Previous Page Next Page 
చదువు పేజి 9

   

     అనుకున్న ప్రకారం శేషగిరి భార్యా పిల్లలతో దిగాడు. కాస్సేపు ఇల్లంతా చాలా సందడిగాఉంది. గడిచిన ఏడాది సంగతులూ, మళ్ళీ ఇంకో ఏడాదికి సరిపోయే సంగతులూ మాట్లాడుకున్నారు.

     మాటల సందర్భంలో సీతమ్మ తన అన్నతో "అన్నట్టు  నీ ఉత్తరం సుందరం నాకు చదివి వినిపించాడు  తెలుసా?" అన్నది.
 
    శేషగిరిభార్య, కామేశ్వరి "ఓరీ!" అన్నది. సుందరానికి అక్షరాభ్యాసం చేయించిన రోజు లెక్క చూశారు. దానికి శేషగిరి కుటుంబం రాలేదు. "కిష్ణ" కు తడపరపోసింది. ఈసంభాషణంతా సుందరానికి చాలా సంతోషంగా ఉన్న సమయంలో శేషగిరి అకస్మాత్తుగా,"సుందరం సంగతి  చెబుతావేమిటి సీతా? కిష్ణ పుస్తకాలు చదివేస్తుంది. దానికెవ్వరూ అక్షరాలు చెప్పలేదు. దానికి ఇప్పటికీ అక్షరాల వరస తెలీదు తెలుసా? అ ఆ ఇ ఈ ఉ ఊ అని వరసగా చెప్పమంటే చెప్పలేదు. సరసు చదివేదంతా విని ఆమాటలు పట్టుకుని పుస్తకంలో గుర్తు పట్టి అక్షరాలూ, వత్తులూ అన్నీ నేర్చుకుంది." అన్నాడు.

    ఒక్కసారిగా సుందరానికి మేనమామమీద పట్టరాని కోపమూ, కిష్ణమీద భరించరాని అసూయా కలిగింది.

    కిష్ణ పుస్తాకాలు చదవగలదన్న విషయం అప్పటికప్పుడు పరీక్షకు పెట్టారు. కృష్ణ అప్పుడప్పుడూ తప్పు చదివినా చాలా వేగంగా చదివింది.

    ఆ తరువాత సుందరాన్ని చదవమన్నారు.

    సుందరం చదవ నిరాకరించాడు. ఎవరు చెప్పినా వినలేదు.

    "వాడు పుస్తకం చదివితే వినాలని వాళ్ళ నాన్న ఎన్నోసార్లు ప్రయత్నించారు. వాడుమటుకు పైకి చదవడు. తనలో తను చదువుకుంటాడు."  అని సీతమ్మ చెప్పింది.

    చదువులో సరుసు ఆటే చురుకుకాదని శేషగిరి అన్నాడు. గాని, తీరా విచారిస్తే వాడికప్పుడే ఎక్కాలు వచ్చుననీ, కూడికలూ, తీసివేతలూ, హెచ్చవేతలూ, భాగారాలూ వచ్చుననీ ఇంగ్లీషు అక్షరాలు నేర్చుకో బోతున్నాడనీ, తెలిసింది.
 
    సుందరానికి కాస్త గర్వం ఏదన్నా ఏర్పడిఉంటే అది కాస్తా దెబ్బతిన్నది.

   
                                                                    0    0    0   

    వీధిలో బాండుమోతవిని సుందరమూ, సరుసూ, కిష్ణా బయటకి వచ్చారు. బండి వెనుకబాగంలో ఎవరో కూచుని చిన్నచిన్న కాగితాలు పంచిపెడుతున్నాడు. ముగ్గురూ బండి వెంటబడి చాలాదూరం వెళ్ళారు. కాని వాళ్ళకు బండిలో వాడు కాగితం ఇవ్వలేదు. చివరకు ఎవరికీ పట్టుబడక నేలమీద పడిన కాగితం సరసుకు దొరికింది.
 
    దాన్ని ముగ్గురూ ఒక్కసారి చదవాలని ప్రయత్నించి రెండుముక్కలుగా చించారు. ఆ తరువాత రాజీపడిముక్కలు దగ్గరిగా పెట్టి చదివారు. సరుసూ, కిష్ణవేణి గబగబా చదివారు. సుందరం వాళ్ళతోపాటు చదవలేక పోయాడు.
 
    ఇంతకూ అది తారాబాయి సర్కసు. తారాబాయి జుట్టుకు బండకట్టుకుని ఎత్తుతుందనీ, ఛాతీ మీద రాయిపెట్టుకుని సమ్మెటలతో కొట్టించుకుంటుందనీ, బండిని నొసటతో తోస్తుందనీ, ఇంకేమేమో చేస్తుందనీ ఆ కాగితంలో ఉంది. ఆవిడచేసే ఫీట్ల బొమ్మలు గోడలమీదకూడా అంటించి ఉన్నై.

    "నానా, మనం సర్కసుకు పోవద్దూ?" అని శేషగిరిని పిల్లలు అడిగారు.

    "ఏముందర్రా ఈ సర్కసులో? పులులూ, సింహాలూ, ఏనుగులూ ఉండవు. చూస్తే కార్లేకర్ సర్కసు చూడాలి." అన్నాడు శేషగిరి.

    కాని సర్కసు చూస్తేగాని వీల్లేదని పిల్లలు పట్టుపట్టారు. శేషగిరి ఒప్పుకున్నాడు. సుందరం ఎన్నడూ సర్కసు చూడలేదు. అందుచేత వాడికి సర్కసు చూడటంలో ఏమి అనందం ఉండేదీ తెలియదు. కాని శేషగిరి రకరకాల సర్కసులనుగురించి వింత వింత కధలు చెప్పాడు. ఒకసారి బెజవాడలో కార్లేకర్ సర్కసు జరుగుతుంటే సింహం ఒకటి తప్పించుకు పారిపోయిందిట. మర్నాడు ఉదయం అది మార్వాపత్రం దగ్గిర కూర్చుని ఉన్నది. జనంహడలిపోయినారు. కాని అది ఎవర్నీ ఏమీ చెయ్యలేదు. కార్లేకర్ వచ్చిదానిమెడకు తాడువేసి పట్టుకుపోయినాట్ట.

    కోడిరామమూర్తి ఎవరూ చెయ్యలేని ఫీట్లుచేస్తాట్ట. గుండెలమీద ఏనుగును ఎక్కించుకుంటాట్ట, రెండు చేతులతో రెండు మోటారుకార్లు ఆపుతాట్ట.

    ఇటువంటి కబుర్లు ఎన్నో శేషగిరి అనంతంగా చెప్పాడు. ఇవన్నీ వింటుంటే సుందరానికి ప్రపంచచిత్రాలన్నీ తెలుసుకుంటున్నట్టూ, ఇప్పుడే తనకు ప్రపంచంతో సంబంధం  ఏర్పడుతున్నట్టూ తోచింది. ఈ ప్రపంచంలో చదువు ఆటే పెద్దవిషయం గా కనిపించలేదు.  ఇందులో రాక్షసులను జ్ఞానపకంచేసే హెమాహేమీ లున్నారు. గుండెలమీద ఏనుగనెక్కించుకుని రెండుచేతులతోనూ రెండుమోటారుకార్లను నిలిపేవాళ్ళున్నారు.
 
    "కోడిరామ్మూర్తిని నువ్వు చూశావా, మామయ్యా?" అన్నాడు సుందరం.

    "చూశా. ఏనుగును ఎక్కించుకోవటం  కన్నకూడా కార్లు ఆపటం చూడటానికి అద్బుతంగా ఉంటుంది.మధ్య చేతలు కట్టుకు నిలబడతాడు. రెండు కార్లూ మోకులతో జబ్బలకు కట్టుకుంటాడు. రెండు కార్లూ ఒక్కసారిగా స్టార్టు చేస్తారు. ఇంజన్లు కుంయోమని గోలెత్తుతై, కాని ఒక్కకారూ ముందుకు పోలేదు."
   
    సుందరం సాయంకాలం ఎప్పుడవుతుందా అని కూచున్నాడు. శేషగిరి పిల్లలు రాత్రికి చూసే సర్కసునుగురించి ఇప్పటినుంచే ఆనందిస్తూ, బిగ్గరిగా మాట్లాడసాగారు. సుందరం పైకి విశేషం మాట్లాడలేదు. వాళ్ళ మాదిరిగా ఉత్సాహం చూపటం చాతకాక పోవటమే దానికి కారణం. కాని ఈ విచిత్రమైన అనుభవం కోసం సుందరం హృదయం కొట్టుకుపోతూనే ఉంది.

    పొద్దుకూకిదీపాలుపెట్టెన కాస్సేపటికల్లా పిల్లలకు అన్నాలు పెట్టింది సీతమ్మ. ఆరోజల్లా సుందరం చదువు సంగతి ఎత్తకపోవటం ఆవిడ గమనించింది.

    "చిన్న వెధవకు రెండురోజులు అటవిడుపు." అనుకున్నదావిడ.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS