how is the ys jagan ruling as ap cm

జగన్ నెల రోజుల పాలన.. హిట్టా? ఫట్టా?

  రాష్ట్ర విభజన తరువాత మొదటిసారి జరిగిన ఎన్నికల్లో టీడీపీ అధినేత చంద్రబాబుకి పట్టంకట్టిన ఏపీ ప్రజలు.. రెండోసారి వైసీపీ అధినేత వైఎస్ జగన్ కు పట్టంకట్టారు. జగన్ ఏపీ సీఎంగా మే 30 న ప్రమాణం స్వీకారం చేసారు. అంటే జగన్ సీఎంగా ప్రమాణం చేసి నెల రోజులు పూర్తయింది. మరి జగన్ మొదటి నెలరోజుల పాలన ఎలా ఉంది?. బాబుని కాదనుకొని ఒక్క ఛాన్స్ ఇచ్చిన ఏపీ ప్రజల మనసు జగన్ గెలుచుకున్నారా? మొదటి నెలరోజుల పాలనలో బాబు కంటే మెరుగ్గా పాలించారా? వంటివి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 2014 లో టీడీపీ అధికారంలోకి వచ్చినప్పుడు సీఎంగా బాబు ప్రమాణస్వీకారం చేయడానికన్నా ముందే.. కేంద్రాన్ని ఓ విషయంలో పట్టుబట్టారు. తెలంగాణలోని 7 పోలవరం ముంపు మండలాలను ఏపీలో కలిపితేనే సీఎంగా ప్రమాణం చేస్తానన్నారు. అనుకున్నది సాధించారు. పోలవరం ముంపు మండలాల విషయంలో విజయం సాధించిన బాబు.. సీఎం హోదాలో తొలి సంతకాలు చేసిన కొన్ని అంశాలపై మాత్రం పూర్తిగా విజయం సాధించలేకపోయారనే చెప్పాలి. సీఎంగా ప్రమాణం చేసిన బాబు అప్పుడు ఐదు ఫైళ్లపై సంతకాలు చేశారు. తొలి సంతకం.. రైతు రుణాలు, డ్వాక్రా రుణాలు, చేనేత రుణ మాఫీ ఫైలుపై సంతకం చేసారు. అయితే ఇవి ఐదేళ్లల్లో పూర్తిస్థాయిలో జరగలేదనే చెప్పాలి. రెండో సంతకం.. వృద్ధులు, వితంతువులకు రూ. 1000 పెన్షన్, వికలాంగులకు రూ. 1500 పెన్షన్ ఫైలుపై చేసారు. ఈ విషయంలో బాబు మాట నిలబెట్టుకున్నారు. అంతేకాదు తరువాత పెన్షన్ ని రెట్టింపు కూడా చేసారు. మూడో సంతకం.. అన్ని గ్రామాలకు తాగునీరు అందించే 'ఎన్టీఆర్ సుజల స్రవంతి' పథకం ఫైలుపై చేసారు. రూ.2 కే 20 లీటర్ల మినరల్ వాటర్ అందించాలనే ఉద్దేశంతో ఈ పథకానికి శ్రీకారం చుట్టారు. కానీ ఈ పథకం పూర్తిస్థాయిలో ఆచరణ సాధ్యం కాలేదు. నాలుగో సంతకం.. బెల్టు షాపుల రద్దు ఫైలుపై చేసారు. ఈ విషయంలో బాబు విఫలమయ్యారనే చెప్పాలి. ఇక ఐదో సంతకం.. ఉద్యోగులకు రిటైర్మెంట్ వయస్సు 58 నుంచి 60 ఏళ్లకు పెంచే ఫైలుపై సంతకం చేశారు. ఈ విషయంలో బాబు మాట నిలబెట్టుకున్నారు. బాబు ఐదేళ్ల పాలన చూసాం కాబట్టి తొలి ఐదు సంతకాల అంశాలు నెరవేర్చారో లేదో ఓ స్పష్టత ఉంది. అయితే జగన్ సీఎంగా బాధ్యతలు తీసుకొని నెలరోజులే అవుతుంది కాబట్టి.. ఈ నెల రోజుల్లో ఆయన తీసుకున్న నిర్ణయాలు, చర్యలు గురించి ప్రధానంగా చర్చిద్దాం.  సీఎంగా ప్రమాణం చేసిన జగన్.. రూ.2000 ఉన్న పెన్షన్ ను రూ.2250 కు పెంచుతూ తొలి సంతకం చేసారు. అయితే ఈ విషయంలో జగన్ కాస్త విమర్శలు ఎదుర్కొన్నారు. ఎందుకంటే వైసీపీ మేనిఫెస్టోలో పెన్షన్ రూ.3000 లకు పెంచుకుంటూ పోతామని క్లియర్ గా రాసినప్పటికీ, ఎన్నికల ప్రచారంలో మాత్రం పెన్షన్ రూ.3000 చేస్తామని పదేపదే చెప్పారు. దీంతో ప్రజలు జగన్ సీఎం కాగానే పెన్షన్ రూ.3000 చేస్తారనుకున్నారు. తీరా సీఎం అయ్యాక మేనిఫెస్టోలో రాసినట్టే పెంచుకుంటూ పోతామని సంతకం చేసారు. దీంతో కాస్త విమర్శలు ఎదురయ్యాయి. జగన్ తన మంత్రివర్గంలో అన్ని సామజిక వర్గాలకు ప్రాధాన్యం ఇవ్వడంతో ప్రశంసలు అందుకున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు మంత్రివర్గంలో 50 శాతం చోటు కల్పించారు. దళిత మహిళను హోంమంత్రిగా నియమించారు. ఇక అమ్మఒడి పథకంపై కొన్ని విమర్శలు ఎదురైనప్పటికి జగన్ కి ఈ విషయంలో మంచి మార్కులు పడ్డాయనే చెప్పాలి. పాఠశాలకు కి పిల్లల్ని పంపే ప్రతి తల్లికి ఏడాదికి రూ.15 వేలు ఇస్తామని జగన్ ప్రకటించారు. అయితే ఈ పథకం కేవలం ప్రభుత్వ పాఠశాలలకే వర్తిస్తుందని కొందరు నేతలు చెప్పడంతో.. పెన్షన్ లో మెలిక పెట్టినట్టే ఈ పథకంలో కూడా మెలిక పెట్టారంటూ విమర్శలు వచ్చాయి. దీంతో తరువాత మళ్ళీ ఏ పాఠశాలలో చదివినా వర్తిస్తుందని నేతలు చెప్పుకొచ్చారు. అయితే విశ్లేషకులు మాత్రం ఈ పథకాన్ని  ప్రభుత్వ పాఠశాలలకే పరిమితం చేయడం కూడా మంచిదని అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే జగన్  ప్రభుత్వ పాఠశాలలను ప్రక్షాళన చేస్తానని, రెండేళ్లలో వాటి రూపు రేఖలే మారిపోతాయని చెప్తున్నారు. అందుకే ఆ పథకాన్ని ప్రభుత్వ పాఠశాలలకే పరిమితం చేస్తే.. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరిగే అవకాశముందనేది విశ్లేషకుల భావన. అంతేకాదు ప్రైవేట్ పాఠశాలల్లో చదివిన వారికి కూడా పథకం వర్తిస్తే.. బడ్జెట్ మరింత భారమవుతుందని అభిప్రాయపడుతున్నారు. మరి ఈ విషయంలో జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి. అదేవిధంగా పార్టీ ఫిరాయింపుల విషయంలో జగన్ తీసుకున్న నిర్ణయం అభినందనీయం. ఫిరాయింపులను ప్రోత్సహించనని, ఒకవేళ ఇతర పార్టీ ఎమ్మెల్యేలు తమ పార్టీలో చేరాలనుకుంటే.. కచ్చితంగా రాజీనామా చేసి రావాల్సిందేనని అసెంబ్లీ సాక్షిగా ప్రకటించి.. ప్రశంసలు అందుకున్నారు. ఇక ఈ నెల రోజుల్లో జగన్ ని బాగా ఇబ్బంది పెట్టిన అంశం ఏదైనా ఉందా అంటే ప్రత్యేకహోదా అనే చెప్పాలి. జగన్ హోదా విషయంలో మొదటి నుంచి దృఢ నిశ్చయంతో ఉన్నారు. హోదా వచ్చే వరకు పోరాడతామని చెబుతూ వస్తున్నారు. అయితే సీఎం అయ్యాక మాత్రం కేంద్రంలో బీజేపీకి పూర్తీ మెజారిటీ ఉందని, బ్రతిమాలడం తప్ప గట్టిగా అడగలేం అన్నట్టుగా మాట్లాడారు. దీనికి తోడు బీజేపీ హోదా ఇచ్చేది లేదని తేల్చి చెప్పింది. దీంతో జగన్ హోదా విషయంలో ఎలాంటి అడుగులు వేస్తారోనన్న ఆసక్తి నెలకొంది. అవినీతిరహిత పాలన అందించడమే తమ ప్రధాన లక్ష్యమని చెబుతున్న జగన్.. గత ప్రభుత్వ అవినీతిపై కేబినెట్ సబ్ కమిటీని కూడా వేశారు. అంతేకాదు అక్రమ కట్టడాలపై చర్యలు అంటూ.. ఏకంగా గత ప్రభుత్వం నిర్మించిన ప్రజావేదికనే కూల్చేసి సంచలం సృష్టించారు. అయితే ఈ విషయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. కొందరు ప్రజాధనాన్ని వృథా చేసారని విమర్శించారు. అయితే కొందరు మాత్రం.. 'మార్పు మననుంచే మొదలు కావాలి అంటారు. అందుకే జగన్ మొదట ప్రభుత్వ అక్రమ కట్టడాన్ని కూల్చేసి, తరువాత మిగతా అక్రమ కట్టడాలపై దృష్టి పెట్టారు.' అంటున్నారు. అదేవిధంగా తెలంగాణ సీఎం కేసీఆర్ తో జగన్ సన్నిహితంగా ఉంటూ.. నీళ్ల పంపకం, విభజన సమస్యలు పరిష్కారానికి అడుగులు వేస్తున్నారు. మరి ముందు ముందు జగన్ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో, ఎలాంటి అడుగులు వేస్తారో చూడాలి.

PM Modi Strategies On Jamili Elections

జమిలీ వెనుక మెయిన్ రీజన్...మోడీ ఏజ్ ఫ్యాక్టర్ ?

మోడీ రెండో సారి అధికారం చేపట్టిన తర్వాత ఒక అఖిలపక్ష భేటీ ఏర్పాటు చేసి పార్లమెంట్‌లో ప్రాతినిధ్యం ఉన్న ప్రతీ పార్టీ అధ్యక్షుడ్ని ఆహ్వానించారు. మొత్తం ఐదు అంశాలు ఎజెండాగా చెప్పినప్పటికీ అసలు విషయం మాత్రం జమిలీ ఎన్నికలు అనేది అప్పటికే అందరికీ అర్ధం అయ్యే ఉంటుంది.  ఒకే దేశం - ఒకే ఎన్నికలు అనే నినాదాన్ని భాజపా చాలా కాలంగా వినిపిస్తోంది. వాస్తవానికి జమిలి ఎన్నికలు నిర్వహణ మీద గతంలోనూ బిజెపి పాలనలోనే న్యాయశాఖ 1999లో జమిలికి జై కొట్టగా 2015లో పార్లమెంటు స్థాయి కమిటీ కూడా జమిలికి మద్దతుగా ఎన్నికల సంఘానికి ప్రతిపాదనలు పంపింది.  మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో సగానికి సగం రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు కూడా జరిపేసిజమిలీ ఎన్నికలు నిర్వహించాలని అనుకున్నారు. అందు కోసం సాధ్యాసాధ్యాల పరిశీలనకు లా కమిషన్‌ను కూడా నియమించారు. ఆ కమిషన్ అన్ని పార్టీల దగ్గర్నుంచి అభిప్రాయాలు తీసుకుంది. జమిలీ ఎన్నికలు నిర్వహిస్తే  ఎదురయ్యే సవాళ్లు అధిగమించాల్సిన మార్గాలతో నివేదిక సిద్ధం చేసింది. కానీ అప్పటి రాజకీయ పరిస్థితుల్లో బీజేపీని వ్యతిరేకించే ప్రతీ పార్టీ జమిలీ ఎన్నికలను అంగీకరించలేదు. అందుకే జమిలీ లేకుండానే మొన్నటి ఎన్నికలు అయిపోయాయి.  అయితే గతంలో జమిలీ ప్రతిపాదన వచ్చినప్పుడు లా కమిషన్ ముందు. కాంగ్రెస్, సమాజ్ వాదీ పార్టీ , టీడీపీ, బీఎస్పీ సహా పలు పార్టీలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. కానీ ఇప్పుడు కొన్ని పార్టీలు జమిలీ ఎన్నికలను స్వాగతించక తప్పని పరిస్థితి ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఎన్నికలకు ముందు వైసీపీ అధినేత జగన్, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ జమిలీ ఎన్నికలకు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. లా కమిషన్‌కు లిఖితపూర్వకంగా ఈ విషయాన్ని తెలియజేశారు.  అయితే ఇక్కడ అసలు విషయం ఇప్పుడు బయటకి వస్తోంది. జమిలీ ఎన్నికలు నిర్వహించడానికి మూడేళ్లలో కసరత్తు పూర్తి చేసి రెండేళ్ల ముందే దేశవ్యాప్తంగా జమిలీ ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉందని చెబుతున్నారు.  అంటే 2022లో జమిలీ ఎన్నికలు పెట్టొచ్చు. ఆ ఏడాది దాదాపుగా ఎనిమిది రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది. ఆ తర్వాత ఏడాది మరో ఐదు రాష్ట్రాలకు జరగాల్సి ఉంది. 2021లో నాలుగు రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది. అయితే వీటన్నింటినీ కలిపేసి.. 2022లో పెట్టడానికి.. బీజేపీ అంతర్గత కసరత్తు చేస్తోందని తాజా పరిణామాలతో స్పష్టమవుతోంది. జమిలీని పెడితే ఎలాంటి సమస్యలు వస్తాయన్న విషయాల మీద అనేక రకాలుగా పరిశీలన జరుపుతున్నారు అగ్రనేతలు. జమిలీ ఎన్నికలు నిర్వహించాలంటే కొన్ని రాష్ట్రప్రభుత్వాల కాలపరిమితి తగ్గించాలి లేదా పెంచాలి. అలా చేయాలంటే రాజ్యాంగ సవరణ అవసరం.  అందుకే ఆ ప్రయత్నాలకి ఇబ్బంది కలగకుండా రాజ్యసభ సభ్యులను తమ పార్టీలో చేర్చుకుంటున్నారని అంటున్నారు. మొత్తానికి రెండేళ్ల ముందే ఈ సారి ఎన్నికలు వచ్చినా ఆశ్చర్యరం లేదని విశ్లేషకులు అంటున్నారు. నిజానికి దీని వెనుక మోడీ బుర్ర ప్రధానం అని తెలుస్తోంది ! కానీ ఎందుకయ్యా అంటే, తాజాగా బీజేపీ పెద్దలు కొత్త రూల్ ఒకటి తెచ్చారంట. దాని ప్రకారం బీజేపీలో 75 ఏళ్ల పైబడిన ఎవరికీ టిక్కెట్లు ఇవ్వరట. అందుకే మొన్నటి ఎన్నికల్లో అద్వానీ, మురళీ మనోహర్ జోషి, సుష్మా లాంటి వాళ్ళని ఇళ్లకే పరిమితం చేశారు.  అయితే ఇప్పుడు ఇదే రూల్ మోడీ తలకు చుట్టుకునేలా ఉంది. అది ఎలా అంటే ప్రస్తుతం మోడీ వయసు 68, ఆయన లెక్క ప్రకరం మళ్ళీ పోటీ చేస్తే వచ్చే వయసు 73 ఏళ్ళు, అప్పటికి టికెట్ వచ్చినా ఆయనని ప్రధాని పదవి నుండి తప్పుకోమని ఆర్ఎస్ఎస్ అడిగే అవకాశం ఉంది. ఇప్పటికే గడ్కరీ లాంటి నేతలను లైన్ లోకి తెస్తున్న ఆ సంస్థ మళ్ళీ మోడీ అంటే ఇబ్బంది పెట్టచ్చు. అందుకే ఆ అవకాశం ఇవ్వకుండా   2022లో జమిలీ పెడితే ఇంకా నాలుగేళ్ళు ఉంటుందనే కారణంతో మోడీ మళ్ళీ ప్రధాని కావచ్చు. అలా మూడు సార్లు ప్రధానిగా పని చేసి అప్పుడు తప్పుకోవచ్చనేది ఆయన యోచనగా చెబుతున్నారు విశ్లేషకులు. అయితే ఇందులో నిజం ఎంతుందో తెలీదు కానీ ఒక్క మనిషి అధికారం కోసం ఇంత చేయడం దేనికి సంకేతమో మరి ? 

chandrababu naidu security reducing is minus to jagan

చంద్రబాబు భద్రత...అక్రమ కట్టడాలు...జగన్ కి తలనొప్పే !

  నిన్నమొన్నటి దాకా ఏపీలో ప్రజావేదిక హాట్ టాపిక్ గా నిలవగా ఇప్పుడు అందరి దృష్టీ చంద్రబాబు భద్రత మీద పడింది. దానికి ముఖ్య కారణం ఆయన భద్రత తగ్గించడమే. గత పదేళ్ళుగా  ఆయనకు ఒక ఏఎస్పీ, ఒక డీఎస్పీ, ముగ్గురు ఆర్‌ఐ బృందాలతో భద్రత ఉండేదని, ఇప్పుడు కేవలం ఒక షిఫ్టునకు ఇద్దరు కానిస్టేబుళ్లు మిగిలారని, కేవలం కక్షపూరితంగానే ఇలా చేశారనే వాదన వినిపిస్తోంది. గతంలో వైఎస్ మొదటి సారి ముఖ్యమంత్రి కాగానే చంద్రబాబుకు భదత్ర తగ్గించాలని నిర్ణయించి ఎన్‌ఎస్జీ భద్రత కూడా అవసరం లేదంటూ కేంద్రానికి లేఖ రాసారు. అయితే అప్పట్లో టీడీపీ పార్లమెంటరీ నేతగా ఉన్న ఎర్రన్నాయుడు అప్పటి ప్రధాని మన్మోహన్‌సింగ్‌ ను కలిసి ఆయనకు భద్రతా కల్పించాల్సిన విషయం మీద మాట్లాడితే మన్మోహన్‌ వెంటనే భద్రత పునరుద్ధరించడంమే కాక జడ్‌ ప్లస్‌, ఎన్‌ఎ్‌సజీ భదత్ర కల్పించారు.  కానీ జగన్ ఎన్ఎస్జీని ఏమీ చేయలేదు కానీ ఏపీ ప్రభుత్వం కల్పిస్తున్న భద్రతను కుదిస్తూ వస్తున్నారు. చివరికి ఇద్దరు కానిస్టేబుల్స్ ని ఉంచారు. అయితే ఈ విషయం మీద టీడీపీ నేతలు విమర్శలు చేస్తోంటే ఈ భద్రత తగ్గింపు అంశంపై రాష్ట్ర హోంమంత్రి మేకతోటి సుచరిత స్పందించారు. ఏ కేటగిరీ వ్యక్తులకు ఎంత భద్రత కల్పించాలనేది భద్రతా సమీక్ష కమిటీ నిర్ణయిస్తుందన్నారు. ఎవరూ కక్షపూరిత నిర్ణయం తీసుకోలేదని కొందరు కావాలనే రాజకీయం చేస్తున్నారని ఆమె మండిపడ్డారు. చంద్రబాబుకు చట్టపరిధిలోనే భద్రత కేటాయింపు జరుగుతుందని ఆమె స్పష్టం చేశారు. అయితే ఈ భద్రతా తగ్గింపు అనే అంశం మీద జాతీయ స్థాయిలో కూడా చర్చ జరుగుతోంది. మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌ కు కి కూడా మోడీ ప్రభుత్వం సిబ్బందిని తగ్గించింది.  నిజానికి చంద్రబాబుకు జెడ్ ప్లస్ కేటగిరీ, ఎన్ఎస్జీ కమాండోలతో రక్షణ కల్పించడానికి కారణం చంద్రబాబు మీద జరిగిన అలిపిరి హత్యాయత్నం. ఆ రోజున ముఖ్యమంత్రి హోదాలో బ్రహ్మోత్సవాలకు పట్టు వస్త్రాలను తీసుకువెళ్తున్న సమయంలో తిరుమల వెళ్లేముందు అలిపిరిలో ఈ బ్లాస్ట్ చేశారు మావోయిస్ట్ లు. దీంతో ఆనాటి నుండే ఆయనకు ఈ స్థాయి భద్రత కల్పిస్తూ వచ్చింది ప్రభుత్వం. అయితే వైఎస్ అప్పట్లో తగ్గించాలని చూసిన మన్మోహన్ దెబ్బకు వెనక్కి తగ్గారు, మన్మోహన్ ఉన్నంతవరకూ అంతెందుకు మోడీతో ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా చంద్రబాబుకు భద్రతా తగ్గించలేదు కానీ జగన్ ముఖ్యమంత్రి అయిన నాటి నుండే ఈ భద్రతా తగ్గింపు స్పష్టంగా కనిపిస్తోంది. కక్షపూరితంగా చేయట్లేదని చెబుతున్నా అది స్పష్టంగా కనిపిస్తోంది. నిజానికి ఏపీ ప్రభుత్వం చేయడానికి ఎన్నో కార్యక్రమాలు పెండింగ్ లో ఉన్నాయి.  కానీ వాటి సంగతి పక్కన పెట్టి ముందుగా ఈ పని పడతా అన్నట్టు జగన్ చంద్రబాబుని తెలుగుదేశాన్ని, గతంలో ఆ ప్రభుత్వం చేసిన పనుల మీదే మెయిన్ ఫోకస్ పెట్టుకు కూర్చుంది. నిజానికి పోలవరం విషయంలో చంద్రబాబు సర్కార్ ని టార్గెట్ చేయచ్చని జగన్ భావించాడు. కానీ అలాంటి ఛాన్స్ ఇవ్వకుండా కేంద్రం చంద్రబాబు ప్రభుత్వం పంపిన అంచనాలను ఆమోదించింది. ఈ ఘటనతో మింగుడు పడనీ జగన్ ఏదో ఒక విధంగా బాబుని టార్గెట్ చేసే పనిలో ఉన్నాడు. అయితే ఈ విషయంలో టీడీపీ నేతల స్పందన ఎలా ఉన్నా చంద్రబాబు మాత్రం హుందాగా స్పందిస్తున్నారు. ప్రభుత్వానికి తన మీద కోపం ఉండి భద్రత తగ్గిస్తే తగ్గించనివ్వండని,  ప్రజలే నాకు రక్షకులు దేవుడు, ప్రజల ఆశీస్సుల వల్లే అలిపిరి దాడిలో మృత్యువు నుంచి బయటపడ్డానని, తనకు తన భద్రత సమస్య కాదనీ రాష్ట్రంలో సామాన్యుల భద్రత ముఖ్యం అంటూ చెబుతున్నారు.  రాష్ట్రంలో జరుగుతున్న దాడులు, అవాంఛనీయ పరిస్థితుల పట్ల హోం మంత్రి మేకతోటి సుచరిత స్పందిస్తున్న విధానం సరైంది కాదని చంద్రబాబు అభిప్రాయపడ్డారు.  మొన్నటికి మొన్న ఒంగోలులో జరిగిన రేప్ గురించి స్పందిస్తూ ఎన్నో జరుగుతుంటాయి, అంతమాత్రాన ప్రతిచోట ఉండి కాపలా కాయలేం కదా అని ఆవిడ చెప్పుకొచ్చారు. హోంమంత్రే అంటే ఇక సామాన్యుడికి దిక్కెవరని బాబు ప్రశ్నించారు. ఇలాంటి ఘర్షణ వాతావరనం సృష్టించి ఎప్పుడూ ఏదో ఒక విషయం మీద కొట్టుకుంటూ ఉంటే పెట్టుబడులకు అనుకూల వాతావరణం లేదనే భావనతో పరిశ్రమలు రావని, యువతకు ఉపాధి అవకాశాలు నిర్వీర్యమవుతాయని, శాంతిభద్రతల అంశమే పెట్టుబడుల్లో కీలకమని ఆయన అంటున్నారు. ఏపీ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతింటే రాష్ట్ర అభివృద్ధికి తానుచేసిన కృషంతా బూడిదలో పోసిన పన్నీరే అవుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.   అయితే ఇదంతా ఒక ఎత్తు అయితే రాజధాని ప్రాంత రైతులు ఆయనను కలిసేందుకు వచ్చి చేసిన వ్యాఖ్యలు మరో ఎత్తు. చంద్రబాబు మీద నమ్మకంతోనే తాము భూములు ఇచ్చామని ఇప్పుడు ఆయన ఇంటినే కూల్చే పరిస్థితి వస్తే వెలగపూడి, తుళ్లూరు, రావిపూడి గ్రామాల చుట్టుపక్కల ఆయన నివాసానికి స్థలాన్ని ఇచ్చేందుకు సిద్ధమని చెబుతున్నారు. మరి అజేయ కళ్ళం లాంటి సీనియర్ ఐఏఎస్ లను తన సలహాదారులుగా చేర్చుకున్న జగన్ ఇలా కక్షపూరితంగా వ్యవహరిస్తే జరిగే నష్టం గురించి వారితో చర్చించలేదా ? లేక వారు ఏదైనా సలహా ఇచ్చినా జగన్ పట్టించుకోవడం లేదా ? అనే ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి.  ఎక్కడైనా కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం ముందుగా ద్రుష్టి పెట్టేది రాష్ట్ర అభివృద్ధి మీద, కానీ జగన్ ప్రభుత్వం మాత్రం అక్రమం, అవినీతి అంటూ వేరేవాటి మీద ఎక్కువ ఫోకస్ చేస్తోంది. పాజిటివిటీ మీద పనులు చేసుకుంటూ వెళ్ళాల్సింది పోయి, నెగిటివిటీతో జరిగిన పనులను, ఇబ్బంది లేకున్నా అక్రమ కట్టడాల మీద చూపిస్తున్న జులుం ఖచ్చితంగా ఇబ్బంది పెట్టేదే, అది ఇప్పటికిప్పుడు ప్రభావం చూపకపోవచ్చు కానీ, జగన్ కి ఆ ప్రభావం ఖచ్చితంగా అర్ధం అయ్యే రోజు వస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 

overconfidence is the reason for tdp defeat

ఒక పరాజయం 100 తప్పులు.. నంద్యాల వాపును బలుపుగా భావించారా?

  క్రికెట్ టోర్నమెంట్ లో.. లీగుల్లో, సెమీ ఫైనల్లో గెలిచాం కదా అని.. ఫైనల్లో అతి విశ్వాసంతో నిర్లక్ష్యంగా ఆడితే ఆ టీంకి ఓటమి ఎదురయ్యే అవకాశాలున్నాయి. సరిగ్గా టీడీపీ విషయంలో కూడా అలాంటి అతి విశ్వాసమే దెబ్బతీసింది అనిపిస్తోంది. టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో.. ఆ ప్రభుత్వ పనితీరు మీద ప్రజల్లో ఎలాంటి అభిప్రాయం ఉందో తెలుసుకోవడానికి ఉప ఎన్నికలు, స్థానిక ఎన్నికలు రూపంలో చాలా తక్కువ అవకాశాలు వచ్చాయి. అలాంటి వాటిల్లో నంద్యాల ఉపఎన్నిక, కాకినాడ మున్సిపల్ చైర్ పర్సన్ ఎన్నిక ఉన్నాయి. ఆ రెండు ఎన్నికల్లోనూ టీడీపీ విజయం సాధించింది. కానీ ఆ విజయం ఎలా దక్కిందన్నదే ప్రశ్న.  ముఖ్యంగా నంద్యాల ఉప ఎన్నికల్లో గెలుపు కోసం టీడీపీ అన్ని దారులు తొక్కిందని ఆరోపణలు వచ్చాయి. ఆ ఎన్నికల్లో ధన ప్రవాహం ఓ రేంజ్ లో జరిగిందని బహిరంగ రహస్యం. అంటే ఆ ఎన్నికల ఫలితాన్ని బట్టి బాబు సర్కార్ పై ప్రజలు సంతృప్తితో ఉన్నారో లేదో అంచనా వేయలేం. ఇక కాకినాడ మున్సిపల్ ఎన్నిక కూడా అక్కడ స్థానిక నేతల పనితీరు మీద ఎక్కువ ఆధారపడి ఉంటుంది. దీనిని బట్టి కూడా బాబు సర్కార్ పై ప్రజల అభిప్రాయాన్ని అంచనా వేయడం కష్టం. కానీ టీడీపీ మాత్రం ఈ రెండు విజయాలతో.. 2019 ఎన్నికల్లో కూడా తమదే అధికారమని ధీమా వ్యక్తం చేసింది. ముఖ్యంగా నంద్యాల ఉపఎన్నికల ఫలితాన్ని చూసి మాకు తిరుగులేదని అతి విశ్వాసానికి పోయింది. అదే కొంపముంచింది. నంద్యాల ఉపఎన్నికలో ప్రజల నిజమైన నాడిని తెలుసుకోకుండా.. టీడీపీ రకరకాల దారులు తొక్కి గెలిచిందని ఆరోపణలు వచ్చాయి. దానికితోడు ఆ గెలుపుని చూసి ఇక మాకు తిరుగులేదని భ్రమల్లో తేలిపోయిందని అంటున్నారు.

ys jagan master plan on ap special status

జగన్ ప్లాన్ : ప్రజావేదిక మీద ఫోకస్....ప్రత్యేక హోదా మిస్సయ్యింది !

  గత మూడు రోజులుగా ఏపీలో వినిపిస్తున్న ఏకైక న్యూస్ ప్రజావేదిక. మీడియా ఫోకస్ మొత్తం ఆ ప్రజావేదిక కూల్చివేత, దాని మీద ప్రముఖుల స్పందన, పబ్లిక్ టాక్స్ పెడుతూ అదే ఏపీకి జీవన్మరణ సమస్యలాగా కలరింగ్ ఇచ్చింది. దాదపు ప్రజలు కూడా అన్ని విషయాలూ వదిలేసి రెండు వర్గాలుగా విడిపోయి మరీ ఈ విషయాన్ని ఒకరు ఖండిస్తుంటే మరొకరు సమర్దిస్తూ ఇదొక జీవన్మరణ సమస్యలా చేస్తూ వెళ్ళారు. ఏపీ ప్రజల్లో ఇంతగా ఈ విషయం హైలైట్ కావాడానికి కారణం మీడియా అని చెప్పక తప్పదు. అయితే ఈ విషయం మీడియాలో ఇంతగా హైలైట్ కావడానికి కారణం ఏమిటా అని ఆరా తీస్తే అందుకు పలు ఆసక్తికర అంశాలను విశ్లేషకులు విశ్లేషిస్తున్నారు.  ఏపీలో నూతనంగా పాలనా పగ్గాలు చేపట్టి పారదర్శక పాలన అందించే దిశగా అడుగులు వేస్తున్న జగన్ ప్రత్యేక హోదా సాధిస్తారనే భావన ఏపీ ప్రజల్లో ఎర్పడుతూ వచ్చింది. దానికి కారణం ఆయన బీజేపీ అలాగే తెలంగాణా రాష్ట్రంతో వ్యవహరిస్తున్న వైఖరి అనే చెప్పొచ్చు. నిజానికి అధికారంలోకి వచ్చే ముందు వైఎస్ జగన్ ఇచ్చిన హామీల్లో ప్రధానమైనది కూడా ప్రత్యేక హోదానే. ఎలాగైనా ఏపీకి హోదా సాధించి తీరుతామని కేంద్రంలో ఎవరు ప్రత్యేక హోదా ఇస్తే వారికి మద్దతు ఇస్తామని చెబుతూ వచ్చింది. ప్రత్యేక హోదా ఇస్తానంటే కూడా ప్రస్తుత పరిస్థితుల్లో బీజేపీకి టీడీపీ మద్దతు ఇచ్చే అవకాశమే లేదని ప్రత్యేక హోదా ఇవ్వాలంటే అది కేవలం వైసీపీ వలనే సాధ్యమని వైకాపా నేతలు ఎన్నికల ముందు గట్టిగా చెప్పారు.  జనం సైతం వారి మాటల్ని నమ్మి ఓట్లు వేసి గెలిపించారు. కానీ గెలిచిన మరునాడే కేంద్రానికి పరిపూర్ణ బలం ఉంది కాబట్టి ఆ విషయంలో గట్టిగా మాట్లాడలేమని జగన్ వ్యాఖ్యలు చేశారు. బీజేపీకి ఇన్ని సీట్లు రాకుండా ఉండాల్సింది అని ఆయన వ్యాఖ్యలు చేశారు . కానీ ప్రత్యేక హోదా సాధనే తమ లక్ష్యం అని పేర్కొన్నారు. దాని కోసం ప్రయత్నం చేస్తున్న జగన్ కు కేంద్రం ఝలక్ ఇస్తూ సరిగ్గా నాలుగు రోజుల క్రితమే హోదాపై కేంద్ర ప్రభుత్వం మరోసారి తన వైఖరి వెల్లడించింది. ‘హోదా ఇచ్చేది లేదు’ అని కేంద్రం తేల్చి చెప్పింది. లోక్‌సభలో జేడీయూ ఎంపీ కౌశలేంద్ర కుమార్‌ అడిగిన ఓ ప్రశ్నకు జగన్ ప్రజావేదిక లో కలెక్టర్ ల సదస్సు ఏర్పాటు చేసిన రోజే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ లిఖితపూర్వక సమాధానమిచ్చారు.  ఆంధ్రప్రదేశ్‌తోపాటు తెలంగాణ, ఒడిసా, రాజస్థాన్‌, బిహార్‌, జార్ఖండ్‌, ఛత్తీస్‌గఢ్‌ల నుంచీ ప్రత్యేక హోదా డిమాండ్లు వచ్చాయి. అయితే, ఏ రాష్ట్రానికీ ప్రత్యేక హోదా ఇచ్చే ప్రతిపాదనలు కేంద్ర ప్రభుత్వం పరిశీలనలో లేవని నిర్మలా సీతారామన్‌ చెప్పారు. నిజానికి గతంలో ప్రణాళిక సహకారంలో భాగంగా ఆయా ప్రమాణాలను పరిగణనలోకి తీసుకుని రాష్ట్రాలకు జాతీయ అభివృద్ధి మండలి ప్రత్యేక హోదా ఇచ్చేది. కొండ ప్రాంతాలు, తక్కువ జన సాంద్రత, ఎక్కువ గిరిజన జనాభా, పొరుగు దేశాలతో సరిహద్దు పంచుకున్న ప్రాంతాలు, ఆర్థిక, మౌలిక సదుపాయాల వెనుకబాటు, వంటి అంశాలను పరిగణలోకి తీసుకుని హోదా ఇచ్చేవారు.  కానీ ప్రత్యేక హోదాలో పారిశ్రామిక వృద్ధికి నిర్దిష్ట చర్యలేమీ లేవని ఆమె తన సమాధానంలో వివరించారు. ఈ విషయం మీడియాలోకి రాక ముందే జాగ్రత్త పడిన జగన్ జాగ్రత్త పడ్డారు, వెంటనే ఈ ప్రజావేదికని కూల్చివేస్తున్నామని ఆయన అప్పటికప్పుడు ప్రకటించారు. ఇక అప్పటికే పెద్దగా న్యూస్ లేక కరువులో ఉన్న తెలుగు మీడియాకి ఈ సమస్య పెద్ద బంగారు బాతులా కనపడి ఉండచ్చు, దీంతో వెంటనే పబ్లిక్ పల్స్ లూ, సెలెబ్రిటీ బైట్స్ అంటూ సినిమా కోసం ప్రమోషన్స్ చేసినట్టు ఈ ప్రజావేదిక విషయంలో కాన్సంట్రేట్ చేశారు. అంటే ఒక రకంగా జగన్ చేసిన చిన్న డీవిఏషన్ కి మీడియా పడిపోయింది. మరి తెలిసి అలా చేసిందో తెలియక అలా చేసిందో కానీ మొత్తానికి ఆ విషయాన్ని పక్కన పెట్టేసేలా వ్యవహరించింది. ఇక ఈ విషయం మీద మాట్లాడిన బీజేపీ నాయకురాలు పురందేశ్వరి  ప్రత్యేక హోదా ముగిసిపోయిన అధ్యాయమని అన్నారు. ఏపీకి ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రత్యేక హోదా పేరుతో ప్రజలను ముఖ్యమంత్రి జగన్ పక్కదోవ పట్టించరాదని హితవు పలికారు. నిజానికి ఆయన అప్పటికే పక్క దోవ పట్టించేశారు. ఈవిడకే కాస్త ఆలస్యంగా అర్ధం అయినట్టుంది.

is chandrababu wasted public money for pushkaralu

ఒక పరాజయం 100 తప్పులు.. పుష్కరాల 'అతి' ఈ 'గతి' కి కారణమా?

  పుష్కరాల 'అతి' టీడీపీకి ఈ 'గతి' పట్టడానికి ఓ కారణమా? అంటే అవుననే అభిప్రాయం వ్యక్తమవుతోంది. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో కృష్ణ, గోదావరి రెండు పుష్కరాలు వచ్చాయి. భక్తితో చేయాల్సిన పుష్కరాలను వేల కోట్లు ఖర్చు పెట్టి భారీగా చేసి.. విమర్శలు పాలయ్యారు. అసలే కొత్తగా ఏర్పడిన రాష్ట్రం. రాజధాని లేదు, ప్రాజెక్ట్ లు నిర్మాణం జరగాలి, లోటు బడ్జెట్. ఇవన్నీ తెలిసి కూడా దశాబ్దాల అనుభవమున్న బాబు.. పుష్కరాల పేరుతో వేలకోట్లు వృథా చేసారు. పోనీ అంత ఖర్చు పెట్టి పుష్కారాల ఏర్పాట్లు అయినా సరిగ్గా చేసారా అంటే అదీ లేదు. విపరీతమైన ప్రచారం చేసుకున్నారు కానీ, పుష్కర ఘాట్లు సరిగ్గా ఏర్పాటు చేయలేకపోయారు. అప్పటికప్పుడు నామినేషన్ల పద్దతిలో టెండర్లు ఇచ్చారు. వారు డబ్బులు తిని అరకొర ఏర్పాట్లు చేసారు. దీంతో ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడ్డారు. వీటికితోడు పుష్కారాలను సినీ దర్శకుడితో షూట్ చేపించారు. అలాంటి వాటి వల్ల ప్రజాధనం వృధా అయింది కానీ ప్రజలకు ఒరిగిందేమీ లేదు. అంతేకాదు, పుష్కారాల సమయంలో దివ్యమైన ముహూర్తం అంటూ ఒక సమయాన్ని ప్రచారం చేసారు. దీంతో ప్రజలందరూ అదే సమయంలో పుష్కర స్నానం చేయడానికి ఉత్సాహం చూపించారు. చివరికి సీఎం గా ఉన్న బాబు కూడా.. సకుటుంబ సమేతంగా అదే సమయానికి పుష్కర స్నానం చేసారు. ఆ ముహూర్తం పుణ్యమా అని తొక్కిసలాట జరిగి పదుల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. పుష్కరాల పేరుతో ప్రజల ప్రాణాలతో చెలగాటమాడారంటూ టీడీపీ ప్రభుత్వం మీద అప్పుడే తీవ్ర విమర్శలు వచ్చాయి. ఇలా పుష్కరాల పేరుతో ఓ వైపు కోట్ల రూపాయల ప్రజాధనం వృథా, మరోవైపు ప్రజల ప్రాణాలతో చెలగాటం.. దీంతో టీడీపీ మీద ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఏర్పడింది. ఆ వ్యతిరేకత ఓటమికి దారి తీసింది.

chandrbaabu to meet TDP Kapu Leaders

కాపు నేతల డిమాండ్....బాబు ఒప్పుకునేనా ?

పార్టీ ఓటమి పాలయ్యాక విదేశాలకి వెళ్లి రెస్ట్ తీసుకుని వచ్చిన ఏపీ మాజీ సీఎం చంద్రబాబు పార్టీని కాపాడుకునే పనిలో పడ్డారు. ఆయన ఊరిలో లేనప్పుడు కాపు నేతలు అందరూ కాకినాడ వెళ్లి పార్టీ నేత తోట త్రిమూర్తులు ఆధ్వర్యంలో ఒక మీటింగ్ పెట్టుకున్న సంగతి తెలిసిందే. అయితే అదే రోజున రాజ్యసభ ఎంపీలు నలుగురు పార్టీ ఫిరాయించి ఏకంగా టీడీపీ రాజ్యసభా పక్షాన్నే బీజేపీలో కలిపేశారు దీంతో ఈ కాపు నేతలు కూడా పార్టీ మారతారు అనే ప్రచారం గట్టిగా జరిగింది. ఈ నేపధ్యంలో చంద్రబాబు వారి మీద ద్రుష్టి సారించినట్టు చెబుతున్నారు.  అదే కాక నిన్న తాను నిర్వహించిన సమావేశానికి అందుబాటులో ఉండి కూడా హాజరుకాని నేతలపై ఆరా తీసిన చంద్రబాబు వాళ్లు ఎందుకు సమావేశానికి రాలేదని పార్టీ ముఖ్యనేతలతో చర్చించినట్టు తెలుస్తోంది. పార్టీకి చెందిన కాపు నేతలు బొండా ఉమా, జ్యోతుల నెహ్రు, తోట త్రిమూర్తులు, పంచాకర్ల రమేష్ బాబు లాంటి నేతల అసంతృప్తికి కారణం ఏమిటనే విషయాన్ని తెలుసుకోవాలని ఆయన పార్టీ నేతలను ఆదేశించారు. బాబు ఆదేశాలతో ఇప్పటికే వీరితో కాపు సామాజికవర్గానికి చెందిన మాజీమంత్రులు గంటా శ్రీనివాసరావు, నారాయణ, చినరాజప్పలు చర్చలు జరిపినట్టు తెలుస్తోంది.  అయితే వీరంతా పార్టీ మారాలని ఆ మీటింగ్ పెట్టుకోలేదని ఈ మీటింగ్ వెనుక ఒక ముఖ్య కారణం ఉందని అంటున్నారు. నిజానికి చంద్రబాబువ రేపు సాయంత్రం కాపునేతలతో భేటీ కానున్నారు. పార్టీలో జరుగుతున్న పరిణామాలపై చంద్రబాబు నేతలతో చర్చించనున్నారు. కాకినాడ సమావేశానికి హాజరైన కాపు నేతలను చంద్రబాబు భేటీకి ఆహ్వానించారు. అయితే ఈ సమావేశానికి వెళ్ళే వారు అందరూ ఓకే మాట మీద ఉన్నారని అంటున్నారు. పార్టీని బ్రష్టు పట్టించిన ఒక ఇద్ద‌రు నేత‌ల‌ను త‌ప్పించాల‌ని, అది కుదరని పక్షంలో ఎవరి దారి వాళ్ళం చూసుకుంటామని బాబుకి చెప్పనున్నట్టు సమాచారం.  నిజానికి కాకినాడ సమావేశంలో ఎన్నిక‌ల స‌మ‌యంలో కాపు అభ్య‌ర్దుల పైన వివ‌క్ష చూపించి లోకేష్ కమ్మ సామాజిక వర్గ అభ్యర్ధులకి స‌హ‌కారం ఎలా అందించించారనే విషయం మీదా వారి ప్రధాన చర్చ నడిచినట్టు సమాచారం.  లోకేశ్ పార్టీ వ్యవహారాల్లో ఉండడం వ‌ల‌నే పార్టీకి న‌ష్టం జ‌రిగింద‌ని, అదీ కాక ఎన్నిక‌ల వేళ‌ లోకేశ్ వ్య‌వ‌హ‌రించిన తీరు పైన కాపు నేత‌లు ఆగ్రహంతో ఉన్నారు. ఆయనతో పాటు గ‌త ప్ర‌భుత్వంలో ఆర్దిక శాఖా మంత్రిగా ప‌ని చేసిన య‌న‌మ‌ల సైతం త‌న‌ వారికే నిధుల మంజూరు చేసుకున్నారని ప్ర‌ధానంగా గోదావ‌రి జిల్లాల‌కు చెందిన కాపు నేత‌ల విజ్ఞ‌ప్తుల‌ను ప‌ట్టించు కోలేద‌ని వారి ప్రధాన ఆరోపణ.  ఈ ఇద్దరినీ పక్కన పెడితే తప్ప తాము పార్టీలో ఉఉండే ప‌రిస్థితి లేద‌ని రేపు బాబుకి క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. వైసీపీలోకి వెళ్ళే పరిస్థితి లేకపోవడంతో సుజనా చౌదరి అండతో బీజేపీ వైపు చూసే అవకాశాలు లేకపోలేదని విశ్లేషకులు చెబుతున్నారు. మరి కన్నకొడుకుని అత్యంత నమ్మకస్తుడు అయిన యనమలని పక్కన పెట్టేందుకు బాబు ఒప్పుకుంటారా ? లేదా ఒక్క సారిగా ఇంతమంది కాపు నేతలను వదులుకుంటారా అనే ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి. మరి ఈ బాబు ఏ నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి మరి.      

Will chandrababu vacate from his Amaravati house

బాబు పిరికివాడిలా పారిపోతాడా? లేక పోరాడతాడా?

  ప్రస్తుతం ఏపీలో ఎక్కడ చూసినా 'ప్రజావేదిక' గురించే చర్చ జరుగుతోంది. సోషల్ మీడియా, మీడియా అన్న తేడా లేకుండా ఎక్కడైనా ప్రస్తుతం ప్రజావేదికే హాట్ టాపిక్ అయింది. గత చంద్రబాబు ప్రభుత్వ హయాంలో నిర్మించిన ప్రజావేదిక అక్రమ కట్టడమని భావించిన సీఎం జగన్.. ఆ భవనాన్ని కూల్చి వేయాలని అధికారులను ఆదేశించారు. దీంతో ప్రజావేదిక నేలమట్టమైంది. ప్రజావేదిక అక్రమ కట్టడమని, రేకుల షెడ్డు కోసం రూ.9 కోట్లు ఖర్చు చేసి.. టీడీపీ అవినీతికి పాల్పడిందని వైసీపీ విమర్శలు చేస్తోంది. అయితే వైసీపీ ఆరోపిస్తున్నట్లు అది రేకుల షెడ్డో, కోళ్ల‌ఫారమో కాదని.. ప్రీ ఇంజనీరింగ్ బిల్డింగ్ సాంకేతిక ప‌రిజ్ఞానాన్ని వాడి ఆ నిర్మాణం చేసారని తెలుస్తోంది. దీనికో ప్ర‌త్యేక‌త కూడా ఉందట. జాగ్ర‌త్త‌గా నిపుణులు ఈ నిర్మాణాన్ని డిస్‌మేంట‌ల్ చేస్తే.. ఇందులో 80 శాతం మెటీరియ‌ల్‌తో మ‌ళ్లీ ఇలాంటి నిర్మాణం ఇంకోటి చేయొచ్చట. కానీ జగన్ సర్కార్ ముందు వెనుక ఆలోచించకుండా జేసీబీలతో కూల్చేసి నిర్మాణానికి ఉపయోగించిన మెటీరియ‌ల్‌ ని వృధా చేసిందని కొందరు అభిప్రాయపడుతున్నారు. అంతేకాదు.. వైసీపీ ఆరోపిస్తున్నట్లు ప్రజావేదిక నిర్మాణానికి రూ.9 కోట్లు ఖర్చు కాలేదట. ప్రజావేదిక నిర్మాణం కోసం ఆర్‌ అండ్‌ బి శాఖ 4.4.2017న జీఓ నెం.ఆర్‌.టి.104ను విడుదల చేసింది. దీని ప్రకారం ప్రజావేదిక నిర్మాణం కోసం రూ.90లక్షలు, పార్కింగ్‌ కోసం రూ.47లక్షలు, మట్టి చదును కోసం రూ.32లక్షలు, ప్రహారిగోడ కోసం రూ.14లక్షలు, సెక్యూరిటీ పోస్టు కోసం రూ.8లక్షలను విడుదల చేసింది. ప్రజావేదిక నిర్మాణం, ఇతర సదుపాయాల కల్పన కోసం అప్పటి ప్రభుత్వం వెచ్చించిన మొత్తం రూ.కోటి 91లక్షలు. కానీ వైసీపీ శ్రేణులు మాత్రం రేకుల షెడ్డు కోసం టీడీపీ రూ.9 కోట్లు ఖర్చు చేసి అవినీతికి పాల్పడిందని సోషల్ మీడియాలో ప్రచారం చేసాయి. ఈ ప్రచారాన్ని తిప్పికొట్టడంలో టీడీపీ శ్రేణులు విఫలమయ్యాయనే చెప్పాలి. టీడీపీ నేతలు కూడా ఈ నిర్మాణం గురించి, నిర్మాణానికి అయిన ఖర్చు గురించి ప్రజలకు అర్థమయ్యేలా వివరించే ప్రయత్నం చేయలేదు. మరోవైపు మిగతా అక్రమ కట్టడాలను కూడా కూల్చే యోచనలో జగన్ సర్కార్ ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ప్రస్తుతం బాబు నివాసముంటున్న ఇంటిని కూల్చేస్తారని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో బాబు రాజధాని ప్రాంతంలో మరో అద్దె ఇంటిని చూసుకుంటున్నారని కూడా వార్తలొస్తున్నాయి. అయితే తాజాగా ఓ కొత్త విషయం తెరమీదకు వచ్చింది. జగన్ సర్కార్ బాబు నివాసాన్ని కూల్చివేయడానికంటే ముందు.. ఆ ఇంటికి వెళ్లే దారిని మూసివేయాలనుకుంటుందట. ప్రజావేదిక అంటే ప్రభుత్వ నిర్మాణం కాబట్టి వెంటనే కూల్చి వేసింది ప్రభుత్వం. కానీ బాబు ఉంటున్న నివాసం ఓ వ్యక్తికి సంబంధించిన ప్రైవేట్ నిర్మాణం. అది ఒకవేళ అక్రమ కట్టడమైనా దాన్ని కూల్చాలంటే ఓ ప్రొసీజర్ ఫాలో అవ్వాలి. ఇప్పటికే దానిపై కోర్టులో కేసు కూడా ఉంది. దాన్ని కోర్టు ఆదేశాలతో కూల్చాల్సి ఉంటుంది. దీనికి చాలా సమయం పట్టే అవకాశముంది. అందుకే జగన్ సర్కార్ బాబుని మరోలా ఇబ్బంది పెట్టాలని చూస్తోందట. ప్రజావేదిక, బాబు నివాసం అక్రమ కట్టడాలు అయినప్పుడు.. వాటికోసం వేసిన రోడ్ కూడా అక్రమమే అవుతుంది కదా. అందుకే ముందుగా బాబు నివాసానికి వెళ్లే దారిని మూసివేయాలి అనుకుంటుందట. ఇప్పటికే పశ్చిమ గోదావరి జిల్లాలో టీడీపీకి చెందిన జడ్పీ చైర్మన్ నివాసానికి వెళ్లే దారిని క్లోజ్ చేసారని వార్తలొచ్చాయి. అదేవిధంగా ఇప్పుడు బాబుని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారని ప్రచారం జరుగుతోంది. మరోవైపు, ఇప్పటికే బాబు కొత్తింటి వేటలో ఉన్నారని వార్తలొస్తున్నాయి. ఒకవేళ బాబు నిజంగానే కొత్తింటికి వెళ్తే.. ఇన్ని రోజులు తాను ఉన్న నివాసం.. అక్రమ నిర్మాణమని ఒప్పుకున్నట్లు అవుతోంది. ఇన్నాళ్లు అక్రమ నిర్మాణమని తెలిసే బాబు అందులో ఉన్నారా అంటూ విమర్శలు వస్తాయి. అలాగే బాబు భయపడి పారిపోయాడనుకునే అవకాశముంది. అసలే బాబు పిరికివాడని, ప్రతి చిన్న దానికి భయపడతారని కొందరు విమర్శలు చేస్తుంటారు. ఇప్పుడు కొత్తింటికి వెళ్తే బాబుకి మళ్ళీ అలాంటి విమర్శలే ఎదురయ్యే అవకాశముంది. మరి బాబు విమర్శలు ఎదుర్కొంటారా లేక అక్కడే ఉండి పోరాడతారా?. ప్రజావేదిక కూల్చివేత పుణ్యమా అని బాబుకి పోరాడటానికి మంచి అవకాశం వచ్చిందని కూడా కొందరు అభిప్రాయపడుతున్నారు. బాబు అదే నివాసంలో ఉండి, ఒకవేళ రోడ్డు తవ్వేస్తే కట్ట మీద నడిచైనా రాకపోకలు సాగించాలని, అప్పుడే ఆయనలోని పోరాట యోధుడు ప్రజలకు కనిపిస్తాడని అంటున్నారు. ఒకవేళ బాబు అక్కడే ఉండి పోరాడితే బాబుకి అన్యాయం జరిగిందన్న సంకేతాలు ప్రజల్లోకి వెళ్లే అవకాశం ఉంది, అదేవిధంగా కార్యకర్తల్లో కూడా ధైర్యం నింపినట్లు అవుతుందని అంటున్నారు. అంటే బాబు కొత్తింటికి వెళ్తే పిరికివాడని అనిపించుకునే అవకాశముంది. అదే పాత నివాసంలోనే ఉంటే పోరాడే యోధుడు అనిపించుకుంటారు. మరి బాబు పారిపోతారో లేక పోరాడతారో చూడాలి.

 Real Facts About Undavalli Praja Vedika Constructions

ప్రజావేదిక నిర్మాణం ఖర్చు కోటీ తొంబై లక్షలు...మరి 9 కోట్లు ఎలా అబ్బా ?

ప్రజావేదిక కూల్చివేతతో మొదలయిన రగడ ఇప్పట్లో చల్లారేలా కనపడడం లేదు. గత తెలుగు దేశం ప్రభుత్వం ఉండగా చంద్రబాబు ఉండవల్లి కరకట్ట మీద నదిని ఆనుకుని లింగమనేని ఎస్టేట్స్ ఓనర్ కట్టుకున్న ఇంటిలో అద్దెకు ఉండేవారు. అయితే బాబుని కలిసేందుకు ప్రజలు వస్తే వారిని కలిసేందుకు, వినతులు స్వీకరించేందుకు ఒక వేదికని నిర్మించింది అప్పటి బాబు సర్కార్. అయితే దానిని అక్రమ నిర్మాణంగా పేర్కొన్న జగన్ సర్కార్ దానిని కూల్చివేసేందుకు నిర్ణయించి నిన్నటితో ఆ ఘట్టాన్ని పూర్తి చేశారు. అయితే ఇది మామూలుగా జరగలేదు.  అమరావతి సెక్రటేరియట్ నుండి పన్నెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రజావేదికలో కావాలనే జగన్ కలెక్టర్ ల సమావేశం ఏర్పాటు చేశారు. అయితే అంతకు ముందే పార్టీ నేతలు, ప్రజలు తనను కలవడానికి వస్తే వీలుగా ఉండేదుకు ఈ సముదాయాన్ని తనకి కేటాయించమని బాబు జగన్ సర్కార్ ని కోరారు. అప్పటి దాకా దాని మీద పెద్దగా అవగాహన లేని జగన్ మాజీ సీఎం లేఖతో అలెర్ట్ అయ్యి వెంటనే దాని మీద నివేదిక తెప్పించుకున్నారు. అయితే ఆ నివేదికలో ఆ కట్టడం అక్రమం అని, దానితో పాటు బాబు నివాసం కూడా అక్రమం అని తేలడంతో వ్యూహాత్మకంగా ప్రజా వేదికలో సదస్సులు ఏర్పాటు చేసి కూల్చి వేస్తున్నట్టు ప్రకటించారు.  అంతే కాక పర్యావరణ నిబంధనలు సహా అన్నింటినీ బేఖాతరు చేస్తూ ఈ ప్రజావేదికను నిర్మించిందని ముఖ్యమంత్రి స్థాయిలోనే ఇలా చేయడం అంటే సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నట్టని ప్రశ్నిస్తూ ఎవరూ కాదనలేని విధంగా కూల్చివెత ఆదేశాలు జారీ చేశారు. అంటే ఒకరంగా బాబు ఉంటున్న ఇల్లు కూలగొట్టేందుకు వీలుగా విమర్శలు రాకుండా ప్రజావేదిక కూల గొట్టారు. అయితే ఈ విషయం మీద చాలా విమర్శలు ఎదురయ్యాయి. అయితే ప్రజావేదిక విషయంలో సీఆర్డీఏ ఇప్పటికే ప్రభుత్వానికి రిపోర్ట్ కూడా ఇచ్చినట్టు వైసీపీ, మంత్రులు కూడా ప్రచారం చేస్తున్నారు. 5 కోట్లతో పూర్తి చేయాల్సిన భవనం కోసం 8 కోట్లు ఖర్చు చేశారని, అది కూడా ఓపెన్ బీడ్ వేయకుండా మంత్రి నారాయణ మౌఖిక ఆదేశాలతో అంచనాలు పెంచి ఖర్చు చేసినట్టు వైసీపీ ప్రచారం చేసింది.    అలా అని సీఆర్డీఏ నివేదిక ఇచ్చింది. ఇక ప్రజావేదిక నిర్మాణానికయిన ఖర్చును బాధ్యుల నుండి వసూలు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. వేదికను కూల్చివేతను నిలిపివేయాలంటూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యం మీద నిన్న తెల్లవారు జాము 3.30 గంటలకు హైకోర్టు విచారణ జరిపింది. ప్రజావేదిక అక్రమ కట్టడమేనని పిటిషనర్‌ ఒప్పుకోవడంతో స్టే ఇవ్వడానికి ధర్మాసనం నిరాకరిచింది. ఈ సందర్భంగా ప్రభుత్వం తరపున వాదించిన అడ్వకేట్‌ జనరల్‌ అక్రమ కట్టడానికి భారీ మొత్తంలో ఖర్చు చేశారని, ఆ మొత్తాన్ని బాధితుల నుండి రాబట్టడంతో పాటు, ఈ వ్యవహారంపై పూర్తిస్థాయిలో విచారణ జరిపిస్తామని చెప్పారు.  ఈ కేసులో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును, అప్పటి పురపాలకశాఖ మంత్రి నారాయణను ప్రతివాదులుగా చేర్చాలని ఆదేశించిన ధర్మాసనం కేసు విచారణను జులై 10వ తేదికి వాయిదా వేసింది. అయితే తాజాగా ఈ విషయం మీద మాట్లాడిన మంత్రి పేర్ని నాని ప్రజావేదికను కూల్చడం లేదని, తరలిస్తున్నామని, దీనికి వినియోగించిన వస్తువులన్నీ ప్రభుత్వ స్థలంలో వేరేచోట అనుమతి తీసుకుని నిర్మించేందుకు ఉపయోగిస్తామని చెప్పారు. ఇక్కడే తాజాగా తెలుగుదేశం గత ప్రభుత్వ హయాంలో ఈ ప్రజావేదిక నిర్మాణం కోసం ఎంత అయ్యిందనే విషయం బయట పెట్టింది.  2017వ సంవత్సరం ఏప్రిల్ నాలుగున జారీ అయిన జీవో ప్రకారం ఆర్ అండ్ బీ నుండి ఈ వేదిక నిర్మాణానికి 90 లక్షల రూపాయల నిధులు జారీ అయ్యాయి. ఆ నిధులు కేవలం నిర్మాణానికి ఉపయోగించారు. ఇక అక్కడే పార్కింగ్ స్థలాలను పూడ్చి రెడీ చేసేందుకు 47 లక్షల రూపాయలు, అలా మిగతా పార్కింగ్, సెక్యూరిటీ మొత్తం అన్నీ కలిపి కోటీ తొంబై లక్షలు ఖర్చు అయ్యాయి. సీఆర్డీఏ చెబుతున్న లెక్క ప్రకారం తొమ్మిది కోట్లు, అంటే మిగిలిన ఏడూ కోట్లతో ఏసీలు, ఫర్నీచర్, ప్రొజెక్టర్ లు లాంటివి ఖరీదు చేసి ఉండవచ్చు, మంత్రి చెబుతున్న దాని ప్రకారం వాటిని మళ్ళీ ఉపయోగిస్తారు, సో ప్రజల సొమ్ము వృధా అయ్యింది సుమారుగా రెండు కోట్ల రూపాయలన్న మాట. కానీ రాజకీయ లబ్దిని ఆశించి వైసీపే మాత్రం తొమ్మిది కోట్ల అవినీతి జరిగింది అంటూ విమర్శలు చేస్తోంది.  

kodela tax is the reason for tdp defeat

ఒక పరాజయం 100 తప్పులు.. కోడెల ట్యాక్సే కొంప ముంచిందా?

  టీడీపీ ఘోర పరాజయంలో పలువురు నేతలు కీలక పాత్ర పోషించారు. వారిలో ముఖ్యంగా మాజీ స్పీకర్ కోడెల శివ ప్రసాద్ రావు గురించి చెప్పుకోవాలి. అసలు కోడెలను స్పీకర్ పదవికి ఎంపిక చేసి చంద్రబాబు తప్పు చేశారంటూ అప్పట్లోనే విమర్శలు వచ్చాయి. రాజ్యాంగ బద్దమైన స్పీకర్ పదవికి నెమ్మదస్తులను, ఆచి తూచి మాట్లాడేవారిని ఎంపిక చేయకుండా.. దూకుడు స్వభావం ఉన్న కోడెలను ఎంపిక చేయడం ఏంటని బాబు నిర్ణయాన్ని పలువురు తప్పుపట్టారు. అయితే స్పీకర్ పదవి చేపట్టాక కోడెల దూకుడు కాస్త తగ్గిందేమో కానీ ఆయన కుటుంబం మాత్రం రెచ్చిపోయింది. ఆయన కుటుంబం పుణ్యమా అని గుంటూరు జిల్లాలో టీడీపీ మీద తీవ్ర వ్యతిరేకత ఏర్పడింది. నాయకుడు అనేవాడు ప్రజలకు అండగా ఉండాలి, అవసరానికి ఆదుకోవాలి. కానీ కోడెల కుటుంబం ప్రజలను అందిన కాడికి దోచుకుంది. నర్సరావుపేట, సత్తెనపల్లి నియోజకవర్గాల్లో కోడెల టాక్స్ పేరుతో ఆయన కొడుకు, కూతురు ప్రజలను పీక్కుతిన్నారు. ఆఖరికి సొంత పార్టీ కార్యకర్తలను కూడా వదలకుండా వసూళ్లకు దిగారు. దీంతో ఇటు పార్టీ శ్రేణుల్లోనూ, ప్రజల్లోనూ కోడెల కుటుంబం మీద తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఆ ప్రభావం టీడీపీ మీద పడింది. నిజానికి కోడెల కుటుంబ ఆగడాలు ఎన్నికలకు ముందే చంద్రబాబు దృష్టికి వచ్చాయి. కానీ బాబు కోడెల కుటుంబాన్ని అదుపు చేసే ప్రయత్నం చేయలేదు. సీనియర్ నేత అని కోడెలని ప్రశ్నించలేకపోయారో, లేక తనని చూసి అన్ని నియోజకవర్గాల ప్రజలు టీడీపీకే ఓట్లేస్తారు అనుకున్నారో తెలీదు కానీ.. బాబు మాత్రం ఈ విషయంలో కోడెల కుటుంబాన్ని అదుపు చేయలేదు. అదే ఎన్నికల్లో బాబు కొంపముంచింది.  

Pawan Kalyan took wrong step

జనసేనకి కుల ముద్ర....పవన్ మళ్ళీ తప్పు చేస్తున్నాడా?

  ఏపీ రాజకీయాలు చాలా విచిత్రంగా ఉంటాయి, ఓడలు బళ్ళు బళ్ళు ఓడలు చేయడం అంటే ఏమిటో ఏపీ ఓటర్లకి తెలిసినంత బాగా ఇంకెవరికీ తెలీదేమో ? తాజా ఎన్నికల్లో హీరోలం అనుకునే వారిని జీరోలు చేసి, రూలర్స్ అనుకునే వారిని ఇంటికే పరిమితం చేసి పారేశారు. నిజానికి ఏపీ వోటర్లు రాజకీయ చైతన్యం కలవారే, కానీ ఏపీలో రాజకీయాలు చేయాలంటే ఎన్నో మెళుకువలు నేర్చుకోవాలి. చాలా చోట్ల కుల సమీకరణలతోనే ముందుకు వెళ్ళాలి. ఈ విషయంలో ఏ చిన్న పొరపాటు జరిగినా డిపాజిట్ లు కూడా లేకుండా పోతారు. ఈ విషయం మొన్నటి ఎన్నికలు బాగా క్లారిటీ ఇచ్చి మరీ చూపాయి. అయితే అయినా ఈ దెబ్బకి గుణ పాఠం నేర్చుకోని పవన్ మళ్ళీ జనసేన విషయంలో అదే తప్పు చేస్తున్నాడు.  నిజానికి పవన్ పార్టీ జనసేనకి కాపు పార్టీ అనే ముద్ర పడింది. అయినా ఆ విషయాన్ని పెద్దగా పట్టించుకోని ఆయన ఎన్నికల ముందు కూడా ఎంతో మంది కాపు నేతలను ఆయన పార్టీలో చేర్చుకున్నారు. జనం కోలుకోలేని విధంగా సమాధానం ఇచ్చారు. అయినా పవన్ తీరు మారినట్టు కనిపించడంలేదు. వంగవీటి వారసుడు రాధాకృష్ణని పార్టీ లో చేర్చుకోవాలని చూడడమే దానికి నిదర్శనం. అయితే ఏపీలో టీడీపీకి కమ్మ, వైసీపీకి రెడ్డి కులాల సపోర్ట్ నేరుగా ఉందని భావిస్తున్న పవన్ జనసేన పార్టీకి కాపు నాయకులని తీసుకున్నా ఫర్లేదని భావిస్తున్నారట. అయితే వంగవీటి రాధాని తీసుకోవడం వల్ల పవన్ కి కలిగే లాభం కంటే నష్టమే ఎక్కువగా ఉంది. మొన్నటి ఎన్నికల ముందు జగన్ ని తిట్టి టీడీపీలో చేరిన రాధాకు చంద్రబాబు టిక్కెట్ ఇవ్వలేదు. అయితే రాధా ఉత్తర కోస్తాలో పలు చోట్ల తిరిగి ప్రచారం చేశారు. అయితే ఇప్పుడు ఆ పార్టీ పరిస్థితి కూడా బాలేకపోవడం వలన జనసేన వైపు చూస్తున్నారు.  నిజానికి ఆయన జనసేనలో చేరినా పెద్దగా ఒరిగేది ఏమీ ఉండదు. ఎందుకంటే ఆయనకీ సొంతంగా చరిష్మా లేదు, తండ్రి రంగా పేరు చెప్పుకుని ఆయన ఇప్పటికీ రాజకీయాలు చేస్తున్నారు. ప్రజారాజ్యంలో ఉన్నప్పుడు అతని వలన కాపు ఓట్లు కొన్నిఅయితే వచ్చాయి, కానీ ఆ తర్వాత వైసీపీ లోకి చేరిన తర్వాత రాధా ద్వారా వైసీపీ పెద్దగా చేకూరిన లాభం ఏమి లేదు. అయితే ఇక్కడ ఆసక్తికరమైన అంశం ఏంటంటే మొన్న ఎన్నికల ప్రచారంలో తనను కాపుగా చూడకండి అని తాను అందరివాడిని అని ప్రసంగాలు దంచిన పవన్ ఇప్పుడు మాత్రం ఎందుకు ఇలా గేట్లు తెరిచాడు అనేదే అర్ధం కాని విషయం. ఒక పక్క సొంత పార్టీలో ఉన్న ఆకుల సత్యనారయణ లాంటి వాళ్ళు నేరుగా పవన్ కి రాజకీయం రాదని విమర్శిస్తుంటే తాను రాజకీయం చేస్తే ఎలా ఉంటుందో చూపిస్తాననేందుకే ఇలా చేస్తున్నాడా అనేది కూడా విశ్లేషణలకి అంతు చిక్కకుండా ఉంది.

ys jagan want to save chandrababu from bjp

జగన్ పదవికి గండం.. బాబుని కాపాడాల్సిన అవసరం వచ్చిందా?

  ప్రస్తుత రాజకీయాలలో ఏదైనా పార్టీ అధికారంలోకి వస్తే.. ప్రత్యర్థి పార్టీ నేతలను భయపెట్టో, బ్రతిమాలో తమ పార్టీలో చేర్చుకొని ప్రత్యర్థి పార్టీని పూర్తిగా ఖాళీ చేయడం చూస్తున్నాం. అయితే ఈ విషయంలో ఏపీ సీఎం వైఎస్ జగన్ వైఖరి మాత్రం భిన్నంగా ఉంది.  ఇటీవల జరిగిన ఎన్నికల్లో వైసీపీ 151 ఎమ్మెల్యే సీట్లతో ఘన విజయం సాధించింది. టీడీపీ కేవలం 23 సీట్లకు పరిమితమైంది. దీంతో జగన్ ఆ 23 లో కూడా మెజారిటీ ఎమ్మెల్యేలను తమ పార్టీలో చేర్చుకొని టీడీపీని ఖాళీ చేస్తారని భావించారంతా. కానీ జగన్ మాత్రం అలాంటిదేం చేయకపోగా.. ఒకవేళ ఎవరైనా తమ పార్టీలో చేరాలనుకుంటే రాజీనామా చేసి రావాలని స్పష్టం చేసారు. ఈరోజుల్లో ఒక్కో ఎమ్మెల్యే ఎన్నికల్లో కోట్లు ఖర్చుపెడుతున్నారు. అన్ని కోట్లు ఖర్చుచేసి గెలిచి, మళ్ళీ ఇప్పుడు రాజీనామా చేసి ఎన్నికలకు పోయే సాహసం చేయలేరు. దీంతో చంద్రబాబు కాస్త ఊపిరి పీల్చుకున్నారు. అయితే జగన్ వదిలినా బీజేపీ మాత్రం టీడీపీని వదల్లేదు. ఇప్పటికే నలుగురు రాజ్యసభ సభ్యులను చేర్చుకున్న బీజేపీ.. ఇప్పుడు ఎమ్మెల్యేలను చేర్చుకునే దిశగా పావులు కదుపుతుంది. అయితే ఈ విషయంలో బాబు & కో ఎంత ఆందోళన చెందుతున్నారో తెలీదు కానీ.. జగన్ మాత్రం బాగా ఆందోళన చెందుతున్నారట. టీడీపీ బ్రతికుండాలని కోరుకుంటున్నారట. మామూలుగా అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీని ఖాళీ చేయాలనుకుంటుంది. కానీ జగన్ మాత్రం టీడీపీ బ్రతకాలని, బాబుని కాపాడుకోవాలని చూస్తున్నారు. అయితే దీని వెనుక బలమైన కారణం ఉంది.  కేంద్రంలో బీజేపీ రెండోసారి అధికారంలోకి వచ్చి బలమైన శక్తిగా ఎదిగింది. ఇప్పుడు బీజేపీ దృష్టి సౌత్ మీద పడింది. ముఖ్యంగా 2024 నాటికి తెలుగు రాష్ట్రాల్లో పాగా వేయాలని చూస్తోంది. అందుకే వచ్చే ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా ఏపీలో పావులు కదుపుతుంది. టీడీపీ నేతలను పార్టీలో చేర్చుకుంటుంది. మొదట టీడీపీ నేతలను చేర్చుకొని బలపడిన తరువాత వైసీపీని టార్గెట్ చేసే అవకాశముంది. ఎందుకంటే ఏపీలో టీడీపీ ఖాళీ అయితే.. అప్పుడు ప్రధాన ప్రత్యర్థులు బీజేపీ, వైసీపీ అవుతాయి. అదే జగన్ భయం. టీడీపీకి ఇప్పుడున్న బలం అలాగే ఉంటే వచ్చే ఎన్నికల్లో జగన్ కి ఈజీ అవుతుంది. అలా కాకుండా బీజేపీ బలపడితే జగన్ కి కష్టాలు మొదలైనట్టే. బీజేపీని ఎదిరించలేడు. ఒకవేళ ఎదిరించే సాహసం చేస్తే పరిస్థితి బాబు కంటే దారుణంగా ఉంటుంది. జగన్ మీద అవినీతి ఆరోపణలు ఉన్నాయి. గతంలో జైలుకి కూడా వెళ్లొచ్చారు. ఒకవేళ జగన్ బీజేపీని ఎదిరిస్తే వాటిని వెలికితీసి జైలుకి పంపినా ఆశ్చర్యం లేదు. అందుకే జగన్ బీజేపీ బలపడకూడదని, బాబుని కాపాడుకోవాలని చూస్తున్నారు. కానీ బీజేపీ మాత్రం ఆ అవకాశం ఇచ్చేలా లేదు. నిజానికి బీజేపీ ఏపీలో బలపడటానికి కొన్ని నెలల ముందు నుంచే ఆపరేషన్ స్టార్ట్ చేసింది. దానిలో భాగంగా ముందుగా టీడీపీని టార్గెట్ చేసింది. ముఖ్యంగా టీడీపీకి ఆర్థికంగా అండగా ఉన్నవారికి గేలం వేసి దెబ్బ తీసింది. తరువాత మిగతా నేతలను టార్గెట్ చేసింది. కొందరు వ్యాపారాల కోసం, కొందరు భవిష్యత్తు కోసం ఇలా రకరకాల కారణాలతో టీడీపీ నేతలు బీజేపీ వైపు చూస్తున్నారు. టీడీపీకి ముందు నుంచి బీసీ, కమ్మ సామాజికవర్గాలు అండ బలంగా ఉండేది. అయితే ఇటీవల జరిగిన ఎన్నికల్లో వారు టీడీపీకి దూరం జరిగారు. ఇప్పుడు వారికి బీజేపీ వల వేసింది. అదేవిధంగా పలు జిల్లాల్లో బలంగా ఉన్న కాపు సామాజిక వర్గ నేతలను కూడా ఆకర్షించే పనిలో బీజేపీ పడింది. ఇలా సామాజిక వర్గాల వారీగా టీడీపీని బలహీనపరుస్తూ తాను బలపడాలనేది బీజేపీ ప్లాన్. బీజేపీ ఒక్కసారి బలపడటం మొదలు పెడితే.. 2024 లో అధికారమే లక్ష్యంగా వైసీపీని టార్గెట్ చేస్తుంది. ఇప్పటికే మోడీ తో సహా పలువురు బీజేపీ పెద్దలు ఏపీలో 2024 లో అధికారంలోకి వస్తామని బలంగా చెబుతున్నారు. దాన్ని బట్టే అర్థంచేసుకోవచ్చు. బీజేపీ ఏపీ మీద ఎంత ఫోకస్ పెట్టిందో. అంటే ఏపీలో టీడీపీ బలహీనపడే కొద్దీ జగన్ కి కష్టాలు మొదలవుతాయి అనమాట. అందుకే జగన్ తన జాగ్రత్తలో తాను ఉన్నట్లు తెలుస్తోంది. బీజేపీ ప్రధాన బలం హిందూ ఓటు బ్యాంకు. హిందువులు అందరూ గంపగుత్తుగా బీజేపీ వైపు చూడకుండా.. శారద పీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామితో సన్నిహితంగా ఉంటున్నారు. ఒకవేళ మెజారిటీ హిందువులు బీజేపీ వైపు వెళ్లినా.. తనకి అండగా ఉన్న రెడ్డి సామాజికవర్గం, క్రిస్టియన్ ఓటుబ్యాంకుతో బీజేపీని ఢీ కొట్టాలని చూస్తున్నారట. అందుకే ఇటీవల అధికారుల పదోన్నుతులలో కూడా రెడ్డిలకు, ముఖ్యంగా క్రిస్టియన్లకు పెద్ద పీట వేశారని తెలుస్తోంది. ఇది బీజేపీ, ఆర్ఎస్ఎస్ కి ఏ మాత్రం నచ్చని చర్య. అంటే జగన్ ఒకవైపు బాబుని కాపాడుకోవాలని చూస్తూనే.. మరోవైపు అవసరమైతే బీజేపీతో పోరుకి సిద్ధమని సంకేతాలు ఇస్తున్నారని అర్ధమవుతుంది. మరి జగన్ బీజేపీని ఎదిరించి నిలబడగలరా?. అసలే ప్రత్యర్థుల మీద సీబీఐ, ఈడీ వంటి వాటిని ఉపయోగించి ముప్పు తిప్పలు పెట్టే బీజేపీ.. జగన్ ని మాత్రం వదులుతుందా?. అదే జరిగితే జగన్ సీఎం పదవి మూడునాళ్ళ ముచ్చట అయ్యే ప్రమాదముంది. అది జరగకూడదంటే జగన్ బాబుని కాపాడుకోకతప్పదు. మరి జగన్ ఈ కమల గండం నుంచి ఎలా బయటపడతారో చూడాలి.

is ys jagan takes wrong decision on praja vedika

జగన్ నిర్ణయం ఫ్యాక్షనిస్ట్ ధోరణా?

  ఏపీ సీఎం వైఎస్ జగన్ ప్రజా వేదిక విషయంలో సంచలన నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ప్రజావేదిక అక్రమ నిర్మాణమని, దాన్ని కూల్చేయాలని జగన్‌ ఆదేశించారు. ప్రజావేదిక నుంచే రాష్ట్రంలో అక్రమ కట్టడాల కూల్చివేత ప్రారంభిద్దామని, సమావేశం ముగియగానే కూల్చివేత పనులు మొదలుపెట్టాలని జగన్ కలెక్టర్ల సమీక్షలో స్పష్టం చేసారు. ఏపీ సీఎంగా ప్రమాణస్వీకారం చేసినప్పటి నుంచి దూకుడుగా వ్యవహరిస్తూ సంచలన నిర్ణయాలు తీసుకుంటున్న జగన్.. ప్రజా వేదిక విషయంలో కూడా సంచలన నిర్ణయం తీసుకొని అందరి దృష్టిని ఆకర్షించారు. అయితే కొందరు విశ్లేషకులు మాత్రం ఏదో తన హీరోయిజం చూపించుకోవడం కోసం జగన్ తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటున్నారని విమర్శిస్తున్నారు. ప్రజా వేదిక కూల్చివేయాలని జగన్ తీసుకున్న నిర్ణయం తప్పని కొందరు అభిప్రాయపడుతున్నారు. ప్రజా వేదిక కూల్చివేయడం అంటే ప్రజా ధనాన్ని వృథా చేయడమేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. జగన్ చెప్పినట్టు అది అక్రమ నిర్మాణమే అవ్వొచ్చు. కానీ అది దాదాపు రూ.10 కోట్ల ప్రజాధనంతో కట్టిన నిర్మాణం. మరి ఇప్పుడు ఉన్నపళంగా దాన్ని కూల్చేస్తే ఆ డబ్బంతా వృథానే కదా. దానికి తోడు ఇప్పుడు కూల్చడానికి కూడా ప్రజాధనమే ఖర్చు చేయాలి. మరి ఇదంతా నష్టమే కదా. మంగళవారం కలెక్టర్లతో సమీక్ష ముగుస్తుంది. బుధవారం నుంచి కూల్చివేత పనులు మొదలుపెట్టమన్నారు. మరి కలెక్టర్లతో తదుపరి సమీక్షలు ఎక్కడ నిర్వహిస్తారు. వాటి కోసం మరో నిర్మాణం చేపడతారా. ఏదైనా భవనం అద్దెకి తీసుకుంటారా?. మరి ఇవన్నీ అదనపు ఖర్చులే కదా. ప్రజావేదిక కూల్చివేత పుణ్యమా అని పది కోట్లు బూడిద పాలు అవ్వడమే కాక.. మళ్ళీ ఇవన్నీ అదనపు ఖర్చులు. అంటే జగన్ ఇదంతా ఆలోచించకుండా అక్రమ కట్టడం కూల్చాలంటూ తొందరపడి నిర్ణయం తీసుకొని ప్రజా ధనాన్ని వృధా చేసినట్లే అవుతుంది కదా అంటున్నారు. సరే అవినీతి మీద, అక్రమ కట్టడాల మీద జగన్ ఉక్కుపాదం మోపుదాం అనుకుంటున్నారు అనుకుందాం. మరి ప్రజావేదిక విషయంలో చూపిన దూకుడు మిగతా కట్టడాల మీద చూపుతారా?. కరకట్ట సమీపంలో పలు అక్రమ కట్టడాలు ఉన్నాయి. ప్రజావేదికను వెంటనే కూల్చేయమని చెప్పిన జగన్.. మరి మిగతా అక్రమ కట్టడాలను కూడా వెంటనే కూల్చేయమని చెప్తారా?. ఒకవేళ ప్రజావేదిక విషయంలో చూపిన చొరవ, ఉత్సాహం మిగతా అక్రమ కట్టడాలపై చూపకపోతే మాత్రం జగన్ తీవ్ర విమర్శలు ఎదుర్కొంటారు. ఎందుకంటే ప్రజావేదికను ప్రతిపక్ష నాయకుడిగా తనకి కేటాయించాలని చంద్రబాబు లేఖ ద్వారా జగన్ ప్రభుత్వాన్ని కోరారు. కానీ ఏపీ ప్రభుత్వం ఆ లేఖకు బదులివ్వకుండానే ప్రజావేదికను స్వాధీనం చేసుకుంది. ఇప్పుడు కూల్చడానికి సిద్దపడింది. మరి ఇప్పుడు జగన్ సర్కార్ ప్రజావేదికను మాత్రమే కూల్చి మిగతా అక్రమ నిర్మాణాల విషయంలో చూసీచూడనట్టు వదిలిస్తే.. ఇది కచ్చితంగా బాబు మీద కక్ష సాధింపు చర్య అనే అభిప్రాయం వ్యక్తమయే అవకాశముంది. దానికితోడు అసలే జగన్ ది ఫ్యాక్షన్ ధోరణి అని టీడీపీ ఆరోపిస్తూ ఉంటుంది. ఇప్పుడు ప్రజావేదిక ఒక్క నిర్మాణాన్ని మాత్రమే కూల్చితే.. నిజంగానే జగన్ ది ఫ్యాక్షన్ ధోరణి అని టీడీపీ మరింత ప్రచారం చేసే అవకాశముంది. మరి జగన్ వారికి ఆ అవకాశం ఇస్తారో లేదో చూడాలి. 

Nara Lokesh is One Of The Reason for TDP Defeat

ఒక పరాజయం 100 తప్పులు.. లోకేష్ తాను ఓడిపోయి పార్టీని ఓడించాడు!!

  'నాయకుడు వారసత్వంలోనుంచి పుట్టడు. ప్రజల్లోనుంచి పుడతాడు. అలా పుట్టిన నాయకుడే ప్రజల గుండెల్లో నిలిచిపోతాడు.' ఈ విషయాన్ని 4 దశాబ్దాల అనుభవమున్న చంద్రబాబు పూర్తిగా విస్మరించారు. తండ్రికి కొడుకు మీద ప్రేమ ఉండడం, కొడుకుని గొప్ప స్థాయిలో చూడాలనుకోవడం సహజం. కానీ తన కొడుకు అసలు ఈ రంగంలో రాణించగలడా లేదా అన్న ఆలోచన లేకుండా.. వారసత్వమే తన కొడుకుని నిలబెడుతుందన్న భావనతో బాబు లోకేష్ ని అందలం ఎక్కించారు. తీరా ప్రజా తీర్పు చూసి ఏడుపు మొహం పెట్టారు. ఎందరో వారసులు రాజకీయాల్లోకి వచ్చారు.. కొందరు రాణించారు. వారసులు రాజకీయాల్లోకి రావడంలో తప్పులేదు. కానీ ఆ వచ్చే విధానంలోనే మార్పు కనపడాలి. ముందు పార్టీ గురించి, పార్టీ సిద్ధాంతాల గురించి పూర్తిగా తెలుసుకోవాలి. ద్వితీయ శ్రేణి నేతలతో, కార్యకర్తలతో టచ్ లో ఉంటూ.. క్షేత్రస్థాయిలో పని చేయాలి. ప్రజల్లో ఉండాలి. కానీ లోకేష్ రాజకీయ ప్రవేశం ఎలా ఉంది?. అంతా హైటెక్ మయం. మీడియా, సోషల్ మీడియాలో కనిపించడమే తప్ప ప్రజల్లోకి వెళ్లే ప్రయత్నం చేయలేదు. ప్రత్యక్ష ఎన్నికల బరిలోకి దిగకుండానే డైరెక్ట్ గా మంత్రి పదవి పొందారు. దీంతో సహజంగానే ప్రజల్లో లోకేష్ మీద వ్యతిరేక భావన ఏర్పడింది. దీనికి తోడు లోకేష్ తన చుట్టూ ఒక కోటరీ ఏర్పాటు చేసుకొని నిజమైన కార్యకర్తలను దూరం పెట్టారు. భజన చేసేవారిని, నాలుగు ముక్కలు ఇంగ్లీష్ మాట్లాడేవారిని, సోషల్ మీడియానే నిజమైన సమాజం అనుకునేవారిని లోకేష్ తన చుట్టూ పెట్టుకున్నారు. దీంతో ఆయన కార్యకర్తలకు, ప్రజలకు దగ్గరవ్వలేకపోయారు. ఇక లోకేష్ మాటల తడబాటు గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి. నాయకుడికి చేతలతో పాటు వాక్చాతుర్యం కూడా ఉండాలి. తన ప్రసంగాలతో కార్యకర్తలను ఉత్తేజ పరచాలి, ప్రజలను ఆకట్టుకోవాలి. వాక్చాతుర్యంతో ప్రత్యర్థి పార్టీలను ఇబ్బంది పెట్టాలి. కానీ లోకేష్ మైక్ పడితే  ప్రత్యర్థి పార్టీలకు పండగే. పదాలను సరిగ్గా పలకకపోవడం లేదా ఒక పదానికి బదులు మరో పదం పలకడం.. ఇలా పదాలతో విన్యాసాలు చేసి ప్రత్యర్థులను కూడా నవ్వించి తాను నవ్వులపాలయ్యాడు. పప్పు అనే పేరు తెచ్చుకున్నాడు. దీన్ని ప్రత్యర్థులు లోకేష్ పేరు వింటే పప్పు అని గుర్తొచ్చే అంత బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లారు. సరే మాటలు తడబాటు సహజం. మిగతా నాయకులు అప్పుడప్పుడు తడబడితే ఈయన ఎక్కువసార్లు తడబడతారు అనుకోవచ్చు. ఇక్కడ లోకేష్ చేసిన ప్రధాన తప్పు.. ప్రజల్లోకి వెళ్లే ప్రయత్నం చేయకపోవడం. క్షేత్రస్థాయిలో పార్టీలో పనిచేస్తూ కార్యకర్తలకు దగ్గరై, ప్రజల్లోకి వెళ్తే పరిస్థితి మరోలా ఉండేది. ఆయన మాటలు తడబడినా ఆయన చేతలు చూసి ఆయన వెంట కొందరైనా నడిచేవారు. కానీ లోకేష్ అలా చేయలేదు. డైరెక్ట్ గా మంత్రి అయ్యి తనకి తిరుగు లేదు అనుకున్నారు. తనకి తాను యువరాజులా ఫీలయ్యారు. ఇదే ప్రత్యర్థులకు వరమైంది. ఒక్కసారి గెలిపిస్తే బాబు కొడుకుని మంత్రిని చేసాడు, మరోసారి గెలిపిస్తే ఏకంగా ముఖ్యమంత్రిని చేస్తారని ప్రజలకు పదే పదే చెప్పారు. దీంతో ప్రజలు లోకేష్ ని కనీసం ఎమ్మెల్యేగా కూడా గెలిపించకుండా ఇంటికి పంపారు. పార్టీని ప్రతిపక్షానికి పరిమితం చేసారు. మరి ఈ అనుభవాల నుంచైనా లోకేష్ తన పద్దతి మార్చుకొని ప్రజలకు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తారేమో చూడాలి.  

political gap between dharmana brothers

అన్నదమ్ముల మధ్య అగాధం!!

  ఒక్క మంత్రి పదవి ఇద్దరు అన్నదమ్ముల మధ్య చిచ్చు పెట్టిందా? ఎవరీ అన్నదమ్ములెవరు? ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వంలో మంత్రి పదవుల రేసులో శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి ఐదుగురు పేర్లు విన్పించగా, అందులో ముఖ్యులుగా ధర్మాన సోదరులు, తమ్మినేని సీతారాం నిలిచారు. ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి తమ్మినేని సీతారాంను అసెంబ్లీ స్పీకర్ పదవికి ఎంపిక చేసారు. సీనియారిటీ, గత అనుభవాల దృష్ట్యా ధర్మాన ప్రసాదరావుకే మంత్రి పదవి లభిస్తుందని ఆయనతో పాటు ఆయన వర్గం ముందు నుంచే ప్రచారం చేసుకుంటూ వచ్చింది. అయితే పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి మాత్రం ఎవరూ ఊహించని విధంగా ధర్మాన ప్రసాదరావుకు కాక ధర్మాన కృష్ణదాస్‌కు మంత్రి పదవి కట్టబెట్టారు. ధర్మాన ప్రసాదరావుకు కాకుండా కృష్ణదాస్‌కు మంత్రి పదవి ఇవ్వడంపై పార్టీలో పెద్ద ఎత్తున చర్చే జరుగుతోందట. మంత్రిగా అనేక పర్యాయాలు పనిచేసి, సుధీర్ఘ అనుభవం కలిగిన ధర్మాన ప్రసాదరావును కాకుండా ధర్మాన కృష్ణదాస్‌ను మంత్రిగా నియమించడంపై జిల్లా పార్టీలో వ్యతిరేక స్వరం మొదలయ్యిందట. ముఖ్యంగా అన్నదమ్ముల మధ్య అగాథం పెంచిందట. మంత్రిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం మొదటిసారి జిల్లాకు విచ్చేసిన ధర్మాన కృష్ణదాస్ కు పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఘనస్వాగతం పలికేందుకు సన్నాహాలు చేసారు. రైల్వే స్టేషన్ నుంచి పార్టీ కార్యాలయం చేరుకునే వరకు ధర్మాన కృష్ణదాస్ కు స్వాగతం పలికేందుకు ఎక్కడా ధర్మాన ప్రసాదరావు రాలేదు. పార్టీ కార్యాలయంలో జరిగే కార్యక్రమానికి ధర్మాన ప్రసాదరావు వస్తారని కొద్దిసేపు కార్యక్రమాన్ని వాయిదా వేసినా ఆయన రాకపోవడంతో చేసేదేమిలేక కార్యక్రమాన్ని కొనసాగించారు. అయితే ఆ సమయంలో ధర్మాన ప్రసాదరావు పార్టీ కార్యాలయంలోనే ఉండి కూడా కార్యక్రమానికి రాకపోవడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. అంతేకాదు ధర్మాన కృష్ణదాస్‌ పార్టీ కార్యాలయం నుంచి వెళ్లిపోగానే ధర్మాన ప్రసాదరావు అనుచరులు ధర్మాన కృష్ణదాస్‌ ఫ్లైక్సీలను వెంటనే తొలగించారు. మంత్రి పదవి దక్కలేదన్న అసంతృప్తితో ధర్మాన ప్రసాదరావు వర్గీయులు ఇలా చేసారని జిల్లాలో కొందరు నాయకులు గుసగుసలాడుకుంటున్నారట. మొత్తం మీద ఇప్పటికే జిల్లాలో పలుచోట్ల అంతర్గత విభేదాలతో పార్టీ బలహీన పడుతుందన్న చర్చ ఒకవైపు నడుస్తుండగానే తాజాగా తెరపైకి వచ్చిన అన్నదమ్ముల పదవీ వైరం ఎటువైపు దారితీస్తుందోనని పార్టీ శ్రేణులు కలవరపడుతున్నాయట. మరి సోదరుల పంచాయితినీ, వైసీపీ అధిష్టానం ఎలా పరిష్కరిస్తుందో చూడాలి.

బీజేపీలోకి హరీష్ రావు.. టీఆర్ఎస్ లో చీలిక!!

  బంతిని నేలకి ఎంత బలంగా విసిరితే.. నింగికి అంత బలంగా ఎగురుతుంది. ఇప్పుడు టీఆర్ఎస్ లో ఇదే జరగబోతుందేమోనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒకప్పుడు టీఆర్ఎస్ అంటే కేసీఆర్ తరువాత హరీష్ రావు పేరు వినిపించేది. కష్ట కాలంలో కేసీఆర్ కి అండగా ఉంటూ పార్టీని బలపరచడానికి హరీష్ కృషి చేసారు. గెలుపు అసాధ్యం అనుకున్న స్థానాల్లో కూడా హరీష్ పార్టీని గెలిపించి చూపించారు. ట్రబుల్ షూటర్ గా పేరుతెచ్చుకున్నారు. కానీ ఇదంతా ఒకప్పుడు. ఇప్పుడు లెక్క పూర్తిగా మారిపోయింది. ఒకప్పుడు కేసీఆర్ కి పార్టీలో ఏ వ్యవహారమైనా ముందుగా మేనల్లుడు హరీష్ పేరు గుర్తుకొచ్చేది. కానీ ఇప్పుడు పూర్తిగా పక్కన పెట్టేస్తున్నారు. ఈ మార్పు ఇటీవల స్పష్టంగా కనిపిస్తుంది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కూడా అసాధ్యమనుకున్న స్థానాల్లో హరీష్ టీఆర్ఎస్ జెండా ఎగిరేలా చేసారు. అయితే అప్పటికే కేసీఆర్ తన కుమారుడు కేటీఆర్ కోసం హరీష్ ని పక్కన పెడుతున్నారనే ప్రచారం జరిగేది. ఎన్నికల తరువాత ఆ ప్రచారం మరింత బలపడింది. హరీష్ కి మంత్రివర్గంలో చోటులేదు, పార్టీలో సరైన స్థానంలేదు. దీంతో హరీష్ అభిమానుల్లో ఆవేదన మొదలైంది. అయితే హరీష్ మాత్రం ఎప్పుడూ కేసీఆర్ కి కానీ, పార్టీకి కానీ వ్యతిరేకంగా ఒక్క వ్యాఖ్య కూడా చేయలేదు. తన విధేయత చూపుతూ వస్తున్నారు. అయితే కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్రారంభోత్సవంతో.. హరీష్ కి అన్యాయం జరుగుతుందనే చర్చ మళ్ళీ తెర మీదకు వచ్చింది. కాళేశ్వరం ప్రాజెక్ట్‌ కోసం ఎంతో శ్రమించిన హరీష్‌కు.. కనీసం ప్రాజెక్ట్ ప్రారంభోత్సవానికి ఆహ్వానం లేకపోవడంతో ఆయన అభిమానులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటు పార్టీ శ్రేణుల్లోనూ, అటు సామాన్య ప్రజల్లోనూ హరీష్ పై సానుభూతి వ్యక్తమవుతోంది. అయితే హరీష్ మాత్రం ఇంత జరుగుతున్నా తన విధేయత చాటుకుంటూనే ఉన్నారు. సిద్దిపేటలో ఘనంగా కాళేశ్వరం ప్రారంభోత్సవ వేడుకలు నిర్వహించి.. ప్రాజెక్ట్ క్రెడిట్ అంతా కేసీఆర్ దే అనేసారు. దీంతో హరీష్ మీద ప్రజల్లో మరింత సానుభూతి, అభిమానం పెరిగాయి. అయితే ఇవన్నీ మౌనంగా భరిస్తూ విధేయత చూపుతున్న హరీష్.. ఎప్పుడో అగ్నిపర్వతంలా పేలి పార్టీలో ప్రళయం సృష్టిస్తారనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. మరోవైపు బీజేపీ చూపు కూడా ఇప్పుడు హరీష్ పై పడినట్లు తెలుస్తోంది. ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణలో నాలుగు ఎంపీ సీట్లు గెలవడంతో బీజేపీలో ఎక్కడలేని ఉత్సాహం వచ్చింది. తెలంగాణలో 2023 లో అధికారమే లక్ష్యంగా పార్టీని బలపరచాలని అడుగులు వేస్తోంది. ఇప్పటికే పలువురు నేతలను కూడా పార్టీలో చేర్చుకుంది. అయితే బీజేపీ ఇలా నెమ్మది నెమ్మదిగా బలపడటం కంటే ఒకేసారి కుంభస్థలాన్ని కొట్టాలని చూస్తోందట. అందుకే ఇప్పుడు హరీష్ ని పార్టీలో చేర్చుకునే దిశగా పావులు కదుపుతోందట. హరీష్ చేరితే టీఆర్ఎస్ లో చీలిక వచ్చి బీజేపీ తిరుగులేని శక్తిగా ఎదుగుతుందనేది ఆ పార్టీ పెద్దల భావనగా తెలుస్తోంది. ఎలాగూ ఇప్పట్లో కాంగ్రెస్ కోలుకొనే పరిస్థితి లేదు. హరీష్ వస్తే టీఆర్ఎస్ బలం కూడా తగ్గుతుంది. దీంతో 2023 అధికారంలోకి రావాలనే ఆశ నెరవేరుతుంది. ఇదే ప్రస్తుతం బీజేపీ ప్లాన్ అని తెలుస్తోంది. మరి హరీష్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.

ఒక పరాజయం 100 తప్పులు.. మల్లెపూల గురించి మాట్లాడేవారు అధికార ప్రతినిధులా?

  నాయకులు చేసే పనులు మాత్రమే కాదు, వారి మాటలు కూడా.. వారి మీద, వారి పార్టీ మీద తీవ్ర ప్రభావం చూపుతాయి. అందుకే నాయకులకు నాలుక అదుపులో ఉండాలి. ఏదైనా మాట్లాడే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించి మాట్లాడాలి. కానీ టీడీపీ అధికార ప్రతినిధులు ఈ విషయాన్ని మరచి మీడియా ముందు నోటికొచ్చినట్లు వాగి పార్టీ ప్రతిష్టను దెబ్బ తీశారు. అలాంటి వారిని పార్టీ అధికార ప్రతినిధులుగా ఎంపిక చేసిన చంద్రబాబు పెద్ద తప్పు చేశారు. ఇప్పుడు ఫలితం అనుభవిస్తున్నారు. అసలు పార్టీ అధికార ప్రతినిధులంటే ఎలా ఉండాలి? పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి. కార్యకర్తలను ఉత్తేజ పరిచేలా ప్రసంగించాలి. కానీ టీడీపీ అధికార ప్రతినిధులు ఎలా ఉన్నారు?. బాబు, లోకేష్ లకు భజన చేయడం, ఇతర పార్టీ నేతలను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ విమర్శలు చేయడం, బూతులు తిట్టడం. వీళ్లా అధికార ప్రతినిధులు?. యామిని సాధినేని ఏమో మల్లెపూలు అంటారు, సీఎం రమేష్ 'నీ అమ్మ' అంటారు, రాజేంద్ర ప్రసాద్ ఏమో ప్రతిపక్ష నేత మీద దాడి జరిగితే వాళ్ళ అమ్మ, చెల్లెలే చేశారు అంటారు. ఇలా వీరు నోరు అదుపులోలేకుండా మాట్లాడిన మాటలు కోకొల్లలు. బూతులు మాట్లాడేవారు, వ్యక్తిగతంగా విమర్శలు చేసే వారు అధికార ప్రతినిధులా? అసలు వీరికి ఏ అర్హత ఉందని అధికార ప్రతినిధులుగా నియమించారు?. బాబుకి, లోకేష్ కి డప్పు కొట్టడమేనా వీరికున్న అర్హత?. గతంలో టీడీపీ శిక్షణ తరగతులు నిర్వహించేది. పార్టీ పట్ల నిబద్ధత ఉన్నవారిని, అద్భుతంగా ప్రసంగించే వారిని అధికార ప్రతినిధులుగా నియమించేవారు. కానీ ఇప్పుడు.. బాబు, లోకేష్ లు మెచ్చేవారు, వాయిద్దరికి భజనచేసేవారు అధికార ప్రతినిధులు అయ్యారు. వారేం చేశారు?. నోటిదూలతో పార్టీ ప్రతిష్ట దెబ్బదీసారు, ప్రజల్లో పార్టీపై చులకన భావం వచ్చేలా చేశారు. మొత్తానికి పార్టీ ఓటమికి కారణమయ్యారు.  

చంద్రబాబుకు మోదీ మార్క్ దెబ్బ!!

  కేంద్రంలో అఖండ మెజార్టీతో రెండోసారి గద్దెనెక్కిన బీజేపీ ఇప్పుడు తమ శత్రువైన చంద్రబాబుని టార్గెట్ చేసింది. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రాకుండా ప్రాంతీయ పార్టీల కూటమి కట్టి కాంగ్రెస్ కు సపోర్టుగా రాజకీయం చేసిన చంద్రబాబుకు తమ దెబ్బ రుచి చూపిస్తున్నారు. అటు కేంద్రంలో మోదీ, ఇటు ఏపీలో వైపీపీ అధికారంలోకి రావ‌టంతో త‌మ‌కు క‌ష్టాలు త‌ప్ప‌వ‌ని టీడీపీ నేత‌లు ముందుగానే ఊహించారు. అయితే ఇంత త్వ‌ర‌గా బీజేపీ ఆప‌రేష‌న్ మొద‌లు పెడుతుంద‌ని, చంద్ర‌బాబును ఇంత త్వ‌ర‌గా కోలుకోలేని దెబ్బ తీస్తుందని ఎవ‌రూ ఊహించ‌లేదు. త‌న‌ను అవ‌మానించిన చంద్రబాబును అదే స్థాయిలో మోదీ ఇప్పుడు దెబ్బ కొడుతున్నారు. 2014 ఎన్నిక‌ల్లో మోదీ, చంద్రబాబు మిత్రులు. ప్ర‌త్యేక హోదా పేరుతో కేంద్ర ప్ర‌భుత్వం నుండి టీడీపీ బ‌యటకు వచ్చి ఎన్డీఏకు గుడ్ బై చెప్పింది. ఏపీకి మోదీ, అమిత్ షా వ‌చ్చిన స‌మ‌యంలో టీడీపీ నేత‌ల నిర‌స‌న‌లు శృతి మించాయి. ఏపీకి మోదీని శ‌త్రువుగా క్రియేట్ చేయ‌టంలో చంద్ర‌బాబు స‌క్సెస్ అయ్యారు. అదే మోదీకి ఆగ్ర‌హం తెప్పించింది. ఏపీలో తాను తిరిగి అధికారంలోకి రావ‌టం కోసం నాడు చంద్ర‌బాబు మోదీని ప్ర‌ధాన ముద్దాయిగా చూపించి, మోదీని తాను మాత్ర‌మే ఎద‌ర్కోగ‌ల‌న‌ని ఎన్నిక‌ల ప్ర‌చారంలో చెప్పుకొన్నారు. మోదీ ఏపీకి ఏమీ చేయ‌లేద‌ని, మోదీని ఏపీలో విల‌న్ గా చూపించే ప్ర‌య‌త్నం చేసారు. ఇక‌, మోదీని ప‌దేప‌దే త‌న‌కంటే జూనియ‌ర్ అనీ, గోద్రా అల్లర్లలో మోదీ రాక్ష‌సంగా వేలాది మంది మైనారిటీలను చంపించార‌ని చంద్ర‌బాబు తీవ్ర వ్యాఖ్య‌లు చేసారు. గోద్రా కేసులో మోదీని అరెస్ట్ చేయాల‌ని తొలుత డిమాండ్ చేసింది తానే అంటూ చంద్ర‌బాబు ప‌లు మార్లు చెప్పుకొచ్చారు. మోదీ ఎన్నిక‌ల్లో ఈవీఎంల‌ను మేనేజ్ చేస్తున్నార‌ని చంద్ర‌బాబు ఆరోపించారు. చంద్ర‌బాబుని మోదీ ఈ స్థాయిలో టార్గెట్ చేయటానికి కార‌ణం ఆయన మోదీపైన చేసిన వ్య‌క్తిగ‌త ఆరోపణలే కారణం అని సమాచారం. ఏపీలో టీడీపీ లేకుండా చేట‌య‌మే ల‌క్ష్యంగా ఇప్పుడు మోదీ, అమిత్ షా ప‌ని చేస్తున్నారు. దీనిలో భాగంగానే టీడీపీ అధినేత చంద్రబాబుకు ఆర్థికంగా వెన్నుదన్నుగా నిలబడ్డ సన్నిహిత పారిశ్రామికవేత్తలు - టీడీపీ రాజ్యసభ సభ్యులు సుజనాచౌదరి, సీఎం రమేష్ లతోపాటు మరో ఇద్దరు ఎంపీలు గరికపాటి రామ్మోహన్, టీజీ వెంకటేశ్ లు ఇప్పుడు బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధం చేశారు. వీరు త‌మ నలుగురిని ప్రత్యేక గ్రూపుగా భావించి రాజ్యసభలో బీజేపీ అనుబంధ సభ్యులుగా గుర్తించాలని రాజ్య‌స‌భ ఛైర్మ‌న్‌ వెంకయ్యనాయుడి కి లేఖ ఇవ్వాల‌ని నిర్ణ‌యించారు. ఈ నలుగురు ఎంపీలను బీజేపీలో చేర్చుకునే బాధ్యతను పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జేపీ నడ్డాకు అమిత్ షా అప్పగించినట్లు తెలుస్తోంది. ఇదంతా బీజేపీ అధినాయ‌క‌త్వం సూచ‌న‌ల మేర‌కే జరుగుతున్నట్లు స‌మాచారం. మ‌రో ఇద్ద‌రు స‌భ్యులు క‌న‌క‌మేడ‌ల ర‌వీంద్ర‌బాబు, సీతారామ‌ల‌క్ష్మి మాత్ర‌మే టీడీపీలో కొన‌సాగే అవ‌కాశం క‌నిపిస్తోంది. అయితే వీరిద్దరిని కూడా బీజేపీలో చేర్చుకునేందుకు అమిత్ షా తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని సమాచారం. రాజ్యసభ ఎంపీలతో పాటు లోక్‌సభ ఎంపీలను కూడా లాక్కునేందుకు బీజేపీ ప్రణాళికలు రచిస్తోంది. ఇప్పటికే విజయవాడ ఎంపీ కేశినేని నాని ఆ పార్టీతో టచ్‌లోకి వచ్చినట్లు సమాచారం. ఇటీవల కేంద్రమంత్రి నితిన్ గడ్కరిని ఆయన కలిసొచ్చిన సంగతి తెలిసిందే. త్వరలోనే నాని కమలం గూటికి చేరడం ఖాయమని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. బుధవారమే కుటుంబ సభ్యులతో కలిసి చంద్రబాబు విదేశీ పర్యటనకు వెళ్లారు. మరి ఈ సంక్షోభ స‌మ‌మంలో చంద్ర‌బాబుకు మ‌ద్ద‌తుగా నిలిచేదెవరో వేచి చూడాలి!!

ఒక పరాజయం 100 తప్పులు.. బాబు ఓటమిలో కీ రోల్ ప్లే చేసిన అగ్రిగోల్డ్!!

  అగ్రిగోల్డ్ విషయంలో చంద్రబాబు& కో వేసిన తప్పటడుగు కొన్ని లక్షల ఓట్లు టీడీపీకి వ్యతిరేకంగా పడేలా చేశాయని చెప్పవచ్చు. అగ్రిగోల్డ్ సంస్థలో కొన్ని లక్షల కుటుంబాలు డిపాజిట్ చేసి మోస పోయాయి. అయితే అప్పుడు బాబు సర్కార్ అమలు కానీ హామీని ఇచ్చి సమస్యని నెత్తి మీదకు తెచ్చుకుంది. డిపాజిటర్ల డబ్బులన్నీ ప్రభుత్వమే తిరిగిస్తుందని చెప్పింది. దీంతో విపక్షాలు ఈ విషయంలో బాబుని టార్గెట్ చేశాయి. బాబు సర్కార్ డబ్బులు చెల్లించలేకపోవడం, విపక్షాలు పదే పదే విమర్శలు చేస్తుండడంతో.. డబ్బులు వస్తాయన్న ఆశతో ఉన్న డిపాజిటర్లకు బాబు సర్కార్ మీద వ్యతిరేకత మొదలైంది. అసలు డిపాజిటర్లకు డబ్బులు ప్రభుత్వం తిరిగి ఇవ్వాలన్న సలహా బాబుకి ఎవరు చెప్పారో కానీ.. ఎంతో అనుభవం ఉన్న బాబు ఏ మాత్రం ఆలోచించకుండా ఆ సలహాను పాటించడం ఆయన చేసిన పెద్ద తప్పు. అసలు ఓ ప్రైవేట్ సంస్థ మోసం చేస్తే ప్రభుత్వం ఎందుకు చెల్లించాలి?. అంటే ప్రైవేట్ సంస్థలు మోసం చేసుకుంటూ పోతుంటే.. ప్రభుత్వం అవి చెల్లించుకుంటూ ఖజానా ఖాళీ చేసుకుంటూ రావాలా?. అసలే లోటు బడ్జెట్.. దానికి తోడు ఇలాంటి హామీలు ఇచ్చి కొత్త తలనొప్పులు తెచ్చుకున్నారు. అగ్రిగోల్డ్ విషయంలో నిజంగా బాధితులకు న్యాయం చేయాలనుకుంటే.. అది ఆ సంస్థ ముక్కు పిండి వసూలు చేసి ఆదుకోవాలి. చట్టం ద్వారా ఆ సంస్థ ఆస్తులు, అప్పులు అంచనా వేసి.. ఆస్తులను వేలం వేసి బాధితులకు డబ్బు చెల్లించాలి. కానీ ముందుకి ముందే పోయేదేముంది మాటేగా అనుకొని డబ్బులు ప్రభుత్వం చెల్లిస్తుంది అన్నారు. తీరా అది సాధ్యపడక.. విపక్షాల నుంచి విమర్శలు, ప్రజల నుంచి వ్యతిరేకత ఎదుర్కొన్నారు. అంతేకాదు అగ్రిగోల్డ్ ఆస్తులపై అప్పటి టీడీపీ మంత్రులు, ఎమ్మెల్యేల కన్ను పడిందని కూడా ఆరోపణలు వచ్చాయి. వీటిని తిప్పికొట్టడంలో టీడీపీ పూర్తిగా విఫలమైంది. మొత్తానికి అగ్రిగోల్డ్ వ్యవహారం పుణ్యమా అని టీడీపీ.. ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత మూటగట్టుకొని ఎన్నో లక్షల ఓట్లను దూరం చేసుకుంది. అధికారానికి దూరమైంది.