Previous Page Next Page 
చదువు పేజి 10

   

   సుందరానికి ఆ హడావుడిలో అన్నం కూడా సరిగా సయించలేదు.

    రాత్రి రెండో ఆటకు అందరూ ఇల్లు తాళంపెట్టి వెళ్ళారు. సర్కసు డేరా, చుట్టూ గాసులైట్లు, బాండూ, డేరాకు కట్టిన తాళ్ళూ, లోపల గాలరీ__ అంతా ఇంకేదో లోకమల్లే ఉంది సుందరానికి.

    ఏదన్నా వింత అనుభవాలు పొందుతున్నప్పుడు జ్ఞానేంద్రియాలు మామూలుగా పనిచేసిన దానికన్న చాలారెట్లు చురుకుగాపనిచేస్తాయి.  అందుచేత ఈ సర్కసు అనుభవాన్ని సుందరం అచ్చగా కళ్ళతోనేకాక, చెవులతోనూ, ముక్కుతోనూ, చర్మంతోనూ, కూడా తనివిదీర పొందాడు.

    ప్రదర్శన సంగతి వేరే చెప్పనక్కర్లేదు. తారాబాయి తెల్లని గౌను ఒకటి వేసుకునివచ్చింది. పెద్ద బండరాతిని తాళ్ళతో జుట్టుకు కట్టుకుని మోకాళ్ళమీద చేతులానించి దాదాపు జానెడెత్తు పైకెత్తింది. ప్రేక్షకులంతా చాలాసేపు చప్పట్లు కొట్టారు. శేషగిరి పిల్లలుకూడా గాలరీలోకూచుని చప్పట్లు కొట్టారు.

    తారాబాయి ఇంకా చాలాఫీట్లు చేసింది. రొమ్ము మీద రాయిపెట్టుకుని సమ్మెటలతో కొట్టించుకున్నది. ఒకబండిలో పదిహేనుమందిని ఎక్కించి దాని పోలును నుదుటికి పెట్టుకుని తోసింది. కత్తులమీద పడుకున్నది.
 
    మధ్య మధ్య ఇతర ఫీట్లుకూడాచేశారు. కాని అన్నిటిలోకీ తీగెమీద నడిచినపిల్ల సుందరాన్ని ప్రబలంగా ఆకర్షించింది. ఆ అమ్మాయి వేసుకున్న నీలంగౌనూ, చేతులో పట్టుకున్న అందమైన గొడుగూ, తీగమీదనుంచి పడకుండా ఆపిల్లచేసిన ఫీట్లూ వాడికి అత్యంద్బుతంగాతోచినై. ఆ పిల్లఫీట్లు చేసినంతసేపూ ఒక పెద్దవాడు ఆమెకేసి చూస్తూ కింద నిలబడి ఆమెఎటుపోతే తానూఅటుపోతున్నాడు. ఆమె పొరపాటున కాలుజారి పడితే పట్టు కొనడానికి ఆమనిషి ఉన్నాడని శేషగిరి పిల్లలకు చెప్పాడు.

    ఆ పిల్లమీద తన కెంత అభిమానం ఉన్నదో ఆ కింద ఉన్నమనిషికికూడా అంత అభిమానం  ఉండి  ఉంటుందని సుందరం నమ్మాడు.

    ఆ రాత్రి నిద్రపట్టబొయ్యే ముందు కూడా సుందరం ఆ సర్కసు పిల్లనుగురించే ఆలోచిస్తున్నాడు. ప్రపంచంలో ఉన్న చదువుకున్న వాళ్ళందరికన్నా, ఉద్యోగస్తు లందరికన్నా ఆ పిల్ల ఒక్కతే నిజంగా ధన్యురాలని సుందరానికి గట్టి నమ్మకం కలిగింది.
   
                                           __౦__
   
                                             ౫
    సుందరం తల్లి దగ్గర నేర్చుకున్న చదువుతో హైస్కూల్లో ప్రవేసించటానికివీల్లేదు.

    "వాడికింకా ఎక్కాలురావాలి, లెక్కలురావాలి, అంతోఇంతో ఇంగ్లీషు రావాలి. ఇదంతా నీవల్ల ఎట్లాఅవుతుంది? ఎవరినన్నా మేష్టర్ని పెట్టాలి." అన్నాడు శ్రీమన్నారాయణ సీతమ్మతో.

    "ఏదో ఒకటి దబ్బున చూడండి. నెల రోజుల్నుంచీ వాడికి చదువూ సంధ్యాలేదు. మళ్ళీ అలవాటు తప్పితే మొండిపడిపోతాడేమో," అన్నది సీతమ్మ.
 
    "చూద్దాం... సుబ్రహ్మణ్యాన్ని పెడదామని ఉంది. శ్రద్దగా చెబుతాడు." అన్నాడు శ్రీమన్నారాయణ.

    "ఏదో ఒక గంటసేపు చెప్పావంటే చెప్పిలేచిపోతేకాదు. మూడు నాలుగు గంటలన్నా కూర్చ్ఘుని నిలకడగా చదువు చెప్పే మేస్టర్ని చూడండి." అన్నది.

    "మేస్టర్ని ఇంటికి పిలిపిద్దామనా?" అన్నాడు శ్రీమన్నారాయణ.

    "మరెట్లా?" అన్నది సీతమ్మ, ఆదుర్దాగా.

    "ఇంకానయం; ఇంటికొస్తే జాస్తి డబ్బడుగుతారు. అదీ కాక ఎక్కువసేపు చెప్పరు. వాడికా చదవంటదు. సుందరం బడికి పోవలసిందే. రోజుకు అయిదారు గంటలసేపు పిల్లలతో కలసి చదువుకుంటే వాడి కేదన్నా అంటుతుంది. పిల్లలు ఒంటరిగా ఎన్నడూ చదువుకోరాదు, తెలిసిందా?" అన్నాడు శ్రీమన్నారాయణ.

    ఇందులో నిజం సీతమ్మ గ్రహించలేకపోయింది.

    "వాడికి బడి అచ్చిరాదండీ. కిందటిసారి రాఘవయ్య బడి చూడలా? ఒంటిగా నా దగ్గర చదువుకుంటేనే  వాడికి చదువుబాగా అంటింది. మిగిలిన పిల్లలతో చేరి వాడు చెడిపోతాడుగాని చదువుకోడు," అన్నది సీతమ్మ.

    శ్రీమన్నారాయణ భార్యకు గట్టి ఉపన్యాసం ఇచ్చాడు.
 
    "నీ చాదస్తం కొంత మార్చ్ఘుకోవాలి. చెబుదామని చాలారోజుల్నుంచీ అనుకుంటున్నా. కాని అశ్రద్ధ అయిపోతున్నది. కొన్ని విషయాల్లో సుందరాన్ని నువ్వుపాడుచేస్తున్నావు. వాడు చూడూ, అందరిపిల్లలల్లే ఆడుకోడేం? అది చాలాతప్పు ఎప్పుడన్నా సుబ్బమ్మగారమ్మాయి లక్ష్మితో పోచుకోలు కబుర్లు చెప్పటం తప్పిస్తే వాడెన్నడూ సాటి పిల్లలతో ఆడుకోగా నేను చూడలా. అది వాడికి మంచిదికాదు. నా అనుభవాన్ని బట్టి చెబుతున్నావిను. పిల్లలు మేస్టరు దగ్గర, పుస్తాకాల్లోనూ నేర్చుకునేదాని కన్న తోటిపిల్లలదగ్గర ఎక్కువ నేర్చుకుంటారు. వాళ్ళతో చేరి నీకొడుకు చేడిపోతాడేమో అని వాణ్ణి ఎన్నాళ్ళు మీదుగడతావ్? రేపు హైస్కూల్లో చేరితే?... వాడు పిల్లలతో కలసి తిరాగాలి. చదువుకున్నప్పుడు చదువుకుని, ఆడుకున్నప్పుడు ఆడుకోవాలి."

    ఈ మాటలువిని సీతమ్మ వూరుకున్నదేగాని వీటిలో ఆవిడకు విశ్వాసం కుదరలేదు. సుందరం తన దగ్గర అక్షరాలు నేర్చుకుంటున్న రోజుల్లో వాడిచదువు విషయం తన భర్త అభిప్రాయాలకన్న తన అభిప్రాయాలే సరిగా పనిచెయ్యటం ఆవిడ చూసిఉన్నది.  కనుక ఇప్పుడు అయన చెప్పేమాటల్లో కొంత నిజం ఉండవచ్చునన్న అనుమానం ఆవిడకు తగల్లేదు. పైగా పిల్లల్లో చదువుకునేవాళ్ళు ఆటలు మరగరనీ, ఆటలు మరిగినవాళ్ళు చదవరనీ ఆవిడకు గట్టి నమ్మకం. సుందరం ఏ ఆటలకూ పోక పోవటంచూసి ఆవిడ గర్వపడేది. వాడికి చదువు బాగా వస్తుందనుకోవడానికి ఆవిడ ఇదే ఆధారంగా చెప్పేది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS