జేసీపై ఎంపీగా పోటీ చేయనున్న వైఎస్ షర్మిల!!

  ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ సోదరి వైఎస్ షర్మిల పేరు చాలా రోజుల తరువాత మళ్ళీ మొన్న తెరమీదకు వచ్చింది. తన గురించి కొన్ని వెబ్ సైట్లు తప్పుడు కథనాలు రాస్తున్నాయని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు షర్మిల గురించి ఓ ఆసక్తికరమైన వార్త వినిపిస్తోంది. ఆమె రాబోయే ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేయబోతున్నట్లు తెలుస్తోంది. షర్మిల ఇప్పటివరకు ప్రత్యక్షంగా ఎన్నికల బరిలో దిగనప్పటికీ.. రాజకీయంగా కాస్తో కూస్తో అనుభవం ఉంది. అవినీతి ఆరోపణల కేసులో జగన్ జైలులో ఉన్న సమయంలో షర్మిల పాదయాత్ర చేసారు. అలాగే వైసీపీని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి తనవంతు కృషి చేసారు. అందుకే వైసీపీ శ్రేణుల్లో షర్మిల మీద సానుకూలత ఉంది. నిజానికి ఆమె గత ఎన్నికల్లో పోటీ చేస్తారని అంతా భావించారు. కానీ అలా జరగలేదు. పోటీకి ఆమె దూరంగా ఉన్నారో లేక జగన్ దూరంగా ఉంచారో తెలీదు కానీ ఆమె మాత్రం ఎన్నికల బరిలో దిగలేదు. తరువాత రాజకీయాలకు కూడా దూరంగా ఉంటూ ఉంచారు. అయితే ఇప్పుడు ఆమె మనసు రాజకీయాలవైపు మళ్లినట్లు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో ఆమె ఎంపీగా పోటీ చేయాలనుకుంటున్నారట. ఆమె పోటీ పట్ల జగన్ కూడా సానుకూలంగా ఉన్నట్లు తెలుస్తోంది. గత ఎన్నికల్లో షర్మిల తల్లి వైఎస్ విజయమ్మ విశాఖపట్నం నుంచి ఎంపీగా పోటీ చేసారు. అయితే ఆ ఎన్నికల్లో విజయమ్మ.. బీజేపీ అభ్యర్థి హరిబాబు చేతిలో ఓడిపోయారు. ఈ సారి ఆమె పోటీ చేసేందుకు విముఖత చూపుతున్నారని తెలుస్తోంది. దీంతో విశాఖపట్నం నుంచి షర్మిలను ఎంపీగా పోటీ చేయించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఇక్కడ వైసీపీ బలంగానే ఉంది. గత ఎన్నికల్లో టీడీపీ మద్దతుతో బీజేపీ గెలిచింది. ఈసారి ఆ పరిస్థితి లేదు. టీడీపీ ఒంటరిగా బరిలోకి దిగే అవకాశాలున్నాయి. ఇక్కడ షర్మిల గెలుస్తుందని నూటికి నూరు శాతం చెప్పలేకపోయినా గెలిచే అవకాశం మాత్రం ఉందని వైసీపీ భావిస్తోంది. ఒకవేళ షర్మిల విశాఖపట్నం నుంచి పోటీ చేయకపోతే.. అనంతపురం నుంచి పోటీ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇక్కడ నుంచి ఎంపీగా టీడీపీ నేత జేసీ దివాకర్ రెడ్డి ఉన్నారు. ఈ సారి కూడా ఆయనే టీడీపీ అభ్యర్దిగా పోటీ చేసే అవకాశం ఉంది. ఇటీవల వైసీపీ పైన, జగన్ పైన జేసీ దివాకర్ రెడ్డి తీవ్ర స్దాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. దీంతో ఆయనపై తన సోదరి చేత పోటీ చేయించి ఓడించాలన్నది జగన్ ఆలోచనగా చెబుతున్నారు. అయితే జేసీని ఓడించడం అంతా ఈజీ కాదనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. మరోవైపు షర్మిల విశాఖపట్నం, అనంతపురం కంటే కడప ఎంపీగా పోటీ చేసేందుకే ఎక్కువ ఆసక్తి కనబరుస్తున్నట్లు తెలుస్తోంది. కానీ జగన్ మాత్రం విశాఖపట్నం లేదా అనంతపురం నుంచే బరిలోకి దింపాలని చూస్తున్నారట. చూద్దాం మరి షర్మిల అసలు పోటీ చేస్తారో లేదో. ఒకవేళ పోటీ చేస్తే ఎక్కడినుంచి పోటీ చేస్తారో ఏంటో.

జగన్ కి షాకిచ్చిన పీకే.. కేసీఆర్ తో దోస్తీ డౌటే!!

  ఏపీ రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. ఏపీలో ఎన్నికల సమీపిస్తున్న వేళ జగన్, కేటీఆర్ భేటీ కావడం హాట్ టాపిక్ అయింది. ఈ భేటీపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా కొందరు వైసీపీ నేతలే.. రాబోయే ఎన్నికల్లో జగన్, టీఆర్ఎస్ తో కలిసి పనిచేస్తారా ఏంటని ఆందోళన చెందుతున్నారు. మరోవైపు ఈ భేటీ గురించి ప్రశాంత్ కిషోర్ టీం కూడా షాకింగ్ ఫీడ్ బ్యాక్ ఇచ్చిందట. జగన్, కేటీఆర్ తో భేటీ అయి రాజకీయాలపై చర్చించారు. ఇక దీనిపై ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుసుకోవాలనుకున్న జగన్.. ప్రశాంత్ కిషోర్ టీంకు ఆ బాధ్యతను అప్పగించారు.అయితే ప్రజల దాకా వెళ్ళకుండానే.. వైసీపీ నేతలు, కార్యకర్తలను ముందుగా సర్వే చేస్తేనే చాలా ప్రతికూల ఫలితాలు వచ్చినట్లుగా తెలుస్తోంది. ప్రజల వద్దకు వెళ్లకుండానే వైసీపీ నేతల నుండి తీసుకున్న ఫీడ్ బ్యాక్ చాలా నెగిటివ్ గా వచ్చిన నేపథ్యంలో జగన్ కేసీఆర్ తో దోస్తీ పై ఆలోచనలో పడ్డారని తెలుస్తోంది. ఇంతకాలం జగన్ పాదయాత్రలతో పార్టీకి కాస్తోకూస్తో మైలేజీ తీసుకొని వచ్చారని సంబరపడుతున్న వైసీపీ శ్రేణులకు జగన్ కేటీఆర్ తో భేటీ నీరుగార్చేసింది అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. నోటికొచ్చినట్టు ఆంధ్ర ప్రజలను తిడుతూ వారి మనోభావాలను కించపరిచే కేసీఆర్ తో పొత్తు పెట్టుకొని ఏపీలో ఎన్నికలకు వెళితే ఘోరంగా ఓడిపోవడం ఖాయమని ఓ వైసీపీ నేత చెప్పినట్టుగా తెలుస్తోంది. ఇక పొరుగు రాష్ట్ర ప్రాంతీయ పార్టీ నేతలతో జతకడితే ఏపీకి ఏవిధంగా లాభం కలుగుతుందో జగన్ ఆలోచించుకోవాలని.. దీనిని ఏపీ రాష్ట్ర ప్రజలు హర్షించరని ఒక నేత ఆందోళన వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది. ఎన్నడూ తెలంగాణ ప్రజల గురించి, తెలంగాణ ప్రాంతం గురించి విమర్శలు చేయని చంద్రబాబుని ఇటీవల తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అక్కడ ప్రజలు ఆదరించలేదు. అలాంటిది ఆంధ్ర ప్రజలని దొంగలు, దోపిడీదారులు అని అభివర్ణించిన కేసీఆర్.. గతంలో తెలంగాణ వస్తే ఆంధ్ర విద్యాసంస్థలను నిషేధిస్తామని చెప్పిన కేసీఆర్.. ఆంధ్రాలో బిర్యాని పేడ బిర్యానీ అంటూ వంకలు పెట్టిన కేసిఆర్.. ఏపీ రాజకీయాల్లో జగన్ కు మద్దతిస్తే అది జగన్ కు మైనస్ తప్ప ప్లస్ కాదని, ఏపీ ప్రజలు కేసిఆర్ మాటలు ఇంకా మరిచిపోలేదని ఒక నేత అభిప్రాయపడ్డారట. ప్రత్యేక హోదా పైన వ్యతిరేకత ప్రదర్శించి, పోలవరం పైన పలు కేసులను దాఖలు చేసి, విద్యుత్ వినియోగానికి సంబంధించి ఏపీకి రావాల్సిన 5200 కోట్ల ధనాన్ని ఎగవేసి, ఇక విభజన చట్టంలో ఉన్న ఉమ్మడి ఆస్తులను పంపిణీ చేయడానికి ఏ విధంగానూ సహకరించని టీఆర్ఎస్ పార్టీని ఏపీ ప్రజలు ఏ విధంగా ఆదరిస్తారు అని వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారట. ఇవన్నీ పక్కన పెట్టి కేసిఆర్ తో దోస్తీ చేయడమంటే జగన్ తన గోతి తానే తీసుకున్నట్లు అవుతుందని కొందరు నేతలు అభిప్రాయపడుతున్నారట. రాహుల్ గాంధీ ఏపీ పర్యటన సమయంలో.. దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే తొలి సంతకం ఏపీకి ప్రత్యేక హోదా పైన చేస్తామని ప్రకటన చేసిన సందర్భంలో కూడా కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు లు తీవ్రంగా వ్యతిరేకించారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో సోనియా గాంధీ ఏపీకి ప్రత్యేకహోదా హామీ ఇస్తే.. తెలంగాణకు వచ్చి ఏపీకి వరాలు ఇవ్వడం ఏంటని టీఆర్ఎస్ నేతలు విమర్శించారు. మరి జగన్ అలాంటి వారితో కలిసి టీడీపీని ఓడించటానికి పని చేస్తే అది వైసీపీకే నష్టం చేస్తుందని వైసీపీ నేతలు భావిస్తున్నారు. ఇక తాజాగా కేటీఆర్ తో జగన్ భేటీ అయిన నేపథ్యంలో వైసీపీలో చేరాలని, వైసీపీ నుంచి ఎన్నికల బరిలోకి దిగాలని భావించిన ఆశావహులు చాలామంది వెనకడుగు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఏపీ రాజకీయాల్లో వేలుపెట్టి సార్వత్రిక ఎన్నికల్లో చంద్రబాబు ను ఓడించడానికి పనిచేస్తామని టీఆర్ఎస్ చెప్తున్న నేపథ్యంలో.. టీఆర్ఎస్ తో దోస్తీ తనకు లాభిస్తుంది అనుకుంటున్న జగన్ కు సొంత పార్టీ నేతల నుండి వస్తున్న వ్యతిరేకత పునరాలోచనలో పడేలా చేసిందట. ఒకవేళ జగన్ నిజంగానే టీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకుంటే తన వేలితో తన కంటినే పొడుచుకున్నట్లు అవుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. చూద్దాం మరి ఏం జరుగుతుందో.

జగన్, పవన్ ని కలిపే బాధ్యత కేటీఆర్ దేనా?

  ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ తో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ భేటీ కావడంతో.. వైసీపీ, టీఆర్ఎస్ పార్టీల దోస్తీ ఆఫీసియల్ అయినట్లు అయింది. మొన్నటివరకు పరోక్షంగా మద్దతు ఇచ్చుకున్న పార్టీలు ఇక నుంచి ప్రత్యక్షంగా మద్దతు ఇచ్చుకోనున్నాయి. ముఖ్యంగా రాబోయే ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఈ పార్టీలు కలిసి పనిచేయనున్నాయి. పేరుకి జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించాలని టీఆర్ఎస్, వైసీపీ దగ్గరయ్యాయని చెప్తున్నా.. నిజానికి ఆ రెండు పార్టీల ప్రధాన లక్ష్యం ఏపీలో చంద్రబాబుని గద్దె దించడం. చంద్రబాబుని ఓడించాలనే ప్రధాన అజెండాతోనే ఈ రెండు పార్టీలు దగ్గరయ్యాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కొందరు టీడీపీ నేతలైతే ఈ పార్టీలను బీజేపీ వెనుకనుంచి ఆడిస్తుందని ఆరోపణలు కూడా చేస్తున్నారు. ఇదంతా సరే మరి పవన్ కళ్యాణ్ పరిస్థితి ఏంటి?. గత ఎన్నికల్లో టీడీపీకి మద్దతిచ్చిన పవన్ తరువాత టీడీపీకి దూరమయ్యారు. చంద్రబాబు మీద, లోకేష్ మీద, ఇతర టీడీపీ నేతల మీద తీవ్ర విమర్శలు చేస్తూ వస్తున్నారు. ఓ రకంగా చంద్రబాబుని గద్దె దించాలని జగన్ ఎలా టార్గెట్ పెట్టుకున్నారో.. పవన్ కూడా అలానే టార్గెట్ పెట్టుకున్నారు. మరి ఈ కామన్ టార్గెట్ జగన్, పవన్ లను దగ్గర చేస్తుందా? అంటే అవుననే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కేటీఆర్, జగన్ భేటీ సందర్భంగా పవన్ గురించి కూడా చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. ఏపీలో చంద్రబాబుని ఓడించాలంటే పవన్ మద్దతు కూడా తోడవ్వాలని టీఆర్ఎస్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై జగన్ తన స్పష్టమైన అభిప్రాయాన్ని వెల్లడించనప్పటికీ.. కొందరు వైసీపీ నేతలు మాత్రం పవన్ తో పొత్తుకు సుముఖంగా ఉన్నట్లు సమాచారం. భేటీ సందర్భంగా కేటీఆర్ కూడా జగన్ తో.. పవన్ ని కలుపుకొనిపోతే చంద్రబాబుని ఓడించడం సులభమని సూచించినట్లు సమాచారం. అంతేకాదు పవన్ ని ఎలా ఒప్పించాలో తనకు తెలుసునని.. పవన్ ని ఒప్పించి చంద్రబాబుని ఓడించడానికి అందరూ కలిసి పనిచేసేలా చేస్తానని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. మరి ఈ వార్తల్లో నిజమెంతో తెలీదు కానీ.. ఇదే నిజమైతే.. తెలంగాణలో టీఆర్ఎస్ ని ఓడించడానికి విపక్షాలన్నీ కూటమిగా ఏర్పడినట్లు ఏపీలో టీడీపీని ఓడించడానికి కూడా కూటమి ఏర్పడడం ఖాయం. చూద్దాం మరి ఏం జరుగుతుందో.

టీఆర్ఎస్, వైసీపీ దోస్తీ.. వైఎస్సార్ అభిమానుల రియాక్షన్ ఏంటి?

  ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఏదైనా హాట్ టాపిక్ ఉందంటే అది ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ భేటీనే. జాతీయ రాజకీయాల మీద దృష్టి పెట్టిన తెలంగాణ సీఎం కేసీఆర్.. బీజేపీ, కాంగ్రెస్ లకు ప్రత్యామ్నాయంగా ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. దానిలో భాగంగానే కేసీఆర్ ఆదేశాల మేరకు తాజాగా కేటీఆర్ జగన్ ను కలిశారు. రాబోయే లోక్ సభ ఎన్నికల్లో టీఆర్ఎస్, వైసీపీ పార్టీలు కలిసి పనిచేయనున్నాయి. అయితే ఈ రెండు పార్టీలు దగ్గరవడానికి ఓ రకంగా చంద్రబాబు కారణమని చెప్పాలి. శత్రువుకి శత్రువు మన మిత్రుడు అవుతాడు అనే ఫార్ములా ఈ రెండు పార్టీల మధ్య దోస్తీ కుదిరేలా చేసిందని చెప్పాలి. ఏపీలో జగన్, చంద్రబాబు ప్రత్యర్థులు. చంద్రబాబుని గద్దె దించి ఎప్పుడెప్పుడు సీఎం కుర్చీలో కూర్చుందామా అని జగన్ ఎదురుచూస్తున్నారు. అదే విధంగా కేసీఆర్ కి కూడా చంద్రబాబు ప్రధాన ప్రత్యర్థి. చంద్రబాబు కాంగ్రెస్ తో కలిసి బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకంచేసే పనిలో ఉన్నారు. ఇప్పటికే తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల సమయంలో టీఆర్ఎస్ కి వ్యతిరేకంగా కాంగ్రెస్ తో కలిసి కూటమిగా ఏర్పడి పని చేసారు. ఆ సమయంలో కేసీఆర్ చంద్రబాబు మీద తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఒకానొక దశలో టీఆర్ఎస్ కు ప్రధాన ప్రత్యర్థి కాంగ్రెస్ కాదు చంద్రబాబు అనే స్థాయిలో విరుచుకుపడ్డారు. ఆ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఘన విజయం సాధించింది. అసలు ట్విస్ట్ అక్కడే మొదలైంది. చంద్రబాబుకి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడానికి ఏపీ రాజకీయాల్లో అడుగుపెడతాం అంటూ కేసీఆర్ ప్రకటించారు. దీంతో ఏపీలో వైసీపీ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. నిజానికి టీఆర్ఎస్, వైసీపీల మధ్య దోస్తీ ఎప్పుడో కుదిరిందనేది బహిరంగ రహస్యం. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో తెలంగాణలో ఉన్న ఒకరిద్దరు వైసీపీ నేతలు టీఆర్ఎస్ కు అనుకూలంగా పనిచేసారు. ఇప్పుడు కేటీఆర్, జగన్ భేటీతో ఈ దోస్తీ ఆఫీసియల్ గా ట్రాక్ ఎక్కనుంది. అయితే టీఆర్ఎస్, వైసీపీల దోస్తీని ఏపీ ప్రజలు ఎలా రిసీవ్ చేసుకుంటారంటే మాత్రం భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. చంద్రబాబు మీద కోపంతో తెలంగాణలో టీఆర్ఎస్ గెలిచిందని ఏపీలో వైసీపీ సంబరాలు చేసుకుంది. చంద్రబాబు మీద పంతం కొద్దీ కేసీఆర్ ఏపీ రాజకీయాల్లో అడుగుపెడతానంటే వైసీపీ తమకేదో మేలు జరుగుతుందని గంతులేస్తుంది. కానీ సాధారణ ప్రజల ఆలోచనలు మాత్రం భిన్నంగా ఉన్నాయి. కేసీఆర్ తెలంగాణ ఉద్యమ సమయం నుంచి ఈమధ్య వరకు ఆంధ్రా వారి మీద తీవ్రస్థాయిలో విమర్శలు చేసారు. కొన్ని సందర్భాల్లో ఏపీ నాయకుల మీదే కాకుండా సాధారణ ప్రజల మీద కూడా తీవ్ర విమర్శలు చేసారు. మరి ఆ మాటలన్నీ ఏపీ ప్రజల అంత త్వరగా మర్చిపోతారా?. అదీగాక ప్రస్తుతం ఏపీ ప్రజలు ప్రత్యేకహోదా కావాలని బలంగా కోరుకున్నారు. మరి టీఆర్ఎస్ నేతలు ఏపీకి ప్రత్యేకహోదా వస్తే కంపెనీలన్నీ ఏపీకి తరలిపోతాయని ప్రత్యేకహోదాని వ్యతిరేకించారు. ఏపీకి ప్రత్యేకహోదా ఇస్తామని చెప్పి తరువాత యూ టర్న్ తీసుకున్న బీజేపీ మీద కోపంతో రగిలిపోతున్న ఏపీ ప్రజలు.. మరి ఇప్పుడు ప్రత్యేక హోదాని వ్యతిరేకించిన టీఆర్ఎస్ తో వైసీపీ దోస్తీ అంటే ఎలా రిసీవ్ చేసుకుంటారు?. సాధారణ ప్రజలే కాదు వైఎస్సార్ అభిమానులు కూడా టీఆర్ఎస్, వైసీపీల దోస్తీని వ్యతిరేకిస్తారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. గతంలో వైఎస్సార్ టీఆర్ఎస్ ను ఎంతగా వ్యతిరేకించేవారో తెలిసిందే. అసెంబ్లీ సాక్షిగా వైఎస్సార్.. కేసీఆర్, ఈటల రాజేందర్ వంటి నేతల మీద విరుచుకుపడిన సందర్భాలు ఉన్నాయి. తెలంగాణ ఏమన్నా కేసీఆర్ జాగీరా? అంటూ మండిపడ్డారు. తలకాయ ఎక్కడ పెట్టుకోవాలో అర్ధమవుతుందా రాజేంద్ర? అని ఈటలని వైఎస్సార్ అసెంబ్లీలో విమర్శించడం తీవ్ర దుమారమే రేపింది. కేసీఆర్, హరీష్ రావు కూడా ఈమధ్య వరకు వైఎస్సార్ మీద తీవ్ర విమర్శలు చేసారు. అసలు వైఎస్సార్ బ్రతికుంటే టీఆర్ఎస్ ని ఎదగనిచ్చేవారు కాదనే మాటలు కూడా వినిపిస్తుంటాయి. మరి ఇవన్నీ మర్చిపోయి జగన్ చెప్పాడు కదా అని వైఎస్సార్ అభిమానులు టీఆర్ఎస్ దోస్తీని స్వాగతిస్తారా అంటే డౌటే. చూద్దాం మరి ఏపీ ప్రజలు, వైఎస్సార్ అభిమానులు టీఆర్ఎస్, వైసీపీ దోస్తీని ఎలా రిసీవ్ చేసుకుంటారో ఏంటో.

ఏపీలో ఎన్నికలు..టీడీపీతో టీఆర్ఎస్ ఢీ

  తెలంగాణ ఎన్నికల్లో ఏపీ సీఎం చంద్రబాబు కూటమి తరుపున ప్రచారం చేయటం తెలంగాణ సీఎం కేసీఆర్ కి నచ్చలేదో ఏమో? ..ఏపీ రాజకీయాల్లో వేలుపెడతాం, చంద్రబాబుకి రిటర్న్ గిఫ్ట్ ఇస్తాం అని అన్నారు. ఆ రిటర్న్ గిఫ్ట్ రానున్న ఎన్నికల్లో చంద్రబాబుని ఓడించటమే. ఆ దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టారు కూడా. తాజాగా ఏపీ ప్రతిపక్ష నేత జగన్ తో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ భేటీ అవ్వటమే ఇందుకు ఉదాహరణ. పైకి ఫెడరల్ ఫ్రంట్ పైనే చర్చించాం అని చెప్తున్నా..ఏపీ రాజకీయాలపై కూడా వారి మధ్య చర్చ జరిగినట్టు సమాచారం. కేసీఆర్ సహా ఆ పార్టీ నేతలు ఏపీలో ప్రచారంలో పాల్గొనే అవకాశం లేకపోలేదని అటు టీఆర్ఎస్,ఇటు వైసీపీ నేతలు చెప్పుకొస్తున్నారు. తాజాగా టీఆర్ఎస్ ఎంపీ సీతారాం నాయక్ మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబును ఓడించేందుకు తమ పార్టీ ఎంపీలు ఏపీలో ప్రచారం చేస్తారని వెల్లడించారు. కేటీఆర్, జగన్ భేటీ కేవలం ఫెడరల్ ఫ్రంట్ కోసమేనని, ఇందులో మరేతర విషయాలు లేవన్నారు. ఫ్రంట్ వెనుక బీజేపీ ఉందన్న విమర్శలు పూర్తిగా అవాస్తవమని ఆయన కొట్టిపారేశారు. దేశంలో గుణాత్మకమైన మార్పు రావాలన్న నినాదాన్ని ఎన్నికల ముందే కేసీఆర్ చెప్పారని ఆయన గుర్తు చేశారు. అందులో భాగంగానే ఫెడరల్ ఫ్రంట్ కోసం కేసీఆర్ అనేక మందిని కలిశారని, జగన్‌తో భేటీ కూడా అందులో భాగంగానే ఈ భేటీ అని ఆయన స్పష్టం చేశారు. జగన్ ఏమైనా అంటరానివాడా? ఆయన ఓ ప్రతిపక్ష నేత అని ఆయన తెలిపారు. జగన్‌తో కేటీఆర్ భేటీ అయితే టీడీపీకి ఎందుకింత ఉలికి పాటు? తెలంగాణ ఎన్నికల సమయంలో చంద్రబాబు పర్యటించలేదా? అని సీతారాం నాయక్ ప్రశ్నించారు. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కూడా భేటీపై స్పందించారు. తాజాగా అయన మీడియాతో మాట్లాడుతూ...వైఎస్‌ జగన్‌, కేటీఆర్‌లు ఫెడరల్‌ ఫ్రంట్‌ గురించి చర్చలు జరిపారన్నారు. త్వరలో కేసీఆరే స్వయంగా వైఎస్‌ జగన్‌తో చర్చలు జరుపుతారని తెలిపారు. రాష్ట్రాల హక్కు కోసం కేంద్రంతో పోరాడాటానికి ఒక వేదికగా ఫెడరల్‌ ఫ్రంట్‌ నిలుస్తుందని, ఇది ఒక్క టీఆర్‌ఎస్‌, వైఎస్సార్‌సీపీది మాత్రమే కాదన్నారు. వివిధ రాష్ట్రాలకు చెందిన రాజకీయ పార్టీలు ఇందులో భాగమవుతాయన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో టీఆర్‌ఎస్‌ పోటీ చేయదని, అభ్యర్థులను నిలపదన్నారు. ఫెడరల్‌ ఫ్రంట్‌లో ఏ ప్రాంతీయ పార్టీలైతే భాగమవుతాయో.. వారికి మద్దతుగా ఫెడరల్‌ ఫ్రంట్‌ ప్రచారం నిర్వహిస్తోందన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇచ్చేవారికే వైస్సార్‌సీపీ మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు.

టీడీపీలో ట్విస్ట్ లే ట్విస్ట్ లు.. భూమా ఔట్, శిల్పా ఇన్!!

  'కుడి ఎడమైతే పొరపాటు లేదోయ్' అనే పాట గుర్తుండే ఉంటుంది. ఇప్పుడిదే పాటని కాస్త మార్చి పాడుకుంటున్నారు మన పొలిటీషియన్స్. 'ఏడాదికో పార్టీ మారితే పొరపాటు కాదోయ్' అని పాడుతున్నారు. ఈరోజుల్లో నాయకులు పార్టీలు మారడం చాలా కామన్ అయిపోయింది. ఇప్పుడు ఏ నాయకుడు ఏ పార్టీలో ఉన్నాడో.. ఎప్పుడు ఏ నాయకుడు ఏ పార్టీలో చేరతాడో తెలుసుకోవడం చాలా కష్టమైపోతుంది. ప్రస్తుతం నంద్యాల రాజకీయం కూడా అలాగే ఉంది. మంత్రి భూమా అఖిల ప్రియ టీడీపీని వీడి జనసేనలో చేరడానికి సిద్దమయ్యారంటూ కొద్ది రోజులుగా వార్తలొస్తున్నాయి. అఖిల ప్రియ ఈ వార్తలను ఖండించినప్పటికీ.. ఆమె టీడీపీని వీడుతున్నారనే ప్రచారం మాత్రం ఆగట్లేదు. ఇప్పుడు నంద్యాలలో మరో వార్త కూడా చక్కర్లు కొడుతోంది. అదేంటంటే అఖిల ప్రియ టీడీపీని వీడటానికి సిద్ధమయ్యారని వార్తలు రావడంతో.. శిల్పా బ్రదర్స్ టీడీపీలో చేరడానికి సిద్దమయ్యారట. 2014 ఎన్నికల సమయంలో భూమా ఫ్యామిలీ వైసీపీలో ఉంటే.. శిల్పా ఫ్యామిలీ టీడీపీలో ఉన్నారు. 2014 లో నంద్యాల అసెంబ్లీ నుంచి వైసీపీ తరుపున భూమా నాగిరెడ్డి, టీడీపీ తరుపున శిల్పా మోహన్ రెడ్డి బరిలోకి దిగారు. ఆ ఎన్నికల్లో భూమా నాగిరెడ్డి విజయం సాధించారు. తరువాత భూమా ఫ్యామిలీ వైసీపీని వీడి టీడీపీలో చేరింది. భూమా నాగిరెడ్డి ఆకస్మిక మరణంతో నంద్యాలలో 2017 లో ఉపఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో చంద్రబాబు శిల్పాని కాదని భూమా ఫ్యామిలీకే టికెట్ ఇవ్వడానికి మొగ్గుచూపారు. భూమా బ్రహ్మానంద రెడ్డికి టికెట్ ఇచ్చారు. దీంతో శిల్పా టీడీపీని వీడి వైసీపీలో చేరి.. వైసీపీ తరుపున బరిలోకి దిగారు. అయితే ఉపఎన్నికల్లో కూడా శిల్పా ఓడిపోయారు. ప్రస్తుతం వైసీపీలో కూడా శిల్పా పరిస్థితి బాగాలేదని తెలుస్తోంది. ఎంఐఎం రాబోయే ఎన్నికల్లో వైసీపీకి మద్దతిస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. మైనార్టీలు అధికంగా ఉండే నంద్యాల అసెంబ్లీ సీటును ఎంఐఎం ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ విషయంపై చర్చలు జరగగా వైఎస్ జగన్ కూడా సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. దీంతో శిల్పా సందిగ్ధంలో పడ్డారు. నంద్యాల టికెట్ ఎంఐఎంకి ఇస్తే తన పరిస్థితి ఏంటని ఆలోచనలో పడ్డ శిల్పాకి.. భూమా కుటుంబం టీడీపీని వీడనుందనే వార్త కొత్త ఆశ తీసుకొచ్చిందట. నంద్యాల టికెట్ ఇస్తానంటే టీడీపీలో చేరడానికి సిద్దమనే సంకేతాలు కూడా ఇచ్చినట్లు తెలుస్తోంది. మరి భూమా ఫ్యామిలీ.. అఖిల ప్రియ చెప్పినట్లు టీడీపీలోనే ఉంటుందా? లేక టీడీపీని వీడి శిల్పా ఫ్యామిలీకి రూట్ క్లియర్ చేస్తుందో చూడాలి.

సంక్రాంతి తరువాత టీడీపీలోకి చేరికలే చేరికలు!!

  ఏపీలో ఎన్నికల సమయం దగ్గర పడుతుండటంతో ప్రధాన పార్టీలన్నీ పార్టీలో చేరికలపై దృష్టి పెట్టాయి. ముఖ్యంగా అధికార పార్టీ టీడీపీ ప్రత్యేక దృష్టి పెట్టింది. ఇన్నిరోజులు ప్రభుత్వ కార్యక్రమాలు, అభివృద్ధి పనులపైనే ఎక్కువ దృష్టి పెట్టిన చంద్రబాబు.. ఎన్నికల సమయం దగ్గరపడుతుండటంతో ఇక నుంచి పార్టీ కార్యకలాపాలపైన ప్రత్యేక దృష్టి సారించనున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా పార్టీలో చేరికలపై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. అభ్యర్థుల ఎంపిక, పార్టీ బలోపేతం వంటి అంశాలపై చంద్రబాబు క్షుణ్ణంగా అధ్యయనం చేస్తున్నారు. పార్టీ ఎక్కడ బలహీనంగా ఉంది. వైసీపీ, జనసేన పార్టీల ప్రభావం ఉన్నచోట ప్రత్యామ్నాయంగా ఎవరిని తెరపైకి తీసుకురావాలి అనే అంశాలపై ఇప్పటికే చంద్రబాబు ఫోకస్ పెట్టారు. మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమల, సూపర్ స్టార్ కృష్ణ సోదరుడు ఘట్టమనేని ఆది శేషగిరిరావు, మాజీమంత్రి అహ్మదుల్లా, మాజీమంత్రి కొణతాల రామకృష్ణ, మాజీ ఎంపీ సబ్బం హరిలను పార్టీలోకి రావాలంటూ ఆహ్వానం పలికారు. అందులో భాగంగా మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమల టీడీపీలో చేరతానని చంద్రబాబుకు స్పష్టం చేశారు. టీడీపీ సముచిత స్థానం కల్పిస్తానని చంద్రబాబు సైతం ఆమెకు హామీ ఇచ్చారు. అదేవిధంగా సూపర్ స్టార్ కృష్ణ సోదరుడు ఘట్టమనేని ఆది శేషగిరిరావు సైతం త్వరలోనే టీడీపీలో చేరనున్నారు. ఇటీవలే వైసీపీకి రాజీనామా చేసిన ఆయన సంక్రాంతి తర్వాత టీడీపీలో చేరతారని ప్రచారం జరుగుతుంది. మాజీమంత్రి అహ్మదుల్లా సైతం అధికార టీడీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. కడప జిల్లాకు చెందిన అహ్మదుల్లా వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రిగా పనిచేశారు. ముస్లిం సామాజిక వర్గంలో మంచి పట్టున్న నేపథ్యంలో ఆయన్ను టీడీపీలోకి ఆహ్వానించినట్లు సమాచారం. త్వరలోనే అహ్మదుల్లా టీడీపీలో చేరనున్నారని జోరుగా ప్రచారం సాగుతోంది. అనకాపల్లి మాజీ ఎంపీ సబ్బం హరి సైతం టీడీపీలో చేరేందుకు ఆసక్తి  చూపుతున్నారు. ఆయన టీడీపీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారని ఎప్పటి నుంచో వార్తలొస్తున్నాయి. ఇప్పటికే పలు అంశాల్లో చంద్రబాబును సబ్బం హరి ప్రశంసిస్తూ వస్తున్నారు. పలుమార్లు కలిసి అభినందించారు కూడా. ఇటీవలే డిసెంబర్ 31న చంద్రబాబును ఆయన నివాసంలో సబ్బం హరి కలిశారు. తాను టీడీపీలో చేరతానని స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. ఇకపోతే మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ సైతం టీడీపీలో చేరాలని భావిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే పలుమార్లు చంద్రబాబు పని తీరును మెచ్చుకున్న కొణతాల.. జనవరి 18న టీడీపీలో చేరుతున్నారని ప్రచారం జరుగుతోంది. అదేవిధంగా కమెడియన్ అలీ కూడా త్వరలోనే టీడీపీ తీర్థం పుచ్చుకోబోతున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి సంక్రాంతి తరువాత టీడీపీలోకి భారీగానే చేరికలు ఉండేలా ఉన్నాయి.

జేసీకి వార్నింగ్ ఇచ్చిన సీఐకి వైసీపీ ఎంపీ టికెట్!!

  సీఐ గోరంట్ల మాధవ్. కొద్ది రోజుల క్రితం ఈ పేరు వార్తల్లో మారుమోగిపోయింది. ఏకంగా అధికార పార్టీ ఎంపీకే మీసం మెలేసి వార్నింగ్ ఇవ్వడంతో ఈయన పేరు వార్తల్లో బాగా వినిపించింది. అనంతపురం జిల్లాలో ప్రబోధానంద స్వామి గొడవలో ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి పోలీసులపై చేసిన అనుచిత వ్యాఖ్యలతో సీఐ మాధవ్ తెరపైకి వచ్చారు. పోలీసులపై జేసీ చేసిన వ్యాఖ్యలని మాధవ్ తీవ్రంగా తప్పుబట్టారు. పోలీసుల జోలికి వస్తే నాలుక కోస్తానంటూ మీసం మెలేసి మరీ వార్నింగ్ ఇచ్చారు. ఈ విషయం అప్పట్లో పెద్ద హాట్ టాపిక్ అయింది. అయితే సీఐ మాధవ్ పేరు ఇప్పుడు మళ్ళీ వార్తల్లో వినిపిస్తుంది. ఆయన రాబోయే ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేస్తున్నారట. జేసీలాంటి వ్యక్తికే సవాల్ విసిరిన మాధవ్‌పై వైసీపీ కన్నేసింది. కదిరి సీఐగా ఉన్న ఆయనతో వైసీపీ పెద్దలు రహస్యంగా మంతనాలు జరిపారట. హిందూపురం ఎంపీగా మాధవ్‌ను పోటీచేసేలా ఒప్పించాలన్నది ఆ సంప్రదింపుల సారాంశం. అందుకు మాధవ్ సైతం ‍ఒప్పుకున్నారని తెలుస్తోంది. సీఐ పదవికి రాజీనామా చేసి రావాలని వైసీపీ హైకమాండ్ కోరడంతో మాధవ్ అదే పనిలో ఉన్నారు. తన రాజీనామా లేఖను జిల్లా ఎస్పీ ద్వారా డీఐజీకి పంపారట కూడా!   మాధవ్ కురబ సామాజికవర్గానికి చెందినవారు. హిందూపురం పార్లమెంట్ పరిధిలో కురబ, యాదవ ఓటర్లు గణనీయంగా ఉన్నారు. అందుకే మాధవ్‌ను బరిలోకి దింపడం ద్వారా టీడీపీకి గట్టిపోటీ ఇవ్వవచ్చని పార్టీ పెద్దలు అంచనా వేస్తున్నారు. పార్లమెంట్ పరిధిలో బీసీ ఓటర్ల సంఖ్యే ఎక్కువ. బీసీల అండతోనే టీడీపీ తరఫున నిమ్మల కిష్టప్ప రెండుసార్లు గెలిచారు. దీంతో టీడీపీ వెంట ఉన్న బీసీలకు గాలం వేయడానికే మాధవ్ పేరును వైసీపీకి తెరపైకి తీసుకువచ్చిందని పరిశీలకులు అంటున్నారు. అయితే మాధవ్‌ను పార్టీలోకి చేర్చుకుని టికెట్ ఇవ్వకుండా ఆయనను బలిపశువును చేస్తారమోనన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే పలువురిని టికెట్ ఇస్తామని చెప్పి పార్టీలో చేర్చుకున్న తర్వాత వారికి హ్యాండ్‌ ఇచ్చిన ఘటనలున్నాయి. అందుకే మాధవ్ విషయంలో ఇలా జరుగుతుందేమో అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. చూడాలి మరి మాధవ్‌ వ్యవహారం వచ్చే రోజుల్లో ఏ మలుపు తిరుగుతుందో!

టీడీపీ కి బిగ్ షాక్.. జనసేనలోకి మంత్రి అఖిల ప్రియ?

  ఏపీలో ఎన్నికల సమయం దగ్గరపడుతున్న వేళ అధికార పార్టీ టీడీపీకి షాక్ ఇచ్చే వార్త ఒకటి చక్కర్లు కొడుతోంది. మంత్రి అఖిల ప్రియ టీడీపీకి గుడ్ బై చెప్పి.. త్వరలో జనసేన తీర్థం పుచ్చుకోవడానికి సిద్దమైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి. త‌ల్లి శోభా నాగిరెడ్డి మ‌ర‌ణంతో ఉపఎన్నిక‌ల ద్వారా వైసీపీ తరుపున అఖిల ప్రియ ఆళ్ల‌గ‌డ్డ ఎమ్మెల్యే అయ్యారు. తరువాత తండ్రి భూమా నాగిరెడ్డితో క‌లిసి వైసీపీ నుండి టీడీపీలోకి చేరారు. ఆ త‌రువాత తండ్రి ఆకస్మికంగా మ‌ర‌ణించారు. కొద్ది కాలానికి అఖిల ప్రియ మంత్రి అయ్యారు. అయితే మంత్రిగా ఉన్న అఖిల ప్రియ అంద‌రినీ కలుపుకొని పోవడంలో స‌క్సెస్ కాలేక పోయార‌నే భావ‌న ఉంది. దీంతో జిల్లాలోని టీడీపీ నేతలే అఖిలకు వ్య‌తిరేకంగా పావులు క‌దుపుతున్నారు. దీంతో అఖిల ప్రియ సైతం పార్టీ నేత‌ల తీరుపై అస‌హ‌నంతో ఉన్నారు. ఈ నేపథ్యంలో అఖిల ప్రియ పార్టీ మారుతారంటూ కర్నూల్ జిల్లాలో జోరుగా ప్రచారం జ‌రుగుతోంది. టీడీపీలో త‌నకు వ్య‌తిరేకంగా నేత‌లు ప‌ని చేస్తున్నా.. అధినాయ‌క‌త్వం వారికి ప్రాధాన్య‌త ఇవ్వ‌టం పై అఖిల ప్రియ అసంతృప్తితో ఉన్న‌ట్లు సమాచారం. దీనికి తోడు వ‌చ్చే ఎన్నిక‌ల్లో భూమా బ్ర‌హ్మానంద‌రెడ్డిని ఆళ్ల‌గ‌డ్డ నుండి టీడీపీ బ‌రిలోకి దింపుతోంద‌ని పార్టీ వ‌ర్గాల స‌మాచారం. నంద్యాల నుండి మైనార్టీ అభ్యర్దికి అవ‌కాశం ఇస్తార‌ని చెబుతున్నారు. క‌ర్నూలు ఎమ్మెల్యేగా అఖిల ప్రియ మేన‌మామ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. దీంతో భూమా కుటుంబం నుండి బ్ర‌హ్మానంద‌రెడ్డికి మాత్ర‌మే టిక్కెట్ ద‌క్కుతుందంటూ పార్టీలో ప్రచారం జరుగుతోంది. పార్టీలో జ‌రుగుతున్న ప‌రిణామాలపై అగ్ర‌హంతో ఉన్న అఖిల ప్రియ.. కర్నూల్ జిల్లా ప‌ర్య‌ట‌నకు సీఎం చంద్రబాబు వ‌చ్చినా దూరంగా ఉన్నారు. అయితే వ్య‌క్తిగ‌త కార‌ణాల‌తోనే అఖిల ప్రియ సీఎం ప‌ర్య‌ట‌న‌కు దూరంగా ఉన్నార‌ని.. సీఎంకు స‌మాచారం కూడా ఇచ్చార‌ని సన్నిహితులు చెబుతున్నారు. అయినా అఖిల ప్రియ టీడీపీని వీడుతున్నారనే ప్రచారానికి మాత్రం ఫుల్ స్టాప్ పడట్లేదు. అఖిల ప్రియ త్వ‌రలోనే టీడీపీని వీడి.. ఎన్నిక‌ల ముందు జనసేనలో చేరతారని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. భూమా కుటుంబానికి పవన్ కళ్యాణ్ కుటుంబంతో సన్నిహిత సంబంధాలున్నాయి. శోభా నాగిరెడ్డి 2004 ఎన్నిక‌ల్లో ప్ర‌జారాజ్యం నుండి ఆళ్ల‌గ‌డ్డ ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు. ఆ త‌రువాత వైసీపీలో చేరారు. భూమా దంప‌తుల మ‌ర‌ణం త‌రువాత పవన్ కళ్యాణ్.. వారి పిల్ల‌ల గురించి ప‌లు మార్లు ఆరా తీసేవారట. ఇప్పుడు కర్నూల్ జిల్లా టీడీపీలో జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో జనసేన పార్టీలో చేరటం కరెక్ట్ అని అఖిల ప్రియ భావిస్తున్నారట. జనసేనలో అయితే తనకు తగిన గౌరవం, గుర్తింపు దక్కుతాయని.. అందుకే వీలైనంత త్వరగా టీడీపీని వీడి జనసేనలో చేరాలని అఖిల ప్రియ అనుకుంటున్నట్లు తెలుస్తోంది. మరి అఖిల ప్రియ నిజంగా జనసేనలో చేరతారో లేక టీడీపీలోనే ఉంటారో చూడాలి.

జగన్, పవన్ నై నై.. చంద్రబాబుకే అలీ జై!!

  గత కొద్దిరోజులుగా ఏపీ రాజకీయాల్లో బాగా నానుతున్న పేరు అలీ. బాలనటుడిగా సినీరంగ ప్రవేశం చేసిన అలీ.. కమెడియన్ గా ఆకట్టుకొని ప్రేక్షకుల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే రాజకీయాల్లో మాత్రం అలీ జనాల్ని తెగ కన్ఫ్యూజ్ చేస్తున్నారు. అలీ ఏ పార్టీలో చేరతారో తెలియక ప్రజలు తలలు పట్టుకుంటున్నారు. వైసీపీ, జనసేన, టీడీపీ ఈ మూడు దారుల్లో అలీ పయనం ఎటువైపో అర్ధంగాక ప్రజలు క్వశ్చన్ మార్క్ ఫేస్ లతో చూస్తున్నారు. సినీ ప్రయాణంలో అలీ.. పవన్ కళ్యాణ్ కి అత్యంత సన్నిహితుడు. పవన్ చేసిన మెజారిటీ సినిమాల్లో అలీ నటించాడు. వీరిద్దరూ మంచి స్నేహితులని సాధారణ ప్రేక్షకులకు కూడా తెలుసు. దీంతో అలీ.. పవన్ స్థాపించిన జనసేన పార్టీలో చేరతారని భావించారంతా. కానీ అలీ ఎందుకో జనసేనకు దూరం పాటిస్తూ వచ్చారు. సర్లే అలీ రాజకీయాలకు దూరంగా ఉండాలని భావిస్తున్నారేమో అనుకున్నారు. కానీ అనూహ్యంగా అలీ వైసీపీ అధినేత జగన్ తో భేటీ అయ్యారు. దీంతో అలీ వైసీపీలో చేరుతున్నారంటూ వార్తలు మొదలయ్యాయి. ఇదేంటి పవన్ జనసేన ఉండగా.. అలీ వైసీపీ వైపు ఎందుకు చూస్తున్నారు? అంటూ ఒకటే చర్చలు. ఒకవైపు అలా చర్చలు జరుగుతుండగానే మరోవార్త బయటికి వచ్చింది. అదే పవన్ తో అలీ భేటీ. ఇంకేముంది అలీ 'స్నేహమేరా జీవితం.. స్నేహమేరా శాశ్వతం' అంటూ పవన్ వైపు వచ్చారు. త్వరలో జనసేనలో చేరతారు అంటూ చర్చలు మొదలయ్యాయి. అబ్బే.. ఇంతటితో ఆగితే ఏం మజా ఉంటుంది. సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలో లాగా ఇంకో పెద్ద ట్విస్ట్ వచ్చింది. ప్రొడ్యూసర్ అశ్వనీదత్ తో కలిసి అలీ.. చంద్రబాబుతో భేటీ అయ్యారు. ఇప్పుడు అలీ టీడీపీలో చేరుతున్నారంటూ వార్తలు. ఇలా ఈ మూడు పార్టీలలో అలీ ఏ పార్టీకి జై కొడతారో అర్థంగాక జనాలు జుట్టు పీక్కుంటున్నారు. అయితే ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే అలీ టీడీపీ వైపే మొగ్గుచూపే అవకాశాలు కనిపిస్తున్నాయి. జనసేన మొదటిసారి ఎన్నికల బరిలో నిలుస్తుంది. రాబోయే ఎన్నికల్లో జనసేన అధికారంలోకి వచ్చే అవకాశాలు చాలా తక్కువున్నాయి. ఇక వైసీపీ విషయానికొస్తే.. టికెట్ విషయంలో అలీకి ఆ పార్టీ నుంచి స్పష్టమైన హామీ రాలేదని తెలుస్తోంది. అసలు ప్రస్తుతం అలీ రాజకీయాల్లోకి రావాలనుకునేది ఎన్నికల బరిలోకి దిగడానికి. నిజానికి అలీ గతంలోనే టీడీపీ తరుపున పోటీ చేయాలనుకున్నారు. కానీ కేవలం ప్రచారానికే పరిమితమయ్యారు. కానీ ఈసారి ఎన్నికల బరిలోకి దిగాలని ఫిక్స్ అయ్యారు. అందుకే ఆయనికి గతంలో ఉన్న టీడీపీ సత్సంబంధాలతో చంద్రబాబుతో భేటీ అయ్యారు. అంతేకాదు ఆయనికి టీడీపీ నుంచి టికెట్ హామీ కూడా వచ్చినట్లు సమాచారం. అలీ టీడీపీ తరుపున మైనార్టీలు ఎక్కువగా ఉండే గుంటూరు 1 నుంచి పోటీ చేసే అవకాశముందని తెలుస్తోంది. మరి అలీ టీడీపీలో చేరతారో లేక ఇంకేమైనా ట్విస్ట్ ఇస్తారో చూడాలి.

ఏపీ ఎన్నికలు.. 50 కోట్లు ఖర్చు పెట్టేవారికే ఎమ్మెల్యే టికెట్

  ఒకప్పుడు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలంటే.. ఆ వ్యక్తికి ప్రజల్లో మంచి పేరుందా? ప్రజలకు సేవ చేస్తాడా? అని పార్టీలు ఆలోచించేవి. కానిప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ప్రత్యర్థి పార్టీ అభ్యర్థి కంటే ఎక్కువ ఖర్చు చేయగలడా? లేదా? అని పార్టీలు ఆలోచిస్తున్నాయి. ఆలోచించడం ఏంటి.. అలా ఖర్చు చేయగలిగిన వారికే టిక్కెట్లు ఇస్తున్నాయి. మరో నాలుగు నెలల్లో ఏపీలో ఎన్నికలు జరుగనున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఏపీలో కూడా ఎమ్మెల్యే టిక్కెట్లు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టగల వారికే దక్కేలా కనిపిస్తున్నాయి. రాబోయే ఎన్నికల్లో ఏపీలో టీడీపీ, వైసీపీ మధ్య ప్రధాన పోటీ జరిగే అవకాశాలున్నాయి. ప్రస్తుతం అధికారంలో ఉన్న టీడీపీ ఎలాగైనా అధికారం నిలబెట్టుకోవాలని చూస్తుంది. మరోవైపు ప్రతిపక్ష వైసీపీ కూడా ఎలాగైనా అధికారం దక్కించుకోవాలని చూస్తోంది. ఈసారి ఎన్నికల్లో ఓడిపోతే పార్టీ భవిష్యత్తుకే ప్రమాదమని వైసీపీ భావిస్తోంది. అందుకే రాబోయే ఎన్నికలను వైసీపీ చాలా సీరియస్ గా తీసుకుంది. అందుకే టీడీపీకి ధీటుగా ఆర్థికంగా బలమైన అభ్యర్థులను నిలబెట్టాలని చూస్తోంది. మొన్నామధ్య వైసీపీ అధినేత జగన్.. పార్టీలో కష్టపడేవారి కంటే ఎన్నికల్లో ఖర్చుపెట్టగలిగే వారికే టిక్కెట్లు ఇవ్వాలని భావిస్తున్నట్లు వార్తలొచ్చిన విషయం తెలిసిందే. 'నిప్పు లేనిదే పొగ రాదు' అన్నట్టు ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే ఆ వార్తలు నిజమే అనిపిస్తోంది. టీడీపీకి దాదాపు అన్ని నియోజకవర్గాల్లో బలమైన అభ్యర్థులు ఉంటారు. వారిని ఓడించాలంటే అంతకన్నా బలమైన అభ్యర్థులను బరిలోకి దింపాలి. అందుకే వైసీపీ నియోజకవర్గాన్ని బట్టి 25 నుంచి 50 కోట్ల వరకు ఖర్చు పెట్టగలిగే వారికే టిక్కెట్లు ఇవ్వాలని భావిస్తోందట. అయితే ఇలా పార్టీలు పోటాపోటీగా ఖర్చు పెట్టగలిగే అభ్యర్థులను బరిలోకి దింపాలి అనుకోవడం.. నిజంగా పార్టీ కోసం కష్టపడే, ప్రజలకు సేవ చేసే మధ్యతరగతి నాయకులకు బాధ కలిగించే విషయమనే చెప్పాలి. బడాబాబులకు టికెట్ ఇస్తే ఖర్చు చేస్తారు. గెలిస్తే సంబరాలు చేసుకుంటారు. తరువాత అవకాశాన్ని బట్టి పార్టీ కూడా మారుతారు. కానీ పార్టీనే నమ్ముకున్న మధ్యతరగతి నాయకులు అలా కాదు. టికెట్ వచ్చినా రాకపోయినా.. పార్టీ అధికారంలో ఉన్నా లేకపోయినా పార్టీలోనే ఉంటారు. పార్టీకోసం కష్టపడతారు. ఇప్పుడు ఏపీలో ప్రధాన పార్టీలు డబ్బు ఖర్చు పెట్టగలిగే వారికే టిక్కెట్లు ఇవ్వాలని చూస్తున్నాయని వార్తలొస్తున్న నేపథ్యంలో.. పార్టీని నమ్ముకొని ఇన్నాళ్లు పార్టీ కోసం పనిచేసిన మధ్యతరగతి నేతలు టికెట్ రాదని తెలిసి బాధపడుతున్నప్పటికీ.. పార్టీని వీడే ఆలోచనలో లేరు. మరి ఇప్పటికైనా ప్రధాన పార్టీలు ఖర్చు పెట్టేవారికి కాదు.. కష్టపడి పనిచేసేవారికి టిక్కెట్లు ఇవ్వాలని మనసు మార్చుకుంటాయేమో చూడాలి.

కేసీఆర్ బాటలో జగన్.. టార్గెట్ వందసీట్లు.. వ్యూహం ఫలిస్తుందా?

  తెలంగాణలో కేసీఆర్ అనుసరించిన వ్యూహాన్నే ఏపీలో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ అనుసరించాలని చూస్తున్నారు. కేసీఆర్ అసెంబ్లీ రద్దు చేసి ముందస్తుకు వెళ్లారు. అంతేకాదు అందరికంటే ముందుగా ఒకేసారి ఏకంగా 105 మంది అభ్యర్థులను ప్రకటించారు. దీనివల్ల అసంతృప్తి నేతలను బుజ్జగించడానికి ఎక్కువ సమయం దొరికింది. అలాగే మిగతా పార్టీలకంటే ముందుగా ప్రచారం మొదలు పెట్టి ప్రజల్లోకి త్వరగా వెళ్లే అవకాశం దొరికింది. మొత్తానికి కేసీఆర్ వ్యూహం ఫలించి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఘన విజయం సాధించింది. ఇప్పుడు ఇదే వ్యూహాన్ని ఏపీలో అమలు చేయాలని జగన్ భావిస్తున్నారు.   ఏప్రిల్-మే నెలల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి వైసీపీ ఈ సారి ఒకే దఫా వంద సీట్లలో అభ్యర్ధులను ప్రకటించాలని టార్గెట్ పెట్టుకున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రకటన కూడా అతి త్వరలోనే ఉండే అవకాశం ఉందని సమాచారం. 'ప్రజా సంకల్ప యాత్ర' పేరుతో జగన్ చేప్పట్టిన పాదయాత్ర ఈ నెల 9 తేదీన శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్చాపురంలో ముగియనుంది. అదేరోజు జగన్ అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 175 సీట్లు ఉన్న ఏపీలో ఒకేసారి వంద సీట్లలో అభ్యర్ధులను ప్రకటించటం ద్వారా జగన్ ఎన్నికలకు ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఇలా ముందుగా అభ్యర్ధుల ప్రకటన పార్టీకి లాభిస్తుందని.. ప్రచారానికి కావాల్సినంత సమయం ఇచ్చినట్లు అవుతుందనే అభిప్రాయంతో జగన్ ఉన్నారు. మిగిలిన 75 సీట్లకు సంబంధించి అభ్యర్ధుల ఎంపిక విషయంలో ఆచితూచి అడుగు వేయాలని.. పరిస్థితులకు అనుగుణంగా ఈ సీట్లలో నిర్ణయం తెసుకోవాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. అయితే తెలంగాణ ఫార్ములా ఏపీలో పనిచేస్తుందని చెప్పటానికి లేకపోయినా.. అభ్యర్ధి ప్రజల్లోకి వెళ్ళటానికి, తమ ప్రత్యర్ధుల కంటే ముందుగా ప్రచారం చేసుకోవటానికి ఇది పనికొస్తుందన్న విషయంలో ఎలాంటి సందేహం లేదు. ఈ సారి వైసీపీలో టిక్కెట్ల కేటాయింపు కూడా పక్కాగా గెలుపు అవకాశాలు ఉన్నవారికే ఇవ్వాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే ఏదైనా కారణంగా టిక్కెట్ నిరాకరించాల్సి వస్తే.. అలాంటి నేతలతో జగన్ స్వయంగా మాట్లాడి బుజ్జగింపులు కూడా చేయటానికి ప్లాన్ రెడీ చేసుకుంటున్నారని తెలుస్తోంది. చూద్దాం మరి జగన్ వ్యూహం ఎంతవరకు ఫలిస్తుందో.

మళ్ళీ నువ్వే రావాలి.. నిజంగా ప్రజలు కోరుకుంటున్నారా?

  గత ఎన్నికల్లో ఏపీ ప్రజల్లోకి.. ముఖ్యంగా యువతలోకి బలంగా దూసుకుపోయిన స్లోగన్ 'బాబు రావాలి.. జాబు రావాలి'. టీడీపీ కార్యకర్తల నుంచి సామాన్య ఓటర్ల వరకు అందరి నోట ఈ మాట బాగా వినిపించింది. ఏపీ ప్రజలు చంద్రబాబుని నమ్మారు.. దానికి తగ్గట్లే అధికారం కట్టబెట్టారు. చంద్రబాబు కూడా ప్రజల నమ్మకాన్ని నిజం చేస్తూ ఈ నాలుగున్నరేళ్లలో చాలా సాధించారు. ప్రపంచ స్థాయిలో రాజధాని నిర్మాణానికి పూనుకున్నారు. అలాగే పోలవరం పనులు పరుగులు పెట్టిస్తున్నారు. కియా మోటార్స్, టిసిఎల్ కంపెనీలు తీస్కోచ్చారు. రాయలసీమకు నీళ్లిచ్చారు. రీసెంట్ గా కడప స్టీల్ ప్లాంట్ కి శంకుస్థాపన కూడా చేసారు. గొప్ప రాజధాని నిర్మాణం కావాలన్నా, పెద్ద కంపెనీలు రావాలన్నా మళ్ళీ బాబే రావాలని టీడీపీ కార్యకర్తలు నమ్ముతున్నారు. అందుకే గతంలో 'బాబు రావాలి.. జాబు రావాలి' అనే స్లోగన్ లాగా ఇప్పుడు 'మళ్ళీ నువ్వే రావాలి' అనే స్లోగన్ ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. మరి ఏపీ ప్రజలు నిజంగా మళ్ళీ చంద్రబాబే రావాలని కోరుకుంటున్నారా? అంటే దాదాపు 64 శాతం మంది మళ్ళీ బాబు రావాలని కోరుకుంటున్నారట. ఏపీలో కొద్ది నెలల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే ప్రధాన పార్టీలన్నీ ఎన్నికల మీద దృష్టి పెట్టడంతో ఏపీలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. చంద్రబాబు కూడా ఓ వైపు ప్రభుత్వ కార్యక్రమాలు చూసుకుంటూనే.. మరోవైపు పార్టీ కార్యక్రమాల మీద దృష్టి పెడుతున్నారు. అదే విధంగా ఎమ్మెల్యేల పనితీరు మీద ఎప్పటికప్పుడు సర్వేలు చేపిస్తూ గెలుపు గుర్రాలను వెతుకుతున్నారు. అయితే రీసెంట్ గా చంద్రబాబు నేతృత్వంలో టీడీపీ పెద్దలు ఒక సర్వే నిర్వహించారట. ఈ సర్వేలో డొంక తిరుగుడు లేకుండా ఒకే ఒక ప్రశ్న అడిగారట. అదేంటంటే మళ్ళీ చంద్రబాబు సీఎం కావాలా? వద్దా?. ప్రతిజిల్లాలో దాదాపు నాలుగు వేల మందిని ఈ ప్రశ్న అడిగినట్లు తెలుస్తోంది. వివిధ వర్గాలు, మతాలు, కులాలకు చెందిన వారు ఈ నాలుగు వేల మందిలో ఉన్నారట. మళ్ళీ చంద్రబాబు సీఎం కావాలా? వద్దా? అన్న ప్రశ్నకు దాదాపు 64 శాతం మంది మళ్ళీ చంద్రబాబే సీఎం కావాలని చెప్పారట. 15 శాతం మంది చంద్రబాబు పనితీరు పర్వాలేదని చెప్పగా.. 21 శాతం మంది మాత్రం ఈ ప్రభుత్వం మారిపోవాలని కోరుకున్నారట. మొత్తానికి ఈ సర్వేతో టీడీపీ నేతలు ఫుల్ హ్యాపీగా ఉన్నారట. అయితే చంద్రబాబు సీఎం కావాలని కోరుకునే వారి శాతం ఇంకా పెరగాలని.. అప్పుడు టీడీపీ విజయావకాశాలు మరింత పెరుగుతాయని నేతలు భావిస్తున్నారట. చూద్దాం మరి ఏం జరుగుతుందో.

పవన్ ఒంటరి పోరు.. వైసీపీకి నష్టమేనా?

  రానున్న ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ఒంటరిగా పోటీ చేస్తే టీడీపీకి నష్టమని వైసీపీ శ్రేణులు భావిస్తున్నారు. కానీ లాజిక్ గా ఆలోచిస్తే పవన్ ఒంటరిగా పోటీ చేయడం వల్ల టీడీపీకి ఎంత నష్టమో వైసీపీకి కూడా అంతే నష్టమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. గత ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ప్రత్యక్షంగా ఎన్నికల్లో పోటీ చేయకుండా టీడీపీకి మద్దతిచ్చారు. టీడీపీ విజయం సాధించి అధికారం చేపట్టింది. అయితే ఆ తరువాత పవన్ టీడీపీకి దూరమయ్యారు. టీడీపీ మీద విమర్శల దాడి కూడా చేస్తున్నారు. అంతేనా గత ఎన్నికల్లో టీడీపీ గెలుపుకి తానే కారణమని కూడా చెప్పుకున్నారు. ఇక కొందరు పవన్ అభిమానులు, జన సైనికులు అయితే అసలు పవన్ లేకపోతే టీడీపీ గెలిచేది కాదని అంటున్నారు. మరికొందరైతే పవన్ వల్లే పవన్ సామాజికవర్గానికి చెందిన ఓట్లన్నీ గంప గుత్తుగా టీడీపీకి పడ్డాయని అభిప్రాయపడ్డారు. కానీ వారు చేస్తున్న వ్యాఖ్యల్లో వాస్తవమెంత?. పవన్ టీడీపీకి మద్దతు ఇవ్వడం వల్ల ఖచ్చితంగా టీడీపీకి ప్లస్సే. అది వాస్తవం. కానీ పవన్ వల్లే టీడీపీ గెలిచిందని మాత్రం అనలేం. ఎందుకంటే సాధారణ ఎన్నికలకు ముందు జరిగిన మున్సిపల్, పంచాయితీ ఎన్నికల్లో టీడీపీ దాదాపు స్వీప్ చేసింది. ఆ ఎన్నికల్లో పవన్, బీజేపీలతో దోస్తీ చేయకుండానే మెజారిటీ స్థానాల్లో టీడీపీ జెండా ఎగురవేసింది. ఇక సాధారణ ఎన్నికల్లో టీడీపీకి.. పవన్, బీజేపీ తోడవడంతో టీడీపీ ఘన విజయం సాధిస్తుందని అంతా భావించారు. అయితే టీడీపీ విజయం సాధించింది కానీ అంచనాలను అందుకంటూ ఘన విజయమైతే సాధించలేదనే చెప్పాలి. మున్సిపల్, పంచాయితీ ఎన్నికల్లో ఒంటరిగా పోటీచేసి స్వీప్ చేసిన టీడీపీ.. మరి సాధారణ ఎన్నికల్లో పవన్ బలం తోడైనా వైసీపీని ఎందుకు చిత్తుగా ఓడించలేకపోయింది?. దీన్నిబట్టే అర్థం చేసుకోవచ్చు. పవన్ గెలుపుని డిసైడ్ చేయలేదని. అదేవిధంగా పవన్ చెప్పాడని ఆయన సామాజికవర్గ ఓట్లన్నీ గంప గుత్తుగా టీడీపీకి పడ్డాయనే అభిప్రాయం కూడా సరైనది కాదు. తమ సామాజికవర్గానికి చెందిన వ్యక్తి చెప్పాడని.. ఆ సామాజికవర్గమంతా ఒకే పార్టీకి ఓటేస్తుందా? అంటే డౌటే. గత ఎన్నికల్లో కూడా పవన్ సామాజికవర్గం ఓట్లన్నీ కేవలం టీడీపీకే పడలేదు. టీడీపీ, వైసీపీలకు దాదాపు సమానంగానే పడ్డాయి. అంతెందుకు పవన్ సామాజికవర్గం బలంగా ఉన్న ఒక నియోజకవర్గంలో ఇండిపెండెంట్ విజయం సాధించాడు. మరి పవన్ సామాజికవర్గం ఓట్లన్నీ టీడీపీకి పడితే అక్కడ ఇండిపెండెంట్ ఎలా గెలిచాడు?. దీన్నిబట్టే అర్థంచేసుకోవచ్చు. పవన్ చెప్పాడని వారంతా ఏకపక్షంగా టీడీపీ వైపు చూడలేదని. మరి ఇప్పుడు పవన్ ఒంటరిగా అన్ని స్థానాల్లో బరిలోకి దిగుతాం అంటున్నారు. పవన్ వెంట ఆయన సామాజికవర్గమంతా ఉండకపోవొచ్చు. కానీ దాదాపు 60 శాతం ఉండే అవకాశముంది. అంటే మిగిలిన 40 శాతం ఓట్లను టీడీపీ, వైసీపీ పంచుకోవాలి. గత ఎన్నికల్లో చెరి 50 శాతం పంచుకున్న టీడీపీ,వైసీపీ.. ఈసారి చెరి 20 శాతం పంచుకోవాలి. అంటే పవన్ ఒంటరిగా పోటీ చేయడం వల్ల ఆయన సామాజికవర్గం ఓట్లు రెండు పార్టీలకు సమానంగా దూరమయ్యే అవకాశముంది. దీనివల్ల టీడీపీకి ఎంత నష్టమో వైసీపీకి కూడా అంతే నష్టం జరుగుతుంది.

టీఆర్ఎస్ లో కొత్త డౌట్స్.. హరీష్ రావుని పక్కన పెడుతున్నారా?

  టీఆర్ఎస్ పార్టీలో హరీష్ రావుకి ట్రబుల్ షూటర్ గా ఎంత పేరుందో.. పార్టీలో ట్రబుల్స్ ఫేస్ చేస్తున్నారని కూడా అంతే వార్తలు వినిపిస్తాయి. అసెంబ్లీ ఎన్నికలకు ముందు.. హరీష్ రావు టీఆర్ఎస్ లో ఇమడలేకపోతున్నారని, ఏ క్షణంలోనైనా ఆయన టీఆర్ఎస్ ని వీడతారని విపక్షాలు ఆరోపణలు చేసాయి. కానీ అలాంటిదేం జరగలేదు. టీఆర్ఎస్ లోనే ఉన్నారు. సిద్ధిపేట నుంచి లక్షకు పైగా మెజారిటీతో గెలిచి రికార్డు సృష్టించారు. అంతేనా రేవంత్ రెడ్డి, డి.కె అరుణ వంటి ఎందరో కాంగ్రెస్ సీనియర్ నేతలను హరీష్ రావు తన వ్యూహ చతురతతో మట్టి కరిపించారు. ఇంతవరకు బాగానే ఉంది కానీ ఎన్నికల ఫలితాలు వచ్చిన కొద్దిరోజుల తరువాత మళ్ళీ కొత్త అనుమానాలు మొదలయ్యాయి. ఎన్నికల్లో టీఆర్ఎస్ ఘన విజయం సాధించి అధికారం నిలిబెట్టుకుంది. కేసీఆర్ రెండోసారి సీఎం గా ప్రమాణ స్వీకారం చేసారు. అంతేనా జాతీయ రాజకీయాల మీద దృష్టి పెడుతున్న కేసీఆర్.. టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేటీఆర్ ని నియమించి పార్టీ బాధ్యతలు అప్పగించారు. మరి హరీష్ రావు పరిస్థితి ఏంటి? ఆయనకు మంత్రివర్గంలోనైనా చోటు దక్కుతుందా? అంటూ హరీష్ వర్గంలో ఆందోళన మొదలైంది. దీనికి తగ్గట్టే కేసీఆర్.. హరీష్ రావుని పార్లమెంట్ కి పంపాలని చూస్తున్నారంటూ వార్తలు మొదలయ్యాయి. అయితే ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే హరీష్ రావుని నిజంగానే రాష్ట్ర రాజకీయాలకు దూరం చేస్తున్నారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం కేసిఆర్ ప్రాజెక్టుల బాట పట్టారు. ప్రాజెక్టు పనులు మరింత వేగవంతం చేసేందుకు సమీక్షలతో వేగం పెంచుతున్నారు. రెండు రోజులపాటు హెలిక్యాప్టర్ మీద కాళేశ్వరం సహా గోదావరిపై నిర్మిస్తున్న ప్రాజెక్టులన్నీ కలియదిరిగారు. ఈ టూర్ లో కేసిఆర్ తో పాటు పలువురు అధికారులు, నేతలు ఉన్నారు. అయితే హరీష్ రావు మాత్రం మిస్ అయ్యారు. హరీష్ రావు మిస్ అవడం వెనుక కారణాలేంటని పార్టీలో చర్చలు జరుగుతున్నాయి. కొందరైతే కావాలనే హరీష్ రావుని పక్కన పెడుతున్నారనే అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నారు. ‘హరీష్ రావు మొన్నటి వరకు తెలంగాణ ఇరిగేషన్ శాఖకు మంత్రిగా పనిచేశారు. ఆయన రాత్రింబవళ్లు ప్రాజెక్టుల నిర్మాణాన్ని పరుగులు పెట్టించారు. రాత్రిపూట ప్రాజెక్టుల వద్దే నిద్రించి మంత్రుల పని తీరులో కొత్త ఒరవడి సృష్టించారు. ఆయన మంత్రిగా ఉన్న కాలంలో ఎక్కువ సమయం ప్రాజెక్టుల వద్దే ఉన్నారు. మరి అటువంటి నాయకుడు, సీఎం కేసిఆర్ ప్రాజెక్టుల టూర్ లో ఉండకపోవడం పెద్ద వెలితి కాదా? ’ అని కొందరు నేతలు అభిప్రాయపడుతున్నారు. ప్రాజెక్టుల నిర్మాణ బాధ్యతలు ఇంతకాలం భుజాన మోసినందున ఆయనను కూడా ఈ టూర్ లో ఇన్వాల్వ్ చేసి ఉంటే మరింత ఉపయోగకరంగా ఉండేది కదా? అని కొందరు పార్టీ నేతలు చర్చించుకుంటున్నారు. మరి హరీష్ రావును కేసిఆర్ ఈ టూర్ కు పిలవలేదా? లేదంటే పిలిచినా ఆయన రాలేదా అన్నది తేలాల్సి ఉంది. అయితే ఈ వ్యవహారంపై సోషల్ మీడియాలో మాత్రం విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 'కాళేశ్వరం ప్రాజెక్ట్ ని నిర్మిస్తున్న వేగం కంటే హరీష్ రావుని పక్కన పెడుతున్న వేగమే ఎక్కువ' అంటూ ఛలోక్తులు వినిపిస్తున్నాయి. మరి ఈ అనుమానాలకు టీఆర్ఎస్ ఎలా చెక్ పెడుతుందో చూడాలి.

కాంగ్రెస్ కి తలపోటు తెప్పిస్తున్న సినిమా.. బీజేపీ ఫుల్ హ్యాపీ

  లోక్ సభ ఎన్నికలకు ముందు సెమీఫైనల్స్ గా భావించిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మూడు రాష్ట్రాల్లో విజయం సాధించి అధికారం దక్కించుకుంది. ఇదే ఉత్సాహంతో లోక్ సభ ఎన్నికల్లో బీజేపీని ఢీ కొట్టేందుకు సిద్ధమవుతోంది. అయితే ఇప్పుడు ఒక్క సినిమా ఒకేఒక్క సినిమా కాంగ్రెస్ పార్టీని బాగా ఇబ్బంది పెడుతోంది. అదే ‘ది యాక్సిడెంటల్‌ ప్రైమ్‌ మినిస్టర్‌’. ప్రధానమంత్రి మీడియా సలహాదారుగా పనిచేసిన సంజయ్ బారు రాసిన 'యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్' పుస్తకం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ అయింది. ఈ ట్రైలర్ మన్మోహన్ సింగ్ కు, కాంగ్రెస్ పార్టీకి మచ్చ తెచ్చేలా ఉంది. మన్మోహన్ సింగ్ ని ప్రధాని కుర్చీలో కూర్చోబెట్టి తెరవెనుక సోనియా గాంధీ ప్రధానిగా వ్యవహరించినట్లు చూపించారు. మన్మోహన్ తను నిర్ణయాలు తీసుకోవాల్సిన సందర్భాల్లో కూడా ఆయన నిర్ణయాలు తీసుకోవడానికి ఇష్టపడలేదని.. సోనియా చెప్పినట్టు చేయడానికే ప్రాధాన్యత ఇచ్చారని ట్రైలర్ లో చూపించారు. ఇవన్నీ సంజయ్ బారు రాసిన పుస్తకంలో ఉన్నవే. అయితే పుస్తకం చదివినవారు తక్కువుంటారు. కానీ ఇప్పుడు ఈ సినిమా లక్షలు, కోట్ల మందికి చేరే అవకాశముంది. దీనివల్ల మన్మోహన్ కి, కాంగ్రెస్ పార్టీకి దెబ్బే. అందుకే కాంగ్రెస్ ఈ సినిమాను చాలా సీరియస్ గా తీసుకుంది. సినిమాను విడుదలకు ముందే తమకు చూపించాలంటూ కాంగ్రెస్‌ నేతలు డిమాండ్‌ చేస్తున్నారు. ‘ట్రైలర్‌ను చూస్తుంటే నిజాన్ని వక్రీకరించినట్లు అనిపిస్తోంది. దీని వల్ల మా పార్టీ ప్రతిష్ఠకు భంగం కలుగుతోంది. అందుకే సినిమాను ముందే ప్రదర్శించాలి. అభ్యంతరకర దృశ్యాలుంటే వాటిని తొలగించాలి. లేదంటే దేశవ్యాప్తంగా విడుదలను అడ్డుకుంటాం’ అని కాంగ్రెస్‌ నేతలు హెచ్చరిస్తున్నారు. మరోవైపు బీజేపీ మాత్రం పండగ చేసుకుంటుంది. ఈ సినిమా ట్రైలర్‌ను బీజేపీ తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేస్తూ కాంగ్రెస్‌పై విమర్శలు గుప్పించింది. ‘10 ఏళ్ల సుదీర్ఘకాలం పాటు ఓ కుటుంబం చేతిలో దేశం ఎలా దోపిడీకి గురైందో చూపించే కథ ఇది. వారసుడు సిద్ధమయ్యేంతవరకు ఓ ప్రతినిధిలా మన్మోహన్‌ సింగ్‌ ప్రధాని కుర్చీలో కూర్చున్నారా? ‘ది యాక్సిడెంటల్‌ ప్రైమ్‌ మినిస్టర్‌’ ట్రైలర్‌ను చూడండి. జనవరి 11న సినిమా విడుదలవబోతోంది’ అని ట్వీట్ లో పేర్కొంది. లోక్ సభ ఎన్నికల ముందు ఈ సినిమా కీలక పాత్ర పోషించేలా ఉంది. ఈ సినిమా రీలీజ్ అయితే కాంగ్రెస్ కి ఎంత మైనస్సో, బీజేపీ అంత మైలేజ్ వచ్చేలా కనిపిస్తోంది. అసలు ఈ సినిమా వెనుక బీజేపీ హస్తం ఉందనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. మరి కాంగ్రెస్ ఈ సినిమా నుంచి ఎలా తప్పించుకుంటుందో చూడాలి.

కేసీఆర్ కే నా ఓటు.. షాక్ లో కాంగ్రెస్, చంద్రబాబు

  ఓ వైపు చంద్రబాబు బీజేపీయేతర ఫ్రంట్‌ అంటూ కాంగ్రెస్ తో కలిసి నడుస్తూ మిగతా పార్టీలను ఏకం చేయాలని చూస్తుంటే.. మరోవైపు కేసీఆర్ బీజేపీయేతర, కాంగ్రెసేతర ఫ్రంట్ అంటూ ప్రాంతీయ పార్టీలను ఏకం చేయాలని చూస్తున్నారు. కేసీఆర్‌ ఫెడరల్‌ ఫ్రంట్‌ ప్రయత్నాల్లో భాగంగా ఇప్పటికే నవీన్‌ పట్నాయక్‌, మమతా బెనర్జీలను కలిశారు. వారు ఇంకా తమ వైఖరిపై స్పష్టత ఇవ్వలేదు కానీ.. సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్‌ యాదవ్‌ మాత్రం ఇంకా కేసీఆర్ తో భేటీ కూడా కాకుండానే కేసీఆర్‌ ఫ్రంట్‌ కు మద్దతు ప్రకటించారు. తాజాగా అఖిలేశ్‌ యాదవ్‌ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. ‘బీజేపీని ఢీకొనేందుకు ఫెడరల్‌ ఫ్రంట్‌ ఏర్పాటు దిశగా కృషి చేస్తున్న కేసీఆర్‌కు అభినందనలు. కేసీఆర్‌ను కలిసేందుకు త్వరలో హైదరాబాద్‌ వెళుతున్నా. ఆయన దేశంలోని ప్రాంతీయ పార్టీలన్నింటినీ ఒక వేదిక మీదకు తీసుకొచ్చేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నారు’ అని కొనియాడారు. తాను కేసీఆర్‌తో ఫోన్లో మాట్లాడానని, 25-26 తేదీల్లో ఢిల్లీలో ఆయనతో భేటీ కావాల్సి ఉందని, వివిధ కారణాల వల్ల ఢిల్లీకి రాలేకపోయానని అఖిలేశ్‌ యాదవ్‌ చెప్పారు. గతంలో కాంగ్రెస్ పార్టీతో దోస్తీ చేసిన అఖిలేశ్ యాదవ్ ఈ మధ్య కాంగ్రెస్ కు దూరం జరుగుతూ వస్తున్నారు. యూపీలో బీఎస్పీ తో కలిసి పోటీ చేసి.. కాంగ్రెస్‌ను యూపీలో అమేథీ, రాయ్‌బరేలీ సీట్లకే పరిమితం చేయాలని చూస్తున్నారు. కానీ కాంగ్రెస్ మాత్రం ఎస్పీ, బీఎస్పీ లతో కలిసి పనిచేయాలనుకుంటుంది. దేశ రాజకీయాల్లో క్రియాశీల పాత్ర పోషించాలని చూస్తున్న అఖిలేశ్ యాదవ్, మాయావతి.. కాంగ్రెస్ ను దూరం పెడుతున్నారు. అందుకేనేమో రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌లలో కాంగ్రెస్‌ ప్రభుత్వాల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆహ్వానించినా ఎస్పీ, బీఎస్పీల అధినేతలు హాజరు కాలేదు. ఇప్పుడు అఖిలేశ్ యాదవ్ అనూహ్యంగా కేసీఆర్ ఫ్రంట్ కు మద్దతు ప్రకటించి అటు కాంగ్రెస్ కు, ఇటు చంద్రబాబుకి బిగ్ షాక్ ఇచ్చారు.

కేసీఆర్.. హరీష్ రావుని రాష్ట్ర రాజకీయాలకు దూరం చేస్తున్నారా?

  కేసీఆర్ వ్యూహాలు రచించడంలో దిట్ట. ప్రత్యర్థుల ఊహలకు అందకుండా ఎత్తులు పైఎత్తులు వేస్తారు. విజయం సాధిస్తారు. ఇప్పటికే ఈ విషయం పలు సందర్భాల్లో రుజువైంది. ఎన్నికలకు కొన్ని నెలల ముందే అసెంబ్లీ రద్దు చేసి ముందస్తుకు వెళ్లి విపక్షాలకు షాక్ ఇచ్చారు. భారీ విజయం సాధించి అంతకన్నా పెద్ద షాక్ ఇచ్చారు. అంతకముందు నుంచే జాతీయస్థాయిలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు ప్రత్యాన్మాయంగా ఫెడరల్ ఫ్రంట్ అంటూ హడావుడి చేసిన కేసీఆర్.. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాస్త సైలెంట్ అయ్యారు. ఇప్పుడు ఎన్నికలు అయిపోయాయి, పార్టీ కూడా ఘన విజయం సాధించింది. దీంతో ఉత్సాహంగా జాతీయ రాజకీయాలవైపు మళ్ళీ అడుగులు మొదలు పెట్టారు. దానిలో భాగంగానే తనయుడు కేటీఆర్ ని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమించి పార్టీ బాధ్యతలు అప్పగించారు. అయితే ఇక్కడినుంచే కేసీఆర్ మార్క్ వ్యూహాలు మొదలు కాబోతున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల తరువాత కేటీఆర్ ని సీఎం చేసి.. కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్తారంటూ ఎప్పటినుంచే వార్తలు వినిపించాయి. దానికి తగ్గట్టే ఎన్నికల్లో విజయం సాధించిన వెంటనే కేటీఆర్ ని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేసీఆర్ నియమించారు. అంతా అనుకున్నట్లు జరిగితే త్వరలో సీఎంని చేసే అవకాశం కూడా ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కేసీఆర్ నిర్ణయాన్ని పార్టీ నేతలు ఎవరూ వ్యతిరేకించే అవకాశం లేదు. కానీ హరీష్ రావు వర్గం మాత్రం అసంతృప్తి వ్యక్తం చేసే అవకాశముంది. హరీష్ రావు మొదటి నుంచి పార్టీ కోసం కష్టపడి పనిచేసారు. పార్టీలో బలమైన నేతగా ఎదిగారు. ఆయన రాష్ట్రవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నారు. అంతేకాకుండా మొన్న జరిగిన ఎన్నికల్లో లక్షకు పైగా మెజారిటీ సాధించి చరిత్ర సృష్టించారు. మరి ఇలాంటి బలమైన నేత వర్గం అసంతృప్తిలో ఉంటే పార్టీకి నష్టం తప్పదు. ఆ అసంతృప్తి తారాస్థాయికి చేరితే పార్టీలో చీలిక వచ్చే ప్రమాదం కూడా ఉంది. అందుకే కేసీఆర్ తనతో పాటు హరీష్ రావుని కూడా జాతీయ రాజకీయాల్లోకి తీసుకెళ్లాలి అనుకుంటున్నారట. ఇలా చేస్తే కేటీఆర్ కు లైన్ క్లియర్ అయినట్లు ఉంటుంది. అలాగే జాతీయస్థాయిలో రాజకీయం చేయడానికి హరీష్ రావు లాంటి బలమైన నేత తనకి తోడు ఉన్నట్లు ఉంటుందని కేసీఆర్ భావిస్తున్నారట. నాలుగు నెలల్లో లోక్ సభ ఎన్నికలు జరగనున్నాయి. ఆ ఎన్నికల్లో కేసీఆర్ ఎంపీ గా పోటీ చేయనున్నారు. ఆయనతో హరీష్ రావుని కూడా ఎంపీగా బరిలోకి దించాలని చూస్తున్నారట. చూద్దాం మరి రాబోయే రోజుల్లో కేసీఆర్ ఎలాంటి వ్యూహాలతో మందికి వెళ్తారో.

'చంద్రగిరి' పై చంద్రన్న కన్ను

  ఏపీ సీఎం చంద్రబాబు స్వంతగ్రామం నారావారి పల్లె ఉన్న చంద్రగిరి నియోజకవర్గంలో ఈసారి ఎలాగైనా టీడీపీ జెండా ఎగరెయ్యాలని ప్రయత్నాలు మొదలుపెట్టారు. చిత్తూరు జిల్లాలో చంద్రగిరికి ప్రత్యేక గుర్తింపు ఉంది. హేమాహేమీలైన నేతలు ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించారు. ఈ నియోజకవర్గం నుంచి చంద్రబాబు 1978లో కాంగ్రెస్ పార్టీ పక్షాన పోటీచేసి గెలిచారు. ఎమ్మెల్యేగా చట్టసభలోకి అడుగుపెట్టారు. తెలుగుదేశం పార్టీని ఎన్‌టీఆర్ స్థాపించిన తర్వాత జరిగిన 1983, 1985, 1994 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్ధులు చంద్రగిరిలో విజయం సాధించారు. 1989, 1999, 2004, 2009 ఎన్నికల్లో కాంగ్రెస్‌పార్టీ తరఫున గల్లా అరుణకుమారి నాలుగుసార్లు గెలుపొందారు. 2014లో ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీచేసిన చెవిరెడ్డి బాస్కర్‌రెడ్డి చంద్రగిరిని కైవసం చేసుకున్నారు. నాటి ఎన్నికల్లో కాంగ్రెస్‌కి గుడ్‌బై చెప్పి టీడీపీలో చేరి పోటీచేసిన గల్లా అరుణకుమారిని ఆయన ఓడించారు. గల్లా అరుణకుమారి కాంగ్రెస్ పార్టీ నుంచి టీడీపీలో చేరటంతో స్థానికనేతలు ఆమెకు సహకరించలేదనే అభిప్రాయం అప్పట్లో వ్యక్తమయ్యింది. దీంతో గత ఎన్నికల్లో ఆమె ఓటమి పాలయ్యారు.   ఈ నేపథ్యంలో చంద్రబాబు ఈ దఫా ఎన్నికలపై సీరియస్‌గా దృష్టిపెట్టారు. గత అనుభవం పునరావృతం కాకూడదని భావించారు. అందుకే చంద్రగిరిలో ముందస్తుగా టీడీపీ అభ్యర్థిని ప్రకటించారు.  గల్లా అరుణకుమారి కూడా వచ్చేఎన్నికల్లో చంద్రగిరి నుంచి పోటీచేయడానికి ససేమిరా అనటంతో కొత్త అభ్యర్థిని పోటీకి దింపాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ తరుణంలో అనేక కోణాల్లో బాబు ఆలోచించారు. చివరికి జిల్లాలో యువనేత, టీడీపీ జిల్లా అధ్యక్షుడయిన పులివర్తి నానిని చంద్రగిరి అభ్యర్థిగా బాబు ప్రకటించారు. రాజకీయ కుటుంబానికి చెందిన నాని వార్డు మెంబరు స్థాయినుంచి ఎదిగారు. 2001లో పులివర్తివారిపల్లెకు సర్పంచ్‌గా ఎన్నికయ్యారు. టీడీపీ తెలుగు యువత జిల్లా అధ్యక్షుడిగా పనిచేశారు. పార్టీ అధికారంలో ఉన్నా లేకున్నా టీడీపీ బలోపేతానికి అలుపెరుగని కృషిచేశారు. ఈ తరుణంలోనే ఆయనపై చంద్రబాబు దృష్టిపడింది. పైగా మంత్రి నారా లోకేశ్‌కు నాని వీరవిధేయుడు. పార్టీ కార్యాలయంలోనే పులివర్తి నాని ఎక్కువ సమయం గడుపుతారు. పార్టీ కార్యకర్తలకు, ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటారు. సమస్యల పరిష్కారం కోసం పాటుపడతారు. ఈ అర్హతల రీత్యా చంద్రబాబుకు నానిపై నమ్మకం పెరిగింది. ఆయన అయితేనే చెవిరెడ్డిపై పోటీచేసి గెలవగల అభ్యర్థి అని చంద్రబాబు భావించారు. చంద్రగిరి అభ్యర్థిగా బాబు తన పేరు ప్రకటించటంతో నాని తన మార్క్‌ రాజకీయం ప్రారంభించారు. నియోజకవర్గంలో చిన్నాచితకగా ఉన్న అసంతృప్తులను కూడగడుతున్నారు. వారిని ఒక తాటిపైకి తీసుకువస్తున్నారు. నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో తిరుగుతున్నారు. ప్రజాసమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు. సూటిగా చెప్పాలంటే ఎన్నికల ప్రచారంలోకే ఆయన దిగేశారు. సందర్భం దొరికినప్పుడల్లా వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి వ్యవహారశైలిపై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. మరి చెవిరెడ్డి బాస్కర్‌రెడ్డి వ్యూహాత్మక రాజకీయాలకు పెట్టింది పేరు. ఈ నేపథ్యంలో చంద్రగిరిలో చంద్రన్న నిర్ణయం వర్కౌట్ అవుతుందో లేదో వేచి చూద్దాం...!!