మళ్ళీ 'ప్ర.సా.దు'లను మొదలుపెడుతున్న జగన్ సర్కార్....ప్రయత్నం మంచిదే కానీ ?

  గత ఎన్నికల్లో గెలిచేందుకు వైఎస్ జగన్ ఇచ్చిన హామీలలో ముఖ్యమైన హామీ మద్యపాన నిషేధం. ఈ పధకం నచ్చి ఆడపడుచులు వోట్లు వేశారో లేదో ? తెలీదు కానీ, ఆ పధకం అమలు చేయకుంటే ప్రతిపక్షాల నుండి వస్తున్న ఒత్తిడిని తట్టుకోలేక దశలవారీగా మద్యపాన నిషేధం చేస్తామని చెబుత్నున్నారు. అందులో భాగంగా ఒక ఆసక్తికర అంశం వెలుగులోకి వచ్చింది. అదేంటంటే ప్రభుత్వమే స్వయంగా మద్యం వ్యాపారంలోకి ప్రవేశించనుందట.  దానికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చేసేందుకు వీలుగా చట్ట సవరణ కూడా చేయాలని భావిస్జోంది. ఆ ముసాయిదా బిల్లును మంత్రివర్గం నిన్న ఆమోదించింది. మరో రెండు రోజుల్లో ఈ బిల్లు ఉభయ సభలకు రానుందని అంటున్నారు. చట్ట సవరణ తరువాత అక్టోబర్ 1 నుంచి ఏర్పాటయ్యే నూతన మద్యం పాలసీ ప్రకారం ప్రైవేటు మద్యం దుకాణాల స్ధానంలో ప్రభుత్వ మద్యం దుకాణాలు ఏర్పాటు అవుతాయి. తొలి దశలో 1,095 మద్యం దుకాణాలు రద్దు చేయాలని క్యాబినెట్ భేటీలో నిర్ణయించారు.  రాష్ట్రంలో ప్రస్తుతం 4,380 మద్యం దుకాణాలకు లైసెన్సులు ఉండగా, వీటిలో 25 శాతం అంటే 1,095 దుకాణాలు రద్దుచేయాలని తీర్మానించింది. దీంతో ఇప్పటి దాకా  బ్రూవరీస్‌ల్లో తయారైన మద్యాన్ని కొనుగోలు చేసి, మద్యం లైసెన్సుదారులకు విక్రయించటానికే పరిమితం అయిన ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర బేవరేజస్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (ఏపీఎస్‌బీసీఎల్‌) స్వయంగా మద్యం దుకాణాలను నడపనుంది. ఇక మద్యం ధరలను కూడా పెంచడం ద్వారా ఎక్సైజ్ సుంకం ఆదాయాన్ని రూ. 2,500 కోట్లకు పెంచుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది.  వ్యాట్‌ రూపంలో వచ్చే ఆదాయం దీనికి అదనం. ధర అధికంగా ఉంటే, తాగేవారి సంఖ్య తగ్గుతుందన్నది ఎక్సైజ్ వర్గాల లాజిక్. అయితే మద్యం దుకాణాలను ప్రభుత్వమే నిర్వహించడం ద్వారా లైసెన్సుల రూపంలో వచ్చే ఆదాయం కోల్పోతుంది. కానీ, అదే సమయంలో లైసెన్సుదారులకు ప్రభుత్వం చెల్లించే కమీషన్‌ మొత్తం మిగులుతుందని ప్రభుత్వం భావిస్తోంది.  నిజానికి ఆంధ్రలో 1937లో మొదటిసారి ఎన్నికల ద్వారా ఏర్పాటయిన కాంగ్రెస్‌ రాష్ట్ర ప్రభుత్వాలు కొన్ని చోట్ల మద్యనిషేధాన్ని అమలు చేసింది.  అయితే 1969లో మద్య నిషేధం తొలగిపోయి ఆంధ్రప్రదేశ్‌ అంతా సారా సామ్రాజ్యంగా ఏర్పడింది. టార్గెట్లు పెట్టి ప్రజల చేత ఎక్కువ తాగించి పన్నులు వసూళ్లు చేసుకునే స్థితికి ఎక్సైజ్‌ శాఖ చేరుకుంది. అలాంటి సమయంలో అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం ప్రభుత్వం మద్యం అమ్మకాలను ప్రభుత్వమే నిర్వహించి పన్నుల బదులు, లాభాలు సంపాదించవచ్చుననే ఆలోచనతో వారుణివాహిని అనే సారా తయారుచేసి ప్రభుత్వ సారా దుకాణాల్లో (ప్రసాదు) అమ్మించడం ప్రారంభించింది.  దీంతో కొన్నాళ్ళకి సారా అమ్మకాలు బంద్ చేయాలని 1990లలో ఉద్యమం మొదలైంది. సారా దుకాణాలను తగులబెట్టడం, సారా పారబోయడం వంటి క్రియాశీల పోరాట రూపాలు మొదలయ్యాయి. అప్పుడు ప్రభుత్వం స్వయంగా పోలీసు స్టేషన్లలో, పోలీసులతో సారా అమ్మించడం కూడా చేసింది అంటే ఆలోచించండి. అది ఎంతలా జనాన్ని ప్రాభావితం చేసింది అంటే 1993లో నెల్లూరు జిల్లా దూబగుంటలో రోశమ్మ నాయకత్వాన ప్రారంభమైన మద్యపాన నిషేధం చరిత్రాత్మక పోరాటంగా మారింది.  అదే 1994 ఎన్నికలలో నాటి ఎన్టీఆర్ తెలుగుదేశం నినాదంగా కూడ మారి, కొత్త ప్రభుత్వం ఏర్పాటు అయ్యాక మద్యనిషేధం ప్రకటించవలసి వచ్చింది. కానీ ఆదాయ వనరులు సరిపోక చంద్రబాబు నాయుడు 1997 లో ఆ నిషేధాన్ని ఎత్తివేసినప్పటి నుంచీ మళ్లీ ఉమ్మడి రాష్ట్రంలో సారా ఏరులై పారింది. ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా ఏడాదికేడాదికీ ఎక్కువ ఆదాయ లక్ష్యాలు నిర్ణయించి ప్రజలచేత మరింతగా తాగించడానికి పూనుకుంది. ఆ ఎక్సైజ్‌ విధానాలనే ఆ తర్వాత రాజశేఖరరెడ్డి, రోశయ్య, కిరణ్‌ కుమార్‌ రెడ్డి ప్రభుత్వాలు కొనసాగించాయి.  కానీ ఇప్పటి జగన్ సర్కార్ ఆదాయం వద్దు, ప్రజల సుఖ సంతోషాలే ముద్దు అని ఆలోచించడం బాగానే ఉంది, కానీ ఆనాటిలా ఇప్పుడు కూడా స్వయంగా పోలీసు స్టేషన్లలో, పోలీసులతో మద్యం అమ్మిస్తే ఏమిటో పరిస్థితి. ఆదాయం చాలదు అనుకున్నప్పుడు అసలు ఇలాంటి హామీలు ఇవ్వకుండా ఉండాల్సింది. కానీ ఇప్పుడు పాతిక వంతున దుకాణాలను రద్దు చేస్తే ఆజనం అంతా మిగతా షాపుల మీద పడతారు. తద్వారా సమయాభావం ఏర్పడి అక్కడే తోపులాటలు కొట్లాటలు వంటి సమస్యలు ఏర్పడినా ఏర్పడవచ్చు. చూద్దాం ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ఎంత మేరకు సత్ఫలితాన్ని ఇస్తుందో ?  

జగన్ కి షాకిచ్చిన వరల్డ్ బ్యాంక్...వేలితో కన్ను పొడుచుకున్నట్టయ్యింది !

  అనుకున్నదే అయ్యింది, గతంలో మేము ప్రస్తావించినట్టే అమరావతి నిర్మాణం మీద నీలి నీడలు కమ్ముకున్నాయి. ఏపీ నూతన ప్రభుత్వానికి ప్రపంచ బ్యాంక్ పెద్ద షాకే ఇచ్చింది. నవ్యాంధ్ర కలల రాజధాని అమరావతి అభివృద్ధి ప్రాజెక్ట్ విషయంలో చేతులెత్తేసింది. రాజధాని నిర్మాణానికి రుణం కోసం ప్రభుత్వం దరఖాస్తు చేసుకోగా అలాంటిది ఏదీ ఇవ్వమని చెబుతూ రుణ సహాయాన్ని నిలిపివేసింది. ఏపీ ప్రభుత్వం 300 మిలియన్‌ డాలర్ల రుణ సాయాన్ని ప్రపంచ బ్యాంక్ ని కోరగా దాని నుంచి తప్పుకుంటున్నట్లు ప్రపంచ బ్యాంక్ తెలిపింది.  ఈ మేరకు బ్యాంక్ వెబ్‌సైట్‌లో ఈ విషయాన్ని పొందుపరిచారు. ఏపీలో జగన్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రపంచబ్యాంకు ఈ నిర్ణయం తీసుకోవడం సర్వత్రా ఆశ్చర్యం కలిగిస్తోంది. తాజా నిర్ణయంతో అమరావతి రాజధాని నిర్మాణం నుంచి ప్రపంచబ్యాంకు తప్పుకున్నట్టయింది. గత ప్రభుత్వ హయాంలో అమరావతి నిర్మాణం మీద ఇప్పటి ప్రభుత్వం అప్పుడు ప్రతిపక్షంలోప్ ఉండి సంచలన ఆరోపణలు చేసింది.  అయితే అప్పుడు ప్రపంచబ్యాంకు బృందం అమరావతిని సందర్శించి పూర్తిస్థాయిలో సంతృప్తి చెందడమే కాకుండా మరింతగా ఆర్థికంగా సహాయపడాలని నిర్ణయించింది. ప్రపంచ బ్యాంక్ నుండి అమరావతి నిర్మాణం రూపేణా రుణం కోసం చంద్రబాబు ప్రభుత్వం 2016 నుంచి ప్రయత్నాలు చేస్తోంది. ప్రయత్నాల్లో భాగంగా రాజధాని నిర్మాణానికి అమరావతి అభివృద్ధి కోసం రూ.7200కోట్ల రుణానికి ప్రతిపాదనలు ప్రపంచ బ్యాంకుకి సీఆర్డీయే పంపింది. దీనిలో భాగంగా తొలివిడతగా 3200కోట్లు, రెండో విడతగా మరో 3200కోట్లు తీసుకునేలా ఒప్పందం కుదిరింది.  కానీ అప్పుడే అప్పటి ప్రతిపక్షంలో జగన్ పార్టీ నుండి కొందరు రాజ‌ధాని విష‌యంలో కోర్టుల‌కు, గ్రీన్ ట్రిబ్యూన‌ల్ కి కూడా ఫిర్యాదులు చేశారు. వ‌ర‌ద‌ముప్పు, వివిధ పంట‌లు పండించే ప్రాంతం, సామాజిక‌, ప‌ర్యావ‌ర‌ణ కోణంలో జ‌రిగేన‌ష్టం వంటి అంశాల‌ను ముందుకు తీసుకొచ్చారు. అక్కడితో ఆగక ప్ర‌భుత్వం రాజ‌ధాని విష‌యంలో ప్ర‌జాభిప్రాయానికి భిన్నంగా వెళుతుందంటూ రాజ‌ధాని ప్రాంత రైతుల పేరిట కొంద‌రు 2017 మే 25 నాడు ప్ర‌పంచ‌బ్యాంక్ కి ఈమెయిల్స్ పంపి ఫిర్యాదు చేశారు.  ప్ర‌పంచ‌బ్యాంక్ ప్ర‌తినిధి బృందం స్వ‌యంగా వ‌చ్చి ప‌రిశీల‌న చేయాల‌ని కోరారు. అదే సంవ‌త్స‌రం జూన్ 12నాడు ఫిర్యాదుని స్వీక‌రించిన ప్ర‌పంచ‌బ్యాంక్ బృందం 2017 సెప్టెంబ‌ర్ లో ఇండియాలో ప‌ర్య‌టించింది. ఆ స‌మ‌యంలో ల్యాండ్ ఫూలింగ్ విధానంపై అభ్యంత‌రాల‌తో పాటు స‌మ‌ర్థిస్తున్న రైతులు కూడా ప్ర‌పంచ‌బ్యాంక్ పానెల్ బృందాన్నిక‌లిశారు. ఏపీ ప్ర‌భుత్వ అధికారులు కూడా ప్రపంచ‌బ్యాంక్ బృందం ముందు త‌మ వాద‌న‌ వినిపించారు.  అయితే అమరావతి వచ్చి స‌మ‌గ్ర విచార‌ణ చేయడం అవ‌స‌రమని ప్ర‌పంచ‌బ్యాంక్ బృందం తేల్చింది. అప్పుడు వరల్డ్ బ్యాంక్ ప్రతినిధులు అమరావతి వచ్చి అంతా గమనించి క్లియరెన్స్ ఇచ్చారు. కానీ నిధులు కావాలంటే మరొమారు తనిఖీలు నిర్వహించాల్సిందేనని తేల్చిన ప్రపంచబ్యాంక్ తమ అభిప్రాయాన్ని ఈ నెల 23వ తేదీలోపుగా చెప్పాలని ఏపీ ప్రభుత్వానికి స్పష్టం చేసింది. రాజధాని నిర్మాణానికి సంబంధించి బ్యాంక్ ఇన్స్‌పెక్షన్ ప్యానెల్ తనిఖీలు చేయాలని స్పష్టం చేసిన నేపధ్యంలో ఈ మేరకు కేంద్రం నుండి రాష్ట్రానికి వరల్డ్ బ్యాంకు నుండి సమాచారం అందింది.  అయితే ఈ విషయమై తమకు మరింత గడువు కావాలని కేంద్రం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం లేఖ పంపింది కానీ ఆ లేఖకు ప్రపంచ బ్యాంకు స్పందించలేదు. కానీ కేంద్రం ఈ వ్యవహారంలో తమ నిర్ణయాన్ని రాష్ట్రానికి చెప్పేసింది .ప్రపంచబ్యాంక్ ఇన్స్‌పెక్షన్ ప్యానెల్ తనిఖీలు చేయడం అనేది కొత్త సంప్రదాయమని, అది ఇక్కడ చేయనిస్తే  దేశంలో ప్రపంచ బ్యాంకు నిధులతో చేపడుతున్న అన్ని ప్రాజెక్టులకు కూడా తనిఖీలు చెయ్యాలని చూస్తారని ఇది ఇబ్బందిగా మారే అవకాశం ఉందని కేంద్రం భావిస్తోంది.  ఈ తరుణంలో అమరావతి నిర్మాణానికి ప్రపంచ బ్యాంకు నిధులను తీసుకెళ్లే ప్రతిపాదనను విరమించుకోవాలని కేంద్రం రాష్ట్రానికి సూచించినట్టుగా తెలుస్తోంది. ఇతర మార్గాల ద్వారా రాజధాని నిర్మాణానికి నిధులను సమీకరించాలని కేంద్రం సూచించినట్టుగా చెబుతున్నారు. కానీ ప్రపంచ బ్యాంకు నుండి నిధుల సేకరణ ఆలోచన విరమించుకోవాలని తెలిపింది. ఆ విధంగా చివ‌ర‌కు తాజాగా ప్రాజెక్ట్ నుంచి వైదొలుగుతున్న‌ట్టు ప్ర‌పంచ‌బ్యాంక్ తేల్చి చెప్ప‌డం గ‌మ‌నార్హం.  ఇప్పుడు ప్రపంచబ్యాంకు నిర్ణయం నేపథ్యంలో ఆసియా డెవలప్ మెంట్ బ్యాంక్ (ఏడీబీ) రుణాల మీద కూడా అనుమానలు ఏర్పడ్డాయి. అమరావతి నిర్మాణం కోసం ఏడీబీ రూ.1400 కోట్లు ఇచ్చేందుకు ముందుకొచ్చింది. ఇప్పుడు ప్రపంచబ్యాంకు ఈ నిర్ణయం తీసుకోవడంతో ఏడీబీ కూడా అదే బాటలో పయనిస్తే జగన్ ఏమి చేస్తారు అనేది చర్చనీయాంశంగా మారింది. అయితే అప్పటి బాబు సర్కార్ ని ఇబ్బంది పెట్టాలని జగన్ పార్టీ చేసిన ఈమెయిల్స్ ఫిర్యాదులు ఇప్పుడు తమ ప్రభుత్వానికి పెను పరీక్షను తెచ్చిపెట్టాయి.

ఒక పరాజయం 100 తప్పులు.. టీడీపీ దుంప తెంచిన ఫిరాయింపులు

  అప్పట్లో ఫిరాయింపులకు వ్యతిరేకంగా పోరాడిన టీడీపీ.. 2014 లో అధికారంలోకి వచ్చిన తరువాత ఫిరాయింపులను ప్రోత్సహించి విమర్శలు ఎదుర్కొంది. అటు కార్యకర్తల్లో, ఇటు ప్రజల్లో వ్యతిరేకత మూటగట్టుకొని.. పతనం దిశగా అడుగులు వేసింది. ఫిరాయింపుల విషయంలో టీడీపీ తీవ్ర విమర్శలు ఎదుర్కోవడానికి ప్రధాన కారణం ఆ పార్టీ రెండు నాలుకల ధోరణి. ఓ వైపు తెలంగాణలో అధికార టీఆర్ఎస్ తమ పార్టీ ఎమ్మెల్యేలను సంతలో పశువుల్ని కొన్నట్టు కొంటుంది అంటూ గోల చేసిన టీడీపీ.. తీరా ఏపీలో అదే ఫిరాయింపులను ప్రోత్సహించింది. అప్పటి ప్రతిపక్ష వైసీపీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలను, నేతలను పార్టీలో చేర్చుకొని విమర్శలు ఎదుర్కొంది. అంతేకాదు ఫిరాయింపు నేతలకు పదవులు కట్టబెట్టి ఎప్పటినుంచో పార్టీనే నమ్ముకొని ఉన్న నేతల్లో అసంతృప్తిని కలిగించింది. తమ మీద పోటీ చేసిన నేతలు, ఇప్పుడు తమ పార్టీలోకి వచ్చి తమ మీదే పెత్తనం చెలాయించడం వారు తట్టుకోలేకపోయారు. ఈ ఫిరాయింపుల వల్ల కార్యకర్తల్లో కూడా అసహనం పెరిగింది. మొన్నటివరకు తమ నాయకులను, తమ పార్టీని తిట్టిన వారికి.. ఇప్పుడు తాము జై కొట్టాల్సి వస్తుందని వారు ఆవేదన వ్యక్తం చేసారు. మరోవైపు ఈ ఫిరాయింపులను వైసీపీ అస్త్రంగా మలుచుకొని ఈ విషయాన్నీ ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లింది. దీంతో ప్రజల్లో వ్యతిరేకత మొదలైంది. మొత్తానికి ఫిరాయింపులు కూడా ఓ రకంగా టీడీపీ ఓటమికి కారణమయ్యాయనే చెప్పాలి.

జగన్ బాటలోనే లోకేష్...కానీ ?

  ఏపీ సీఎం కావడానికి జగన్ తీసుకున్న నిర్ణయాల్లో ఆయన చేపట్టిన పాదయాత్ర ముఖ్యమైనదని చెప్పాలి. ఆయన ప్రజల్లో మమేకం అవ్వడానికి ఈ పాదయాత్ర బాగా ఉపయోగపడింది. ఈ క్రమంలో ఆయన బాటలో మాజీ మంత్రి నారా లోకేష్ ‌కూడా ఈ పాదయాత్ర చేపట్టే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పార్టీ నేతలు జంప్ కావడానికి సిద్దంగా ఉన్నారు. ఈ క్రమంలో పార్టీ శ్రేణుల్లో నమ్మకాన్ని నింపి తన అనుభవం కూడా పెంచుకునే ఉద్దేశంతో నారా లోకేష్ ఈ పాదయాత్ర చేపడుతున్నట్లు పార్టీ వర్గాల నుండి విశ్వసనీయంగా అందుతున్న సమాచారం.  అయితే అది జగన్ మాదిరి సుదీర్ఘ పాదయాత్ర కాకుండా విడతల వారీగా యాత్ర చేయాలనీ చినబాబు ఆలోచిస్తున్నట్లు టీడీపీ నేతలు చెబుతున్నారు. గత ఎన్నికల్లో చావు దెబ్బ తిన్న టిడిపి ఒకపక్క అధికార పార్టీ దాడులతో, మరోపక్క బీజేపీలోకి ఫిరాయింపులతో ఊపిరి సలపలేకుండా పోతోంది. బాబు వల్ల కూడా కావడం లేదని, ఇక టీడీపీని కాపాడాలంటే జూనియర్ ఎన్టీఆర్ రంగంలోకి దిగాలని కొందరు, లేదు బాలయ్య అండర్ లోకి వెళ్ళాలని మరి కొందరు రకరకాల వ్యాఖ్యలు చేస్తున్నారు.  మరోపక్క అధికార పాఖం లోకేష్ కి పప్పు అనే నిక్ నేమ్ జనాల్లోకి తీసుకెళ్లడంలో సక్సెస్ అయ్యారు. ఈ నేపధ్యంలో తనపై జరిగిన దుష్ప్రచారానికి చెక్ పెట్టడానికి లోకేష్ సంసిద్ధమవుతున్నారని అంటున్నారు. గత 2004 ఎన్నికల ముందు వైఎస్ పాదయాత్ర 2014 ఎన్నికల ముందు అంటే 2012లో చంద్రబాబు వస్తున్నా మీకోసం పాదయాత్ర చేసి అధికారంలోకి వచ్చారు. మొన్న  2019 ఎన్నికల్లో ప్రజా సంకల్ప యాత్ర చేసి జగన్ ప్రస్తుతం అధికారంలో ఉన్నారు. దీంతో పాదయాత్ర చేసిన వారు అధికారంలోకి వస్తారనే సెంటిమెంట్ ఏర్పడింది.  అందుకే ఇప్పుడు చిన బాబు పాదయాత్రకు శ్రీకారం చుట్టారని అంటున్నారు.  అయితే వారు చెబుతున్న ఈ విడతల వారీ పాదయాత్ర అనేది సరయిన ఫలితాన్ని ఇవ్వదేమో అనే అనుమానాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే గత వైఎస్ జగన్ పాదయాత్ర అప్పుడు కూడా ఆయన శుక్రవారం అవగానే పాదయాత్రకి బ్రేక్ ఇచ్చి హైదరాబాద్ కోర్టుకు వెళ్ళేవారు. ఇప్పుడు ఈయనకి అలాంటి ఇబ్బందులు ఏవీ లేకున్నా ఎందుకు ఈ బ్రేక్ ఇస్తున్నారో లోకేష్ కే ఎరుక ! అదీ కాక ముచ్చటగా మూడు నెలల పాలన కూడా చూడకుండా ఇప్పుడే దాడి మొదలు పెడితే అది సత్ఫలితాన్ని ఇస్తుందా లేదనా అనే విషయం మీద కూడా తర్కించాల్సిన అవసరం ఉంది.      

ఒక పరాజయం 100 తప్పులు.. అడ్డూ అదుపూలేని దుబారా..!!

  విభజన అనంతరం కొత్త రాష్ట్రానికి అనుభవమున్న చంద్రబాబు సీఎం అయితే రాష్ట్ర అభివృద్ధి బాగుంటుందని ఏపీ ప్రజలు భావించారు. అందుకే ఏపీ ప్రజలు 2014 ఎన్నికల్లో బాబుకి పట్టంకట్టారు. కానీ బాబు చేసిన కొన్ని తప్పుల మూలంగా 2019 ఎన్నికల్లో ఘోర పరాజయం ఎదుర్కొని ప్రతిపక్షానికి పరిమితమయ్యారు. గత ఐదేళ్లల్లో బాబు చేసిన తప్పుల్లో దుబారా ఖర్చు ప్రధానమైనదని చెప్పవచ్చు. నూతన రాష్ట్రం, రాజధాని లేదు, లోటు బడ్జెట్.. ఇలా ఎన్నో సమస్యలున్న వేళ సీఎం అయిన బాబు.. అనసరంగా హంగు ఆర్భాటాలకు పోయి ప్రజా వ్యతిరేకత మూటగట్టుకున్నారు. ప్రమాణ స్వీకారంతో మొదలైన దుబారా.. బాబుని ప్రతిపక్షానికి సాగనంపేలా చేసింది. అసలే లోటు బడ్జెట్ అంటే కోట్లు ఖర్చుతో ప్రమాణ స్వీకారం చేసారు. ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరాబాద్ లోని భవనాల మరమత్తులు, ఆధునీకరణ పేరుతో కోట్లు ఖర్చు పెట్టారు. తీరా కొద్ది నెలలు కూడా ఉండకుండానే అమరావతికి మకాం మార్చారు. అక్కడ తాత్కాలిక భవనాలకు కోట్ల ఖర్చు. వీటికితోడు విదేశీ పర్యటనల కోసం ప్రత్యేక విమానాలు. ఇక నవనిర్మాణ దీక్షలు, ధర్మ పోరాట దీక్షలు సరేసరి. దీక్ష అంటే ఓ టెంట్ వేస్తే సరిపోతుంది. కానీ బాబు దీక్షలు మాత్రం.. భారీ స్టేజ్, చుట్టూ క్లాత్ డెకరేషన్, ఏసీలు అబ్బో ఇలా మాములు హడావుడి కాదు. బాబు అనుభవం కొత్త రాష్ట్రానికి ఎంతలా ఉపయోగపడింది అనే దానికంటే.. బాబు చేసిన దుబారా అప్పటి విపక్ష వైసీపీకి మాత్రం మంచి అస్త్రం అయిందనే చెప్పాలి. బాబు దుబారాను వైసీపీ ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లింది. దీంతో ప్రజల్లో బాబు మీద వ్యతిరేకత మొదలై, అది ఎన్నికల్లో ఓడించే వరకు వెళ్లిందనే చెప్పాలి.

ఏపీలో కొత్త పుంతలు తొక్కుతున్న జంపింగ్ పాలిటిక్స్ !

  ఏపీ రాజకీయాలు రకరకాల మలుపులు తిరుగుతున్నాయి. ఎక్కడైనా నాయకులు పార్టీ మారుతున్నారు అంటే అది అధినేతకు చెప్పకుండా సైలెంట్ గా వెళ్ళిపోయి పార్టీలో చేరి పాత అధినేత మీద రకరకాల ఆరోపణలు చేస్తారు. కానీ ఏపీలో మాత్రం పార్టీ మారుతున్నామని పార్టీ అధినేత దగ్గరకి వెళ్లి మరీ చెప్పి వస్తున్నారు. ఈ వింత పరిస్థితి తెలుగు దేశం పార్టీలో నెలకొంది. గత ఎన్నికల ముందు వరకూ మేమే రాజులం మేమే మంత్రులం అన్నట్టు ఏపీలో అధికారాన్ని చెలాయించిన ఆ పార్టీ నేతలు, ఇప్పుడు అధికారం కోల్పోవడంతో ఒక్కసారిగా రోడ్డున పడిపోయిన ఫీలింగ్ లో ఉన్నారు.  దానికి తోడు గత ప్రతిపక్షం ఎక్కడ తమను టార్గెట్ చేస్తుందో అనే భయంలో ఉన్న్నారు. ఇక వ్యాపారాలు ఉన్న నేతల సంగతి వర్ణనాతీతం. అందుకే వారు ప్రత్యామ్నాయ మార్గాలను చూసుకుంటున్నారు. ఇప్పాతికే ఆ పార్టీ నుండి నలుగు ఎంపీలు పార్టీ మారి బీజేపీలోకి వెళ్ళగా ఇప్పుడు మరో సీనియర్ నేత కూడా పార్టీ మారే యోచనలో ఉన్నట్టు చెబుతున్నారు. సీనియ‌ర్ నాయకుడు ప్రస్తుతం టీడీపీ నేత‌గా ఉన్న రాయ‌పాటి సాంబ‌శివ‌రావు టీడీపీ వీడి బీజేపీలో చేరేందుకు రంగం సిద్దమైంది !  రెండు మూడు రోజుల్లో రాయ‌పాటి బీజేపీ జాతీయాధ్య‌క్షుడు అమిత్ షా స‌మ‌క్షంలో బీజేపీలో చేర‌నున్నట్లు స‌మాచారం. రాయ‌పాటి బీజేపీలో చేర‌టం ద్వారా ఆయ‌న‌కు గుంటూరు జిల్లాలో ఉన్న అనుచర వ‌ర్గం మొత్తంగా బీజేపీలో చేరే అవ‌కాశం క‌నిపిస్తోంది. దీని పైన రాయ‌పాటి ఒక‌టి రెండు రోజుల్లో అధికారికంగా ప్ర‌క‌ట‌న చేయ‌నున్నారని అంటున్నారు. ఈ చేరికల విషయంలో కీలక పాత్ర పోషిస్తున్న రామ్ మాధవ్ రాయపాటి ఇంటికి వచ్చి తమ పార్టీలో చేరాలని ఆయనను ఆహ్వానించినట్టు తెలుస్తోంది.  కొద్ది రోజుల్లోనే తాను ఢిల్లీ వస్తానని... అక్కడ మరిన్ని విషయాలు మాట్లాడతానని రాయపాటి రామ్ మాధవ్‌కు చెప్పినట్టు ప్రచారం జరుగుతోంది. ఆయనతో చర్చలు జరుపుతున్న ఫొటోలు సైతం కొన్ని సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. తనతో బీజేపీ దూత వచ్చి పార్టీలోకి రావాలని కోరిన విషయాన్ని రాయపాటి సాంబశివరావు స్వయంగా టీడీపీ అధినేత చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారని టాక్.  ఢిల్లీలో తాను నివాసం ఉంటున్న ఇంటి వ్యవహారంతో పాటు పోల‌వ‌రం సమస్యలను వివరించి కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీలో చేరాల్సిన ఆవశ్యకత గురించి వివరించినట్లు సమాచారం. పోల‌వ‌రం నిర్మాణం మీద ప్ర‌స్తుత ముఖ్య‌మంత్రి నిపుణుల క‌మిటీ వేయ‌టం..రివ‌ర్స్ టెండ‌రింగ్ దిశ‌గా అడుగులు వేస్తున్న క్ర‌మంలో ఆ కాంట్రాక్ట్ చేస్తున్న తను మ‌రింత‌గా ఆర్దికంగా న‌ష్ట‌పోయే అవ‌కాశం ఉంద‌ని చెప్పారట. ఈ నేపధ్యంలో రాయ‌పాటి టీడీపీ వీడి బీజేపీలో చేరటం ఖాయ‌మైందని అంటున్నారు.  

గంటా వ్యూహాత్మక మౌనం....కారణం అదేనా ?

  అసెంబ్లీలో టీడీపీ, వైసీపీ మధ్య మాటల యుద్ధం హోరాహోరీగా సాగుతున్న విషయం తెలిసిందే. సభలో టీడీపీ సభ్యుల సంఖ్య తక్కువే అయినా అధికార వైసీపీతో ఢీ అంటే ఢీ అన్నట్టు పోరాడుతోంది. చంద్రబాబుతో పాటు ఆ పార్టీ నాయకులు అచ్చెన్నాయుడు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, మాధవ నాయుడు సహా పలువురు ఎమ్మెల్యేలు వైసీపీకి కౌంటర్ ఇచ్చే విషయంలో తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఈ విషయంలో టీడీపీకి చెందిన ఎమ్మెల్యే, మాజీమంత్రి గంటా శ్రీనివాసరావు సైలెంట్‌గా ఉండటం టీడీపీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. విశాఖ ఉత్తరం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించిన గంటా శ్రీనివాసరావు కొంతమంది టీడీపీ ఎమ్మెల్యేలను వెంటబెట్టుకుని బీజేపీలోకి వెళతారని కొద్దిరోజుల క్రితం జోరుగా ప్రచారం జరిగింది. అయితే తాను పార్టీ మారబోనని గంటా శ్రీనివాసరావు క్లారిటీ ఇచ్చారు.  అయినా సరే ఆయన జగన్ పాలన చేపట్టిన నాటి నుండే సైలెంట్ అయ్యారు. ఇప్పటి వరకు టీడీపీ నేతలు జగన్ పాలనపై కాస్తో కూస్తో ఆరోపణలు చేసినా, టీడీపీపై జరుగుతున్న దాడులపై అసహనం ప్రదర్శించినా గంటా మాత్రం చాలా సైలెంట్ గా చూస్తున్నారు. ఒకపక్క ఆయన వైసీపీలో చేరేందుకు కూడా వ్యూహాలు రచిస్తున్నారని, అయితే మంత్రి అనీల్ కుమార్ యాదవ్ అడ్డు పడుతున్నారని కూడా ప్రచారం జరుగుతుంది.  ఇంతకీ గంటా సైలెన్స్ వెనుక బలమైన కారణమే ఉన్నట్టు తెలుస్తుంది. టీడీపీని పూర్తి స్థాయిలో టార్గెట్ చేసిన సీఎం జగన్ గతంలో టిడిపి హయాంలో చేసిన అవినీతిపై దృష్టి పెట్టారు. ఇప్పుడు అవినీతి పుట్టలు బద్దలు కొట్టే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో అవినీతి చేసి కాస్తో కూస్తో వెనకేసుకున్న నాయకులలో టెన్షన్ మొదలైంది. అందులో భాగంగా ఇప్పుడు గతంలో మంత్రిగా పనిచేసిన గంటా శ్రీనివాసరావుకు చెక్ పెట్టే పనిలో జగన్ సర్కార్ ఉన్నట్లుగా సమాచారం.   గడిచిన ఐదేళ్లలో విశాఖ జిల్లాలో భూ దందాలు విపరీతంగా జరిగాయని ,విశాఖ భూ కుంభకోణం లో ఉన్నది టిడిపి నేతలేనని అప్పట్లో వైసీపీ నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రతిపక్ష హోదాలో వైసిపి నాడు ఎంతో పోరాటం చేసినప్పటికీ నాడు అధికార పార్టీగా ఉన్న టిడిపి ఈ వ్యవహారంపై ఏమాత్రం స్పందించలేదు. గంటా శ్రీనివాసరావు వర్గంగా ఉన్న భీమిలి నేతలే పెద్ద ఎత్తున అక్రమ భూ సేకరణ చేశారని, అందుకే ప్రభుత్వం దాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం చేసిందని అప్పట్లో పెద్దఎత్తున చర్చ సాగింది.  ఇక ఇప్పుడు జగన్ విశాఖ భూ కుంభకోణాన్ని బయటకు లాగి కుంభకోణానికి కారణమైన బాధ్యులను చట్టరీత్యా శిక్షించాలనే ప్రయత్నాల్లో ఉన్నారు.విశాఖ భూకుంభకోణం పై సమగ్ర దర్యాప్తుకు జగన్ ఆదేశించటంతో ఇప్పుడు గంటా శ్రీనివాసరావుకు, గంటా వర్గానికి టెన్షన్ పట్టుకుంది. అందుకే గంటా సైలెంట్ గా ఉంటున్నారని అంటున్నారు. నిజానికి సొంత మంత్రులే ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకోవడంతో అప్పటి బాబు ప్రభుత్వం దీనిపై ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని నియమించింది.  ఈ సిట్ బృందం పలు కోణాల్లో విచారణ చేసి నివేదికను ప్రభుత్వానికి అందించింది. అయితే ఎన్నికల దెబ్బకి ఈ విషయం మరుగున పడింది. ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో గంటా ఈ వ్యవహారంలో ఏం చెయ్యాలో అర్ధం కాక సమావేశాలకి కూడా సరిగా రావడం లేదని అంటున్నారు.   

తెలంగాణాకి కూడా కొత్త గవర్నర్ ?

  రాష్ట్ర విభజన అనంతరం సుమారు ఐదేళ్ళ తర్వాత ఏపీకి కొత్త గవర్నర్ ను నియమించారు. ఒడిశాకు చెందిన మాజీ మంత్రి, ప్రముఖ న్యాయవాది బిశ్వ భూషణ్ హరిచందన్ ను గవర్నర్ గా నియమిస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ మేరకు రాష్ట్రపతి భవన్ ఉత్తర్వులు జారీ చేసింది. వారం రోజుల్లోగా ఏపీ గవర్నర్ గా ఆయన బాధ్యతలు స్వీకరించే అవకాశాలు ఉన్నాయి. విజయవాడలోని సీఎం క్యాంపు కార్యాలయాన్ని గవర్నర్ నివాసంగా మార్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.  ఇప్పటివరకు ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు సంయుక్త గవర్నర్ గా నరసింహన్ వ్యవహరించారు. ఇక ఇప్పుడు తెలుగురాష్ట్రాలకు ఉమ్మడి గవర్నర్‌గా ఉన్న నరసింహన్‌ను తెలంగాణకే పరిమితం చేసింది కేంద్ర ప్రభుత్వం. ఇదిలా ఉంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ లో 2009 నుండి గవర్నర్ గా ఉన్న నరసింహన్ ని కూడా ఏక్షణంలోనైనా మార్చే అవకాశం ఉందనే ప్రచారం సాగుతోంది. రాష్ట్ర విభజన చట్టంలో హైదరాబాద్‌ పదేళ్లపాటు ఉమ్మడి రాజధానిగా ఉంటుందని పేర్కొన్నా గత ప్రభుత్వం ముందే రాజధానిని అమరావతికి తరలించింది నెమ్మదిగా హైకోర్టు విభజన కూడా పూర్తిచేశారు.  మొన్న జగన్ చొరవతో ఆంధ్రా బిల్డింగ్స్ కూడా తెలంగాణకు ఇచ్చేయగా, సచివాలయంలో ఆంధ్రకు చెందిన బ్లాక్‌లను కూడా తెలంగాణకు కేటాయించారు. ఇక తాజాగా ఉమ్మడి గవర్నర్ వ్యవస్థ కూడా పోయి.. రెండు రాష్ట్రాలకు గవర్నర్‌లు వచ్చారు. ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరాబాద్‌లో శాంతి భద్రతలపై చట్టంలో ప్రత్యేకంగా ‘సెక్షన్‌ 8’ను పొందుపరిచారు. సెక్షన్‌-1(7) లో ఉమ్మడి గవర్నర్‌ ప్రస్తావన ఉండగా ఆ తర్వాత సెక్షన్‌-1 (8)(1)లో రాజధానిలో గవర్నర్‌ అధికారాలు, బాధ్యతలు ఉన్నాయి.  సెక్షన్‌-8లో ఉమ్మడి రాజధానిగా ఉన్నంత కాలం ప్రజల రక్షణ, ఆస్తులను కాపాడే అధికారం గవర్నర్‌కు అప్పగించారు. శాంతిభద్రతల పరిరక్షణ, అంతర్గత భద్రత, ఉమ్మడి రాజధానిలోని ప్రభుత్వ భవనాలను ఇరు రాష్ట్ర ప్రభుత్వాలకు కేటాయించడం వంటి బాధ్యతలను గవర్నర్‌కు ఇచ్చారు. ఇప్పటికే ఈ ప్రక్రియ మొత్తం ముగిసిపోయింది. ఏపీకి ప్రత్యేక గవర్నర్‌ నియామకం నేపథ్యంలో నరసింహన్ పదవీకాలం కూడా ముగిసినట్లే అనే ప్రచారం సాగుతోంది. కొన్నాళ్ళ క్రితం ఆయన గవర్నర్ గా తప్పుకుని కేంద్ర హోం శాఖకి వెళ్తారని కూడా ప్రచారం జరిగింది. ఏమి జరగనుందో వేచి చూడాలి ?  

ఒక పరాజయం 100 తప్పులు.. ఇసుక తుఫాను ధాటికి కొట్టుకుపోయిన టీడీపీ

  సామాన్య ప్రజలకు భారం కాకుండా చేయాలన్న ఉద్దేశంతో ఏపీలో ఉచిత ఇసుక పాలసీని తీసుకొచ్చిన టీడీపీ.. కథ అడ్డం తిరిగి, చివరకు ఇసుక తుఫాను ధాటికి కొట్టుకుపోయిందా అంటే అవుననే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఏపీలో ఇసుక మాఫియా ఎప్పటినుంచో ఉంది. ఈ మాఫియా ఇసుకను బంగారంలాగా సామాన్యులకు అందుబాటులో లేని ధరలతో చుక్కలు చూపిస్తోంది. దీంతో కొందరు సీనియర్ అధికారులు ఇసుకను ప్రభుత్వ ఆదాయ వనరుగా భావించకుండా ఫ్రీ చేస్తే.. అందరికీ అందుబాటులో ఉంటుంది. ఇసుక మాఫియా ఆటలు కూడా సాగవని అప్పుడు ఏపీ సీఎంగా ఉన్న బాబుకి సలహా ఇచ్చారు. దీంతో బాబు ఇసుకని ఫ్రీ చేసారు. ఇది మంచి ఉద్దేశంతో తీసుకున్న నిర్ణయమే అయినప్పటికీ.. కొందరి తీరు కారణంగా ప్రజలు ఇబ్బంది పడ్డారు, పార్టీ నష్టపోయింది. ఫ్రీ ఇసుక మాకే అన్నట్టుగా కొందరు ఎమ్మెల్యేలు, మంత్రులు, నేతలు రెచ్చిపోయారు. ఇసుక మాఫియాతో చేతులు కలిపి.. ఇసుకను స్థానిక ప్రజలకు అందని ద్రాక్షలా చేసారు. తెలంగాణ మరియు ఇతర రాష్ట్రాలకు తరలించి కోట్లకు కోట్లు సంపాదించారు. గత ఐదేళ్ళలో ఈ ఇసుక మాఫియా వల్ల ఎన్నో దాడులు కూడా జరిగాయి. ప్రజలు, ప్రతిపక్షాలు విమర్శిస్తున్నా బాబు ఈ విషయాన్ని ఎందుకనో అంత సీరియస్ గా తీసుకున్నట్టు కనిపించలేదు. ఇసుక మాఫియాను అరికట్టే ప్రయత్నం చేయలేదు. ఇదే ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత మూటగట్టుకొని బాబు కొంపముంచింది. మొత్తానికి ఇసుక తుఫాను ధాటికి టీడీపీ ప్రతిపక్షానికి పరిమితమైంది.

పార్లమెంట్.. రూమ్ నెo.5 లో ఏం జరుగుతోంది?

  ఓడలు బళ్ళు, బళ్ళు ఓడలు అవడం అంటే ఏమిటో టీడీపీకి తెలిసి వస్తోంది. ఎన్ని ఏళ్ళ రాజకీయ జీవితంలో చూడని వన్నీ జగన్ బాబుకు చూపిస్తున్నారు. ఇప్పటికే ఎన్నో రకాలుగా ఇబ్బంది పెట్టలని చూస్తున్న జగన్ పార్టీ ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి కేటాయించిన పార్లమెంటులోని ఐదో నంబర్ గదిని ఖాళీ చేయించేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. ప్రస్తుతం టీడీపీ కార్యాలయం పార్లమెంట్ లోని ఐదో నంబర్ గదిలోనే ఉంది. అయితే అంత పెద్ద గది వాళ్లకి అక్కర్లేదని 22 మంది లోక్‌సభ, ఇద్దరు రాజ్యసభ సభ్యులున్న ఆ గదిని తమ పార్టీకి కేటాయించాలని వైసీపీ పార్లమెంటరీ పార్టీ చేసిన విజ్ఞప్తిని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ఆమోదించినట్లు తెలిసింది. పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ముగిసిన తరువాత ఐదో నంబర్ గదిని ఖాళీ చేసి మూడో అంతస్తులో ఉన్న చిన్న గదిలోకి టీడీపీ తమ కార్యాలయంగా మార్చుకోవలసి ఉంటుందని అంటున్నారు. పార్లమెంటు ఆవరణలోని ఐదో నంబర్ గది దాదాపు 35 సంవత్సరాల నుండి తెలుగుదేశం అధీనంలో ఉన్నది.  1984లో ఎన్‌టీ రామారావు నాయకత్వంలోని తెలుగుదేశం పార్టీ 30 లోక్‌సభ సీట్లు గెలుచుకోవటంతో ఐదో నంబర్ గదిని ఆ పార్టీకి కేటాయించారు. తెలుగుదేశం పార్టీకి ఎక్కువ మంది సభ్యులుండటం వల్ల గ్రౌండ్‌ఫ్లోర్‌లో ఉన్న ఆ గదిని పార్టీ కార్యాలయం కోసం కేటాయించారు. అప్పటినుంచీ ఆ గది టీడీపీ కార్యాలయంగా కొనసాగుతూనే ఉంది. 1989లో తెలుగుదేశం లోక్‌సభ సభ్యుల సంఖ్య రెండుకు పడిపోయినా ఆ ఐదో నంబర్ గదిని మాత్రం ఎలానో కాపాడుకున్నారు.  2004లో టీడీపీ సభ్యుల సంఖ్య ఐదుకు పడిపోయినప్పడు కూడా అప్పటి టీడీఎల్‌పీ నాయకుడు ఎర్రంనాయుడు, 2009 ఎన్నికల్లో టీడీపీ ఆరు సీట్లు మాత్రమే గెలిచినా అప్పటి టీడీఎల్‌పీ నాయకుడు నామా నాగేశ్వరరావు ఐదో నంబర్ గది తమ చేయి జారకుండా కాపాడుకున్నారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో తెలుగుదేశం లోక్‌సభ సభ్యుల సంఖ్య మూడుకు పడిపోవటం సుజనా చౌదరి, రమేష్, గరికపాటి రామ్మోహన్‌రావు, వెంకటేష్ బీజేపీలో చేరిపోవటంతో రాజ్యసభలో టీడీపీకి ఇద్దరు సభ్యులే మిగిలారు.  దీనికితోడు ఆ సీట్లను వైసీపీ గెలుచుకోవడంతో ముప్పై ఐదేళ్ళు పైగా ఉంటున్న ఆ గది నుండి తెలుగుదేశం పార్టీ ఇప్పుడు ఖాళీ చేయవలసి వస్తోంది. వైసీపీ పార్లమెంటరీ పార్టీ నాయకుడు వి.విజయసాయిరెడ్డి ఈ ఐదో నంబర్ గదికోసం గట్టిగా కృషి చేశారని అంటున్నారు. ఆయన బీజేపీ నాయకులను కలిసి ఐదోనంబర్ గదిని తమకు కేటాయించవలసిన అవసరం గురించి పలుమార్లు వివరించటంతో వైసీపీకి కేటాయించేందుకు అంగీకరించినట్లు తెలిసింది.  అయితే ఈ గది వైసీపీకి దక్కకుండా చూసేందుకు తెలుగుదేశం నాయకులు గట్టిగా ప్రయత్నించినా ఫలితం కనిపించటం లేదని అంటున్నారు. నిజానికి వారం క్రితమే ఐదో నంబర్‌ గదిలో ఉన్న టీడీపీ కార్యాలయాన్ని పార్లమెంటరీ మంత్రిత్వశాఖకు కేటాయించారని సమాచారం. ఈ గదిని పార్లమెంటరీ మంత్రిత్వశాఖ కార్యదర్శి పేరిట కేటాయించారని, దానిని తర్వాత మరెవరికైనా కేటాయించవచ్చునని అనుకున్నారు. అది వైసీపీకే అని తాజాగా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి.  

బాబు మీద మరక వేయడానికి జగన్ కి రెండో అవకాశం కూడా పోయిందా ?

  ఎంతో కష్టపడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన జగన్, అభివృద్ధి మీద కాక అవినీతి మీద ద్రుష్టి పెట్టడం చర్చనీయాంశంగా మారింది. తనని పదే పదే అక్రమాస్తుల కేసును ఉద్దేశిస్తూ చంద్రబాబు, ఆయన పార్టీ చేసిన అవినీతి ఆరోపణల మీద రివెంజ్ తీర్చుకోవాలని చూస్తున్నాడో ఏమో కానీ ఎలా అయినా చంద్రబాబు అవినీతి పరుడు అనే ముద్ర వేయడానికి శాయశక్తులా ప్రయత్నిస్తున్నాడు.  అందుకు అనుగుణంగానే బాబు నిర్ణయాలు, ఆయన ప్రభుత్వ ఉత్తరవుల మీద కేబినేట్ సబ్ కమిటీల మీద కమిటీలు వేసుకుంటూ వెళ్తున్నాడు. అలాగే అమరావతి, పోలవరం, విధ్యుత్ కొనుగోళ్ళ విషయాల్లో తెలుగుదేశంని టార్గెట్ చేయడానికి చూస్తోంటే ఎప్పటికప్పుడు అది ఎదురు తిరుగుతూనే ఉంది. చంద్రబాబు హయాంలో చేసుకున్న సౌర, పవన విద్యుత్తు కొనుగోలు ఒప్పందాలు (పీపీఏ)ల్లో అక్రమాలు చోటు చేసుకున్నాయని జగన్ సర్కారు భావిస్తోంది.  అందుకే వాటిని ఎలా అయిన బయట పెట్టాలని చూస్తున్న సంగతి తెలిసిందే. కాగా ఇందులో అవకతవకలేమీ చోటు చేసుకోలేదని, పీపీఏలను రద్దు చేస్తే.. దాని ప్రభావం పెట్టుబడులపై పడే ప్రమాదం ఉందని హెచ్చరిస్తూ కేంద్ర మంత్రి ఆర్కే సింగ్ ఇటీవలే జగన్‌కు లేఖ రాసిన రాశారు. అలా ఒక విషయంలో గేట్లు క్లోజ్ అవ్వగా నిన్న మరో విషయంలో కూడా గేట్లు క్లోజ్ అయ్యాయి. అదే పోలవరం, పోలవరం నిర్మాణంలో అవకతవలకు సంబంధించి నిన్న రాజ్యసభలో వైసీపీ, బీజేపీ సభ్యులు కొన్ని ప్రశ్నలు సంధించారు.  అంతేకాక పోలవరంపై వస్తున్న అవినీతి ఆరోపణలపై విచారణ జరిపించాలని ఈ సందర్భంగా కేంద్రంపై ఒత్తిడి తెచ్చారు. పోలవరం నిర్వాసితులకు పునరావాసం, పునర్నిర్మాణంలో అవకతవకలు జరిగాయంటూ వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి రాజ్యసభలో ప్రస్తావించారు. అయితే విజయసాయి ప్రశ్నలకు క్లారిటీ ఇచ్చిన కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో అవకతవకలు జరిగినట్టు తమకు ఎలాంటి నివేదికలు రాలేదని తేల్చి చెప్పారు.  అందుకే ఈ విషయం మీద విచారణకు ఆదేశించే అవకాశం కూడా లేదని ఆయన స్పష్టం చేశారు. అంతేకాక పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా కేంద్రం ప్రకటించిందని, విభజన చట్టంలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందని షెకావత్ తెలిపారు. పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణానికి వంద శాతం నిధులను కేంద్రమే భరిస్తుందని చెప్ప్పిన ఆయన నిర్మాణ పనులు ఇప్పటి వరకు 60 శాతం వరకు పూర్తి అయ్యాయని తెలిపారు. 

ఒక పరాజయం 100 తప్పులు.. టీడీపీని ముంచేసిన 'ఆ' మీడియా!!

  మీడియా అనేది.. ప్రభుత్వం ప్రజలకు మంచి చేస్తే ప్రశంసించాలి. తప్పు చేస్తే ప్రశ్నించాలి. అధికార, ప్రతిపక్ష పార్టీలు అనే తేడా లేకుండా ప్రజలకు ఉన్నది ఉన్నట్టుగా చూపించాలి. అయితే ఇప్పుడు మీడియా సంస్థలు కొన్ని పార్టీల సొంత సంస్థలుగా మారిపోయి నిజాలను దాస్తున్నాయి. కొందరు నాయకులను ముంచుతున్నాయి. సరిగ్గా చంద్రబాబు విషయంలో కూడా ఇదే జరిగిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కొన్ని తెలుగు మీడియా సంస్థలు గత ఐదేళ్ళలో బాబు ఏమి చేసినా పొగడటమే పనిగా పెట్టుకున్నాయి. బాబు ఏమి చేసినా ఆహా ఓహో అనడం, బాబు ఏది చేస్తే అదే కరెక్ట్ అన్నట్టు చెప్పడం చేసాయి. అసలు బాబు పాలన మీద, పార్టీ మీద ప్రజల్లో ఎటువంటి అభిప్రాయం ఉందనే విషయాన్ని నిజాయితీగా తెలియజేసే ప్రయత్నమే చేయలేదు. అదేమంటే బాబు పొగడ్తను తీసుకున్నట్టు విమర్శను తీసుకోరు. ఆయన్ని పొగిడితే పక్కన పెట్టుకుంటారు, ఆయన నిర్ణయాన్ని తప్పుబట్టినా, విమర్శించినా శత్రువుగా చూస్తారు అందుకే మేము భజన చేశామని కొందరు మీడియా అధినేతలు చెబుతున్నారు. మొత్తానికి ఆ మీడియా భజన వల్ల ప్రజల్లో ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకత.. బాబుకి తెలియకుండా పోయింది. పార్టీ ఘోరంగా ఓడిపోయింది. మరి బాబు ఇకనైనా పొగడ్తతో పాటు విమర్శ కూడా తీసుకొని మళ్ళీ గాడిలో పెడతారేమో చూడాలి.

బిగ్ బాస్ కాంట్రవర్సీ....అనవసరమైనదేనా ?

  బిగ్ బాస్ తొలి రెండు సీజ‌న్స్ ప‌ద్ద‌తిగా సాగిపోయాయి. చిన్న కాంట్రవ‌ర్సీ కూడా లేకుండా అయిపోయాయి. కానీ మూడో సీజ‌న్ మాత్రం ప్రారంభానికి ముందే  ఎన్నో వివాదాల‌కు తావిస్తుంది.  బిగ్ బాస్ తొలి సీజన్‌తోనే ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. తొలి సీజన్‌కు యంగ్ టైగర్ ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా వ్యవహరించడంతో ఎక్కడలేని క్రేజ్ వచ్చేసింది. ఆయన కూడా అద్భుతంగా హోస్ట్ చేయడంతో తెలుగు టీవీ చరిత్రలోనే అత్యధిక టీఆర్‌పీ రేటింగ్‌తో ఈ షో దూసుకుపోయింది.  ఇక రెండో సీజన్‌కు నేచురల్ స్టార్ నాని హోస్ట్‌గా వ్యవహరించారు. ఈ సీజన్ 100 రోజులపాటు సుధీర్ఘంగా సాగింది. హౌజ్‌లో మసాలా, గొడవలతో మొదటి సీజన్‌ను మించి హైలైట్ అయ్యింది.  మూడో సీజన్  జులై 21 నుంచి ‘బిగ్ బాస్’ షో ప్రసారం కానున్నట్టు ఇప్పటికే ప్రోమో వీడియో ఒకటి స్టార్ మా ఛానల్‌లో ప్రసారమవుతోంది. ఇప్పుడు ఆ షో నిడివి, సెలబ్రిటీల సంఖ్యను ఖరారుచేస్తూ స్టార్ మా ఛానల్ ట్వీట్ చేసింది.  100 రోజులపాటు ఈ షో కొనసాగనుంది. మొత్తం 15 మంది సెలబ్రిటీలు బిగ్ హౌజ్‌లోకి అడుగుపెట్టనున్నారు. గతంలో మాదిరిగానే శని, ఆదివారాల్లో రాత్రి 9 గంటలకు, సోమవారం నుంచి శుక్రవారం వరకు రాత్రి 9.30 గంటలకు ఈ షో ప్రసారం కానుంది. అయితే గత రెండు సీజనల సమయంలో బ‌య‌టికి రాలేదో లేక ఏమో కానీ ఇప్పుడు ఈ షో మీద సెక్స్ ఆరోపణలు వస్తున్నాయి.  సినీ పరిశ్రమ వరకే పరిమితమైన లైంగిక వేధింపులు ఇప్పుడు ‘బిగ్ బాస్’లోకి కూడా వచ్చాయని శ్వేతా రెడ్డి ఆరోపిస్తోంది. తాను బిగ్ బాస్ హౌజ్‌లోని అడుపెట్టాలంటే తమ బాస్‌ను ఇంప్రస్ చేయాలని ఒక కో ఆర్డినేటర్ తనను అడిగాడని ఆరోపిస్తూ ఆమె బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు లైంగిక వేధింపుల కింద ‘బిగ్ బాస్’ నిర్వాహకులపై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు.  తాజాగా రాయదుర్గం పోలీస్‌స్టేషన్‌లో కూడా కేసు నమోదైంది.. బిగ్‌ బాస్‌ 3 నిర్వాహకులు తనకు అవకాశం ఇస్తానని చెప్పి మోసం చేశారంటూ సినీ నటి గాయత్రి గుప్తా పోలీసులకు ఫిర్యాదు చేశారు. శ్వేతారెడ్డితో కలిసి రాయదుర్గం పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లిన గాయత్రి గుప్తా పోలీసులకు కంప్లయింట్ చేశారు. బిగ్‌బాస్‌ 3 నుంచి నిర్వాహకులు ఫోన్‌ చేసి నటించేందుకు సిద్ధమా అని అడిగారని.. ఆ తర్వాత ఆ టీమ్‌కు సంబంధించిన మరి కొంత మంది వ్యక్తులు తమ ఇంటికి వచ్చి అగ్రిమెంట్‌ కూడా చేసుకున్నారని గాయత్రి చెప్పారు.  ఈ మేరకు తాను సినిమాలు కూడా వదులుకున్నానని తెలిపారు. అయితే తనను అసభ్యకరమైన రీతిలో కమిట్‌మెంట్‌ అడగడంతో ఆగ్రహం వ్యక్తం చేశానన్నారు. ఆ తర్వాత కొద్ది రోజులకు ఫోన్‌ చేసి తనకు ఛాన్స్‌ రాలేదని చెప్పారని ఫిర్యాదులో పేర్కొన్నారు. బిగ్‌ బాస్‌ షోలో సెలక్ట్‌ అయ్యానని చెప్పడంతో ఆరు సినిమాల్లో ఛాన్స్‌లు వదులుకున్నానని తనకు జరిగిన ఆర్థిక నష్టాన్ని భర్తీ కూడా చేయలేదని గాయత్రి గుప్తా ఫిర్యాదులో పేర్కొన్నారు.  షోను రక్తి కట్టించేందుకు పాపులర్ పర్సనాలిటీలతో పాటు సోషల్ మీడియాలో పాపులర్ అయినవారికి బిగ్ బాస్ హౌజ్ లోకి అవకాశం కల్పిస్తారు. బిగ్ బాస్ కు ఉన్న క్రేజ్ తో కంటెస్టెంట్లకు మరింత పాపులారిటీ పెరిగే అవకాశాలు ఉంటాయి. ఈ క్రేజ్ నే బిగ్ బాస్ కో-ఆర్డినేటర్లు, ప్రొడ్యూసర్లు క్యాష్ చేసుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. గత సీజన్‌కి కంటెస్టెంట్ వీక్‌గా ఉండటంతో ఆ ప్రభావం రేటింగ్స్‌పై పడింది.  ఈసారి అలాంటి తప్పులు జరగకుండా.. ఆటను రక్తికట్టించగలిగే సెలబ్రిటీలను బిగ్ బాస్ హౌస్‌కి తీసుకువస్తున్నారు. ఈ ప్రయత్నంలో భాగంగా ఎవరైతే కాంట్రివర్శిలు చేసి ఫేమస్ అయ్యారో వాళ్ళనే సంప్రదించించారు బిగ్ బాస్ నిర్వాహకులు. అయితే ఇదంతా న‌మ్మ‌డానికి లేద‌ని కావాల‌నే కాంట్ర‌వ‌ర్సీ చేసి చీప్ ట్రిక్స్ ప్లే చేసి పాపుల‌ర్ కావాల‌ని చేస్తున్నారంటూ వాళ్ల‌పైన ఎదురు దాడి కూడా జరుగుతోంది.  తాజాగా స్వయం ప్రకటిత మేధావిగా ప్రకటించుకున్న కత్తి మహేష్ ఈ విషయం మీద కామెంట్స్ చేశారు.  బిగ్ బాస్ హౌస్‌కి వస్తే 100 రోజుల పాటు సెక్స్ లేకుండా ఉండగలరా? అని నిర్వాహకులు అడగడంలో తప్పేం లేదని కత్తి మహేష్ అంటున్నాడు. అంతేకాదు గాయిత్రి గుప్తను ‘యాక్టివ్ సెక్స్ లైఫ్ ఉన్న బోల్డ్ అమ్మాయి’ అని కూడా ఆయన సంచలన ఆరోపణ చేశారు. ఆయన ఏమని పోస్ట్ చేశారంటే  ‘2017 లో..  బిగ్ బాస్ టీం: 70 రోజుకు సెక్స్ లేకుండా ఉండగలరా?  నేను: బాత్రూమ్ లో కెమెరాలు ఉండవుగా! పర్లేదు మ్యానేజ్ చేసుకుంటాను.  ఇదే ప్రశ్న , ఇదే టీం యాక్టివ్ సెక్స్ లైఫ్ ఉన్న బోల్డ్ అమ్మాయిని ఇప్పడు 2019లో అడిగితే తప్పైపోతుందా? జస్ట్ ఆస్కింగ్! అని పోస్ట్ చేశారు ఆయన.  అయితే ఈ విషయాన్ని ఒక ఫీమెల్ కంటెస్టెంట్ని అడగకూడని గాయత్రి అంటుంటే లేదు అడిగితే తప్పేంటని కత్తి మహేష్ అడుగుతున్నారు. అయితే ఈ విషయం మీద మాత్రం బయటకి వచ్చి కంప్లైంట్ చేసిన వారిదే తప్పన్నట్టు కామెంట్ చేస్తున్నారు నెటిజన్లు కూడా.  ఒక ఆడపిల్లను అలా అడగొచ్చా ? అంటే ఏమని చెప్పగలం గేమ్ ఆడించే వారి రూల్స్ వారికి ఉంటాయేమో ?. ఈ వివాదాలు రాకుండా ఆ అగ్రిమెంట్ చేసే టీమ్ లో ఒక మహిళని పెట్టుకుని వారి చేత లేడీస్ ని ఈ ప్రశ్న వేయించి ఉంటే సరిపోయేది. అయితే రెండు సీజన్లు ఎటువంటి ఆరోపణలు లేకుండా సాగిన ఈ షో మీద వీరు కామెంట్ చేయడం వలన నష్టం వీరికా ? బిగ్ బాస్ కా ? పాపులర్ అయ్యేది బిగ్ బాసా ? ఈ ఇద్దరా ?

బాబు గారి పెంపుడు కుక్కను కంట్రోల్ చేయాలి....కేశినేని తెగించారా ?

  ఏపీలో మొన్నటి ఎన్నికల్లో ఘోర ఓటమిని చవిచూసిన టీడీపీకి రోజూ ఏదో ఒక టెన్షన్ మామూలు అయిపొయింది. ఓపక్క పలువురు నేతలు పార్టీని వీడుతుండగా మరోవైపు పార్టీలోని నాయకుల మధ్య అంతర్గత పోరు రచ్చకెక్కడం టీడీపీ అధిష్టానానికి మింగుడు పడటం లేదు. గత కొంతకాలంగా టీడీపీ అధిష్టానంపై అసంతృప్తిగా ఉన్న ఎంపీ కేశినేని నాని ఆదివారం ట్విటర్‌ వేదికగా బుద్ధా వెంకన్నపై పరోక్షంగా విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే.  అయితే దీనికి బుద్దా కూడా కౌంటర్‌ ఇచ్చారు. అయితే ఈరోజు పోద్దుపోద్దున్నే కేశినేని ట్విటర్‌ వేదికగా టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడును ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘చంద్రబాబు గారు.. నన్ను వద్దనుకుంటే రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఎంపీ పదవికి, పార్టీ సభ్యత్వానికి కూడా రాజీనామా చేసేందుకు సిద్ధం. నాలాంటి వాళ్లు పార్టీలో ఉండాలంటే.. మీ పెంపుడు కుక్కను కంట్రోల్‌ చేయండి’  కేశినేని ట్విటర్‌లో పేర్కొన్నారు.  అయితే కేశినేని ఈ వ్యాఖ్యలు ఎవరిని ఉద్దేశించి చేశారనే దాని మీద క్లారిటీ లేకున్నా, ఆ వ్యాఖ్యలు బుద్ధా వెంకన్నను ఉద్దేశించినవేనని అంటున్నారు విశ్లేషకులు. నిన్న కూడా పేరు ప్రస్తావించకుండా ‘‘రాజకీయ జన్మలు, రాజకీయ పునర్జన్మలు, రాజకీయ భవిష్యత్తులు, గుళ్లో కొబ్బరి చిప్ప దొంగలకి, సైకిల్ బెల్లుల దొంగలకి, కాల్ మనీ గాళ్లకి, సెక్స్ రాకెట్ గాళ్లకి, బ్రోకర్లకి, పైరవిదారులకి అవసరం. నాకు అవసరం లేదు’’ అంటూ నాని ట్వీట్ చేశారు.  మొన్నటి ఎన్నిక‌ల్లో విజ‌య‌వాడ నుండి రెండో సారి ఎంపీగా గెలిచిన ఆయన ఆనాటి నుండే ట్వీట్ల ద్వారా పార్టీలో సంచ‌ల‌నంగా మారారు. పేర్లు ఆయన ఎక్కడా ప్రస్తావించకున్నా ఆయ‌న కృష్ణా జిల్లాకు చెందిన పార్టీలో అధికారం చెలాయిస్తున్న ఇద్ద‌రు నేత‌ల‌ను ల‌క్ష్యంగా చేసుకొని ఈ రచ్చ చేస్తున్నారని అర్ధమయ్యింది. అయితే ఆ మధ్య పార్లమెంటరీ నేత ఎన్నిక సమయంలో కూడా ఆయన రచ్చ రేపుతుండడంతో చంద్ర‌బాబు పిలిపించుకుని మాట్లాడారు.  అయితే తాత్కాలికంగా అప్పటికీ సైలెంట్ అయినా మళ్ళీ ట్వీట్ల రచ్చ మొదలుపెట్టారు. ముందుముందుగా పోరాడితే పోయేదేమీ లేదు బానిస సంకెళ్లు మినహా' అంటూ ఓ ట్విట్‌, మొదలుపెట్ట్రిన ఆయన ఆ తర్వాత నేను పార్టీలో ఎప్పుడూ ధిక్కార స్వరం వినిపి స్తూనే ఉంటా.. అది నా నైజం.. నేను నిజం మాత్రమే మాట్లాడతా.' అంటూ మరో ట్విట్‌ చేశారు. అయితే నిజానికి ఈయన టార్గెట్ చేస్తున్నది ఆ జిల్లా మాజీ మంత్రి, జిల్లా మొత్తానికి టీడీపీ ఫైనలైజర్ లీడర్ అయిన ఉమాని, అలాగే ఆయన అనుచరుడుగా పేరొందిన బుద్ధా వెంకన్నని.  ఉమాకి.. ఎంపీ కేశినేని నానికి మధ్య దూరం ఉందన్న విషయం ఇటీవల నాని పోస్టులతో స్పష్టమవుతోంది. రాష్ట్ర పార్టీ కార్యాలయాన్ని విజయవాడలో ఏర్పాటు చేయాలన్న పార్టీ అధినేత నిర్ణయం ఈ ఇద్దరు నేతల నడుమ దూరానికి కారణమైందని అంటున్నారు. వీరి నడుమ అంతరాన్ని తగ్గించేందుకు అధినేత చోరావ్ అ చూపినా ఫలితం లేకుండా పోయింది. నిజానికి కొద్ది రోజుల క్రితం వీఎంసీ తాజా మాజీ కార్పొరేటర్లతో నాని ఏర్పాటు చేసిన సమావేశం మరోసారి వివాదానికి ఆజ్యం పోసింది.  ఈ సమావేశంలో వచ్చే ఎన్నికల్లో నాగుల్‌ మీరా పశ్చిమ నుంచి పోటా చేస్తారన్న సంకేతాలను నాని పంపారు. ఈ క్రమంలో పశ్చిమ నియోజకవర్గ టీడీపీ నేత బుద్ధా వెంకన్న కొందరు పార్టీ నేతల వద్ద ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. పార్టీ అధినేత అనుమతి లేకుండా నాని ఎలా ప్రకటిస్తారని వెం కన్న కొందరు నేతల వద్ద వ్యాఖ్యానించినట్లు తెలిసింది. ఆ వ్యాఖ్యలను కొందరు ద్వితీయ శ్రేణి నాయకులు నానికి చేరవేశారు.  దీంతో వీరిద్దరి నడుమ దూరం పెరిగింది. అప్ప‌టి నుండి ఈయన కూడా కేశినేనికి టార్గెట్ గా మారారు. ఈ రచ్చ చంద్ర‌బాబునే ఇబ్బంది పెట్టె స్థాయికి చేరింది. తాజాగా నాలుగు ఓట్లు సంపా దించలేనివాడు నాలుగు పదవులు సంపా దిస్తున్నాడు. నాలుగు పదాలు చదవలేని వాడు.. నాలుగు వాక్యాలు రాయలేనివాడు.. ట్వీట్లు చేస్తున్నాడు.. దౌర్భాగ్యం' అంటూ నాని ట్వీట్‌ చేశారు. నిజానికి ఇప్పుడు బుద్ధా వెంకన్న నామినేటెడ్ ఎమ్మెల్సీగా ఉన్నారు, దీంతో ఈ వ్యాఖ్యలు ఆయనను ఉద్దేశించినవే అని అంటున్నారు.  దీనికి వెంకన్న కూడా వెంటనే స్పందించారు. ‘సంక్షోభ సమయం లో పార్టీ కోసం నాయకుడు కోసం పోరా డేవాడు కావాలి. ఇతర పార్టీ నాయకులతో కలిసి కూల్చేవాడు ప్రమాదకరం. నీలాగా అవకాశ వాదులు కాదు. చనిపోయే వరకు చంద్ర బాబు కోసం సైనికుడిలా పోరాడే వాడు కావాలి' అంటూ ట్వీట్‌ చేశారు. ఇదే స‌మ‌యంలో కేశినేని నానికి మ‌ద్ద‌తుగా పార్టీ నేత నాగుల్ మీరా ట్వీట్ చేసారు.   ‘పార్టీ కష్టకాలంలో చంద్రన్న ఆదేశంతో బాధ్యత తలకెత్తుకుని కోట్లాది రూపా యలు ఖర్చు పెట్టి వస్తున్నా మీకోసం పాదయాత్రను దిగ్విజయంగా నిర్వహించి, విజయవాడ పార్లమెంటు నియోజక వర్గాన్ని విజయపథంలో నడిపించిన కేశినేని నాని కష్టంతోనే నీకు, నాకు పదవులు దక్కాయి. గుర్తుపెట్టుకో’ అంటూ నాగుల్‌ మీరా, బుద్దా వెంకన్నను ఉద్దేశించి ట్వీట్‌ చేశారు.  ఎంపీ కేశినేని నాని తాజా ట్వీట్ చూస్తుంటే ఆయ‌న తాడో పేడో తేల్చుకోవడానికి సిద్దమయ్యారనే విష‌యం అర్దం అవుతోంది. తాజాగా ఆయ‌న చేసిన ట్వీట్‌లో పార్టీలో తాను అస‌వ‌రం లేద‌ని భావిస్తే ఆ విష‌యం త‌న‌కు స్ప‌ష్టం చేయా ల‌ని తాను ఎంపీ ప‌దవితో పాటుగా పార్టీకి కూడా రాజీనామా చేస్తాన‌ని ట్వీట్ ద్వారానే చంద్ర‌బాబుకు అల్టిమేటం జారీ చేసా రు. అదే స‌మ‌యంలో పెంపుడు కుక్క‌ను కంట్రోల్ చేయండి అంటూ ప‌రోక్షంగా తాను ట్వీట్ల ద్వారా యుద్దం చేస్తున్న నేత గురించి ప్ర‌స్తావించిన‌ట్లు స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. అయితే ఈ విషయంలో చంద్రబాబు ఏమి చేస్తారో అనే విషయం ఆసక్తికరంగా మారింది.  

జగన్ కి విషమ పరీక్ష....బాబు కన్నా ఎక్కువ అప్పుల తిప్పలు ?

  గత ఎన్నికల్లో హోరాహోరీ పోరాడిన వైసీపీ ప్రభుత్వం నిన్న తొలి పద్దును ప్రవేశపెట్టింది. దాదాపు రూ.2.28 లక్షల కోట్లతో ఆర్థిక మంత్రి బుగ్గన ఈ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్‌పై జగన్ మార్క్ స్పష్టంగా కనిపించింది. ఎన్నికల్లో తాము గెలవడానికి ఎంతో దోహదపడిన మేనిఫెస్టోలో పేర్కొన్న నవరత్నాల అమలు కోసం బడ్జెట్ లో భారీ ఎత్తున నిధులు కేటాయించారు.  అయితే ఈ కేటాయింపుల్లో ఎక్కువ మొత్తం సంక్షేమ పదకాలకే కేటాయించిన నేపధ్యంలో ముందుకుముందే విమర్శలు రాకుండా తమకి ఒక విజన్‌ ఉందని, రాబోయే కాలంలో తమ విజన్ తో  దేశంలోనే ఎపీను ప్రథమ స్థానంలో నిలుపుతామని బడ్జెట్ సందర్భంగా బుగ్గన వ్యాఖ్యానించారు. వాస్తవాలు మాట్లాడుకోవాలంటే సంక్షేమ పథకాల కోసం రూ.90 వేల కోట్లు కేటాయించిన తరుణంలో ప్రభుత్వానికి విజన్ ఎంతో అవసరం.  పూర్తి బడ్జెట్ రూ.2,27,974 కోట్లు కాగా ఆదాయ వనరులేమో రూ.1,78,697 కోట్లు మాత్రమే ఉన్నాయి. ఏపీకి పన్నుల రూపేణా 75,437 కోట్లు సమకూరుతాయని సర్కారు భావిస్తుండగా కేంద్ర పన్నుల్లో వాటా రూపంలో రూ.34,833 కోట్లు, పన్నేతర ఆదాయంగా రూ.7354 కోట్లు, రుణ వసూళ్ల ద్వారా రూ.600 కోట్లు ఖజనాకు చేరతాయని భావిస్తోంది. మరోపక్క రెవెన్యూ లోటు రూ.1778.52 కోట్లు ఉండగా ద్రవ్యలోటు సుమారు రూ.35,260.58 కోట్లుగా ఉంది.  ఈ నేపధ్యంలో కేంద్ర ప్రభుత్వం చేసే సహాయం మీదనే ఏపీ సర్కారు భారీ ఆశలు పెట్టుకుంది. కేంద్ర నుంచి నిధుల రూపంలో రూ.61,071 కోట్లు వస్తాయని ప్రభుత్వం ఆశిస్తోంది. గతంలో చంద్రబాబు కేంద్రం నుంచి రూ.50 వేల కోట్ల సాయాన్ని ఆశిస్తే వారిచ్చినది రూ.19 వేల కోట్లే. అంటే డిమాండ్ కి సప్ప్లై కి మధ్య ఉన్న తేడా రూ.30 వేల కోట్లు. ప్రస్తుతానికి వైసీపీ బీజేపీ మధ్య సఖ్యత ఉన్నా అడిగినంత నిధులిచ్చేంత అవసరమైతే మోడీకి లేదు.  దీంతో ఈ విషయంలో ఏపీ ప్రభుత్వం ఇబ్బంది పడక తప్పదేమో ? గత ఏడాది బడ్జెట్ కంటే ఈ ఏడాది బడ్జెట్ అంచనా 19.32 శాతం పెరుగుతుందని వైసీపీ నిన్న ప్రకటించింది. కానీ ఆ అంచనాలు ఎంత మేర నిజమవుతాయో చెప్పలేం. వారి అంచనా మేరకు పెరగకపోతే జగన్ సర్కారుకు చిక్కులు తప్పవు. ఎందుకంటే గత 2018-19 బడ్జెట్లో బాబు సర్కారు అంచనాల కంటే తక్కువగా ఆదాయం సమకూరింది.  ఆ వ్యత్యాసం ఎంత అంటే రూ.35 వేల కోట్లకుపైగా. దీంతో అప్పుడు రూ.33,461 కోట్ల మేర అప్పులు తెస్తామని చెప్పిన చంద్రబాబు సర్కారు రూ.38 వేల కోట్ల మేర రుణాలు తెచ్చింది. ప్రస్తుత బడ్జెట్లో అదే పరిస్థితి తలెత్తకుండా జాగ్రత్తపడాలి. ఇక రుణాల రూపంలో రూ.46,921 కోట్లు సేకరించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. 2018-19 నాటికి రాష్ట్రానికి రూ.2.58 లక్షల కోట్ల రుణాలు ఉన్నాయని నిన్న బుగ్గన స్పష్టం చేశారు.  అయితే గత ఆర్థిక సంవత్సరంలో టీడీపీ సర్కార్ ఎడాపెడా అప్పులు చేస్తోందని ఆరోపించిన వైసీపీ ఇప్పుడు అంతకంటే ఎక్కువ అప్పులు తేవాల్సిన దుస్థితి. జగన్ సమర్ధతకి ఆది పెద్ద పరీస్ఖ అనే చెప్పాలి. నిజానికి పాలనలో అనుభవం ఉన్న చంద్రబాబుకే సాధ్యం కానిది, యువకుడిని అని చెబుతున్న జగన్ ఏమి చేయనున్నారో ? చూడాలి మరి.  

అమరావతి నిర్మాణానికి కేంద్రం మోకాలడ్డు....జగన్ ఏమి చేస్తారో ?

  ఏపీ రాజధాని అమరావతి మీద జగన్ ముఖ్యమంత్రి అయిన నాటి నుండే జానానికి అనుమానం పట్టుకుంది. దానికి కారణం మొదటి నుండి రాజధాని అక్కడ కట్టడాన్ని వైసీపీ వ్యతిరేకిస్తూ రావడమే. అదీ కాకా ఎన్నికల ముందు జాతీయ మీడియా సంస్థ ఏర్పాటు చేసిన చర్చా కార్యక్రమంలో జగన్‌ను రాజధాని మార్పుపై అడిగితే ఏమీ స్పందించకుండా ఉండిపోయాడు. ఆ మౌనం కృష్ణా, గుంటూరు జిల్లాల్లో వ్యతిరేకత తెచ్చే ప్రమాదం ఉంటుందేమో అన్న సందేహాలున్నప్పటికీ జగన్ ఆనాడు స్పందించకపోవడం ఇప్పటికీ ఆశ్చర్యం కలిగించే విషయమే.  అయితే జగన్ వైపు నుండి పడతాయి అనుకున్న బ్రేకులు ప్రపంచ బ్యాంక్ నుండి పడేలా కనిపిస్తున్నాయి. దానికి కారణం అమరావతి నిర్మాణం కోసం నిధులు కావాలంటే వెంటనే తాము తనిఖీలు నిర్వహించాల్సిందేనని ప్రపంచబ్యాంక్ ఏపీ ప్రభుత్వానికి తేల్చి చెప్పింది. అయితే బాబు సర్కార్ ఆ నిదులను సద్వినియోగం చేసింది కాబట్టి వాళ్ళు తనిఖీలు చేసినా వచ్చే నష్టం లేదు. కానీ ప్రపంచబ్యాంక్ ఇన్స్‌పెక్షన్ ప్యానెల్ తనిఖీలు చేయడం ఇప్పటి వరకు దేశంలో లేదని, ఇప్పుడు కూడా ఆ అవకాశం ఇవ్వమని కేంద్రం చెప్తోంది.  ఇక దీంతో ఎటూ రాజధాని మార్చాలని చూస్తున్న జగన్ కు ఈ  వ్యవహారం కలిసోచ్చేలా ఉంది. ఇప్పటి వరకూ లేని ప్రపంచబ్యాంక్ ఇన్స్‌పెక్షన్ ప్యానెల్ తనిఖీ అనేది కొత్త సంప్రదాయమని భావిస్తున్న కేంద్రం అవకాశం ఇస్తే దేశంలో ప్రపంచ బ్యాంకు నిధులతో చేపడుతున్న అన్ని ప్రాజెక్టులకు కూడా తనిఖీలు చెయ్యాలని చూస్తారని అది మరింత ఇబ్బందిగా మారే అవకాశం ఉందని భావిస్తోంది. ఈ తరుణంలో అమరావతి నిర్మాణానికి ప్రపంచ బ్యాంకు నిధులను తీసుకెళ్లే ప్రతిపాదనను విరమించుకోవాలని కేంద్రం రాష్ట్రానికి సూత్రప్రాయంగా పేర్కొన్నట్టు సమాచారం. దాని స్థానే ఇతర మార్గాల ద్వారా రాజధాని నిర్మాణానికి నిధులను సమీకరించాలని కేంద్రం సూచించినట్టుగా చెబుతున్నారు. అయితే ఈ విషయంలో జగన్ కి కాస్త సంతోషంగానే ఉన్నా, ఆయనకి ఇది రిస్క్ లానే తోస్తోంది. ఎందుకంటే తనిఖీల విషయమై తమ అభిప్రాయాన్ని ఈ నెల 23వ తేదీలోపుగా చెప్పాలని ఏపీ ప్రభుత్వానికి ప్రపంచబ్యాంక్ స్పష్టం చేసింది. కానీ కేంద్రం తనిఖీలను వ్యతిరేకిస్తుంది. అయితే ఈ విషయమై తమకు మరింత గడువు కావాలని కేంద్రం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం లేఖ పంపింది. కానీ లేఖ అయితే పంపింది కానీ రాష్ట్ర ప్రభుత్వం ఏమి చేయనుంది అనేదే ఆసక్తికరంగా మారింది.  ఎందుకంటే నిర్మణాలు మొదలు పెట్టి చాలా వరకూ పూర్తి చేసుకున్న అమరావతికే నిధులు సమకూర్చలేకుంటే ఇంకా కొత్తగా ఓకవేళ దొనకొండ రాజధాని అని చెప్పినా అది ప్రజామోదం పొందే అవకాశం లేదు, దీంతో జగన్ ఇప్పుడు ఏమి చేయాలో పాలుపోని పరిస్థితుల్లో ఉన్నారని అంటున్నారు. చూడాలి అమరావతి ఏమవుతుందో ?

జగన్ సార్...కేసీఆర్ గారిని మీ అంత బాగా అర్ధం చేసుకున్న వారు లేరేమో ?

  కేసీఆర్ ని, ఆయ‌న గొప్ప మ‌న‌సును జ‌గ‌న్ మాదిరి అర్థం చేసుకున్నోళ్లు ఇంకెవరూ ఉండ‌రేమో ? తాజాగా జ‌రుగుతున్న అసెంబ్లీ స‌మావేశాల్లో ఆయ‌న మాట‌లు వింటే అలానే అనిపిస్త్తోంది. ఇరుగుపొరుగు రాష్ట్రాల‌తో స‌ఖ్య‌త ఉండ‌టం చాలా అవసరం. కానీ జగన్ చూపుతున్న అతి ప్రేమ ఆయన కొంప ముంచే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. దానికి నిన్న అసెంబ్లీ ప్రొజెక్ట్ స్క్రీన్ అయ్యింది.  ఎందుకో ఏమో కానీ గోదావ‌రి నీళ్ల‌ను శ్రీ‌శైలంలో క‌ల‌పాల‌న్న రూ.లక్ష‌న్న‌ర కోట్ల ప్రాజెక్టు విష‌యంలో జ‌గ‌న్ ప్ర‌ద‌ర్శిస్తున్న అతి శ్రద్ద ఆయన కొంప ముంచక తప్పదని అంటున్నారు. ఆయన మాటలు ఏ రేంజ్ లో ఉన్నాయంటే కేసీఆర్ ఏపీకి గోదావరి నీళ్లు ఇచ్చేందుకే ఈ లక్షన్నర కోట్ల కొత్త ప్రాజెక్ట్‌కు రూపకల్పన చేశారని, కేసీఆర్ నీళ్లిస్తూంటే ప్రతిపక్ష పార్టీ వద్దంటున్నాయని ఆయన విమర్శలు గుప్పించారు.  అయితే అసలు నిజంగా మనకు కేసీఆర్ నీళ్లిస్తున్నారా..? మన నీళ్లలో అనధికారికంగా వాటా పొందుతున్నారా..? అనేది కొంచెం లోకజ్ఞానం ఉన్నవారికి ఎవరికీ అయినా అర్ధం అవుతుంది. నిజానికి ఏపీలో ప్రభుత్వం మారిన తర్వాత.. తెలంగాణ సర్కార్‌తో.. అత్యంత సన్నిహిత సంబంధాలు ఏర్పడ్డాయి. ఈ క్రమంలో నీటి పారుదలకి సంబంధించి రెండు ప్రభుత్వాలు చేసిన ఆలోచన గోదావరి నీటిని శ్రీశైలంకు తరలించడం.  రెండు రాష్ట్రాలు సంయుక్తంగా ఈ ప్రాజెక్ట్‌ను చేపట్టి పూర్తి చేయాలని ప్రాధమిక నిర్ణయానికి వచ్చాయి. ఈ విషయం మీద ఇరు రాష్ట్రాల చీఫ్ ఇంజినీర్లలు కూడా చర్చలు జరుపుతున్నారు. ఈ ప్రాజెక్ట్ పూర్తి అయితే రాయలసీమకు నీటి కరువు ఉండదని ఏపీ అధికార పార్టీ చెబుతోంది. కానీ నిపుణులు, విశ్లేషకులు మాత్రం అందుకు పూర్తి భిన్నంగా విశ్లేషిస్తున్నారు. ఆంధ్ర హక్కు అయిన నీళ్లను తెలంగాణ వాడుకునేందుకే ఈ ప్రాజెక్ట్ కి కేసీఆర్ రూపకల్పన చేశారని అంటున్నారు. తాజాగా నీటిపారుదల, ప్రాజెక్టుల విషయంలో కాస్త పట్టున్న సీనియర్ నేతలు మైసూరారెడ్డి, తులసీరెడ్డి కడపలో ఓ మీటింగ్ పెట్టి నిపుణులతో చర్చించి అసలు తెలంగాణ సీఎం జగన్మోహన్ రెడ్డిని ఎలా వాడుకోవాలని చూస్తున్నారో క్లారిటీ ఇచ్చారు. గోదావరి నికర జలాలపై సంపూర్ణ హక్కులు ఏపీకే ఉన్నాయి, మిగులు జలాల్ని ఏదోలా తీసుకునేందుకే తెలంగాణ కొత్త ప్రాజెక్టు ప్రతిపాదనలు పెట్టిందని చెబుతున్నారు.  గోదావరి నికర జలాలపై పూర్తి హక్కు ఉన్నప్పుడు పక్క రాష్ట్రంతో కలిసి పంచుకోవడం ఎందుకనే ప్రశ్న మొదలువుతోంది. కొత్త ప్రాజెక్ట్ పేరు చెప్పి ఏపీ నీటిని తెలంగాణ వాడుకునేందుకు ఆంధ్రప్రదేశ్‌ చేతనే ఖర్చు పెట్టి ప్రాజెక్ట్ నిర్మించడం అంటే ఎంత తెలివి తక్కువ పనో అర్ధం అవుతుందని అంటున్నారు. జ‌గ‌న్ మాట‌ల‌న్ని ఎలా ఉన్నాయంటే.. ఈ ప్రాజెక్టు లేకపోతే ఏపీకి భ‌విష్యత్తే లేద‌న్న‌ట్లుగా మాట్లాడ‌టం కనిపిస్తుంది. మరి అయన ఎందుకు ఇంతగా సాగిల పడుతున్నారో మరి ?

మొన్న టీఆర్ఎస్ భేటీకి...నిన్న అమిత్ షాతో భేటీ...డీఎస్ మార్క్ రాజకీయం !

  మొన్నటికి మొన్న టీఆర్ఎస్ పార్టీ పార్లమెంటరీ సమావేశానికి హాజరయి వారికి షాక్ ఇచ్చిన డీఎస్, ఇప్పుడు అమిత్ షాతో సుధీర్గ భేటీ జరిపి మళ్ళీ హాట్ టాపిక్ గా మారారు. నిజానికి డీఎస్ అనే ఒక ఎంపీ ఉన్నారని కూడా టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ కూడా మర్చిపోయి ఉండచ్చు, అలాంటిది ఆయన వారి సమావేశానికి వెళ్లి షాక్ ఇచ్చి అక్కడితో ఆగక, నిన్న ఢిల్లీలో అమిత్‌షాను కలిశారు. ఈ ఇద్దరు నేతలు అరగంటకుపైగా సమావేశమైనట్లు సమాచారం.  అయితే తెలంగాణా మీద ఫోకస్ పెట్టిన షాతో ఈయన అంత సేపు భేటీ కావడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారింది. మొన్నటి లోక్ సభ ఎన్నికల్లో డీఎస్ కుమారుడు అరవింద్, నిజామాబాద్ నుంచి కేసీఆర్ కుమార్తె కవితపై బీజేపీ టికెట్ పై పోటీ చేసి గెలిచారు. ఆ ఎన్నికల్లో ఎటూ పార్టీకే దూరంగా ఉన్నాడు కాబట్టి తన కుమారుడికి డీఎస్ మద్దతిచ్చి తన పార్టీకి వ్యతిరేకంగా కొడుకును గెలిపించుకున్నాడు.  నిజానికి డీ శ్రీనివాస్ పై, ఎన్నికలకు ముందే వేటు వేయాలని తన తండ్రి కేసీఆర్ ను కవిత కోరారు. కానీ కేసీఆర్ ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు, కానీ అపాయింట్మెంట్ కూడా ఇవ్వకుండా అవమానించారు. ఈ పరిణామాల నేపథ్యంలో బీజేపీలోకి డీఎస్ వెళతారని అందరూ అనుకున్నారు. కానీ, పార్టీ మారకపోయినప్పటికీ, గులాబీ గూటికి దూరమయ్యారు. అయితే కాంగ్రెస్ పార్టీ గనుక రాష్ట్రంలో అధికారంలోకి వస్తే మళ్లీ డీఎస్ కాంగ్రెస్‌లో చక్రం తిప్పుతారని అప్పట్లో ప్రచారం కూడా జరిగింది.  డి.శ్రీనివాస్ అనుచరులుగా గుర్తింపు తెచ్చుకున్న టీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్సీ భూపతిరెడ్డికి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే టికెట్ కూడా ఇచ్చింది. అయితే అనుచరులను కాంగ్రెస్ పార్టీలోకి పంపిన డీఎస్ తాను మాత్రం అధికారికంగా కాంగ్రెస్ పార్టీలో చేరలేదు. కాంగ్రెస్ పార్టీలో అధికారికంగా చేరితే రాజ్యసభ సభ్యత్వానికి ఇబ్బంది అనే కారణంగా ఆయన ఎక్కడా కాంగ్రెస్ కండువా కప్పుకోలేదు.  అసెంబ్లీ ఎన్నికలకు ముందు విద్యార్థినిపై లైంగిక దాడి కేసు ఎదుర్కొన్న ఆయన కుమారుడు సంజయ్ కూడా కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా పని చేశారు. అలాంటి సంజయ్ బుధవారం టీఆర్ఎస్ ఎంపీ కవితతో సమావేశం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే తాజాగా ఎంపీ కవితతో డీఎస్ తనయుడు సంజయ్ భేటీ వెనుక ఆంతర్యం ఏమిటనే దానిపై రకరకాల విశ్లేషణలు వినిపిస్తున్నాయి. అయితే ఆయన టీఆర్ఎస్ లో మళ్ళీ యాక్టివ్ అయ్యేందుకు ప్రయత్నిస్తున్నారనే విశ్లేషణ కాస్త లాజిక్ ప్రకారం బాగానే ఉంది. కానీ మళ్ళీ ఆయన షాతో భేటీ కావడం మళ్ళీ ఆయన రాజకీయ చతురత మీద అంచనాలు రేపుతోంది. ఈ భేటీతో ఆయన బీజేపీలో చేరతారనే ప్రచారం మొదలయ్యింది. తనను అకారణంగా పక్కన పెట్టిందన్న కారణంతో ఎన్నికలకు ముందు, తన అనుచరులను కాంగ్రెస్ పార్టీలోకి పంపించి టీఆర్ఎస్ ఓట్లు చీల్చడం, తన కుమారుడిని బీజేపీ అభ్యర్ధిగా పోటీ చేయించడం, టీఆర్ఎస్ అభ్యర్థి కవితకు వ్యతిరేకంగా అరవింద్ కు మద్దతునివ్వడం, ఇప్పుడు పార్లమెంటరీ పార్టీ సమావేశానికి హాజరవడం, మళ్ళీ అమిత్ షాతో భేటీ కావడం ఇవన్నీ డీఎస్ కాంగ్రెస్ మార్క్ రాజకీయం అని అనుకుంటున్నారు. 

తుది అంకానికి కర్-నాటకం...రాజీనామానా...అసెంబ్లీ రద్దా ?

  గత కొన్ని రోజులుగా ఉత్కంఠను రేపిన కర్ణాటక రాజకీయం చివరి అంకానికి చేరినట్టే ? నా అంటే అవుననే అంటున్నారు. ఏడాది క్రితం అట్టహాసంగా ఏర్పడిన సంకీర్ణ ప్రభుత్వానికి కాలం చెల్లిపోయిందని, రెబెల్ ఎమ్మెల్యేలను సముదాయించడానికి చేసిన ప్రయత్నాలన్నీ విఫలమవడంతో ముఖ్యమంత్రి కుమారస్వామి రాజీనామా చేసి అసెంబ్లీ రద్దుకు సిఫారసు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ రోజు 11 గంటలకు కుమారస్వామి అత్యవసరంగా మంత్రిర్గ సమావేశం ఏర్పాటు చేస్తున్నారు.  కేబినెట్ మీటింగ్ తర్వాత గవర్నర్ ను కలిసి కుమారస్వామి రాజీనామా పత్రాన్ని అందిస్తారని సమాచారం. ఇప్పటికే ఆయన గవర్నర్ అపాయింట్ మెంట్ కోరారు. నిన్న ఎలాంటి సెక్యూరిటీ లేకుండా ప్రైవేట్ కారులో బయటకు వెళ్లిన కుమారస్వామి కొన్ని గంటల పాటు పత్తా లేకుండా పోయారు. ఆ తర్వాత జేపీ నగర్‌ లోని తన సొంతింటికి వెళ్లి రాజకీయ పరిణామాలపై తన తండ్రి దేవెగౌడతో చర్చించారు. ఆయనతో చర్చలు జరిపాక ఆయన సలహా మేరకే సీఎం పదవికి రాజీనామా చేయాలని కుమారస్వామి నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.  ఒకవేళ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు కాంగ్రెస్‌ పార్టీ ముందుకు వస్తే బయట నుంచి మద్దతు ఇద్దామని దేవెగౌడ చేసిన ప్రతిపాదనను కుమారస్వామి అంగీకరించారని అంటున్నారు. అయితే కుమారస్వామి రాజీనామా చేసి అసెంబ్లీ రద్దుకు పూనుకుంటే తద్వారా మళ్ళీ అసెంబ్లీ ఎన్నికలు వస్తే ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉండాలని బీజేపీ పావులు కదుపుతోంది. కాంగ్రెస్ కూడా అసెంబ్లీని రద్దు చేయవద్దని కోరుతోంది. కుమారస్వామి రాజీనామా చేస్తే మళ్ళీ జేడీఎస్ తో కలిసి కాంగ్రెస్ సర్కార్‌తో ఏర్పాటయ్యే అవకాశాలను అగ్రనేతలు పరిశీలిస్తున్నారు. రెబల్ ఎమెల్యేలందరికీ మంత్రి పదవులిస్తే వారు రాజీనామాలను ఉపసంహరించుకుంటారని, తద్వారా తగిన బలంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవచ్చని కాంగ్రెస్ నేతలు ఆలోచిస్తున్నారు. చూడాలి మరి ఏమవుతుందో ?