ఏపీ రాజధాని ప్లానింగ్ సిద్ధం
ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణం ఎలా ఉంటుందో అన్న విషయంలో అందరూ చాలా ఉత్కంఠంగా ఎదురుచూసిన సంగతి తెలిసిందే. ఎందుకంటే అటు ముఖ్యమంత్రి, ఇటు మంత్రులు అందరూ రాష్ట్ర రాజధాని విషయంలో పదే పదే ప్రకటనలు చేస్తుండటంతో అందరిలో ఆసక్తి పెరిగింది. అంతకు ముందు సింగపూర్ వాళ్లు ఏపీ రాజధాని ప్లానింగ్ ఇచ్చినా దానిలో కొన్ని మార్పులు చేర్పులు చేయాల్సివచ్చింది. ఈ నేపథ్యంలో ఎప్పటినుండో ఎదురుచూస్తున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన రాజధాని 'మాస్టర్ ప్లాన్' ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు అందింది. అయితే ప్రస్తుతం సింగపూర్ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు సింగపూర్ మంత్రి ఈశ్వరన్ రాజధాని మస్టార్ ప్లాన్ ను అందజేశారు.
తూళ్లూరు - మందడం మధ్య ఏపీ నూతన రాజధానిని(కోర్ కాపిటల్) రూపొందించనున్నారు. అయితే ఈ రాజధాని ప్లానింగ్ లో అనేక ఆసక్తికర అంశాలు పొందుపరిచారు. సింగపూర్ బృందం ఇచ్చిన ప్లానింగ్ లో ఎక్కువశాతం పచ్చదనానికి ప్రాధాన్యత ఇచ్చినట్టు తెలుస్తోంది. మొత్తం 7,068 ఎకరాలలలో 58 మండలాలతో 220 కిలోమీటర్ల పరిధిలో రాజధాని విస్తరణ ఉంటుంది. ఇండిస్ట్రియల్ పార్కులు, వినోదకేంద్రాలు, తాగునీరు, విద్యుత్, రవాణా, మౌలికసదుపాయాల అభివృద్ధి, ఐటీ, పారిశ్రామిక, వాణిజ్య, నివాసేతర భవనాలు, పార్కులు, క్రీడా ప్రాంగణాలతో మాస్టర్‌ప్లాన్ రూపొందించబడింది. నడక సైకిళ్లు ద్వారా కూడా రవాణా సౌకర్యాన్ని ఏర్పాటు చేయనున్నారు. సచివాలయం, అసెంబ్లీ, హైకోర్టు, రాజ్ భనవ్ లాంటి ప్రభుత్వ సంబంధిత కార్యలయాలన్నీ ఇక్కడే రానున్నాయి.
అయితే సింగపూర్ ప్రతినిధులతో రాజధాని అంశాలపై చర్చించిన చంద్రబాబు ఈ 'మాస్టర్ ప్లాన్' లో కొన్ని సూచనలు చేశారు. చంద్రబాబు చేసిన సూచనలకు అనుగుణంగా తొలి దశ తుది మాస్టర్ ప్లాన్ మరో ఆరు వారాల్లో సర్కారు చేతికి అందజేయనుంది. అంటే జులై 15 నాటికి సీడ్ కేపిటల్ మాస్టర్‌ప్లాన్ ను సింగపూర్ బృందం ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక అది వచ్చిన వెంటనే ఏపీ రాజధానికి పునాది పడటమే తరువాయి.