మోడీ దాచిన పెద్ద రహస్యం..!!

మోడీ ప్రధాని పదవి చేపట్టి నాలుగేళ్లు దాటింది.. ఈ నాలుగేళ్లలో అవకాశం దొరికినప్పుడల్లా మోడీ, కాంగ్రెస్ మీద విమర్శలు చేసారు.. ఇప్పటి పరిస్థితులే కాదు, ఎప్పుడో నలభై ఏళ్ళ క్రితం ఇందిరాగాంధీ సమయంలో ఎమర్జెన్సీను కూడా గుర్తుచేస్తూ విమర్శలు చేస్తారు.. అలాంటి మోడీ దేశానికీ నష్టం జరుగుతుందనే ఉద్దేశంతో కాంగ్రెస్ చేసిన పెద్ద తప్పుని నాలుగేళ్లుగా రహస్యంగా ఉంచారట.. కాంగ్రెస్ తప్పు చేస్తే మోడీ విమర్శించకుండా నాలుగేళ్లు ఉన్నారా? నో వే అంటారా.. నిజమండి బాబూ.. ఈ విషయాన్ని స్వయంగా మోడీనే ఒక ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. 'ఆర్థిక నిపుణుడైన వ్యక్తి ప్రధానిగా ఉన్నప్పుడు దేశ ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుందని భావిస్తాం..కానీ తాను ప్రధాని కుర్చీలో కూర్చునే సమయానికి దేశ ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉందని' మోడీ, అప్పటి మన్మోహన్ ప్రభుత్వం మీద విమర్శలు చేసారు.. ఆర్థిక వేత్త అయిన ప్రధాని, ఆర్థిక నైపుణ్యం ఉన్న ఆర్థిక మంత్రి హయాంలో దేశం సంక్షోభంలో పడింది.. ఆ గణాంకాల్ని చూసి తాము నిర్ఘాంతపోయామని మోడీ అన్నారు.. ఎవరూ ఊహించని రీతిలో ఉన్న అంకెల్ని చూసి, వాటిని సరి చేసేందుకు ప్రయత్నించామన్నారు. తాము అధికారంలోకి వచ్చినప్పుడు దేశ ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉంది..ఆ  సమయంలో తమ ముందు రెండు మార్గాలున్నాయి.. ఒకటి ఉన్నది ఉన్నట్లుగా ప్రజలకు చెప్పటం.. రెండోది దెబ్బ తిన్న భారత ఆర్థిక పరిస్థితిని గుట్టుగా బాగుచేయటం.. మొదటి విధానంలో రాజకీయ లబ్థికి అవకాశం ఉంది.. రెండో విధానంలో మాత్రం అలాంటిది లేదు.. అయినప్పటికీ తాము రెండో విధానాన్నే ఎంచుకున్నామని మోడీ అన్నారు.. రాజకీయంగా ఎన్ని విమర్శలు వచ్చినా భరించాం.. దేశానికి నష్టం జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నామని మోడీ తెలిపారు. ఓ వైపు ప్రజల్లో మోడీ మీద వ్యతిరేకత మొదలవ్వడం, మరో వైపు కాంగ్రెస్ విపక్షాలన్నింటినీ ఏకం చేసి వచ్చే ఎన్నికల్లో మోడీని దెబ్బ తీయాలని చూస్తున్న తరుణంలో.. మోడీ నాలుగేళ్ళ రహస్యం ఇప్పుడు బయటపెట్టడంతో అందరు షాక్ అవుతున్నారు.. మరి మోడీ వ్యాఖ్యలను కాంగ్రెస్ ఎలా తిప్పికొడుతుందో చూడాలి.. అయితే మోడీ వ్యాఖ్యల పట్ల కొందరి స్పందన వేరేలా ఉంది.. కాంగ్రెస్ వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం అయిందని నాలుగేళ్లకు చెప్పారు.. మరి మీరు అధికారంలోకి వచ్చాక నోట్లరద్దు, జీఎస్టీ వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం అయిందని విమర్శలు వస్తున్నాయి.. ఇక దీనికి సమాధానం ఇంకెన్నాళ్ళకి చెప్తారు అంటూ ఛలోక్తులు వినిపిస్తున్నాయి.

పవన్‌పై పోటీకి నిమ్మగడ్డ సై..?

  రాజకీయ నాయకుడు ఎన్నికలు ఉన్నప్పుడే ప్రచారం చేస్తే సరిపోదు.. ఎన్నికలు లేకపోయినా ఆరోజు ఈరోజని తేడాలేకుండా ప్రతిరోజూ ప్రచారం చేసుకోవాలి.. అప్పుడే నాయకుడు అనేవాడు ప్రజల్లో ఉంటాడు.. ఈ ఫార్ములాని ఇంచుమించు అన్ని పార్టీలు ఫాలో అవుతున్నాయి.. అందుకే ప్రతి పార్టీ సొంతంగానో లేక అనుకూలమైన వ్యక్తులతోనో.. న్యూస్ పేపర్, ఛానల్ నడిపిస్తున్నాయి.. ఎప్పటినుండో ఉన్న పార్టీల దగ్గరనుండి ఈ మధ్య వచ్చిన పార్టీల వరకు అన్నింటికీ మీడియా విలువ బాగా తెలుసు.. జనసేనకి కూడా మీడియా విలువ తెలిసినట్టుంది.. ఆ మధ్య కొన్ని ఛానెల్స్ మీద విమర్శలు చేసిన పవన్, పార్టీ తరుపున తనకంటూ ఓ ఛానల్ ఉండాలని అనుకుంటున్నారట.. దానిలో భాగంగానే కొత్త ఛానల్ తీసుకోవాలి అనుకున్నారట..  తరువాత కొత్త ఛానల్ కంటే ఆల్రెడీ కొంత పేరున్న పాత ఛానల్ కొనడం బెటర్ అని డిసైడ్ అయ్యారట.. ఓ ఎన్నారై ఆర్థిక సాయంతో 10 టీవీ ఛానల్ కొనాలని సంప్రదింపులు కూడా జరిపారట.. ఇక 10 టీవీ జనసేన టీవీ అని ఆనందపడే లోపు, అనూహ్యంగా నిమ్మగడ్డ ప్రసాద్ తెరమీదకు వచ్చారట.. భారీమొత్తానికి ఛానల్ కొంటా అనడంతో ఛానల్ యాజమాన్యం ఆలోచనలో పడినట్టు తెలుస్తుంది.. దీన్ని బట్టి చూస్తుంటే, ఒక ఛానల్ కోసం 'పవన్ పై పోటీకి నిమ్మగడ్డ ప్రసాద్ సై' అన్నట్టు తెలుస్తుంది.. అయితే ఈ విషయంపై కొందరి వాదన వేరేలా ఉంది.. వైసీపీ, జనసేన కుమ్మక్కయ్యాయి.. అందుకే వైసీపీ సానుభాతిపరుడు నిమ్మగడ్డ, పవన్ కోసం ఛానెల్ కొంటున్నాడు అంటున్నారు.. వీటిల్లో ఏది నిజమో కాలమే నిర్ణయించాలి.  

అరెస్ట్.. విడుదల.. మళ్ళీ రాముడి గురించి వ్యాఖ్యలు!! 

  ఇటీవల ఓ టీవీ ఛానల్ చర్చా కార్యక్రమంలో పాల్గొన్న కత్తి మహేష్.. శ్రీ రాముడి గురించి అనుచిత వ్యాఖ్యలు చేయడం.. ఈ వ్యాఖ్యలు హిందువుల మనోభావాలు దెబ్బ తినేలా ఉన్నాయంటూ కొందరు పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.. అయితే సోమవారం రాత్రి బంజారాహిల్స్‌ పోలీసులు మహేష్ ని అరెస్ట్ చేసి ఆ వ్యాఖ్యల గురించి వివరణ కోరినట్టు తెలుస్తుంది.. అదేవిధంగా అవసరమైతే మరోసారి విచారణకు రావాల్సి వుంటుందని చెబుతూ నోటీసులు ఇచ్చి మహేష్ ని పంపించారు. ఈ అరెస్ట్, విడుదల గురించి కత్తి మహేష్ సోషల్ మీడియాలో స్పందించారు.. 'కేసుకు సంబంధించిన వివరాలు అడిగారు. చెప్పాను. ఇప్పుడు వివరణ కోరుతూ నోటీస్ ఇచ్చారు. ఇన్వెస్టిగేషన్ కి సహకరించమని కూడా నోటీస్ లో ఉంది. అంతే. ఇకపైన మిగతా విషయాలు చూడాలి' అని పోస్ట్ చేసారు.. అంతటితో ఆగితే కత్తి మహేష్ ఎలా అవుతా? అనుకున్నారేమో.. ఇంకో పోస్ట్ పెట్టి మరోసారి విమర్శలకు, చర్చలకు తెర లేపారు.  'శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారు అనువదించిన రామాయణం లో యుద్ధకాండలో రాముడు సీతనుద్దేశించి " సద్వంశంలో పుట్టినవాడు పౌరుశవంతుడయితే, పరగృహంలో ఉండిన భార్యను ఆనందంతో ఎవడు స్వీకరించగలడు. ఇంత కాలానికి నువ్వు రావణుని ఓడిలోనుండి దిగివచ్చావు. వాడు నిన్ను దుశ్చింతతో చూసాడు. ఇక నా కులం పాడుచేసుకుని నిన్నెలా స్వీకరిస్తాను? పోయిన కీర్తి మళ్లీ తెచ్చుకోవడానికి నిన్ను సాధించాను. నాకు నీయెడల ఆసక్తి లేశమూ లేదు.యథేచ్ఛగా వెళ్లిపో. ఇది నేను దృఢ నిశ్చయంతో చెప్పినమాట కానీ వేళాకోళం కాదు. కనుక లక్ష్మణుని దగ్గరకో, భరతుని దగ్గరకో, వానరేంద్రుడైన సుగ్రీవునిదగ్గరకో, రాక్షసేన్ద్రుడయిన విభీషణునిదగ్గరకో వెళ్లి కాలం గడుపుకో. నువ్వు చక్కని దానవు. నాగరికత కలదానవు. వంట ఇల్లు జొచ్చిన కుందేలులాగా తన ఇంటో ఉన్నదానవు. సహజంగా దుష్టుడయిన రావణుడు నిన్ను విడిచిపెట్టి ఉండడు" అని చాలా కఠినంగా చెప్పాడు. లాలనపాలనలు ఎదురుచూస్తూ ఉన్న సీత ఇది విని ఏనుగు చేతచిక్కిన సల్లకీలతలాగా వడవడ వొణికిపోతూ కన్నీరు విడిచింది. ఆధారం: శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి సర్వలభ్య రచనల సంకలనం మూడవ సంపుటం. మనసు ఫౌండేషన్ ప్రచురణ. కాబట్టి, సీతను రావణునిదగ్గర కే తిరిగి వెళ్ళిపొమ్మన్నది సాక్షాత్తు సీత భర్తయిన శ్రీరాముడే. ఆ తరువాతే మణిరత్నం అయినా, బాబు గోగినేని అయినా లేదా నేనైనా అన్నది'. అంటూ పోస్ట్ చేసారు.. దీంతో మళ్ళీ సోషల్ మీడియాలో చర్చలు మొదలయ్యాయి.. ఈ చర్చలు ఎప్పుడు ముగుస్తాయో ఏంటో.

ప్రేమిస్తే చంపేస్తారా నాన్న?

తండ్రికి కూతురంటే ఇష్టం.. కాదు కాదు ప్రాణం.. అందుకేనేమో కొందరు క్షణికావేశంలో సొంత కూతురు ప్రాణాలే తీస్తున్నారు.. కూతురిని ప్రేమగా చూసుకోవాల్సిన తండ్రి, తన కూతురు వేరొకరిని ప్రేమించిందని తెలిస్తే తట్టుకోలేకపోతున్నాడు.. కూతురు మీద తనకున్న ప్రేమని మర్చిపోయి, తన కూతురి ప్రాణాలే తీసేస్తున్నాడు.. కూతురు మీదున్న ప్రేమని మర్చిపోయి తండ్రి యముడిలా మారడానికి కారణం.. కూతురి ప్రేమ.. అవును ప్రేమే.. ప్రేమ పలకడానికి రెండు అక్షరాలే.. కానీ అదే ప్రేమ రెండు అక్షరాల చావుని కూడా పరిచయం చేస్తుంది. చిన్నప్పుడు చెయ్యి పట్టుకొని నడిపించిన నాన్న, ప్రేమిస్తే చంపేస్తాడని.. గుండెల మీద ఎత్తుకొని ఆడించిన నాన్న ప్రాణం తీస్తాడని..  ఏ కూతురు ఊహించదు.. అంతెందుకు ప్రాణంగా ప్రేమించిన కూతురి ప్రాణాలు తీయాలని, తీస్తానని ఏ తండ్రి అనుకోడు.. కానీ తీస్తున్నాడు.. దానికి కారణం క్షణికావేశం.. అవును ఈ క్షణికావేశమే ప్రాణంగా ప్రేమించిన కూతురి ప్రాణాలు తీసేలా చేస్తుంది. కృష్ణా జిల్లా చందర్లపాడు మండలం తోటరావులపాడు గ్రామానికి చెందిన కోటేశ్వరరావు కుమార్తె చంద్రిక బీ.ఫార్మసీ చదువుతోంది.. పుట్టిన రోజు సందర్భంగా స్వగ్రామం వచ్చిన చంద్రిక, తన ప్రేమ విషయాన్ని తల్లికి చెప్తే.. ఆమె తన భర్త కోటేశ్వరరావుకి చెప్పింది.. కూతురు ప్రేమలో పడటం, ఎక్కువగా ప్రేమికుడితో ఫోన్ మాట్లాడుతుండటంతో.. కూతురు ప్రేమలో పడి తన పరువు తీస్తుంది అంటూ క్షణికావేశంలో కర్రతో బలంగా కొట్టడంతో చంద్రిక చనిపోయింది.. ఇప్పుడు కూతురు దూరమైందని బాధపడుతున్నాడు.. ఆవేశంలో కూతుర్ని దూరం చేసుకొని ఇప్పుడు కన్నీరు పెట్టుకొని ఏం లాభం.. కూతురు ప్రేమ గురించి తెలిసి ఆవేశం తెచ్చుకునే ముందు, ఒక్కసారి కూతురి మీద తనకున్న ప్రేమని గుర్తుతెచ్చుకుంటే ఎంత బాగుండేది. ఇంత జరిగినా, కూతురికి నాన్నంటే ప్రాణం.. దానికి ఉదాహరణే చంద్రిక సోదరి శిరీష మాటలు.. 'మా నాన్న చాలా మంచోడు.. నా కన్నా మా అక్క అంటేనే ఎక్కువ ప్రేమ.. క్షణికావేశంలో అనర్థం జరిగిపోయింది.. ఇప్పుడు అందరం బాధపడుతున్నాం...’’ అంటూ శిరీష కన్నీరు పెట్టుకుంది.. చంద్రిక, శిరీష లాంటి ప్రతి ఆడపిల్ల కోరిక ఒక్కటే.. 'కూతురు ప్రేమని అర్ధం చేసుకోకపోయినా పర్లేదు.. కానీ కూతురి మీద ప్రేమని చంపుకొని, కూతురిని చంపి సమాజం దృష్టిలో చెడ్డవాడివి కాకు నాన్న'.

వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీదే విజయం..!

  తెలంగాణ సీఎం కేసీఆర్, ముందస్తు ఎన్నికలకు సిద్ధంగా ఉండండి అంటూ ప్రతిపక్షాలకు సవాల్ విసరడం.. ప్రతిపక్ష కాంగ్రెస్ ఎన్నికలు ఎప్పుడొచ్చినా మేం సిద్దమే అంటూ ప్రతిసవాల్ విసరడం తెలిసిందే.. అయితే ముందస్తు ఎన్నికల గురించి కాంగ్రెస్‌ శాసనసభా పక్షనేత జానారెడ్డి కాస్త భిన్నంగా స్పందించారు.. ముందస్తు ఎన్నికలపై సీఎం కేసీఆర్‌ సవాల్‌ హాస్యాస్పదమన్నారు.. ఐదేళ్లు పరిపాలించమని ప్రజలు ఓట్లేస్తే.. ముందస్తు ఎన్నికలకు ఎందుకు వెళ్తున్నారో కేసీఆర్‌ ప్రజలకి సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు..  కేంద్ర ప్రభుత్వం కూడా ముందుస్తు ఎన్నికలకు పోవాలని చూస్తుందని, దాని ట్రాప్ లో టీఆర్ ఎస్ పడినట్టు కనిపిస్తోందని ఆరోపించారు.. ఒకవేళ టీఆర్ ఎస్ ముందస్తు ఎన్నికలకు వెళ్లాల్సి వస్తే...ఎందుకు వెళుతున్నారో ప్రజలకు చెప్పాల్సి ఉంటుందన్నారు.. కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల షెడ్యుల్ విడుదల చేస్తే కాంగ్రెస్ పార్టీ కూడా సిద్ధంగా ఉంటుందన్నారు.. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని, ఎన్ని సీట్లు వస్తాయో చెప్పలేను కానీ అధికారం చేపట్టడానికి కావాల్సినన్ని స్థానాల్లో మాత్రం గెలుస్తామని జానారెడ్డి ధీమా వ్యక్తం చేశారు..  అదే విధంగా, డీ శ్రీనివాస్ తిరిగి కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్నారన్న వార్తలపై స్పందించిన జానారెడ్డి.. డి శ్రీనివాస్ తనతో మాట్లాడలేదని, ఈ విషయం గురించి ఇంకా ఎటువంటి సమాచారం తనకి అందలేదని అన్నారు.. అలానే, పీసీసీలో మార్పులు చేర్పులు జరుగుతాయన్న సమాచారం లేదని.. దీనిపై అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా దాని ప్రకారం నాయకులు, కార్యకర్తలు పని చేయాల్సి ఉంటుందన్నారు.. పార్టీ నేతల్లో భేదాభిప్రాయాలు ఉండొచ్చు కానీ పార్టీ మొత్తం ఐక్యంగా ఉందని స్పష్టం చేసారు.. చూద్దాం మరి జానారెడ్డి అనుకున్నట్టు వచ్చే ఎన్నికల్లో అధికారం చేపట్టడానికి కావాల్సినన్ని స్థానాల్లో కాంగ్రెస్ గెలుస్తుందో లేదో.  

టీడీపీ ఎంపీలకు వార్నింగ్ ఇచ్చిన చంద్రబాబు

  కడప ఉక్కు పరిశ్రమ కోసం ఓ వైపు టీడీపీ నేత సీఎం రమేష్ ఆమరణ దీక్ష చేస్తున్నారు.. మరోవైపు చంద్రబాబు ధర్మపోరాట దీక్షలు, లేఖలు ఇలా అన్ని విధాలుగా కేంద్రం మీద ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు.. ఇంతవరకు బాగానే ఉంది కానీ, చంద్రబాబు రాసిన లేఖను కేంద్రమంత్రికి అందించి, ఉక్కు పరిశ్రమ గురించి మాట్లాడటానికి వెళ్లిన టీడీపీ ఎంపీల తీరే చంద్రబాబుకి తలనొప్పిగా మారింది.. టీడీపీ ఎంపీలు సరదాగా దీక్ష గురించి మాట్లాడుకుంటున్న వీడియో ఒకటి లీక్ అయింది.. ఆ వీడియోలో టీడీపీ ఎంపీలు దీక్ష గురించి వెటకారం చేసారు.. జోను లేదు గీను లేదని అవంతి శ్రీనివాస్ అంటే.. నేను ఐదు కేజీల బరువు తగ్గాలనుకుంటున్న వారం రోజులు దీక్ష చేస్తానని మురళి మోహన్ అన్నారు.. ఈ వీడియోని ప్రతిపక్షాలు అస్త్రంగా మలుచుకొని దీక్షల మీద టీడీపీ చిత్తశుద్ధి ఇది అంటూ విమర్శలు చేస్తూ వీడియో షేర్ చేస్తున్నాయి.. ఈ విషయం చంద్రబాబుకి తెలిసి వెంటనే ఎంపీలతో మాట్లాడి వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తుంది..  సీఎం రమేష్ ఓవైపు దీక్ష చేస్తుంటే, ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఏంటని ప్రశ్నించిన బాబు, ఎవరు పడితే వారు ఏది పడితే అది మాట్లాడొద్దని, ఛలోక్తులకు ఇది సమయం కాదని, మరోసారి ఇలాంటి కామెంట్స్ చేయొద్దని హెచ్చరించారట.. చంద్రబాబు సీరియస్‌ కావడంతో ఎంపీలు కూడా వివరణ ఇచ్చారు.. తమ మాటలను కొంతమంది వక్రీకరించారని మురళీమోహన్, అవంతి శ్రీనివాస్‌లు అన్నారు.. ఆ వీడియోను ఎడిటింగ్ చేశారని 75ఏళ్ల వయస్సులోనూ వారం రోజులు దీక్ష చేయగలమా అన్న మాటల్ని మాత్రం కట్ చేశారని చెప్పారట.. దీనిపై స్పందించిన బాబు, టీడీపీ చేసే పోరాటంపై బురదజల్లే ప్రయత్నం జరుగుతోందని ప్రతి ఒక్కరు బాధ్యతగా వ్యవహరించాలని సూచించినట్టు తెలుస్తుంది..  అదే విదంగా, రాష్ట్రం మొత్తం ధర్మపోరాటం వైపు చూస్తోందని.. టీడీపీ ఎంపీల ఉద్యమంపై ప్రజలు ఆశలు పెట్టుకున్నారని.. ఒకప్పుడు జేసీ దివాకర్‌రెడ్డి ఆవేదనతో చేసిన వ్యాఖ్యల్ని వివాదాస్పదం చేశారని.. ఇప్పుడు మురళీ మోహన్ మాట్నలి కట్ అండ్ పేస్ట్ చేశారని.. రాష్ట్రానికి హాని చేసే వ్యక్తులపట్ల అప్రమత్తంగా ఉంటూ కుట్రదారుల చేతుల్లో పావుల్లా మారొద్దని బాబు సూచించారు.. ప్రతి క్షణం అప్రమత్తంగా, సీరియస్‌నెస్‌తో ఉండాలన్నారు బాబు.. అలానే అసలు ఆ వీడియో ఎవరు తీశారు? బయటికెలా వచ్చింది? ఎవరు ఎడిట్ చేసారో? విచారించాలని.. ముందు సీసీ ఫుటేజ్ చెక్ చేస్తే దీని వెనక ఎవరైనా ఇంటి దొంగ ఉన్నారేమో అన్న విషయం కూడా తెలిసిపోతుందని చెప్పినట్టు తెలుస్తుంది.  

60 కోట్ల భారతీయులు రోడ్డున పడతారు... ఎందుకంటే!

  ఇది ఎవరో దారిన పోయే దానయ్య చెప్పిన విషయం కాదు. సాక్షాత్తూ ప్రపంచ బ్యాంక్‌ చేస్తున్న హెచ్చరిక. ఇంతకీ ఈ హెచ్చరిక వెనుక ఉన్న కారణం ఏమిటో తెలిస్తే ఆశ్చర్యపోతారు- వాతావరణంలో మార్పు! మనిషి రోజురోజుకీ ఎదిగిపోతున్నాడే కానీ వాతావరణాన్ని మాత్రం పట్టించుకోవడం లేదు. ఈ కారణంగా భూగర్భ జలాలు పడిపోవడం, అయితే అతివృష్టి లేదా అనావృష్టి రావడం, కాలుష్యం పెరిగిపోవడం, పంటలు సరిగా పండకపోవడం... లాంటి సవాలక్ష సమస్యలు వస్తున్నాయి. వీటికి తోడు కాలుష్యం వల్ల కలిగే అనారోగ్యాల సంగతి సరేసరి. వీటన్నింటి కారణంగా 2050 నాటికి మన దేశ జీడీపీ 2.8 శాతం తగ్గిపోయే అవకాశం ఉందంటోంది ప్రపంచ బ్యాంక్‌. దీనివల్ల తీవ్రమైన నిరుద్యోగం తలెత్తే అవకాశం ఉందట. ఇక పంటలు సరిగా పండక రైతులు, అనారోగ్యాల బారిన పడి మధ్యతరగతి ప్రజల జీవితాలు దుర్భరమయ్యే ప్రమాదం ఉంది. విదర్భ వంటి కొన్న ప్రాంతాల్లో అయితే తీవ్రమైన కరువు విలయతాండవం చేసే ప్రమాదం ఉందట.ఇప్పటికైనా కళ్లు తెరిచి మన చుట్టూ ఉన్న నీటి వనరులనీ, అడవులనీ, పర్యావరణాన్నీ కాపాడుకోకపోతే ఈ హెచ్చరిక నిజమై తీరుతుందని ప్రపంచ బ్యాంక్‌ అంచనా వేస్తోంది. వాతావరణ మార్పుని ప్రజల ఆదాయంతో ముడిపెడుతూ ప్రపంచ బ్యాంక్‌ నివేదికను రూపొందించడం ఇదే మొదటిసారి.

తెలంగాణాలో టీడీపీతో కాంగ్రెస్ పొత్తు?

  తెలంగాణ సీఎం కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు సంకేతాలు ఇవ్వడంతో, తెలంగాణ కాంగ్రెస్ అలెర్ట్ అయింది.. కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దె దించడమే లక్ష్యంగా అడుగులు వేస్తుంది.. కేంద్రంలో మోడీ ప్రభుత్వాన్ని గద్దె దించడం కోసం, బీజేపీ వ్యతిరేక పార్టీలు అన్నింటినీ కలుపుకొని పోవాలని కాంగ్రెస్ చూస్తుంది.. ఇదే ఫార్ములాని తెలంగాణ కాంగ్రెస్ ఫాలో అవ్వాలనుకుంటుంది.. తెరాస వ్యతిరేక పార్టీలను కలుపుకొని వచ్చే ఎన్నికల్లో బరిలోకి దిగి కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దె దించాలని చూస్తుంది.. తెలంగాణలో తెరాస కాకుండా కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ, సీపీఐ, సీపీఎం, టీజేఎస్‌, టీఈపీ ఇలా చాలా పార్టీలు ఉన్నాయి.. ఎవరికి వారు ఒంటరిగా బరిలోకి దిగితే ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలిపోయి మళ్ళీ తెరాసనే అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుంది.. అందుకే తెలంగాణ కాంగ్రెస్ తెరాస వ్యతిరేక పార్టీలతో పొత్తు పెట్టుకొని, వచ్చే ఎన్నికల్లో తెరాసని ఓడించాలని చూస్తుంది. టీడీపీ ఏపీ లో అధికారంలో ఉంది కానీ, తెలంగాణాలో ఆ పార్టీ పరిస్థితి బాలేదు.. టీడీపీ అగ్రనేతలు చాలావరకు పార్టీని వీడి. తెరాస, కాంగ్రెస్ లలో చేరారు.. అయితే టీడీపీకి హైదరాబాద్, ఖమ్మం, అలానే కొన్ని గ్రామాల్లో ఇంకా ఓటు బ్యాంకు ఉంది.. అందుకే కాంగ్రెస్ టీడీపీతో పొత్తు పెట్టుకోవాలని చూస్తుందట.. గత ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ కలిసి పోటీ చేసింది.. కానీ ఇప్పుడు టీడీపీ,బీజేపీ మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమంటుంది.. ఇక తెరాసతో కూడా టీడీపీ కి సఖ్యత లేదు.. అందుకే కాంగ్రెస్ టీడీపీతో పొత్తుకు సిద్ధమని సంకేతాలు ఇస్తుంది.. అలానే గత ఎన్నికల్లో కాంగ్రెస్ తో కలిసి పోటీచేసిన సీపీఐ ఈసారి కూడా కాంగ్రెస్ తోనే కలిసి నడవాలనుకుంటుంది. ఇక తెలంగాణ ఇంటి పార్టీ (టీఈపీ) ఇప్పటికే కాంగ్రెస్ తో పొత్తుకు సిద్ధమైంది.. అలానే తెరాస ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తున్న కోదండరాం టీజేఎస్‌ కూడా కాంగ్రెస్ తో పొత్తుకు సిద్ధంగా ఉంది.. కాంగ్రెస్ కి బీజేపీ పూర్తి వ్యతిరేకం కావున ఒంటరిగానే బరిలోకి దిగుతుంది.. అలానే సీపీఎం కూడా ఒంటరిగా బరిలోకి దిగే అవకాశాలున్నాయి.. తెరాసను అడ్డుకోవాలంటే టీడీపీ, సీపీఐ, టీజేఎస్‌, టీఈపీ ఇలాంటి పొత్తు తప్పనిసరి అని తెలంగాణ కాంగ్రెస్ భావిస్తోందట.. ఇప్పటికే ఆ దిశగా పావులు కూడా కదుపుతున్నట్టు తెలుస్తుంది.. చూద్దాం మరి తెలంగాణ కాంగ్రెస్ వ్యూహం ఫలిస్తుందో లేదో.

కాంగ్రెస్సా? బీజేపీనా? తేల్చుకోలేకపోతున్న డీఎస్

  తెలంగాణ రాజకీయాలు అప్పుడే వేడెక్కుతున్నాయి.. సీఎం కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లాలనే ఆలోచనతో విపక్షాలకు సవాల్ విసురుతుంటే.. ప్రతిపక్ష కాంగ్రెస్ మేము ముందస్తు ఎన్నికలకు సిద్దమే అంటూ ప్రతిసవాల్ విసురుతుంది.. దీనికి తగ్గట్టే పార్టీలు ఎమ్మెల్యే సీట్ల కేటాయింపు గురించి లెక్కలు, ఆలోచనలు చేస్తున్నాయి.. ఇదంతా ఒక ఎత్తైతే ఇప్పుడు కొత్తగా ఒక టాపిక్ తెలంగాణ రాజకీయాల్లో తెరమీదకు వచ్చింది.. అదే డీఎస్ చూపు ఏ పార్టీ వైపు?.. ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీలో ఓ వెలుగు వెలిగిన డీఎస్, రాష్ట్ర విభజన అనంతరం అప్పటి పరిస్థితుల దృష్ట్యా మరియు కుమారుడు భవిష్యత్తు కోసం, తెరాసలో చేరారు..  తెరాస కూడా డీఎస్ అనుభవానికి గౌరవమిచ్చి రాజ్యసభ సభ్యుడుగా, ప్రభుత్వ సలహాదారుగా నియమించింది.. అయితే డీఎస్ పెద్ద కుమారుడు సంజయ్, డీఎస్ తో పాటే ఉన్నారు కానీ, రెండో కుమారుడు అరవింద్ మాత్రం బీజేపీ లో చేరారు.. అరవింద్ చేరిక వెనక డీఎస్ ప్లాన్ ఉందని అప్పట్లో ఆరోపణలు కూడా వచ్చాయి.. ఇలాంటి ఆరోపణలని పెద్దగా పట్టించుకోని డీఎస్.. గత కొంత కాలంగా తెరాసతో మాత్రం అసంతృప్తిగా ఉన్నట్టు తెలుస్తుంది.. తెరాస పార్టీ కార్యక్రమాల్లో డీఎస్ కు తగిన ప్రాధాన్యత ఇవ్వకపోవడం, అలానే కుమురుడు సంజయ్, తనతో పాటు పార్టీలో చేరిన వారికి సముచిత స్థానం కల్పించకపోవడంతో అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తుంది..  దీనికి తోడు తాజాగా నిజామాబాద్ తెరాస నేతలు డీఎస్ పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నారు, ఆయన మీద క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని సీఎంకి లేఖ రాయడంతో.. డీఎస్ కలత చెంది తెరాసను వీడి వేరే పార్టీలో చేరాలని చూస్తున్నారట.. ఇప్పటికే కాంగ్రెస్ పెద్దలతో మంతనాలు కూడా జరిపారట.. కాంగ్రెస్ కూడా సానుకూలంగా స్పందించి డీఎస్ కి, ఆయన కుమారుడు సంజయ్ కి సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చిందట.. డీఎస్ అంత ఓకే ఇక పాత గూటికే నా పయనం అని సిద్దమవగా, రెండో కుమారుడు అరవింద్ పెద్ద ట్విస్ట్ ఇచ్చాడట.. బీజేపీలో చేరాలని డీఎస్ మీద ఒత్తిడి చేస్తున్నాడట..  అలానే బీజేపీ పెద్దలతో కూడా మాట్లాడిస్తున్నాడట.. కానీ డీఎస్ మాత్రం కాంగ్రెస్ వైపే వెళ్లాలని ఎక్కువ మొగ్గు చూపుతున్నారట.. ఒకప్పటి పార్టీ అయితేనే సంతృప్తి ఉంటుందని భావిస్తున్నారట.. చూద్దాం మరి డీఎస్ తిరిగి కాంగ్రెస్ గూటికి చేరతారో లేక రెండో కొడుకు మాటలకు మనస్సు మార్చుకొని బీజేపీలో చేరతారో.. చూద్దాం ఏం జరుగుతుందో.  

మోడీకి దెబ్బ మీద దెబ్బ

ప్రస్తుతం పరిస్థితులన్నీ బీజేపీ మీద బాగా పగపట్టేసినట్టు ఉన్నాయి.. మిత్రపక్షాలు ఒక్కొక్కటిగా దూరమవుతూ బీజేపీకి దెబ్బ మీద దెబ్బ పడుతుంది.. ఇప్పుడు మరో మిత్రపక్షం బీజేపీ గుడ్ బై చెప్పే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది.. అదే బీహార్ లోని జేడీయూ పార్టీ.. గత ఏడాది ఆర్జేడీతో తెగదెంపులు చేసుకుని బీజేపీతో కలిసిన నితీష్ కుమార్ జేడీయూ తిరిగి లాలూ పార్టీతో చేతులు కలపాలని చూస్తుందట.. నితీష్ కుమార్, బీజేపీతో ఇమడలేకపోతున్నారని తెలుస్తుంది.. మరోవైపు బీజేపీ మీద వ్యతిరేక పవనాలు కూడా వీస్తున్నాయి.. బీజేపీతో కలిసుంటే వచ్చే ఎన్నికల ఫలితాల మీద ప్రభావం పడుతుంది.. అందుకే నితీష్ కుమార్ బీజేపీ తో తెగదెంపులు చేసుకునే ఆలోచనలో ఉన్నారట.. ఇప్పటికే నితీష్ సన్నిహితులు ఆర్జేడీ మరియు కాంగ్రెస్ నేతలతో చర్చలు జరుపుతున్నట్టు తెలుస్తుంది. అయితే ఆర్జేడీ, నితీష్ తో దోస్తీ అంటే కాస్త ఆలోచిస్తుందట.. నితీష్ ని నమ్మలేం అనుకుంటున్నారట.. అదీకాక లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబం మీద సిబిఐని ఉసిగొల్పారు.. అలాంటి వారితో దోస్తీ వద్దని ఆర్జేడీ నేతలు భావిస్తున్నారట.. ఇక కాంగ్రెస్ పరిస్థితి వేరేలా ఉంది.. బీజేపీని గద్దె దించడమే ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్న కాంగ్రెస్, ఏ పార్టీతో అయినా దోస్తీకి సిద్దమే.. కానీ లాలూ ఆర్జెడీకి ఇష్టం లేకుండా జేడీయూతో దోస్తీ చేసే సాహసం చేయదు.. ఇదే విషయం కాంగ్రెస్ నేతలు, జేడీయూ నేతలకు చెప్పినట్టు తెలుస్తుంది.. మీతో దోస్తీకి ఆర్జేడీ ఓకే అంటే మాకు ఓకే అన్నారట.. మరి నితీష్ తనమీద ఆర్జేడీ నేతలకు ఉన్న ఆగ్రహాన్ని తగ్గించి మళ్ళీ ఆర్జేడీతో చేతులు కలుపుతారా? చూద్దాం ఇదే జరిగితే బీజేపీకి మరో దెబ్బ తగిలినట్టే.

టీఆర్ఎస్‌లో గడబిడ మొదలవుతుంది

  తెలంగాణ సీఎం కేసీఆర్ మళ్ళీ అధికారం తమదే అని అంటున్నారు.. ముందస్తు ఎన్నికలకు కూడా వెళ్లాలని చూస్తున్నారు.. అయితే కాంగ్రెస్ సీనియర్ నేత జైపాల్ రెడ్డి మాత్రం వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలవడం అంత సులభం కాదంటూ టీఆర్ఎస్ మీద, కేసీఆర్ మీద ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసారు..  ఆ మధ్య కేసీఆర్ హడావుడి చేసిన ఫెడరల్ ఫ్రంట్  ఎక్కడ అంటూ ప్రశ్నించారు.. ఓవైపు ఫెడరల్ ఫ్రంట్ అంటూనే మరోవైపు బీజేపీతో కలిసి రహస్య దోస్తీ చేస్తున్నట్లుగా ఆరోపించారు.. కేసీఆర్ ఏ పథకాన్ని స్టార్ట్ చేసినా అది ఫెయిల్ అవుతుందన్నారు..  తెలంగాణ రాష్ట్రాన్ని ఇప్పించింది తానేనని చెప్పిన జైపాల్ రెడ్డి, తెలంగాణలో ఆట స్టార్ట్ చేసింది కేసీఆరే అయినప్పటికీ గోల్ కొట్టేది మాత్రం కాంగ్రెస్ పార్టీనేనని అన్నారు.. అలానే కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కుమ్ములాటలు గురించి వస్తున్న విమర్శలపై కూడా జైపాల్ రెడ్డి స్పందించారు.. జాతీయ పార్టీగా కాంగ్రెస్లో విభేదాలు సహజమేనని, ఎన్నికల్లో మాత్రం తామంతా ఒక్కటై టీఆర్ఎస్ పని పడతామన్నారు.. కాంగ్రెస్ తో పోలిస్తే ఎన్నికల సమయంలో టికెట్లు ఇచ్చేటప్పుడు కేసీఆరే ఎక్కువగా ఇబ్బంది పడతారన్నారు.. కాంగ్రెస్ లో టికెట్లు ఇచ్చిన తర్వాత కలిసి ముందుకు వెళతామని, టీఆర్ఎస్ లో మాత్రం టికెట్లు ఇచ్చిన తర్వాతే గడబిడ మొదలవుతుందన్నారు.. సిట్టింగులకు టికెట్లు ఇస్తే ప్రజలు ఓడిస్తారని, వేరేవారికి టికెట్లు ఇస్తే సిట్టింగులు ఓడిస్తారని జైపాల్ రెడ్డి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసారు.

భారతదేశం పరువు తీసిన సర్వే

భారతదేశం.. సాంప్రదాయాల నిలయం.. స్త్రీలను గౌరవించడం ప్రపంచానికి నేర్పిన దేశం.. ఇలా గొప్పగా చెప్పుకునేవాళ్ళం.. కానీ ఇప్పుడు భారతదేశం సిగ్గుతో ప్రపంచం ముందు తల దించుకుంటుంది.. ప్రపంచానికి స్త్రీలను గౌరవించడం నేర్పించిన మనం, విలువలు మర్చిపోయి భారతదేశ పరువుని నడి ప్రపంచంలో తాకట్టు పెడుతున్నాం.. దానికి రుజువే తాజాగా వెల్లడైన థాంమ్సన్ రాయటర్స్ ఫౌండేషన్ నిర్వహించిన సర్వే.. మహిళలకు భారత్ అత్యంత ప్రమాదకరమైన దేశమని ఈ సర్వే వెల్లడించింది. అత్యాచారాలు, లైంగిక వేధింపులు,మహిళల అక్రమ రవాణాలో భారత్ అగ్రస్థానంలో ఉందట.. అలానే  మహిళల భద్రత విషయంలో భారత్ మహా డేంజర్ అంటూ సర్వే వెల్లడించింది.. లైంగిక వేధింపులతో పాటు, బలవంతపు పెళ్లిళ్లు, బాల్య వివాహాలు, భ్రూణ హత్యలు ఇలా అన్నింట్లో భారత్ ముందు వరుసలో ఉందని ఈ సర్వే వెల్లడించింది.. అభివృద్ధిలో ప్రపంచ దేశాలకి పోటీ ఇవ్వాలన్న ఆలోచన దగ్గరే ఆగిపోయిన భారతదేశం, మహిళలకు అత్యంత ప్రమాదకరమైన దేశంగా మొదటి స్థానం రావడం భారతీయులుగా సిగ్గుపడాల్సిన విషయం.. ఇప్పటినుండైనా స్త్రీలను గౌరవిద్దాం.. భరతమాత పరువు కాపాడదాం.

కమ్యూనిస్టులకు పవన్ మీద ఎందుకంత అనుమానం?

  టీడీపీని విభేదించాక పవన్ ఒంటరి పోరుకి సిద్ధమన్నారు.. కానీ పవన్, వైసీపీకి మద్దతని ఆరోపణలు వచ్చాయి.. అయితే ఈ ఆరోపణలను పవన్ కొట్టిపారేసే ప్రయత్నం చేసారు.. అలానే కమ్యూనిస్టులతో కలిసి పనిచేస్తామని, మూడునెలల్లో కార్యాచరణ రూపొందిస్తాం అని పవన్ ప్రకటించారు.. విచిత్రంగా పవన్ ఈ ప్రకటన చేసిన మరుసటి రోజే, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసారు.. జనసేన, వైసీపీకి మద్దతిస్తే తాము ఆ పార్టీతో కొనసాగలేమని స్పష్టం చేసారు.. స్వయంగా పవన్, కమ్యూనిస్టులతో కలిసి పనిచేస్తామని చెప్పినా, వాళ్ళకి నమ్మకం లేదా.. కమ్యూనిస్టులకు పవన్ మీద ఎందుకంత అనుమానం? అని చర్చలు మొదలయ్యాయి.. అయితే కమ్యూనిస్టుల అనుమానాలకు కూడా కారణాలు ఉన్నట్టు తెలుస్తుంది.. కడప ఉక్కు పరిశ్రమ కోసం చేస్తున్న బంద్ కు పవన్ మద్దదైతే తెలిపారు కానీ, కేంద్రాన్ని నిలదీయట్లేదు, ఇదే కాదు ఏ విషయంలోనూ ఈ మధ్య పవన్ కేంద్రాన్ని విమర్శించట్లేదు.. అలానే ఎన్నికల విషయం వచ్చేసరికి పవన్ 175 స్థానాల్లోనూ పోటీ చేస్తాం అని చెప్తున్నాడు.. మరోవైపు వచ్చే ఎన్నికల్లో వైసీపీతో పొత్తు గురించి పవన్ స్పష్టత ఇవ్వలేదు.. వీటి మూలంగా తమను వాడుకుని వదిలేస్తున్నారా అనే అనుమానాలు కమ్యూనిస్టులకు వస్తున్నాయట.  

వైసీపీ ఎంపీలు రాజీనామా చేసి తప్పు చేసారా...!

  ప్రత్యేకహోదా కోసం ఏ పార్టీ ఏం చేసిందనేది కాసేపు పక్కనపెడితే, ప్రత్యేకహోదా సాధించనందుకు ప్రజలు బాధపడుతున్నారనేది వాస్తవం.. రాష్ట్ర ప్రయోజనాల కోసం టీడీపీ, బీజేపీతో కలిసి పనిచేసింది.. బీజేపీ ప్రత్యేకహోదాకి బదులుగా అంతే సమానమైన ప్రత్యేకప్యాకేజీ ఇస్తానంది.. దానికీ టీడీపీ అంగీకరించింది.. కానీ బీజేపీ ప్రత్యేక ప్యాకేజీ విషయంలో కూడా వెనకడుగు వేస్తుండటంతో.. టీడీపీ, బీజేపీతో తెగదెంపులు చేసుకొని ప్రత్యేకహోదాకి పట్టుపట్టింది.. ఇప్పటికీ టీడీపీ,బీజేపీ ల మధ్య మాటల యుద్ధం నడుస్తూనే ఉంది.. మరోవైపు ఏపీ విపక్ష పార్టీ వైసీపీ, ప్రత్యేకహోదా కోసం తమ పార్టీకి చెందిన ఐదుగురు ఎంపీల చేత రాజీనామా చేయించింది.. అయితే రాజీనామాల వల్ల ఉపయోగం లేదని, వైసీపీ రాజీనామాల పేరుతో డ్రామాలు ఆడుతుందని విమర్శలు వినిపించాయి.. రాజీనామాల విషయంలో వైసీపీ నిర్ణయం తప్పని పార్లమెంట్ సాక్షిగా నిరూపించే అవకాశం టీడీపీకి వచ్చిందని విశ్లేషకులు అంటున్నారు. పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు జులై 18 నుంచి ఆగస్టు 10వరకు మొత్తం 18 రోజులు జరగనున్నాయి.. ఈ సమావేశాల్లో పార్లమెంట్ సాక్షిగా టీడీపీ, బీజేపీ ని నిలదీయాలని చూస్తుంది.. అవసరమైతే బీజేపీ మీద అవిశ్వాసతీర్మానం పెట్టాలనే ఆలోచనలో కూడా టీడీపీ ఉన్నట్టు తెలుస్తుంది.. కానీ వైసీపీకి ఆ అవకాశం లేదు.. ఎంపీల రాజీనామా వల్ల పార్లమెంట్లో రాష్ట్రం కోసం పోరాడే అవకాశం కోల్పోయింది.. మరో వైపు ఉపఎన్నికలకు కూడా ఆస్కారం లేదు.. దీంతో వైసీపీ ఎంపీల రాజీనామాల వల్ల ప్రయోజనం లేదని విశ్లేషకులు భావిస్తున్నారు.. అలానే టీడీపీ, పార్లమెంట్ సాక్షిగా రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రం మీద పోరాడితే.. వైసీపీ నిర్ణయం తప్పని ప్రజలకి అర్ధమవుతుంది అంటున్నారు.

రమణ దీక్షితులు ఇక సైలెంట్ అవుతారా

  శ్రీవారి ఆభరణాలు తరలించారంటూ, టీటీడీ మాజీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు కొద్దిరోజుల నుండి ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే.. ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్న టీటీడీ, స్వామీ వారి ఆభరణాలను ప్రదర్శనకు ఉంచి.. రమణ దీక్షితులు చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని తేల్చేసింది.. టీటీడీ చరిత్రలోనే తొలిసారిగా పాలక మండలి సభ్యుల కోసం శ్రీవారి ఆభరణాలను ప్రదర్శించారు.. బోర్డు సభ్యులు వీటిని పరిశీలించారు.. శ్రీవారి ఆభరణాలు అన్నీ ఉన్నాయని, రూబీ ఒకటి పగిలిపోయిందని, దాని విలువ రూ. 50గా రికార్డులో నమోదు చేసి ఉందని తెలిపారు.. అలానే రమణ దీక్షితులు చెబుతున్న పింక్ డైమండ్ అసలు లేనే లేదని పేర్కొన్నారు. శ్రీవారి ఆభరణాల విషయంలో వస్తున్న ఆరోపణల నేపథ్యంలో సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు..  తాజాగా అమరావతిలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఈ విషయంపై బాబు స్పందించారు.. ఇకపై ప్రతి రెండేళ్లకోసారి శ్రీవారి నగలపై ప్రత్యేక కమిటీతో న్యాయ విచారణ చేపడతామని ప్రకటించారు.. ఆ కమిటీ ముందే, రెండేళ్లకోసారి నగల పరిశీలన చేస్తామని, అదే విధంగా భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా జాగ్రత్తలు తీసుకుంటామని చంద్రబాబు స్పష్టం చేశారు.. అదే విధంగా కొంతమంది లేని నగలు, డైమండ్లు పోయాయంటూ రాజకీయాలు చేస్తున్నారని బాబు మండిపడ్డారు.. మొత్తానికి శ్రీవారి ఆభరణాల గురించి వస్తున్న ఆరోపణలకి టీటీడీ ఆభరణాల ప్రదర్శన చేసి ఆరోపణలు అవాస్తవమని నిరూపించడం అలానే టీడీపీ ప్రభుత్వం శ్రీవారి ఆభరణాల రక్షణకోసం కీలక నిర్ణయం తీసుకోవడంతో భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

చిరంజీవి దర్శకత్వంలో పవన్‌కళ్యాణ్ జనసేన...!

  చిరంజీవి సామజిక న్యాయం అంటూ ప్రజారాజ్యం పార్టీ స్థాపించారు.. ఆ పార్టీ ఆశించిన స్థాయిలో విజయం సాధించక పోవడంతో, కాంగ్రెస్ లో విలీనం చేసారు.. చిరు కేంద్రమంత్రిగా కూడా పని చేశారు.. తరువాత పరిస్థితులు మారిపోయాయి.. రాష్ట్ర విభజన అనంతరం ఏపీలో కాంగ్రెస్ పరిస్థితి దారుణంగా తయారైంది.. అదే సమయంలో చిరు సోదరుడు పవన్ జనసేన పార్టీ స్థాపించారు.. బీజేపీ,టీడీపీ పార్టీలకు మద్దతిచ్చి కాంగ్రెస్ కి వ్యతిరేకంగా ప్రచారం చేసారు.. చిరు చిన్నగా కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలకు దూరమవుతూ, మళ్ళీ సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చారు.. పవన్ బీజేపీ,టీడీపీ పార్టీలకు దూరమై, సినిమాలకి బ్రేక్ ఇచ్చి పూర్తిగా రాజకీయాల మీద ఫోకస్ చేస్తున్నారు.  పవన్ అప్పుడప్పుడు ప్రజారాజ్యం సమయంలో అన్నయ్యని మోసం చేసిన ప్రతి ఒక్కరికి సమాధానం చెప్తా అని ఆవేశంగా మాట్లాడటంతో.. పవన్, చిరు కోసమే పార్టీ పెట్టాడని.. జనసేన, ప్రజారాజ్యానికి సీక్వెల్ అని ఆరోపణలు, విమర్శలు వచ్చాయి.. అయితే పవన్ వీటిని పట్టించుకోకుండా ప్రజల్లో తిరుగుతూ, వచ్చే ఎన్నికల వైపు అడుగులు వేస్తున్నారు.. కానీ మరొక్కసారి చిరు ప్రజారాజ్యం తెరమీదకి వచ్చింది.. చిరు అభిమాన సంఘ సభ్యులకు ' గతంలో ప్రజారాజ్యానికి పనిచేసినట్టే, జనసేనకు పనిచేయాలని' మెసేజ్ లు వస్తున్నాయట.. ఈ వార్త బయటికి రావడంతో మళ్ళీ చర్చలు మొదలయ్యాయి.. చిరు తెర వెనుక ఉండి జనసేన పార్టీ నడిపిస్తున్నాడు.. ఇప్పుడే తెరముందుకు వస్తే జనసేన మరో ప్రజారాజ్యంలా అవుతుందని ప్రజలు భావిస్తారు. అందుకే తమ్ముడిని తెర ముందు ఉంచి తెర వెనుక అంతా అన్నయ్య నడిపిస్తున్నాడని ఆరోపణలు వినిపిస్తున్నాయి.. అభిమాన సంఘ సభ్యులకు మెసేజ్ లు అనే వార్తలో నిజమెంత ఉందో తెలీదు కానీ ఆ వార్త బయటికొచ్చినప్పటి నుండి జనసేన పార్టీ, తెరముందు పవన్, తెర వెనుక చిరు అంటూ సెటైర్స్ వినిపిస్తున్నాయి.. చూద్దాం మరి చిరు, పవన్ దీనిపై ఎలా స్పందిస్తారో.

తెలంగాణ కాంగ్రెస్ లో ఒకే కులానికి పెద్ద పీట

  ప్రస్తుతం తెలంగాణలో ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్, వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా తెరాసని గద్దె దించి అధికారంలోకి రావాలని చూస్తుంది.. కానీ తెలంగాణ కాంగ్రెస్ నాయకుల తీరు చూస్తుంటే, మళ్ళీ ప్రతిపక్షానికే పరిమితం అవ్వాల్సి వచ్చేలా ఉందని అధిష్టానం భయపడుతుంది.. సమిష్టిగా పార్టీని బలోపేతం చేయాల్సింది పోయి, ఎవరికివారు పార్టీకి నేనే పెద్ద దిక్కు, నేనే సీఎం అవుతా అంటున్నారు.. దీనికితోడు పీసీసీ అధ్యక్షుడిని మార్చాలని కొందరు, పార్టీ రాష్ట్ర ఇంచార్జిని మార్చాలని మరికొందరు.. వీటితో ఏం చేయాలో పాలుపోక, పరిస్కార మార్గం కోసం అన్వేషణలో ఉన్న అధిష్టానానికి మరో షాక్..  సీనియర్ నాయకుడు దానం నాగేందర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసారు.. ఆయన పోతూ పోతూ కాంగ్రెస్ పార్టీ తీరుపైన, నాయకత్వం పైన విమర్శలు చేసారు.. గ్రేటర్ లో ఏ పార్టీ కార్యక్రమం జరిగినా సొంత ఇంటి పనిలా తన భుజాలపైనే వేసుకుని పని చేశానని, అలాంటిది గ్రేటర్ ఎన్నికల్లో తనకు తెలియకుండానే ఎవరెవరికో అనామకులకి టికెట్లు ఇచ్చారని దానం ఆవేదన వ్యక్తం చేశారు.. బీసీలకు ప్రాధాన్యత ఇస్తేనే కాంగ్రెస్ కు మళ్లీ పునర్వైభవం వస్తుందని పార్టీ అధినేత రాహుల్ గాంధీకి కూడా చెప్పానని అన్నారు.. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో అన్ని వర్గాలకు సమానత్వం లేదు.. బడుగు, బలహీన వర్గాలను పట్టించుకోవడం లేదు.. అందుకే డీఎస్, కేకేలాంటి వాళ్లు పార్టీని వీడారని దానం అన్నారు..  ఒక వర్గానికి చెందిన వారు మాత్రమే పార్టీలో ఆధిపత్యం చెలాయిస్తున్నారని విమర్శించారు.. కాంగ్రెస్ పార్టీ ఈ మధ్య నిర్వహించిన బస్సు యాత్రలో కేవలం ఒక సామాజిక వర్గానికి చెందిన నేతలకే ప్రాధాన్యముందని, మిగతా సామాజిక వర్గానికి చెందిన నేతలకు అందులో చోటు లేదని విమర్శించారు.. ఉత్తమ్ పార్టీ కోసం కష్టపడుతున్నా కొందరు నేతలు ఆయన్ని కిందకు లాగే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.. వైఎస్ లా పార్టీని కాపాడతానంటూ చెప్పగలిగే ధైర్యం ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ఒక్క నాయకుడికైనా ఉందా? అని ప్రశ్నించిన దానం.. పార్టీలో తనకు తగిన ప్రాధాన్యత ఇవ్వడం లేదని , ఆత్మాభిమానం చంపుకోలేకే కాంగ్రెస్ కు రాజీనామా చేశానని తెలిపారు.. మరి దానం చేసిన ఒకే సామాజిక వర్గ ఆధిపత్యం ఆరోపణలకు కాంగ్రెస్ ఎలా స్పందిస్తుందో చూడాలి.  

ప్రత్యేకహోదా కోసం కాంగ్రెస్ తో పొత్తుకు పవన్ సై అంటాడా?

  పవన్ కళ్యాణ్.. 2014 లో ప్రత్యక్షంగా ఎన్నికల్లో పోటీ చేయనప్పటికీ, 'కాంగ్రెస్ హటావో దేశ్ బచావో' అంటూ బీజేపీ, టీడీపీకి మద్దతిచ్చి కాంగ్రెస్ కి వ్యతిరేకంగా ప్రచారం చేసారు.. అనుకున్నట్టే కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి వచ్చాయి.. కానీ తరువాత పరిస్థితులు మారిపోయాయి.. పవన్ బీజేపీ, టీడీపీ లను విభేదించి ఒంటరిగా 2019 ఎన్నికల వైపు అడుగులు వేస్తున్నారు.. హోదా ఇవ్వలేదని బీజేపీతో విభేదించిన పవన్, కాంగ్రెస్ కి మద్దతిచ్చే అవకాశం ఉందంటూ వార్తలు బయటికొస్తున్నాయి.. ఇప్పుడిప్పుడే మోడీ మీద వస్తున్న వ్యతిరేకతను అస్త్రంగా మలుచుకొని మళ్ళీ పుంజుకోవాలని చూస్తున్నకాంగ్రెస్, ఏపీ మీద కూడా ప్రత్యేక దృష్టి పెట్టింది..  విభజన తరువాత ఏపీలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి దారుణంగా తయారైంది.. ఏపీలో ఇప్పుడిప్పుడే ఉనికిని చాటుకునే ప్రయత్నం చేస్తున్న కాంగ్రెస్, ప్రత్యేకహోదా అంశంతో తిరిగి పుంజుకోవాలని చూస్తుంది.. ఇప్పటికే రాహుల్ గాంధీ ఏపీ కాంగ్రెస్ నేతలతో సమావేశమై ఏపీలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం గురించి చర్చించారు.. కాంగ్రెస్ నుండి వెళ్లిపోయిన బలమైన నాయకులు తిరిగి పార్టీలోకి వచ్చేలా చూడాలన్నారు.. రాహుల్ ఏపీ మీద ప్రత్యేకదృష్టి పెట్టడంతో ఏపీ కాంగ్రెస్ నేతల్లో నూతనుత్తేజం వచ్చి పార్టీ బలోపేతానికి పావులు కదుపుతున్నారు.. ఇదంతా బానే ఉంది కానీ ఇప్పుడొక భేటీ అందరిని ఆశ్చర్య పరుస్తుంది..  అదే, కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ తో పవన్ భేటీ.. కాంగ్రెస్ ని తీవ్రంగా వ్యతిరేకించి, విమర్శలు చేసిన పవన్.. ఇప్పుడు కాంగ్రెస్ నేతతో భేటీ అవడంతో అందరు షాక్ అవుతున్నారు.. ప్రత్యేకహోదా కోసం పవన్ కాంగ్రెస్ కి మద్దతిచ్చే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.. ప్రధాన జాతీయ పార్టీలు రెండు.. ఒకటి బీజేపీ, రెండు కాంగ్రెస్.. బీజేపీ ఏపీకి ప్రత్యేకహోదా నిరాకరించింది.. కాంగ్రెస్ ఏపీకి ప్రత్యేకహోదా ఇస్తా అంటుంది..అందుకే, పవన్ కాంగ్రెస్ కి మద్దతిచ్చే అవకాశం ఉందనేది వాళ్ళ భావన.. మరి పవన్ ప్రత్యేకహోదా కోసం తన పంతాన్ని పక్కన పెట్టి కాంగ్రెస్ తో పొత్తుకు సై అంటారో లేదో చూద్దాం.  

కిరణ్ కుమార్ రెడ్డి, ఉండవల్లి కాంగ్రెస్ లోకి వస్తారా?

  ఒకప్పుడు ఏపీలో కాంగ్రెస్, ఐతే అధికారంలో ఉండేది లేదా బలమైన ప్రతిపక్షంగా ఉండేది.. కానీ రాష్ట్ర విభజన తరువాత 'ఒకప్పుడు ఏపీలో కాంగ్రెస్ ఉండేది' అని చెప్పుకునే పరిస్థితికి వచ్చింది.. రాష్ట్ర విభజన జరిగి నాలుగేళ్లు గడిచింది.. కాంగ్రెస్ ఇప్పుడిప్పుడే ఏపీలో తన ఉనికిని చాటుకునే ప్రయత్నం చేస్తుంది.. 2019 ఎన్నికల సమయానికి పార్టీని బలోపేతం చేయాలని చూస్తుంది.. విభజనకి ముందు కాంగ్రెస్ లో చాలామంది బలమైన నాయకులు ఉండేవారు.. విభజన తరువాత ఏపీలో కాంగ్రెస్ మీద తీవ్ర వ్యతిరేకత రావడంతో..  చాలామంది కాంగ్రెస్ ని వీడి టీడీపీ,వైసీపీ,బీజేపీ పార్టీలలో చేరారు.. ఇక కొందరు నాయకులైతే అసలు రాజకీయాలకే దూరమయ్యారు..  అతి కొద్దిమంది నాయకులు మాత్రమే వేరే పార్టీలలో ఇమడలేమనో లేదా ఎప్పటికైనా కాంగ్రెస్ పుంజుకుంటుందన్న ఆశతోనో పార్టీనే అంటిపెట్టుకొని ఉన్నారు.. ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ మీద కాస్త వ్యతిరేకత మొదలవడంతో, కాంగ్రెస్ లో ఉత్సాహం మొదలైంది.. 2019 లో అధికారమే లక్ష్యంగా అడుగులేస్తూ.. రాష్ట్రాల్లో పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టింది.. అలానే ప్రాంతీయ పార్టీలతో దోస్తీకి సిద్ధమైంది.. ఐతే ఇప్పుడు కాంగ్రెస్ అధిష్టానం ఏపీ మీద కూడా సీరియస్ గా దృష్టి పెట్టినట్టు తెలుస్తుంది.. పార్టీని వీడిన సీనియర్ నాయకులని తిరిగి పార్టీలోకి ఆహ్వానించి, ఏపీలో మళ్ళీ కాంగ్రెస్ కి పూర్వ వైభవం తీసుకురావాలని చూస్తున్నారట.. ఇప్పటికే ఆ దిశగా పావులు కూడా కదుపుతున్నట్టు తెలుస్తుంది..  మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, ఉండవల్లి అరుణ్ కుమార్, కావూరి సాంబశివరావు లాంటి సీనియర్ నాయకులను తిరిగి కాంగ్రెస్ లోకి తీసుకురావాలని చూస్తున్నారట.. అలానే కాంగ్రెస్ నుండి మిగతా పార్టీలకు వెళ్లిన నేతలని కూడా తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారట.. అలానే 'తప్పనిసరి  పరిస్థితుల్లో విభజన జరిగింది.. ఏపీకి ప్రత్యేకహోదా కాంగ్రెస్ తోనే సాధ్యం' అనే నినాదంతో ప్రజల్లోకి వెళ్లాలని చూస్తున్నారట.. 'ఇప్పుడున్న పరిస్థితుల్లో నాయకులు ధైర్యం చేసి తిరిగి కాంగ్రెస్ కి రావడం.. ప్రత్యేకహోదా కోసం కాంగ్రెస్ ని నమ్మి ప్రజలు ఓటెయ్యడం కష్టమే' అంటున్నారు విశ్లేషకులు.. చూద్దాం ఏం జరుగుతుందో.