Previous Page Next Page 
చదువు పేజి 8

 

     "ఏమమ్మా, ఇంకేం కావాలీ? అన్ని అక్షరాలూ వచ్చినయ్యన్నావే?"
 
    "గుడింతం రావద్దూ?"

    "అంటే"

    "నీకు క రాయటం వచ్చు. కా, కీ, కూ ఎట్లా రాస్తావు? అదీ గుడింత మంటే."

    "అదివస్తే అన్నీ రాస్తావా?"
 
    "ఆ తరువాత వత్తులు రావాలి.?"

    "అంటే?"

    "కావత్తూ , చావత్తూ, నావత్తూ, మావత్తూ__"
 
    "ఎందుకవీ?"

    "'అబ్బ' అని రాయాలంటే ఎట్లా? అబ రాసి 'బా'కు బావత్తివ్వాలి."

    "ఆ తరువాత అన్ని మాటలూ రాయగలనా?"

    "ఓ, రాయగలవు."

    సుందరం కాస్త ఆలోచించి, "అమ్మా. నీ పేరురాయనా?" అన్నాడు. కాస్త బిడియంగా.

    "వత్తులు రాందే ఎట్లా రాస్తావు?" సుందరం పలక మీద 'అమ' అని రాసి చూపించాడు.

    "అమ అని రాశావు, అమ్మ ఎట్లా అవుతుంది?... నువు అక్షరాలన్నీ పలకమీద రెండువేపులా రాసివుంచు, నాన్న చూస్తారు. నాన్నను బాలశిక్ష కొనుక్కు రమ్మన్నా. సరేనా? నేను వంటకు పోతున్నా."
 
    సీతమ్మ వంటపనిలో వుండగా సుందరం పలక పట్టుకుని చాటంత మొహంతో వచ్చి "అమ్మా, నీ పేరు రాయలేనంటివే రాశా, చూసుకో!" అని పలక చూపించాడు.

    పలకమీద వాడు రాసినది చూసి ఒక్కక్షణం సీతమ్మ నిర్ఘాంతపోయి, కొడుకును దగ్గరికి తీసుకుని రెండు చెంపలూ ముద్దు పెట్టుకున్నది.

    సుందరం పలక మీద "అంమ" అని రాశాడు.

                                             ___౦ ___
   
                                                 ౪
    'అమ్మా నీకు ఉత్తరంవచ్చింది." అన్నాడు సుందరం.
   
    "చెయ్యి విడిగా లేదు. అట్లా గడపమీద పెట్టు." అన్నది తల్లి వంటింటోనుంచి.
   
     సుందరం కాస్సేపు కార్డు అటూ ఇటూ తిప్పాడు. వాడికిప్పటి వరకు చేతివ్రాత  చదవటం అలవాటు కాలేదు. అందుచేత వెంటనే వాడికి ఉత్తరం చదవాలనే ఆలోచన తట్టలేదు. కాని పోష్టుజవాను ఉత్తరం చూసి తన తల్లి పేరు చదవటం సుందరానికి స్పురణకువచ్చింది. అందుచేత ఆ పేరు ఎక్కడఉన్నదీ వెతకసాగాడు. మొట్టమొదట అసలు అర్ధమే కాదనిపించిన వ్రాతకొంచెం శ్రమపడితే చదవటానికి వీలుగానే వున్నది. చిరునామాలో సుందరం తనతల్లిపేరు పోల్చుకున్నాడు. కార్డు అవతలివేపు తిప్పి శ్రద్దగా, ఓపికగా ఒక్కొక్క అక్షరమే చదవసాగాడు. ఎంత కష్టపడినా సుందరానికి కొన్ని అక్షరాల పోలిక తెలియనే లేదు.
 
    ఇంతలో సీతమ్మ వంటింటోనుంచి "? ఉత్తరమేదిరా సుందరం." అని కేక పెట్టింది.

    "శేషగిరి మామయ్య రాశాడమ్మా," అంటూ సుందరం వంటింటివాకిలి దగ్గరికి వచ్చాడు.

    "నీ కెట్లా తెలుసూ?"

    "మామయ్యా. అత్తయ్యా నరుసూ, కిష్టవేణీ వస్తున్నారుట నేచదివా." అన్నాడు సుందరం.

    "ఓరివెధవా! ఏదీ చదువూ," అన్నది తల్లి.

    తడువుకుంటూ. అక్షరాలుకూడ బలుక్కుంటూ, మధ్య మధ్యకొన్ని అక్షరాలు తల్లి ఊహకు వదులుతూ, అక్కడక్కడ మాటలు తప్పుగా విరుస్తూ సుందరం ఉత్తరమంతా చదివాడు. సుందరం అసలే గుర్తించలేకపోయినవి అంకెలు. అవి వాడికిరావు.
 
    తన అన్న శేషగిరి కుటుంబం ఆ సాయంకాలమే వస్తున్నారని సీతమ్మకు స్వయంగా కార్డు చూసుకుంటేగాని తెలియలేదు. శేషగిరి తాము వస్తున్నవారం రాయలేదు. తేదీ మాత్రమే రాశాడు.

    "ఇంకా నయం. అదన్నా రాశాడు," అనుకున్నది సీతమ్మ. తన అన్న మతి మరుపు ఆవిడకు బాగాతెలుసు. ఒక ఉత్తరంలో పిల్లలకో, పెళ్ళానికో జబ్బుగావున్నట్టురాసి, నాలుగు రోజుల తరవాత రాసే ఉత్తరంలో ఆవిషయమే రాయడు.

    సుందరాన్ని ఎవరన్నా, "అంతా మేనమామే." అంటే సీతమ్మ తన కొడుక్కు శేషగిరి చురుకు మాత్రమే రావాలనీ పరధ్యానం రాగూడదనీ కోరుకునేది. శేషగిరి చదువునే రోజుల్లో చాలా మంచి మార్కులు సంపాదించుకునేవాడు. ఆయన ఒకసారి ఏదన్నా చదివితే ఎన్నటికీ మరవని ఏకసంతగ్రాహి బజారుకువెళ్ళి కొనదలచినది మరచిపోయి వస్తాడు. రాయదలచినది రాయటమూ, చెప్పదలచినది చెప్పటమూ మరిచిపోతాడు.

    సుందరానికి తన మేనమామను చూస్తే చాలా అభిమానం. చదువులో తాను "శేషగిరి మావయ్యంతవాడుకావా"లని వాడికుండేది. ఏడాదికి రెండు మూడుసార్లు శేషగిరి చెల్లిలిని చూసి పోతూ ఉండేవాడు. ఎప్పుడన్నా భార్యనూ పిల్లల్నీ తెచ్చేవాడు గాని, సామాన్యంగా ఒంటరిగానే వచ్చేవాడు.

    అందుచేత ఈ సారి అందరూ వస్తున్నారంటే సుందరానికి చాలా అనందం కలిగింది. వాడికి సరుసు జ్ఞాపకం వున్నాడు గాని కిష్ణవేణి సరిగా జ్ఞాపకంలేదు. కిష్ణవేణికి నాలుగోఏడు వచ్చింది. సుందరం కన్నా ఎనిమిది నెలలుచిన్నది, దానికీ సుందరానికీ పెళ్ళి అవుతుందని సగం నవ్వులకూ, సగం నిజానికీ, నలుగురూ అటుండేవాళ్ళు. అందుచేత సుందరం దానితో ఆటే స్నేహం చెయ్యటానికి ప్రయత్నించలేదు.

    సరుసు సుందరంకంటె రెండేళ్ళకు తక్కువుగా పెద్దవాణ్ణి కిందటేడే బళ్ళోవేశారు. తన చదువుచూసి "శేషగిరి" మావయ్యా, సరుసూ వాళ్ళు నిర్ఘాంతపోతారని సుందరం రూఢిచేసుకున్నాడు. వాళ్ళ రాక కోసం సుందరం తహతహ లాడటానికి కొంతవరకే కారణం.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS