'జనసేన'కు మెగా మద్దతు!?

  'జనసేన'కు మద్దతుగా మెగా హీరోలు రంగంలోకి దిగుతున్నారా? తమ మాటల ద్వారా జనసేనాని పవన్ కల్యాణ్ వెనుక తాము ఉన్నామని మెగా ఫ్యామిలీలో యువ హీరోలందరూ చెప్పదలుచుకున్నారా? తాజా పరిణామాలు చూస్తుంటే అవునక తప్పదు. అయితే... ఇక్కడ ఓ విషయం గమనించాలి. మెగా వారసులు నేరుగా రాజకీయ ప్రసంగాలు చేయడం లేదు. సినిమా వేడుకలకు వచ్చినప్పుడు తమ ప్రసంగాల్లో రాజకీయాలను ప్రస్తావించకుండా వదలడం లేదు. ఎవరిపై విమర్శలు చేయడకుండా.. పవన్ 'జనసేన'కు మద్దతుగా మాట్లాడటమో లేదా పవన్‌ని విమ‌ర్శించేవారిపై సుత్తిమెత్తగా విరుచుకు పడటమో జరుగుతుంది. 'పడి పడి లేచె మనసు' ప్రీ రిలీజ్ ఈవెంట్ సోమవారం రాత్రి జరిగింది. దానికి స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్ అతిథిగా వచ్చారు. చంద్రబాబునాయుడు, కేసీఆర్, చిరంజీవి, పవన్ కల్యాణ్... ఎవరినైనా 'గారు' అని సంభోదించాలని చెప్పారు. ఒకరికి గౌరవం ఇవ్వడం తప్పేం కాదన్నారు. అల్లు అర్జున్ స్పీచ్ గమనిస్తే "రాజకీయాల్లోకి వచ్చినంత మాత్రానా గౌరవం ఇవ్వకూడదని ఎవరూ హక్కు ఇవ్వలేదు" అన్నారు. చంద్రబాబునాయుడు, కేసీఆర్ ఎప్పట్నుంచో రాజకీయాల్లో ఉన్నారు. వారితో పోలిస్తే కొత్తగా రాజకీయాల్లోకి వచ్చినది పవన్ కల్యాణే. రాజకీయాల్లో విమర్శలు సహజం. పవన్‌ని ఎంతోమంది విమర్శిస్తున్నారు. కొందరు మాత్రం అసభ్య పదజాలంతో వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నారు. అటువంటి వాళ్లకు బన్నీ కౌంటర్ ఇచ్చాడని మెగా టాక్. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా నటించిన 'అంతరిక్షం' ప్రీ రిలీజ్ ఈవెంట్ మంగళవారం రాత్రి జరిగింది. దీనికి మెగా ప‌వ‌ర్‌స్టార్‌ రామ్‌చ‌ర‌ణ్‌ అతిథిగా వచ్చారు. అమెరికాలో పవన్ ప్రసంగం బావుందని చెప్పారు. వేదిక ముందున్న అభిమానులను ఉద్దేశిస్తూ రామ్ చరణ్ "మీరు వేదికకు అటువైపు ఉన్నారు కాబట్టి అరుస్తున్నారు. నేను ఇటువైపు ఉన్నాను కాబట్టి అరవలేకపోతున్నా. నాకూ మీలా అరవాలని ఉంది" అన్నారు. పవన్ ఏం చెప్పారని కాదు... ఆయన మాటల్లో భావాన్ని ఆదర్శంగా తీసుకోవాలని రామ్ చరణ్ కోరారు. ఫేస్‌బుక్‌లో పవన్ ప్రసంగాన్ని ప్రశంసిస్తూ ఒక పోస్ట్ కూడా పెట్టారు. "నిజమైన ధైర్యం అంటే... భయం లేకపోవడం కాదు. ప్రతిరోజూ భయాన్ని ఎదుర్కోవడం! ఆ భయాన్ని అధిగమించాలంటే... మిమ్మల్ని భయపెట్టే పనినే రోజూ చేయండి. భయంలో మార్పును ఎదుర్కోలేక పోవడమే పెద్ద భయం" అని తాజా అమెరికా పర్యటనలో తన ఉపన్యాసంలో పవన్ చెప్పారు. ఈ మాటలను వదిలేసి కొందరు భగత్ సింగ్ ఆత్మహత్య చేసుకున్నాడని పవన్ చెప్పిన మాటలను హైలైట్ చేస్తూ విమర్శలు చేయడం పట్ల మెగా ఫ్యామిలీ అసంతృప్తిగా ఉందట. ఇంతకు ముందూ పవన్‌ని టార్గెట్ చేస్తూ కొందరు చేసిన టీవీ కార్యక్రమాలపై మెగా ఫ్యామిలీ అసంతృప్తితో ఉంది. త్వరలో ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఇటువంటి విమర్శలకు చెక్ పెడుతూ.. 'జనసేన'కు మద్దతుగా మెగా హీరోలు మాట్లాడే అవకాశాలు ఉన్నాయని సమాచారం.

టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి?

  కాంగ్రెస్ ఈ ఎన్నికల్లో కేసీఆర్ ను ఎలాగైనా ఓడించి అధికారం దక్కించుకోవాలనుకుంది. కేసీఆర్ ను గద్దె దించడమే లక్ష్యంగా టీడీపీ, టీజేఎస్, సీపీఐ పార్టీలతో కలిసి కాంగ్రెస్ ప్రజకూటమి కూడా ఏర్పాటు చేసింది. ఒకానొక దశలో టీఆర్ఎస్, ప్రజకూటమిల మధ్య పోరు నువ్వా నేనా అన్నట్లు సాగుతుంది అనుకున్నారంతా. కానీ ఫలితాలు వార్ వన్ సైడ్ అని తేల్చేశాయి. టీఆర్ఎస్ 88 సీట్లతో ఘన విజయం సాధించి అధికారం నిలబెట్టుకుంది. ప్రజకూటమి మాత్రం కేవలం 21 సీట్లతో సరిపెట్టుకుంది. అందులో కాంగ్రెస్ కి 19 సీట్లు రాగా, టీడీపీకి 2 సీట్లు వచ్చాయి. ఇక టీజెఎస్, సీపీఐ అయితే ఖాతా కూడా తెరవలేదు. ఒకరకంగా చెప్పాలంటే పోటీ ఇస్తుందనుకున్న కూటమి.. టీఆర్ఎస్ చేతిలో చిత్తుగా ఓడిపోయింది. కూటమి ఓటమికి రకరకాల కారణాలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్, టీడీపీల పొత్తుని ప్రజలు స్వాగతించలేదని, అభ్యర్థుల ఎంపిక సరిగా జరగలేదని, అభ్యర్థుల ప్రకటన ఆలస్యమైందని ఇలా ఎవరికీ తోచిన కారణాలు వారు చెప్తున్నారు. అయితే ఈ ఓటమిని కాంగ్రెస్ అధిష్టానం సీరియస్ గా తీసుకున్నట్లు సమాచారం. అవసరమైతే రాష్ట్ర నాయకత్వాన్ని మార్చాలనే ఆలోచనలో కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఎన్నికలకు ముందు.. కూటమి గెలిచినా ఓడినా పూర్తీ బాధ్యత నాదే అని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. అంతేకాదు ఓడిపోతే గాంధీ భవన్ లో అడుగు కూడా పెట్టనని అన్నారు. మరి ఈ మాటలకు ఉత్తమ్ కట్టుబడి ఉన్నారో లేదో తెలీదు కానీ.. పార్టీలోని కొందరు నేతలు మాత్రం నాయకత్వ మార్పు కోరుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ రానున్న ఐదారు నెలల్లో పంచాయతీ, స్థానిక సంస్థలు, సహకార, మున్సిపాల్టీ, పార్లమెంట్ ఇలా వరుసగా ఎన్నికలు ఉన్నాయి. ఓటమి నిరుత్సాహంతో ఉన్న కార్యకర్తలు ఉత్సాహంగా పని చేయాలంటే నాయకత్వ మార్పు జరగాలనే అభిప్రాయం కొందరు నేతలు వ్యక్తం చేస్తున్నారట. ఇప్పటికే అధిష్టానం కూడా ఆ దిశగా ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ టీపీసీసీ అధ్యక్షుడిని మార్చాల్సి వస్తే ఆ పదవి రేవంత్ రెడ్డిని వరించే అవకాశముందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సీనియర్లు దాదాపు ఓడిపోయారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్క వంటి నేతలు మాత్రం తక్కువ మెజారిటీతో బయటపడ్డారు. రేవంత్ రెడ్డి కూడా ఓడిపోయారు. అయితే రేవంత్ రెడ్డికి రాష్ట్రవ్యాప్తంగా పలు నియోజకవర్గాల్లో అభిమానులున్నారు. ప్రభుత్వం మీద ధీటుగా విమర్శలు చేస్తూ ఫైర్ బ్రాండ్ ఇమేజ్ తెచ్చుకున్నారు. అలాంటి దూకుడున్న నేతకి పగ్గాలు అప్పగిస్తే కార్యకర్తల్లో నూతనోత్సాహం వచ్చి చురుగ్గా పనిచేస్తారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరి పార్టీలో యువ రక్తం రావాలని కోరుకుంటున్న రాహుల్ గాంధీ.. తెలంగాణ పార్టీ పగ్గాలు రేవంత్ రెడ్డికి అప్పగిస్తారేమో చూడాలి.

బీజేపీ రాహుల్ గాంధీని తక్కువ అంచనా వేస్తుందా?

  లోక్ సభ ఎన్నికలకు ముందు సెమీఫైనల్స్‌గా భావించిన ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు నిన్న వెలువడిన విషయం తెలిసిందే. అయితే ఈ ఫలితాలు కొన్ని పార్టీల్లో సంతోషాన్ని నింపితే.. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి మాత్రం షాక్ తగిలేలా చేశాయి. ఏ రాష్ట్రంలోనూ బీజేపీ పూర్తిస్థాయి ఆధిపత్యాన్ని కొనసాగించలేకపోయింది. తెలంగాణలో ఓటర్లు టీఆర్ఎస్ కి బ్రహ్మరధం పట్టి మళ్ళీ అధికారం కట్టబెట్టారు. ఇక్కడ బీజేపీ ఒక్క సీటుతో సరిపెట్టుకుంది. ఇక కాంగ్రెస్ విషయానికొస్తే టీఆర్ఎస్ ని గద్దె దించడమే లక్ష్యంగా టీడీపీ, టీజేఎస్, సీపీఐ వంటి పార్టీలతో కలిసి కూటమిగా ఏర్పడింది. కానీ కూటమికి ఓటమి తప్పలేదు. కూటమి పార్టీలతో కలిసి కాంగ్రెస్ గట్టి పోటీ ఇస్తుంది అనుకుంటే. గత ఎన్నికల్లో చూపిన మాత్రం ప్రభావం కూడా చూపలేక చతికిలపడిపోయింది. కాంగ్రెస్ కి మిజోరంలో కూడా ఇలాంటి ఫలితమే ఏర్పడింది. ఈశాన్య రాష్ట్రాల్లో మిజోరంను కాంగ్రెస్ కంచుకోటగా భావిస్తారు. కానీ ఇక్కడ కాంగ్రెస్ 5 స్థానాలతో సరిపెట్టుకొని అధికారం పోగొట్టుకుంది. అయితే ఈ రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్ కి చేదు ఫలితాలు ఎదురైనా మిగతా మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్ సత్తా చాటింది. సెమీఫైనల్స్‌ లో బీజేపీకి షాక్ ఇచ్చి ఫైనల్స్ కి సిద్ధమైంది. ఛత్తీస్ గఢ్ లో కాంగ్రెస్, బీజేపీ ల మధ్య పోరు నువ్వా నేనా అన్నట్టు సాగుతుంది అనుకున్నారు. కానీ ఫలితాలు మాత్రం వార్ వన్ సైడ్ అని తేల్చేశాయి. ఇక్కడ 90 సీట్లకు గాను కాంగ్రెస్ 68 సీట్లు గెలుచుకొని జెండా ఎగరేసింది. బీజేపీకి కంచుకోటల్లాంటి రాజస్థాన్, మధ్యప్రదేశ్ లలో కూడా కాంగ్రెస్ సత్తా చాటింది. రాజస్థాన్ లో 199 సీట్లకు గాను కాంగ్రెస్ 100 సీట్లు గెలుచుకుంది. ఇక మధ్యప్రదేశ్ విషయానికొస్తే 230 సీట్లకు గాను 114 సీట్లు గెలుచుకుంది. ఈ మూడు రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్ తన సత్తా చాటి బీజేపీని అధికారానికి దూరం చేసింది. పేరుకివి రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలైనా మోదీ, రాహుల్ గాంధీ మధ్య పోరులా సాగింది. ఎందుకంటే పీఎం ఎన్నికలకు ముందు వీటిని సెమీఫైనల్స్‌గా భావించారు. ప్రచారంలో కూడా మోదీ, రాహుల్ పోటాపోటీగా పాల్గొన్నారు. రాహుల్ ని పప్పు అని, రాహుల్ ప్రచారం చేస్తే కాంగ్రెస్ ఓడిపోతుందని బీజేపీ విమర్శలు చేస్తూ వస్తుంది. అయితే ఫలితాలు చూస్తే మాత్రం బీజేపీ రాహుల్ ని తక్కువ అంచనా వేస్తుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ముఖ్యంగా ఈ మూడు రాష్ట్రాల ఫలితాలతో రాహుల్ బీజేపీకి బిగ్ షాక్ ఇచ్చినట్లు అయింది. ఇన్ని రోజులు బీజేపీకి తిరుగులేదు, మోదీ లాంటి బలమైన నేత కాంగ్రెస్ లో లేరని బీజేపీ భావించింది. కానీ రాహుల్ రోజురోజుకి పరిణితి చూపిస్తూ పప్పు కాదు నిప్పు అని రుజువు చేసుకుంటున్నాడు. ఇది కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపుతుంది. మరి రాహుల్ సెమీఫైనల్స్‌ లో షాక్ ఇచ్చినట్లే ఫైనల్స్ లో కూడా మోదీకి షాక్ ఇస్తారా?. చూద్దాం ఏం జరుగుతుందో.

అయ్యో కాంగ్రెస్.. తెలంగాణలో ఎందుకిలా?

  ఐదు రాష్ట్రాల ఫలితాలు మరి కొద్ది సేపట్లో తేలిపోనున్నాయి. ఇప్పటికే ఏయే రాష్ట్రాల్లో ఏ పార్టీ గెలవబోతుందనే అవగాహన అయితే వచ్చింది. తెలంగాణ, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్ గఢ్, మిజోరం రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగాయి. ఐదు రాష్ట్రాల ఫలితాలూ ఈరోజే తెలుస్తాయి. ప్రస్తుతానికి కాంగ్రెస్ రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్ గఢ్ రాష్ట్రాలలో ఆధిక్యం ఉండి.. అధికారం దిశగా దూసుకుపోతుంది. మరోవైపు మిజోరంలో కూడా కాంగ్రెస్ రెండో స్థానంతో పర్వాలేదు అనిపించుకుంటుంది. అయితే తెలంగాణలో మాత్రం కాంగ్రెస్ పరిస్థితి దారుణంగా ఉంది. గత ఎన్నికల్లో ఒంటరిగా 22 స్థానాలు గెలుచుకున్న కాంగ్రెస్.. ఈసారి కూటమిగా ఏర్పడి కూడా కనీసం 20 స్థానాలైనా గెలుచుకుంటుందా అనిపిస్తోంది. ఎన్నికల ముందు కాంగ్రెస్.. టీడీపీ, టీజేఎస్, సీపీఐ పార్టీలతో కలిసి ప్రజకూటమిగా ఏర్పడటంతో.. టీఆర్ఎస్, ప్రజకూటమి మధ్య పోరు నువ్వా నేనా అన్నట్టుగా సాగుతుంది అనుకున్నారు. కానీ పరిస్థితి పూర్తి భిన్నంగా మారిపోయింది. కూటమి టీఆర్ఎస్ కు కనీస పోటీ కూడా ఇవ్వలేకపోతుంది. రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్ గఢ్ రాష్ట్రాలలో అధికారం దిశగా దూసుకుపోతున్న కాంగ్రెస్ తెలంగాణలో కనీసం 20 సీట్లైనా గెలుస్తుందా అనిపిస్తోంది. రాష్ట్రం ఇచ్చిన పార్టీగా తెలంగాణలో కాంగ్రెస్ దూసుకుపోవాల్సింది పోయి.. ఇలా చతికలు పడటానికి కారణం కూటమేనా అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కాంగ్రెస్ ఒంటరిగా బరిలోకి దిగితే అధికారంలోకి రాకపోయినా టీఆర్ఎస్ కి గట్టి పోటీ ఇచ్చేదేమో. కానీ కూటమిగా ఏర్పడి అధికారంపై కన్నేసిన కాంగ్రెస్ కి గట్టి దెబ్బ తగిలింది. చివరి వరకు పొత్తులు, సీట్ల పంపకాలు తేలలేదు. చాలా మంది అభ్యర్థులను ఆలస్యంగా ప్రకటించారు.. దీంతో ప్రచారానికి సమయం సరిపోలేదు. అదీగాక కాంగ్రెస్ తెలంగాణ వ్యతిరేక పార్టీ టీడీపీతో పొత్తు పెట్టుకుంది అంటూ టీఆర్ఎస్ జనాల్లోకి బాగా తీసుకెళ్లింది. ఇది కూడా ఒక రకంగా నష్టం కలిగించింది. ఇక కాంగ్రెస్, టీడీపీ మొన్నటి వరకు బద్ధ శత్రువులు. ఇలాంటి పార్టీలు కూటమితో దగ్గరైతే కొందరు ఆహ్వానించారు కానీ కొందరు కార్యకర్తలు వ్యతిరేకించారు. మరి ముఖ్యంగా వైఎస్ అభిమానులు కొందరు కాంగ్రెస్, టీడీపీ పొత్తుని వ్యతిరేకిస్తూ టీఆర్ఎస్ కి వోట్ వేశారు. నిజానికి కూటమిలో చాలా పార్టీలు ఉన్నాయి కానీ బలమైన పార్టీలు ఒకటి రెండు మించి లేవు. కానీ కేసీఆర్ ఓడించడానికి అందరూ కలిశారు అనే అభిప్రాయం మాత్రం టీఆర్ఎస్ ప్రజల్లోకి తీసుకెళ్లింది. కర్ణుడి చావుకు సవాలక్ష కారణాలు అన్నట్టు తెలంగాణలో కాంగ్రెస్ ఓటమికి చాలా కారణాలు కనిపిస్తున్నాయి. మిగతా రాష్ట్రాల్లో ఆధిక్యంలో ఉండటం ఆ పార్టీకి కాస్త కలిసొచ్చే అంశమనే చెప్పాలి.

హంగ్ వస్తే ఎంఐఎం, బీజేపీ అడుగులు ఎటువైపు?

  తెలంగాణ ఎన్నికల ఫలితాలపై నెలకొన్న ఉత్కంఠకు రేపు తెరపడనుంది. ఎగ్జిట్ పోల్స్ చెప్పినట్టు టీఆర్ఎస్ మరోసారి గెలిచి అధికారం నిలబెట్టుకోనుందా? లేక లగడపాటి చెప్పినట్టు కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రజకూటమి గెలిచి అధికారంలోకి రానుందా? అని రేపు తేలిపోనుంది. టీఆర్ఎస్, ప్రజకూటమి మధ్య నువ్వా నేనా అన్నట్టు సాగుతున్న ఈ పోరులో ఎవరో ఒకరు గెలిస్తే ఓకే. కానీ ఒకవేళ హంగ్ వస్తే పరిస్థితి ఏంటి?. ఇప్పుడు ఇది అందరిని వేధిస్తున్న ప్రశ్న. టీఆర్ఎస్, ప్రజకూటమి రెండూ అధికారానికి కొద్ది సీట్లు దూరంలో ఆగిపోతే.. ఎంఐఎం, బీజేపీ, ఇండిపెండెంట్లు కీలకం అవుతారు. ఇప్పటికే ఎంఐఎం తాము పోటీ చేయని స్థానాల్లో తమ మద్దతు టీఆర్ఎస్ కే అని ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో ఒకవేళ హంగ్ వస్తే ఎంఐఎం టీఆర్ఎస్ కు మద్దతిచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక బీజేపీ విషయానికి వస్తే ప్రజకూటమికి మద్దతిచ్చే అవకాశమే లేదు. ఎందుకంటే స్టేట్ అయినా, సెంట్రల్ అయినా బీజేపీకి ఎప్పుడూ కాంగ్రెస్ బద్ధ శత్రువే. అందుకే హంగ్ వస్తే బీజేపీ, టీఆర్ఎస్ కు మద్దతిచ్చే అవకాశం పుష్కలంగా ఉంది. ఇప్పటికే కొందరు బీజేపీ నేతలు ఒకవేళ హంగ్ వస్తే కాంగ్రెస్ కి అధికారం దూరం చేయడం కోసం టీఆర్ఎస్ కి మద్దతిస్తామని అంటున్నారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు గుర్తుండే ఉంటాయి. అక్కడ బీజేపీని అధికారానికి దూరం చేయడం కోసం.. కాంగ్రెస్ తక్కువ సీట్లు గెలుచుకున్న జేడీఎస్ కి మద్దతిచ్చి కుమారస్వామిని సీఎం చేసి బీజేపీకి షాక్ ఇచ్చిన విషయం తెలిసిందే. తెలంగాణలో హంగ్ వస్తే బీజేపీ కూడా కాంగ్రెస్ కి అలాంటి షాకే ఇవ్వాలనుకుంటుందట. గత ఎన్నికల్లో కంటే ఇప్పుడు కాస్త ఎక్కువ సీట్లు గెలుస్తామని బీజేపీ భావిస్తోంది. అనుకున్నట్టే 5 నుంచి 10 సీట్లు గెలిస్తే బీజేపీ కీలకం అవుతుంది. అప్పుడు టీఆర్ఎస్ కి మద్దతిస్తే కాంగ్రెస్ కి ఆటోమేటిక్ గా షాక్ తగులుతుంది. అయితే ఇక్కడ ఓ పెద్ద మెలిక ఉంది. ఎంఐఎం మద్దతు టీఆర్ఎస్ కి ఉంటే బీజేపీ టీఆర్ఎస్ కి మద్దతు ఇవ్వలేదు. ఎందుకంటే బీజేపీకి కాంగ్రెస్ ఎంత వ్యతిరేకమో, ఎంఐఎం అంతే వ్యతిరేకం. దీంతో బీజేపీ కాంగ్రెసేతర, మజ్లిసేతర ప్రభుత్వానికి మద్దతిచ్చే అవకాశముంది. ఇక తప్పని పరిస్థితుల్లో ఒకవేళ టీఆర్ఎస్, ఎంఐఎం దోస్తీ విడిపోయే పరిస్థితి లేకపోతే మాత్రం.. టీఆర్ఎస్ ప్రభుత్వానికి బీజేపీ బయటనుంచి మద్దతిచ్చే అవకాశముంది. కానీ బీజేపీ అంత సాహసం చేస్తుందో లేదో చూడాలి. ఒకవేళ హంగ్ వచ్చి ఇంత జరుగుతుంటే.. మరి కాంగ్రెస్ ఊరుకుంటుందా?. తన మార్క్ రాజకీయం మొదలుపెట్టదు. కాంగ్రెస్ నుంచి టికెట్ ఆశించి భంగపడ్డ నేతలు రెబెల్స్ గా బరిలోకి దిగారు. వారిలో కొందరు గెలిచే అవకాశముంది. ఆ గెలిచే అవకాశమున్న రెబెల్స్ తో ఇప్పటికే కాంగ్రెస్ టచ్ లో ఉండుంటుంది. అసలే తెలంగాణ ఎన్నికలను కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. మరి అలాంటి ఎన్నికల్లో హంగ్ వచ్చి అధికారం దూరం అవుతుంటే కాంగ్రెస్ ఊరుకుంటుందా? ఎంత దూరమైనా వెళ్తుంది. అవసరమైతే కాంగ్రెస్ ఎంఐఎం తో ఉన్న పాత పరిచయాలను తెరమీదకు తెచ్చి మద్దతు కోరే అవకాశముంది. ఇప్పటికే కాంగ్రెస్ ఆ దిశగా అడుగులు కూడా వేస్తున్నట్టు తెలుస్తోంది. ఒకవిధంగా ఇది ఫలించే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే ఎంఐఎం కి బీజేపీ బద్ధ శత్రువు. అలాంటి బీజేపీ టీఆర్ఎస్ కి మద్దతిస్తే ఎంఐఎం కాంగ్రెస్ వైపు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇప్పటికే అక్బరుద్దీన్ ఓవైసీ లాంటి వారు ఎన్నికలకు ముందు అలాంటి హింట్ కూడా ఇచ్చారు. మరి తెలంగాణలో హంగ్ వస్తే ఎంఐఎం, బీజేపీ అడుగులు ఎలా ఉంటాయో చూడాలి.

తెలంగాణ కాంగ్రెస్ సీఎం అభ్యర్థి గెలుపుపై అనుమానాలు

  అసెంబ్లీ ఎన్నికలు వచ్చిన ప్రతిసారి కాంగ్రెస్ లో సీఎం అభ్యర్థి ఎవరో తెలీదు కానీ సీఎం అభ్యర్థుల రేసు లిస్ట్ లో చాలామంది పేర్లు వినిపిస్తాయి. నిన్న తెలంగాణలో ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ ఎప్పటిలాగానే సీఎం అభ్యర్థిని ప్రకటించలేదు. దీంతో సీఎం అభ్యర్థి ఇతనే అంటూ చాలా మంది నేతల పేర్లు వినిపించాయి. వారిలో కాంగ్రెస్ సీనియర్ నేత భట్టి విక్రమార్క ఒకరు. కేసీఆర్ 2014 ఎన్నికలకు ముందు దళితుడిని సీఎం చేస్తామని అన్నారు. కానీ ఆ మాట నిలబెట్టుకోలేకపోయారు. దీంతో కాంగ్రెస్ ఈ ఎన్నికల్లో అధికారంలోకి వస్తే దళితుడిని సీఎం చేయాలని భావిస్తోదంటూ వార్తలు వినిపించాయి. ఒకవేళ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి, దళిత నేతని సీఎం చేయాలనుకుంటే భట్టి విక్రమార్కకు సీఎం అయ్యే అవకాశాలు ఎక్కువున్నాయనే అభిప్రాయం వ్యక్తమైంది. అయితే ఈ వార్తలు, ఊహల్లో నిజమెంతో తెలీదు కానీ ఇప్పుడు భట్టి గురించి ఒక షాకింగ్ చర్చ జరుగుతుంది. అదేంటంటే కొందరు భట్టి గెలుపుపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. భట్టి ఉమ్మడి ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2009, 2014 ఎన్నికల్లో మధిర నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఇప్పుడు ముచ్చటగా మూడోసారి మధిర నుంచి బరిలోకి దిగి హ్యాట్రిక్ దిశగా అడుగులు వేస్తున్నారు. ఆయనకు పోటీగా టీఆర్ఎస్ తరుపున కమలరాజ్, బిఎల్ఎఫ్ తరుపున రాంబాబు బరిలో ఉన్నారు. కూటమికి మొదటి నుంచి భట్టి గెలుపు మీద ఎలాంటి అనుమానాలు లేవు. అయితే టీఆర్ఎస్.. కాంగ్రెస్ సీనియర్ నేతలు ప్రాతినిధ్యం వహిస్తున్న కొన్ని నియోజకవర్గాల మీద ప్రత్యేక దృష్టి పెట్టింది. వాటిలో మధిర ఒకటి. టీఆర్ఎస్ భట్టిని ఎలాగైనా ఓడించి మధిరలో పాగా వేయాలనుకుంది. ఆ బాధ్యతను ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి అప్పగించారు. దానికి తగ్గట్టే ఆయన మధిరలో తిష్ట వేసి కమలరాజ్ గెలుపుకి పావులు కదిపినట్టు తెలుస్తోంది. అయినా కూటమి నేతలు భట్టి విజయంపై ధీమాగా ఉన్నారు. అయితే నిన్న ఎన్నికలు జరిగిన సాయంత్రం నుంచి మధిర నియోజకవర్గంలో భట్టి గెలుపు కష్టమే అంటూ చర్చలు మొదలయ్యాయి. మధిరలో పొంగులేటి వ్యూహాలు ఫలించడమే కాకుండా, కొన్ని సామజిక వర్గాల ఓట్లు కూడా భట్టికి పడలేదని తెలుస్తోంది. మరోవైపు బిఎల్ఎఫ్ అభ్యర్థి రాంబాబు కూడా భట్టి ఓటు బ్యాంకుకి బాగా గండి కొట్టారు అంటున్నారు. ఇలా పలు కారణాలు భట్టి గెలుపుకి అడ్డుకట్టగా మారాయి అంటున్నారు. అయితే కూటమి నేతలు మాత్రం ఈ మాటలు కొట్టిపారేస్తున్నారు. 2014 ఎన్నికల్లో కూడా భట్టి గెలుపు కష్టమన్నారు. కానీ గెలిచారు. ఇప్పుడు టీడీపీ ఓటు బ్యాంకు తోడైంది. భట్టి ఖచ్చితంగా మంచి మెజారిటీతో గెలుస్తారు అని ధీమా వ్యక్తం చేస్తున్నారు. చూద్దాం మరి ఏం జరుగుతుందో.

తెలంగాణలో ఎవరిది అధికారం? ఏది నిజం?

  ఎన్నికల సమయంలో ఫలితాల కోసం ఉత్కంఠ ఉండటం సహజం. అయితే ఈ మధ్య కాలంలో తెలంగాణ ఎన్నికల ఫలితాలపై ఉన్న ఉత్కంఠ మరే ఎన్నికల మీద లేదనేది నిజం. టీఆర్ఎస్, ప్రజకూటమిల మధ్య నువ్వా నేనా అన్నట్టు జరుగుతున్న ఈ పోరులో ఎవరు గెలుస్తారోనని తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. నిన్న ఎన్నికలు జరిగాయి. ఎగ్జిట్ పోల్స్ కూడా వచ్చాయి. అయినా ప్రజలకు ఫలితాల మీద ఒక స్పష్టత రాలేదు. మాములుగా అయితే ఎగ్జిట్ పోల్స్ వచ్చాక ఫలితాల మీద ఒక అవగాహన వస్తుంది. కానీ తెలంగాణ విషయంలో అది జరగలేదు. దానికి ప్రధాన కారణం లగడపాటి సర్వే. ఎగ్జిట్ పోల్స్ కి పూర్తి భిన్నంగా లగడపాటి సర్వే ఉంది. దీంతో ఫలితాల మీద ఇంకా ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. లగడపాటి పొలిటిషీయన్ గా ఎంత ఫేమస్సో దానికి పదిరెట్లు పెప్పర్ స్ప్రేతో ఫేమస్. దానికి వంద రెట్లు సర్వేలతో ఫేమస్. ఆయన సర్వేలు దాదాపు నిజమవుతాయి. అందుకే ఆయన్ని ఆంధ్ర ఆక్టోపస్ అంటారు. అలాంటి లగడపాటి తెలంగాణలో ప్రజకూటమిదే విజయమని చెప్పేశారు. కూటమికి 55 నుంచి 75 సీట్లు, టీఆర్ఎస్ కి 25 నుంచి 45 వస్తాయని చెప్పారు. మొత్తానికి కూటమికే ఎక్కువ సీట్లు వస్తాయని నమ్మకంగా చెప్తున్నారు. అయితే ఎగ్జిట్ పోల్స్ మాత్రం లగడపాటి సర్వేకి పూర్తి భిన్నంగా ఉన్నాయి. దాదాపు అన్ని సర్వేలు తెలంగాణలో మళ్ళీ టీఆర్ఎస్ దే అధికారం అంటున్నాయి. ఒకటి రెండు సర్వేలు మాత్రం హంగ్ కి ఆస్కారం ఉందన్నాయి. అయితే మెజారిటీ సర్వేలు మాత్రం టీఆర్ఎస్ వైపు మొగ్గు చూపుతున్నాయి. దీంతో మళ్ళీ అధికారం మాదే అంటూ టీఆర్ఎస్ ధీమాగా ఉంది. మరోవైపు కూటమి కూడా మేమే అధికారంలోకి వస్తామని నమ్మకంగా చెప్తుంది. ఎగ్జిట్ పోల్స్ లో వచ్చినట్టు ఖచ్చితంగా జరగాలని లేదు. గతంలో ఆ సర్వేల అంచనాలను తారుమారు చేస్తూ ఫలితాలు వచ్చిన సందర్భాలు ఉన్నాయి. అదేవిధంగా లగడపాటి చెప్పింది దాదాపు జరుగుతుంది అని కూటమి చెప్తుంది. మొత్తానికి ఎగ్జిట్ పోల్స్ టీఆర్ఎస్ వైపు మొగ్గుచూపుతున్నాయి. లగడపాటి సర్వే కూటమి వైపు మొగ్గుచూపుతుంది. మరి విజయం ఎవరివైపు మొగ్గుచూపుతుందో, ఎవరు చెప్పింది నిజమవుతుందో తెలియాలంటే 11  వ తేదీ వరకు వేచి చూడాల్సిందే..

ఖమ్మంలోని ఆ మూడు స్థానాల్లో 'టీడీపీ'దే విజయమా?

  అసెంబ్లీ రద్దుకి ముందువరకు అసలు తెలంగాణలో టీడీపీ ఉందా? అని అడిగినవాళ్లు.. ఇప్పుడు ఎన్నికలు తేదీ దగ్గరపడుతున్న వేళ తెలంగాణలో టీడీపీ ఇంత బలంగా ఉందా!! అంటూ ఆశ్చర్యపోతున్నారు. 2014 ఎన్నికల్లో టీడీపీ 15 స్థానాల్లో గెలుపొందింది. అయితే తరువాత ఒకరిద్దరు తప్ప దాదాపు అందరూ పార్టీని వీడారు. ఎమ్మెల్యేలే కాదు పలువురు సీనియర్ నేతలు కూడా పార్టీని వీడారు. మెజారిటీ నాయకులతో పాటు కేడర్ కూడా టీడీపీని వీడారు.. దీంతో ఇక తెలంగాణలో టీడీపీ కోలుకోవడం కష్టమే అనుకున్నారంతా. కానీ ఆ అంచనాలు తప్పని రుజువైంది. కేసీఆర్ అసెంబ్లీ రద్దు చేయటం. అనూహ్యంగా ప్రజకూటమితో కాంగ్రెస్, టీడీపీ దగ్గరవ్వడం జరిగిపోయాయి. దీంతో పరిణామాలు ఒక్కసారిగా మారిపోయాయి. అప్పటివరకు సైలెంట్ గా ఉన్న టీడీపీ కార్యకర్తలు ఖమ్మం జిల్లాలో బాలకృష్ణ పర్యటనకు భారీగా తరలివచ్చి అంతా పసుపు మయం చేశారు. ఇక అక్కడినుంచి టీడీపీ వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఖమ్మం, హైదరాబాద్ ఇలా ఎక్కడ చూసినా పసుపు జెండాలు రెపరెపలాడుతున్నాయి. దీంతో తెలంగాణలో టీడీపీ ఇంకా బలంగానే ఉందని అర్ధమవుతోంది. అయితే ఇప్పుడు టీడీపీ బలం తోడవడంతో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందా అని ఎంతలా చర్చలు జరుగుతున్నాయో.. ప్రస్తుతం టీడీపీ పోటీ చేస్తున్న 13 స్థానాల్లో ఎన్ని స్థానాలు గెలుచుకుంటుంది? అంటూ అంతే చర్చలు జరుగుతున్నాయి. టీడీపీ పోటీ చేస్తున్న వాటిలో మెజారిటీ స్థానాలు గెలిచే అవకాశమున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పోటీ చేస్తున్న మూడు స్థానాల్లో టీడీపీ గెలవడం ఖాయమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఖమ్మం జిల్లాలో టీడీపీ.. ఖమ్మం, సత్తుపల్లి, అశ్వారావుపేట స్థానాల్లో పోటీ చేస్తుంది. ఖమ్మం నుంచి మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు బరిలోకి దిగారు. ఆయనకు పోటీగా టీఆర్ఎస్ అభ్యర్థిగా తాజా మాజీ ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ కుమార్ బరిలో ఉన్నారు. పువ్వాడ గత ఎన్నికల్లో ఖమ్మం అసెంబ్లీ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి.. టీడీపీ అభ్యర్థి తుమ్మల మీద విజయం సాధించారు. తరువాత పువ్వాడ, తుమ్మల ఇద్దరూ టీఆర్ఎస్ లో చేరారు. ఇప్పుడు ఖమ్మం బరిలో పువ్వాడ, నామా ఉన్నారు. ఖమ్మంలో టీడీపీ, కాంగ్రెస్ బలంగా ఉంటాయి. వాటికి తోడు సీపీఐ కూడా ఉంది. ఈమధ్య ఖమ్మంలో జరిగిన రాహుల్ గాంధీ, చంద్రబాబు సభ నామాలో కొత్త ఉత్సాహం తీసుకొచ్చిందనే చెప్పాలి. అదీగాక పువ్వాడ పార్టీలు మారుతుంటారనే అభిప్రాయం ప్రజల్లో ఉంది. దీంతో నామా గెలుపు ఖాయమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. సత్తుపల్లి నుంచి సండ్ర వెంకటవీరయ్య బరిలో ఉన్నారు. ఇప్పటికే రెండు సార్లు విజయం సాధించిన ఆయన ఈ ఎన్నికల్లో కూడా విజయం సాధించి హ్యాట్రిక్ సాధించాలనుకుంటున్నారు. ఈయనకి నియోజకవర్గంలో మంచి పేరుంది. గత ఎన్నికల్లో టీడీపీ తరుపున గెలిచిన పలువురు.. పార్టీని వీడినా ఆయన మాత్రం టీడీపీనే నమ్ముకొని ఉన్నారు. ఆయనికి పోటీగా టీఆర్ఎస్.. పిడమర్తి రవిని బరిలో దించింది. పిడమర్తి గతఎన్నికల్లో కూడా టీఆర్ఎస్ తరుపున పోటీచేశారు. అయితే కేవలం ఆరువేల పైచిలుకు ఓట్లు మాత్రమే సాధించారు. వైసీపీ తరుపున మట్టా దయానంద్ 73,000 సాధించి సండ్రకు గట్టి పోటీ ఇచ్చి రెండో స్థానంలో నిలిచారు. తరువాత దయానంద్ టీఆర్ఎస్ లో చేరి ఈ ఎన్నికల్లో టికెట్ ఆశించారు. కానీ టీఆర్ఎస్ అధిష్టానం పిడమర్తికే టికెట్ కేటాయించింది. దీంతో దయానంద్ అసంతృప్తి వ్యక్తం చేశారు. తరువాత మెత్తబడినా ఇప్పటికీ సత్తుపల్లి టీఆర్ఎస్ లో అసంతృప్తి సెగలు ఉన్నట్టు తెలుస్తోంది. ఇవ్వన్నీ కలిసి సండ్రకు ముచ్చటగా మూడోసారి కూడా విజయం వరిస్తుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అశ్వారావుపేట విషయానికి వస్తే టీడీపీ తరుపున మెచ్చా నాగేశ్వరరావు బరిలోకి దిగారు. ఆయనకు పోటీగా టీఆర్ఎస్ అభ్యర్థి తాటి వెంకటేశ్వర్లు బరిలో ఉన్నారు. గత ఎన్నికల్లో వైసీపీ తరుపున బరిలోకి దిగిన తాటి వెంకటేశ్వర్లు, మెచ్చా నాగేశ్వరరావుపై కేవలం 930 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. తరువాత తాటి టీఆర్ఎస్ లో చేరారు. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలోకి దిగారు. అయితే తాటి.. నియోజకవర్గంలో ప్రచారానికి వెళ్తుంటే పెద్ద ఎత్తున నిరసన సెగలు తగులుతున్నాయి. అడుగడుగునా గ్రామస్థులు ఆయన్ని అడ్డుకుంటున్నారు. ఆఖరికి తుమ్మల లాంటివారు రంగంలోకి దిగి మీ కోపం ఈ ఎన్నికల్లో చూపించకండి అని చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంతెందుకు తాజాగా సత్తుప్లల్లి సభకు హాజరైన కేసీఆర్.. తాటిని స్టేజి ఎక్కొద్దంటూ అడ్డుకున్నారు. దీనిబట్టి అర్ధం చేస్కోవచ్చు తాటి మీద ఎంత వ్యతిరేకత ఉందో. ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే అశ్వారావుపేటలో మెచ్చా నాగేశ్వరావు గెలుపు కష్టమేమి కాదు. గత ఎన్నికల్లో కొద్దీ ఓట్ల తేడాతో ఓడిపోయిన ఆయన.. ఇప్పుడు కూటమి బలం, తాటి మీద వ్యతిరేకతతో ఈజీగా గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి.

కూటమి అధికారంలోకి వస్తే రేవంత్ రెడ్డి సీఎం అవుతారా?

  తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేడి చివరి దశకి చేరుకుంటోంది. మరి కొద్ది రోజుల్లో ఎవరిని అధికారం వరించనుందో, ఎవరు ప్రతిపక్షానికి పరిమితం కానున్నారో తేలిపోనుంది. అయితే ఇప్పుడు అందరిలో ఒక ఆసక్తికరమైన చర్చ మొదలైంది. మళ్ళీ టీఆర్ఎస్సే అధికారంలో వస్తే కేసీఆర్ సీఎం అవుతారని అందరికి తెలిసిన విషయమే. అయితే ఒకవేళ మహాకూటమి అధికారంలోకి వస్తే సీఎం ఎవరు?. ఇది కొద్దిరోజులుగా అందరినీ వేధిస్తున్న ప్రశ్న. నిజానికి అసెంబ్లీ రద్దుకి ముందు వరకు మళ్ళీ టీఆర్ఎస్సే అధికారంలోకి వస్తుందని అంతా భావించారు. కానీ కాంగ్రెస్ ఎప్పుడైతే టీడీపీ, టీజేఎస్, సీపీఐ పార్టీలతో మహాకూటమిగా ఏర్పడిందో ఒక్కసారిగా పరిస్థితి మారిపోయింది. అప్పటివరకు వార్ వన్ సైడ్ అనుకున్నది కాస్తా.. టీఆర్ఎస్ వర్సెస్ మహాకూటమి పోరు నువ్వా నేనా అన్నట్టుగా మారింది. దీంతో టీఆర్ఎస్.. మహాకూటమిని ఎదుర్కోడానికి ఉన్న ఏ ఒక్క అవకాశాన్ని వదలకుండా విమర్శలు చేయటం మొదలుపెట్టింది. టీఆర్ఎస్ మహాకూటమిని టార్గెట్ చేస్తూ చేసిన ప్రధాన విమర్శల్లో 'మహాకూటమి సీఎం అభ్యర్థి ఎవరు?' కూడా ఒకటి. 'కూటమిలో అసలు సీఎం అభ్యర్థి ఎవరో తెలీదు. ఒకవేళ కూటమి అధికారంలోకి వస్తే నేను సీఎం అంటే నేను సీఎం అని నేతలంతా కొట్టుకుంటారు. నెలకో సీఎం మారతారు' అంటూ టీఆర్ఎస్ కూటమి మీద విమర్శలు చేస్తూ వస్తుంది. ఇప్పుడు ఎన్నికలు చివరి దశకి చేరుకోవడంతో ప్రజలు కూడా ఒకవేళ కూటమి అధికారంలోకి వస్తే సీఎం ఎవరు? అంటూ చర్చలు మొదలు పెట్టారు. కూటమి అధికారంలోకి వస్తే కాంగ్రెస్ నేత సీఎం కావడం ఖాయం. ఇది అందరికీ తెలిసిన విషయమే. అయితే ఆ సీఎం అయ్యే కాంగ్రెస్ నేత ఎవరు?. ఇదే అసలు ప్రశ్న. కాంగ్రెస్ లో సీఎం రేసులో ఉన్న నేతల లిస్ట్ భారీగానే ఉంటుంది. ఉత్తమ్ కుమార్ రెడ్డి, జానారెడ్డి, భట్టి విక్రమార్క, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, డీకే అరుణ, విజయశాంతి, రేవంత్ రెడ్డి ఇలా చెప్పుకుంటూ పొతే అసెంబ్లీ అభ్యర్థుల లిస్ట్ అంత పెద్దగా ఉంటుంది. ఈ మధ్య మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సుష్మితా దేవ్ అన్నట్టు ఒకవేళ 'మహిళా సీఎం' ప్రతిపాదన వస్తే విజయశాంతి, డీకే అరుణ లాంటివారు రేసులో ఉంటారు. అలాకాకుండా గతంలో కేసీఆర్ 'దళిత సీఎం' అని హామీ ఇచ్చి మాట తప్పారు కాబట్టి.. కాంగ్రెస్ ఆ దిశగా ఆలోచిస్తే భట్టి విక్రమార్క జాక్ పాట్ కొట్టినట్టే. అయితే ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే మహిళా సీఎం, దళిత సీఎం మాటలు దాదాపు మాటలకే పరిమితం కావొచ్చు. కాబట్టి దాదాపు లిస్ట్ అంతా సీఎం రేసులో ఉన్నట్టే. అయితే ఈ లిస్ట్ లో ప్రధానంగా రెండు పేర్లు వినిపిస్తున్నాయి. ఒకటి ఉత్తమ్ కుమార్ రెడ్డి, రెండు రేవంత్ రెడ్డి. వీరు ప్రచారానికి వెళ్లిన చోట్ల కార్యకర్తలు 'సీఎం.. సీఎం' అని అరవడం కూడా చూస్తున్నాం. తాజాగా రేవంత్ రెడ్డి పాల్గొన్న ఒక ప్రచార సభలో కూడా కార్యకర్తలు అలాగే నినాదాలు చేశారు. అయితే రేవంత్ రెడ్డి 'దానికింకా సమయం ఉంది. నాకు ఓపిక ఉంది. ప్రస్తుతం కేసీఆర్ ఉద్యోగం ఊడగొట్టడమే నా లక్ష్యం' అన్నారు. రేవంత్ రెడ్డి చెప్పినట్లే ఒకవేళ కూటమి అధికారంలోకి వచ్చినా ఆయన సీఎం అవడానికి ఇంకా సమయం ఉండొచ్చు. ఎందుకంటే కాంగ్రెస్ లో చాలా మంది సీనియర్లు ఉన్నారు. వారిని కాదని రేవంత్ ని సీఎం చేసే సాహసం అధిష్టానం చేయకపోవొచ్చు. అలా చేస్తే సీనియర్లకు తప్పుడు సంకేతాలు వెళ్లే అవకాశముంది. దీన్నిబట్టి చూస్తుంటే సీఎం రేసులో ఉత్తమ్ ప్రధమం అనమాట. ఉత్తమ్ ఇప్పటికే పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నారు. ఆయన నాయకత్వాన్ని మొదట్లో కొందరు నేతలు వ్యతిరేకించినా తరువాత సైలెంట్ అయ్యారు. అలాగే ఇప్పుడు కూడా ఉత్తమ్ ని సీఎం చేస్తే పార్టీ నేతల్లో వ్యతిరేకత అంతగా ఉండకపోవొచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరి కాంగ్రెస్ అధిష్టానం ఎలా ఆలోచిస్తుందో చూడాలి. అయినా అసలు ఇదంతా జరగాలంటే ఫలితాలు కూటమికి అనుకూలంగా రావాలిగా. చూద్దాం మరి ఫలితాలు ఎలా వస్తాయో.

వైసీపీ బిగ్ మిస్టేక్.. మళ్ళీ ప్రతిపక్షానికే పరిమితమా?

  తెలంగాణ ఎన్నికల వేడి ఏపీకి కూడా తగులుతుంది. ముఖ్యంగా వైసీపీకి.. ఈ తెలంగాణ ఎన్నికల సందర్భంగా చేసిన తప్పిదం వల్ల ఏపీలో నష్టం జరిగే అవకాశాలున్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. తెలంగాణలో డిసెంబర్ 7 న ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ ఎన్నికల పోరు ప్రధానంగా టీఆర్ఎస్, మహాకూటమి మధ్య జరగనుంది. వైసీపీ, జనసేన తప్ప దాదాపు అన్ని పార్టీలు ఎన్నికల బరిలో నిలిచాయి. జనసేన తమ మద్దతు ఏ పార్టీకో చెప్పలేదు కానీ.. వైసీపీ మాత్రం మహాకూటమిలో టీడీపీ ఉండటంతో ఆటోమేటిక్ గా టీఆర్ఎస్ వైపు మొగ్గుచూపించి. కూకట్ పల్లి, ఎల్బీనగర్ లాంటి నియోజక వర్గాల్లో కొందరు వైసీపీ నేతలు మా మద్దతు టీఆర్ఎస్ కే అంటూ కండువాలు కప్పుకొని మరీ కనిపించారు. అయితే ఇదే ఏపీలో వైసీపీ కొంప ముంచుతుంది అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఏపీ ప్రజలు ప్రత్యేహోదా మీద కోటి ఆశలు పెట్టుకున్నారు. కానీ కేంద్రం మొండిచేయి చూపింది. ఏపీకి ప్రత్యేకహోదా, విభజన హామీల విషయంలో కేంద్రంలో ఉన్న బీజేపీ వెనకడుగు వేసిందంటూ టీడీపీ, బీజేపీకి దూరమై పోరాడుతోంది. అదే సమయంలో కాంగ్రెస్.. కేంద్రలో అధికారంలోకి వస్తే ఏపీ ప్రత్యేకహోదా ఫైల్ మీద తొలి సంతకం చేస్తామని హామీ ఇవ్వడంతో రాష్ట్ర ప్రయోజనాల కోసం టీడీపీ, కాంగ్రెస్ కి దగ్గరైంది. తెలంగాణలో కాంగ్రెస్ కూటమితో కలిసి టీఆర్ఎస్ మీద పోరుకి సిద్ధమైంది. దీంతో కేసీఆర్ ఆంధ్ర పెత్తనం అంటూ చంద్రబాబు మీద తీవ్ర విమర్శలు చేయటం మొదలుపెట్టారు. అంతేకాదు ఏపీకి ప్రత్యేకహోదా ఇచ్చి కాంగ్రెస్ తెలంగాణకు అన్యాయం చేస్తుంది, ప్రత్యేకహోదా కి మేం వ్యతిరేకమని టీఆర్ఎస్ నేతలు స్పష్టం చేశారు. ఏపీ ప్రజలు ప్రత్యేకహోదా కావాలని బలంగా కోరుకుంటున్నారు. అలాంటిది ప్రత్యేకహోదాని వ్యతిరేకిస్తున్న టీఆర్ఎస్ కి వైసీపీ మద్దతు ఎలా ఇస్తుంది? అంటే వైసీపీ కూడా ప్రత్యేకహోదాకి వ్యతిరేకమా? అని ప్రశ్నలు మొదలయ్యాయి. సైలెంట్ గా ఉండకుండా అనవసరంగా టీఆర్ఎస్ కి మద్దతుగా సంకేతాలు ఇచ్చామని వైసీపీ నేతలు కొందరు కలవరపడుతున్నట్టు తెలుస్తోంది. నిజానికి తెలంగాణలో వైసీపీ లేదనే చెప్పుకోవాలి. 2014 ఎన్నికల్లో 3 ఎమ్మెల్యేలు, ఒక ఎంపీ స్థానం గెలుచుకుంది. తరువాత వారు పార్టీని వీడారు. కేడర్ కూడా ఎవరి దారి వారు చూసుకున్నారు. ఈ ఎన్నికల్లో వైసీపీ బరిలోకి దిగితే ఒక్క సీటు కూడా గెలిచే పరిస్థితి లేదు. అందుకే జగన్ కూడా ఏపీ మీదనే తన దృష్టంతా పెట్టి తెలంగాణ ఎన్నికలకు దూరంగా ఉన్నారు. అంతవరకు బాగానే ఉంది. కానీ టీఆర్ఎస్ కి మద్దతుగా వైసీపీ ఇస్తున్న సంకేతాలే ఏపీలో ఆ పార్టీకి తలనొప్పి తెచ్చిపెట్టేలా ఉన్నాయి. అసలే తెలంగాణలో పార్టీ ఉనికిపోయింది. ఏపీలో ప్రతిపక్షానికి పరిమితమైంది. ఇప్పుడు ప్రత్యేకహోదాకి వ్యతిరేకమనే సంకేతాలు ఏపీ ప్రజల్లోకి వెళ్తే మళ్ళీ ప్రతిపక్షానికే పరిమితమయ్యే ప్రమాదముంది. చూద్దాం మరి ఏం జరుగుతుందో.

కేసీఆర్‌ నిమ్మ, మిరపకాయను నమ్ముతారు

  ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు నిజామాబాద్‌లో బీజేపీ నిర్వహించిన బహిరంగ సభకు ప్రధాని నరేంద్ర మోదీ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల మీద విమర్శల వర్షం కురిపించారు. ముందుగా తెలుగులో తన ప్రసంగం ప్రారంభించిన మోదీ.. గోదావరి, మంజీరా, కృష్ణా నదులు ప్రవహించే పుణ్యభూమని, రజాకార్ల ఆగడాలను ధైర్యంగా ఎదిరించిన భూమి ఇదని అన్నారు. నిజామాబాద్‌కు చెందిన గిరిజన పుత్రులు ఎవరెస్ట్‌ పై దేశ జెండాను ఎగరవేశారని కొనియాడారు. నాలుగున్నరేళ్ల టీఆర్ఎస్ పాలనను ప్రజలు ప్రశ్నించే సమయమిది. వాగ్దానాలనునెరవేర్చడంలో విఫలమైన టీఆర్ఎస్ ఎండగట్టాల్సిన తరుణమిది. 50 ఏళ్ల కాంగ్రెస్‌ పాలన తరహాలోనే టీఆర్ఎస్ ఆలోచిస్తోంది. అభివృద్ధి చేయకుండా గెలవచ్చన్న భ్రమల్లో ఆ పార్టీ ఉంది. కాలం మారింది.. ఇక మీ ఆటలు సాగవు అని హెచ్చరించారు. నిజామాబాద్‌ను లండన్‌గా మారుస్తానని కేసీఆర్‌ చెప్పారు. కానీ నగరంలో తాగునీటికి కూడా ప్రజలు అలమటించే పరిస్థితి ఏర్పడింది. మురుగునీటి పారుదల వ్యవస్థను అస్తవ్యస్తం చేశారు. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చని సీఎంగా కేసీఆర్‌ చరిత్రలో నిలుస్తారు. కేసీఆర్ హామీలే కాదు.. పాలన కూడా పూర్తికాలం పాటు చేయలేదని విమర్శించారు. ముందస్తు ఎన్నికలతో తెలంగాణ ప్రజలకు కష్టాల నుంచి విముక్తి కలిగింది. ప్రజలకు కనీసం తాగునీరు ఇవ్వలేని వ్యక్తిని సీఎం పీఠంపై మళ్లీ కూర్చోబెడదామా?. ఇంటింటికీ నీళ్లివ్వకపోతే ఓట్లు అడగనన్న మీరు.. మళ్లీ ఎలా ఓట్లు అడుగుతున్నారు? అని ప్రశ్నించారు. హామీలు మర్చిపోయిన కేసీఆర్‌ను ఇంటికి పంపాలని పిలుపునిచ్చారు. కేసీఆర్‌ నిమ్మ, మిరపకాయను నమ్ముతారు.. ఆత్మవిశ్వాసాన్ని నమ్మరని ఎద్దేవా చేశారు. కేసీఆర్‌ మంత్ర తంత్రాలను నమ్మడం తప్ప ప్రజల ఆరోగ్యాన్ని ఏనాడు పట్టించుకోలేదని విమర్శించారు. కేంద్రం తెచ్చిన ఆయుష్మాన్‌భవ పథకాన్ని ఎందుకు అమలుచేయరని ప్రశ్నించారు. ఆయుష్మాన్‌భవ పథకంతో 3లక్షల మంది ప్రజల ప్రాణాలు కాపాడగలిగామన్నారు. సబ్‌ కా సాత్‌, సబ్‌ కా వికాస్‌ బీజేపీ నినాదమని ప్రధాని అన్నారు. విద్య, ఉపాధి, ఆదాయం పెంచడం, వృద్ధులకు అండగా ఉండటం, ప్రతి ఎకరాకు నీరు ఇవ్వడం బీజేపీ లక్ష్యమని మోదీ స్పష్టం చేశారు. రిమోట్‌ కంట్రోల్‌ ద్వారా పనిచేసే యూపీఏ సర్కారులో కేసీఆర్‌ మంత్రిగా పనిచేశారు. కేసీఆర్‌ కాంగ్రెస్‌కు వ్యతిరేకమంటే నమ్మవద్దు. కాంగ్రెస్‌, టీఆర్ఎస్ ప్రజలను మభ్యపెట్టేలా దొంగాట ఆడుతున్నాయి. ఇటీవల తెలంగాణలో రాహుల్‌, సోనియాగాంధీ కలిసి సభలో పాల్గొన్నారు. ఓ వైపు కుమారుడు.. మరో వైపు తల్లి మాట్లాడుతూ కుటుంబపాలన గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా అనిపించింది. కాంగ్రెస్‌, టీఆర్ఎస్ రెండు కుటుంబపార్టీలే. పార్టీల విధానాల్లో కూడా పెద్దగా తేడా లేదు. తప్పుడు ప్రచారంలో ఈ రెండు పార్టీలు పోటీ పడుతున్నాయి. ప్రజలను మభ్యపెట్టేలా కాంగ్రెస్‌, టీఆర్ఎస్ దొంగాట ఆడుతున్నాయి. కాంగ్రెస్‌ నుంచి నేర్చుకున్న విద్యలతోనే కేసీఆర్‌ రాష్ట్రాన్ని అధోగతి పట్టించారు అని విమర్శించారు.

తెలంగాణలో అధికారం.. ఏపీలో వైభవం

  ప్రస్తుతం తెలుగు ప్రజల ఆలోచనలు తెలంగాణ రాజకీయాల చుట్టూనే తిరుగుతున్నాయి. దానికి కారణం త్వరలో తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండటమే. టీఆర్ఎస్ అధికారం నిలబెట్టుకుంటుందా? లేక మహాకూటమి అధికారంలోకి వస్తుందా? అంటూ అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే టీఆర్ఎస్, కూటమి పార్టీలు ప్రచారంలో మునిగిపోయాయి. అయితే ఇప్పుడు కూటమికి మేడ్చల్ లో జరిగిన భారీ బహిరంగ సభతో కొత్త ఉత్సాహం వచ్చింది. ముఖ్యంగా ఈ సభకు సోనియా గాంధీ రావడం కూటమికి కలిసొచ్చిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. తెలంగాణ ఇచ్చిన వ్యక్తిగా తెలంగాణ ప్రజలకు సోనియా గాంధీ మీద అభిమానం ఉంది. తెలంగాణ తెచ్చింది మేమే అని కేసీఆర్ ఎంత చెప్పినా.. తెలంగాణ ఇచ్చింది సోనియా గాంధీ అని పలువురు అభిప్రాయం. కాంగ్రెస్ నేతలు కూడా గతంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన సమయంలో కేసీఆర్ కుటుంబ సమేతంగా వెళ్లి సోనియాకు కృతజ్ఞతలు చెప్పిన విషయాన్ని జనంలోకి తీసుకెళ్లి కేసీఆర్ ని ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇలాంటి సమయంలో సోనియా గాంధీ తెలంగాణకు రావడంతో టీఆర్ఎస్ కి ఇబ్బంది తప్పదనే అభిప్రాయం వ్యక్తమైంది. దానికి తగ్గట్టే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తరువాత తొలిసారి తెలంగాణ గడ్డ మీద అడుగు పెట్టిన సోనియా తన ప్రసంగంతో ఆకట్టుకున్నారు. అయితే ఒకే దెబ్బకి రెండు పిట్టలు అన్నట్టుగా.. ఒకే సభలో ఇటు తెలంగాణ ప్రజలకు, అటు ఏపీ ప్రజలకు భరోసా ఇచ్చారు. సోనియా గాంధీ ఏం మాట్లాడతారా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూసారు. దానికి తగ్గట్టే ఆమె ఉద్వేగంగా మాట్లాడి ఆకట్టుకున్నారు. ఇన్నేళ్ల తరువాత తెలంగాణకు వస్తే తల్లి తన బిడ్డల దగ్గరకు వచ్చినట్లుంది అని చెప్పి తెలంగాణ మీద తనకున్న ప్రేమను చాటుకున్నారు. అంతేకాదు తెలంగాణ ఇస్తే రాజకీయంగా తమ పార్టీకి నష్టం జరుగుతుందని తెలిసినా తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేర్చాలనే ఉద్దేశంతో ఎన్ని కష్టాలు ఎదురైనా రాష్ట్రం ఇచ్చామని గుర్తుచేసారు. కానీ పసిబిడ్డ లాంటి తెలంగాణకు టీఆర్ఎస్ ప్రభుత్వం మూలంగా ఈ నాలుగేళ్లు అన్యాయం జరిగిందని అన్నారు. కూటమి అధికారంలోకి వస్తే తెలంగాణను అభివృద్ధి చేసి.. ప్రజలు కోరుకున్న తెలంగాణగా తీర్చిదిద్దుతామని భరోసా ఇచ్చారు. అదేవిధంగా ఏపీ ప్రజలకు కూడా సోనియా గాంధీ భరోసా ఇచ్చారు. ఆంధ్ర ప్రజల జీవితాలు బాగుండాలని తెలంగాణ బిల్లును ప్రవేశపెట్టిన రోజున ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని పార్లమెంటులో నిర్ణయం తీసుకున్నాం. ఆంధ్రప్రదేశ్‌ ప్రజలందరికీ ఈ వేదిక నుంచి వాగ్దానం చేస్తున్నాను. ప్రత్యేక హోదా సహా ఆ రోజు చేసిన వాగ్దానాలన్నిటినీ నెరవేరుస్తాం అన్నారు. దీంతో ఇటు తెలంగాణలో పాటు అటు ఏపీ కూడా ఎంత ముఖ్యమో చెప్పకనే చెప్పారు.  ప్రస్తుతం తెలంగాణలో టీఆర్ఎస్, కూటమి మధ్య నువ్వా నేనా అన్నట్టు పోరు సాగుతుంది. ఈ సభతో తెలంగాణ ఇచ్చిన వ్యక్తి సోనియా అనే విషయం ప్రజల్లోకి వెళ్తే అధికారం కూటమి వైపు ఎక్కువ మొగ్గుచూపే అవకాశాలున్నాయి. ఇక ఏపీ విషయానికి వస్తే.. రాష్ట్ర విభజన అనంతరం ఏపీలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా డీలా పడిపోయింది. ఇప్పట్లో ఆ పార్టీ కోలుకోవడం కష్టమే అనుకున్నారంతా. కానీ కేంద్రంలోని బీజేపీ ప్రత్యేక హోదా విషయంలో ఏపీకి అన్యాయం చేయడం.. కాంగ్రెస్ కేంద్రంలో అధికారంలోకి వస్తే మొదటి సంతకం ఏపీ ప్రత్యేక హోదా ఫైల్ మీద చేస్తామని హామీ ఇవ్వడంతో ఏపీలో కాంగ్రెస్ ఇప్పుడిప్పుడే కాస్త ఊపిరి పోసుకుంటుంది. ఇప్పటికే రాహుల్ గాంధీ ప్రత్యేక హోదాకి కట్టుబడి ఉన్నామని పలు సందర్భాల్లో చెప్పారు. ఇప్పుడు తాజాగా సోనియా గాంధీ బహిరంగ సభలో ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని హామీ ఇవ్వడం ఏపీలో ఆ పార్టీకి నూతనోత్సాహమనే చెప్పాలి. మరి సోనియా సభతో కాంగ్రెస్ శ్రేణులు భావిస్తున్నట్టు తెలంగాణలో అధికారం, ఏపీలో పార్టీకి పూర్వ వైభవం వస్తుందేమో చూడాలి.

కేసీఆర్, కేటీఆర్ లకు ఓటమి భయం పట్టుకుందా?

  లోపల భయపడిపోతూ పైకి మనం ఎంత ధైర్యంగా నటించినా ఏదో ఒక సందర్భంలో మన భయం బయటపడుతుంది. ప్రస్తుతం టీఆర్ఎస్ పార్టీ పరిస్థితి కూడా అలానే ఉందనే అభిప్రాయం కూటమి పార్టీల నుంచి వ్యక్తమవుతోంది. అసెంబ్లీ రద్దు సమయం నుంచి తమ పార్టీ వంద సీట్లు గెలుచుకొని తిరిగి అధికారంలోకి వస్తుందంటూ టీఆర్ఎస్ చెప్తూ వచ్చింది. ముఖ్యంగా కేసీఆర్, కేటీఆర్.. వంద సీట్లు పైనే గెలుస్తామని బల్లగుద్ది మరీ చెప్పారు. ఆ సమయంలో దాదాపు అందరూ.. టీఆర్ఎస్ వంద సీట్లు గెలవడం కష్టం కానీ.. అధికారంలోకి రావడం మాత్రం ఖాయమనే అభిప్రాయం వ్యక్తం చేశారు. అయితే ఎప్పుడైతే కాంగ్రెస్, టీడీపీ, టీజేఎస్, సీపీఐ పార్టీలు మహాకూటమిగా ఏర్పడ్డాయో ఒక్కసారిగా అంచనాలు తారుమారయ్యాయి. వార్ వన్ సైడ్ కాదు.. టీఆర్ఎస్ కు మహాకూటమితో నువ్వా నేనా అన్నట్టు పోరు తప్పేలా లేదనే అభిప్రాయం వ్యక్తమైంది. కొన్ని సర్వేలు అయితే మహాకూటమిదే పైచేయి అని తేల్చాయి. దీనికితోడు ప్రచారానికి వెళ్తున్న టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థులకు నిరసన సెగలు. దీంతో ప్రజల్లో క్రమక్రమంగా మహాకూటమి కూడా అధికారంలోకి రావొచ్చనే అభిప్రాయం మొదలైంది. అంతేకాదు ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే కేసీఆర్, కేటీఆర్ లకు ఓటమి భయం పట్టుకుందా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఎన్నికల వేడి మొదలైన తరువాత కేటీఆర్ ఒక మాట పదేపదే చెప్తున్నారు. అదే 'టీఆర్ఎస్ ఒంటరిగా అధికారంలోకి రాకపోతే.. రాజకీయ సన్యాసం తీసుకుంటా, అమెరికా వెళ్ళిపోతా'. కేటీఆర్ వ్యాఖ్యలపై టీఆర్ఎస్ శ్రేణులు అది ఆయనకి గెలుపుపై ఉన్న ధీమా అని సమర్ధించుకుంటున్నా.. కూటమి నేతలు మాత్రం విమర్శలు గుప్పిస్తున్నారు. కేటీఆర్ కి ఓటమి భయం పట్టుకుంది కాబట్టే ఓడిపోతే రాజకీయాలు వదిలేస్తా, అమెరికా వెళ్ళిపోతా అంటున్నాడు అంటూ విమర్శించారు. మరికొందరైతే గెలిచినా, ఓడిపోయినా ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవ చేసే నాయకులు కావాలి కానీ.. ఓడిపోతే వదిలేసి విదేశాలు పోయే నాయకులు ఎందుకంటూ ఘాటుగా విమర్శిస్తున్నారు. ఇప్పుడు ఇలాంటి విమర్శల వర్షమే కేసీఆర్ మీద కూడా మొదలైంది. కేసీఆర్ మొన్నటి వరకు వంద సీట్లు గెలుస్తాం, మళ్ళీ తమదే అధికారమని ధీమా వ్యక్తం చేస్తూ.. కూటమి నేతల మీద విమర్శల వర్షం కురిపించారు. అయితే తాజాగా కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు మాత్రం ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. 'వచ్చే ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ ఓడిపోతే.. నాకొచ్చే నష్టం పెద్దగా ఏమీ లేదు. గెలిపిస్తే గట్టిగా పని చేస్త. లేకుంటే ఇంటికాడ రెస్ట్‌ తీసుకుంటా. వ్యవసాయం చేసుకుంటా' అని కేసీఆర్ అన్నారు. దీంతో కేటీఆర్ లాగే కేసీఆర్ కి కూడా ఓటమి భయం పట్టుకుందంటూ విమర్శలు మొదలయ్యాయి. కూటమి గెలుస్తుందని అర్ధమయ్యే కేసీఆర్.. ఓడిపొతే ఇంటికాడ రెస్ట్ తీసుకుంటా అంటున్నారు అంటూ కూటమి నేతలు విమర్శిస్తున్నారు. ఇలా ఓడిపోతే అమెరికా పోయేవాళ్లు, రెస్ట్ తీసుకునేవాళ్లు తెలంగాణకు అవసరమా అంటూ గట్టిగానే విమర్శలు వినిపిస్తున్నాయి. అసెంబ్లీ రద్దు సమయంలో వంద సీట్లు గెలుస్తామని ధీమా వ్యక్తం చేసి విపక్షాలకు భయం పుట్టించిన కేటీఆర్, కేసీఆర్.. ఇప్పుడు 'ఓడిపోతే అమెరికా వెళ్ళిపోతా, ఓడిపోతే ఇంట్లో రెస్ట్ తీసుకుంటా' అంటూ విపక్షాలకు అస్త్రాలు అందించారు. మరి టీఆర్ఎస్ శ్రేణులు చెప్తున్నట్టు వారు కాన్ఫిడెన్స్ తో ఆ మాటలు అన్నారో లేక కూటమి నేతలు చెప్తున్నట్టు ఓటమి భయంతో ఆ మాటలు అన్నారో తెలియాలంటే డిసెంబర్ 11 వరకు వేచి చూడాల్సిందే. చూద్దాం ఏం జరుగుతుందో.

రంగంలో అగ్రనేతలు..ఏకంగా ఇంటికే వెళ్తున్నారు

  నామినేషన్ల ఉపసంహరణకు నేడు ఆఖరి గడువు కావటంతో రెబల్స్ ని బుజ్జగించే పనిలో పడ్డారు అన్ని పార్టీల నేతలు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ నుంచి రెబల్స్ గా బరిలోకి దిగిన నేతలను బుజ్జగించేందుకు ఆ పార్టీ అగ్రనేతలు రంగంలోకి దిగారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలను   అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న పార్టీ ఒక్క సీటును కూడా వదులుకోవడానికి సిద్ధంగా లేదు. అందుకే, తిరుగుబాటు అభ్యర్థులను బుజ్జగించడానికి అహ్మద్‌ పటేల్‌,జైరాం రమేశ్‌, వీరప్ప మొయిలీ,డీకే శివకుమార్‌ వంటి హేమాహేమీలు దిగి వచ్చారు. వారు అసమ్మతి నేతల ఇంటికి నేరుగా వెళ్లి బుజ్జగించే ప్రయత్నాలు చేస్తున్నారు. శేరిలింగంపల్లిలో కాంగ్రెస్‌ రెబల్‌ అభ్యర్థి భిక్షపతి యాదవ్‌ను బుజ్జగించడానికి ఏకంగా ఆరుగురు అగ్ర నేతలు ఆయన ఇంటికి వెళ్లారు. ఇప్పటికే భిక్షపతి యాదవ్‌ను  జైపాల్‌రెడ్డి కలిశారు. నామినేషన్‌ ఉపసంహరించుకోవాలని కోరగా.. ఆయన ససేమిరా అన్నారు. దాంతో  ఏఐసీసీ కోశాధికారి అహ్మద్‌ పటేల్‌, టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌, మాజీ ఎంపీ సుబ్బిరామిరెడ్డి, కేంద్ర మాజీ మంత్రి జైపాల్‌ రెడ్డి, మాజీ ఎంపీ మధు యాష్కీ, సినీ నిర్మాత బండ్ల గణేశ్‌ తదితరులు భిక్షపతి యాదవ్‌ ఇంటికి వెళ్లి నామినేషన్‌ను ఉపసంహరించుకోవాలని బుజ్జగించారు. ఉన్నతమైన స్థానం ఇచ్చి గౌరవమిస్తామని హామీ ఇచ్చారు.అగ్రనేతలు రావటంతో భిక్షపతి కూడా మెత్తబడ్డారు. పెద్దలు మాట్లాడిన తీరు, ఇచ్చిన హామీ తనను సంతృప్తిపరిచాయని, నామినేషన్‌ను ఉపసంహరించుకుంటానని తెలిపారు.  మరోవైపు మేడ్చల్‌ నుంచి రెబల్‌ అభ్యర్థిగా నామినేషన్‌ వేసిన జంగయ్య యాదవ్ ను బుజ్జగించేందుకు జైరాం రమేశ్‌ ఆయన ఇంటికి వెళ్లారు. పార్టీలో మంచి భవిష్యత్తు ఉంటుందని హామీ ఇచ్చారు. దీంతో నామినేషన్‌ ఉపసంహరించుకుంటానని జంగయ్య యాదవ్‌ తెలిపారు. మల్కాజిగిరి నుంచి నామినేషన్‌ వేసిన సురేశ్‌ యాదవ్‌తో వీరప్ప మొయిలీ మాట్లాడారు. ఆయన కూడా పోటీ నుంచి తప్పుకొంటున్నట్లు ప్రకటించారు. ఖైరతాబాద్‌ నుంచి నామినేషన్‌ తిరస్కరణకు గురైన రాజు యాదవ్‌.. తాను దాసోజు శ్రవణ్‌కు మద్దతుగా పనిచేస్తానని తెలిపారు. సూర్యాపేటలో నామినేషన్‌ వేసిన పటేల్‌ రమేశ్‌ రెడ్డి కూడా ఉపసంహరణకు అంగీకరించారు. పొత్తుల్లో భాగంగా సనత్‌నగర్‌ సీటును కోల్పోయిన మర్రి శశిధర్‌ రెడ్డి నివాసానికీ జైరాం రమేశ్‌ వెళ్లి సంప్రదింపులు జరిపినట్లు తెలిసింది. మరోవైపు రేవంత్‌తో సమావేశమైన జైరాం... సోనియా సభ ఏర్పాట్లు, అసంతృప్తుల బుజ్జగింపులపై చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. రెబల్స్‌ అందరూ నామినేషన్లు ఉపసంహరించుకుంటారని పార్టీ ముఖ్య నేత ఒకరు చెప్పారు. మొత్తానికి అగ్రనేతలు దిగి రావటంతో బుజ్జగింపులు కొలిక్కి వచ్చాయి. రెబల్స్‌ను బుజ్జగించడానికి కాంగ్రెస్‌ అధిష్ఠానం పెద్దలు ఏకంగా వారి ఇళ్లకే వెళ్లడం ఆ పార్టీ చరిత్రలో ఇదే తొలిసారి అని కాంగ్రెస్‌ సీనియర్లు చెబుతున్నారు.

తెలంగాణాలో టీడీపీ తరుపున కొడాలి నాని ప్రచారం

  కొడాలి నానికి మొదటినుంచి నందమూరి కుటుంబంతో మంచి అనుబంధముంది. ముఖ్యంగా ఎన్టీఆర్, నందమూరి హరికృష్ణ అంటే కొడాలి నానికి అమితమైన గౌరవం, అభిమానం. జూనియర్ ఎన్టీఆర్ కి కూడా కొడాలి నాని మంచి స్నేహితుడు. నందమూరి కుటుంబంతో ఉన్న ఆ అనుబంధంతోనే అప్పుడు నానికి టీడీపీ గుడివాడ టికెట్ ఇచ్చారనే అభిప్రాయం ఉండేది. అయితే నాని గుడివాడలో తనకంటూ ఓ ప్రత్యేక మార్క్ ని క్రియేట్ చేసుకొని గుడివాడలో తిరుగులేని నేతగా ఎదిగారు. టీడీపీలో మంచిపేరు తెచ్చుకున్నారు. తరువాత కొన్ని పరిస్థితుల దృష్ట్యా ఆయన టీడీపీని వీడి వైసీపీలో చేరారు. అయినా ఆయనకి నందమూరి కుటుంబం మీద అభిమానం ప్రేమ ఏ మాత్రం తగ్గలేదు. హరికృష్ణ మరణించిన సమయంలో ఓ వైవు బాధపడుతూనే మరోవైపు జూనియర్ ఎన్టీఆర్ ఓ స్నేహితుడిలా అండగా ఉన్నారు. ఏ పార్టీలో ఉన్నా హరికృష్ణ కుటుంబం మీద ఉన్న అభిమానం పోదని రుజువు చేసుకున్నారు. అయితే ఇప్పుడు నాని హరికృష్ణ కుటుంబం కోసం తెలంగాణలో టీడీపీ తరుపున ప్రచారం చేయాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. తెలంగాణలో డిసెంబర్ 7 న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. టీఆర్ఎస్ ను గద్దె దించడమే లక్ష్యంగా కాంగ్రెస్, టీడీపీ, టీజెఎస్, సీపీఐ పార్టీలు మహాకూటమిగా ఏర్పడి నువ్వా నేనా అన్నట్టు పోరుకి సిద్ధమయ్యాయి. ఈ కూటమిలో పొత్తులో భాగంగా టీడీపీకి 14 స్థానాలు కేటాయించారు. వాటిలో కూకట్ పల్లి కూడా ఉంది. చంద్రబాబు కూకట్ పల్లి నుంచి అనూహ్యంగా హరికృష్ణ కూతురు సుహాసినిని బరిలోకి దించారు. సుహాసిని గెలవాలని మహాకూటమి ఎంత బలంగా కోరుకుంటుందో.. కొడాలి నాని కూడా అంతే బలంగా కోరుకుంటున్నారట. హరికృష్ణ కూతురి గెలుపు కోసం తనవంతుగా ప్రచారం చేయాలని నాని భావిస్తున్నారట. ఇప్పటికే ఈ విషయాన్ని తమ పార్టీ అధినేత జగన్ దృష్టికి కూడా తీసుకెళ్లారట. అయితే జగన్ మాత్రం ఈ విషయంపై స్పందించలేదని తెలుస్తోంది. అయినా కొడాలి నాని మాత్రం తాను ప్రచారం చేయాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. మరి కొడాలి నాని నిజంగా ప్రచారం చేయాలనుకుంటున్నారో లేదో తెలీదు కానీ టీడీపీ శ్రేణులు మాత్రం దీన్ని వ్యతిరేకించే అవకాశాలున్నాయి. ఎందుకంటే ఏపీలో టీడీపీ, వైసీపీ ప్రత్యర్థులు. అలాంటిది టీడీపీ నుంచి వైసీపీలో చేరిన నేత ప్రచారానికి వస్తా అంటే టీడీపీ ఒప్పుకుంటుందా? కష్టమే. మరోవైపు కొడాలి నాని కూడా ప్రచారానికి రావడం అనుకున్నంత ఈజీ ఏం కాదు. ఆయన ప్రచారానికి రావాలనుకుంటున్నారన్న వార్తలు వస్తేనే.. నందమూరి అభిమానుల ఓట్ల కోసమే నాని ఇలాంటి నిర్ణయం తీసుకున్నారంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అదీగాక తెలంగాణలో టీడీపీ తరుపున ప్రచారం చేస్తే టీడీపీని పొగడాలి, కేసీఆర్ కి వ్యతిరేకంగా మాట్లాడాలి. దీనివల్ల టీడీపీ వ్యతిరేకంగా, కేసీఆర్ కి సన్నిహితంగా ఉంటున్న వైసీపీకి కష్టాలు తప్పవు. మరి ఇన్ని ప్రతికూలతల నడుమ నాని కూకట్ పల్లిలో టీడీపీ తరుపున ప్రచారం చేస్తారో లేదో చూడాలి.

పొన్నాలకి క్లియర్..మర్రికి షాక్‌.. జానాకు సస్పెన్స్‌

  తెలంగాణలో ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్,టీడీపీ,టీజేఎస్,సీపీఐ పార్టీలు మహాకూటమిగా ఏర్పడిన సంగతి తెలిసిందే. కూటమితో ఒక్కటయ్యాయిగాని సీట్ల సర్దుబాటు కోసం చాలా కాలం మదన పడ్డాయి. ఎట్టకేలకు టీడీపీ 14 ,టీజేఎస్ 8, సీపీఐ 3 , మిగలిన  స్థానాల్లో కాంగ్రెస్ పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు. ఇప్పుడే అసలు తలనొప్పి మొదలైంది.సీట్లు సరే ఏ పార్టీ ఏ స్థానంలో పోటీ చేయాలనే దానిపై తర్జన భర్జన పడ్డాయి. నామినేషన్ వేసేందుకు ఇతర పార్టీలు సిద్ధమవుతున్నా కూటమి పార్టీల్లో సమన్వయము కుదర్లేదు.కూటమి విచ్చిన్నం అవుతుంది అనుకున్న తరుణంలో పలు చర్చల అనంతరం మొత్తానికి పార్టీలు తమ తొలి విడుత అభ్యర్థుల జాబితాను విడుదల చేశాయి. కానీ కాంగ్రెస్ పార్టీ విడుదల చేసిన జాబితాతో కొందరు సీనియర్ నేతలు అవాక్కయ్యారు. తమ పేర్లు లేకపోవటంతో షాక్ కి గురయ్యారు. జాబితాలో మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత పొన్నాల లక్ష్మయ్య, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత మర్రి శశిధర్‌రెడ్డి పేర్లు లేవు. పొన్నాల లక్ష్మయ్య తాను మొదటి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న జనగామ స్తానం నుంచి పోటీ చేయాలనుకున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ విడుదల చేసిన రెండు జాబితాల్లోనూ తన పేరు లేదు.ఆ స్థానాన్ని పొత్తు భాగంగా టీజేఎస్ కి కేటాయిస్తున్నారని, ఆ పార్టీ అధ్యక్షుడు కోదండరాం పోటీ ఇక్కడి నుంచి పోటీ చేయనున్నారని వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో పొన్నాల హుటాహుటిన ఢిల్లీ వెళ్లారు. అధిష్టానంతో చర్చలు జరిపారు.ఎంపీ టికెట్ ఇస్తామన్నా వద్దని జనగామ టికెట్ కోసం పట్టుబట్టారు. బీసీ నేత అందులోనూ,సీనియర్ నేత అవ్వటంతో ప్రజల్లోకి వ్యతిరేక సంకేతాలు వెళ్తాయని భావించి ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ జనగామ స్థానం విషయంలో రాజీ పడాల్సిందిగా కోదండరాంని కోరారు. అంతేకాకుండా రాష్ట్ర వ్యహారాలు ఇంచార్జ్ కుంతియా, పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కోదండరాం భేటీ అయ్యి చర్చలు జరిపారు. ఎట్టకేలకు కోదండరాం ఆ స్థానం విషయంలో తగ్గారు.దీంతో పొన్నాల కి లైన్ క్లియర్ అయింది. మర్రి శశిధర్ రెడ్డి ..మాజీ ముఖ్య మంత్రి కుమారుడు,న్యాయపోరాటాలతో అధికార టీఆర్‌ఎస్‌ పార్టీని ఉక్కిరిబిక్కిరి చేసిన నాయకుడు.ఇలాంటి నేతకి కాంగ్రెస్ పార్టీ మొండిచేయి చూపింది.ఆయన పేరు కూడా రెండు జాబితాల్లో ప్రకటించలేదు.పైగా ఆ స్థానాన్ని పొత్తులో భాగంగా టీడీపీ కి కేటాయిస్తున్నట్టు వార్తలు వచ్చాయి.దీంతో ఆయన డిల్లీ వెళ్లి అధిష్టానంతో చర్చలు జరిపారు.సనత్‌నగర్ నుంచి పోటీ చేసేందుకు తనకే అవకాశం ఇవ్వాలని కాంగ్రెస్ పెద్దలకు విజ్ఞప్తులు చేసుకున్నప్పటికీ ఫలితం లేకుండా పోయింది. కనీసం మూడో జాబితాలోనైనా సనత్‌నగర్ స్థానాన్ని కాంగ్రెస్‌కు కేటాయిస్తారనుకుంటే అది జరగలేదు. కాంగ్రెస్ మూడో జాబితా విడుదలైన కాసేపటికే సనత్‌నగర్ నుంచి కూన వెంకటేష్ గౌడ్ పోటీ చేస్తున్నట్లు తెలుగుదేశం పార్టీ ప్రకటించింది.దీనిపై స్పందించిన మర్రి శశిధర్‌రెడ్డి మూడో జాబితాలోనూ తన పేరు లేకపోవడం బాధాకరమన్నారు. తనకు ప్రత్యామ్నాయ మార్గాలున్నాయన్నారు. నియోజకవర్గంలో తన కమిట్‌మెంట్స్ ఉంటాయని చెప్పుకొచ్చారు. కార్యకర్తలతో చర్చించి త్వరలో ఓ నిర్ణయానికొస్తానని శశిధర్ రెడ్డి చెబుతున్నారు. దీంతో ఆయన పార్టీ మారిన ఆశ్చర్య పడాల్సిన అవసరంలేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మిర్యాలగూడ విషయంలో కూడా సందిగ్దత వీడలేదు.మిర్యాలగూడ స్థానం నుంచి కాంగ్రెస్ సీనియర్ నేత జానా రెడ్డి ఆయన కుమారున్నిబరిలో దింపాలని భావిస్తున్నారు.పొత్తులో భాగంగా ఆ స్థాన్నాన్ని టీజేఎస్ ఆశిస్తుంది.దీనిపై స్పష్టత రాకపోవటంతో ఆ స్థానాన్ని పక్కన పెట్టింది కాంగ్రెస్ పార్టీ. దీంతో ఢిల్లీకి వెళ్లి మరీ జానారెడ్డి ప్రయత్నాలు చేశారు.కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం ఒక కుటుంబానికి ఒకే టికెట్ అని తేల్చేసిందట.ఇప్పటికే పొన్నాల కోసం జనగామ స్థానాన్ని త్యాగం చేసిన కోదండరాం మరో స్థానాన్ని వదులుకోడానికి సిద్ధంగాలేరని సమాచారం.దీంతో జానా రెడ్డి తన కుమారునికి టికెట్ ఇవ్వకున్నా పర్లేదు కానీ టీజేఎస్ లో తాను సూచించిన వ్యక్తికి టికెట్ ఇవ్వాలని కోదండరాంపై ఒత్తిడి తెస్తున్నారట. జేఏసీ లో కీలక భూమిక పోషించిన టీజేఎస్ నేత విద్యాధరర్ రెడ్డి కి టికెట్ ఇవ్వాలని కోదండరాం భావిస్తుంటే టీజేఎస్ లోనే ఉన్న తన వియ్యంకుడి సోదరుడైన మేరెడ్డి విజయేందర్ రెడ్డికి ఇవ్వాలని జానారెడ్డి పట్టుబడుతున్నారట.మరీ ఈ ఇరకాటంలో ఆ స్థానాన్ని ఎవరికి కేటాయిస్తారో వేచిచూడాల్సిందే.

టీఆర్ఎస్ కు ఓటేయమంటున్న బీజేపీ.!!

  తెలంగాణలో డిసెంబర్ 7 న అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న విషయం తెలిసిందే. బరిలో ఎన్ని పార్టీలు ఉన్నా.. అధికారం కోసం టీఆర్ఎస్, మహాకూటమి మధ్యే అసలు పోరు అనేది వాస్తవం. అసెంబ్లీరద్దుకి ముందు వరకు తెలంగాణ ఎన్నికల ఫలితం ఏకపక్షమే అనుకున్నారంతా. కానీ ఎప్పుడైతే కాంగ్రెస్.. టీడీపీ, టీజేఎస్, సీపీఐ పార్టీలతో కలిసి కూటమిగా ఏర్పడిందో.. అప్పటినుంచి పరిస్థితులు మారిపోయాయి. ఇప్పుడు అధికారం కోసం టీఆర్ఎస్ వర్సెస్ మహాకూటమి పోరు నువ్వానేనా అన్నట్టుగా సాగుతుంది. కొన్ని సర్వేలు కూటమిదే అధికారమని కూడా చెప్తున్నాయి. దీంతో బీజేపీ ఆలోచనలో పడింది. తెలంగాణలో బీజేపీ అంతబలంగా లేకపోయినా ఒంటరిగా బరిలోకి దిగుతుంది. గెలుస్తామని ధీమా వ్యక్తం చేస్తుంది. కానీ అదంతా పైకి మాత్రమే. లోపల బీజేపీ వేరేలా ఆలోచిస్తుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రస్తుతం తెలంగాణలో బీజేపీ ముందున్న ప్రధాన లక్ష్యం మహాకూటమిని ఓడించడం. తెలంగాణలో మహాకూటమి ఓడిపోవాలని టీఆర్ఎస్ ఎంతబలంగా కోరుకుంటుందో.. అంతకంటే బలంగా బీజేపీ కూడా కోరుకుంటోంది. బీజేపీకి కాంగ్రెస్ అప్పటికి ఇప్పటికి ఎప్పటికి ప్రధాన శత్రువే. ఇప్పుడు టీడీపీ కూడా అదేస్థాయిలో శత్రువైంది. మరి అలాంటిది ఇప్పుడు కాంగ్రెస్, టీడీపీ కలిసి కూటమిగా ఏర్పడి అధికారంలోకి వస్తానంటే బీజేపీ ఊరుకుంటుందా?. అందుకే కూటమికి అడ్డుకట్ట వేయడానికి ఏం చేయడానికైనా సిద్దపడింది. ప్రస్తుతం బీజేపీ కొన్ని స్థానాల్లో ప్రచారం చేస్తూ కేడర్ కి భిన్న సంకేతాలు ఇస్తుందట. గెలుస్తుంది అనుకుంటేనే బీజేపీకి ఓటేయండి లేదంటే టీఆర్ఎస్ కి ఓటేయండి అని చెప్తుందట. దీనివల్ల కూటమిని ఓటమికి దగ్గర చేయొచ్చని బీజేపీ భావిస్తున్నట్టు తెలుస్తోంది. నిజానికి బీజేపీ, టీఆర్ఎస్ పార్టీల మధ్య రహస్య పొత్తుందని ఎప్పటినుంచో ఆరోపణలు వినిపిస్తున్నాయి. బీజేపీ సిట్టింగ్ స్థానాల్లో టీఆర్ఎస్ కావాలనే బలం లేని అభ్యర్థులను నిల్చోబెడుతుందని పలువురు ఆరోపించారు. ఆ ఆరోపణల్లో నిజమెంతో ఇంకా బయటికి తెలియలేదు కానీ.. కూటమిని ఓడించాలని బీజేపీ టీఆర్ఎస్ కి ఓటేయమని చెప్తుంది అంటూ కొత్త ఆరోపణలు మొదలయ్యాయి. ఒకవేళ నిజంగా బీజేపీ అలా చేస్తే మాత్రం బీజేపీకే నష్టమనే అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. టీఆర్ఎస్ సహకరిస్తే బీజేపీ మూడు, నాలుగు సిట్టింగ్ స్థానాల్లో గెలుస్తుందేమో.. కానీ మిగతా స్థానాల్లో కూటమి ఓటమి కోసం టీఆర్ఎస్ కి ఓటు వేయిస్తే అసలు తెలంగాణలో బీజేపీ మనుగడకే ప్రమాదం. అసలే బీజేపీకి అన్ని స్థానాల్లో బరిలోకి దిగడానికి బలమైన అభ్యర్థులు లేరనే అభిప్రాయం ఉంది. ఇప్పుడున్న కాస్త ఓటుబ్యాంకు కూడా టీఆర్ఎస్ కి పడితే.. బీజేపీ ఓటు శాతం దారుణంగా పడిపోతుంది. దీనితో పార్టీ కేడర్ మనోధైర్యం దెబ్బ తినడంతో పాటు.. ప్రజలకు బీజేపీ మీద నమ్మకం పోతుంది. మరి భవిష్యత్తులో పార్టీకి జరిగే భారీ నష్టం గురించి ఆలోచించకుండా టీఆర్ఎస్ కు సహకరించి బీజేపీ రాంగ్ స్టెప్ వేస్తుందా?. చూద్దాం ఏం జరుగుతుందో.

టీఆర్‌ఎస్‌ సెంటిమెంట్ ను మార్చిన జీవన్‌రెడ్డి

  టీఆర్ఎస్ పార్టీ అధినేత ప్రతి విషయంలో సెంటిమెంట్ ఫాలో అవుతారు.ముఖ్యంగా ఎన్నికల సమయంలో అయితే తూచా తప్పకుండా పాటిస్తారు.ప్రతి ఎన్నికల్లోనూ నామినేషన్‌ దాఖలు చేసే ముందు కోనాయిపల్లి వెంకన్నను కేసీఆర్‌ దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తోంది.1985 నుంచి ప్రతి ఎన్నిక సందర్భంగా కేసీఆర్‌ కోనాయిపల్లికి వచ్చి వెంకటేశ్వరస్వామికి పూజలు చేశాకే నామినేషన్‌ పత్రాలు దాఖలు చేస్తూ వస్తున్నారు. టీఆర్ఎస్ ఆవిర్భావ సమయంలో కూడా ఈ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు.ఈ ఎన్నికలకు కూడా నామినేషన్ వేసేముందు కోనాయిపల్లిలో పూజలు జరిపించి నామినేషన్ వేశారు.అయితే ఈ సెంటిమెంట్ నామినేషన్స్ కి మాత్రమే పరిమితం కాదు చివరికి అభ్యర్థుల ప్రకటనలోనూ ఫాలో అవుతున్నారు కేసీఆర్‌. ఎన్నికల్లో కేసీఆర్‌ మొట్ట మొదటి టికెట్ కేటాయించిన వారు ఓడిపోతారనే సెంటిమెంట్ ఉండేది.ఆలా జరిగిన సందర్భాలు కూడా ఉన్నాయి.2001లో టీఆర్‌ఎస్‌ ఆవిర్భావం అనంతరం 2004లో తొలిసారిగా సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ తరుపున అభ్యర్థులు బరిలో దిగారు.అయితే, ఆ ఎన్నికల్లో కేసీఆర్‌ మొట్టమొదటి టికెట్‌గా ప్రకటించిన కరీంనగర్‌ జిల్లా సిరిసిల్ల నియోజకవర్గం అసెంబ్లీ అభ్యర్థిగా పాపారావ్‌ ఓటమి పాలయ్యారు.2009 సార్వత్రిక ఎన్నికల్లోనూ కేసీఆర్‌ కరీంనగర్‌ జిల్లా పెద్దపల్లి నియోజకవర్గం నుంచి టీఆర్‌ఎస్‌ అసెంబ్లీ అభ్యర్థిగా సత్యనారాయణరెడ్డిని ప్రకటించారు.ఆయన కూడా ఓడిపోయారు. దీంతో టీఆర్‌ఎస్‌ అధినేత తొలి టికెట్‌ ప్రకటించిన అభ్యర్థి ఓటమి పాలవుతారనే ప్రచారం సాగింది.అయితే ఈ ప్రచారానికి 2014 ఎన్నికల ఫలితాలే అడ్డుకట్ట వేశాయి. 2014 ఎన్నికల్లో ఆర్మూర్‌ అభ్యర్థిగా బరిలోకి దిగిన నియోజకవర్గం ఇన్‌చార్జి ఆశన్నగారి జీవన్‌రెడ్డి 13,461 ఓట్ల మెజారిటీతో విజయం సాధించాడు.2013 లో టీఆర్‌ఎస్‌ 13వ ఆవిర్భావ సభను జీవన్‌రెడ్డి విజయవంతంగా నిర్వహించిందనుకు కేసీఆర్‌ ఆయన ఇంటికి వెళ్లి మరీ టీఆర్‌ఎస్‌ మొట్ట మొదటి అభ్యర్థిగా ఆర్మూర్‌ అసెంబ్లీ స్థానానికి జీవన్‌రెడ్డి పేరును ప్రకటించారు.మొత్తానికి జీవన్ రెడ్డి గెలిచారు.దీంతో జీవన్ రెడ్డి మొదటి టికెట్‌ కేటాయించిన వ్యక్తి ఓటమి పాలవుతాడనే సెంటిమెంట్ కి స్వస్తి పలకడంతో ఇప్పడు జరగనున్న ఎన్నికలకు సెంటిమెంట్ ని ఫాలో అయ్యే కేసీఆర్‌ మొట్టమొదట బీ-ఫారం జీవన్ రెడ్డి కే ఇచ్చారు.మరి ఈసారి కూడా సెంటిమెంట్ వర్కవుట్ అవుతుందో లేదో వేచి చూద్దాం..!!

టీడీపీ అభ్యర్థి రేవూరి పోటీ నుంచి తప్పుకుంటారా?

  కాంగ్రెస్ 65 మంది అభ్యర్థులతో తొలిజాబితాను ప్రకటించింది. అదేవిధంగా టీడీపీ కూడా 9 మంది అభ్యర్థులతో తొలి జాబితాను ప్రకటించింది. దీంతో ఈ 74 స్థానాల మీద స్పష్టత వచ్చింది ఇక మిగతా స్థానాల అభ్యర్థుల ఎంపిక మీద దృష్టిపెడితే చాలు అనుకున్నారు. కానీ కొందరు ఆశావహులు టిక్కెట్లు ప్రకటించిన స్థానాల్లో కూడా ఇంకా ఆశ పోగొట్టుకోవట్లేదు. ముఖ్యంగా కాంగ్రెస్ నేతలు ఒక స్థానం విషయంలో పట్టుబడుతున్నారు. అదే వరంగల్‌ పశ్చిమ నియోజకవర్గం. టీడీపీ అభ్యర్థులను ప్రకటించిన జాబితాలో  వరంగల్‌ పశ్చిమ కూడా ఉంది. ఈ స్థానం నుంచి రేవూరి ప్రకాష్ రెడ్డి పేరు ప్రకటించారు. కాంగ్రెస్‌ పార్టీ ఉమ్మడి వరంగల్‌ జిల్లా అధ్యక్షుడు నాయిని రాజేందర్‌రెడ్డికే వరంగల్‌ పశ్చిమ టిక్కెట్ ఇవ్వాలని కాంగ్రెస్‌ నేతలు హన్మకొండలోని డీసీసీ భవన్‌లో రెండు రోజులుగా దీక్ష చేస్తున్న సంగతి విదితమే. పొత్తులో భాగంగా ఆ సీటుని కాంగ్రెస్ టీడీపీకి కేటాయించింది. టీడీపీ అభ్యర్థిని కూడా ప్రకటించింది. అయినా కాంగ్రెస్ నేతలు పట్టువీడకుండా రాజేందర్‌రెడ్డికే టిక్కెట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నట్టు తెలుస్తోంది. నిన్న కాంగ్రెస్ సీనియర్ నేత వి. హన్మంతరావు దీక్షలో పాల్గొన్న నేతలను సంప్రదించారు. దీక్షలో పాల్గొన్న కాంగ్రెస్‌ నగర అధ్యక్షుడు కట్ల శ్రీనివాస్ తో పాటు మిగతా నాయకులతో చర్చించారు. న్యాయం చేయాలని నాయకులు,కార్యకర్తలు వి.హెచ్ ను చుట్టుముట్టారు. రాజేందర్‌రెడ్డికి టిక్కెట్, బీ-ఫాం కేటాయింపు తర్వాతే దీక్ష విరమిస్తామని కట్ల శ్రీనివాస్‌ సమాధానమిచ్చారు. వి.హెచ్ నచ్చచెప్పే యత్నంచేసినా స్వీయ నిర్బంధంలో ఉండి దీక్ష చేస్తున్న నేతలు డీసీసీ భవన్‌ నుంచి బయటకు రాలేదు. అనంతరం వి.హెచ్ మీడియాతో మాట్లాడుతూ.. ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో పార్టీ కష్టకాలంలో ఉన్న సమయంలో రాజేందర్‌రెడ్డి అన్ని విధాలా సేవలందించారన్నారు. ఆయనకు పశ్చిమ టిక్కెట్ దక్కకపోవడం సమంజసం కాదన్నారు. ఈ విషయమే టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి కుంతియా, టీడీపీ అధినేత చంద్రబాబు, టీటీడీపీ అధ్యక్షుడు రమణలతో చర్చించి ఒప్పించే ప్రయత్నం చేస్తానని హామీ ఇచ్చారు. వి.హెచ్ నచ్చచెప్పే ప్రయత్నం చేసినా నేతలు వినలేదు. రాజేందర్‌రెడ్డికి టిక్కెట్ కేటాయించాల్సిందేనని పట్టుబడుతున్నారు. పాపం వి.హెచ్ చేసేదేమి లేక ఉత్తమ్‌, కుంతియా, చంద్రబాబు, రమణలతో చర్చించి ఒప్పించే ప్రయత్నం చేస్తానని హామీ ఇచ్చారు. కానీ ఇది ఇప్పుడు ఎంతవరకు సాధ్యం. టీడీపీ ఇప్పటికే వరంగల్‌ పశ్చిమ అభ్యర్థిని ప్రకటించింది. టీడీపీ మొదటినుంచి టిక్కెట్ల విషయంలో పెద్దగా పట్టుబట్టలేదు. టీఆర్ఎస్ ని గద్దె దించడమే లక్ష్యంగా, కూటమి ప్రయోజనాల దృష్ట్యా 14 స్థానాలతో సరిపెట్టుకుంది. మరి ఇప్పుడు సీనియర్ నేత రేవూరి ప్రకాష్ రెడ్డి లాంటి నేత స్థానాన్ని అడిగితే అంగీకరిస్తుందా?. రేవూరి ప్రకాష్ రెడ్డి పోటీ నుంచి తప్పుకుంటారా? అంటే అనుమానమే. కాంగ్రెస్ కూడా అభ్యర్థిని మార్చడానికి సుముఖుత వ్యక్తం చేయకపోవొచ్చు అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఎందుకంటే ఒక్కసారి అభ్యర్థిని మార్చడం మొదలుపెడితే మిగతా స్థానాల్లోని ఆశావహులు కూడా ఇదే విధంగా పట్టుబట్టే అవకాశముంది. దీంతో ఇన్నాళ్లు చర్చలు జరిపి, కసరత్తులు చేసి, సీట్ల కేటాయింపు చేసిన కష్టమంతా బూడిదలో పోసిన పన్నీరు అవుతుంది. అదీగాక ఇప్పటికే టిక్కెట్ల విషయంలో కూటమికోసం టీడీపీ చేసిన త్యాగాలు కాంగ్రెస్ కి తెలుసు. వీటినిబట్టి చూస్తుంటే కాంగ్రెస్ వరంగల్‌ పశ్చిమ అభ్యర్థిని మార్చడానికి సుముఖుత వ్యక్తం చేయకపోవొచ్చు అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరోవైపు రాజేందర్‌రెడ్డి తన అనుచరులతో సమావేశమై భవిష్యత్తు కార్యాచరణపై చర్చిస్తున్నట్టు తెలుస్తోంది. ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో ఏంటో అని కాంగ్రెస్ శ్రేణులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. చూద్దాం మరి ఏం జరుగుతుందో.