వెనక్కితగ్గిన శివప్రసాద్

చిత్తూరు ఎంపీ శివప్రసాద్‌ వెనక్కితగ్గారు. ప్రభుత్వాన్ని కార్నర్‌ చేయడమే కాకుండా, నేరుగా  చంద్రబాబుపైనే విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టిన శివప్రసాద్‌‌కి ఎట్టకేలకు ముఖ్యమంత్రి అపాయింట్‌మెంట్‌ దొరికింది. తన వ్యాఖ్యలపై చంద్రబాబు సీరియస్‌గా ఉండటమే కాకుండా, క్రమశిక్షణా చర్యలు తీసుకోబోతున్నారని తెలుసుకున్న శివప్రసాద్‌... యాక్షన్‌ లేకుండా కూల్‌ చేసేందుకు రాయబారాలు పంపినట్లు చెబుతున్నారు. అయితే శివప్రసాద్‌ వ్యవహారశైలిపై గుర్రుగా ఉన్న చంద్రబాబు శాంతించలేదని, ఎన్నో వినతుల తర్వాతే అపాయింట్‌మెంట్‌ ఇచ్చారని తెలుస్తోంది.   ఎట్టకేలకు చంద్రబాబును కలిసిన శివప్రసాద్‌.... తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చారు. అంతేకాదు పార్టీకి నష్టం కలిగించేలా మాట్లాడినందుకు క్షమాపణలు కోరినట్లు తెలుస్తోంది. అయితే శివప్రసాద్‌‌ను... చంద్రబాబు గట్టిగానే మందలించినట్లు టాక్ వినిపిస్తోంది. మరోసారి పార్టీకి ఇబ్బంది కలిగించేలా మాట్లాడితే చర్యలు తప్పవని హెచ్చరించినట్లు తెలుస్తోంది. ఏమైనా సమస్యలుంటే తన దృష్టికి తీసుకురావాలని, మీడియాకి ఎక్కి ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే ఇకపై సహించేది లేదని వార్నింగ్‌ ఇచ్చినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. బాధ్యతగా ఉండాల్సిన సీనియర్‌ నేతలే ధిక్కారస్వరం వినిపిస్తే ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయని, ఇకపై జాగ్రత్తగా ఉండాలని శివప్రసాద్‌కి చంద్రబాబు సూచించారు.   గీత దాటే నేతలను ఇకపై ఉపేక్షించే ప్రసక్తే లేదని చంద్రబాబు తేల్చిచెప్పినట్లు తెలుస్తోంది. హెచ్చరించి వదిలేస్తుంటే అలుసుగా తీసుకుంటున్నారని, ఇకపై కట్టుదాటే నేతలపై వేటు వేయడం ఖాయమని పార్టీ శ్రేణులకు చంద్రబాబు సంకేతాలు పంపారు.

బీజేపీని సైడ్‌లైన్‌ చేస్తోన్న టీఆర్‌ఎస్‌... ప్రోటోకాల్‌‌పై కమలం కన్నెర్ర

కేసీఆర్‌ సర్కార్‌‌ను తెలంగాణ బీజేపీ మరోసారి కార్నర్‌ చేసింది. ప్రజావ్యతిరేక నిర్ణయాలపై పోరాటం చేస్తూనే.... తాజాగా ప్రోటోకాల్‌ వివాదాన్ని తెరపైకి తెచ్చింది. టీఆర్‌ఎస్ ప్రభుత్వం.... కేంద్ర మంత్రులను అవమానించేలా వ్యవహరిస్తోందని ఆరోపిస్తున్నారు. మేడే ఉత్సవాలకు కేంద్ర కార్మికశాఖ మంత్రి దత్తాత్రేయను ఆహ్వానించకపోవడాన్ని తప్పుబడుతోంది.   ఇటీవల రాజ్‌భవన్‌ క్వార్టర్స్‌ ప్రారంభోత్సవానికి స్థానిక ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డిని ఆహ్వానించలేదని... అలాగే బన్సీలాల్‌పేట్లో డబుల్‌ బెడ్రూమ్ ఇళ్ల శంకుస్థాపనకు స్థానిక ఎంపీ, కేంద్ర మంత్రి దత్తాత్రేయను పిలవకుండానే కార్యక్రమం నిర్వహించారని బీజేపీ నేతలు మండిపడుతున్నారు. టీఆర్‌ఎస్‌ నేతలకు ఎందుకింత అభద్రతా భావం అంటూ ప్రశ్నిస్తున్నారు.   కేంద్ర మంత్రులను ఆహ్వానిస్తే... బీజేపీకి ఎక్కడ పేరు వస్తుందోనని, తమను పిలవడం లేదని కమలం పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. అందుకే ప్రోటోకాల్‌ సైతం పాటించకుండా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని, ఇవన్నీ ప్రజలు చూస్తున్నారని, వచ్చే ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కి కచ్చితంగా బుద్ధి చెబుతారని హెచ్చరిస్తున్నారు. 

నంద్యాల టీడీపీ అభ్యర్ధి ఖరారు... ప్రకటించేది అప్పుడే..!

టీడీపీలో నంద్యాల బైపోల్‌ పంచాయతీ తెగేలా కనిపించడం లేదు. అభ్యర్ధి ఎవరనే దానిపై సస్పెన్స్‌ కొనసాగుతోంది. టికెట్ కోసం భూమా, శిల్పా వర్గాలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. వివాదానికి తెరదించేందుకు టీడీపీ అధిష్టానం ప్రయత్నిస్తున్నా కొలిక్కిరావడం లేదు. దాంతో నిర్ణయం తీసుకోలేక హైకమాండ్‌ తలలు పట్టుకుంటోంది.   నంద్యాల టికెట్‌ కోసం పట్టుబడుతోన్న భూమా, శిల్పా వర్గాలతో ఏపీ టీడీపీ అధ్యక్షుడు కళా వెంకట్రావ్‌ చర్చలు జరిపారు. ఆ తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి ఇరువర్గాలూ తమ వాదనలు వినిపించారు. అయితే ఉపఎన్నిక నోటిఫికేషన్‌ వచ్చాక చూద్దామంటూ సీఎం నిర్ణయాన్ని వాయిదా వేశారు. కానీ టికెట్ దక్కించుకునేందుకు విశ్వప్రయత్నాలు చేస్తోన్న శిల్పా బ్రదర్స్‌... మరోసారి అధినేతను కలిసి తమ వాదన వినిపించారు. 2014లో టీడీపీ తరపున తానే పోటీ చేశానని, ఇప్పుడు కూడా తనకే టికెట్‌ ఇవ్వాలని, లేదంటే కేడర్ చేజారిపోతుందని శిల్పా మోహన్‌రెడ్డి అంటున్నారు.    ఇటు మంత్రి భూమా అఖిలప్రియ కూడా చంద్రబాబును కలిసి.... తమ కుటుంబానికే టికెట్‌ ఇవ్వాలని మరోసారి కోరారు. సంప్రదాయం ప్రకారం తమకే టికెట్‌ ఇవ్వాలని పట్టుబడుతున్నారు. పైకి ముఖ్యమంత్రి నిర్ణయమే ఫైనల్‌ అంటున్నా.... టికెట్‌ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అయితే భూమా వర్గంతో కళా వెంకట్రావ్‌ జరిపిన చర్చల్లో  కేంద్ర మంత్రి సుజనాచౌదరి పాల్గొనడం ఆసక్తికరంగా మారింది. అఖిలప్రియను బుజ్జగించి, శిల్పాకు టికెట్‌ కేటాయించేందుకేనంటూ టాక్‌ వచ్చింది. కానీ భూమా వర్గం వెనక్కితగ్గకపోవడంతో, చర్చలు కొలిక్కిరాలేదని చెబుతున్నారు. దాంతో అమెరికా పర్యటన తర్వాతే నంద్యాల అభ్యర్థిపై నిర్ణయం తీసుకుంటానని చంద్రబాబు తేల్చి చెప్పినట్టు తెలుస్తోంది.

సభలో మాట్లాడలేని ప్రతిపక్షాలు మీడియా పాయింట్ కే పరిమితమా?

అసెంబ్లీ అయినా, పార్లమెంట్ అయినా… ఎందుకు? ప్రజా సమస్యలపై చర్చ చేయటానికి! ఇంకా ముఖ్యంగా, ప్రతిపక్షం జనం గొంతుని ప్రభుత్వానికి వినిపించటానికి… చట్ట సభలు ఉపయోగపడతాయి! ఊరికే చట్టాలు , తీర్మానాలు అమోదించుకోటానికి మాత్రమే సభలు ఏర్పాటు చేయబడలేదు. కాని, చాలా ఏళ్లుగా మన దేశంలో చట్ట సభల్లో చర్చ కంటే ఎక్కువగా రచ్చ జరుగుతోంది. కొన్ని సార్లైతే అది కూడా లేకుండా కథ కానిచ్చెస్తున్నారు పాలకులు! తాజాగా భూ సేకరణ చట్టానికి మార్పులు, చేర్పుల విషయంలో తెలంగాణ అసెంబ్లీలో అదే జరిగింది!   ఒక్కసారి మనం కాస్త వెనక్కి వెళితే 2014లో పార్లమెంట్ సమావేశాలు గుర్తుకు వస్తాయి. అక్కడ తెలుగు ప్రాంతాన్ని రెండు రాష్ట్రాలుగా విడదీసే అతి కీలకమైన విభజన బిల్లు ఎంపీలు అమోదించారు. కాని, ఎలాంటి చర్చ మాత్రం జరగలేదు లోక్ సభలో. రాజ్యసభలో తీవ్ర గందరగోళం మధ్య కొంత చర్చ నడిచింది. వ్యవహారం మొత్తం కొన్ని గంటల వ్యవధిలో పూర్తైపోయింది. చివరగా చూస్తే అధికారంలో వున్న వారు బలప్రయోగం చేసి బిల్ చేశారనీ అర్థమైపోయింది. అయితే, విభజన బిల్లుకు ఎలాగూ మద్దతు లభించేదే… కాని, అప్పటి యూపీఏ సర్కార్ అర్థవంతమైన చర్చ తరువాత బిల్ పాస్ చేసే ప్రయత్నం చేయలేదు. ఇప్పుడున్న ప్రభుత్వాల తీరు కూడా అలానే వుంటోంది చాలా సందర్బాల్లో!   చట్ట సభల్లో చర్చ అనగానే రాజకీయ యుద్ధంలా మారిపోయింది ఈ మధ్య పరిస్థితి. భౌతిక దాడుల దాకా వెళ్లిపోతున్నారు నేతలు. మైక్ లు విరగొట్టడం, పేపర్లు చించటం అయితే సర్వ సాధారణంగా మారిపోయింది. ఇంతే తప్ప ఆ రోజు ఎన్నుకున్న అంశంపై నిజాయితీగా మాట్లాడే ఉద్దేశం పాలక, ప్రతిపక్షాలు ఇద్దరిలోనూ కనిపించటం లేదు. అందుకే, బిల్లో , తీర్మానమో, సవరణ పాస్ చేయించుకోవాలనుకున్న అధికార పార్టీలు గందరగోలం జరిగితేనే బెటర్ అనుకుంటున్నాయి. చర్చ లేకుండా, జనానికి ఎలాంటి అవగాహన కల్పించే అవసరం లేకుండా తమ పని పూర్తి చేసుకుంటున్నాయి!   భూ సేకరణ బిల్ లో కొద్దిపాటి సవరణలు సంకల్పించారు కేసీఆర్. స్పష్టమైన మెజార్జీ వున్న ఆయనకి ఇది పెద్ద సవాలేం కాదు. అయితే, చిక్కంతా అసలు ఏ మాత్రం చర్చకు అవకాశం లేకుండా టీఆర్ఎస్ సర్కార్ బిల్ పాస్ చేసుకోవటంతోనే వస్తోంది. ప్రతిపక్షాలు మాట్లాడటానికి కొంచెం కూడా టైం ఇవ్వకుండా పది, పదిహేను నిమిషాల్లో సభ ముగించటం జనంలోకి ఎలాంటి సంకేతాలు పంపుతుంది? బయట మార్కెట్లో మిర్చీ రైతులు నిరసనలకు దిగుతున్న నేపథ్యంలో ప్రతిపక్షాన్ని మాట్లాడనీయకపోవటం… ఒక విధంగా గవర్నమెంట్ ఢిపెన్స్ లో పడ్డట్టుగానే భావిస్తారు పబ్లిక్. అంతే కాదు, కాంగ్రెస్ సభ్యులకి మాట్లాడే అవకాశం ఇవ్వలేదు. బీజేపీ, టీటీడీపీ నేతలు సస్పెన్షన్లో వున్నారు. ఇక మిగిలింది బిల్ కు మద్దతు తెలిపే టీఆర్ఎస్ సభ్యులు. వారితోనే చర్చ అంటూ లేకుండా బిల్ పాస్ చేసేశారు!   అసెంబ్లీల్లోని రాష్ట్ర ప్రభుత్వాలైనా, పార్లమెంట్లోని కేంద్ర ప్రభుత్వమైనా తమ పంతం ఎలాగూ నెగ్గించుకుంటాయి. ఆ క్రమంలో కనీసం ప్రతిపక్షం మాట్లాడే అవకాశం కూడా ఇవ్వకపోవటం అప్రజాస్వామికం అవుతుంది. అలా కాకుండా అభిప్రాయాలు సభ ముందు పెట్టే అవకాశం సభ్యులందరికీ ఇచ్చి ఆ పై ప్రభుత్వాలు తమ నిర్ణయాలు అమల్లోకి తెస్తే బావుంటుంది. మరో వైపు ప్రతిపక్ష సభ్యులు కూడా మాట్లాడే అవకాశాన్ని చర్చ కోసం వాడితేనే బావుంటుంది. రచ్చ చేయటానికి, సత్తా చాటటానికి వాడుకుంటే జనానికి చట్ట సభలపై ఆసక్తి, నమ్మకం రెండూ పోతాయి…

మిర్చీ ఘాటు… రాజకీయ గాటు!

మిర్చీ లాంటి హీరో ప్రభాస్ నటించిన హాట్ మూవీ బాహుబలి! రిలీజైంది. కో్ట్లు కొల్లగుడుతోంది. వెయ్యి కోట్ల టార్గెట్ పెద్ద కష్టమేం కాదు కూడా! కాని, అదే సమయంలో మిర్చీ రైతుల మార్కెట్ కష్టాలు చూశారా? బాహుబలికి, మిర్చీ మద్దతు ధరకు ఏంటి సంబంధం అనుకుంటున్నారా? వుంది! అదే మార్కెటింగ్! బాహుబలి లాంటి సినిమా అద్భుతమైన మార్కెటింగ్ తో కావాల్సినంత , రావాల్సినంత కలెక్షన్స్ కొల్లగొట్టింది. టికెట్ ధర పెంచుకుంటామంటే… కోర్టు కూడా ఓకే చేసింది! కాని, నిత్యావసర ఆహార పదార్థమైన మిర్చీకి మాత్రం మద్దతు ధర లేదు. ప్రభుత్వం స్పందించటం లేదు. రైతులు ఆగ్రహానికి లోనై దాడులు సైతం చేస్తున్నారు. అయినా మిర్చీ ఘాటు ఎవ్వరికీ తగులుతున్నట్టు కనిపించటం లేదు!   మద్దతు ధర కష్టాలు కేవలం మిర్చీ రైతులకో, తెలంగాణ రాష్ట్రానికో సంబంధించినవి కావు. దేశ వ్యాప్తంగా రైతులందరి గోడు ఒకేలా వుంటోంది. అన్ని రాష్ట్రాల్లో ఎప్పుడో అప్పుడు మద్దతు మంటలు మండుతున్నాయి. రైతులు చివరకు ఆత్మహత్యలు చేసుకునే దాకా పరిస్థితి వెళుతోంది! ఎందుకిలా? ఒక సినిమా, ఒక సబ్బు, ఒక సిగరెట్, ఒక మద్యం బాటిల్… అన్నీ గిట్టుబాటు అయ్యేలా అమ్ముకోవచ్చు! కాని, బతకటానికి కావాల్సిన తిండికి మాత్రం మద్దతుండదు! రైతుకి మద్దతు ధర దొరకదు! ఇది అత్యంత విషాదం…   తెలంగాణ సీఎం కేసీఆర్, మిర్చీ రైతుల దాడిని కుట్రగా పేర్కొన్నారట. రైతులు కాదు… ఎవరో రాజకీయ దురుద్దేశంతో ఆ పని చేయించారని అన్నారట. అది నిజం కావచ్చు. ప్రభుత్వంపై కోపంతో రైతుల్ని అడ్డుపెట్టుకోవచ్చు. మొన్నటికి మొన్న తమిళ రైతుల్ని కూడా దిల్లీ రోడ్ల మీద వదిలేశారు చెన్నై రాజకీయ పెద్దలు. మోదీ పట్టించుకోరనీ తెలిసీ కూడా తమిళ రైతుల్ని అక్కడ వుండనిచ్చారు. తీరా తమ రాజకీయ సంక్షోభాలు తీరాక పళనిస్వామి వచ్చి మాటిచ్చి స్వరాష్ట్రం తీసుకెళ్లారు. ఇదంతా అనుమానాస్పదంగానే జరిగింది!   కొన్ని చోట్ల రైతుల సమస్యలు అడ్డుపెట్టుకుని రాజకీయం చేస్తున్న మాట వాస్తవం. కాని, అదే సమయంలో రైతుల సమస్యలు అంతకంటే వాస్తవం. రైతు పండించిన ఆహారం లేకుంటే ఏమున్నా ఏం లాభం? సినిమాలు, ఐపీఎల్ మ్యాచ్ లు ప్రాణాలు కాపాడలేవు కదా? అయినా ప్రాణాలు నిలిపే అత్యంత ముఖ్యమైన వాటిని మన పాలకులు నిర్లక్ష్యం చేస్తున్నారు. ప్రతీ వారంలో తప్పక కనిపించే వార్త కిసానో, జవానో చనిపోయాడనే తప్ప మరొకటి కాదు! ఇది మొత్తం వ్యవస్థకే ప్రమాదకరం. అభివృద్ధి చెందుతోన్న భారతదేశం రైతులు, సైనికుల్ని కోల్పోయి ఎప్పటికీ అగ్ర రాజ్యంగా ఎదగలేదు!   జవాన్ల విషయంలో కేంద్ర ప్రభుత్వం, కిసాన్ ల విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలు రాజకీయ ఆలోచనలు పక్కన పెట్టి నిజాయితీగా కృషి చేయాలి. మిర్చీ మొదలు పసుపు వరకూ ఏ పంటకైనా రైతు కోరిన మద్దతు ధర ఇవ్వటం మన ప్రభుత్వాలకి పెద్ద పనేం కాదు, వేల కోట్ల లోన్లు, వందల ఎకరాల భూములు అభివృద్ధి పేరుతో ధారదత్తం చేసే సత్తా వున్నప్పుడు అన్నదాతకి డబ్బులెందుకు వుండవు? మనసుంటే మార్గముంటది! అంతకన్నా ముఖ్యంగా, అయిదేళ్లకోసారి దేశంలోని అన్ని పార్టీలు, అందరు నేతలూ ఎన్నికలు ఎదుర్కోవాల్సిందే! అప్పుడు రైతు మాత్రమే కాదు… ఓటర్ కూడా అవుతాడు!

రేప్ ఆరోపణల మినిస్టర్ కి బెయిల్ ఇచ్చాడు! సస్పెండ్ అయ్యాడు!

మన దేశంలో అత్యంత శక్తివంతమైన వ్యక్తి ఎవరు? రాజకీయంగా మాట్లాడుకుంటే… ప్రధాని! ఆర్దికంగా మాట్లాడుకుంటే… అంబానీలు, అదానీలు, టాటాలు, బిర్లాలు, బోలెడు మంది! అయితే, బాగా పవర్ వున్న వాళ్లు, డబ్బున్న వాళ్లకు కూడా దక్కని గౌరవం, హోదా, రాజ్యాంగబద్ధమైన రక్షణ వగైరా వగైరా అన్నీ కొన్ని పదవుల్లోని వారికి మాత్రం దక్కుతుంటాయి. రాష్ట్రపతి, గవర్నర్, చట్ట సభల స్పీకర్ … ఇలాంటి వారికన్నమాట! ఇదే కోవలోకి వచ్చే మరో అరుదైన ఉద్యోగం … జడ్జ్!   దేశంలో జడ్జ్ పదవిలో వున్న వారికి ఎంతో గౌరవం దక్కుతుంది. మీడియాతో సహా న్యాయమూర్తిని ప్రశ్నించే సాహసం ఎవ్వరూ చేయరు. కాని, రాను రాను మన జడ్జీలు కూడా వివాదాస్పదులవుతన్నారు. సుప్రీమ్ చీఫ్ జస్టిస్ మొదలు సెషన్స్ కోర్టుల్లోని న్యాయమూర్తుల వరకూ చాలా మంది ఎప్పుడో అప్పుడు న్యూస్ లో నిలుస్తున్నారు. తాజాగా హెడ్ లైన్స్ లోకి వచ్చిన జడ్జీగారు… ఓం ప్రకాష్ మిశ్రా. ఈయన లక్నో హైకోర్టుకు చెందిన ఓ న్యాయమూర్తి. కొన్ని రోజుల క్రితం యూపీ మాజీ మంత్రి, రేప్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటోన్న గాయత్రి ప్రజాపతికి బెయిల్ ఇచ్చేశాడు. ఇప్పుడు హైకోర్టు చీఫ్ జస్టిస్ దీలీప్ భోసలే చేత విధుల నుంచీ సస్పెండ్ చేయబడ్డాడు. అంతే కాదు, డిపార్ట్ మెంటల్ విచారణ కూడా ఎదుర్కొంటున్నాడు!   సమాజ్ వాది పార్టీలోని పేరు మోసిన క్రిమినల్ అయిన గాయత్రి ప్రజాపతి రేప్ కేసులో నిందితుడు. ఇంకా దారుణం ఏంటంటే, రేప్ బాధితురాలి మైనర్ కూతురు మీద కూడా అత్యాచారం చేయబోయడంటున్నారు. అటువంటి తీవ్ర ఆరోపణలున్న వ్యక్తికి ఓం ప్రకాష్ మిశ్రా ఎలా బెయిల్ ఇచ్చి వుంటాడు? ఆ మధ్య ఇక్కడ కూడా ఓ జడ్జ్ ఇలాగే బుక్కయ్యాడు. గాలి జనార్ధన్ రెడ్డికి బెయిల్ ఇచ్చిన కేసులో అవినీతి ఆరోపణలు ఎదుర్కొని జైలుకి వెళ్లాల్సి వచ్చింది!   న్యాయం అందించాల్సిన న్యాయమూర్తులే క్రిమినల్స్ కు అండగా నిలిచినట్లు జనంలోకి సంకేతాలు వెళ్లటం చాలా నష్టం కలిగిస్తుంది. ఇప్పటికే జనం పెద్ద పెద్ద కేసుల్లో బెయిల్ వచ్చినా, తీర్పులు వచ్చినా అనుమానంగా చూస్తున్నారు. అది జగన్ కేసు కావచ్చు, సల్మాన్ కేసు కావచ్చు, జయలలిత అక్రమాస్తుల కేసు కావచ్చు… ఇలా వీవీఐపీ కేసులన్నీ వివాదాస్పదంగానే మారుతున్నాయి. ఇక మామూలు కేసుల విషయంలో అయితే కోర్టుల నిర్ణయాల్ని అడిగేవారూ, నమ్మేవారూ ఇద్దరూ లేకుండా పోతోంది పరిస్థితి! చాలా మంది ఎంత పెద్ద సమస్యైనా కోర్టు బయటే సెటిల్ చేసుకుందామని ఇప్పటికీ భావిస్తుండటం .. నమ్మకం లేకపోవటం వల్ల కూడా జరుగుతోంది!   కోర్టులు, న్యాయమూర్తులు వివాదాలకు, అనుమానాలకు తావు లేకుండా వుండాలి. అలా జరిగేందుకు ఏం చేయాలో మేధావులు, ప్రజాప్రతినిధులు అందరూ ఆలోచించి సంస్కరణలు చేపట్టాలి. బ్రిటీష్ కాలం నాటి మన న్యాయవ్యవస్థ ఎప్పటికప్పుడు అప్ డేట్ చేసుకోవటం మన బాద్యతే!

దీనస్థితిలో శశికళ జైలు జీవితం... !

ఓడలు బండ్లు... బండ్లు ఓడలు అవుతాయి అన్న సామెత శశికళకు బాగా సరిపోయేట్టు ఉంది. ఆమె ఏదో అనుకుంటే ఇంకేదో జరిగింది. తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత మరణం తరువాత అధికారం చేపట్టి తమిళనాడును ఏలుదామని అనుకుంది. సీఎంగా ఇక ప్రమాణం చేస్తారు అని అందరూ అనుకోగా.. ముందుగా దురదృష్టం ఆమె తలుపుతట్టి.. అక్రమాస్తుల కేసులో ప్రతికూలంగా తీర్పురావడంతో జైలుకు వెళ్లాల్సి వచ్చింది. ఇక ఆతరువాత ఒకదాని తరువాత ఒకటి సమస్యలు వచ్చిపడుతూనే ఉన్నాయి. తాను సీఎంగా పగ్గాలు చేపట్టలేకపోయింది... కనీసం సీఎం పళనిస్వామి.. తన మేనల్లుడు దినకరన్ ద్వారా అయినా సరే జైలులో ఉండే పార్టీని నడిపించాలని అనుకున్నారు. అది కూడా వర్కవుట్ కాలేదు. పార్టీ  గుర్తు కోసం ఏకంగా ఈసీ అధికారులకే లంచం ఇవ్వడానికి పూనుకొని దినకరన్ బుక్ అయ్యారు. ఆయనను కాస్త ఢిల్లీ క్రైం బ్రాంచ్ పోలీసులు అరెస్ట్ అయ్యారు. దీనికితోడు విచారణలో చిన్నమ్మ శశికళ ఆదేశం మేరకే దినకరన్ ముడుపులు ఇవ్వజూపారన్న సాక్ష్యాలు సేకరించారు పోలీసులు. ఇక పళనిస్వామి కూడా ఆమెను వ్యతిరేకించిన పన్నీరు సెల్వంతో జత కట్టేందుకు సిద్దపడ్డాడు. దీంతో మరిన్ని చిక్కుల్లో పడ్డట్టైంది.   ఇదిలా ఉండగా ప్రస్తుతం బెంగుళూరులోని పరప్పన జైలులో ఉన్న ఆమెను పలకరించడానికి నేతలు కూడా కరువయ్యారట. బయట ఉన్నప్పుడు చిన్నమ్మకు వంగి వంగి దండాలు పెట్టిన నేతలు ఇప్పుడు కనీసం అమెను చూడటానికి రావడానికి తీరిక లేకుండా పోయినట్టు ఉంది. ఆమె అరెస్ట్ అయిన మొటల్లో ఎక్కువ సందర్శకులు వచ్చినా.. ఇప్పుడు వారి సంఖ్య భారీగా తగ్గింది. గత 14 రోజుల్లో ముగ్గురు మాత్రమే రాగా, వీరిలో ఒకరు శశికళ దగ్గరి బంధువైన డాక్టర్‌ ఉన్నారు. ఇక జైల్లో శశికళను సాధారణ ఖైదీగా పరిగణిస్తున్నారు. ఆమె వదిన ఇళవరసి ఇదే జైలులో శిక్ష అనుభవిస్తున్నా.. అనారోగ్య సమస్యల వల్ల ఇళవరసి ఎక్కువగా జైలు ఆస్పత్రిలో ఉండటంతో సెల్‌లో శశికళ ఒంటరిగా ఉంటున్నారు. చిన్నమ్మ ఎక్కువ సమయం టీవీ చూస్తూ కాలక్షేపం చేస్తున్నట్టు జైలు అధికార వర్గాలు తెలిపాయి. అంతేకాదు ఒకదాని తరువాత ఒకటి సమస్యలు వచ్చిపడుతున్న నేపథ్యంలో శశికళ కాస్త డిప్రేషన్ కు గురవుతున్నట్టు సమాచారం. మొత్తానికి శశికళ కూడా ఊహించి ఉండదేమో తనకు ఇలాంటి పరిస్థితి వస్తుందని..

బెయిల్ రద్దు కాలేదు… జైల్ కి వెళ్లాల్సిన ప్రమాదం లేదు!

  బాహుబలి సక్సెస్ తో ప్రభాస్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు! అయితే, ఏపీలో ఇవాళ్ల పండగ చేసుకుంటోన్న మరో వర్గం… జగన్ ఫ్యాన్స్! కొన్నాళ్లుగా అటు జగన్ కి, ఇటు ఆయన శ్రేయోభిలాషులకి గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్న బెయిల్ రద్దు పిటీషన్ ఎట్టకేలకు రిలీఫ్ ఇచ్చింది! యువనేత ఇప్పుడప్పుడే జైలుకెళ్లే ప్రమాదం లేకుండా పోయింది! వైసీపీ కార్యకర్తలు, నేతలు కూడా ఊపిరి పీల్చుకున్నారు!   జగన్ అక్రమాస్తుల కేసు ఇప్పటికే ఎన్నో మలుపులు తిరిగింది. ఆయన నెలల తరబడి చంచల్ గుడాలో మగ్గాల్సి వచ్చింది. ఎలాగో బెయిల్ పై బయటకొచ్చిన ఆయన 2014లో సీఎం అయ్యి తీరుతానని భావించారు. కాని, ఆ కలని కల్ల చేస్తూ ఓటర్లు టీడీపీకి ఛాన్స్ ఇచ్చారు. సర్లే అని ప్రతిపక్షంలో కూర్చున్న జగన్ కి వలస పక్షుల పుణ్యమాని ఇప్పటి వరకూ కంటి మీద కునుకు వుండటం లేదు. ఇన్ని కష్టాల మధ్యలో ఆయన బెయిల్ రద్దు చేయాలని సీబీఐ కోర్టుకెళ్లింది. మాజీ సీఎస్ రమాకాంత్ రెడ్డి సాక్షి మీడియాకిచ్చిన ఇంటర్వ్యూ కారణంగా చూపుతూ దర్యాప్తు సంస్థ పావులు కదిపింది. అయితే, జగన్ పైకి చూపించకపోయినా కాస్త టెన్షన్ పడ్డారనే చెప్పాలి! బెయిల్ కాని రద్దైతే ఆయన రాజకీయ భవిష్యత్తే పెద్ద కొశన్ మార్క్ అయ్యేది!   జగన్ మీద వున్న కేసు చాలా బలమైంది. నిర్దోషిగా ఆయన బయటపడతారని ఎవరూ చెప్పలేని పరిస్థితి. అటువంటిది ఇప్పుడు అమల్లో వున్న బెయిల్ కూడా రద్దు అయి వుంటే పెద్ద గండంగానే మారేది. ఎందుకంటే, మోదీ అన్ని రాష్ట్రాల ఎన్నికలతో సహా పార్లమెంట్ ఎలక్షన్స్ వచ్చే యేడు నిర్వహించాలని ఆలోచిస్తున్నారు. అలాగే, టీడీపీ కూడా ముందస్తు ఎన్నికలకు సర్వ సన్నద్ధంగా వుంది. అంటే… రాబోయే నెలల్లో ఎప్పుడైనా ఎన్నికల నగారా మోగొచ్చు. అలాగని ఈ పరిణామం ఖచ్చితంగా జరుగుతుందని కూడా చెప్పలేం. యథావిధిగా 2019లోనే ఎన్నికలు జరిగితే… అందుకు కొంత టైం వున్నట్టే!   అసలు ఎన్నికలు ఎప్పుడు వచ్చినా… జగన్ మళ్లీ జైలుకి వెళ్లటం మాత్రం నెగటివ్ గానే పని చేస్తుంది. ఇప్పటికే చాలా మంది నేతల వలసలతో వైసీపీ డల్ గా వుంది. ఇక అధినేత కూడా జైల్లోకి వెళ్లిపోతే నాయకులు, కార్యకర్తల నైతిక స్థైర్యం దిగిజారిపోవచ్చు. ఈ పరిణామం టీడీపీ, బీజేపీలకి లబ్ధి చేకూరుస్తుంది! కాని, కోర్టు బెయిల్ రద్దు చేయటం కుదరదని చెప్పటంతో జగన్ కు ఇవాళ్ల పెద్ద రిలీఫే వచ్చింది. అలాగే, ఆయన విదేశీ టూర్ కూడా చేసుకోవచ్చని న్యాయస్థానం చెప్పటం జగన్ కి మరింత ఊరట!   బెయిల్ రద్దు చేయకుండా కోర్టు ఇచ్చిన సువర్ణావకాశాన్ని జగన్ చక్కగా వాడుకోవాలి. పార్టీ నేతల్ని, కార్యకర్తల్ని యుద్ధానికి సిద్దం చేసుకోవాలి. ముందస్తు ఎన్నికలు వచ్చినా, సరైన టైముకే వచ్చినా అన్ని విధాల రెడీగా వుండాలి. కారణం, అవినీతి, అక్రమ ఆస్తుల కేసులో ఎప్పుడు ఏ తీర్పు వస్తుందో ఎవ్వరూ చెప్పలేని స్థితి. జగన్ తాను బయట వున్నా, లోపల వున్నా వైసీపీ… టీడీపీని ధీటుగా ఎదుర్కొనేలా తయారు చేయాలి. లేదంటే అపర చాణుక్యుడు చంద్రబాబు గూటిలోకి మరికొందరు వైసీపీ నేతలు జంప్ చేయవచ్చు. బీజేపీ కూడా ఢిల్లీ నుంచి పావులు కదుపుతూ ప్రముఖ వైసీపీ నాయకులకి గాలం వేయవచ్చు! ఈ రెండు పరిణామాలు జరిగితే… ఒకవేళ జగన్ జైలుకి వెళితే… తిరిగి వచ్చేప్పటికీ ఏమీ మిగలదు!

మోదీ ఐడియాకి… చంద్రబాబు ఆమోదం!

  మోదీ వచ్చాక ప్రతిపక్షాలకే కాదు… చాలా చోట్ల వున్న ప్రాంతీయ పార్టీలకు కూడా కునుకు లేకుండా పోతోంది. ఎన్డీఏలో వున్నా లేకున్నా , బీజేపికి వ్యతిరేకంగా మాట్లాడినా , మాట్లాడకున్నా, కాంగ్రెస్, కమ్యూనిస్టుల వైపున నిలిచినా , నిలవకున్నా… అందర్నీ టెన్షన్ పెడుతున్నారు మోదీ, షా! ఈ ఇద్దరు గుజరాతీ చాణుక్యులు ఉత్తర్ ప్రదేశ్ లోని ములాయం, మాయావతి మొదలు మహారాష్ట్రలోని ఉద్ధవ్ వరకూ అందర్నీ అల్లాడిస్తున్నారు. వీళ్ల బాధితులుగా మారిన వారిలో అరివింద్ కేజ్రీవాల్, మమతా బెనర్జీ కూడా వున్నారు. అందుకే, చాలా చోట్లా బీజేపి మిత్రపక్షాలు, ప్రతిపక్షాలు ఒకేలా విమర్శలకు దిగుతున్నాయి. అయితే, తెలుగు రాష్ట్రాల్లో మాత్రం సీన్ వేరుగా వుంది!   చాలా రాష్ట్రాల్లో జరుగుతున్నట్టు మోదీపై వ్యతిరేక కామెంట్ల పర్వం ఏపీ, తెలంగాణల్లో జరగటం లేదు. కేసీఆర్ ఎంత మాత్రం ప్రధానిని టార్గెట్ చేయటం లేదు. ఇక ఎన్డీఏలో భాగస్వామి అయిన చంద్రబాబు అయితే వీలైనప్పుడల్లా నాలుగు మంచి మాటలే మాట్లాడుతున్నారు. ప్రత్యేక హోదా విషయంలో మోదీ సర్కార్ ప్రవర్తన టీడీపీకి ఇబ్బందిగా మారినా సీఎం ఘాటుగా ఏనాడూ స్పందిచలేదు. పవన్ కళ్యాణ్, జగన్ ఇరువైపుల నుంచీ దాడి చేసినా చంద్రబాబు గంభీరంగానే నెట్టుకొచ్చారు. ఇక తాజాగా టీడీపీ అధినేత ఒకే దేశం ఒకే ఎన్నికల విషయంలో కూడా మోదీకి మద్దతు పలికారు! ముందస్తు ఎన్నికలు కాదు… ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్ధమే అన్న బాబు అన్ని ఎన్నికలూ ఒకేసారి జరిగేతే మంచిదేనన్నారు!   ప్రతీ మూడు నెలలకు ఒకసారి పార్లెమంట్, అసెంబ్లీ లేదా స్థానిక ఎన్నికలు వస్తే ఎప్పటికప్పుడు తమని తాము నిరూపించుకునేందుకే .. ప్రభుత్వాల సమయం సరిపోతోందని చంద్రబాబు అన్నారు. అందుకే, 2018 చివర్లో ముందస్తు ఎన్నికలు వచ్చినా సరేనన్నారు. తాము చేస్తున్న అభివృద్ధే తమని గెలిపిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఇప్పటి వరకూ మోదీ ప్రతిపాదించిన వన్ నేషన్ వన్ ఎలక్షన్ కు స్పష్టంగా మద్దతు పలికిన సీఎం మన చంద్రబాబే. చాలా మంది ముఖ్యమంత్రులు ఈ ఆలోచనకు సుముఖంగానే వున్నా ఇంకా పబ్లిగ్గా మాట్లాడటం లేదు. కాని, ఏపీ సీఎం మోదీకి విస్పష్టంగా మద్దుతు తెలిపి మరో మంచి సంస్కరణకి ఉతం ఇచ్చారు. రానున్న రోజుల్లో బీజేపియేతర పార్టీ ఆధినేతలు చాలా మంది చంద్రబాబును ఫాలో అయ్యే అవకాశాలే కనిపిస్తున్నాయి. అరవింద్, మమత బెనర్జీ లాంటి కరుడుగట్టిన మోదీ వ్యతిరేకుల్ని మినహాయిస్తే దేశ వ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలకు మెల్ల మెల్లగా లైన్ల క్లియర్ అవుతున్నట్టే కనిపిస్తోంది!   అన్ని ఎన్నికల్ని ఒకేసారి నిర్వహించటం వల్ల జాతీయ పార్టీల ప్రభావం విపరీతంగా పెరుగుతుందని వినిపిస్తోన్న వాదన కూడా ఏపీ సీఎం తోసి పుచ్చటం మనం తప్పకుండా గమనించాలి. ప్రజలు మంచి చేసిన పార్టీకి ఎన్నికలు ఎప్పుడు జరిగినా మద్దతు పలుకుతారని ఆయన అన్నారు. 2014లో పార్లెమంట్ ఎలక్షన్స్ తో పాటే అసెంబ్లీ ఎలక్షన్స్ జరిగినా తెలుగు రాష్ట్రాల్లో అధికారం టీడీపీ, టీఆర్ఎస్ ల స్వంతమే అయింది. బీజేపి గణనీయంగా లాభపడిందేం లేదు. కాబట్టి చంద్రబాబు తరహాలోనే అందరూ ముఖ్యమంత్రులు ఎన్నికల సంస్కరణకి ముందుకు రావాలని మనమూ కోరుకుందాం…

కేసీఆర్‌ సర్కార్‌కి దెబ్బ మీద దెబ్బ... తప్పెక్కడ జరుగుతోంది?

  తెలంగాణ ప్రభుత్వానికి దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. అనేక నిర్ణయాలపై కోర్టులు అక్షింతలు వేయగా.... తాజాగా మరోసారి హైకోర్టులో చుక్కెదురైంది. కాంట్రాక్టు లెక్చరర్లను క్రమబద్దీకరిస్తూ... టీ-సర్కార్‌ విడుదల చేసిన జీవోపై అభ్యంతరం తెలిపింది. సరైన ఎంపిక ప్రక్రియ లేకుండా... ఎలా క్రమబద్దీకరిస్తారంటూ ధర్మాసనం ప్రశ్నించింది. 1996 తర్వాత కాంట్రాక్టు పద్దతిలో ఉద్యోగాలు పొందిన వారిని... క్రమబద్దీకరించొద్దంటూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులిచ్చింది.   కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్దీకరణ చేస్తామని... టీఆర్ఎస్‌ మేనిఫెస్టోలో పెట్టింది. దీంతో కాంట్రాక్టు ఉద్యోగుల్ని క్రమబద్దీకరిస్తూ... జీవో 16 జారీ చేసింది తెలంగాణ ప్రభుత్వం. ఇప్పటికే దాదాపు 1000 మందికి పైగా ఉద్యోగులను క్రమబద్దీకరించి నియామకాలు చేసింది. అయితే నాలుగు వేల జూనియర్ లెక్చరర్‌ పోస్టులు ఖాళీగా ఉండగా... కాంట్రాక్టు ఉద్యోగుల్ని రెగ్యులరైజ్ చేయడాన్ని నిరుద్యోగులు తప్పుబట్టారు. ప్రభుత్వ నిర్ణయంతో నష్టపోతున్నామని హైకోర్టును ఆశ్రయించారు. దీంతో రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం విచారణకు స్వీకరించింది. అటు టీ-సర్కార్ ప్రతినిధులు, ఇటు నిరుద్యోగులు హైకోర్టు ముందు వాదనల్ని వినిపించారు. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులతో క్రమబద్దీకరణ ప్రక్రియకు తాత్కాలికంగా బ్రేక్ పడింది.   అలాగే తెలంగాణ భూసేకరణ చట్టం విషయంలోనూ రాష్ట్ర ప్రభుత్వానికి చుక్కెదురైంది. అనేక లోపాలను ఎత్తిచూపిన  కేంద్ర న్యాయశాఖ... బిల్లును వెనక్కిపంపింది. ముఖ్యంగా తెలంగాణ భూసేకరణ, పునరావాస చట్టం 2014 జనవరి నుంచే అమల్లోకి వచ్చినట్లు బిల్లులో ప్రస్తావించడాన్ని తీవ్రంగా తప్పుబట్టింది. 2014 జూన్ రెండున తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే.... 2014 జనవరి నుంచే చట్టం ఎలా అమల్లోకి వస్తుందని ప్రశ్నించింది. బిల్లులో అనేక లోపాలను ఎత్తిచూపడంతో తెలంగాణ సర్కార్‌ ఇరకాటంలో పడింది. భూసేకరణ బిల్లులో మళ్లీ మార్పులు చేర్పులు చేసి తిరిగి కేంద్రానికి పంపడానికి వర్క్‌ జరుగుతోంది. అయితే కీలక నిర్ణయాల విషయంలో ప్రభుత్వానికి ఎదురుదెబ్బలు తగలడానికి అధికారుల కసరత్తులో లోపం స్పష్టంగా కనిపిస్తోంది. ఏదో హడావిడిగా ముసాయిదా బిల్లులు, జీవోలు రూపొందించడంతోనే ఇలాంటి పరిస్థితి ఎదురవుతోందని ప్రభుత్వం భావిస్తోంది.

ఒకరిద్దరి వల్లే ప్రభుత్వానికి చెడ్డపేరు... క్లాస్‌ పీకిన చంద్రబాబు

  మంత్రులు, అధికారులకు చంద్రబాబు క్లాస్ పీకారు. ప్రభుత్వం ఎంత బాగా పని చేస్తున్నా... ఒకరిద్దరి తప్పిదాలతో అందరికీ చెడ్డ పేరు వస్తోందని మండిపడ్డారు. ఒక లారీ డ్రైవర్ తప్పతాగి మూడు చెక్‌పోస్టులు దాటొచ్చి అంతమందిని బలిగొంటే... రవాణాశాఖ అధికారులు నిద్రమత్తులో జోగుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇసుక అక్రమార్కులపై ఇక నుంచి పీడీ యాక్ట్‌ పెట్టాలంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు.   ఉచిత ఇసుకను కొంతమంది తమ స్వార్థ ప్రయోజనాలకు వాడకుంటున్నా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని చంద్రబాబు ఫైరయ్యారు. రోడ్డు ప్రమాదాలు జరగడంలో రవాణా శాఖాధికారుల తప్పిదం స్పష్టంగా కనిపిస్తోందన్నారు. ఏర్పేడు ప్రమాదంలోనూ ఇదే జరిగిందన్నారు. మహబూబ్‌నగర్‌ నుంచి బయలుదేరిన లారీ మూడుకి పైగా చెక్‌పోస్టులను దాటి ఉంటుందని, ఏ చెక్‌పోస్టు దగ్గరైనా అధికారులు సరిగ్గా చెక్‌ చేసి ఉంటే, లారీ డ్రైవర్‌ తాగి ఉన్నాడన్న విషయంగానీ, లేదంటే క్లీనర్‌ బండి నడుపుతున్న విషయంగాని బయటపడేదన్నారు. ఏర్పేడు ఘటన పూర్తిగా రోడ్డు ప్రమాదమే అయినా ఇసుక మాఫియా అరాచకాల కారణంగానే అక్కడ జనం గుమిగూడి ఉన్నారన్న విషయం మర్చిపోరాదన్నారు. అక్రమ ఇసుక రవాణాని అరికట్టడంలో అధికారులు విఫలం కావడం వల్లనే ప్రజలు ఆందోళనలు చేయాల్సి వచ్చిందన్నారు చంద్రబాబు. అక్రమ ఇసుక రవాణాదారులపై పీడీ యాక్ట్‌ ప్రయోగించాలన్నారు. ఇసుక తవ్వకాలపై నేరుగా జిల్లా కలెక్టర్లే బాధ్యత వహించాలని...అలాగే ఉచిత ఇసుకను గనులు, రెవెన్యూ, హోంశాఖా మంత్రులు మగ్గురు కలిసి పర్యవేక్షించాలన్నారు.   ప్రభుత్వం ఎన్ని మంచి పనులు చేసినా, ఒకరిద్దరి తప్పిదాలతో అదంతా గాల్లో కలిసిపోతోందని చంద్రబాబు మండిపడ్డారు. చట్టాన్ని సక్రమంగా అమలు చేయాల్సిన అధికారులు నిర్లక్ష్యంగా ఉండటం వల్లే ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తోందన్నారు. అధికారుల పనితీరు మెరుగుపర్చడం, నైపుణ్యాల వృద్ధికి మాజీ సీఎస్‌ ఎస్పీ టక్కర్‌ సేవలు వినియోగించుకోనున్నట్లు చెప్పారు.

టికెట్‌ రూ.150... స్నాక్స్‌ రూ.250... థియేటర్లలో నిలువు దోపిడీ

  బాహుబలి-2 రిలీజ్‌కు ముందే ప్రేక్షకులకు చుక్కలు చూపిస్తోంది. బాహుబలి-1 సస్పెన్స్ తెలుసుకోవాలంటే బాహుబలి-2 చూడాల్సిందేనని ఎదురుచూస్తున్న ఫ్యాన్స్‌కు మైండ్ బ్లాంక్ అవుతోంది. అభిమానుల క్రేజ్‌ను మల్టీఫ్లెక్స్‌లు క్యాష్ చేసుకుంటున్నాయి . సరదాగా సినిమాకు వెళ్దామనుకుంటే... ప్రేక్షకుల జేబుకు కన్నమేస్తున్నాయి. టికెట్ బుక్ చేసుకుందామనుకున్న ప్రేక్షకులకు థియేటర్లు దడపుట్టిస్తున్నాయి. టికెట్ బుక్ చేసుకోవాలంటే కచ్చితంగా పాప్ కార్న్, సమోసా, కూల్ డ్రింక్ కొనాలంటూ షరతులతో హడలుగొడుతున్నారు. దాంతో 150 రూపాయలు పెట్టి సిన్మా చూడాలనుకుంటే.... స్నాక్స్ కోసం మరో 250 రూపాయలు ఖర్చు చేయాలి. అంటే ఒక్క టికెట్‌కు 400 రూపాయలు పెట్టాల్సిందే.   బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడో తెలుసుకోవాలంటే మొదటి రోజు మొదటి ఆట చూడాల్సిందే. ఆ తర్వాత సినిమా చూసినా, సస్పెన్స్‌ తెలిసిపోయి మజా ఉండదు. అందుకే ఎంత రేటు పెట్టయినా సరే టికెట్‌ కొని సినిమా చూడాలనుకుంటున్నారు ప్రేక్షకులు, ఈ క్రేజ్‌నే క్యాష్‌ చేసుకుంటున్నారు థియేటర్ల యాజమాన్యాలు. బాహుబలి-2పై ప్రేక్షకుల్లో ఉన్న క్రేజును క్యాష్‌ చేసుకోవడమే కాకుండా... దారుణంగా దోపిడీకి పాల్పడుతున్నాయి థియేటర్ల యాజమాన్యాలు. ప్రేక్షకుల జేబులు గుల్ల చేయడమే లక్ష్యంగా కాంబో ఆఫర్లు, ఎంట్రీ పాస్‌ల పేరిట సినీ అభిమానులకు చుక్కలు చూపిస్తున్నారు. ప్రేక్షకులకు ఇష్టమున్నా లేకపోయినా కూల్ డ్రింక్స్‌, పాప్‌ కార్న్‌, తినుబండారాలను కచ్చితంగా కొనుగోలు చేసేలా కాంబో ఆఫర్లు పెట్టారు. టికెట్‌తోపాటే కాంబో ఆఫర్లు మిక్స్‌ చేసి అమ్ముతున్నారు. దాంతో 150 రూపాయల టికెట్‌ని మూడు నాలుగు వందల వరకు అమ్ముతున్నారు.   మరోవైపు ఏపీలో అధికారికంగానే బాహుబలి టికెట్లు భారీగా పెంచేశారు. మల్లీఫ్లెక్సుల్లో 150 రూపాయల టికెట్‌ 200కి.... 200 రూపాయల టికెట్‌ను 250కి విక్రయించనున్నారు. ఇక సాధారణ థియేటర్లలో 70 రూపాయల టికెట్‌ 100కి.... 90 రూపాయల టికెట్‌ 150కి.... 150 రూపాయల టికెట్‌ 200కి అమ్మనున్నారు. అయితే పెంచిన టికెట్ల ధరలు.... మొదటి వారంరోజులు మాత్రమే అమల్లోకి ఉండనున్నాయి.   చివరిగా చెప్పేదేమంటే కట్టప్ప.... బాహుబలిని ఎందుకు చంపాడో చూద్దామని థియేటర్‌కి వెళ్తే ...నిలువు దోపిడీ ఖాయం. సినిమా చూడాలంటే... ఇష్టమున్నా లేకున్నా ఫుడ్ ఐటెమ్స్‌ కొనాల్సిందే.

ఇలాంటి వ్య‌క్తి ఒక్క‌రుంటే చాలు దేశానికి ఎంతో మేలు: మంత్రి త‌ల‌సాని!

  క‌ళాత‌ప‌స్వి కె.విశ్వ‌నాథ్ ను ప్ర‌తిష్టాత్మ‌క  దాదా సాహెబ్ ఫాల్క్ అవార్డు వ‌రిడంచ‌డంతో యావ‌త్త్ టాలీవుడ్ ఇండ‌స్ర్టీ అంతా అభినంద‌న‌ల జ‌ల్లు కురిపిస్తోంది. కాగా  ఈరోజు ( బుధ‌వారం) మ‌ధ్నాహ్నం తెలంగాణ రాష్ర్ట సినిమాటోగ్ర‌ఫీ మంత్రి త‌ల‌సాని శ్రీనివాస‌ యాద‌వ్, మా అధ్య‌క్షుడు శివాజీ రాజా, జాయింట్ సెక్ర‌ట‌రీ న‌రేష్ స్వ‌యంగా విశ్వ‌నాథ్ ఇంటికెళ్లి అభినందించారు.   అనంత‌రం త‌ల‌సాని శ్రీనివాస యాద‌వ్ మాట్లాడుతూ, ` ఇప్ప‌టివ‌ర‌కూ దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు మ‌న తెలుగు వాళ్లైన బి.ఎన్. రెడ్డి, పైడి జైరాజు, ఎన్. వి. ప్ర‌సాద్ , నాగిరెడ్డి, అక్కినేని నాగేశ్వ‌ర‌రావు, రామానాయుడు గారికి అందించారు. ఇప్పుడు విశ్వ‌నాథ్ గారిని ఆ అవార్డుతో స‌త్క‌రించ‌డం  సంతోషంగా ఉంది. ఆయ‌న ప్ర‌జ‌ల‌కు చేరువ‌య్యే  ఎన్నో్ సందేశాత్మ‌క సినిమాలు తెర‌కెక్కించారు. `స్వ‌ర్ణ‌క‌మలం` తో పాటు చిరంజీవి గారితో ఎన్నో మంచి సినిమాలు తీశారు. ఈ అవార్డు ఆయ‌న్ను  ఎప్పుడో వ‌రించాలి. కానీ ఆల‌స్య‌మైన‌ప్ప‌టికీ మంచి నిర్ణ‌యంతో ఆయ‌న్ను గౌర‌వించ‌డం తో  ప్ర‌పంచంలో ఉన్న తెలుగు వాళ్లు  అంతా గౌర‌వంగా భావిస్తున్నాం. ఈ రోజు తెలంగాణ రాష్ర్ట ముఖ్య‌మంత్రి కేసీఆర్ గారు ఆయ‌న్ను  స‌న్మానం చేయ‌మ‌ని చెప్పారు. ఆయ‌న్ను గౌర‌వించ‌డం అదృష్టంగా భావిస్తున్నాం. ఇలాంటి వ్య‌క్తులు స‌మాజంలో ఒక్క‌రుంటే చాలు దేశానికి ఎంతో మేలు క‌లుగుతుంది.  త్వ‌ర‌లోనే ప్ర‌భుత్వం త‌రుపున కూడా ఓ కార్య‌క్ర‌మం చేస్తాం. ప్ర‌స్తుతం  తెలుగు సినీ ప‌రిశ్ర‌మ మూడు పువ్వులు ఆరు కాయ‌లుగా సాగిపోతుంది.  ఈ సంవ‌త్స‌రం కూడా ఇండ‌స్ర్టీకి మంచి బ్రేక్ వ‌చ్చింది` అని అన్నారు.   `మా` అధ్య‌క్షుడు శివాజీ రాజా మాట్లాడుతూ, ` విశ్వ‌నాథ్ గారు తెలుగు సినీ ప‌రిశ్ర‌మ అంతా గ‌ర్వంగా చెప్పుకునే ఎన్నో సినిమాలు చేశారు. ఇది మాకు దక్కిన గౌర‌వం.  ఈ టైమ్ ఆ టైమ్ లో అవార్డు రావ‌డం ఇది సంజీవ‌ని లాంటింది. మేమంతా సంబురాలు చేసుకుంటున్నాం. త్వ‌ర‌లోనే మా సిల్వ‌ర్ జూబ్లీ వేడుక చేస్తున్నాం.  ఆ వేడుక‌లో ఆయ‌న్ను అత్యంగ గౌరవంగా స‌త్క‌రించుకుంటాం` అని అన్నారు.   `మా` జాయింట్ సెక్ర‌ట‌రీ న‌రేష్ మాట్లాడుతూ, ` `మాయాబ‌జార్`,  `శంక‌రాభ‌ర‌ణం,  నుంచి ఇప్ప‌టి  బాహుబ‌లి వ‌ర‌కూ భార‌త‌దేశంలో ఎన్నో అద్భుత‌మైన సినిమాలు తీయ‌డం జ‌రిగింది. కె. విరెడ్డి,  కె. విశ్వ‌నాథ్ , రాజ‌మౌళి ప్ర‌పంచానికి తెలుగు సినిమాను చాటి చెప్పారు.  విశ్వ‌నాథ్ గారు చేసిన ఎన్నో  సినిమాలు తెలుగు జాతి గౌర‌వాన్ని నిల‌బెట్టాయి. క‌మిటీ మొత్తం విశ్వ‌నాథ్ గారిని  ఏక‌గ్రీవంగా  అవార్డుకు ఎంపిక చేయ‌డం ఎంతో గొప్ప విష‌యం. ఆయ‌న‌ మ‌రిన్ని  ప్ర‌పంచ స్థాయి అవార్డులు అందుకోవాల‌ని కోరుకుంటున్నాం` అని అన్నారు.

జగన్‌‌ మెడకు చుట్టుకుంటోన్న సోషల్‌ మీడియా కేసు

  ఏపీలో సోషల్‌ మీడియా వివాదం రోజుకో మలుపు తిరుగుతోంది. కేసు మొత్తం వైసీపీ, జగన్‌ చుట్టే తిరుగుతోంది. పొలిటికల్‌ పంచ్‌ వెబ్‌సైట్‌ నిర్వాహకుడు రవికిరణ్‌కు వైసీపీతో, సాక్షి మీడియాతో ఉన్న లింకులపైనే ప్రధానంగా పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. వైసీపీ ఐటీ వింగ్ ఇన్‌ఛార్జ్ మధుసూదన్‌రెడ్డి విచారణ విషయంలో హైడ్రామా చోటు చేసుకుంది. మధుసూదన్‌‌ను ప్రశ్నించి వదిలిపెట్టిన పోలీసులు.... కొద్దిసేపటికే మళ్లీ విచారణకు రావాలంటూ ఆదేశించడం అనుమానాలు రేకెత్తించింది.   పొలిటికల్‌ పంచ్‌ రవికిరణ్‌తో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి గానీ, సాక్షి మీడియాకి గానీ ఎలాంటి సంబంధం లేదని వైసీపీ ఐటీ వింగ్ ఇన్‌ఛార్జ్ మధుసూదన్‌రెడ్డి తెలిపారు. లక్షల మంది వైసీపీ సానుభూతిపరుల్లో రవికిరణ్‌ ఒకరన్నారు. అయితే రవికిరణ్‌కు వైఎస్సార్‌సీపీ మద్దతు ఉంటుందన్నారు. తాము ఎవరినీ కించపర్చలేదంటున్న మధుసూదన్‌రెడ్డి.... ప్రభుత్వ అవినీతి, ప్రజావ్యతిరేక కార్యక్రమాలపైనే వ్యంగ్యంగా పోస్టులు పెడుతున్నట్లు వివరించారు. అయితే పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని, జగన్‌పైనా, వైఎస్‌ కుటుంబంపైనా టీడీపీ అధికారిక వెబ్‌సైట్లో అసభ్యకరంగా పోస్టులు పెడుతున్నా పోలీసులు చర్యలు తీసుకోవడం లేదన్నారు.   మరోవైపు పొలిటికల్‌ పంచ్ నిర్వాహకుడు రవికిరణ్‌‌ను మరోసారి సుదీర్ఘంగా విచారించిన తుళ్లూరు పోలీసులు... వైసీపీతో ఉన్న సంబంధాలపై ప్రశ్నల వర్షం కురిపించారు. అయితే వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీతో తనకెలాంటి సంబంధం లేదని రవికిరణ్‌ పోలీసులకు వివరణ ఇచ్చాడు. తన వెబ్‌సైట్లో ఒక్క టీడీపీ మీదే కాకుండా, అన్ని రాజకీయ పార్టీలపైనా సెటైర్లు ఉన్నాయన్నారు. అయితే రవికిరణ్‌ అరెస్ట్‌ సయమంలో సాక్షి ఛానల్‌తో మాట్లాడిన రవికిరణ్‌ భార్య.... తన భర్తకు సాక్షి మీడియాతో సంబంధాలున్నాయని, వాళ్లే జీతాలు చెల్లిస్తారని చెప్పినట్లు తెలుస్తోంది. ఈ విషయంపైనే పోలీసులు... రవికిరణ్‌ను ప్రధానంగా ప్రశ్నించినట్లు తెలుస్తోంది. మొత్తానికి పొలిటికల్‌ పంచ్‌ రవికిరణ్‌ కేసు... జగన్‌, సాక్షి, వైసీపీ చుట్టే తిరుగుతోంది.

ఏపీలో కొత్త వివాదం... బయోమెట్రిక్‌పై ఉద్యోగుల గరంగరం

  ఇష్టమొచ్చినప్పుడు వస్తారు... బోర్‌ కొట్టినప్పుడు వెళ్లిపోతారు. అసలు ఎప్పుడు ఆఫీస్‌లో ఉంటారో... ఎప్పుడు వెళ్లిపోతారో తెలియదు. అసలు వాళ్లను అడిగే వాళ్లే ఉండరు. మధ్యాహ్నం అయినా… డ్యూటీకి రావాలన్న సంగతి మర్చిపోతారు. ఇలా టైమ్‌కు డ్యూటీకి రాని ఉద్యోగులపై ఏపీ సర్కార్‌ ఫోకస్‌ పెట్టింది. ఎంప్లాయిస్ టైమింగ్స్‌పై ఆరోపణలు రావడంతో సీరియస్ గా తీసుకున్న ప్రభుత్వం...  టైమ్‌ టూ టైమ్‌ పనిచేసేలా స్ట్రిక్ట్ రూల్స్ అమలు చేయడానికి ప్లాన్ చేస్తోంది. ఉదయం 11 గంటలు దాటినా… ఉద్యోగులు డ్యూటీకి రాకపోవడంతో  ప్రభుత్వ సేవలు పొందడంలో ప్రజలు ఇబ్బందిపడుతున్నారని గుర్తించిన ప్రభుత్వం... ఉద్యోగుల అటెండెన్స్‌ ఇష్యూను సీరియస్ గా తీసుకుంది. ఇలాంటి వారి కోసం నయా ప్లాన్ రెడీ  చేసింది సర్కారు.   ఇష్టమొచ్చినట్లు వ్యవహరించే ఉద్యోగులను దృష్టిలో పెట్టుకొని... బయోమెట్రిక్ సిస్టమ్ తీసుకొచ్చింది. వైద్యారోగ్య, రెవెన్యూ శాఖలతో పాటు సచివాలయంలోనూ బయోమెట్రిక్ సిస్టమ్ అమల్లోకి తెచ్చింది. సచివాలయం ఉద్యోగులకు వారానికి ఐదురోజులే పని దినాలున్నా సోమవారం, శుక్రవారం సాయంత్రం త్వరగా వెళ్లడంతో పాటు  ప్రజలకు అందుబాటులో ఉండకపోవడంతో బయో మెట్రిక్‌ను తప్పని సరి చేసింది ప్రభుత్వం.   ఎప్పుడు పడితే అప్పుడు ఆఫీసుకు వచ్చి పోదాం... అనుకునే ఉద్యోగులకు ఈ కొత్త సిస్టం చెక్ పెట్టనుంది. ఇది పకడ్బందీగా ఇంప్లిమెంట్ చేస్తేనే ఉద్యోగుల తీరులో మార్పు వస్తుందని  సర్కారు  భావిస్తుంది. అయితే బయోమెట్రిక్‌ సిస్టమ్‌ను ఉద్యోగులు వ్యతిరేకిస్తున్నారు. ఇది తమను వేధించడానికే అంటున్నారు. ఈ-ఆఫీస్‌‌తో ఎవరు ఎక్కడ నుంచైనా పని చేసుకునే వెసులుబాటు ఉందని, కొత్తగా బయోమెట్రిక్‌ సిస్టమ్‌ను అమలు చేయడం సరికాదంటున్నారు.

జగన్‌ కల నెరవేరుతుందా? ప్రశాంత్‌ పాచికలు పారతాయా?

  ముందస్తు ఎన్నికల ఊహాగానాలతో జగన్‌ అలర్ట్‌ అయ్యారు. 2014లో స్వల్ప ఓట్ల తేడాతో అధికారానికి దూరమైన జగన్...ఈసారి ఎలాగైనా సీఎం పీఠం అధిష్టించాలని పావులు కదుపుతున్నారు. రాజకీయ వ్యూహాల్లో ఆరితేరిన ఆయుధంతో టీడీపీని చిత్తు చేయాలని భావిస్తున్నారు. అందుకోసం ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్‌ను రంగంలోకి దించారు. వైసీపీ గెలుపు బాధ్యతల్ని ప్రశాంత్ కిషోర్ నెత్తిన పెట్టారు. ఇప్పటికే జగన్‌తో సమావేశమైన ప్రశాంత్‌ కిషోర్‌... ఏపీ రాజకీయాలపై చర్చించారు. జగన్‌తో పరిచయ కార్యక్రమం పూర్తికావడంతో... ప్రశాంత్ కిషోర్ టీమ్ ఇప్పటికే ఏపీ‌లో వైసీపీ పరిస్థితిపై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది.   ప్రశాంత్ కిషోర్ 2014లో తన రాజకీయ వ్యూహాలతో మోడీని, తర్వాత బీహార్ లో నితీశ్ కుమార్ ని గద్దెనెక్కించి పేరు తెచ్చుకున్నారు. అప్పట్నుంచి పొలిటికల్ సర్కిల్స్‌లో ప్రశాంత్‌ కిషోర్‌ పేరు మార్మోగిపోయింది. ఇటీవల జరిగిన ఉత్తరప్రదేశ్, పంజాబ్ ఎన్నికల్లో కాంగ్రెస్ వ్యూహకర్తగా వ్యవహరించారు. అయితే యూపీలో ప్రశాంత్ పాచికలు పారకపోయినా...పంజాబ్ లో మాత్రం కాంగ్రెస్ ను అధికారంలోకి తెచ్చాయి. అలాంటి ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు వైసీపీకి వ్యూహకర్తగా వ్యవహరించడం ఆసక్తి రేపుతోంది.   అధికార పార్టీలో అసంతృప్తుల్ని త‌మ వైపు తిప్పుకునేందుకు సూచ‌న‌లతో పాటు గెలుపు కోసం ప్రశాంత్ కీలకమైన సలహాలిస్తారని జగన్ నమ్ముతున్నారు. గ‌తంలో అనేకమంది విజయానికి బాటలు వేసిన ప్రశాంత్ కిషోర్ తననూ అధికారంలోకి తెస్తుందని జగన్ భావిస్తున్నారు.

బాహుబలి కోసం టెన్షన్ గా వెయిట్ చేస్తోన్న జనం… ఈ టెన్ ఫ్యాక్ట్సే కారణం!

ఆకాశాన్ని మేఘాలు కమ్మేశాయి! కారు చీకట్లు ముసురుకుంటున్నాయి! ఏ క్షణాన అయినా చినుకులు రాలవచ్చు! ఒక్కసారి వర్షం మొదలైందా… ఇక తుఫానే! ఇదంతా చెబుతోంది వాతావరణ సూచన కాదు! ఎర్రటి ఎండా కాలంలో బాహుబలి బాక్సాఫీస్ పైకి దండెత్తి వస్తున్నాడు. కాసుల వర్షం… కలెక్షన్ల తుఫాన్ సృష్టించబోతున్నాడు! ఇంతకీ బాహుబలి 2, అదేనండీ, బాహుబలి ది కన్ క్లూషన్ మ్యానియాకు కారణం ఏంటి? పది ముక్కల్లో చెప్పకుంటే… ఆ టెన్ టెంప్టింగ్ ఫ్యాక్ట్స్ ఆఫ్ బాహుబలి… ఇవే…   1.     బాహుబలి 2 సినిమా క్లైమాక్స్ ఖర్చే మరో భారీ తెలుగు సినిమా బడ్జెట్ అంత! దాదాపు 30కోట్లు బాహుబలి పార్ట్ 2 క్లైమాక్స్ కోసం వెచ్చించారు. ఇది బాహుబలి ది బిగినింగ్ కన్నా రెట్టింపు!   2.    బాహుబలి అనగానే మనకు ఇప్పటికిప్పుడు గుర్తుకు వచ్చే ప్రధానమైన సీన్స్ ఏవీ? ఆరడుగుల ఆజానుబాహుడు ప్రభాస్ కొండలపైనా, జలపాతలపైనా చేసిన విన్యాసాలు! మొదటి భాగం షూట్ చేస్తున్నప్పుడు జలపాతాల సీన్లు షూట్ చేయటానికి ముప్పాతిక సమయం సరిపోయిందట! అలాంటి కళ్లార్పనీయని దృశ్యాలు బాహుబలి 2లో ఇంకా వున్నాయట! అఫ్ కోర్స్, ఒళ్లు గగుర్పొడిచే యుద్ధాలతో పాటూ!   3.    బాహుబలి ది కన్ క్లూషన్ షూటింగ్ 2015 డిసెంబర్లో ప్రారంభమైంది. ఒకటిన్నర సంవత్సరంలో రాజమౌళి తన సిల్వర్ స్క్రిన్ వండర్ ని సిద్ధం చేశాడు!   4.    బాహుబలి 2 సినిమాకు సంబంధించి లీకైన కొన్ని ఫోటోలు పోయిన సంవత్సరం కలకలం సృష్టించాయి!   5.    బాహుబలి హిందీ డబ్బింగ్ వర్షన్ వంద కోట్లు వసూలు చేసింది! కాని, ఇప్పుడు రిలీజ్ కి సిద్ధమైన బాహుబలి 2 సాటిలైట్ రైట్సే 51కోట్లకు అమ్ముడుపోయాయి! సోనీ టీవీ ఈ భారీ మొత్తం ఖర్చు చేసి బాహుబలి 2 స్వంతం చేసుకుంది! ఒక డబ్బింగ్ సినిమా ఇంత ధర పలకటం హిందీలో ఇదే మొదటిసారి!   6.    బాహుబలి ది కన్ క్లూషన్ లో అందర్నీ ఆకర్షిస్తున్న అంశం… ప్రభాస్, రాణా, అనుష్కల మధ్య నడవబోయే ముక్కోణపు ప్రేమకథ! భల్లాలదేవుడు దేవసేనని కోరితే… దేవసేన అమరేంద్ర బాహుబలిని ప్రేమిస్తుంది! వీరి కథలో శివగామి పాత్ర ఏంటి? ఇదే పెద్ద ట్విస్ట్ గా వుండనుంది!   7.    బాహుబలి మొదటి భాగం చివర్లో అమరేంద్ర బాహుబలిని… సింహాసనాధీశుడ్ని చేసిన రాజమాత శివగామి… కట్టప్ప చేత అతడ్ని చంపిస్తుందా? వినటానికే విభ్రాంతికరంగా వున్న ఈ మలుపు బాహుబలి 2లో వుండబోతోందంటున్నారు! అదే నిజమైతే, శివగామి బాహుబలికి వ్యతిరేకంగా ఎందుకు మారింది? ఇది మిలియన్ డాలర్ ప్రశ్న!   8.    దేవసేనతో సహా మాహిష్మతీ రాజ్య సింహాసనం ఆశించిన బాహుబలి, భల్లాలదేవ… గంటలు, రోజుల తరబడి జిమ్ లో గడిపారు! 30కేజీల వరకూ బరువు పెరిగి భారీగా కనిపించిన ప్రభాస్ , రాణా ఇందుకోసం కఠోర శ్రమ చేయటమే కాక బోలెడు ఆహార నియమాలు కూడా పాటించారు! వియత్నాం నుంచీ వచ్చిన మార్షల్ ఆర్ట్స్ కోచ్ ట్యువాన్ వద్ద ప్రత్యేక శిక్షణ తీసుకున్నారు!   9.     థియేటర్స్ కి వచ్చాక టికెట్ల అమ్మకం ద్వారా జరిగే బిజినెస్ కాకుండా ఇప్పటికే బాహుబలి 2 అయిదు వందల కోట్ల వ్యాపారం చేసింది! టెలివిజన్ రైట్స్ , థియేట్రికల్ రైట్స్ లాంటి ద్వారా ఈ అద్భుతం సాధించింది!   10.  లాస్ట్ బట్ నాట్ లీస్ట్… బాహుబలి ది కన్ క్లూషన్… విడుదలకి ఒక్కో క్షణం దగ్గర పడుతున్నకొద్దీ అందరి మనస్సుల్లో ఒకే ప్రశ్న మెదులుతోంది! అదే… ‘’ కట్టప్ప బహుబలిని ఎందుకు చంపాడు? ’’ దీనికి సమాధానం దొరకాలంటే బాహుబలి బిగ్ స్క్రీన్ పైకి రెండోసారి రావాల్సిందే! And the countdown has already began…

జగన్ నిజంగా అరాచకవాదేనా..?

ఒక పార్టీకి అధినేత..అందునా రాష్ట్రానికి ప్రతీపక్షనేత..అలాంటి వ్యక్తి నలుగురిలో ఉన్నప్పుడు ఎంత హుందాగా ఉండాలి. కానీ జగన్‌లో నిఖార్సైన రాజకీయ నేత లక్షణాలు అణుమాత్రం కూడా కనిపించడం లేదు. ఒంటెత్తు పోకడలు, అనుభవ లేమి, బాధ్యతారాహిత్యం, ముందుచూపు లేకపోవడం వల్లే అధికారానికి దూరమయ్యామని..అయినా సరే తమ అధినేతలో కొంచెం కూడా మార్పు రాలేదని వైసీపీ నేతలు, కార్యకర్తలు బహిరంగంగా వ్యాఖ్యానించిన సందర్భాలు ఎన్నో. తాజాగా జగన్ అనుభవలేమి మరోసారి ఆయనను నవ్వుల పాలు చేసింది. చిత్తూరు జిల్లా ఏర్పేడు పోలీస్ స్టేషన్ వద్ద జరిగిన లారీ ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలను పరామర్శించేందుకు జగన్ వెళ్లారు. అక్కడి వరకు అది మంచి ఆలోచనే..దానిని అభినందించాల్సిందే. కానీ ఏదో బహిరంగసభకు వెళ్తున్నట్లు భారీ కాన్వాయ్‌, మంది మార్భలంతో వెళ్లేసరికి బాధితులు భయపడిపోయారు. ప్రతిపక్షనేత వారిని ఓదారుస్తుండగా ఆయన అనుచరులు నానా రచ్చ చేశారు.   జగనన్నా జిందాబాద్..అంటూ హోరెత్తించారు. దీంతో బాధిత కుటుంబాలకు చిర్రెత్తుకొచ్చింది. ఇక్కడేమైనా పెళ్లి జరుగుతుందా ఇంతమంది వచ్చారు..ఆ జిందాబాద్‌లు ఏంటీ అంటూ తిట్ల దండకం ఎత్తుకున్నారు. ఇది చూసిన వారు అనుభవమున్న  రాజకీయనాయకుడికి..అనుభవలేమికి ఇదే తేడా అంటున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో జగన్‌ ఎప్పటికీ పోటీపడలేరని..చంద్రబాబు అయితే వేదికల మీద ఉన్నప్పుడు కానీ..ఇలాంటి సందర్భాల్లో కానీ అత్యంత జాగ్రత్తతో వ్యవహరిస్తారు..ఎక్కడ ఎలా ప్రవర్తించాలో తమ శ్రేణులకు సూచించేవారని. తన సామాజిక వర్గం నేతలను పక్కన ఉంచుకున్నా.. అంతే స్థాయిలో ఇతర సామాజిక వర్గాల నేతలను పక్కనబెట్టుకుని బ్యాలెన్స్ అయ్యేలా చూసుకుంటారు. అలాంటి చిన్నచిన్న జాగ్రత్తలే ఒక నాయకుడిని జనంలో ఉన్నతంగా నిలబెడతాయి..   అయినా 14 మంది చనిపోయి ఆ కుటుంబాలు కొండంత దు:ఖంలో ఉంటే అలాంటి చోట జేజేలు కొట్టించుకోవడం ఏంటీ..తమ అభిమాన నాయకుడిని చూసిన ఆనందంలో అభిమానులు అలాగే ప్రవర్తిస్తారు అనుకుంటే వారిని జగన్ అనుచర గణమే  అక్కడికి వాహనాల్లో తరలించింది. అలాంటి వారు మరి జిందాబాద్‌లు కొట్టక ఏం చేస్తారు. వెళ్లేది ఓదార్పు యాత్రకు అని జగన్ మరచిపోయినట్లున్నారు..అందుకే వారు జిందాబాద్‌లు కొడుతుంటే పులకరించిపోయారు తప్పించి పట్టించుకోలేదు. అందుకే అంటారు ఎక్కడ నెగ్గాలో కాదు..ఎక్కడ తగ్గాలో తెలిసిన వాడే గొప్పవాడని..ఈ విషయాన్ని జగన్ ఎంత త్వరగా గుర్తిస్తే అంత త్వరగా ఉన్నత స్థాయికి వెళతారని రాజకీయ విశ్లేషకుల టాక్.

అసలే పార్టీ పరిస్థితి బాగా లేదు... పైగా ఈ చెత్త రూల్స్‌ ఏంటి?

2019లో ఎలాగైనా అధికారాన్ని దక్కించుకోవాలనుకుంటోన్న కాంగ్రెస్‌... ఒకవైపు టీఆర్‌ఎస్ ప్రభుత్వంపై పోరాడుతూనే.... మరోవైపు పార్టీ బలోపేతంపై దృష్టిపెట్టింది. ముఖ్యంగా కమిటీలు, పెండింగ్‌ డీసీసీల అధ్యక్షుల నియామకాలను పూర్తి చేయాలనుకుంటోంది. అయితే కీలకమైన డీసీసీ అధ‌్యక్ష పదవులు చేపట్టేందుకు సీనియర్లు ఎవరూ ముందుకురావడం లేదు. కనీసం మోస్తరు లీడర్ల కూడా ఇంట్రస్ట్ చూపించడం లేదు. ఎందుకంటే రాహుల్‌ తీసుకొచ్చిన కొత్త రూల్సే దానికి కారణం. డీసీసీ అధ్యక్షులకు వచ్చే ఎన్నికల్లో టికెట్లు ఇవ్వబోమన్న అధిష్టాన నిర్ణయంపై తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు మండిపడుతున్నారు.   అసలే పార్టీ పరిస్థితి బాగాలేదు... పైగా ఈ చెత్త రూల్స్‌ ఏంటంటూ దిగ్విజయ్ ముఖం మీదే చెప్పేశారు. ఇలాగైతే ఎవరూ సీనియర్లు ఎవరూ డీసీసీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టరని, దాంతో జిల్లాల్లో పార్టీ బలోపేతం కూడా సాధ్యంకాదన్నారు. సమర్ధులు, సీనియర్లకు డీసీసీ బాధ్యతలు అప్పగించాలని, అలాగే వచ్చే ఎన్నికల్లో టికెట్లు కూడా ఇవ్వాలని, అప్పుడే పార్టీ బలోపేతం అవుతుందని, లేదంటే అంతే సంగతులని దిగ్విజయ్‌కి తేల్చిచెప్పారు. అయితే సీనియర్ల అభిప్రాయాలను రాహుల్ దృష్టికి తీసుకెళ్తానని దిగ్విజయ్‌... మండల కమిటీల నియామకాన్ని వెంటనే పూర్తి చేయాలని ముఖ్యనేతలకు ఆదేశించారు.   మరోవైపు నేతల మధ్య సమన్వయం కొరవడుతోందని గుర్తించిన అధిష్టానం... క్రమశిక్షణ ఉల్లంఘించే లీడర్లపై చర్యలు తీసుకోవాలని భావిస్తోందట. దిగ్విజయ్‌ ముందే కోమటిరెడ్డి రాజగోపాల్‌‌రెడ్డి, గూడూరు నారాయణరెడ్డి కొట్టుకోవడాన్ని హైకమాండ్‌ సీరియస్‌గానే తీసుకుందంటున్నారు. మరోసారి ఇలాంటి సీన్‌ రిపీట్‌ అయితే ఉపేక్షించేది లేదని వార్నింగ్‌ ఇచ్చారు. ఓవైపు చెత్త రూల్స్‌... మరోవైపు కుమ్ములాటలతో లీడర్ల మధ్య సమన్వయం లోపిస్తుంటే, పార్టీ బలోపేతం ఎలా సాధ్యమని, వచ్చే ఎన్నికల్లో అధికారం దక్కుతుందని దిగ్విజయ్‌తోపాటు టీకాంగ్రెస్‌ సీనియర్లు కూడా సందేహాలు వ్యక్తం చేస్తున్నారట.