొన్న ఖమ్మం నుంచి ఎమ్మెల్యేగా పోటీచేసి ఓడిపోయారు. దీంతో ఆయన ఎంపీగా పోటీ చేసే అవకాశం లేదు. ఇక కాంగ్రెస్ నుంచి ముందుగా వినిపించే పేరు రేణుక చౌదరి. సీనియర్ నేత, గతంలో ఎంపీగా పనిచేసారు. అయితే ఇప్పుడున్న వర్గపోరులో ఆమెకి మిగతా నేతలు సహకరించడం కష్టమే. అందుకే సుధాకర్ రెడ్డి వంటి నేతలు రాహుల్ ని పోటీ చేయమని కోరుంటారు. అయితే రాహుల్ ఖమ్మం నుంచి పోటీ చేసే అవకాశం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఆయన యూపీలోని అమేథీ నుంచి పోటీ చేస్తుంటారు. ఈసారి కూడా అక్కడి నుంచే పోటీ చేసే అవకాశముంది. చూద్దాం మరి ఏం జరుగుతుందో.

ఎన్నికలంటే చంద్రబాబు అంతలా భయపడుతున్నారా?

  తెలుగుదేశం పార్టీ. 37 సంవత్సరాల చరిత్ర ఉన్న పార్టీ. స్థాపించిన 9 నెలల్లోనే అధికారంలోకి వచ్చిన పార్టీ. జాతీయ స్థాయిలో తిరుగులేని పార్టీగా పేరున్న కాంగ్రెస్ ని ఢీ కొట్టిన పార్టీ. మరి అలాంటి పార్టీ ఎన్నికలకు భయపడుతోందా? ఎన్నికలు వచ్చిన ప్రతిసారి ఏదోక పార్టీతో పొత్తు ఎందుకు పెట్టుకుంటుంది? ఇవి సగటు టీడీపీ కార్యకర్తను వేధిస్తున్న ప్రశ్నలు. బీజేపీ, టీఆర్ఎస్, వామపక్షాలు, జనసేన ఇలా దాదాపు అన్ని పార్టీలతో ఏదోక ఎన్నికల్లో టీడీపీ కలిసి పనిచేసింది. అంతెందుకు ఈ మధ్య జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో 37 ఏళ్ళ విరోధాన్ని పక్కన పెట్టి కాంగ్రెస్ తో కూడా కలిసి పనిచేసింది. ఆ సమయంలో ఇక టీడీపీ పొత్తుపెట్టుకోకుండా మిగిలింది ఏపీ ప్రతిపక్ష పార్టీ వైసీపీనే అంటూ విమర్శలు కూడా వినిపించాయి. తెలంగాణలో అంటే టీడీపీ మునుపటిలా బలంగా లేదు. తప్పనిసరి పరిస్థితుల్లో కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుంది అనుకున్నాం. మరి ఏపీలో ఏమైంది. ఏపీలో టీడీపీ అధికారంలో ఉంది. రోజురోజుకి మరింత బలపడుతుంది. అయినా ఒంటరిగా పోటీ చేస్తామని కుండబద్దలు కొట్టినట్టుగా ఎందుకు చెప్పట్లేదు. తెలంగాణలో టీడీపీ పరిస్థితి ఎలా ఉందో.. ఏపీలో కాంగ్రెస్ పరిస్థితి ఆలా ఉంది. ఒక్క సీటు అయినా గెలుస్తుందని నమ్మకం లేకపోయినా.. కాంగ్రెస్ మొత్తం 175 స్థానాల్లో ఒంటరిగా పోటీ చేస్తామని ధైర్యంగా చెప్తుంది. మరి 175 స్థానాల్లో బలంగా ఉన్న టీడీపీకి ఆ ధైర్యం ఏమైంది? ఎందుకు వచ్చే ఎన్నికల్లో ఏదైనా పార్టీ తమతో కలిసి వస్తుందా అని ఎదురుచూస్తుంది? అంటూ టీడీపీ కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 'టీడీపీ కొత్తగా వచ్చిన పార్టీ కాదు. ఏపీలో బలంగా లేని పార్టీ కాదు. మరి అలాంటప్పుడు మిగతా పార్టీలతో పొత్తు ఎందుకు?. పొత్తు వల్ల టీడీపీకే నష్టం తప్ప ఒరిగేదేమి లేదు. ఆ పార్టీలకు కొన్ని స్థానాలు కేటాయించడం వల్ల.. పార్టీ కోసం కష్టపడి పనిచేసిన ఆశావహుల్లో అసంతృప్తి పెరుగుతుంది. అదీగాక ఇంతకాలం వ్యతిరేకించిన వారితో కలిసి పనిచేయాలంటే ఇబ్బందిగా ఉంటుంది' అని టీడీపీ కార్యకర్తలు అభిప్రాయపడుతున్నారు. మరి ఏపీలో ఒంటరిగా పోటీచేసినా అధికారంలోకి వచ్చే అవకాశం ఉండి కూడా టీడీపీ అధినేత ఇతర పార్టీల వైపు ఎందుకు చూస్తున్నారో? ఇకనైనా కార్యకర్తల ఆవేదన పట్టించుకోని ఒంటరిగా బరిలోకి దిగుతారేమో చూడాలి.

కేంద్ర బడ్జెట్ లో కేసీఆర్ మార్క్.. టీఆర్ఎస్ కు బోలెడంత మైలేజ్!!

  తెలంగాణలో కేసీఆర్ కు రైతుబంధు పథకం ఎంత మైలేజ్ తీసుకొచ్చిందో తెలిసిందే. ఈమధ్య జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ ఘన విజయం సాధించడానికి ఓ రకంగా రైతు బంధు పథకం కూడా కారణమనే చెప్పాలి. రైతు బంధు ప్రజల్లోకి బాగా వెళ్ళింది. పక్క రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా ఈ పథకాన్ని అమలు చేయడానికి సిద్ధమవుతున్నాయి. కేసీఆర్ కూడా ఈ పథకం దేశవ్యాప్తంగా ఉండాలని ఇప్పటికే అన్నారు. కేసీఆర్ ప్రస్తుతం 'ఫెడరల్ ఫ్రంట్' తో జాతీయ రాజకీయాల్లో తన మార్క్ చూపించడానికి సిద్దమైన విషయం తెలిసిందే. 'ఫెడరల్ ఫ్రంట్' అజెండాలో రైతు బంధు ఉంది. ఫెడరల్ ఫ్రంట్ వస్తే.. దేశవ్యాప్తంగా రైతు బంధు అమలు చేస్తామని కేసీఆర్ స్వయంగా ప్రకటించారు. అయితే ఇప్పుడు కేంద్రం కేసీఆర్ బాటలో నడుస్తుంది. తెలంగాణలో కేసీఆర్ కి మైలేజ్ తెచ్చిన.. అలాగే ఇతర రాష్ట్రాల్లో సీఎంలకు మైలేజ్ తీసుకురావడానికి సిద్దమైన పథకానికి కేంద్రం శ్రీకారం చుట్టింది. దీంతో దేశవ్యాప్తంగా రైతులకు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తోంది. ఈరోజు కేంద్రం బడ్జెట్ ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. అయితే ఈ బడ్జెట్ లో కేసీఆర్ మార్క్ కనిపించింది. తెలంగాణలో విజయవంతంగా అమలవుతున్న రైతుబంధు పథకం తరహాలోనే దేశవ్యాప్తంగా ఉన్న చిన్న, సన్నకారు రైతులకు నగదు బదిలీ పథకాన్ని బీజేపీ ప్రభుత్వం ప్రకటించింది. కిసాన్ సమ్మాన్ నిధి పేరుతో ప్రవేశపెట్టిన ఈ పథకాన్ని గత ఏడాది డిసెంబర్ నుంచే అమలు చేయబోతున్నట్టు కేంద్రం ప్రకటించింది. ఐదెకరాల లోపు ఉన్న రైతుల బ్యాంక్ అకౌంట్‌లోకి ఏడాదికి ఆరు వేల రూపాయలు జమ చేయనున్నట్టు బడ్జెట్ ప్రవేశపెట్టిన కేంద్రమంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. మూడు విడతల్లో ఈ మొత్తానికి జమ చేస్తామని ప్రకటించారు. ఇందుకోసం రూ. 75 వేల కోట్ల రూపాయలు ఖర్చవుతుందని అన్నారు. ఈ పథకం ద్వారా దేశంలోని  12కోట్లమంది రైతులకు లబ్ది కలుగుతుందని తెలిపారు. అయితే 6 వేలు.. మూడు విడతలంటే రైతులు నుంచి స్పందన ఎలా ఉంటుందో తెలీదు కానీ.. కేంద్రం నిర్ణయం కేసీఆర్ ప్రభుత్వానికి అన్ని విధాలా కలిసొచ్చేలా ఉంది. కేంద్రం కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని ప్రవేశపెట్టడం ద్వారా.. రైతుబంధు పథకానికి కేంద్రం నుంచి నిధులు రానున్నాయి. ఆ రకంగా తెలంగాణ ప్రభుత్వానికి ఏటా కొన్ని వేల కోట్ల రూపాయల నిధులు ఆదా కావొచ్చని తెలుస్తోంది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో రైతు బంధు పథకం మొత్తాన్ని పెంచాలని నిర్ణయించుకున్న తెలంగాణ ప్రభుత్వానికి కేంద్రం తీసుకున్న నిర్ణయం కలిసొచ్చిందనే టాక్ వినిపిస్తోంది. మరోవైపు కేంద్రం.. రైతుబంధు పథకాన్ని అమలు చేయడంపై టీఆర్ఎస్ వర్గాల్లో హర్షం వ్యక్తమవుతోంది. తెలంగాణ ప్రభుత్వం మోడల్‌ను కేంద్రం అమలు చేసిందనే క్రెడిట్ తమకు దక్కుతుందని టీఆర్ఎస్ నేతలు భావిస్తున్నారు. లోక్ సభ ఎన్నికల ప్రచారంలో ఈ అంశం తమకు ఉపయోగపడుతుందని ఆశిస్తున్నారు. రైతు సంక్షేమంలో కేంద్రం కూడా తమను ఫాలో అవుతుందని చెప్పుకోవడానికి టీఆర్ఎస్ ప్రభుత్వానికి అవకాశం లభించింది. మరి ఈ అవకాశాన్ని టీఆర్ఎస్ ఎలా వినియోగించుకుంటుందో చూడాలి.

పవన్ కళ్యాణ్ బిగ్ మిస్టేక్ చేసారా?

  వచ్చే ఎన్నికల్లో ఏపీలో త్రిముఖ పోరు జరిగే అవకాశాలున్నాయి. కాంగ్రెస్, బీజేపీ పార్టీలు కూడా బరిలో ఉన్నప్పటికీ.. ప్రధాన పోటీ మాత్రం టీడీపీ, వైసీపీ, జనసేన మధ్యే జరిగే అవకాశముంది. రాష్ట్రాన్ని విభజించిన పార్టీగా కాంగ్రెస్ ఏపీలో వ్యతిరేకత మూటగట్టుకుంది. ఆ ప్రభావంతోనే 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ ఒక్క సీటు కూడా గెలవలేదు. అయితే కేంద్రంలో అధికారంలోకి వస్తే ఏపీ ప్రజల ఆకాంక్ష అయిన 'ప్రత్యేక హోదా' మీద తొలి సంతకం పెడతామని హామీ ఇవ్వడంతో.. కాంగ్రెస్ మీద ఏపీ ప్రజల్లో వ్యతిరేకత తగ్గింది. దీనివల్ల కాంగ్రెస్ కి కాస్త ఓటు శాతం పెరుగుతుంది కానీ.. మరీ సీట్లు గెలిచే అంత పుంజుకుంటుందని మాత్రం చెప్పలేం. ఇక బీజేపీది కూడా ఇంచుమించు కాంగ్రెస్ పరిస్థితే. 2014 ఎన్నికల సమయంలో ప్రత్యేక హోదా సహా విభజన హామీలన్నీ నెరవేరుస్తాం అన్నారు. ఆ ఎన్నికల్లో టీడీపీ, జనసేన మద్దతు కూడా ఉండటంతో బీజేపీ కొన్ని సీట్లు గెలుచుకుంది. అయితే తరువాత ప్రత్యేక హోదా మరియు విభజన హామీల విషయంలో యూ టర్న్ తీసుకుంది. దీంతో కాంగ్రెస్ లాగానే బీజేపీ కూడా ఏపీ ప్రజల్లో వ్యతిరేకత మూటగట్టుకుంది. వచ్చే ఎన్నికల్లో బీజేపీకి.. గత ఎన్నికల్లో కాంగ్రెస్ కి ఎదురైన అనుభవం ఎదురైనా ఆశ్చర్యం లేదు. కాంగ్రెస్, బీజేపీలు జాతీయ పార్టీలుగా పోటీ చేసి తమ ఓటుబ్యాంకుని కాపాడుకుంటాయి తప్ప.. ఏపీలో అద్భుతాలు చేసే అవకాశంలేదు. అంటే ఇక ప్రధాన పోటీ టీడీపీ, వైసీపీ, జనసేనల మధ్యే. ఏపీలో అధికార పార్టీ టీడీపీ వచ్చే ఎన్నికల్లో కూడా సత్తా చాటి అధికారం నిలిబెట్టుకోవాలనుకుంటుంది. ఇక ప్రతిపక్ష వైసీపీ కూడా టీడీపీని ఎలాగైనా గద్దె దించి అధికారం పొందాలని చూస్తోంది. ఓ రకంగా టీడీపీతో నువ్వా నేనా అన్నట్టు పోరుకి సిద్ధమైంది. ఇక మిగిలింది జనసేన. గత ఎన్నికల్లో టీడీపీకి మద్దతిచ్చిన జనసేన ఇప్పుడు వామపక్షాలతో కలిసి టీడీపీ, వైసీపీల మీద పోరుకి సిద్దమైంది. ఇదే పవన్ కళ్యాణ్ చేస్తున్న బిగ్ మిస్టేక్ అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఎందుకంటే వామపక్షాలు ఒకప్పటిలా కొద్ది స్థానాల్లో కూడా బలంగా లేవు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో చూశాం కదా. గతంలో కనీసం ఒకటి రెండు సీట్లైనా గెలిచే వామపక్షాలు ఈసారి ఒక్క సీటు కూడా గెలవలేదు. ఓటు శాతం కూడా బాగా తగ్గిపోయింది. ఏపీలో కూడా వామపక్షాల పరిస్థితి అలాగే ఉంది. మరిప్పుడు పవన్ వామపక్షాలతో కలిసి పోటీ చేయడం వల్ల ప్రయోజనం ఏంటనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఏపీలో మొత్తం 175 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. వాటిల్లో కొన్ని సీట్లు వామపక్షాలకు కేటాయించాలి. మరి వామపక్షాల ఎంతవరకు ఆ సీట్లు గెలుచుకోగలవు?. ఒకవేళ ఓడిపోతే జనసేనకు ఆ సీట్లు నష్టమే కదా. అసలే జనసేన మొదటిసారి ఎన్నికల బరిలో నిలుస్తుంది. మిగతా పార్టీలకు భిన్నంగా రాజకీయం చేయాలనుకుంటుంది. మరి మొదటిసారి పోటీ చేస్తున్న జనసేనకు ప్రతి సీటు ముఖ్యమే కదా. ఈ విషయం పవన్ కి కూడా తెలుసు. మరి పవన్ వామపక్షాలతో ఎందుకు కలిసి పని చేస్తున్నారంటే.. పవన్ రాజకీయ లాభం ఆశించి కాదు.. వామపక్షాల సిద్ధాంతాలు నచ్చి వాటితో కలిసి నడుస్తున్నారని జనసైనికులు అంటున్నారు. మరి పవన్ వామపక్షాలకు ఎన్ని సీట్లు కేటాయిస్తారో? ఎన్ని సీట్లలో విజయాన్ని అందిస్తారో? చూడాలి.

ఆపరేషన్ ప్రియాంక గాంధీ ఫలిస్తుందా?

  జాతీయ రాజకీయాల్లో ప్రస్తుతం బాగా వినిపిస్తున్న పేరు ప్రియాంక గాంధీ. ఇన్నాళ్లు ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చిన ప్రియాంక.. రీసెంట్ గా ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, ప్రియాంకను.. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా, ఉత్తరప్రదేశ్ తూర్పు ఇంఛార్జ్ గా నియమించారు. దీంతో ప్రియాంక పొలిటికల్ ఎంట్రీ ఆఫీసియల్ అయింది. పోలికల్లో నాయనమ్మ 'ఇందిరా గాంధీ' లా ఉండే ప్రియాంక పొలిటికల్ ఎంట్రీ కోసం కాంగ్రెస్ శ్రేణులు ఎప్పటినుంచో ఎదురుచూసాయి. పోలికల్లోనే కాదు ఆవభావాలు, మాట తీరు ఇలా అన్నిట్లో ఇందిరాను గుర్తు చేస్తుంటుంది ప్రియాంక. అందుకే కాంగ్రెస్ లో ప్రియాంకను అభిమానించే వారు ఎక్కువ. ప్రియాంక ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాకముందే.. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ తరపున ప్రచారం చేస్తుండేవారు. ప్రియాంక ప్రచారానికి విశేష స్పందన వచ్చేది. ఓ రకంగా ప్రియాంక ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాకముందే తనదైన ముద్ర వేశారు. ఇప్పుడు ప్రియాంక ఎంట్రీతో కాంగ్రెస్ శ్రేణుల్లో నూతనోత్సాహం వచ్చింది. అయితే ప్రస్తుతం ప్రియాంక ముందున్న ప్రధాన లక్ష్యం.. యూపీలో కాంగ్రెస్ కి పూర్వవైభవం తీసుకొచ్చే ప్రయత్నం చేయడం. కేంద్రంలో అధికారం కావాలంటే యూపీలో గట్టిపట్టు ఉండాలన్నది రాజకీయ నానుడి. ఎందుకంటే ఇక్కడ అత్యధికంగా 80 ఎంపీ సీట్లు ఉన్నాయి. యూపీలో ఒకప్పుడు కాంగ్రెస్ కి గట్టిపట్టు ఉండేది. కానీ తరువాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. 2014 ఎన్నికల్లో యూపీలోని మొత్తం 80 ఎంపీ సీట్లలో కాంగ్రెస్‌ విజయం సాధించింది కేవలం 2 మాత్రమే. 2014లో రాయబరేలి, అమేథీల నుంచి సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ మాత్రమే విజయం సాధించారు. కేంద్రంలో అధికారం కావాలంటే యూపీలో పట్టు అవసరమని భావించిన కాంగ్రెస్.. ఇప్పుడు ప్రియాంకను రంగంలోకి దింపింది. దీంతో యూపీ రాజకీయం గరంగరంగా మారింది. గత ఎన్నికల్లో మోదీ ప్రభంజనంలో కాంగ్రెస్‌, బీఎస్పీ, ఎస్పీ యూపీలో కొట్టుకుపోయాయి. వారణాసి నుంచి మోదీ పోటీచేసి భారీ ఆధిక్యంతో గెలుపొందారు. యూపీలో బీజేపీ 71 స్థానాలు గెలుచుకుంటే.. ఎస్పీ 5, కాంగ్రెస్ 2 స్థానాలతో సరిపెట్టుకున్నాయి. ఇక బీఎస్పీ అయితే ఖాతా కూడా తెరవలేదు. అయితే ఇప్పుడు యూపీ రాజకీయాలు మారిపోయాయి. ఎస్పీ, బీఎస్పీ జతకట్టాయి. దీంతో బీజేపీకి కొన్ని సీట్లు తగ్గే అవకాశాలున్నాయి. తాజాగా కొన్ని సర్వేలు కూడా అదే చెప్తున్నాయి. ఎస్పీ, బీఎస్పీ లతో కలిసి కాంగ్రెస్ పోటీ చేస్తే యూపీలో బీజేపీకి ఘోర పరాజయం తప్పదని సర్వేలు చెప్తున్నాయి. అయితే ఎస్పీ, బీఎస్పీ మాత్రం ఎందుకో కాంగ్రెస్ తో పొత్తుకి దూరంగా ఉంటున్నాయి. సోనియాగాంధీ, రాహుల్‌గాంధీల స్థానాలు రాయబరేలి, అమేథీలు మాత్రం కాంగ్రెస్ కు వదిలేస్తాం అంటున్నాయి. అంటే దాదాపు కాంగ్రెస్ యూపీలో ఒంటరి పోరే అనమాట. కాంగ్రెస్ ఒంటరిగా పోటీ చేస్తే మళ్ళీ 2 సీట్లకే పరిమితమయ్యే ప్రమాదముంది. యూపీలో కాంగ్రెస్ పరిస్థితి ఇలా అవ్వడానికి కారణం ప్రజాకర్షకనేత లేకపోవడం అని భావించిన కాంగ్రెస్ ఇప్పుడు ప్రియాంకను రంగంలోకి దింపింది. దీనివల్ల గతంలో ఇందిరా గాంధీని అభిమానించే వాళ్ళు, అదేవిధంగా ప్రియాంకను వ్యక్తిగతంగా అభిమానించే యువత కాంగ్రెస్ వైపు వచ్చే అవకాశాలున్నాయి. అదేవిధంగా యూపీలో కుల సమీకరణాలు అధికంగా ఉంటాయి. కాంగ్రెస్‌కు ఓటు బ్యాంకుగా ఉన్న బ్రాహ్మణులు,ఠాకూర్లు బీజేపీ వైపు మళ్లారు. ఎస్సీలు బీఎస్పీ శిబిరంలో చేరగా.. ముస్లింలు సమాజ్‌వాదీ పార్టీకి సానుకూలంగా మారారు. దీంతో యూపీలో కాంగ్రెస్ కి కష్టాలు మొదలయ్యాయి. అయితే ప్రియాంక రాకతో ఇన్నాళ్లుగా పార్టీకి దూరమైన వర్గాలు మళ్లీ దగ్గరకు వస్తాయని కాంగ్రెస్‌ శ్రేణులు ఆశిస్తున్నాయి. ఇప్పటికిప్పుడు యూపీలో కాంగ్రెస్ కి పూర్వవైభవం రాకపోయినప్పటికీ.. కనీసం 20 ఎంపీ సీట్లైనా గెలవాలని కాంగ్రెస్ టార్గెట్ గా పెట్టుకుందట. మరి కాంగ్రెస్ శ్రేణులు భావిస్తున్నట్లు ప్రియాంక రాక కాంగ్రెస్ కి కలిసి వస్తుందా?. యూపీలో కాంగ్రెస్ పట్టు సాధిస్తుందా?. తెలియాలంటే లోక్ సభ ఎన్నికల వరకు వేచి చూడాల్సిందే. చూద్దాం మరి ఏం జరుగుతుందో.

దగ్గుబాటి ఫ్యామిలీ.. తలా ఒక పార్టీ.. జగన్ కి తలనొప్పి!!

  ఎన్నికల సమయం దగ్గరపడినప్పుడు పాలిటిక్స్ ఇచ్చే కిక్.. సూపర్ హిట్ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా కూడా ఇవ్వలేదు. ఎన్నికలు వస్తున్నాయంటే చాలు.. నాయకులు ఆ పార్టీ నుంచి ఈ పార్టీలోకి, ఈ పార్టీ నుంచి ఆ పార్టీలోకి జంప్ చేస్తూ ఉంటారు. జంపింగుల వల్ల పార్టీలకు కొన్నిసార్లు లాభాలు ఉంటే కొన్నిసార్లు తలనొప్పులు వస్తాయి. ప్రస్తుతం ఏపీలో రాజకీయాలు ఎవరి ఊహలకు అందట్లేదు. ఏ నాయకుడు ఎప్పుడు ఏ పార్టీలో చేరతారో అర్థంకావట్లేదు. దగ్గుబాటి కుటుంబం నుంచి హితేష్ వైసీపీలో చేరడానికి సిద్దమవుతున్న విషయం తెలిసిందే. తాజాగా దగ్గుబాటి వెంకటేశ్వరరావు తన కుమారుడు హితేష్ తో కలిసి వెళ్లి జగన్ తో భేటీ అయిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా వెంకటేశ్వరరావు.. తన కుమారుడు వైసీపీ నుండి పోటీ చేయడానికి ఆసక్తి కనబరుస్తున్నారని తన మనసులో మాట చెప్పారు. అయితే ఇక్కడే ఓ పెద్ద ట్విస్ట్ ఉంది. దగ్గుబాటి కుటుంబం గతంలో కాంగ్రెస్ లో ఓ వెలుగు వెలిగింది. పురంధేశ్వరి కేంద్రమంత్రిగా కూడా పనిచేసారు. అయితే విభజన ఎఫెక్ట్ తో ఏపీలో కాంగ్రెస్ పరిస్థితి దారుణంగా తయారవడంతో గత ఎన్నికలు సమయంలో పురంధేశ్వరి బీజేపీలో చేరారు. వెంకటేశ్వరరావు మాత్రం ప్రత్యక్ష రాజకీయాలకు కాస్త దూరం పాటిస్తూ వస్తున్నారు. అయితే ఇప్పుడు వారసుడు వంతు వచ్చింది. బీజేపీతో భవిష్యత్తు కష్టం. ఏపీలో భవిష్యత్తు కావాలంటే పక్కా టీడీపీ, వైసీపీ లాంటి పార్టీలు కావాలి. టీడీపీని పురంధేశ్వరి తండ్రి స్వర్గీయ ఎన్టీఆర్ స్థాపించినప్పటికీ.. కొన్ని కారణాల వల్ల ఆమె టీడీపీకి దూరంగా ఉంటున్నారు. అందుకే కుమారుడిని వైసీపీ తరపున బరిలోకి దించాలనుకున్నారు. దానిలో భాగంగానే వెంకటేశ్వరరావు కుమారుడితో వెళ్లి జగన్ ని కలిశారు. అయితే వెంకటేశ్వరావు.. జగన్ ని ఆలోచనలనో పడేసే, ఓ రకంగా చెప్పాలంటే తలనొప్పి తెప్పించే విషయం చెప్పారట. అదేంటంటే పురంధేశ్వరి బీజేపీలోనే కొనసాగుతారు. హితేష్ మాత్రం వైసీపీలో చేరతారు అని చెప్పారట. దీంతో జగన్ కి తలనొప్పి మొదలైంది. అదేంటి పురంధేశ్వరి బీజేపీలో కొనసాగితే జగన్ కి ఎందుకు తలనొప్పి అనుకుంటున్నారా. అక్కడే ఉంది అసలు మెలిక. మీకు పరకాల ప్రభాకర్ గుర్తున్నారు కదా. అదేనండి ఏపీ ప్రభుత్వానికి మీడియా సలహాదారుగా పనిచేసారు. ఆయన సతీమణి నిర్మల సీతారామన్ ఏమో బీజేపీ సర్కార్ లో రక్షణ శాఖ మంత్రిగా ఉన్నారు. ఇంకేముంది భర్త టీడీపీ సలహాదారు, భార్య బీజేపీ మంత్రి.. ఇది చాలు టీడీపీ, బీజేపీ కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నాయని చెప్పడానికి అంటూ వైసీపీ విమర్శలు చేయడం మొదలుపెట్టింది. ఒకే కుటుంబంలో వేరు వేరు పార్టీలను అభిమానించడం సహజం, ఎవరి వ్యక్తిగత అభిప్రాయాలు వారికి ఉంటాయి అని పరకాల చెప్పే ప్రయత్నం చేసినా విమర్శలు ఆగలేదు. దీంతో పరకాల సలహాదారుగా రాజీనామా చేసారు. ఎవరి తీసుకున్న గోతిలో వారే పడినట్లు ఇప్పుడు వైసీపీ వంతు వచ్చింది. తల్లి బీజేపీ, కొడుకు వైసీపీలో ఉంటే.. బీజేపీ, వైసీపీవి కుమ్మక్కు రాజకీయాలు అంటూ విమర్శలు మొదలవుతాయి. ఎందుకంటే అది వైసీపీ చెప్పిన ఫార్ములానే కదా. దీంతో జగన్ కి ఏం చేయాలో అర్థంగాక బుర్ర బద్ధలవుతుందట. హితేష్ ని పార్టీలో చేర్చుకోవాలా వద్దా అని తెగ ఆలోచిస్తున్నారట. మరి కొడుకు రాజకీయ భవిష్యత్తు కోసం పురంధేశ్వరి బీజేపీని వీడుతారా లేక.. ఏదైతే అది అవుతుందిలే అని హితేష్ ని పార్టీలో చేర్పించుకొని జగన్ విమర్శలు ఎదుర్కుంటారో చూడాలి. అయితే హితేష్ వైసీపీ ఎంట్రీ వల్ల.. జగన్ కే కాదు దగ్గుబాటి కుటుంబానికి కూడా కష్టాలు మొదలయ్యాయి. దగ్గుబాటి కుటుంబం మీద కొందరు విమర్శలు చేస్తుంటే.. కొందరు జాలి చూపిస్తున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్, టీడీపీ కూటమితో దగ్గరైతే.. ఎన్టీఆర్ కాంగ్రెస్ కి వ్యతిరేకంగా టీడీపీని స్థాపించారు.. అలాంటి కాంగ్రెస్ తో టీడీపీ పొత్తు పెట్టుకుంటే ఎన్టీఆర్ ఆత్మ శాంతించదు అంటూ పురంధేశ్వరి మండిపడ్డారు. అయితే మరి మీరు కాంగ్రెస్ లో ఉన్నప్పుడు, కాంగ్రెస్ లో మంత్రిగా పనిచేసినప్పుడు ఎన్టీఆర్ ఆత్మ శాంతించిందా అంటూ తీవ్ర స్థాయిలో విమర్శలు ఎదుర్కొన్నారు. ఇప్పుడు కూడా అదేస్థాయిలో విమర్శలు ఎదురవుతున్నాయి. అప్పట్లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఎన్టీఆర్ పై తీవ్రస్థాయిలో విమర్శలు చేసేవారు. అప్పట్లో వైఎస్ తీరు ఎన్టీఆర్ కి నచ్చేది కాదు. మరి ఇప్పుడు కుమారుడిని.. వైఎస్ తనయుడు స్థాపించిన వైసీపీలో చేర్పిస్తే ఎన్టీఆర్ ఆత్మ శాంతిస్తుందా? అంటూ విమర్శలు ఎదురవుతున్నాయి. మరికొందరైతే దగ్గుబాటి వెంకటేశ్వరావుకి ఎన్టీఆర్ అల్లుడిగా.. టీడీపీ, కాంగ్రెస్ పార్టీల్లో పనిచేసిన సీనియర్ నేతగా గుర్తింపు, గౌరవం ఉండేవి. అలాంటి వ్యక్తి ఇప్పుడు కొడుకు టికెట్ కోసం తనకంటే జూనియర్ అయిన జగన్ ని బ్రతిమాలుకుంటున్నారు అంటూ జాలిపడుతున్నారు. మరి జగన్, దగ్గుబాటి కుటుంబం ఈ వ్యతిరేకతను ఎలా అధిగమిస్తుందో చూడాలి.

చిరంజీవి బాటలో పవన్.. ఎమ్మెల్యే పోటీలో ఊహించని ట్విస్ట్!!

  ప్రశ్నిస్తానంటూ జనసేన పార్టీ స్థాపించిన పవన్ కళ్యాణ్ 2014 ఎన్నికల్లో పోటీ చేయకుండా టీడీపీకి మద్దతు ఇచ్చారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత టీడీపీకి దూరం జరుగుతూ ప్రశ్నించడం మొదలుపెట్టారు. తరువాత పూర్తిగా దూరం జరిగి విమర్శలు చేస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో పవన్ పోటీకి కూడా సిద్ధమయ్యారు. ఏపీలోని మొత్తం 175 స్థానాల్లో వామపక్షాలతో కలిసి పోటీ చేస్తామని ఇప్పటికే పవన్ ప్రకటించారు. అయితే పవన్ వచ్చే ఎన్నికల్లో వైసీపీతో పొత్తు పెట్టుకుంటారని.. లేదా గత ఎన్నికల్లో లాగా వచ్చే ఎన్నికల్లో మళ్ళీ టీడీపీతో కలిసి పనిచేస్తారని ఇలా రకరకాల వార్తలు వచ్చాయి. వీటిని పవన్ ఎప్పటికప్పుడు ఖండిస్తూ వస్తున్నారు. జన సైనికులు కూడా పవన్ కి ఎవరితో పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం లేదంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇదంతా సరే.. జన సైనికులతో పాటు ఇప్పుడు సామాన్యులను ఓ ప్రశ్న వేధిస్తోంది. అదే పవన్ ఎమ్మెల్యేగా ఎక్కడినుంచి పోటీ చేస్తారు?. మొత్తం 175 స్థానాల్లో పోటీ చేస్తాం అంటున్నారు బాగానే ఉంది. మిగతా స్థానాల్లో ఎవరు పోటీ చేస్తారో తెలీదు కానీ ముందు పవన్ పోటీ చేసే స్థానం చెప్పండంటూ ప్రజలు తలలు పట్టుకుంటున్నారు. పవన్ తాను ఎమ్మెల్యేగా పోటీ చేసే స్థానం గురించి ఎంత కన్ఫ్యూజ్ అవుతున్నారో తెలీదు కానీ.. ప్రజలను మాత్రం బాగా కన్ఫ్యూజ్ చేస్తున్నారు. పవన్ ఒకసారి అనంతపురం నుంచి పోటీ చేస్తా అన్నారు. ఒకసారి శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నుంచి అన్నారు. మరోసారి తూర్పు గోదావరి జిల్లా పిఠాపురం అన్నారు. ఇలా ఒకోసారి.. ఒకో సభలో.. ఒకో పేరు చెప్పారు. దీంతో పవన్ అసలు ఏ స్థానం నుంచి పోటీ చేస్తారో అర్ధంగాక జనసైనికులు తలలు పట్టుకుంటున్నారు. తాను పోటీ చేసే స్థానం మీద స్పష్టత కోసం పవన్ తెగ కసరత్తులు చేస్తున్నారట. ఒకవైపు 175 స్థానాల్లో సరైన అభ్యర్థులను ఎంపిక చేసే పనిలో బిజీగా ఉంటూనే.. మరోవైపు తాను పోటీ చేసే స్థానం ఎంపిక విషయంలోనూ నిమగ్నమయ్యారట. ఇన్నిరోజులు పవన్ పోటీ చేసే స్థానం అంటూ అనంతపురం, ఇచ్చాపురం, పిఠాపురం ఇలా రకరకాల పురం పేర్లు వినిపించాయి. అయితే ఇప్పుడు కొత్తగా మరోపేరు తెరమీదకు వచ్చింది. అదే గతంలో చిరంజీవి ఎమ్మెల్యేగా పోటీచేసి గెలిచిన తిరుపతి. చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ స్థాపించి 2009 ఎన్నికల బరిలో దిగిన విషయం తెలిసిందే. ఆ ఎన్నికల్లో చిరంజీవి తిరుపతి, పాలకొల్లు రెండు నియోజకవర్గాల నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయగా.. తిరుపతి నుంచి గెలుపొందారు. తరువాత పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసారు. ఇప్పుడు మళ్ళీ సినిమాలతో బిజీ అయ్యారు. అయితే ఇప్పుడు ఎమ్మెల్యే పోటీ విషయంలో పవన్ కూడా తన అన్నయ్య చిరంజీవి బాటలోనే వెళ్లే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. పవన్ ఎక్కడ నుంచి పోటీ చేయాలని తర్జనభర్జన పడుతుండగా.. గతంలో అన్నయ్య చిరంజీవిని గెలిపించిన తిరుపతి నుంచి పోటీ చేయమని కొందరు మెగా అభిమానులు సూచించారట. దీనిపై పవన్ కూడా కాస్త సానుకూలంగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే కొందరు మాత్రం అప్పటి పరిస్థితి వేరు, ఇప్పుడు వేరు.. ఇప్పుడున్న పరిస్థితుల్లో తిరుపతి కంటే శ్రీకాకుళం జిల్లా లేదా గోదావరి జిల్లాల నుంచి పోటీ చేయడం మంచిదని సలహా ఇస్తున్నారట. ఇంకా కొందరైతే రెండు స్థానాల నుంచి పోటీ చేయమని సలహా ఇస్తున్నారట. దీంతో ఆలోచనలో పడ్డ పవన్ తిరుపతి, ఇచ్చాపురం, పిఠాపురంలలో ఏవైనా రెండు స్థానాల నుంచి పోటీ చేయాలనుకుంటున్నారట. మరి పవన్ గతంలో చిరంజీవికి విజయం అందించిన తిరుపతి నుంచి పోటీ చేస్తారేమో చూడాలి.

కొడాలి నానికి చెక్ పెట్టే దిశగా టీడీపీ.. ఓటమి తప్పదా?

  గుడివాడ. ఒకప్పుడు టీడీపీకి కంచుకోట. గతంలో ఎన్టీఆర్ ఇక్కడినుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 1983 నుంచి 2009 వరకు ఒక్కసారి తప్ప మిగతా అన్నిసార్లు గుడివాడలో టీడీపీనే గెలుస్తూ వచ్చింది. అలాంటి కంచుకోట.. గత ఎన్నికల్లో టీడీపీకి దూరమైంది. దానికి కారణం కొడాలి నాని. నందమూరి కుటుంబానికి.. మరీ ముఖ్యంగా హరికృష్ణ కుటుంబానికి సన్నిహితంగా ఉండే కొడాలి నాని.. 2004, 2009 ఎన్నికల్లో టీడీపీ తరుపున గుడివాడ ఎమ్మెల్యేగా గెలుపొందారు. తక్కువ సమయంలోనే గుడివాడలో తిరుగులేని నేతగా ఎదిగారు. అయితే ఆ తరువాత టీడీపీ అధినేత చంద్రబాబుతో విభేదాల కారణంగా నాని టీడీపీని వీడి వైసీపీలో చేరారు. అప్పటినుంచి టీడీపీ మీద విమర్శల చేయడం మొదలుపెట్టారు. ముఖ్యంగా చంద్రబాబుని టార్గెట్ చేస్తూ తీవ్రస్థాయిలో విరుచుకు పడుతున్నారు. ఇది టీడీపీ శ్రేణులకు మింగుడుపడని విషయం. టీడీపీ నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి, టీడీపీ వల్ల ఎదిగి ఇప్పుడు టీడీపీని విమర్శించడం ఏంటంటూ టీడీపీ నేతలు నాని మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ అధిష్టానం కూడా నాని విషయంలో సీరియస్ గానే ఉంది. ఈసారి గుడివాడలో నానికి ఎలాగైనా చెక్ పెట్టాలనుకుంటుంది. గత ఎన్నికల్లో నాని మీద పోటీగా.. టీడీపీ. రావి వెంకటేశ్వర రావుని బరిలోకి దింపింది. అయితే ఏపీలో టీడీపీ అధికారంలోకి వచ్చినప్పటికీ.. గుడివాడలో మాత్రం నాని గాలి వీయడంతో.. రావి 11 వేల పైచిలుకు ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఎమ్మెల్యేగా హ్యాట్రిక్ విజయం సాధించడంతో నాని గుడివాడలో తిరుగులేని నేతగా ఎదిగారు. ఇప్పుడు మళ్ళీ ఎన్నికల సమయం దగ్గరపడుతుండటంతో టీడీపీ గుడివాడ మీద ప్రత్యేక దృష్టి పెడుతోంది. ఈసారి నానికి ఎలాగైనా చెక్ పెట్టాలని చూస్తోంది. నాని దూకుడును త‌ట్టుకోగ‌లిగిన నేత కోసం టీడీపీ అన్వేషి స్తోంది. వచ్చే ఎన్నికల్లో నాని మీద పోటీగా రావినే బరిలోకి దింపాలా లేదా మరోనేతను దింపాలా అని ఆలోచనలో పడింది. ఆ ఆలోచనల నుంచే కొత్తపేరు తెరమీదకు వచ్చింది. ఆ పేరే దేవినేని అవినాష్. కొడాలి నాని ని ఎదుర్కోగ‌లిగిన నేత‌ల వడపోత చేపట్టగా తుది పరిశీలనలో రావి వెంకటేశ్వరరావు, దేనినేని అవినాష్‌ పేర్లు ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. గుడివాడ నియోజకవర్గంలో ఇప్పటికే పలుమార్లు నిర్వహించిన సర్వేలు రావికి సానుకూలంగా ఉన్నా ఆయన ఎంత వరకు నానిని ధీటుగా ఎదుర్కొనగలరన్న అంశాన్ని పార్టీ వర్గాలు పరిశీలిస్తు న్నాయి. రావి ఆర్థికంగా ఆచితూచి వ్య‌వ‌హ‌రిచే వ్య‌క్తి కావ‌టంతో అధిష్టానం అవినాష్ పేరును ప‌రిశీలిస్తున్న‌ట్లు స‌మాచారం. కృష్ణా జిల్లా రాజ‌కీయాల్లో దేవినేని కుటుంబానికి ఓ ప్ర‌త్య‌క గుర్తింపు ఉంది. అవినాష్ ప్రస్తుతం రాష్ట్ర తెలుగు యువత అధ్యక్షులుగా ఉన్నారు. ఆర్థికంగా, సామాజికంగా బలమైన యువనేత కావడం.. అదీగాక దివంగత దేవినేని నెహ్రు తనయుడు కావడం కూడా అవినాష్ కి కలిసొచ్చే అంశం. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకొని నానికి ధీటైన అభ్యర్థి అవినాషే అని చంద్రబాబు భావిస్తున్నారట. కొద్ది రోజుల్లోనే ఈ విషయం మీద ఓ స్పష్టత వచ్చే అవకాశముంది.

టీడీపీలోకి వంగవీటి.. వైసీపీలోకి దేవినేని!!

  వంగవీటి రాధా టీడీపీలో చేరడం ఖాయమైపోయింది. ఒకప్పుడు విజయవాడను శాసించిన వంగవీటి, దేవినేని కుటుంబాల వారసులు ఇప్పుడు మరోసారి ఒకే పార్టీలో, ఒకే వేదికపై కనిపించబోతున్నారు. దీంతో ఇప్పుడు విజయవాడ రాజకీయాలు ఆసక్తికరంగా మారిపోయాయి. గతంలో ఒకేసారి కాంగ్రెస్ పార్టీలో కొనసాగిన వంగవీటి, దేవినేని కుటుంబాలు.. ఇప్పుడు టీడీపీలోనూ అదే రకమైన రాజకీయ ప్రయాణం చేయబోతున్నాయి. అప్పట్లో వంగవీటి, దేవినేని కుటుంబాల మధ్య ఆధిపత్య పోరు ఉండేది. దీంతో విజయవాడలో వంగవీటి రంగా వర్సెస్ దేవినేని నెహ్రూ అన్నట్లుగా పరిస్థితి ఉండేది. వంగవీటి రంగా హత్యానంతరం విజయవాడ రాజకీయాలు మారిపోయాయి. రంగా రాజకీయ వారసత్వాన్ని కొనసాగించిన ఆయన కుమారుడు రాధా కాంగ్రెస్ పార్టీలో కొనసాగి ఎమ్మెల్యేగా గెలుపొందారు. మరోవైపు అప్పట్లో టీడీపీలో ఉన్న దేవినేని నెహ్రూ.. సంక్షోభం సమయంలో ఎన్టీఆర్ పక్షాన నిలిచారు. ఎన్టీఆర్ మరణం తర్వాత చంద్రబాబుతో విభేదాల కారణంగా కాంగ్రెస్ పార్టీలో చేరారు. అలా వంగవీటి, దేవినేని కుటుంబాలు కాంగ్రెస్ గొడుగు కిందకు వచ్చాయి. ఒకే పార్టీలో ఉన్నా ఈ రెండు కుటుంబాల మధ్య మర్యాదపూర్వకంగా కూడా మాటలు ఉండేవి కావు. అయినా ఈ రెండు కుటుంబాలను కాంగ్రెస్ అప్పట్లో బాగానే బ్యాలెన్స్ చేసింది. తరువాత ఆ అవసరం లేకుండా పోయింది. 2009లో వంగవీటి రాధా చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీలో చేరారు. దేవినేని నెహ్రూ మాత్రం 2014 వరకు కాంగ్రెస్ లోనే కొనసాగారు. 2014 తరువాత దేవినేని నెహ్రూ, ఆయన తనయుడు అవినాష్ టీడీపీలో చేరారు. అనారోగ్యం కారణంగా కొన్నాళ్ల క్రితం దేవినేని నెహ్రూ చనిపోగా.. ప్రస్తుతం ఆయన తనయుడు అవినాష్ టీడీపీలో ఉన్నారు. రీసెంట్ గా చంద్రబాబు అవినాష్ ని రాష్ట్ర తెలుగు యువత అధ్యక్షుడిగా కూడా నియమించారు. అయితే తాజాగా వైసీపీకి రాజీనామా చేసిన వంగవీటి రాధా కూడా టీడీపీలో చేరబోతుండటంతో.. ఈ ఇరువురు టీడీపీలో ఎలా ఇముడుతారనే అంశం ఆసక్తికరంగా మారింది. మాటలు లేకపోయినా నాడు కాంగ్రెస్‌లో ఎలాగోలాగ సర్దుకుపోయిన వంగవీటి, దేవినేని కుటుంబాల వారసులు.. నేడు టీడీపీలో అదే రకంగా సర్దుకుపోతారా అంటూ చర్చలు మొదలయ్యాయి. అంతేకాదు ఇప్పుడొక సంచలన వార్త విజయవాడ రాజకీయాల్లో చక్కర్లు కొడుతోంది. రాధా రాకను అవినాష్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారట. రాధా టీడీపీలో చేరితే, తాను టీడీపీని వీడుతా అని అవినాష్ సన్నిహితుల వద్ద చెప్తున్నారంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అంతేనా ఇప్పటికే వైసీపీ రంగంలోకి దిగి అవినాష్ కి విజయవాడ ఎంపీ టికెట్ ఆఫర్ చేసినట్లు కూడా వార్తలొస్తున్నాయి. విజయవాడలో వంగవీటి ఫ్యామిలీ లోటుని దేవినేని ఫ్యామిలీతో భర్తీ చేయాలని వైసీపీ భావిస్తోందట. మొత్తానికి రాధా టీడీపీలో చేరిన వెంటనే అవినాష్ వైసీపీలో చేరతారని వార్తలొస్తున్నాయి. అయితే అవినాష్ వైసీపీలో చేరతారు అని వస్తున్న వార్తలను కొందరు కొట్టిపారేస్తున్నారు. టీడీపీ అవినాష్ కి తెలుగు యువత అధ్యక్ష పదవి ఇచ్చి గౌరవించింది, వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ కూడా ఇచ్చే అవకాశం కూడా ఉంది. మరి రాధా టీడీపీలో చేరుతున్నారని.. అవినాష్ తనకు తగిన గుర్తింపు ఇస్తున్న టీడీపీని వీడి వైసీపీలో చేరతారా? లేక గతంలో వంగవీటి, దేవినేని కుటుంబాలు కాంగ్రెస్ లో సర్దుకుపోయాయి కదా అని టీడీపీలోనే కొనసాగుతారో చూడాలి.

ఎన్నికల ఎఫెక్ట్.. టీడీపీకి కొత్త అధ్యక్షుడు!!

  తెలంగాణ టీడీపీలో భారీ మార్పులు చోటు చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమి నేపథ్యంలో టీడీపీ అధిష్టానం వచ్చే లోక్‌సభ ఎన్నికలపై ప్రత్యేక దృష్టి సారించాలనుకుంటుంది. ఎన్నికలలోగా పార్టీని గాడిన పెట్టాలని భావిస్తోంది. అందులో భాగంగా పార్టీ అధ్యక్షుడి మార్పు సహా.. క్షేత్రస్థాయిలో పార్టీ ప్రక్షాళన చేయాలని నిర్ణయానికి వచ్చిందట.  రాష్ట్ర విభజన తరవాత రెండు రాష్ట్రాలకూ ఇద్దరు అధ్యక్షులను నియమించారు. ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా కళా వెంకట్రావ్, తెలంగాణ టీడీపీ అధ్యక్షుడిగా ఎల్.రమణ నియమితులయ్యారు. ఏపీలో టీడీపీ బలంగా ఉంది, అధికారంలో ఉంది.. కాబట్టి ఏ సమస్య లేదు. కానీ తెలంగాణ లో పరిస్థితి ఆలా లేదు. రోజురోజుకి పార్టీ పరిస్థితి దారుణంగా తయారవుతుంది.  ఒక్కప్పుడు తెలంగాణలో బలమైన పార్టీగా ఉన్న టీడీపీ ఇప్పుడు ఉనికి కోసం పోరాడాల్సి వస్తోంది. విభజనంతరం 2014లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ 15 ఎమ్మెల్యే, ఒక ఎంపీ స్థానాన్ని గెల్చుకుంది. అయితే 13మంది ఎమ్మేల్యేలు, ఒక ఎంపీ టీఆర్ఎస్ పార్టీలో చేరిపోయారు. ఎమ్మెల్యేలు పార్టీ వీడకుండా చూడటంలో అధ్యక్షుడిగా రమణ విఫలమయ్యారనే వివర్మలున్నాయి‌. గ్రేటర్ ఎన్నికల్లో సైతం టీడీపీ ఒకే ఒక్క స్థానాన్ని గెల్చుకుంది. తాజాగా జరిగిన ముందస్తు ఎన్నికల్లో సైతం అధ్యక్షుడిగా ఎల్‌.రమణ పనితీరుపై విమర్శలు వచ్చాయి.‌ ప్రజాకూటమిని ఏర్పాటు చేయటంలో రమణ చొరవ తీసుకున్నప్పటకీ.. పార్టీ క్యాడర్లో మాత్రం ఉత్సాహం నింపలేకపోయారనే విమర్శలు వచ్చాయి. మరోవైపు టికెట్ల పంపిణీ విషయంలో కూడా రమణపై సొంత పార్టీ నేతలే ఆరోపణలు చేశారు‌. ముందస్తు ఎన్నికల్లో పోటీచేయకుండా.. రమణ సేఫ్ గేమ్ ఆడారనే విమర్శలు వచ్చాయి. వీటన్నింటినీ పార్టీ అధిష్టానం పరిగణనలోకి తీసుకుందట. అయితే పార్లమెంట్ ఎన్నికల ముందు అధ్యక్ష మార్పిడి వల్ల పార్టీకి నష్టమని కొందరు అభిప్రాయపడుతున్నారట. మరోవైపు ఒకవేళ అధ్యక్షుడిని మారిస్తే ఎవరికి అవకాశం ఇవ్వాలనేది అంతుచిక్కడం లేదట. ఖమ్మం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నేత టీటీడీపీ అధ్యక్ష బాధ్యతలు తీసుకోవటానికి ఆసక్తి కనబరుస్తున్నారని సమాచారం. ఇప్పటికే ఆయన అధిష్టానం దగ్గర తన మనసులో మాటను చెప్పారట. అయితే పార్టీ అధినేత ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది. చూద్దాం మరి చంద్రబాబు రమణని మారుస్తారో లేదో.

చంద్రబాబుకి ఫస్ట్ గిఫ్ట్ ఇచ్చిన కేసీఆర్.. ఇకనుంచి గిఫ్ట్ లే గిఫ్ట్ లు!!

  వైసీపీ అధినేత, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ సొంత జిల్లా కడపలో అప్పుడే రాజకీయాలు వేడెక్కాయి. ఎన్నికల సమయం దగ్గరపడుతుంటే ప్రధాన పార్టీల్లో చేరికలు, వలసలు సహజం. ప్రస్తుతం ఏపీలో కూడా అదే జరుగుతుంది. తాజాగా కడప జిల్లాకు చెందిన రాజంపేట ఎమ్మెల్యే మేడా మల్లిఖార్జున రెడ్డి టీడీపీకి గుడ్ బై చెప్పి జగన్ ని కలిశారు. ఆఫీసియల్ గా వైసీపీలో చేరడానికి సిద్ధమయ్యారు. అయితే మేడా టీడీపీని వీడడం వెనుక జగన్ పాత్ర ఎంతుందో తెలీదు కానీ టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ పాత్ర మాత్రం గట్టిగా ఉన్నట్లు తెలుస్తోంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం కేసీఆర్ మాట్లాడుతూ.. ఏపీ రాజకీయాల్లో వేలుపెట్టి చంద్రబాబుకి రిటర్న్ గిఫ్ట్ ఇస్తా అన్న విషయం తెలిసిందే. దానిలో భాగంగానే మొదటి గిఫ్ట్ గా కేసీఆర్.. మేడాను టీడీపీకి దూరం చేసినట్లు తెలుస్తోంది. గత ఎన్నికల సమయంలో మేడా టీడీపీలో చేరారు. పార్టీలో చేరిన వెంటనే ఆయనకు టికెట్ దక్కడం.. కడప జిల్లాలో టీడీపీ ఘోర ఓటమి చవిచూసినా.. ఆయన మాత్రం జిల్లా నుంచి రాజంపేట ఎమ్మెల్యేగా గెలుపొందడం జరిగిపోయాయి. కడప జిల్లా నుంచి గెలిచిన ఏకైక టీడీపీ ఎమ్మెల్యే కావడంతో ఆయనకు మంత్రి పదవి దక్కుతుందని ఆశించారు. కానీ చంద్రబాబు మాత్రం మేడాకి మంత్రి పదవి ఇవ్వకుండా ప్రభుత్వ విప్ తో సరిపెట్టారు. దీంతో మేడాలో అసంతృప్తి విత్తనం మొలకెత్తింది. అదే సమయంలో వైసీపీ నుంచి టీడీపీలో చేరిన ఆదినారాయణరెడ్డికి మంత్రి పదవి ఇవ్వడంతో మేడా అసంతృత్తి ఆగ్రహంగా మారింది. పార్టీ తరుపున గెలిచిన తనకి మంత్రి పదవి ఇవ్వకుండా వైసీపీ నుంచి వచ్చిన ఆదినారాయణ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వడం ఏంటంటూ.. సన్నిహితులు, ఇతర టీడీపీ నేతల దగ్గర ఆగ్రహం వ్యక్తం చేసారు. దీంతో మేడాని బుజ్జగించేందుకు చంద్రబాబు రంగంలోకి దిగి.. మేడా తండ్రికి టీటీడీ బోర్డు మెంబర్ గా అవకాశమిచ్చారు. అయినా మేడా శాంతించలేదు. పార్టీ పట్ల అసంతృప్తిగానే ఉన్నారు.  దీన్నే వైసీపీ తనకి అనుకూలంగా మార్చుకోవాలనుకుంది. మేడా టీడీపీని వీడి వైసీపీలో చేరేలా పావులు కదపడం మొదలుపెట్టింది. అయినా మేడా సందిగ్ధంలోనే ఉన్నారు. వైసీపీలో చేరాలా? వద్దా? ఆలోచనలో పడ్డారు. సరిగ్గా అదే సమయంలో కేసీఆర్ రంగంలోకి దిగి ఒక్క ఫోన్ కాల్ తో మేడా టీడీపీని వీడేలా చేశారట. అసలు మేడా కేసీఆర్ కి అంత ఇంపార్టెన్స్ ఇవ్వడం ఏంటనేగా మీ డౌట్. మేడా పెద్ద కాంట్రాక్టర్. కేసీఆర్ సహకారంతో ఆయన తెలంగాణలో చాలా కాంట్రాక్టులు చేస్తున్నారట. మరి తనకి కాంట్రాక్టులు ఇచ్చిన కేసీఆర్ మాటకి ఆ మాత్రం విలువ ఇవ్వాలి కదా. అసలే టీడీపీ మీద అసంతృప్తి, దీనికితోడు కేసీఆర్ ఫోన్ కాల్.. ఇంకేముంది మేడా వెంటనే టీడీపీకి గుడ్ చెప్పేశారట. మొత్తానికి మేడా రూపంలో కేసీఆర్ చంద్రబాబుకి గిఫ్ట్ ఇచ్చారు. అయితే ఇది ఇంతటితో అయిపోలేదట. మరికొందరు ఎమ్మెల్యేలు, ఎంపీలను టీడీపీని వీడి వైసీపీలో చేరేలా చేస్తానని కేసీఆర్ జగన్ కి హామీ ఇచ్చారట. తాజాగా వైసీపీ బొత్స సత్యనారాయణ మాటలు వింటే ఇది నిజమనే అభిప్రాయం కలగక మానదు. తాజాగా బొత్స మాట్లాడుతూ.. మేడా మల్లిఖార్జున రెడ్డి మాత్రమే కాదనీ ఇంకా చాలామంది టీడీపీ నుంచి బయటకు వస్తారని అన్నారు. దీనిబట్టి చూస్తుంటే వైసీపీ కేసీఆర్ తో కలిసి టీడీపీకి షాకులు మీద షాకులు ఇచ్చేలా ఉంది. చూద్దాం మరి ముందు ముందు కేసీఆర్ చంద్రబాబుకి ఎలాంటి గిఫ్ట్ లు ఇస్తారో ఏంటో.

వైసీపీలో తారాస్థాయికి చేరిన వర్గపోరు.. పాపం జగన్ ఏం చేస్తారో?

  విశాఖ జిల్లా ఎలమంచిలి నియోజకవర్గం వైసీపీలో వర్గపోరు తారాస్థాయికి చేరుతోంది. ఆ పార్టీ నేతల మధ్య విభేదాలు రోజు రోజుకీ ముదురుతున్నాయి. సమన్వయకర్త కన్నబాబురాజుతో కలిసి పనిచేయలేమని, ఆయనను మార్చాల్సిందేనని బొడ్డేడ ప్రసాద్‌, ప్రగడ నాగేశ్వరరావు వర్గీయులు డిమాండ్‌ చేస్తున్నారు. కన్నబాబురాజు ఏకపక్షంగా వ్యవహరిస్తూ కార్యకర్తల మనోభావాలను దెబ్బతీస్తున్నారని బొడ్డేడ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికార పార్టీలో వున్నప్పుడు తనపై కేసులు పెట్టించి, ఇబ్బందులకు గురిచేసిన వ్యక్తితో ఎలా కలిసి పనిచేస్తానని మరో నేత ప్రగడ నాగేశ్వరరావు అంటున్నారు. ఎలమంచిలి నియోజకవర్గం వైసీపీలో వర్గపోరు ఇప్పుడు కొత్తగా మొదలైంది కాదు. ఆదినుంచి ఉంది. ప్రస్తుత సమన్వయకర్తగా ఉన్న కన్నబాబురాజు వైసీపీలో చేరకముందు.. బొడ్డేడ ప్రసాద్‌, ప్రగడ నాగేశ్వరావు మధ్య వర్గపోరు నడిచేది. ఇరువురు పార్టీ కార్యక్రమాలను వేర్వేరుగా నిర్వహించేవారు. గత ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి రమేష్ బాబు చేతిలో ఓడిపోయిన ప్రగడ నాగేశ్వరరావును నియోజకవర్గం సమన్వయకర్తగా అధిష్ఠానం నియమించింది. అయితే ఏడాదిన్నర క్రితం అతనిని తొలగించి, బొడ్డేడ ప్రసాద్‌కు పగ్గాలు అప్పగించింది. దీంతో ఇద్దరిమధ్య విభేదాలు మరింత ముదిరాయి. గత ఎన్నికల్లో తమ నేత ఓటమికి కారణమైన వ్యక్తిని సమన్వయకర్తగా నియమించడం ఏమిటని ప్రగడ వర్గీయులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇద్దరూ కలిసి పార్టీ అభివృద్ధికి పనిచేయాలని అధినేత జగన్‌ చెప్పినా వారు శాంతించలేదు.   ఈ నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే కన్నబాబురాజు టీడీపీని వీడి వైసీపీలో చేరారు. అంతేకాక సమన్వయర్తగా వున్న బొడ్డేడ ప్రసాద్‌ను తప్పించి, అధిష్ఠానం కన్నబాబురాజును నియమించింది. దీంతో పాత ప్రత్యర్థులు బొడ్డేడ, ప్రగడ ఒక్కటయ్యారు. గత కొంతకాలంగా బొడ్డేడ ప్రసాద్‌తో విభేదిస్తూ వస్తున్న ప్రగడ.. గతంలో కన్నబాబురాజు తనను అన్యాయంగా కేసుల్లో ఇరికించారంటూ బొడ్డేడతో చేతులు కలిపారు. దీంతో ఇరువురు నేతల అనుచరులు కూడా ఒకే తాటిపైకి వచ్చారు. జగన్‌ విశాఖ జిల్లాలో పాదయాత్రకు ముందు మునగపాకలో విజయ్‌సాయిరెడ్డి సమక్షంలోనే బొడ్డేడ, కన్నబాబు వర్గాలు గొడవ పడ్డాయి. జగన్‌ పాదయాత్ర తరువాత కూడా వర్గపోరు తగ్గలేదు. జగన్‌ జన్మదిన వేడుకలు, పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని కూడా వేర్వేరుగా జరుపుకున్నారు. పార్టీ కార్యక్రమాలను, కార్యకర్తల సమావేశాలను వేర్వేరుగా నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా మునగపాక మండలంలో జరిగిన ఒక కార్యక్రమంలో బొడ్డేడ, ప్రగడ నేతలతోపాటు వారి అనుచరులు కూడా పార్టీ సమన్వయకర్తపై తమ అసంతృప్తిని బహిరంగంగానే వెల్లడించారు. తమను చిన్నచూపు చూస్తున్నారని, తమ మనోభావాలు దెబ్బతింటున్నాయని కార్యకర్తలు ఆవేదన చెందారు. కన్నబాబురాజుతో కలిసి పనిచేయలేమని, సమన్వయకర్తను మార్చే విషయాన్ని పరిశీలించాలని అధిష్ఠానానికి సూచించారు. కార్యకర్తల మనోభావాలను గౌరవించని పక్షంలో తగిన నిర్ణయం తీసుకుందామని బొడ్డేడ ప్రకటించారు. కన్నబాబురాజు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు తనపై పలు కేసులు పెట్టి అవమానించారని, అలాంటి వ్యక్తితో ఇప్పుడు ఎలా కలిసి పనిచేస్తామని ప్రగడ నాగేశ్వరరావు ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో అధిష్ఠానం రంగంలోకి దిగి.. బొడ్డేడ ప్రసాద్‌, ప్రగడ నాగేశ్వరరావు వర్గీయులను శాంతపరచకపోతే ఎలమంచిలిలో వైసీపీకి తీవ్రనష్టం వాటిల్లుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. చూద్దాం మరి వైసీపీ అధినేత జగన్ పార్టీలో ఏర్పడిన ఈ వర్గపోరుని ఎలా అరికడతారో.

జేసీపై ఎంపీగా పోటీ చేయనున్న వైఎస్ షర్మిల!!

  ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ సోదరి వైఎస్ షర్మిల పేరు చాలా రోజుల తరువాత మళ్ళీ మొన్న తెరమీదకు వచ్చింది. తన గురించి కొన్ని వెబ్ సైట్లు తప్పుడు కథనాలు రాస్తున్నాయని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు షర్మిల గురించి ఓ ఆసక్తికరమైన వార్త వినిపిస్తోంది. ఆమె రాబోయే ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేయబోతున్నట్లు తెలుస్తోంది. షర్మిల ఇప్పటివరకు ప్రత్యక్షంగా ఎన్నికల బరిలో దిగనప్పటికీ.. రాజకీయంగా కాస్తో కూస్తో అనుభవం ఉంది. అవినీతి ఆరోపణల కేసులో జగన్ జైలులో ఉన్న సమయంలో షర్మిల పాదయాత్ర చేసారు. అలాగే వైసీపీని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి తనవంతు కృషి చేసారు. అందుకే వైసీపీ శ్రేణుల్లో షర్మిల మీద సానుకూలత ఉంది. నిజానికి ఆమె గత ఎన్నికల్లో పోటీ చేస్తారని అంతా భావించారు. కానీ అలా జరగలేదు. పోటీకి ఆమె దూరంగా ఉన్నారో లేక జగన్ దూరంగా ఉంచారో తెలీదు కానీ ఆమె మాత్రం ఎన్నికల బరిలో దిగలేదు. తరువాత రాజకీయాలకు కూడా దూరంగా ఉంటూ ఉంచారు. అయితే ఇప్పుడు ఆమె మనసు రాజకీయాలవైపు మళ్లినట్లు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో ఆమె ఎంపీగా పోటీ చేయాలనుకుంటున్నారట. ఆమె పోటీ పట్ల జగన్ కూడా సానుకూలంగా ఉన్నట్లు తెలుస్తోంది. గత ఎన్నికల్లో షర్మిల తల్లి వైఎస్ విజయమ్మ విశాఖపట్నం నుంచి ఎంపీగా పోటీ చేసారు. అయితే ఆ ఎన్నికల్లో విజయమ్మ.. బీజేపీ అభ్యర్థి హరిబాబు చేతిలో ఓడిపోయారు. ఈ సారి ఆమె పోటీ చేసేందుకు విముఖత చూపుతున్నారని తెలుస్తోంది. దీంతో విశాఖపట్నం నుంచి షర్మిలను ఎంపీగా పోటీ చేయించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఇక్కడ వైసీపీ బలంగానే ఉంది. గత ఎన్నికల్లో టీడీపీ మద్దతుతో బీజేపీ గెలిచింది. ఈసారి ఆ పరిస్థితి లేదు. టీడీపీ ఒంటరిగా బరిలోకి దిగే అవకాశాలున్నాయి. ఇక్కడ షర్మిల గెలుస్తుందని నూటికి నూరు శాతం చెప్పలేకపోయినా గెలిచే అవకాశం మాత్రం ఉందని వైసీపీ భావిస్తోంది. ఒకవేళ షర్మిల విశాఖపట్నం నుంచి పోటీ చేయకపోతే.. అనంతపురం నుంచి పోటీ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇక్కడ నుంచి ఎంపీగా టీడీపీ నేత జేసీ దివాకర్ రెడ్డి ఉన్నారు. ఈ సారి కూడా ఆయనే టీడీపీ అభ్యర్దిగా పోటీ చేసే అవకాశం ఉంది. ఇటీవల వైసీపీ పైన, జగన్ పైన జేసీ దివాకర్ రెడ్డి తీవ్ర స్దాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. దీంతో ఆయనపై తన సోదరి చేత పోటీ చేయించి ఓడించాలన్నది జగన్ ఆలోచనగా చెబుతున్నారు. అయితే జేసీని ఓడించడం అంతా ఈజీ కాదనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. మరోవైపు షర్మిల విశాఖపట్నం, అనంతపురం కంటే కడప ఎంపీగా పోటీ చేసేందుకే ఎక్కువ ఆసక్తి కనబరుస్తున్నట్లు తెలుస్తోంది. కానీ జగన్ మాత్రం విశాఖపట్నం లేదా అనంతపురం నుంచే బరిలోకి దింపాలని చూస్తున్నారట. చూద్దాం మరి షర్మిల అసలు పోటీ చేస్తారో లేదో. ఒకవేళ పోటీ చేస్తే ఎక్కడినుంచి పోటీ చేస్తారో ఏంటో.

జగన్ కి షాకిచ్చిన పీకే.. కేసీఆర్ తో దోస్తీ డౌటే!!

  ఏపీ రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. ఏపీలో ఎన్నికల సమీపిస్తున్న వేళ జగన్, కేటీఆర్ భేటీ కావడం హాట్ టాపిక్ అయింది. ఈ భేటీపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా కొందరు వైసీపీ నేతలే.. రాబోయే ఎన్నికల్లో జగన్, టీఆర్ఎస్ తో కలిసి పనిచేస్తారా ఏంటని ఆందోళన చెందుతున్నారు. మరోవైపు ఈ భేటీ గురించి ప్రశాంత్ కిషోర్ టీం కూడా షాకింగ్ ఫీడ్ బ్యాక్ ఇచ్చిందట. జగన్, కేటీఆర్ తో భేటీ అయి రాజకీయాలపై చర్చించారు. ఇక దీనిపై ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుసుకోవాలనుకున్న జగన్.. ప్రశాంత్ కిషోర్ టీంకు ఆ బాధ్యతను అప్పగించారు.అయితే ప్రజల దాకా వెళ్ళకుండానే.. వైసీపీ నేతలు, కార్యకర్తలను ముందుగా సర్వే చేస్తేనే చాలా ప్రతికూల ఫలితాలు వచ్చినట్లుగా తెలుస్తోంది. ప్రజల వద్దకు వెళ్లకుండానే వైసీపీ నేతల నుండి తీసుకున్న ఫీడ్ బ్యాక్ చాలా నెగిటివ్ గా వచ్చిన నేపథ్యంలో జగన్ కేసీఆర్ తో దోస్తీ పై ఆలోచనలో పడ్డారని తెలుస్తోంది. ఇంతకాలం జగన్ పాదయాత్రలతో పార్టీకి కాస్తోకూస్తో మైలేజీ తీసుకొని వచ్చారని సంబరపడుతున్న వైసీపీ శ్రేణులకు జగన్ కేటీఆర్ తో భేటీ నీరుగార్చేసింది అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. నోటికొచ్చినట్టు ఆంధ్ర ప్రజలను తిడుతూ వారి మనోభావాలను కించపరిచే కేసీఆర్ తో పొత్తు పెట్టుకొని ఏపీలో ఎన్నికలకు వెళితే ఘోరంగా ఓడిపోవడం ఖాయమని ఓ వైసీపీ నేత చెప్పినట్టుగా తెలుస్తోంది. ఇక పొరుగు రాష్ట్ర ప్రాంతీయ పార్టీ నేతలతో జతకడితే ఏపీకి ఏవిధంగా లాభం కలుగుతుందో జగన్ ఆలోచించుకోవాలని.. దీనిని ఏపీ రాష్ట్ర ప్రజలు హర్షించరని ఒక నేత ఆందోళన వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది. ఎన్నడూ తెలంగాణ ప్రజల గురించి, తెలంగాణ ప్రాంతం గురించి విమర్శలు చేయని చంద్రబాబుని ఇటీవల తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అక్కడ ప్రజలు ఆదరించలేదు. అలాంటిది ఆంధ్ర ప్రజలని దొంగలు, దోపిడీదారులు అని అభివర్ణించిన కేసీఆర్.. గతంలో తెలంగాణ వస్తే ఆంధ్ర విద్యాసంస్థలను నిషేధిస్తామని చెప్పిన కేసీఆర్.. ఆంధ్రాలో బిర్యాని పేడ బిర్యానీ అంటూ వంకలు పెట్టిన కేసిఆర్.. ఏపీ రాజకీయాల్లో జగన్ కు మద్దతిస్తే అది జగన్ కు మైనస్ తప్ప ప్లస్ కాదని, ఏపీ ప్రజలు కేసిఆర్ మాటలు ఇంకా మరిచిపోలేదని ఒక నేత అభిప్రాయపడ్డారట. ప్రత్యేక హోదా పైన వ్యతిరేకత ప్రదర్శించి, పోలవరం పైన పలు కేసులను దాఖలు చేసి, విద్యుత్ వినియోగానికి సంబంధించి ఏపీకి రావాల్సిన 5200 కోట్ల ధనాన్ని ఎగవేసి, ఇక విభజన చట్టంలో ఉన్న ఉమ్మడి ఆస్తులను పంపిణీ చేయడానికి ఏ విధంగానూ సహకరించని టీఆర్ఎస్ పార్టీని ఏపీ ప్రజలు ఏ విధంగా ఆదరిస్తారు అని వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారట. ఇవన్నీ పక్కన పెట్టి కేసిఆర్ తో దోస్తీ చేయడమంటే జగన్ తన గోతి తానే తీసుకున్నట్లు అవుతుందని కొందరు నేతలు అభిప్రాయపడుతున్నారట. రాహుల్ గాంధీ ఏపీ పర్యటన సమయంలో.. దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే తొలి సంతకం ఏపీకి ప్రత్యేక హోదా పైన చేస్తామని ప్రకటన చేసిన సందర్భంలో కూడా కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు లు తీవ్రంగా వ్యతిరేకించారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో సోనియా గాంధీ ఏపీకి ప్రత్యేకహోదా హామీ ఇస్తే.. తెలంగాణకు వచ్చి ఏపీకి వరాలు ఇవ్వడం ఏంటని టీఆర్ఎస్ నేతలు విమర్శించారు. మరి జగన్ అలాంటి వారితో కలిసి టీడీపీని ఓడించటానికి పని చేస్తే అది వైసీపీకే నష్టం చేస్తుందని వైసీపీ నేతలు భావిస్తున్నారు. ఇక తాజాగా కేటీఆర్ తో జగన్ భేటీ అయిన నేపథ్యంలో వైసీపీలో చేరాలని, వైసీపీ నుంచి ఎన్నికల బరిలోకి దిగాలని భావించిన ఆశావహులు చాలామంది వెనకడుగు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఏపీ రాజకీయాల్లో వేలుపెట్టి సార్వత్రిక ఎన్నికల్లో చంద్రబాబు ను ఓడించడానికి పనిచేస్తామని టీఆర్ఎస్ చెప్తున్న నేపథ్యంలో.. టీఆర్ఎస్ తో దోస్తీ తనకు లాభిస్తుంది అనుకుంటున్న జగన్ కు సొంత పార్టీ నేతల నుండి వస్తున్న వ్యతిరేకత పునరాలోచనలో పడేలా చేసిందట. ఒకవేళ జగన్ నిజంగానే టీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకుంటే తన వేలితో తన కంటినే పొడుచుకున్నట్లు అవుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. చూద్దాం మరి ఏం జరుగుతుందో.

జగన్, పవన్ ని కలిపే బాధ్యత కేటీఆర్ దేనా?

  ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ తో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ భేటీ కావడంతో.. వైసీపీ, టీఆర్ఎస్ పార్టీల దోస్తీ ఆఫీసియల్ అయినట్లు అయింది. మొన్నటివరకు పరోక్షంగా మద్దతు ఇచ్చుకున్న పార్టీలు ఇక నుంచి ప్రత్యక్షంగా మద్దతు ఇచ్చుకోనున్నాయి. ముఖ్యంగా రాబోయే ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఈ పార్టీలు కలిసి పనిచేయనున్నాయి. పేరుకి జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించాలని టీఆర్ఎస్, వైసీపీ దగ్గరయ్యాయని చెప్తున్నా.. నిజానికి ఆ రెండు పార్టీల ప్రధాన లక్ష్యం ఏపీలో చంద్రబాబుని గద్దె దించడం. చంద్రబాబుని ఓడించాలనే ప్రధాన అజెండాతోనే ఈ రెండు పార్టీలు దగ్గరయ్యాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కొందరు టీడీపీ నేతలైతే ఈ పార్టీలను బీజేపీ వెనుకనుంచి ఆడిస్తుందని ఆరోపణలు కూడా చేస్తున్నారు. ఇదంతా సరే మరి పవన్ కళ్యాణ్ పరిస్థితి ఏంటి?. గత ఎన్నికల్లో టీడీపీకి మద్దతిచ్చిన పవన్ తరువాత టీడీపీకి దూరమయ్యారు. చంద్రబాబు మీద, లోకేష్ మీద, ఇతర టీడీపీ నేతల మీద తీవ్ర విమర్శలు చేస్తూ వస్తున్నారు. ఓ రకంగా చంద్రబాబుని గద్దె దించాలని జగన్ ఎలా టార్గెట్ పెట్టుకున్నారో.. పవన్ కూడా అలానే టార్గెట్ పెట్టుకున్నారు. మరి ఈ కామన్ టార్గెట్ జగన్, పవన్ లను దగ్గర చేస్తుందా? అంటే అవుననే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కేటీఆర్, జగన్ భేటీ సందర్భంగా పవన్ గురించి కూడా చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. ఏపీలో చంద్రబాబుని ఓడించాలంటే పవన్ మద్దతు కూడా తోడవ్వాలని టీఆర్ఎస్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై జగన్ తన స్పష్టమైన అభిప్రాయాన్ని వెల్లడించనప్పటికీ.. కొందరు వైసీపీ నేతలు మాత్రం పవన్ తో పొత్తుకు సుముఖంగా ఉన్నట్లు సమాచారం. భేటీ సందర్భంగా కేటీఆర్ కూడా జగన్ తో.. పవన్ ని కలుపుకొనిపోతే చంద్రబాబుని ఓడించడం సులభమని సూచించినట్లు సమాచారం. అంతేకాదు పవన్ ని ఎలా ఒప్పించాలో తనకు తెలుసునని.. పవన్ ని ఒప్పించి చంద్రబాబుని ఓడించడానికి అందరూ కలిసి పనిచేసేలా చేస్తానని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. మరి ఈ వార్తల్లో నిజమెంతో తెలీదు కానీ.. ఇదే నిజమైతే.. తెలంగాణలో టీఆర్ఎస్ ని ఓడించడానికి విపక్షాలన్నీ కూటమిగా ఏర్పడినట్లు ఏపీలో టీడీపీని ఓడించడానికి కూడా కూటమి ఏర్పడడం ఖాయం. చూద్దాం మరి ఏం జరుగుతుందో.

టీఆర్ఎస్, వైసీపీ దోస్తీ.. వైఎస్సార్ అభిమానుల రియాక్షన్ ఏంటి?

  ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఏదైనా హాట్ టాపిక్ ఉందంటే అది ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ భేటీనే. జాతీయ రాజకీయాల మీద దృష్టి పెట్టిన తెలంగాణ సీఎం కేసీఆర్.. బీజేపీ, కాంగ్రెస్ లకు ప్రత్యామ్నాయంగా ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. దానిలో భాగంగానే కేసీఆర్ ఆదేశాల మేరకు తాజాగా కేటీఆర్ జగన్ ను కలిశారు. రాబోయే లోక్ సభ ఎన్నికల్లో టీఆర్ఎస్, వైసీపీ పార్టీలు కలిసి పనిచేయనున్నాయి. అయితే ఈ రెండు పార్టీలు దగ్గరవడానికి ఓ రకంగా చంద్రబాబు కారణమని చెప్పాలి. శత్రువుకి శత్రువు మన మిత్రుడు అవుతాడు అనే ఫార్ములా ఈ రెండు పార్టీల మధ్య దోస్తీ కుదిరేలా చేసిందని చెప్పాలి. ఏపీలో జగన్, చంద్రబాబు ప్రత్యర్థులు. చంద్రబాబుని గద్దె దించి ఎప్పుడెప్పుడు సీఎం కుర్చీలో కూర్చుందామా అని జగన్ ఎదురుచూస్తున్నారు. అదే విధంగా కేసీఆర్ కి కూడా చంద్రబాబు ప్రధాన ప్రత్యర్థి. చంద్రబాబు కాంగ్రెస్ తో కలిసి బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకంచేసే పనిలో ఉన్నారు. ఇప్పటికే తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల సమయంలో టీఆర్ఎస్ కి వ్యతిరేకంగా కాంగ్రెస్ తో కలిసి కూటమిగా ఏర్పడి పని చేసారు. ఆ సమయంలో కేసీఆర్ చంద్రబాబు మీద తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఒకానొక దశలో టీఆర్ఎస్ కు ప్రధాన ప్రత్యర్థి కాంగ్రెస్ కాదు చంద్రబాబు అనే స్థాయిలో విరుచుకుపడ్డారు. ఆ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఘన విజయం సాధించింది. అసలు ట్విస్ట్ అక్కడే మొదలైంది. చంద్రబాబుకి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడానికి ఏపీ రాజకీయాల్లో అడుగుపెడతాం అంటూ కేసీఆర్ ప్రకటించారు. దీంతో ఏపీలో వైసీపీ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. నిజానికి టీఆర్ఎస్, వైసీపీల మధ్య దోస్తీ ఎప్పుడో కుదిరిందనేది బహిరంగ రహస్యం. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో తెలంగాణలో ఉన్న ఒకరిద్దరు వైసీపీ నేతలు టీఆర్ఎస్ కు అనుకూలంగా పనిచేసారు. ఇప్పుడు కేటీఆర్, జగన్ భేటీతో ఈ దోస్తీ ఆఫీసియల్ గా ట్రాక్ ఎక్కనుంది. అయితే టీఆర్ఎస్, వైసీపీల దోస్తీని ఏపీ ప్రజలు ఎలా రిసీవ్ చేసుకుంటారంటే మాత్రం భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. చంద్రబాబు మీద కోపంతో తెలంగాణలో టీఆర్ఎస్ గెలిచిందని ఏపీలో వైసీపీ సంబరాలు చేసుకుంది. చంద్రబాబు మీద పంతం కొద్దీ కేసీఆర్ ఏపీ రాజకీయాల్లో అడుగుపెడతానంటే వైసీపీ తమకేదో మేలు జరుగుతుందని గంతులేస్తుంది. కానీ సాధారణ ప్రజల ఆలోచనలు మాత్రం భిన్నంగా ఉన్నాయి. కేసీఆర్ తెలంగాణ ఉద్యమ సమయం నుంచి ఈమధ్య వరకు ఆంధ్రా వారి మీద తీవ్రస్థాయిలో విమర్శలు చేసారు. కొన్ని సందర్భాల్లో ఏపీ నాయకుల మీదే కాకుండా సాధారణ ప్రజల మీద కూడా తీవ్ర విమర్శలు చేసారు. మరి ఆ మాటలన్నీ ఏపీ ప్రజల అంత త్వరగా మర్చిపోతారా?. అదీగాక ప్రస్తుతం ఏపీ ప్రజలు ప్రత్యేకహోదా కావాలని బలంగా కోరుకున్నారు. మరి టీఆర్ఎస్ నేతలు ఏపీకి ప్రత్యేకహోదా వస్తే కంపెనీలన్నీ ఏపీకి తరలిపోతాయని ప్రత్యేకహోదాని వ్యతిరేకించారు. ఏపీకి ప్రత్యేకహోదా ఇస్తామని చెప్పి తరువాత యూ టర్న్ తీసుకున్న బీజేపీ మీద కోపంతో రగిలిపోతున్న ఏపీ ప్రజలు.. మరి ఇప్పుడు ప్రత్యేక హోదాని వ్యతిరేకించిన టీఆర్ఎస్ తో వైసీపీ దోస్తీ అంటే ఎలా రిసీవ్ చేసుకుంటారు?. సాధారణ ప్రజలే కాదు వైఎస్సార్ అభిమానులు కూడా టీఆర్ఎస్, వైసీపీల దోస్తీని వ్యతిరేకిస్తారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. గతంలో వైఎస్సార్ టీఆర్ఎస్ ను ఎంతగా వ్యతిరేకించేవారో తెలిసిందే. అసెంబ్లీ సాక్షిగా వైఎస్సార్.. కేసీఆర్, ఈటల రాజేందర్ వంటి నేతల మీద విరుచుకుపడిన సందర్భాలు ఉన్నాయి. తెలంగాణ ఏమన్నా కేసీఆర్ జాగీరా? అంటూ మండిపడ్డారు. తలకాయ ఎక్కడ పెట్టుకోవాలో అర్ధమవుతుందా రాజేంద్ర? అని ఈటలని వైఎస్సార్ అసెంబ్లీలో విమర్శించడం తీవ్ర దుమారమే రేపింది. కేసీఆర్, హరీష్ రావు కూడా ఈమధ్య వరకు వైఎస్సార్ మీద తీవ్ర విమర్శలు చేసారు. అసలు వైఎస్సార్ బ్రతికుంటే టీఆర్ఎస్ ని ఎదగనిచ్చేవారు కాదనే మాటలు కూడా వినిపిస్తుంటాయి. మరి ఇవన్నీ మర్చిపోయి జగన్ చెప్పాడు కదా అని వైఎస్సార్ అభిమానులు టీఆర్ఎస్ దోస్తీని స్వాగతిస్తారా అంటే డౌటే. చూద్దాం మరి ఏపీ ప్రజలు, వైఎస్సార్ అభిమానులు టీఆర్ఎస్, వైసీపీ దోస్తీని ఎలా రిసీవ్ చేసుకుంటారో ఏంటో.

ఏపీలో ఎన్నికలు..టీడీపీతో టీఆర్ఎస్ ఢీ

  తెలంగాణ ఎన్నికల్లో ఏపీ సీఎం చంద్రబాబు కూటమి తరుపున ప్రచారం చేయటం తెలంగాణ సీఎం కేసీఆర్ కి నచ్చలేదో ఏమో? ..ఏపీ రాజకీయాల్లో వేలుపెడతాం, చంద్రబాబుకి రిటర్న్ గిఫ్ట్ ఇస్తాం అని అన్నారు. ఆ రిటర్న్ గిఫ్ట్ రానున్న ఎన్నికల్లో చంద్రబాబుని ఓడించటమే. ఆ దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టారు కూడా. తాజాగా ఏపీ ప్రతిపక్ష నేత జగన్ తో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ భేటీ అవ్వటమే ఇందుకు ఉదాహరణ. పైకి ఫెడరల్ ఫ్రంట్ పైనే చర్చించాం అని చెప్తున్నా..ఏపీ రాజకీయాలపై కూడా వారి మధ్య చర్చ జరిగినట్టు సమాచారం. కేసీఆర్ సహా ఆ పార్టీ నేతలు ఏపీలో ప్రచారంలో పాల్గొనే అవకాశం లేకపోలేదని అటు టీఆర్ఎస్,ఇటు వైసీపీ నేతలు చెప్పుకొస్తున్నారు. తాజాగా టీఆర్ఎస్ ఎంపీ సీతారాం నాయక్ మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబును ఓడించేందుకు తమ పార్టీ ఎంపీలు ఏపీలో ప్రచారం చేస్తారని వెల్లడించారు. కేటీఆర్, జగన్ భేటీ కేవలం ఫెడరల్ ఫ్రంట్ కోసమేనని, ఇందులో మరేతర విషయాలు లేవన్నారు. ఫ్రంట్ వెనుక బీజేపీ ఉందన్న విమర్శలు పూర్తిగా అవాస్తవమని ఆయన కొట్టిపారేశారు. దేశంలో గుణాత్మకమైన మార్పు రావాలన్న నినాదాన్ని ఎన్నికల ముందే కేసీఆర్ చెప్పారని ఆయన గుర్తు చేశారు. అందులో భాగంగానే ఫెడరల్ ఫ్రంట్ కోసం కేసీఆర్ అనేక మందిని కలిశారని, జగన్‌తో భేటీ కూడా అందులో భాగంగానే ఈ భేటీ అని ఆయన స్పష్టం చేశారు. జగన్ ఏమైనా అంటరానివాడా? ఆయన ఓ ప్రతిపక్ష నేత అని ఆయన తెలిపారు. జగన్‌తో కేటీఆర్ భేటీ అయితే టీడీపీకి ఎందుకింత ఉలికి పాటు? తెలంగాణ ఎన్నికల సమయంలో చంద్రబాబు పర్యటించలేదా? అని సీతారాం నాయక్ ప్రశ్నించారు. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కూడా భేటీపై స్పందించారు. తాజాగా అయన మీడియాతో మాట్లాడుతూ...వైఎస్‌ జగన్‌, కేటీఆర్‌లు ఫెడరల్‌ ఫ్రంట్‌ గురించి చర్చలు జరిపారన్నారు. త్వరలో కేసీఆరే స్వయంగా వైఎస్‌ జగన్‌తో చర్చలు జరుపుతారని తెలిపారు. రాష్ట్రాల హక్కు కోసం కేంద్రంతో పోరాడాటానికి ఒక వేదికగా ఫెడరల్‌ ఫ్రంట్‌ నిలుస్తుందని, ఇది ఒక్క టీఆర్‌ఎస్‌, వైఎస్సార్‌సీపీది మాత్రమే కాదన్నారు. వివిధ రాష్ట్రాలకు చెందిన రాజకీయ పార్టీలు ఇందులో భాగమవుతాయన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో టీఆర్‌ఎస్‌ పోటీ చేయదని, అభ్యర్థులను నిలపదన్నారు. ఫెడరల్‌ ఫ్రంట్‌లో ఏ ప్రాంతీయ పార్టీలైతే భాగమవుతాయో.. వారికి మద్దతుగా ఫెడరల్‌ ఫ్రంట్‌ ప్రచారం నిర్వహిస్తోందన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇచ్చేవారికే వైస్సార్‌సీపీ మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు.