లోకేష్ చాలా తెలివైన వాడే...కానీ అదే దెబ్బేసింది....మాజీ నేత విశ్లేషణ !

  ఏపీ మాజీ సీఎం కుమారుడు ఏపీ మంత్రి నారా లోకేష్ తెలివి తక్కువ వాడని, పప్పు అని అప్పటి ప్రతిపక్ష వైసీపీ గట్టిగా ప్రాజెక్ట్ చేసింది. ఆయన మీద వందల కొద్దీ మార్ఫింగ్ పోస్ట్ లు చేసీ చేసీ ఆయనకు పప్పు అనే పేరు పెట్టేసింది. దానికి తోడు ఆయనకు తెలుగు సరిగా పలకక పోవడంతో జనం అదే నిజమని నమ్మారు. నిజానికి ఆయన తెలివైన వాడు, అది ఆయనతో రాజకీయం చేసిన వారికి మాత్రమే తెలుసు, అది వైసీపీ వారికయినా టీడీపీ వారికయినా కీలక నేతలుగా ఉన్నవారికి. ఈ విషయం చెబితే మీకు నవ్వు రావచ్చు కానీ అదే నిజం. ఇదే విషయాన్ని ఇప్పుడు చెబుతున్నారు ఆ పార్టీ మాజీ నేత ప్రస్తుత బీజేపీ నేత అంబికా కృష్ణ. తాజాగా బీజేపీలో చేరిన ఆయన ఒక ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే నారా లోకేశ్ కు ప్రజల్లో అంత ఆదరణ రాలేదని అందుకే మంగళగిరిలో లోకేశ్ ఓడిపోయారని వ్యాఖ్యానించారు. మంగళగిరిలో ఓడిపోవడం టీడీపీకి, లోకేశ్ కు అపప్రధేనని అభిప్రాయపడ్డారు. లోకేశ్ కొన్ని పద్ధతులను మార్చుకోవాల్సి ఉందని ఆయన పేర్కొన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు లోకేశ్ అపాయింట్ మెంట్ కూడా పార్టీ నేతలకు దొరికేది కాదని వ్యాఖ్యానించారు.  చంద్రబాబుతో అపాయింట్మెంట్ కావాలన్నా దొరికేది కానీ లోకేశ్ తో దొరికేది కాదని ఆయన పేర్కొన్నారు. ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ దొరికినా లోకేష్ ది దొరకక కొంతమంది మంత్రులు కూడా ఈ విషయంలో చాలా ఫీలయ్యారని చెప్పుకొచ్చారు. నాయకుడి వెనుక లక్షల మంది ఉంటారని, అది అర్థం చేసుకుని వాళ్లకు టైం ఇవ్వాల్సిన బాధ్యత ఉందని కానీ అది తెలియక అపాయింట్మెంట్ ఇవ్వకపోవడమే లోకేష్ చేసిన బ్లండర్ అని అంబికా కృష్ణ చెప్పారు.  నిజానికి లోకేశ్ చాలా తెలివైనవాడనీ, ఆలోచనాపరుడనీ, స్టాన్ ఫర్డ్ విశ్వవిద్యాలయంలో చదువుకున్నాడని అంబికా కృష్ణ తెలిపారు. ‘ఓ విషయాన్ని ఎలా ప్రజెంట్ చేయాలి? ఓ సమస్యను ఎలా పరిష్కరించాలి? అనే విషయం లోకేశ్ కు బాగా తెలుసనీ, అయితే ఆయన చుట్టూ ఉన్న గ్యాంగ్ సరైన డైరెక్షన్ ఇవ్వలేకపోతుందేమో? అని ఆయన పేర్కొన్నారు. నిజానికి ఇది ఈయన అనుభవం వలన వచ్చిన అభిప్రాయం మాత్రమే కానీ ఈ విషయం చాలా మందికి అర్ధం అయ్యింది. లోకేష్ కి మైనస్ ఏదయినా ఉంది అంటే అది లోకేష్ వెనక ఉన్న టీమ్ మాత్రమే. కిలారు రాజేష్, పెద్ది రామారావు లాంటి వారిని ఆయన ఒక కోటరీగా ఏర్పరచుకుని ప్రజలు కాదు కదా నాయకులను కూడా తన అపాయింట్మెంట్ ఇవ్వలేకపోయారు. అదే ఆయన కొంప ముంచింది. 

జగన్ రాజధానిని దొనకొండకి మారుస్తారా ?

  జగన్ రాజధానిని మారుస్తాడా? ఇప్పుడు ఇదే చర్చ ఏపీని పట్టి కుదిపేస్తోంది. ఇలా చర్చ జరగాడానికి ఒక కారణం జగన్ గద్దె నెక్కిన వెంటనే అమరావతి పనులను ఆపడమే కాక వైసీపీకి చెందిన ముఖ్య నాయకులు - ఎమ్మెల్యేలు దోనకొండ మరియు చుట్టుపక్కల భూములను పెద్ద ఎత్తున కొనుగోలు చేయడం కూడా ఈ అనుమానాలకు కారణమవుతోంది. జగన్ ప్రణాళికల ప్రకారమే వీరంతా కొంటున్నారనే చర్చ మొదలయ్యింది.  నిజానికి ఉమ్మడి రాష్ట్రం నుంచి ఏపీ విడిపోయినప్పడు ఏపీ రాజధాని కోసం నియమించిన శివరామకృష్ణన్ కమిటీ దోనకొండను ఏపీ రాజధాని ప్రాంతంగా ఎంపిక చేసింది. అయితే చంద్రబాబు ఈ ప్రభుత్వ భూములున్న ప్రాంతాన్ని కాకుండా అమరావతిని రాజధానిగా ఎంచుకున్నారు. అయితే అత్యదిక ప్రభుత్వ భూములు ఉన్న దోనకొండకి ఇండస్ట్రీయిల్ కారిడార్ పేరిట ఒక సెజ్ కి శంకుస్థాపన చేసి వదిలిపెట్టారు. అయితే జగన్ మొండితనం, ఎన్నికల ముంగిట రాజధాని మార్పు విషయంలో అతడి వైఖరి సందేహాలకు తావిస్తున్నాయి.  ఎన్నికల ముందుఓ జాతీయ మీడియా సంస్థ ఏర్పాటు చేసిన చర్చా కార్యక్రమంలో జగన్‌ను రాజధాని మార్పుపై అడిగితే ఏమీ స్పందించకుండా ఉండిపోయాడు. ఆ మౌనం కృష్ణా, గుంటూరు జిల్లాల్లో వ్యతిరేకత తెచ్చే ప్రమాదం ఉంటుందేమో అన్న సందేహాలున్నప్పటికీ జగన్ ఆనాడు స్పందించకపోవడం ఆశ్చర్యం కలిగించింది. ఈ నేపథ్యంలో రాజధాని మార్పు యోచన నిజంగానే జగన్‌కు ఉందేమో అన్న డౌట్లు వచ్చాయి. అమరావతిని రాజధానిగా కొనసాగించి అక్కడ ఎంత అభివృద్ధి చేసినా భవిష్యత్తులో టీడీపీ దాని క్రెడిట్ పొందవచ్చు చేసుకోవచ్చు.  తమ ప్రణాళికల్నే జగన్ అమలు చేశాడని చెప్పొచ్చు. కాబట్టి అమరావతిలో ముందు అనుకున్న స్థాయిలో అభివృద్ధి అయితే జరక్కపోవచ్చు. ఇప్పుడే కాక మరోవైపు 2014లో కూడా జగన్ పార్టీ అధికారంలోకి వస్తుందన్న అంచనాతో ఆయన వర్గీయులు పెద్ద ఎత్తున ప్రకాశం జిల్లా దొనకొండలో భారీగా భూములు కొన్నట్లు సమాచారం. వాళ్ల కోసం జగన్ రాజధాని మార్చొచ్చన్న ప్రచారం కూడా ఉంది. కానీ రాజధాని మార్పు అంత సులువైన వ్యవహారమేమీ కాదు కాబట్టి అధికారికంగా ఇలాంటి మార్పేమీ చేయకుండా అధికార వికేంద్రీకరణ పేరుతో అమరావతిలో యాక్టివిటీ తగ్గించి రాయలసీమ, దొనకొండ ప్రాంతాలలో తమకు కావలసిన హైకోర్టు లాంటివి, అక్కడ ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పాటు చేయడం.. క్రమంగా అమరావతి ప్రాధాన్యం తగ్గించడం లాంటివి జగన్ చేయొచ్చన్నది రాజకీయ విశ్లేషకుల అంచనా. ఇది ఎంతవరకూ నిజం అవుతుందో ? తెలీదు కానీ చర్చ మాత్రం జరుగుతోంది.  

కుమారస్వామి సంచలన నిర్ణయం...వారికి ఆ ఆఫర్

  ఎమ్మెల్యేల రాజీనామాతో సంక్షోభంలో కూరుకుపోయిన కర్ణాటకలోని కాంగ్రెస్-జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వం చివరి ప్రయత్నాలు ప్రారంభించింది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కుమారస్వామి కాంగ్రెస్‌ తిరుగుబాటు ఎమ్మెల్యే రామలింగారెడ్డితో సమావేశమై ప్రస్తుత రాజకీయ పరిణామాలపై చర్చిస్తున్నారు. బెంగళూరులోని ఓ రహస్య ప్రదేశంలో వీరిద్దరూ భేటీ అయ్యారు. అయితే మరోపక్క రాజీనామాలను ఉపసంహరించుకునే ప్రసక్తే లేదని తిరుగుబాటు ఎమ్మెల్యేలు తెగేసి చెబుతున్నారు.  సీఎంను మార్చినా తమ నిర్ణయంలో ఎలాంటి మార్పు ఉండదని వారు చెబుతున్నారు. అయితే సీఎం పదవి నుంచి వైదొలిగేది లేదని చెబుతున్న కుమారస్వామి ప్రభుత్వాన్ని నిలబెట్టుకునేందుకు ఇరు పార్టీలకు చెందిన 13 మంది రెబల్ ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఆఫర్ చేసినట్టు సమాచారం. అయితే, ఈ ఆఫర్‌ను కూడా వారు తిరస్కరించినట్టు సమాచారం. ఇక ఈరోజు నేడు అత్యవసరంగా కేబినెట్ మీటింగ్ నిర్వహించనున్నారు.  ఈ సందర్భంగా కొందరు మంత్రులతో రాజీనామా చేయించి, వాటిని రెబల్ ఎమ్మెల్యేలకు ఇవ్వాలన్న ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. రాజీనామాల విషయంలో తాను ముందు వరుసలో ఉన్నట్టు కాంగ్రెస్ ట్రబుల్ షూటర్, జలవనరుల శాఖా మంత్రి డీకే శివకుమార్ తెలిపారు. ఇక ఇప్పటికే డిప్యూటీ సీఎం పరమేశ్వర తన నివాసంలో కాంగ్రెస్‌ పార్టీ మంత్రులకు అల్పాహార విందు ఇచ్చారు. ఈ సందర్భంగా ప్రస్తుత రాజకీయ పరిణామాలు, రానున్న రోజుల్లో తీసుకోవాల్సిన భవిష్యత్‌ కార్యాచరణపై చర్చించారు.  కాంగ్రెస్-జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వాన్ని కాపాడుకోవడానికి అవసరమైతే మంత్రి పదవులు త్యాగం చేయడానికి సిద్ధపడాలని ఈ సమావేశంలో పలువురు మంత్రులు ప్రతిపాదించినట్టు సమాచారం. అయితే ముంబైలోని హోటల్లో ఉన్న రెబల్ ఎమ్మెల్యేలు పదిమంది కుమారస్వామి ఆఫర్‌ను తిరస్కరించారని చెబుతున్నారు. త్వరలోనే తామంతా బీజేపీలో చేరబోతున్నట్టు రెబల్ ఎమ్మెల్యే ప్రతాప్ గౌడ పాటిల్ చెబుతున్నారు. ఇక ఇదే మంచి సమాయం అనుకున్న సీఎం ఆశావహులు తమ తమ అభిమానుల చేత సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేయిస్తున్నారు.  అలా ప్రచారం జరుగుతున్న పేర్లలో డీకే శివ కుమార్, రామలింగారెడ్డి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. కర్ణాటక రాజకీయ సంక్షోభం పార్లమెంటు ముందుకు వచ్చింది. కర్ణాటక రాజకీయ సంక్షోభంపై కాంగ్రెస్‌ పార్టీ లోక్‌ సభలో వాయిదా తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. సంకీర్ణ ప్రభుత్వాన్ని కూలగొట్టేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని కాంగ్రెస్‌ ఆ తీర్మానంలో పేర్కొంది.

వైసీపీ మాస్టర్ ప్లాన్....అనుకున్నదే చేశారు....

  వైసీపీలో నెంబర్ 2 గా ఉన్న ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డికి పదవి నుండి తొలగించగానే అనేక రకాల ఊహాగానాలు మొదలయ్యాయి. ఈ నేపధ్యంలో జగన్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. అనుకున్న పదవిలో విజయసాయిరెడ్డిని కూర్చోబెట్టాలి అనుకున్న ప్రభుత్వం దాని కోసం ఏకంగా ప్రత్యేక ఆర్డినెన్స్ తెచ్చారు. ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి పదవి ఆఫీస్‌ ఆఫ్‌ ప్రాఫిట్‌(లాభదాయక హోదా) కిందకు రాదని పేర్కొంటూ రాష్ట్ర ప్రభుత్వం హడావిడిగా ఆర్డినెన్స్‌ జారీచేసింది. గత నెలలోనే రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డిని ఈ పోస్టులో నియమించారు. అయితే అప్పుడు ఈ పోస్టుకు ఆఫీస్‌ ఆఫ్‌ ప్రాఫిట్‌ నుంచి మినహాయింపు లేదు. దీంతో విజయసాయిరెడ్డి రాజ్యసభ సభ్యత్వానికి ముప్పు వచ్చే అవకాశం ఉండడంతో ఆ నియామకాన్ని రద్దు చేశారు. చట్టసభల సభ్యులు ఇతర లాభదాయక పోస్టుల్లో ఉండకూడదు అనే ఉద్దేశంతో ఆఫీస్‌ ఆఫ్‌ ప్రాఫిట్‌ అనే నిబంధనలు గతంలో తీసుకొచ్చారు. మంత్రి పదవులు, స్పీకర్‌, స్టాండింగ్‌ కమిటీ చైర్మన్లు-సభ్యులు లాంటి పదవులు శాసనసభ విధుల్లో భాగం కాబట్టి వాటిని లాభదాయకం కింద చూడొద్దని ఒక జాబితా ఖరారు చేశారు. ఏయే పోస్టులు లాభదాయకం కావో నిర్ధారించుకునే అధికారాలు రాష్ర్టాలకే ఉంటాయి. ఏపీలో 116 పోస్టులను ఇప్పటికే ఈ జాబితా నుంచి మినహాయించారు. చివరిసారిగా 2007లో టీటీడీ చైర్మన్‌, సభ్యుల పదవులను ఈ జాబితా నుండి మినహాయించారు. అదేవిధంగా ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి పోస్టుకు కూడా ఆఫీస్‌ ఆఫ్‌ ప్రాఫిట్‌ నుంచి మినహాయింపునిస్తూ ‘ఆంధ్రప్రదేశ్‌ పేమెంట్‌ ఆఫ్‌ శాలరీస్‌ అండ్‌ పెన్షన్‌ అండ్‌ రిమూవల్‌ ఆఫ్‌ డిస్‌క్వాలిఫికేషన్స్‌(అమెండ్‌మెంట్‌) ఆర్డినెన్స్‌, 2019’ను గవర్నర్‌ నరసింహన్‌ శనివారం జారీచేశారు. దీంతో విజయసాయిరెడ్డిని మళ్లీ నియమించుకునేందుకు లైన్‌ క్లియర్‌ అయ్యింది.  దీంతో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిని మళ్లీ పదవి వరించింది. ఢిల్లీలో ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా నియమిస్తూ జగన్ సర్కారు జీవో నెంబర్ 35 జారీ చేసింది. ఢిల్లీ ఏపీ భవన్‌లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా నియమిస్తూ విజయసాయిరెడ్డి ఢిల్లీలోని ఏపీ భవన్‌కు వస్తే ఆయన్ను రాష్ట్ర ప్రభుత్వ అతిథిగా గౌరవించాలని ఉత్తర్వులు జారీ చేసింది.అయితే, రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా ఉన్న ఆయనకు ఎలాంటి ఆర్థిక ప్రయోజనాలు ఉండవని స్పష్టం చేసింది.

ఒక పరాజయం 100 తప్పులు.. నాశనం చేసిన బాబు 'నేనే' మంత్ర జపం

  ఉమ్మడి రాష్ట్రానికి తొమ్మిదేళ్లు సీఎంగా పనిచేసిన చంద్రబాబు హైదరాబాద్ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించారు. ఆ విషయం ప్రజలకు తెలుసు. ఆ విషయాన్ని ప్రజలు చెప్తే బాబుకి కూడా గౌరవంగా ఉంటుంది. కానీ బాబు.. హైదరాబాద్ ని నేనే అభివృద్ధి చేశా, హైదరాబాద్ ని నేనే ప్రపంచపటంలో పెట్టా, అన్నీ నేనే చేశా అంటూ పదేపదే చెప్పుకోవడంతో.. ఉన్న గౌరవం పోయి నవ్వుల పాలయ్యారు. రాష్ట్ర విభజన తరువాత ఏపీ మొదటి సీఎంగా బాధ్యతలు చేపట్టాక కూడా ఆయన నేను అనే మాటని వదల్లేదు. ఆ పని నేనే చేశా, ఆ ప్రాజెక్ట్ నేనే తెచ్చా ఇలా అన్నీ నేనే నేనే అంటూ పదేపదే చెప్పి చులకన అయిపోయారు. ఆయన నిజంగానే ఎన్నో చేసి ఉండొచ్చు, కానీ అవన్నీ ఆయన పదేపదే నేనే చేసానని చెప్పుకోవాల్సిన అవసరంలేదు. ఆయన నిజంగానే ప్రజలకోసం చేస్తే.. ప్రజలు గుర్తిస్తారు, గౌరవిస్తారు, గెలిపిస్తారు. కానీ ఇలా పదేపదే నేనే అనడం వల్ల విపక్షాలు దాన్ని అస్త్రంగా మలుచుకొని ప్రజల్లో ఆయన్ని చులకన చేసాయి. ఇప్పుడు ఆయనే విపక్షానికి పరిమితం అయ్యారు. ఎన్నికల ముందు కూడా బాబు నేనే మంత్రాన్ని జపించారు. ఒకవైపు ప్రజల్లో పలువురు ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత ఉంటే.. బాబు ఆ విషయాన్ని పట్టించుకోకుండా నన్ను చూసి ఓటేయండి, అన్ని నియోజకవర్గాల్లో నేనే అభ్యర్థిని అనుకోని ఓటేయండి అని చెప్పుకొచ్చారు. కానీ ప్రజలు మాత్రం స్థానికంగా ఉండేది ఎమ్మెల్యేలే కదా అని వారిని ఓడించి ఇంటికి పంపారు. బాబుని ప్రతిపక్షానికి పరిమితం చేసారు. మరోవైపు ఎమ్మెల్యేలు కూడా నిర్లక్ష్యం చూపారు. అన్నింటికి బాబు నేనున్నా, అన్ని నేనే అంటున్నారుగా అంటూ నిర్లక్ష్యంగా వ్యవహరించి వాళ్ళు ఓడిపోయారు, పార్టీని ఓడించారు. మొత్తానికి బాబు నేనే మంత్ర జపం.. ప్రజల్లో చులకన భావనతో పాటు, పార్టీకి ఓటమిని కూడా రుచి చూపించింది.

బీజేపీలో జనసేన విలీనం.. బీజేపీ సీఎం అభ్యర్థిగా పవన్!!

  అమెరికాలో తానా ఉత్సవాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. తానా వేడుకల్లో అతిథిగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన బీజేపీ జాతీయ కార్యదర్శి రామ్ మాధవ్ తో సమావేశమయ్యారు. అమెరికాలో జరిగిన వీరి భేటీ అందరిలోనూ ఆసక్తి కలిగించింది. ఇది కచ్చితంగా రాజకీయ భేటీ అయ్యుంటుందని వార్తలు కూడా వచ్చాయి. అయితే పవన్, రామ్ మాధవ్ మాత్రం అలాంటిదేం లేదని కొట్టి పారేస్తున్నారు.  పాత పరిచయంతోనే రామ్ మాధవ్ ను కలిశానని పవన్ వెల్లడించారు. తాను రామ్ మాధవ్ ను కలవడం వెనుక ఆపరేషన్ ఆకర్ష్ లాంటివేమీ లేవని స్పష్టం చేశారు. రామ్ మాధవ్ కూడా పవన్ ను స్నేహపూర్వకంగానే కలిశానని, తమ భేటీ వెనుక రాజకీయ ఉద్దేశాలు లేవని స్పష్టం చేశారు. ప్రస్తుతం పవన్ తో పనిచేసే ఉద్దేశం లేదని, అయితే పార్టీలోకి ఎవరొచ్చినా స్వాగతిస్తామని చెప్పారు. వీరిద్దరూ ఇది స్నేహపూర్వక భేటీ అని చెప్తున్నప్పటికీ, ఈ భేటీలో ప్రధానంగా రాజకీయ అంశాలే చర్చకు వచ్చాయని ప్రచారం జరుగుతోంది. పార్టీలోకి ఎవరొచ్చినా స్వాగతిస్తామని చెప్పిన రామ్ మాధవ్.. నిజంగానే ఈ భేటీలో పవన్ ని బీజేపీలోకి ఆహ్వానించారని వార్తలొస్తున్నాయి. ఇటీవల జరిగిన ఎన్నికల్లో జనసేన ఘోర పరాజయాన్ని చవిచూసింది. మరోవైపు బీజేపీ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఏపీలో అధికారమే లక్ష్యంగా అడుగులు వేస్తోంది. దానిలో భాగంగా ఇప్పటికే పలువురు టీడీపీ నేతలను పార్టీలో చేర్చుకుంటున్న బీజేపీ.. ఇప్పుడు పవన్ మీద దృష్టి పెట్టిందట. పవన్ ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ.. ఆయనకు యూత్ లో మంచి ఫాలోయింగ్ ఉంది. పవన్ కి దగ్గరైతే యూత్ బీజేపీకి దగ్గరవుతారని ఆ పార్టీ అధిష్టానం భావిస్తోందట. అదేవిధంగా మెజారిటీ కాపు సామాజికవర్గం కూడా పవన్ వెంట నడిచే అవకాశముంది బీజేపీ అంచనా వేస్తోందట. అందుకే ఇప్పుడు పవన్ కి దగ్గరయ్యే ప్రయత్నాలు చేస్తుందని తెలుస్తోంది. దానిలో భాగంగానే రామ్ మాధవ్.. పవన్ ని కలిసి జనసేనను బీజేపీలో విలీనం చేయాలనీ అప్పుడు మీరే సీఎం అభ్యర్థి అని చెప్పారట.. లేదా వచ్చే ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకోవాలని కోరారట.  అయితే ఈ విషయంలో పవన్ మాత్రం వెనకడుగు వేస్తున్నట్లు తెలుస్తోంది. బీజేపీ ఏపీకి అన్యాయం చేసిందని గతంలో పవన్ పదేపదే విమర్శించారు. ఇప్పుడు అదే బీజేపీతో దోస్తీ అంటే ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్లి జనసేన మరింత బలహీన పడుతుందని ఆయన భావిస్తున్నారట. ఇక విలీనం అనే మాట వింటేనే పవన్ ఉలిక్కిపడుతున్నారట. గతంలో పవన్ సోదరుడు చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ స్థాపించిన సంగతి తెలిసిందే. ఉమ్మడి రాష్ట్రంలో 18 ఎమ్మెల్యే సీట్లు కూడా గెలుచుకుంది. అయితే తరువాత చిరంజీవి ప్రజారాజ్యాన్ని కాంగ్రెస్ లో విలీనం చేసారు. దీంతో ఆయన తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. ఇప్పుడసలు రాజకీయాలకే దూరంగా ఉంటున్నారు. అందుకే పవన్ విలీనం అంటేనే ఉలిక్కిపడుతున్నారట. అదీగాక ప్రజారాజ్యాన్ని కాంగ్రెస్ లో విలీనం చేయడం పట్ల పవన్ కూడా అప్పుడు అసంతృప్తి వ్యక్తం చేసారు. మళ్ళీ ఇప్పుడు తానే తాను స్థాపించిన పార్టీని విలీనం చేయడం కరెక్ట్ కాదని పవన్ భావిస్తున్నారట. అయితే బీజేపీ కనీసం పవన్ తో పొత్తుకైనా ఒప్పించాలని చూస్తోందట. మరి పవన్ బీజేపీతో కలిసి పనిచేసే విషయంపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి. 

తొక్కుదామనుకుంటే ఏకు మేకయ్యాడు రేవంత్ !

  ప్రస్తుతం పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న సంగతి తెలిసిందే.అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిని చవిచూసి తిరిగి పార్లమెంటు ఎన్నికల్లో ఘన విజయం సాధించి మొదటి సారి లోక్ సభలో అడుగుపెట్టిన మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్ రెడ్డి తెరాస దుమ్ము దులిపి పారేశారు. జీరో అవర్ లో ఆయన లేవనెత్తిన అంశాలు పలువురుని ఆకట్టుకున్నాయి. పోడు భూముల వివాద అంశాన్ని రేవంత్ రెడ్డి ప్రస్తావించి ఇటీవల అటవీ శాఖ అధికారిణి అనితపై జరిగిన దాడి సహా పోడు భూముల సమస్యల గురించి మాట్లాడి దశాబ్దాలుగా ప్రభుత్వం, ఆదివాసీల మధ్య నలుగుతున్న భూ సమస్య పరిష్కారంలో కేంద్రం జోక్యం చేసుకోవాలని కోరారు.  రెవెన్యూ, అటవీ శాఖల మధ్య సమన్వయం లేకపోవడం వల్లే తెలంగాణలో ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని, తద్వారా శాంతిభద్రతల సమస్య తలెత్తుతోందని కాగజ్ నగర్ దాడిని ప్రస్తావించారు. ఐదు లక్షల హెక్టార్ల భూముల విషయంలో సమస్య కొన్నేళ్లుగా సాగుతోందన్నారు. అడవిని పోడు చేసి ఆదివాసీలు జీవిస్తుండగా వారిని వెళ్లగొట్టేందుకు సర్కార్‌ ప్రయత్నిస్తోందని ఆయన ఆరోపించారు. ఐదో షెడ్యూల్‌లో ఉన్న సున్నితమైన ఈ సమస్య విషయంలో కేంద్ర అటవీ, హోంశాఖ మంత్రులు జోక్యం చేసుకొని తక్షణమే సమీక్ష జరపాలని కోరుతున్నానని రేవంత్ ఈ సందర్భంగా విజ్ఞప్తి చేసారు.  ఇక కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కూడా సభలో మాట్లాడారు. ఇంటర్ విద్యార్థుల అంశాన్ని సంజయ్‌ ప్రస్తావించారు. అయితే ఈ విషయాలు ఇప్పుడు హైలైట్ గా నిలుస్తున్నాయి. దానికి కారణం ఈ ఇద్దరూ అసెంబ్లీకి పోటీ చేసి ఓడి మళ్ళీ ఇప్పుడు పార్లమెంట్ కి పోటీ చేసి గెలిచారు. అయితే సంజయ్ సంగతి ఏమో కానీ రేవంత్ ని మాత్రం అప్పట్లో కేసీయార్ గట్టిగా టార్గెట్ చేశారు. అదేదో సినిమాలో అన్నట్టు గేటుని ఎంత గట్టిగా నెడితే అంత బలంగా వెనక్కి వస్తుందని అలాగే వచ్చి నేషనల్ లెవల్లో కెసీఆర్ కి చెమటలు పట్టిస్తున్నాడు రేవంత్. బీజేపీలోకి వెళ్తాడని ప్రచారం కూడా జరుగుతోంది. నిజంగా అది గనుక జరిగిందా ? కేసీఆర్ ఒంటెత్తు పోకడ పాలనకి చరమ గీతం పాడడానికి బీజేపీ మొదటి అడుగు వేసినట్టే.

బాబుని టార్గెట్ చేయడానికి జగన్ కి మరో దారి ?

  అభివృద్ధిని సైతం పక్కన పెట్టి గత ప్రభుత్వ అవినీతి మీదే ఫోకస్ చేసిన ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి బాబును కార్నర్ చేసే మరో విషయాన్ని వెలికి తీశారు. అదేంటంటే సీఎంఆర్ఎఫ్ చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ చెక్ బౌన్స్ వ్యవహారం. టీడీపీ సర్కార్ గతంలో  జారీ చేసిన ఈ చెక్కులు అది కూడా తొమ్మిది వేలకు పైగా చెక్కులు బౌన్స్ కావడంతో ఈ సాకు చూపి బాబును కార్నర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు జగన్.  గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ఇచ్చిన 9వేలకు పైగా ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు బౌన్స్ అయిన వ్యవహారం ఇప్పుడు ఏపీలో తీవ్ర కలకలం రేపుతోంది. ఎన్నికల ముందు ఎలా అయినా వోట్లు గుద్దించుకునే క్రమంలో అన్ని ప్రభుత్వ శాఖల ఖజానాల నుండి సొమ్ము తరలించారని ఆరోపణలు వైసీపీ చేస్తోంది. వ్యవసాయ శాఖలో విత్తనాల కొరతకు కారణం , కొనుగోలు చెయ్యకపోవటం, పెండింగ్ బకాయిలు చెల్లించకపోవటమేనని వ్యవసాయ శాఖామంత్రి కన్నబాబు ఆరోపణలు చేసినా ఎవరూ అంతగా పట్టించుకోలేదు.  కానీ ఇప్పుడు ఈ సీఎం రిలీఫ్ ఫండ్ ల వ్యవహారం మాత్రం కలకలం రేపుతోంది. గతంలో అధికారంలో ఉన్న టీడీపీ ప్రభుత్వం పెద్ద ఎత్తున సీఎంఆర్ఎఫ్ నిధులు కేటాయించింది. ఆ పార్టీ ఎమ్మెల్యేలు కోరిందే తడవుగా చెక్కులు జారీ అయ్యేవి. అయితే సరిగ్గా ఎన్నికలకు ముందు ప్రభుత్వం పెట్టిన కొన్ని అనవసర పధకాల వలన నిధుల మళ్లింపు జరిగినదని అందుకే రాష్ట్ర వ్యాప్తంగా 9 వేల చెక్కులు బౌన్స్ అయ్యాయని అధికారులు చెబుతున్నట్టు సమాచారం. 9 వేలకుపైగా చెక్కులు బౌన్స్ అవగా ఆ అయ్యిన వాటి విలువ 40 కోట్ల దాకా ఉంటుందని అంచనా. ఇక దీనికి బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకునే ఆలోచనలో ఉన్నారట జగన్.  

ఒక పరాజయం 100 తప్పులు.. కోడికత్తి టీడీపీకే దిగిందా?

  ఒకప్పుడు రాజకీయాల్లో ప్రత్యర్థుల మీద రాజకీయపరమైన విమర్శలు మాత్రమే ఉండేవి. కానీ ఇప్పుడు అలా కాదు. నాయకులు ఒక్కరిపై ఒకరు వ్యక్తిగత విమర్శలు చేసుకుంటున్నారు. దీనికి టీడీపీ కూడా మినహాయింపు కాదు. ఓ రకంగా టీడీపీ ఘోర పరాజయానికి ఈ వ్యక్తిగత విమర్శలు కూడా కారణమని చెప్పవచ్చు. టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో అప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్న వైఎస్ జగన్ మీద పదేపదే వ్యక్తిగతంగా విమర్శలు చేస్తుండేది. అదే టీడీపీ కొంపముంచింది. జగన్ అప్పటికే అవినీతి ఆరోపణల కేసుల కేసులో ఏడాదికి పైగా జైలులో ఉన్నారు. జగన్ ని అప్పటి కేంద్ర ప్రభుత్వం అన్యాయంగా జైలుకి పంపిందని అప్పటికే వైసీపీ శ్రేణుల్లో అభిప్రాయం ఉంది. దానికి తోడు.. తరువాత ఆయన అధికారంలోకి వచ్చేవరకు యాత్రల పేరుతో ప్రజల్లోనే ఉన్నారు. ఇలాంటి సమయంలో ఆయన్ను 'ఏ1' అంటూ పదేపదే టీడీపీ వ్యక్తిగతంగా టార్గెట్ చేసి విమర్శలు చేయడంతో.. ప్రజల్లో జగన్ మీద తెలీకుండానే సానుభూతి ఏర్పడింది. అదేవిధంగా విశాఖ ఎయిర్ పోర్ట్ లో జగన్ పై జరిగిన కోడి కత్తి దాడి విషయంలో కూడా టీడీపీ నోరు పారేసుకుంది. బాబూ రాజేంద్ర ప్రసాద్ వంటి నేతలైతే.. జగన్ మీద ఆయన తల్లో, చెల్లెలో దాడి చేసి ఉంటారంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసారు. అంతేకాదు మిగతా టీడీపీ నేతలు కూడా 'కోడి కత్తి.. కోడి కత్తి' అంటూ జోకులేసారు. అక్కడ దేనితో దాడి జరిగిందనేది కాదు.. ఎవరి మీద దాడి జరిగిందనేది ముఖ్యం. ఓ ప్రతిపక్ష నేత దాడి మీద జరిగితే.. అధికార పార్టీ నేతలు మాట్లాడాల్సిన మాటలేనా అవి?. అలా కోడి కత్తి అంటూ నోరు పారేసుకుని, జగన్ మీద సానుభూతి పెంచారు. తమ పార్టీ మీద వ్యతిరేకత పెంచుకున్నారు. ఓ రకంగా గత ఐదేళ్లల్లో టీడీపీ తమ ప్రభుత్వం చేస్తున్న, చేయబోతున్న అభివృద్ధి గురించి చెప్పడం కంటే.. జగన్ మీద విమర్శలు చేయడానికే ఎక్కువ సమయం వెచ్చించింది. ఇప్పుడు ఫలితం అనుభవిస్తుంది.

హోదాని అటక ఎక్కించారు.. కనీసం ఇప్పుడైనా పోరాడతారా జగన్?

  2019-2020 ఆర్ధిక సంవత్సరానికి గాను కేంద్ర బడ్జెట్‌ను కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ శుక్రవారం లోక్‌సభలో ప్రవేశపెట్టారు. ఎప్పటిలాగానే బడ్జెట్‌లో తెలుగు రాష్ట్రాలకు నిరాశే ఎదురైంది. ముఖ్యంగా ఏపీకి అన్యాయం జరిగిందని పలువురు అభిప్రాయపడుతున్నారు. వైసీపీ ఎంపీ విజయ సాయి రెడ్డి కూడా బడ్జెట్ పై అసంతృప్తి వ్యక్తం చేసారు. ఏపీకి కేంద్రం మొండిచేయి చూపించిందని విమర్శించారు. అయితే ఇప్పుడు కేంద్ర బడ్జెట్ పై ఏపీ సీఎం జగన్ ఎలా స్పందిస్తారోనన్న ఆసక్తి అందరిలో నెలకొంది. ఎన్నికలకు ముందు.. తమ పార్టీని గెలిపిస్తే ఏపీకి న్యాయం జరిగేలా చూస్తామని జగన్ చెప్పారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితులు కనిపించట్లేదు. ఇప్పటికే ప్రత్యేకహోదా విషయంలో.. బీజేపీకి పూర్తీ మెజారిటీ ఉందని, కాబట్టి బ్రతిమాలడం తప్ప చేసేదేమి లేదని జగన్ చేతులెత్తేశారు. మరోవైపు బీజేపీ నేతలేమో హోదా ముగిసిన అధ్యాయమని కుండబద్దలు కొట్టేసారు. మొత్తానికి అందరూ కలిసి హోదా విషయం అటక ఎక్కించారు. హోదా విషయంలో మొండిచేయి చూపిన కేంద్రం.. బడ్జెట్ లో కూడా ఏపీకి అన్యాయం చేసింది. ఏదో విజయ సాయి మీడియా ముందుకొచ్చి అన్యాయం జరిగిందని చెప్పారు సరే. మరి సీఎం జగన్ ఏం చేయబోతున్నారు?. గతంలో కేంద్ర బడ్జెట్ లో ఏపీకి అన్యాయం జరిగితే, అప్పుడు రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీడీపీ మీద వైసీపీ తీవ్ర విమర్శలు చేసింది. టీడీపీ కేంద్రం మీద ఒత్తిడి తెచ్చి రాష్ట్రానికి ఏం తీసుకురాలేకపోతుందని వైసీపీ పదే పదే విమర్శలు చేసింది. కట్ చేస్తే.. ఇప్పుడు రోజులు మారాయి. ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చింది. మళ్ళీ కేంద్ర బడ్జెట్ లో ఏపీకి అన్యాయం జరిగింది. మరి ఇప్పుడు జగన్ ఏం చేయబోతున్నారు?. కేంద్రం మెడలు వంచి ఏపీకి న్యాయం జరిగేలా చూస్తారా?. లేక హోదా విషయంలో వెనక్కి తగ్గినట్టే తగ్గి విమర్శలు పాలవుతారా?. ఏపీ ప్రజలు జగన్ ని నమ్మి వైసీపీకి 151 ఎమ్మెల్యే సీట్లు, 22 ఎంపీ సీట్లు కట్టబెట్టారు. 22 ఎంపీ సీట్లు అంటే మాములు విషయం కాదు. ప్రాంతీయ పార్టీలలో ఎంపీల సంఖ్యా పరంగా వైసీపీనే ముందు వరుసలో ఉంది. మరి జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు?. పార్లమెంట్ సాక్షిగా వైసీపీ ఎంపీలతో ఏపీకి న్యాయం జరిగేదాకా పోరాటం చేయిస్తారా? లేక బీజేపీని ఢీ కొట్టడం రిస్క్ ఎందుకని సైలెంట్ గా ఉంటారో కాలమే నిర్ణయిస్తుంది.

చేతులు కాలాకయినా ఆకులు పట్టుకున్నారు....థాంక్స్ లోకేష్ గారూ !

  టీడీపీ కార్యకర్తలు, మద్దతుదారులకు పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందని టీడీపీ నేత, ఎమ్మెల్సీ నారా లోకేష్ తెలిపారు. వైసీపీ నేతలు బెదిరించినా, దాడిచేసినా, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారంటూ కేసులు పెట్టి వేధించినా టీడీపీ ప్రత్యేక విభాగం నంబర్ 7306299999కు సమాచారం అందించాలని సూచించారు. ఎల్లవేళలా పార్టీకి అండగా ఉన్న కార్యకర్తలు, అభిమానులను రక్షించుకోవడం తమ బాధ్యత అని వ్యాఖ్యానించారు. అలాగే టీడీపీ కార్యకర్తలు, మద్దతుదారులను ఆదుకునేందుకు ప్రతీ జిల్లాకు లీగల్ సెల్ ఏర్పాటు చేశామని లోకేశ్ పేర్కొన్నారు.  టీడీపీ కార్యకర్తలు, మద్దతుదారులు తమపై ఎదురైన వేధింపులపై ఫిర్యాదు చేసేందుకు https://www.facebook.com/tdpsocialmedialegalcell  అనే ఫేస్ బుక్ పేజీని ప్రారంభించామని తెలిపారు. సోషల్ మీడియాలో ఎలాంటి అభ్యంతరకరమైన పోస్టులు కార్యకర్తల దృష్టికి వస్తే, ఈ పేజీ వేదికగా పంచుకోవాలని కోరారు. అలాంటి వ్యక్తులపై చట్టపరమైన పోరాటం చేస్తామనీ, చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పార్టీపై దుష్ప్రచారం చేస్తూ, పార్టీ నేతలపై అసభ్యకరమైన రీతిలో సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్న వారిపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు.  దీని కోసం ప్రతి జిల్లాలో తెదేపా లీగల్ సెల్ ను ఏర్పాటు చేస్తున్నాం. ఎల్లవేళలా పార్టీకి అండగా ఉన్న కార్యకర్తలను, అభిమానులను రక్షించుకోవడం మా బాధ్యత అని లోకేష్ పేర్కొన్నారు.  అయితే ఈ పని ఎప్పుడో చేసి ఉండాల్సిందనే వాదన ఇప్పుడు వినిపిస్తోంది. దానికి కారణం మనం చేసిన మంచి పనులు జనాలకు తెలిస్తే జనానికి మనం నచ్చొచ్చు నచ్చకపోవచ్చు కానీ కానీ మనపై జరుగుతున్న దుష్ర్పచారాన్ని అడ్డుకోకపోతే ప్రతి ఒక్కరికి దూరమైపోతామని చాన్నాళ్ళగా తెలుగుదేశం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే వారు ఎప్పటి నుండో మొత్తుకున్నా వారి మాట చెవిన పడేసుకున్న పాపాన పోలేదు పార్టీ.  కానీ అంతా అయిపోయి జరగాల్సిన నష్టం జరిగాక ఇప్పుడు ఆ విషయాన్ని గొప్పగా చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ తనకున్నంత మీడియా బలం వైకాపాకు లేదనే భ్రమలో ఉండింది కానీ అత్యంత ప్రభావవంతమైన సోషల్ మీడియాని వైకాపా ఆక్రమించింది అనే విషయాన్ని పార్టీ గ్రహించలేకపోయింది, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో వైకాపా, టీఆర్ఎస్ కార్యకర్తలు చంద్రబాబును తిట్టని తిట్టు లేదు. బోల్లిబాబు అంటూ మొదలు పెట్టి రకరకాల పేర్లతో, ఫోటో మార్ఫింగ్ లతో చంద్రబాబు గురించి చేయని ప్రచారం, చెప్పని అబద్ధమూ లేదు.  కానీ అధికారంలో ఉన్న పార్టీని ఇంత ధైర్యంగా తిడుతున్నా, వ్యక్తిగత పరువుకు భంగం కలిగిస్తున్నా తెలుగుదేశం ప్రముఖులు అస్సలు పట్టించుకోలేదు. నవ్విన నాపచేను పండుతుంది అనుకున్నారో ఏమో అసలు ఖండన కూడా ఉండేది కాదు. ఏకంగా విజయసాయి రెడ్డి లాంటి వాళ్ళు వైకాపా అనఫీశియాల్ పెయిడ్ పేజెస్ లో లోకేష్, చంద్రబాబుల మార్ఫింగ్ ఫోటోలు పెట్టినా ఎవరూ పట్టించుకోలేదు. విజయసాయిరెడ్డి మొదట తన ట్విట్టరులో ఏదో ఒక ఆరోపణ చేస్తారు. ఆ ఆరోపణ చేసే విధానం కూడా చాలా అద్భుతంగా ఉంటుంది.  పార్టీలో ఆ స్థాయి వ్యక్తి రాతపూర్వకంగా చెప్పారు అంటే అది నిజమై ఉంటుంది కదా అని ఆ పార్టీ కార్యకర్తలు విస్తృత ప్రచారం చేసేవారు. కానీ ఏ ఒక్క ఆరోపణ మీద కూడా టీడీపీ పరువు నష్టం దావా వేయలేదు. కోర్టుకు వెళ్లలేదు, దీంతో ఆయన మళ్లీ మళ్లీ ఎప్పుడూ ఎవరూ చేయని ఆరోపణలు కూడా చేయడం మొదలుపెట్టారు. అలా రాష్ట్ర ప్రజల్లో చంద్రబాబు పనులను, అభివృద్ధిని అబద్ధమని నమ్మించడంలో వైసీపీ వంద శాతం సక్సెస్ అయ్యింది. దీనిని మొగ్గలోనే అడ్డుకుని ఉంటే టీడీపీకి ఇంత డ్యామేజ్ కచ్చితంగా జరిగేది కాదు. చివరకు ఈరోజు కృష్ణా జిల్లాకు తొలకరి కంటే ముందే నీరు అందిస్తున్న పట్టిసీమ కూడా చంద్రబాబు కట్టి తప్పు చేశాడు, అవసరం అయితే ఆ పట్టిసీమని కూడా కూలగొట్టాలి అని ఆ పార్టీ నేతలు అంటున్నారంటే బాబు చేసిన అభివృద్ధిని వైసీపీ ఎలా ప్రచారం చేసిందో అర్ధం అవుతోంది. మొత్తానికి చేతులు కాలాక అయినా ఆకులు పట్టుకుంటూ మంచి పనే చేస్తున్నారని ఆ పార్టీ శ్రేణులు లోకేష్ కి థాంక్స్ కూడా చెబుతున్నారు.   

జగన్ అభద్రతా భావం....అందుకే విజయసాయి తొలగింపు ?

  ఏపీ రాజకీయాల్లో ఒక ఘటన ఆసక్తికరంగా మారింది, అదే విజయసాయి రెడ్డి ప్రత్యేక ప్రతినిది హోదా నుండి తొలగింపు. నిజానికి ఇది మామూలుగా అయితే అంత పెద్ద ప్రాముఖ్యత లేని వార్తే అని చెప్పాలి. ఏదో పొరపాటున నియమించారు, ఇప్పుడు రూల్ తెలిసి తప్పించారని సరిపెట్టుకోవచ్చు. కానీ గత కొన్ని రోజులుగా విజయసాయి రెడ్డి గురించి జరుగుతున్న ప్రచారం మాత్రం అలా సరిపెట్టుకోనివ్వడం లేదు.  ఎందుకంటే ఇది జగన్ తీసుకున్న అనూహ్య నిర్ణయం. వైకాపాలో అత్యంత కీలకంగా వ్యవహరిస్తున్న వ్యక్తి విజయసాయి, అక్రమాస్తుల కేసులో కలిసి జైలుకి వెళ్లి వచ్చిన నాటి నుండి ఈయనను పార్టీలో నెంబర్ 2 స్థానానికి వచ్చేలా చేశారు జగన్. అసలు ఏ మాత్రం రాజకీయ అనుభవం లేని ఈయన ఏకంగా ఒక పార్టీలో నెంబర్ 2 అయ్యాడంటే అది మామూలు విషయం కాదు. ఆయన చదువు ప్రకారం ఆయన ఒక తెలివయిన వ్యక్తి అయ్యుండచ్చు, కానీ ఏమాత్రం రాజకీయ అనుభవం లేకున్నా జగన్ పుణ్యమా అంటూ ఏకంగా పీఎంవోలో గంటల తరబడి కూర్చునే స్థాయికి వచ్చారు.  ఆ మహత్యమో ఏమో కానీ 2019 ఎన్నికల్లో అయితే విజయసాయిరెడ్డి లేకుండా ఏ పనీ జరగలేదు. జగన్ ని కూడా అంతగా పట్టించుకోక క్యాడర్ మొత్తం ఆయన చుట్టూనే తిరిగింది. ఎంతో కీలకంగా కనిపించిన ఆయనకు ప్రచారం జరిగినట్టే ప్రాధాన్యత దక్కింది. మొన్నటి విజయం అనంతరం ఏకంగా 5 పదవులు జగన్ ఆయనకు కట్టబెట్టారు. అందులో అత్యంత కీలకమైన, కేబినెట్ ర్యాంకు కలిగిన పోస్టు ‘ఢిల్లీలో ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి’ పదవి కూడా ఒకటి. అయితే ఈ పోస్టును రద్దు చేస్తూ నిన్న రాత్రి జగన్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.  దీనికి కారణంగా నిబంధనల పేరు చెబుతున్నారు. ఓ ఎంపి మరో లాభదాయక పదవిలో కొనసాగేందుకు వీలు లేదన్నది ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారం ఉన్న నిబంధన. ఇదే విషయంలో గతంలో కూడా సోనియా గాంధి వంటి వారి మీద చాలా వివాదాలు రేగాయి. అందుకే తప్పించామని చూచాయగా చెబుతున్నా ఈ కీలకమైన పోస్టును పీకేయడం వెనుక మరో పెద్ద కారణమే ఉండే అవకాశం ఉందని అంటున్నారు. ఈ మధ్య కాలంలో మోడీకి ఏపీ బీజేపీ నేతల కంటే సాయిరెడ్డి ఎక్కువ దగ్గరయ్యాడని విశ్లేషకుల భావన. ఈ విషయాన్ని ఆయనే చెప్పుకున్నాడు, మోడీ వచ్చి విజయ్ గారూ బాగున్నారా అని అన్నారని, ఇది జీవితంలో అత్యంత సంతోషకరమైన రోజు అని ఆయన పేర్కొన్నాడు.  నిజానికి విజయసాయి మీద ఆంధ్రా పళని స్వామి అంటూ ప్రచారం జరుగుతోంది. ఆయన సొంత పార్టీకి ఎలా హ్యాండ్ ఇచ్చి మోడీతో చేతులు కలిపి సీఎం పీఠాం అనుభవిస్తున్నాడో ఈయన కూడా అదే చేయబోతున్నాడనేది కొందరి వాదన. అదీ కాక ఏపీలో వైసీపీ వారిని చేర్చుకోడానికి బీజేపీ తలుపులు తెరిచింది, ఎటూ జగన్ గెలిచేందుకు మోడీ ఈవీఎంల ద్వారా సాయ పడ్డాడు అనే ప్రచారం ఉండనే ఉంది, ఈ క్రమంలో మెజారిటీ ఎమ్మెల్యేలను తప్పించి, విజయసాయి రెడ్డిని బీజేపీ సీఎం చేసినా ఆశ్చర్యం లేదని ప్రచారం జరిగింది. ఇలాంటి ప్రచారాల మధ్య సాయిరెడ్డిని తప్పించడం ఏపీ రాజకీయల్ల్లో కలకలం రేపుతోంది. ఈ ప్రచారాల వలన ఏర్పడిన అభద్రతా భావం వలనే జగన్ విజయసాయి రెడ్డిని తప్పించారనేది జరుగుతున్న ప్రచారం. చూడాలి ఈ వ్యవహారం ఎంతవరకూ దారితీస్తుందో ?  

ఒక పరాజయం 100 తప్పులు.. టీడీపీకి పెద్ద దెబ్బ వేసిన పెద్ది!

  టీడీపీ ఘోర పరాజయంలో పెద్ది రామారావు కూడా కీలక పాత్ర పోషించారని చెప్పవచ్చు. నారా లోకేష్ ప్రసంగాలు మెరుగు పరచాలనే ఉద్దేశంతో పెద్ది రామారావును శిక్షకుడిగా ఎంపిక చేసారు. లోకేష్ కి శిక్షణ ఇవ్వడం ఏమో కానీ, ఆయన పార్టీకి పరోక్షంగా శిక్ష విధించారనే అభిప్రాయం వ్యక్తమవవుతోంది. పెద్ది రామారావు రచయిత. పలు నాటకాలు, సీరియల్స్ రచించారు. మరి ఈయన లోకేష్ దృష్టిలో ఎలా పడ్డారో తెలీదు కానీ.. లోకేష్ ప్రసంగాలు మెరుగుపరిచే బాధ్యత పెద్దికి అప్పగించారు. బహుశా పెద్దికి తెలుగు మీద పట్టు ఉండటం వల్ల ఎంపిక చేశారేమో?. అయితే ఆ ఎంపికే తరువాత వారి కొంపముంచింది. పెద్ది వైసీపీ సానుభూతి పరుడనే ప్రచారం కూడా ఉంది. మరి అలాంటి పెద్దిని లోకేష్ తన దగ్గర ఎలా పెట్టుకున్నారో అర్థంకాని ప్రశ్న. పెద్ది మూలంగా లోకేష్ ప్రసంగాలలో పెద్దగా మార్పేమీ లేదు. అదే తడబాటు, అదే నవ్వులపాలు. కానీ పెద్ది జీవితం ఈ నాలుగేళ్లలో చాలా మారిపోయిందనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఆయన ఆర్థికంగా చాలా బలపడ్డారట. అంతేకాదు ఈయన పార్టీ డేటాని కూడా లీక్ చేసారని కూడా ఆరోపణలు ఉన్నాయి. అలాగే, ప్రభుత్వం మీద ప్రజల్లో ఎలాంటి అభిప్రాయం ఉందన్న విషయంలో బాబుకి ఈయన తప్పుడు రిపోర్టులు కూడా ఇచ్చారు అంటారు. మొత్తానికి పెద్దిని పక్కన పెట్టుకొని.. బాబు, లోకేష్ లు పార్టీకి పెద్ద నష్టమే చేశారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.  

సీఎం జగనే...కానీ పాలన మాత్రం ఆయనదా ?

  ఏపీలో ఆగ‌స్ట్ 15వ తేది నుంచి గ్రామ సేవ‌కుల వ్య‌వ‌స్థ అమ‌లులోకి రానుంది. దీంతో ఇక‌ ప్ర‌భుత్వ ప‌థ‌కాల‌న్నీ వారి చేతుల మీదుగానే పంపిణీ కానున్నాయి. ఆఖ‌రికి రేష‌న్ స‌రుకుల‌ను సైతం గ్రామ సేవ‌కులే ఇంటింటికి చేరుస్తారని సీఎం జగన్ ప్రకటించారు. ఈ క్రమంలో ఇప్పటి దాకా రేష‌న్ అందిస్తున్న డీల‌ర్ల వ్య‌వ‌స్థ ర‌ద్దు కానుంది. వేలాది మంది రేష‌న్ డీల‌ర్లు రోడ్డున ప‌డ‌నున్నారు, అయితే ప్ర‌భుత్వానికి ఇప్ప‌టికే వారంతా త‌మ రేష‌న్ డీల‌ర్ల వ్య‌వ‌స్థ‌ను రద్దు చేయ‌వ‌ద్ద‌ని కోరుతూ ప‌లు విన్న‌పాలు చేశారు.  అయినా ప్ర‌భుత్వం నుంచి ఎటువంటి స్పంద‌న లేని నేప‌థ్యంలో ఎపీ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ కు ఆధ్యాత్మిక గురువు స్వ‌రూపానందేంద్ర స‌ర‌స్ప‌తిని ఈ రేష‌న్ డీల‌ర్లు ఆశ్రయించారు. ఈ వ్య‌వ‌స్థ ర‌ద్దు కాకుండా త‌మ‌రే త‌మ‌ను ర‌క్షించాల‌ని ఈరోజు స్వామిజీ అభ్య‌ర్ధించారు. ఇప్పుడు ఇదే విషయం రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారింది. నిజానికి స్వాములు ఆధ్యాత్మిక దీవెనలు ఇస్తారు తప్ప ప్రభుత్వాలు, మంత్రులు, సీఎంల మాదిరిగా సమస్యలు పరిష్కరించరు కదా. మరి అలాగైతే.. రేషన్ డీలర్లు తమ సమస్యల పరిష్కారం కోసం స్వరూపానంద వద్దకు ఎందుకు వచ్చినట్టు ? అంటూ నెటిజన్లు ఆడుకుంటున్నారు. ఏపీలో ఏ పని కావాలన్నా స్వరూపానంద ఆశీస్సులు ఉంటే చాలని, స్వయంగా ముఖ్యమంత్రి హోదాలో ఉన్న జగన్ నిత్యం స్వామి వారి పాద సేవ చేస్తుంటే స్వామి వారి నోట నుంచి వచ్చే మాటను పెడచెవిన పెట్టరని, ఈ లాజిక్ గ్రహించిన రేషన్ డీలర్లు ఇలా తమ సమస్యల పరిష్కారం కోసం సీఎం జగన్ ను ఆశ్రయించడానికి బదులుగా నేరుగా స్వరూపాందన వద్దకు వచ్చారని ప్రచారం జరుగుతోంది.  గతంలో తెలంగాణలోనూ చిన్నజీయర్ స్వామిని కలిసి రెవెన్యూ ఉద్యోగులు ఆ శాఖను ప్రక్షాళన చేయకుండా కేసీఆర్ కు చెప్పాలని వినతిపత్రం ఇవ్వడం అప్పట్లో సంచలనంగా మారింది. ఇప్పుడు జగన్ విషయంలో కూడా రేషన్ డీలర్ లు అలాగే ప్రవర్తిస్తున్నారు. అయితే ఇదంతా కావాలని చేసిందని వైసీపీ అనుకూల వెబ్ మీడియా కధనాలు ప్రచురించింది. స్వామీజీని కలసిన రేషన్ డీలర్ల వర్గం అసలు యూనియన్ లో ఒక భాగం మాత్రమేనని కేవలం జగన్ ని టార్గెట్ చేయడం కోసమే వారు ఈ పనిచేసినట్టు తెలుస్తోందని కధనాలు ప్రచురించింది.  గతంలో జగన్ స్వామీజీని కలిసినప్పుడు టీడీపీ నేతలు నానా హంగామా చేసి స్వరూపానంద పవర్ సెంటర్ గా మారుతున్నారని ఆరోపించారని ఆ ఆరోపణలకి తగ్గట్టే మంత్రివర్గ కూర్పు సమయంలో చాలామంది ఆశావహులు స్వరూపానంద దర్శనానికి ఎగబడ్డారు కూడా. ఆ తర్వాత జగన్ నుంచి సూచనలు వెళ్లాయో లేక స్వామీజీయే అవగతం చేసుకున్నారో తెలియదు కానీ ఇటీవల రాజకీయ తాకిడి శారదా పీఠానికి కాస్త తగ్గిందని, కానీ ఇప్పుడు కావాలనే ఇలా రేషన్ డీలర్ లు చేశారని అంటున్నారు.  ముందుగా ఒక వినతి పత్రం ఇవ్వడానికి వస్తున్నామని చెబితే శారదా పీఠం నిర్వాహకులు ఒప్పుకోలేదని, అందుకే భక్తుల ముసుగులో ఆ డీలర్లు స్వామీజీని కలిశారని, ఎక్కడా డీలర్లనే ప్రస్తావనే రాకుండా, అసలు సమస్య ఏమిటో కూడా స్వరూపానందకు చెప్పకుండా దర్శనం చేసుకుని, ఆశీర్వాదం తీసుకుంటున్న ఫొటోలు తీసుకుని వైరల్ చేశారనేది ఆ మీడియా సారాంశం. అయితే ఇందులో నిజం ఎంత అనేది ఆ స్వరూపానంద స్వాముల వారికే ఎరుక.  

ఒక పరాజయం 100 తప్పులు.. బాబుని కార్యకర్తలకు దూరం చేసింది ఆ 'చౌదరే'నా?

  మన దగ్గర ఏమీ లేనప్పుడు అందరితో మంచిగా ఉండటం గొప్ప కాదు.. మన దగ్గర అన్నీ ఉన్నప్పుడు అందరితో ఉండటం గొప్ప. అలాగే రాజకీయాల్లో.. పార్టీ క్రియాశీల కార్యకర్తగా ఉన్నప్పుడు మిగతా కార్యకర్తలతో మంచిగా ఉండటం గొప్పకాదు, పార్టీలో తగిన గుర్తింపు వచ్చి మంచి స్థాయికి వెళ్ళాక కూడా కార్యకర్తలతో మంచిగా ఉండటం గొప్ప. ఇది లేకనే టీడీపీలో ఒక నేత తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. ఓ రకంగా టీడీపీ ఓటమికి కూడా కారణమయ్యారు. ఆయనే టీడీపీ ప్రోగ్రామ్స్ కమిటీ చైర్మన్ వీవీ చౌదరి. వీవీ చౌదరి అప్పట్లో తెర వెనుక నుండి టీడీపీ కోసం క్రియాశీల కార్యకర్తగా తన వంతు కృషి చేసారు. మరి ఈయన బాబు తనయుడు లోకేష్ దృష్టిలో ఎలా పడ్డారో తెలీదు కానీ.. ఆయనకు బాగా దగ్గరయ్యారు. ఎంతలా అంటే ఫోను చేసి స్వేచ్ఛగా మాట్లాడే అంత. తరువాత పార్టీ ఆఫీస్ లో కూడా వీవీ చౌదరి హవా కొనసాగింది. ఆయన హవానే నిజమైన కార్యకర్తలను పార్టీకి దూరమయ్యేలా చేసింది. దురుసుగా ప్రవర్తించడం, ఎవర్ని లెక్క వేయకుండా మాట్లాడం, కార్యకర్తలు ఏదైనా సమస్యను పార్టీ దృష్టికి తీసుకొస్తే పట్టించుకోకపోవడం. ఇలా సొంత పార్టీ కార్యకర్తలని ఇబ్బంది పెట్టారు. పార్టీలో అంతా నేనే అన్నట్లుగా లోకేష్, బాబులకు దగ్గరైన ఈయన.. కార్యకర్తలను దూరం చేసాడు. దీన్ని గుర్తించడంలో బాబు విఫలమయ్యారు. అందుకే ఇప్పుడు ఫలితాన్ని అనుభవిస్తున్నారు.

కృష్ణా నది మీద నింద మోపుతున్న బీజేపీ మాజీ ఎంపీ

  హనుమంతుడు దళిత వర్గానికి చెందినవాడు  - "బీజేపీ" నేత, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ హనుమంతుడు ‘జాట్’ కులానికి చెందినవాడు - "బీజేపీ" నేత, యూపీ మంత్రి లక్ష్మీ నారాయణ చౌదరి  మహాభారత కాలం నుంచే భారత్‌లో ఇంటర్‌నెట్ -  "బీజేపీ" నేత, త్రిపుర సీఎం బిప్లవ్‌కుమార్  మహాభారత కాలం నుంచే జర్నలిజం ఉంది -   "బీజేపీ" నేత, యూపీ డిప్యూటీ సీఎం దినేశ్ శర్మ తొలి విమానాన్ని కనిపెట్టింది భారతీయుడే -   "బీజేపీ" నేత, కేంద్ర మంత్రి సత్యపాల్‌సింగ్    ప్లాస్టిక్ సర్జరీ దేవుడు-వినాయకుడు - "బీజేపీ" నేత, ప్రధాని నరేంద్ర మోడీ కృష్ణానది మా భూమిని ఆక్రమించింది - "బీజేపీ" నేత, మాజీ ఎంపీ గోకరాజు గంగరాజు ఇవన్నీ చూస్తోనే నవ్వొస్తోందా మీకు, నవ్వుకోండి నవ్వుకోండి. మిగతా విషయాలు పాతవే కాబట్టి వాటి సంగతి ప్రస్తుతం ప్రస్తావానర్హం కాదు. ఇక గోకరాజు గంగరాజు గారి గురించి మనం మాట్లాడాల్సి వస్తే, ప్రస్తుతం ఏపీ మొత్తం మీద అక్రమ కట్టడాల కూల్చివేతల అంశం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. కృష్ణా నది కరకట్టపై ఉన్న కట్టడాలను అక్రమ కట్టడాలుగా తేల్చిన సీఆర్డీఏ అధికారులు ఆయా యజమానులకు కూల్చివేత నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే.  అందరితో పాటే బీజేపీ నేత, మాజీ ఎంపీ గోకరాజు గంగరాజు గెస్ట్ హౌస్ కి కూడా అధికారులు నోటీసులు ఇచ్చారు. అయితే ఈ నోటీసుల మీద గోకరాజు గారి స్పందనే ఆసక్తికరంగా మారంది. కరకట్టను తాము ఆక్రమించుకోలేదన్న ఆయన కృష్ణా నదే తమ భూములను ఆక్రమించిందని చెప్పిన లాజిక్ కి మైండ్ బ్లాక్ కావడం విలేఖరుల వంతు అయింది. నదీ భూములను తాము ఆక్రమించలేదని నిజానికి తమ భూములను కృష్ణా నదే కబ్జా చేసిందని అంటున్నారు.  25 ఏళ్ల క్రితం నుంచి ఉండవల్లిలో 25 ఎకరాల భూమి ఉందని చెప్పుకొచ్చారు. తాను కట్టిన గెస్ట్ హౌస్ కు వైఎస్సార్ హయాంలో మల్లాది విష్ణు ఉడా చైర్మన్ గా ఉండగానే ఉడా, ఇరిగేషన్ శాఖల అనుమతి తీసుకునే కట్టానని గంగరాజు చెప్పారు. బీపీఎస్ వచ్చిన తర్వాత అనుమతి కోసం దరఖాస్తు చేశామని, అనుమతి రాలేదని చెప్పారు. దీంతో గతంలో ఇరిగేషన్ అధికారులు 30 అడుగులు మాత్రం వదిలి భవనం నిర్మించుకోమని పర్మిషన్ ఇచ్చినట్లుగా గోకరాజు తెలిపారు. నదిలో కూడా‌ మాకు ఇంకా ల్యాండ్ ఉందని వరద వచ్చినప్పుడల్లా మా ల్యాండ్ కొంత కోల్పోతున్నామని ఆయన అంటున్నారు. ఫాంహౌస్ కట్టుకున్న తర్వాత నదికి 100 మీటర్ల లోపల కట్టకూడదని జీవో వచ్చిందని గోకరాజు చెప్పారు. ప్రజావేదికను కూల్చిన విధంగా అన్నీ కూల్చాలంటే రాష్ట్ర వ్యాప్తంగా నది వెంబడి ఉన్నటువంటివి ఎన్నో కూల్చాల్సి ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు.  తాను కట్టిన భవంతి విలాసవంతమైనది కాదని కేవలం ఫాం హౌస్ మాత్రమే అని వివరించారు. చిన్న చిన్న పొరపాట్లు అందరూ చేస్తారన్న గోకరాజు అందరి మీద చర్యలు తీసుకున్న తర్వాత తన మీద తీసుకున్నా తనకు అభ్యంతరం లేదని అంటున్నారు. గోకరాజు చేసిన వ్యాఖ్యలు ఏపీలో చర్చకు దారితీశాయి. ఆయన మాటలతో అంతా అవాక్కవుతున్నారు.    

చేతులు కాల్చుకుని ఆకులు పట్టుకున్న బీజేపీ

  ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల మీద ఫోకస్ పెట్టిన బీజేపీ, రెండు తెలుగు రాష్ట్రాలలో వీలయినంత మందిని చేర్చుకునే పనిలో పడింది. ఆ చేర్చుకునేది ఏదో పేరున్న నాయకులనో, నలుగురు చేయెత్తి నమస్కారం పెట్టగలిగిన వ్యక్తులనో చేర్చుకుంటే ఫర్వాలేదు కానీ ఒక అరవై ఏళ్ళు పైబడిన మహిళను తనను లైంగికంగా వేధించిందని పరువు తీసిన వ్యక్తిని పార్టీలో చేర్చుకోవడంతో ఇప్పుడు పరువు తీసుకుని, దానిని కవర్ చేసుకునే పనిలో పడింది. తాజాగా బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ – ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీ పార్వతి తనను లైంగిక వేధింపులకు గురి చేసిందంటూ ఎన్నికలా సమయంలో  ఫిర్యాదు చేసిన కోటి అనే వ్యక్తిని కండువా కప్పి పార్టీలోకి చేర్చుకున్నారు.  అయితే కోటి కావాలనే లక్ష్మీ పార్వతి పరువు తీయడానికే ఇలా చేశాడని హైదరాబాద్ పోలీసులు తేల్చారు, అంతేకాదు పూనమ్ కౌర్ మాట్లాడుతున్నట్టుగా ఉన్న వీడియోలని వైరల్ చేసింది కూడా ఇతనే అని పోలీసులు గుర్తించారు. కోర్టుకు వెళ్లి నం బెయిలబుల్ వారెంట్ తెద్దాం అనుకునే లోపే ఈ కోటి వెళ్లి బెయిలు తెచ్చేసుకున్నాడు. అయితే అప్పుడు మిస్సయ్యిన కోటి నిన్న బీజేపీ అధ్యక్ష్యుల వారి కండువాలో కనపడ్డాడు. ఈ క్రమంలో ఇలాంటి వ్యక్తిని పార్టీలో చేర్చుకోవడంపై సామాన్య ప్రజల్లో సైతం ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. లక్ష్మీపార్వతి వైసీపిలో ఉంది కాబట్టి ఆమె చట్టపరమైన చర్యలు తీసుకోకుండా వాటి నుంచి తప్పించుకోవడానికి ఆయన బీజేపీలో చేరి ఉంటాడని నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు.  సుజనా చౌదరి, సీఎం రమేష్ లాంటి వాళ్ళను ఆర్ధిక ఉగ్రవాదులు అంటూ తెలుగు ప్రజల్లో ప్రాజెక్ట్ చేసిన బీజేపీ పెద్దలు ఆ తర్వాత ఏమాత్రం తొణకకుండా వారిని పార్టీలో చేర్చుకున్నప్పుడు రాజకీయాల్లో ఇలాంటివి సహజమే అని జనం సరిపెట్టుకుని ఉండచ్చు, కానీ ఒక మహిళ అది కూడా వృద్ద మహిళను ఇలా అసభ్య రీతిలో చిత్రీకరించిన ఇలాంటి వ్యక్తిని పార్టీలో ఎలా చేర్చుకుంటారని వారు ప్రశ్నిస్తున్నారు. దీంతో ఈ కోటి పార్టీలో చేరడం వలన ఒరిగేది ఏమీ లేకున్నా పెద్ద నష్టం కలిగేలా ఉండడంతో బీజేపీ నేతలు వెంటనే దీనిపై వివరణ ఇచ్చుకున్నారు.  మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు ఆధ్వర్యంలో వినుకొండ నియోజకవర్గానికి చెందిన 80 మంది టీడీపీ కార్యకర్తలు నిన్న పార్టీలో చేరారని వారిలో కోటి కూడా ఉన్నాడని అతనిని ప్రత్యేకంగా ఏమీ చేర్చుకోలేదని, ఇంకా బీజేపీలో కోటికి సభ్యత్వం ఇవ్వలేదని. అతడు బీజేపీ సభ్యుడు కాదని క్లారిటీ ఇచ్చింది. అయినా తాను 100 మందితో వచ్చి జాయిన్ అయ్యానని, మోడీ పాలన నచ్చే జాయిన్ అయ్యానని కోటి చెబుతుంటే బీజేపీ మాత్రం తమకు సంబంధం లేదని అంటోంది. అయినా విషయం తెలియక చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే లాభం ఏముంది చెప్పండి.

విత్తన సంక్షోభం : గత ప్రభుత్వ నిర్లక్ష్యమా....ఈ ప్రభుత్వ అనుభవలేమా ?

ఏపీ ప్రభుత్వ అనుభవ లేమి ప్రతి విషయంలోనూ కొట్టోచ్చిన్నట్టు కనిపిస్తోంది. ఏపీ ప్రభుత్వం పాలన మొదలుపెట్టి నెల రోజులయింది. అయితే ఈ ప్రభుత్వానికి మొట్టమొదటి దెబ్బ రైతుల నుండే తగిలింది. విత్తనాల లేమితో  రైతులందరూ రోడ్ల మీదకు వచ్చే పరిస్థితి ఎదురయింది. తడ నుండి ఇచ్చాపురం దాకా విత్తనాల సమస్య తీవ్రంగా ఉంది. ఇప్పటికే పలు చోట్ల రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తున్నారు. విత్తన పంపిణీ కేంద్రాల వద్ద రైతులు బారులు తీరుతున్నారు. పడిగాపులు పడుతున్నారు. కానీ విత్తనాలు మాత్రం అందడం లేదు. అయితే విత్తన సమస్యను తీర్చే చర్యల గురించి చెప్పాల్సిన మంత్రి టీడీపీ ప్రభుత్వం మీద నిందలేసి తాము పరిశుద్దులం అనిపించుకునే ప్రయట్నం చేస్తున్నారు.  ఈ నెల రోజుల్లో వ్యవసాయ సీజన్‌ కు రైతులకు కావాల్సినవి అందుబాటులో ఉంచారో, లేదో మాత్రం సమీక్ష చేయలేకపోయారు ఏపీ మంత్రి వర్యులు. అవినీతి మీద సమీక్ష అంటూ సమయం వృధా చేసిన సర్కార్ ఒక్క రోజంటే ఒక్క రోజు కూడా వ్యవసాయ సమస్యలపై సమీక్షించలేదు. ఫలితంగా విత్తన సంక్షోభం రైతులను ఏడిపిస్తోంది. ఏదో ఒకటి చేసి విత్తనాలు రైతులకు ఇవ్వాల్సిన సర్కారు గత ప్రభుత్వం దగ్గర ప్రణాళికే లేదని, నాణ్యమైన విత్తనాల పంపిణీలో గత ప్రభుత్వం విఫలమయిందని మంత్రి కన్నబాబు చెప్పుకొస్తున్నారు. విత్తన సేకరణకు, పంపిణీకి గత ప్రభుత్వానికి.. ఒక స్పష్టమైన కార్యాచరణ లేదని మండిపడ్డారు. అయితే సుమారుగా 25 రోజుల క్రితమే మంత్రిగా బాధ్యతలు తీసుకున్న కన్నబాబు, వ్యవసాయశాఖ శాఖ మీద పట్టు సాదించలేకపోయారు అని చెప్పవచ్చు. రాష్ట్రంలో ఉన్న రైతులకు ఎన్ని క్వింటాళ్ల విత్తనాలు పంపించేయాలి మన దగ్గర ఎన్ని క్వింటాళ్ల విత్తనాలు ఉన్నాయి అని వ్యవసాయశాఖ అధికారులు దగ్గర సమాచారం ఉంటుంది, కానీ అవి ఏమి తెలుసుకోకుండా మంత్రి అట్టహాసంగా జూన్ 15 తేదీన విత్తన పంపిణీ ప్రారంభించారు. అయితే విత్తన పంపిణీ విషయంలో వ్యవసాయశాఖ వైఫల్యం చెందడంతో రైతులు రాస్తారోకోలు, ధర్నాలకు దిగారు.  ఆలస్యంగా మేలకున్న మంత్రి కన్నబాబు చంద్రబాబు మీదకే నెపం నెట్టే ప్రయత్నం చేశారు. ఇప్పుడు విత్తనాల కోసం 10 రోజుల్లో మరో వెయ్యి కోట్లు విడుదల చేస్తామని గొప్పగా ప్రకటించారు. ఎక్కువ ధర ఇచ్చైనా నాణ్యమైన విత్తనాలు సేకరిస్తామని చెబుతున్నారు. ఈ ఏడాది 4.43 లక్షల క్వింటాళ్ల వేరుశనగ విత్తనాలను పంపిణీ చేయాల్సి ఉంటే తమ ప్రభుత్వం ఏర్పడేనాటికి 50 వేల క్వింటాళ్లనే సేకరించారన్నారు. తాము అధికారంలోకి వచిన తర్వాత 2.70 లక్షల క్వింటాళ్లను సిద్ధం చేసి రైతులకు అందజేశామని, మరో 50 వేల క్వింటాళ్లను అందుబాటులో ఉంచినట్టు చెబుతున్నారు. ఇది జగన్ ప్రభుత్వ అనుభవ లేమితోనే జరిగిందని విశ్లేషకులు భావిస్తున్నారు.

ఒక పరాజయం 100 తప్పులు.. టీడీపీ కొంప ముంచిన NRI ముఠా

  దూరపు కొండలు నునుపు అన్నట్టుగా.. కొందరు ఎన్నారైల మాయలో పడి, వారినేదో గొప్పవారిలా ఊహించుకొని చంద్రబాబు దెబ్బతిన్నారా అంటే అవుననే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఎన్నారైలు ఇక్కడ నుంచి విదేశాలకు బ్రతుకుదెరువు కోసం వెళ్లిన వారు మాత్రమే. కానీ బాబు, లోకేష్ లు మాత్రం.. కొందరు ఎన్నారైలను ఆకాశం నుంచి దిగొచ్చిన వారిలా చూస్తూ.. వారి భజనకి, వారి మాయమాటలకు పడిపోయి.. తానా అంటే తందానా అన్నారు. ఇప్పుడు ఫలితం అనుభవిస్తున్నారు. ఎన్నారైలు నాలుగు డాలర్లు వెనకేసుకునే సరికి.. వారికి టికెట్, వీరికి పదవి అంటూ బాబు, లోకేష్ ల వద్ద పైరవీలు చేసారు. దీంతో నిజమైన కార్యకర్తలు, పార్టీ కోసం కష్టపడిన సరైన గుర్తింపు లేక చిన్నగా పార్టీకి దూరమవుతూ వచ్చారు. దీనికి తోడు వేమూరి రవి వంటి వారు APNRT పేరుతో చేసిన హడావుడి అంతాఇంతా కాదు. అదేదో ప్రభుత్వ సంస్థనో, పార్టీ అనుబంధ సంస్థనో అన్నట్లు చేసారు. అంతేనా ఎన్నారైలు తిరుమల వస్తే వారికి ప్రత్యేక దర్శనం టికెట్లు అంట. వారేమన్నా దైవాంశ సంభూతులా? లేక మంత్రులు, ప్రధాన మంత్రులా?. ఇలా వారిని నెత్తికి ఎక్కించుకొని బాబు తీవ్ర విమర్శలు పాలయ్యారు. బాబు సామాజిక వర్గానికి చెందిన కొందరు ఎన్నారైలు.. టీడీపీ తమ కులానికి చెందిన పార్టీ అన్నట్టుగా అత్యుత్సాహం చూపడం కూడా పార్టీ ప్రతిష్టతను దెబ్బతీసింది. టీడీపీ మొదటినుంచి అండగా ఉన్న అనేక కులాలను దూరం చేసింది. ఈ ఎన్నారై ముఠా ఇంకా చాలా కార్యాలు వెలగబెట్టింది. అవన్నీ ఈ వీడియోలో వివరంగా తెలుసుకోండి.