పేలుళ్ళ బాధితులకు అండగా ఉంటాం: ప్రధాని మన్మోహన్

        దిల్‌సుఖ్‌నగర్ జంట పేలుళ్ల ప్రాంతాలను ప్రధాన మంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ పరిశీలించారు. పేలుళ్లపై ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్‌సింగ్ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని అన్నారు. ఓమ్ని, యశోద ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించానని, వారికి మెరుగైన వైద్య సేవలు, సహాయం అందించాలని డాక్టర్లకు ఆదేశించినట్లు ప్రధాని తెలిపారు. బాంబు పేలుళ్లు జరిగిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలు సంతృప్తికరంగా ఉన్నాయని, ప్రజల దైర్యం, తెగువ అభినందనీయమని ఆయన అన్నారు. హైదరాబాద్ ప్రజలు సయంమనం పాటించాలని ప్రధాని విజ్ఞప్తి చేశారు

హాఫ్ సెంచరీ చేయనున్న నాయక్

  మెగాభిమానులకు ఒక శుభవార్త. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్, అమలా పాల్, కాజాల్ అగర్వాల్ నటించిన ‘నాయక్’ సినిమా ఈ నెల 27వ తేదిన రాష్ట్రంలో 55థియేటర్లలో 50రోజులు పూర్తి చేసుకోబోతోంది.అంతే కాదు, పక్కనున్నకర్ణాటక రాష్ట్రంలోకూడా మన ‘నాయక్’5 థియేటర్లలో దిగ్విజయంగా ‘హాఫ్ సెంచరి’ చేయబోతున్నాడు. ఇవి కాక బీ, సి సెంటర్లలోకూడా నాయక్ మంచి జోరు మీదున్నట్లు సమాచారం.   రాష్ట్రంలో 55థియేటర్లలో 50రోజులు పూర్తి చేసుకోబోతున్న సెంటర్ల వివరాలు:   నైజాం:9; సీడెడ్:15; నెల్లూరు:1; కృష్ణ; 4; గుంటూరు:8; తూర్పుగోదావరి:6; పశ్చిమ గోదావరి:4; వైజాగ్:8; కర్ణాటక:5. ఇవికాక మిగిలిన జిల్లాల వివరాలు ఇంకా అందవలసి ఉంది.   వీవీ వినాయక్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను దానయ్య మరియు రాధాకృష్ణ కలిసి నిర్మించారు. తమన్ సంగీత దర్శకత్వం చేసారు. ఈ సినిమాలో బ్రహ్మానందం, యం.యస్.నారాయణ, జయప్రకాశ్ రెడ్డి, రఘుబాబు, రాహుల్ దేవ్, ఆశిష్ విద్యార్ధి, ప్రదీప్ రావత్, అజాజ్ ఖాన్, తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు.

పేలుళ్ళ ప్రదేశాన్ని పరిశీలించిన ప్రధాని మన్మోహన్

        హైదరాబాద్ లో బాంబు పేలుళ్ళ జరిగిన స్థలాన్ని ప్రధాని మన్మోహన్ సింగ్ ఈ రోజు పరిశీలించారు. ప్రధాని ముందుగా కోణార్క్ ధియేటర్ వద్ద పేలుడు జరిగిన ప్రదేశాన్ని ఆయన పరిశీలించారు. ఆ తరువాత వెంకటాద్రి ధియేటర్ వద్ద పేలుడు ప్రాంతాన్ని చూశారు. పేలుడు జరిగిన తరువాత ఆ ప్రాంతంలో ఇప్పుడు ఉన్న పరిస్థితులు, సంఘటన జరిగిన తీరును కిరణ్ ప్రధానికి వివరించారు. అక్కడి నుంచి ప్రధాని యశోద, ఓమ్నీ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించేందుకు బయలుదేరి వెళ్ళారు. ప్రధాని మన్మోహన్ సింగ్ ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడ నుంచి దిల్ షుక్ నగర్ కు ఆయన వచ్చారు. గవర్నర్ నరసింహన్, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి,కేంద్ర మంత్రి సర్వే సత్యనారాయణ,డిజిపి దినేష్ రెడ్డి లు ప్రధాని వెంట ఉన్నారు.   

హైదరాబాద్ పేలుళ్ళు: నేపాల్ లో ఇద్దరు అరెస్ట్

        హైదరాబాద్ పేలుళ్ళ కేసులో అనుమానితులుగా భావిస్తున్న ఇద్దరు వ్యక్తులున్ని భారత్‌, నేపాల్‌ సరిహద్దు ప్రాంతంలో భద్రతా సిబ్బంది అరెస్ట్ చేశారు. వీరిలో ఒకరిని హైదరాబాద్‌కు చెందిన మహ్మద్ ఆదాంగా, రెండో వ్యక్తిని సోమాలియాకు చెందిన మహ్మద్ అబ్దుల్లా ఓమన్‌గా గుర్తించారు. బీహార్‌లోని తూర్పు చంపారన్‌ జిల్లా రక్సాల్‌ వద్ద సరిహద్దు దాటేందుకు ప్రయత్నిస్తుండగా భద్రతా బలగాలు అదుపులోకి తీసుకున్నాయి.అనంతరం వీరిని బీహార్ తూర్పు చంపరాన్ పోలీసులకు అప్పగించారు.   ఇద్దరి నుంచి సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌కు చెందిన కొన్ని ఫొటోలు, దృశ్యాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. సికింద్రాబాద్‌కు చెందిన ఫోటోలు, దృశ్యాలు దొరకటంతో హైదరాబాద్‌ బాంబు పేలుళ్లతో వీరికేమైనా సంబంధం ఉందా అన్న విషయమై అధికారులు ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది.    

వరవర రావుగారికి బాంబు ప్రేలుళ్ళు వినబడలేదా?

  ఎక్కడయినా పోలీసుల చేతిలో నక్సల్స్ చనిపోతే, మరుక్షణం అక్కడ వాలిపోయి, మానవ హాక్కుల ఉల్లంఘన జరిగిపోయిందంటూ గగ్గోలు పెట్టేసే వరవరరావు గారికి, చివరికి భారత దేశం మీద దాడికి పాల్పడిన కసాబ్, అఫ్జల్ గురూ వంటి ఉగ్రవాదులు కూడా ఉద్యమ కారులలాగే కనిపిస్తారు. వారిని ఉరి తీసినప్పుడు ఆయన వీదులకెక్కి వారిని ఉరితీయడం చాలా అన్యాయం, మానవ హక్కుల ఉల్లంఘన అంటూ చాలా గగ్గోలు చేసేస్తారు. కానీ మొన్న హైదరాబాదులో జరిగిన బాంబు ప్రేలుళ్ళలో 16 మంది అమాయక ప్రజలు దుర్మరణం చెందినా, వందమందికి పైగా ప్రజలు తీవ్ర గాయాలపాలయినా కూడా స్పందించడానికి ఆయన నోరు ఎందుకో పెగలట్లేదు. అఫ్జల్ గురూ ఉరికి నిరసనగా వీదులకెక్కి హంగామా చేసిన ఆయన ఇప్పుడు ఎందుకు నోరు మెదపట్లేదు? గాయపడిన, చనిపోయిన ప్రజలకి ఆయన చెప్పే మానవ హక్కులు వర్తించవా? లేక అయన కేవలం ఉగ్రవాదులకు, నక్సలయిట్లకు మాత్రమే ప్రాతినిద్యం వహిస్తున్నారా? దేశం యావత్తు స్పందించిన ఈ దుర్ఘటనపై ఇటువంటి ‘మహా మేధావులు’ స్పందించకపోవడం ఏవిధంగా అర్ధం చేసుకోవాలి?

చంద్రబాబు వల్లే బాంబు ప్రేలుళ్ళు ఆపలేకపోయారుట!

  హైదరాబాదు బాంబు ప్రేలుళ్ళ ధాటి నుండి ప్రజలు పూర్తిగా కోలుకొనక మునుపే, అధికార కాంగ్రెస్, ప్రతిపక్షాల మద్య మాటల యుద్ధం మొదలయింది. తెరాస నేత హరీష్ రావు, తెదేపా నేత రేవంత్ రెడ్డి తదితరులు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి రాజీనామా చేయాలనీ డిమాండ్ మొదలు పెట్టారు.   మరో వైపు కాంగ్రెస్ నేతలు వీ.హనుమంత్ రావు, పొన్నం ప్రభాకర్ వంటి వారు కిరణ్ కుమార్ రెడ్డికి ఎసరు పెట్టె పనిలో పడ్డారు. క్రమంగా స్వపక్ష విపక్షలనుండి విమర్శలు జోరందుకొంటున్న తరుణంలో కాంగ్రెస్ శాసనమండలి సభ్యుడు పాలడుగు వెంకట రావు, ఒక బలమయిన సాకుతో చంద్రబాబు మీద ఎదురు దాడి మొదలుపెట్టారు.   “గత నాలుగు నెలలుగా అంతూపొంతూ లేకుండా సాగుతున్న చంద్రబాబు పాదయాత్రకే సగం పోలీసు బలగాలు కేటాయించవలసి వస్తుంటే, ఇక ప్రజలను కాపాడటానికి పోలీసులు ఎక్కడ సరిపోతారు? ఆయన ఏ జిల్లాలో అడుగు పెడితే, ఆ జిల్లాలో వందలాది పోలీసులను ఆయన భద్రతకోసం వినియోగించవలసి వస్తోంది. అదే విధంగా మరోవైపు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత షర్మిల కూడా పాదయాత్ర మొదలు పెట్టడంతో మరింత మంది పోలీసులను పక్కన పెట్టవలసి వస్తోంది."   "ఈ విధంగా ఇద్దరు ప్రతిపక్షనేతలు సుదీర్గ కాలం పాదయాత్రలు కొనసాగిస్తుంటే, ఉన్న పోలీసు బలగాలలో సగం మంది వారి భద్రతకే వెళ్లిపోతుంటే, ఇక ఇటువంటి ఉగ్రవాదుల దాడిని సమర్దంగా ఎదుర్కోవడానికి పోలీసులెక్కడ సరిపోతారు?” అని ఆయన ప్రశ్నించారు.   ఆయన చెప్పిన దానిలో కొంత నిజం ఉన్నపటికీ, అది పూర్తిగా నమ్మ శక్యంగా లేదు. పాలడుగు చేసిన ఈ విమర్శలకు తెదేపా, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలు ఎలాగు జవాబు చెప్పుకొంటాయి గనుక, ఆ ప్రసక్తి పక్కన పెడితే, కేవలం ఇద్దరు ప్రతిపక్ష నేతలకి భద్రత కల్పించడమే తమ తలకు మించిన భారం అవుతోందని కాంగ్రెస్ నేత అంటున్నపుడు, మరి రాష్ట్రం ఇన్ని కోట్ల మందికి ఆయన కాంగ్రెస్ ప్రభుత్వం ఏ విధంగా భద్రత కల్పించగలదూ? అనే ప్రశ్నకు ఆయనే జవాబు చెప్పవలసి ఉంది.   అధికారంలో ఉన్న ప్రతీ కాంగ్రెస్ నాయకుడు వెనుక ప్రస్తుతం ఎంతెంత మంది పోలీసు బలగాలను కేటాయించు కొన్నారో ఆయన లెక్క జెపితే, అప్పుడు ఇద్దరు ప్రతిపక్ష నేతల వెనుక అంతమంది ఉండటం సమజసమా కాదా? అనే సంగతి కూడా తేల్చవచ్చును.   అయితే, పాలడుగు చెప్పిన మాటను చంద్రబాబు, షర్మిల ఇద్దరూ కూడా ఆలోచించవలసిన అవసరం ఉంది. తమ పార్టీ రాజకీయ ప్రయోజనాలకోసం ఈ విదంగా పాదయాత్రలు చేస్తున్నపుడు, ప్రజల కష్టార్జితంతో తమకు భద్రత కోరుకోవడం ఎంతవరకు సబబు అని వారిద్దరూ కూడా ఆలోచించుకోవాలి.   ప్రజల సొమ్మును విద్యుత్ చార్జీల పేరిట, అదిక పన్నుల పేరిట ప్రభుత్వం దోచుకొంటోందని నిత్యం విమర్శించే వారిరువురూ, తమ పాదయాత్రలు సజావుగా సాగడానికి, తమ స్వీయ భద్రతకోసం ఈవిధంగా ప్రజాధనంతో పోలీసు బలగాలను విరివిగా ఉపయోగించుకొంటూ, వారు కూడా ప్రభుత్వం చేస్తున్న పనినే చేస్తున్నారని తెలుసుకోవలసిన అవసరం ఉంది.వారిద్దరూ అవసరమనుకొంటే, తమ స్వంత ఖర్చుతో ఎంత మంది కావాలనుకొంటే అంతమంది ప్రైవేట్ భద్రతా సిబ్బందిని నియమించుకొని ఎంతకాలం పాదయాత్రలు చేసినా ఎవరూ ఆక్షేపించరు.

పవన్ కళ్యాణ్ సినిమాలో కమెడియన్ గా సునీల్

  మంచి హాస్య నటుడిగా పేరు సంపాదించుకొన్నసునీల్, రాజమౌళి దర్శకత్వం వహించిన ‘మర్యాద రామన్న’ సినిమాలో నటించిన తరువాత దశ తిరిగింది. అంతకు ముందు అతను ‘అందాల రాముడు’ సినిమాలో హీరోగా చేసినప్పటికీ, మర్యాద రామన్న సినిమాతో వచ్చినంత పేరు రాలేదు. మర్యాద రామన్న తరువాత హీరో స్థాయికెదిగిపోయిన సునీల్, తన స్వంత సినిమాలతోనే బిజీ అయిపోవడం చేత ఇతర హీరోల సినిమాలలో కమెడియన్ గా కనిపించడం లేదు. త్వరలో విడుదల కానున్న ‘మిష్టర్ పెళ్ళికొడుకు’ సినిమాలో సునీల్ హీరో గా నటిస్తున్నారు. అయితే, త్రివిక్రమ్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ చేయబోతున్న కొత్త సినిమాలో సునీల్ మళ్ళీ కమెడియన్ గా చేయబోతున్నాడు. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ తో ప్రణీత, సమంతా హీరోయిన్లు గా జత కట్టబోతున్నారు. ఈ సినిమాను రిలయన్స్ ఎంటర్ టైనర్ సంస్థతో కలిసి బీ.వీ.యస్.యన్. ప్రసాద్ తన శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై నిర్మించనున్నారు. ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తునారు.

హైదరాబాద్ కూకట్ పల్లిలో భారీ అగ్నిప్రమాదం

        హైదరాబాద్ లోని కూకట్ పల్లిలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. కూకట్ పల్లి మెట్రో దుకాణం వెనుక ఉన్న అపార్ట్ మెంట్లోని కెమికల్ ల్యాబ్ లో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. గ్యాస్ సిలిండర్ లీక్ కారణంగానే ఈ అగ్ని ప్రమాదం జరిగినట్టు భావిస్తున్నారు. మంటల ధాటికి కారు పేలిపోవడంతో స్థానికులు భయంతో బాంబు అనుకొని పరుగులు తీశారు. ఈ అగ్ని ప్రమాదంలో ఒక కారు 8 ద్విచక్రవాహనాలు కాలిపోయాయి. మంటలు చెలరేగిన ఇంట్లో గ్యాస్ సిలిండర్లు పేలాడంతో పెద్ద శబ్దాలు వచ్చాయి. పేలుళ్ళ ధాటికి అపార్ట్ మెంట్ కూలిపోయే ప్రమాదం ఉందని అధికారులు భావిస్తున్నారు. పక్కనే ఉన్న ఇళ్ళకి కూడా మంటలు వ్యాపించడంతో అగ్నిమాపక సిబ్బంది మ౦టలను అదుపుచేసేందుకు ప్రయత్నం చేస్తున్నారు.  

సీసీ కెమెరాలు పై ప్రభుత్వం వివరణ ఇవ్వాలి

      హైదరాబాద్ లో జరిగిన వరుస బాంబు పేలుళ్లను ఉగ్రవాదుల పిరికిపంద చర్యగా బీజేపీ సీనియర్ నేత వెంకయ్యనాయుడు అభివర్ణించారు. వ్యవస్థను కూల్చడానికి ఉగ్రవాదులు ఆటవిక చర్యలకు దిగుతున్నారని ఆయన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. బాంబు పేలుళ్ల ఘటనపై వెంకయ్యనాయుడు ప్రభుత్వంపై విమర్శలు చేశారు. పేలుళ్లు జరిగిన ప్రదేశాల్లో వెంకయ్యనాయుడు సందర్శించారు. కేంద్రం స్పష్టమైన హెచ్చరికలు చేసినా, రాష్ట్ర ప్రభుత్వ వ్యవస్థ ఏం చేసిందని ఆయన ప్రశ్నించారు. వైఫల్యంపై, సీసీ కెమెరాలు పనిచేయకపోవటంపై రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలని వెంకయ్యనాయుడు డిమాండ్ చేశారు. ఉగ్రవాదంపై ఉమ్మడి పోరాటం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. అనంతరం కమల, యశోదా ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను వెంకయ్యనాయుడు పరామర్శించారు.  

ప్రభుత్వ వైఫల్యానికి రెండు కారణాలు

  బాంబు ప్రేళ్ళుల తరువాత ప్రతిపక్షాలు ప్రభుత్వంపై రెండు ప్రధాన ఆరోపణలు చేస్తున్నాయి. మొదటిది కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం నిఘా వర్గాల హెచ్చరికలను నిర్లక్ష్యం చేయడం. రెండోది పోలీసులను, నిఘా సంస్థలను తమపైకి ఉసిగొల్పి వాటిని దుర్వినియోగం చేయడం. రెండూ కూడా తీవ్రమయిన ఆరోపణలే. కేంద్ర నిఘా హెచ్చరికలకు కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం సరిగ్గా స్పందించి ఉంటే, ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నట్లు ఈ ఘోర దుర్ఘటన జరిగిఉండేది కాదన్నమాట నిజం. దానిపై ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికానీ, అతని మంత్రి వర్గ సహచరులు గానీ నోరు మెదపట్లేదు. తమ నిర్లక్ష్యానికి, దాని ఫలితానికి నైతిక బాధ్యత వహించవలసినవారు, ఈ సంఘటనకు తాము బాధ్యులము కామన్నట్లు వ్యవహరించడం చాల ఘోరం. పైగా నిన్నఅత్యవసరంగా సమావేశమయిన మంత్రి వర్గం, పరిస్థితులను సమీక్షించకపోగా, తమ పనితీరుకు తామే శభాషీలు చెప్పుకొంటూ అభినందన తీర్మానాలు చేసుకొని, సిగ్గుపడకుండా తమ భుజాలు తామే చరుచుకొన్నారు.   ఉగ్రవాదుల దాడి జరుగబోతోందని తెలిసినప్పటికీ కిరణ్ ప్రభుత్వం అంత నిర్లక్ష్యం ఎందుకు వహించిందో ఆలోచిస్తే, దానికి ప్రతిపక్షాలు చెపుతున్న రెండో కారణం సహేతుకంగా కనబడుతుంది.   ఎంతసేపు, ప్రతిపక్షాలవారు ఏమి చేయబోతున్నారు? సహకార ఎన్నికలలో తిమ్మిని బమ్మిని చేసి ఎలా గెలవాలి?తమ ఈ అఖండ విజయాన్ని ప్రదర్శించి కేంద్రం వద్ద ఏవిధంగా మెప్పుపొందాలి? అధిష్టానాన్ని ఏవిధంగా ప్రసన్నం చేసుకోవాలి? వంటి విషయాల పైన కనబరిచిన శ్రద్ధ, చేతిలో ఉన్న నిఘావేదికపై లేకపోవడం వల్లనే ఈ ఘోర దుర్ఘటన జరిగింది.   ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నట్లు నిఘా సంస్థలను దుర్వినియోగం చేయడం కూడా ఈ ఘటనకు మరో ప్రధాన కారణం కావడం దురదృష్టకరం. ప్రభుత్వం తమ ఉద్యమలను ఆపేందుకు వినియోగిస్తున్న పోలీసు బలగాలలో కేవలం 10శాతం బలగాలను ప్రజల రక్షణకు ఉపయోగించి ఉండిఉంటే బహుశః ఈ ఘోరకలి జరిగి ఉండేదికాదని తెరాస నేతలు కొదండరాం, హరీష్ రావు, కవిత వంటి వారు చేస్తున్న విమర్శలలో నిజం లేకపోలేదు.   ఉగ్రవాదులను, సంఘవ్యతిరేఖ శక్తులపై నిఘాపెట్టవలసిన మన నిఘా సంస్థలు, అధికారంలో ఉన్నవారి చేతుల్లో ఆయుదాలుగా మారిపోయి, ప్రతిపక్షాల కదలికలను, వారి రాజకీయ ఎత్తుగడలను కనిపెట్టే దుస్థితికి దిగజారిపోయాయి గనుకనే, అవి తమ కర్తవ్య నిర్వహణలో విఫలం అవుతున్నాయి. అందువల్లనే మన నిఘా సంస్థలు మొన్న జరిగిన బాంబు ప్రేలుళ్ళవంటి సంఘటనలను పునరావృతం కాకుండా నివారించలేకపోతున్నాము.   కీలకమయినా బాధ్యతలు నిర్వర్తించవలసిన నిఘా సంస్థల పరిస్థితే ఈవిదంగా ఉన్నపుడు, అధికారులకి ప్రత్యక్షంగా సలాములు అర్పిస్తూ పనిచేయవలసిన పోలీసులనుండి ఏమి ఆశించగలము? ఏ రంగంలో నయినా రాజకీయ నాయకులు తమ వేలు, ముక్కు దూర్చినప్పుడు దాని పరిస్థితి ఈవిధంగానే అఘోరిస్తుంది అని చెప్పక తప్పదు.

"కళాభినేత్రి" వాణిశ్రీ కి అభినయ భారతి పురస్కారం

    హైదరాబాద్, ప్రఖ్యాత చలనచిత్ర నటి కళాభినేత్రి శ్రీమతి వాణిశ్రీ ని "అభినయ భారతి" పురస్కారంతో సత్కరించనున్నట్లు డా. గజల్ శ్రీనివాస్ పాలకొల్లు కళా పరిషత్ వ్యవస్థాపకులు శ్రీ మేడికొండ శ్రీనివాస్ చౌదరి. శ్రీ మానాపురం సత్యనారాయణ ఒక ప్రకటనలో తెలియచేసారు. డా.గజల్ శ్రీనివాస్ పాలకొల్లు కళా పరిషత్ 6వ అఖిల భారత స్థాయి నాటికల పోటీలు ఫిబ్రవరి 24,25,26 తేదీలలో పాలకొల్లులో జరగనున్నాయని తెలిపారు. 24వ తారీఖున శ్రీమతి వాణిశ్రీ గారికి, "అభినయ భారతి" బిరుదు ప్రధానం. యువకళావాహిని వ్యవస్థాపకులు శ్రీ Y.K. నాగేశ్వరరావు గారిని బళ్ళారి రాఘవ రంగస్థల పురస్కారం. యువ నటీమణి, కూచిపూడి నాట్య కళాకారిణి కుమారి మధుశాలిని గారిని నాట్యమయూరి పురస్కారాలతో సత్కరించనున్నట్లు తెలిపారు.   ఈ కార్యక్రమానికి రాష్ట్ర పురపాలక శాఖా మాత్యులు శ్రీ M.మహీధర్ రెడ్డి గారు, మైనర్ ఇరిగేషన్ శాఖా మాత్య్లులు శ్రీ T.G. వెంకటేష్ గారు, సాంఘీక సంక్షేమ శాఖా మాత్యులు శ్రీ పితాని సత్యనారాయణ గారు, పాలకొల్లు శాసనసభ్యురాలు శ్రీమతి బంగారు ఉషారాణి గారు, తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ శ్రీ కనుమూరి బాపిరాజు గారు, విజయవాడ పార్లమెంట్ సభ్యులు శ్రీ లగడపాటి రాజగోపాల్ గారు, ప్రఖ్యాత తెలుగు గజల్ గాయకులూ డా. గజల్ శ్రీనివాస్ పాల్గొంటున్నట్లు నిర్వాహకులు తెలిపారు.   ఫిబ్రవరి 24,25,26 తేదీలలో ఏడు (7) నాటికలు ప్రదర్శించబడతాయని తెలిపారు.

ఆగదూ...ఈ పాదయాత్ర ఆగదూ...

  ఒకవైపు చంద్రబాబు మరో వైపు షర్మిల ఇద్దరూ ఎండనక వాననక ఎంతో కష్టపడుతూ చేస్తున్న పాదయాత్రలకి మద్యమద్యలో ఆటంకాలు తప్పడం లేదు. కొద్ది రోజుల క్రితం ఇద్దరూ కూడా తమ పాదయాత్రలకి ఆరోగ్య సమస్యలతో బ్రేక్ ఈయవలసి వస్తే, మళ్ళీ మొన్న శాసనమండలి ఎన్నికల నియమావళి అమలులోకి రావడంతో రెండు రోజులు విరామం తీసుకోవలసి వచ్చింది. ఆ మరునాడే హైదరాబాదులో బాంబు ప్రేలుళ్ళు జరగడంతో ఇద్దరూ కూడా తమ పాదయత్రలకి మరోరోజు శలవు ప్రకటించేరు. షర్మిల నల్గొండలోనే నిలిచిపోగా, చంద్రబాబు మాత్రం హైదరాబాద్ వచ్చి బాంబు ప్రేలిన దిల్ షుక్ నగర్ ప్రాంతాన్ని, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాదితులను పరామర్శించి, హైదరాబాదులో ఉన్న తన ఇంటికి కూడా వెళ్ళకుండా నేరుగా గుంటూరు తిరిగి వచ్చేసి మళ్ళీ తన పాదయాత్ర మొదలుపెట్టేసారు.   చంద్రబాబు గుంటూరు జిల్లాలో వేమూరు మండలం నుండి ఈ రోజు తన పాదయాత్రను మొదలు పెట్టగా, షర్మిల నల్గొండ జిల్లాలో దామచర్ల మండలలో గల వాడపల్లి గ్రామం నుండి తన పాదయాత్రను మొదలుపెట్టారు. ఆమె ఈరోజు సాయంత్రంలోగా గుంటూరు లో ప్రవేశించే అవకాశం ఉంది.   ఇద్దరూ కూడా కేంద్ర నిఘా వర్గాలు హెచ్చరికలను పట్టించుకోని కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంపై దుమ్మెత్తి పోశారు. ఈ దుర్ఘటన కేవలం ప్రభుత్వ వైఫల్యం వల్లనే జరిగిందని ఆరోపించారు. భాదితులకి ప్రభుత్వం ప్రకటించిన ఎక్స్ గ్రేషియాను మరింత పెంచాలని చంద్రబాబు డిమాండ్ చేసారు. ఇంతవరకు వారి విమర్శలు సహేతుకమయినప్పటికీ, ఇక ఈ విషయంలో వారు అత్యుత్సాహం ప్రదర్శించకపోవడమే మేలని చెప్పవచ్చును.   ఇద్దరికీ ఇప్పుడు కిరణ్ కుమార్ రెడ్డిని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించేందుకు మరో కొత్త అస్త్రం దొరికింది గనుక, ఇక ఇద్దరూ తమ పాదయాత్రల్లో ఇదే విషయాన్నీపదే పదే ప్రస్తావిస్తూ, ప్రజలలో కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల మరింత విముఖత పెరిగేందుకు కష్టపడవచ్చును. అయితే, ఇటువంటి విషయాలలో అత్యుత్సాహం ప్రదర్శించడం వలన, బాంబు ప్రేలుళ్ళపై జరుగుతున్న దర్యాప్తుకు ఆటంకాలు ఏర్పడే అవకాశం ఉంది గనుక, ఈ అంశాన్ని తమ రాజకీయ లబ్ధికి వాడుకొనే ప్రయత్నం చేయకుండా తమని తాము నిగ్రహించుకొంటే మంచిది.   అంతగా కిరణ్ ప్రభుత్వంతో చెలగాటం ఆడుకోవాలనే కోరిక వారిలో బలంగా ఉంటే, త్వరలో జరుగనున్న శాసనసభ సమావేశాల్లో ఆపని చేసినట్లయితే, ప్రభుత్వాన్ని అధికారికంగా ప్రశ్నించినట్లు ఉంటుంది. బాధ్యతగల ప్రతిపక్ష నేతలుగా ఇద్దరూ కూడా ఈ ప్రేలుళ్ళ అంశాన్ని రాజకీయం చేయకుండా సంయమనం పాటించగలిగితే మంచిది. లేదంటే ప్రజల్లో వారే పలుచన అవుతారని తెలుసుకొంటారు.

షారుక్ తో సమానంగా డబ్బు కూడా ఇస్తే బాగుంటుంది: నాని

  ఇటీవల కాలంలో తెలుగు సినిమా పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకొన్ననటుడు నాని కూడా ఒకరు. అష్ట చెమ్మా సినిమాతో చిన్న సినిమాల హీరోగా తన సినీ ప్రస్థానం మొదలు పెట్టిన నాని ఒకవైపు చిన్న సిన్న సినిమాలు చేస్తూనే, క్రమంగా పెద్ద సినిమాల హీరోగా ఎదుగుతున్నాడు. పిల్ల జమీందార్, ఈగ వంటి సినిమాలలో చక్కటి నటన ప్రదర్శించిన నాని, ప్రస్తుతం ‘జెండాపై కపిరాజు’, ‘పైసా’అనే రెండు సినిమాలలో నటిస్తున్నాడు.   ఇటీవలే విదేశాలలో ఆ సినిమా షూటింగ్ పూర్తీ చేసుకొని వచ్చిన నానికి మరో బంపర్ ఆఫర్ దొరికింది. ప్రఖ్యాత బాలివుడ్ సినీ నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిలిమ్స్ సంస్థ వారు తెలుగులో నిర్మించనున్నవారి తొలి చిత్రంలో నానికి ఆఫర్ ఇచ్చారు. ముంబాయిలో ఉన్న ఆ సంస్థ స్టుడియోలో ప్రస్తుతం ఫోటో షూట్ లో పాల్గొనడానికి వెళ్ళిన నాని ఆ సంస్థ అధినేత మరియు సినిమా దర్శకుడు అయిన ఆదిత్య చోప్రాను కలిసాడు. హిందీలో సూపర్ హిట్ అయిన ‘బ్యాండ్ బాజా బారత్’ సినిమాకు రిమేక్ అయిన ఈ తెలుగు సినిమా షూటింగు త్వరలో మొదలవుతుంది. ఈ సందర్భంగా దర్శకుడు ఆదిత్య చోప్రాతో జరిగిన సరదా సంభాషణను నాని ట్వీటర్ లో పెట్టాడు. ‘నాదీ, షారుక్ ఖాన్ ది బట్టల కొలతలు ఒకటేనని వారు అన్నారు. అప్పుడు, నాకు వారివ్వబోయే డబ్బుకూడా ఆయనతో సరిసమానంగా ఉంటుందా? అని జోక్ చేసాను. ఏమయినప్పటికీ, ఈ సినిమా ఎప్పుడు మొదలవుతుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను,’ అన్నాడు నాని.

సి.సి కెమెరాల వైర్లు ముందే కత్తిరించిన టెర్రరిస్టులు?

  ఈ రోజు మీడియాలో వచ్చిన తాజా సమాచారం, దర్యాప్తు సంస్థలు దిల్ షుక్ నగర్ కూడలిలో మరియు సమీపంలో గల షిరిడి సాయిబాబా మందిరం వద్ద అమర్చబడిన సి.సి.కెమెరాల రికార్డులు పరిశీలిదామని ప్రయత్నించినప్పుడు, కూడలిలో ఉన్న కెమెరాల వైర్లు కత్తిరించబడి ఉన్నట్లు కనుగొన్నారు. సమాచారం ప్రకారం ఉగ్రవాదులు తమని ఎవరూ గుర్తు పట్టకుండా ముందుగానే కెమెరాల వైర్లు కత్తిరింఛి వేసి ఉండవచ్చని పోలీసులు అభిప్రాయ పడుతున్నారు. అయితే, ఈ వార్తను పోలీసులు ఇంకా దృవీకరించలేదు. తాము ఇంతవరకు కొన్ని ఆధారాలు సంపాదించామని చెప్పారు. త్వరలోనే ఈ పని చేసిన వారిని పట్టుకోగాలమనే నమ్మకం వ్యక్తం చేసారు.

హైదరాబాదు పేలుళ్లపై రామ్ గోపాల్ వర్మ స్పందన

  ముంబయిపై జరిగిన ఉగ్రవాదుల దాడిని ‘26/11 దాడులు’ అనే సినిమాగా మలిచిన రామ్ గోపాల్ వర్మ, ఆ ప్రయత్నంలో అనేక మంది బాధితులను, హతుల కుటుంబాలను కలిసి వారి హృదయ విదారక గాధలు విని కదిలిపోయానని ఇటీవల ఒక టీవీ చానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ లో తెలిపారు. ఆ అనుభవం తన ఆలోచనలో చాలా మార్పులు కూడా తెచ్చిందని, ఆయన పేర్కొన్నారు. భాదితుల కుటుంబాలను అందరికంటే దగ్గరగా చూసిన ఆయనకి, నిన్న హైదరాబాదులో జరిగిన బాంబు దాడులలో భాదితుల గోడు అర్ధం చేసునందునేమో, కొంచెం ఆవేశంగా ప్రభుత్వ అసమర్ధతను ఎండగడుతూ ట్వీటర్ లో తీవ్ర విమర్శలు చేసారు.   ముందుగా రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని విమర్శిస్తూ ‘బాంబు ప్రేలుళ్ళను ఖండిస్తున్నాను’ అనే ఆయన చెప్పిన డైలాగు 1965 లో బ్లాక్ అండ్ వైట్ సినిమాలు మొదలయినప్పటి నుండి వింటున్నదే. అరగదీసిన డైలాగు అది.   ‘తక్షణమే పట్టుకొంటాము’ అని అంటున్నారు, మరి అలా చేయగలిగే కెపాసిటీ ఉంటే ముందే ఎందుకు పట్టుకోలేదని నేనడుగుతున్నాను.’   హోం మంత్రి షిండే నిన్న ‘ప్రేలుళ్ళపై విచారణ జరిపిస్తాను’ అన్న డైలాగు ఈ దశాబ్దానికే గొప్ప హై లయిట్ అనదగ్గ డైలాగు.’   ‘డిల్లీ నుండి స్పెషల్ టీములు విచారణ చేయడానికి రప్పిస్తున్నాం’ అనే మాటకి అర్ధం స్థానిక టీములు వెధవలనా?’ ప్రధానమంత్రి గారు దిగ్బ్రాంతి వ్యక్తం చేసారుట. అంటే, ఆయన దిగ్బ్రాంతి వ్యక్తం చేయకుండా సంతోషం వ్యక్తం చేస్తారని అనుకొంటామా మనము? మన రాజకీయనాయకులకి కోన వెంకట్ వంటి మంచి డైలాగులు వ్రాసే రచయితలూ అవసరం ఉంది.’   ‘వీరు (రాజకీయ నాయకులూ)మాట్లాడే మాటలు వినవలసిన వాళ్ళు ఎవరూ వినరు, ఎందుకంటే ఆ వినవలససిన వాళ్ళు బాంబులు పేల్చే ప్రిపరేషన్ లో బిజీ గా ఉంది ఉంటారు. అందువల్ల వారి మాటలు ప్రజలే వినక తప్పట్లేదు.”   రచయిత కోన వెంకట్ కూడా రామ్ గోపాల్ వర్మ ట్వీటర్ మెసేజ్ కు వెంటనే స్పందిస్తూ, వర్మ గారు మీరు చెప్పింది బాగానే ఉంది గానీ, ఈ రాజకీయ నాయకులకు కావలసింది మా వంటి రచయితలూ కారు, దర్శకుల అవసరం ఉంది.” అని జవాబు ఇచ్చారు.  

పేలుళ్ళ పై అమెరికా హెచ్చరించింది: బాబు

      నగరంలో ఉగ్రవాదులు పక్కా పథకం ప్రకారమే పేలుళ్లకు పాల్పడ్డారని టిడిపి అధ్యక్షుడు చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. ఇలాంటి ఘటన జరగడం దురదృష్టకరమని అన్నారు. అమెరికా ప్రభుత్వం ముందే హెచ్చరించింది, కేంద్ర ఇంటిలిజెన్స్ వర్గాలు హెచ్చరికలు చేసినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం తేలిగ్గా తీసుకోవడం దారుణమని అన్నారు. పేలుళ్లకు ప్రభుత్వ వైఫల్యమే కారణమని ఆయన ఆరోపించారు. దిల్‌సుఖ్‌నగర్‌లోని బాంబు పేలుళ్ల ఘటనాస్థలిని చంద్రబాబు నాయుడు పరిశీలించారు. శాంతిభద్రతల విషయంలో ప్రభుత్వం మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని చంద్రబాబునాయుడు డిమాండ్ చేశారు. ప్రజలు సంయమనం పాటించాలని చంద్రబాబునాయుడు విజ్ఞప్తి చేశారు. దిల్‌సుఖ్‌నగర్‌లో బాంబు పేలుళ్లు జరిగిన విషయం తెలియగానే చంద్రబాబు తమ పాదయాత్రను వాయిదా వేసి, శుక్రవారం ఉదయం హైదరాబాద్ చేరుకున్నారు. దిల్‌సుఖ్‌నగర్‌లో జరిగిన బాంబు పేలుళ్ల ఘటనా స్థలిని సందర్శించిన అనంతరం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను బాబు పరామర్శించారు. మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల ఎక్స్గ్రేషియా అందచేయాలని ఆయన డిమాండ్ చేశారు.  

సమంత, సిద్దార్థ్ ల 'జబర్‌దస్త్' స్టోరీ ఇదే

        'అలా మొదలైంది' చిత్రంతో సూపర్ హిట్ కొట్టిన నందిని రెడ్డి, టాలీవుడ్ లక్కీ గర్ల్ సమంత, లవర్ బాయ్ సిద్దార్థ్ వీరి కాంబినేషన్లో సినిమా వస్తోంది అంటే అంచనాలు భారీగా ఉంటాయి. మొదటి సినిమాతో మ్యాజిక్ క్రియేట్ చేసిన నందిని నుంచి రెండో సినిమాలో కూడా సమ్ థింగ్ స్పెషల్ ఉంటుందని ప్రేక్షకులు ఆశిస్తారు. వీరికి తోడు అన్ కా౦ప్రమైజింగ్ ప్రొడ్యూసర్ బెల్లంకొండ సురేష్ తోడవడంతో 'జబర్‌దస్త్' సినిమా పై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ సినిమా ఫస్ట్ రిపోర్ట్ స్టోరీ మీ కోసం: పెట్టిన ప్రతీ బిజినెస్ ఫెయిల్యూర్ అవుతూ..మరో బిజినెస్ కోసం అప్పులు చేసి జనాల్ని మోసం చేస్తూ బతికే షోకిల్లా రాయుడు బైర్రాజు (సిద్దార్థ్), సొంతంగా బిజినెస్ చేసి పైకి రావాలనుకునే శ్రేయ (సమంత) అనుకోకుండా కలిసి ఓ ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీ ఆరంభిస్తారు. కంపెనీ బాగా అభివృద్ధి చెందుతుంది. ఆ తర్వాత మనస్పర్ధలు రావడంతో ఇద్దరూ విడిపోయి వేర్వేరుగా బిజినెస్ చేస్తారు. అలా విడిపోయిన వీరి జీవితాల్లోకి సరస్వతి (నిత్యా మీనన్), ఫేమస్ డాన్ జావేద్ భాయ్ (శ్రీహరి) ఎందుకు వచ్చారు?చివరికి బైర్రాజు, శ్రేయ ఎలా కలిశారన్నది మిగిలిన కథ.  

తెలంగాణ సడక్ బంద్ వాయిదా

    తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 24న తలపెట్టిన “సడక్ బంద్” కార్యక్రమాన్ని వాయిదా వేస్తున్నట్లు తెలంగాణ రాజకీయ జేఏసీ ప్రకటించింది. ఈ నెల 24న హైదరాబాద్ – బెంగుళూరు హైవేను దిగ్బంధించాలని కార్యాచరణ రూపొందించారు. అలంపూర్ నుండి హైదరాబాద్ వరకు దాదాపు 12 చోట్ల సడక్ బంద్ పాయింట్లను జేఏసీ నిర్ణయించింది. దీనికి సన్నాహకంగా ఇప్పటికే జేఏసీ రెండు రోజులు బస్సు యాత్ర నిర్వహించింది.   ఇక దీనికితోడుగా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలుకూడా ఒక రోజు బస్సుయాత్ర నిర్వహించారు. ఇప్పటికే మహబూబ్ నగర్ జిల్లాలోని టీఆర్ఎస్, జేఏసీ నేతలను పోలీసులు బైండోవర్ కింద అరెస్టు చేశారు. అనూహ్యంగా హైదరాబాద్ లో బాంబు పేలుడు ఘటన జరగడంతో దానిని వాయిదా వేశారు. తిరిగి ఎప్పుడు నిర్వహించేది తరువాత వెల్లడిస్తామని తెలిపారు.