మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డికి బిగ్ షాక్

 

మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత కాకాని గోవర్ధన్ రెడ్డికి మరో ఎదురుదెబ్బ తగిలింది. సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిని ఉద్దేశించి పరుష పదజాలంతో అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై ఆయనపై వెంకటాచలం పోలీస్ స్టేషన్‌లో మ‌రో కేసు నమోదైంది. చవటపాలెం సొసైటీ ఛైర్మన్ రావూరు రాధాకృష్ణ నాయుడు చేసిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ఇదిలా ఉంటే.. కాకాని గోవర్ధన్ రెడ్డితో పాటు మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రమేయం ఉందని ఆరోపణలు ఎదుర్కొంటున్న నకిలీ మద్యం కేసుకు సంబంధించిన కీలక ఫైళ్లు కూడా మాయమవడం కలకలం రేపుతోంది. 2014 ఎన్నికల సమయంలో గోవా నుంచి నకిలీ మద్యం తెప్పించి, లేబుళ్లు మార్చి ఓటర్లకు పంపిణీ చేశారని వీరిపై ఆరోపణలు ఉన్నాయి.

 ఆనాడు ఈ నకిలీ మద్యం తాగి పలువురు మరణించగా, వందలాది మంది అనారోగ్యానికి గురయ్యారు.ఈ కేసుకు సంబంధించి కొన్ని ముఖ్యమైన ఫైళ్లు 2018లోనే అదృశ్యమైనట్లు విజయవాడ ప్రత్యేక కోర్టు గుర్తించి, కేసును సీఐడీకి అప్పగించింది. అయితే, 2019లో వైసీపీ అధికారంలోకి రావడంతో దర్యాప్తు ముందుకు సాగలేదు. ఇప్పుడు కూటమి  ప్రభుత్వం అధికారంలో రావడంతో ఈ కేసు మళ్లీ తెరపైకి వచ్చింది. తనపై కేసు నమోదు కావడంతో కాకాణి తీవ్రంగా స్పందించారు. దేవాలయ భూములు అక్రమాలపై ప్రశ్నించినందుకే కేసులు పెడుతున్నారని ఆరోపించారు. సోమిరెడ్డికి దమ్ముంటే నార్కో అనాలసిస్ టెస్ట్‌కు సిద్దమా అని సవాల్ విసిరారు.

కారు పార్టీ పోయి...హస్తం పార్టీ వచ్చిన దోపిడీ ఆగలేదు : కిషన్‌రెడ్డి

  కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చి రెండేళ్లయిన ఎన్నికలు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఆరోపించారు. ఇందిరా పార్కు ధర్నా చౌక్‌ వద్ద బీజేపీ ఆధ్వర్యంలో మహాధర్నా నిర్వహించారు. రెండేళ్ల కాంగ్రెస్‌ నయవంచన పాలన పేరుతో చేపట్టిన ఈ కార్యక్రమంలో నెరవేర్చని హామీలను పేర్కొంటూ ఛార్జ్‌షీట్‌ విడుదల చేశారు. పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో తెలంగాణ అప్పుల పాలైందని కేంద్ర మంత్రి అన్నారు. తెలంగాణలో కారు పార్టీ పోయి హస్తం పార్టీ దోపిడీ మాత్రం ఆగలేదని ఆయన అన్నారు.  కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండేళ్లయినా 2 లక్షల ఉద్యోగాలు ఎందుకు భర్తీ చేయలేదని ప్రశ్నించారు. రాష్ట్రంలో సంక్షేమ పథకాలను అమలు చేయలంటే భూములు అమ్మవలసి వస్తోందని కిషన్ రెడ్డి విమర్శించారు. ఏ ముఖం పెట్టుకొని ముఖ్యమంత్రి జిల్లాల పర్యటనలు చేస్తున్నారని, కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం సన్నం, ఉచిత బస్సు పథకాలను మాత్రమే ప్రచారం చేసుకుంటుందని, అందులో సన్నం బియ్యం పంపిణీలో కేంద్ర ప్రభుత్వం వాటనే ఎక్కువ ఉందని కిషన్ రెడ్డి తెలిపారు. బీసీలను మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వానికి విజయోత్సవాలు జరుపుకునే హక్కు ఎక్కడిదని ఎంపీ డీకే అరుణ అన్నారు. అన్ని వర్గాలను కాంగ్రెస్ సర్కార్ మోసం చేసింది. నిరుద్యోగులకు ఇస్తామన్న రూ.4 వేలు ఏవి? రూ.3 లక్షల కోట్ల బడ్జెట్ లో బీసీలకు రూ.20 వేల కోట్లు కేటాయిస్తామని చెప్పి ఎంత కేటాయించారని చెప్పాలని ప్రశ్నించారు  గతంలో బీఆర్ఎస్, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీల హాయంలో తెలంగాణలో పార్టీ ఫిరాయింపుల రాజ్యం కొనసగుతోందని కిషన్ రెడ్డి  తెలిపారు. ఈ మహాధర్నలో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రాంచందర్ రావు, మాజీ అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, ఎంపీ డీకే అరుణ, రాజ్యసభ ఎంపీ లక్ష్మణ్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు ఈ ధర్నాలో పాల్గొన్నారు.

బీజేపి రాజ్యాంగంలో లౌకిక పదం తొలగిస్తామనడం దారుణం : సీపీఐ

బీజేపి రాజ్యాంగంలో లౌకిక, సొషలిష్ట అనే పదాలు 400 ఎంపీ సీట్ల ఇస్తే తొలగిస్తామనడం దారుణమన్ని ఆంధ్రప్రదేశ్ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య మండిపడ్డారు. రాజ్యాంగ సవరణ పేరుతో ఎస్టీ, ఎస్సీ, మైనార్టీలను అణచివేసి ఆర్ఎస్ఎస్ విధానాలు పెంచిపోషించడం వల్ల దేశంలో అశాంతి నెలకొల్పుతున్నరన్నారు.  అలగే దేశంతో రూపాయి విలువ 56 రూపాయలు ఉన్నదాని 90 రూపాయల 30 పైసులు పడిపొవడాని నిర్మాల సీతారామన్న మంచిదే అన్నడం చాలా దారుణమన్నారు. దిని వల్ల ప్రజలు, రైతులు నష్టపోతారన్నారు. అలగే రాష్ట్ర ప్రభుత్వం మెడికల్ విద్యను ప్రైవేటికరణ చేసి చాల అన్యాయం చెస్తుందన్నారు. రాజ్యధాని పేరుతో మల్లి ల్యాండ పుల్లింగుకు పాల్పడుతుందన్నారు. డబ్బులంతా అమరావతిపై పెట్టి మల్లి ప్రాంతీయ ఉద్యమాలకు తెరతీస్తున్నారన్నారు.

వింటర్ లో హాట్ హాట్ గా మద్యం సేల్స్! నాలుగు రోజుల్లో రూ.600 కోట్లు!

తెలంగాణలో మద్యం విక్రయాలు అమాంతంగా పెరిగిపోయాయి. తెలంగాణలో మందుబాబులు గజగజలాడించే చలి నుంచి రక్షణ కోసం చలిమంటలు, దుప్పట్లు, రగ్గులను కాకుండా మద్యాన్ని ఆశ్రయించారని భావించాల్సి వస్తోంది. ఎందుకంటేచలి పెరగడంతో గత నాలుగు రోజులలో  రాష్ట్రంలో  ఏకంగా 600 కోట్ల రూపాయల విలువైన మద్యం విక్రయాలు జరిగాయి. తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో అయితే ఈ అమ్మకాలు 5 కోట్ల 86 లక్షలుగా ఉన్నాయి.  వెచ్చటి మద్యం గొంతులో పోసుకుని చలిలో  తెలంగాణ మందుబాబులు ఖుషీ చేస్తున్నారని ఈ గణాంకాలు తేటతెల్లం చేస్తున్నాయి. గత ఏడాది ఇదే కాలంతో పొలిస్తే  మద్యం విక్రయాలు ఈ ఏడు ఏకంగా 107 శాతం పెరిగాయి.  రాష్ట్రం మొత్తంగా చూస్తే ఈ నెల మొదటి తారీకు నుంచి నాలుగో తేదీ వరకూ అంటే డిసెంబర్ 1 నుంచి 4 వరకూ కేవలం నాలుగు రోజుల్లో 600 కోట్లు ఉండటానికి  గ్రామ పంచాయతీ ఎన్నికలు, కొత్త మద్యం విధానం కూడా కారణమని అధికారులు భావిస్తున్నారు. ఏది ఏమైతేనేం తెలంగాణలో మద్యం అమ్మకాలు కొత్త రికార్డు సృష్టించాయి. విశేషమేంటంటే.. ఇంతటి చలిలోనూ కూడా బీర్ల అమ్మాకాలు కూడా జోరుగా సాగాయి.  నాలుగు రోజుల వ్యవధిలోనే రాష్ట్రంలో  5.89 లక్షల కేసుల బీర్లు అమ్ముడవ్వడమే ఇందుకు నిదర్శనం. అదే గత ఏడాది ఇదే కాలంలో  బీర్ల అమ్మకాలు 4.26 లక్షల కేసులు మాత్రమే. 

ఏపీ గ్రోత్ రేట్@10.5%

ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ గణనీయంగా పుంజుకుంటోంది.  ఈ ఏడాది ఏపీ వృద్ధి రేటు జాతీయ సగటు కంటే ఎక్కువగా ఉంది. వైసీపీ హయాంలో ఏపీ ప్రగతి తిరోగమనంలో సాగిన సంగతి తెలిసిందే.  అయితే తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికార పగ్గాలు చేపట్టిన తరువాత  దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల జాబితాలో ఏపీ అగ్రపీఠిన నిలుస్తోంది. 2025-26  ఆర్థిక సంవత్సరం తొలి మేమూడు నెలల్లోనే రాష్ట్ర వృద్ధి10.5 శాతంగా ఉంది.   దేశవ్యాప్తంగా సగటు వృద్ధి 8.8 శాతం ఉంటే, ఒక్క అంధ్రప్రదేశ్ మాత్రం జాతీయ సగటును మించిన వృద్ధి రేటు సాధించింది. ఈ వేగం ఇలాగే సాగితే  ఈ ఏడాది మొత్తం రాష్ట్ర ఆదాయం సుమారు 18 లక్షల 65 వేల కోట్ల రూపాయలకు చేరుకునే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. ఏపీ అభివృద్ధిలో సింహ భాగం వ్యవసాయానిదే అని చెప్పాలి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో వ్యవసాయ ఉత్పత్తులు 9.6 శాతం పెరిగి 81 వేల 496 కోట్ల రూపాయలకు చేరాయి. గత ఏడాది ఈ వృద్ధి 36 శాతంగా ఉంది. అలాగే సేవల రంగం 8.5 శాతం, పరిశ్రమలు 23 శాతం  పెరిగాయి. ఈ మూడు రంగాలూ ఒకేసారి బలపడటం వల్లనే  ఆర్థిక వ్యవస్థ పునాది గట్టిపడిందని చెప్పాలి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వర్ణాంధ్ర విజన్ 2047    ప్రకారం 2047 నాటికి రాష్ట్ర ఆదాయం 2.4 లక్షల కోట్ల డాలర్లకు , తలసరి ఆదాయం 35 లక్షల రూపాయలు చేరాలి. ఆ దీర్ఘకాలిక లక్ష్యం దిశగా తొలి అడుగు పడిందనే తాజా గణాంకాలు సూచిస్తున్నాయి.  పథకాల అమలులో వేగం,  అధికారుల చొరవ, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల వెల్లువ అన్నీ కూడా ఏపీ ప్రగతికి, పురోగతికి, ఆర్థిక పరిపుష్టికి దోహదం చేస్తున్నాయని చెప్పాలి.    సముద్ర ఆహార ఎగుమతుల్లో దేశంలోనే ఆంధ్రాకు 38 శాతం వాటా ఉంది, దాదాపు 7.74 బిలియన్ డాలర్ల విలువైన ఎగుమతులు జరిగాయి. విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం 28 వేల 409 మెగావాట్లకు చేరింది. రిజర్వ్ బ్యాంక్ వడ్డీ రేట్లను తగ్గించడం, బ్యాంకుల్లో డబ్బు లభ్యత పెంచడం వల్ల ప్రజలలో కొనుగోలు శక్తి పెరిగింది. జగన్ హయాంలో కుదేలైన ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ చంద్రబాబు హయాంలో ఇప్పుడు కోలుకుని వేగంగా ముందుకు సాగుతోంది. 

ఏబీవీ కొత్త పార్టీ?!

దేశంలో ఇప్పటికే స‌వాల‌క్ష పార్టీలు ఉన్నాయి. వీటిలో యాక్టివ్ గా ఉన్న‌వి కొన్నే. వాటిలో బీజేపీ, కాంగ్రెస్ వంటి జాతీయ పార్టీల‌తో పాటు ఆమ్ ఆద్మీపార్టీ, సీపీఐ, సీపీఎం, ఎన్సీపీ, తృణ‌మూల్, ఎస్పీ, బీఎస్పీ వంటి పార్టీలు వీటికి అద‌నం. ఇక ప్రాంతీయ పార్టీల విషయానికి వస్తే తెలుగుదేశం, వైసీపీ,  జ‌న‌సేన‌,  డీఎంకే, అన్నాడీఎంకే, బీఆర్ఎస్ వంటి పార్టీలు ఉన్నాయి. అన్ని రాష్ట్రాలలోని ప్రాంతీయ పార్టీలనూ కలిపితే దాదాపు ఓ పాతిక పార్టీలు యాక్టివ్ గా ఉన్నాయని చెప్పవచ్చు.  అలాంటి యాక్టీవ్ పార్టీల‌న్నిటినీ  ప‌క్క‌న పెడితే..   దేశంలో ఉన్న పార్టీల సంఖ్య సుమారు రెండున్న‌వేల వ‌ర‌కూ ఉంటాయి. రీసెంట్ గా తెలంగాణ‌లో తీన్మార్ మ‌ల్ల‌న్న  తెలంగాణ రాజ్యాధికార పార్టీని ఏర్పాటు చేశారు. అలాగే ఏపీ  కేంద్రంగా మరో కొత్త పార్టీ ఆవిర్భవించనున్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది.   ఆ పార్టీ పేరు ఇంకా  ఖరారు కాలేదు కానీ, పార్టీ ఏర్పాటైతే పక్కా అంటున్నారు. ఇంతకీ ఆ పార్టీని ఏర్పాటు చేస్తున్నది ఎవరయ్యా అని చూస్తే.. ఆయన ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంక‌టేశ్వ‌ర‌రావు. ఈయ‌న జ‌గ‌న్ జ‌మానాలో ఎన్నేసి అష్ట‌క‌ష్టాలు ప‌డ్డారో  తెలిసిందే. ఇటీవ‌ల ప్ర‌వీణ్ ప్ర‌కాష్ చెప్పిన అపాల‌జీ వీడియోనే ప్ర‌త్య‌క్ష  సాక్షి. అదలా ఉంచితే..  ఏబీవీకి ఇంకా ప్ర‌భుత్వ ప‌రంగా రావ‌ల్సిన బ‌కాయిలు ఇప్పటికీ  రాలేదు. వాస్తవానికి ఏబీవీ   జ‌గ‌న్ పై పోరాడిన విధానికి కూట‌మి ప్ర‌భుత్వాధినేత చంద్ర‌బాబు నుంచి మంచి ఆద‌ర‌ణ ల‌భించాల్సి ఉంది. కానీ తెలుగుదేశం కూటమి ప్రభుత్వం నుంచి ఏబీవీకి ఎటువంటి మద్దతూ లభించలేదు.  అప్ర‌ధాన్య‌మైన పోలీస్ హౌసింగ్ బోర్డు చైర్మన్ పదవిని అప్పగించి మమ అనేశారు. అయితే ఆయనా పోస్టు తీసుకోలేదనుకోండి అది వేరే సంగతి. అయితే   ఏబీవీ ప్ర‌స్తుతం చంద్ర‌బాబు మీద ఆయ‌న ప్ర‌భుత్వ విధానాల‌పైనా విమర్శలు గుప్పిస్తున్నారు.   అంతే కాదు వైసీపీ వారికి య‌ధేచ్చ‌గా దోచి పెడుతున్నార‌న్న సంచ‌ల‌న కామెంట్లు కూడా చేశారు. ఆమాట‌కొస్తే మొన్న‌టికి మొన్న కందుకూరు క‌మ్మ  కాపు ఘ‌ట‌న‌లో ప్ర‌భుత్వం  ఇచ్చిన న‌ష్ట‌ప‌రిహారంపై కూడా రియాక్టయ్యారు ఏబీవీ. ఇలా తెలుగుదేశం కూటమి ప్ర‌భుత్వ నిర్ణయాలను ఖండిస్తూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు ఏబీ వెంకటేశ్వరరావు.   ఇలా ఖండనలు, ప్రకటనలతో కాదని తానే స్వయంగా ఒక కొత్త  పార్టీ  పెట్టి  సత్తా చాటాలన్న నిర్ణయానికి ఏబీవీ వచ్చినట్లు కనిపిస్తోంది.   దేశంలోనే అత్యంత అవినీతి ప‌రుడిగా  వేల కోట్ల‌ను సంపాదించిన పేరు సాధించిన  జ‌గ‌నే పార్టీ న‌డ‌ప‌డానికి  డ‌బ్బుల్లేవు కాబ‌ట్టి తాను  కార్యాల‌యాన్ని తీసేశాన‌ని బాహ‌టంగా చెప్పుకున్నారు. అలాంటిది ఏబీవీ లాంటి ఒక రిటైర్డ్ ప్ర‌భుత్వోద్యోగి వ‌ల్ల సాధ్య‌మ‌వుతుందా? అని సందేహాలు పరిశీలకుల నుంచి వ్యక్తం అవుతున్నాయి. అయితే  జ‌య ప్ర‌కాశ్ నారాయ‌ణ‌ లోక్ స‌త్తా  అరవింద్ కేజ్రీవాల్  ఆమ్ ఆద్మీ పార్టీ,  సీబీఐ మాజీ జేడీ ల‌క్ష్మీనారాయ‌ణ‌ కూడా సేమ్ టు సేమ్  ఈయ‌న‌లాగానే ఐఏఎస్ ఐపీఎస్ కేడ‌ర్ కి సంబంధించిన వారే. వారిలో అర‌వింద్ కేజ్రీవాల్ పార్టీ క్లిక్ అయిన‌ట్టు మిగిలిన వారు పెట్టిన పార్టీలు రాణించ‌లేదు.  ఆ  కోవ‌లోకి వ‌చ్చే ఏబీవీ అంత‌గా మాస్ జ‌నాల్లోకి దూసుకెళ్ల‌గ‌ల‌రా? అన్న‌దే ఇక్క‌డ ప్ర‌శ్నార్ధ‌కంగా  మారింది.  ఇక పార్టీ పేరు ఏమిటని చూస్తూ.. ఈయన ఏపీకి పరిమితమై రాజకీయాలు చేయాలని భావిస్తున్నారు కనుక ఆంధ్ర శ‌బ్ధం వ‌చ్చేలా ఆయన పార్టీ పేరు ఉంటుందని అంటున్నారు పరిశీలకులు. ఏది ఏమైనా ఏబీవీ పెట్టబోయే పార్టీ ఏమిటి? ఎప్పుడు ఆరంభం కానుంది? అన్న ప్రశ్నలకు కాలమే సమాధానం చెబుతుంది.  

మళ్లీ మన ప్రభుత్వమే వస్తుంది... అధైర్య పడొద్దు : కేసీఆర్

  బీఆర్‌ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గజ్వేల్ నియోజకవర్గ పరిధిలోని ఎర్రవెల్లి, నర్సన్నపేట గ్రామాల నూతన సర్పంచులు, వార్డు మెంబర్లలు కేసీఆర్‌ను  ఫాం హౌస్‌ కలిశారు. ఈ సందర్బంగా కేసీఆర్ మాట్లాడుతూ అన్ని కాలాలు మనకు అనుకులంగా ఉండవు కొన్ని కష్టాలు వస్తాయి. వాటికి కుంగి పోవద్దని తెలంగాణ పల్లెలకు తిరిగి మంచి రోజులు వస్తాయిని అప్పటి వరకు ప్రజలు అధైర్యపడొద్దని వచ్చేది మన బీఆర్‌ఎస్ ప్రభుత్వమని తెలిపారు.  కాంగ్రెస్ పాలనలో ఎవరో ఏదో చేస్తారని ఆగం కావొద్దని సూచించారు. గ్రామస్థుల మద్దతుతో ఎన్నికైన సర్పంచులను శాలువాలతో సత్కరించి వారికి మిఠాయిలు పంచారు. ఈ సందర్భంగా తన వద్దకు వచ్చిన గ్రామస్థులను గుర్తుపట్టి పేరు పేరునా పలకరించి, వారి యోగ క్షేమాలను అడిగి తెలుసుకున్నారు. తెలంగాణలో గత బీఆర్‌ఎస్‌ పాలనలో గొప్పగా వర్ధిల్లిన గ్రామాల పరిస్థితిని, నేడు కాంగ్రెస్ ప్రభుత్వంలో అన్ని రకాలుగా దిగజారిన పరిస్థితిని, గ్రామస్తులు కేసీఆర్ దృష్టికి తెచ్చి ఆవేదన వ్యక్తం చేశారు

భార‌త్ అంటే...పుతిన్‌కి ఎలాంటి అభిప్రాయ‌ముందంటే!

  పుతిన్ భార‌త్ వ‌చ్చినపుడు ఒక ప్రయివేటు ఛానెల్ కి ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో.. కొన్ని ఆస‌క్తిక‌ర‌మైన స‌మాధానాలు చెప్పారు. ఆ ప్ర‌శ్న‌లేంటి  స‌మాధానాలు ఎలాంటివ‌ని చూస్తే..మీరు 25 ఏళ్లుగా రష్యాకు నాయకత్వం వహిస్తున్నారు. ఇది చాలా అరుదైన రికార్డు. ఈ దీర్ఘకాల పాలనా  రహస్యమేంట‌ని అడ‌గ్గా..  అందుకు స‌మాధానం చెప్పిన  పుతిన్.. రహస్యం ఏమీ లేదు. ప్రజలు మ‌న ప‌ట్ల‌ నమ్మకంగా ఉంటేనే ఇది సాధ్యమవుతుంది. 1990లలో రష్యా పతనమైంది – ఆర్థికంగా, రాజకీయంగా, సైనికంగా. ప్రజలు దేశాన్ని మళ్లీ గౌరవించే స్థితికి తీసుకురావాలని కోరుకున్నారు. నేను ఆ ఆశయాన్ని నెరవేర్చడానికి ప్రయత్నించాను. అంతే అంటూ ఎంతో క్లిష్ట‌మైన ప్ర‌శ్న‌కు సింపుల్ గా తేల్చేశారు పుతిన్. డొనాల్డ్ ట్రంప్ మళ్లీ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. మీరు ఆయనతో రెండు సార్లు క‌ల‌సి పనిచేశారు. ఈసారి రష్యా-అమెరికా సంబంధాలు ఎలా ఉంటాయని అనుకుంటున్నారు? అని అడిగిన ప్ర‌శ్న‌కు.. పుతిన్ ఇచ్చిన ఆన్స‌రేంంటే.. ట్రంప్ ఒక వ్యాపారవేత్త. ఆయనకు లాభనష్టాలు అర్థమవుతాయత‌ప్ప ఈ పోరాటాలు యుద్ధాల ప‌ట్ల ఆయ‌న‌కేమంత ముక్కువ లేదు.. ఉక్రెయిన్ యుద్ధం అమెరికాకు ఏం లాభం ఇస్తోంది? ఏమీ లేదు – డబ్బు వృథా అవుతోంది. యూరప్‌లో అస్థిరత పెరుగుతోంది. ట్రంప్ దీన్ని అర్థం చేసుకుంటార‌నే అనుకుంటున్నా అన్నారు పుతిన్.. రష్యాతో ఒప్పందం చేసుకోవడం అమెరికాకు మేలు చేస్తుందని ఆయన భావిస్తే, ఆ దిశలో అడుగులు వేస్తారు. ఇందుకు మేము సిద్ధంగా ఉన్నామ‌ని కుండ బ‌ద్ధ‌లు కొట్టేశారు పుతిన్.  ఇక‌ ఉక్రెయిన్ యుద్ధాన్ని ఎప్పుడు ముగిస్తారు? అన‌డిగిన ప్ర‌శ్న‌కు స‌మాధానంగా పుతిన్.. యుద్ధం మా చాయిస్ కాదన్నారు. 2014లో కీవ్‌లో పశ్చిమ దేశాల ఆధారిత రాజకీయ తిరుగుబాటు చేశాయి. మిన్స్క్ ఒప్పందాలను జర్మనీ మాజీ ఛాన్సలర్ ఒప్పుకున్నట్టుగా – ఉక్రెయిన్‌ను మోసం చేయడానికే ఆ ఒప్పందాలు చేశామని చెప్పారు. మేము రష్యా మాటును నమ్మమని కోరుకోవడం లేదు – వాళ్లే ఆ మాట చెప్పారు కదా! అని ప్ర‌శ్నించారు. పుతిన్. ఇప్పుడు మా షరతులు స్పష్టం: ఉక్రెయిన్ నిరాయుధీకరణ, నాటోలో చేరకపోవడం, రష్యన్ భాషా హక్కులు, క్రిమియా మ‌రియు నాలుగు ప్రాంతాలు రష్యాలో భాగమే అనే గుర్తింపు. ఇవి నెరవేరితే రేపే యుద్ధం ఆగిపోతుందని తేల్చి చెప్పేశారు పుతిన్.. భారత్-రష్యా సంబంధాలు ఎప్పటికీ మారవని మీరు చెబుతుంటారు. ఉక్రెయిన్ యుద్ధం తర్వాత పశ్చిమ దేశాలు రష్యాపై ఆంక్షలు విధించాయి. భారత్ మాత్రం కొనసాగిస్తోంది. ఇది మిమ్మల్ని ఆశ్చర్యపరిచిందా? అని అడగ్గా.. అందుకు పుతిన్ ఏమ‌న్నారంటే.. ఎంత మాత్ర‌మూ ఆశ్చ‌ర్యం క‌లిగించ‌లేద‌న్నారు ర‌ష్యా అధ్య‌క్షుడు పుతిన్ – ఇది భారత దేశ స్వభావం. భారత్ ఎప్పుడూ ఎవరి బెదిరింపులకు లొంగలేదు. 1971లో అమెరికా ఏడో నౌకాదళాన్ని బంగాళాఖాతంలోకి పంపినప్పుడు కూడా భారత్ తన మార్గంలోనే నడిచింది. ఇప్పుడు కూడా అదే. మీరు మా నుంచి చవకగా చమురు కొంటున్నారు, మేము మీ నుంచి ఔషధాలు, టెక్నాలజీ కొంటున్నాం – ఇది పరస్పర లాభం. ఇది దోస్తీ కాదు, వ్యాపారం స‌రిగ్గా అదే స‌మ‌యంలో వ్యూహాత్మక సహకారంగా చెప్పుకొచ్చారు పుతిన్. చైనాతో మీ సంబంధాలు చాలా దగ్గరయ్యాయి. ఇది భారత్‌ను ఆందోళన క‌లిగించే అంశం కదా? అని ప్ర‌శ్నించిన‌పుడు పుతిన్ ఇందుకెలాంటి ఆన్స‌రిచ్చారో చూస్తే..  చైనాతో మా సంబంధాలు భారత్‌కు వ్యతిరేకం కాదు. భారత్-చైనా మధ్య సరిహద్దు సమస్యలు మా వల్ల రాలేదు – అది బ్రిటిష్ వలస పాలన నుంచి వచ్చిన సమస్యలు. మేము ఎప్పుడూ భారత్-చైనా మధ్య యుద్ధం కోరుకోలేదు. రష్యా భారత్‌కు S-400 ఇస్తుంది, చైనాకు SU-35 ఇస్తుంది – ఇది వ్యాపారం. రెండు దేశాలతోనూ మా సంబంధాలు స్వతంత్రంగా ఉంటాయన్నారాయ‌న‌. భారత్ క్వాడ్‌లో ఉంది, అమెరికాతో దగ్గరవుతోంది. ఇది రష్యాకు సమస్య కాదా? అన్న‌ది  స్ట్రైట్ క్వ‌శ్చిన్. కాగా.. పుతిన్ ఇందుకు చెప్పిన ఆన్స‌రేంటంటే.. భారత్ ఎప్పుడూ తన స్వతంత్ర విదేశాంగ విధానం కలిగి ఉంటుంది. 1950-60లలో నెహ్రూ నాన్-అలైన్డ్ మూవ్‌మెంట్ ప్రారంభించినప్పుడు మేము మద్దతు ఇచ్చాం. ఇప్పుడు క్వాడ్‌లో ఉన్నా, భారత్ తన అవసరాలను కాపాడుకుంటుంది. మేము దాన్ని గౌరవిస్తామ‌ని అన్నారే త‌ప్ప భార‌త వైఖ‌రిని వ్య‌తిరేఖించ‌లేదాయ‌న‌.  మీరు ఇండియాలో బ్రహ్మోస్, AK-203 తయారీ, అణు రియాక్టర్లు, ఇప్పుడు రష్యన్ ఆయిల్ రిఫైనరీలు కూడా పెట్టుబడులు పెట్టాలని అనుకుంటున్నారు. ఇదంతా ఆంక్షలను దాటవేయడానికా? అన్న‌ది ఒక ప్ర‌శ్న కాగా..  పుతిన్  నవ్వుతూ..  ఆంక్షలు మమ్మల్ని బలహీనపరుస్తాయని వాళ్లు అనుకున్నారు. కానీ మేము బలోపేతమయ్యాం. భారత్‌లో రిఫైనరీ పెట్టడం అంటే మీకు చవకైన ఇంధనం, మాకు స్థిరమైన మార్కెట్. ఇది విన్- విన్ సిట్యువేషన్. ఆంక్షలు లేకపోయినా మేము ఇదే చేసేవాళ్లమ‌ని క్లారిటీ ఇచ్చారు పుతిన్.. మీరు ఎప్పుడు రిటైర్ అవుతారు? 2036 వరకు కొనసాగుతారా? అని ప్ర‌శ్నించ‌గా.. అందుకు పుతిన్  చిరుద‌ర‌హాసంతో నేను రిటైర్ అయినప్పుడు మీడియాలో మొదట తెలుసుకుంటారు. ఇప్పుడు రష్యా స్థిరత్వం అవసరం. ఒకవేళ నేను వెళ్లిపోతే ఎవరూ దేశాన్ని విడదీయకుండా చూడాలి. అది జరిగే వరకు నేను ఉంటాన‌ని స్ప‌ష్టం చేశారు.. ఇదీ పుతిన్ సింపుల్ అండ్ స్ట్రైట్ ఆన్స‌ర్స్ ఇచ్చిన విధానం. అప్పుడ‌ప్పుడూ అక్క‌డ‌క్క‌డా చిరున‌వ్వులే త‌ప్ప‌.. ఎలాంటి హావ‌భావ విన్యాసాల‌ను చేయ‌లేదాయ‌న‌. భార‌త్ ప‌ట్ల త‌న వైఖ‌రి చెప్పేట‌ప్పుడు మాత్రం ఒకింత న‌మ్మ‌కంగా స్థిర‌చిత్తంతో చెప్పిన‌ట్టు క‌నిపించింది.  

జగన్ ద్వేషం.. అమరావతికి వరం!!

అమరావతి నెత్తిన జగన్ పాలు పోశారంటున్నారు పరిశీలకులు. అమరావతిని నిర్వీర్యం చేయడమే లక్ష్యంగా జగన్ ఐదేళ్ల పాలన సాగింది. సరే రాష్ట్ర ప్రజలంతా అమరావతి వెంనే ఉన్నారన్న సంగతి 2024 ఎన్నికల ఫలితం తేల్చేసింది. అధికార పగ్గాలు చేపట్టినత తెలుగుదేశం కూటమి ప్రభుత్వం కూడా అమరావతి పురోగతి పనులను వాయువేగంతో చేపట్టింది. జగన్ కాలంలో జంగిల్ గా కనిపించిన అమరావతి ఇప్పుడు ఆకాశ హర్మ్యాలతో, నిరాటంకంగా సాగుతున్న నిర్మాణ పనులతో కలకలలాడు తోంది. అయినా అందరిలో ఓ చిన్న అనుమానం. ఐదేళ్ల తరువాత అంటే 2029 ఎన్నికలలో ఏదైనా అనూహ్యం సంభవించి జగన్ మళ్లీ అధికారంలోకి వస్తే.. ఇదే సంశయం అమరావతి రాజధాని రైతులనూ తొలిచేసింది. అందుకే ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ తెరమీదకు తీసుకువచ్చారు. ఇదే విషయాన్ని చంద్రబాబు దృష్టికీ తీసుకువెళ్లారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని చంద్రబాబు నాయకత్వంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా  అమరావతి రాజధాని అన్న చట్టబద్ధత అవసరమని భావించింది. దీంతో ఇదే విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకువెళ్లింది. మోడీ నాయకత్వంలో కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీయే సర్కార్ లో తెలుగుదేశం కూడా కీలక భాగస్వామి అన్న సంగతి తెలిసిందే. దీంతో కేంద్రం కూడా  అందుకు సై అంది.  అమరావతికి రక్షణగా నిలవడానికి ముందుకు వచ్చింది.దీంతో ఆంధ్రప్రదేశ్ శాశ్వత, ఏకైక  రాజధానిగా అమరావతి అని ప్రకటిస్తూ గెజిట్ నోటిఫికేషన్ ఇవ్వడంతో పాటు చట్టబద్ధత కల్పించడానికి సై అంది.  ఇక ఆ దిశగా చర్యలు తీసుకోవడం లాంఛనమే అన్నది రూఢీ అయిపోయింది. దేశం మొత్తంలోనే ఏ రాష్ట్ర రాజధానికీ ఇలా గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చిన దాఖలాలేదు. చటబద్ధత కల్పించిన పరిస్థితీ లేదు. ఒక్క అమరావతికి మాత్రమే ఆ భాగ్యం దక్కింది. ఇందుకు ఎవరు ఔనన్నా కాదన్నీ వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డే కారణం. ఆయన ఇసుమంతైనా దాచని అమరావతి ద్వేషం కారణంగానే సపోజ్ ఫర్ సపోజ్ ఆయన భవిష్యత్ లో పొరపాటున అధికారంలోకి వచ్చినా అమరావతిలో ఒక్క ఇటుక ముక్క కూడా కదిలించే అవకాశం లేకుండా రాజధానిగా అమరావతికి చట్టబద్ధత రాబోతోంది.  దేశంలో ఏ రాజధానికీ దక్కని ఈ భాగ్యం ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి దక్కడానికి జగన్ ద్వేష పూరిత, కక్ష సాధింపు రాజకీయ వైఖరే కారణమనడంలో సందేహం లేదు. 

దినదిన ప్రవర్ధమానంగా దిగజారుతున్న వైసీపీ గ్రాఫ్!

ప్రతిపక్ష హోదా లేకపోయినా ఆంధ్రప్రదేశ్ లో ప్రధాన విపక్షం వైసీపీయే. అందులో సందేహం లేదు. ఎందుకంటే కూటమి పార్టీలు కాకుండా అసెంబ్లీలో ప్రాతినిథ్యం ఉన్న పార్టీ వైసీపీయే. అటువంటి వైసీపీ పని తీరును కూడా ప్రజలు గమనిస్తారు. ప్రజా సమస్యలపై ఆ పార్టీ ఎలా స్పందిస్తోంది. వాటి పరిష్కారం దిశగా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చేందుకు ఆ పార్టీ చేపడుతున్న కార్యక్రమాలు ఏమిటి?  ప్రజల పక్షాన నిలబడేందుకు ఆ పార్టీ నేతలు ముందుకు వస్తున్నారా? వంటివన్నీ జనం గమనిస్తారు. ఇప్పుడు రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికార పగ్గాలు చేపట్టి 17 నెలలు గడిచింది. ఒకింత ఆలస్యమైనా వైసీపీ అధినేత జగన్ తమ పార్టీ గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు. తాము ప్రభుత్వంపై చేస్తున్న విమర్శల పట్ల వారి స్పందన ఎలా ఉంది అన్న అంశంపై అంతర్గతంగా ఒక సర్వే చేయించారు. ఐప్యాక్ పై నమ్మకం సడలిపోయిందో ఏమో కానీ, ఈ సారి విపక్షంగా తన పార్టీ తీరు ఎలా ఉంది అన్నఅంశంపై ఢిల్లీకి చెందిన ఓ సంస్థతో కూటమి పాలనపైనా, విపక్షంగా వైసీపీ తీరుపైనా సర్వే చేయించారు.  అయితే ఈ సర్వే ఫలితంతో  జగన్ కు షాక్ తగిలింది.   విపక్షంగా వైసీపీ ఘోరంగా ఫెయిల్ అయ్యిందన్నదే ఈ సర్వే పలితంగా తేలిందని తెలుస్తోంది. ఈ విషయాన్ని పార్టీ వర్గాలే వెల్లడిస్తున్నాయి.  గత ఏడాది ఓటమి తరువాత కంటే రాష్ట్రంలో వైసీపీ గ్రాఫ్ దారుణంగా పతనమైందని ఆ సర్వేలో తేలిందంటున్నారు. ముఖ్యంగా పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికలో వైసీపీ అభ్యర్థి డిపాజిట్ కూడా గల్లంతయ్యేంత ఘోర పరాజయం మూటగట్టుకున్న తరువాత.. రాయలసీమలో కూడా వైసీపీ ప్రతిష్ఠ పాతాళానికి పడిపోయిందని ఆ సర్వే పేర్కొన్నట్లు తెలుస్తోంది. ఇక వైసీపీ అధినేత జగన్ పట్ల కూడా ప్రజలలో వ్యతిరేకత గూడుకట్టుకుంటోందని సర్వే తేల్చిం దంటున్నారు. పార్టీ ఓటమి తరువాత రాష్ట్ర వదిలి బెంగళూరులో ప్రవాసం ఉంటున్నట్లుగా జగన్ వ్యవహరిస్తున్న తీరు పట్ల ప్రజలతో పాటు, పార్టీ క్యాడర్ లో కూడా అసంతృప్తి గూడుకట్టుకుందని సర్వేలో వెల్లడైనట్లు తెలుస్తోంది.   చూడాలి మరి ఈ సర్వే ఫలితంతో నైనా జగన్ రెడ్డి తన తీరు మార్చుకుంటారా?

పరకామణి దొంగను వెనకేసుకొస్తున్న జగన్

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరకామణి చోరీ కేసు నిందితుడిని వెనకేసుకు వస్తున్నారు. పరకామణిలో జరిగిన చోరీ చాలా చాలా చిన్నదని అంటూ.. ఆ విషయంలో ఇంత రాద్ధాంతం ఎందుకని విస్మయం వ్యక్తం చేస్తున్నారు. అయితే నేరం, దొంగతనం చిన్నాదా పెద్దదా అన్నది పక్కన పెడితే.. తప్పు చేసిన వారికి శిక్ష పడాలి. మన చట్టం అదే చెబుతోంది. అందులోనూ కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవేంకటేశ్వర స్వామి వారికి భక్తులు ఇచ్చిన కానుకలను దొంగిలించడమంటే మహాఘోరం, క్షమించరాని నేరం. తాము శ్రీవారికి భక్తుతో సమర్పించిన కానుకలు చోరీ అవుతున్నాయంటే భక్తుల మనోభావాలు దెబ్బతింటాయి కూడా. కానీ వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మాత్రం అదేమంత పెద్ద నేరం కాదని తీసి పడేస్తున్నారు. పరకామణి లో రవికుమార్ అనే వ్యక్తి  ఏదో చిన్న దొంగతనం చేశాడు.. కానీ అందుకు ప్రాయశ్చితంగా  టీటీడీకి 144 కోట్ల రూపాయలు విరాళంగా ఇచ్చాడంటూ వెనకేసుకు వచ్చారు. అటు వంటి వ్యక్తి విషయంలో ఇంత యాగీ చేస్తారేంటంటూ ఆశ్చర్యపోయారు. పరకామణి చోరీ నిందితుడిని వెనకేసుకురావడమే కాదు.. అతడిని మహాదాతగా ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం కూడా చేశారు.  నిజమే జగన్ హయాంలో వేల కోట్ల రూపాయల కుంభకోణాలు జరిగాయి. ఆయన స్వయంగా ఆక్రమాస్తుల కేసుల్లో విచారణ ఎదుర్కొంటున్నారు. అటువంటి వ్యక్తికి పరకామణి చోరీ చిన్న విషయం కనిపించడంలో ఆశ్చర్యం లేదు.. కానీ కోట్లాది మంది భక్తుల మనోభావాలతో ముడిపడి ఉన్న తిరుమల శ్రీవారి విషయంలో జగన్ తీరును ఎవరూ సమర్ధించరు. సమర్ధించలేరు. ఎవరి తప్పులకు వారు శిక్ష అనుభవించి తీరాలి. అయినా జగన్ మోహన్ రెడ్డి పరకామణి  చోరీ నిందితుడు రవికుమార్ ను వెనకేసుకురావడం చూస్తుంటే..ఈ చోరీ కేసులోనూ ఆయన ప్రమేయం ఉందా అన్న అనుమానాలను పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు. ఈ కేసులోనూ తాను బుక్కయ్యే ప్రమాదం ఉందన్న భయం ఆయనలో ప్రస్ఫుటంగా కనిపిస్తోం దంటున్నారు.   అందుకే పరకామణి చోరీ కేసును ఇప్పుడు తిరగతోడి విచారించడం సరికాదన్నట్లుగా మాట్లాడు తున్నారంటున్నారు.  ఇక్కడ జగన్ పరకామణిలో చోరీ జరగలేదని చెప్పడం లేదు.. కానీ చోరీ చేసిన సొత్తుకంటే ఎన్నో రెట్ల ఆస్తులను టీటీడీకి ఇచ్చి ప్రాయశ్చిత్తం చేసుకున్న వ్యక్తిని ఎందుకు విచారణ పేరుతో విధిస్తారని ఆశ్చర్యపోతున్నారు జగన్. రవికుమార్ చేసిన తప్పుకు ప్రాయశ్చిత్తంగా రూ.144 కోట్ల ఆస్తులను టీటీడీకి ఇవ్వడం వల్లనే తన హయాంలో ఆ కేసును రాజీ చేశారని చెబుతున్న జగన్ అసలు ఓ చిరుద్యోగికి అంత ఆస్తి ఎక్కడిదన్న విషయం మాత్రం చెప్పలేదు. వాస్తవానికి ప జగన్ హయాంలో తిరుమల పరకామణిలో అవకతవకలకు హద్దు లేకుండా పోయిందనీ, రవికుమార్ ఇటువంటి చోరీలతోనే కోట్ల రూపాయలు సంపాదించాడ, ఆ సంపాదన నుంచి వందల కోట్ల రూపాయలను వైసీపీ నేతలకు రాసిచ్చాడనీ పరిశీలకులు ఆరోపణలు చేస్తున్నారు.  ఏది ఏమైనా చిన్న చోరీ చేసి ప్రాయశ్నితంగా 144 కోట్లు టీటీడీకి రాసిచ్చేశానని రవికుమార్ చెప్తున్న మాటలు, ఆయనను సమర్ధించుకు వస్తూ జగన్ చేస్తున్న వ్యాఖ్యలూ ఇసుమంతైనా నమ్మశక్యంగా లేవు.   అయినా నేరం జరిగిందని నిందితుడే అంగీకరించాడు. ఇప్పుడు జగన్  కూడా ఔను రవికుమార్ చోరీ చేశాడని చెబుతున్నారు. అలాంటప్పుడు విచారణ జరపడంలో తప్పేముంది? అన్నిటికీ మించి పరకామణి చోరీపై ఫిర్యాదు చేసిన సతీష్ హత్యకు గురి కావడంతో పరకామణి చోరీ వ్యవహారంలో రవికుమార్ వెనుక పెద్ద తలకాయలు ఉన్నాయన్న అనుమానాలు సర్వత్రా వ్యక్తం అవుతున్నాయి. అవి నివృత్తి కావాలంటే ఈ విషయంపై సమగ్ర దర్యాప్తు జరగాల్సిందే.  అయినా ఇప్పుడు పరకామణి చోరుడు రవికుమార్ ను వెనకేసుకు వస్తూ జగన్ మాట్లాడిన మాటలు వింటుంటే గుమ్మడి కాయల దొంగ అంటే భుజాలు తడుముకున్నట్లు అన్న సామెత గుర్తుకు వస్తోందంటున్నారు పరిశీలకులు.  అదలా ఉంటే కోర్టు కూడా పరకామణి చోరీ వ్యవహారాన్ని లోక్ అదాలత్ లో రాజీ కుదుర్చుకోవడాన్ని సీరియస్ గా తీసుకుంది. ఇదేమీ చిన్న విషయం కాదని హైకోర్టు డివిజన్ బెంచ్ పేర్కొంది.   ఈ కేసులో సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ నిందితుడు రవికుమార్ దాఖలు చేసిన  పిటిషన్ ను గురువారం (డిసెంబర్ 4) విచారించిన ధర్మాసనం  సతీష్‌కు సంబంధించిన కేసు లోక్ అదాలత్‌లో రాజీకి అవకాశం లేదని సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును   సమర్థించింది.   ఆలయాల ప్రయోజనాల పరిరక్షణలో  కోర్టులే మొదటి సంరక్షకులుగా వ్యవహరిస్తాయని  స్పష్టం చేసింది. పరకామణి చోరీ వంటి తీవ్రమైన కేసులో రాజీ కుదుర్చుకోవడాన్ని తేలికగా తీసుకోలేమని స్పష్టం చేసింది. తరువాత రవికుమార్ దాఖలు చేసిన అప్పీల్‌పై తదుపరి విచారణను ఈనెల 11కి వాయిదా వేసింది.