ఏపీలో మళ్లీ ఎన్నికలు.. టీడీపీ స్కెచ్, వైసీపీకి షాక్

  ఏపీలో మళ్లీ ఎన్నికలు జరుగుతాయనీ, అందుకు టీడీపీ ప్లాన్ కూడా సిద్ధం చేసిందని ప్రచారం జరుగుతోంది. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేదీ మాటలు కూడా ఇందుకు సంకేతాలుగా కనిపిస్తున్నాయి. ఈ నెల 27 అర్థరాత్రి వరకూ ఎన్నికల కోడ్ అమల్లో ఉంటుందన్న ఆయన.. తప్పనిసరి అయితే రీపోలింగ్ జరిపిస్తామన్నారు. వీవీ ప్యాట్ స్లిప్పుల్లో తేడా వచ్చినా, ఈవీఎం డీకోడ్ కాకపోయినా, ఈవీఎంలు మొరాయించినా, పార్టీల మధ్య ఓట్ల తేడా తక్కువగా ఉన్నా రీపోలింగ్‌ జరిపించే అవకాశం ఉందని ద్వివేది స్పష్టం చేశారు. ఈ మాటలను టీడీపీ తనకు అనుకూలంగా మార్చుకోవాలన్న ఆలోచనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఎన్నికల ఫలితాలు తమకు అనుకూలంగా వస్తే సరే. ఒకవేళ వ్యతిరేకంగా వస్తే మాత్రం ఈవీఎంలు, వీవీప్యాట్లలో తేడా కొట్టిందనీ, అంతా గందరగోళం అయిపోయిందనీ మళ్లీ ఎన్నికలు జరపాల్సిందేనని టీడీపీ పట్టుపట్టే ఛాన్సుందని తెలుస్తోంది. వైసీపీ వైపు నుంచీ చూస్తే... ఆ పార్టీ మళ్లీ ఎన్నికలు అనే ఆలోచనలోనే లేదు. ఎందుకంటే కచ్చితంగా తామే గెలుస్తామని బలంగా నమ్ముతోంది. ఈ నమ్మకమే టీడీపీని మళ్లీ ఎన్నికలవైపు నడిపిస్తోందనే ప్రచారం జరుగుతోంది. వైసీపీ అంత కాన్ఫిడెంట్‌గా ఉందంటే.. ఎన్నికల్లో ఏదో గోల్‌మాల్ జరిగిందనీ, దాన్ని ఎలాగైనా కనిపెట్టి.. మొత్తం ఎన్నికల్ని రద్దు చేసైనా సరే నిజానిజాల్ని బయటకు తేవాలని టీడీపీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల్లో గందరగోళం జరిగినట్లు టీడీపీ నిరూపిస్తే, వీవీప్యాట్ స్లిప్పుల్లో తేడాలను కనిపెడితే, అప్పుడు ఈసీ కూడా గట్టిగా ప్రశ్నించలేని పరిస్థితి ఉంటుంది. అది రీపోలింగ్‌కి దారితీస్తుంది. మరి రేపటి ఫలితాలు ఎవరికి అనుకూలంగా ఉంటాయో, ఒకవేళ టీడీపీకి ప్రతికూలంగా ఉంటే రీపోలింగ్‌ అంటారేమో చూడాలి.

జగన్ కేబినెట్ లో ఆర్ధిక మంత్రిగా విజయసాయి రెడ్డి

  ఏపీలో వైసీపీనే అధికారంలోకి వస్తుందని మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ అంచనా వేసాయి. రాజకీయ విశ్లేషకులు కూడా వైసీపీకి గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు. దీంతో ఫలితాలు రాకముందే వైసీపీ శ్రేణుల్లో ఉత్సాహం మొదలైంది. నిజానికి వైసీపీ శ్రేణులు తమదే అధికారమని మొదటి నుంచి నమ్మకంగా చెబుతున్నాయి. వైఎస్ జగన్ పేరుతో సీఎం నేమ్ ప్లేట్, జగన్ సీఎం ప్రమాణస్వీకారానికి ముహూర్తం, జగన్ డ్రీం కేబినెట్ లిస్ట్.. ఇలా సోషల్ మీడియాలో వైరల్ అయిన కొన్ని పరిశీలిస్తే చాలు.. గెలుపుపై వైసీపీ శ్రేణులు ఎంత నమ్మకంగా ఉన్నాయో అర్ధమవుతోంది. ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ అంచనాలు కూడా వైసీపీకి అనుకూలంగా ఉన్న నేపథ్యంలో జగన్ కేబినెట్ లో ఎవరెవరు ఉండబోతున్నారన్న చర్చలు ఊపందుకున్నాయి. ముఖ్యంగా కీలక నేత విజయసాయి రెడ్డిని జగన్ తన మంత్రివర్గంలోకి తీసుకొని కీలకమైన ఆర్థిక శాఖ అప్పగించనున్నారన్న ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం వైసీపీలో నెంబర్ 2 అంటే విజయసాయి రెడ్డి గుర్తుకొస్తారు. జగన్ కు అత్యంత సన్నిహితుడుగా పేరున్న విజయ సాయి రెడ్డి వైసీపీలో కీలక పాత్ర పోషిస్తున్నారు. గల్లీ నుంచి ఢిల్లీ వరకు పార్టీ కోసం తనవంతుగా కష్టపడుతున్నారు. అందుకే జగన్.. వైసీపీ అధికారంలోకి వస్తే విజయ సాయి రెడ్డిని కేబినెట్ లోకి తీసుకోవాలి అనుకుంటున్నారట. అయితే విజయ సాయిరెడ్డి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయలేదు. ఆయన రాజ్యసభ సభ్యుడిగా మాత్రమే ఉన్నారు. దీంతో ఆయనను ఎమ్మెల్సీ కోటాలో మంత్రిగా తీసుకోవాలన్న ప్రయత్నాల్లో జగన్ ఉన్నట్లు సమాచారం. ఇక ఎంతో కీలకమైన స్పీకర్ పదవిని దగ్గుబాటి వెంకటేశ్వరరావుకు అప్పగించాలన్న యోచనలో జగన్ ఉన్నారని కూడా చర్చ జరుగుతోంది. స్పీకర్ పదవికి అంబటి రాంబాబు పేరు కూడా పరిశీలనలో ఉన్నట్టు సమాచారం. వీరితో పాటు మొదట్నుంచి తన వెంటే ఉన్న కొంతమంది నాయకులకు కూడా తన కేబినెట్‌లో జగన్ చేర్చుకోబోతున్నారని తెలుస్తోంది. ధర్మాన కృష్ణదాస్, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, రోజా, ఆళ్ల రామకృష్ణారెడ్డి, కొడాలి నాని తదితరులకు పదవులు దక్కవచ్చని వైసీపీలో చర్చ జరుగుతోంది.

తెలంగాణలో బీజేపీ బోణి కొట్టనుంది.. గెలిచే సీట్లు అవేనా?

  సార్వత్రిక ఎన్నికలు ముగిశాయి. ఈ నెల 23 న ఫలితాలు వెలువడనున్నాయి. అప్పటికి వరకు నిన్న సాయంత్రం విడుదలైన ఎగ్జిట్ పోల్స్ గురించి చర్చలు జరుగుతూ ఉంటాయి. లోక్ సభ ఎన్నికల్లో కూడా తెలంగాణలో టీఆర్ఎస్‌కే మెజారిటీ సీట్లు ఖాయమని ఎగ్జిట్ పోల్స్ తేల్చేశాయి. అయితే టీఆర్ఎస్ చెబుతున్న 16 సీట్లకు రెండు, మూడు సీట్లు తగ్గే అవకాశముందని సర్వేలు అంచనా వేశాయి. అంతేకాదు తెలంగాణలో బీజేపీ బోణి కొట్టనుందని అంచనా వేశాయి. దీంతో బీజేపీ గెలవబోయే సీటు ఏది అయ్యుంటుంది అంటూ విపరీతమైన చర్చలు జరుగుతున్నాయి. తెలంగాణలో బీజేపీ గెలిచే అవకాశమున్న సీటు అంటే ముందుగా కరీంనగర్ పేరు వినిపిస్తోంది. ఇక్కడ బీజేపీ అభ్యర్థిగా బండి సంజయ్ బరిలోకి దిగారు. బండి సంజయ్ ఎప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటారన్న పేరుంది. దీంతో పార్టీలతో సంబంధం లేకుండా ప్రజలు ఆయన వైపు మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా యువత ఆయనకు అండగా నిలబడ్డారు. దీన్నిబట్టి చూస్తుంటే బండి సంజయ్ పుణ్యమా అని తెలంగాణలో బీజేపీ ఖాతాలో ఒక సీటు పడేలా ఉంది. ఇక బీజేపీ మరో రెండు స్థానాల్లో కూడా బలమైన పోటీ ఇచ్చినట్లు తెలుస్తోంది. అవే సికింద్రాబాద్, నిజామాబాద్ స్థానాలు. ఈ రెండింట్లో ముఖ్యంగా సికింద్రాబాద్ లో బీజేపీ గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. సికింద్రాబాద్ నుంచి బీజేపీ అభ్యర్థిగా సీనియర్ నేత కిషన్ రెడ్డి బరిలోకి దిగారు. సికింద్రాబాద్ లో బీజేపీకి పట్టు ఉండటమే కాకుండా కిషన్ రెడ్డికి కూడా వ్యక్తిగతంగా మంచి ఇమేజ్ ఉండటంతో.. ఇక్కడ బీజేపీ గెలిచే అవకాశాలు లేకపోలేదు. ఇక నిజామాబాద్ లో బీజేపీ గెలుస్తుందని చెప్పలేము కానీ టీఆర్ఎస్ కి గట్టి పోటీ ఇస్తుందనే అభిప్రాయం మాత్రం వ్యక్తమవుతోంది. ఎగ్జిట్ పోల్స్ అంచనా వేసినట్టు తెలంగాణలో బీజేపీ బోణి కొడుతుందో లేదో ఈ నెల 23 న తేలనుంది.

పవర్ లెస్ సీఎం ప్రెస్ మీట్ ని అడ్డుకున్నాడా?

  విజయవాడలో ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమా గురించి ప్రెస్ మీట్ పెట్టాలని ప్రయత్నించి దర్శకుడు రామ్ గోపాల్ వర్మ విఫలమయ్యారు. వర్మ రూపొందించిన 'లక్ష్మీస్ ఎన్టీఆర్‌' సినిమా ఏపీలో తప్ప అన్ని ప్రాంతాల్లో విడుదలైంది. అయితే ఇప్పుడు ఏపీలో సినిమా విడుదలకు లైన్ క్లియర్ అయ్యింది. దీంతో మే 1న సినిమాను విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏపీలో ప్రెస్ మీట్ పెట్టాలని వర్మ అనుకున్నారు. విజయవాడలో నడిరోడ్డుపై లక్ష్మీస్ ఎన్టీఆర్ ప్రెస్ మీట్ పెడతానంటూ ట్విట్టర్‌లో చెప్పిన వర్మ...అనుకున్న ప్రకారం బయల్దేరారు. దీంతో అక్కడ ఎయిర్ పోర్టుకు చేరుకోగానే వర్మను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఏపీలో ఎన్నికల కోడ్ అమల్లో ఉండటంతో వర్మ ప్రెస్ మీట్‌కు పోలీసులు అనుమతి ఇవ్వలేదు. దీంతో వర్మ ఎలాంటి ప్రెస్ మీట్ పెట్టకుండానే వెనుదిరిగారు. ట్విట్టర్ వేదికగా ఏపీ ప్రభుత్వం మీద విమర్శలు గుప్పిస్తున్నారు. మరోవైపు ఈ ఘటనపై స్పందించిన వైసీపీ అధినేత జగన్.. వర్మకు అండగా నిలిచారు. ట్విట్టర్ వేదికగా ఆయన చంద్రబాబును ప్రశ్నించారు. "విజయవాడలో ప్రెస్ మీట్ పెట్టలేని  పరిస్థితుల్లో మన ప్రజాస్వామ్యం ఉంది.  పోలీసుల్ని బంట్రోతులు కన్నా హీనంగా వాడుకునే పరిస్థితుల్లో మన ప్రజాస్వామ్యం ఉంది. ఇదా ప్రజాస్వామ్యం..! చంద్రబాబు గారూ..! ఇంతకీ రామ్ గోపాల్ వర్మ చేసిన తప్పేంటి..?"  అని జగన్ ట్వీట్ చేశారు. అయితే ఈ ఘటనపై వర్మ మీద విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పోలీసుల అనుమతి తీసుకోకుండా ప్రెస్ మీట్‌ ఎలా పెడతారు? అయినా నడిరోడ్డు మీద ప్రెస్ మీట్ ఏంటి? ట్రాఫిక్ కి అంతరాయం కలగదా? అలా నడిరోడ్డు మీద మీటింగ్ పెట్టి ఏదైనా జరగరాని సంఘటన జరిగితే ఎవరిదీ బాధ్యత? అంటూ వర్మ తీరుపై పలువురు మండిపడుతున్నారు. పోలీసులు కూడా వర్మ ప్రెస్ మీట్ కి ఎందుకు అనుమతి ఇవ్వలేదో వివరించారు. విజయవాడ నగరపరిధిలో సెక్షన్‌ 30 పోలీస్‌ యాక్ట్‌, సెక్షన్‌ 114 సీఆర్‌పీసీ, ఎలక్షన్‌ కోడ్‌ అమల్లో ఉన్నాయని గుర్తు చేశారు. ఈ సమయంలో ప్రెస్ మీట్ నిర్వహించుకొనేందుకు ముందస్తుగా పోలీసులు అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలన్నారు. నిత్యం రద్దీగా ఉండే విజయవాడలోని పైపులరోడ్డు, ఎన్టీఆర్‌ సర్కిల్‌ వద్ద ప్రెస్‌ మీట్‌ నిర్వహిస్తే ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగి ప్రజలకు అసౌక్యం ఏర్పడే అవకాశం ఉందన్నారు. ఈ ప్రాంతంలో వర్మ ప్రెస్ మీట్ నిర్వహిస్తే రెండు వర్గాల మధ్య ఘర్షణలకు దారి తీసే అవకాశం ఉందని భావించామన్నారు. దీంతో ముందస్తుగా రామ్‌గోపాల్ వర్మను అదుపులోకి తీసుకొన్నట్టు  పోలీసులు తెలిపారు. ఎలక్షన్‌ కోడ్‌ అమలు, పోలీసుల అనుమతి.. ఇలాంటివి పట్టించుకోకుండా వైఎస్ జగన్ వర్మకి సపోర్ట్ గా మాట్లాడడంపై కూడా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మొన్నటి వరకు చంద్రబాబుని ఆపద్ధర్మ ముఖ్యమంత్రి అని, పవర్ లెస్ సీఎం అని అన్నారు. ఆయనకసలు అధికారులు లేవని, ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పుడు ఈసీ చెప్పిందే వేదమని డైలాగ్ లు కొట్టారు. తీరా పోలీసులు ఎన్నికల కోడ్ పేరుతో వర్మ ప్రెస్ మీట్ ని అడ్డుకుంటే మాత్రం.. చంద్రబాబు సీఎం అని, టీడీపీ ప్రభుత్వం అని గుర్తుకొచ్చిందా?. అయినా పవర్ లెస్ సీఎం ఓ ప్రెస్ మీట్ ని ఎలా అడ్డుకోగలడు?, ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పుడు ఈసీ, సీఎస్ చెప్పిందే వేదమని మీరే చెప్పారు కదా. మరి ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పుడు నడిరోడ్డుపై ప్రెస్ మీట్ పెట్టుకోవడానికి వారు అనుమతి ఇస్తారేమో అడగండి అంటూ పలువురు జగన్ ని ప్రశ్నిస్తున్నారు.

చంద్రబాబు చేసిన పని కూడా చేయలేరా కేసీఆర్?

  తెలంగాణ వ్యాప్తంగా ఇంటర్ బోర్డు నిర్వాకంతో ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. దాదాపు 20 మంది ఇంటర్ విద్యార్థులు మార్కులు తక్కువ వచ్చాయనో, ఫెయిల్ అయ్యామనో ఆత్మహత్యలకు పాల్పడ్డారు. అయితే ఇంత జరుగుతున్నా దీనిపై సీఎం కేసీఆర్ స్పందించకపోవడంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తప్పుకి బాధ్యులైన వారిని శిక్షించి మీకు అండగా ఉంటామని.. విద్యార్థులకు, తల్లిదండ్రులకు భరోసా ఇవ్వలేదు. కనీసం ఆత్మహత్యల పట్ల విచారం వ్యక్తం చేసి.. మిగతా విద్యార్థుల్లో ధైర్యం నింపే ప్రయత్నం కూడా చేయలేదు. కేసీఆర్ కి ఓ ఐదు నిమిషాలు ప్రెస్ మీట్ పెట్టడానికో లేక ఒక ట్వీట్ చేయడానికో కూడా టైం లేదా? అంటూ విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అన్నింట్లో తోటి తెలుగు రాష్ట్రమైన ఏపీతో పోటీ పడే కేసీఆర్.. తెలంగాణలో విద్యార్థుల ఆత్మహత్యపై ఏపీ సీఎం చంద్రబాబు స్పందించినా.. తన సొంతం రాష్ట్రంలో ఇంత జరుగుతుంటే కేసీఆర్ ఎందుకు స్పందించట్లేదు అంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు. తెలంగాణ ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యలపై ట్విట్టర్ వేదికగా చంద్రబాబు స్పందించారు. 'పరీక్షలో ఫెయిల్ అయ్యామని తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్ విద్యార్ధులు ఆత్మహత్య చేసుకున్నట్లు వెలువడుతున్న వార్తలు బాధ కలిగించాయి. ఉజ్వల భవిష్యత్తు ఉన్న విద్యార్ధుల మరణం నన్ను కలిచివేసింది. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి. విద్యార్ధులకు నా విజ్ఞప్తి ఒక్కటే.. కేవలం పరీక్షలు, పాస్ కావడం మాత్రమే జీవితం కాదు. అవి మీ ప్రతిభకు గుర్తింపు మాత్రమే.. కానీ పరీక్షల కంటే మీ జీవితాలు ముఖ్యం. మీ ప్రాణాలు అంతకన్నా అమూల్యమైనవి. పరీక్షల్లో తప్పినంత మాత్రాన మీ జీవితాలను అర్థాంతరంగా ముగించి, మీ కన్నవారు మీపై పెట్టుకున్న ఆశలను కడతేర్చకండి. ఈ వయసులో తల్లిదండ్రులకు కడుపుకోత పెట్టకండి. మీ ముందెంతో సుందరమైన బంగారు భవిష్యత్తు ఉంది. ప్రపంచ చరిత్రలో విజేతలుగా నిలిచిన చాలామంది మొదట పరాజితులే..చదువు అనేది కేవలం విజ్ఞానానికే, అదే జీవితం కాదు. ఓటమి విజయానికి తొలిమెట్టు. మళ్లీ మంచి ఫలితాల కోసం కష్టపడి చదవండి. ఎప్పటికప్పుడు మీ నైపుణ్యాలను పెంచుకోండి. ఎంచుకున్న రంగాలలో ప్రతిభ చూపి రాణించండి. కష్టపడితే విజయం మీదే, బంగారు భవిష్యత్తు మీదే. జీవితంలో మీ ఎదుగుదలే తల్లిదండ్రులకు, దేశానికి  మీరిచ్చే బహుమతి.' అని ట్వీట్ చేశారు. ఈ మాత్రం స్పందన తెలంగాణ సీఎం కేసీఆర్ నుంచి కరువైందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ప‌య్యావుల కేశ‌వ్ ఓడిపోవాలని కోరుకుంటున్న టీడీపీ నేతలు!!

  ఏపీలో ఎన్నికలు ముగిశాయి. ఫలితాలు మే 23 న వెలువడనున్నాయి. మరి విజయం ఎవరిని వరిస్తుందో తెలీదు కానీ ప్రధాన పార్టీల నేతలు మాత్రం ఎవరికి వారు గెలుపు మాదంటే మాదని ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరి ఎవరి ధీమా నిజం కానుందో మే 23 న తేలనుంది. అయితే టీడీపీ.. ఒక నియోజకవర్గంలో ఎక్కడ తమ పార్టీ అభ్యర్థి గెలుస్తాడోనని తెగ కలవరపడిపోతుందట. అదేంటి పార్టీ అభ్యర్థి గెలిస్తే సంతోషమేగా అనుకుంటున్నారా? దానికి ఓ సెంటిమెంట్ ఉందిలేండి. ఆ అభ్యర్థి గెలిస్తే టీడీపీ ప్రతిపక్షానికి పరిమితమవుతుందట. ఇంతకీ ఆ అభ్యర్థి ఎవరో కాదు టీడీపీ సీనియర్ నేత ప‌య్యావుల కేశ‌వ్. ప‌య్యావుల కేశ‌వ్‌.. ఈ ఎన్నికల్లో అనంత‌పురం జిల్లా లోని ఉర‌వ‌కొండ నుండి టీడీపీ అభ్య‌ర్దిగా బ‌రిలో ఉన్నారు. ఆయన గెలిచే అవకాశాలు కూడా ఉన్నాయి అంటున్నారు. అయితే టీడీపీ శ్రేణులు మాత్రం.. ఏంటీ ప‌య్యావుల కేశ‌వ్ గెలుస్తున్నారా.. వామ్మో!! అంటూ తెగ టెన్షన్ పడుతున్నారు. పయ్యావుల 2004, 2009 ఎన్నికల్లో గెలుపొందారు. ఈ రెండు సార్లు టీడీపీ ప్రతిపక్షానికి పరిమితమైంది. ఇక‌ 2014 ఎన్నికల్లో పయ్యావుల ఓడిపోయారు. టీడీపీ అధికారంలోకి వ‌చ్చింది. 2014 ఎన్నిక‌ల్లో ప‌య్యావులపై పోటీ చేసిన వైసీపీ అభ్య‌ర్ది విశ్వేశ్వ‌రరెడ్డి 2275 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. టీడీపీ అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత టీడీపీ అధినేత చంద్ర‌బాబు కేశ‌వ్‌కు ఎమ్మెల్సీగా అవ‌కాశం క‌ల్పించి.. శాస‌న మండ‌లిలో చీఫ్ విప్‌గా నియ‌మించారు. ఉర‌వ‌కొండ నుండి తాజా ఎన్నిక‌ల్లో మ‌రో సారి టీడీపీ అభ్య‌ర్దిగా ప‌య్యావుల బ‌రిలో దిగారు. 2014లో ఓడిన నాటి నుండే ప‌య్యావుల 2019 ఎన్నిక‌ల్లో విజ‌యం కోసం వ్యూహాలు అమ‌లు చేసారు. ఇక‌, అక్క‌డ వైసీపీ నుండి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న విశ్వేశ్వ‌ర రెడ్డిని బ‌రిలో ఉన్నారు. ఇద్ద‌రి మ‌ధ్య హోరాహోరీ పోరు సాగింది. ఈ ఎన్నిక‌ల్లో ఉర‌వ‌కొండ నుండి ఖ‌చ్చితంగా ప‌య్యావుల గెలుస్తార‌నే ధీమాతో స్థానిక నేతలు ఉన్నారు. అయితే రాష్ట్ర నేత‌లు మాత్రం పయ్యావుల గెలిస్తే 2004, 2009 ఎన్నికల సెంటిమెంట్ రిపీట్ అవుతుందేమోనని టెన్షన్ పడుతున్నారు. మరి ప‌య్యావుల ఈసారైనా సెంటిమెంట్ బ్రేక్ చేస్తారో లేక అలానే కంటిన్యూ చేస్తారో చూడాలి.

కేఏ పాల్ కి ఏమైంది? ఎందుకిలా తయారయ్యాడు?

  కేఏ పాల్.. ఒకప్పుడు మత ప్రభోదకుడిగా, శాంతి దూతగా ప్రపంచస్థాయి గుర్తింపు తెచ్చుకున్నాడు. కానీ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఒక కామెడీ పీస్ లా మిగిలిపోయాడు. అవమానాలు ఎదుర్కొన్న స్థాయి నుంచి ఎవరూ ఊహించని స్థాయికి ఎదిగాడు. అంతలోనే నేలకు జారి హేళనలు ఎదుర్కొంటున్నాడు. అసలు కేఏ పాల్ కి ఏమైంది? ఎందుకిలా తయారయ్యాడు? క్లుప్తంగా తెలుసుకుందాం. కేఏ పాల్ పూర్తి పేరు కిలారి ఆనంద్ పాల్. ఆంధ్రప్రదేశ్ లోని చిట్టివలస అనే చిన్న గ్రామంలో జన్మించాడు. వారిది హిందూ మతం అయినప్పటికీ వారి కుటుంబం క్రిస్టియన్ మతంలోకి మారారు. దీంతో కేఏ పాల్ కి చిన్నతనం నుంచి జీసస్ ని పూజించడం అలవాటైంది. అయితే పాల్ చదువులో చాలా వెనుక ఉండేవాడు. పదో తరగతి రెండుసార్లు ఫెయిల్ అయ్యాడు. అతికష్టం మీద మూడో సారి పాస్ అయ్యాడు. తరువాత మళ్ళీ ఇంటర్ లో కూడా ఫెయిల్. ఆ టైం లో పాల్ చిన్న చిన్న పనులు చేసి కూడా డబ్బులు సంపాదించుకునేవాడు. కానీ ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నాడు. ఆ అవమానాలే అతన్ని అందనంత ఎత్తుకి ఎదిగేలా చేశాయి. టెన్త్ కూడా పాస్ కానీ పాల్ పట్టుదలతో ఇంగ్లీష్ బాష మీద పట్టు సాధించాడు. మత ప్రభోదకుడిగా మారిపోయాడు. అనతికాలంలోనే ప్రపంచదేశాల్లో ఉపన్యాసాలు ఇచ్చే స్థాయికి ఎదిగాడు. ఒకానొక టైంలో 20 నిమిషాల ఉపన్యాసానికి 20 కోట్ల రూపాయలు తీసుకున్న రోజులు కూడా ఉన్నాయి. బోయింగ్ 747 ఎస్పీ విమానం కూడా ఆయన సొంతమైంది. ఆయన ట్రస్ట్ ద్వారా ఎందరో అనాధ పిల్లల్ని ఆదుకొని చదివించాడు, ఎందరో విదువరాళ్లకు ఆర్థికసాయం చేశాడు. అయితే అలా ప్రపంచస్థాయి గుర్తింపు తెచ్చుకున్న కేఏ పాల్ రాజకీయాల పుణ్యమా అని కమెడియన్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. కొందరు స్వార్ధ రాజకీయ నాయకులు చేసిన కుట్రల్లో కేఏ పాల్ బలైపోయారు అంటుంటారు. కొందరు నాయకులు ఆయనను కోట్ల డబ్బులు ఇవ్వమని బెదిరించేవారట, కొందరైతే మత ప్రభోదనలు ఆపివేయాలని ఒత్తిడి తెచ్చేవారట. ఇలా రకరకాల ఒత్తిడులు, బెదిరింపులు.. మరోవైపు 2008 లో కేఏ పాల్ ప్రజాశాంతి పార్టీ స్థాపించాడు. తరువాత ఒత్తిడులు మరింత పెరిగాయి. దీంతో ఆయన ఆ రాజకీయ కుట్రలు, ఒత్తిడులు తట్టుకోలేక 2009 ఎన్నికల్లో పోటీ కూడా చేయలేదు. ఇంతలో సోదరుడిని హత్య చేశారన్న ఆరోపణలతో జైలు. అయితే తనని కుట్ర ప్రకారం జైలుకు పంపించారని కేఏ పాల్ చెప్తుంటారు. ఈ వరుస సంఘటనలతో పాల్ మెంటల్ గా బాగా డిస్ట్రబ్ అయ్యారు. మత ప్రభోదనలకు దూరమయ్యాడు. ఒకప్పుడు విమానాల్లో ప్రపంచ దేశాలు చుట్టొచ్చిన ఆయన.. ఇప్పుడు తన వింత చేష్టలు, వింత మాటలతో 2019 ఎన్నికల్లో ఒక కమెడియన్ గా మిగిలిపోయాడు. ఇప్పుడు ఆయన చేష్టలు చూసి మనం నువ్వుకుంటున్నాం కానీ ఒకప్పుడు ఆయన్ని చూసిన వారు మాత్రం ప్రస్తుత ఆయన పరిస్థితిని చూసి జాలిపడుతున్నారు.

హైదరాబాద్ లో పోలింగ్ శాతం తగ్గడానికి కారణం

  తెలంగాణలో లోక్ సభ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. అయితే 2014 ఎన్నికలు, 2018 ముందస్తు అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే.. ఈ ఎన్నికల్లో పోలింగ్ శాతం బాగా తగ్గింది. 17 లోక్‌సభ నియోజకవర్గాల్లో 62.25 శాతం పోలింగ్‌ నమోదైనట్టు ఎన్నికల సంఘం అధికారులు వెల్లడించారు. రాష్ట్రం మొత్తం మీద ఖమ్మం లోక్‌సభ నియోజకవర్గంలో రికార్డు స్థాయిలో 75.61 శాతం పోలింగ్‌ నమోదైంది. అతితక్కువగా హైదరాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గంలో 39.49 శాతం నమోదైంది. సాధారణంగానే హైదరాబాద్ లో పోలింగ్ శాతం తక్కువగా ఉంటుంది. 2014 ఎన్నికల్లో 53.27 శాతం ఉండగా.. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో 47.29 శాతం నమోదైంది. ఇక తాజాగా జరిగిన లోక్ సభ ఎన్నికల్లో కనీసం 40 శాతం కూడా నమోదు కాలేదు. అదేవిధంగా.. మల్కాజిగిరిలో 42.75 శాతం, సికింద్రాబాద్ లో 45 శాతం నమోదైంది. దీంతో ఓటర్లు మీద విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే పోలింగ్ శాతం తగ్గిపోవడానికి ముఖ్యంగా రెండు కారణాలు ఉన్నట్లు తెలుస్తోంది. తెలంగాణ, ఏపీ రాష్ట్రాలలోని వివిధ ప్రాంతాలకు చెందిన వారు భారీ సంఖ్యలో హైదరాబాద్ లో నివసిస్తూ ఉంటారు. వీరిలో చాలామంది హైదరాబాద్ తో పాటు, సొంత ఊరిలో ఓటు కలిగి ఉన్నారు. ఏపీలో లోక్ సభతో పాటు అసెంబ్లీ కి కూడా ఎన్నికల జరగడంతో, చాలామంది హైదరాబాద్ నుండి తమ సొంత ఊళ్లకు వెళ్లి అక్కడ ఓటు హక్కు వినియోగించుకున్నారు.హైదరాబాద్ లో ఓటింగ్ శాతం తగ్గడానికి ఇది ఒక కారణంగా కనిపిస్తోంది. ఇక మరో ముఖ్య కారణం.. ఎవరికి ఓటేసి ఏం లాభం అనే అభిప్రాయం ఓటర్లలో ఏర్పడటం. అసెంబ్లీ ఎన్నికల్లో 88 సీట్లతో టీఆర్ఎస్ ఘన విజయం సాధించింది. ఆ తరువాత ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలు కూడా టీఆర్ఎస్ కు క్యూ కట్టారు. దీంతో అసెంబ్లీ అంతా దాదాపు గులాబీమయం అయింది. ఇప్పుడు లోక్ సభ ఎన్నికల్లో కూడా టీఆర్ఎస్ హవా కొనసాగేలా ఉంది. ఒకవేళ వేరే పార్టీ అభ్యర్థికి ఓటేస్తే.. వారు గెలిచినా టీఆర్ఎస్ గూటికి చేరే అవకాశముంది. ఈ మాత్రం దానికి ఓటేయడం ఎందుకనే అభిప్రాయం కొందరు వ్యక్తం చేస్తున్నారు. మొత్తం మీద పలు కారణాల పుణ్యమా అని తెలంగాణలో పోలింగ్ శాతం తగ్గిపోయింది.

తనని తిట్టినవారికే నవ్వుతూ కండువాలు కప్పుతున్న జగన్

  ఎన్నికల సమయం దగ్గరపడుతున్న వేళ వైసీపీ అధినేత వైఎస్ జగన్.. వరుసపెట్టి పలువురు నేతలకు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు. ఈ చేరికలు చూసి వైసీపీ శ్రేణులు ఆనందపడుతున్నారు. అయితే వారి చేరిక వల్ల వైసీపీకి కొత్తగా ఒరిగేది ఏముందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఎందుకంటే దాదాపు వారంతా గతంలో వైసీపీని వీడి, జగన్ మీద తీవ్ర విమర్శలు చేసిన వారే. గత ఎన్నికల సమయంలో వైసీపీలో చేరి, తర్వాత పార్టీని వీడి.. జగన్‌ మీద విమర్శలు గుప్పించిన వారు వరుసగా ఇప్పుడు వైసీపీలో చేరుతున్నారు. వీరిలో కొందరు ఎన్నికలకు ముందుగానే పార్టీ ఫిరాయించిన వారున్నారు. కొందరు ఎన్నికల్లో వైసీపీ ఓడిపోయిన తర్వాత ఫిరాయించిన వారున్నారు. గతంలో వైసీపీని వీడి తనమీద విమర్శలు చేసిన వారిని జగన్ ఏరికోరి మరి పార్టీలో చేర్పించుకుంటున్నారు. రీసెంట్ గా వైసీపీలో చేరిన దేవినేని చంద్రశేఖర్, రఘురామకృష్ణంరాజు, దాడి వీరభద్రరావు లాంటి వారు ఆ కోవలోకే వస్తారు. మంత్రి దేవినేని ఉమా సోదరుడు దేవినేని చంద్రశేఖర్.. 2014 ఎన్నికలకు ముందు వైసీపీలో చేరారు. జగన్ టికెట్ ఇస్తారేమో అని ఆయన ఆశపడ్డారు. కానీ ఇవ్వలేదు. ఎన్నికల్లో వైసీపీ ఓడిపోవడంతో.. అనంతరం మళ్లీ ఆయన సోదరుడు ఉమాకి దగ్గరయ్యారు. ఆ సమయంలో.. ఆయన జగన్‌పై తీవ్ర విమర్శలు చేశారు. ఇప్పుడు మళ్లీ జగన్ పంచకు చేరారు. జగన్‌ కూడా హ్యాపీగా కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఇక రఘురామకృష్ణంరాజు అయితే గతంలో జగన్ ని నపుంసకుడు అంటూ హద్దు దాటి విమర్శలు చేశారు. తనని వ్యక్తిగతంగా దూషించిన వ్యక్తిని కూడా జగన్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించేశారు. మాజీ మంత్రి దాడి వీరభద్రరావు కూడా అంతే. ఆయన వైసీపీకి రాజీనామా చేసినప్పుడు.. జగన్‌ వ్యక్తిత్వం పై చేసిన విమర్శలు అన్నీ ఇన్నీ కాదు. జగన్ పై విమర్శల దాడి చేసిన ఆయన చాలా కాలం పాటు ఏ పార్టీలోనూ చేరలేదు. ఈ మధ్య టీడీపీలో చేరడానికి సిద్ధమయ్యారు అంటూ వార్తలొచ్చాయి. కానీ టికెట్ విషయంలో టీడీపీ సానుకూలంగా స్పందించక పోవడంతో వెనకడుగు వేశారు. ఇక ఎన్నికల సమయం వచ్చే సరికి.. మళ్లీ వైసీపీ వైపే చూశారు. ఇలా తనను విమర్శించిన వారిని.. జగన్ పిలిచి మరీ పార్టీలో చేర్చుకోవడంతో.. ఆయనకు ఇంతకు మించిన నేతలు దొరకడం లేదా? వారి చేరికల వల్ల జగన్‌కు లాభం కన్నా నష్టమే ఎక్కువ ఉంటుంది అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

లోకేష్ నీ బాడీని గ్యారేజ్ లో చూపించుకో.. మతిస్థిమితం లేని మంత్రి!!

  'రాజకీయ నాయకుల మధ్య పార్టీల సిద్ధాంతపరమైన వ్యతిరేకతే తప్ప వ్యక్తిగత వ్యతిరేకత ఉండదు. వ్యక్తిగతంగా ఒకరినొకరు దూషించుకోరు.' ఇది ఒకప్పటి మాట. ఈ తరంలో కొందరు నేతలు హద్దు దాటి వ్యక్తిగతంగా విమర్శలు చేసున్నారు. అందులో ముందువరుసలో ఉంటారు వైసీపీ నేత విజయసాయి రెడ్డి. ట్విట్టర్ వేదికగా విజయసాయి.. ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ మీద హద్దు దాటి విమర్శలు చేస్తున్నారు. ఆయన కూడా విమర్శల పాలవుతున్నారు.   కొండవీడులో రైతు కోటయ్య మృతికి టీడీపీ, ఏపీ పోలీసులే కారణమని వైసీపీ ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. అలాగే రైతు కులాన్ని ప్రస్తావిస్తూ జగన్ ట్వీట్ చేసారు. దీనిపై స్పందించిన లోకేష్.. జగన్ కులరాజకీయాలు చేస్తున్నారని, శవాలపై పేలాలు ఏరుకునే జగన్ మరోసారి శవరాజకీయం మొదలుపెట్టారని విమర్శించారు. అయితే ఈ విమర్శలకు విజయ సాయి ఘాటు రిప్లై ఇచ్చారు. 'లోకేష్.. మేం శవాల మీద పేలాలు ఏరుకుంటున్నాం అని ట్వీట్ పెట్టావ్. ఇంతకీ శవం ఎవరు. నువ్వా? మీ నాన్నా?' అని ట్వీట్ చేసారు. ఈ ట్వీట్ పై విమర్శలు వెల్లువెత్తాయి. విమర్శలు చేయాలి గానీ.. మరీ ఇలా బ్రతికున్నవాళ్లను శవాలంటూ వారి చావుని కోరుకోవడం ఏంటని పలువురు తప్పుపట్టారు. కొందరైతే గతంలో జగన్ నంద్యాల ఉపఎన్నికల సందర్భంగా సీఎం చంద్రబాబుని నడిరోడ్డు మీద ఉరి తీయాలంటూ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ.. అధినేత బాటలోనే మిగతా నేతలంతా నడుస్తున్నారు. మీ పార్టీ నేతలు ఎదుటి వ్యక్తుల చావుని కోరుకుంటున్నారు, మీరేం ప్రజా నాయకులు అసలు? అంటూ విమర్శిస్తున్నారు. అయినా విజయ సాయి వ్యక్తిగత విమర్శలు ఆపలేదు. తాజాగా లోకేష్ బాడీ గురించి హద్దు మీరి కామెంట్స్ చేసారు. వైసీపీ, బీజేపీ, టీఆర్ఎస్ కలిసిపోయాయని టీడీపీ ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. ఇదే విషయాన్నీ లోకేష్ ట్విట్టర్ లో వ్యంగంగా ట్వీట్ చేసారు. 'ఢిల్లీ మోడీ గారు, తెలంగాణ మోడీ కేసిఆర్ గారు, ఆంధ్రా మోడీ జగన్ గారికి కలలో కూడా చంద్రబాబు గారే గుర్తుకొస్తున్నారు. ఫెడరల్ ఫ్రంట్ అంటూ చక్రం తిప్పి 420 పార్టీతో జత కట్టిన కేసీఆర్ గారు తెలంగాణకే పరిమితమై చతికలపడ్డారు.' అని ట్వీట్ చేసారు. అయితే దీనికి కౌంటర్ గా విజయ సాయి లోకేష్ బాడీ గురించి కామెంట్స్ చేసారు. 'లోకేష్.. నీకు జగన్ గారిలోనూ కేసీఆర్ గారిలోనూ మోడీ గారు కనిపిస్తున్నారా? ఆంధ్ర మోడీ, తెలంగాణ మోడీ అని వ్యగంగా ట్వీట్ చేసావు. మోడీ సంగతి తర్వాత ఆలోచిద్డువులే.. ముందు నీ బాడీ, ముఖ్యంగా మైండ్ సంగతి ఆలోచించు! ఎక్కడన్నా మంచి గ్యారేజ్ లో చూపించుకో.మతిస్థిమితం లేని వాళ్ళు మంత్రిగా అనర్హులు.' అంటూ ట్వీట్ చేసారు. ఈ ట్వీట్ పై కూడా నెటిజన్లు విరుచుకుపడుతున్నారు. నేతలు హుందాగా విమర్శలు చేయాలి, తమపై వచ్చిన విమర్శలను హుందాగా తిప్పికొట్టాలి. అంతేకాని ఇలా బాడీ, మైండ్ గ్యారేజ్ లో చూపించుకో, మతిస్థిమితం లేదంటూ హద్దు దాటి వ్యాఖ్యలు చేయడం ఏంటని మండిపడుతున్నారు. మరి విజయ సాయి ఇప్పటికైనా తన తీరు మార్చుకొని హుందాగా విమర్శలు చేస్తారో లేక ఎన్నికలు వస్తున్నాయిగా అని ఇంకాస్త డోస్ పెంచి విమర్శలు పాలవుతారో చూడాలి.

ఏపీలో కాంగ్రెస్ ని చూసి వైసీపీ భయపడుతోందా?

  వచ్చే ఎన్నికల్లో ఏపీలో కాంగ్రెస్ పార్టీ మాకు పోటీ ఇస్తుంది, కాంగ్రెస్ పోటీ చేస్తే మా పార్టీకి ఇబ్బంది అని టీడీపీ, వైసీపీ పార్టీలు అనుకునే అవకాశముందా?. అబ్బే అసలే ఛాన్సే లేదు అంటారా?. కానీ వైసీపీ ఎందుకో కాంగ్రెస్ ని చూసి ఉలిక్కిపడుతుందేమో అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాంగ్రెస్ ప్రత్యేక హోదా భరోసా యాత్ర పేరుతో బస్సు యాత్రకి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. అయితే ఈరోజు నెల్లూరు జిల్లా వెంకటగిరి క్రాస్ రోడ్డు వద్ద కాంగ్రెస్‌ బస్సులను వైసీపీ నేతలు, కార్యకర్తలు అడ్డుకొని నల్లజెండాలతో నిరసన తెలిపారు. ‘కాంగ్రెస్ గో బ్యాక్’ అంటూ గట్టిగా నినాదాలు చేశారు. రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించిన కాంగ్రెస్ పార్టీకి భరోసాయాత్ర చేసే హక్కు లేదంటూ వైసీపీ నేతలు నినాదాలు చేశారు. భరోసా యాత్ర పేరుతో మరోసారి ప్రజల్ని మోసం చేసేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తోందంటూ మండిపడ్డారు. దీంతో కాంగ్రెస్, వైసీపీ కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అయితే కాంగ్రెస్ యాత్రను వైసీపీ నేతలు అడ్డుకోవడం ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ అయింది. విభజన ఎఫెక్ట్ తో ఏపీలో కాంగ్రెస్ కి గట్టి దెబ్బ తగిలింది. గత ఎన్నికల్లో ఒక్కసీటు కూడా గెలవలేదు. అయితే ఏపీ ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్న ప్రత్యేకహోదాని ఇస్తామని కాంగ్రెస్ భరోసా ఇస్తోంది. ఇప్పటికే కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తొలి సంతకం ఏపీ ప్రత్యేకహోదా ఫైల్ మీద పెడతామని పలుసార్లు స్పష్టం చేసింది. దీంతో ఏపీ ప్రజల్లో కాంగ్రెస్ మీద విభజన కోపం కాస్త తగ్గింది. అదీగాక కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ హోదా విషయంలో మొండిచెయ్యి చూపింది. దీంతో హోదా రావాలంటే కాంగ్రెస్సే మనకున్న ఏకైక మార్గం అని పలువురు అభిప్రాయపడుతున్నారు. హోదా హామీతో కాంగ్రెస్ పట్ల ఏపీ ప్రజలు కాస్త సానుకూలంగా స్పందిస్తుండటంతో.. ప్రజల్లోకి వెళ్ళడానికి ఇదే సరైన సమయం అని భావించిన కాంగ్రెస్ ప్రత్యేక హోదా భరోసా యాత్ర చేపట్టింది. అదేవిధంగా నిన్న ఏపీ పర్యటనకు వచ్చిన రాహుల్ గాంధీ.. మోదీ మాట ఇచ్చి తప్పిన తిరుపతి సాక్షిగానే ఏపీకి హోదా ఇచ్చి తీరుతామని స్పష్టమైన హామీ ఇచ్చారు. దీంతో కాంగ్రెస్ నేతలు ఈరోజు బస్సు యాత్రలో మరింత ఉత్సాహంతో పాల్గొన్నారు. అయితే వైసీపీ నేతలు యాత్రని అడ్డుకొని వాగ్వాదానికి దిగారు. ఏపీకి హోదా ఇస్తానంటున్న కాంగ్రెస్ బస్సు యాత్రని అడ్డుకోవాల్సిన అవసరం వైసీపీకి ఏమొచ్చింది? అంటే కాంగ్రెస్ వల్ల.. వచ్చే ఎన్నికల్లో వైసీపీకి ఎంతోకొంత నష్టం జరిగే అవకాశముంది. అందుకే వైసీపీ ఉలిక్కిపడుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఎందుకంటే ఇప్పుడున్న వైసీపీ ఓటు బ్యాంకంతా ఒకప్పటి కాంగ్రెస్ ఓటు బ్యాంకే.. మరి ఇప్పుడు హోదా హామీతో కాంగ్రెస్ కాస్తోకూస్తో బలపడి ఎంతోకొంత ఓట్లు చీలిస్తే వైసీపీకి నష్టమేగా? అందుకే వైసీపీ కాంగ్రెస్ బస్సుకి బ్రేకులు వేయాలని చూస్తుందట. మొత్తానికి వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ ఒక్కసీటైనా గెలుస్తుందో లేదో తెలీదు కానీ.. ఎన్నికలకు ముందే ఓట్లు చీలుస్తుందేమో అని వైసీపీలో భయం కలిగేలా చేసింది. చూద్దాం మరి హోదా హామీతో ఏపీలో కాంగ్రెస్ ఎంతలా బలపడుతుందో.

చంద్రబాబు, పవన్ ల మధ్య కుదిరిన డీల్.. జనసేనకు 25 సీట్లు!!

  ఏపీలో ఎన్నికలు సమీపిస్తుండడంతో ప్రధాన పార్టీలు గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతున్నాయి. ముఖ్యంగా ప్రతిపక్ష వైసీపీ, అధికార పార్టీ టీడీపీని ఇబ్బంది పెట్టడానికి శాయశక్తులా ప్రయత్నిస్తుంది. పోలీసుశాఖ పదోన్నతులు, చింతమనేని వీడియో, రైతు కోటయ్య మృతి.. కాదేదీ టీడీపీని విమర్శించడానికనర్హం అంటూ కొత్త కొత్త టాపిక్స్ తో టీడీపీ మీద ఆరోపణలు, విమర్శలు చేస్తుంది. తాజాగా వైసీపీ పరోక్షంగా మరో టాపిక్ తో టీడీపీని టార్గెట్ చేసింది. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ల మధ్య డీల్ కుదిరింది అంటూ  జగన్ కి సంబంధించిన పత్రికలో ఓ ఆర్టికల్ ప్రచురితమైంది. ముసుగులో స‌ర్దుబాటు అంటూ ఒక క‌థ‌నం ప్ర‌చురించారు. దాని సారాంశం ఏంటంటే.. సీఎం చంద్ర‌బాబు, ప‌వ‌న్ కళ్యాణ్ ల మ‌ధ్య ర‌హస్య ఒప్పందం కుదిరిపోయింద‌ట‌, సీట్ల స‌ర్దుబాటు కూడా జ‌రిగిపోయిందట‌! అంతేకాదు.. ఈ మ‌ధ్య చంద్ర‌బాబు, ప‌వ‌న్ లు ఓ ర‌హ‌స్య స్థ‌లంలో భేటీ అయ్యార‌నీ, పారిశ్రామికవేత్త లింగమనేని రమేష్‌ ఈ భేటీకి ఏర్పాట్లు చేశారంటూ రాశారు. ఈ భేటీలో సీట్ల సర్దుబాటు, ఎన్నికలకు ఎలా వెళ్ళాలి వంటి అంశాలు చర్చించారట. జనసేనకు 25 అసెంబ్లీ సీట్లు, 3 ఎంపీ సీట్లు ఇచ్చేలా డీల్ కుదిరిందట. అంతేనా ‘ఇన్నాళ్లూ తిట్టుకొని ప్రజల ముందుకు వెళ్లాం. ఇప్పుడు జనం  ముందుకు ఏ ముఖం పెట్టుకొని వెళ్లగలుగుతాం? ఇప్పటికిప్పుడు కలసి పోటీ చేస్తామంటే ప్రజలు అంగీకరించే పరిస్థితి ఉండదు. ఏం చెప్పి నమ్మించగలం?’ అని ప్రధానంగా చర్చించారంటూ రాసుకొచ్చారు. మొత్తానికి 2014 లో టీడీపీకి మద్దతిచ్చిన పవన్.. తరువాత టీడీపీకి దూరమై విమర్శలు చేసారు. ఈమధ్య చంద్రబాబుతో మళ్ళీ డీల్ కుదరడంతో విమర్శలు తగ్గించారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీతో పొత్తు పెట్టుకొని పోటీ చేస్తారు అని ఆ క‌థ‌నం సారాంశం. మరి పవన్ కళ్యాణ్ ఏమో ఎవరితో పొత్తులుండవు.. వచ్చే ఎన్నికల్లో వామపక్షాలతో మాత్రమే కలిసి పనిచేస్తాం అన్నారు. ఇప్పటికే ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ఎంపిక కోసం కమిటీ ఏర్పాటు చేసి దరఖాస్తులు కూడా తీసుకుంటున్నారు. మరోవైపు ఆయన సోదరుడు నాగబాబు యూట్యూబ్ లో చంద్రబాబుని టార్గెట్ చేస్తూ వీడియోస్ పోస్ట్ చేస్తున్నారు. మరి ఈ పరిస్థితుల్లో ఈ పత్రికలో వచ్చిన కథనం ఎంతవరకు నిజమవుతుందో చూడాలి.  

టీడీపీకి షాక్.. అవంతి, పండుల బాటలో మరో ఎంపీ!!

  అనకాపల్లి ఎంపీ అవంతి శ్రీనివాస్, అమలాపురం ఎంపీ పండుల రవీంద్రబాబు బాటలోనే.. కాకినాడ ఎంపీ తోట నర్సింహం కూడా టీడీపీని వీడి వైసీపీలో చేరతారంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. అనారోగ్యం కారణంగా తాను రాబోయే ఎన్నికల్లో పోటీచేయడం లేదంటూ ప్రకటించిన నర్సింహం.. ఆయన భార్య వాణికి టికెట్ ఇవ్వాలని టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబును కలిసి విజ్ఞప్తి చేశారు. కీలకమైన జగ్గంపేట టీడీపీ టికెట్ తన భార్యకు ఇవ్వాలని చంద్రబాబుకి విన్నవించడం ద్వారా నర్సింహం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారని తెలుస్తోంది. జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూకి ఇప్పటికే టీడీపీ టికెట్ ఖరారైనట్టు సమాచారం ఉంది. ఇది తెలిసి కూడా నర్సింహం టికెట్ అడగడం పార్టీని వీడుతున్నానంటూ చెప్పుకోవడానికి కారణం కోసమేననే వాదన ఉంది. జగ్గంపేట టికెట్ ఇవ్వకపోతే.. వైసీపీలోకి వెళ్లిపోవాలని తోట నర్సింహం భావిస్తున్నట్లు సమాచారం. జగ్గంపేట టికెట్ ను వైసీపీ నుంచి పోటీ చేసి గెలిచి, ఆ తరువాత టీడీపీలో చేరిన జ్యోతుల నెహ్రూకే టీడీపీ అధిష్టానం ఖరారు చేసినట్టు తెలుస్తుండగా, ఈ విషయం తెలిసి కూడా నర్సింహం ఇదే స్థానాన్ని ఆశించడం వెనుక ఆయన రాజకీయ వ్యూహం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే టీడీపీకి రాజీనామా చేసి, వైసీపీలోకి వెళ్లాలని నిర్ణయించుకున్న ఆయన, కారణం చెప్పుకోవడానికే జగ్గంపేట టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. 2014 ఎన్నికలకు ముందు వరకూ కాంగ్రెస్ పార్టీలో ఉంటూ మంత్రిగానూ పనిచేసిన ఆయన, ఎన్నికలకు ముందు టీడీపీలో చేరి కాకినాడ నుంచి ఎంపీగా బరిలోకి దిగి గెలిచారు. తాజాగా, చలమలశెట్టి సునీల్ టీడీపీలో చేరనుండటంతో తోట నర్సింహానికి సీటు లభించే పరిస్థితి లేదు. అందుకే ఆయన పోటీకి దూరంగా ఉండి.. టీడీపీలో తన భార్యకైనా టికెట్ లభిస్తే, పార్టీలో ఉండాలని, లేకుంటే మరో పార్టీలోకి మారాలని ఆయన భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఇక తోట నర్సింహం వైసీపీలో చేరినా.. జగ్గంపేట టికెట్ హామీ లభించడం కష్టమేనని తెలుస్తోంది. ఎందుకంటే, ఇప్పటికే జ్యోతుల చంటిబాబు ఆ నియోజకవర్గంలో వైసీపీ సమన్వయకర్తగా ఉన్నారు. జగన్ టికెట్ కూడా ఆయనకే ఖరారు చేసినట్టు వైసీపీ వర్గాలు చెప్తున్నాయి. మరి ఇటువంటి పరిస్థితుల్లో తోట నర్సింహం ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.

నువ్వేమైనా పోటుగాడివా?.. తోటాపై జగన్ ఫైర్!!

  వైసీపీ అధినేత వైఎస్ జగన్.. 'సీనియర్లకు రెస్పెక్ట్ ఇవ్వరు, ఎవరి మాట వినరు, మైండ్ లో ఫిక్స్ అయితే బ్లైండ్ గా వెళ్ళిపోతారు' అని కొందరు నేతలు ఆరోపణలు చేస్తుంటారు. మరి ఈ ఆరోపణల్లో నిజమెంతో తెలీదు కానీ.. ఎన్నికలు సమీపిస్తున్న వేళ జగన్ కి సంబంధించి ఇలాంటి వార్తే ఒకటి తాజాగా తెరమీదకు వచ్చింది. టీడీపీ ఎమ్మెల్యే తోటా త్రిమూర్తులతో.. నువ్వేమైనా పోటుగాడివి అనుకుంటున్నావా? అంటూ జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారట. రామచంద్రాపురం ఎమ్మెల్యే తోటా త్రిమూర్తులు టీడీపీని వీడి వైసీపీలో చేరడానికి సిద్దమయ్యారంటూ వార్తలొచ్చిన విషయం తెలిసిందే. తోటా వైసీపీలో చేరాలంటే తనకి కాకినాడ ఎంపీ టికెట్, తమ కుమారుడికి రామచంద్రాపురం ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేశారట. ఇదే విషయంపై వైసీపీ నేత విజయసాయి రెడ్డితో తోటా చర్చించగా.. ఒక్క సీటు మాత్రమే ఇస్తామని, రెండో సీటు కష్టమని విజయసాయి చెప్పారట. దీనికి బదులిస్తూ.. రెండ్లు సీట్లు ఇస్తేనే వైసీపీలో చేరతానని తోటా తెగేసి చెప్పడంతో విజయ సాయికి ఏం చేయాలో తెలియక జగన్ తో ఫోన్ మాట్లాడించారట. జగన్ తోటాతో ఫోన్లో మాట్లాడుతూ.. 'అన్నా ఒక్క సీటిస్తాం. అది నీకా? మీ అబ్బాయికా? అన్నది మీరే తేల్చుకోండి. రెండో సీటు మాత్రం ఇచ్చే ప్రసక్తే లేదని' చెప్పారట. దానికి తోటా స్పందిస్తూ.. రెండు సీట్లిస్తేనే వైసీపీలో చేరతా అన్నారట. ఇంకేముంది జగన్ కి కోపం కట్టలు తెంచుకొని తోటా మీద ఫైర్ అయ్యారట. 'నువ్వు ఏమన్నా పోటుగాడివి అనుకుంటున్నావా? చంద్రబాబుని ఇబ్బంది పెట్టడానికే నీకు సీటు ఇస్తానంటున్నా. నువ్వు ఎంత పోటుగాడివో నాకు తెలుసులే. ఇష్టమైతే ఒక సీటు తీసుకొని పార్టీలోకి రా. లేదంటే మానేయ్' అంటూ ఆవేశంగా ఫోన్ పెట్టేశారట. దీంతో తోటాకి ఒక్కసారిగా మైండ్ బ్లాంక్ అయిపోయిందట. ఇప్పుడే ఇలా ఉంటే వైసీపీలో చేరాక నా పరిస్థితి ఎలా ఉంటుందో అనుకొని.. ప్రస్తుతానికి వైసీపీలో చేరే ప్రోగ్రాంకి ఫుల్ స్టాప్ పెట్టి.. చంద్రబాబుతో భేటీ అయ్యి టీడీపీలోనే ఉంటానని తోటా స్పష్టం చేశారట. మరి ఈ వార్తలో నిజమెంతో తెలీదు కానీ.. తోటా త్రిమూర్తుల మీద జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారంటూ రాజకీయ వర్గాల్లో తెగ చర్చ జరుగుతోంది.

ఈసారి బీజేపీ వంతు.. వైసీపీలోకి కావూరి

  ఎన్నికలకు ముందు ఏపీలో ప్రతిపక్ష వైసీపీకి కొత్త జోష్ వస్తోంది. ఇప్పటికే అధికార పార్టీ టీడీపీ నుంచి పలువురు నేతలు వైసీపీ గూటికి చేరారు. అయితే ఇప్పుడు బీజేపీ వంతు వచ్చింది. మాజీ కేంద్రమంత్రి, బీజేపీ నేత కావూరి సాంబ‌శివ‌రావు బీజేపీని వీడి వైసీపీలో చేరడానికి సిద్దమైనట్లు సమాచారం. ఇప్పటికే వైసీపీ కీలక నేత విజయసాయి రెడ్డితో మంతనాలు జరిపిన కావూరి.. రెండు రోజుల్లో వైసీపీ అధినేత జగన్ ని కలసి పార్టీ తీర్థం పుచ్చుకుంటారని తెలుస్తోంది. కావూరి వచ్చే ఎన్నికల్లో వైసీపీ టికెట్ మీద ఏలూరు లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసే అవకాశం ఉంది. దీనికి సంబంధించి ప్రస్తుతం అంతర్గత చర్చలు జరుగుతున్నాయి. టికెట్ ఖరారైతే కావూరి కాషాయ కండువా తీసేసి వైసీపీ కండువా కప్పుకోవడం ఖాయమని సమాచారం. కావూరి వైసీపీలో చేరితే ఏపీ బీజేపీకి గట్టి దెబ్బనే చెప్పాలి. గతంలో కావూరి కాంగ్రెస్ పార్టీ నుండి ఐదు సార్లు ఎంపీగా గెలిచారు. మ‌చిలీప‌ట్నం లోక్‌సభ స్థానం నుండి మూడు సార్లు, ఏలూరు లోక్‌స‌భ స్థానం నుండి రెండుసార్లు గెలిచారు. యూపీఏ హయాంలో కేంద్రమంత్రిగా కూడా పనిచేశారు. స‌మైక్యాంధ్ర వాయిస్ ను బ‌లంగా వినిపించిన ఆయన.. రాష్ట్ర విభ‌జ‌న స‌మ‌యంలో కాంగ్రెస్ ను వీడి బీజేపీలో చేరారు. అయితే, 2014 ఎన్నికల్లో మాత్రం ఆయన పోటీ చేయలేదు. ప్ర‌స్తుతం ఏపీలో నెల‌కొన్న రాజ‌కీయ ప‌రిస్థితుల్లో ఆయ‌న బీజేపీని వీడి వైసీపీలో చేరాల‌ని భావిస్తున్నారు. ఏలూరు నుంచి ఎంపీగా పోటీ చేసే ఆలోచనలో ఆయన ఉన్నట్లు సమాచారం.

విజయవాడ ఎంపీ సీటుపై వైసీపీ గురి.. బరిలో దాసరి!!

  వచ్చే ఎన్నికల్లో టీడీపీని ఓడించడమే లక్ష్యంగా పెట్టుకున్న వైసీపీ ఉన్న ఏ ఒక్క అవకాశాన్ని వదులుకోవట్లేదు. ముఖ్యంగా టీడీపీకి పట్టున్న స్థానాల మీద ప్రత్యేక దృష్టి పెడుతోంది. టీడీపీకి పట్టున్న స్థానాల్లో విజయవాడ లోక్ సభ ఒకటి. గత ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి కేశినేని నాని విజయవాడ ఎంపీగా గెలుపొందారు. వచ్చే ఎన్నికల్లో కూడా ఆయనే బరిలోకి దిగే అవకాశముంది. కేశినేని నానిని ఢీకొట్టి గెలిచే బలమైన అభ్యర్థి కోసం వైసీపీ ఎప్పటినుంచో కసరత్తులు మొదలుపెట్టింది. విజయవాడ వైసీపీ ఎంపీ అభ్యర్థి ఈయనే అంటూ ఇప్పటికే పలువురి పేర్లు వినిపించాయి. కానీ వైసీపీ అధినేత జగన్ ఇంతకాలం ఎవరి పేరుని ఖరారు చేయలేదు. అయితే తాజాగా జగన్ విజయవాడ ఎంపీ అభ్యర్థిగా ప్రముఖ పారిశ్రామికవేత్త దాసరి జైరమేష్ ను ఖరారు చేసినట్టు తెలుస్తోంది. విజయవాడలో టీడీపీని ఢీ కొట్టాలంటే ఆర్థికంగా బలమైన వ్యక్తి కావాలని భావిస్తున్న వైసీపీ.. ఇందుకోసం దాసరి జైరమేష్ ను ఎంచుకున్నట్టు తెలుస్తోంది. ఈరోజు సాయంత్రం దాసరి జైరమేష్ జగన్‌ను కలిసి అధికారికంగా పార్టీ కండువా కప్పుకోబోతున్నట్టు టాక్ వినిపిస్తోంది. దాసరి జైరమేశ్‌తో పాటు టీడీపీ సీనియర్ నేత దాసరి బాలవర్ధనరావు కూడా వైసీపీలో చేరబోతున్నారని సమాచారం. విజయవాడ వైసీపీ ఎంపీ అభ్యర్థిగా దాసరి జై రమేష్ పేరు తెరపైకి రావడం వెనుక దగ్గుబాటి వెంకటేశ్వరరావు హస్తం ఉన్నట్టు రాజకీయవర్గాల్లో ప్రచారం జరుగుతోంది. కొద్ది రోజుల క్రితం కుమారుడు హితేష్‌తో కలిసి వైసీపీలో చేరిన దగ్గుబాటి వెంకటేశ్వరరావు.. విజయవాడ ఎంపీ అభ్యర్థి ఎవరనే దానిపై జగన్‌తో కీలక చర్చలు జరిపినట్టు తెలుస్తోంది. ఈ స్థానం కోసం ఇంకా ఎవరిని ఖరారు చేయలేదని జగన్ తెలపడంతో.. దగ్గుబాటి దాసరి జైరమేష్ పేరును సూచించారని సమాచారం.

టీడీపీని వీడనున్న మాగుంట, తోటా.. మరో ఐదుగురు కూడా!!

  ఎన్నికల సమీపిస్తున్న వేళ అధికారపార్టీ టీడీపీ నుంచి ప్రతిపక్ష వైసీపీ గూటికి నేతలు క్యూ కడుతున్నారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇలా ఒక్కొక్కరిగా టీడీపీని వీడుతున్నారు. అయితే టీడీపీ అధిష్టానం మాత్రం స్వప్రయోజనాల కోసం పార్టీ వీడే వారి వల్ల పార్టీకేం నష్టం లేదని.. నిజమైన నేతలు, కార్యకర్తలు పార్టీతోనే ఉన్నారని అంటోంది. ఇప్పటికే మేడా మల్లిఖార్జున రెడ్డి, ఆమంచి కృష్ణ మోహన్, అవంతి శ్రీనివాస్ వంటి నేతలు టీడీపీని వీడారు. అయితే ఇప్పుడు వీరిబాటలోనే మరికొందరు నేతలు టీడీపీని వీడడానికి సిద్దమైనట్లు తెలుస్తోంది. మాజీ ఎంపీ, ప్ర‌స్తుత ఎమ్మల్సీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి వైసీపీ వైపు చూస్తున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. టీడీపీలో అసంతృప్తిగా ఉన్న ఆయనకు ఇప్పటికే వైసీపీ నేతలు టచ్ లోకి వచ్చి ఒంగోలు ఎంపీ టికెట్ ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. పార్టీ మార్పుపై చర్చించడానికి మాగుంట త‌న వ‌ర్గీయుల‌తో ప్ర‌త్యేకంగా స‌మావేశం అయ్యారని సమాచారం. అయితే ఆ స‌మావేశం జ‌రుగుతున్న స‌మ‌యంలోనే సీఎం కార్యాల‌యం నుండి ఆయ‌న‌కు కాల్ వ‌చ్చింది. సీఎంతో సమావేశం కావాల‌ని వారు సూచించిన‌ట్లు తెలుస్తోంది. ఈరోజు సాయంత్రం మాగంటి, సీఎం చంద్రబాబు తో భేటీ అయ్యే అవకాశముంది. మరి మాగంటి సీఎం తో భేటీ అయ్యి టీడీపీలోనే కొనసాగుతా అంటారో లేక ఆమంచి లాగా హ్యాండ్ ఇస్తారో చూడాలి. అదేవిధంగా తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం ఎమ్మెల్యే తోటా త్రిమూర్తులు కూడా టీడీపీని వీడి వైసీపీలో చేరడానికి సిద్దమైనట్లు వార్తలొస్తున్నాయి. మాగుంట శ్రీనివాసులు, తోటా త్రిమూర్తులు మాత్రమే కాదు మరో ఐదుగురు ఎమ్మెల్యేలు కూడా టీడీపీని వీడబోతున్నట్లు వార్తలొస్తున్నాయి. మరి ఈ వార్తల్లో నిజమెంతో తెలీదు. ఒకవేళ నిజమైతే ఈ జంపింగులకు చంద్రబాబు ఎలా అడ్డుకట్ట వేస్తారో చూడాలి. మొత్తానికి ఎన్నికలకు ముందు అధికార టీడీపీకి షాకుల మీద షాకులు తగులుతున్నాయనే చెప్పాలి.

అవినీతి ఆరోపణలున్న వ్యక్తికి కీలక పదవి.. ఇదేనా పవన్ విశ్వసనీయత?

  జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజకీయ సలహాదారుడిగా మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పి.రామ్మోహన్ రావు బాధ్యతలు స్వీకరించారు. విజయవాడలోని జనసేన పార్టీ కార్యాలయంలో పవన్ కళ్యాణ్ సమక్షంలో బాధ్యతలు స్వీకరించారు. గతంలో పి.రామ్మోహన్ రావు తమిళనాడు ప్రధాన కార్యదర్శిగా విధులు నిర్వహించి రిటైర్ అయ్యారు. సోమవారం ఉదయం పార్టీలో చేరిన ఆయనను పవన్ కళ్యాణ్ వెంటనే తన రాజకీయ సలహాదారుగా నియమించుకున్నారు. తమిళనాడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన రామ్మోహన్ రావు పలు ప్రభుత్వ సంక్షేమ పథకాలకు రూపకర్త అని.. ఆయన సూచనలు, సలహాలు జనసేన పార్టీకి ఎంతగానో ఉపయోగపడతాయని తాను ఆశిస్తున్నట్లు పవన్ కళ్యాణ్ తెలిపారు.  తాను అందరిలాగా రాజకీయాలు చేయడానికి రాలేదని, తన రాజకీయశైలి మిగతా పార్టీలకు భిన్నమని చెప్పుకొస్తున్న పవన్ కళ్యాణ్.. మేధావుల పేరుతో ఇప్పటికే చాలా మందిని పార్టీలో చేర్చుకున్నారు. దీనిపై పలువురు ప్రశంసిస్తున్నారు కూడా. అయితే రామ్మోహన్ రావును పార్టీలో చేర్చుకుని.. వెంటనే పదవి ఇచ్చిన విషయంలో మాత్రం పవన్ విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఇది పవన్ విశ్వసనీయతను ప్రశ్నించాల్సిన విషయమని కొందరు అభిప్రాయపడుతున్నారు. పవన్ కల్యాణ్ కొద్ది రోజుల క్రితం.. శేఖర్ రెడ్డి అనే వ్యక్తిపై విమర్శలు చేశారు. ఆయన ఓ పెద్ద దొంగ అని, ఆయనతో మంత్రి నారా లోకేష్‌కు సంబంధాలున్నాయని ఆరోపించారు. శేఖర్ రెడ్డి, లోకేష్ ల దోస్తీ ఆరోపణల్లో నిజమెంత ఉందో తెలీదు కానీ.. శేఖర్ రెడ్డి అనే వ్యక్తి అవినీతి పరుడు అనే అంశంలో మాత్రం క్లారిటీ ఉంది. ఎందుకంటే ఈ శేఖర్ రెడ్డి వ్యవహారం తమిళనాడులో ఒకప్పుడు కలకలం రేపింది. పెద్ద నోట్ల రద్దు జరిగినప్పుడు అసలు నోట్లే దొరకని రోజుల్లో శేఖర్ రెడ్డి ఇంట్లో.. వందల కోట్లు కొత్త నోట్లు పట్టుబడి దేశవ్యాప్తంగా సంచలనమైంది. అయితే దీని వెనుక కథేమిటో బయటకు రాలేదు కానీ.. ఆయన పట్టుబడిన తర్వాత ఆ కేసు మొత్తం తాజాగా పవన్ సలహాదారుగా బాధ్యతలు స్వీకరించిన రామ్మోహన్ రావు చుట్టూనే తిరిగింది. అన్నాడీఎంకే నేతలకు అత్యంత దగ్గరయిన శేఖర్ రెడ్డి.. అప్పట్లో సీఎస్‌గా ఉన్న రామ్మోహన్ రావు ద్వారానే పనులు చక్కబెట్టుకున్నారు. వారిద్దరికి సన్నిహిత సంబంధాలున్నాయి. ఇద్దరిపై ఒకే సారి సీబీఐ దాడులు కూడా చేసింది. సీబీఐ అధికారులు.. రామ్మోహన్ రావు, ఆయన కుమారుడు ఇంటిపై దాడులు చేసి.. పెద్ద మొత్తంలో ఆస్తులు, బంగారం, నగదు స్వాధీనం చేసుకున్నారు. అసలు శేఖర్ రెడ్డి.. రామ్మోహన్ రావుకి బినామీ అనే అనుమానం కూడా సీబీఐ అధికారులు వ్యక్తం చేశారు. బీజేపీతో అన్నాడీఎంకే రాజీపడిపోయింది కాబట్టి.. ఆయన వ్యవహారాలు మరుగునపడిపోయాయి. లేకపోతే సీబీఐ ఇప్పటికీ రామ్మోహన్ రావు ఇంటి చుట్టూనే తిరుగుతూ ఉండేదని తమిళనాడులో చెప్పుకుంటూనే ఉంటారు. అలాంటి వ్యక్తిని పవన్ పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. వెంటనే పదవి కూడా కట్టబెట్టారు. శేఖర్ రెడ్డిని పెద్ద దొంగ అన్న పవన్.. అతని తోడు దొంగని పార్టీలోకి తీసుకొచ్చి పదవి కట్టబెట్టారు. ఇదేనా పవన్ చెప్పిన భిన్న రాజకీయ శైలి? ఇదేనా పవన్ విశ్వసనీయత? అంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు. మరి పవన్ దీనిపై ఎలా స్పందిస్తారో చూడాలి.

ఆయన ఎమ్మెల్యేగా గెలిస్తే టీడీపీకి 150 సీట్లు ఖాయం

  ఏపీలో త్వరలో జరగనున్న ఎన్నికల్లో 175 అసెంబ్లీ సీట్లకు గాను.. మాకు 150 సీట్లు వస్తాయంటే, మాకు వస్తాయంటూ ప్రధాన పార్టీలు టీడీపీ, వైసీపీ పోటీపడి మరి చెప్తున్న విషయం తెలిసిందే. మరి ఈ రెండు పార్టీలకు ఎన్నెన్ని సీట్లొస్తాయో ఎన్నికలు జరిగి ఫలితాలు వస్తేనే కానీ స్పష్టత రాదు. అయితే కొందరు టీడీపీ నేతలు మాత్రం.. తమ పార్టీ నేత ఒకాయన ఎమ్మెల్యేగా గెలిస్తే తమకి 150 సీట్లు రావడం ఖాయమని భావిస్తున్నారట. ఇంతకీ ఆ నేత ఎవరంటే.. నెల్లూరు జిల్లా కోవూరు ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి. పోలంరెడ్డి మీద ఇటు స్థానిక కార్యకర్తలు, అటు నియోజకవర్గ ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్నట్లు తెలుస్తోంది. దీంతో ఆయనకు వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇస్తే ఓడిపోవడం ఖాయమని స్థానిక నేతలు అంటున్నారు. ఒకవేళ అంత వ్యతిరేకత ఉన్న ఆయన గెలిస్తే.. ఏపీలో టీడీపీ 150 సీట్లు ఈజీగా గెలుస్తుందని ఆ నేతలు అభిప్రాయపడుతున్నారు. నియోజకవర్గంలో పోలంరెడ్డిపై ఉన్న వ్యతిరేకత తెలిసి కూడా ఆ సీటుని పోగొట్టేందుకే మంత్రి నారాయణ, ఎమ్మెల్సీ రవిచంద్ర యాదవ్ లు పార్టీ అధినేత చంద్రబాబుని తప్పుదోవపట్టిస్తున్నారని నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు మండిపడుతున్నారు. కోవూరు నియోజకవర్గంలో వైసీపీని గెలిపించేందుకు నారాయణ, రవిచంద్ర కుట్రపన్నుతున్నారని కొందరు టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. టీడీపీ కంచుకోటల్లో కోవూరు నియోజకవర్గం ఒకటి. ఇక్కడి నుంచి టీడీపీ అభ్యర్థులు అనేకసార్లు విజయం సాధించారు. కాంగ్రెస్ నుంచి టీడీపీలో చేరిన పోలంరెడ్డి 2014 ఎన్నికల్లో కోవూరు నుంచి టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దిగి విజయం సాధించారు. టీడీపీలో చేరి ఎమ్మెల్యేగా గెలుపొందినా ఆయనలో పాత కాంగ్రెస్ వాసన పోలేదు. కాంగ్రెస్ కార్యకర్తల్ని చేరదీసి పక్కన పెట్టుకున్నారు. వాళ్ళ పనులు చక్క పెడుతున్నారు. దీంతో ఎప్పటినుంచో టీడీపీ జెండా మోస్తూ.. పార్టీ కోసం కష్టపడిన స్థానిక టీడీపీ నేతలు, కార్యకర్తల్లో అసంతృప్తి మొదలైంది. దీంతో వారు బాహాటంగానే పోలంరెడ్డిపై విమర్శలు చేసారు. ఎవరేం అన్నా, ఎవరేం చేసినా మంత్రి సోమిరెడ్డి, నారాయణ, రవిచంద్ర వంటి నేతల ఆశీస్సులు ఉండటంతో పోలంరెడ్డి ఎలాగోలాగా బండి లాగిస్తున్నారు. అయితే ఇప్పుడు స్థానిక నేతలు, కార్యకర్తలు పొలంరెడ్డికి టికెట్ ఇవ్వొద్దని ముక్తకంఠంతో చెప్తున్నారు. అసలు ఇంత వ్యతిరేకత ఉన్న పోలంరెడ్డికి నారాయణ, రవిచంద్ర ఎందుకు మద్దతిస్తున్నారని నేతలు నిలదీస్తున్నారు. ఎట్టిపరిస్థితుల్లోనూ పోలంరెడ్డికి టికెట్ ఇవ్వొద్దని అధిష్టానాన్ని కోరుతున్నారు. ఒకవేళ నారాయణ, రవిచంద్ర వంటి నేతల మాటలు నమ్మి పోలంరెడ్డికి టికెట్ ఇస్తే వైసీపీ గెలవడం ఖాయం అంటున్నారు. మరి స్థానిక నేతలు, కార్యకర్తలు ఇంతలా వ్యతిరేకిస్తున్న పోలంరెడ్డికి చంద్రబాబు టికెట్ ఇస్తారో లేదో చూడాలి.