అవిశ్వాసం వీగిపోయినా చంద్రబాబు దిల్లీకి ఎందుకు వెళ్లారు?

చంద్రబాబు దిల్లీ వెళ్లారు. దీన్ని కూడా కొందరు విమర్శిస్తున్నారు. కొందరైతే వెటకారాలు కూడా చేస్తున్నారు. అవిశ్వాస తీర్మానం వీగిపోవటంతో ఏపీ సీఎం మరో విధంగా హడావిడి చేస్తున్నారని ప్రచారం సాగుతోంది. కానీ, నిన్నే పార్లమెంట్లో చర్చతో వేడెక్కిన దిల్లీకి ఇవాళ్ల చంద్రబాబు ఎందుకు వెళ్లారు? జగన్ చెప్పినట్టు అమరావతిలో కూర్చునే జాతీయ మీడియా దృష్టిని ఆకర్షించవచ్చు కదా? టీడీపీ ఎమ్మెల్యేలతో చేత కూడా పార్లమెంట్ సమావేశాలు సాగుతుండగానే రాజీనామాలు చేయించి నిరాహార దీక్షలు చేయవచ్చు కదా?     చంద్రబాబు దిల్లీ టూర్ ఊరికే చేస్తున్నదేం కాదు. ప్రత్యేక హోదా విషయంలో సభలో చేయాల్సింది అంతా చేసేశాం. ఇప్పుడిక పార్లమెంట్ వెలుపల జరగాల్సిందే మిగిలి వుంది. ప్రత్యేక హోదా రాలేదు. మోదీ ఇవ్వనని తేల్చేశారు. మరి ఎలా? చంద్రబాబు ఒకటి కావాలని నిర్ణయించుకున్నాకా వెనక్కి తగ్గరు కదా! అదీ ఆంధ్ర ప్రజలకు మంచి చేసేది అయితే ఆయన ఏనాడూ మడమ తిప్పరు. అందుకే, ఇప్పుడు మరో పంథాలో ముందుకు సాగుతున్నారు. ఎన్నికల ముందు జరుగుతోన్న కీలక పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో బాబు చక్రం తిప్పుతున్నారు.     మోదీ ఒకవేళ ముందస్తుకు సై అంటే ఇప్పుడు జరుగుతోన్న లోక్ సభ సమావేశాలే చివరివి కూడా కావచ్చు. అందుకే, హుటాహుటిన దిల్లీ చేరుకున్న చంద్రబాబు జాతీయ మీడియా ముందు ఏపీ బాధని వెల్లడించారు. ఇప్పుడైతేనే నేషనల్ మీడియా పూర్తి స్థాయి దృష్టి పెడుతుంది. పార్లమెంట్ సమావేశాలు ముగిసిపోతే ఏపీ ప్రత్యేక హోదా అంశం స్థానిక సమస్యగా భావిస్తాయి ఇంగ్లీషు, హిందీ మీడియా సంస్థులు. అందుకే, చంద్రబాబు ఇదే సమయాన్ని తెలివిగా వాడుకుంటున్నారు. సమస్యని ఏక కాలంలో మీడియా, ఉత్తరాది పార్టీలు అన్నిటి దృష్టికి తీసుకుపోతున్నారు. ఏపీ స్పెషల్ స్టేటస్ ఇష్యూ ఎంతగా ఇంగ్లీష్, హిందీ ఛానల్స్ లో మార్మోగితే అంత ఇబ్బంది మోదీకి. అలాగే, ఈ సమస్యపై టీడీపీ ఆక్రోశాన్ని, ఆగ్రహాన్ని ఇతర పార్టీలు ఎంతగా గుర్తిస్తే అంత మంచిది భవిష్యత్ లో. రానున్న ఎన్నికల్లో ఫలితాలు ఎలాగైనా వుండవచ్చు. అవిశ్వాస తీర్మానంలో గెలిచినప్పటికీ మోదీ 2019 ఓటర్ల తీర్పులో గెలిచేస్తారని చెప్పలేం. అప్పుడు మోదీ వ్యతిరేక పార్టీలదే కీలక పాత్ర అవుతుంది. ఆప్ , టీఎంసీ, బీఎస్పీ, ఎస్పీ… ఇలా అనేక పార్టీలు మోదీపై గుస్సాగా వున్నాయి. ఆయా పార్టీలతో వ్యూహ రచన చేయాలంటే బాబు దిల్లీలో వుండటం ఇప్పడు తప్సనిసరి. అందుకే, చంద్రబాబు నేరుగా రాజధాని చేరి రాజకీయం చేస్తున్నారు.     ఇప్పటికిప్పుడు హోదా ఇవ్వకపోవటాన్ని ఎత్తి చూపటం, మెజార్టీ వర్సెస్ మోరాలిటి అంటూ నినదించటం ఒక కోణం. రానున్న కాలంలో మోదీ వ్యతిరేక శిబిరంలో కీలకంగా మారి అలాగైనా ఏపీకి లాభం రాబట్టుకోవటం మరో కోణం! ఇదీ సింపుల్ గా చెప్పుకుంటే చంద్రబాబు దిల్లీ టూర్ సారాంశం…

గాడి తప్పిన పాక్ లో… ఓ గాడిద బతుకు!

  మన దేశంలో జరిగే బోలెడు ఉప ఎన్నికలు, స్థానిక ఎన్నికలు, అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు జరుగుతుంటాయి. మధ్యలో అవిశ్వాస తీర్మానం పేరున లోక్ సభలోనూ ఓటింగ్ హడావిడి నడిచింది. వీటన్నటి మధ్యా అంతర్జాతీయ వ్యవహారాలు పెద్దగా ఆసక్తి లేని వారు పట్టించుకోకుండా వదిలేస్తోన్న ఎలక్షన్స్ త్వరలో జరగబోతున్నాయి. అవే పాకిస్తాన్ జాతీయ ఎన్నికలు! ఈ మాట వినగానే భారతీయులు ఎవరైనా నవ్వేసి ఊరుకునే ప్రమాదమే వుంది. అలాంటి స్థితి మన పక్క దేశంలో నెలకొని వుంటుంది. 1947లొనే స్వతంత్రం పొంది ఇండియాతో పాటూ ఏర్పడ్డప్పటికీ పాకిస్తాన్ దారుణమైన స్థితిలో వుంది. ఇండియా చంద్రుడ్ని, అంగారకుడ్ని చేరుకుంటూ వుంటే పాకిస్తాన్ కాశ్మీర్ లో కాలుపెట్టడానికి ఉగ్రవాదుల్ని తయారు చేయటంలోనే మునిగిపోయింది. దీనికి కారణం పాక్ లోని మతోన్మాదం, ఆ మతోన్మాదాన్ని వాడుకునే అక్కడి మిలటరీ. పాక్ సైన్యం చేతిలోనే ఆ దేశం అధికారం మగ్గిపోతూ వుంటుంది. ప్రధాని వున్నా, నియంతలు పాలించినా! అందుకే, పాక్ ఎన్నికలు అంటే ఎవ్వరూ పెద్దగా ఆసక్తి చూపరు…   పాకిస్తాన్ ఎన్నికల్ని మనం పెద్దగా పట్టించుకోకున్నా ఈ మద్య జరిగిన ఒక నికృష్టమైన దాడిని మాత్రం తప్పక మాట్లాడుకోవాలి. ఎన్నికల సందర్భంగా దాడి అంటే అదేదో మానవ బాంబు దాడి అనుకోకండి. అవి కూడా పాకిస్తాన్ లో సర్వ సాధారణం అయిపోయాయి. ఈ ఎన్నికల సందర్భంగానే బాంబు పేలుళ్లలో వందల మంది చనిపోయారు. అది పక్కన పెడితే కొందరు ఆగంతకులు కరాచీ నగరంలో ఓ రాత్రి పూట ఒక గాడిదని చిత్రవధ చేశారు. ఎంత దారుణంగా అంటే… గాడిద ముక్కుపుటాలు విరిచేశారు. ఎముకలు విరిగేలా చావబాదారు. కార్ తో గాడిదని ఢీకొట్టి నుజ్జునుజ్జు చేశారు! ఎందుకు? సమాధానం వింటే పాకిస్తాన్ లో రాజ్యమేలుతోన్న ఉన్మాదం ఎంతో అవగాహనకు వస్తుంది!     పాకిస్తాన్ ఎన్నికల్లో తరువాతి ప్రధానిగా మాజీ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్ ఫుల్ గా ప్రచారం అవుతున్నాడు. అతడికే మిలటరీ సపోర్ట్ కూడా వుండటంతో గెలవటం దాదాపు ఖాయం అయిపోయినట్టే. అతను ప్రధాని అవుతాడో కాడోగానీ… ఇమ్రాన్ ఖాన్ ఓ మాటన్నాడు. ఎన్నికల ప్రచారంలో నవాజ్ షరీఫ్ మద్దతుదారులు గాడిదలు అన్నాడు! అదే గుర్తుతెలియని ఉన్మాదుల నికృష్ట ప్రవర్తనకి కారణం! రాత్రి వేళ ఘారాతి ఘోరంగా గాడిదని హింసించి దాని ఒంటిపై నవాజ్ అని కత్తితో చెక్కి… రోడ్డు పక్కన చావటానికి వదిలేసి వెళ్లిపోయారు.   బహుశా ఇమ్రాన్ ఖాన్ పార్టీ తెహ్రీక్ ఏ ఇన్సాఫ్ సభ్యులని అనుమానిస్తున్న సాడిస్టులు ఇంత వరకూ దొరకలేదు. మనుషుల్నే కుక్కల్లా కాల్చి చంపే పాకిస్తాన్ లో గాడిదని ఎవరు పట్టించుకుంటారు? అలా దారిన పోతున్న ఒకాయన రక్తం కక్కుతూ చచ్చిపోతున్న గాడిదని చూసి ఫేస్బుక్ లో పోస్టు పెట్టి ఎవరైనా సాయం చేయండని అభ్యర్థించాడు. ఒక స్వచ్ఛంద సంస్థ వారొచ్చి గాడిదకి ఫస్ట్ ఎయిడ్ చేసి ప్రస్తుతం వైద్యం చేయిస్తున్నారు. సగటు పాకిస్తానీల ఉన్మాదానికి బలైన ఆ గాడిద ఇంకా లేచి నిలబడి తిరగలేకపోతోంది. బతికే చాన్స్ వుందని వైద్యులు కూడా చెప్పలేకపోతున్నారు!   మనుషుల్నే మతోన్మాదంతో , డబ్బుల కోసం, అధికారం కోసం, అర్థంపర్థం లేని పగతో చంపేసే పాకిస్తాన్ లో గాడిద బతికినా చచ్చినా పెద్దగా తేడా ఏం వుండబోదు. కానీ, అసలు విషాదం ఏంటంటే… పాక్ లోని ఆర్మీ, పాలకులు, తాజాగా అధికారులు, న్యాయ వ్యవస్థలోని వారు అందరూ … మొత్తం వ్యవస్థనే గాడిదని చేశారు. తమకు ఇష్టం వచ్చినట్టు ఇష్టం వచ్చిన దిశ నుంచీ హింసిస్తున్నారు. అటువంటి పాక్ లో సామాన్య జనం బతుకులు మాత్రం… ఎన్ని ఎన్నికలు వచ్చినా …. చావుబతుకుల మధ్య ఊగిసలాడుతున్న ఆ గాడిదలానే వుండబోతున్నాయి. నవాజ్ షరీఫ్ జైలుకి వెళ్లినా, ఇమ్రాన్ ఖాన్ ప్రధాని అయినా పాక్ ఎప్పుడు మారుతుందో వాళ్ల దేవుడికే తెలియాలి!  

శివసేన పులి స్వారీ చేస్తోన్న బీజేపీకి ‘గండం’ తప్పకపోవచ్చు!

శత్రువుగా కనిపించే శత్రువు కంటే… మిత్రుడుగా నటించే శత్రువు చాలా ప్రమాదకరం! ఈ విషయం మోదీ లాంటి రాజకీయ నాయకుడికి , అమిత్ షా లాంటి వ్యూహకర్తకి తెలియదని మనం భావించలేం. కానీ, వారు కూడా ఏమీ చేయలేక కళ్లప్పగించి చూస్తున్నారు శివసేనని! అసలింతకీ మరాఠా పార్టీకి, కాషాయ పార్టీకి మధ్య సమస్య ఏంటి? అదే ఇంత వరకూ అర్థం కానిది! శివసేన ప్రతీ రోజూ , ప్రతీ కారణంపై ఏదో ఒక విధంగా బీజేపీని తిట్టిపోస్తూనే వుంది. అయినా కూడా రాష్ట్రంలో, కేంద్రంలో అధికారం నుంచీ మాత్రం తప్పుకోదు. మిత్ర పక్షంగా వుంటేనే ప్రతిపక్షాల కంటే దారుణంగా దాడి చేస్తుంటుంది!     శివసేన, బీజేపీలది ప్రతీ రోజు సాయంత్రం విపరీతంగా గొడవపడే భార్యా, భర్తల సంబంధం లాంటిది. తెల్లవారితే అంతా మామూలైపోతుంది. రెండు పార్టీలు అసలేం కాలేదన్నట్టు నటిస్తాయి. తాజా అవిశ్వాస తీర్మానం విషయంలో కూడా అంతా శివసేన బీజేపీ వ్యతిరేక స్టాండ్ తీసుకుంటుందని అంచనా వేశారు. ఉద్ధవ్ గత కొన్ని నెలలుగా తన పత్రిక సామ్నాలో దుమ్మెత్తి పోస్తూనే వున్నాడు. తమ సీఎం ఫడ్నవీస్ ను, దేశ ప్రధాని మోదీని ఆయన తిట్టని తిట్టు లేదు. అవిశ్వాస తీర్మానం వీగిపోయాక కూడా శివసేన మరో మారు బీజేపీపై మాటల బాంబులు వేసింది. తమ పత్రికలో మోదీని కసాయి అనేసింది. జంతువుల్ని కాపాడుతాడుగానీ మనుషుల్ని పట్టించుకోడనీ, దయ, జాలీ లేవని నోటికి వచ్చినట్టు రాసేశారు. మరింత కోపమే వుంటే మోదీకి వ్యతిరేకంగా పెట్టిన అవిశ్వాస తీర్మానంలో ఓటు వేయవచ్చు కదా? అలా చేయలేదు! సైలెంట్ గా శివసేన ఎంపీలు జారుకున్నారు. సభలో లేకపోవటం ద్వారా బీజేపీకి, మోదీకి కావాల్సినంత మేలు చేశారు!     ఒకవైపు శివసేన అయోమయంగా ప్రవర్తిస్తున్నా బీజేపీ ఏమీ అనకుండా మౌనంగా భరిస్తోంది! అంతకు మించి కాషాయ అగ్రనేతలు చేయగలిగింది కూడా ఏం లేదు. మహారాష్ట్రలో కమలానికి స్వంత మెజార్టీ లేదు. కేంద్రంలో కూడా వాజ్ పేయ్, అడ్వాణీ హయాం నుంచీ శివసేన తోడుగా వుంటోంది. అక్కడా సాటి హిందూత్వ పార్టీ అయిన శివసేనని కమలదళం వదలలేదు. ఇలా దిల్లీలో, ముంబైలో రెండు చోట్లా శివసేన అవసరం ఎంతో కొంత బీజేపీకి కూడా వుంది. ఇదే మోదీ, అమిత్ షాల సహనానికి,మౌనానికి కారణం!     ఇష్టం లేని కాపురం శివసేన, బీజేపీలు ఇంకా ఎంత కాలం చేస్తాయో ఎవ్వరూ చెప్పలేరు. కానీ, ఇదే తంతు కొనసాగితే మాత్రం ఇద్దరికీ కష్టమే. ప్రాంతీయ పార్టీ అయిన శివసేనని పక్కన పెడితే మళ్లీ ప్రధాని కావాలని పట్టుదలతో వున్న మోదీకి మాత్రం … మిత్ర పక్షంలా పక్కనే వుంటూ బల్లెంలా తయరైన మరాఠా పార్టీ ఏనాటికైనా ప్రమాదమే! శివసేన పులి స్వారీ చేయటం… దుస్సాహసమే!

వాట్సప్ మెసేజ్ లకి, వాస్తవాలకి తేడా తెలుసుకోలేకపోతున్న జనం!

సైన్స్ , టెక్నాలజీ ఎప్పుడూ ప్రపంచాన్ని ప్రభావితం చేస్తూనే వుంటాయి. అయితే, కొన్ని సార్లు వాటి ప్రభావం మంచికి దారి తీస్తే కొన్ని సార్లు చెడు ఎదురవుతూ వుంటుంది. అయితే, ఈ మధ్య కాలంలో చాలా ఆవిష్కరణలు, సాంకేతిక అద్భుతాలు ఒక ఉద్దేశంతో మొదలై ఎక్కడో ముగుస్తున్నాయి. చివరకు, విషాదాలకి దారి తీస్తున్నాయి! సోషల్ మీడియా కూడా ఆ లిస్టులో చేరింది!     కంప్యూటర్ కనుగొన్న సైంటిస్టుకి ఇంటర్నెట్ అంటూ ఒకటి వస్తుందని తెలియకపోవచ్చు. అలాగే, ఇంటర్నెట్ రూపొందించిన శాస్త్రవేత్తలకు ఫేస్బుక్, వాట్సప్ లాంటివి ఊహల్లో కూడా వుండకపోవచ్చు! కానీ, ఇవాళ్ల అవ్వి అంగీకరించి తీరాల్సిన నిజాలు! ట్విట్టర్, ఫేస్బుక్, వాట్సప్ లాంటివి ఎంతో మేలు చేస్తున్నాయన్నది కూడా నిజమే. అదీ ఒప్పుకుని తీరాల్సిందే. కానీ, ఇండియా లాంటి దేశాల్లో మేలు చేసే సోషల్ మీడియా తలనొప్పులు కూడా తెచ్చి పెడుతోంది. అదే ప్రభుత్వానికి కూడా సమస్యగా మారింది! సోషల్ మీడియాలో ఇతర సైట్లు కూడా వున్నా… స్మార్ట్ ఫోన్లనే నమ్ముకున్న వాట్సప్ యాప్ దుమారం రేపుతోంది. ట్విట్టర్ కంటే, ఫేస్బుక్ కంటే వాట్సప్ సామాన్యులకి అత్యంత అందుబాటులో వుంటూ అవసరాలు తీరుస్తోంది. మాటలు, పాటలు, కథలు, కవితలు, వీడియోలు, ఆడియోలు… ఇలా ఒక్కటని కాకుండా అన్నీ షేర్ చేసుకుంటున్నారు కామన్ ఇండియన్స్. వాట్సప్పే అందరికీ దిక్కైపోయింది. కానీ, వాట్సప్ వాడే క్రమంలో తెలిసీ , తెలియక గందరగోళానికి, విషాదాలకి కూడా భారతీయులే కారణం అవుతున్నారు!     వాట్సప్ కంపెనీ వారు అధికారికంగా చెబుతోన్న సమాచారం ప్రకారం కూడా ఇండియన్స్ మెసేజ్ లు ఫార్వార్డ్ చేయటంలో అందరి కంటే ముందున్నారట. ప్రపంచంలో వాట్సప్ వాడే వారందరిలో మన భారీయులే మెసేజ్ ఫార్వార్డ్ ఆప్షన్ విపరీతంగా వాడుతున్నారట. ఇదే ఇప్పుడు సమస్యలకి కారణం అవుతోంది. ప్రాణాలు కూడా తీస్తోంది. తమకు వచ్చిన మెసేజ్ వెనకా ముందు ఆలోచించకుండా తమ కాంటక్ట్స్ లో వున్న అందరికీ పంపేస్తున్నారు. అలా వెళ్లిన మెసేజ్ ప్రభావం చాలా తీవ్రంగా వుంటోంది. ఈ మద్యే బళ్లారి ప్రాంతంలో హైద్రాబాద్ నుంచి వెళ్లిన సాఫ్ట్ వేర్ ఉద్యోగిని అనుమానంతో కొట్టి చంపారు. పిల్లల్ని ఎత్తుకెళ్లే కిడ్నాపర్లు రెడ్ కార్లో వస్తున్నారన్న వాట్సప్ మెసేజే ఆ విషాదానికి కారణం! ఇలాంటివి చాలా జరుగుతున్నాయి.     కాశ్మీర్ లాంటి కల్లోల ప్రాంతాల్లో కూడా వాట్సప్ మెసేజ్ లు సంక్షోభానికి దారి తీస్తున్నాయి. రెచ్చగొట్టే తప్పుడు సందేశాలు వైరల్ గా మారిపోయి ప్రాణ నష్టం కలిగిస్తున్నాయి. అందుకే, ఏ చిన్న అల్లరి మొదలైనా ప్రభుత్వాలు ఇంటర్నెట్ సేవలు ఆపేయాల్సిన పరిస్థితి వస్తోంది. ఇది టెక్నాలజీని ఎలా వాడుకోవాలో అర్థం కాని అజ్ఞానం, అత్యుత్సాహం! వాట్సప్ ఆమెరికాలోనూ, ఇతర అభివృద్ధి చెందిన దేశాల్లోనూ కూడా వుంది. కానీ, అక్కడ ఇలా ఫార్వర్డ్ మెసేజీల సమస్య లేదు. వాట్సప్ మెసేజ్ లు చూసి జనం రెచ్చిపోరు. ఎందుకంటే, టెక్నాలజీని వాడుకోవటంలో వారు విచక్షణ చూపుతున్నారు. మన దగ్గర అది కొరవడుతోంది.     వాట్సప్ కి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం తప్పుడు వార్తల విషయమై నోటీసులు ఇచ్చింది. మూడు వారాల్లో రెండు సార్లు తీవ్రంగా హెచ్చరించింది. వాట్సప్ వారు కూడా ఎలా ఫేక్ మెసేజ్ లు ఫిల్టర్ చేయాలా అని ఆలోచిస్తున్నారట. నియమాలు, నియంత్రణలు ఎలా వున్నా… జనం వాట్సప్ లాంటి ఆధునిక సౌకర్యాల్ని తెలివిగా, వివేకంతో వాడుకోవాలి. అంతే తప్ప తమకు ఏది వచ్చినా దాన్ని అందరికి చేరవేసి అనవసర సంకోభాలకి తెర తీయవద్దు. అలాగే, సున్నితమైన విషయాలపై వాట్సప్ లాంటి ఓపెన్ ఫోరమ్ లలో వచ్చే ప్రతీ మాటని నమ్మవద్దు. అన్నిటికి రెచ్చిపోతూ రోడ్ల మీదకొచ్చే ఉన్మాదాన్ని జనం మానుకోనంత వరకూ ఎంత మంచి ఆవిష్కరణ అయినా చెడుకే దారి తీస్తుంది. ప్రభుత్వం దీనిపై జనాన్ని చైతన్య పరచాలి!

దిల్లీలో అవిశ్వాసం… ట్విట్టర్‌లో జనసేనాని అయోమయం!

ఏపీ పాలిటిక్స్ లో చంద్రబాబువి తెలివైన రాజకీయాలు. జగన్ వి ఆవేశపూరిత రాజకీయాలు. ఇక పవన్‌వి ఆశ్చర్యకర రాజకీయాలు! ఆయన ఎప్పుడు ఎవర్ని టార్గెట్ చేస్తారో, ఎవరికి గౌరవం ఇస్తారో, ఎవర్ని బతిమాలతారో, ఎవర్ని తిట్టిపోస్తారో ఆయనకే తెలియదు! అవిశ్వాస తీర్మానం నేపథ్యంలోనూ పవర్ స్టార్ ట్వీట్ల రాజకీయం మరోసారి అందర్నీ ఆశ్చర్యపరిచింది. అసలింతకీ కళ్యాణ్ బాబు కథ ఏంటి, కథనం ఏంటి, స్క్రీన్ ప్లే ఏంటి అనేలా వ్యవహారం నడిచింది!     గత వారం రోజులుగా ఏదైనా అంశం తీవ్ర దుమారం రేపుతోంది అంటే… అది అవిశ్వాసమే! కేంద్రంపై టీడీపీ సంధించిన బలపరీక్ష అస్త్రం కలకలమే రేపుతోంది. లాభ, నష్టల మాట ఎలా వున్నా ఏపీకి జరిగిన అన్యాయం జాతీయ స్థాయిలో చర్చకొచ్చింది. ఒక విధంగా మోదీ బోనులో నిలబడాల్సిన స్థితి వచ్చింది. టీడీపీ ఇంత వరకైనా సక్సెస్ అవుతుంటే జగన్ తన ఎంపీల చేత రాజీనామాలు చేయించి అస్త్ర సన్యాసానికి పాల్పడ్డారు. ఆయనకంటే తెలివైన వారు పవన్ కళ్యాణ్! అసలు ఈయన అవిశ్వాస తీర్మానంపై చర్చ జరగనున్న శుక్రవారం ఉదయం వరకూ నిద్రలేవలేదు! అవిశ్వాసం గురించి ఒక్క మాటా మాట్లాడలేదు! జనసేన అనే ఒక పార్టీనే ఏర్పాటు చేసుకుని జనంలో తిరుగుతోన్న నాయకుడు ఇంత బాధ్యత రాహిత్యంతో వుండవచ్చా? హోదా గురించి ప్రజలు ఎంతో సీరియస్ గా వుంటే అది సమస్యే కాదన్నట్టు తన యాత్రలు, పర్యటనలు, కవాతులు తాను చేసుకుంటున్నారు పవన్. ఇక తప్పదన్నట్టు అవిశ్వాసం సభలో జరగనున్న నాటి ఉదయం రెండు మొక్కుబడి ట్వీట్లు చేసి ఊరుకున్నారు! అందులోనూ తనదైన శైలిలో గందరగోళ వ్యాఖ్యానం చేశారు జనసేనాని!     గుర్తుందిగా… ఇదే గబ్బర్ సింగ్ గతంలో అనంతపురం, కాకినాడ సభల్లో కాషాయ పార్టీని కడిగిపారేశారు. కానీ, ఇప్పుడు తాను కావాలన్న హోదా విషయంలోనే టీడీపీ పూర్తి స్థాయి యుద్ధం చేస్తుంటే … సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు! పవన్ తన ట్వీట్స్ లో స్వీట్ గా ఇలా చెప్పారు. బీజేపీ పెద్దలకు టీడీపీ పెద్దలతో ఏవైనా గొడవలుంటే ప్రత్యేక హోదాని పణంగా పెట్టవద్దట! ఇదేం చోద్యం? టీడీపీ నాయకత్వానికి బీజేపీ నేతలతో వ్యక్తిగత పగలు, ప్రతీకారాలు ఏముంటాయి? పవన్ కే తెలియాలి.     ఇక ఇంకో ట్వీట్ లో పవన్ టీడీపీ, బీజేపీలు రెండూ డ్రామాలు చేస్తున్నాయని విమర్శించారు. టీడీపీ హోదా ఇవ్వమని పట్టుబట్టి అవిశ్వాస తీర్మానం దాకా వ్యవహారాన్ని లాక్కొస్తే నాటకాలు ఏమున్నాయి? మోదీని నేరుగా విమర్శిస్తోంటే ఇంకేం కావాలి? జగన్ తో బాటూ పవన్ ఈ మధ్య కాలంలో మోదీని పల్లెత్తు మాట అనటం మీరెప్పుడైనా చూశారా? కానీ, మన అజ్ఞాత వాసికి అన్ని రిస్క్ లు తీసుకుంటోన్న టీడీపీ కూడా బీజేపీకి తోడు దొంగలా కనిపిస్తోందట!     ఆ మధ్య ఏవో పెన్ డ్రైవ్ లు దొరికాయని వార్తలు రావటమే తప్ప వాటి గురించి, అవ్వి పవన్ పంథాపై చూపుతోన్న ప్రభావం గురించి అధికారికంగా ఏం తెలియటం లేదు. కానీ, పవన్ బీజేపీని సాద్యమైనంత తక్కువ టార్గెట్ చేసీ… మోదీని ఒక్క మాటైనా అనకుండా వుంటూ… టీడీపీని బోనులో నిలబెడుతుండటం చూస్తే… పెన్ డ్రైవ్ గాసిప్స్ నిజమేనేమో అనిపిస్తోంది! దిల్లీ పెద్దలు జగన్ని సీబీఐ ద్వారా, పవన్ని పెన్ డ్రైవ్ ద్వారా రిమోట్ కంట్రోలింగ్ చేస్తున్నట్టే కనిపిస్తోంది! 

ఆటలో అరటి పండు అయిపోయిన వైసీపీ! 

ఇప్పుడు దేశమంతా పార్లమెంట్ వైపు చూస్తోంది. ముఖ్యంగా, తెలుగు రాష్ట్రాలు అవిశ్వాస తీర్మానం చర్చను శ్రద్ధగా వింటున్నారు. ఏపీ ప్రజలకు ఎంతో అవసరమైన ప్రత్యేక హోదా గురించి టీడీపీ ఏం చెబుతోంది, బీజేపీ ఏం చెప్పబోతోంది ఈ రోజు తేలిపోతుంది. అలాగే, ప్రత్యేక హోదా గురించి ఇంత వరకూ ఒక్కసారి కూడా అధికారికంగా నోరు మెదపని మోదీ ఏమంటారు? అది కూడా తీర్మానంపై చర్చ చివరకొచ్చే సరికి స్పష్టం కానుంది. కానీ, ఈ మొత్తం వ్యవహారంలో ఇప్పుడు జనం దృష్టిని ఆకర్షిస్తున్న మరో వ్యక్తి జగన్! ప్రధాన ప్రతిపక్ష నేత అయిన ఆయన జనంలో పాదయాత్ర చేస్తున్నారు. సంతోషమే. కానీ, ఆయన ఎంపీలు ఎక్కడున్నారు? కీలకమైన ప్రత్యేక హోదా గురించి అవిశ్వాసం ముందుకొస్తే వారెక్కడా? ఇదీ సామాన్య ఆంద్రా జనం ఆలోచన!     జగన్ యువ నేత. ఒక విధంగా చెప్పాలంటే… ఏపీ సీఎం చంద్రబాబు జగన్ పుట్టేటప్పటికే పాలిటిక్స్ మొదలు పెట్టారు. ఆ అపార అనుభవం ఇప్పుడు కళ్లారా కనిపిస్తోంది! జగన్ వయస్సంత అనుభవం వున్న రాజకీయ చాణుక్యుడు చంద్రబాబు అటు మోదీని , ఇటు జగన్ ని ఏక కాలంలో కార్నర్ చేశారనే చెప్పాలి. హోదా ఇవ్వని పీఎంని అవిశ్వాసానికి గురి చేయటమే గొప్ప విజయం! స్వంతంగా ఇరవై మంది ఎంపీలు కూడా లేని టీడీపీ ఆ పని చేయగలిగింది. ఇది గొప్ప నైతిక విజయమే. మోదీ ఓట్ల సంఖ్యతో బలపరీక్ష నెగ్గవచ్చు. కానీ, జనం ముందు బాబు తన పోరాట పటిమ నిరూపించుకున్నారు. మరి జగన్ సంగతేంటి?     జగన్ అనుభవ రాహిత్యం గత నాలుగేళ్లలో ఇది రెండోసారి సుస్పష్టంగా కనిపించటం. ఏపీ అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష నేతగా వున్న ఆయన ఇప్పటికీ డెమొక్రటిక్ పాలిటిక్స్ ఒంట బట్టించుకోవటం లేదు. ఆ మధ్య అసెంబ్లీలోకి కోట్లాది ఓటర్లు తమని నమ్మి అందించిన ఎంట్రీని తనకు తానే దూరం చేసుకున్నారు. పాదయాత్ర అంటూ బయలుదేరి అసెంబ్లీని బహిష్కరించారు. ఇది ఆవేశంతో తీసుకున్న నిర్ణయమే తప్ప ఆలోచనతో కాదు. రోడ్లపై ఉద్యమాలు చేయటానికి ఎన్నికల్లో గెలవటం ఎందుకు? ఎన్జీవోలు స్థాపించుకుని కూడా జనం కోసం పోరాడవచ్చు కదా? ఏపీ ప్రజలు ప్రధాన ప్రతిపక్షం హోదా ఇస్తే దాన్ని అవతలకి విసిరేసి రోడ్డు మీదకొచ్చి మళ్లీ ఓటేయండి అంటూ పాదయాత్ర చేయటం జగన్ కే చెల్లింది!     అసెంబ్లీ వేదికగా తన అనుభవ రాహిత్యం నిరూపించుకున్న జగన్ తానే కాక తన ఎమ్మెల్యేలు కూడా జనం కష్టాలు ప్రస్తావించకుండా చేసేశారు. ఇప్పుడు అదే తప్పిదం పార్లమెంట్ వేదికగా ఎంపీల చేత చేయించారు. అనేక నియోజకవర్గాల్లో ఓటర్లు వైసీపీ ఎంపీల్ని ఎందుకు గెలిపించారు? తమ గొంతు దిల్లీలో వినిపిస్తారని! కానీ, ఇప్పుడు అత్యంత ముఖ్యమైన ప్రత్యేక హోదా సమస్యపై జనం తరుఫున మాట్లాడాల్సిన సమయంలో జగన్ ఎంపీలు ఏ ఒక్కరూ లేరు! ఇది ఖచ్చితంగా జగన్ దుందుడుకు నిర్ణయం వల్లే! పార్లమెంట్లో టీడీపీ వాదన, బీజేపీ ప్రతి వాదన జరుగుతుంటే వైసీపీ స్వరమే లేకుండాపోయింది. ఇది చేజేతులారా జగన్ చేసుకున్న నిర్వాకం అనక తప్పదు!     చంద్రబాబువి సహనంతో కూడుకున్న రాజకీయాలు. జగన్ వి అసహనపు ఎదురు దాడులు. సీఎం అవ్వలేకపోయానన్న అసహనం, త్వరగా ఎన్నికలొచ్చి అధికార పీఠంపై కూర్చోవాలన్న అసహనం అతడ్ని తప్పుదోవ పట్టిస్తున్నాయి. పాతికేళ్లు ఎదురు చూసి సీఎం అయిన తన తండ్రి వైఎస్ చరిత్ర అయినా జగన్ ఒకసారి మననం చేసుకోవాలి. లేదంటే, అసెంబ్లీ, పార్లమెంట్ వేదికలుగా జగన్ ప్రజాస్వామ్యాన్ని , ఓటర్లు వేసిన ఓట్లని అపహాస్యం చేయటం… జనం సీరియస్ గా తీసుకుంటారు! 

అవిశ్వాసానికి వెళ్లకపోతే… జేసీ ఓటర్ల విశ్వాసాన్ని దెబ్బ తీసినట్లేనా?

రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు వుండరు. ఇది పాత మాటే. కానీ, కొత్త విషయం ఏంటంటే…. అసలు ఇప్పటి రాజకీయాల్లో మిత్రులు అంటూ ఎవరూ వుండటం లేదు! ఎవరు ఎప్పుడు ఎలా కుట్ర చేస్తారో తెలియదు. ఎవరు ఎందుకు ఇబ్బంది కలిగిస్తారో అర్థం కాదు! అసలు ఎవరి ఎవరి వైపున నిలబడుతున్నారో కూడా క్లారిటీ వుండటం లేదు!     టీడీపీ అవిశ్వాస తీర్మానం పెట్టింది. కాంగ్రెస్ కూడా బీజేపీని టార్గెట్ చేస్తూ మద్దతు పలికింది. అసలు చరిత్రలో ఏనాడూ కలవని టీడీపీ, కాంగ్రెస్ లు మోదీ విషయంలో ఒకే అభిప్రాయానికి వచ్చాయి. ఇంత వరకూ అందరికీ అర్థమయ్యే వ్యవహారమే. కానీ, తమ పార్టీ పెట్టిన అవిశ్వాస తీర్మానికి తానే హాజరుకానని జేసీ దివాకర్ రెడ్డి అనటం … నిజంగా ఆశ్చర్యకర పరిణామమే! ఇంతకీ జేసీ సమస్య ఏంటి? జేసీ దివాకర్ రెడ్డి తాను పార్లెమంట్ కు వెళ్లనని భీష్మించి అనంతపురంలో కూర్చున్నారు. ఎంపీగా ఎన్నికైన ఆయన సభ నడుస్తుంటే ఇంట్లో కూర్చోవటం ఏంటి? ఓట్లు వేసిన జనానికి జవాబుదారి అంటూ ఏం లేదా? అది పక్కన పెడితే టికెట్ ఇచ్చిన పార్టీ అవిశ్వాస తీర్మానంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేయమని విప్ జారీ చేసింది. దాన్నైనా గౌరవించాలి కదా? ఇంత కాలం జేసీ కూడా మిగతా ఎంపీలతో కలిసి ఆంద్రాకు అన్యాయం జరుగుతోందనే అన్నారు. తీరా ఇప్పుడు ఓటు వేసి మోదీ సర్కార్ ను బోనులో నిలబెట్టే సమయం వస్తే ఆయన వెళ్లకుండా వుండిపోతున్నారు! ఇదెక్కడి విడ్డూరం?     దిల్లీకి వెళ్లకపోవటానికి జేసీ చెబుతోన్న కారణాలు కూడా విచిత్రంగానే వున్నాయి. మోదీ ప్రధానిగా వున్నంత కాలం ఏపీకి ఏమీ రావని కుండబద్ధలు కొడుతున్నారు. ఆయన చెప్పింది నిజమే అయినా జనం కోసం , జరుగుతున్న అన్యాయాన్ని పార్లమెంట్ వేదికగా వినిపించాలి కదా? అది చేయకుండా అనంతపురంలో ప్రెస్ మీట్ పెట్టి మీడియాతో బాధని పంచుకుంటే ఏం లాభం? ప్రత్యేక హోదా అవిశ్వాస తీర్మానం వల్ల రాదని జేసీ ఇప్పుడు మాట్లాడుతున్నారు. ఆ విషయం అపార అనుభవం వున్న చంద్రబాబుకు తెలియదా? తెలిసే ఆయన అవిశ్వాస తీర్మానంతో మోదీని ఢీకొడుతున్నారంటే జనం మనోభావాల్ని జాతీయ స్థాయిలో వినిపించాలనే కదా! మరి అందులో భాగం అవ్వటానికి ప్రజల చేత ఎన్నుకోబడ్డ ఎంపీగా జేసీ దివాకర్ రెడ్డికి ఏంటి ఇబ్బంది? జేసీ మొరాయింపు వెనుక అసలు కారణం వేరే అంటున్నారు టీడీపీలోని వారు. ఇప్పటికే ఆయనని బుజ్జిగించి దిల్లీ ఫ్లైట్ ఎక్కించే పనిలో వున్న కొంత మంది ఆయన గుంతకల్లు మాజీ ఎమ్మెల్యే మధూసూదన్ గుప్త విషయంలో గుస్సాగా వున్నారని అంటున్నారు. గుప్తా టీడీపీలో చేరేందుకు రెడీ అవుతున్నారట. అది పార్టీకి కూడా ఇష్టమే. కానీ, టీడీపీ ఎంపీ అయిన దివాకర్ రెడ్డి మాత్రం మధూసూదన్ గుప్తా చేరికని ఇష్టపడటం లేదు. అందుకే, అదును చూసి టీడీపీ అధిష్టానం పై ఒత్తిడి పెంచారని టాక్!     జేసీ అలకకి కారణాలు ఎలా వున్నా… ఆయన తన వ్యక్తిగత , రాజకీయ అంశాల కారణంగా ప్రత్యేక హోదా విషయాన్ని లైట్ తీసుకోవటం బాధాకరమే! పార్టీని, పార్టీ అధినేతని ఇబ్బంది పెట్టేలా ప్రవర్తిస్తూ ఆయన జనం ముందు చులకన అవుతున్నారు. ఆంధ్రులకు ఎమోషనల్ ఇష్యూగా మారిన హోదా విషయంలో జేసీ పునరాలోచించుకుంటే మంచిది. దిల్లీకి వెళ్లి మోదీకి వ్యతిరేకంగా ఓటు వేసి ఎంపీగా తన బాద్యత నిర్వర్తిస్తే చరిత్రలో పేరు చెడిపోకుండా స్థిరమవుతుంది!

సుప్రీమ్ శబరిమల తీర్పు… చట్టం ముందు అన్ని మతాలు సమానమేనా?

సుప్రీమ్ కోర్టు సంచలన తీర్పుల పరంపర కొనసాగుతూనే వుంది. స్వలింగ సంపర్కంపై గొంతు విప్పిన అత్యున్నత న్యాయస్థానం మరో కీలక తీర్పు వెలువరించింది. ఈసారి హిందూ మత విశ్వాసాలకు సంబంధించిన అంశంలో న్యాయస్థానం సూటిగా అభిప్రాయం వెలువరించింది. శబరిమల ఆలయంలోకి ఆడవారు ప్రవేశించవచ్చని దీపక్ మిశ్రా సహా అందరూ న్యాయమూర్తులు ఏకీభవించారు!     కేరళలోని శబరిమల అయ్యప్ప ఆలోయంలోకి 10 ఏళ్ల వయస్సున్న అమ్మాయిలు మొదలు 50 ఏళ్ల వరకూ వయస్సున్న వారికి అనుమతి వుండదు. ఇది అందరికీ తెలిసిందే. అయితే, ఈ నియమంపై కోర్టుకెక్కారు కొందరు ఉద్యమకారులు. కేవలం స్త్రీలన్న వివక్షతో, ప్రకృతి సహజమైన ఋతుస్రావం నెపంగా చూపుతూ దేవుడి దర్శనానికి దూరం చేయటం తప్పన్నది వారి వాదన. నిజానికి నెలసరి సమయంలో హిందూ స్త్రీలు ఏ గుడిలోకి కూడా వెళ్లరు. అంతటా ఇది వర్తిస్తుంది. కానీ, అయ్యప్ప ఆలయంలోకి ఎలాంటి శారీరిక ఇబ్బంది లేని రోజుల్లో కూడా ఇంత కాలం అనుమతించే వారు కాదు. పదేళ్ల నుంచీ యాభై ఏళ్ల వయస్సున్న ఆడవారెవరూ కొండ మీదకి వెళ్లేవారు కాదు. ఇది తప్పా ఒప్పా అనేది పెద్ద చర్చ. ఎంతో కాలంగా జరుగుతూ వస్తోంది కూదా. అయితే, తాజా సుప్రీమ్ తీర్పుతో శబరిమల వివాదానికి తెర పడినట్టైంది.     కోర్టు తీర్పుని అందరూ శిరసావహించటం తప్పనిసరే. అలాగే, అత్యధిక శాతం హిందువులు దీన్ని పెద్దగా విమర్శిస్తారని కూడా భావించలేం. ఎందుకంటే, ఆలయాల్లోకి స్త్రీల్ని నిషేధించటం హిందూ మతంలోని మూలమైన సిద్ధాంతం ఏం కాదు. అసలు అలాంటి నియమం వేదాలు, పురాణాల్లో ఎక్కడా కనిపించదు కూడా. శబరిమల, శని సిగ్నాపూర్ లాంటి క్షేత్రాల్లో కాల క్రమంలో ఏర్పడ్డ నిషేధాలే ఇవన్నీ. కేరళలలోనే ఇతర అయ్యప్ప ఆలయాల్లో కూడా ఎక్కడా స్త్రీల ప్రవేశం కట్టడి చేయలేదు. కేవలం శబరిమల కొండపైకే నిషేధించారు. దాని వల్ల స్త్రీలకి ఏం నష్టం జరుగుతోందని వాదించే చాందసవాదులు కూడా వున్నారు. వారి మాటలో కొంత వరకూ సరైన అంశాలే వున్నా రాజ్యాంగబద్ధంగా పని చేసే కోర్టు మగ, ఆడా మధ్య భేదాలు వుండకూడదన్న సమనత్వ సూత్రంపైనే తీర్పు వెలువరించింది. ఇక ఇక్కడే మరో కోణమూ వుంది. తీర్పు వచ్చింది కాబట్టి నమ్మకాల్ని, విశ్వాసాల్ని పక్కన పెట్టి ఎందరు స్త్రీలు శబరిమల కొండ ఎక్కుతారు? అదీ అనుమానమే! చాలా మంది స్త్రీలు శబరిమల కొండపైకి ఒక వయస్సు వచ్చే వరకూ ప్రవేశం లేకపోవటం పెద్ద సమస్యగా భావించరనేది కూడా సత్యమే!     ఏ మతమైన ఎప్పటికప్పుడు సంస్కరించుకుంటూనే ముందుకు సాగాలి. అది శబరిమల ఆలయం ప్రవేశమైనా, ట్రిపుల్ తలాఖ్ లాంటి దురాచారమైనా… అన్నీ కాలక్రమంలో పక్కకు తప్పుకోవాల్సిందే. కాకపోతే, మన దేశంలో అభ్యుదయవాదులు, రాజకీయ నాయకులు, ప్రభుత్వాలు చేయవలసిన పనులు కోర్టులు చేయాల్సి వస్తోంది. అదే విచారకరం! ఇప్పటికైనా కోర్టులో, ప్రభుత్వాల్లో ఏవో ఒకటి అన్ని మతాల్లోని దురాచారాల్ని అంతం చేసే కార్యక్రమం మొదలు పెట్టాలి. అలా కాకుండా కేవలం హిందువుల విశ్వాసాలు, నమ్మకాలు దెబ్బతిసేలా మాత్రమే తీర్పులు, ఆదేశాలు, చట్టాలు వస్తే… అది అశాంతికి కారణం అవుతుంది. మైనార్టీ మతాల విషయంలో కూడా ఉద్యమకారులు, అభ్యుదయవాదులు, ప్రభుత్వాలు నిష్పపక్షపాతంగా, నిర్భయంగా స్పందించాలి. ట్రిపుల్ తలాఖ్ లాంటి దురాచారాల్ని సమూలంగా అంతం చేసే చర్యలు వేగంగా చేపట్టాలి. అదే సమానత్వం అనిపించుకుంటుంది!

మోదీ గెలిచి ఓడటం, చంద్రబాబు ఓడి గెలవటం… ఖాయమే!

టీడీపీ పంతం నెగ్గించుకుంది! చంద్రబాబు వ్యూహం ఫలించింది! అవిశ్వాస రాజకీయం మోదీని కార్నర్ చేయగలిగిందనే చెప్పాలి! నిజానికి స్వంతంగా మ్యాజిక్ ఫిగర్ దాటిన ప్రభుత్వం అవిశ్వాసం ఎదుర్కోవాల్సి రావటమే ఒక మైనస్ పాయింట్. అందులోనూ తమతో నాలుగేళ్లు కలిసి సాగిన టీడీపీ లాంటి పార్టీయే అవిశ్వాసం పెట్టటం మోదీకి ఇబ్బందికర పరిస్థితే. అందుకే, గత పార్లమెంట్ సమావేశాల్లో రోజుల తరబడి సమయం వృథా అయినా ప్రధాని చర్చకు సిద్ధపడలేదు. కానీ, అది రివర్స్ రిజల్ట్స్ ఇచ్చింది. మీడియాలో, దేశ వ్యాప్తంగా కూడా మోదీ ప్రతిపక్షాల ప్రశ్నలకి భయపడుతున్నారని ప్రచారం జరిగింది. మళ్లీ ఈసారి కూడా పోయిన సారిలాగే టీడీపీ అవిశ్వాస అస్త్రం ఎక్కుపెట్టడంతో మోదీ చర్చకు దిగి రాక తప్పలేదు…     ప్రత్యేక హోదా విషయంలో కేంద్రం మోసం చేసిందంటూ రాష్ట్రంలో అన్ని పార్టీలు నిరసనలు చేస్తున్నాయి. కానీ, పార్లమెంట్ వేదికగా ఉద్యమిస్తేనే దేశమంతా గమనిస్తుంది. అందుకే, టీడీపీ పోరుబాట ఎంచుకుంది. కానీ, ఏపీలో ప్రధాన ప్రతిపక్షం మాత్రం తప్పులో కాలేసింది. జగన్ తన ఎంపీల చేత రాజీనాలు చేయించి ట్రాప్ లో పడ్డారు. ఇప్పుడు మోదీ అవిశ్వాసం పై చర్చకు సై అనటంతో టీడీపీ ఎంపీల స్వరమే లోక్ సభలో వినిపించనుంది. జనం తరుఫున మాట్లాడే అవకాశం వైసీపీకి లేకుండా పోయింది. ఈ విషయంలో టీడీపీదే పై చేయి అయిందని చెప్పుకోవాలి…     టీడీపీ, వైసీపీ మధ్య పోటీ పక్కన పెడితే చంద్రబాబు గత కొన్ని రోజులుగా బీజేపిని తీవ్రంగా టార్గెట్ చేస్తున్నారు. ప్రత్యేక హోదా విషయంలో మోదీయే విలన్ అని జనానికి చెప్పగలిగారు. ఇప్పుడు పార్లమెంట్ వేదికగా అదే మరింత స్పష్టం కానుంది. ఖచ్చితంగా బీజేపీ నేతలు, ప్రధాని కూడా తీవ్ర స్థాయి ఎదురు దాడికి సిద్ధమయ్యే చర్చకు ఒప్పుకుని వుంటారు. అందులో ఎలాంటి సందేహం అక్కర్లేదు. అయితే, కాషాయ దళం ఎంత ప్రతి దాడి చేసినా ప్రత్యేక హోదా ఇవ్వకపోవటం అనే ప్రధానమైన తప్పిదం మాత్రం కప్పిపుచ్చలేనిది. జనం ఆ విషయం గుర్తిస్తే చంద్రబాబు అవిశ్వాస వ్యూహం ఫలించినట్లే!     అవిశ్వాస తీర్మానం సందర్భంగా చర్చ జరగటం, ప్రధాని సుదీర్ఘమైన ఉపన్యాసం ఇవ్వటం ఎప్పుడైనా మామూలే. అయితే, చివర్లో ఓటింగ్ జరిగి ప్రభుత్వాలు కూలుతుంటాయి. అంతటి పరిస్థితి ఇప్పుడైతే లేదనే చెప్పాలి. మోదీ సర్కార్ కూలటం దాదాపు అసాద్యమే. ప్రధానమైన ప్రతిపక్షం కాంగ్రెస్ కే కేవలం 44 సీట్లు వుండటం, టీడీపీ లాంటి ప్రాంతీయ పార్టీలు ఎంతగా ప్రతిఘటిస్తున్నా టీఆర్ఎస్, అన్నాడీఎంకే లాంటి పార్టీలు లోపాయికారిగా కేంద్రానికి సాయపడుతుండటం, వైసీపీ కూడా తన ఎంపీల రాజీనామాతో మోదీకి హెల్ప్ చేయటం… ఇలాంటి బోలెడు కారణాలున్నాయి! వీటన్నిటి వల్ల బీజేపీకి ఇప్పటికిప్పుడు నష్టం లేన్నట్టే. కానీ, టీడీపీతో సహా అవిశ్వాసాన్ని ప్రవేశపెట్టిన పార్టీలు, మద్దతిస్తున్న పార్టీలు మాత్రం జనం ముందు దిల్లీ పెద్దల్ని దోషులుగా నిలిపే ఛాన్స్ వుంటుంది. అంత వరకూ చంద్రబాబు ఇతర నేతలు సక్సెస్ అయినట్టే! 

మా బాబు మంచివాడని రమణ దీక్షితులు ఇందుకే అన్నారా?

తిరుమల వెంకన్న ప్రధానార్చకులుగా రమణ దీక్షితులు ఇప్పుడు అందరికీ తెలిసిన వారే! నిజానికి ఆయన అర్చకులుగా వున్నప్పటి కంటే పదవీ విరమణ తరువాతే మరింత ఫేమస్ అయ్యారు. కారణం వివాదాల పరంపరనే! టీటీడీలో అరాచకాలు జరుగుతున్నాయని ఆరోపించటం మొదలు పింక్ డైమండ్ అని ఒకసారి, అమిత్ షాను కలిసి ఒకసారి, జగన్ తో బేటీ అయ్యి ఒకసారి ఆయన వార్తల్లో నిలుస్తున్నారు. లోపలి కారణాలు అసలేంటో ఎవ్వరికీ తెలియదు. తప్పు టీటీడీదా? రమణ దీక్షితులుదేనా? అంతా అయోమయమే! కానీ, ఈ గొడవ మొత్తంలోకి చంద్రబాబు పేరు కూడా పదే పదే వచ్చేస్తోంది. ఆయన ప్రమేయం ఎంత మేర అన్నది కూడా అస్పష్టమే. రమణ దీక్షితులు లాంటి అర్చకులకి 65 ఏళ్ల వయో పరిమితితో బలవంతంగా రిటైర్మెంట్ ఇవ్వటం చంద్రబాబు ఆలోచనా? లేక టీటీడీ బోర్డులోని వారిదా? దాన్ని ముందుగానే సీఎంకి చెప్పి అమలు చేశారా? ఇలా బోలెడు ప్రశ్నలు! అయితే తాజాగా రమణ దీక్షితులు బాబుకి క్లీన్ చిట్ ఇవ్వటం నిజంగా ఆసక్తికరమే!     ఇంత కాలంగా పోరుబాట పట్టిన రమణ దీక్షితులు ఇప్పుడు రూటు మార్చారా? సుప్రీమ్ గడప తొక్కుతాననీ, న్యాయపోరాటం చేసి తన అర్చకత్వ పదవి తాను తిరిగి పొందుతానని చెప్పుకొచ్చిన ఆయన వున్నట్టుండీ చంద్రబాబు గురించి వ్యాఖ్యలు చేశారు. ఆయన తనకు శ్రీవేంకటేశ్వర యూనివర్సిటీలో జూనియర్ అని గుర్తు చేసుకున్నారు. అంతే కాదు, చంద్రబాబు మంచివాడని కూడా కితాబునిచ్చారు. సీఎంగా ఆయన ఆంధ్రా ప్రజల అభివృద్ధి కోరతారని అన్నారు. ఇతరులెవరో చంద్రబాబుని పక్కదోవ పట్టించారని కూడా రమణ దీక్షితులు అనటం కొసమెరుపు! చంద్రబాబు తనకు అపాయింట్ మెంట్ ఇచ్చి కూడా క్యాన్సిల్ చేశారని వాపోయారు!     ఈ తాజా కామెంట్స్ తో రమణ దీక్షితులు చెప్పదలుచుకున్నది ఏంటి? తనకు సీఎంతో సంధి ఓకేనని చెబుతున్నారా? అలాగే, తనకు అప్పాయింట్ మెంట్ ఇస్తే బాబుని కలిసి ఆయన ఏమైనా చెప్పదలుచుకున్నారా? బాబు మంచివాడే కానీ… అంటూ ముక్తాయింపు ఇచ్చారంటే… ఆ అసలు విలన్లు ఎవరు? బోలెడు ప్రశ్నలు తలెత్తుతున్నాయి దీక్షితులు మాటలతో! ఏది ఏమైనా స్వరం మార్చిన రమణ దీక్షితులు తత్వం గ్రహించారనే భావించాలి. దిల్లీలో మకాం వేసి న్యాయ పోరాటం చేయటం అంత సులువేం కాదని అర్థమై వుండవచ్చు. టీటీడీ తీసుకున్న నిర్ణయం కోర్టు కొట్టివేస్తుందో లేదో చెప్పలేని పరిస్థితి. అలాగే కేసులో ఆయన విజయం సాధించినా అది ఎన్నాళ్లు సాగుతుందో ఊహించలేని వ్యవహారం. వీటన్నటి మధ్యా సమరం కంటే సంధే మంచిదని భావించారనుకోవాలి! మహాసంప్రోక్షణ సందర్భంగా తొమ్మది రోజులు భక్తుల్ని రానివ్వమని ప్రకటించిన టీటీడీ పెద్ద దుమారం రేపింది. అయితే, దాన్ని చంద్రబాబు ఒక్క ఆదేశంతో సద్దుమణిగించారు. భక్తుల్ని పరిమిత సంఖ్యలో అనుమతించాల్సిందేనని తెలిపారు. రమణ దీక్షితులు వ్యవహారం కూడా సీఎం అలాగే డీల్ చేస్తే సరిపోతుందని అంటున్నారు విశ్లేషకులు. ఆయనకి అప్పాయింట్ మెంట్ ఇచ్చి అతడి వాదన కూడా వింటే సమస్య చాలా వరకూ సద్దుమణగవచ్చు. ఎన్నికలు అంతకంతకూ సమీపిస్తున్న తరుణంలో ఒకవేళ దీక్షితులు సుప్రీమ్ గడప తొక్కిదే టీడీపీకి ఎంతో కొంత ఇబ్బందికరమే. దీన్ని దృష్టిలో పెట్టుకున్నా కూడా చంద్రబాబు చర్చకు ఆస్కారం కల్పించి రమణ దీక్షితులు వివాదాన్ని చల్లార్చే ప్రయత్నం చేస్తే ఎంతో బావుంటుంది. 

సుప్రీమ్ చెప్పాకైనా మోదీ సర్కార్ గోరక్షకులపై దృష్టి పెడుతుందా? 

గతంలో అసలు జరిగేవి కావో లేక మీడియా ఇంతగా రిపోర్ట్ చేసేది కాదో… కానీ, మోదీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచీ పెద్ద తలనొప్పిగా మారిపోయిన సమస్య గోరక్షకుల దాడులు! నిజంగా ప్రధానికి ఈ దాడుల్లో ప్రమేయం వుండదని తెలిసినా చివరకు ఆయనని, ఆయన ప్రభుత్వాన్ని టార్గెట్ చేయాల్సి వస్తుంది ప్రతీ ఒక్కరికి. ఎందుకంటే, ఎక్కడైనా ఓ రాష్ట్రంలో కొంత మంది ఉద్దేశ్యపూర్వకంగా ఒకరిద్దరిపై దాడి చేస్తే అది శాంతి భద్రతల సమస్య. రాష్ట్రం పరిధిలోనిది. కానీ, మోదీ సర్కార్ వచ్చినప్పటి నుంచీ ఒక మతాన్ని, కొన్ని కులాల్ని కావాలని గురి చూసి దాడులు జరుగుతున్నాయని వాదన వినిపిస్తోంది. ఇది ఆందోళనకరమైన పరిణామమే. స్వయంగా సుప్రీమ్ కోర్టు కూడా అదే అంటోంది…     కోర్టులో దాఖలైన ఓ కేసు విచారణలో భాగంగా జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం కేంద్రాన్ని ప్రత్యేక చట్టం చేయమని ఆదేశించింది. రాష్ట్రాల్ని కూడా జనం చట్టాల్ని తమ చేతుల్లోకి తీసుకోకుండా చూడాలని ఆదేశించింది. గో రక్షకులమని చెప్పుకుంటూ మందలుగా మారి దాడులు చేయటం నిజంగా దుర్మార్గం. కానీ, ఉత్తరభారతంలో గత కొన్ని ఏళ్లుగా ఇది మామూలైపోయింది. దీనికి ప్రస్తుత మోదీ ప్రభుత్వం కారణమని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. అది ఎంత వరకూ నిజమనేది పక్కనపెడితే చాలా రాష్ట్రాల్లో అమాయకులు మాత్రం ప్రాణాలు కోల్పోతున్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనే కాదు ఇతర ప్రాంతీయ పార్టీలు, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు కూడా గోరక్షకుల దాడులతో కలవర పెడుతున్నాయి. దీన్ని అరికట్టడానికి అవసరమైన చట్టం తేవాలని సుప్రీమ్ సూచించింది. పార్లమెంట్లో ఈ తరహా చట్టం తేవటానికి పెద్దగా అడ్డంకులు కూడా వుండకపోవచ్చు. అన్ని పార్టీలు అంగీకరిస్తాయి కూడా.     చట్టం తీసుకురావాలన్న కోర్టు మరిన్ని సూచనలు కూడా చేసింది. దాడి జరిగినప్పుడు నష్ట పరిహారం బాధితుల మతం, కలం చూసి ఇవ్వకూడదని స్పష్టం చేసింది. వారికి జరిగిన నష్టం ఆధారంగా నిర్ణయించాలని సూచించింది. బాధితులు ఏ మతం వారైనా వుండవచ్చిన అభిప్రాయపడింది. సుప్రీమ్ సూచనల మేరకు కేంద్ర ప్రభుత్వం ఎంత త్వరగా చట్టాన్ని తెస్తే అంత మంచిది. లేదంటే ఎంతో మంది అమాయకులు ఇంకా బలయ్యే అవకాశాలున్నాయి. కేవలం గోరక్షకుల దాడులే రాజకీయంగా చర్చకు వస్తున్నాయి కానీ… చాలా చోట్ల అనేక కోణాల్లో జనం చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుంటున్నారు. రోడ్లపైనే హింసతో చెలరేగిపోతున్నారు.     కొద్ది రోజుల క్రితమే కేవలం ఒక వాట్సప్ మెసేజ్ కారణంగా ఒక సాఫ్ట్ వేర్ టెక్కీ జనం దాడిలో మరణించాడు. అతడ్ని పిల్లల్ని ఎత్తుకుపోయేవాడిగా భావించి జనం కొట్టి చంపారు. ఇలాంటివి జరగటానికి అనేక కారణాలే వున్నా… ప్రధానంగా మందగా మారిపోయి దాడి చేస్తే ఎవరికీ శిక్షలు పడటం లేదు. అదే జనంలోని అరాచకులకి ఊతం ఇస్తోంది. కొంత వరకూ అనుమానం వున్నా, లేదా ఏదో ఇతర కోపం వున్నా… మరో పది మందితో కలిసి దాడులు చేస్తున్నారు. చివరకు ఎలాంటి శిక్షా లేకుండా తప్పించుకుంటున్నారు. ఇది సమాజానికి అస్సలు క్షేమం కాదు. కఠినమైన చట్టం తీసుకు రావటమే సమస్యకి కొంత మేర పరిష్కారం చూపుతుంది!  

అజ్జు భాయ్‌ని సికింద్రాబాద్ పిచ్‌పై స్వంత పార్టీ నేతలే రనవుట్ చేస్తారా?

అజహరుద్దీన్… ఈ పేరు వినగానే మనకు ఇప్పటికీ క్రికెట్టే గుర్తుకు వస్తుంది. అలాంటి మంచి ట్రాక్ రికార్డ్ వున్న క్రికెటర్ అండ్ కెప్టెన్ ఆయన. కానీ, ఇప్పుడు అజహరుద్దీన్ క్రికెటర్ కాదు. పొలిటీషన్. అసలు ఆయన అలా ప్రవర్తిచింది ఎప్పుడూ లేదు. పోయిన ఎన్నికల్లో కూడా ఎంపీగా గెలిచి ఈ అయిదళ్ల కాలంలో దాదాపు స్థబ్దుగా వుండిపోయారు. చాలా మంది సినీ, క్రికెట్ ప్రముఖల్లాగే కాంగ్రెస్ కు ఓ ఎంపీ సీటు సంపాదించి పెట్టి తన పని తాను చేసుకుంటూ వుండిపోయాడు. పార్లమెంట్లో , బయటా ఎక్కడా అజహరుద్దీన్ రాజకీయ వ్యాఖ్యలు చేసిందీ లేదు, రాజకీయ అంశాలపై పెద్దగా స్పందించింది కూడా లేదు! కాకపోతే, తాజాగా ఆయన చేసిన ఒక చిన్న కామెంట్ కాంగ్రెస్ లో కలకలం రేపుతోంది. అదీ తెలంగాణ , హైద్రాబాద్ కాంగ్రెస్ లలో!     2014లో ఉత్తరాదిన పోటి చేసిన అజహరుద్దీన్ ఈసారి స్వంత రాష్ట్రం తెలంగాణ నుంచీ పోటీకి రెడీ అయ్యాడు.అయితే, చాలా రోజులుగా ఆయన హైద్రాబాద్ ఎంపీ స్థానానికి అసదుద్దీన్ ఓవైసీపై పోటీ చేస్తారని టాక్ వినిపించింది. దిల్లీలోని కాంగ్రెస్ అధిష్టానం ఓవైసీకి అజహరుద్దీన్ సరైన పోటీ అని భావించిందట. కారణం… ముస్లిమ్ జనాభా ఎక్కువ వుండే హైద్రాబాద్ లో ఓవైసీకి పెద్దగా పోటీనే లేదు ప్రస్తుతం. అతడిపై విమర్శలు చేయటం కూడా బీజేపీ వారు చేయాల్సిందే తప్ప ఇతర పార్టీలు ఓవైసీల ఎంఐఎం ప్రాపకం కోసం పాకులాడుతూనే వుంటాయి. టీఆర్ఎస్ కానీ, తెలంగాణ కాంగ్రెస్ కానీ ఎప్పుడూ ఓవైసీల్ని టార్గెట్ చేసింది లేదు. కానీ, గత ఎన్నికల్లో మోదీ తుఫాన్ కారణంగా కాంగ్రెస్ 44 సీట్లకు దిగజారింది. తమకు స్వతంత్రం వచ్చినప్పటి నుంచీ ఓటు బ్యాంక్ గా వున్న ముస్లిమ్ లు కూడా కాంగ్రెస్ ను దూరం పెట్టేశారు. అందుకే, రాహుల్ టీమ్ ముస్లిమ్ జనాభా ఎక్కువగా వుండే నియోజక వర్గాలపై దేశ వ్యాప్తంగా ప్రత్యేక దృష్టి పెడుతోంది ఈ సారి.     హైద్రాబాద్ లోని ముస్లిమ్ ఓటు బ్యాంక్ ను అజహరుద్దీన్ తిరిగి తమ ఖాతాలోకి తెస్తాడని కాంగ్రెస్ హై కమాండ్ భావించి వుండవచ్చు. కానీ, ఓవైసీపై పోటీ చేస్తే తాను తప్పక ఓడిపోతానని అజహరుద్దీన్ కు బాగా తెలుసు. ఎంఐఎం అధినేతకు అలాంటి పట్టు నియోజకవర్గంపై వుంది. అంతే కాక అజహరుద్దీన్ కు అసదుద్దీన్ తో వున్న బంధం కూడా పోటీకి వెనుకంజ వేసేలా చేసి వుండవచ్చు. ఇవన్నిటి కారణంగా అజహరుద్దీన్ సికింద్రాబాద్ బాంబు పేల్చాడు!     హైద్రాబాద్ అంత ముస్లిమ్ జనాభా లేనప్పటికీ సికింద్రాబాద్ లో కూడా చాలా అసెంబ్లీ సెగ్మెంట్లలో ముస్లిమ్ ఓటర్లు మెజార్టీగా వున్నారు. అందుకే, అజహరుద్దీన్ సికింద్రాబాద్ నుంచీ పోటీ చేస్తానని తన అభిప్రాయం బయటపెట్టారు. ఇది వరుసగా సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేస్తూ వస్తోన్న అంజన్ కుమార్ యాదవ్ కి నచ్చలేదు. 2014లో ఓడినప్పటికీ 2004, 2009 ఎన్నికల్లో ఆయన మంచి మెజార్టీతోనే గెలిచారు. 2019లో బీజేపీ దత్తాత్రేయ నెగ్గారు. ఇటువంటి పరిస్థితుల్లో తనకు మంచి పట్టున్న నియోజక వర్గం వదలటానికి అంజన్ ఏ మాత్రం సిద్దంగా లేరు. అంతే కాదు, అజహరుద్దీన్ కి మతం కలిసి వస్తే అంజన్ కు కులం కలిసి వస్తుందని కాంగ్రెస్ హైకమాండ్ గుర్తించాలి. పైగా కాంగ్రెస్ అజహరుద్దీన్ లాంటి ముస్లిమ్ అభ్యర్థిని పోటీకి పెడితే అది బీజేపీకి ఆటోమేటిక్ గా కలిసొచ్చే అంశం. అజహరుద్దీన్ పై బహిరంగంగా బీజేపీ మతపరమైన కామెంట్లు చేయకపోయినా… బూతు లెవల్లో ఓటర్లను హిందూత్వ భావజాలంతో ప్రభావితం చేయగలదు. అలా కాంగ్రెస్ కు సికింద్రాబాద్ నియోజక వర్గం మొత్తానికి పోయే ప్రమాదం వుంది. లోకల్ నేతైన అంజన్ కుమార్ నే బరిలోకి దించటం ఎంతైనా తెలివైన పని అంటున్నారు రాజకీయ పండితులు!     రాహుల్ గాంధీ నిజంగా ముస్లిమ్ లకు దగ్గరవ్వాలనుకుంటే అజహరుద్దీన్ ను ఓవైసీ పైన పోటికి ఒప్పించటమే తెలివైన నిర్ణయం అవుతుంది. ఎందుకంటే, ఎన్నిసార్లు గెలిచినా హైద్రాబాద్ ముస్లిమ్ ల సమస్యలపై ఓవైసీలు పెద్దగా చేసిందేం లేదు. ఆ విషయాన్ని ఓటర్లుకు అజహరుద్దీన్ చేత చెప్పిస్తే కాంగ్రెస్ తిరిగి పట్టు సాధించుకోవచ్చు. అలాగే, అసదుద్దీన్ బీజేపీతో పాటూ కాంగ్రెస్ ను పదే పదే టార్గెట్ చేస్తున్నారు ఈ మధ్య. రాష్ట్రంలో టీఆర్ఎస్ కు దగ్గరగా మసులుకుంటున్నారు. జాతీయ స్థాయిలో కూడా ఆయనేం కాంగ్రెస్ కు మద్దతు పలకటం లేదు. కాబట్టి ఓవైసీలపై అజహరుద్దీన్ చేత పోరు చేయించి హైద్రాబాద్ వశం చేసుకుంటే అది పెద్ద లాభంగా మారుతుంది. లేదంటే సికింద్రాబాద్ నియోజక వర్గంలో లేనిపోని గందరగోళంతో అంజన్ కుమార్ లాంటి మాస్ లీడర్ ని కూడా ఏ బీజేపీకో, టీఆర్ఎస్ కో కోల్పోవాల్సి రావచ్చు! 

టీటీడీ చెలగాటం… టీడీపీకి ప్రాణ సంకటం!

మహాసంప్రోక్షణ మహావివాదం ఒక్క మాటతో ముగిసింది. చంద్రబాబు కలుగజేసుకుని భక్తులకి నిత్యం దర్శనాలు కల్పించాల్సిందేనని అదేశించటంతో టీటీడీ బోర్డు నిర్వాకం మరింత దుమారం కాకుండా ఆగిపోయింది. అయితే, అసలు ఇంత వరకూ పరిస్థితి రాకుండా వుంటే ఇంకా బావుండేదని మాత్రం చెప్పుకోవాలి. ఇదంతా సీఎంపైనా, అధికార పార్టీపైనా అనవసర రాద్ధాంతానికి మూలమైంది. కేవలం టీటీడీ బోర్డు వారి అనాలోచిత నిర్ణయం పెద్ద గొడవకి తెర తీసింది.     ఎన్నికల ముందు సంవత్సరం అంటే అధికార పక్షం డిఫెన్స్ లో సాగుతుంటుంది. అపోజిషన్ దూకుడుగా ఆడుతుంది. ఈ విషయం తెలియని వారు కాదు టీటీడీ చైర్మన్, ఇతర సభ్యులు, ఈవో. అయినా కూడా సరిగ్గా ప్రతిపక్షం అవకాశం కోసం ఎదురు చూస్తున్నప్పుడు మహాసంప్రోక్షణ వివాదం కోరి తల మీద తెచ్చి పెట్టారు. అసలు వెయ్యి సంవత్సరాలుగా రామానుజచార్యుల కాలం నుండీ ఈ క్రతువు జరుగుతూనే వుంది. ప్రతీ పన్నెండు సంవత్సరాలకి ఒకసారి స్వామి వారికి విశేష పూజలు, ఆగమ శాస్త్ర యుక్తంగా సేవలు జరుగుతాయి. మరి గతంలో చేసిన విధంగానే ఇప్పుడూ చేస్తే పోయేదానికి కొత్తగా భక్తుల్ని నిషేధించటం ఎందుకు? దీనికి టీటీడీ దగ్గర సరైన సమాధానం వుందని అనుకోలేం.     ఎందుకంటే, వారు చెబుతున్నట్టు గతంలో వచ్చిన దాని కంటే ఇప్పుడు చాలా ఎక్కువ మంది వస్తున్నారన్నది నిజం. కానీ, అందుకు తగ్గట్టే సాంకేతిక సౌకర్యాలు కూడా పెరిగాయి. మనసుంటే మార్గమూ వుంటుంది. రోజుకు ఇరవై వేల మందికి ఏ విధంగా చూసినా దర్శనం కల్పించే అవకాశం వుంటుందని బోర్డు వారే ఒప్పుకున్నప్పుడు ఆ పని చేయకుండా మొత్తంగా దర్శనాలు రద్దు చేయటం, అవసరం వున్నా లేకున్నా కొండపైకి దార్లు మూయటం, సీసీ కెమెరాలు పని చేయవని చెప్పటం… ఇదంతా ఎందుకు? రమణ దీక్షితులు కేంద్రంగా సాగుతోన్న వివాదానికి మరింత ఆజ్యం పోసింది మహా సంప్రోక్షణ! చంద్రబాబు నాయుడు ఇప్పటికైనా నిర్ధిష్టమైన ఆదేశాలు ఇవ్వటంతో పెద్ద దుమారం తప్పిందనాలి. ప్రతిపక్ష నేత జగన్ దీనిపై నోరు విప్పకున్నా ఆయన పార్టీ ప్రతినిధి రోజా కొండపైనే కామెంట్స్ చేశారు. సామాన్య భక్తులు కూడా కొంత వరకూ ఆగ్రహం చెందారనే చెప్పాలి. ఒకవేళ ఈ లోపే ఎవరైనా కోర్టుకి వెళ్లి పబ్లిక్ ఇంట్రస్ట్ లిటిగేషన్ లాంటిది వేసి వుంటే? అది మీడియాలో మరింత రచ్చకి దారి తీసేది! ప్రత్యేక హోదా విషయంలో తమని టార్గెట్ చేస్తున్న చంద్రబాబుని బీజేపీ ఈ విషయంలో కార్నర్ చేసి వుండేది. హిందూ మతపరమైన విషయాలు, అదీ తిరుమల వెంకన్నకు సంబంధించిన వివాదం అయితే… కాషాయ పార్టీని నియంత్రించటం కష్టమే అయివుండేది.     వారికి ప్రత్యేక హోదా విషయంలో జరుగుతోన్న ప్రచారం నుంచీ ఏపీ ప్రజల దృష్టి మరల్చటానికి అచ్చంగా ఇలాంటి గొడవే కావాలి. దాన్ని టీటీడీ చక్కగా అందించింది. సమయానికి ఏపీ సీఎం తేరుకోవటంతో హిందువుల మనోభావాల చుట్టూ జరిగే రాజకీయం ఆదిలోనే ఆగిపోయింది! ఆ మధ్య దుర్గ గుడి వివాదం, ఇప్పుడు తిరుమల… ఇలాంటివి ఎన్నికల ఓటర్ల మీద తీవ్ర ప్రభావమే చూపే అవకాశం వుంది. కానీ, వీటిల్లో చాలా వరకూ ప్రభుత్వం, మంత్రులు, సీఎం పాత్ర చాలా తక్కువ. ఈవోలు, దేవాలయ బోర్డుల నిర్వాకాలే ఎక్కువ. కాబట్టి చంద్రబాబు నాయుడు ఎన్నికల ముందు నడుస్తోన్న ఈ కీలక సంవత్సరంలో ఇలాంటి సున్నితమైన అంశాలపై ఇక ముందు మరింత జాగ్రత్తగా వుంటే మంచిది! గొడవ జరిగాక సద్దుమణిగించటం… ఎంతో కొంత డ్యామేజ్ చేసే తీరుతుంది. వివాదం చెలరేగకుండా వుండేలా చర్యలు వుండాలి.

ఓట్ల  కోసం గ్లామర్ మంత్రాన్ని నమ్ముకుంటోన్న బీజేపీ! 

సినిమా నటులు, ఇతర సెలబ్రిటీలకు దాదాపుగా అన్ని పార్టీలు పిలిచి టికెట్లు ఇస్తుంటాయి. ఎందుకు? దీని వెనుక పెద్ద లాజిక్కే వుంది. సినిమా వాళ్లో, సెలబ్రిటీలో అయితే గెలిచే అకాశాలు చాలా ఎక్కువ. అదీ తొలిసారి రంగంలోకి దిగుతున్న వారైతే జనం క్రేజ్ తో ఓట్లు వేసేస్తారు. ఆ తరువాత వారు ఎంత వరకూ నియోజక వర్గానికి ఉపయోగపడతారన్నది వాళ్ల ఆసక్తి, నిజాయితీ మీద ఆధారపడి వుంటుంది. కానీ, ఎవరికీ తెలియని కొత్త వార్ని తెచ్చి నిలబెట్టేదాని కన్నా కాస్త పేరున్న సెలబ్రిటీల్ని నిలపటం పార్టీలకి సేఫ్. అందుకే, వారి కోసం ఎన్నికల సీజన్లో గాలం వేస్తుంటాయి. ఇక గెలుపు కంటే మరో ముఖ్యమైన అంశం… సెలబ్రిటీలు పార్టీల అధినాయకత్వానికి పెద్దగా ప్రమాదం కాదు. వారు ఎంత మెజార్టీతో గెలిచినా తమ పని తాము చేసుకుపోతుంటారు తప్ప దాదాపు ఏ సందర్భంలోనూ పార్టీ నాయకత్వానికి తలనొప్పులు తీసుకురారు. సెలబ్రిటీలకు అసలు సిసలు పార్టీల అంతర్గత రాజకీయం తెలియదు కాబట్టి నాయకత్వాన్ని ధిక్కరించి ముఠాలు కట్టటం లాంటివి చేయరు. ఇలా రెండు విధాలా లాభం వుండటం వల్లనే ఈ సారి మరో మారు బీజేపి సెలబ్రిటీ గ్లామర్ పై ఆశలు పెట్టుకుంటోంది.     దేశంలోని చిన్న చిన్న ప్రాంతీయ పార్టీలు కూడా సినిమా వాళ్ల కోసం ఎప్పుడూ ఎదురు చూస్తుంటాయి. అలాంటిది బీజేపీ, కాంగ్రెస్ వార్ని ఎలా వదిలేస్తాయి. ఇప్పటికే చాలా మంది సినిమా వాళ్లు కాంగ్రెస్ , బీజేపీల టికెట్లపై గెలిచారు. అమితాబ్ బచ్చన్ మొదలు మన కృష్ణంరాజు దాకా వున్న వాళ్ల లిస్ట్ చాలా పెద్దదే! అయితే, 2014లో మోదీ యూపీఏ పై దండయాత్ర చేసి స్వంత మెజార్టీతో నెగ్గారు. అందులో కూడా సెలబ్రిటీల పాత్ర కాస్త వుందనే చెప్పాలి. హేమామాలిని లాంటి వారు ఎప్పటిలాగే కమల దళం కోసం పోటీ చేయగా కొత్తగా పరేష్ రావల్, అనుపమ్ ఖేర్ భార్య , సీనియర్ నటి కిరణ్ ఖేర్, ఒలంపిక్ గోల్డ్ మెడలిస్ట్ రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ లాంటి వారు ఎన్నికల బరిలో దూకారు.     2014 కంటే ఇప్పుడు మోదీ పరిస్థితి కాస్త క్లిష్టంగా వుంది. అయిదేళ్ల ప్రభుత్వ వ్యతిరేకత పైకి కనిపించకున్నా ఆందోళన కలిగిస్తోంది. అందుకే, జనం ఈజీగా కన్విన్స్ అయ్యేలా మరింత మంది సెలబ్రిటీలను బ్యాలెట్ బ్యాటిల్ లోకి దించాలని డిసైడ్ అయ్యారట. ముఖ్యంగా, బాలీవుడ్ లో షారుఖ్, సల్మాన్, ఆమీర్ ఖాన్లకు ధీటుగా నిలుస్తూ కరుడుగట్టిన ఉత్తరాది బీజేపీ అభిమానులకు ఫేవరెట్ అయిన అక్షయ్ కుమార్ ని రంగంలోకి దించే యోచనలో వున్నారట. కానీ, ఆయన బీజేపీ పెద్దలు ఆశించినట్టు పంజాబ్ నుంచో, దిల్లీ నుంచో తలపడాలంటే ముందు కెనడా పౌరసత్వం వదులుకోవాలి. ఇప్పటికే మోదీ, అమిత్ షా టీమ్ అక్కీకి రెడీ అవ్వమని చెప్పారట. బాలీవుడ్ ఖిలాడీ ఏం చేస్తాడో! అక్షయ్ తో పాటూ అనుపమ్ ఖేర్ ని కూడా బీజేపీ పోటీలో పెట్టాలని భావిస్తుందంటున్నారు.     నానాపటేకర్ ని ఆయన స్వంత రాష్ట్రం మహారాష్ట్ర నుంచీ పోటీ చేయిస్తారట. వీరే కాకుండా ఎన్నికలు దగ్గర పడుతోన్నకొద్దీ మరింత మంది కాషాయ కండువాలతో పార్టీకి సెలబ్రిటీ గ్లామర్ తెస్తారని ప్రచారం జరుగుతోంది. కాకపోతే, ఇటు తెలంగాణలో పెద్దగా బలం లేక, అటు ఏపీలో ప్రత్యేక హోదా విషయంలో తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటోన్న బీజేపీతో ముందకు సాగటానికి ఇక్కడైతే ఏ సెలబ్రిటీ సాహిసించే పరిస్థితి లేదు! తెలుగు రాష్ట్రల్లో కొత్తగా బీజేపీ కండువాలు కప్పుకునే మూడ్ లో ఏ ప్రముఖులు కూడా కనిపించటం లేదు. మరీ ముఖ్యంగా సినీ సెలబ్రిటీలైతే అంత రిస్క్ తీసుకుంటారని అస్సలు భావించలేం. కాబట్టి బీజేపీ సెలబ్రిటీ గ్లామర్ మంత్రానికి తెలుగు రాష్ట్రాల్లో అయితే చింతకాయలు రాలవనే నిర్ణయించుకోవాలి!

కేసీఆర్‌కు గద్దర్, కోదండరామ్‌ల డ్యామేజ్ తప్పదా?

ఒకవైపు ఏపీ రాజకీయాలు నిత్యం హాట్ హాట్ గా నడుస్తున్నాయి. ఓ సారి పవన్, చంద్రబాబు ఫైట్, మరోసారి చంద్రబాబు, జగన్ మాటల యద్ధం, ఇవేవీ కాకపోతే, ప్రత్యేక హోదా విషయంలో కేంద్రంపై పోరాటాలు… ఇలా రోజూ ఆసక్తికరంగానే సాగిపోతోంది ఆంధ్రా వ్యవహారం. కానీ, తెలంగాణలో కాస్త భిన్నమైన వాతావరణం వుంది. ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ సభలు, సమావేశాలు, ప్రెస్ మీట్లు ఎన్ని ఏర్పాటు చేసినా అధికార పక్షంపై దుమారం రేగేలా కామెంట్లు చేయలేకపోతోంది. టీ కాంగ్ అద్యక్షుడు ఉత్తమ్ సహా అందరూ కేసీఆర్ ని, ఆయన పథకాల్ని టార్గెట్ చేస్తున్పప్పటికీ మీడియాలో, జనంలో పెద్ద చర్చకు దారి తీయటం లేదు. దీనికి ప్రధానమైన కారణం… ఏపీలో వున్నట్టుగా చంద్రబాబు, జగన్, పవన్ వంటి వ్యక్తుల చుట్టూ తెలంగాణలో రాజకీయం లేదు! కేసీఆర్ తో సమానమైన ఛర్మిష్మా గల నేత కాంగ్రెస్ లో కనిపించటం లేదు. అలాగే, ఎవరు సీఎం క్యాండిడేటో తెలియని స్థితిలో … పూర్తిగా దిల్లీ అదుపు, ఆజ్ఞాల్లో టీ కాంగ్రెస్ పని చేయాలి. కానీ, కేసీఆర్, కేటీఆర్, కవిత, హరీష్ రావు ప్రత్యక్ష నాయకత్వంలో ప్రాంతీయ పార్టీ అయిన తెరాస దూసుకుపోతోంది. ఇదే పోటీలో సమతుల్యం దెబ్బతినేలా చేస్తోంది. ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ, వైసీపీ రెండూ ప్రాంతీయ పార్టీలు కావటంతో పరిస్థితి నువ్వా, నేనా అన్నట్టు వుంటోంది.     ఇప్పుడు పరిస్థితి ఎలా వున్నా… కనీసం వచ్చే ఎన్నికల తరువాతైనా తెలంగాణలో అధికార మార్పు వుంటుందా? కాస్త రాజకీయ అవగాహన వున్న వారు ఎవరైనా తెలంగాణ కాంగ్రెస్ అంత ఈజీగా కేసీఆర్ ని గద్దె దించలేదని చెప్పేస్తారు. అందుకు తగిన కారణాలు కూడా వున్నాయి. కేసీఆర్ వైఫల్యాలు అడపాదడపా కాంగ్రెస్ నాయకులు మీడియా ముందు చెబుతోన్నా గట్టిగా జనంలోకి తీసుకెళ్లలేకపోతున్నారు. పైగా రైతులకి ముఖ్యమంత్రి ఎకారానికి ఇంతంటూ డబ్బులు ఇవ్వటం, బీమా కల్పించటం, కొన్ని వర్గాలకి గొర్రెలు, బర్రెలు వంటివి పంపిణీ చేయటం లాంటివి చేస్తూ కులాల వారీగా ఆకట్టుకుంటున్నారు. మైనార్టీల్ని కూడా మతపరమైన సంతుష్టీకరణ చేస్తూ పట్టిపెడుతున్నారు. కేసీఆర్ చాణక్యానికి టీ కాంగ్ వద్ద పెద్దగా ఎదురు సమాధానాలు లేవు. ఇక బీజేపీ లాంటి ఇతర ప్రతిపక్షల సంగతైతే మరీ దయనీయం. వారు కూడా ఎలాంటి ప్రతిఘటన చూపటం లేదు. ఈ సమయంలో జనంలో కొంత ఆసక్తి రేపుతున్న వారు ఇద్దరున్నారు! వారే… కోదండ రామ్, గద్దర్!     కోదండరామ్ ఇప్పటికే తెలంగాణ జన సమితి పెట్టేశారు. ఆ మద్య సభలు, సమావేశాలు, నిరసనలు చేసి అందరి దృష్టినీ ఆకర్షించారు. కేసీఆర్ కూడా ముందు జాగ్రత్తగా ఆయన ప్రయత్నాల్ని గట్టిగా ఎదుర్కొన్నారు. స్వయంగా కోదండరామ్ ని విమర్శించారు కూడా. ఇక ఇప్పుడు గద్దర్ రంగంలోకి దిగబోతున్నట్టు ప్రకటించారు. లెఫ్ట్ పార్టీలు ఏర్పాటు చేసిన బహుజన ఫ్రంట్ మీటింగ్ లో ఆయన ఓట్ల రాజకీయం వైపు తాను రాబోతున్నానని సంకేతాలిచ్చారు. ఇది ఒక విధంగా పెద్ద వార్తే! గద్దర్ లాంటి వ్యక్తులు కేసీఆర్ కు వ్యతిరేకంగా మాట్లాడితే ఓటర్లపై ఖచ్చితంగా ప్రభావం వుంటుంది. కానీ, ఎంత అనేదే పెద్ద ప్రశ్న. ఓట్ల రాజకీయాల్ని వ్యతిరేకించే నక్సల్ వాదిగా గద్దర్ ఇంత కాలం కొనసాగారు. కానీ, ఇప్పుడు ఆయనే ఓట్ల కోసం జనంలోకి వెళతానని అంటున్నారు. లాల్, నీల్ కలయిక అంటూ మాట్లాడారు. లెఫ్ట్ తో దళితులు కలవాలని ఆయన కోరుకుంటున్నారు. ఇదంతా కేసీఆర్ కు ఎంత వరకూ నష్టం చేయగలదు?     కోదండరామ్ అయినా, గద్దర్ అయినా నిజాయితీ విషయంలో మచ్చ లేని వారు. వాళ్లని జనం నమ్ముతారు. కానీ, మందు, బిర్యానీ, కులం, మతం ప్రధానంగా జరుగుతుంటాయి మన ఎన్నికలు. వాటిలో వీరికి మన ఓటర్లు ఎంత ప్రాముఖ్యత ఇస్తారో అనుమానమే! చాలా మంది ఓట్ల పోరాటంలో ఓడిపోయిన ఉద్యమకారుల విషయంలో ఇది గతంలో జరిగింది కూడా. లక్షలాది జనం తరలి వచ్చే ఉద్యమకారులకి ఓట్లు మాత్రం అంత తేలిగ్గా పడవు. అందుకు బోలెడు కారణాలు. ప్రధానమైంది ఎన్నికల సమయంలో జరిగే మనీ మ్యానేజ్మెంట్. ఆ విషయంలో గద్దర్ వ్యతిరేకిస్తున్న కేసీఆర్, మోదీ ఇద్దరూ సిద్ధహస్తులే! మరి ఇటువంటి సమయంలో కేసీఆర్ ని కట్టడి చేయాలని నిజంగా గద్దర్, కోదండరామ్ అనుకుంటే ఏం చేయాలి?     కోదండరామ్, గద్దర్లే వేరు వేరు వేదికల ద్వారా ఎన్నికలకి వెళుతున్నారు. ఇక ఎప్పుడూ టీఆర్ఎస్ కి వ్యతిరేకంగా వుండే కాంగ్రెస్, బీజేపీలు వుండనే వున్నాయి. ఇలా ప్రతిపక్షంలో ఎందరు ఎక్కువై ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిస్తే కేసీఆర్ కు అంత ఆనందం! ఆయనకు వచ్చే సీట్లు మరింతగా పెరుగుతాయి. ఇది తెలియనంత అమాయకులు కాదు గద్దర్, కోదండరామ్, కాబట్టి వారిద్దరూ టీఆర్ఎస్, బీజేపీలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ తో జతకట్టి ముందుకు సాగితేనే కొంతైనా ఫలితం రాబట్టగలిగే అవకాశం వుంటుంది. టీ కాంగ్రెస్ కూడా గద్దర్, కోదండరామ్ లాంటి వార్ని తమతో కలుపుకుని ముందుకు పోయే పరిపక్వత చూపాలి. అలాంటిదేం ఇంత వరకూ కనిపించలేదు. ఇదే పరిస్థితి కొనసాగితే… ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలటం ద్వారా … గద్దర్, కోదండరామ్ ల ప్రచారం అంతా కేసీఆర్ కు వరంగా మారే ప్రమాదముంది!

చంద్రబాబు వ్యూహంతో… జగన్ ఒత్తిడికి లోనవుతున్నాడా? 

ఒక్కసారి మనం 2014 కంటే వెనక్కి వెళితే… మళ్లీ తెలంగాణ ఉద్యమం కళ్ల ముందు కనిపిస్తుంది! అప్పటి పరిస్థితుల్లో అన్ని పార్టీలు ప్రత్యేక తెలంగాణకు మద్దతిచ్చినవే. కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ, వైసీపీ, సీపీఐ… ఇలా ప్రతీ పార్టీ జైతెలంగాణ అనక తప్పలేదు. అయితే, మిగతా పార్టీలన్నీ ఆంద్రాలో నష్టం జరుగుతోన్న తెలంగాణకు సై అని ఎందుకు అన్నాయి? జనంలో వున్న సెంటిమెంట్ ని టీఆర్ఎస్ గుర్తించి క్యాష్ చేసుకుంది కాబట్టి! గులాబీ బాస్ కేసీఆర్ జనకాంక్షని గ్రహించి ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడేలా చేసి మిగతా అన్ని పార్టీల్ని కార్నర్ చేయగలిగారు! ఇప్పుడు అలాంటి వ్యూహమే చంద్రబాబు కూడా చేస్తున్నారని చెప్పుకోవచ్చు! అందులో జగన్ ఒత్తిడికి లోనుకావటం అసలు విశేషం!     ప్రత్యేక హోదా అంటూ గత కొంత కాలంగా టీడీపీ తన ఉద్యమాన్ని తార స్థాయికి చేర్చింది. ఏకంగా ప్రధాని మోదీని టార్గెట్ చేసుకుని రాష్ట్రంలో, దిల్లీలో పోరుబాట పట్టింది. ఎన్డీఏ నుంచి బయటకొచ్చి జనం ముందు బీజేపీని దోషిని చేసింది. ఇదంతా సక్సెస్ అవుతున్నట్టేనా? కేంద్రం ప్రత్యేక హోదా ఇచ్చే సూచనలైతే కనిపించటం లేదు. కానీ, చంద్రబాబు పొలిటికల్ స్కోర్ అయితే పెంచుకుంటున్నారు. మరీ ముఖ్యంగా, ప్రతిపక్ష నాయకుడు జగన్ అంకంతకూ కార్నర్ అవుతున్నారు. టీడీపీ ఒకవైపు స్పెషల్ స్టేటస్ ఇవ్వలేదని బీజేపీని, బీజేపితో సీక్రెట్ దోస్తీ చేస్తున్నారని జగన్ ని ఇరుకున పెడుతోంది. దాని ఫలితం పదే పదే కనిపిస్తోంది.     స్పెషల్ స్టేటస్ విషయంలో టీడీపీ జోరుని తగ్గించేందుకు జగన్ తన ఎంపీల చేత రాజీనామాలు చేయించారు. పార్లమెంట్లో నిరసనలు చేయించారు. కాకపోతే, ఏదీ కూడా మోదీకి మరి ఇబ్బందికరంగా మారకుండా జాగ్రత్తపడుతూనే వచ్చారు. ప్రసిడెంట్, వైస్ ప్రసిడెంట్ ఎన్నికలప్పుడు బేషరతుగా మద్దతిచ్చి మోదీ, షాల దృష్టిలో పడ్డారు. కానీ, ఈ మెతకదనం అసలుకే ఎసరు తెచ్చేలా వుందని భావించి ఇప్పుడు అలెర్ట్ అయ్యారు. మరోసారి మరో పరోక్ష ఎన్నికల్లో బీజేపికి మద్దతిస్తే టీడీపీ జనంలోకి ఆ విషయం తీసుకెళ్లి రచ్చ చేస్తుందని భయపడ్డ జగన్ కమలానికి వ్యతిరేకంగా ఓటు వేస్తామంటూ సెలవిచ్చారు!     రాజ్యసభ డిప్యూటి చైర్మన్ పదవికి ఈ పార్లమెంట్ సెషన్లో ఎన్నికలు జరగనున్నాయి. టీడీపీ ప్రస్తుతం శత్రుపక్షం కాబట్టి ఎలాగూ మద్దతివ్వదు. కానీ, అనూహ్యంగా జగన్ కూడా తాము వ్యతిరేకంగా ఓటు వేస్తామని ప్రకటించారు. బీజేపి అభ్యర్థికి వ్యతిరేకంగా ఓటు వేయటం అంటే మోదీ, షాలకు కోపం తెప్పించటమే. అయినా జగన్ ఈ సాహసానికి పూనుకోవటం టీడీపీ వల్లే అనాలి.     ఇప్పటికే రానున్న పార్లమెంట్ సమావేశాల్లో అవిశ్వాసంతో మోదీ సర్కార్ ను ఓ ఆటాడాలని టీడీపీ యోచిస్తోంది. ఎన్డీఏలో లేని ప్రతీ పార్టీని కలిసి మద్దతు అడుగుతోంది. శివసేన లాంటి పార్టీల్ని కూడా కదలించే ప్రయత్నం చేస్తోంది. ఇలా ప్రత్యేక హోదా ఇవ్వని మోదీపై చంద్రబాబు యుద్ధం చేస్తోంటే… జగన్ బీజేపికి మద్దతెలా ఇస్తారు? ఇస్తే జనంలోకి ఎలాంటి సంకేతాలు వెళతాయి? టీడీపీ నేతలు చూస్తూ ఊరుకుంటారా? ఈ ప్రశ్నల కారణంగానే జగన్ మోదీ వ్యతిరేక టీమ్ లోకి రావాల్సి వచ్చింది. ఇది ఖచ్చితంగా చంద్రబాబు ఒత్తిడి వ్యూహమనే చెప్పాలి! ఏపీలో బాబు బీజేపిని ఒంటరని చేశారనే అనాలి! 

రామ మందిర రాజకీయం మళ్లీ రాజుకుంటోంది!

ఓవైసీ అయోధ్య రామ మందిరం వివాదం పై మళ్లీ నోరు విప్పాడు. ఆ కేసులో తీర్పు ఇవ్వాల్సింది సుప్రీమ్ కోర్టు అన్నాడు. అమిత్ షా కాదంటూ సెటైర్లు వేశాడు. అంతే కాదు, ఎన్నికల ముందు రాబోతోన్న అయోధ్య తీర్పు పారదర్శకంగా వుండాలని పేర్కొన్నాడు. ఇలా హఠాత్తుగా ట్విట్టర్ లో అయోధ్య గురించి ఎందుకు మాట్లాడాల్సి వచ్చింధి?     అసదుద్దీన్ ఓవైసీ ఆందోళనకి కారణం అమిత్ షా! ఆయన హైద్రాబాద్ వచ్చిన సందర్భంగా బీజేపీ నాయకులతో, ఆరెస్సెస్, వీహెచ్పీ నేతలతో మాట్లాడారు. మీడియాకు నేరుగా వివరాలేవీ తెలియజేయనప్పటికీ … ఆయన రామ మందిరం గురించి మాట్లాడారని మ్యాటర్ లీకైంది. 2019 ఎన్నికల లోపే అయోధ్యలో రామ మందిరం సాకారం అవుతుందని షా అన్నారట. ఇది ఎలా బయటకు వచ్చిందోగానీ జాతీయ మీడియాలో కూడా కలకలం రేపింది. కోర్టులో వున్న విషయంపై బీజేపీ అధ్యక్షుడు అయ్యి వుండి అమిత్ షా అలా ఎలా మాట్లాడతారని నిరసనలు మొదలయ్యాయి. ఓవైసీ ట్విట్టర్ వ్యాఖ్యలకు ఇదే కారణం! ఎన్నికలు దగ్గర పడుతోన్న కొద్దీ అన్ని పార్టీలు తమ తమ బలాల్నీ, బలహీనతల్ని మథింపు చేసుకుంటాయి. బీజేపీకి ఖచ్చితంగా రామ మందిరం పెద్ద బలం. బలహీనత కూడా! మోదీ ప్రస్తుతం స్వంత మెజార్టీతో ప్రధానిగా వున్నారు. ఆయన వాజ్ పేయ్ లా పొత్తుల వల్ల మందిరం కట్టలేకపోయానని చెప్పలేరు. అందుకే, ఎట్టి పరిస్థితుల్లోనూ కాషాయదళం రామ మందిరానికి పునాదులు వేశాకే పార్లమెంట్ ఎన్నికలకు వెళ్లాలని చూస్తోంది. సుప్రీమ్ లో కేసు విచారణ జరుగుతున్న వేగం కూడా ఆ దిశగానే వుంది. కోర్టు తీర్పు ఎలా చూసినా ఎన్నికల లోపే వచ్చేస్తుంది. అయితే, తీర్పు ఏంటన్నది ఎవ్వరం చెప్పలేం. కానీ, షా తనకు ఇప్పటికే తెలుసునన్నట్టు నాయకులకి, కార్యకర్తలకి మందిరం కట్టేస్తామని చెప్పటం వివాదాస్పదం అవుతోంది.     కోర్టులో వున్న వ్యవహారంపై తాను వ్యాఖ్యలు చేయకూడదని అమిత్ షాకి తెలియదనుకోవటం మూర్ఖత్వమే అవుతుంది. ఒకవేళ ఆయన తెలిసే మాట్లాడి వుంటే… ముందు ముందు మరోమారు రామ జన్మభూమి రాజకీయాలకు కీలకం అవ్వనుందని భావించవచ్చు. ఓవైసీ లాంటి వాళ్లు అప్పుడే పాదర్శకం అంటూ వ్యాఖ్యలు చేస్తున్నారంటే… తీర్పు ఎలా వచ్చినా గందరగోళం తప్పకపోవచ్చు. అలాగే, ఉత్తర్ ప్రదేశ్ లోని షియా ముస్లిమ్ నాయకులు కూడా రామ మందిర నిర్మాణానికి బీజేపీ డైరెక్షన్లో అనుకూల వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇలా మొత్తం మీద రామ మందిర అనుకూల, వ్యతిరేక వర్గాల మధ్య పెద్ద రచ్చే జరగవచ్చు రానున్న ఎన్నికల సీజన్లో! ఖచ్చితంగా 2014లో లాగా అభివృద్ధి, అవినీతి వంటి విషయాలు పెద్దగా ప్రభావం చూపకపోవచ్చు. మరి ఇదంతా చివరాఖరుకు ఎవరికి లాభిస్తుంది? ప్రస్తుతానికి రాముడికే తెలియాలి! ఎన్నికల ఫలితాల నాడు మాత్రమే మనకు తెలుస్తుంది!

అసలు బిజినెస్ చేసుకోమంటే… సైడ్ బిజినెస్సే ముద్దంటున్న మల్టీప్లెక్స్లు!

వీకెండ్ వస్తే గతంలో ఎటు వెళ్లాలా అని జనం తెగ ఆలోచించే వారు! ఒక్కొక్కరూ ఒక్కో దారి చూసుకునే వారు. కొందరు సినిమాకి, కొందరు చుట్టాల వద్దకి, కొందరు షికార్లకి వెళ్లే వారు. కానీ, ఎప్పుడైతే షాపింగ్ మాల్స్ అండ్ మల్టీప్లెక్సులు ప్రత్యక్షం అయ్యాయో జనం వారాంతాలు అక్కడే గడిచిపోతన్నాయి. చాలా మంది మల్టీప్లెక్సుల్లో సినిమాలకి విపరీతంగా అలవాటు పడిపోయారు. శనివారం, ఆదివారం సినిమాలు చూస్తూ, చిరుతిళ్లు తింటూ , షాపింగ్ చేస్తూ గడిపేస్తున్నారు. కానీ, ఇదే సమయంలో తమ జేబులకి చిల్లులు కూడా పెట్టుకుంటున్నారు. విచిత్రంగా జనం సొమ్ము దోచేస్తున్నది సినిమా టికెట్లు కాదు. సినిమా మధ్యలో నోట్లో నమిలే చిరుతిళ్లు!     మల్టీప్లెక్సుల్లో ఓ కాఫీ, ఓ కోక్, ఓ పాప కార్న్ లేదా ఓ బర్గర్… ఇవన్నీ ఎంత రేటు వుంటాయో అందరికీ తెలిసిందే! నిజానికి బయట కంటే డబుల్ రేట్లు పలుకుతుంటాయి. కొన్ని చోట్ల మూడింతలు కూడా! కానీ, కామన్ ఇండియన్స్ వీట్ని ఎప్పుడూ పెద్దగా పట్టించుకోలేదు. కారణం… అంత పోష్ గా, అద్దాల మేడల్లో ప్రదర్శించే సినిమాల్లో… ఇలాంటి ఖరీదైన ఫుడ్సే వుంటాయని కన్విన్స్ అయిపోయారు. అయితే, ఎవరికో ఒకరికి మాత్రం ఒళ్లు మండకుండా వుంటుందా? అదే జరిగింది. ఓ ముంబై వాసి నేరుగా వెళ్లి ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేశాడు. మల్టీప్లెక్సుల్లో మామూలు క్వాలిటితోనే సర్వ్ చేయబడే ఫుడ్స్ ఎందుకు విపరీతమైన ధరకు అమ్ముతున్నారని అతడి ప్రశ్న! కోర్టు స్వీకరించింది. ప్రస్తుతం విచారణ జరుగుతోంది!     ఒకవైపు కోర్టులో కేసు వుండగానే మహరాష్ట్ర అసెంబ్లీలో ఇదే అంశంపై చర్చ జరిగింది. మొదట ఎన్సీపీ నేత మల్టీప్లెక్సుల దోపిడి అంశం లేవనెత్తినప్పటికీ తరువాత అన్ని పార్టీల వారు గొంతు కలిపారు. అందరూ ఇది అన్యాయమనే అన్నారు. అధికార బీజేపీ మంత్రి నేరుగా ఇక మీదట తమ ఇష్టానుసారం రేట్లు నిర్ణయించడం కుదరదని చెప్పేశారు! ప్రతీ ఆహారం ఎమ్మార్పీ రేటుకే అమ్మేలా రూల్ తెస్తామన్నారు. పైగా మల్టీప్లెక్సుల్లోకి ప్రేక్షకులు తమ స్వంత ఆహారం కూడా తెచ్చుకోవచ్చని ప్రకటించారు!   మహారాష్ట్ర అసెంబ్లీలో జరిగిన వ్యవహారమంతా మనకు పైకి చిన్న విషయంగా కనిపించినా పీవీఆర్ సినిమాస్ లాంటి మల్టీప్లెక్స్ కంపెనీల షేర్లే డౌన్ అయిపోయాయి స్టాక్ మార్కెట్లో! ఎందుకంటే, మల్టీప్లెక్సుల్లో తినుబండారాలు, పానీయాల మీద రేట్లు తగ్గిపోతే దాదాపు 30-35 శాతం లాభాలు తగ్గిపోతాయట యాజమాన్యాలకి! ఇది బాహాటంగానే చెప్పేస్తున్నారు. అంటే, ఇంత కాలం మల్టీప్లెక్సుల వారు సినిమా టికెట్ల మీద కంటే ఈ కొసరు అమ్మకాల మీదే ఎక్కువ రాబట్టుకుంటున్నారన్నమాట!     బయట పదికి దొరికేది మల్టీప్లెక్స్ లో యాభై రూపాయాల కంటే ఎక్కువ రేట్ కి అమ్ముతున్నారంటే… రెండింతలు, మూడింతలు డబ్బు ఎక్కువ చెల్లిస్తూ ఇంత కాలం ప్రేక్షకులు ఎంత నష్టపోయి వుంటారు? పైగా ఇప్పటికీ వ్యవహారమంతా మహారాష్ట్రలోనే జరుగుతుంది! హైద్రాబాద్, బెంగుళూరులోని మల్టీప్లెక్స్ ల దోపిడికి ఎప్పుడు అంతం? ఇంకా కొన్ని నెలలైనా పట్టవచ్చు! కోర్టు తీర్పు వస్తే తప్ప మహా సర్కార్ కూడా అంతిమ నియమ, నిబంధనలు నిర్ణయించలేదు. ఆ తరువాత మెల్లగా ఒక్కో రాష్ట్రం మల్టీప్లెక్సుల దోపిడీని అరికట్టాలి! అంత వరకూ సామాన్యుడు వినోదం కోసమో, బలహీనతకొద్దో ఎక్కువ డబ్బులు ఖర్చు చేస్తూనే వుండాలి. చేతులకు చిలుము వదులుతూనే వుండాలి. ఇదీ పరిస్థితి!

జగన్‌కి బంపర్ ఆఫర్! స్వీకరించక తప్పదా?

  2019 ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ అమిత్ షాకి మిత్రుల అవసరం తెలిసి వస్తోందా? పరిణామాలు చూస్తుంటే అలాగే అనిపిస్తోంది. బీహార్ కు వెళ్లిన ఆయన నితీష్ తో చర్చలు జరిపారు. టిఫిన్ చేస్తూ, లంచ్ చేస్తూ మీటింగ్ లు నడిపిన షా ఎట్టకేలకు కొంచెం నమ్మకం కలిగించగలిగాడు నితీష్ లో. సీట్ల పంపకం సాకుగా చూపి ఎన్డీఏ నుంచి బయటకు రావాలని భావించారు నితీష్. తన అనుకూలాన్ని బట్టి ఇటు వైపు, అటు వైపు గోడ దూకటం జేడీయూ నేతకి మామూలే. కాకపోతే, ఇప్పుడు మోదీ, షా ఆయనని వదులుకునే స్థితి లేదు. అందకే హుటాహుటిన పాట్నా వెళ్లి చర్చల రాజకీయం చేశారు షా. అయినా కూడా నితీష్ ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటారో తెలియని స్థితి!     బీహార్ నుంచి తెలంగాణకొచ్చిన అమిత్ షా ఎవ్వరూ ఊహించని విధంగా రామోజీ రావును కలిశారు. ఆయనతో ఏం మాట్లాడారు అన్నది సస్పెన్సే! అయితే, రానున్న ఎన్నికల్లో అన్ని దిక్కుల్లోంచి వ్యతిరేకత వచ్చే అవకాశాలుండటంతో అమిత్ షా ఈ మధ్య చాలా మంది ప్రముఖుల్నే కలుస్తున్నారు. వారిని తమకు మద్దతు తెలపమని కోరుతున్నారు. బ్యాడ్మింటన్ స్టార్ సైనా కూడా అమిత్ షాతో బేటీ అయ్యారట. కానీ, ఇవన్నిటికంటే కీలకమైన వ్యాఖ్యలు అమిత్ షా హైద్రాబాద్ వదిలి వెళ్లాక వచ్చాయి. పైగా అవి కేంద్రంలోని ఓ మంత్రి చేశారు. ఆయన బీజేపీ వాడు కాకపోవటమే ఇక్కడ ట్విస్ట్!   మహారాష్ట్రకు చెందిన రిపబ్లిక్ పార్టీ నాయకుడు రామ్ దాస్ అథావలే. ఆయన ఎన్డీఏలో భాగంగా కేంద్రంలో మంత్రిగా వున్నారు. ఆయన తాజా వ్యాఖ్యల్లో విస్పష్టంగా జగన్ ను ఎన్డీఏలోకి ఆహ్వానించారు. అలా వస్తే తాము జగన్ ని ఏపీ సీఎం చేసేందుకు కూడా సహకరిస్తామన్నారు! ఇక్కడ తాము అంటే ఎవరో రామ్ దాస్ అథావలే చెప్పలేదు. మహాలో చాలా చిన్న పార్టీ అయిన రిపబ్లిక్ పార్టీ సహకారంతో జగన్ సీఎం అవుతారా? కాదు! అంటే, అథావలే మాట్లాడుతున్నది మోదీ, అమిత్ షాల గురించేననుకోవాలి! వారి సహకారంతో జగన్ సీఎం అవ్వొచ్చునని చెప్పటం… తీవ్రమైన పరిణామామే! ఇంత బహిరంగంగా జగన్ ను తమ కూటమిలోకి రమ్మనటం 2019 ఎన్నికల ఫీవర్ కారణంగానే అనుకోవచ్చు!     చంద్రబాబు ఎన్డీఏ నుంచీ వెళ్లిపోతే నితీష్ వచ్చాడని షా అన్నారు ఈ మద్య! అదే సమయంలో కేంద్రంలోని మంత్రి జగన్ ను రమ్మంటున్నారు. సీఎం చేస్తామంటున్నారు. అంటే, చంద్రబాబు లేని లోటు జగన్ చేరికతో పూడ్చుకోవాలని కమలం పెద్దలు డిసైడ్ అయిపోయారా? ఇంచుమించూ అదే అనుకోవాలి! కానీ, ఈ బంపరాఫర్ కి జగన్ ఎలా స్పందిస్తారు? ఇప్పటికే టీడీపీ జగన్ని, విజయసాయిరెడ్డిని మోదీ మనుషులంటూ ప్రచారం చేస్తోంది. అలాగే, ప్రత్యేక హోదా ఇవ్వని హిందూత్వ పార్టీతో జగన్ చేతులు కలిపితే ఆంద్రా ప్రజలు , ముఖ్యంగా, మైనార్టీలు ఎలా రిసీవ్ చేసుకుంటారు? టీడీపీ క్యాష్ చేసుకోకుండా వుంటుందా? జగన్ ను వెనక్కి పట్టి వుంచే ప్రశ్నలు ఇవే!     జగన్ కు రాజకీయంగా కొంత డ్యామేజ్ వున్నా రిస్క్ చేసి ఎన్డీఏలో చేరతాడనే కొందరు అభిప్రాయపడుతున్నారు. ఆయన మీద వున్న కేసులే ఇందుకు కారణం అవుతాయని వారి అంచన. మోదీ, షా కేంద్ర దర్యాప్తు సంస్థల ద్వారా వైసీపీని లొంగదీసుకోవచ్చిన అనుమానిస్తున్నారు! చూడాలి మరి… జగన్ ఎన్డీఏలో చేరితే… అది చంద్రబాబుకి, టీడీపికి పెద్ద ప్లస్ పాయింటే అవుతుంది!