కాంగ్రెస్, బీజేపీ వార్... ముఖ్యమంత్రిగా కుమారస్వామి..!

  నిన్నటి వరకూ కర్ణాటక ఎన్నికల్లో బీజేపీ కనుక గెలిస్తే యడ్యూరప్ప ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉందని... కాంగ్రెస్ కనుక గెలిస్తే సిద్ద రామయ్య ముఖ్యమంత్రి అవుతారన్న అభిప్రాయాలు ఉన్న సంగతి తెలిసిందే. ఎందుకంటే ప్రధాన పార్టీలు ఆ రెండే కాబట్టి.. ఆ రెండు పార్టీలకే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఆ ఇద్దరిలోనే ఎవరో ఒకరు ముఖ్యమంత్రిగా అయ్యే అవకాశం ఉంది కాబట్టి అలా అనుకోవడంలో తప్పులేదు. కానీ ఇప్పుడు అనూహ్యంగా మరో వ్యక్తి తెరపైకి వచ్చారు. అది ఎవరో కాదు కుమార స్వామి.   నిజానికి ఈరోజు ఓట్ల లెక్కింపు ప్రారంభమైన తరువాత.. కొద్దిసేపటికే బీజేపీ హవా కొనసాగించింది. దాదాపు అన్ని చోట్లా ఆధిక్యంలోకి వచ్చి మ్యాజిక్ ఫిగర్ కూడా దాటేసింది. కానీ ఓట్ల లెక్కింపు జరిగేకొద్ది క్షణ క్షణానికి ఫలితాలు మారుతూ.. అందరిలో ఆసక్తి రేకెత్తించాయి. దాంతో నిన్నటి వరకూ కర్ణాటక ఎన్నికల్లో హంగ్ ఏర్పడుతుందీ అనున్నారు కానీ.. ఆ పరిస్థితి లేదు.. బీజేపీనే అధికారం చేపడుతుందని అందరూ ఊహించారు. ఓట్ల లెక్కింపు కొనసాగుతున్న కొద్దీ   చిన్న చిన్నగా కాంగ్రెస్ కూడా పుంజుకోవడం మొదలుపెట్టిందో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. చాలా చోట్ల బీజేపీని వెనక్కి నెట్టి కాంగ్రెస్ దూసుకొచ్చింది. దాంతో బీజేపీ కాంగ్రెస్ కంటే ఎక్కువ స్థానాలు దక్కించుకున్నప్పటికీ మ్యాజిక్ ఫిగర్ అందుకోలేకపోయింది. ముందునుండి అనుకున్నట్టుగానే హంగ్ ఏర్పడింది. దాంతో ఇప్పుడు జేడీఎస్ కీలకంగా మారింది.   మరోవైపు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు జేడీఎస్ తో మంతనాలు మొదలుపెట్టేశాయి. కాంగ్రెస్ కు అధికారం రాకూడదని బీజేపీ... ఏమైనా సరే.. కర్ణాటక పీఠం బీజేపీకి దక్కకూడదన్నట్లుగా కాంగ్రెస్ వ్యవహరిస్తున్నాయి. అంతేకాదు.. ఇప్పటికే కాంగ్రెస్ నుండి గులాం నబీ అజాద్ వంటి పెద్దలు వచ్చి పావులు కదపటం మొదలెట్టారు. ఈ నేపథ్యంలోనే... జేడీఎస్ కు బయట నుంచి మద్దతు ఇస్తూ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు కాంగ్రెస్ ఓకే చెప్పినట్టు సమాచారం. తమకు అధికారం అక్కర్లేదని.. జేడీఎస్ ప్రభుత్వానికి మద్దతు ఇస్తామని.. కుమారస్వామి సీఎంగా ప్రమాణస్వీకారం చేసేందుకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పినట్టు టాక్స్ వినిపిస్తున్నాయి.  దీంతో.. కాంగ్రెస్ తో కలుద్దామా?  వద్దా?  అన్న ఆలోచనలో ఉన్న కుమారస్వామి... వెతుక్కుంటూ వచ్చిన సీఎం పదవిని ఓకే చేసే అవకాశం ఉందంటున్నారు. వరుస దెబ్బలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న జేడీఎస్.. తానే అధికారం చేపట్టే ఛాన్స్ వస్తే.. ఆ అద్భుత అవకాశాన్ని వదులుకునేది లేదు అంటున్నారు. దీంతో.. కర్ణాటక రాజకీయం ఒక్కసారిగా మారింది. ఇక బీజేపీ కూడా తమ వంతు తాము ప్రయత్నాలు మొదలుపెట్టేశారు. మరి చూద్దాం ఆఖరికి ఏం జరుగుతుందో..

జేడీఎస్ కింగ్ మేకర్ అవ్వనుందా..?

  కర్ణాటక ఎన్నికలు ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ఇక ప్రధాన పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు గెలుపు ఎవరిదో ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఒక్క ఆ రెండు పార్టీలు మాత్రమే కాదు.. దేశ వ్యాప్తంగా ఉన్న పార్టీలు.. సామాన్య ప్రజల చూపు కూడా ఇప్పుడు కర్ణాటక ఎన్నికల ఫలితాలపై పడింది. ఇక ఈ ఉదయం ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ఈ రోజు ఉదయం మొదలైన కౌంటింగ్ క్షణ క్షణానికి తారుమారు అవుతున్నాయి. కౌంటింగ్ ప్రారంభమైన కొద్దిసేపటికే బీజేపీదే హవా అన్నటాక్ వచ్చేసింది. అన్ని చోట్ల దాదాపు బేజీపీనే ఆధిక్యంలో ఉంది. దాంతో బీజేపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు సంబరాల్లో మునిగిపోయారు అప్పుడే. అయితే క్రమ క్రమంగా కాంగ్రెస్ పుంజుకుంటోంది. బీజేపీ ఆధిక్యత చిన్నచిన్నగా తగ్గుతోంది. 222 స్థానాలకు ఎన్నికలు జరుగగా, 112 స్థానాల్లో గెలిస్తే అధికారం ఖాయమవుతుంది. ఈ నేపథ్యంలో ఒకానొక దశలో 118 స్థానాల్లో ఆధిక్యాన్ని చూపిన బీజేపీ ఇప్పుడు చాలా స్థానాల్లో ఆధిక్యాన్ని కోల్పోయింది. ఇక ఇవే ఫలితాలు కనుక చివరి వరకూ కొనసాగితే మాత్రం హంగ్ ఏర్పడక తప్పదు. అలా ఏర్పడితే కనుక జేడీఎస్ కింగ్ మేకర్ గా మారాల్సిందే. మరి ఒకవేళ హంగ్ కునుక వస్తే తమ మద్దతు కాంగ్రెస్ కే ఇస్తామని ఇప్పటికే జేడీఎస్ అధికార ప్రతినిధి డానిష్ అలీ స్పష్టం చేశారు.  కాంగ్రెస్ కనుక ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన సీట్లు గెలవకుంటే తమ మద్దతు ఆ పార్టీకేనని.. మేం కాంగ్రెస్‌తోనే వెళ్తాం. అది మా బాధ్యత కూడా.. బీజేపీతో మేం వెళ్లే ప్రసక్తే లేదని తేల్చి చెప్పేశారు.   ఇదిలా ఉండగా.. ఇప్పుడు మరో అంశం కూడా తెరపైకి వస్తుంది. గతంలో గోవా, మణిపూర్ ఎన్నికల సమయంలో బీజేపీ... ఫిరాయింపుదారులను ప్రోత్సహించి, ఇతర పార్టీల ఎమ్మెల్యేలను తమవైపు లాక్కుని  లో అధికారానికి దగ్గరైనట్టే, కర్ణాటకలోనూ ఓ ఐదారుగురు ఇతర పార్టీల ఎమ్మెల్యేలతో బీజేపీ బేరసారాలు చేయవచ్చని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మరి ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో.. బేడీఏస్ కింగ్ మేకర్ గా మారుతుందో..? లేదో..? ఏ జరుగుతుందో తెలుసుకోవాలంటే ఫలితాలు ఆఖరి వరకూ ఆగాల్సిందే.

అనిల్ అంబానీ, చంద్రబాబు భేటీ వెనుక ఆంతర్యం అదేనా..!

  ప్రముఖ పారిశ్రామికవేత్త అనిల్ ‌అంబానీ ఏపీ రాజధాని అమరావతిని సందర్శించారు. ముందు ఆయన విజయవాడ కనకదుర్గమ్మ ఆలయాన్ని దర్శించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజల అనంతరం ఆలయ అర్చకులు అంబానీకి తీర్థ ప్రసాదాలను అందజేశారు. అనంతరం సీఎం చంద్రబాబుతో ఆయన అమరావతి సచివాలయంలో భేటీ అయ్యారు. నెల్లూరు జిల్లాలో పవర్‌ప్రాజెక్టు, మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల ఏర్పాటు తదితర అంశాలపై అనిల్ అంబానీ సీఎంతో చర్చించినట్టు సమాచారం. అయితే ఇక్కడివరకూ బాగానే ఉన్నా.... రేపు కర్ణాటక ఎన్నికల ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో వీరి భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. కేంద్రం నుంచి వైదొలగిన తరవాత మోడీ పై చంద్రబాబు తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. కర్ణాటక ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేయొద్దని పిలుపు ఇచ్చారు కూడా.   కాగా కొన్ని రోజుల క్రితం అనిల్‌ అంబానీ అన్న ముకేష్‌ అంబానీ చంద్రబాబుతో భేటీ అయిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో ముకేష్ అంబానీ చంద్రబాబుపై ప్రశంసలు కురిపించిన సంగతి కూడా విదితమే. చంద్రబాబు ఇప్పుడు ఉన్న స్థాయి కంటే ఇంకా పెద్ద స్థాయిలో ఉండాలని ఉన్నారు. దీంతో ఇన్ డైరెక్ట్ గా చంద్రబాబుకు పీఎం పదవి కరెక్ట్ అని ముకేష్ అంబానీ అన్నారని పలు వార్తలు కూడా వచ్చాయి. అంతేకాదు బాబు, ముకేష్ భేటీ తరవాతే చంద్రబాబు వైఖరిలో పూర్తి మార్పు వచ్చిందని..మోడీ పై బాబు దాడి తీవ్రం చేశారని... అన్నారు. ఇక ఇప్పుడు అనిల్‌ అంబానీతో భేటీ అయ్యారు. రాఫెల్‌ డీల్‌ విషయంలో మోడీ-అనిల్ బంధం పై కాంగ్రెస్‌ ఇప్పటికే తీవ్రస్థాయిలో ఆరోపణలు చేస్తోంది. కర్ణాటక ఎన్నికల్లో బీజేపీ ఓడిపోయే పక్షంలో మోడీ వ్యతిరేక వర్గం మరింత బలపడే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఇప్పటికే చంద్రబాబు వైపు కాంగ్రెస్, బీజేపీ యేతర పక్షాలు చూస్తున్నాయి. ఈ నేపథ్యంలో బాబు-అనిల్‌ భేటీకి ప్రాధాన్యం సంతరించుకుంది. మోడీ తరఫున అనిల్‌ అంబానీ రాయబారం నెరుపుతున్నారా అన్న అనుమానాలు కూడా వ్యక్తమౌతున్నాయి. కానీ..  అధికారులు చెప్తున్న విషయం ఏంటంటే... అనిల్ దీరూభాయ్ అంబానీ గ్రూప్ (అడాగ్) గ్రూప్ నెల్లూరు, విశాఖపట్నం తదితర ప్రాంతాల్లో విద్యుత్, ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులను చేపట్టారు. అయితే, ఈ ప్రాజెక్టుల్లో పురోగతి కనిపించడం లేదని భావించిన రాష్ట్ర ప్రభుత్వం సదరు భూమిని వెనక్కు తీసుకోవాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో అనిల్ అంబానీ, చంద్రబాబుతో భేటీ అవుతున్నారని చెబుతున్నారు. చూద్దాం మరి వీరి భేటీ వెనుక అసలు రహస్యం ఏంటో..

కర్ణాటక ఎన్నికల్లో హంగ్...జేడీఎస్ కీలకం.. ఆపార్టీకే మద్దతు..

  ఎట్టకేలకు కర్ణాటక ఎన్నికలు ముగిశాయి. ఇప్పుడు అందరి చూపు ఎన్నికల ఫలితాల మీద పడింది. ఏ పార్టీ అధికారంలోకి వస్తుందా అని అప్పుడే చర్చలు మొదలయ్యాయి. ఇక ఈ ఎన్నికల ఫలితాలపై ఇప్పటికే ఎన్నో సంస్దలు సర్వేలు కూడా చేశాయి. అయితే ఒక్కో సంస్థ ఒక్కో రకంగా చెబుతుండటంతో అసలు ఏ పార్టీ గెలుస్తుందా అని అందరూ ఆసక్తికరంగా మారింది. ఒకానొక సందర్భంలో హంగ్ కూడా ఏర్పడుతుందన్న వార్తలు కూడా వచ్చాయి. ఒకవేళ హంగ్ కనుక ఏర్పడితే పరిస్థితి ఏంటన్న వార్తలు వస్తున్న నేపథ్యంలో జేడీఎస్ అధికార ప్రతినిధి డానిష్ అలీ సంచలన వ్యాఖ్యలు చేశారు.   ఎగ్జిట్ పోల్స్ ఫలితాల్లో చాలా వరకు బీజేపీ సుమారు 97 సీట్లతో అతిపెద్ద పార్టీగా అవతరించే అవకాశం ఉందని...  బీజేపీ తర్వాతి స్థానంలో 90 సీట్లతో కాంగ్రెస్ రెండో అతిపెద్ద పార్టీగా అవతరిస్తుందని.. అయితే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే 112 సీట్లు అవసరం.. దీంతో జేడీఎస్ కీలకంగా మారింది.  జేడీఎస్‌కు 31 సీట్లు రావచ్చని అంచనా. ఆ పార్టీ మద్దతు ఇచ్చే వారే అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది. అయితే ఎన్నికలకు ముందు జరిగిన పరిణామాలను బట్టి జేడీఎస్ మద్దతు బీజేపీకేనని అందరూ భావించారు. కానీ.. ఆ వార్తల్లో ఎంతమాత్రమూ నిజం లేదని, కాంగ్రెస్ కనుక ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన సీట్లు గెలవకుంటే తమ మద్దతు ఆ పార్టీకేనని, అది తమ బాధ్యత అని జేడీఎస్ అధికార ప్రతినిధి డానిష్ అలీ తెలిపారు. ఇక ఎన్నికల ప్రచారంలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ, జేడీఎస్‌ను బీజేపీ-బి టీమ్‌గా అభివర్ణించారు. రాహుల్ ఆరోపణలను దేవెగౌడ కొట్టివేశారు. బీజేపీ, కాంగ్రెస్‌లకు తాము మద్దతు ఇవ్వబోమని తేల్చి చెప్పారు. ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ తర్వాత జేడీఎస్ ప్రధాన కార్యదర్శి, ముఖ్య అధికార ప్రతినిధి అయిన డానిష్ అలీ మాట్లాడుతూ.. ‘‘బీజేపీతో మేం వెళ్లే ప్రసక్తే లేదు. కాంగ్రెస్‌కు ఒకవేళ మెజారిటీ రాకుంటే, ఆ పార్టీకి వంద లోపు సీట్లు వస్తే… అప్పుడు మేం కాంగ్రెస్‌తోనే వెళ్తాం. అది మా బాధ్యత కూడా’’ అని పేర్కొన్నారు. మరి చూద్దాం ఏం జరుగుతుందో...హంగ్ ఏర్పడుతుందో.. లేదో..!

ఏకంగా బెదిరింపులకే దిగారుగా..!

  మీకు అమరావతి ఎందుకు, మయసభ కట్టుకుంటారా అని గతంలో బీజేపీ ఎంపీ జీవీఎల్ నర్సింహారావు ఎగతాళి చేసిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు ఏకంగా బెదిరింపు చర్యలకే దిగుతున్నారు. కర్ణాటక ఎన్నికలు ముగియగానే, ఆంధ్రప్రదేశ్ సంగతి చూస్తాం అంటూ గత కొన్ని రోజులుగా బీజేపీ పెద్దలు మాట్లాడుతున్న నేపథ్యంలో అలా ఎన్నికలు ముగిశాయో లేదో అప్పుడే తమ నోటికి పని చెప్పారు. ముఖ్యంగా జీవీఎల్ నర్సింహారావు అయితే కాస్త ఎక్కువే మాట్లాడారు.  కర్ణాటక ఎన్నికల్లో ఘన విజయం సాధిస్తున్నామని, ఎడ్యూర‌ప్ప‌పై ఏ అభియోగాలు లేవ‌ని, ఆయన చాలా క్లీన్ అని, అందుకే ఆయన్ను ముఖ్యమంత్రిని చేసాం అంటూ, చెప్పుకొచ్చిన ఆయన.. ఆంధ్రాలో రాబోయే ఆరు నెల‌ల్లో భాజ‌పాకి మ‌హ‌ర్ద‌శ రాబోతోంద‌ని..ఆంధ్రప్రదేశ్ లో, కొన్ని రోజుల్లోన్నే అనూహ్య పరిణామాలు ఉంటాయని... ఆంధ్రప్రదేశ్ ని ఏలేది మేమే అంటూ, జోస్యం చెప్పారు.రాజకీయంగా అన్ని పార్టీలు, ఈ అనూహ్య పరిణామాలు ఎదుర్కోవటానికి సిద్ధంగా ఉండాలని వార్నింగ్ ఇచ్చారు.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు పై కూడా విపరీత వ్యాఖ్యలు చేసారు... చంద్రబాబు నాయుడు అవినీతి చేసారని, దాని అంతు చూస్తాం అంటూ పాత పాటే పాడారు.. కర్ణాటక రాష్ట్రంలో భాజ‌పా అధికారంలోకి వ‌చ్చాక సిద్ధరామయ్య పై విచార‌ణ జ‌రుగుతుంద‌న్నారు. ఎడ్యూర‌ప్ప జైలుకి వెళ్లొచ్చినంత మాత్రాన అవినీతిప‌రుడు అయిపోతారా అంటూనే, జగన్ కూడా ఇదే బాపతు అనే విధంగా, మాట్లాడి వీరి బంధాన్ని బయట పెట్టారు..

చంద్రబాబు ఆదేశం కూడా లెక్కచేయలేదుగా...

  గత కొద్దిరోజులుగా టీడీపీ నేత సుజనా చౌదరి బీజేపీలో చేరుతున్నారని వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ వార్తలపై స్పందించిన సుజనా చౌదరి..అబ్బే అదేం లేదు... తాను ఏ పార్టీలోకి వెళ్లడం లేదని చెప్పుకొచ్చారు. కానీ సుజనా అలా చెపుతున్నా ఆయన చేసే పనులు.. వైఖరి చూస్తుంటే మాత్రం ఈవార్తల్లో ఎంతో కొంత నిజం ఉందన్న అనుమానాలు రాక తప్పదు. ఇప్పుడు చంద్రబాబు మాటలు కూడా సుజనా లెక్కచేయట్లేదన్న వార్తలు వస్తున్నాయి. తెలుగు దేశం పార్టీ విస్తృత స్థాయి సమావేశానికి ఎట్టి పరిస్థితిల్లోనూ పార్టీలోని ముఖ్య నేతలు రావాల్సిందేనని చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారట. కానీ సుజనా మాత్రం ఆయన ఆదేశాల్ని బేఖాతరు చేస్తూ సమావేశానికి డుమ్మా కొట్టారట. దీంతో బీజేపీతో టీడీపీ కలిసున్నంత కాలం ఇరు పార్టీల మధ్య కీలకంగా వ్యహిరించిన సుజనా.. ఇప్పుడు భేటీకి రాకపోవడంతో సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఎన్డీయేలో టీడీపీ ఉన్నప్పుడు అత్యంత క్రియాశీలకంగా వ్యవహరించిన సుజనా.. ఎప్పుడైతే టీడీపీ బీజేపీతో కటీఫ్ అయిందో అప్పటినుండి పార్టీ కి సంబంధించిన సమావేశాల్లో పెద్దగా కనిపించకుండా పోయారు. ఇక ఇప్పుడు ఏకంగా చంద్రబాబు ఆదేశాన్నే పట్టించుకోకుండా ఇలా చేయడంతో.. రేపో మాపో తాను బీజేపీలో చేరుతున్నానని చెప్పడానికే సుజనా ఇలా చేస్తున్నాడేమో అని అనుకుంటున్నారు.

పెళ్లిపీటలు ఎక్కబోతున్నఅఖిల ప్రియ... అసలు కథ ఇదే..

  ఏపీ మంత్రి, దివంగత భూమా నాగిరెడ్డి, శోభా నాగిరెడ్డిల కుమార్తె మంత్రి భూమా అఖిలప్రియ పెళ్లిపీటలు ఎక్కబోతున్నారు. వరుడు ఎవరో కాదు... మాజీ డీజీపీ సాంబశివరావు అల్లుడు, మంత్రి నారాయణ దగ్గరి బంధువు భార్గవ్‌తో మంత్రి అఖిలప్రియకు నిశ్చితార్థమైంది. హైదరాబాద్‌లోని నివాసంలో కుటుంబ సభ్యులు, స్నేహితులు, బంధువుల సమక్షంలో అఖిలప్రియ, భార్గవ్‌ల నిశ్చితార్థ వేడుకను నిర్వహించారు. గతకొంతకాలంగా అఖిలప్రియ, భార్గవ్‌లు ప్రేమించుకుంటున్నట్టు తెలుస్తోంది.   గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి బావమరిది, కడప మేయర్ రవీంద్రనాథ్ రెడ్డి కొడుకుతో గతంలో అఖిల ప్రియకు పెళైన సంగతి తెలిసిందే. అయితే ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తడంతో పెళ్లైన ఏడాదికే విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత అఖిలప్రియ మాజీ డీజీపీ సాంబశివరావు అల్లుడు భార్గవ్ కు ఐదేళ్ల ప్రేమాయణం నడిపింది. అఖిల ప్రియ మంత్రిగా ఉండగానే భార్గవ్ తో చనువుగా ఉండటం.. ఇక భార్గవ్ కూడా నేరుగా అఖిల ప్రియ ఛాంబర్ కే వచ్చి కూర్చోవడం... అక్కడి నుండే అన్ని వ్యవహారాలు నడిపించడం... ఇక ఇవన్నీ ముఖ్యమంత్రి దృష్టికి రావడంతో ఆయన కూడా చీవాట్ల పెట్టడం అన్నీ జరిగాయి. ఇక భార్గవ్ కూడా విడాకులు తీసుకోకుండా అఖిల ప్రియతో చెట్టాపట్టాలేసుకొని తిరుగుతుండటంతో సాంబశివరావు హెచ్చరించినా భార్గవ్ మారకపోవడంతో సాంబశివరావే దగ్గరుండి విడాకులు ఇప్పించారట. దీంతో లైన్ క్లియర్ అవ్వడంతో ఇద్దరూ ఒకటయ్యారు. ఈ నేపథ్యంలో ఇరువురి నిశ్చితార్థ వేడుకను కుటుంబ సభ్యులు జరిపించగా.. ఆగస్టు 29న అఖిలప్రియ, భార్గవ్‌ల వివాహం జరుగనున్నట్టు సమాచారం.

లగడపాటి సర్వే... కర్ణాటక ఎన్నికల్లో గెలుపువారిదే...

ఈ నెల 12 వ తేదీన కర్ణాటక ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఇక ఈ ఎన్నికలు అన్ని పార్టీలకు కీలకంగా మారడంతో ఎలాగైనా సరే ఎన్నికల్లో గెలవాలని తెగ పాట్లు పడుతున్నారు. ముఖ్యంగా బీజేపీ, కాంగ్రెస్ పార్టీల భవిష్యత్తు ఓ రకంగా ఈ ఎన్నికలపైనే ఆధారపడి ఉన్నాయి. అందుకే రెండు పార్టీల నేతలు ఒకరిపై ఒకరు మాటల యుద్దాలే చేస్తున్నారు. ఒకరినొకరు వేలెత్తి చూపించుకుంటూ.. విమర్శలు చేసుకుంటున్నారు. ఇక ఈ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారా అన్నది మాత్రం ఎన్నికలు అయిపోయి.. ఫలితాలు రావాల్సిందే. కానీ ఎన్నికల సమయంలో మాత్రం సర్వేలు చేయడం కామన్ థింగే. ఆ సంస్థ ఆ సర్వే చేసిందని.. ఈ సంస్థ ఈ సర్వే చేసిందని.. ఆ పార్టీ కి ఎక్కువ సీట్లు వస్తాయని.. ఇలా ఎన్నో వార్తలు వస్తుంటాయి.   అయితే ఈ సర్వేల సంగతి ఏమో కానీ.. కచ్చితమైన ఫలితాలను ప్రకటించడంలో లగడపాటి సర్వేది అందెవేసిన చేయి అని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలోనే కర్నాటక పీఠం ఎవరికి దక్కబోతోందనేదానిపై కూడా లగడపాటి సర్వే చేశారు.  ఒకట్రెండు సంస్థలు కాంగ్రెస్ అతిపెద్ద పార్టీగా అవతరిస్తుందని చెప్పగా.. బీజేపీకి పట్టం ఖాయమని మరికొన్ని సంస్థలు అంచనా వేస్తున్నాయి. అయితే మెజారిటీ సర్వేలు మాత్రం హంగ్ ఖాయమని, జేడీఎస్ కింగ్ మేకర్ పాత్ర పోషించడం ఖాయమని చెప్తున్నాయి. ఇక గెలుపు రెండు పార్టీల మధ్య ఊగిసలాడుతున్న నేపథ్యంలో లగడపాటి సర్వేపై అందరి కళ్లూ పడ్డాయి. అయితే లగడపాటి మాత్రం ఈసారి సర్వే ఫలితాలను అధికారికంగా వెల్లడించలేదు. కానీ లగడపాటి తన రెగ్యులర్ సంస్థతో కలిసి సర్వే చేశారు. ఆ సర్వే ప్రకారం ఈసారి కర్నాటకలో గెలుపు బీజేపీదేనని స్పష్టం చేశారు. ఆ పార్టీకి 110-120 స్థానాలు వస్తాయని అంచనా వేశారు. కాంగ్రెస్ కు 70-80, జేడీఎస్ కు 40వరకూ సీట్లు దక్కుతాయని తేల్చారు. కొంతకాలం వరకూ కాంగ్రెస్ లీడింగ్ లో ఉన్నా.. ఇప్పుడు మాత్రం ఆ పార్టీ వెనుకబడిందని, బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని లగడపాటి సర్వే జోస్యం చెప్పింది. మరి లగడపాటి సర్వే ఏమాత్రం నిజమవుతుందో తెలియాలంటే ఎన్నికలవ్వాల్సిందే... అప్పటి వరకూ వెయిట్ చేయాల్సిందే..

సముద్రం ఒకరి కాలి దగ్గర కూర్చోదు... పర్వతం ఎవ్వరికీ ఒంగి సలాం చేయదు...

  సముద్రం ఒకరి కాలి దగ్గర కూర్చుని మొరగదు.. పర్వతం ఎవ్వరికీ ఒంగి సలాం చేయదు.. మనమంతా పిడికెడు మట్టే కావచ్చు.. కానీ మన జెండా ఎత్తితే.. ఉవ్వెత్తున ఎగసి పడే గుండె ధైర్యం..దేశాన్ని ముందుకు తీసుకెళ్లే ఆత్మగౌరవం నినాదం రెపరెపలాడుతుంటూయి.. ఇవన్నీ యువత గుర్తు పెట్టుకోవాలి.. ఇంతకీ ఈ మాటలు చెబుతున్నది ఎవరనుకుంటున్నారా..? ఇంకెవరూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ది ఫస్ట్ వార్ ఇండియన్ ఇండిపెండెన్స్ మే 10, 1857 సిపాయిల తిరుగుబాటును గుర్తు చేస్తూ.. వైబ్రాంట్స్ ఆఫ్ కలాం అనే స్వచ్ఛంద సంస్థ ఓ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. ఎన్టీఆర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన ప్రపంచంలోనే అతి పెద్ద జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం పవన్ మాట్లాడుతూ... పై వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు.. జాతీయ జెండా అంటే ఓ కులానికో, మతానికో, రాజకీయ పార్టీకో చెందినది కాదన్నారు. స్వలాభం కోసం చాలా మంది రాజకీయాలు చేస్తున్న ప్రస్తుత తరుణంలో యువత ప్రపంచంలోనే అతి పెద్ద జెండాని ఆవిష్కరించే కార్యక్రమాన్ని చేపట్టడం వారి ఔన్నత్యాన్ని చాటి చెబుతోందన్నారు. ఆ తరువాత భారతీయుడినైన నేను.. భారతీయుడిగా పుట్టినందుకు చాలా గర్వపడుతున్నాను అంటూ.. అందరితో కలిసి దేశ భక్తి ప్రతిజ్ఞ చేశారు.

అలా వచ్చింది... చంద్రబాబుపై కామెంట్లు చేసేసింది..

  జనసేన అధినేత పవన్ కల్యాణ్ అంటే ఎంతో అభిమానమని.. ఎంతో ప్రేమ అని చెప్పిన మాధవీ లత అందరికీ షాకిస్తూ బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే.  కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ సమక్షంలో ఆమె బేజీపీ తీర్ధం పుచ్చుకున్నారు. ఇక మాధవీలత చేసిన పనికి అందరూ షాకై..అదేంటీ పవన్ అంటే అభిమానమని చెప్పింది.. ఆయన అవకాశమిస్తే పార్టీలో చేరి ప్రజలకు సేవ చేయడానికి కూడా రెడీ అని చెప్పిన ఆమె ఇంత సడన్ గా బీజేపీలో చేరిపోయిందేంటీ అని అనుకుంటుండగా...ఇక ఆ వార్తలపై స్పందించిన మాధవీ లత..తనకు పవన్ అంటే ఇప్పటికీ అభిమానం ఉందని... కానీ బీజేపీ పార్టీ విధానాలు నచ్చి ఆ పార్టీలో చేరానని చెప్పుకొచ్చింది. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశంలో ఎక్కడైనా సరే బీజేపీ తరఫున ప్రచారం చేయడానికి తాను అన్ని విధాలా సిద్ధంగా ఉన్నానని.. మరీ ముఖ్యంగా తనకు ఏపీ, తెలంగాణల్లోనే కాకుండా జాతీయ స్థాయిలో పని చేయాలనే కోరిక ఉందన్నారు. అంతేకాదు పోటీ గురించి మాట్లాడిన ఆమె.. రెండు రాష్ట్రాల్లో ఎక్కడ పోటీ చేయమన్నా చేస్తానని.. అవకాశం వస్తే తప్పకుండా బరిలోకి దిగుతానని మాధవీ తన మనసులోని మాటను చెప్పారు.   ఇక ఇక్కడి వరకూ బాగానే ఉన్నా... అలా బీజేపీలో చేరిందో లేదో అప్పుడే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిపై కామెంట్లు స్టార్ట్ చేసింది. ఓ చానెల్ లో ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన.. ప్రత్యేక హోదా గురించి మాట్లాడుతూ... ప్రత్యేక హోదా విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నోసార్లు మాట మార్చారు...ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామని చెప్పిన కేంద్ర ప్రభుత్వం ఏపీకి భారీ ఎత్తున నిధులు ఇచ్చింది...కేంద్రం ఇచ్చిన నిధులకు లెక్కలు చెప్పాల్సిన అవసరం లేదా?. పోలవరం ప్రాజెక్టులో భారీగా అవినీతి జరిగింది... లారీ ఇసుక ఎత్తితే రూ. 5 లక్షలు బిల్లు పెట్టారు" అని ఆరోపించింది. దీంతో మాధవీ లత చేసిన వ్యాఖ్యలకు  బీజేపీ నేతలు షాకయ్యారట. నిన్న కాక మొన్నొచ్చిన మాధవీ లతే మనకంటే ఎంతో బెటరని మాట్లాడుకుంటున్నారట. మరి వచ్చీ రాగానే చంద్రబాబునే టార్గెట్ చేసింది.. మరి చంద్రబాబు మీద ఒక్క మాట కూడా పడనివ్వని.. ఆ పార్టీ నేతలు మాధవీ లతకు ఎలా కౌంటర్ ఇస్తారో చూద్దాం..

నేనే ప్రధాని.. ఇంత కాన్ఫిడెంట్ ఎక్కడినుండి వచ్చింది!

  కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి బాగానే ధైర్యం వచ్చినట్టుంది. ఒకప్పుడు అసలు మాట్లాడటమే సరిగ్గా రాని రాహుల్ గత కొద్ది కాలం నుండి తన పంథా మార్చి ప్రధాని మోడీ పై ఓ రేంజ్ లో విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు. గుజరాత్ ఎన్నికల తరువాత అయితే రాహుల్ ను ఏకంగా హీరోనే చేసేశారు కాంగ్రెస్ పార్టీ నేతలు. ఇక ఆతరువాత పార్టీ బాధ్యతలు తీసుకున్న తరువాత తన దూకుడుని ఇంకాస్తా పెంచారు. ఇప్పుడు కర్ణాటక ఎన్నికల్లో అదే దూకుడిని చూపిస్తున్నారు రాహుల్. ఇంకో నాలుగు రోజుల్లో కర్ణాటక ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ ఎన్నికలు అన్ని పార్టీలకు ముఖ్యంగా బీజేపీకి, కాంగ్రెస్ కు కీలకం కావడంతో ఎవరి వ్యూహాల్లో వారు ఉన్నారు. ప్రచార కార్యక్రమాల్లోనే కాదు.. ట్విట్టర్ వేదికగా కూడా బీజేపీ-కాంగ్రెస్ పార్టీ నేతలు విమర్శలు గుప్పించుకుంటున్నారు. ఈ ఎన్నికల ద్వారానే ఇప్పుడు ప్రధానిగా ఉన్న మోడీ భవిత్యంపై కానీ... ప్రధాని అభ్యర్ధి రేసులో ఉన్న రాహుల్ భవితవ్యం కానీ ఆధారపడి ఉంది. ఇలాంటి నేపథ్యంలో రాహుల్ కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు.   కర్ణాటక ప్రచారంలో భాగంగా మీడియాతో మాట్లాడిన ఆయన...2019లో కాంగ్రెస్ అతిపెద్ద పార్టీగా ఆవిర్భవిస్తే తానే ప్రధాని అవుతానన్నారు. ‘‘2019 ఎన్నికల్లో కాంగ్రెస్ అతిపెద్ద పార్టీగా ఆవిర్భవిస్తే నేనే ప్రధాని అవుతానేమో. అందులో తప్పేముంది’’ అని రాహుల్ గాంధీ అన్నారు.  అవినీతికి పాల్పడిన వ్యక్తిని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎందుకు ప్రకటించారో ప్రధాని మోదీ ముందు సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. 5 వేల కోట్లు దోచుకున్న రెడ్డి సోదరులకు, రెడ్డి వర్గానికి ఆయన 8 సీట్లు ఎలా ఇచ్చారో వివరణ ఇవ్వాలని అన్నారు. అధికారంలోకి వచ్చి ఐదేళ్లు గడుస్తున్నా ఇంత వరకూ యువతకు ఉపాధి ఎందుకు కల్పించలేదని ప్రశ్నించారు. ఇక రాహుల్ ఇంత ధైర్యంగా నేనే ప్రధాని అవుతా అని అనడంతో.. రాహుల్ కు ఇంత కాన్ఫిడెంట్ ఎక్కడినుండి వచ్చిందని పార్టీ నేతలే షాకవుతున్నారట. అంతేకాదు రాహుల్ కూడా కాంగ్రెస్ తరపున ప్రధాని నేనే అని ఇంకెవరికీ ఆ ఛాయిస్ లేదని చెప్పకనే చెప్పారు అని అనుకుంటున్నారు. మరి చూద్దాం.. రాహుల్ కల ఎప్పుడు నెరవేరుతుందో...

కన్నాకు ఆఫర్స్... మళ్లీ కన్ఫ్యూజన్

  కన్నా లక్ష్మీ నారాయణ మళ్లీ కన్ఫ్యూజన్ లో పడినట్టు తెలుస్తోంది. ముందు బీజేపీ నుండి వైసీపీ లోకి జంప్ అవుదామని చూసిన కన్నాకు అమిత్ షా నుండి ఫోన్ రావడం ఆ తరువాత  ఆకస్మికంగా బీపీ పెరిగిందంటూ ఆస్పత్రిలో చేరి.. ‘జంపింగ్’ ఎపిసోడ్ కి కొంత విరామం ఇవ్వడం జరిగింది. ఆ తరువాత మళ్లీ కన్నా టీడీపీకి జంప్ అవుతున్నట్టు వార్తలు వచ్చాయి. చంద్రబాబుతో చెప్పి మంచి ‘రోల్’ ఇప్పిస్తామంటూ టీడీపీ నేతల నుంచి లాబీయింగ్ జరిగింది. ఇక రేపో మాపో కన్నా టీడీపీలో చేరుతారు అనుకునే లోపే మళ్లీ కన్నా ఆలోచనలో పడ్డట్టు తెలుస్తోంది. బీజేపీలోనే కొనసాగమని కమలం నేతలు ఒత్తిడి తెస్తున్నట్టు తెలుస్తోంది. మరోవైపు  వైసీపీ నుంచి సైతం కొన్ని ప్రెజర్ గ్రూప్స్ కసరత్తు మొదలుపెట్టేశాయి. ఒక ముహూర్తం దాటిపోతేపోయింది.. మరో ముహూర్తం పెట్టుకుందాం అంటూ జగన్ క్యాంపు నుంచి కన్నా మీద ఒత్తిడి షురూ అయ్యిందట. ఇక దీంతో ప్రధాన పార్టీలన్నీ ఆఫర్స్ మీద ఆఫర్స్ ఇవ్వడంతో కన్నా బుర్ర మరింత వేడెక్కిపోయిందట.. అంతేకాదు.....హైదరాబాద్ వెళ్లి బీపీ చెక్ చేయించుకుని.. తిరిగొచ్చిన తర్వాత ‘తన భవిష్యత్ కార్యాచరణ’ ప్రకటిస్తానని కన్నా సున్నితంగా ఎస్కేప్ అవుతున్నారట. మొత్తం మీద కన్నాకు ఆఫర్స్ మీద అఫర్స్ వస్తున్నాయి. మరి ఆఖరికి కన్నా ఏం నిర్ణయం తీసుకుంటారో చూద్దాం..!

మోడీ పరువు అడ్డంగా తీసేస్తున్నారుగా..!

అనుకున్నదొక్కటి.. అయినదొక్కటి... అన్నట్టు ఉంది  కేంద్ర మంత్రి విజయ్‌ సంపాలా పరిస్థితి ఇప్పుడు. పాపం ప్రధాని మోడీ గురించి గొప్పగా చెప్పలనుకున్నారు.. కానీ అది కాస్త బెడిగికొట్టింది. దీంతో పొగడ్తలు సంగతి పక్కపెడితే విమర్శలు మాత్రం కురిపిస్తున్నారు. ఇంతకీ విజయ్ సంపాలా చేసిన పని ఏంటనుకుంటున్నారా..? అసలు సంగతేంటంటే.. మన ప్రియతమ ప్రధానమంత్రి తల్లి హీరాబెన్ మోదీ ఇప్పటికీ ఆటోలోనే ప్రయాణిస్తున్నారంటూ విజయ్‌ సంపాలా తన ట్విట్టర్‌ ఖాతాలో ఓ ఫొటో పోస్ట్ చేశారు. పోనీ అక్కడితో ఆగారా అంటే అదీ లేదు...రాహుల్‌ గాంధీ తల్లి సోనియా గాంధీపై  విమర్శలు చేశారు. ఆమె ప్రపంచంలోనే ధనిక నేతల్లో నాలుగో స్థానంలో ఉన్నారని కామెంట్ చేశారు. ఇంకేముంది బీజేపీ నేతలు మోడీని ప్రశంసించే పనిలో పడ్డారు. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. సదరు మంత్రిగారు పెట్టిన ఈ ఫొటో మార్ఫింగ్ చేసిన ఫొటో అని గుర్తుపట్టేశారు నెటిజన్లు.  మోడీ తల్లి ఆటో ఫోటోలో.. ఆమె భుజాన్ని మరో చేయి పట్టుకున్నట్లుగా ఉండటంతో అది మార్ఫింగ్ ఫోటోగా తేలిపోయింది.   అంతే ఇంక నెటిజనల్లు ఆయనపై కామెంట్లు స్టార్ట్ చేశారు. మార్ఫింగ్ ఫోటోలు పెట్టి దొంగ ప్రచారం చేసుకుంటారా? అంటూ తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. మరోవైపు, ఆ ఫోటో నిజమైతే.. మోదీ కనీసం తల్లిని కూడా పట్టించుకోవట్లేదా? అని కొందరు విమర్శిస్తున్నారు. అంతేకాదు గత ఎన్నికల సమయంలోనూ చిన్నతనంలో మోడీ టీ అమ్మారంటూ.. పేదవాడిని అంటూ.. టీ అమ్మే వ్యక్తి ప్రధాని కాకుడదా అంటూ సెంటిమెంట్ తో ప్రచారం చేసి అధికారాన్ని చేపట్టారు. ఇక ఇప్పుడు కూడా ఇలాంటి ప్రచారాలే మొదలుపెట్టారు. కానీ కాంగ్రెస్ నేతల్ని టార్గెట్ చేసే క్రమంలో అత్యుత్సాహంతో తమ నాయకుడు కమ్ ప్రధానిని ఆకాశానికి ఎత్తేసే క్రమంలో పప్పులో కాలేస్తూ చిక్కులు తెచ్చుకుంటున్నారు. మోడీ ఇమేజ్ కు భారీగా దెబ్బ పడేలా చేస్తున్నారు. మరి నేతలు బీజేపీ నేతలు అత్యుత్సాహం కాస్త తగ్గించుకుంటే బెటర్ లేకపోతే మొదటికే మోసం వస్తుంది...

పురంధీశ్వరీకి షాకిచ్చిన ఓటర్....అన్యాయం చేసే పార్టీలతోనే ఎందుకుంటున్నారమ్మా?

  త్వరలో కర్ణాటక ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఇక ఈ ఎన్నికలు అన్ని పార్టీలకు కీలకంగా మారడంతో.. పార్టీలన్నీ కలిసి ఎలాగైనా ఎన్నికల్లో గెలవాలని తెగ కష్టపడుతున్నారు. దీనిలో భాగంగానే ప్రచార కార్యక్రమాల్లో బిజీ.. బిజీగా పాల్గొంటున్నారు. అంతేకాదు ఈ ప్రచార కార్యక్రమాల్లో మన ఏపీ నేతలు కూడా పాల్గొంటున్నారు. అలా ప్రచార కార్యక్రమానికి వెళ్లిన బీజేపీ నేత పురంధీశ్వరీకి ఓ షాక్ తగిలింది. ఇంతకీ ఆ షాక్ ఏంటనుకుంటున్నారా..? అసలు సంగతేంటంటే..  రాయచూరు జిల్లాలో నిర్వహించిన ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న పురంధీశ్వరీని ఓ ఓటర్ ఓ ప్రశ్న అడిగాడు...  ‘అమ్మా… గత ఎన్నికలలో ఇక్కడకు వచ్చి కాంగ్రెస్ కు ఓటేయమన్నారు… ఇప్పుడు వచ్చి బిజెపికి ఓటేయమంటున్నారు. ఏపీకి అన్యాయం చేసే పార్టీలతోనే ఎప్పుడు ఎందుకుంటున్నారమ్మా?’ అంటూ అవాక్కయ్యే ప్రశ్న వేసాడు. ఇక ఆ ఓటర్ అడిగిన ప్రశ్నకు షాకైన పురంధీశ్వరీ తేరుకొని సమాధానం చెప్పుకున్న ఇచ్చుకునే ప్రయత్నం చేశారు. అయితే మళ్లీ ఆ ఓటరు...‘మాది గుడివాడ, మీ నాన్న గారు పార్టీ స్థాపించినపుడు జెండా మోసా, ఆ అభిమానంతోనే అడుగుతున్నా, వేరొకర్ని అయితే అడిగేవాడ్ని కాదు’ అంటూ మరో చురక అంటించారు. దీంతో ఏం సమాధానం చెప్పుకోవాలో తెలియక..  ‘న్యాయం చేసే పార్టీలకే ఓటు వేయాలని, తనది రాజకీయం కాదని’ ఓ ముక్క చెప్పి అక్కడ నుండి వెళ్లిపోయినట్లుగా సమాచారం. మొత్తానికి బీజేపీ నేతలకు ఒకదాని తరువాత ఒకటి ఎదురుదెబ్బలు తగులుతూనే ఉన్నాయి. మరి ఇంత వ్యతిరేకతను మూటగట్టుకున్న బీజేపీ ఈ ఎన్నికల్లో ఎంత వరకూ విజయం సాధిస్తుందో చూద్దాం...

వారికి భూమిపై అదే చివరి రోజు..

గుంటూరుజిల్లా దాచేపల్లిలో జరిగిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే కదా. తొమ్మిదేళ్ల చిన్నారిపై..సుబ్బయ్య అనే వ్యక్తి అత్యాచారం చేయడంతో దాచేపల్లిలో స్థానికులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేశారు. నిందితుడిని పట్టుకోవాలని.. కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఇక ఒకపక్క ఆందోళనలు చేస్తుంటే.. మరోపక్క నిందితుడు సుబ్బయ్య ఆత్మహత్య చేసుకున్నట్టు తెలిసింది. దీంతో సుబ్బయ్య మృతదేహాన్ని తమకు అప్పగించాలని.. నడిరోడ్డుపై కాల్చాలని బాధితురాలి కుటుంబసభ్యులు డిమాండ్ చేశారు.   ఇక ఇప్పుడు ఈ ఘటనపై స్పందించిన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నాగరిక సమాజంలో బతికేటప్పుడు మనుషులకు భయం కూడా ఉండాలని హెచ్చరించారు. ఈరోజు గుంటూరు ఆస్పత్రిలో బాధితురాలిని పరామర్శించిన ఆయన మాట్లాడుతూ.. దాచేపల్లి ఘటన తనను తీవ్రంగా కలచివేసిందని, ఇలాంటి ఘటనలు ఇకపై జరగడానికి వీల్లేదని ఆయన తెలిపారు. ఇలాంటి తప్పులు చేసేవారికి ఈ భూమ్మిద అదే చివరి రోజు అవుతుందని ఆయన హెచ్చరించారు. అలాంటి నీచులకు రాష్ట్రంలో నివసించే హక్కులేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.   ‘మనిషి మనిషిగా బతకాలి... మనుషుల్లో మానసిక పరివర్తన రావాలి... దీనిపై పెద్ద ఎత్తున చర్చ జరగాలని సూచించారు. అంతేకాదు... అమ్మాయిలకు సంఘీభావంగా రాష్ట్రవ్యాప్తంగా సోమవారం ‘ఆడబిడ్డల రక్షణకు కదులుదాం’ కార్యక్రమాన్ని నిర్వహించాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. నీచమైన నేరాలను అందరూ ఖండించాలని, ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని ఆయన సూచించారు. ప్రతి మండల కేంద్రంలో ఆ మండలంలోని పోలీస్ స్టేషన్ వరకు ర్యాలీ నిర్వహించాలని సూచించారు.

టీడీపీ తమ్ముళ్లు ముందు వీటికి సమాధానం చెప్పండి....

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తమ పార్టీ ఎన్నికల వ్యూహకర్తగా దేవ్ ను నియమించిన సంగతి తెలిసిందే. ఇక ఎప్పుడుతే దేవ్ ని నియమిస్తున్నట్టు ప్రకటించారో అప్పటినుండి దేవ్ గురించి ఎన్నో ఆసక్తికర విషయాలు బయటకు వచ్చాయి. దేవ్ అస‌లు పేరు ఏమనగా.. వాసుదేవ్‌ అని...పుట్టింది, పెరిగింది కేరాఫ్ చింత‌ల్ బ‌స్తీ అని.. తెలుగులో మాట్లాడ‌టం భేషుగ్గా వ‌చ్చని వార్తలు వచ్చాయి. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే... గ‌తంలో ఈయ‌న భారతీయ జ‌న‌తా పార్టీకి ప్ర‌తినిధిగా కూడా ప‌నిచేశారని.. అంతే కాదు.. ఈయ‌న తెలంగాణ కాంగ్రెస్ నాయ‌కుడు దామోద‌ర్ రాజ‌న‌ర‌సింహ‌కి బంధువు అని పలు ఆసక్తికర విషయాలు బయటపడ్డాయి. దీంతో మరోసారి పవన్ వెనుక బీజేపీ ఉందని వార్తలు వచ్చాయి. ఇత టీడీపీ బీజేపీనే దేవ్ ను పంపిందని అన్నారు. ఇక తనపై వస్తున్న వార్తలపై స్పందించిన దేవ్.. టీడీపీకి ఓ బహిరంగ లేఖ రాసినట్టు తెలుస్తోంది..   ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు కూడా మొదట కాంగ్రెస్ పార్టీ ఉండేవారు... ఇప్పుడు తెలుగుదేశంలో ఉన్నారు. అంటే టీడీపీ వెనకాల కాంగ్రెస్ ఉన్నట్టా..? రాష్ట్ర విభజనని తెలుగుదేశం పార్టీనే కాంగ్రెస్ పార్టీ చేత చేయించిందా..? ఎన్టీఆర్ గారి కూతురు పురుంధరేశ్వరి బీజేపీలో ఉన్నాయి.. అంటే బీజేపీ-టీడీపీ ఇంకా కలిసిఉన్నట్టేనా.. రెండూ కలిసి ఏపీకి ప్రత్యేక హోదా రాకుండా నాటకాలు ఆడుతున్నాయా..? ఎన్టీఆర్ లక్ష్మీపార్వతిని రెండో పెళ్లి చేసుకున్నారు.. ఇప్పుడు ఆమె వైసీపీలో ఉన్నారు.. అంటే వైసీపీ-టీడీపీకి పోలవరంలో జరుగుతున్న అవినీతిలో భాగస్వామం ఉందా...? అని ముందు వీటికి క్లారిటీ ఇవ్వాలని కోరినట్టు తెలుస్తోంది. మరి దేవ్ వ్యాఖ్యలపై టీడీపీ ఎలా స్పందిస్తుందో చూద్దాం.

టీడీపీలోకి రఘురామ కృష్ణరాజు.. జగన్ కు మొగుడు... కేవీపీకి వియ్యంకుడు..

  ఎన్నికలు దగ్గర పడుతున్నకొద్దీ పార్టీ ఫిరాయింపులు కూడా జోరుగా సాగుతున్నాయి. టీడీపీలో అసంతృప్తిగా ఉన్న నేతలు వైసీపీలోకి.. వైసీపీపై అసంతృప్తితో ఉన్న నేతలు టీడీపీలోకి జంప్ అవుతున్నారు. ఇక ఇప్పుడు తాజాగా మరోనేత టీడీపీలో చేరడానికి సిద్దంగా ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. ఆయన ఎవరో కాదు ప్రముఖ పారిశ్రామికవేత్త రఘురామ కృష్ణరాజు. స్వయానా కేవీపీ రామచంద్రారావు వియ్యంకుడు. పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన రఘురామ కృష్ణరాజు కొన్నాళ్లుగా వైసీపీలో ఉన్నారు. ఇక వైసీపీలో ఉంటే జగన్ జగన్ చెప్పుచేతల్లోనే ఉండాలి. జగన్ మాటను కాదని ఏం చేయడానికి కుదరదు. నిజానికి జగన్ తీరు నచ్చకే చాలా మంది నేతలు వేరే పార్టీలోకి వెళుతుంటారు. కొంతమంది మాత్రం ఏం చేయలేక సెలైంట్ కాలం వెళ్లదీస్తుంటారు. కానీ రఘురామ రాజు మాత్రం అలా చేయలేదు. జగన్ వైఖరి భరించలేక పార్టీ నుండి బయటకు వచ్చేశాడు. అంతేకాదు.. తాను భయటకు వచ్చేప్పుడు మీడియాతో మాట్లాడుతూ జగన్ వైఖరిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. జగన్ జనాల్లో ఉన్నప్పుడు రామాచారిలా, సెయింట్ లా కనిపిస్తాడు.. పార్టీ నేతల ముందు మాత్రం జుట్టు విదిల్చిన అపరిచితుడిలా ఉంటాడని... నా పరిస్థితి ఎలా అయిందంటే పౌరాణిక సినిమా చూద్దామని థియేటర్ కి వెళ్లి షకీలా సినిమా చూసినట్టుయిందని.. ఇంకా చాలా కామెంట్లే చేశారు. దీంతో రగిలిపోయిన జగన్ వైసీపీ నుండి సస్పెండ్ చేశారు. ఇక అప్పటినుండి జగన్ రఘురామ కృష్ణరాజు పేరు చెబితెనే మండిపోతుంటారు. ఇక ఆతరువాత రఘురామ కృష్ణరాజు బీజేపీ పార్టీలో చేరారు. అక్కడ తగిన ప్రాధాన్యం లేకపోవడంతో పార్టీ నుండి బయటకు వచ్చేశారు.   ఇక ఇప్పుడు ఈయన టీడీపీలో చేరబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. నిజానికి ఈయన గత ఎన్నికల్లోనే టీడీపీలో చేరి నర్సాపురం నుండి పోటీ చేయడానికి రంగం సిద్దం అయ్యారు. కానీ అప్పుడు బీజేపీ-టీడీపీ తో పొత్తు పెట్టుకోవడంతో.. ఆసీటు గోకరాజు రంగరాజుకు ఇవ్వాల్సి వచ్చింది. అయితే ఇక ఇప్పుడు రెండు పార్టీలకు చెడింది. వచ్చే ఎన్నికల్లో బీజేపీ-టీడీపీ పొత్తు పెట్టుకునే ఛాన్స్ లేదు. దీంతో రఘురామ రాజుకు ఈసారి ఆ అవకాశం దక్కింది. మరి వైసీపీ లో ఉండి బయటకు వచ్చినప్పుడే జగన్ పై ఓ రేంజ్ లో విరుచుకుపడ్డారు. అలాంటిది ఇప్పుడు ఆయన ఏకంగా టీడీపీలోకి చేరుతున్నారు. అలాంటిది... ఇప్పుడు జగన్ పై ఏ రేంజ్లో కామెంట్లు విసురుతారో చూడాలి. ఇదిలా ఉండగా రఘురామ రాజు టీడీపీలోకి చేరుతున్నారన్న వార్తలు రావడంతో.. జగన్ కు సరైన మొగుడు ఈయనే అని అప్పుడే సెటైర్లు మొదలయ్యాయి. మరి చూద్దాం జగన్ కు రఘురామ రాజు ముందు ముందు ఎలాంటి కౌంటర్లు వేస్తాడో..

మీ వయసెంత మోదీజీ.. సిగ్గుగా లేదా....!

  విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్ బీజేపీపై విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు. తాజాగా మరోసారి మోడీపై విమర్శలు ఆయన గుప్పించారు.  ఈరోజు ‘ప్రజాస్వామ్య రక్షణ కోసం’ పేరిట ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ...‘ప్రధాని మోదీ గారూ..! 2019 తర్వాత దేశంలో మీకు అంతగా పనేం ఉండదు. కర్ణాటక వచ్చేస్తే మా వాళ్లు కూర్చోబెట్టి కన్నడ భాష నేర్పిస్తారు. ఏమిటండీ.. ఎన్నికల ప్రచార సభల్లో మీ కన్నడ ప్రసంగం..!’ అని...రాష్ట్రంలో నాలుగైదు సభల్లో మోదీ మాట్లాడిన కన్నడ ప్రసంగాన్ని అనుకరించి చూపించారు. ఏమిటండీ ఈ భాష కాయగూరలు అమ్మినట్లు అని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ‘నాకేం భయంలేదు... ఈ భాజపావాళ్లు నన్నేమీ చేయలేరు. నేను ఏ పార్టీ వ్యక్తిని కాను’..భాజపా నాయకులు తమది ప్రభంజనమని చెబుతూ.. సునామీ, ప్రళయాలతో పోల్చుకుంటున్నారు. సునామీలు దేశానికేమైనా మంచివా? అని ప్రశ్నించారు. రాహుల్‌గాంధీ ప్రసంగంతో పోటీ పడుతున్న మోదీని ప్రకాష్‌ తీవ్రంగా విమర్శించారు. ‘రాహుల్‌ వయసెంత..మీ వయసెంత మోదీజీ.. సిగ్గుగా లేదా’ అని అన్నారు. ‘ఈ నెల 15న కర్ణాటక ఎన్నికల ఫలితాలే చెబుతాయి. ఇక్కడ మీ ప్రతాపం ఎంతుందో? ఇక్కడి నుంచే భాజపా పతనం ఆరంభమవుతుంది’ అని జోస్యం చెప్పారు.

జగనే సీఎం..రాజు గారు ఏమన్నా చెప్పారా... !

  బీజేపీ-టీడీపీ మధ్య ప్రస్తుతం పచ్చగడ్డివేస్తేనే భగ్గుమనే పరిస్థితులు నెలకొన్నాయి. మిత్రపక్షంగా ఉన్నప్పుడే రెండు పార్టీల నేతల మధ్య మాటల యుద్దం జరుగుతూ ఉండేది. ఇక ప్రత్యేక హోదా నేపథ్యంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు బీజేపీ నుండి విడిపోయి వార్ ప్రకటించేశారు. మోడీని టార్గెట్ చేస్తూ... ఏదో ఒక కౌంటర్ ఇస్తూనే ఉన్నారు. దీంతో ఈ మాటల యుద్దం ఇంకా తారాస్థాయికి చేరింది అని చెప్పొచ్చు. ఇక సోము వీర్రాజు లాంటి వాళ్లయితే రెచ్చిపోయి మరీ మాట్లాడేస్తుంటారు. ఇక ఈ రెండు పార్టీలు విడిపోయిన నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో వైసీపీ-బీజేపీ పార్టీలు పొత్తు పెట్టుకుంటాయని.. అందుకే జగన్ చంద్రబాబును విమర్సిస్తున్నారే తప్పా.. ప్రత్యేక హోదా ఇవ్వకుండా మోసం చేసిన మోడీని మాత్రం పల్లెత్తు మాట కూడా అనడం లేదని టీడీపీ నేతలు కూడా ఆరోపిస్తూనే ఉన్నారు. అంతేకాదు కాస్త రాజకీయ అనుభవం ఉన్న ఎవరైనా బీజేపీతో పొత్తు కోసం జగన్ చూస్తున్నాడన్న విషయం ఇట్టే అర్దమైపోతుంది.   ఇక ఇవన్నీ ఒక ఎత్తైతే.. ఈ వ్యాఖ్యలను నిజం చేస్తున్నట్టు ఉన్నాయి బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు చేసిన వ్యాఖ్యలు..  తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారిని దర్శించుకున్న ఈయన మీడియాతో మాట్లాడుతూ... ఎప్పటిలాగే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు. చంద్రబాబు గ్రాఫ్ పడిపోయిందని, రానున్న రోజుల్లో పూర్తిగా పడిపోతుందని ఆయన అన్నారు.ఓటుకు నోటు కేసులో అడ్డంగా బుక్కైన చంద్రబాబు... హైదరాబాదులో ఉంటే ఇబ్బందులు వస్తాయని భావించి, అక్కడి నుంచి పారిపోయి వచ్చి, విజయవాడలో మకాం పెట్టారని విష్ణు అన్నారు. ఇప్పుడు బీజేపీకి ఓటు వేయవద్దని కర్ణాటకలోని తెలుగువారికి ఆయన పిలుపునిస్తున్నారని ఆయన మండిపడ్డారు. చంద్రబాబు పిలుపు ఇవ్వాలనుకుంటే ఆయన చుట్టాలకు ఇచ్చుకోవాలని ఎద్దేవా చేశారు. చంద్రబాబు పిలుపుతో కర్ణాటకలో ఉన్న తెలుగువారు ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఉందని చెప్పారు. టీడీపీ పూర్తిగా అవినీతిలో కూరుకుపోయిందని... త్వరలోనే అవినీతిని బయటపెడతామని చెప్పారు. అంతేనా అక్కడితో ఆగకుండా 2019 ఎన్నికల్లో వైసీపీ విజయ సాధిస్తుందని, జగన్ ముఖ్యమంత్రి అవుతారని ఆయన జోస్యం చెప్పారు. మరి సీఎం కావాలని ఎంతో ఆశగా ఉన్న జగన్ కనుక రాజు గారి మాటలు వింటే ఫుల్ కుషీ అవుతారేమో.. మరి ఏకంగా వైసీపీ నే గెలుస్తుందని... చెప్పి.. వైసీపీ-టీడీపీ రెండు పార్టీలు వచ్చే ఎన్నికల్లో పొత్తు పెట్టుకుంటాయని ఇన్ డైరెక్ట్ గా చెప్పినట్టున్నారు. చూద్దాం మరి ఏం జరుగుతుందో...