సిద్ధార్ధను దేశమే చంపేసిందా?

 


దేశీయ కాఫీ రుచిని విశ్వ వ్యాప్తం చేసిన కాఫీ బ్రాండ్ అంబాసిడర్ 'కేఫ్ కాఫీ డే' ఫౌండర్ దుర్మరణం ఒక వ్యవస్థీకృత హత్య అనేందుకు పలు కారణాలు ఉన్నాయి. ఆయన వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఇంత తీవ్ర చర్యకు నెట్టివేయబడడానికి కారణాలు ఏమిటి ? ఇంకా నిర్ధారణ కానప్పటికీ ఆయన రాసినట్టుగా భావించబడుతున్న లేఖ అనేక అనుమానాలను లేవనెత్తుతోంది. దేశ వ్యాప్తంగా అనంతమైన ఆవేదనను అంతులేని ప్రశ్నలను మిగిల్చిన సిద్దార్ధ మరణం దేశ ఔత్సాహిక పారిశ్రామిక వేత్తల అనేక సమాధానం దొరకని జీవన్మరణ ప్రశ్నలను లేవనెత్తుతోంది. ప్రధానంగా ఈ లేఖలో ప్రైవేట్ పెట్టుబడి ప్రదాతలు మరియు ఆదాయ పన్ను అధికారుల వేధింపులు కారణాలుగా కనబడుతున్నాయి. ఈ ప్రైవేటు పెట్టుబడి ప్రదాతలు వారికిచ్చిన వాటాలను తిరిగి కొనుగోలు చేయమని ఒత్తిడి చేయడం ఒక వ్యవస్థీకృత సమస్య. భారత దేశ కార్పొరేట్ రుణ మార్కెట్ ఒక పనికి మాలిన, పనికి రాని పేలవమైన వ్యవస్థ. షేరు విలువ అప్పు తనఖా కంటే తగ్గిపోయినప్పుడు పారిశ్రామికవేత్తలను అకాల మరణానికి నెట్టివేసే మన దేశం యొక్క చట్టపరమైన రుణ మార్కెట్ ఇన్ఫరాస్ట్రక్చర్ ఒక దివాళాకోరు స్థితిలో ఉంది. 

కాఫీ డే మన దేశంలో ఒక సుప్రసిద్దమైన విజయవంతమైన బ్రాండ్. కాఫీ డే అనే పదం నవ భారత పాప్ సంస్కృతిలో, అలాగే యువత జీవన శైలిలో భాగం అయ్యింది. భారత నగరాలూ, పట్టణాలలో యువత హ్యాంగౌట్ స్పాట్ గా స్టార్ట్అప్స్ కి, సమావేశాలకు ఎన్నో ప్రణయ ప్రేమ బంధాలకు వేదికయ్యింది. ఈ బ్రాండ్ నిర్మాత అయిన సిద్దార్ధ.. ఏ అమెరికా లాంటి ఫంక్షనల్ రుణ మార్కెట్ ఉన్న ఆర్థిక వ్యవస్థలో ఉండి ఉంటే.. అతనికి డబ్బు కానీ ఋణం కానీ సమకూరడంలో ఎటువంటి ఇబ్బందీ ఉండేది కాదు. కానీ మన దేశంలో సిద్దార్థ లాంటి పారిశ్రామిక వేత్తలు.. బంధువులు నుండో, మిత్రుల నుండో పీఈ ప్రొవైడర్స్ నుండో డబ్బు తీసుకోవాల్సి వస్తుంది. పీఈ నిధుల కోసం అయ్యే ఫైనాన్సింగ్ ఖర్చు చాలా ఆధికం. వివిధ కార్పోరేట్ ఆస్తులను తనఖాగా ఇవ్వడానికి తగిన న్యాయపరమైన ఆమోదం లేక పోవడం వలన పీఈ నిధులు ఖరీదు గానూ, ప్రమాదంగానూ మారుతున్నాయి.  చాలా సందర్భాల్లో పీఈ పెట్టుబడులను దోపిడీగానే అనుకోవాలి. ఈ సందర్భంలో పీఈ సంస్థలను నిందించి ప్రయోజనం లేదు. మన దేశంలో ఒక శక్తివంతమైన రుణ మార్కెట్ ని అధివృద్ది చేయాల్సిన అవసరాన్ని సిద్దార్ధ మరణం ముందుకు తెస్తోంది. మంచి పరపతి గల కంపెనీలకి, ట్రిపుల్ ఏ రేటెడ్ పేపర్లతో జంక్ బాండ్ లను జారీ చేయగల రుణ మార్కెట్ ని భారత్ అభివృద్ధి చేయాలి. ఋణం, వడ్డీ, కరెన్సీ వంటి అన్ని రకాల రిస్కులను నిరోధించడంతో పాటు సమర్ధవంతమైన, వేగవంతమైన, చట్టపరమైన రుణ మార్కెట్ కల్పన నేటి తక్షణ అవసరం. అలాగే అధికారులు పన్ను చెల్లింపు దారుల మధ్య సహృద్భావమైన సంప్రదింపులు, సంబంధాలు మరింత మెరుగుపడాలి.

పారిశ్రామిక వేత్తలు దోపిడీ దారులు అనే వామపక్ష దురభిప్రాయ సంస్కృతి నుండి దూరం కావాలి. వామపక్ష భావజాలంతో ప్రభావమైన మీడియా.. పారిశ్రామికవేత్తలను దొంగలుగా చిత్రీకరించే ఒక దురలవాటును వదులుకోవాలి. దేశ ఆర్ధిక అభివృద్ధిలో కీలక భూమిక పోషించే వ్యాపారవేత్తలు దేశ నిర్మాతలనే స్పృహతో వ్యవహరించాలి. ఎన్నో ఆర్ధిక, కుటుంబ, సామాజిక ఒత్తిడులను, రిస్కులను తీసుకుంటూ పెళ్ళాం పుస్తెలు, మిత్రుల నుండి అప్పులు చేసి పలువురికి ఉపాధి కలిపిస్తూ.. ప్రత్యక్ష-పరోక్ష పన్నులు చెల్లిస్తూ మరింత మందికి పరోక్ష ఉపాధిని కల్పిస్తూ.. ఇతర అనుబంధ పరిశ్రమలకి వ్యాపారాన్ని ఇస్తూ, సంపద సృష్టిస్తూ, చందాలు, సామజిక కార్యక్రమాలకి నిధులు ఇస్తూ సమాజం యొక్క నిర్దయకు నిష్టూరానికి, నష్టానికి, కష్టాలకి గురి అవుతూ అంతర్ధానం అయ్యే ఎందరో పారిశ్రామిక వేత్తలకు సిద్దార్ధ ప్రాయోపవేశం ఒక ఉదాహరణ.

Teluguone gnews banner

భలే మంచి ఓటు బేర‌మూ!

హైద‌రాబాద్ సిటీ వ్యాప్తంగా ఉన్న ఓట‌ర్ల‌లో ప్ర‌స్తుతం జూబ్లీహిల్స్ లో ఉన్న ఓట‌ర్లు మాత్రం దేవుళ్ల‌తో స‌మానం.. కార‌ణం అంద‌రికీ తెలిసిందే. ఈ ఎన్నిక ప్ర‌స్తుతం రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ  పార్టీలకు చావోరేవో పరిస్థితి.  అధికార కాంగ్రెస్ ఇక్కడ గెలవకుంటే  అధికారంలో ఉండీ లేన‌ట్టే అని భావిస్తున్న పరిస్థితి. ఇక బీఆర్ఎస్ ఇక్కడ ఓటమి పాలైతే.. రాష్ట్రంలో ఇక ఉనికి కోల్పోయినట్లే అని భయపడుతోంది. ఇక బీజేపీ విషయానికి వస్తే.. 2028లో అధికారంలోకి రావాలన్న ఆశ అడియాశ అయినట్లే అని బెంబేలెత్తే పరిస్థితి.  ఇప్పుడు జూబ్లీ బైపోల్ లో విజయం సాధిస్తే.. 2028 ఎన్నికలలో అధికారం చేజిక్కించుకోవడానికి రాచబాట వేసుకున్నట్లే అన్న నమ్మకంతో ఉంది.  ఎందుకంటే జూబ్లీ బైపోల్ లో బీజేపీకి డిపాజిట్ వస్తే ఆ పార్టీకి గెలుపుతో సమానం అని ఎద్దేవా చేశారు.   అంతే కాదు ఇక్క‌డ బీజేపీ త‌న డిపాజిట్లు కోల్పోతే.. కేంద్రంలో మోడీ స‌ర్కార్ పాలనకు ఇది  రెఫ‌రెండంగా భావిస్తారా? అని స‌వాల్  కూడావిసిరారు.  ఇక స‌ర్వేలు బీఆర్ఎస్ వైపు మొగ్గు చూపుతుంటే,  దానిపై కూడా రేవంత్ సెటైరిక‌ల్ కామెంట్స్ చేశారు. ఆయా స‌ర్వే కంపెనీల వారు.. ఆయా పార్టీల నుంచి డ‌బ్బు తీసుకుని ఆయా పార్టీలకు వంత పాడ‌తార‌ని, వాటిని స‌ర్వేల‌ని తాము అనుకోలేమ‌ని తీసిపారేశారు. ఎందుకంటే గ‌తంలో సారు- కారు- ప‌ద‌హారు అన్న‌ది వీరేన‌ని.. ఆ త‌ర్వాత ఆ సంఖ్య ఎంత పెద్ద ఎత్తున త‌గ్గిందో తెలిసిందేననీ గుర్తు చేశారు.  ఈ నేపథ్యంలోనే మూడు పార్టీలూ జూబ్లీ బైపోల్ ను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. దీంతో ఓటర్లను ప్రలోభ పెట్టడానికి ఎంత ఖర్చైనా వెనుకాడటం లేదంటున్నారు పరిశీలకులు. దీంతో  ఇక్క‌డి ఓట్ల కొనుగోలు ప్ర‌క్రియ మొదలైపోయిందంటున్నారు.   ఓటుకు రెండు వేలు, మూడు వేలు అంతకన్నా ఎక్కువ అన్నట్లుగా పరిస్థితి మారిపోయిందంటున్నారు.  పోలింగ్ తేదీనాటికి ఓటు ధర మరింత పెరిగినా ఆశ్చర్యపోవడం లేదంటున్నారు. ఎందుకంటే జూబ్లీ బైపోల్ మూడు పార్టీలకూ అత్యంత ప్రతిష్ఠత్మకం కనుక అంటున్నారు. 

జూబ్లీ బైపోల్.. గెలుపోటములతో పాటు.. పోలింగ్ శాతంపైనా చర్చ!

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచార వేడి పెరిగింది. విమర్శల ఘాటు తీవ్రమైంది. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలు విజయం కోసం సర్వశక్తులూ ఒడ్డుతున్నాయి. దీంతో జూబ్లీపైపోల్ లో ఏ పార్టీ గెలుస్తుంది.. ఏ అభ్యర్థికి ఎన్ని ఓట్లు వస్తాయి అన్న చర్చ జోరందుకుంది. అయితే దీనిని మించి అసలు జూబ్లీలో పోలింగ్ శాతం ఎంత నమోదౌతుందన్న చర్చ కూడా జరుగుతోంది. అసలు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఎప్పుడు ఎన్నికలొచ్చినా.. తప్పకుండా డిబేట్ జరిగే పాయింట్ ఇది. తక్కువ పోలింగ్ శాతం.. ఇక్కడి ఎన్నికని ప్రభావితం చేసే మేజర్ ఫ్యాక్టర్‌గా కనిపిస్తోంది. పార్టీల భవిష్యత్తును నిర్ణయించేది ఓటర్లే కాబట్టి.. పోలింగ్ భారీగా నమోదవుతుందా? లేక.. ఎప్పటిలాగే 50 శాతం లోపే ఉంటుందా? అన్నది ఇంట్రస్టింగ్‌గా మారింది.  ఒకవేళ.. తక్కువ పోలింగ్ శాతం నమోదైతే ఎవరికి నష్టం జరుగుతుంది? ఓటింగ్ పర్సంటేజ్ పెరిగితే ఏ పార్టీకి ప్లస్ అవుతుందనే చర్చ జోరుగా సాగుతోంది. దానివల్లే, ఈ ఉపఎన్నికలోనైనా జూబ్లీహిల్స్ ఓటర్లు గడప దాటి, పోలింగ్ బూత్ దగ్గర క్యూలో నిలబడి.. తమకు నచ్చిన నాయకుడిని ఎన్నుకుంటారా? లేక.. మెజారిటీ ఓటర్లు.. ఎప్పటిలాగే.. ఎవరైతే ఏముంది? మాకొచ్చేదా? పోయేదా? అని లైట్ తీసుకొని.. రిలాక్స్ అవుతారా? అన్నదానిపై రకరకాల చర్చ జరుగుతోంది. ఒక్కసారి జూబ్లీహిల్స్ పోలింగ్ హిస్టరీని చూస్తే.. అక్కడ ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయో అర్థమవుతుంది. తెలంగాణ ఆవిర్భావం తరువాత నుంచి జూబ్లీలో పోలింగ్ ట్రెండ్ ను ఓ సారి పరిశీలిస్తే.. 2014లో అసెంబ్లీ ఎన్నికలప్పుడు మాత్రమే.. జూబ్లీహిల్స్‌లో 50.1 శాతం పోలింగ్ నమోదైంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ నాటి నుంచి నేటి వరకు.. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఇదే అత్యధికంగా నమోదైన పోలింగ్ రికార్డ్. అంటే అంతకు ముందు ఇక్కడ భారీ పోలింగ్ జరిగిందని కాదు. మరీ గతంలోకి పోకుండా.. తెలంగాణ ఆవిర్భావం తరువాత నుంచి మాత్రమే మన పరిశీలనకు తీసుకుందాం. సరే 2014లో జూబ్లీ నియోజకవర్గంలో 50.1శాతం రికార్డు స్థాయి పోలింగ్ జరిగిందని చెప్పుకున్నాం కదా.. 2018 అసెంబ్లీ ఎన్నికల దగ్గరకు వచ్చేసరికి 5 శాతం ఓటింగ్ తగ్గిపోయింది. అప్పుడు కేవలం.. 45.5 శాతం  మాత్రమే పోలింగ్ నమోదైంది.  ఆ తరువాత  జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో.. మళ్లీ 5 శాతం పోలింగ్ పడిపోయింది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో జూబ్లీ నియోజకవర్గ పరిధిలో జరిగిన పోలింగ్ కేవలం 39.8 శాతం  మాత్రమే. గత గత అసెంబ్లీ ఎన్నికలలో కూడా ఇక్కడ పోలింగ్ 50శాతం దాటలేదు.  2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో  జూబ్లీహిల్స్‌లో  47.5 శాతం ఓటింగ్  నమోదైంది. 2014 ఎన్నికల తర్వాత ఇదే హయ్యెస్ట్. అయితే.. ఆ తర్వాత లోక్‌సభ ఎన్నికల నాటికి పోలింగ్ శాతం మళ్లీ రెండు శాతం తగ్గి  45.5 శాతం మాత్రమే నమోదైంది.  అంటే 2014 అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఈ నియోజకవర్గంలో ఎన్నడూ 50శాతం పోలింగ్ నమోదు కాలేదు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో క్లాస్, మాస్ ఏరియాలున్నాయ్. ఓ వైపున సంపన్నులుంటే.. మరోవైపు సాధారణ ప్రజలు ఉంటారు. ఇక్కడ ఎన్నికలొస్తే.. పోలింగ్ బూత్ దాకా వచ్చే వారి సంఖ్య చాలా తక్కువగా ఉంటోంది. మరోవైపు.. స్లమ్ ఏరియాలు, పేదలు నివసించే ప్రాంతాలు కూడా ఎక్కువే ఉన్నాయ్. ఇక్కడి ఓటర్లే.. ఎక్కువ సంఖ్యలో పోలింగ్‌లో పాల్గొంటున్నారు. అయితే.. తెలంగాణ వచ్చిన తర్వాత జూబ్లీహిల్స్‌కు తొలిసారి ఉప ఎన్నిక వచ్చింది. మరి.. ఈ బైపోల్ విషయంలోనైనా.. జూబ్లీహిల్స్ ఓటర్ల తీరు మారుతుందా? లేక.. ఎప్పటిలాగే మెజారిటీ ఓటర్లు ఈ ఉపఎన్నికని కూడా లైట్ తీసుకుంటారా? అనే చర్చ మొదలైంది. పార్టీల గెలుపోటముల గురించి ఇప్పుడు ఎంత చర్చ జరుగుతుందో.. పోలింగ్ శాతంపై కూడా అంతే డిబేట్ నడుస్తోంది. ఈ ఉపఎన్నికలో.. ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ మధ్య ట్రయాంగిల్ ఫైట్ నడుస్తోంది. గట్టిపోటీ ఉన్నప్పుడు, ఒక్క బైపోల్‌.. మొత్తం స్టేట్ రాజకీయాన్నే మార్చేస్తుందని నమ్ముతున్నప్పుడు.. తమ అభ్యర్థిని గెలిపించుకోవాలని.. అన్ని పార్టీలు తీవ్రంగా కృషి చేస్తాయ్. ఓటర్లను పోలింగ్ కేంద్రాల దాకా రప్పించేందుకు ఎంతో ప్రయత్నిస్తాయి. అందువల్ల.. జూబ్లీహిల్స్‌ బరిలో ఉన్న ప్రధాన పార్టీల నాయకులంతా.. ఓటర్లని పోలింగ్ స్టేషన్ల దాకా తీసుకొచ్చేందుకు అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేసుకున్నట్లు కనిపిస్తోంది. ముఖ్యంగా.. మాస్ ఏరియాల్లో బీసీ, ముస్లిం ఓటర్లు గణనీయంగా ఉన్న ప్రాంతాల్లోని ఓటర్లను.. పోలింగ్‌కు రప్పించడానికి పార్టీలు మరింత ఫోకస్ చేసే అవకాశం ఉంది. క్లాస్ ఏరియాల్లో నివసించే వారు.. పోలింగ్‌లో పాల్గొనేలా చూసేందుకు.. పార్టీల అభ్యర్థులు, కార్యకర్తలు ఇప్పటికే పర్సనల్ అప్పీల్స్ చేస్తున్నారు. ఇంటింటికీ వెళ్లి.. వారు ఓటు వేయాలని కోరుతున్నారు. కానీ.. వాళ్లంతా పోలింగ్ కేంద్రాల దాకా వస్తారా? లేదా? అనేదే.. ఇప్పుడు మోస్ట్ ఇంట్రస్టింగ్ పాయింట్. జూబ్లీహిల్స్ సెగ్మెంట్‌లో నమోదైన మొత్తం ఓటర్లలో.. దాదాపు 22 శాతం మంది 29 ఏళ్ల లోపు యువ ఓటర్లే ఉన్నారు. వీరంతా.. ఉద్యోగాలు, విద్య, మౌళిక వసతుల లాంటి అంశాలపై ఎక్కువగా దృష్టి పెడుతున్నారు. వీరి టర్నౌట్ గనక పెరిగితే.. పోలింగ్ శాతం తప్పకుండా పెరుగుతుందనే అంచనాలున్నాయ్. గత ఎన్నికల సరళిని బట్టి చూస్తే.. ఇక్క 50 శాతం పోలింగ్ టచ్ కావడం కాస్త కష్టమే అయినప్పటికీ.. పార్టీల మధ్య నెలకొన్న బలమైన పోటీ, యువతలో కనిపిస్తున్న ఉత్సాహం, పార్టీల నేతలు ఓటర్లను పోలింగ్ కేంద్రాల వరకు రప్పించడంలో చూపించే శ్రద్ధ మీదే ఈ ఉపఎన్నికలో పోలింగ్ శాతం పెరగడమా? తగ్గడమా? ఎప్పటిలాగే నమోదవడమా? అనేది ఆధారపడి ఉంటుందనడంలో సందేహం లేదు.

జ‌గ‌న్ + భ‌జ‌న‌ - పార్టీ = ?

జ‌గ‌న్ ప్ల‌స్ భ‌జ‌న మైన‌స్ పార్టీ.. ఇదీ నెల్లూరు మాజీ ఎంపీ మేక‌పాటి రాజ‌మోహ‌న్ రెడ్డి చేసిన కామెంట్స్ సారాంశం. జ‌గ‌న్ చుట్టూ భ‌జ‌న  ప‌రులు పేరుకుపోయార‌నీ, ఆయ‌న వారి చెప్పుడు మాట‌లు విని నిండా మునిగిపోయార‌నీ, అప్పుడ‌ప్పుడూ ఆయ‌న్ను విమ‌ర్శించి, త‌ప్పు స‌రిదిద్దే వారి మాట‌లు కూడా వినాల‌ని హిత‌వు ప‌లికారు మేక‌పాటి. నిజానికి జ‌గ‌న్ లో అలాంటి మార్పు వ‌చ్చే అవ‌కాశ‌ముందా? అని చూస్తే అందుకు ఆస్కార‌మే లేద‌ని అంటారు ఆయ‌న గురించి బాగా తెలిసిన వారు. జ‌గ‌న్ చుట్టూ ఉన్న కోటరీలో కీ ప‌ర్స‌న్ అయిన విజ‌య‌సాయి రెడ్డి ఈ బాధ ప‌డ‌లేక ఆయ‌న్ను విడిచి వెళ్లిపోయారు.   పార్టీకి దూరంగా మ‌స‌లుతున్నారు. ఇక మిగిలింది స‌జ్జ‌ల‌, ధ‌నుంజ‌య‌రెడ్డి త‌దిత‌రులు. జ‌గ‌న్ ది బాగా ఇగో ఉన్న కేరెక్ట‌రైజేష‌న్. ఆయ‌న త‌న‌కు ఏది అనిపిస్తే అది చేయ‌డం ఒక అల‌వాటు. ఊరికే  వచ్చి ఇచ్చే ఉచిత స‌ల‌హాలు ఎట్టి ప‌రిస్థితుల్లోనూ ప‌ట్టించుకోరు. అది ఆయ‌న ఇగోయిస్టిక్ మైండ్ సెట్ కి సంబంధించిన విష‌యం. ఒక వేళ ఎవ‌రి నుంచైనా స‌ల‌హా తీసుకుంటే.. కొన్ని కోట్ల రూపాయ‌లు ఖ‌ర్చు చేసి పీకే వంటి వారిని నియ‌మించుకుని వారి నుంచైనా ఏదైనా స‌ల‌హా సూచ‌న పాటిస్తారేమోగానీ ఎట్టి ప‌రిస్థితుల్లోనూ త‌న క‌న్నా కింది స్థాయి వ్య‌క్తుల మాట‌లు విన‌డం గానీ వారికి  ప్ర‌యారిటీ ఇవ్వ‌డం గానీ ఉండ‌దు. జ‌గ‌న్ ది అంతా వ‌న్ వే.  త‌న పార్టీలో ఉన్న లీడ‌ర్ల‌ను జ‌గ‌న్ కేవ‌లం పావులుగానే భావిస్తారు. తాను ఎక్క‌డ ఎవ‌ర్ని నిల‌బెడితే వారక్క‌డి నుంచి  గెలుస్తారంటే  అదంతా త‌న చ‌రిష్మా యేననీ, వారికంటూ సొంత  ప్ర‌తిభా పాట‌వాలుండ‌వనే నమ్ముతారు జగన్. అందుకే గ‌త ఎన్నిక‌ల్లో ఒక రాజ‌కీయ చ‌ద‌రంగం ఆడి బొక్క‌బోర్లా ప‌డ్డారు.   జ‌గ‌న్ కి ఒక మ‌నిషికి విలువ ఇవ్వాల‌న్న విషయం కనీసం తెలియదంటారు ఆయనకు సన్నిహితంగా మెలిగిన వారు.  ఇదే విషయాన్ని  విజ‌య‌సాయిరెడ్డి ఇప్ప‌టికే ఎన్నోసార్లు బాహ‌టంగానే చెప్పారు కూడా.  జ‌గ‌న్ తో పోలిస్తే తానెంతో సీనియ‌ర్ అయినా.. నిల‌బ‌డే మాట్లాడాల్సి ఉంటుంద‌ని విజయసాయిరెడ్డి చెప్పుకోవడమూ  తెలిసిందే. ఇక ఎమ్మెల్యేలు, ఎంపీల‌ను కూడా జ‌గ‌న్ ఇప్ప‌టి వ‌ర‌కూ గౌర‌వించిన దాఖలాలు లేవు. ఈ విష‌యంలో ర‌ఘురామ మ‌రింత క్లారిటీగా చెప్ప‌గ‌ల‌రు. ఆయ‌నంతగా జ‌గ‌న్ ని వ్య‌తిరేకించారంటే అందుకు కార‌ణం ఈ విలువ‌లేని త‌న‌మే. సాధార‌ణంగా చిన్న పిల్ల‌ల నుంచి వృద్ధుల వ‌ర‌కూ ప్ర‌తి ఒక్కరికీ వారి వారి  స్తోమ‌త‌కు త‌గ్గ‌ట్టు అంతో ఇంతో నాలెడ్జ్ ఉంటుంది. కొన్ని సార్లు ఆ విష‌య ప‌రిజ్ఞానం ఎన్నో వింత‌లను న‌మోదు చేస్తుంద‌ని న‌మ్మే ర‌కం కాదు జ‌గ‌న్ రెడ్డి. ఆయ‌నదంతా త‌న తాత స్టైల్. వీడ్ని కొట్టు- వాడ్ని ప‌ట్టు- ఇదిగో వీడికి పెట్టు. అనుకుంటారు త‌ప్ప‌.. మ‌న‌క‌న్నా మించి మ‌న‌కు తెలివితేట‌లు నేర్పేవారు మ‌న కింది స్థాయి  వ్య‌క్తుల్లో ఉంటార‌న్న న‌మ్మ‌కాలు గానీ, అభిప్రాయాలు గానీ జ‌గ‌న్ లో ఉండ‌వు. ఉండ‌బోవు.  ఆయ‌న‌దంతా ఒక‌టే సిద్ధాంతం. పైన దేవుడున్నాడు. కింద  జ‌నం ఉన్నారు. మ‌ధ్య‌లో మ‌నం  ఈ ఇద్ద‌రి ద్వారా ఇక్క‌డ చ‌క్రం తిప్పుతుంటాం అనుకునే బాప‌తు. ఒక వేళ మేక‌పాటి చెప్పిన‌ట్టు ఎవ‌రైనా ఒక‌రు చెప్పిన స‌ల‌హా సూచ‌న‌ల కార‌ణంగా ఏదైనా పార్టీకి ల‌బ్ధి చేకూరిందే అనుకుంటే.. జ‌గ‌న్ లోని ఇగో దాన్ని ఎంత మాత్రం ఒప్పుకోదు.  జ‌గ‌న్ ఫీలింగ్స్ లో ఇది జ‌నం  కోసం పార్టీ పెట్టిన  పార్టీ అని గానీ వారికి ల‌బ్ధి చేకూరాల‌ని పెట్టిన పార్టీ అనిగానీ భావించరు. త‌న తండ్రి మీద‌నే ఒక ఈర్ష్య, అసూయ క‌లిగిన  వ్య‌క్తి జ‌గ‌న్. ఈ విష‌యం  ఆయ‌నే స్వ‌యంగా చెప్పుకొచ్చారు. తాను ఓదార్పు యాత్ర‌ల‌కు వెళ్లిన‌పుడు త‌న తండ్రి  ఫోటో వారిళ్ల‌లో దేవుడి ఫోటోల ప‌క్క‌న  పెట్టార‌నీ.. ఆ స్థానంలో త‌న ఫోటో ఉండాల‌న్న‌ది ఆయ‌న ప్ర‌గాఢ‌మైన‌ కోరిక‌.  అందుకోసం తాను అధికారంలో ఉండగా ఎడా పెడా, ఇబ్బ‌డి ముబ్బ‌డిగా జ‌నానికి రాష్ట్ర ఖ‌జానా  సొమ్ము దోచి పెట్టి రాష్ట్రాన్ని ఆర్థిక సంక్షోభంలోకి నెట్టడానికి కూడా వెనుకాడలేదు జగన్.  అదే సొమ్ము రాష్ట్రం చెంత ఉంటే, దాంతో ఈ పాటికి అమ‌రావ‌తి రాజ‌ధానితో పాటు పోల‌వ‌రం కూడా పూర్త‌య్యి ఉండేది.  అలాంటి జగన్ ఇప్పుడు  కార్య‌క‌ర్త‌ల కోసం తాను మారుతున్న‌ట్టు చెబుతున్నా.. జ‌గ‌న్ కున్న మాన‌సిక స్థితిని బ‌ట్టి చూస్తే అందులోనూ వ‌న్ వే యేఉంటుంది త‌ప్ప‌, ప్ర‌జాస్వామిక విధాన  స‌ర‌ళిని  ఊహించ‌డం వెర్రిత‌న‌మే అవుతుందంటున్నారు పరిశీలకులు.  అటువంటి జగన్ కనుక రాష్ట్రానికి మరో సారి సీఎం అయితే.. ఏపీని ఆయ‌న నామ‌రూపాల్లేకుండా చేస్తార‌న‌డంలో సందేహానికి తావులేదం టున్నారు విశ్లేషకులు.

ఉచిత బ‌స్సు ఎఫెక్ట్ న్యూయార్క్ ను కూడా షేక్ చేసిందిగా!

అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ మీద వ్య‌తిరేక‌త ఈనాటిది కాదు. ఆయ‌న తొలిసారి గెలిచిన‌పుడు కూడా తీవ్ర జ‌నాగ్ర‌హం వ్య‌క్త‌మైంది.  రాస్తారోకోలు, ధ‌ర్నాలు, నిర‌స‌న‌లు, కోర్టు కేసులు  న‌డిచాయ్. ఆయ‌న రెండో సారి ఓడినా, మ‌ళ్లీ తీవ్ర య‌త్నాలు సాగించి మరోసారి అగ్రదేశాధ్యక్షుడయ్యారు. ఎట్ట‌కేల‌కు త‌న సెకండ్ ట‌ర్మ్ డ్రీమ్ నెర‌వేర్చుకున్నారు.  అమెరికా అధ్యక్షపగ్గాలను రెండో సారి చేపట్టీపట్టడంతోనే ఆయన తీసుకున్న తీవ్ర నిర్ణ‌యాల కారణంగా చిక్కుల్లో పడ్డారు. పడుతున్నారు. ఇప్ప‌టికే ట్రంప్ మీద ఎన్నో కేసులున్నాయి. తాజాగా  ఆయ‌న మీద ఎంత వ్య‌తిరేకత ఉందో చెప్ప‌డానికి మ‌రో ఉదాహ‌ర‌ణ న్యూయార్క్ మేయ‌ర్ ఎన్నిక‌. ఈ ఎన్నిక అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ కు భారీ షాకిచ్చింది. న్యూయార్క్ మేయ‌ర్ గా భార‌త ఉగండా మూలాలున్న జోహ్రాన్ మ‌మ్ దానీ ఎన్నిక‌య్యారు. ఈయ‌న మ‌రెవ‌రో కాదు మ‌న భార‌తీయ ద‌ర్శ‌కురాలు మీరానాయ‌ర్- ఉగాండాకి చెందిన మమ్ దానీల‌ కుమారుడే. మ‌మ్ దాని ఓట‌మి కోసం ట్రంప్ ఎంత రిస్క్ చేశారంటే.. క‌మ్యూనిస్టు భావ‌జాలం అధికంగా ఉన్న మ‌మ్ దానీని    గెలిపిస్తే న్యూయార్క్ కోసం చాలా చాలా త‌క్కువ నిధులు మాత్ర‌మే మంజూరు చేస్తానని అక్కడి ఓట‌ర్ల‌ను హెచ్చ‌రించారు.  అయితే ట్రంప్ హెచ్చరికలను న్యూయార్క్ జనం ఖాతరు చేయలేదు. అత్యంత పిన్న వ‌య‌స్కుడైన 34 ఏళ్ల మ‌మ్ దానీని మేయర్ గా ఎన్నుకున్నారు.   మాజీ గ‌వ‌ర్న‌ర్ ఆండ్రూ క్యోమోపై విజ‌యం సాధించి యంగ‌స్ట్ మేయ‌ర్ ఫ‌ర్- ఓల్డెస్ట్ సిటీగా మ‌మ్ దానీ రికార్డు సృష్టించారు.   ఇక్క‌డ చెప్పుకోద‌గ్గ మ‌రో విష‌య‌మేంటంటే.. మ‌మ్ దానీ ద‌క్షిణ భార‌త‌ ఎన్నిక‌ల ఫ‌లితాల‌ను ప్ర‌భావితం చేస్తోన్న‌ ఉచిత సిటీ  బ‌స్సు ప్ర‌యాణాల ప్ర‌క‌ట‌న చేయ‌డం బాగా క‌ల‌సి వ‌చ్చిన‌ట్టు చెబుతున్నారు. కేవ‌లం బెంగ‌ళూరు, హైద‌రాబాద్ లోనే కాదు న్యూయార్క్ లోనూ ఈ  ఫ్రీబ‌స్ ట్రిక్ ప‌ని చేసిందంటే దీని రేంజ్ ఏంటో ఊహించుకోవ‌చ్చు. ఫ్రీబ‌స్ ఆఫర్ కి అంత‌ర్జాతీయంగానూ జనం బుట్ట‌లో ప‌డిపోతున్నార‌న్న‌మాట‌.  స‌ర్కార్ కి  ఇదెంత న‌ష్ట‌దాయ‌క‌మైనా కూడా ఇలా జ‌నం లెక్క చేయ‌కుండా ఉచిత  ప్ర‌యాణాల మోజులో ప‌డ్డ‌మేంట‌న్న‌ది పెద్ద చర్చగా మారింది. ఇదిలా ఉంటే.. నగరంలో అద్దెలను స్థిరీకరిస్తానని మాటివ్వ‌డం, యూనివర్శల్‌ ఛైల్డ్‌ స్కీమ్‌ అమలు చేస్తాన‌న‌డం, 2030 నాటికి కనీస వేతనాల పెంపు గ్యారంటీగా చెప్ప‌డం, కార్పొరేట్లు, సంపన్నులపై పన్ను పెంచి చిరుజీవుల జీవన వ్యయాలను తగ్గిస్తానని త‌న‌ ప్రచారంలో చెప్పుకొచ్చారు జోహ్రాన్ మ‌మ్ దానీ. ఇవి కూడా నగర ప్రజలను విశేషంగా ఆకర్షించాయి. వీటిన్నింటికీ మించి అధ్యక్షుడు ట్రంప్‌నకు వ్య‌తిరేకంగా ఎంతో ధైర్యంగా ఎదురొడ్డి నిలబడటంలోనూ విజ‌యం సాధించారు జోహ్రాన్ మ‌మ్ దానీ. ఏది ఏమైనా లాస్ట్ పంచ్ ఏంటంటే ఇక్క‌డా ఫ్రీ బ‌స్ స్కీమ్ వ‌ర్క‌వుట్ కావ‌డం.

ప్రతిపక్ష హోదా కోసం జగన్ వృధా ప్రయాస

ప్రజలు ఇవ్వకపోయినా విపక్ష హోదా కోసం నానాయాగీ చేస్తూ, మంకుపట్టుపట్టి ప్రజల దృష్టిలో మరింత చులకల అవుతున్న జగన్ మోహన్ రెడ్డికి ఆయన చేస్తున్నదంతా వృధాప్రయాసేనని తెలియదా? వైసీపీ లో అంతో కొంతా విషయజ్ణానం ఉన్న వారు ఎవరూ ఈ సంగతిని ఆయనకు చెప్పడానికి ధైర్యం చేయలేకపోతున్నారా? అంటే పరిశీలకులు ఔననే అంటున్నారు. కేవలం అహంభావంతో ఆయన విపక్ష హోదా కోసం పట్టుబడుతున్నారనీ, ఏం చేసినా ఆయనకు విపక్ష నేత హోదా కానీ, ఆయన పార్టీకి విపక్ష పార్టీ హోదా కానీ వచ్చే అవకాశాలు ఇసుమంతైనా లేవనీ పరిశీలకులు అంటున్నారు. అయితే తాజాగా జగన్ కు అత్యంత బలమైన మద్దతు దారు అయిన ఉండవల్లి అరుణ్ కుమార్ కూడా విపక్ష హోదా కోసం జగన్ పడుతున్న తాపత్రేయం అనవసరమని అన్నారు. ఎంత పాకులాడినా ఆయనకు విపక్ష నేత హోదా వచ్చు అవకాశం లేదనీ, ఆ విషయంలో జగన్ చేస్తున్నదంతా వృధా ప్రయాసేనని కుండబద్దలు కొట్టేశారు.  రాజ్యాంగబద్ధంగా రాని…ప్రజలు ఇవ్వని విపక్ష హోదా కోసం జగన్ పోరాడి ఉపయోగం లేదని ఉండవల్లి విస్పష్టంగా చెప్పారు.  అయినా ప్రజా సమస్యలపై పోరాడడానికి  ప్రతిపక్ష హోదా అవసరం ఏముందని ఉండవల్లి అన్నారు. ఈ విషయాన్ని జగన్ ఎంత త్వరగా గుర్తిస్తే ఆయనకు రాజకీయంగా అంత మేలు జరుగుతుందని అంటున్నారు.  తనకు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వలేదు కనుకే తాను అసెంబ్లీకి రావడం లేదని జగన్ అంటున్నా.. ఉండవల్లి చెబుతున్నదాన్ని బట్టి చూస్తే సీఎంగా చక్రం తిప్పిన అసెంబ్లీలో ఇప్పుడు ఒక సాధారణ ఎమ్మెల్యేగా కూర్చోవడానికి జగన్ కు అహం అడ్డొస్తోందనీ, ఆ కారణంగానే ఆయన అసెంబ్లీకి డుమ్మా కొడుతున్నారన్నది ఉండవల్లి అభిప్రాయంగా కనబడుతోంది. అధికార తెలుగుదేశం కూటమి కూడా జగన్ కేవలం అహంభావంతో మాత్రమే అసెంబ్లీని బాయ్ కాట్ చేశారని విమర్శిస్తున్నారు.  జగన్ అధికారంలో ఉన్న సమయంలో అసెంబ్లీలో తమ పార్టీకి ఉన్న 151 మంది సభ్యుల బలం చూసుకునిసభలో అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు అందరినీ అవమానించిన జగన్ ఇప్పుడు తనకు అదే మర్యాద జరుగుతుందన్న భయంతోనే ప్రతిపక్ష హోదా నెపంతో సభకు గైర్హాజరు అవుతున్నారని అధికార పార్టీ అంటున్నది. ఇప్పడుు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ కూడా  అధికారపార్టీ అంటున్నదే రైట్ అన్నారని భావించాల్సి వస్తున్నది.   ప్రతిపక్ష హోదా  ఇస్తేనే అసెంబ్లీకి వస్తాననడం విడ్డూరంగా ఉందంటూ ఉండవల్లి వ్యాఖ్యానించారు.  అధికార పక్ష సభ్యుల తీరు నచ్చకుంటే  సభ నుంచి వాకౌట్ చేయడం వంటివి సాధారణమని, కానీ మొత్తంగా సభకే గైర్హాజరు కావడం అనుచితమని, ఎంత మాత్రం ఆమోదయోగ్యం కాదనీ అన్నారు. మరి ఇప్పటికైనా జగన్ కు జ్ణానోదయం అవుతుందా చూడాల్సిందే!

రాజగోపాల్ రెడ్డి కింకర్త్యం

మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి విషయంలో కాంగ్రెస్ పార్టీ ఒక క్లారిటీ ఇచ్చేసింది. దబాయించి, బెదరించి పార్టీలో పదవులను తెచ్చుకోవడం అంత తేలిక కాదని క్లియర్ కట్ గా కాంగ్రెస్ హై కమాండ్ తన చేతల ద్వారా చూపింది. రేవంత్ కేబినెట్ లో బెర్త్ కోసం కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్ని అస్త్రాలూ ఉపయోగించేశారు. సామ, దాన, బేద, దండోపాయలను వాడేశారు. అయినా పార్టీ హైకమాండ్ కిమ్మనలేదు. చర్యలు తీసుకోలేదు. అలాగని మంత్రి పదవి గ్యారంటీ అన్న హామీను ఇవ్వలేదు. సరికదా... కోమటిరెడ్డికి నేరుగా చెప్పకుండానే కేబినెట్ బెర్త్ ఇచ్చేది లేదన్న విషయాన్ని చేతల ద్వారా చెప్పకనే చెప్పింది.   త‌న‌కు మంత్రి ప‌ద‌వి ఇవ్వాల‌ని.. ఇస్తార‌ని.. అయితే ఇందుకు కొందరు అడ్డుపడుతున్నారనీ ఇంత కాలం చెబుతూ వచ్చిన రాజగోపాల్ రెడ్డి..  కాంగ్రెస్ అధిష్ఠానంపై కూడా విమర్శనాత్మక వ్యాఖ్యలు చేశారు. ఒకే కుటుంబంలోని వారికి గతంలో పార్టీ హైకమాండ్ పదవులు ఇచ్చిన సందర్భాలను ఉటంకిస్తూ, తనకిస్తే తప్పేమిటని కూడా నిలదీశారు. పనిలో పనిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపైనా తీవ్ర వ్యాఖ్యలూ, విమర్శలూ చేసేశారు.  ఎక్క‌డెక్క‌డ నుంచో వ‌చ్చిన వారిని అందలం ఎక్కించారని నిష్ఠూరాలాడారు.   గీత దాటి విమర్శలు చేసినా  కనీసం  క్రమశిక్షణా కమిటీ ముందుకు కూడా కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డిని పిలవలేదు. ఆయనపై చర్యలు తీసుకోలేదు. ఆయన వ్యాఖ్యలు, విమర్శలను పార్టీ  హైకమాండ్ అసలు పట్టించుకోనట్లుగానే వదిలేసింది. కీలెరిగి వాత పెట్టిన సందర్భంగా.. ఆయనకు వాస్తవం కళ్లకు కట్టేలా చేసింది. తాజాగా  రేవంత్ రెడ్డి తన కేబినెట్ లోని మహమ్మద్ అజారుద్దీన్ తీసుకున్నారు. అంతటితో ఆగకుండా.. కేబినెట్ బెర్త్ ఆశిస్తున్న ఇద్దరు సీనియర్ నాయకులు ప్రేమ్‌సాగ‌ర్‌రావు, సుద‌ర్శ‌న్‌రెడ్డికి  కేబినెట్ హోదాతో కూడిన నామినేటెడ్ పదవులు ఇచ్చారు.   కానీ తనకు మంత్రి పదవి కావాలి, ఇచ్చి తీరాలి అంటూ ఎన్నో ఆశలు పెట్టుకోవడమే కాకుండా, పదవి కోసం నానా యాగీ చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని పూర్తిగా విస్మరించారు.  హైకమాండ్ ఈ విషయంలో స్పష్టతతో ఉంది కనుకనే రేవంత్ రెడ్డి ఈ నిర్ణయాలు తీసుకున్నారని కాంగ్రెస్ వర్గాలే చెబుతున్నాయి. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని పూర్తిగా విస్మరించిన అంశం ఇప్పుడు కాంగ్రెస్ లోనే కాకుండా, రాష్ట్ర రాజకీయాలలో పెద్ద చర్చనీయాంశంగా మారింది. పార్టీలోని ఏ వర్గం నుంచీ కూడా రాజగోపాల్ రెడ్డి పట్ల సానుభూతి వ్యక్తం అవుతున్న దాఖలాలు కనిపించడం లేదు.  పదవి కోసం హైకమాండ్ ను బ్లాక్ మెయిల్ చేసే స్థాయిలో వ్యవహరిస్తే.. ఇలాగే ఉంటుందన్న అభిప్రాయం పార్టీ వర్గాల్లో వ్యక్తం అవుతోంది. సరే ఇవన్నీ పక్కన పెడితే ఇప్పుడు కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎలా స్పందిస్తారన్న ఆసక్తి మాత్రం రాజకీయవర్గాలలో కనిపిస్తోంది.  

అందరికి ఓటు.. ఈసీ టార్గెట్!

మన దేశంలో ఓటరు జాబితా సమగ్రతను కాపాడటమే లక్ష్యంగా.. డూప్లికేట్ ఓట్లు, మృతి చెందిన వారి ఓట్లు, వలస వెళ్లిన ఓటర్ల పేర్లను తొలగించేందుకే.. ఎన్నికల సంఘం..  స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ చేపడుతోంది. ఓటు వేసేందుకు అర్హత కలిగిన ప్రతి పౌరుడి పేరు.. ఓటర్ లిస్టులో ఉండేలా చూస్తోంది. కోట్లాది మంది యువ ఓటర్ల చేరిక వల్ల.. ఓటర్ లిస్టులు కూడా అప్‌డేట్ కావాల్సిన అవసరం ఉంది.  కొన్ని రాజకీయ పార్టీలు ఈ రివిజన్‌కు మద్దతిస్తుండగా.. మరికొన్ని ప్రతిపక్ష పార్టీలు ఈ ప్రక్రియ పట్ల తీవ్ర అభ్యంతరాలు చెబుతూ, ఆందోళన  వ్యక్తం చేస్తున్నాయ్. రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచు కొని.. ఈ రివిజన్ చేస్తున్నారని.. ఇది ఓటరు జాబితాలను తారుమారు చేసే ప్రయత్నమని ఆరోపి స్తున్నారు. అధికార పార్టీ.. తమకు అనుకూలంగా లేని వర్గాలు, మోనారిటీలు, షెడ్యూల్డ్ కులాలు, మహిళలు, పేద వర్గాల ఓటర్ల పేర్లను.. వ్యూహాత్మకంగా జాబితా నుంచి తొలగించే కుట్ర చేస్తోందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్‌లో.. ఓటర్లు తమ అర్హతని నిరూపించుకునేందుకు బర్త్ సర్టిఫికెట్ల లాంటి పత్రాలను సమర్పించాల్సి రావడం నిరక్ష్యరాస్యులు, పేదలు, వలస కార్మికులకు కష్టమని వాదిస్తున్నారు. బీహార్‌లో జరిగిన ఫస్ట్ ఫేజ్ రివిజన్ తర్వాత.. లక్షలాది మంది పేర్లను ఓటరు జాబితా నుంచి తొలగించారు. ముఖ్యంగా, ప్రతిపక్ష పార్టీలకు ఓటు వేసే అవకాశం ఉన్నవారి పేర్లు.. ఎక్కువగా తొలగించారనే ఆరోపణలు వచ్చాయి. దాంతో.. ఎస్ఐఆర్‌పై కొన్ని పార్టీల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా 18 ఏళ్లు నిండిన కొత్త ఓటర్లందరూ జాబితాలో ఉండేలా చూడటమే ఎస్ఐఆర్ లక్షఅయం. వన్ మ్యాన్ వన్ ఓట్ అనే సిద్ధాంతాన్ని బలోపేతం చేసే ఉద్దేశం కూడా ఉంది. అనేక రాజకీయ పార్టీలు గతంలో ఓటర్ లిస్ట్‌లపై ఆందోళన వ్యక్తం చేశాయి. వాటన్నింటిని పరిష్కరించేందుకు కూడా ఈ ప్రక్రియ ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. అయితే.. కొన్ని ప్రతిపక్ష పార్టీలు.. ఈ రివిజన్ వెనుక రాజకీయ కారణాలున్నాయని.. నకిలీ ఓట్ల తొలగింపు పేరుతో.. తమ మద్దతుదారులను టార్గెట్‌గా చేసుకొని.. ఓటు హక్కును దోచుకునే ప్రయత్నమని ఆరోపిస్తున్నాయి. అయితే.. ఎన్నికల సంఘం మాత్రం.. ఇది తప్పనిసరిగా చేపట్టాల్సిన ప్రక్రియ అని, ఎన్నికల సంస్కరణల్లో భాగమని చెబుతోంది. ఎస్ఐఆర్‌లో భాగంగా.. ఓటర్ జాబితాలోని ఓటర్లందరికీ.. బూత్ లెవెల్ ఆఫీసర్లు.. ప్రత్యేక ఎన్యుమరేషన్ ఫామ్స్ అందిస్తారు. అందులో.. సమగ్రమైన ఓటర్ జాబితాకు కావాల్సిన అన్ని వివరాలు ఉంటాయి. బీఎల్‌వోలు.. ప్రతి ఇంటికీ మూడు సార్లు వెళ్తారు. వలస వచ్చిన ఓటర్ల సమస్యని కూడా పరిష్కరిస్తారు. అంతేకాదు.. ఓటర్లు కూడా తమ ఎన్యుమరేషన్ ఫామ్స్‌ని ఆన్‌లైన్‌లోనూ సమర్పించొచ్చు. బీఎల్‌వోలు.. ఫామ్స్ పంపిణీ చేయడం ప్రారంభించాక.. ఓటర్ల తమ వివరాలను పాత ఓటర్ లిస్టుతో ధ్రువీకరించుకోవాల్సి ఉంటుంది. 2003 ఓటర్ లిస్టులో.. తమ పేరు ఉందో లేదో చూసుకోవాల్సి ఉంటుంది. వారి పేర్లు గానీ వారి తల్లిదండ్రుల పేర్లు గానీ 2003 నాటి ఓటర్ లిస్టులో కనిపిస్తే.. వారు ఎలాంటి అదనపు పత్రాలను సమర్పించాల్సిన అవసరం లేదు. 2002 నుంచి 2004 కాలం నాటి ఓటర్ లిస్టులను.. ఎన్నికల సంఘం వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచుతారు. ఓటర్లు.. తమ చేరికను నేరుగా ఆన్‌లైన్‌లోనే ధ్రువీకరించుకునే అవకాశం కల్పించారు.  స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పారదర్శకతని కాపాడేందుకు.. అన్ని రాష్ట్రాల ప్రధాన ఎన్నికల అధికారులు, జిల్లా ఎన్నికల అధికారులు.. రాజకీయ పార్టీల ప్రతినిధులను కలిసి.. ఎస్ఐఆర్ ప్రక్రియ గురించి వివరించనున్నారు. ఎందుకంటే.. అనేక సార్లు రాజకీయ పార్టీలు ఓటర్ లిస్టుల గురించి ఆందోళనలు లేవనెత్తాయ్. అందువల్ల.. ఓటర్ లిస్టులో కచ్చితత్వం, పారదర్శకతని నిర్ధారించేందుకు.. ఎన్నికల సంఘం స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ చేయాలని నిర్ణయించింది. ఈ రివిజన్‌లో భాగంగా.. ప్రతి బూత్ లెవెల్ అధికారికి.. దాదాపు వెయ్యి మంది ఓటర్ల బాధ్యత అప్పగిస్తారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గాన్ని.. ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ మానిటర్ చేస్తారు. బీహార్ మోడల్‌లా.. ఈ ప్రక్రియని విజయవంతం చేయడమే లక్ష్యమని చెబుతోంది ఈసీ. అదే విధంగా అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో.. ఎలాంటి దోషాలు లేని సమగ్రమైన ఓటర్ లిస్టులను ప్రకటించడమే.. రెండో దశ ఎస్ఐర్ లక్ష్యమని ఎన్నికల సంఘం గట్టిగా చెబుతోంది.

బీహార్‌లో ఎన్డీఏకి నితీష్‌కుమారే దిక్కు.. ఎందుకంటే?

ఇండియా పొలిటికల్ అటెన్షన్ అంతా.. ఇప్పుడు బీహార్ వైపే ఉంది. ఈసారైనా.. అక్కడ సర్కార్ మారుతుందా?  లేక నితీశ్ కుమార్ ప్రభుత్వానికే ప్రజలు మళ్లీ పట్టం కడతారా? అనే సస్పెన్స్ నెలకొంది. ఇలాంటి పరిస్థితుల్లో.. ఢిల్లీ లెవెల్ లీడర్లు బీహార్ గడ్డ మీద చేసే కామెంట్లు.. అక్కడి రాజకీయం కొత్త టర్న్ తీసుకునేలా చేస్తున్నాయి. ఎన్నికల ర్యాలీలో.. కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలు కూడా అలాంటివే. రాజకీయాల్లో ఖాళీ సీట్లు లేవని.. నరేంద్రమోడీ పీఎంగా, నితీశ్ కుమార్ సీఎంగా కొనసాగుతారని.. అమిత్ చేసిన స్టేట్‌మెంట్.. బీహార్ సహా మిగతా స్టేట్స్‌లోనూ పెద్ద ఎత్తున చర్చకు దారి తీసింది.   అసలు.. నితీశే సీఎం అభ్యర్థి అని బీజేపీ ఎందుకు చెబుతోంది? ఆయనకు వయసు మీద పడింది. నితీశ్ సుదీర్ఘ పాలనపై ఎన్నో విమర్శలున్నాయ్. జనంలో వ్యతిరేకతతో పాటు ఆయన హయాంలో స్కాములు జరిగాయనే ఆరోపణలున్నాయ్. అయినా సరే.. నితీశ్ కుమార్‌నే బీజేపీ నెక్ట్స్ సీఎంగా ప్రొజెక్ట్ చేస్తోంది.  ఇందుకు అనేక కారణాలు కనిపిస్తున్నాయ్. ఇది ఎన్డీయే కూటమికి అనివార్యమైన రాజకీయ అవసరంగా కనిపిస్తోంది. ముఖ్యంగా నితీశ్ కుమార్‌కు ఉన్న అతిపెద్ద బలం  ఈబీసీ ఓట్ బ్యాంక్. అత్యంత వెనుకబడిన తరగతులు, మహాదళిత్‌ల మద్దతు ఆయనకు పుష్కలంగా ఉంది. ఈ వర్గాలే  బీహార్‌ ఎన్నికలలో డిసైడింగ్ ఫ్యాక్టర్‌గా ఉన్నాయి. బీజేపీ తన సంప్రదాయ ఓట్ బ్యాంకుతో పాటు, నితీశ్ ద్వారా ఈ కీలకమైన ఈబీసీ ఓట్లను తమ వైపు ఆకర్షించాలని చూస్తోంది. అందువల్ల నితీశ్ కుమార్ నాయకత్వాన్ని  తిరస్కరిస్తే.. ఆయన మరోసారి కూటమి మారతారేమోనన్న ఆందోళన బీజేపీ నాయకత్వంలో కనిపిస్తోంది. ఎందుకంటే.  గతంలో రెండు సార్లు నితీశ్ బీజేపీని వీడారు. కూటమి విచ్ఛిన్నం కాకుండా స్థిరంగా ఉంచేందుకు నితీశే నెక్ట్స్ సీఎం అని.. ఆయన తర్వాతే తామని చెప్పడం బీజేపీకి తప్పనిసరి అవుతోంది. మరోవైపు నితీశ్ కుమార్‌ని బీహార్ ప్రజలు ఇప్పటికీ.. లాలూ ప్రసాద్ యాదవ్ హయాంలోని జంగిల్ రాజ్‌కు పూర్తి విరుద్ధంగా చూస్తారు.  దాదాపు  రెండు దశాబ్దాలుగా బీహార్‌కు పాలనా స్థిరత్వాన్ని ఇచ్చింది నితీశ్ నాయకత్వమే.  ప్రతిపక్ష  మహాఘట్‌బంధన్  యువ నాయకుడు తేజస్వి యాదవ్‌ని సీఎం అభ్యర్థిగా బరిలో నిలిపినప్పుడు, ఆయనకు వ్యతిరేకంగా అనుభవజ్ఞుడైన, అవినీతి మరకలు లేని నితీశ్‌ని నిలబెట్టడం బీజేపీకి సులభమవుతుంది. పాలనా స్థిరత్వం వర్సెస్ అరాచకత్వం అనే నినాదాన్ని జనంలోకి తీసుకెళ్లడానికి  నితీశ్ కంపల్సరీ అవుతారనే చర్చ జరుగుతోంది. కానీ  ఇక్కడంతా ఒప్పుకోవాల్సిన నిజం ఏమిటంటే, నితీశ్ కుమార్‌కు వయసు మీద పడింది. ఆయన పాలనపై ఇప్పుడు విమమర్శలు వినిపిస్తున్నాయ్. జనంలోనూ  జేడీయూ హాయాంపై వ్యతిరేకత ఉన్న విషయం వాస్తవమే. అయితే,  ఈ వ్యతిరేకతను  బీజేపీ తనపై పడకుండా చూసుకునేందుకే.. నితీశ్‌ని ముందుంచుతోందనే వాదన వినిపిస్తోంది. నితీశే సీఎం అభ్యర్థిగా ఉంటే,  రాజకీయ ప్రత్యర్థులు విమర్శలన్నీ ఆయన, ఆయన పార్టీ జేడీయూ లక్ష్యంగానే ఉంటాయి. దీని ద్వారా బీజేపీ కొంత రిలాక్స్ అయ్యే అవకాశం ఉంది. పైగా ఈ వ్యతిరేకతని అధిగమించేందుకు.. బీజేపీ తరచుగా డబుల్ ఇంజిన్ సర్కార్ స్లోగన్‌ని హైలైట్ చేస్తూ వస్తోంది. నరేంద్రమోడీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం చేసిన అభివృద్ధిని, నితీశ్ నాయకత్వంలోని బీహార్ పాలనని కలిపి.. డబుల్ ఇంజిన్ సర్కార్ చేపట్టిన ప్రోగ్రెస్‌గా ప్రచారం చేస్తోంది. దాంతో,  నితీశ్‌పై వ్యతిరేకత ఉన్నా.. మోడీ ఇమేజ్‌తో దాన్ని అధిగమించాలని చూస్తోంది. కొన్ని రోజుల కిందటి వరకు, బీజేపీ నాయకత్వం వ్యూహాత్మకంగా ఎన్నికలు నితీశ్ నాయకత్వంలో జరుగుతాయి.  సీఎంని ఎమ్మెల్యేలు ఎన్నుకుంటారనే ద్వంద్వ  వైఖరిని అవలంబించింది. కూటమి భారీ మెజారిటీ సాధించి, బీజేపీకి అత్యధిక సీట్లు వస్తే, ఎన్నికల తర్వాత బీజేపీ తమ సొంత నాయకుడిని సీఎం చేయాలనే ఆలోచనతో ఉన్నట్లుగా గుసగుసలు వినిపించాయ్. కానీ, ఇప్పుడు బీజేపీ స్వరం మారింది. నితీశ్ కుమార్‌ని సీఎం అభ్యర్థిగా ప్రకటించడం ద్వారా, కూటమిలో చీలిక రాకుండా, ఎన్నికల్లో విజయం సాధించడంపై దృష్టి పెట్టింది. పైగా,  బీహార్‌లో నితీశ్ కుమార్‌కు.. మంచి పాలన అందించిన నాయకుడిగా.. సుశాసన్ బాబు అనే ఇమేజ్ ఉంది.  నితీశ్ పాలనలో శాంతిభద్రతలు మెరుగుపడ్డాయని, ఎంతో కొంత అభివృద్ధి జరిగిందనే నమ్మకం ప్రజల్లో ఉంది. కానీ.. ఈ ఇమేజ్ ఇప్పుడు అంత స్ట్రాంగ్‌గా లేదనే చర్చ జరుగుతోంది. దాదాపు 20 ఏళ్ల పాటు నితీశ్ కుమార్ సీఎంగా కొనసాగటం వల్ల.. ప్రజల్లో సహజంగానే కొంత పాలనపై వ్యతిరేకత పెరుగుతుంది. ఇప్పుడు బీహార్‌లో ఇది స్పష్టంగా కనిపిస్తోంది. అందువల్ల.. ప్రత్యర్థి పార్టీల విమర్శలకు దీటుగా.. నితీశ్ నాయకత్వాన్ని ముందుంచడమే బెటరని బీజేపీ భావించి ఉండొచ్చంటున్నారు. గతంలో.. నితీశ్ కుమార్ నాయకత్వంలోనే.. ఎన్డీయే కూటమికి మంచి ఫలితాలు వచ్చాయి. కూటమి విజయం కోసం, ప్రధానంగా బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న ఓటుని.. నితీశ్ వైపు మళ్లించే వ్యూహం కూడా అయి ఉండొచ్చన్న చర్చ జరుగుతోంది. అయితే.. కొన్ని వర్గాలు నితీశ్‌పై వస్తున్న సహజ వ్యతిరేకతని, వయోభారం లాంటి అంశాలను దృష్టిలో ఉంచుకొని.. ఎన్నికల తర్వాత ఫలితాలను బట్టి సీఎంను ఖరారు చేసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నాయి. కానీ.. ఇప్పుడున్న పరిస్థితుల్లో.. కూటమిని సమష్టిగా ముందుకు నడిపించడంలో.. నితీశ్ కుమారే కీలకంగా ఉన్నారు. సింపుల్‌గా చెప్పాలంటే.. నితీశ్ కుమార్ పర్సనల్ ఇమేజ్ బలహీనపడినా.. బీహార్‌లోని కీలకమైన ఓట్ బ్యాంకుని నిలుపుకునేందుకు.. రాజకీయ స్థిరత్వం కోసం బీజేపీకి ఆయన తప్పనిసరిగా కావాలి.  ఇక.. బీహార్‌లో ఉపాధి అవకాశాలు తక్కువగా ఉండటం, వలసలు కొనసాగడం లాంటి సమస్యల వల్ల.. యువ ఓటర్లు నిరాశకు గురయ్యే అవకాశం ఉంది. యువ నాయకుడు తేజస్వి యాదవ్.. భారీగా ఉద్యోగాలు, మార్పును తెస్తాననే హామీలు.. వారిపై ప్రభావం చూపే అవకాశం ఉందనే చర్చ జరుగుతోంది. దీనికితోడు.. నితీశ్ కుమార్ తరచుగా కూటములను మార్చడం వల్ల.. ప్రతిపక్షాలు ఆయన్ని.. పల్టూ రామ్ అని విమర్శిస్తున్నాయ్. ఇది.. ఆయన విశ్వసనీయతపై ప్రశ్నలు లేవనెత్తుతోంది. ఇప్పుడు నితీశే సీఎంగా ఉంటారనే అమిత్ షా ప్రకటన కూడా.. కూటమిలో అంతర్గత అనిశ్చితి రేకెత్తించే అవకాశం ఉందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయ్. చిరాగ్ పాశ్వాన్‌‌కు చెందిన ఎల్జేపీ పార్టీ బలం పెరిగింది. నితీశ్-చిరాగ్ మధ్య పాత వైరుధ్యాలు కూటమి సమన్వయాన్ని దెబ్బతీయొచ్చనే చర్చ జరుగుతోంది. మరోవైపు.. బీహార్‌లో యాదవులు, ముస్లింలు.. ఆర్జేడీ, కాంగ్రెస్‌ ఉన్న కూటమికి మద్దతుగా ఉన్నారనే చర్చ జరుగుతోంది. ఈ పరిస్థితుల్లో.. బీహార్‌ని గెలవాలంటే.. ఆ రెండూ కాకుండా బలమైన ఓట్ బ్యాంక్ కావాలి. నితీశ్ కుమార్ తన పాలన ద్వారా.. ఈబీసీలు, మహిళా ఓటర్ల మద్దతుని కూడగట్టుకన్నారు. ఈ ఓట్ బ్యాంక్ బీజేపీకి లేదు. బీహార్‌లో విజయం సాధించాలంటే.. ఎన్డీయే కూటమికి ఈ రెండు వర్గాల ఓట్లు చాలా కీలకం. అందువల్లే నితీశ్ నాయకత్వాన్ని బలపరుస్తోంది బీజేపీ. అమిత్ షా స్టేట్‌మెంట్‌తో.. ఈ సందేశం బీహార్ ప్రజల్లోకి బలంగా వెళ్లింది. అంతేకాదు.. మహాఘట్‌బంధన్.. నితీశ్‌ని సీఎం అభ్యర్థిగా ప్రకటించకుండా.. బీజేపీ డబుల్ గేమ్ ఆడుతోందనే విమర్శల్ని తిప్పికొట్టేందుకు కూడా.. ఈ ప్రకటన పనిచేస్తుందని బీజేపీ భావించి ఉండొచ్చు.  మరీ.. ముఖ్యంగా తేజస్వి యాదవ్ మార్పు నినాదంతో ప్రచారం చేస్తున్నారు. అందువల్ల.. ఆయనను ఎదుర్కొనేందుకు.. పరిపాలనలో అనుభవం ఉన్న నితీశ్ కుమార్ కంటే.. బెటర్ ఫేస్ ఎన్డీయేకు మరొకటి లేదు. ఎన్నికల ఫలితాల్లో బీజేపీకి గనక ఎక్కువ సీట్లు వస్తే.. నితీశ్‌ని సీఎం కుర్చీలో కూర్చోబెట్టి.. అధికారాన్ని, కూటమిపై పట్టును కొనసాగించొచ్చనే ఆలోచన కూడా బీజేపీ ఉండొచ్చు. మొత్తంగా.. నితీశ్ కుమార్ ఓట్ బ్యాంకుని ఉపయోగించుకొని.. ఎన్నికల్లో విజయం సాధించడం, తర్వాత కూటమిలో తన ఆధిపత్యాన్ని పెంచుకోవడం కోసమే.. బీజేపీ నితీశ్ కుమార్‌ని సీఎంగా ప్రొజెక్ట్ చేస్తోందనే చర్చ జోరుగా సాగుతోంది. 

లొంగిపోయిన మావోయిస్టుల దారెటు?

లొంగిపోయిన మావోయిస్టులు ఎక్కడికి వెడతారు. ఇదొక ఫండ‌మెంట‌ల్ క్వ‌శ్చన్. కార‌ణ‌మేంటంటే..   ఒక‌రిద్ద‌రు త‌ప్ప‌.. కుప్ప‌లు తెప్ప‌లుగా లొంగిపోతున్న వారంతా కూడా దాదాపు అడ‌వి బిడ్డ‌లే.   ద‌శాబ్దాలుగా ఉద్య‌మంలోకి చ‌దువుకున్న వారెవ‌రూ వెళ్ల‌డం లేదు. న‌గ‌ర వాసులెవ‌రూ రావ‌డం లేదు. మావోయిజం అంటే ఏమిటి? దాని ప‌రిణామ క్ర‌మాలేమిటి? ప్ర‌స్తుత‌ స‌మాజానికి దాని ద్వారా వ‌చ్చే లాభ‌మేంటి, న‌ష్ట‌మేంట‌న్న‌ది ఇక్క‌డెవ‌రూ పెద్ద‌గా ప‌ట్టించు కోవ‌డం లేదు. ఆ మాట‌ కొస్తే చైనా ప్రోడక్ట్స్ ఏవీ కూడా వాడ‌కూడ‌ద‌న్న కొన్ని నియ‌మాల‌ను పెట్టుకున్న ఒకానొక నాగ‌రిక‌ జాతి త‌యారైన ప‌రిస్థితులు. కొంద‌రైతే తొలుత చైనా బ‌జార్ లు గా పెట్టుకుని ఆ త‌ర్వాత మ‌న‌కూ చైనాతో వ‌చ్చిన స‌రిహ‌ద్దు గొడ‌వ‌ల కార‌ణంగా.. భార‌త్ బ‌జార్లుగా వాటిని మార్చుకున్న ప‌రిస్థితులు.  చైనాలోనే మావోయిజాన్ని అమ‌లు చేసే వారెవ‌రూ లేరు. చైనాది మొత్తం దురాక్ర‌మ‌ణ- దురాలోచ‌న- దుర్నీతి. అలాంటి చైనాయే వాడ్డం మానేసిన మావోయిజాన్ని   ఇక్క‌డ అమ‌లు చేయ‌డానికి గానీ, ఫాలో కావ‌డానికి గానీ ఎవరూ పెద్దగా సిద్ధంగా లేరు.  ఈ విష‌యం స్వ‌యంగా కొంద‌రు మావోయిస్టు మ‌ద్ధ‌తుదారులు కూడా అంగీకరిస్తున్నారు.  ఇప్పుడు ఉద్య‌మంలోకి చ‌దువుకున్న వారెవ‌రూ రావ‌డం లేదు. ఉన్న ఆ ఫాలోయ‌ర్లు, లేదా ద‌ళంలో ఉన్న వారంతా కూడా అడ‌వి బిడ్డ‌లే. వీరికి మావోయిజం మీదున్న అవ‌గాహ‌న, శ్ర‌ద్ధాస‌క్తుల‌క‌న్నా.. త‌మ త‌మ ప్రాంతాల్లో లేని వ‌స‌తుల మీదే ఎక్కువ ఫోక‌స్. అడ‌వుల్లో లేని వ‌స‌తుల‌తో పాటు జ‌రిగే వ‌న‌రుల దోపిడీ కార‌ణంగానే వీరు ఎక్కువ‌గా మావోయిస్టులుగా మారి ఉద్య‌మంలోకి వ‌స్తుంటారు. తొలి త‌రం త‌ప్ప ఆ త‌ర్వాతి త‌రాల్లోని వారంతా దాదాపు అడ‌వి బిడ్డ‌లే ఎక్కువ. ఒక వేళ మావోయిజానికి ఫ్యూచ‌రంటూ ఒక‌టి ఉంటే.. టాప్ లీడ‌ర్షిప్ నుంచి లోయ‌ర్ కేడ‌ర్ వ‌ర‌కూ అంద‌రూ వారే ఉండే అవ‌కాశ‌మెక్కువ‌ అని చెబుతారు జ‌గ‌న్ వంటి మావోయిస్టు నేత‌లు. ఆ మాట‌కొస్తే నేడో రేపో హిడ్మా సైతం లొంగిపోయే అవకాశాలున్నాయంటున్నారు. అలాంటి వారు ఇప్పుడు త‌మ ద‌గ్గ‌రున్న ఆయుధాల‌ను అప్ప‌గించారు స‌రే. వారికంటూ ఒక పున‌రావాసం ఎక్క‌డైనా పోలీసులు ఏర్పాటు చేసి ఉండొచ్చుగాక‌.. మ‌ల్లోజుల వంటి వారికి ఊళ్ల‌ల్లో   కుటుంబం, బంధువులు ఉండ‌టం వల‌న‌.. వారంతా ఆయా ఇళ్ల‌కు వెళ్లిపోయే అవ‌కాశ‌ముంది. మ‌రి ఈ అడ‌వి బిడ్డ‌లు ఎక్క‌డికి వెళ్లాలి? అంటే తిరిగి అదే అడ‌వుల్లోకే వెళ్లాల్సి ఉంటుంది. అడ‌వులన్నాక తిరిగి ఆయుధం ప‌ట్టి తీరాల్సిందే . ఎందుకంటే అక్క‌డ మ‌నుగ‌డ సాగించాలంటే తుపాకీ, లేకుంటే ఏ విల్లంబుల్లాంటి ఆయుధాల‌నైతే వారు చేబ‌ట్టాల్సిందే. మ‌రి వారు సాయుధ పోరాటాన్ని ఆపి.. పోలీసుల‌కు లొంగిపోయార‌న్న వార్త‌ల్లో నిజ‌మెంత‌? అన్న‌దిప్పుడు స్పెష‌ల్ డిబేట్ గా మారింది.

జూబ్లీ హిల్స్ బైపోల్ ప్రచారానికి కేసీఆర్ వస్తారా?

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ప్రచారానికి గులాబీ బాస్ కేసీఆర్ రానున్నట్లు ప్రచారం జరుగుతోంది.  ఆ క్రమంలో జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక ప్రచారం రసవత్తరంగా మారుతోంది. ఈ ఎన్నిక ఫలితం ప్రభావం వచ్చే జీహెచ్‌ఎంసీ ఎన్నికలు, స్థానిక సంస్ధ ఎన్నికలపై ఉంటుందన్న అంచనాతో ప్రధాన పార్టీలు దీనిని ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి.  అందుకు తగ్గట్లుగానే  మూడు పార్టీలూ కూడా తమతమ పార్టీల అగ్ర నాయకులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతోపాటు సీనియర్లు, అనుబంధ విభాగాల నాయకులకు బాధ్యతలు అప్పగించాయి.  అధికార, విపక్ష పార్టీలకు జూబ్లీహిల్స్‌ నియోజకవర్గంలో విజయం ఒక  సవాలుగా మారింది. కాంగ్రెస్ స్థానిక యువనేత, అనుభవం ఉన్న నవీన్‌యాదవ్‌కు టికెట్‌ను ఖరారు చేసింది. కాంగ్రెస్‌ పాలనకు జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక పరీక్షగా మారడంతో.. పార్టీ దీనిని ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. రెండు నెలల క్రితమే మంత్రులు పొన్నం ప్రభాకర్‌, తుమ్మల నాగేశ్వర్రావు, వివేక్‌ వెంకటస్వామిలకి ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించారు. మరోవైపు ఇతర మంత్రులు కూడా ఇంటింటి ప్రచారం చేసేలా యాక్షన్ ప్లాన్ సిద్ధం చేశారట.  పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు తాము ప్రభావితం చేయగలిగిన ప్రాంతాల్లో ప్రచారం చేసేలా పీసీసీ వ్యూహారచరన చేస్తుందట. త్వరలోనే సీఎం రేవంత్‌రెడ్డి రోడ్‌షో నిర్వహించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఉప ఎన్నికల్లో  గెలిస్తే రానున్న జీహెచ్‌ఎంసీ ఎన్నికలకు దారి మరింత సులువు అవుతుందని కాంగ్రెస్‌ భావిస్తుంది. గ్రేటర్‌లో పాగా వేస్తే వచ్చే స్థానిక, అసెంబ్లీ ఎన్నికలకు మరింత బలం చేకూరుతుందని కాంగ్రెస్ పార్టీ ఆలోచనలో ఉంది. బీఆర్‌ఎస్‌ గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి చవిచూసినా గ్రేటర్‌లో మాత్రం తన పట్టును కోల్పోలేదు. జూబ్లీహిల్స్‌లో గెలిస్తే జీహెచ్‌ఎంసీ పీఠం తప్పక కైవసం చేసుకోవాలనే ఆలోచనలో గులాబీ దళం పని చేస్తుంది. బీఆర్‌ఎస్‌ అభ్యర్థి మాగంటి సునీతకు మద్దతుగా ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ స్వయంగా రంగంలోకి దిగే అవకాశాలున్నాయనే టాక్ నడుస్తోంది. ఇప్పటికే ప్రకటించిన స్టార్ క్యాంపెయినర్ల జాబితలో కేసీఆర్ పేరును పెట్టింది బీఆర్ఎస్.  బీఆర్‌ఎస్‌ వెల్లడించిన స్టార్‌ క్యాంపెయినర్ల జాబితాలో కేసీఆర్‌ పేరు ఉండడం ఆసక్తికరంగా మారింది. ఒకటి రెండు సభలకు కేసీఆర్‌ హాజరయ్యే అవకాశం ఉందని పార్టీ నేతలు పేర్కొంటున్నారు. ఇప్పటికే మూడు, నాలుగు చోట్ల బహిరంగ సభలు నిర్వహించిన పార్టీ అగ్ర నాయకులు, ఇంటింటి ప్రచారానికి ప్రాధాన్యం ఇస్తున్నారు. మిగతా పార్టీల కంటే ముందుగానే అభ్యర్థిని ప్రకటించిన బీఆర్‌ఎస్‌.. ప్రచార పర్వాన్ని కూడా అదేరీతిన కొనసాగిస్తోంది. ముఖ్యనేతలకు డివిజన్ల వారీగా నాయకులకి బాధ్యతను అప్పగించింది గులాబీ పార్టీ. సెంటిమెంటు, సానుభూతి అంశం తమకు కలిసి వస్తుందన్న ధీమాతో బీఆర్‌ఎస్‌ నేతలు ఉన్నారట. జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక ప్రచారం కోసం మూడు ప్రధాన పార్టీలు తమ ముఖ్య నేతలు, కార్యకర్తలను హైదరాబాద్‌లోనే  హరించడంతో..నియోజకవర్గంలో సందడి నెలకొంది.   బీజేపీ జూబ్లీహిల్స్‌లో మరోసారి లంకల దీపక్‌రెడ్డికి ఛాన్స్‌ ఇచ్చింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో మూడో స్థానంలో నిలిచిన దీపక్‌రెడ్డి మరోసారి అవకాశం ఇచ్చింది. ఇక్కడ గెలిస్తే గ్రేటర్‌ పీఠం తప్పక తమదేనని బీజేపీ భావిస్తోంది.  కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోనే జుబ్లీహిల్స్‌ అసెంబ్లీ సెగ్మెంట్‌ ఉన్న నేపథ్యంలో ఆయన ఇప్పటికే పార్టీ క్యాడర్‌తో పలుమార్లు సమీక్షలు నిర్వహించి ప్రచారాన్ని వ్యూహాత్మకంగా కొనసాగిస్తున్నారు.  ప్రచారానికి బీజేపీ పాలిత ముఖ్యమంత్రులు ,యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌  కూడా పాల్గొనే అవకాశం ఉందని కాషాయ దళం చెబుతున్న పరిస్ధితి. మాగంటి గోపీనాథ్ మృతి తర్వాత జూబ్లీహిల్స్ లో వచ్చిన బైపోల్స్ లో బీఆర్ఎస్ తిరిగి మాగంటి సతీమణి సునీతకు టికెట్ ఇచ్చింది. అందరికంటే ముందుగానే బీఆర్ఎస్ తమ అభ్యర్థిని అనౌన్స్ చేసి ప్రచారం కూడా మొదలు పెట్టింది . ఈ ఉప ఎన్నికను అస్త్రంగా వాడుకుని రానున్న జీహెచ్ఎంసీ, స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ చక్రం తిప్పాలని చూస్తుంది . గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న కేసీఆర్ ఫామ్ హౌస్ కే పరిమితం అయ్యారు. అయితే జూబ్లీ వార్ లో తిరిగి తమ సిట్టింగ్ స్థానాన్ని సొంతం చేసుకునేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారట గులాబీబాస్. అందులో భాగంగా ఎర్రవల్లి లోని ఫాంహౌస్ లో సమావేశం ఏర్పాటు చేసి పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేశారు. తాజాగా నిర్వహించిన ఆ సమావేశంలో మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు, జూబ్లీహిల్స్ ఇంచార్జీలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఇప్పటికే బీఆర్ఎస్  పార్టీ 40 మందితో కూడిన స్టార్ క్యాంపెయినర్స్ లిస్టును విడుదల చేసింది.  పార్టీ విడుదల చేసిన స్టార్ కాంపెయిన్ లిస్ట్ లో మొదటి పేరు కేసీఆర్ దే అవ్వడం గమనార్హం.. దీంతో గులాబీ పార్టీ వర్గాల్లో కేసీఆర్ జూబ్లీహిల్స్ ప్రచారంలో పాల్గొంటారు అని చర్చ నడుస్తుంది . ఈ నెల చివరన కేసీఆర్ జూబ్లీహిల్స్ లో క్యాంపెయిన్ చేస్తారు అన్న వార్తతో కార్యకర్తల్లో జోష్ నెలకొంది. ఒకవేళ నిజంగానే కేసీఆర్ జూబ్లీహిల్స్ ప్రచారంలో పాల్గొంటే మాగంటి సునీత గెలుపును ఎవ్వరు ఆపలేరు అని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తుంది . ప్రజల్లో కేసీఆర్ మాటలకు, ఆయన వాక్చాతుర్యునికి , మంచి స్పందన ఉందనేది విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరి చూడాలి గులాబీ పార్టీ అధినేత కేసిఆర్ నిజంగానే ప్రచారంలో పాల్గొంటారో? లేదో.