రెండు పేపర్లతో నోరు మాయించిన చంద్రబాబు...

  రాష్ట్ర విడిపోయి దాదాపు నాలుగేళ్లు అయిపోయింది. ఈ మూడేళ్లు ఒక ఎత్తైతే ఈ ఏడాది మాత్రం ఏపీ రాజకీయాలు దేశ వ్యాప్తంగా చర్చలకు దారితీశాయి. దానికి కారణం ఏపీ ప్రత్యేక హోదా పోరాటమే కారణం. దీని కోసం మిత్రపక్షంగా ఉన్న బీజేపీ-టీడీపీ పార్టీలు సైతం విడిపోయాయి. ప్రత్యేక హోదా ఇవ్వనప్పుడు మీతో మేము ఎందుకు ఉంటాం అని బయటకు వచ్చేశారు. ఇక ఇప్పుడు బయటకు వచ్చిన తరువాత ఒక సమస్య. ఈ పని ఏదో ముందే చేసి వుంటే బావుండేది కదా అని మరో వాదన. అయితే అలా మాట్లేడే వారికి చంద్రబాబు మంచి ఆన్సర్ ఇచ్చారు.   అసలు సంగతేంటంటే... ఏపీ ప్రత్యేక హోదా పోరాటం నేపథ్యంలో చంద్రబాబు అఖిలపక్షం ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే కదా. ఈ సమావేశానికి   సీపీఎం, సీపీఐ, కాంగ్రెస్, ఏపీ ఎన్జీవో సంఘం, ప్రత్యేకహోదా, విభజన హామీల సాధన సమితి ఇలా చాలా మంది హాజరయ్యారు. ఈ సందర్భంగా సీపీఎం నేత మధు మాట్లాడుతూ, రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్ర ప్రభుత్వంపై వత్తిడి తెచ్చేందుకు ఈ నాలుగేళ్లు అఖిలపక్ష సమావేశాలు జరిపి ఉంటే బాగుండేదని, మీరు ఎప్పుడో బయటకు రావాల్సింది, ఇప్పటి దాక ఎందుకు రాలేదు అంటూ, చంద్రబాబుని ప్రశ్నించారట. అయితే దీనికి చంద్రబాబు వారి ముందు రెండు కాగితాలు పెట్టారట. అది చూసి మొదట వారికి అర్దం కాలేదట. అప్పుడు చంద్రబాబు వాటిని చూపిస్తూ.... ఫిబ్రవరి 4 నుంచి మా ఎంపీలు పార్లమెంట్ లో ఆందోళన మొదలు పెట్టారు... ఫిబ్రవరి 9న వెనుకబడిన ప్రాంతాలకి, కేంద్రం 350 కోట్లు ఇచ్చింది... ఇది తెలుసుకున్న ప్రధాని కార్యాలయం, ఫిబ్రవరి 15న RBIతో చెప్పి, వేసిన డబ్బులు వెనక్కు తీసుకున్నారు...అలా ఉంటుంది వీరి కక్ష. నాలుగేళ్ల ముందే నేను బయటకు వచ్చి ఉంటే, పరిస్థితి ఎలా ఉండేదో ఊహించుకోండి... పోలవరం అసలు మొదలే అయ్యేది కాదు... అమరావతికి ఎన్నో ఇబ్బందులు వచ్చేవి (పర్మిషన్ల గురించి)... నాలుగేళ్లు అయ్యాకనే మనకివ్వాల్సింది మనం అడిగితే ఇలా చేస్తున్నారు.. తొలిరోజు నుంచే నేను దూకుడుగా వెళ్లివుంటే రాష్ట్రానికి ఇంకా అన్యాయం జరిగేది కాదా అని ప్రశ్నించారట. అంతేకాదు... ఒకవేళ నేను కనుక ముందే అలా చేసి వుంటే ‘సీయం కాస్త ఓపిక పట్టివుంటే బావుండేది, దూకుడుగా వెళ్లి రాష్ట్ర ప్రయోజనాలకు అన్యాయం చేశార’ని అప్పుడు మీరే అనేవారు అని అన్నారట. దాంతో చంద్రబాబు సమాధానం విన్న వారు ఏం మాట్లాడాలే తెలీక సైలెంట్ గా ఉండి పోయారట. మరి చంద్రబాబు చెప్పిన దాంట్లో కూడా నిజం ఉంది కదా... అందుకే వాళ్లు కూడా ఏం మాట్లాడలేకపోయారు. నాలుగేళ్ల క్రితమే తిరగబడి ఉంటే ఇచ్చిన ఆ చిల్లర కూడా ఇచ్చేవాళ్లు కాదేమో...

సౌత్ సీఎంల ఆగ్రహం... మీ సొంత సొమ్ము ఇస్తున్నారా...!

ఓ సినిమాలో లక్ష రూపాయలు జేబులో పెట్టుకుని తిరిగే కమెడియన్ సునీల్.. కనబడివారికల్లా ఇస్తానంటాడు. కానీ చివరికి ఒక్క రూపాయి కూడా ఇవ్వడు. బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా కూడా… అంతే.. ఏ రాష్ట్రానికి వెళ్తే ఆ రాష్ట్రానికి ఓ లెక్క తీసుకెళ్తారు. అందులో కనీసం రెండు నుంచి ఐదు లక్షల కోట్లు ఉంటాయి. అక్కడ ఉన్నది… బీజేపీ ప్రభుత్వమైతే… వారి బానిసలే కాబట్టి నోరు మూసుకుంటారు. కానీ దక్షిణాదితో పాటు బెంగాల్ లోనూ … ఉన్నది నిఖార్సైన ప్రభుత్వాలు కాబట్టి… అమిత్ షా… పొలిమేర దాటక ముందే కొర్రు కాల్చి వాత పెట్టేస్తూంటారు.   ఎవడబ్బ సొమ్ము.. మా డబ్బు మాకే ఇస్తున్నారు కదా.. ఇవి పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఆగ్రహంతో మాట్లాడుతున్న మాటలు. అంతలా ఎవర్ని తిడుతున్నారబ్బా అనుకుంటున్నారా...? ఎవరినే కాదు అమిత్ షాని.  అమిత్ షా పై నిప్పులు చెరుగుతున్నారు. ఎందుకంటే.. ఎక్కడికి ప్రచారానికి వెళ్లినా.. ఒకటే పాట పాడుతున్నారు. ఏ రాష్ట్రానికి వెళ్లినా.. మేం ఈ రాష్ట్రానికి ఇన్ని లక్షల కోట్లు ఇచ్చాం.. అని చెప్పడంతో ప్రతిపక్షపార్టీలకు మండిపోతుంది. ఇటీవల తెలంగాణ వచ్చి ఇలాంటి కూతలే కూస్తే దానికి కేసీఆర్ స్పందించి అమిత్ షాకి దిమ్మతిరిగేలా ఆన్సర్ ఇచ్చి నోరుమాయించారు.  మీ అబ్బసొమ్ము ఇస్తున్నావా అని నిలదీసేసరికి సౌండ్ లేదు. ఒక్క తెలంగాణయే కాదు... ఈ మధ్య ఎన్నికల ప్రచారానికి కర్ణాటకకు వెళ్లారు. అక్కడ కూడా కర్ణాటకకు రెండు లక్షల కోట్లిచ్చామని.. సిద్ధరామయ్య తినేశాడని అన్నాడు. అంతే దానికి సిద్దరామయ్య కూడా వెంటనే ప్రెస్ మీట్ పెట్టి లెక్కలు మొత్తం బయటపెట్టి అమిత్ షాను కడిగిపారేశారు. కర్ణాటక నుంచి కేంద్రానికి వెళ్తున్న సొమ్ములో కేవలం 30 పైసలే తిరిగి వస్తోందని .. మిగతా సొమ్ము ఎక్కడి పోతుందని ప్రశ్నలు గుప్పించారు. ఇక ఆ తర్వాత ఒడిషా, కేరళల్లోనూ అదే లక్ష కోట్లు లెక్క. చివరికి బెంగాల్ కు వెళ్లి.. అక్కడా అదే ప్రచారం చేపట్టారు. ఇప్పుడు ఏపీ విషయంలో కూడా అదే చేశారు. ఏపీ చాలా ఇచ్చామని అదే పాట పాడారు. దీంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి మండిపోయింది. రాష్ట్రాల సొమ్ము తిని కేంద్రం.. రాష్ట్రాలకే ఇస్తూ.. వారికేదో తాము సాయం చేస్తున్నట్లు బిల్డప్ ఇస్తుందని మండిపడ్డారు.   దీంతో మోడీ వల్ల సగం వ్యతిరేకత రాగా.. ఇప్పుడు అమిత్ షా వల్ల ఇంకా వ్యతిరేకత పెరిగిపోయింది. కేంద్రానికి ప్రత్యేకంగా ఆదాయం ఎక్కడి నుంచి వస్తుంది... డబ్పులు ఆకాశం నుండి ఏమైనా రాలిపడుతున్నాయా.... కాదు కదా...  కేంద్ర పన్నులు అంటూ ప్రత్యేకంగా రాష్ట్రాల నుంచే వసూలు చేస్తోంది... ఆ డబ్బే మాకు ఇస్తుంది కదా అని మండిపడుతున్నారు. మరి రాజ్యాంగ ప్రకారం రాష్ట్రాలకు నిధులు ఇస్తున్నారు కానీ... మరి మోడీ, షా తమ జేబుల్లోంచి ఇచ్చినట్టు ఫీలవుతున్నట్టున్నారు.

మరీ ఇంత జోకర్ అయ్యావేంటి సామి...

  ఇప్పటికే పవన్ కళ్యాణ్ తనకు తెలిసీ తెలియని మాటలతో ఆయనకు రాజకీయ విజ్ఞత లేదు... ఏం మాట్లాడటాతో ఆయనకే తెలియదు అంటూ...కొంతమంది అయితే అసలు పవన్ ను పట్టించుకోవాల్సిన అవసరం లేదు అని చెప్పుకునే పరిస్థితి వచ్చింది. మిడి మిడి జ్ఞానంతో.. అడ్డదిడ్డమైన సమాధానాలతో ఉన్న పరువు కాస్త పొగొట్టుకుంటూ ఉంటాడు. ఇప్పుడు ఏకంగా పెద్ద జోకర్ అయిపోయాడు. వామపక్షాలతో కలిసి ప్రత్యేకహోదా ఉద్యమం కాన్సెప్ట్ మీద సమావేశం పెట్టిన ఆయన మాంచి కామెడీ చేశారు.   ఆ కామెడీ ఏంటంటే....సాధారణంగా పవన్ మాట్లాడేప్పుడు నేల చూపులు చూస్తుంటారు కదా... అలాగే నేల చూపులు చూస్తూ... ఎవరైనా ఏదైనా అంటారేమో అన్న చందాన... కేంద్రం, మోడీ, అమిత్ షా గురించి పొడి పొడిగా మాట్లాడుతూ.. ఆ తర్వాత సంబంధం లేని విషయాలను ఎత్తుకుని… ఆవేశం చూపించారు. రాజధానిలో ఇతర ప్రాంతాలకూ భూమి కేటాయించాలట. ఢిల్లీని చూస్తే…. రాజధానిలో ఇతర ప్రాంతాలకూ భూమి కేటాయించడం. రాయలసీమకు, ఉత్తరాంధ్రకు అమరావతిలో రెండు వేల ఎకరాలు కేటాయించాల్సిన అవసరం ఉందనేది పవన్ మాట. ఇక్కడే పవన్ దొరికిపోయాడు. రాజధానిలో 2వేల ఎకరాలు ఏంది సామి అని సోషల్ మీడియాలో ఆయనపై అప్పుడే కామెంట్లు మొదలయ్యాయి. ఎవరికి నచ్చినట్టుగా వాళ్లు ట్రోల్ చేయడం స్టార్ట్ చేశారు. ఏకంగా కేఏపాల్ తో పోల్చుతూ కామెడీ చేసుకుంటున్నారు. కేఏపాల్ ఎంత సీరియస్ గా హిలేరియస్ కామోడీ చేస్తారో..పవన్ కూడా అలాగే కామెడీ చేస్తున్నారని అన్నారు. మ‌రి రెండు వేల ఎక‌రాల‌ను ఎలా పంచాలో ఫార్ములా కూడా చెప్పి ఉంటే బాగుండేది. ఏయే జిల్లాకు ఎంత‌? ఏయే కులానికి ఎంత‌? అందులోనూ ఎస్సీ, ఎస్టీ, బీసీ ల వాటా ఎంత‌?. ఈ ప‌వ‌న్ ఎపుడూ ఇంతే.. ఏదీ ప‌క్కా ప్లాన్ తో రాడు… ఈసారైనా బ్లూ ప్రింట్ తో రా సామీ… అంటూ సెటైర్లు వేసుకుంటున్నారు. దీంతో పపన్ కల్యాణ్ నోరు విప్పకపోతేనే బావుంటుందని అనుకుంటున్నారు. మరి నిజంగానే పవన్ మాట్లాడకుండా ఉంటేనే బావుంటుందన్న వాదన వినిపిస్తుంది. ప్రత్యేక హోదా గురించి మాట్లాడకుండా.. ఎక్కడో రాజధానిలో తెలుగు వాళ్ల కోసం భూమి కేటాయించాలి పవన్ అనడం నిజంగా ఆయన ఫూలిష్  నెస్సే అవుతుంది. ఇప్పటికైనా ఎక్కడ, ఎప్పుడు, ఎలా మాట్లాడాలో నేర్చుకుంటే బెటర్..

ఈయనెవరండి బాబు... స్ట్రాటజీ ఏంటో అర్దమయిచావట్లేదు...

  ఎన్నికల వ్యూహకర్తగా బాధ్యతలు నిర్విర్తించడమంటే మామూలు విషయం కాదు...ఎన్నో వ్యూహాలు రచించాలి..ఎప్పటికప్పుడు పార్టీ గురించి అధ్యయం చేస్తుండాలి... సర్వేలు నిర్వహిస్తుండాలి.. ఇలా పార్టీ భారాన్ని మొత్తం మోయాల్సి ఉంటుంది. ఎన్నికల్లో పార్టీ గెలిచిందా ఓకే.. లేదంటే ఆ నష్టాన్ని కూడా తన భుజాలపై మోయాల్సిందే. ఇప్పుడు ఈ ఉపోద్ఘాతం అంతా ఎవరికోసం అంటారా... ఇంకెవరూ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ గురించి.   భారత రాజకీయ నాయకులకు పరిచయం అక్కర్లేని పేరు. ఎన్నికల వ్యూహకర్తగా ఈయన ఎంతో మందికి అధికారాన్ని అందించాడు. ప్రధాని మోడీ కూడా పీకే సలహాలు తీసుకున్నారంటేనే చెప్పొచ్చు.. ఆయన ఎలాంటి వ్యూహాలు రచిస్తాడో. ఇక ఇప్పుడు ప్రస్తుతం పీకే జగన్ పార్టీకి ఎన్నికల వ్యూహకర్తగా పనిచేస్తున్నారు. జగన్ కూడా పీకే సలహాలు, సూచనలు పాటిస్తూ ముందుకు సాగిపోతున్నారు. అయితే అలాంటి పీకే కి ఇప్పుడు ఓ వ్యక్తి స్ట్రాటజీ ఏంటో అస్సలు అర్ధం కావట్లేదటా. ఇంతకీ ఆ వ్యక్తి ఎవరనుకుంటున్నారా...? ఎవరో కాదు.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్.   తనకు ఎలాంటి అధికారాలు అవసరం లేదని... కేవలం ప్రజా సమస్యలే తనకి ముఖ్యమని ఇప్పటికే పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. అందుకు తగ్గట్టుగానే ప్రలు ప్రజా సమస్యలపై స్పందించి ప్రభుత్వాన్ని నిలదీశారు కూడా. దీనికి తోడు ఇన్నిరోజులు టీడీపీ పార్టీ, జనసేన పార్టీ రెండూ ఒకటే అనుకుంటే ఇప్పుడు  అది కూడా లేదన్న విషయం అర్ధమైపోయింది. సందు దొరికినప్పుడల్లా టీడీపీపై విమర్సలు చేస్తూనే ఉన్నారు. అటు వైసీపీ కి ఫెవర్ గా మాట్లాడతారా అంటే అదీ లేదు. దీంతో పవన్ 2019 ఎన్నికల వ్యూహం ఎంటో అర్ధకావట్లేదట. ఇంకా పార్టీ నిర్మాణం దశలోనే ఉంది.. అలాంటి పార్టీ వచ్చే ఎన్నికల్లో అనుసరించే వ్యూహాలు ఏంటి.. ఎలా ఉండబోతుంది అన్న విషయాలు అర్ధం కావట్లేదట. ఈ విషయాన్నే ఆయన సీనియర్ పార్టీ నేతలతో చర్చించారట. మొత్తానికి ఎన్నికల వ్యూహాలు రచించడంలో తల పండిన పీకే కే పవన్ గురించి అర్దం కావట్లేదంటే గ్రేటే. దీన్నిబట్టి చూస్తే పవన్ కాస్త డిఫరెంట్ అన్న విషయం మరోసారి రుజువైంది.

ఉండవల్లికి శివాజీ వార్నింగ్ .. నన్ను కెలకొద్దు.. అన్నీ బయటపెడతా...

  ఓ జాతీయ పార్టీ 'ఆపరేషన్ ద్రవిడ' చేపట్టిందంటూ హీరో శివాజీ దానికి సంబంధించిన పలు సంచలన విషయాలు బయటపెట్టిన సంగతి తెలిసిందే. ఈరోజు నుండి ఇక ఎక్కడ చూసిని దీనిపై ఒకటే చర్చలు మొదలయ్యాయి. అంతేకాదు దీనిపై స్పందించిన ఉండవల్లి ఎవరో చెప్పిన కథను నమ్మి శివాజీ ఇలా చెప్పి ఉంటారని.. ఇదంతా ఓ జానపథ కథ అని కొట్టిపారేశారు. అయితే ఇప్పుడు...ఉండవల్లి వ్యాఖ్యలపై స్పందించిన శివాజీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ ఛానల్ లో ఇంటర్వ్యూలో పాల్గొన్న శివాజీని.. మీరు చెప్పింది ఒక జానపద కథలా ఉందని ఉండవల్లి చెప్పారని..మీరేమంటారని అనగా...ఆపరేషన్ గరుడ గురించి తాను వివరాలను వెల్లడిస్తే... ఉండవల్లికి ఉలుకెందుకని ప్రశ్నించారు. గత 10 నుంచి 12 ఏళ్లుగా ఆయనను తాను గమనిస్తున్నానని... ఏ ఇద్దరు కూడా ప్రశాంతంగా ఉండకూడదనేని ఉండవల్లి తత్వమని.. ఏదో ఒక పక్క ఉండి అవతలివారిపై నిందలు వేస్తుంటారని... తద్వారా బెనిఫిట్ పొందుతుంటారని అన్నారు. ఆయన చెబితే భగవద్గీత... మేము చెబితే పిచ్చి మాటలా? అని మండిపడ్డారు. తాను చెప్పింది నమ్మాలని ఉండవల్లిని అడిగానా? అని ఎద్దేవా చేశారు.   అంతేకాదు.. తనకు బెనిఫిట్స్ మీద ఆశ ఉంటే... బీజేపీ నుంచి బయటకు వచ్చేవాడినే కాదని.. తనను కెలికితే గతంలో పోలవరం గురించి ఉండవల్లి మాట్లాడినవన్నీ వీడియోలో పెట్టి చూపిస్తానని హెచ్చరించారు. తాను ప్రశాంతంగా రాష్ట్రం కోసం పని చేస్తున్నానని... తనను రెచ్చగొట్టొద్దని చెప్పారు. మరి శివాజీ వార్నింగ్ కు ఉండవల్లి ఎలా స్పందిస్తారో చూద్దాం...

తెలుగువారిని అవమానిస్తూ అమిత్ షా లేఖ...

  నాలుగేళ్ల పాటు ఏపీకి చాలా ఎక్కువ సాయం చేసినట్టు అమిత్ షా చంద్రబాబుకు తొమ్మిది పజీల లేఖ రాసిన సంగతి తెలిసిందే. ఇక ఈలేఖపై స్పందించిన చంద్రబాబు కేంద్రంపై నిప్పులు చెరిగారు. అసెంబ్లీలో అమిత్ షా లేఖపై మాట్లాడుతూ... తెలుగువారిని అవమానిస్తూ అమిత్ షా లేఖ రాశారని అన్నారు. అమిత్ షా లేఖలోని విషయాలు అన్నీ కట్టుకథలు, అర్ధసత్యాలని... ఉన్నతస్థాయిలోని వ్యక్తులు అబద్దాలు చెప్పకూడదని మండిపడ్డారు. ఇంక చంద్రబాబు ప్రసంగంలోని ముఖ్యాంశాలు.... * నేను రాసిన లెటర్ చూడండి.. అమిత్ షా రాసిన లెటర్ చదవండి. ప్రజలను రెచ్చగొడుతున్నట్టు అమిత్ షా లేఖ ఉంది.. * జాతీయ స్థాయి నాయకులు తమ హుందాతనాన్ని తగ్గించుకోకూడదు * కాంగ్రెస్ కంటే బీజేపీ ఎక్కువ మోసం చేసిందన్న భావన ప్రజల్లో ఉంది... ఇది కాదనలేని సత్యం. * ప్రజలు ఆందోళన చేస్తున్నా ఒక్క మాట కూడా స్పందించడంలేదు... చట్టంలోని అంశాలను అడిగితే ఎదురుదాడి చేస్తారా..?.. ఏపీ అంటే అంత చిన్నచూపు ఎందుకు.. * చాలా డబ్బులిచ్చేశాం అన్నట్టు మాట్లాడుతున్నారు.. ప్రజల పన్నుల్లో కొంతభాగన్ని మాత్రమే తిరిగి ఇస్తున్నారు. ఆర్ధికంగా స్ట్రాంగ్ గా ఉంటే వాళ్లని ఎందుకు అడుగుతాం.. * హోదాపై సెంటిమెంట్ ఎందుకు వచ్చింది.. కేంద్రం అన్యాయం చేసింది కాబట్టే సెంటిమెంట్ వచ్చింది.. * నడికుడి-కాళహస్తి రైల్వే లైన్ కు భూములిచ్చి.. 50శాతం నిధులు కూడా ఇచ్చాం... భూములు మావి... నిధులు మావి.. శ్రమ మాది.. పేరు మాత్రం వారిది.. * ప్రజల పక్షమా..ఢిల్లీ పక్షమా... ఏపీ బీజేపీ నేతలు తేల్చుకోవాలి. * అరకొర నిధులతో విద్యాసంస్థలు పూర్తవడానికి 50, 60 ఏళ్లు పడుతుంది * ఏకపక్షంగా మాట్లాడటం ఎంతవరకూ సమంజసం... అక్కడ డబ్బులు పెట్టినప్పుడు ఇక్కడ ఎందుకు పెట్టరు

కేంద్రంపై యుద్దం.. అంత ధైర్యం ఎక్కడినుండి వచ్చింది..!

  గతంలో తండ్రి చాటు బిడ్డ అని... సరిగ్గా మాట్లాడటం కూడా రాదు అన్న ముద్ర నారా లోకేశ్ పై ఉండేది. కానీ మంత్రి అయిన తరువాత లోకేశ్ కు కాస్త రాజకీయ పరిజ్ఞానం పెరిగిందని చెప్పొచ్చు. అందుకే ఇప్పుడు ఏకంగా కేంద్రంపైనే యుద్దానికి దిగాడు. అసలు సంగతేంటంటే.. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా చంద్రబాబు కు లేఖ రాసిన సంగతి తెలిసిందే కదా. ఇక ఈ లేఖలో షా ఏం రాశారంటే... ఎన్డీయే నుంచి టీడీపీ బయటకు రావడం ఏకపక్ష నిర్ణయం తీసుకున్నట్లుగా భావిస్తున్నానన్నారు. ఈ నిర్ణయం ఆశ్చర్యం, భాదను కలిగించిందని... టీడీపీ, ఏపీ ప్రజలు బీజేపీకి నిజమైన స్నేహితులని వ్యాఖ్యానించారు. ఏపీ అభివృద్ధికి మోదీ సహకరించారని... రాష్ట్రానికి సంబంధించిన ఏ విషయంలోనూవెనకడుగు వేయలేదన్నారు. అంతేకాదు...ఇంకా నాలుగేళ్ల సాయంపై కూడా స్పందించి.. నాలుగేళ్లలో చేసిన అభివృద్ధి పనుల్ని షా ప్రస్తావించారు. విభజన చట్టంలోని హామీలను ఒక్కొక్కటిగా తీరుస్తున్నామని... కేంద్రం నుంచి కేటాయించిన నిధుల వివరాలను చెప్పుకొచ్చారు. పోలవరం, రాజధాని కోసం ప్రత్యేక శ్రద్ధ చూపించామన్నారు. మూడు ఎయిర్‌పోర్టుల్ని అంతర్జాతీయంగా తీర్చిదిద్దామన్నారు. ఇలా చెప్పిన ప్రతి హామీని దాదాపుగా నెరవేర్చామని చెప్పుకొచ్చారు. అలాగే ఏపీలో రోడ్ల నిర్మాణానికి ప్రత్యేకంగా నిధులు కేటాయించామని... మెట్రో రైలుకు కూడా సూత్రప్రాయంగా అంగీకారం తెలిపామన్నారు. మొత్తం 9 పేజీలతో అమిత్ షా ఈ లేఖ రాశారు.   దీంతో ఈ లేఖపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఆశ్చర్యంగా లోకేష్ ముందు స్పందించి అమిత్ షాకు కౌంటర్ ఇచ్చాడు. అమిత్ షా లేఖ చూసాక ఆయనకి రాష్ట్ర సమస్యల మీద అవగాహన లేనట్టు అర్ధం అయ్యిందని...ఆంధ్రప్రదేశ్ ప్రజానీకంలో కేంద్రం మీద వున్న అసంతృప్తిని సీఎం చంద్రబాబు ఎన్నిసార్లు వివరించినా ప్రధాని మోడీ పట్టించుకోలేదని...కేంద్రానికి ఎప్పటికప్పుడు వివిధ పనులకి సంబంధించిన యూటిలైజేషన్ సర్టిఫికెట్స్ పంపుతున్నామని చెప్పిన లోకేష్ …అసలు వాటికి ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా ఇవ్వడానికి సంబంధం ఏంటని నిలదీశారు. దీంతో ఈ టైంలో లోకేష్ కేంద్రంపై ఇలాంటి కామెంట్లు చేయడం సాహసం చేసినట్టే అని అనుకుంటున్నారు. దానికి కారణం లేకపోలేదు... ఇప్పటికే చంద్రబాబుపై కేంద్రం మండిపడుతుంది... దానికి తోడు అవిశ్వాస తీర్మానం కూడా పెట్టారు.. అన్నింటికీ మించి...నారా లోకేష్ పై ఓ రేంజ్ లో అవినీతి ఆరోపణలు వస్తున్న తరుణంలో లోకేశ్ ఇలా మాట్లాడటం నిజంగా ధైర్యం చేసినట్టే. అంతేకాదు ఇంత ధైర్యం లోకేశ్ కు ఎక్కడినట్టు వచ్చిందో అని అప్పుడే రాజకీయవర్గాల్లో చర్చలు మొదలయ్యాయి. దీనిబట్టి చూస్తే.. మోడీ - అమిత్ షా ద్వయాన్ని దీటుగా ఎదుర్కోవడానికి టీడీపీ గట్టిగానే ప్రిపేర్ అయినట్టు ఉంది..

ట్విట్టర్ ఖాతాలు తెరిచినంతమాత్రాన నమ్ముతారా...?

సోషల్ మీడియాని వాడుకోవడంలో ప్రధాని మోడీ దిట్ట అని అందరికీ తెలిసిందే. గత ఎన్నికల్లో బీజేపీకి ఇంత ఫాలోయింగ్ వచ్చి అధికారం చేపట్టిందంటే ఓ రకంగా ఈ సోషల్ మీడియా కూడా కారణం అని చెప్పొచ్చు. అన్ని పార్టీలేమో కానీ.. బీజేపీ, మోడీ మాత్రం సోషల్ మీడియాను ఓ రేంజ్ లో వాడుకున్నారు. ఎక్కడ చూసినా జనాలు నమో.. నమో అనుకునేలా చేశారు. ఇక ఈసారి కూడా మోడీ సోషల్ మీడియానే వాడుకోవాలని చూస్తున్నారు. అందుకే బీజేపీ ఎంపీలందరికీ ఓ టార్గెట్ పెట్టినట్టు తెలుస్తోంది. బీజేపీ పార్లమెంటరీ సమావేశం జరిగిన నేపథ్యంలో మోడీ బీజేపీ ఎంపీలంతా ట్విట్టర్ లో అధికారిక ఖాతాలు తెరవాలని ఆదేశించారు. అంతేనా.. ఒక్కో ఎంపీకి కనీసం మూడు లక్షల మంది ఫాలోయర్లు ఉండాలని టార్గెట్ విధించారు. ప్రతిపక్షాల తప్పుడు విమర్శలను ఎండగట్టేందుకు ఎంపీలంతా ప్రజల్లోకి వెళ్లాలని... వాస్తవాలను ప్రజలకు తెలియజేయడానికి టెక్నాలజీని ఉపయోగించుకోవాలని తెలిపారు. ప్రతిపక్షాల అసత్యాలను తిప్పికొట్టేలా మన సందేశం ప్రజల్లోకి వెళ్లాలని సూచించారట. దాదాపు మూడు గంటల సేపు ఈ సమావేశం జరిగింది. ఇందులో సోషల్ మీడియాను వినియోగించుకోవడంపైనే ఎక్కువ చర్చ జరిగిందట. మరి అప్పుడంటే మోడీకి క్రేజ్ ఉంది కాబట్టి అందరూ నమ్మేశారు. కానీ ఈ నాలుగేళ్లలో బీజేపీ వైఖరి, పాలన చూసిన చాలా మంది..మోడీకి వ్యతిరేకంగా తయారయ్యారు. అలాంటిది ఇప్పుడు ఎన్ని ట్విట్టర్ ఖాతాలు తెరిచినా... ఎంత మంది ఫాలోవర్లు ఉన్నా వేస్ట్ అన్న విషయం మోడీకి తెలియట్లేదు. దానికితోడు ఇటీవలే ఓ నిజం కూడా బయటపడింది. మోడీకి సోషల్ మీడియాలో ఉన్న అకౌంట్లలో 60 శాతం ఫేక్ అకౌంట్లనే తేలింది. ఇంత తెలిసిన తరువాత ఏదో తమ నేతలతో ఖాతాలు తెరిపించినంత మాత్రనా నమ్మడానికి సిద్దంగా లేరన్న విషయం గుర్తుపెట్టుకుంటే బెటర్.  కేవలం ట్విట్టర్ ఖాతాలు తెరిచి రాజకీయాలు చేద్దామనుకుంటే అది కాని పని అని తెలుసుకుంటే మంచిది...

బీజేపీ ప్లాన్ ఇదేనా.... చంద్రబాబు ఉంటే హోదా ఇవ్వం...

సోము వీర్రాజు..ఈయన గురించి పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈమధ్య మీడియా సమావేశాల్లో ఈయన హడావుడి ఎక్కువైంది. మైకు కనిపిస్తే చాలు.. నోటికొచ్చినట్టు మాట్లాడటం..ఏపీ ప్రభుత్వంపై దుమ్మెత్తిపోయడమే పనిగా పెట్టుకున్నారు. బీజేపీ-టీడీపీ మిత్ర పక్షాలుగా ఉన్నప్పుడు కూడా ఈయన తన నోటికి తాళం వేయకుండా టీడీపీపై విమర్శలు గుప్పించేవారు. ఇప్పుడు బీజేపీ నుండి టీడీపీ బయటకు వచ్చిన తరువాత... ఇంకా ఎక్కువ విమర్శించడం మొదలుపెట్టారు. ఇప్పటికే ఎన్నో కామెంట్స్ చేసిన ఆయన తాజాగా మరోసారి  ఏపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ఏపీలో అవినీతి పరాకాష్టకు చేరిందని, ప్రభుత్వ అవినీతిని తవ్వడానికి పలుగు సరిపోదని, బుల్డోజర్ కావాలని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం సుముఖంగా ఉందని కాని.. మట్టి నుంచి ఇసుక వరకు, పోలవరం నుంచి పట్టిసీమ వరకు రూ.లక్షల కోట్ల అవినీతి జరిగిందని అన్నారు. రాష్ట్రంలో అవినీతికి ‘పట్టిసీమ’ పరాకాష్ట అని, రూ.1120 కోట్లతో ‘పట్టిసీమ’ మొదలైందని, ఇప్పుడు రూ.1667  కోట్లకు వెళ్లిందని అన్నారు. పట్టిసీమలో ఏర్పాటు చేసిన మోటార్లు 30 అని చెప్పారని, కేవలం 24 మోటార్లు మాత్రమే పెట్టారని, పంపు సెట్ల ఖరీదులోనూ మతలబు ఉందని ఆరోపించారు.   అంతేకాదు... చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలం హోదా ఇచ్చే ప్రసక్తే లేదని .. అరుణ్‌ జైట్లీ సూచించినట్లు ‘స్పెషల్‌ స్టేటస్‌ వెహికల్‌’ ఏర్పాటు చేస్తే.. హోదా హామీ ద్వారా ఏపీకి దక్కాల్సిన అన్నిటికి అన్ని మేళ్లూ అందుతాయని, ఈ విషయంలో బీజేపీపై ఎలాంటి అనుమానాలు అవసరంలేదని ఆయన స్పష్టం చేశారు. అయితే అవినీతిలో కూరుకుపోయిన చంద్రబాబు మాత్రం అందుకు సుముఖంగా లేరని, తన తప్పులు కప్పిపుచ్చుకోవడానికి ఆయన రాష్ట్రాన్ని బలిపెడుతున్నాడని ఆరోపించారు. చూడబోతే నిజంగానే చంద్రబాబుకు క్రెడిట్ దక్కకుండా బీజేపీ ప్లాన్ చేస్తున్నట్టు ఉంది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలం హోదా ఇచ్చే ప్రసక్తే లేదు అని రాజుగారు అంత ఖచ్చితంగా చెబుతున్నారంటే అందులో నిజం లేకపోలేదు అని అనుకుంటున్నారు. దీనిబట్టి చూస్తే ఏదో హంగామా చేసి తమవల్లే హోదా వచ్చిందని చెప్పుకోవాలని బీజేపీ చూస్తున్నట్టు అర్దమైపోయింది. చూద్దాం ఏం జరుగుతుందో..

తెలంగాణ ప్రభుత్వంపై చైనా సీరియస్... గొప్పలే.. విషయం లేదు..

  పేరు గొప్ప.. ఊరు దిబ్బ అన్న సామెత వినే ఉంటారు. ఇప్పుడు ఈ సామెత తెలంగాణ ప్రభుత్వానికి సరిగ్గా సూటవుతుందని చెప్పొచ్చు. ఎంతసేపు మేము అది చేశాం.. ఇది చేశాం.. మా కంటే తోపులు ఎవ్వరూ లేరని చెప్పుకునే తెలంగాణ ప్రభుత్వానికి ఓ ఎదురుదెబ్బ తగిలింది. అది కూడా ఏదో సొంత రాష్ట్రం నుండో.. లేక పక్క రాష్ట్ర నుండో కాదు.. ఏకంగా పక్క దేశమే తెలంగాణ ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. అసలు సంగతేంటంటే... ఉమ్మడిగా ఉన్న రాష్ట్రం రెండుగా విడిపోయిన తరువాత..తెలంగాణలో కేసీఆర్, కేటీఆర్.. ఏపీలో చంద్రబాబు, లోకేశ్ విదేశీ పెట్టుబడులు రాష్ట్రంలోకి తెప్పిచడానికి తెగ ప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఏ ప్రాంతాలు అనుకూలంగా ఉంటాయో ఆ ప్రాంతాల్లో పెట్టుబడులు పెట్టడానికి విదేశాలు మొగ్గుచూపుతున్నాయి.   ఈ నేపథ్యంలోనే తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు చైనా ముందుకొచ్చింది. దీనిలోభాగంగానే....  చైనా నుంచి పారిశ్రామికవేత్తలు.. పెట్టుబడిదారులు.. ఉన్నతస్థాయి ప్రతినిధుల బృందం మూడు రోజులు పర్యటించేందుకు హైదరాబాద్ కు వచ్చారు. బంజారాహిల్స్ లోని రాడిసన్ బ్లూ హోటల్లో చైనా పారిశ్రామికవేత్తలతో వ్యాపార సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ.. ఐటీ.. పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ రావాల్సి ఉంది. రాత్రి ఏడు గంటలకు కార్యక్రమం స్టార్ట్ కావాల్సి ఉన్నా.. 8 గంటల వరకూ వెయిట్ చేయాల్సి వచ్చింది. అయినా రాకపోవటంతో రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులు లేకుండానే సమావేశాన్ని పూర్తి చేశారు. ఈ కార్యక్రమంలో  చైనా బృందంలో పర్యావరణం.. సహజ విద్యుత్తు.. మౌలిక సదుపాయాలు.. మౌలిక వసతులు.. గృహ నిర్మాణం.. ఐటీ సేవలు.. పరిశ్రమలకు చెందిన 82 మంది పారిశ్రామికవేత్తలు.. పెట్టుబడిదారులు పాల్గొన్నారు.   దీంతో తెలంగాణ ప్రభుత్వంపై చైనా బృందం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇంతమంది చైనా బృందం ఒక రాష్ట్రానికి రావడం ఇదే తొలిసారని.. వేరే ఏ దేశానికి వెళ్లినా తమకు ఘన స్వాగతం లభించేదని.. ఇక్కడ ప్రభుత్వం తీరు అసంతృప్తిగా ఉంది... తమను ఉద్దేశ పూర్వకంగా అవమానించినట్లుగా ఆ బృందం చెబుతోంది. అంతేకాదు...తమ పర్యటనను మధ్యలోనే ఆపేసుకొని తిరిగి వెళ్లిపోయేందుకు సిద్ధమవుతున్నారు. మరి మా రాష్ట్రంలో అపారమైన అవకాశాలు ఉన్నాయని.. అక్కడ గొప్పలు చెప్పుకొని.. తీరా ఇక్కడికి వచ్చిన తరువాత ఇలా వ్యవహరించడం చూసి తెలంగాణ ప్రభుత్వానికి గొప్పలు చెప్పుకోవడం తప్ప.. విషయం లేదని అంటున్నారు. మరి దీనిపై కేసీఆర్ గారు ఎలా స్పందిస్తారో చూద్దాం...

ఆ విషయంలో శివాజీ సక్సెస్ అయినట్టే..

  ఇప్పటికే ఏపీ ప్రత్యేక హోదాపై... పార్లమెంట్ అవిశ్వాస తీర్మానంపై గందరగోళం నెలకొంది. ఒకపక్క పార్టీలు ఒకరిమీద మరొకరు దుమ్మెత్తిపోసుకుంటున్నాయి. ఎవరికి ఎవరు ఫేవరో.. ఎవరికి ఎవరు శత్రువులో కూడా తెలియని గజిబిజి గందరగోళంలో పడిపోయారు జనాలు. ఇంత కన్ఫ్యూజన్ లో ఉండగా.. హీరో శివాజీ ఆపరేషన్ గరుడ అంటూ మరో బాంబు పేల్చాడు. ఉన్న కన్ఫ్యూజన్ తోనే చస్తుంటే ఇప్పుడు ఈ ఆపరేషన్ గరుడ అంటూ పెద్ద థీరమే చెప్పాడు. ఇప్పుడు ఈ ‘ఆపరేషన్ గరుడ’ అంశం రాజకీయ వర్గాల్లో కలకలం సృష్టిస్తుంది. జాతీయ పార్టీ ఒకటి ఆపరేషన్ గరుడ స్టార్ట్ చేసిందని... అది 2017లో మొదలైందని.. దానికోసం ఇప్పటికే 4800కోట్లు ఖర్చుచేయనున్నారని తెలిపారు. ద్రవిడ అంటే సౌత్ ఇండియా.. ఏపీలో దీనికి ఆపరేషన్ గరుడ అని... తమిళనాడు, కేరళకు సంబంధించి ఆపరేషన్ రావణ...కర్నాటకలో ఆపరేషన్ కుమార అని అన్నారు. అంతేకాదు ఈ ఆపరేషన్లో ఏయే పార్టీ ఎలా పని చేస్తుంది.. ఎలా జాతీయ పార్టీ వారితో పనిచేయించుకుంటుంది.. ఆఖరికి ఎవరు ముఖ్యమంత్రి అవుతారు... అని కూడా శివాజీ చెప్పాడు.   అయితే శివాజీ చెప్పింది ఎంత వరకూ నిజమో... నిజంగా ఇదంతా జరుగుతుందో లేదో తెలియదు కానీ.. కొంత వరకూ మాత్రం శివాజీ మాటలు మాత్రం  ప్రజల్లోకి బలంగా వెళ్ళినట్టే తెలుస్తోంది. మరోవైపు... ఇంకో వాదన కూడా వినిపిస్తుంది. శివాజీ బీజేపీ కి మంచి స్ట్రోక్ అయితే ఇచ్చారు కానీ... అసలు ఈ ఈ ఆపరేషన్ కార్యరూపం దాల్చుతుందా అన్నది ప్రశ్నగా మిగిలింది. ఎందుకంటే... నిజానికి ఇప్పటికే ఈ ఆపరేషన్ గురించి శివాజీ బయటకు చెప్పేశాడు. మరి బయటకు చెప్పిన ప్లాన్ ను బీజేపీ అనుసరించే అవకాశమే లేదు. బహిర్గతం అయిన అంశాన్ని ఏ రాజకీయ పార్టీ కూడా అనుసరించదు. ఒకవేళ బీజేపీ కనుక ఈ ప్లాన్ అనుసరించపోతే ఓవిధంగా బిజెపికి ‘మాస్టర్ స్ట్రోక్’ను ఇవ్వడంలో శివాజీ సక్సెస్ సాధించాడని చెప్పవచ్చు. మరి ఏ రాజకీయ పార్టీ కూడా ఒక్క ప్లాన్ తోనే ఉండదు. రాజకీయ ఎత్తుగడలు చాలా డిఫరెంట్ గా ఉంటాయి. మనం ఒకటి అనుకుంటే..ఇంకోటి జరుగుతుంది. ప్రస్తుతానికైతే బీజేపీ ప్లాన్ ఇదని బిజెపికి ‘మాస్టర్ స్ట్రోక్’ ఇచ్చాడు. మరి బీజేపీ ఇంకేం ప్లాన్ వేస్తుందో చూద్దాం...

రెచ్చిపోకండి...మీకూ అవసరం వస్తుంది...!

ఏపీకి ప్రత్యేక హోదా డిమాండ్ చేస్తూ టీడీపీ, వైసీపీ పార్టీలు పార్లమెంట్లో అవిశ్వాస తీర్మానం పెట్టిన సంగతి తెలిసిందే. అయితే అవిశ్వాస తీర్మానం పెట్టారు కానీ... ఇంతవరకూ చర్చకు రాలేదు. అవిశ్వాస తీర్మానానికి కావాల్సినంత మద్దతు ఉన్నా చర్చకు మాత్రం రావట్లేదు. దీనికి కారణం... టీఆర్ఎస్, అన్నాడీఎంకేల వైఖరే కారణమన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఒకపక్క ఏపీ ఎంపీలు ప్రత్యేక హోదా కోసం పోరాడుతుంటే... మరోపక్క టీఆర్ఎస్ పార్టీ రిజర్వేషన్ల పెంపు కోసం...అన్నాడీఎంకే కావేరి నది జల వివాదంపై పోరాడుతున్నాయి. అయితే ఈ రెండు పార్టీలను బీజేపీ పార్టీనే నడిపిస్తుందన్న వార్తలు కూడా వస్తున్నాయి. అందుకే అవిశ్వాస తీర్మానంపై చర్చకు రానివ్వకుండా అడ్డుకుంటున్నాయి అని అంటున్నారు. అయితే ఇప్పుడు ఆపార్టీల నేతల వ్యాఖ్యలు చూస్తుంటే నిజమేనేమో అని కూడా అనిపిస్తుంది.   ఎందుకంటే ఇదే విషయంపై ఓ టీఆర్ఎస్ ఎంపీని అడుగగా.. దానికి ఆయన మమ్మల్ని అడిగి అవిశ్వాస తీర్మానం పెట్టారా.. మేమెందుకు మద్దతు ఇవ్వాలని.. అయినా పక్కరాష్ట్రాలతో మాకు పనిలేదు అని మద్దతివ్వం అని ఇన్ డైరెక్ట్ గా చెప్పేశారు. ఇప్పుడు అన్నాడీఎంకే కూడా తమ వైఖరి ఏంటో చెప్పేసింది. అన్నాడీఎంకే అధికారిక పత్రికలో బీజేపీతో తమకున్న బంధాన్ని బయటపెట్టేసింది. ఏపీ ప్రయోజనాల కోసం తాము సహకరించాల్సిన అవసరం లేదని, బీజేపీ ప్రభుత్వాన్ని పడగొట్టే ఉద్దేశం తమకు లేదని కుండ బద్దలు గొట్టింది. తాము లోక్‌సభలో పోరాడుతున్నది తమ రాష్ట్ర ప్రయోజనాలకే తప్ప ఏ పార్టీకీ వ్యతిరేకంగా కాదని.. ఎన్డీయే నుంచి బయటకు వచ్చిన టీడీపీ మోదీ ప్రభుత్వంపై పెట్టిన అవిశ్వాస తీర్మానానికి తామెందుకు మద్దతివ్వాలని సూటిగా ప్రశ్నించింది. అంతేకాదు.. ఒకవేళ ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తే అది తమకు హానిగా మారుతుందని, జయలలిత కూడా ఇదే చెప్పేవారని చెప్పారు. మొత్తానికి  అన్నాడీఎంకేను అడ్డుపెట్టుకుని బీజేపీ నాటకాలు ఆడుతోందన్న విషయం దీనిబట్టి అర్ధమైపోయింది. మరి పక్క రాష్ట్రాలతో మాకు అవసరం లేదు... మాకు వారితో పనిలేదు అని విర్రవీగుతున్న ఈ పార్టీలు.. అన్ని రోజులు ఒకలాగే ఉండవు.. ఎప్పుడూ తామే అధికారంలో ఉండమన్న సంగతి గుర్తుంచుకుంటే బెటర్. లేకపోతే భవిష్యత్తులో తమకు కూడా ఇలాంటి పరిస్థితులు రావచ్చు... ఇప్పుడు బీజేపీని చూసి రెచ్చిపోతున్న వీళ్లు.. తేడా వస్తే అదే పార్టీ మాకు మీ అవసరం లేదు పోండి అనే రోజులు కూడా రాకమానదు... అప్పుడు అవసరం లేదన్న ఈ పక్క రాష్ట్రాల అవసరమే గతవుతుంది...

టీడీపీ పై బీజేపీ కుట్ర.. నాదగ్గర పక్కా సమాచారం ఉంది..

  ప్రస్తుతం ఏపీ రాజకీయాలు ఇంతకుముందెన్నడూ లేనంత హాట్ గా తయారయ్యాయి. ఒకపక్క ఏపీ ప్రత్యేక హోదా కోసం పోరాటం.. మరోపక్క బీజేపీ నుండి టీడీపీ బయటకు రావడం... ఇక ఇన్ని రోజులు టీడీపీతోనే ఉన్నాడనుకున్న పవన్ ఒక్కసారిగా ఆ పార్టీపైనే తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించడం.. దీంతో పవన్ వెనుక బీజేపీ ఉందని టీడీపీ అనడం...పార్లమెంట్లో ప్రత్యేక హోదాపై అవిశ్వాసం తీర్మానాలు పెట్టడం.... వైసీపీ మేమే ముందు అవిశ్వాస తీర్మానం పెట్టామని అంటే.. దానికి టీడీపీ విమర్శించడం ఇలా పార్టీలన్నీ జనాల్ని కన్య్పూజన్ లో పడేశాయి. దీంతో అసలు రాష్ట్రంలో ఏం జరుగుతుందో కూడా తెలియని పరిస్థితిలో పడ్డారు.   ఇదిలా ఉంటే ఇప్పుడు ప్రస్తుత పరిస్థితులపై మాజీ ఎంపీ సబ్బం హరి స్పందించి కీలక వ్యాఖ్యలు చేశారు.  అవిశ్వాస తీర్మానం చర్చకు రాకుండా బీజేపీనే అడ్డుకుంటోందని, అన్నాడీఎంకే, టీఆర్ఎస్ పార్టీలతో ఆందోళన చేయిస్తోందని తేల్చి చెప్పారు. సాటి తెలుగువారికి అన్యాయం జరుగుతుంటే టీఆర్ఎస్ ఇలా చేయడం ఎంతమాత్రమూ సబబు కాదన్నారు. మోదీపై ఇది తొలి అవిశ్వాసమని, చర్చకు వస్తే అంతర్జాతీయంగా ఆయన పరువు పోతుందనే అడ్డుకుంటున్నారని అన్నారు. అంతేకాదు... వైసీపీ-జనసేనలను ఉపయోగించుకుని టీడీపీని తొక్కేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందనడంలో ఎటువంటి సందేహం లేదని.. ఈ విషయంలో తన వద్ద పక్కా సమాచారం ఉందన్నారు. దేశంలో ప్రాంతీయ పార్టీలు ఉండకూడదన్న మోదీ-షా ద్వయం కుట్ర వల్లే ఏపీకి ఇన్ని కష్టాలు వచ్చాయన్నారు.  ఇక ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ పని అయిపోయినట్టేనని, ఆ పార్టీతో ఎవరు కలిసినా మటాషేనని తేల్చి చెప్పారు. మరి ఈ కన్ఫ్యూజన్ పోవాలంటే... ఎవరి స్ట్రాటజీ ఏంటో తెలియాలంటే కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.

ఎన్నిసార్లైనా మోడీని కలుస్తా.. దాని కోసం కలుస్తా.. మీకెందుకు..?

నా ఇష్టం వచ్చినన్ని సార్లు ప్రధాని మోడీని కలుస్తా.. ఎప్పుడు కావాలంటే అప్పుడు కలుస్తా మీకెందుకు..? ఈ డైలాగులు కొట్టేది ఎవరనుకుంటున్నారా...? ఎవరో కాదు.. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. గత కొద్దిరోజులుగా విజయసాయిరెడ్డి, మోడీల భేటీలపై పలు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే కదా. ఒకపక్క కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వస తీర్మానం పెట్టి ఇప్పుడు మోడీని కలవడం ఏంటని ఇప్పటికే పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు. దీనికో తోడు ఈ రోజు, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రితో మంతనాలు జరుపుతూ దొరికిపోయారు. మరి దీన్ని చూసి ఊరుకుంటారా..? ఇదే విషయాన్ని మీడియా వాళ్లు అడగగా... విజయసాయిరెడ్డికి చిర్రెత్తుకొచ్చినట్టుంది. అందుకే మీడియా పై చిందులు తొక్కారు. అవునండీ కలిశాను..  నా ఇష్టం వచ్చినన్ని సార్లు ప్రధానిని కలుస్తా, మీకెందుకు, చంద్రబాబుకి ఎందుకు.. నా ఇష్టం, మోడీని కలుస్తూనే ఉంటా అంటూ రెచ్చిపోయాడు...అక్కడితో ఆగకుండా... చంద్రబాబుని జైలుకి పంపిస్తా అని, దాని కోసం మోడీని కలుస్తా, మంత్రుల్ని కలుస్తా, అందరినీ కలుస్తా, చంద్రబాబును బోనులోకి ఎక్కించేంతవరకు ప్రధాన మంత్రిని, మంత్రులను కలుస్తూనే ఉంటానని రెచ్చిపోయారు.  కేంద్రంపై అవిశ్వాసం పెట్టే నైతిక హక్కు తమకు మాత్రమే ఉందని, చంద్రబాబుకి లేదని చెప్పారు... చంద్రబాబుపై చర్యలు తీసుకునేంత వరకు చేయాల్సిందంతా చేస్తామని అన్నారు. మొత్తానికి విజయసాయిరెడ్డికి బాగానే కోపం వచ్చినట్టుంది పాపం. మరి దీనిపై టీడీపీ నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి...

ఎవడండీ ప్రధాని.. వాడికి ఎంత ధైర్యం..!

  ప్రధాని మోడీని ఫ్లోలో గాడు అన్నందుకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఎంత బద్నాం చేశారో తెలిసిందే. ప్రధాని అంతటి వ్యక్తిని గాడు అని అంటావా అని కొందరు.. మోడీని గాడు అని సంబోధించినందుకు కేసీఆర్ ను జైల్లో కూడా పెట్టాలని మరికొంతమంది బీజేపీ నేతలు డిమాండ్ చేశారు. మరి మాములుగానే కేసీఆర్ ప్రతిపక్షనేతలను కూరలో కరివేపాకులాగా తీసిపారేస్తుంటారు. అలాంటిది తనను అన్ని మాటలు అంటుంటే చూస్తూ ఊరుకుంటారా..? బీజేపీ నేతలు తనపై చేసిన వ్యాఖ్యలపై స్పందించి..ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని.. నాలాంటి వాళ్ల దగ్గర కొస్తే భస్మం అయిపోతారాని...అయినా ప్రధానిని ఏం అనకూడదని ఏమన్న రాజ్యాంగంలో రాసుందా..? అని ప్రశ్నించారు. ఇప్పుడు ఈ ఉపోద్ఘాతం అంతా ఎందుకంటే..ఇక్కడ మరో వ్యక్తి కూడా కోపంతో మోడీని ఆడు అని సంబోధించారు. ఆయన ఎవరో కాదు.. ఏ విషయాన్నైనా ముక్కుసూటిగా చెప్పే..సినీ నిర్మాత, దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజ్.   ఇటీవల నేను 29సార్లు ఢిల్లీ వెళ్లినా మోడీ అపాయింట్ మెంట్ ఇవ్వలేదని చంద్రబాబు ఓ చెప్పుకుంటున్న సంగతి తెలిసందే. దీనిపైనే ఓ మీడియా ఛానెల్ లో ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ..  ‘ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 29సార్లు ఢిల్లీకి వెళితే.. మోడీ అపాయింట్‌ మెంట్ ఇవ్వలేదట. ఇది ఎంత దారుణం.. దీన్ని ఎవరైనా చెప్పుకుంటారా? నిజంగా చంద్రబాబుకి ఆత్మగౌరవం ఉండి ఉంటే ఒకసారి రెండుసార్లు చూసి అప్పుడే ఎన్డీఏకి గుడ్‌బై చెప్పి బయటకు వచ్చేసి ఉండాల్సింది..' అని భరద్వాజ అభిప్రాయపడ్డారు. అంతేకాదు మోడీపై కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు.  29 సార్లు మా ముఖ్యమంత్రి వెళితే పట్టించుకోరా? ఎవడండీ ప్రధాన మంత్రి?.. సీఎంని లోపలికి రానీయకుండా ఉండటానికి.. వాడికి ఎంత ధైర్యం ఉండాలి? ప్రధాన మంత్రి ఎంత గొప్పోడైనా కావచ్చు. కానీ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని ఇలా అవమానిస్తారా? అని ఆయన ప్రశ్నించారు. ఏడాదిన్నర కాలం మా ముఖ్యమంత్రిని లోపలికి రానీయకుండా చేశారంటే ఏమనాలి? ఆ ముఖ్యమంత్రి ఎవరు? మేం ఓటేసి గెలిపించుకున్నాం.. ఆయన్ని అవమానించారంటే.. ఆ అవమానం ఆయనొక్కరిదే కాదు.. మమ్మల్నీ అవమానించినట్టే. మాకు జరిగిన ఈ అవమానానికి నువ్ ఏం సమాధానం చెప్తావ్?.. అంటూ ప్రధానిని ప్రశ్నించారు. మరి కేసీఆర్ గాడు అన్నందుకు బీజేపీ నేతలు అంతలా విరుచుకుపడ్డారు. మరి ఇప్పుడు భరద్వాజ గారు ఏకంగా.... వాడు, వీడు అనే సంబోధించారు. మరి దీనిపై ఎంత దుమారం రేగుతుందో చూడాలి.

మోడీ నిజస్వరూపం బయటపెట్టిన బీజేపీ ముఖ్యనేత...నియంతకు నిదర్శనం..

  ప్రస్తుతం దేశవ్యాప్తంగా బీజేపీకి వ్యతిరేక పవనాలు వీస్తున్న సంగతి తెలిసిందే. ఒకప్పుడు మోడీకు ఉన్న హవా ఇప్పుడు లేదని చెప్పొచ్చు. ఇటీవల జరుగుతున్న ఉపఎన్నికల్లో బీజేపీ ఓటమి మూటగట్టుకుంటుందంటేనే చెప్పొచ్చు.. మోడీ ప్రభంజనం తగ్గిందని. మోడీ-షా ద్వయం చేస్తున్న పాలన నచ్చక ఇప్పటికే కొత్తగా థర్డ్ ఫ్రంట్ అంటూ ప్రతిపక్షపార్టీలన్నీ ఒకతాటిపైకి వస్తున్నాయి. దేశంలోని ఇతర రాష్ట్రాలు, రాజకీయ పార్టీల పట్ల… మోదీ, షాల వ్యవహరిస్తున్న తీరుపై.. బీజేపీలోని చాలా మంది నేతలు ఆగ్రహంతో ఉన్నారు. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే... అసలు బీజేపీలోనే చీలికలు వస్తాయేమో అన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి. దీనికి కారణం మోడీ అద్వానీని అవమానించడమే కారణంగా తెలుస్తోంది. అద్వానీ తరపు నాయకులు మోడీ ప్రవర్తించిన తీరుకు ఆయనపై ఆగ్రహంగా ఉన్నట్టు రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఇక ఇప్పుడు దీనికి ఆజ్యం పోస్తున్నట్టు మరో ఘటన చోటుచేసుకుంది.   అదేంటంటే.. మోడీ తీరు నచ్చక ఓ కీలక నేత పార్టీకి రాజీనామా చేసి బయటకు వచ్చేశాడు. ఆయన ఎవరో కాదు..భారతీయ జనతా పార్టీ ఐటీ సెల్ ఫౌండర్ ప్రద్యుత్ బోరా. బయటకు వస్తూ మోడీ నిజస్వరూపాన్ని బయటపెట్టేశాడు. పార్టీకి రాజీనామా చేసిన ఆయన మీడియాతో  మాట్లాడుతూ... ” దేశ ప్రజాస్వామ్య వ్యవస్థ ప్రమాదంలో పడింది. గెలుపు కోసం ఎలాంటి నీచమైన పనులైనా చేయడానికి పార్టీ వెనుకాడటం లేదు. ఇది 2004 నాటి బీజేపీ కాదు. పార్టీలో అంతా పిచ్చితనం కనిపిస్తోంది. నియంతల వ్యవహారంలా నడుస్తోంది. ఇలాంటి పార్టీలో ఉండలేను..”.. అని నేరుగా  ప్రధాని నరేంద్రమోదీని ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో ఇప్పుడు స్వయంగా పార్టీ నేతే బయటకు రావడంతో పార్టీ నేతల్లో గుండెల్లో గుబులు పట్టుకుందట. పార్టీపైన అసంతృప్తితో ఉన్నా కొంతమంది నేతలు మాత్రం ఏం చేయలేక... మోడీ-షా ద్వయానికి భయపడి సైలెంట్ గా తమ పని తాము చేసుకుంటూ పోతున్నారట. ఈ సమయంలో ప్రద్యుత్ బోరా ఏకంగా వారిది నియంత పాలన అని సంచలన వ్యాఖ్యలు చేసి.. ఇంక పార్టీలో ఉండలేక.. రాజీనామా చేసి బయటకు వచ్చేశారు. దీంతో బోరా స్ఫూర్తితో పార్టీలో ఉన్న ఇంకా కొంత మంది బయటకు వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది చూద్దాం మరి ముందు ముందు ఎంత మంది నేతలు బయటకు వస్తారో...

అమ్మను ఆస్పత్రిలో చేర్పించే రోజు ఏం జరిగిందంటే...? నిజం చెప్పిన శశికళ..

  తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత మరణంపై ఇప్పటికీ ఎన్నో అనుమానాలు ఉన్న సంగతి తెలిసిందే. ఆమెను ఆస్పత్రిలో చేర్పించినప్పుటి నుండి... ఆమె మరణించినంత వరకూ అసలు ఏం జరిగిందో ఎవరికీ తెలియదు. ఒక్క శశికళకు తప్ప. కనీసం పార్టీ నేతలకు కూడా అనుమతి లేకుండా.. చాలా రహస్యంగా జయలలితకు చికిత్స చేశారు. అందుకే కొంతమంది అసలు జయలలితను శశికళే చంపింది అని ఆరోపణలు కూడా చేశారు. ఆ తరువాత ఇంకా ఎన్నో అనుమానాలు తెరపైకి వచ్చాయి కానీ.. వాటికి సమాధానం మాత్రం లేదు. అనారోగ్య కారణాల వల్లే ఆమె చనిపోయారని వైద్యులు చెబుతున్నప్పటికీ.. అమ్మ మరణం వెనుక కుట్ర ఉందని కొందరు అన్నాడీఎంకే నేతలు ఆరోపిస్తున్నారు. అయితే ఇప్పడు జయలలితను ఆసుపత్రిలో చేర్చిన రోజు ఏం జరిగిందో శశికళ చెప్పారు.   ఆమె మృతిపై దర్యాప్తు చేసేందుకు న్యాయస్థానం జస్టిస్‌ అరుముగస్వామి నేతృత్వంలో విచారణ కమిషన్‌ వేసింది. ఆ విచారణలో ఆమె ఏం చెప్పిందంటే..‘సెప్టెంబరు 22, 2016 రాత్రి 9.30 గంటల ప్రాంతంలో జయలలిత బ్రష్‌ చేసుకునేందుకు బాత్‌రూమ్‌కు వెళ్లారు. అప్పటికే ఆమెకు జ్వరం బాగా ఉంది. బాత్‌రూంలో ఆమె కిందపడిపోవడంతో సాయం పట్టమని నన్ను పిలిచారు. నేను వెంటనే వెళ్లి జయలలితను బాత్‌రూం నుంచి తీసుకొచ్చి బెడ్‌ మీద పడుకోబెట్టాను. అంతలో ఆమె స్పృహ కోల్పోయారు. దీంతో నేను మా బంధువైన డాక్టర్‌ శివకుమార్‌కు ఫోన్‌ చేశాను. డాక్టర్‌ వచ్చి జయలలితను పరీక్షించారు.  ఆ తర్వాత అపోలో ఆసుపత్రి వైస్‌ ఛైర్‌పర్సన్‌ ప్రీతారెడ్డి భర్త విజయ్‌కుమార్‌ రెడ్డికి ఫోన్‌ చేసి అంబులెన్స్‌ పంపమని కోరారు’. ‘15 నిమిషాల్లో రెండు అంబులెన్స్‌లు వచ్చాయి. జయలలితను అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించాం. మార్గ మధ్యంలో ఆమెకు స్పృహ వచ్చింది. ఎక్కడకు వెళ్తున్నాం అని అడిగితే ఆసుప్రతికి అని చెప్పాను. ఆ రోజు ఉదయమే డాక్టర్‌ శివకుమార్‌ జయలలితను రెండు సార్లు పరీక్షించారు. ఆసుప్రతికి రావాలని చెప్పినా అందుకు అమ్మ ఒప్పుకోలేదు. జ్వరం ఎక్కువవడంతో రాత్రి స్పృహ కోల్పోయారు’ అని శశికళ చెప్పారు.   ఇంకా  ఆసుపత్రిలో ఉన్న సమయంలో జయలలితను చూసేందుకు ఎవరినీ అనుమతించలేదంట కదా అని అడుగగా.. దానికి.. అది అవాస్తవమని..అక్టోబరు 22, 2016న అప్పటి రాష్ట్ర గవర్నర్‌ విద్యాసాగర్‌ రావు జయలలితను చూశారు. ‘అప్పుడు అమ్మ గవర్నర్‌ను చూసి చేయి పైకెత్తిందట... ఈ విషయాన్ని గవర్నరే నాతో చెప్పారు’ అని అన్నారు.  సెప్టెంబరు 22-27 మధ్య అన్నాడీఎంకే నేతలు పన్నీర్‌సెల్వం, తంబిదురై, విజయ భాస్కర్‌ ఆమెను చూసినట్లు చెప్పారు. ఆ తర్వాత కూడా కొందరు నేతలు జయలలితను చూసినట్టు తెలిపారు. ఏది ఏమైనా జయలలిత మరణం మిస్టరీగా మారడం బాధాకరమైన విషయం. చూద్దాం.. శశికళ చెప్పింది నిజమో..కాదో...?  

టీఆర్ఎస్ వెనుక బీజేపీ... గమనిస్తున్న పార్టీలు...

  దేశ రాజకీయాలు మునుపెన్నడూ లేనంత వేడి పుట్టిస్తున్నాయి. ఒకపక్క ఏపీ ఎంపీలు ప్రత్యేక హోదాకోసం పోరాటం చేస్తుంటే..మరోపక్క టీఆర్ఎస్ నేతలు రిజర్వేషన్లపై.. ఇంకో రాష్ట్రం కావేరి నది వివాదంపై ఇలా పార్లమెంట్లో పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తూ.. కేంద్ర ప్రభుత్వానికి చెమటలు పట్టిస్తున్నారు. అయితే ఇక్కడే ఓ ట్విస్ట్ ఉంది. టీడీపీ నేతలు బీజేపీ నుండి బయటకు వచ్చి పార్లమెంట్లో అవిశ్వాస తీర్మానం పెట్టి ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్నారు. ఇక దీని వెనుక చంద్రబాబు ఉన్నారు కాబట్టి బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ చంద్రబాబుకి మద్దతుగా నిలిచాయి. కానీ దురదృష్టం ఏంటంటే.. అంతమంది మద్దతున్నా అవిశ్వాస తీర్మానం మాత్రం చర్చకు రాకపోవడం. కారణం టీఆర్ఎస్ పార్టీ.. అన్నాడీఎంకే పార్టీ.   టీఆర్ఎస్ పార్టీ రిజర్వేషన్ల కోసం డిమాండ్ చేస్తుంది. అన్నాడీఎంకే పార్టీ కావేరి జల వివాదం పై డిమాండ్ చేస్తుంది. ఈ రెండు పార్టీలు కనుక సెలైంట్ గా ఉంటే.. అవిశ్వాస తీర్మానం చర్చకు వస్తుంది. కానీ అది జరగడం లేదు. ప్రత్యేక హోదాకు తమ మద్దతు ఉంటుందని.. చెప్పిన టీఆర్ఎస్ ఇప్పుడు ఇలా వ్యవహరించడం అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. అన్నాడీఎంకే పార్టీ అంటే మోడీ డైరెక్షన్ లో నడుస్తోందనే విషయం అందరికీ తెలిసిందే. కాబట్టి ఆ పార్టీ లోక్ సభలో ఆందోళన చేసే విషయంలో ఎవరికీ పెద్దగా అనుమానాలు లేవు. కానీ టీఆర్ఎస్ ను చూస్తుంటేనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. టీఆర్ఎస్ వెనుక బీజేపీ ఉందన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి. ఏదో థర్డ్ ఫ్రంట్ పేరుతో హంగామా చేస్తున్నారు కానీ...  అయితే ఆచరణలో మాత్రం ఆయన బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారనే అనుమానాలు అనేక పార్టీల్లో ఉన్నాయి. అందుకే.. అవిశ్వాసం అంశం చర్చకు రాకుండా చేయడంలో టీఆర్ఎస్ కీలక పాత్ర పోషిస్తుందని మిగిలిన రాజకీయ పార్టీలు చర్చించుకుంటున్నాయి. అందుకే... కేసీఆర్ నేతృత్వంలోని టీఆర్ఎస్ ఎంపీలు ఒక వైపు తాము బీజేపీకి కూడా ప్రత్యామ్నాయం కోరుకుంటున్నామని చెబుతూనే బీజేపీని టార్గెట్ చేసే అవిశ్వాసానికి మద్దతు ఇవ్వకపోవడం ఏమిటని పలు రాజకీయ పార్టీలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. మరి కేసీఆర్ ఇలానే వ్యవహరిస్తే థర్డ్ ఫ్రంట్ సంగతేమో కానీ... తమ పార్టీకే మద్దతి లేకుండా చేసుకునేలా ఉన్నాడు. మరి జనాల్ని పిచ్చోళ్లని చేయడం ఈజీ ఏమో కానీ... తోటి రాజకీయ పార్టీలను పిచ్చోళ్లని చేయడం ఈజీ కాదని కేసీఆర్ కు కూడా అర్దమయ్యే టైం దగ్గర్లోనే ఉంది.

మోడీని వణికిస్తున్న అద్వానీ..

  ప్రత్యేక హోదా డిమాండ్ చేస్తూ చంద్రబాబు బీజేపీతో విడిపోయి.. మోడీపై తిరుగుబాటు బావుటా ఎగరవేసిన సంగతి తెలిసిందే. అంతేకాదు పార్లమెంట్లో అవిశ్వాస తీర్మానం కూడా పెట్టించారు. అయితే కేంద్రం మాత్రం అవిశ్వాస తీర్మానం చర్చకు రానివ్వడం లేదన్నది ప్రతిఒక్కరి వాదన.  చంద్రబాబుకి ప్రతిపక్షపార్టీలన్నీ మద్దతుగా నిలవడంతో.. మోడీ భయపడి కావాలనే ఇలా చేస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాదు మరో వాదన కూడా వినిపిస్తోంది.. టీడీపీ అవిశ్వాసం అయితే పెడుతుంది గానీ ప్రభుత్వాన్ని పడగొట్టలేదు అని తెలుసు. అలాంటిది బాబుకి మోడీ ఎందుకు ఇంతలా భయపడుతున్నారని కూడా అనుకుంటున్నారు.   అయితే ఇప్పుడు అసలు విషయం బయటపడింది. అసలు మోడీ భయపడేది చంద్రబాబుకి కాదట.. బీజేపీ సీనియర్ నేత అద్వానీకట. ఆశ్చర్యంగా ఉంది కదా.. అసలు కథ ఏంటంటే... ఇప్పటికే అద్వానికీ దక్కాల్సిన ప్రధాని పదని మోడీ దక్కించుకున్నారు. ఆ తరువాత కూడా బీజేపీ లో తనకు ఎన్ని అవమానాలు జరుగుతున్నా మౌనంగా భరిస్తూవచ్చారు. కానీ ఇటీవల జరిగిన ఓ ఘటనను మాత్రం అద్వానీయే కాదు.. ఎవరూ మర్చిపోలేకపోతున్నారు. త్రిపుర లో కొత్త ప్రభుత్వం ఏర్పాటు సందర్భంగా మోడీ సహా బీజేపీ పెద్దలు అక్కడకి వెళ్లిన సంగతి తెలిసిందే కదా. ఈ సందర్భంగా మోడీ అందరికీ నమస్కారం చేశారు కానీ..అక్కడే ఉన్న అద్వానిని మాత్రం పట్టించుకోలేదు. అంత పెద్ద వయసులో ఉన్న ఆయన నమస్కారం పెడితే.. ప్రతినమస్కారం కూడా చేయకుండా ఆయన్ని  గుర్తించినట్టు ప్రవర్తించారు. ఇక ఈ వీడియో ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ కూడా అయింది. ప్రధాని ప్రవర్తించిన తీరు చూసి అందరూ మోడీని ఓ రేంజ్లో ఏకిపారేశారు. ఇక అంతకుముందు నుండే అద్వాని అనుచరులు మోడీపై కోపంగా ఉన్నా.. ఇక ఈ ఘటన తరువాత ఇంకా ఆవేశంతో రగిలిపోతున్నారట. దాంతో అవిశ్వాసం చర్చ కనుక ఓటింగ్ కు వస్తే.. అద్వాని అనుచరులు తనకు వ్యతిరేకంగా ఓటు వేస్తారని మోడీ భయపడిపోతున్నారట. అంతేకాదు... అద్వానీ ఎక్కడా బయటపడకపోయినా.. తన వర్గాన్ని తన మీద యుద్ధానికి సన్నద్ధం చేస్తున్నాడని మోడీ సందేహిస్తున్నాడట. ఇప్పటికే బీజేపీ తో పాటు జాతీయంగా అన్ని పార్టీల్లో అద్వానీ మీద సానుభూతి వ్యక్తం అవుతున్న విషయం మోడీకి బాగా అర్ధం అయ్యింది. అందుకే అద్వానీ అదును చూసి దెబ్బ కొడతారేమో అన్న భయంతో మోడీ వణికిపోతున్నారు. అందుకే అవిశ్వాస తీర్మానం గురించి మోడీ ఇంతగా అభద్రతకు లోను అవుతున్నారు. మొత్తానికి తాడిని తన్నేవాడు ఉంటే.. వాడిని తలను తన్నేవాడు ఉంటాడన్న సామెత ప్రకారం.. అందరూ మోడీ భయపెడుతుంటే.. మోడీ మాత్రం అద్వానికి భయపడుతున్నారు.