ఏటీఎం కార్డుతో జేబుకు చిల్లు!
posted on Aug 2, 2014 @ 4:09PM
ఆమధ్యకాలంలో అయితే ఏటీఎం కార్డుల్ని జనం చాలా విరివిగా ఉపయోగించేవారు. ఏ బ్యాంకు నుంచి ఏటీఎం కార్డు తీసుకున్నా ఏ ఇతర బ్యాంకు ఏటీఎం నుంచి ఎలాంటి రుసుము లేకుండా డబ్బు విత్ డ్రా చేసుకునే అవకాశం వుండేది. అప్పుడు జనం బ్యాంకు నుంచి వంద వంద చొప్పున విత్ డ్రా చేసుకుని పొదుపుగా ఖర్చు పెట్టుకునేవారు. ఈమధ్యకాలంలో ఆ పరిస్థితి మారింది. అకౌంట్ వున్న బ్యాంకులో తప్ప ఇతర బ్యాంక్ ఏటీఎంలలో నెలకు ఐదుసార్లకు మించి డబ్బు విత్ డ్రా చేస్తే అదనపు రుసుము పడుతుందని రిజర్వ్ బ్యాంకు రూల్ పెట్టింది. దాంతో ఏటీఎం కార్డులు వాడేవాళ్ళకి బ్రేకులు పడ్డాయి. ఇప్పుడు రిజర్వ్ బ్యాంక్ ఏటీఎం నిబంధనలను మరింత కఠినతరం చేసింది. ఇకపై ఇతర బ్యాంకుల ఏటీఎంలలో నెలకు రెండుసార్లకు మించి డబ్బు విత్ డ్రా చేస్తే సేవా రుసుము చెల్లించాల్సి వస్తుంది. త్వరలో ఈ నిబంధన అమలులోకి రానుంది. అయితే ఈ నిబంధన నుంచి పల్లెటూర్లకు మినహాయింపు ఇవ్వాలని రిజర్వ్ బ్యాంక్ ఆలోచిస్తోంది.