కాంగ్రెస్ తో పొత్తు.. చంద్రబాబుకి తలనొప్పిగా మారనుందా?

  తెలుగు రాజకీయాల్లో తలపండిన మేథావులు కూడా కాంగ్రెస్, టీడీపీ పార్టీల మధ్య పొత్తు కుదురుతుందని ఊహించి ఉండరు. కానీ అనూహ్యంగా తెలంగాణలో ఈ రెండు పార్టీలు మహాకూటమితో దగ్గరయ్యాయి. దీన్ని కొందరు స్వాగతించగా.. కొందరు మాత్రం తీవ్రంగా వ్యతిరేకేరించారు. అయితే మొదట చంద్రబాబు కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకోవాలి అనుకోలేదు. తెరాసతో కలిసి నడుద్దాం అనుకున్నారు. కానీ తెరాస నుండి సానుకూల స్పందన రాకపోవడంతో మహాకూటమి వైపు అడుగులు పడ్డాయి. అదికూడా కాంగ్రెస్ పార్టీనే, టీడీపీతో పొత్తుకు ఉవ్విళ్లూరింది. టీడీపీలోని మెజారిటీ నాయకులు పార్టీని వీడినా పలు చోట్ల కేడర్ మాత్రం టీడీపీనే అంటిపెట్టుకొని ఉన్నారు. ఇప్పటికీ తెలంగాణలో టీడీపీకి 10 శాతం పైనే ఓటుబ్యాంకు ఉందని అంచనా. అందుకే కాంగ్రెస్, టీడీపీతో దోస్తీకి సిద్ధమైంది. కాంగ్రెస్ కి తెలంగాణలో బలం ఉంది కానీ ఇప్పటికిప్పుడు ఒంటరిగా బరిలోకి దిగి తెరాసను ఓడిస్తుందా? అంటే అనుమానమే. అందుకే కాంగ్రెస్ తమ బలానికి, టీడీపీ బలం తోడైతే తెరాసను ఈజీగా ఓడించవచ్చని భావించింది. పొత్తు దిశగా అడుగులు వేసింది. ఇక తప్పనిసరి పరిస్థితుల్లో చంద్రబాబు పొత్తు విషయాన్ని తెలంగాణ నేతలకే వదిలేసారు. ఇది కాంగ్రెస్ తో పెట్టుకున్నట్టు కాదు. తెరాసకు వ్యతిరేకంగా ఏర్పడిన కూటమిలో భాగం అవుతామనే ఉద్దేశంతో టీడీపీ అంగీకరించింది. అయితే ప్రజల్లోకి ఇది కాంగ్రెస్ టీడీపీ పొత్తుగానే వెళ్ళింది. దీనివల్ల కాంగ్రెస్ పార్టీకి లాభం కొండంత ఉంది కానీ టీడీపీకి ఆవగింజంత కూడా లాభం లేదు. లాభం సంగతి అటుంచితే ఇంకా టీడీపీకి నష్టమే అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరోవైపు ఈ పొత్తు వల్ల భవిష్యత్తులో మరిన్ని తలనొప్పులు వచ్చేలా ఉన్నాయి.       తెలంగాణలో టీడీపీకి భారీ సంఖ్యలో నాయకులు లేకపోయినా.. ఓటుబ్యాంకు మాత్రం బాగానే ఉంది. సుమారు 40 స్థానాల్లో బలంగా ఉన్న టీడీపీ.. కేవలం కాంగ్రెస్ ఇచ్చే 10, 15 స్థానాల కోసం పొత్తుకు సిద్దమవ్వడం ఏంటంటూ తెలుగు తమ్ముళ్లు ఆవేదన వ్యక్తం చేసున్నారు. ఒంటరిగా పోటీచేసినా ఆ 10,15 స్థానాలు గెలిచే అవకాశం ఉంది. అలాంటప్పుడు కాంగ్రెస్ తో పొత్తు ఎందుకనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అసలు టీడీపీ అంటే కాంగ్రెస్ కి వ్యతిరేకంగా పుట్టిన పార్టీ అని పేరుంది. అలాంటి టీడీపీ ఇప్పుడు అదే కాంగ్రెస్ తో దోస్తీ చేస్తే ప్రజలకి తప్పుడు సంకేతాలు వెళ్లే ప్రమాదం ఉందని కొందరు టీడీపీ నేతలు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు ఏపీ టీడీపీ నాయకులు కూడా కాంగ్రెస్ తో దోస్తీని వ్యతిరేకిస్తున్నారు. దీంతో చంద్రబాబు ఆలోచనలో పడ్డారు. దోస్తీ తెలంగాణకే పరిమితం.. ఏపీలో, కేంద్రంలో కాంగ్రెస్ ఎప్పటికీ మన శత్రువే అనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని చూస్తున్నారట. తెలంగాణలో పరిస్థితి వేరు. ప్రస్తుతం అక్కడ టీడీపీకి నాయకుల కొరత ఉంది. ముందు అక్కడ పార్టీ బలోపేతం మీద దృష్టి పెట్టాలి. అందుకే కూటమిలో కలవాల్సి వచ్చిందని అభిప్రాయం వ్యక్తం చేసున్నారట. మొత్తానికి తెలంగాణలో కాంగ్రెస్ తో దోస్తీ చంద్రబాబుకి తలనొప్పి తీసుకొచ్చి పెడుతుంది. ఓ వైపు ఏపీ అభివృద్ధి మీద దృష్టి పెడుతూనే.. మరోవైపు తెలంగాణ దోస్తీ గురించి వివరణ ఇచ్చుకోవాల్సి వస్తూ బుర్ర వేడెక్కుతుందట. మరోవైపు తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేతలు టీడీపీ కూటమిలో భాగం కావడం మాకు కలిసొచ్చింది. ఈ దోస్తీ వల్ల కాంగ్రెస్ కి ఎంత లాభం ఉందో.. టీడీపీకి అంతే నష్టం ఉంటుందని అభిప్రాయపడుతున్నారట. చూస్తుంటే ఈ దోస్తీ మూలంగా చంద్రబాబుకి భవిష్యత్తులో మరిన్ని తలనొప్పులు తలుపుతట్టేలా ఉన్నాయి. చూద్దాం మరి చంద్రబాబు వీటి నుండి ఎలా బయటపడతారో ఏంటో.

కాంగ్రెస్ టీడీపీకి అన్యాయం చేస్తుందా?

  తెలుగు రాజకీయ చరిత్రలో ఎవరూ ఊహించని సంఘటన ఒకటి జరిగింది. అదే తెలంగాణాలో మహాకూటమితో కాంగ్రెస్, టీడీపీ దగ్గరవడం. అయితే తెలంగాణలోని రాజకీయ పరిస్థితుల దృష్ట్యా తెలంగాణకు మాత్రమే పరిమితమయ్యేలా టీడీపీ మహాకూటమికి మద్దతు తెలిపింది. నిజానికి తెలంగాణలో టీడీపీతో పొత్తుకి మొదటి నుండి కాంగ్రెస్ పార్టీ నే ఎక్కువ ఉత్సాహం చూపింది. ఇక తప్పనిసరి పరిస్థితుల్లో ప్రజాప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని టీడీపీ మహాకూటమి వైపు మొగ్గుచూపింది. పేరుకి మహాకూటమిలో కాంగ్రెస్ కాకుండా మూడు పార్టీలు ఉన్నాయనే కానీ.. కాంగ్రెస్ కి టీడీపీ నే ప్రధాన బలం. టీజెఎస్ పార్టీలో కోదండరాం లాంటి బలమైన నేతలు ఉన్నారు కానీ బలమైన ఓటు బ్యాంకు లేదనే చెప్పాలి. ఇక సిపిఐ సంగతి సరేసరి. ఒకప్పుడు ఎర్రజెండాలు రెపరెపలాడాయి కానీ ఇప్పుడు ఆ ప్రభావం లేదనే చెప్పాలి. టీడీపీ పరిస్థితి అలా కాదు. ఎప్పటినుండో ఉన్న పార్టీ.. ప్రజలకు చేరువైన పార్టీ. 2014 ఎన్నికల అనంతరం మెజారిటీ నాయకులు పార్టీని వీడారు కానీ.. కేడర్ మాత్రం టీడీపీనే అంటిపెట్టుకొని ఉంది. ఇప్పటికీ తెలంగాణలో టీడీపీకి 10 శాతంపైనే ఓటు బ్యాంకు ఉంది. అందుకే కాంగ్రెస్ టీడీపీకి దగ్గరైంది. తమ బలానికి టీడీపీ బలం తోడైతే అధికారం ఈజీగా పొందొచ్చని భావించింది. అయితే అలాంటి టీడీపీకి ఇప్పుడు కాంగ్రెస్ అన్యాయం చేస్తుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.     సీట్ల కేటాయింపు విషయంలో మిగతా పార్టీలను చూసినట్టు కాంగ్రెస్, టీడీపీని చిన్నచూపు చూస్తుంది. టీడీపీ తెలంగాణలో దాదాపు 40 స్థానాలలో బలంగా ఉంది. ఈ 40 స్థానాల్లో టీడీపీ.. మొదటి రెండు స్థానాల్లో నిలిచే అవకాశముంది. ఈ లెక్కల ప్రకారం టీడీపీకి 25 నుంచి 30 స్థానాలు కేటాయించాలి. కానీ కాంగ్రెస్ మాత్రం 10,15 సీట్లిచ్చి చేతులు దులుపుకోవాలని చూస్తోంది. ఈ విషయంలో తెలంగాణ టీడీపీ నేతలు కూడా గట్టిగా పట్టుబట్టడం లేదు. ఏదో సచ్చినోడి పెళ్ళికి వచ్చిందే కట్నం అన్నట్టుగా ఎన్ని సీట్లిస్తే అన్ని చాలులే అన్నట్టు వ్యవహరిస్తున్నారు. ఇదే టీడీపీ కార్యకర్తలకు మింగుడు పడటంలేదు. ఇంత బలమైన కేడర్ ఉన్న పార్టీకి 10 స్థానాలు ఏంటి అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రేవంత్ రెడ్డి లాంటి నేతలు టీడీపీలో ఉండి ఉంటే కనీసం 25 సీట్లైనా కావాలని కాంగ్రెస్ మీద ఒత్తిడి తెచ్చేవారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. దీంతో ఇక చంద్రబాబు తెరమీదకు వచ్చి సీట్ల గురించి మాట్లాడి కనీసం 25 సీట్లైనా వచ్చేలా చూడాలని తెలుగు తమ్ముళ్లు అభిప్రాయపడుతున్నారు. లేదంటే కాంగ్రెస్ పది సీట్లు కేటాయించి టీడీపీ ఓటుబ్యాంకుతో లబ్ధిపొందాలని చూస్తోంది. ఇప్పటికైనా అధిష్టానం దృష్టి పెట్టి పార్టీకి అన్యాయం జరగకుండా చూడాలని తెలుగు తమ్ముళ్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

జనసేనతో పొత్తు.. జగన్ నై నై

గత కొంతకాలంగా వైసీపీ, జనసేన పార్టీల మధ్య రహస్య పొత్తు ఉంది.. ఆ రెండు పార్టీలను వెనకుండి బీజేపీ నడిపిస్తోంది అంటూ పలువురు ఆరోపిస్తూ వచ్చారు. ఇక ఈమధ్య వైసీపీ, జనసేనల మధ్య అధికార పొత్తుకు రంగం సిద్దమైందంటూ వార్తలు కూడా వచ్చాయి. మరి వైసీపీతో పొత్తుకు జనసేన సుముఖంగా ఉందో లేదో తెలీదు కాని.. జనసేనతో పొత్తు అంటే మాత్రం వైసీపీ అధినేత జగన్ నై నై అంటున్నారట.     తనపై విమర్శలు, అవినీతి ఆరోపణలు చేస్తోన్న పవన్‌ కళ్యాణ్‌ తో పొత్తు పెట్టుకోనే ప్రసక్తేలేదని.. ఈ విషయంలో తనతో సంబంధం లేకుండా జనసేనతో చర్చించవద్దని.. జగన్ తన పార్టీ నాయకులకు ఆదేశాలు ఇచ్చారట. జనసేనతో పొత్తు పెట్టుకుంటే వైసీపీ వల్ల జనసేనకు లాభం కలుగుతుంది కానీ.. జనసేన వల్ల వైసీపీకి అసలు ఏ మాత్రం లాభం ఉండదని జగన్ భావిస్తున్నారట. అందుకే జగన్ ఒకవైపు చంద్రబాబును టార్గెట్‌ చేస్తూనే మరో వైపు పవన్‌ పై విమర్శలు చేస్తున్నారు. మరోవైపు జగన్‌, పవన్‌ లను కలసి పోటీ చేయించాలని బీజేపీ పావులు కదుపుతున్నట్టు వార్తలొచ్చాయి. ఈ వార్తల్లో నిజమెంతుందో తెలీదు కానీ జగన్ మాత్రం  పవన్‌ తో పొత్తు పెట్టుకునే ప్రసక్తేలేదని అంటున్నారట. ఆయన గొంతెమ్మ కోర్కెలు తీర్చలేం ఆయన కోరిన సీట్లు ఇవ్వలేం.. గత ఎన్నికల పరిస్థితులకు ఇప్పటి పరిస్థితులకు ఎంతో వ్యత్యాసం ఉంది. పవన్‌కు రాజకీయ లబ్దిని చేకూర్చడం కంటే ఒంటరిగా ముందుకు వెళదాం అని జగన్‌ తేల్చి చెబుతున్నారట.     ఇటీవల విజయసాయిరెడ్డి పవన్‌తో రహస్య మంతనాలు జరిపినట్లు వార్తలొచ్చిన విషయం తెలిసిందే. జగన్‌ ఆదేశాల మేరకు విజయసాయిరెడ్డి సంప్రదింపులు జరిపారా?.. లేదా ఆయన వ్యవహారశైలి ఎలా ఉంటుందని తెలుసుకునేందుకు స్వయంగా కలిశారా?.. అనే విషయం బయటపడడం లేదు. ఏది ఏమైనా పవన్ తో ముందు ముందు మరిన్ని సమస్యలు వస్తాయని వైసీపీ ఆందోళన చెందుతుంది. వైసీపీ ఓటు బ్యాంక్‌ జనసేనకు లభించవచ్చు కానీ జనసేన ఓటు బ్యాంక్‌ వైసీపీకి బదిలీ అయ్యే పరిస్థితి కనిపించడం లేదు. పవన్‌ ఓటు బ్యాంక్‌ కేవలం కాపు యువజన ఓటర్లేనని.. వారు జనసేన అభ్యర్థికి ఓటు వేస్తారే తప్ప పొత్తు ఉన్నా వైసీపీకి ఓటు వేసే పరిస్థితి లేదని జగన్‌ భావిస్తున్నారట. ఈ నేపథ్యంలో పవన్‌ తో పొత్తు కన్నా.. అప్పటి పరిస్థితులను బట్టి  ఒంటరిగా ఎన్నికల బరిలోకి దిగాలా? ఎవరినైనా కలుపుకుపోవాలా? అనే విషయంపై చర్చిద్దామని జగన్‌ నాయకులకు చెప్పినట్లు తెలుస్తోంది. భవిష్యత్తులో ఏమంటారో తెలీదు కానీ ప్రస్తుతానికైతే జనసేనతో పొత్తు అంటే జగన్ నై నై అంటున్నారట.

చంద్రబాబుని ఫాలో అవుతున్న వైఎస్ జగన్.!!

చంద్రబాబుకి ముందుచూపు ఉన్న నేతగానే కాకుండా.. నిబద్ధత, క్రమశిక్షణ ఉన్న నేతగా పేరుంది. పార్టీ నేతలైనా, ప్రజాప్రతినిధులైనా, ప్రభుత్వ అధికారులైనా ఆయనలాగే క్రమశిక్షణతో ఉండాలని చంద్రబాబు కోరుకుంటారు. నిబద్ధత, క్రమశిక్షణ విషయంలో ఆయన చాలా స్ట్రిక్ట్ గా ఉంటారు. అవసరమైతే సొంత పార్టీ నేతలకు క్లాసులు కూడా పీకుతారు. అంతెందుకు టిక్కెట్ల కేటాయింపు విషయంలో కూడా ఆయన ముక్కు సూటిగా వ్యవహరిస్తారు. ఎప్పటికప్పుడు నియోజక వర్గాల వారీగా తమ పార్టీ ఎమ్మెల్యేల పనితీరు ఎలా ఉందో రిపోర్ట్స్ తెప్పించుకుంటారు. చిన్న తప్పులుంటే సూచలను ఇస్తారు. ఆ ఎమ్మెల్యే మీద ప్రజల్లో మరీ వ్యతిరేకత ఉంటే పద్ధతి మార్చుకో లేదంటే వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ ఇచ్చేది లేదని కుండబద్దలు కొట్టేస్తారు. అందుకే ఆయన హయాంలో ఇంచుమించు అందరూ ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేస్తారు. చంద్రబాబుకి స్వప్రయోజనాల కంటే పార్టీ ప్రయోజనాలు, రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం. అందుకే ఆయన టిక్కెట్ల కేటాయింపు, అభివృద్ధి పనుల విషయంలో నిక్కచ్చగా ఉంటారు. దానికి తగ్గట్టే ఫలితాలు కూడా అందుకుంటారు. ఇదే ఇప్పుడు జగన్, చంద్రబాబుని ఫాలో అయ్యేలా చేసిందేమో అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.     జగన్, చంద్రబాబు అంటే ఒంటికాలి మీద లేస్తారు. ప్రతిపక్ష నేతగా అధికారపార్టీ నేతని విభేదించడం కామన్ లేండి. చంద్రబాబు మీద విమర్శలు, ఆరోపణలు చేస్తూ.. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబుని ఎలాగైనా ఓడించి సీఎం అవ్వాలని చూస్తున్న జగన్.. చంద్రబాబునే ఫాలో అవుతూ చంద్రబాబుని దెబ్బతీయాలని చూస్తున్నారట. మొన్నటివరకు టిక్కెట్ల కేటాయింపు విషయంలో చంద్రబాబు నమ్ముకున్న.. నియోజకవర్గాల వారీగా రిపోర్టులు, క్రమశిక్షణనే జగన్ కూడా నమ్ముకుంటున్నారట. ఒక్క మాటలో చెప్పాలంటే ' పద్ధతి మార్చుకో.. లేదంటే నిన్ను మార్చి వేరే వారికి టిక్కెట్ ఇస్తాం' అని పెద్ద రాయుడు రేంజ్ లో వార్నింగ్ ఇస్తున్నారట.     జగన్‌ ఓ వైపు పాదయాత్ర చేస్తూనే.. మధ్యలో విరామ సమయంలో ఆయా నియోజకవర్గాల ఇన్‌చార్జ్‌లు, సిట్టింగ్‌లతో ఒక్కొక్కరితో వ్యక్తిగతంగా సమావేశమై వారి బలాలు, బలహీనతలపై పూర్తిస్థాయిలో సమీక్ష చేస్తున్నారు. తాజాగా గుంటూరు జిల్లాలోని నరసరావుపేట లోక్‌సభ స్థానం పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్‌చార్జ్‌లు, ఎమ్మెల్యేలను చీపురుపల్లెకు పిలుపించుకొని రివ్యూ నిర్వహించారట. సర్వే బృందాలు కూడా సమీక్షలో ఉన్నాయి. ప్రతి ఒక్కరిని నీ బలహీనతలు ఇవి అంటూ బహిర్గత పరిచి సలహాలు, సూచనలు ఇచ్చారట. బలహీనతలు ఎక్కువ మోతాదులో ఉన్న వారిని ఉద్దేశించి మీ బలహీనతలను నెల రోజుల్లో సరిచేసుకుంటే సరి, లేకుంటే సీటు వేరే వారికి ఇవ్వాల్సి వస్తుందని హెచ్చరించినట్లు సమాచారం. ఒక ఇన్‌ఛార్జ్‌ని ఉద్దేశించి నీకు మాటలు ఎక్కువ, తిరుగుడు తక్కువ అని మందలిస్తూ ఇప్పటి నుంచైనా నియోజకవర్గ ప్రజలతో మమేకం కావాలని ఆగ్రహించినట్లు తెలుస్తోంది. అలాగే ఒక ఎమ్మెల్యేను ఉద్దేశించి కూడా మాట్లాడుతూ ఎన్నికల సమీపిస్తున్నాయ్‌.. చురుగ్గా వ్యవహరించకపోతే ప్రత్యర్ధిని ఢీకొనడం కష్టమని సూచించినట్లు సమాచారం. అంతేకాదు ఆయా ఇన్‌చార్జ్‌ల, ఎమ్మెల్యేల తీరు నచ్చక నియోజకవర్గంలోని సీనియర్‌ నేతలు ఎవరెవరు దూరంగా ఉంటున్నారో కూడా సర్వే నివేదిక ద్వారా వివరిస్తూ వారిని దగ్గరకు తీసుకునే చర్యలు వెంటనే చేపట్టాలని, గెలవాలంటే అహాన్ని వీడాలని సలహా ఇచ్చినట్లు తెలుస్తోంది. మొత్తానికి జగన్ కూడా చంద్రబాబు స్టైల్ లో నియోజకవర్గాల వారీగా రిపోర్టులు తెప్పించుకొని ఫోకస్ చేస్తున్నారుగా అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

రాఫెల్ డీల్ రచ్చ.. సుప్రీంకోర్టు విచారణ

గత కొంతకాలంగా కాంగ్రెస్ పార్టీ రాఫెల్ డీల్ గురించి బీజేపీ ప్రభుత్వం మీద ఆరోపణలు, విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. రాఫెల్ యుద్ధ విమానాల తయారీకి రిలయన్స్‌ కంపెనీని భాగస్వామిగా చేసుకోవాల్సిందిగా భారత ప్రభుత్వమే సూచించిందంటూ ఫ్రాన్స్‌ మాజీ అధ్యక్షుడు ఫ్రాన్స్‌వో హోలన్‌ ఇటీవల చేసిన వ్యాఖ్యలతో.. ఈ రాఫెల్ వివాదం మరింత ముదిరింది. తరువాత భారత ప్రభుత్వం ప్రమేయం లేదని ఫ్రాన్స్‌ మాట మార్చింది కానీ.. కాంగ్రెస్ మాత్రం బీజేపీ మీద మాటల యుద్ధం చేస్తూనే ఉంది. ముఖ్యంగా కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ రాఫెల్ యుద్ధ విమానాల ఒప్పందంలో మోదీ ప్రభుత్వం తీవ్ర అవినీతికి పాల్పడిందని మొదటి నుండి ఆరోపిస్తూ వస్తున్నారు. యుద్ధ విమానాల తయారీలో ఎటువంటి నైపుణ్యం, అనుభవం లేని రిలయన్స్‌ కంపెనీని ఎందుకు ఎంపిక చేసుకున్నారో చెప్పాల్సిందిగా మోదీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. మొత్తానికి మోదీని ఈ రాఫెల్ వివాదంతో ఇరుకునపెట్టే ప్రయత్నం చేస్తున్నారు.   అయితే రాఫెల్ యుద్ధ విమానాల ఒప్పందం గురించి కాంగ్రెస్, బీజేపీల మధ్య జరుగుతున్న మాటల యుద్ధం కాస్తా ఇప్పుడు సుప్రీంకోర్టు మెట్లు ఎక్కింది. 36 రాఫెల్ జెట్‌ విమానాల కొనుగోలుకు ఎంత వ్యయం అయిందనే వివరాలను తెలియజేయాల్సిందిగా కోరుతూ వినీత్‌ ధండా అనే ఓ న్యాయవాది సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేశారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగోయ్‌, జస్టిస్‌ ఎస్‌కే కౌల్‌, జస్టిస్‌ కెఎం జోసఫ్‌ ఈ పిటిషన్‌ విచారణను చేపట్టేందుకు అంగీకరించారు. ఈనెల 10న ఈ పిటిషన్‌ విచారణను ప్రారంభిస్తామని జస్టిస్‌ గొగొయ్‌తో కూడిన ధర్మాసనం వెల్లడించింది.   యూపీఏ హయాంలో రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలుకు, ఎన్డీయే హయాంలో విమానాల కొనుగోలుకు ఎంత కేటాయించారనే దానికి సంబంధించిన వివరాలు తెలియజేయాల్సిందిగా న్యాయవాది వినీత్‌ తన పిటిషన్‌లో పేర్కొన్నారు. దీంతో పాటు రిలయన్స్‌, డసో ఏవియేషన్‌ మధ్య ఈ ఒప్పందం ఏ విధంగా జరిగిందో తెలపాల్సిందిగా కోరారు. ఆయనతో పాటు మరో న్యాయవాది ఎంఎల్‌ శర్మ కూడా రాఫెల్ ఒప్పందానికి సంబంధించిన పూర్తి వివరాలు బహిర్గతం చేయాల్సిందిగా కోరుతూ పిటిషన్‌ వేశారు. ఆ పిటిషన్‌ విచారణ కూడా ఈనెల 10న చేపట్టనున్నారు. ఇన్నాళ్లు అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధంగా ఉన్న రాఫెల్ డీల్ వివాదం ఇప్పుడు సుప్రీంకోర్టు గడప తొక్కడంతో.. ఈ వివాదం ఎటువైపు వెళ్తుందోనని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. చూద్దాం మరి ఏం జరుగుతుందో.

బాలయ్య రాకతో ఖమ్మం టీడీపీ బలపడిందా?

ఒకప్పుడు ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో పసుపు జెండా బాగానే రెపరెపలాడింది. అయితే రాష్ట్ర విభజన అనంతరం పరిస్థితి మారిపోయింది. ఏపీలో అయితే టీడీపీ అధికారంలోకి వచ్చింది కానీ తెలంగాణలో వెనుకబడిపోయింది. దాదాపు  ఆ పార్టీలోని బలమైన నేతలంతా పార్టీని వీడారు. దీంతో తెలంగాణలో టీడీపీకి పెద్ద దిక్కు లేకుండా పోయింది. అయితే ఇలాంటి బ్యాడ్ టైములో కూడా టీడీపీకి కలిసొచ్చే అంశం ఒకటుంది. తెలంగాణలో టీడీపీని ఎందరు వీడినా.. కొన్ని ప్రాంతాల్లో మాత్రం కేడర్ టీడీపీనే అంటిపెట్టుకొని ఉంది. అలాంటి వాటిల్లో ఖమ్మం జిల్లా ఒక్కటి. పసుపు జెండా తప్ప వేరే జెండా పట్టుకోవడానికి మనసొప్పని కేడర్.. ఎప్పటికైనా టీడీపీకి తెలంగాణలో పూర్వవైభవం వస్తుందన్న ఆశతో, నమ్మకంతో.. నిరుత్సాహ పడకుండా ఎదురు చూసారు. వారి ఆశ ఆనందంగా, నమ్మకం నిజంగా మారడానికి.. మహాకూటమి, బాలకృష్ణ రూపంలో అదృష్టం వరించింది.     తెలంగాణ రాజకీయ పరిస్థితుల దృష్ట్యా కాంగ్రెస్, టిజెఎస్, సిపిఐలతో కలిసి టీడీపీ మహాకూటమిలో భాగమైంది. ఈ మహాకూటమితోనే తెలంగాణలో టీడీపీ ఉనికి కోల్పోలేదు, నాయకులు దూరమైనా పార్టీ బలంగానే ఉందనే విషయం స్పష్టమైంది. మహాకూటమితో తెలంగాణ టీడీపీలో ఉత్సాహం వచ్చింది. ముఖ్యంగా ఖమ్మంలో ఉత్సాహం రెట్టింపు అయింది. ఖమ్మంలో మొదటి నుండి టీడీపీ బలంగా ఉంది. విభజన అనంతరం తుమ్మల నాగేశ్వరరావు లాంటి సీనియర్ నేతలు కొంత కేడర్ ని వెంటపెట్టుకొని పార్టీని వీడి తెరాసలో చేరినా.. మిగిలిన కేడర్ మాత్రం టీడీపీతోనే ఉంది. మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు, సత్తుపల్లి తాజా మాజీ ఎమ్మెల్యే సండ్ర లాంటి నేతలు ఉన్నా.. ఈ నాలుగేళ్లు పరిస్థితుల వల్ల వారు కార్యకర్తలకు పూర్తీ భరోసా ఇవ్వలేకపోయారు. అయితే నాలుగేళ్ళ తరువాత వాళ్ళ ఎదురుచూపులు ఫలించాయి. మహాకూటమితో అటు నేతల్లో, ఇటు కార్యకర్తల్లో ఉత్సాహం మొదలైంది. అయితే ఈ ఉత్సాహం రెట్టింపు అయింది మాత్రం బాలయ్య పర్యటనతోనే అని చెప్పాలి.     నామా, సండ్ర ఖమ్మం జిల్లాలో బాలయ్య పర్యటనకు శ్రీకారం చుట్టారు. అంచనాలకు మించి ఆ పర్యటన విజయం సాధించింది. మధిర, వైరా, సత్తుపల్లి నియోజక వర్గాల్లో పర్యటించిన బాలయ్య పలు చోట్ల ఎన్టీఆర్ విగ్రహాలను ఆవిష్కరించారు. అదే విధంగా తన స్పీచ్ తో ఉత్సాహం నింపారు. కార్యకర్తలు కూడా బాలయ్యకు అడుగడుగునా నీరాజనాలు పట్టారు. మధిర నుండి సత్తుపల్లి వరకు కార్యకర్తలు, అభిమానులు స్వచ్చందంగా విశేష సంఖ్యలో పాల్గొని పర్యటనను విజయవంతం చేసారు. పార్టీని వీడలేక పార్టీకి మంచిరోజులు ఎప్పుడు వస్తాయంటూ నాలుగేళ్లుగా లోలోపలే కుమిలిపోతూ ఎదురు చూస్తున్న కార్యకర్తలు బాలయ్య పర్యటనతో కట్టలు తెంచుకున్న ఉత్సాహంతో పసుపు జెండాలు పట్టుకొని బాలయ్య వెంట నడిచారు. మనసు అంగీకరించకపోయినా వేరే పార్టీలలో చేరిన వారు కూడా బాలయ్య రాకతో ఇదే కదా మన అసలు పార్టీ అంటూ పసుపు జెండా పట్టుకున్నారు. దీంతో మొన్నటి వరకు అసలు పార్టీ ఉందా? అని వెటకారం చేసినవారే.. పార్టీ ఇంత బలంగా ఉందా!! అని ఆశ్చర్యపోతున్నారు. ఏదేమైనా బాలయ్య రాకతో ఖమ్మం టీడీపీ బలపడిందనే చెప్పాలి.

వైసీపీ, జనసేన పొత్తు.. ఎవరికి నష్టం?

  ఏపీలో ఎన్నికలకు ఇంకా సుమారు ఏడు నెలల సమయం ఉన్నా రాజకీయాలు మాత్రం అప్పుడే వేడెక్కాయి. దాదాపు అన్ని పార్టీలు ఎన్నికల మీద దృష్టి పెట్టాయి. అధికార పార్టీ టీడీపీ నుండి.. వైసీపీ, జనసేన, బీజేపీ, కాంగ్రెస్ వరకు అన్ని పార్టీలు ప్రజలను ఆకట్టుకొనే పనిలో ఉన్నాయి. అయితే గత ఎన్నికలకు, రానున్న ఎన్నికలకు పరిస్థితులు పూర్తి భిన్నంగా ఉన్నాయి. గత ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ, జనసేన కలిసి పోటీ చేసాయి. టీడీపీ అధికారంలోకి వచ్చింది. తరువాత రాజకీయ పరిస్థితుల మూలంగా ఆ రెండు పార్టీలకు టీడీపీ దూరం కావాల్సి వచ్చింది. ఏపీకి బీజేపీ అన్యాయం చేసింది, నమ్మించి మోసం చేసింది అంటూ టీడీపీ ఎన్డీయే నుండి బయటికొచ్చి బీజేపీ మీద పోరాడుతుంది. బీజేపీ కూడా అదేస్థాయిలో చంద్రబాబుని టార్గెట్ చేస్తూ విమర్శలు చేస్తుంది. ఈ రెండు పార్టీలు ఇప్పట్లో కలిసే అవకాశమైతే అసలు లేదు. ఇక జనసేన విషయానికొస్తే 2014 ఎన్నికల్లో పవన్ టీడీపీ కి మద్దతిచ్చారు కానీ తరువాత టీడీపీ కి దూరమై విమర్శలు గుప్పిస్తున్నారు. జనసేన కూడా టీడీపీతో కలిసే అవకాశం లేదు. అంటే వచ్చే ఎన్నికల్లో టీడీపీ ఒంటరిగానే బరిలోకి దిగబోతుంది. తెలంగాణలో అక్కడి రాజకీయ పరిస్థితుల దృష్ట్యా మహాకూటమితో కాంగ్రెస్ కి దగ్గరైంది కానీ ఏపీలో ఆ పరిస్థితి లేదు. అదీగాక రాష్ట్ర విభజనతో ఏపీకి కాంగ్రెస్ అన్యాయం చేసిందనే భావనతో ఏపీ ప్రజలు గత ఎన్నికల్లో ఒక్క సీట్ కూడా కట్టపెట్టలేదు. ఇప్పుడు ప్రత్యేకహోదాతో కాంగ్రెస్ ప్లేస్ లో బీజేపీ వచ్చి చేరింది. ఇదే సమయంలో కాంగ్రెస్ ప్రత్యేకహోదాపై తొలి సంతకం అంటూ మళ్ళీ ఏపీలో ఉనికిని చాటుకునే ప్రయత్నం చేస్తుంది. ఏది ఏమైనా కాంగ్రెస్, బీజేపీలు వచ్చే ఎన్నికల్లో పెద్దగా ప్రభావం చూపలేవనేది వాస్తవం. అయితే బీజేపీ మాత్రం ఈ విషయాన్ని అంగీకరించకుండా చంద్రబాబుని టార్గెట్ చేస్తూనే ఉంది.   ఇప్పుడు బీజేపీ, వైసీపీ, జనసేన అందరి కామన్ టార్గెట్ చంద్రబాబు. చంద్రబాబుని వచ్చే ఎన్నికల్లో ఓడించడమే వీరి ముందున్న ప్రధాన లక్ష్యం. పైకి ఈ మూడు పార్టీలు విడివిడిగా టార్గెట్ చేస్తూ విమర్శలు చేస్తున్నా.. రహస్యంగా ఈ మూడు పార్టీలు పొత్తు పెట్టుకున్నాయని.. బీజేపీ డైరెక్షన్లోనే జగన్, పవన్ పని చేస్తున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. దానికి తగ్గట్టే జగన్, పవన్ కూడా కేవలం చంద్రబాబు ప్రభుత్వం మీదే విమర్శలు చేస్తున్నారు. రాష్ట్రానికి జరిగిన అన్యాయం గురించి కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయట్లేదు. దీంతో రహస్య పొత్తు అనే వార్తలకు బలం చేకూరుతుంది. అసలు తెరవెనుక ఏం జరుగుతుందో తెలిసే వరకు ఇవన్నీ ఊహాగానాలుగానే మిగిలిపోతాయి. అయితే ఇన్నాళ్లు రహస్య పొత్తు అంటూ వార్తలు కాస్త త్వరలో వైసీపీ, జనసేన అధికార పొత్తు అంటూ వార్తలు మొదలయ్యాయి. జనసేనకు 25 సీట్లు కేటాయిస్తే వైసీపీతో పొత్తుకు పవన్ సిద్ధమంటూ ఈ మధ్య బాగా వార్తలు బాగా వినిపిస్తున్నాయి. అసలు ఈ వార్తల్లో నిజమెంత?. ఏపీ ప్రజలు హోదా విషయంలో బీజేపీపై కోపంగా ఉన్నారు కాబట్టి వైసీపీ, బీజేపీతో అధికారికంగా పొత్తు పెట్టుకునే సాహసం చేయదు. ఇక జనసేన విషయానికొస్తే జనాల్లోకి నెగటివ్ వెళ్లే అవకాశమైతే లేదు. కానీ పొత్తు వల్ల ఇరు పార్టీలకు నష్టం కలిగే అవకాశాలు ఉన్నాయి. జనసేన తో పొత్తు పెట్టుకుంటే వైసీపీ 25 సీట్లు త్యాగం చేయాలి. ఈ 25 స్థానాల్లో వైసీపీలో టికెట్ ఆశిస్తూ.. కొన్నేళ్లుగా పార్టీకోసం పని చేసినవారుంటారు. పొత్తులో భాగంగా మీకు టికెట్ దగ్గలేదంటే వారు అసంతృప్తితో పార్టీ వీడే అవకాశం ఉంది. దీనివల్ల అధికారం ఆశ ఏమో కానీ మొదటికే మోసం వస్తుంది. జనసేన పరిస్థితి కూడా అలాగే ఉంది. ప్రస్తుతానికైతే పార్టీ నాయకులతో కళకళలాడట్లేదు కానీ పవన్ వల్ల మంచి జరుగుతుంది, పవన్ రాజకీయాలను మార్చేస్తాడు అని నమ్మిన కొందరు యువత మాత్రం అండగా ఉన్నారు. అలాంటిది పవన్, అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న జగన్ లాంటి నేతతో చేతులు కలుపుతారా?. ఇది ఆయన్ని నమ్మిన యువత నమ్మకాన్ని వమ్ము చేసినట్టే అవుతుంది. అదీగాక ఇతను కూడా సాధారణ రాజకీయ నాయకుడే అనే అభిప్రాయం ప్రజల్లోకి వెళ్తుంది. ఇది భవిష్యత్తుకి ప్రమాదంగా మారుతుంది. అంటే వైసీపీతో పొత్తు జనసేనకు నష్టమనే చెప్పాలి. దీనిబట్టి చూస్తుంటే తెరవెనుక ఏం జరుగుతుందో తెలీదు కానీ.. తెరముందు వైసీపీ, జనసేన కలిసే అవకాశాలు లేవనే చెప్పాలి. చూద్దాం మరి ఏం జరుగుతుందో.

జగన్ రాంగ్ స్టెప్..రాజశేఖర్‌ చేతిలో వైసీపీ గెలుపు

  గుంటూరు జిల్లాలోని చిలకలూరిపేట రాజకీయాలు రసవత్తరంగా మారాయి. చిలకలూరిపేట నియోజకవర్గంలో టీడీపీకి బ్రహ్మరథంపట్టిన ద్వితీయ శ్రేణి నాయకులు, కార్యకర్తలు మంత్రి పుల్లారావు వ్యవహారశైలిని తప్పుపడుతూ.. ఆయన కుటుంబ జోక్యంపై నిరసన వ్యక్తం చేసిన సందర్బాలు ఎన్నో ఉన్నాయి. వాటిని అనుకూలంగా మలచుకుని వచ్చే ఎన్నికల్లో విజయం సాధించాలనే తపనతో మాజీ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌ నానా తంటాలు పడ్డారు. పుల్లారావు మళ్లీ ఎన్నికల్లో గెలుస్తారా? గెలవరా? ఒకవేళ ఆయన గెలిచినా తక్కువ మెజార్టీతో బయటపడతారు తప్ప ఇదివరకటి మెజార్టీ రాదని స్థానిక నేతలు భావించారు. అయితే వైసీపీ అధినేత జగన్ తీసుకున్న ఒక్క నిర్ణయంతో అక్కడి రాజకీయాలు ఒక్కసారిగా మారిపోయాయి. ఒకప్పుడు టీడీపీలో హడావుడి చేసి సంచలనం సృష్టించిన రజనిని పార్టీలో చేర్చుకోవడమే కాకుండా ఆమెను నియోజకవర్గ ఇన్‌ఛార్జిగా ప్రకటించడంతో వైసీపీలో ముసలం ఏర్పడింది. ఎన్నికోట్లు ఖర్చు పెట్టినా రజని విజయం సాధించలేరు. కానీ మర్రి రాజశేఖర్‌ ఆమెకు సంపూర్ణ మద్దతు ఇచ్చి.. ఆమెతో కలసి ప్రచారం చేస్తే.. మంత్రి పుల్లారావు గెలుపుకి గండిపడే అవకాశముందని అంటున్నారు స్థానిక నేతలు. అంటే రజిని గెలుపు మర్రి రాజశేఖర్‌ చేతుల్లో ఉందన్నమాట.   ఇదే పుల్లారావుపై చిలలూరిపేట ప్రజలు ఇండిపెండెంట్‌గా గెలిపించారు. అప్పట్లో తాను గెలుస్తానంటే ఏ ఒక్కరూ నమ్మలేదు. అప్పట్లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసిన అభ్యర్థికి పదివేల ఓట్లు మాత్రమే వచ్చాయని.. ఇప్పుడు తాను మరో నిర్ణయం తీసుకుంటే 2004 ఫలితాలు వస్తాయని అంటున్నారు  మర్రి రాజశేఖర్‌. నిజాయితీపరుడు అయిన మర్రి రాజశేఖర్‌ ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తే ఫలితాలు వేరేలా వస్తాయని టీడీపీ అభిమానులు కూడా భావిస్తున్నారు. కోట్లాది రూపాయలు సొమ్ము లేనంత మాత్రాన ఎన్నికల్లో విజయం సాధించలేరా? ఎందుకు జగన్‌ రజనీని అభ్యర్థిగా నిర్ణయించారని వైసీపీ కార్యకర్తలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. రజనీకి పూర్తి సహకారం ఇచ్చి మర్రి రాజశేఖర్‌ పనిచేస్తే మంత్రి పుల్లారావుకు ఓటమి తప్పదు. ఒకవేళ రాజశేఖర్‌ మనస్ఫూర్తిగా పనిచేయాలని భావించినా.. ఆయనను అభిమానించే ఓటర్లు ఎంత వరకు రజనీ కోసం పనిచేస్తారో తెలియదని స్థానికులు చెబుతున్నారు. ఆఖరి నిమిషంలో మర్రి రాజశేఖర్‌ని అభ్యర్థిగా ప్రకటించే అవకాశం కూడా ఉందంటున్నారు. ఏది ఏమైనా చిలకలూరిపేటలో రాజకీయాలు రసవత్తరంగా మారాయని చెప్పవచ్చు. మంత్రి పుల్లారావు, ఆయన కుటుంబ సభ్యులపై అసంతృప్తిగా ఉన్న టీడీపీ నాయకులు, కార్యకర్తలు తాజాగా వైసీపీలో జరుగుతున్న పరిణామాలను చూసి వారు మౌనం వహిస్తున్నారు. ఏది ఏమైనా మర్రి రాజశేఖర్‌ తీసుకునే నిర్ణయంపై రజనీ గెలుపు ఓటములు ఆధారపడి ఉన్నాయి. చూద్దాం మరి ఏం జరుగుతుందో.

గుంటూరు వైసీపీలో చిచ్చు.. ఏసురత్నం ఎవరో తెలుసా?

రీసెంట్ గా వైసీపీ గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి పార్టీ సమన్వయకర్తగా 'ఏసురత్నం' ను నియమించింది. అయితే అసలు ఈ ఏసురత్నం ఎవరు? అంటూ ఓ వైపు వైసీపీ నాయకులు, కార్యకర్తలు, సానుభూతిపరులు ఆరా తీస్తుండగా.. టీడీపీ మాత్రం సంబరాలు చేసుకుంటుంది. మరి ఇంతకీ ఈ ఏసురత్నం ఎవరో తెలియాలంటే ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్ళాలి. ఒకప్పుడు చంద్రబాబు అభిమాని అయిన అధికారిగా ఏసురత్నంకు పేరుంది. ఆయన పదవీ విరమణ సమయంలో సచివాలయంలో ఎస్‌పిఎఫ్‌శాఖలో పనిచేస్తూ ముఖ్యభద్రతాధికారిగా బాధ్యతలు నిర్వహించారు. ఆయనకు టీడీపీ నాయకులు, మంత్రులు చాలా మంది తెలుసు. టీడీపీ అధికారం కోల్పోయిన తరువాత ఏసురత్నానికి ప్రమోషన్‌ వచ్చి బదిలీలో వెళ్లారు. తరువాత ఆయన అక్రమంగా ఆస్తులు కూడేసుకున్నారని ఏసీబీ కేసులు పెట్టింది. ఇదంతా తనపై కావాలని కుట్ర చేసి దాడులు చేశారని.. తాను ఏ విధంగా అక్రమాస్తులు కూడబెట్టానో చెప్పాలని ఆయన అప్పటి ముఖ్యమంత్రి వై.ఎస్‌.రాజశేఖర్‌రెడ్డిని కలసి గోడు వెల్లబోసుకోవడంతో ఆయన కనికరించి ఆశీర్వదించారు.     ఆ తరువాత ఏసురత్నం ఎక్కడ పనిచేశారో తెలీదు కానీ.. కట్ చేస్తే తాజాగా గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి వైసీపీ సమన్వయకర్తగా ఎంట్రీ ఇచ్చారు. మరి జగన్‌ ఎలా ఆకర్షించారో?.. ఎంత ముట్టచెప్పారో? కానీ గుంటూరు సమన్వయకర్త పదవిని పొందారు అంటూ ఆరోపణలు వినిపిస్తున్నాయి. దళిత క్రిష్టియన్‌ అయిన ఏసురత్నాన్ని గుంటూరు-2లో ఎలా నియమించారు?. టీడీపీకి బలమైన మద్దతు ఉన్న ఈ నియోజకవర్గంలో ఏసురత్నం టీడీపీ అభ్యర్థిని ఎదుర్కోగలరా? కోట్ల రూపాయలు ముఖ్యమా? టీడీపీని  ఓడించడం ముఖ్యమా? దీని వెనుక ఏమేమి జరిగుంటుందో అనేదానిపై వైసీపీ నేతలు ఆరా తీస్తున్నారు. అదేవిధంగా అప్పిరెడ్డి తప్ప వేరే ఎవరినీ గెలిపించమని వైసీపీ నేతలు చెబుతున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ దీని వెనుక ఉన్నారా? అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. కోట్ల రూపాయలు ఉన్నాయని ఏసు రత్నాన్ని అభ్యర్థిగా నియమించారా? అప్పిరెడ్డిని కాదని ఏసురత్నాన్ని ఎవరికి కోసం నియమించారు? ఎందుకోసం నియమించారు? విధేయులైన కార్యకర్తలు జగన్‌కు అక్కర్లేదా?.. ఒకవేళ కన్నాను గెలిపించాలని ఏసురత్నాన్ని దింపినా.. తాము కన్నాను అయినా ఏసురత్నాని అయినా ఓడిస్తామని.. తాము అప్పిరెడ్డిని ఇండిపెండెంట్‌గా బరిలోకి దించుతామని.. స్వార్థం కోసం పార్టీని బలి చేయడాన్ని సహించమని వైసీపీ నేతలు చెబుతున్నారు. మరోవైపు ఏసురత్నమేమిటి? ఆయన వైసీపీ అభ్యర్థి ఏమిటి? ఇదంతా కలగా ఉందని పోలీసు అధికారులు చెబుతున్నారు. ఒకప్పుడు చంద్రబాబుకు వీరవిధేయుడైన ఏసురత్నం.. వైఎస్‌ చేసిన సహాయం వల్ల వైకాపాలో చేరారా? లేక జగన్‌ కు ముడుపులు ముట్టచెప్పి ఆయన పార్టీలో చేరారా? ఈ విషయంలో మధ్యవర్తుల ఎవరు? అంటూ పోలీసు అధికారులు కూడా ఈ విషయంపై ఆరా తీస్తున్నారు. ఏది ఏమైనా గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో టీడీపీ ఎమ్మెల్యే వేణుగోపాల్‌రెడ్డికి టిక్కెట్‌ ఇవ్వరని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో వైసీపీలోలో ఈ రకమైన ముసలం ఏర్పడడంతో టీడీపీ నాయకులు సంబరాలు చేసుకుంటున్నారు. ఏసురత్నం వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తే.. టీడీపీ మెజార్టీ ఎంత? అనేదానిపైనే ఎన్నికలు ఉంటాయని టీడీపీ నాయకులు అంటున్నారు. స్థానిక నేతలను బలిపశువులను చేయడం జగన్‌ కు ప్యాషన్‌గా మారిందని.. ఏమిటిది? అని పార్టీకి చెందిన నేతలు కూడా తప్పుపడుతున్నారు. మాజీ పోలీసు అధికారి ఏసురత్నం వైసీపీలో చేరి సమన్వయకర్తగా నియమింపబడి సంచలనం సృష్టించి స్థానిక నేతలకు నిద్రలేకుండా చేస్తున్నారు. చూద్దాం మరి గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో వైసీపీ పరిస్థితి ఏమవుతుందో.

వేడెక్కిన నెల్లూరు రాజకీయం.. ఫలించేనా టీడీపీ వ్యూహం?

  నెల్లూరు రాజకీయాలు రోజురోజుకి వేడెక్కుతున్నాయి. అక్కడ అధికార పార్టీ టీడీపీ, ప్రతిపక్షం వైసీపీ నువ్వానేనా అన్నట్టు పోటీ పడుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో అక్కడ ఫలితాలు ఎలా ఉంటాయో అంటూ ఇప్పటినుండే చర్చలు మొదలయ్యాయి. మరోవైపు టీడీపీ, వైసీపీలు జిల్లాలో పాగా వేయాలని వ్యూహాలు రచిస్తున్నాయి. నిన్నామొన్నటి వరకు నెల్లూరు జిల్లాలో బలమైన రెడ్డి సామాజికవర్గనాయకులంతా వైసీపీలో చేరడంతో టీడీపీ పని గోవిందా అన్న వ్యాఖ్యలు వినిపించాయి. ఈ నేపథ్యంలో పార్టీ అధినేత, సీఎం చంద్రబాబు రంగంలోకి దిగి వ్యవసాయశాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డిని పక్కకు తప్పించి మంత్రి నారాయణకు, మాజీ మంత్రి ఆదాల ప్రభాకర్‌రెడ్డికి పూర్తి పెత్తనం ఇచ్చినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో మంత్రి నారాయణ నెల్లూరు పట్టణ నియోజకవర్గం నుంచి పోటీ చేయడం దాదాపు ఖాయమైంది. మరోవైపు జడ్పీ ఛైర్మన్‌ బమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డిని టీడీపీలో చేర్పించేందుకు మంత్రి నారాయణ, ఆదాల చేసిన ప్రయత్నాలు ఫలించబోతునన్నట్టు తెలుస్తోంది. రేపో మాపో ఆయన టీడీపీ తీర్థం పుచ్చుకోబోతున్నట్టు సమాచారం. ఇలా వరుస పరిణామాలతో నెల్లూరు రాజకీయాలు మారిపోతున్నాయి. నెల్లూరు ఎంపి సీటు మాదేనని నిన్నామొన్నటి వరకు ధీమాగా ఉన్న వైకాపా నేతలకు 'చంద్రబాబు' ఖంగు తినిపిస్తున్నారు. లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోని ఏడు నియోజకవర్గాల్లో ఎట్టి పరిస్థితుల్లో టీడీపీ గెలవాలని మంత్రి నారాయణను, మాజీ మంత్రి ఆదాలను ఆదేశించారు. ఏయే నియోజకవర్గంలో ఎవరైతే విజయం సాధిస్తారో అనే విషయాన్ని మీకే వదిలేస్తున్నాను. సరైన అభ్యర్థులను ఎంపిక చేసే బాధ్యతను కూడా మీకే ఇస్తున్నాను. ఏదైనా విషయం ఉంటే నేరుగా తనతోనే మాట్లాడాలని మిగతా వారితో మాట్లాడాల్సిన పనిలేదని చంద్రబాబు వారికి చెప్పారని సమాచారం. నియోజకవర్గ పరిధిలోని కోవూరు ఎమ్మెల్యే విషయాన్ని ఇప్పుడేం పట్టించుకోవద్దు. టిక్కెట్‌ పోలంరెడ్డికి ఇవ్వాలా? మరెవరికైనా ఇవ్వాలా? అనే విషయాన్ని తాను చూసుకుంటానని ఈ విషయంలో వాస్తవ నివేదికలను తనకు ఇవ్వాలని చంద్రబాబు వారితో చెప్పినట్టు తెలుస్తోంది.     మరోవైపు నెల్లూరు గ్రామీణ నియోజకవర్గం నుంచి తన కుమారుడ్ని పోటీ చేయించాలనుకున్న మంత్రి సోమిరెడ్డికి చంద్రబాబు షాక్‌ ఇచ్చారట. మీ స్వంత నియోజకవర్గం మీద దృష్టి పెట్టి అక్కడ మీరు గెలిచే మార్గం చూసుకోండి. మిగతా నియోజకవర్గాల సంగతి నాకు వదిలేయండి అని గట్టిగానే చెప్పారట. అంతేకాదు కావలి, ఉదయగిరి నియోజకవర్గాల్లో పార్టీ అభ్యర్థులు గెలవాలి.. ఏదైనా లోటుపాట్లు ఉంటే తన దృష్టికి తీసుకురండి.. అంతే కానీ స్థానిక నేతలపై ఎటువంటి వ్యాఖ్యలు చేయవద్దని పార్టీ నేతలకు చంద్రబాబు సూచించారట. ఆత్మకూరు నియోజకవర్గంలో అవలీలగా విజయం సాధిస్తానని భావిస్తున్న స్థానిక వైసీపీ ఎమ్మెల్యే గౌతంరెడ్డికి మంత్రి నారాయణ, ఆదాలలు చుక్కలు చూపిస్తున్నారు. నియోజకవర్గ పరిధిలో స్థానిక నేతలందరిని ఒకదారిలో నడిపించే బాధ్యతను మంత్రి నారాయణ, ఆదాల భుజాన వేసుకున్నారు. జడ్పీ ఛైర్మన్‌ బమ్మిరెడ్డి త్వరలో టిడిపిలో చేరనున్న నేపథ్యంలో ఆత్మకూరులో పార్టీ మరింత పుంజుకోవడం ఖాయమని, పార్టీ అభ్యర్థి బల్లినేని కృష్ణయ్య గెలుపు నల్లేరుపై నడకేనని పార్టీ నేతలు చెబుతున్నారు. మాజీ ఎమ్మెల్యే కొమ్మి లక్ష్మయ్యనాయుడు కూడా టీడీపీలో చేరబోతున్నట్టు తెలుస్తోంది. ఆత్మకూరు, ఉదయగిరి, నెల్లూరు గ్రామీణ నియోజకవర్గాలపై మంత్రి నారాయణ, ఆదాలలు ప్రత్యేక దృష్టిసారిస్తున్నారు. నెల్లూరు సీటును అవలీలగా కైవసం చేసుకుంటామని భావిస్తున్న వైకాపా నేతలు.. మారిన పరిస్థితుల్లో మౌనం వహిస్తున్నారు. అంతే కాకుండా పలు మండలాల్లో పట్టున్న వైకాపా నేతలు టీడీపీలో చేరేందుకు మధ్యవర్తుల ద్వారా సంప్రదింపులు జరుపుతున్నారని సమాచారం. నెలకు ఐదు రోజులు నెల్లూరులోనే ఉంటాను.. నెల్లూరు లోక్‌సభ నియోజకవర్గంలోని ఏడు నియోజకవర్గాలే కాకుండా మిగతా నాలుగు నియోజకవర్గాల్లో అభ్యర్థులు గెలిపించే పూచీ తనపై వేసుకుంటానని మంత్రి నారాయణ చెబుతున్నారు. మంత్రి సోమిరెడ్డిని పక్కన పెట్టి నారాయణ, ఆదాలకు పూర్తి అధికారాలు ఇవ్వడంతో.. వారిద్దరూ కలసి వ్యూహరచన చేస్తున్నారు. మరి టీడీపీ వ్యూహాలు ఫలించి నెల్లూరు జిల్లాలో పాగా వేసి వైసీపీకి షాక్ ఇస్తుందేమో చూడాలి.

వంగవీటి రాధా ఓటు దేనికి.. ఎంపీకా? టీడీపీకా?

రాజకీయ భవితవ్యంపై వంగవీటి రాధా అంతర్మథనంలో పడ్డారు. విజయవాడ సెంట్రల్ సీటు ఇచ్చేదిలేదని చెప్పిన వైసీపీ అధిష్టానం నిర్ణయంపై మండిపడ్డ రాధా.. మూడు రోజుల్లో తన నిర్ణయం చెబుతానంటూ ప్రకటన చేసారు. ఇది జరిగి వారం, పదిరోజులు దాటింది. తాజాగా వైసీపీ అధిష్టానం నుండి కొందరు పెద్దలు రాధాకు సర్ధిచెప్పే ప్రయత్నం చేసినట్టు తెలుస్తోంది. ఎంపీగా పోటీకి దిగేందుకు మచిలీపట్నం అన్ని విధాల అనువుగా ఉన్నట్లు తమ సర్వేలో తేలిందని, వంగవీటి బ్రాండ్ ఇమేజ్ తూర్పు కృష్ణాలో బాగా వర్కౌట్ అవుతుందని నియోజకవర్గాల వారీగా లెక్కలేసి వివరించినట్టు తెలుస్తోంది. అంతేకాకుండా మచిలీపట్నం ఎంపీగా పోటీకి సై అంటే ఎన్నికల ఖర్చు మొత్తం తామే భరిస్తామని అధిష్టానం భారీ ఆఫర్ ఇచ్చినట్టు సమాచారం. ప్రస్తుతం పార్టీకి రాష్ట్రంలో అనుకూల పవనాలు వీస్తున్నాయని ఇలాంటి తరుణంలో మంచి నిర్ణయం తీసుకోవాలని పార్టీ పెద్దలు రాధాకు సూచించినట్టు తెలుస్తోంది.   ఈ విషయంపై అంతరంగికులు, సన్నిహితులతో రాధా సుదీర్ఘ చర్చలు సాగించినట్లు తెలుస్తోంది. దశాబ్దాలుగా టీడీపీపై పోరాటం చేసాం. గతంలో ఆ పార్టీ నుంచి వచ్చిన ఆఫర్లను తిరస్కరించాం. ఇప్పుడు వైసీపీలో సెంట్రల్ సీటు రాలేదని పార్టీ మారి టీడీపీ నుంచి సెంట్రల్ సీటుకు పోటీ చేస్తే ఓటు అడగటం కష్టంగా ఉంటుందని పలువురు సన్నిహితులు తమ అభిప్రాయాలను వెల్లడించినట్టు సమాచారం. ఇప్పటిదాకా వంగవీటి బ్రాండ్ ఇమేజ్ ను కాపాడుకుంటూ వస్తున్నాం. మనల్నే నమ్ముకున్న ప్రజలు ఉన్నారు. కాబట్టి వాళ్ళ మనోభావాలను పరిగణలోకి తీసుకొని రాజకీయంగా కీలక నిర్ణయం తీసుకుంటే మంచిదనే సలహాలు ఇచ్చినట్టు తెలుస్తోంది. తమ కుటుంబానికి టీడీపీతో ఉన్న వైరం, ఫ్లాష్ బ్యాక్ లో చోటు చేసుకున్న వర్గపోరు తదితర కారణాల దృష్ట్యా రాధా ఆలోచనలో పడ్డట్టు తెలుస్తోంది. 2019 ఎన్నికల్ని అత్యంత కీలకంగా భావిస్తున్న రాధా ఎక్కడ నుంచి పోటీ చేయాలి? ఎలా గెలవాలి? అనే దానిపై ఆలోచనలో పడ్డారు. కాబట్టి కొద్దిరోజులు సైలెంట్ గా ఉండి రాజకీయ సమీకరణాల్ని బేరీజు వేసే పనిలో పడ్డట్టు సమాచారం. గెలుపే లక్ష్యంగా రాధా నిర్ణయం ఉంటుందని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. తాజా పరిణామాల క్రమంలో రాజకీయ భవితవ్యంపై రాధా ఎలాంటి నిర్ణయాన్ని తీసుకుంటారనేది తేలాలంటే కొద్దిరోజులు ఓపిక పట్టాల్సిందే.

చంద్రబాబుకు కేవీపీ లేఖ.. జగన్ కు దగ్గరవుతున్నారా?

కాంగ్రెస్, టీడీపీ.. ఒకప్పుడు ప్రత్యర్థి పార్టీలేమో కానీ ఇప్పుడు కాదనే చెప్పాలి. ముఖ్యంగా తెలంగాణలో మహాకూటమి పేరుతో ఈ రెండు పార్టీ దగ్గరయ్యాయి. ఇలాంటి సమయంలో ఈ రెండు పార్టీలు ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకోవడం ఆటోమేటిక్ గా తగ్గిపోతుంది. అంతెందుకు రీసెంట్ గా రాహుల్ గాంధీ కర్నూల్ పర్యటనకు వచ్చారు. ఈ సందర్భంగా రాహుల్ బహిరంగ సభలో మాట్లాడుతూ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీపై విమర్శలు చేసారు కానీ టీడీపీ మీద చేయలేదు. ఏపీ కాంగ్రెస్ నేతలు కూడా ఇంచుమించు ఇదే ఫాలో అవుతున్నారు. ఏదో చిన్నాచితకా తప్ప టీడీపీ మీద ఘాటైన విమర్శలు చెయ్యట్లేదు. అయితే కాంగ్రెస్ సీనియర్ నేత కేవీపీ రామచంద్రరావు మాత్రం నా రూటే సెపరేటు అంటున్నారు. హోదా విషయంలో చంద్రబాబు మాటలు మార్చారంటూ ఘాటు లేఖ రాసారు.     ఏపీకి ప్రత్యేక హోదా ప్రకటించాలంటూ కాంగ్రెస్ ఎప్పటి నుంచో పోరాటం చేస్తోంది. హోదా కోసం పోరాటం చేయాల్సిన చంద్రబాబు మాత్రం.. అప్పుడు హోదా వద్దు ప్యాకేజీ ముద్దన్నారు. ప్యాకేజీకి ఒప్పుకొని సన్మానాలు కూడా చేయించుకున్నారు. ఇప్పుడేమో హోదా కావాలంటూ అసెంబ్లీలో తీర్మానం చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఎన్నికలు సమీపిస్తుండటంతో చంద్రబాబుకు రాష్ట్రం, ప్రత్యేక హోదా గుర్తుకొచ్చింది. ఇప్పుడు ప్రత్యేక హోదాకు తానే ప్రతినిధి అన్నట్లు వ్యవహరిస్తున్నారు. కాంగ్రెస్ కూడా మద్దతిస్తుందంటున్నారు. కాంగ్రెస్ పార్టీ మద్దతు కావాలని సీఎం కోరడం సిగ్గుచేటు. కేంద్రం ఎలాగూ హోదాను ఇవ్వడం లేదని తెలిసే, చంద్రబాబు కొత్త డ్రామాలు ఆడుతున్నారు. ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టే చంద్రబాబు కళ్ళకు కమ్ముకున్న అధికార పొరలు కరిగిపోతున్నాయి. ఏపీ ప్రజలకు జరిగిన అన్యాయం గుర్తుకువస్తోందన్నారు. ప్రత్యేక హోదా కోసం కాంగ్రెస్ చేసిన పోరాటానికి చంద్రబాబు ఎప్పుడూ మద్దతు ఇవ్వలేదు. పార్లమెంటులో ప్రైవేటు బిల్లుకు కూడా సహకరించలేదు. ఇప్పుడు హోదా పేరుతో చంద్రబాబు ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ప్రత్యేక హోదాపై తొలి సంతకం పెడతానని రాహుల్ ప్రకటించారు. చిత్తశుద్ధి ఉంటే.. హోదా ఉద్యమకారులపై పెట్టిన కేసులను ఎత్తివేయాలని కేవీపీ అన్నారు.     అయితే ఇప్పుడు కేవీపీ లేఖ ఏపీలో హాట్ టాపిక్ అయింది. ఓ వైపు తెలంగాణలో కాంగ్రెస్, టీడీపీ దగ్గరవుతున్నాయి. మరోవైపు ఏపీ ప్రత్యేకహోదా విషయంలో రాహుల్ గాంధీ లాంటి నేతలు కేంద్రంలో అధికారం ఉన్న బీజేపీని విమర్శిస్తున్నారు కానీ.. చంద్రబాబుని విమర్శించట్లేదు. కానీ సీనియర్ నేత కేవీపీ మాత్రం దీనికి భిన్నంగా చంద్రబాబుని విమర్శిస్తున్నారు. అంటే కేవీపీ కాంగ్రెస్ అధిష్టానాన్ని ఫాలో అవ్వట్లేదా? లేక చంద్రబాబుకి దగ్గరవుతున్న కాంగ్రెస్ కి దూరమవుతూ.. జగన్ కి దగ్గరవుతున్నారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కేవీపీ మొదటి నుండి వైఎస్ కుటుంబానికి సన్నిహితుడు. కాంగ్రెస్ నేతలు కొన్ని సందర్భాల్లో జగన్ ని విమర్శించినా, కేవీపీ మాత్రం విమర్శించారు. కేవీపీ వైసీపీలో చేరతారంటూ గతంలో కూడా వార్తలొచ్చాయి. అయితే ఇప్పుడు ఈ లేఖతో వైసీపీ చేరుతున్నారనే హింట్ ఇచ్చారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరి కేవీపీ తెలంగాణ, ఏపీ రాజకీయాలు రెండు వేరనే దృష్టితో లేఖ రాసారో లేక నిజంగానే జగన్ కి దగ్గరవుతున్నట్టు హింట్ ఇచ్చారో? తెలియాలంటే కొంతకాలం వేచి చూడాల్సిందే. చూద్దాం ఏం జరుగుతుందో.

రాజకీయాల్లోకి మంచు మనోజ్..!!

మంచు మనోజ్.. మోహన్ బాబు తనయుడిగా వెండితెరకు పరిచయమైన మనోజ్.. హిట్, ప్లాప్ లతో సంబంధం లేకుండా విభిన్న సినిమాలు చేస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు.. అయితే ఈ మధ్య మనోజ్ సినిమాలకు దూరంగా ఉంటున్నాడు.. 'ఒక్కడు మిగిలాడు' సినిమా తరువాత ఏ సినిమా చేయలేదు.. దీంతో అసలు మనోజ్ ఇక సినిమాలు చేస్తాడా? లేదా ? అంటూ అనుమానాలు వ్యక్తమయ్యాయి.. అయితే ఇప్పుడు మనోజ్ గురించి ఒక ఆసక్తికరమైన వార్త చక్కర్లు కొడుతోంది.. అదే మనోజ్ రాజకీయాల్లోకి వస్తున్నాడట.     మనోజ్ కి మొదటి నుండి సమాజం మీద, సేవల మీద దృష్టి ఎక్కువ.. సోషల్ మీడియా ద్వారా అందరికీ అందుబాటులో ఉంటాడు.. ఏదైనా సంఘటన జరిగితే వెంటనే స్పందిస్తాడు.. అసలు సినిమాల్లో కన్నా నార్మల్ గానే మనోజ్ కి మద్దతిచ్చే వాళ్ళ సంఖ్య ఎక్కువ.. అలాంటి మనోజ్ ఇప్పుడు రాజకీయాల్లోకి రాబోతున్నాడంటూ వార్తలు వస్తున్నాయి.. టీడీపీలో చేరబోతున్నాడని కొందరంటే, జనసేనలో చేరబోతున్నాడని మరికొందరు అంటున్నారు.. ఇంకా కొందరైతే టీడీపీ తరుపున హైదరాబాద్లో ఎమ్మెల్యే పోటీ చేస్తాడని అంటున్నారు.. ఇప్పటికే నందమూరి కళ్యాణ్ రామ్ టీడీపీ తరుపున కూకట్ పల్లి, లేదా శేర్ లింగంపల్లి నుండి ఎమ్మెల్యేగా పోటీ చేస్తారంటూ వార్తలొచ్చాయి.. ఇప్పుడు కొత్తగా రాజకీయాల్లోకి మనోజ్ అంటూ వార్తలు స్టార్ట్ అయ్యాయి.     మరి మనోజ్ నిజంగా రాజకీయాల్లోకి వస్తారో లేదో చూడాలి.. ఒకవేళ వస్తే టీడీపీలోకి వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.. మంచు కుటుంబం మొదటి నుండి నందమూరి కుటుంబానికి సన్నిహితంగా ఉంటుంది.. అదీగాక మనోజ్, జూనియర్ ఎన్టీఆర్ కి మంచి ఫ్రెండ్.. అలాగే బాలకృష్ణతో కూడా సత్సంబంధాలు ఉన్నాయి.. ఇవన్నీ పక్కన పెడితే.. అసలు మనోజ్ నిజంగానే సినిమాలకు దూరం అయ్యాడా? రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్నాడా? ఇలాంటివి తెలియాలంటే కొంతకాలం వేచి చూడాల్సిందే.. చూద్దాం ఏం జరుగుతుందో.

సత్యం రామలింగరాజు వస్తే మళ్ళీ ఉద్యోగాలు వస్తాయా?

దేశవ్యాప్తంగా ఇప్పుడు ఉద్యోగాల కల్పన ప్రభుత్వాలకు అతిపెద్ద సమస్యగా మారింది. గతంలో ఉపాధి కోసం మాత్రమే వెంపర్లాడేవారు. కానీ ఇప్పుడు విద్యాధికులు పెరిగారు. సాంకేతిక నైపుణ్యాలు అలవర్చుకుంటున్నారు. వీరికి సాదాసీదా ఉపాధి సరిపోదు. వారి నైపుణ్యాలు, అర్హతలకు తగిన ఉద్యోగావకాశాలు కల్పించి తీరాల్సిందే. గతంలో ఉద్యోగాల కల్పన కోసం పరిశ్రమలపైనే ఎక్కువగా ఆధారపడేవారు. ఇందుకోసం ప్రభుత్వాలు పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహాలిచ్చేవి. వందల ఎకరాలు నామమాత్రపు ధరపై అందించేవి. కోట్లరూపాయల విలువైన విధ్యుత్, అమ్మకపు పన్ను వంటి ఇతర రాయితీలు కల్పించేవి. ఐటీ రంగ విస్తృతితో తక్కువ పెట్టుబడితోనే ఎక్కువమందికి మెరుగైన జీతభత్యాలతో కూడిన ఉద్యోగావకాశాల కల్పనకు వీలుచిక్కింది.     ప్రపంచంలో వస్తున్న ఈ మార్పును ముందుగా గుర్తించి దేశంలో అమల్లోకి తెచ్చిన తొలి తరం ఐటీ సంస్థల వ్యవస్థాపకుల్లో ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి, సత్యం రామలింగరాజు తదితరులు ముఖ్యులు. వీరు నామమాత్రపు పెట్టుబడితోనే ఐటీ సంస్థల్ని ప్రారంభించారు. అంచెలంచెలుగా వాటిని విస్తరించారు. లక్షలమంది నిపుణులకు ఉద్యోగావకాశాలను కల్పించారు. వీరి దగ్గర పనిచేసిన వందలాది మంది తిరిగి సొంతంగా ఐటీ సంస్థలు నెలకొల్పారు. వారు కూడా వందలు, వేల సంఖ్యలో ఉద్యోగావకాశాలు కల్పించారు. ఇలా ఐటీ ఉద్యోగాల కల్పన ఆద్యుల్లో ఒకరైన సత్యం రామలింగరాజు ఇప్పుడీ వ్యవస్థలకు దూరంగా ఉన్నారు. సత్యం నిర్వహణలో కొన్ని సాంకేతిక లోపాల సాకుతో గత ప్రభుత్వం ఆయన్ను అరెస్ట్ చేసింది. ఆస్తుల్ని పరిరక్షించుకునేందుకు న్యాయస్థానాల్ని ఆశ్రయించడం వంటి చర్యలకు పాల్పడకుండా తన చేతిలోని వ్యాపార సామ్రాజ్యంతో పాటు వ్యక్తిగత ఆస్తుల్ని కూడా ఆయన ప్రభుత్వానికి అప్పగించారు.     ఒకప్పుడు సత్యం రామలింగ రాజు రాష్ట్రంలోనే కాదు దేశంలోనే ఎక్కువ సంఖ్యలో ఉద్యోగావకాశాలు కల్పించిన వ్యక్తి. ఓ దశలో ప్రోటోకాల్ నిబంధనల్ని సైతం పక్కనబెట్టి , హైదరాబాద్ కొచ్చిన బిల్ క్లింటన్ పక్కన రామలింగరాజుకు స్థానం కల్పించారు. రామలింగరాజు వ్యవస్థపరంగానే కాకుండా సొంతంగా కూడా అనేక సేవ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. బైర్రాజు ఫౌండేషన్ పేరిట లోతట్టు గ్రామాలకు మంచినీటి సరఫరా.. రక్షిత మంచినీటి పథకాలు.. పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించారు. సేవ గుణంలో సాంకేతికను ప్రవేశపెట్టారు. 108 అంబులెన్స్ ల నిర్వహణకు అత్యాధునిక కంప్యూటర్ పరిజ్ఞానంతో కూడిన విధివిధానాల్ని నిర్దేశించారు. ఇలాంటి నైపుణ్యంతో అంబులెన్స్ లు నిర్వహించిన ఘనత దేశంలోనే కాదు.. ప్రపంచంలోనే మొట్ట మొదటిగా ఏపీకి దక్కింది. రామలింగరాజు ఏ బ్యాంకుల్ని మోసం చేయలేదు. ఏ ఆర్థిక సంస్థల బకాయిలు ఎగవేయలేదు. పరిమిత వనరులతోనే ప్రపంచంలోనే అతిపెద్ద వాటిలో ఒకటైన వ్యాపార సామ్రాజ్యాన్ని సృష్టించారు. ఇంతటి ప్రజ్ఞాపాటవాలు, వృత్తి నైపుణ్యం కలిగిన రామలింగరాజు కొన్నాళ్ల జైలు జీవితం అనంతరం ఇప్పుడు ఓ సాదాసీదా వ్యక్తిగా జీవిస్తున్నారు. అయితే ఇలాంటి మేధావి మేధస్సును వినియోగించుకోవాల్సిన అవసరం సమాజంపై ఉంది. పెద్దగా పెట్టుబడి లేకుండానే ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ఐటీ సాంకేతిక నైపుణ్యం అవసరాలకనుగుణంగా ఉద్యోగావకాశాల్ని సృష్టించగలగడంలో ఆయన దిట్ట. పెరుగుతున్న వృత్తి నిపుణుల నిరోద్యోగ సమస్యను అధిగమించడంలో ఆయన ఆలోచనలు, సేవలు ఉపకరిస్తాయి. ప్రభుత్వాలు ఈ దిశగా యోచించాలని మేధావులు సూచిస్తున్నారు. ఆయన ఎదుర్కున్న నేరం కేవలం సాంకేతికపరమైందే. నేరారోపణ అనంతరం దేశాన్నోదిలి పారిపోయేందుకు ప్రయత్నించలేదు. ఆస్తుల్ని కాపాడుకునేందుకు తప్పుడు పనులకు పాల్పడలేదు. మౌనంగానే ఆస్తుల్ని అప్పగించి జైలు శిక్ష అనుభవించారు. ఆయన సేవల్ని వినియోగించుకోవడం వల్ల ప్రభుత్వాలకు మరింత ప్రయోజనం చేకూరుతుంది. లక్షలాదిమంది వృత్తినిపుణులకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని మేధావులు పేర్కొంటున్నారు. మరి ప్రభుత్వాలు ఈ దిశగా ఆలోచిస్తాయో చూడాలి.

వంగవీటి రాధా దారెటు?

  విజయవాడ వైసీపీ రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది.. విజయవాడ సెంట్రల్‌ అసెంబ్లీ టిక్కెట్ ఆశిస్తున్న వంగవీటి రాధాకు వైసీపీ అధినాయకత్వం మొండి చెయ్యి చూపింది.. రాధా స్థానంలో ఆ టిక్కెట్ ను మల్లాది విష్ణుకు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది.. ఈ నిర్ణయమే ఇప్పుడు విజయవాడ వైసీపీలో అలజడి సృష్టిస్తుంది.. రాధా తనకు సెంట్రల్ టిక్కెట్ కావాల్సిందేనని పట్టుబడుతుండగా, వైసీపీ అధినాయకత్వం మాత్రం సెంట్రల్ టిక్కెట్ ఇచ్చేది లేదని తేల్చి చెప్తూ.. రాధా ముందు రెండు ఆప్షన్లు ఉంచింది.. విజయవాడ తూర్పు నుంచి లేదా బందరు పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేయాలని రాధాకు సూచించింది.. అయితే రాధా మాత్రం ఈ రెండు స్థానాలలో పోటీ చేసేందుకు సుముఖంగా లేరు.. ఇంతకాలం సెంట్రల్ టిక్కెట్ వస్తుందని ఆశతో గ్రౌండ్ లెవెల్లో వర్క్ చేస్తుంటే, ఇప్పుడిలా మొండి చెయ్యి చూపడంతో.. రాధాతో పాటు ఆయన అనుచరులు కూడా తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.. మరోవైపు ఇదంతా రాధాను పార్టీ నుంచి పొమ్మనకుండా పొగబెట్టే కార్యక్రమమని కొందరు అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.. జరుగుతున్న ఈ పరిణామాల నేపథ్యంలో రాధా భవిష్యత్తు కార్యాచరణ ఎలా ఉండబోతోందన్న అంశంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.     రాధా వర్గీయులు కొందరు ఆయనకి పార్టీ మారమని సూచించినట్టు కూడా తెలుస్తోంది.. దీంతో రాధా వైసీపీని వీడతారా?.. ఒకవేళ వీడితే ఏ పార్టీ గూటికి చేరతారు? చర్చలు మొదలయ్యాయి.. ఆయన ముందు ప్రధానంగా రెండు ఆప్షన్లు ఉన్నాయి.. ఒకటి టీడీపీ, రెండు జనసేన.. ప్రస్తుతం ఏపీలో టీడీపీ అధికారంలో ఉంది, అలాగే విజవాడలో బలంగా ఉంది.. దీంతో కొందరు ఆయనకు టీడీపీలో చేరమని సూచిస్తున్నట్టు తెలుస్తోంది.. అయితే రాధా టీడీపీ చేరే అవకాశాలు తక్కువని విశ్లేషకులు భావిస్తున్నారు.. దానికి పలు కారణాలు ఉన్నాయి.. రాధా సెంట్రల్ సీటుని పట్టుబడుతున్నారు.. అయితే సెంట్రల్ నుండి టీడీపీ నుండి బోండా ఉమా ప్రాతినిధ్యం వహిస్తున్నారు.. ఉమాని తప్పించి రాధాకు టిక్కెట్ ఇచ్చే అవకాశం లేదు.. అదీగాక వంగవీటి కుటుంబం మొదటినుండి టీడీపీకి వ్యతిరేకం.. వీటిని బట్టి చూస్తుంటే రాధా టీడీపీలో చేరే అవకాశం లేదు.. ఇక రెండో ఆప్షన్ జనసేన.. జనసేనలో పవన్ కళ్యాణ్ తప్ప బలమైన నేతలు లేరు.. జనసేనలో చేరితే విజయవాడలో పార్టీకి పెద్ద దిక్కుగా ఉండొచ్చు అలాగే కోరుకున్న సెంట్రల్ టిక్కెట్ వచ్చే అవకాశముంది.. దీంతో రాధా జనసేన వైపే మొగ్గు చూపుతున్నట్టుగా తెలుస్తోంది.. మెజారిటీ అనుచరులు కూడా జనసేన వైపే అడుగులు వేయమని చెప్తున్నారట.. మరి సెంట్రల్ టిక్కెట్ విషయంలో అసంతృప్తిగా ఉన్న రాధా నిజంగానే వైసీపీని వీడి జనసేనలో చేరతారా?.. తెలియాలంటే కొంతకాలం వేచి చూడాల్సిందే.

కేసీఆర్ టార్గెట్ ఆ ముగ్గురేనా?

  కేసీఆర్ ఆలోచనలు, వ్యూహాలు అంత త్వరగా అర్థంకావు.. అదేవిధంగా ఆయన కొన్ని సందర్భాల్లో తీసుకొనే దూకుడు నిర్ణయాలు ప్రత్యర్థి పార్టీలకే కాదు సొంత పార్టీ నేతలని కూడా షాక్ కి గురి చేస్తాయి.. అలాంటిదే ముందస్తు, అసెంబ్లీ రద్దు.. ముందస్తు ఉంటుందా లేదా అని అందరూ తలలు పట్టుకుంటుండగా అసెంబ్లీ రద్దు చేసారు.. అంతేనా తొలి విడతగా ఏకంగా 105 మంది అభ్యర్థులను ప్రకటించారు.. ఓ వైపు మిగతా పార్టీలు పొత్తులు, సీట్ల పంపకం, అభ్యర్థుల ఎంపిక అంటూ తర్జన భర్జన పడుతుంటే.. కేసీఆర్ మాత్రం మెజారిటీ స్థానాలు ఎలా గెలవాలి? ప్రధాన ప్రత్యర్థులను ఎలా ఓడించాలి? అంటూ వ్యూహాలు రచించే పనిలో పడిపోయారు.. కేసీఆర్ ముఖ్యంగా ముగ్గురు కాంగ్రెస్ నేతలని టార్గెట్ చేసినట్టు తెలుస్తోంది.. ఆ ముగ్గురు ఎవరో కాదు జానారెడ్డి, డికె అరుణ, రేవంత్ రెడ్డి.   నల్గొండ జిల్లా కాంగ్రెస్‌కు కంచుకోట.. కోమటిరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డిలతోపాటు జానారెడ్డిలాంటి ముఖ్యనేతలు నల్గొండ నుంచే ప్రాతినిధ్యం వహిస్తున్నారు.. దీంతో కేసీఆర్ నల్గొండలో కాంగ్రెస్ కంచుకోటను కదిలించాలని చూస్తున్నారట.. ముఖ్యంగా జానారెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న నాగార్జున సాగర్ నియోజకవర్గంలో తెరాస జెండా ఎగరేయాలని ప్రయత్నిస్తున్నారట.. మరి కేసీఆర్ వ్యూహాలు ఫలించి జానారెడ్డికి ఝలక్ తగులుతుందో లేదో చూడాలి.. నల్గొండతో పాటు మహబూబ్‌నగర్ మీద కూడా కేసీఆర్ ప్రత్యేక దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది.. మహబూబ్‌నగర్ లో ఇద్దరు ఫైర్ బ్రాండ్లు ఉన్నారు.. ఒకరు డి.కె అరుణ, మరొకరు రేవంత్ రెడ్డి.. అరుణ, రేవంత్ ఇద్దరూ మొదటి నుండి కేసీఆర్ మీద తీవ్ర విమర్శలు చేస్తూ కేసీఆర్ ని ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తున్నారు.. అందుకే కేసీఆర్ వీరిద్దరిని ఎలాగైనా ఓడించాలని కంకణం కట్టుకున్నట్టు తెలుస్తోంది.. అరుణ గద్వాల్ నుండి ప్రాతినిధ్యం వహిస్తుండగా, రేవంత్ కొడంగల్ నుండి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.. వీరిద్దరి దూకుడికి కళ్లెం వేయాలని కేసీఆర్ భావిస్తున్నారు.. మరి కేసీఆర్ టార్గెట్ గా పెట్టుకున్న ఈ ముగ్గురు నేతలు కేసీఆర్ వ్యూహాలు అధిగమించి విజయాన్ని అందుకుంటారో లేదో చూడాలి.

ఎన్టీఆర్ గెలుపు.. చంద్రబాబు ఓటమి.. మరి కేసీఆర్?

తెలుగు రాష్ట్రాలలో ఇప్పుడేదైనా హాట్ టాపిక్ ఉందంటే అది తెలంగాణ ముందస్తు గురించే.. కేసీఆర్ అసెంబ్లీ రద్దు చేయటమే కాకుండా 105 మంది అభ్యర్థులను ప్రకటించి పొలిటికల్ హీట్ పెంచారు.. కేసీఆర్ వచ్చే ఎన్నికల్లో వందకి పైగా సీట్లు గెలిచి మళ్ళీ అధికారం తామే పొందుతామని నమ్మకంగా ఉన్నారు.. అయితే ప్రతిపక్షాలు కూడా ఎన్నికలు ఎప్పుడొచ్చినా మేం సిద్ధం, తెరాసను ఓడిస్తాం అంటున్నాయి.. ఈ ముందస్తులో ఎవరు గెలుస్తారో తెలీదు కానీ.. తెలుగు రాష్ట్రాలలో ముందస్తు రావడం ఇది మూడోసారి.. ఉమ్మడి రాష్ట్రంలో రెండు సార్లు ముందస్తు రాగా, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక మొదటిసారి ముందస్తు రావడం విశేషం.     గతంలో ఉమ్మడి రాష్ట్రంలో ఎన్టీఆర్ ముందస్తుకి వెళ్లి విజయం సాధించగా, రెండోసారి ముందస్తుకు వెళ్లిన చంద్రబాబు మాత్రం ఓటమి పాలయ్యారు.. 1983 లో ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ స్థాపించిన తొమ్మిదినెలల్లోనే ఎన్టీఆర్‌ నాయకత్వంలో 201 సీట్లను గెలుచుకొని రికార్డు సృష్టించింది.. అనంతరం కొద్దికాలానికే ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని రద్దు చేయడం, నాదెండ్ల భాస్కరరావు సీఎంగా ప్రమాణస్వీకారం చేయడం జరిగింది.. దీనిపై రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు జరగడంతో కేంద్రప్రభుత్వం ఎన్టీఆర్ కు తిరిగి అధికారపగ్గాలు అప్పగించింది.. ఆ సభలో తెలుగుదేశానికి చెందిన అనేకమంది ఫిరాయించడంతో ఎన్టీఆర్ కు ఇబ్బందికరంగా ఉండేది.. దీంతో మరోసారి ప్రజాతీర్పును కోరుతూ 1985లో సభను రద్దుచేసి ముందస్తు ఎన్నికలకు వెళ్లారు.. 1985లో జరిగిన ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్టీఆర్ ఘన విజయం సాధించారు.     తరువాత 2004 లో చంద్రబాబు ముందస్తు ఎన్నికలకు వెళ్లారు.. అప్పట్లో వాజ్‌పేయి నాయకత్వంలోని ఎన్డీయే సైతం ముందస్తుకు సిద్ధం కావడంతో లోక్‌సభకు అసెంబ్లీకి కలిపి ఎన్నికలు నిర్వహించారు.. అయితే ఈ ఎన్నికల్లో టీడీపీ ఓటమి పాలైంది.. దాదాపు 14 ఏళ్ళ తరువాత మళ్ళీ ముందస్తు తెరమీదకు వచ్చింది.. అసెంబ్లీ గడువు ముగిసేందుకు ఇంకా ఎనిమిది నెలల సమయం ఉండగానే సభను రద్దు చేసిన కేసీఆర్‌.. ముందస్తు ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయం తీసుకున్నారు.. అన్నీ అనుకూలిస్తే నవంబర్‌లో రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్‌ తదితర రాష్ట్రాలతో పాటు ఎన్నికలు జరిగే అవకాశాలు ఉన్నాయి.. మరి ఎన్టీఆర్ కి గెలుపుని, చంద్రబాబుకి ఓటమిని మిగిల్చిన ముందస్తు.. కేసీఆర్ కి గెలుపుని అందిస్తో లేదో తెలియాలంటే కొద్ది నెలలు వేచి చూడాల్సిందే.

ఎట్టకేలకు వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి..!!

తమ పార్టీ తరుపున గెలిచిన ఎమ్మెల్యేలను అధికారపార్టీలోకి లాగేసుకున్నారని, వారిపై అనర్హత వేటు వేసే వరకు తాము అసెంబ్లీకి రామని చెప్పి.. అన్నట్టుగానే అసెంబ్లీ సమావేశాలకు దూరంగా ఉంటున్న వైసీపీ మనస్సు మార్చుకున్నట్టు తెలుస్తోంది.. ఈ నెల 6వ తేదీ నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాలకు వైసీపీ ఎమ్మెల్యేలు హాజరుకాబోతున్నట్టు సమాచారం.     గత ఏడాది నుంచి వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావడం లేదు.. దీనిపై విమర్శలు వ్యక్తమవుతున్నా.. ఆ పార్టీ అధినేత జగన్‌ మాత్రం ఇన్నాళ్లూ పట్టించుకోలేదు.. అయితే, తాజాగా మనస్సు మార్చుకున్నట్టు తెలుస్తోంది.. కానీ ఇక్కడొక ట్విస్ట్ ఉంది.. వారు అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యేది, ప్రజా సమస్యలపై చర్చించడానికి కాదట.. సమావేశాలు జరుగుతున్న సమయంలోనే తమ పార్టీ ఎమ్మెల్యేలందరి చేత రాజీనామా చేయించాలని జగన్‌ భావిస్తున్నారట.. ఏపీకి ప్రత్యేకహోదా రాకపోవడానికి చంద్రబాబే కారణమని ప్రసంగించి ఒకేసారి తమ పార్టీ ఎమ్మెల్యేల చేత రాజీనామా చేయించాలనుకుంటున్నారట.. దీనివల్ల చంద్రబాబు మీద ఒత్తిడి పడటంతో పాటు, ప్రత్యేకహోదా విషయంలో తమ పార్టీ గట్టిగా ఉందనే అభిప్రాయం ప్రజల్లోకి వెళ్తుందని జగన్ భావిస్తున్నారట.. నిజానికి జగన్, ఎమ్మెల్యేల చేత ఎప్పుడో రాజీనామా చేయించాలి అనుకున్నారు.. కానీ ఎంపీల రాజీనామాల ఎఫెక్ట్ తో కాస్త వెనకడుగు వేసినట్టు తెలుస్తోంది.. అయితే ఇప్పుడు జగన్ మనసు మారింది.. అసెంబ్లీకి వెళ్లకుండా ఉండే కంటే రాజీనామా చేస్తే ప్రజల్లో సానుభూతి వస్తుందని జగన్ భావిస్తున్నారట.     అయితే కొందరు వైసీపీ శ్రేణులు మాత్రం జగన్ నిర్ణయం పట్ల ఆందోళన చెందుతున్నట్టు తెలుస్తోంది.. ఇప్పటికే ఎంపీల చేత రాజీనామా చేపించి పార్లమెంట్ సాక్షిగా కేంద్రాన్ని నిలదీసే అవకాశాన్ని కోల్పోయారని విమర్శలు మూటగట్టుకున్నాం.. ఇప్పుడు ఎమ్మెల్యేల చేత కూడా రాజీనామా చేపిస్తే ఇంకెన్ని విమర్శలు మూటకట్టుకోవాల్సి వస్తుందోనని భయపడుతున్నారట.. ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్లే ప్రమాదం ఉందనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది.. అసెంబ్లీ సమావేశాలకు వెళ్లకుండా ఉండటానికో లేదా రాజీనామా చేయడానికో మిమల్ని ఎమ్మెల్యేలుగా గెలిపించలేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేసే అవకాశం ఉందని అంటున్నారు.. చూద్దాం మరి జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో తరువాత ఏం జరుగుతుందో.

ప్రతిపక్షాల వెన్నులో వణుకు పుట్టించిన ప్రగతి నివేదన సభ

  ప్రగతి నివేదన సభ.. తెరాస కలల సభ.. ఈ నాలుగున్నరేళ్లలో తెరాస ప్రభుత్వం సాధించిన అభివృద్ధి, చేపట్టిన సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లే సభ.. భారీ జనసమీకరణతో తెరాస పట్ల ప్రజలు ఎంత సానుకూలంగా ఉన్నారో తెలుపుతూ ప్రతిపక్షాల వెన్నులో వణుకుపుట్టించాలని భావించి చేపట్టిన సభ.. మరి అనుకున్న స్థాయిలో ఈ సభ విజయం సాధించిందా?.. తెరాస శ్రేణులు మాత్రం 'ప్రగతి నివేదన సభ' పట్ల సంతోషంగా ఉన్నారు.. సభ విజయం సాధించిందని గర్వంగా చెప్తున్నారు.. వారి సంతోషం వెనుక కూడా కారణం ఉందిలేండి.. ట్రాక్టర్లు, బస్సులు, కార్లు ఇలా వేల వాహనాల్లో లక్షలాదిగా తెరాస కార్యకర్తలు తరలివచ్చారు.. సభ ప్రాంగణం ఆకాశంలా, కార్యకర్తలు నక్షత్రాలలా కనపడడంతో తెరాస శ్రేణులు సంబరాల్లో మునిగిపోయారు.. అనుకున్నట్టే జనసమీకరణ చేయగలిగామని తెరాస నాయకత్వం సంతోషం వ్యక్తం చేస్తోంది.. మొత్తానికి తెరాస శ్రేణులు 'ప్రగతి నివేదన సభ' పెద్ద హిట్టు అంటూ గర్వంగా చెప్తున్నాయి.     అయితే ఈ సభపై ప్రతిపక్షాల స్పందన వేరేలా ఉంది.. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ సభ సప్పగా సాగింది అంటూ విమర్శిస్తూ, సభ ప్లాప్ అని సంతోషం వ్యక్తం చేస్తోంది.. ' ప్రగతి నివేదన సభ' పెట్టి అసలేం చెప్పాలనుకున్నారు? ఏం చెప్పారు? ఏం సాధించారు? అని కాంగ్రెస్ సూటిగా ప్రశ్నిస్తుంది.. వందల కోట్లు ధనం వృధా, ప్రజల సమయం వృధా.. అసలు ఈ సభ పెట్టి ప్రజలకు చెప్పాలనుకున్నారు.. ఎప్పుడు చెప్పే నాలుగు మాటలు చెప్పి పంపించారు.. జనసమీకరణ కూడా 25 లక్షలు అన్నారు కానీ సభకి వచ్చినవాళ్లు 10 లక్షలు కూడా ఉండరంటూ విమర్శిస్తోంది.. మొత్తం కాంగ్రెస్ మా దృష్టిలో సభ ఫట్టు అన్నట్టు చెప్తోంది.. కానీ తెరాస మాత్రం ఏం చేసినా ప్రతిపక్షాలు విమర్శించటం కామనేగా అని లైట్ తీసుకుంటుంది.. అంతేకాదు సభకి వచ్చిన స్పందన చూసి కాంగ్రెస్ ఓర్వలేక ఇలా మాట్లాడుతుందని కొందరు, సభని చూసి కాంగ్రెస్ భయపడి పైకి మాత్రం మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తుందని మరికొందరు కాంగ్రెస్ ని విమర్శిస్తున్నారు.. ఎవరేమనుకున్నా సభ హిట్టు, ఆ విషయం ప్రపంచానికి తెల్సు అంటూ తెరాస గర్వంగా చెప్తుంది.