బాబర్ బడి గురించి విన్నారా!

  పశ్చిమబెంగాల్‌ల్లో ఓ మారుమూల ఊరు బబ్తా. ఆ ఊళ్లో ‘బాబర్ ఆలీ’ అనే చిన్న కుర్రవాడు ఉండేవాడు. అతనికి చదువంటే ఇష్టం. అందుకనే కిలోమీటర్ల కొద్దీ దూరం నడిచి నడిచి ఓ బడికి వెళ్లి చదువుకునేవాడు. అంతవరకూ బాగానే ఉంది. కానీ తన తోటి పిల్లలంతా చదువు మీద దృష్టి పెట్టకుండా ఆడపాటల్లో గడిపేయడం అతన్ని ఆలోచింపచేసింది. ఆ తర్వాత అతను ఏం చేశాడు అన్నది ఓ చరిత్ర!   బాబర్‌ ఆలీ ఐదో తరగతి చదువుకుంటుండగా... చదువుకునే అవకాశం లేని తన తోటి పిల్లలకి కూడా ఏదన్నా చేయాలన్న ఆలోచన వచ్చింది. ఆలోచన వచ్చిందే తడవుగా తన ఇంటి ముందర ఉన్న జామచెట్టు కింద నలుగురినీ పోగేసి చదువు చెప్పడం మొదలుపెట్టాడు. తన చెల్లెలుతో సహా ఓ ఎనిమిది మంది పిల్లలు అతని దగ్గర చదువుకోవడం మొదలుపెట్టారు.   మొదట్లో బాబర్‌ ఏదో సరదాగా ఈ ఇంటిబడిని మొదలుపెట్టాడు. కానీ ఇతరులకి చదువు నేర్పడంలో ఉన్న తృప్తి ఆ పిల్లవాడికి ఓ లక్ష్యాన్ని ఏర్పరిచింది. తన ఊళ్లో చదువుకోని ప్రతి ఒక్కరికీ, తనకి తెలిసిన విద్యని నేర్పాలన్న తపన మొదలైంది. దాంతో ఇంటింటికీ తిరిగి పిల్లలని తన బడికి పంపమని ప్రాథేయపడటం మొదటుపెట్టాడు. తన చేతిలో ఉన్న చిల్లర డబ్బుల్తోనే పిల్లలకి కావల్సిన చాక్‌పీసులు, పుస్తకాలు కొనిపెట్టే ప్రయత్నం చేశాడు. పిల్లలని బడికి ఆకర్షించేందుకు స్వీట్లు కొనిపెట్టేవాడు. బాబర్ తండ్రి చాలా చిన్న ఉద్యోగి. మొదట్లో తన పిల్లవాడి తపన ఆయనకు అర్థం కాలేదు. కానీ ఎప్పుడైతే బాబర్‌ లక్ష్యాన్ని గ్రహించాడో... తను కూడా తనకి చేతనైన సాయం చేయడం మొదలుపెట్టాడు.   బడి నడిపేందుకు బాబర్ కుటుంబం నుంచి పూర్తి సహకారం వచ్చేసింది. కానీ గ్రామస్తులకి మాత్రం అతని మీద చాలా అనుమానాలు మొదలయ్యాయి. ఏ స్వార్థమూ లేకుండా తమ పిల్లలకి అతను చదువెందుకు చెబుతున్నాడు? కొంపదీసి తమ పిల్లలని వేరే మతంలోకి కానీ మార్చడు కదా? లాంటి సందేహాలతో అతన్ని ఛీదరించుకోవడం మొదలుపెట్టారు. కానీ బాబర్ మాత్రం వెనక్కి తగ్గలేదు. రోజూ ఠంచనుగా తన బడి నుంచి వచ్చిన వెంటనే ఇంటిబడిని మొదలుపెట్టేసేవాడు. ఒకోసారి అతనికి ఇంత తిండి తినే అవకాశం కూడా ఉండేది కాదు.   2002లో బాబర్ మొదలుపెట్టిన ఈ చిన్న బడి క్రమంగా ప్రపంచ దృష్టిని ఆకర్షించడం మొదలుపెట్టింది. 2009లో బీబీసీ పత్రికలో అతని మీద ఒక కథనం వచ్చింది. ‘ప్రపంచంలోనే అతి చిన్న వయసు హెడ్‌మాస్టర్’ అంటూ ఆ కథనం ప్రకటించింది. దాంతో బాబర్‌ బడికి కావల్సినంత ప్రచారం దక్కింది. అతను మరింతమంది పిల్లలని చేర్చుకునేందుకు, కొత్త బడిని నిర్మించేందుకు దాతలు ముందుకు వచ్చారు. ఇక కర్ణాటకలోని ఇంటర్మడియట్‌ పాఠ్యపుస్తకాలలో బాబర్‌ గురించి ఓ పాఠమే ఉంది.   ఇప్పుడు బాబర్ నేర్పుతున్న బడిలో 300 మందికి పైగా విద్యార్థులు ఉన్నారు. వారికి చదువు చెప్పేందుకు 10 మంది టీచర్లు ఉన్నారు. వారిలో ఆరుగురు టీచర్లు ఒకప్పుడు బాబర్ బడిలో చదువకుని పైకి వచ్చినవారే! అలా ఓ జాబచెట్టు కింద మొదలైన బాబర్ బడికి ఇప్పుడు ‘ఆనంద శిక్షానికేతన్‌’ అన్న పేరుతో అద్భుతాలు సృష్టిస్తోంది. చదువు సంగతి అలా ఉంచితే, నలుగురికీ మంచి చేయాలన్న ఆలోచన ఉంటే... ఎంతటివారైనా అద్భుతాలు సాధించగలరని నిరూపిస్తోంది.            - నిర్జర.         

'ఆపరేషన్ గరుడ' ప్లేస్ లో 'ఆపరేషన్ బి'.. టీడీపీకి కష్టాలు తప్పవా?

  గతంలో నటుడు శివాజీ.. ఓ జాతీయ పార్టీ 'ఆపరేషన్ గరుడ' పేరుతో ఏపీ రాష్ట్రాన్ని, రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలని చూస్తుందంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. కొన్ని పరిణామాలు చూసి 'ఆపరేషన్ గరుడ' నిజమేనా? అనే అనుమానాలు కూడా వ్యక్తమయ్యాయి. అయితే ఇప్పుడు 'ఆపరేషన్ గరుడ' ప్లేస్ లో ఏపీని టార్గెట్ చేస్తూ మరో ఆపరేషన్ ప్రారంభం కాబోతున్నట్టు తెలుస్తోంది. అయితే ఈసారి ఈ ఆపరేషన్ గురించి చెప్పింది శివాజీ కాదు.. ప్రముఖ సినీ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరధ్వాజ. తాజాగా ఓ తెలుగు న్యూస్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తమ్మారెడ్డి మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. 'ఆపరేషన్ గరుడ' ఫెయిల్ అయ్యేసరికి 'ఆపరేషన్ బి' పేరుతో త్వరలోనే మరో ఆపరేషన్ ప్రారంభమవుతుందని చెప్పి సంచలనం రేపారు. పదిహేను రోజుల్లోగా ఈ ఆపరేషన్ ప్రారంభమవుతుందని అన్నారు. నిన్న మొన్నటి వరకు వ్యాపారస్థులపై జరిపిన ఐటీ, ఈడీ దాడులు.. ఈసారి నేరుగా ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులపై జరుగుతాయని తెలిపారు. గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందిన నలుగురు మంత్రులు, 24 మంది వివిధ వ్యాపారాలు చేస్తున్న టీడీపీ ఎమ్మెల్యేలు, టీడీపీ అధినేత, మరియు ఎమ్మెల్యే లు వల్లభనేని వంశీ మోహన్,బొడే ప్రసాద్,బూరుగుపల్లి శేషారావు, ఆలపాటి రాజేందరప్రసాద్,కొమ్మాలపాటి శ్రీధర్, సిద్ధా రాఘవరావు.. ఎంపీ లు సీఎం రమేష్, మురళీమోహన్, విజయవాడ లోని ప్రముఖ హోటల్ డీవీ మానర్ యజమాని, KL యూనివర్సిటీ అధినేత పై త్వరలో ఐటీ, ఈడీ దాడులు జరగబోతున్నట్లు తమ్మారెడ్డి తెలిపారు. ఇందుకోసం పీఎంవోలో ఒక అధికారి ప్రత్యేకంగా పనిచేస్తున్నారని కూడా చెప్పారు. అయితే ఇందులో నిజానిజాలు తనకు పూర్తిగా తెలియవని, తనకు అందిన సమాచారాన్నే బయటపెడుతున్నానని అన్నారు. ఈ విషయంపై తనను విచారణ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చని చెప్పారు. ఇందులో భయపడాల్సిన అవసరం లేదని అన్నారు. తనకు తెలిసిన విషయాన్నే తాను చెప్పానని తెలిపారు. ఎన్డీయే నుంచి టీడీపీ బయటకు వచ్చినందువల్లే టీడీపీని ఇబ్బందులపాలు చేసే ప్రయత్నాన్ని బీజేపీ చేస్తోందని తమ్మారెడ్డి విమర్శించారు. జాతీయ రాజకీయాల్లో బాబు చురుగ్గా పాల్గొనకుండా ఉండేందుకే ఈ దాడులు జరగుతాయని అన్నారు. టీడీపీకి చెందిన నేతలను దొంగలుగా చూపించడం వల్ల జనాల్లో టీడీపీని చులకన చేయాలనేది బీజేపీ ఆలోచన అని చెప్పారు. 30 మంది ఎంపీలు, ఎమ్మెల్యేలను దొంగలుగా చూపెడితే ఓటర్లలో దాని ప్రభావం ఎంత స్థాయిలో ఉంటుందో ఊహించగలమని అన్నారు. తనకు చంద్రబాబుపై ప్రత్యేకమైన అభిప్రాయం ఏమీ లేదని, గతంలో ఆయనను విమర్శించిన సందర్భాలు కూడా ఉన్నాయని గుర్తుచేశారు. అయితే ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని ఇబ్బందులకు గురి చేయడం మాత్రం ప్రజాస్వామ్యానికి మంచిది కాదని తమ్మారెడ్డి అన్నారు. చూద్దాం మరి 'ఆపరేషన్ బి' ఏపీ మీద ఎలాంటి ప్రభావం చూపుతుందో.

పరారీలో గాలి జనార్ధన్ రెడ్డి.. ఇప్పుడు బీజేపీ వ్యక్తి కాకుండా పోయాడా?

  మైనింగ్ మాఫియాకి పర్యాయపదం లాంటి వ్యక్తి గాలి జనార్ధన్ రెడ్డి మరోసారి వార్తల్లో నిలిచారు. ప్రస్తుతం గాలి జనార్ధన్ రెడ్డి పరారీలో ఉన్నారు. ఆయన్ని పట్టుకొనేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. ప్రజల నుంచి డబ్బు వసూలు చేసి రూ.600 కోట్లకు కుచ్చుటోపీ పెట్టిన అంబిడెంట్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీని ఈడీ కేసు నుంచి కాపాడేందుకు గాలి జనార్దన్ రెడ్డి రూ.18 కోట్లకు ఒప్పందం కుదుర్చుకున్నారని ఆరోపణలు వస్తున్నాయి. ఈ ఆరోపణల నేపథ్యంలో జనార్ధన్ రెడ్డి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఈ వ్యవహారంలో ఈడీ అధికారికి జనార్ధన్ రెడ్డి కోటి లంచం కూడా ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇందుకు ప్రతిఫలంగా ఆయన అంబిడెంట్ కంపెనీ నుంచి 57 కిలోల బంగారు కడ్డీలు తీసుకున్నట్లు సమాచారం. ఈ ఏడాది మార్చిలో ఈ డీల్ జరిగినట్టు పోలీసులు చెబుతున్నారు. ఈ విషయమై జనార్ధన్ రెడ్డిని ప్రశ్నించేందుకు ప్రయత్నిస్తే ఆయన అందుబాటులో  లేకుండా పోయినట్టుగా పోలీసులు గుర్తించారు. జనార్దన్ రెడ్డి నివాసంలో పోలీసులు సోదాలు నిర్వహించారు. అయితే సోదాలు నిర్వహించిన పోలీసులకు కొన్ని షాకింగ్ విషయాలు తెలిశాయి. జనార్ధన్ రెడ్డి ఇంట్లో గోడల మధ్యలో రహస్య లాకర్లను గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. అదేవిధంగా జనార్ధన్‌రెడ్డి అసిస్టెంట్ అలీఖాన్ ఇంట్లో పేలుడు పదార్థాలు కూడా లభించినట్లు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం హైద్రాబాద్, బెంగుళూరు, ఢిల్లీలో జనార్థన్ రెడ్డి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపడుతున్నారు. జనార్ధన్ రెడ్డి మిత్రుల ఇళ్లలో కూడ పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. అయితే ఇంతవరకు గాలి జనార్ధన్ రెడ్డి ఆచూకీ తెలియలేదు. ఆయన హైద్రాబాద్ లో ఉండి ఉంటారని కొందరు అనుమానాలు వ్యక్తం చేయగా మరికొందరు మాత్రం దేశం వదిలి వెళ్ళిపోయుంటాడని అభిప్రాయపడుతున్నారు. గాలి జనార్ధన్ రెడ్డి మైనింగ్ కింగ్ గా జనాలకి ఎలా తెలుసో బీజేపీ నేతగా కూడా అలానే తెలుసు. అయితే గాలి జనార్ధన్ రెడ్డి వ్యవహారం వల్ల పార్టీకి మచ్చ పడుతుంది అనుకున్నారో ఏమో కానీ.. బీజేపీ నేతలు ఈ వ్యవహారంపై భిన్నంగా స్పందిస్తున్నారు. బీజేపీ కర్ణాటక అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి బీఎస్. యడ్యూరప్ప మాట్లాడుతూ.. గాలి జనార్దన్ రెడ్డికి బీజేపీకి ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెప్పారు. తప్పు ఎవరు చేసినా చట్టం ముందు అందరూ సమానమే అని అన్నారు. గాలి జనార్దన్ రెడ్డి కేసుకు సంబంధించి మీడియాలో వచ్చిన వార్తలు తప్ప మిగిలిన విషయాలు తనకు తెలీదని, మాతో ఎవరూ ఈ విషయంపై మాట్లాడలేదని యడ్యూరప్ప అన్నారు. గాలి జనార్దన్ రెడ్డి బీజేపీలో లేరని, అందువలన ఈ విషయంపై పూర్తి వివరాలు తాము సేకరించలేదని యడ్యూరప్ప స్పష్టం చేశారు. మరో బీజేపీ నేత, గాలి ప్రధాన అనుచరుడు, ఎమ్మెల్యే శ్రీరాములు కూడా ఇంచుమించు ఇలాగే స్పందించారు. ఈ విషయం గురించి తనకు తెలియదని, మీడియాలో చూసిన తర్వాతే తెలుసుకున్నానని తెలిపారు. చట్టం తన పని తాను చేసుకుపోతుందని, ఎవరూ చట్టానికి అతీతులు కారని శ్రీరాములు వ్యాఖ్యానించారు. బీజేపీ నేతల స్పందనతో గాలి అనుచరులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బీజేపీలో గాలి జనార్ధన్ రెడ్డి కీలక నేతగా వ్యవహరించారు. మంత్రిగా కూడా పనిచేసారు. ఇప్పటికి బళ్లారిలో గాలి కుటుంబానికి మంచి పట్టుంది. ఎన్నికల సమయంలో కూడా బీజేపీకి గాలి జనార్ధన్ రెడ్డి ఆర్థికంగా తోడుంటారని అంటుంటారు. ఎన్నికల సమయంలో బీజేపీ వ్యక్తి అయిన గాలి జనార్ధన్ రెడ్డి.. కర్ణాటకలో ఎన్నికలు, ఉప ఎన్నికలు అయిపోయి.. ఇలా కేసులో దొరికిపోయి పారిపోతే పార్టీకి మచ్చ వస్తుందని.. ఇప్పుడు బీజేపీ వ్యక్తి కాకుండా పోయాడా? అంటూ గాలి జనార్ధన్ రెడ్డి అనుచరులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు బీజేపీ అధిష్టానం చెప్పినదాని ప్రకారమే కర్ణాటక బీజేపీ నేతలు గాలి జనార్ధన్ రెడ్డి విషయంలో ఇలా స్పందిస్తున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ఓవర్ కాన్ఫిడెన్సే కేసీఆర్ కొంపముంచుతుందా?

  ఓవర్ కాన్ఫిడెన్స్.. కొన్నిసార్లు తీసుకెళ్లి కొండమీద కూర్చోబెడితే, కొన్నిసార్లు కొంపముంచుతుంది. ప్రస్తుతం ఆ ఓవర్ కాన్ఫిడెన్సే కేసీఆర్ కొంపముంచేలా కనిపిస్తోంది. 2014 లో కేసీఆర్ గెలిచి సీఎం అయ్యారు. తెలంగాణలో ఎదురులేని నేతగా పేరుతెచ్చుకున్నారు. ఎప్పుడు ఎన్నికలు జరిగినా తమదే అధికారం అనుకున్నారు. ఆ కాన్ఫిడెన్స్ తోనే వంద సీట్లకు పైగా గెలుస్తామంటూ 8 నెలల ముందే అసెంబ్లీ రద్దు చేసి ముందస్తుకు సిద్ధమయ్యారు. తొలివిడతలో ఒకేసారి 105 మంది అభ్యర్థులను ప్రకటించి దూకుడు చూపించారు. అధికారం మళ్ళీ తమదే అని ధీమాగా ఉన్నారు. కానీ ఇక్కడ నుంచే పరిస్థితులు ఒక్కొక్కటిగా కేసీఆర్ కి వ్యతిరేకంగా మారడం మొదలు పెట్టాయి. కాంగ్రెస్, టీడీపీ, టీజేఎస్, సీపీఐ పార్టీలు మహాకూటమిగా ఏర్పడ్డాయి. దీంతో కూటమి రూపంలో కేసీఆర్ కి బలమైన ప్రత్యర్థి వచ్చింది. అసెంబ్లీ రద్దుకి ముందు వరకు తెలంగాణలో కాంగ్రెస్ అంతోఇంతో బలంగా ఉంది కానీ.. వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రావడం కష్టమే అనే అభిప్రాయం ఉండేది. కానీ కూటమి బలంతో కాంగ్రెస్ బలం రెట్టింపు అయింది. ముఖ్యంగా టీడీపీ కేడర్ బలం కాంగ్రెస్ కి కలిసొస్తుంది. సర్వేలు కూడా మహాకూటమికే విజయావకాశాలు ఎక్కువున్నాయని చెప్తున్నాయి. ఇదే కేసీఆర్ కి మింగుడుపడటం లేదు. దీనికి తోడు కేసీఆర్ ని ఇబ్బంది పెడుతున్న మరో అంశం గ్రామాల్లో తెరాస ఎమ్మెల్యే అభ్యర్థులకు ఎదురవుతున్న నిరసన సెగ. కేసీఆర్ తాను సర్వేలు చేయించుకున్నాను. అన్ని సర్వేల్లో వందకి పైగా సీట్లు వస్తాయని తేలింది అన్నారు. తమ పథకాలు ప్రజల్లోకి బాగా వెళ్లాయి. ప్రజలు తెరాస ప్రభుత్వం పట్ల సానుకూలంగా ఉన్నారు. కారు గుర్తు కనిపిస్తే చాలు ఓట్లు గుద్దేస్తారు అనుకున్నారు. అందుకేనేమో చాలామంది సిట్టింగ్ ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత ఉన్నా.. 'కేసీఆర్ బ్రాండ్ తో ఈజీగా గెలవొచ్చు' అనే కాన్ఫిడెన్స్ తో మార్చకుండా దాదాపు వారినే అభ్యర్థులుగా ప్రకటించారు. కానీ ఇప్పుడు పరిస్థితులు చూస్తుంటే ఆ కాన్ఫిడెన్సే కొంపముంచింది అనిపిస్తోంది. ఎమ్మెల్యే అభ్యర్థులు ప్రచారానికి వెళ్తే ఈ నాలుగున్నరేళ్లలో ఏం చేసారని ఇప్పుడొచ్చి ఓట్లు అడుగుతున్నారు? అంటూ ప్రజలు నిలదీస్తున్నారు. కొందరు నేతలని అయితే అసలు గ్రామాల్లోనే అడుగు పెట్టనివ్వట్లేదు. అభ్యర్థులను మార్చలేక, ఈ అభ్యర్థులతో ఎలా గెలవాలో తెలియక కేసీఆర్ తల పట్టుకుంటున్నారు. కేసీఆర్ బలమైన నేత. ఎప్పుడు ఏం చేయాలో తెలిసిన వ్యక్తి. మరి అలాంటి కేసీఆర్ రాంగ్ స్టెప్ ఎలా వేశారు?. ఆయన పక్కన ఉన్నవారే మీ ఫోటో ఉంటే చాలు అభ్యర్థి ఎవరైనా ప్రజలు కళ్ళు మూసుకొని కారు గుర్తుకి ఓటేస్తారని ఆయనని ఇలా రాంగ్ స్టెప్ వేసేలా చేసారా అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఆయన చుట్టూ ఉన్న వాళ్ళు ఆయన మెప్పు కోసం ఎన్నైనా చెప్పి ఉండొచ్చు. కానీ ప్రజల్లో ఎమ్మెల్యేల మీద, పార్టీ మీద ఎలాంటి అభిప్రాయం ఉందో నిజం చెప్తేనే కదా ఆయనకి తెలిసేది. అదీగాక ఆయన మీడియాకి కూడా అంత స్వేచ్ఛ ఇవ్వలేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మీడియాకి స్వేచ్ఛ ఇస్తేనే కదా మంచి చేసినప్పుడు పొగడ్త.. తప్పు చేసినప్పుడు విమర్శ చేసి ప్లస్ లు, మైనస్ లు తెలిసేలా చేస్తుంది. ఇప్పుడు అనుకోని ఏం లాభం. నెలలో ఎన్నికలు ఉన్నాయి. మరి ఎన్నికల్లో కేసీఆర్ ఒకప్పటిలా దూసుకుపోతారో లేదో చూడాలి.

తెరాసకు చెక్.. కోదండరామ్ తో కాంగ్రెస్ ప్లాన్ అదేనా?

  తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాడిన ప్రముఖుల్లో కోదండరామ్ ఒకరు. ఈ తరం తెలంగాణ కోసం పోరాడిన నాయకుల్లో ఆయన పేరు ఖచ్చితంగా ఉంటుంది. కేసీఆర్ లాంటి నేతలు ఉద్యమ సమయంలో కోదండరామ్ ను ఎంతలా పొగిడారో అందరికీ తెలిసిందే. అయితే తరువాత పరిస్థితులు మారిపోయాయి. రాష్ట్రం ఏర్పడింది. కేసీఆర్ సీఎం అయ్యారు. తరువాత కోదండరామ్ పోరాట లక్ష్యం కూడా మారిపోయింది. 'మనం పోరాడి తెలంగాణ సాధించినది దీనికోసం కాదు.. కేసీఆర్ పాలన సరిగా లేదు.. ఇలా అయితే బంగారు తెలంగాణ సాధ్యం కాదు' అంటూ కోదండరామ్ మళ్ళీ పోరాటం మొదలుపెట్టారు. తెలంగాణ జనసమితి పేరుతో రాజకీయ పార్టీని కూడా స్థాపించారు. ప్రస్తుతం తెలంగాణలో ఎన్నికల హడావుడి మొదలైంది. తెరాసను గద్దె దించడమే లక్ష్యంగా కాంగ్రెస్, టీడీపీ, టీజేఎస్, సీపీఐ పార్టీలు మహాకూటమిగా ఏర్పడ్డాయి. కూటమిలో సీట్ల సర్దుబాటు గురించి చర్చలు జరుగుతున్నాయి. కోదండరామ్ కూడా సీట్ల సర్దుబాటు గురించి కాంగ్రెస్ తో చర్చలు జరుపుతూ బిజీగా ఉన్నారు. ఒక వైపు సీట్ల సర్దుబాటు గురించి చర్చలు జరుగుతుంటే.. మరో వైపు కోదండరామ్ తో కాంగ్రెస్ ఓ ప్లాన్ వేస్తుందట. అదేటంటే కోదండరామ్ తో వీలైనంత ఎక్కువగా ప్రచారం చేయించాలని కాంగ్రెస్ భావిస్తోందట. ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ ఏర్పాటు చేసే బహిరంగ సభల్లో.. కేసీఆర్ కి వ్యతిరేకంగా కోదండరామ్ తో విమర్శలు చేయించాలని చూస్తోందట. వేరే నేతలు ఎవరు విమర్శలు చేసినా తెరాస వెంటనే తిప్పికొడుతుంది.. విరుచుకుపడుతుంది. అదే కోదండరామ్ అయితే తెరాస మిగతా నేతల మీద విరుచుకుపడినట్టు పడలేదు. హద్దుమీరి మాటలు అనలేదు. ఒకవేళ అన్నా అది తెరాస కే మైనస్. తెలంగాణ కోసం పోరాడిన నేతగా, వివాదాలకు దూరంగా ఉండే నేతగా, సౌమ్యుడుగా  కోదండరామ్ అంటే ప్రజల్లో సదాభిప్రాయం ఉంది. మరి అలాంటి కోదండరామ్ మీద తెరాస నోరుజారితే మొదటికే మోసం వస్తుంది. మొత్తానికి తెరాసకి చెక్ పెట్టడానికి కోదండరామ్ అనే అస్త్రాన్ని కాంగ్రెస్ తెరమీదకు తీసుకురాబోతుంది అనమాట. చూద్దాం మరి ఏం జరుగుతుందో.

పదిమంది సీనియర్ నేతలను రంగంలోకి దింపుతున్న కాంగ్రెస్.!!

  ప్రస్తుతం కాంగ్రెస్ తెలంగాణలో తెరాసను గద్దె దించడమే ప్రధాన లక్ష్యంగా పెట్టుకుంది. దానికోసం ఉన్న ఏ ఒక్క అవకాశాన్ని వదలకుండా అడుగులు వేస్తోంది. ఇప్పటికే టీడీపీ, టిజెఎస్, సీపీఐ పార్టీలతో కలిసి కూటమి ఏర్పాటు చేసిన కాంగ్రెస్.. సీట్ల కేటాయింపు, అభ్యర్థుల ఎంపిక, అసంతృప్తుల బుజ్జగింపు ఇలా అన్ని విషయాల్లోనూ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. కూటమిలోని మిగతా పార్టీలతో చర్చల మీద చర్చలు జరిపి.. ఆచితూచి అడుగులు వేసి.. పార్టీలు సంతృప్తి చెందేలా సీట్ల లెక్క తేల్చింది. అలాగే కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపికలోనూ భారీ కసరత్తు చేసింది. నియోజకవర్గాల్లో రిపోర్ట్ లు తెప్పించుకొని, ముఖ్య నేతలతో చర్చింది అభ్యర్థుల ఎంపిక జాగ్రత్తగా చేస్తుంది. అయితే అభ్యర్థులను ప్రకటించిన తరువాత తెరాసలో లాగా అసంతృప్తి సెగ తగలకుండా కాంగ్రెస్ ముందే జాగ్రత్త చర్యలు చేపట్టింది. తెరాసలో అభ్యర్థులను ప్రకటించిన తరువాత అసంతృప్తి సెగ ఎంతలా తగిలిందో తెలిసిందే. పలు సీనియర్ నేతలు పార్టీని వీడారు.. కొందరు ఇండిపెండెంట్ గా పోటీ చేయడానికి సిద్ధమయ్యారు. దీంతో కాంగ్రెస్ ఆచి తూచి అడుగులు వేస్తోంది. అభ్యర్థులను ప్రకటించిన వెంటనే జానారెడ్డి, రేవంత్ రెడ్డి, భ‌ట్టి విక్ర‌మార్క‌, విజ‌య‌శాంతి ఇలా సుమారు పదిమంది ముఖ్య నేతలను రంగంలోకి దింపనుందట. వీరికి ఒక్కొక్కరికి 10 నుంచి 15 నియోజకవర్గాలు అప్పగిస్తారు. అభ్యర్థుల ప్రకటన జరిగిన వెంటనే ఈ నేతలు ఆ నియోజకవర్గాల్లోని అసంతృప్తులను బుజ్జగించే పనిలోపడతారు. టిక్కెట్లు రాలేద‌ని బాధ‌ప‌డొద్ద‌ని, కాంగ్రెస్ అధికారంలోకి రాగానే నామినేటెడ్ ప‌ద‌వుల‌లో ప్రాధాన్య‌త కల్పిస్తామ‌ని, ఇత‌ర మార్గాల ద్వారా కూడా పార్టీ నుంచి మేలు జ‌రుగుతుంద‌ని బుజ్జ‌గింపులు చేసి.. వారు పార్టీ మారకుండా, రెబెల్స్ గా పోటీచేయకుండా సాధ్యమైనంత వరకు ప్రయత్నిస్తారన్నమాట. చూద్దాం మరి కాంగ్రెస్ అసంతృప్తులను బుజ్జగించడంలో ఎంత వరకు సక్సెస్ అవుతుందో.

ఏంటో ఈ జోక్యం.. 'సీబీఐ'నే కాదు 'ఆర్బీఐ'ని కూడా వదలని కేంద్రం

  గుర్రం చేసే పని గుర్రం చేయాలి.. గాడిద చేసే పని గాడిద చేయాలి. అలాకాకుండా ఒకరి పనిలో ఒకరు తలదూరిస్తే చివరికి వారి పని అయిపోతుంది. ప్రస్తుతం కేంద్రం పరిస్థితి కూడా అలాగే ఉంది. అసలే సీబీఐ పనితీరులో జోక్యం చేసుకుంటున్నారన్న విమర్శల్ని ఎదుర్కొంటున్న కేంద్రానికి భారతీయ రిజర్వు బ్యాంక్ (ఆర్బీఐ) రూపంలో కొత్త తలనొప్పి వచ్చిపడింది. తాము టెస్టు మ్యాచ్‌లను ఆడుతుంటే కేంద్రం మాత్రం టీ-20 క్రికెట్ తరహా నిర్ణయాలను తీసుకుంటున్నదని ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ విరల్ ఆచార్య అన్నారు. తాజాగా ఏడీ ష్రాఫ్ మెమోరియల్ స్మారకోపన్యాసాన్ని ఆచార్య ఇచ్చారు. ఈ సందర్భంగానే ఆర్బీఐ నిర్ణయాల్లో ప్రభుత్వ జోక్యం ఎక్కువైపోతున్నదంటూ తనదైనశైలిలో విమర్శలు గుప్పించారు. పంజాబ్ నేషనల్ బ్యాంక్ కుంభకోణం నేపథ్యంలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ చేసిన వ్యాఖ్యలపైనా స్పందించారు. ఈ తరహా మోసాలకు ఆర్బీఐ వంటి నియంత్రిత సంస్థలు బాధ్యత వహించట్లేదని, రాజకీయ నాయకుల్నే ప్రజలు దోషులుగా చూస్తున్నారని జైట్లీ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. దీనిపై ఆర్బీఐ గవర్నర్ ఊర్జిత్ పటేల్‌కు జైట్లీకి మధ్య మాటల యుద్ధం నడుస్తున్న సంగతీ విదితమే. దీనిపై విఠల్ ఆచార్య స్పందిస్తూ ఆర్బీఐకి అసలు స్వేచ్ఛ ఉందా? అని సందేహం వ్యక్తం చేశారు. బ్యాంకుల్ని ముఖ్యంగా ప్రభుత్వ రంగ బ్యాంకుల నియంత్రణ కోసం ఆర్బీఐకి మరిన్ని అధికారాలు కావాల్సిందేనన్నారు. పెట్టుబడుల ఉపసంహరణ, యాజమాన్య మార్పులు, బోర్డుల్లో డైరెక్టర్ల నియామకాలు, లైసెన్సుల రద్దు, విలీనాలు, అమ్మకాల్లో తీర్మానాలు వంటి అంశాల్లో ప్రైవేట్ రంగ బ్యాంకుల విషయమై ప్రభావవంతమైన నిర్ణయాలు తీసుకుంటున్నామని పరోక్షంగా ప్రభుత్వ రంగ బ్యాంకుల్లోనే ఇది కుదరడం లేదని ఆచార్య సంకేతాలిచ్చారు.  ప్రభుత్వ రంగ బ్యాంకుల ఉనికినే ప్రశ్నార్థకం చేస్తున్న మొండి బకాయిల వ్యవహారంపైనా స్పందిస్తూ.. పర్యవేక్షణ, నియంత్రిత ప్రమాణాల్లో రాజీ పడాల్సి వస్తున్నదని ప్రభుత్వ పెద్దల జోక్యాన్ని ఎండగట్టారు. చివరకు ఆర్బీఐ ద్రవ్యవిధాన నిర్ణయాల్లోనూ మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) పేరుతో తలదూర్చడాన్ని ప్రస్తావించారు. మొత్తంగా ఆర్బీఐకి, కేంద్ర ప్రభుత్వానికి మధ్య విభేదాలు ఏమాత్రం మంచివి కావంటూ ఆర్బీఐ స్వేచ్ఛను గౌరవించకపోతే ఆర్థిక మార్కెట్లకు కష్టాలు తప్పవన్నారు. ఇప్పటికే సీబీఐ, ఐటీ, ఎన్నికల సంఘం వంటివాటిల్లో కేంద్రం తల దూరుస్తుందని విమర్శలు వస్తున్న వేళ.. ఆర్బీఐ నిర్ణయాలలోనూ కేంద్రం తల దూరుస్తుందని తెలియడంతో ఈ విమర్శలు మరింత పెరిగేలా ఉన్నాయి.

సీమాంధ్రులపై కేటీఆర్ ప్రేమ.. నిజమెంత?

  తెలంగాణలో ఎన్నికల సమయం దగ్గర పడటంతో రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. తెరాస 100 సీట్లకు పైగా సాధించి మళ్ళీ తామే అధికారం చేపడతామని ధీమాతో అసెంబ్లీ రద్దు చేసి ముందస్తుకు సిద్ధమైంది. కానీ ఎప్పుడైతే కాంగ్రెస్, టీడీపీ, టిజెఎస్, సిపిఐ పార్టీలు మహాకూటమిగా ఏర్పడ్డాయో.. ఒక్కసారిగా పరిస్థితులు మారిపోయాయి. ప్రస్తుతం తెలంగాణలో 'తెరాస వర్సెస్ మహాకూటమి' పోరు నువ్వా నేనా అన్నట్టు సాగేలా కనిపిస్తోంది. దీంతో తెరాస.. మహాకూటమి మీద మాటల యుద్ధం మొదలుపెట్టింది. 'కాంగ్రెస్ సిగ్గులేకుండా టీడీపీ తో పెట్టుకుంది. మహాకూటమి గెలిస్తే జుట్టు చంద్రబాబు చేతిలో ఉంటుంది. మళ్ళీ తెలంగాణలో ఆంధ్రోళ్ల పెత్తనం వస్తుంది'. ఇలా తెరాస నేతలు ఏవేవో సంచలన వ్యాఖ్యలు చేసారు. ముఖ్యంగా కేసీఆర్, హరీష్ రావు లాంటి నేతలు కాంగ్రెస్, టీడీపీ పొత్తుని సహించలేక.. గతంలో లాగా మరొక్కసారి తెలంగాణ సెంటిమెంట్ ను రగిల్చాలనే ఉద్దేశంతో.. చంద్రబాబుని టార్గెట్ చేస్తూ శృతిమించిన వ్యాఖ్యలు చేసారు. అయితే ఈ వ్యాఖ్యలు తెరాసకు పెద్ద తలనొప్పిగా మారాయి. రాష్ట్రం ఏర్పడ్డాక ఇంకా అవే సెంటిమెంట్ మాటలా? అంటూ కొందరు అసహనం వ్యక్తం చేసారు. ఇక ఏపీలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చి తెలంగాణలో సెటిల్ అయిన వారు.. తెరాస తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసారు. అసలే గతంలో ఏపీకి ప్రత్యేకహోదా వస్తే తెలంగాణలోని కంపెనీలు ఏపీకి తరలిపోతాయంటూ వ్యాఖ్యలు చేసి.. ఏపీ ప్రజల ఆగ్రహానికి గురైన తెరాస నేతలు.. ఎన్నికల వేల చంద్రబాబు, ఆంధ్రోళ్ల పెత్తనం అంటూ వ్యాఖ్యలు చేసి ఇంకా ఆగ్రహం తెప్పించారు. అయితే ఏమైందో ఏంటో సడెన్ గా తెరాస యూ టర్న్ తీసుకుంది. 'సీమాంధ్రులకు సోదరుడిలా అండగా ఉంటా.. అమరావతి నిర్మాణానికి వందకోట్లు ఇవ్వాలనుకున్నాం.. ఎన్టీఆర్ తెలుగు జాతికి గుర్తింపు తెచ్చారు.. హరికృష్ణ మరణసమయంలో తెలంగాణ ప్రభుత్వం ఎలా స్పందించిందో చూసారుగా'.. అంటూ ఏపీ మీద, ఏపీ ప్రజల మీద తమకు చాలా ప్రేమ ఉందని చెప్పే ప్రయత్నం చేసారు కేటీఆర్. అయితే కేటీఆర్ చేసిన ఈ వ్యాఖ్యలు పట్ల పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎన్నికల సమయం దగ్గర పడటంతోనే కేటీఆర్ లేనిప్రేమను ఒలకపోస్తున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్ చుట్టూ ప్రక్కల ప్రాంతాల్లో సెటిలర్లు ఎక్కువుగా ఉంటారు. వీళ్ళు అనేక నియోజక వర్గాల్లో గెలుపుని ప్రభావితం చేయగలరు. వారిలో ఎక్కువగా టీడీపీని, చంద్రబాబుని అభిమానించే వారుంటారు. ఈ విషయాన్ని ఆలస్యంగా గ్రహించారో ఏంటో.. కేటీఆర్ ఇప్పుడు వారి మీద ప్రేమ చూపిస్తున్నారనే అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అందుకే మొన్నటి వరకు తెరాస నేతలు చంద్రబాబు మీద విరుచుకు పడితే కేటీఆర్ మాత్రం ఆచితూచి అడుగులు వేశారు. కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకున్నారనే చంద్రబాబుపై మా కోపం.. తెలుగు రాష్ట్రాలను కాంగ్రెస్, బీజేపీ కాకుండా ప్రాంతీయ పార్టీలు పాలించాలనేదే మా ధ్యేయం అన్నారు. అంతేనా అమరావతి నిర్మాణానికి రూ.100 కోట్లు ఇవ్వాలనుకున్నారట. కానీ కేంద్రం మట్టి, నీరు తప్ప ఏమివ్వట్లేదు అలాంటిది తెలంగాణ ప్రభుత్వం ఇస్తే బాగోదని ఆగిపోయారట. కాంగ్రెస్, బీజేపీ హవా ఉండకూడదు.. తెలుగు రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీల హవా ఉండాలి.. అన్నదమ్ముల్లా కలిసుండాలి అని కేటీఆర్ అన్నారు.. కానీ కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఇవ్వట్లేదని వీరు కూడా ఇవ్వడం మానేశారంట!!.. ఇదేం లాజిక్ అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. తెలుగు రాష్ట్రాలు ఒకరికొకరు అండగా ఉండాలన్నారు.. కానీ ప్రత్యేకహోదా వస్తే తెలంగాణ కంపెనీలు ఏపీకి తరలిపోతాయనే అపోహ ఎందుకు కలిగించారు?.. తెలంగాణ ఏర్పడి నాలుగైదు సంవత్సరాలు అవుతున్నా ఇంకా ఆంధ్రా పెత్తనం అని ఎందుకు అంటున్నారు? ఏపీ సీఎం మీద శృతిమించి వ్యాఖ్యలు చేయాల్సిన అవసరం ఏముంది? ఇలా పలు ప్రశ్నలు ఎదురవుతున్నాయి. మొత్తానికి ఎన్నికల సమయం దగ్గర పడటమే.. సెటిలర్ల విషయంలో కేటీఆర్ యూ టర్న్ తీసుకోవడానికి కారణం అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

జగన్ పై దాడి వెనుక నిజంగానే టీడీపీ హస్తముందా?

తెలుగు రాష్ట్రాల్లో నిన్నటి నుంచి ఒక విషయంపై విపరీతమైన రచ్చ జరుగుతుంది. అదే వైసీపీ అధినేత వైఎస్ జగన్ పై దాడి. వైజాగ్ ఎయిర్‌పోర్ట్‌లో శ్రీనివాస్ అనే ఓ యువకుడు సెల్ఫీ కోసమంటూ జగన్ దగ్గరికి వచ్చి.. తన వెంట తెచ్చుకున్న కోడి పందాలలో ఉపయోగించే కత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో జగన్ భుజానికి స్వల్ప గాయమైంది. పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి విచారణ చేస్తున్నారు. జగన్ ప్రాథమిక చికిత్స చేసుకొని.. నార్మల్ గానే ఫ్లైట్ ఎక్కి హైదరాబాద్ వెళ్లారు. అయితే ఇక అక్కడి నుంచి స్క్రీన్ ప్లే మారిపోయింది. వైసీపీ నేతలు ఒక్కొక్కరిగా టీడీపీ ప్రభుత్వం మీద విమర్శల దాడి మొదలు పెట్టారు. కొందరు ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల ఈ దాడి జరిగిందంటే.. ఇంకొందరేమో అసలు ఈ దాడి చేయించిందే టీడీపీ, ఈ దాడి వెనుక టీడీపీ హస్తం ఉందని ఆరోపించారు. ఇక మరి కొందరైతే ఆ కత్తికి విషం పూసి పొడిచారేమో అంటూ కొత్త అనుమానాలు క్రియేట్ చేసి పార్టీ కార్యకర్తలను భయ భ్రాంతులకు గురిచేసారు. అంతేనా జగన్ భుజానికి గాయం లోతు విషయంలోనూ కన్ఫ్యూజన్. వైజాగ్ ఎయిర్‌పోర్ట్‌ లో చికిత్స చేసిన డాక్టర్లు జగన్‌ ఎడమ చేతికి అర సెంటీమీటరు లోతున భుజానికి గాయమైందని చెప్తే.. హైదరాబాద్‌లో జగన్‌కు చికిత్స చేసిన సిటీ న్యూరో సెంటర్‌ డాక్టర్లు మాత్రం జగన్‌కు మూడు నుంచి నాలుగు సెంటీమీటర్ల లోతున గాయమైందని, ఆపరేషన్‌ చేసి తొమ్మిది వరకు కుట్లు వేశామని చెప్పారు. దీంతో వైజాగ్ లో అర సెంటీమీటరు ఉన్న గాయపు లోతు.. హైదరాబాద్‌ చేరుకునే సరికి నాలుగు సెంటీమీటర్లు ఎలా అయ్యిందంటూ చర్చ మొదలైంది. అయితే కత్తికి విష రసాయనాలు పూశారేమో అని నిర్ధారణ చేసుకునేందుకు వీలుగా శాంపిల్స్‌ను లోతు నుంచి సేకరించాల్సి వచ్చిందని, అందుకే గాయం పెద్దదైందని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి.     సరే ఇదంతా పక్కన పెడితే.. అసలు ఈ దాడికి కారణం టీడీపీ నే అని వైసీపీ బలంగా ఆరోపణలు చేస్తోంది. కానీ ఆరోపణల్లో నిజమెంత?. నిందితుడు శ్రీనివాస్ వెయిటర్ గా పనిచేస్తున్న హోటల్ ఓనర్ టీడీపీ సానుభూతి పరుడు అన్నారు. కానీ ఆ ఓనర్ మాత్రం తాను వైసీపీ అభిమానినని మీడియాతో చెప్పినట్టు తెలుస్తోంది. అంతెందుకు నిందితుడు శ్రీనివాస్ కూడా జగన్ కి వీరాభిమాని. ఈ విషయాన్ని చెప్పింది ఎవరో కాదు. నిందితుడి సోదరుడే స్వయంగా మీడియా ముందు చెప్పాడు. 2018 న్యూ ఇయర్ సందర్భంగా నిందితుడు ఒక ఫ్లెక్సీ పెట్టాడు. అందులో అతని ఫోటోతో పాటు జగన్ ఫోటో కూడా ఉంది. ఈ ఫ్లెక్సీ ఫోటో కూడా నిందితుడి సోదరుడి ద్వారా బయటికి వచ్చింది. కానీ ఎవరో ఆ ఫ్లెక్సీ ఫోటోని కూడా మార్ఫ్ చేసారు. ఒక దానిలో జగన్ ప్లేస్ లో చంద్రబాబు ఫోటో.. మరోదానిలో జగన్ ప్లేస్ లో లోకేష్ ఫోటో పెట్టారు. ఈ మార్ఫింగ్ ఫోటోలు చూసి కొందరు కార్యకర్తలు ఆందోళన, మరికొందరు నిరసన వ్యక్తం చేసారు. ఇలాంటి సమయంలో సంయమనం పాటించాల్సిన నాయకులూ కూడా రెచ్చ కొట్టే వ్యాఖ్యలు చేస్తూ టీడీపీ మీద ఆరోపణలు చేస్తున్నారు. అయితే టీడీపీ కూడా వాటిని అంతేస్థాయిలో తిప్పికొడుతోంది. ఎయిర్‌పోర్ట్‌ లో స్థానిక పోలీసులు కాదు సీఐఎస్ఎఫ్‌ సిబ్బంది ఉంటారు.. వారి కళ్ళుగప్పి నిందితుడు కత్తి ఎలా లోపకి తీసుకెళ్లాడు?.. తనపై దాడి జరిగిన వెంటనే జగన్‌ స్థానిక పోలీసులకు ఫిర్యాదు ఇవ్వకుండా, వారికి సమాచారం తెలపకుండా తన మానాన తాను హైదరాబాద్‌ ఎలా వెళ్లిపోయారు? వైజాగ్ లో స్వల్ప గాయం హైదరాబాద్ వెళ్ళాక పెద్దగా ఎలా అయిందంటూ టీడీపీ నేతలు పలు అనుమానాలు చేసారు. అంతేకాదు గతంలో శివాజీ.. ఆపరేషన్ గరుడలో భాగంగా ఒక ముఖ్య నేతపై ఇలా ప్రాణహాని లేని దాడి జరిపి అల్లర్లు సృష్టిస్తారు అన్నారు. శివాజీ చెప్పినట్టే దాడి జరగడంతో ఇది ఆపరేషన్ గరుడలో భాగమే అని టీడీపీ నేతలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే వైసీపీ మాత్రం ఆపరేషన్ గరుడ కూడా చంద్రబాబు ఆడిస్తున్న నాటకమని ఆరోపిస్తుంది. దీంతో అసలు ఈ దాడి ఏంటో? ఈ దాడి వెనకున్న డ్రామా ఏంటో అర్థంకాక సామాన్యులు తలలు పట్టుకుంటున్నారు.     సరే కాసేపు ఈ దాడి వెనుక టీడీపీ ఉంది అనుకున్నాం. కానీ ఈ దాడి వల్ల టీడీపీకి జరిగే ప్రయోజనం ఏంటని అడిగితే అందరి సమాధానం మౌనం. ఒక నాయకుడి మీద దాడి జరిగితే ఆ దాడి వల్ల ప్రజల్లో ఎంతోకొంత సానుభూతి వస్తుంది. పోయి పోయి ఒక పార్టీ, ప్రత్యర్థి పార్టీ నాయకుడి మీద ఇలాంటి దాడి చేసి సానుభూతి పెంచుతుందా? అంటే అనుమానమే. మరి టీడీపీ మాత్రం ఇంత సిల్లీ దాడి ఎలా చేస్తుంది?. జగన్ ఎప్పటినుంచో పాదయాత్ర చేస్తున్నారు. చాలా నియోజకవర్గాలు కవర్ చేసారు. వందల మీటింగులు పెట్టారు. వేల కిలోమీటర్లు నడిచారు. అయినా జగన్ మీద ఈగ కూడా వాలలేదు. కానీ టైట్ సెక్యూరిటీ ఉండే ఎయిర్‌పోర్ట్‌లో అంత సిల్లీగా దాడి ఎలా జరిగింది?. నిందితుడు అసలు సిబ్బంది కళ్ళు గప్పి ఆ కత్తి ఎలా తీసుకెళ్లాడు? ఇది ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం కాదు.. అక్కడ ఉండే సీఐఎస్ఎఫ్‌ సిబ్బంది నిర్లక్ష్యం అవుతుంది. అదీగాక నిందితుడు కూడా తాను జగన్ అభిమానిని.. ఆయనని సీఎం చేయాలనే ఆశతో సానుభూతి కోసం ఈ దాడి చేసానని పోలీసుల ముందు అంగీకరించినట్టు తెలుస్తోంది. ఒకవైపు విచారణ జరుగుతుంది. పూర్తి వివరాలు బయటికి వస్తాయి. అసలు నిజమేంటో తెలీకుండా కొందరు నేతలు ఇలా ప్రభుత్వం మీద ఆరోపణలు చేస్తూ.. ప్రజలను రెచ్చగొడుతూ.. శాంతిభద్రతలకు విఘాతం కల్గించడం ఎంత వరకు కరెక్ట్?. ప్రస్తుతం జరిగిందంతా చూస్తుంటే ఈ దాడి వెనుక టీడీపీ ఉందనే ఆరోపణల్లో నిజంలేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరి అసలు ఈ దాడి వెనుక ఉన్న డ్రామా ఏంటో తెలియాలంటే కొంతకాలం వేచి చూడాల్సిందే. తెలుసుకుందాం త్వరలో అసలు నిజాలేంటో.

పంచాయతీ ఎన్నికలు.. జనసేనకు తప్పవా కష్టాలు

  ఏపీలో మూడు నెలల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. నిజానికి పంచాయతీ ఎన్నికలు ఎప్పుడో జరగాలి. కానీ ప్రభుత్వం జరపకుండా ప్రత్యేక అధికారులను నియమించింది. దీనిపై విపక్షాలు విమర్శలు గుప్పించాయి. ముఖ్యంగా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్.. తమ పార్టీకి భయపడే టీడీపీ ప్రభుత్వం పంచాయతీ ఎన్నికలు నిర్వహించట్లేదు అంటూ విమర్శలు చేసారు. ఇప్పుడు హైకోర్టు ఆదేశంతో మూడు నెలల్లో ఎన్నికలు జరగనున్నాయి. అయితే జనసేనకు పంచాయతీ ఎన్నికలు క్లిష్టమైన పరిస్థితిని తెచ్చిపెట్టాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. జనసేన పార్టీ స్థాపించి సుమారు ఐదేళ్లు అయింది కానీ.. ఇంతవరకు ప్రత్యక్ష ఎన్నికల్లో పాల్గొన్న అనుభవం లేదు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బరిలోకి దిగాలని పవన్ భావిస్తున్నారు. ఇప్పుడు పంచాయతీ ఎన్నికల రూపంలో ముందే బరిలోకి దిగే అవకాశం వచ్చింది. పవన్.. టీడీపీ ప్రభుత్వం పంచాయతీ ఎన్నికలు నిర్వహించట్లేదు అంటూ విమర్శలు చేసారు కానీ.. నిజానికి పంచాయతీ ఎన్నికలు జరగడం జనసేనకు అంత మంచిదేమి కాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఎందుకంటే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధానంగా టీడీపీ, వైసీపీ, జనసేన పార్టీల మధ్య త్రిముఖ పోరు నడిచే అవకాశాలున్నాయి. దీంతో పంచాయతీ ఎన్నికల్లో కూడా ప్రధానంగా ఈ మూడు పార్టీల గెలుపు గురించి పట్టించుకుంటారు. టీడీపీ, వైసీపీ పార్టీలకు ఎన్నికలు కొత్త కాదు. గ్రామస్థాయి నుంచి కేడర్ ఉంది. మండల, నియోజకవర్గ స్థాయి నేతలున్నారు. వారు పంచాయతీ ఎన్నికలు పట్టించుకుంటారు. కానీ జనసేన పరిస్థితి పూర్తీ భిన్నంగా ఉంది. గ్రామస్థాయిలో నిర్మాణం జరగలేదు. మండల, నియోజకవర్గ స్థాయి నేతలు ఏర్పడలేదు. అసెంబ్లీ ఎన్నికలంటే పార్టీ అధ్యక్షుడిగా పవన్ ప్రచారం చేయొచ్చు.. కానీ పంచాయితీలకు సాధ్యపడదు. అక్కడి లీడర్లు, అక్కడి కేడర్ కావాలి. ఇవ్వన్నీ చూస్తుంటే పంచాయతీ ఎన్నికల్లో జనసేనకు చేదు అనుభవం తప్పదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇదే జరిగితే ఈ ప్రభావం అసెంబ్లీ ఎన్నికల మీద కూడా పడుతుంది. అలా అని జనసేన పంచాయతీ ఎన్నికల్లో బరిలోకి దిగకుండా ఉండలేని పరిస్థితి. ఎందుకంటే ఇప్పటికే పవన్ పలు సందర్భాల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేసారు. మొత్తానికి పంచాయతీ ఎన్నికలు జనసేనకు కష్టాలు తెచ్చిపెట్టాయిగా అంటున్నారు విశ్లేషకులు. చూద్దాం మరి జనసేన వీటిని ఎలా ఎదుర్కుంటుందో.

ఆ రెండు స్థానాల్లో టీడీపీ.. తెరాసకు పెద్ద తలనొప్పిగా మారిందా?

  తెలంగాణలో టీడీపీ పార్టీ ప్రస్తావన వస్తే ఖమ్మం జిల్లా గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి. ఖమ్మం జిల్లాలో టీడీపీకి మొదటినుంచి పట్టుంది. ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో 2009 ఎన్నికల్లో ఖమ్మం ఎంపీ స్థానాన్ని టీడీపీనే కైవసం చేసుకుంది. 2014 ఎన్నికల్లో కూడా ఎంపీ స్థానాన్ని గెలిచే అవకాశముంది.. కానీ పార్టీలో అంతర్గత వర్గ పోరు కారణంగా స్వల్ప తేడాతో ఓటమి పాలైంది. అయితే ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. 2014 ఎన్నికల తరువాత పార్టీలోని కొందరు నేతలు తెరాసలో చేరారు. దీంతో ఇప్పుడు వర్గపోరు లేదు. అదీకాకుండా ఇప్పుడు మహాకూటమి ఏర్పడింది. దీంతో ఖమ్మంలో టీడీపీ బలం రెట్టింపు అవుతుంది. నిజానికి 2014 ఎన్నికల తరువాత సీనియర్ నాయకులు కొందరు పార్టీని వీడడంతో ఖమ్మంలో టీడీపీ పని అయిపోయింది అనుకున్నారు. కానీ మొదటి నుంచి పార్టీని నమ్ముకున్న కేడర్ మాత్రం టీడీపీనే అంటిపెట్టుకొని ఉన్నారు. ఈ విషయం ఈ మధ్య బాలకృష్ణ ఖమ్మం పర్యటన సందర్భంగా స్పష్టమైంది. బాలకృష్ణ మధిర, సత్తుపల్లి నియోజకవర్గాల్లో పర్యటించగా.. స్వచ్చంధంగా వేల సంఖ్యలో కార్యకర్తలు పాల్గొని పసుపుమయం చేసారు. దీంతో టీడీపీ ఖమ్మంలో ఎంత బలంగా ఉందో అర్థమైంది. ఇప్పుడు మహాకూటమితో కాంగ్రెస్ బలం కూడా తోడవడంతో.. ఖమ్మం పార్లమెంట్ కి మహాకూటమి అభ్యర్థి బరిలోకి దిగితే భారీ మెజారిటీతో గెలవడం ఖాయమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే లోక్ సభ ఎన్నికలకు ఇంకా సమయం ఉండడంతో ప్రస్తుతం అందరి దృష్టి అసెంబ్లీ ఎన్నికలపై పడింది. ముఖ్యంగా రెండు అసెంబ్లీ నియోజకవర్గాల మీద ప్రధాన దృష్టి ఉంది. అవే ఖమ్మం అసెంబ్లీ మరియు సత్తుపల్లి. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో ఖమ్మం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగిన పువ్వాడ అజయ్ కుమార్, టీడీపీ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావుపై ఐదువేల మెజారిటీతో గెలుపొందారు. అయితే తరువాత వీరిద్దరూ తెరాస తీర్థం పుచ్చుకున్నారు. తుమ్మల మంత్రి అయ్యారు. తరువాత పాలేరులో జరిగిన ఉపఎన్నికల్లో ఎమ్మెల్యేగా కూడా గెలుపొందారు. వచ్చే ఎన్నికల్లో మళ్ళీ పాలేరు నుంచే బరిలోకి దిగుతున్నారు. ఇక ఖమ్మం విషయానికొస్తే తాజా మాజీ ఎమ్మెల్యే అజయ్ కుమార్ నే తెరాస తమ అభ్యర్థిగా ప్రకటించింది. ఖమ్మంలో ఎలాగైనా గెలవాలని తెరాస పట్టుదలగా ఉంది. అజయ్ తో పాటు తుమ్మల ఖమ్మం అసెంబ్లీని సీరియస్ గా తీసుకున్నారు. అయితే ఖమ్మంలో తెరాస గెలుపు సులభం కాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. గత ఎన్నికల్లో కాంగ్రెస్, టీడీపీ మధ్యనే ప్రధాన పోటీ నడిచింది. ఆ ఎన్నికల్లో తెరాస 7 శాతం ఓట్లకే పరిమితమైంది. తరువాత ఇద్దరు నేతల చేరికతో తెరాస బలం కాస్త పెరిగినప్పటికీ.. ఖమ్మంలో కాంగ్రెస్, టీడీపీ పార్టీలకు ఇంకా బలమైన కేడర్ ఉంది. ఇప్పుడు ఈ రెండు పార్టీలు కలిసి పోటీ చేయడం.. అదీగాక మహాకూటమి అభ్యర్థిగా మాజీ ఎంపీ నామా నాగేస్వరరావు బరిలోకి దిగడం దాదాపు ఖాయం అవ్వడంతో తెరాసకు తలనొప్పి మొదలైంది. బలమైన కేడరున్న పార్టీలు ఏకమవ్వడం, బలమైన ప్రత్యర్థి బరిలోకి దిగుతుండడంతో తెరాసకు ఓటమి భయం మొదలైంది. సత్తుపల్లి నియోజకవర్గం టీడీపీ కంచుకోట అని చెప్పవచ్చు. గత ఎన్నికల్లో ఇక్కడ టీడీపీ అభ్యర్థి సండ్ర వెంకట వీరయ్య విజయం సాధించారు. వచ్చే ఎన్నికల్లో కూడా ఆయనకే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తోంది. గత ఎన్నికల్లో ఇక్కడ వైసీపీ తరుపున పోటీ చేసిన దయానంద్ రెండో స్థానంలో నిలవగా.. కాంగ్రెస్ 15 శాతం ఓట్లతో మూడో స్థానంలో నిలిచింది. ఇక తెరాస అభ్యర్థి పిడమర్తి రవి కేవలం ఆరు వేల ఓట్లే సాధించారు. తరువాత వైసీపీ అభ్యర్థి దయానంద్ తెరాసలో చేరారు. దీంతో వచ్చే ఎన్నికల్లో తెరాస అభ్యర్థి ఆయనే అనే అభిప్రాయం వ్యక్తమైంది. కానీ తెరాస అనూహ్యంగా పిడమర్తి రవినే తమ అభ్యర్థిగా ప్రకటించింది. దీంతో ఆ పార్టీలో అసంతృప్తి సెగ భగ్గుమంది. ఇదే సండ్రకు కలిసి రానుంది. ఒకవైపు కాంగ్రెస్ ఓటుబ్యాంకు బలం తోడైంది.. మరోవైపు తెరాసలో అసంతృత్తి సెగ. దీంతో మళ్ళీ సండ్రనే విజయం సాధిస్తారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే తుమ్మల మాత్రం సత్తుపల్లిని బాగా సీరియస్ గా తీసుకున్నారు. ఇక్కడ ఎలాగైనా తెరాస జెండా ఎగురవేయాలని చూస్తున్నారు. ఎందుకంటే ఇది తుమ్మల సొంత నియోజకవర్గం.. అదీగాక ఆయన గతంలో టీడీపీని తరుపున ఎమ్మెల్యేగా పనిచేసారు. నియోజకవర్గం మీద ఆయనకున్న పట్టు, అనుభవంతో సండ్ర జోరుకి ఎలాగైనా బ్రేకులు వేయాలని చూస్తున్నారు. అయితే ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే తుమ్మల ఆశలు ఫలించేలా లేవు. మొత్తానికి టీడీపీ బరిలోకి దిగుతున్న ఖమ్మం అసెంబ్లీ, సత్తుపల్లి అసెంబ్లీ సీట్లు తుమ్మల, తెరాసకు పెద్ద తలనొప్పిగా మారాయనే చెప్పాలి. చూద్దాం మరి ఏం జరుగుతుందో.

కేసీఆర్ మహాకూటమికి చెక్ పెట్టాలని జగన్, పవన్ ని దింపుతున్నారా?

  తెరాస 100 సీట్లకు పైగా గెలిచి మళ్ళీ అధికారం తామే చేపడతామని ధీమా వ్యక్తం చేస్తూ ముందస్తుకు సిద్ధమైంది. అయితే తెరాస ఊహించినట్లు 100 సీట్లైతే రావడం కష్టం కానీ.. మళ్ళీ అధికారంలోకి వచ్చే అవకాశాలు మాత్రం ఉన్నాయని అందరూ భావించారు. ఇదంతా ఒకప్పటి మాట. ఎప్పుడైతే కాంగ్రెస్, టీడీపీ, టిజెఎస్, సిపిఐ పార్టీలు కలిసి మహాకూటమిగా ఏర్పడ్డాయో ఒక్కసారిగా అంచనాలు మారిపోయాయి. తెలంగాణలో కాంగ్రెస్ బలంగానే ఉంది కానీ తెరాసను అధికారానికి దూరం చేసే అంత బలం లేదని మొన్నటివరకు అందరూ భావించారు. కానీ ఇప్పుడు మహాకూటమితో కాంగ్రెస్ బలం పెరిగింది. ముఖ్యంగా నాయకులు దూరమైనా కేడర్ ఉండి.. కొన్ని ప్రాంతాల్లో బలంగా ఉన్న టీడీపీ బలం కాంగ్రెస్ కు కలిసొస్తుంది. దీంతో రానున్న ఎన్నికల్లో పోటీ నువ్వానేనా అన్నట్టు జరిగే అవకాశాలున్నాయి. ఇదే ఇప్పుడు తెరాసను కలవరపెడుతోంది. మహాకూటమిని ఓడించి ఎలాగైనా మళ్ళీ అధికారంలోకి రావాలని కేసీఆర్ వ్యూహాలు రచిస్తున్నారు. మహాకూటమిని అడ్డుకోవడానికి ఉన్న ఏ చిన్న అవకాశాన్ని వదులుకోకూడదని కేసీఆర్ భావిస్తున్నారట. దానిలో భాగంగానే అవసరమైతే జగన్, పవన్ లను అస్త్రాలుగా మలుచుకోవాలని కేసీఆర్ చూస్తున్నారట. ప్రస్తుతం జగన్, పవన్ ల దృష్టంతా వచ్చే ఏపీ ఎన్నికల మీదే ఉంది. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబుని ఎలాగైనా ఓడించాలని ఎవరికి తోచిన దారిలో వారు అడుగులు వేస్తున్నారు. అయితే వీరి అడుగులు తెలంగాణలో పడితే ఎలా ఉంటుందా అని కేసీఆర్ ఆలోచిస్తున్నారట. నిజానికి తెలంగాణలో వైసీపీ, జనసేన పార్టీలు అసలు ఉన్నాయా? అనే పరిస్థితి. 2014 ఎన్నికల్లో వైసీపీ తెలంగాణలో ఒక ఎంపీ, 3 ఎమ్మెల్యే స్థానాలు గెలిచింది కానీ వాళ్ళు ఎన్నికల అనంతరం పార్టీని వీడారు. ఉన్న కేడర్ కూడా దూరమైంది. దీంతో జగన్ పార్టీని ఏపీకే పరిమితం చేసారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేసినా ఒక్క సీటు కూడా గెలిచే అవకాశం లేదు. మరి అలాంటిది కేసీఆర్ వైసీపీ గురించి ఎందుకు ఆలోచిస్తున్నారు? అంటే దానికో కారణం ఉందట. వైసీపీని కాంగ్రెస్ బలంగా ఉన్న కొన్ని స్థానాల్లో బరిలోకి దింపితే.. వైఎస్ రాజశేఖర్ రెడ్డి మీదున్న అభిమానంతో కొందరు కాంగ్రెస్ ఓటర్లు వైసీపీకి ఓటేసే అవకాశం ఉందని కేసీఆర్ భావిస్తున్నారట. దీనివల్ల కాంగ్రెస్ కి ఎంతోకొంత నష్టం జరిగే అవకాశముంది. అలాగే జనసేన బరిలోకి దిగితే కూడా తెరాసకు ఎంతోకొంత లాభం ఉంటుందని కేసీఆర్ అనుకుంటున్నారట. మహాకూటమి బలంగా ఉన్న స్థానాల్లో జనసేనను బరిలోకి దింపితే ప్రభుత్వ వ్యతిరేక ఓటుబ్యాంకు చీలిపోయి తెరాసకు లాభం జరుగుతుందని కేసీఆర్ భావిస్తున్నారట. ఈ వార్తల్లో నిజమెంతో తెలీదు కానీ కేసీఆర్ మహాకూటమిని అడ్డుకోవడానికి వైసీపీ, జనసేనని రంగంలోకి దింపుతారా అంటే నమ్మడానికి కష్టంగా ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అదీగాక బలంలేని తెలంగాణలో పోటీ చేసి వైసీపీ తన పరువు తాను తీసుకునే సాహసం చేయకపోవొచ్చు. ఇక జనసేన విషయానివస్తే తెలంగాణలో పార్టీ నిర్మాణమే జరగలేదు. ఇప్పటికిప్పుడు సరైన అభ్యర్థులు దొరకడం కూడా కష్టమే. మరి ఇలాంటి సమయంలో పవన్ తొందరపడి పార్టీకి నష్టం జరిగే స్టెప్ వేయకపోవొచ్చు. చూద్దాం మరి మహాకూటమిని అడ్డుకోవడానికి కేసీఆర్ ముందు ముందు ఎలాంటి వ్యూహాలు రచిస్తారో ఏంటో.

బొత్స జనసేన వైపు చూస్తున్నారా?

  బొత్స సత్యనారాయణ.. తెలుగు రాజకీయాల్లో పెద్దగా పరిచయం అవసరంలేని పేరు. ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో కాంగ్రెస్ సీనియర్ నేతగా బొత్స బాగానే గుర్తింపు తెచ్చుకున్నారు. పీసీసీ అధ్యక్షుడిగా, మంత్రిగా పనిచేసారు. ఇలా రాష్ట్రస్థాయి నేతగా పేరుతెచ్చుకున్న బొత్స రాష్ట్ర విభజన అనంతరం కాస్త డల్ అయ్యారు. విభజనతో రాష్ట్రానికి తీరని అన్యాయం చేసిందంటూ ఏపీ ప్రజలు ఆ సమయంలో కాంగ్రెస్ మీద బాగా ఆగ్రహం వ్యక్తం చేసారు. దీంతో మెజారిటీ కాంగ్రెస్ నేతలు ఆ పార్టీకి దూరమయ్యారు. కొందరు పూర్తిగా రాజకీయాలకే దూరమైతే.. కొందరు ఇతర పార్టీలలో చేరారు. వారిలో బొత్స ఒకరు. ముందుగా బొత్స టీడీపీలో చేరాలని చూసినా అటునుండి సరైన రెస్పాన్స్ రాకపోవడంతో.. ఇక వైసీపీలో చేరారు. అయితే ఇప్పుడు వైసీపీలో కూడా బొత్స సంతృప్తిగా లేనట్టు తెలుస్తోంది. బొత్సకు వైఎస్ రాజశేఖర్ రెడ్డితో కలిసి పని చేసిన అనుభవముంది. కానీ జగన్ తన సీనియారిటీకి తగిన గౌరవం ఇవ్వడంలేదని బొత్స భావిస్తున్నారట. రాష్ట్రస్థాయి నేతగా పేరుతెచ్చుకున్న తాను వైసీపీలో చేరాక జిల్లా నేత స్థాయికి దిగజారానని బొత్స ఫీల్ అవుతున్నారట. బొత్స అంతలా ఎందుకు ఫీల్ అవుతున్నారంటే దాని వెనుక కొన్ని కారణాలు ఉన్నట్టు తెలుస్తోంది. విజయనగరం జిల్లాలో పాదయాత్ర చేస్తూ.. పలు నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించిన జగన్.. తన నియోజకవర్గం వచ్చేసరికి తన పేరు చెప్పకుండా వెళతాడా?.. తాను తీసుకువచ్చిన 'కోలగట్ల వీరభద్రస్వామి'కి ముందే టిక్కెట్‌ ఇచ్చి తనకు ఇవ్వరా?.. ఎంత అవమానం?..  అని బొత్స ఫీల్ అవుతున్నారట. అంతేకాదు తన సంగతే ఇలా ఉంటే ఇక తన కుటుంబసభ్యుల టిక్కెట్ల సంగతేంటి? వారికి టిక్కెట్లు కష్టమేనా అని ఆవేదన చెందుతున్నారట. అసలే ఎన్నికలు దగ్గరికి వస్తున్నాయి. తనకి, తన కుటుంబానికి సీట్ల కేటాయింపు విషయంలో తగిన ప్రాధాన్యత ఇవ్వకపోతే అవసరమైతే పార్టీ మారే ఆలోచనలో కూడా ఉన్నారట బొత్స. టీడీపీలో డోర్స్ ఓపెన్ అయ్యే అవకాశం తక్కువ కాబట్టి జనసేనవైపు చూస్తున్నారట. మరి బొత్స నిజంగానే వైసీపీలో తగిన ప్రాధాన్యత దక్కట్లేదని ఫీల్ అవుతున్నారా? అసలు ఆయనకు వైసీపీని వీడి జనసేనలో చేరే ఆలోచన ఉందా?.. అసలే పవన్ పార్టీలో చేరికల గురించి ఆచితూచి అడుగులు వేస్తున్నారు. మరి అలాంటి పవన్.. బొత్స పార్టీలో చేరతానంటే ఎలా రియాక్ట్ అవుతారు? ఇవన్నీ తెలియాలంటే కొంతకాలం వేచి చూడాల్సిందే.

ఒక్క సీటు.. మహాకూటమిలో చిచ్చుపెడుతోంది.!!

  తెరాసను ఓడించడమే ప్రధాన లక్ష్యంగా కాంగ్రెస్.. టీడీపీ, టిజెఎస్, సిపిఐ పార్టీలతో కలిసి మహాకూటమి ఏర్పాటు చేసింది. ఒకవైపు తెరాస ఇప్పటికే 105 మంది అభ్యర్థులను ప్రకటించి, అసంతృప్తులను బుజ్జగిస్తూ, ప్రచారం మొదలుపెడితే.. మహాకూటమి మాత్రం ఇంకా సీట్ల సర్దుబాటు దగ్గరే ఆగిపోయింది. తెరాసలో లాగా మహాకూటమిలో అసంతృప్తుల సెగ తగలకూడదనే ఉద్దేశంతో.. కాంగ్రెస్ కూటమిలోని మిగతా పార్టీలతో చర్చల మీద చర్చలు జరుపుతూ.. ఆచితూచి అడుగులు వేస్తుంది. అయితే కొన్నిసార్లు ఆలస్యం కూడా ప్రమాదమే. ఇప్పటికే టిజెఎస్ అధ్యక్షుడు కోదండరాం కూడా ఇదే చెప్పారు. కాంగ్రెస్ ఆలస్యం చేయకుండా సీట్ల విషయంలో ఎంత త్వరగా స్పష్టత ఇస్తే అంత మంచిదని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే కాంగ్రెస్ మాత్రం కూటమిలోని మిగతా పార్టీలకు తక్కువ సీట్లు కేటాయించాలని చూస్తోందని.. కాంగ్రెస్ చెప్పిన సంఖ్యతో టీడీపీ, టిజెఎస్ సంతృప్తిగా లేవని.. దానివల్లే సీట్ల సర్దుబాటు లేటవుతోందని తెలుస్తోంది. దీంతో అసలు సీట్ల విషయంలో చిచ్చు మొదలై అసలు మహాకూటమి చీలిపోయే ప్రమాదముందనే అభిప్రాయాలూ వ్యక్తమయ్యాయి. మరి కాంగ్రెస్ సీట్ల విషయంలో టీడీపీ, టిజెఎస్ పార్టీలను ఎలా బుజ్జగిస్తుందో తెలీదు కానీ.. ఒక్క సీటు విషయంలో మాత్రం సిపిఐతో పెద్ద తలనొప్పి ఏర్పడిందట. ఆ సీటు మాకే కేటాయించాలని సిపిఐ పట్టుబడుతోందట. ఒకవేళ ఆ సీటు కేటాయించకపోతే అవసరమైతే కూటమికి దూరం అవ్వడానికి కూడా సిద్దమనే సంకేతాలు ఇస్తుందట. సిపిఐ అంతలా పట్టుబడుతున్న ఆ సీటు ఏంటంటే ఖమ్మం జిల్లాలోని వైరా నియోజకవర్గం. గిరిజన నియోజకవర్గంగా ఉన్న వైరా 2009లో ఆవిర్భవించింది. 2009 ఎన్నికల్లో టీడీపీ, సిపిఎం  మద్దతుతో సిపిఐ పోటీ చేయగా కాంగ్రెస్‌ ఒంటరిగా పోటీచేసింది. ఆ ఎన్నికల్లో సిపిఐ అభ్యర్థిగా బాణోత్‌ చంద్రావతి విజయం సాధించారు. 2014 ఎన్నికల్లో సిపిఎం మద్దతుతో వైసీపీ.. కాంగ్రెస్‌ మద్దతుతో సిపిఐ పోటీ చేసాయి. టీడీపీ ఒంటరిగా బరిలోకి దిగింది. ఆ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి బాణోత్‌ మదన్‌లాల్‌ గెలిచారు. తరువాత ఆయన తెరాస తీర్థం పుచ్చుకున్నారు. రానున్న ఎన్నికల్లో తెరాస అభ్యర్థిగా ఆయన్నే ప్రకటించారు. ఇప్పటికే ఆయన ప్రచారం కూడా నిర్వహిస్తున్నారు. అయితే ఇప్పుడు కాంగ్రెస్, టీడీపీ, సిపిఐ మహాకూటమితో దగ్గరయ్యాయి. దీంతో మహాకూటమి నుంచి వైరాలో ఎవరు బరిలోకి దిగుతారో అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సీటు కోసం కాంగ్రెస్, సిపిఐ పోటీపడుతున్నాయి. గతంలో ఇది తమ సిట్టింగ్‌ స్థానమని తమకు బలముందని తప్పకుండా విజయం సాధిస్తామని సిపిఐ వాదిస్తుండగా.. కాంగ్రెస్‌ నేతలు తామే అధికార పార్టీని ఢీకొనగలమని, తాము పోటీ చేస్తేనే విజయం తథ్యమనే సంకేతాలు పార్టీ అధిష్ఠానానికి పంపిస్తున్నారు. దీంతో సిపిఐ వైరాలో బలప్రదర్శన నిర్వహిస్తోంది. పార్టీ సీనియర్‌ నాయకుడు కూనంనేని సాంబశివరావు ఈ స్థానాన్ని తమకు కేటాయించాల్సిందేనని పట్టుబడుతున్నారు. మరోవైపు వైరాలో తాము పోటీ చేస్తామంటూ కాంగ్రెస్‌ శ్రేణులు బలమైన సంకేతాలు ఇస్తున్నారు. పార్టీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీలు నిర్వహించడంతో పాటు గాంధీభవన్‌ వద్ద నిరసన తెలిపి వైరా స్థానాన్ని కాంగ్రెస్‌ వదులుకోకూడదంటూ పార్టీ పెద్దల దృష్టికి తీసుకెళ్లారు. దీనికితోడు కాంగ్రెస్‌ కీలక నేత మల్లు భట్టి విక్రమార్క సొంత మండలం వైరా కావడంతో ఆయన కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థినే వైరా నుండి బరిలోకి దింపితే బాగుంటుందని భావిస్తున్నారట. మొత్తానికి ఈ ఒక్క సీటు కోసం ఇరుపార్టీలు పట్టుపట్టినట్టు తెలుస్తోంది. మరి కాంగ్రెస్ ఈ సీటు విషయంలో సిపిఐని ఎలా బుజ్జగిస్తుందో చూడాలి.

తెరాసకు కడియం కుటుంబం బిగ్ షాక్.!!

  తెరాసకు అసంతృప్తుల సెగ తగులుతూనే ఉంది. ఇప్పటికే కొండా సురేఖ, బాబుమోహన్ లాంటి వారు పార్టీని వీడారు. అయితే ఇప్పుడు కడియం కుటుంబం తెరాసకు బిగ్ షాక్ ఇవ్వబోతున్నట్టు తెలుస్తోంది. కడియం శ్రీహరి తన కూతురు కావ్యను రాజకీయ ఆరంగేట్రం చేయించేందుకు సర్వం సిద్ధం చేసుకున్నారు. బహిరంగంగా చెప్పకపోయినా అంతర్గతంగా స్టేషన్ ఘన్‌పూర్‌లో తమ కూతురు కావ్య పోటీలో ఉండేలా కార్యకర్తలను గత రెండేళ్లుగా సన్నద్ధం చేశారు. రెండేళ్లుగా నియోజకవర్గంలో పల్లెపల్లెనా కడియం కావ్య ప్రచారం చేస్తూ.. కార్యకర్తలకు అందుబాటులో ఉండేలా చూసుకున్నారు. నియోజకవర్గంలో రాజయ్యపై ఉన్న వ్యతిరేకత కూడా కావ్యకు కలిసొస్తుంది.. ఈసారి కావ్యకే టిక్కెట్ వస్తుంది అనుకున్నారంతా. కానీ కేసీఆర్ ఆ అంచనాలను తారుమారు చేస్తూ.. స్టేషన్ ఘన్‌పూర్‌ తెరాస అభ్యర్థిగా మళ్ళీ రాజయ్యనే ప్రకటించారు. దీంతో వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. అసమ్మతి నేతలంతా బహిరంగసభలు నిర్వహించారు. కేటీఆర్ వద్దకు వెళ్లి తమకు రాజయ్య వద్దని విన్నవించుకున్నారు. అయినా తెరాస అధిష్టానం మాత్రం దిగిరాలేదు. పైగా కడియంను పిలిచి.. ఒక్క స్టేషన్ ఘన్‌పూర్ మాత్రమే కాదు.. మహబూబాబాద్, డోర్నకల్ స్థానాలలో కూడా తెరాస అభ్యర్థులకు అసమ్మతి లేకుండా చేసే బాధ్యత మీదే అంటూ కడియంకి నిర్దేశించారట.     అదే సమయంలో కడియం తెరాసను వీడుతున్నారు అంటూ వార్తలు మొదలయ్యాయి. కూతురి టిక్కెట్ కోసం కడియం కాంగ్రెస్ లో చేరబోతున్నారంటూ వార్తలొచ్చాయి. అయితే ఈ వార్తలని కడియం ఖండించారు. ఆయనకు పార్టీ మారే ఉద్దేశం ఉందో లేదో తెలీదు కానీ.. ఆయన కూతురు కావ్య మాత్రం టిక్కెట్ విషయంలో చాలా సీరియస్ గా ఉన్నారట. అవసరమైతే ఇండిపెండెంట్‌గా పోటీ చేయాలనీ భావిస్తున్నారట. ఇప్పటికే ఈ విషయంపై ఆమె నియోజకవర్గ కార్యకర్తలతో కూడా చర్చించినట్టు తెలుస్తోంది. ఇదే జరిగితే తెరాసకు బిగ్ షాక్ అనే చెప్పాలి. మహాకూటమి నుండి ఈసారి తెరాసకు నువ్వా నేనా అన్నట్టు పోటీ ఎదురుకానుంది. అంటే తెరాసకు ప్రతి స్థానం ముఖ్యమే. మరి ఇలాంటి సమయంలో కడియం కూతురు కావ్య ఇండిపెండెంట్‌గా బరిలోకి దిగితే.. నియోజకవర్గంలో తెరాస ఓటు బ్యాంకు రెండుగా చీలిపోయే ప్రమాదముంది. ఇది మహాకూటమికి కలిసొస్తుంది. గెలుపు వరిస్తుంది. మరి కడియం కావ్య నిజంగానే ఇండిపెండెంట్‌గా బరిలోకి దిగి తెరాసకు షాక్ ఇస్తారా? లేక తెరాస కడియం కుటుంబాన్ని బుజ్జగించి స్టేషన్ ఘన్‌పూర్‌లో జెండా ఎగరేస్తుందా? చూద్దాం ఏం జరుగుతుందో.

పవన్ కళ్యాణ్ సీఎం అయ్యే అవకాశం ఉందా?

  'పాలించడానికి కాదు ప్రశ్నించడానికి వస్తున్నా' అంటూ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ స్థాపించారు. దానికి తగ్గట్టే 2014 ఎన్నికల బరిలోకి దిగకుండా టీడీపీ, బీజేపీలకు మద్దతిచ్చారు. రాష్ట్రంలో టీడీపీ, కేంద్రంలో బీజేపీ అధికారంలోకి అయితే వచ్చాయి కానీ తరువాత పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. రాష్ట్రానికి బీజేపీ అన్యాయం చేస్తుంది అంటూ టీడీపీ, బీజేపీ మీద పోరాటం మొదలుపెట్టింది. అదే సమయంలో పవన్ కూడా సినిమాలకు బ్రేకిచ్చి వచ్చే ఎన్నికల్లో ఒంటరిగా బరిలోకి దిగుతా అంటూ.. టీడీపీకి దూరమయ్యారు. ప్రశ్నించడం మొదలుపెట్టారు. అంతేనా యాత్రలు చేస్తూ టీడీపీ ప్రభుత్వం మీద విమర్శల వర్షం కురిపిస్తున్నారు. ఓవైపు తెలంగాణలో ఎన్నికల వేడి మొదలైతే.. అసలు జనసేన బరిలోకి దిగుతుందా? లేదా? అనే దానిపై స్పష్టత ఇవ్వలేదు కానీ.. ఏపీలో ఎన్నికలకు ఇంకా 7 నెలల సమయం ఉండగానే పవన్ ఎన్నికలపై దృష్టి పెడుతున్నారు. దీనిబట్టి చూస్తుంటే పవన్ ప్రస్తుతం ఏపీ మీదే దృష్టంతా పెట్టినట్టు తెలుస్తోంది. అందుకే ఏపీలో యాత్రలు చేస్తూ ఎప్పుడూ టీడీపీ మీద, అప్పుడప్పుడు వైసీపీ మీద విమర్శలు చేస్తున్నారు. అయితే పవన్ ఈమధ్య ఎక్కువగా మాట్లాడుతున్న ఒక పాయింట్ మాత్రం అందరిని ఆలోచనలో పడేస్తుంది. పవన్ మైక్ పడితే ఈమధ్య ఒక మాట బలంగా వినిపిస్తుంది. 'ఒక సీఎం మనవడు సీఎం కావొచ్చు.. ఒక సీఎం కొడుకు సీఎం కావొచ్చు.. కానీ ఒక కానిస్టేబుల్ కొడుకు సీఎం కాకూడదా?' అని పవన్ ప్రశ్నిస్తున్నారు. ఎందుకు కాకూడదు అవొచ్చు. ఛాయ్ వాలా మోదీ పీఎం కాలేదా? అని పలువురు అభిప్రాయపడుతున్నారు. అయితే ఇక్కడ పవన్ తెలుసుకోవాల్సింది ఒకటుంది. పవన్ మెగాస్టార్ తమ్ముడిగా వెండితెరకు పరిచయమయ్యారు. తన టాలెంట్ తో పవర్ స్టార్ రేంజ్ కి ఎదిగారు. పవన్ ప్రజల దృష్టిలో సామాన్యుడు కాదు.. కానిస్టేబుల్ కొడుకు కాదు.. ఒక స్టార్ అనే విషయాన్ని గుర్తించాలి. ఒకప్పుడు పవన్ పాలించడానికి కాదు ప్రశ్నించడానికి రాజకీయాల్లోకి వచ్చా అన్నారు. అంతేకాదు ప్రజలకు సేవ చేయాలంటే పదవే కావాలా? అని ప్రశ్నించారు. అలాంటి పవన్ ఇప్పుడు సీఎం సీఎం అంటున్నారు. పదవి లేకుండా సేవ చేయడం కష్టం అనుకున్నారో ఏమో తెలీదు కానీ ఈమధ్య పవన్ మాటల్లో సీఎం కావాలనే ఆశ మాత్రం కనిపిస్తోంది. ఆయన అభిమానులు కూడా కొందరు సీఎం సీఎం అని అరుస్తున్నారు.. వచ్చే ఎన్నికల్లో పవన్ సీఎం అవుతారని నమ్మకంగా ఉన్నారు. అయితే పవన్ వచ్చే ఎన్నికల్లో సీఎం అవ్వడం సాధ్యమేనా అంటే కష్టమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. పవన్ కి యూత్ లో భారీ ఫాలోయింగ్ ఉంది. పవన్ సభలకు భారీగా జనాలు తరలివస్తున్నారు. ఇది నిజం. కానీ ఈ ఫాలోయింగ్, సభలు ఇప్పటికిప్పుడు పవన్ ని సీఎం చేస్తాయా అంటే డౌటే. గతంలో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు కూడా ప్రజలు సభలకు ఇలానే తరలివచ్చారు. ఇక చిరంజీవి ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరంలేదు. మరి అలాంటి చిరంజీవికి ఆయన కుటుంబంలోని పవన్ లాంటి మిగతా హీరోలు తోడైనా.. అనూహ్యంగా కేవలం 18 సీట్లకే పరిమితమయ్యారు. దీన్నిబట్టి ఫాలోయింగ్, సభలు సీఎం చేయలేవని అర్థంచేసుకోవచ్చు. అదీగాక జనసేన పార్టీ నిర్మాణం ఇంకా పూర్తీ స్థాయిలో జరగలేదు. ఇక పార్టీలో పవన్ తప్ప జనాన్ని ఆకర్షించదగ్గ నేతలు కూడా లేరనే చెప్పాలి. పవన్ కూడా ఉత్తరాంధ్ర మీదే ఎక్కువ దృష్టి పెడుతున్నారు తప్ప రాష్ట్రం మొత్తం మీద అంతగా దృష్టి పెట్టట్లేదు. అదీగాక ఏపీలో అధికార టీడీపీ, ప్రతిపక్ష వైసీపీ కూడా బలంగా ఉన్నాయి. దీన్నిబట్టి చూస్తుంటే పవన్ ఇప్పటికిప్పుడు సీఎం అయ్యే అవకాశం తక్కువున్నా.. గెలుపు ఓటములను మాత్రం ప్రభావితం చేయగలరు. టీడీపీ, వైసీపీలకు పూర్తీ మెజారిటీ లేకపోతే పవన్ కింగ్ మేకర్ అయ్యే అవకాశం కూడా ఉంది. మరి పవన్ వచ్చే ఎన్నికల్లో కింగ్ మేకర్ అవుతారో లేదో చూడాలి. అయితే పవన్ సీఎం అయ్యే అవకాశాలని పూర్తిగా కొట్టిపారేయలేం. ఆయన ఇప్పటికిప్పుడు సీఎం కాకపోయినా.. భవిష్యత్తులో అయినా సీఎం అవకాశాలున్నాయి. సేవచేయడానికి పదవులు అవసరంలేదని నమ్మిన పవన్.. పదవి లేకపోయినా ప్రజలకు సేవ చేస్తూ, ప్రభుత్వాలను ప్రశ్నిస్తూ ఉంటే.. ప్రస్తుతం ఆయన్ని నమ్ముతున్న వారే కాదు.. మిగతావారు కూడా ఆయన్ని నమ్మి సీఎం అవకాశముంది. చూద్దాం మరి భవిష్యత్తులో ఏం జరుగుతుందో.

కాంగ్రెస్ గూటికి పలువురు తెరాస కీలక నేతలు..!!

  ఎన్నికల సమయం దగ్గరపడడంతో తెలంగాణ రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. గత ఎన్నికల అనంతరం.. ఈ నాలుగున్నరేళ్లలో కాంగ్రెస్, టీడీపీ పార్టీలలోని పలువురు సీనియర్ నాయకులు తెరాస గూటికి చేరారు. తెరాస ఒకరకంగా నాయకులతో కళకళలాడింది. అయితే ఇప్పుడు తెరాసకు ట్విస్ట్ ఇచ్చే పనిలో బిజీగా ఉంది కాంగ్రెస్. కేసీఆర్ ఎన్నికలకు ఎనిమిది నెలల సమయం ఉండగానే అసెంబ్లీని రద్దు చేసి ముందస్తుకు సిద్ధమయ్యారు. అంతేనా.. ఒకేసారి 105 అభ్యర్థులను ప్రకటించి దూకుడు పెంచారు. అయితే అప్పటి నుంచి కాంగ్రెస్ తెరాస దూకుడికి కళ్లెం వేసే పని మొదలు పెట్టింది. ఓ వైపు టీడీపీ, టీజెఎస్, సిపిఐ పార్టీలతో కలిసి మహాకూటమి ఏర్పాటు చేసి.. గెలుపై ధీమాగా ఉన్న తెరాసకు షాక్ ఇస్తూ నువ్వా నేనా అన్నట్టుగా పోటీకి సిద్ధమైంది. దీనికి తోడు తెరాసకి మరో చిక్కొచ్చిపడింది. కాంగ్రెస్, టీడీపీ పార్టీల నుండి భారీగా నాయకులను చేర్చుకున్నారు. దీంతో అన్ని స్థానాల నుండి ఆశావహులు ఎక్కువయ్యారు. అందరికి టిక్కెట్ కేటాయించడం కుదరదు. దీంతో అసంతృప్తిలో ఉన్న నేతలు కొందరు అభ్యర్థులకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు చేపడితే.. మరికొందరు ఏకంగా పార్టీనే వీడుతున్నారు. ఇది కాంగ్రెస్ కి కలిసొచ్చే అంశం. ఇప్పుడు కాంగ్రెస్ తెరాసలోని అసంతృప్తిని తమకి అనుకూలంగా మార్చుకొనే పనిలో బిజీగా ఉంది. తెలంగాణలో కాంగ్రెస్ బలంగా అయితే ఉంది కానీ ఇప్పట్లో అధికారం పొందడం కష్టమనే అభిప్రాయం మొన్నటివరకు ఉండేది. కానీ ఎప్పుడైతే ముందస్తుకు తెర లేచిందో అప్పటి నుంచి కాంగ్రెస్ కి మంచిరోజులు మొదలయ్యాయి. నాయకులు అంతగా లేకున్నా కేడర్ బలంగా ఉన్న టీడీపీ మహాకూటమితో దగ్గరైంది. దీంతో అధికారం దక్కుతుందనే ఆశ కాంగ్రెస్ లో మొదలైంది. దీనికి తోడు తెరాసలో టిక్కెట్ కోసం అసంతృప్తి సెగలు. ఇంకేముంది కాంగ్రెస్ 'వస్తుందిలే అధికారం ముందు ముందునా' అని పాడుకుంటుంది. అంతేకాదు తెరాసలోని అసంతృప్తి నేతలకు సైలెంట్ గా గేలం వేస్తుందట. తెరాస లోని ఓ ఐదుగురు కీలక నేతలు త్వరలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోబోతున్నారట. ఈ నెల 20న కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటనకు వ‌స్తున్న నేప‌థ్యంలో.. ఆయ‌న స‌మ‌క్షంలోనే ఈ ప్ర‌ముఖుల చేరిక‌లు ఉంటాయని తెలుస్తోంది. ఎన్నికలు సమీపిస్తున్న వేల ఇది తెరాసకు పెద్ద షాక్ అనే చెప్పాలి. మరోవైపు ఈ చేరికలతో కాంగ్రెస్ కి కూడా ఇబ్బందులు తప్పవనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇప్పటికే కాంగ్రెస్ కూటమి సీట్ల సర్దుబాటుతో సతమతమవుతోంది. కూటమిలోని పార్టీలకు సంతృప్తికరంగా సీట్లు కేటాయించాలి. అదేవిధంగా కూటమిలోని పార్టీలకు సీట్లు కేటాయించిన స్థానాల్లో.. తమ పార్టీ నేతలను బుజ్జగించాలి. మరి ఇలాంటి సమయంలో తెరాస నుండి ఐదుగురు కీలక నేతలు చేరితే.. వారికి ఖచ్చితంగా సీట్లు కేటాయించాలి. దీంతో సొంత పార్టీ నేతలకో లేక కూటమిలోని పార్టీల సీట్లకో గండిపడుతోంది. దీంతో కాంగ్రెస్ లో లేదా కూటమిలో అసంతృప్తి సెగ ఏర్పడే ప్రమాదం ఉంది. మరి కాంగ్రెస్ నిజంగానే తెరాసలోని కీలక నేతలకు గేలం వేసిందా? ఒకవేళ వారు నిజంగానే పార్టీలో చేరితే అసంతృప్తి ఏర్పడకుండా కాంగ్రెస్ ఎలాంటి వ్యూహంతో ముందుకెళ్తుంది? ఇలాంటి తెలియాలంటే కొద్దిరోజులు వేచి చూడాల్సిందే.

తెలంగాణ ఎన్నికల బరిలో జనసేన.. ఎవరికి లాభం?

  తెలంగాణలో ఎన్నికల నగారా మ్రోగింది. కేసీఆర్ సాధారణ ఎన్నికలకు ఎనిమిది నెలల ముందుగానే అసెంబ్లీ రద్దు చేయడంతో ముందస్తు ఎన్నికలకు తెరలేచింది. ఇప్పటికే ఎన్నికల సంఘం ఎన్నికల తేదీలను కూడా ప్రకటించింది. తెలంగాణలో డిసెంబర్ 7 న ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికలకు ఇంకా రెండు నెలలు కూడా సమయం లేకపోవడంతో దాదాపు అన్ని పార్టీలు ఎన్నికల హడావుడిలో మునిగిపోయాయి. తెరాస ఇప్పటికే 105 అభ్యర్థులను ప్రకటించి.. ప్రచారంలో బిజీ బిజీగా ఉంది. ఇక మహాకూటమిగా ఏర్పడిన కాంగ్రెస్, టీడీపీ, టిజెఎస్, సిపిఐ కూడా ఒకవైపు సీట్ల సర్దుబాటుపై చర్చలు జరుపుతూనే.. మరోవైపు ప్రచారం మొదలుపెట్టాయి. ఇలా దాదాపు అన్ని పార్టీలు ఎన్నికల హడావుడిలో ఉన్నాయి జనసేన తప్ప. జనసేన అసలు తెలంగాణ ఎన్నికల బరిలోకి దిగుతుందా? లేక వైసీపీ లాగా ఏపీకే పరిమితమవుతుందా? అంటూ అనుమానాలు వ్యక్తమయ్యాయి. పవన్ ఏపీలో వచ్చే ఎన్నికలకు సిద్ధమంటూ యాత్రలు చేస్తూ టీడీపీ ప్రభుత్వం మీద విమర్శలు చేస్తున్నారని కాని.. తెలంగాణ గురించి ఇంతవరకు ఓ స్పష్టత ఇవ్వలేదు. దీంతో ఆయన అభిమానులు కూడా అసలు తెలంగాణలో జనసేన బరిలోకి దిగుతుందా? అంటూ అనుమానం వ్యక్తం చేసారు. అయితే తాజాగా పవన్ ఈ విషయంపై స్పందించారు. విజయవాడలో జనసేన రాష్ట్ర కార్యాలయాన్ని పవన్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమ సమయంలో ఆంధ్రులకు జరుగుతున్న అన్యాయాన్ని చూడలేకే తాను రాజకీయాల్లోకి వచ్చినట్లు గుర్తుచేశారు. ఎవరో పాలకులు చేసిన తప్పులకు ప్రజలెందుకు బలికావాలని అడిగారు. తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేసే అంశంపై 4, 5 రోజుల్లో తేల్చేస్తామన్నారు. మీడియా సమావేశం పెట్టి అన్ని విషయాలు వెల్లడిస్తామన్నారు. ఏపీలో పర్యటన ముగించాక తెలంగాణ గురించి ఆలోచిద్దాం అనుకుంటున్న సమయంలోనే ముందస్తు ఎన్నికలొచ్చేశాయని పవన్ చెప్పారు. అంటే జనసేన తెలంగాణ ఎన్నికల బరిలో దిగేది లేనిది ఓ 4, 5 రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉందన్నమాట. అయితే ఒకవేళ తెలంగాణ బరిలో జనసేన దిగితే.. దానివల్ల ఎవరికి ప్రయోజనం? అనే దానిపై చర్చలు మొదలయ్యాయి. జనసేన ఏపీలో ఎంతోకొంత ప్రభావం చూపగలదు కాని.. తెలంగాణలో ప్రభావం చూపడం కష్టమే. ఇంతవరకు పార్టీ నిర్మాణం కూడా జరగలేదు.. పవన్ తప్ప ప్రజలకి తెల్సిన నాయకులు లేరు.. అదీగాక అన్ని స్థానాల్లో బరిలోకి దిగే సరైన అభ్యర్థులు కూడా కష్టమే. దీంతో ఒకవేళ జనసేన తెలంగాణలో పోటీకి సిద్ధమైనా కొన్ని స్థానాల్లోనే బరిలోకి దిగే అవకాశం ఉంది. అయితే ఆ కొన్ని స్థానాల్లో జనసేన గెలిచినా గెలవకపోయినా ప్రభావం చూపే అవకాశం మాత్రం ఉంది. పవన్ వీరాభిమానులు, అలాగే కొందరు సెటిలర్లు జనసేన వైపు మొగ్గుచూపే అవకాశం ఉంది. అయితే ఇప్పటివరకు సెటిలర్ల చూపు మహాకూటమి వైపు ఉందనే అభిప్రాయం ఉంది. అయితే ఇప్పుడు జనసేన బరిలోకి దిగితే ఆ సెటిలర్ల ఓట్లు ఎంతోకొంత చీలే అవకాశముంది. ఇది తెరాసకు ఖచ్చితంగా కలిసొచ్చే అంశమే. అంటే పవన్ తెలంగాణలో పోటీ చేయాలనుకుంటే.. పరోక్షంగా తెరాస లాభం చేకూర్చినట్టే అవుతుందన్నమాట. చూద్దాం మరి ఏం జరుగుతుందో.

గద్దర్ మహాకూటమి అస్త్రంగా మారనున్నారా?

  తెలంగాణకు మొదటినుండి ఉద్యమాల గడ్డగా పేరుంది. అయితే ఆ ఉద్యమాలలో పాటకి ప్రత్యేక స్థానముంది. ప్రజల్లో స్ఫూరి నింపాలన్నా, ఉద్యమం వైపు అడుగులు వేయించాలన్నా పాటే ఆయుధం. గద్దర్ ఆయుధం కూడా అదే. అసలు గద్దర్ అంటే మొదటగా గుర్తొచ్చేదే పాట. గద్దర్ పాట ఉద్యమానికి స్ఫూర్తి. ఎన్నో గుండెలను కదిలించగల శక్తి. తెలంగాణ ఉద్యమ సమయంలో 'పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా' అంటూ ఎందరినో ఉద్యమం వైపు నడిపించిన వ్యక్తి. ఒక్కమాటలో చెప్పాలంటే గద్దర్ పాట కోట్ల గుండెలను కదిలించగలదు. అందుకే ఇప్పుడు మహాకూటమి గద్దర్ ని అస్త్రంగా మార్చుకోవాలని చూస్తుంది. కేసీఆర్ పై పోటీ చేసేందుకు గ‌ద్ద‌ర్ దాదాపుగా సిద్దపడినట్టు తెలుస్తోంది. రాజ‌కీయ పార్టీలతో పాటు ప్ర‌జ‌లూ త‌న‌ని కోరుకుంటే.. గజ్వేల్ నియోజ‌క వ‌ర్గం నుంచి కేసీఆర్ మీద పోటీ చేసేందుకు సిద్ధం అని ఆయ‌న ప్ర‌క‌టించారు. ఇలాంటి సమయంలో ఆయన తాజాగా కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షుడు రాహుల్ గాంధీని ఢిల్లీలో క‌లుసుకోవ‌డం కొంత ప్రాధాన్య‌త‌ను సంత‌రించుకుంది. సైద్ధాంతికంగా ఆయ‌న ఏపార్టీలోనూ చేరే అవ‌కాశం లేదు కాబ‌ట్టి.. మ‌హా కూట‌మి ఆయ‌న‌కి మ‌ద్ద‌తు ఇచ్చే అవ‌కాశం క‌నిపిస్తోంది. అయితే దీని వెన‌క మ‌హా కూట‌మి వ్యూహం ఉంద‌నీ చెప్పుకోవ‌చ్చు. కేసీఆర్ మీద కూట‌మి నుంచి ఏదో ఒక పార్టీకి చెందిన ఎవ‌రో ఒక‌ర్ని నిల‌బెట్టినా పెద్ద‌గా ప్ర‌యోజ‌నం ఉండ‌దు. ఇత‌ర నేత‌ల్ని విమ‌ర్శించిన‌ట్టుగానే.. త‌న ప్ర‌త్య‌ర్థిపై కూడా కేసీఆర్ మాట‌ల తూటాలు అవలీలగా పేల్చేస్తారు. అదే గ‌ద్ద‌ర్ పోటీకి దిగార‌నుకోండి.. కేసీఆర్ విమ‌ర్శ‌లు చేసే ఆస్కారం త‌క్కువ‌. అంతేకాదు గ‌ద్ద‌ర్ కు మ‌ద్ద‌తు ఇవ్వ‌డం ద్వారా మ‌హాకూట‌మికి జ‌రిగే మ‌రో మేలు కూడా ఉంది. గద్దర్ కి ఆయుధ‌మైన పాట ద్వారా తెరాస పాల‌న‌పై ప్ర‌భావవంత‌మైన విమ‌ర్శ‌లు చేసే ఆస్కారం ఉంది. కేసీఆర్ కి వ్య‌తిరేకంగా గ‌ద్ద‌ర్ ఆటాపాటా రాష్ట్రవ్యాప్తంగా మ‌హాకూట‌మికి ప్ర‌చార అస్త్రంగా మారే అవ‌కాశం ఉంటుంది. కేసీఆర్ మీద గ‌ద్ద‌ర్ లాంటివారు రంగంలోకి దిగితే, ఎన్నిక‌ల ఫ‌లితం అనూహ్యంగా మారుతుందో లేదో చెప్పలేం కానీ.. ఎన్నిక‌ల ప్రచారం మాత్రం మ‌రింత ఆస‌క్తిక‌రంగా మారుతుంది.